[డౌన్లోడ్ PDF] [51 పేజీలు]
ఖుత్బా యందలి ముఖ్యాంశాలు
1) హజ్ విధిత్వము మరియు ప్రాధాన్యత.
2) హజ్ మహత్యాలు.
3) ఉమ్రా ఆదేశాలు.
మొదటి ఖుత్బా
గత శుక్రవారపు ఖుత్బాలో మేము హరమైన్ షరీఫైన్ మహత్యాలను ఖుర్ఆన్ మరియు హదీసుల వెలుగులో వివరించాం. హజ్ కాలాన్ని దృష్టిలో వుంచుకొని ఈ రోజు హజ్ విధిత్వము, ప్రాధాన్యత, దాని మహత్యాలు, ఆదేశాలు మరియు మర్యాదల గురించి తెలుసుకుందాం. అల్లాహ్ ను వేడుకొనే దేమిటంటే, ఆయన మనందరినీ మాటిమాటికీ హరమైన్ షరీఫైన్లను సందర్శించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక! ఆమీన్!!
హజ్ విధిత్వము మరియు ప్రాధాన్యత
హజ్ – ఇస్లాం మౌలికాంశాలలో ఒకటి.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఇస్లాం ధర్మం ఐదు మౌలికాంశాలపై ఆధారపడి వుంది. అల్లాహ్ తప్ప మరో నిజమైన ఆరాధ్యడు ఎవ్వరూ లేరు మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆయన దాసులు మరియు ప్రవక్త అని సాక్ష్యమివ్వడం, నమాజు నెలకొల్పడం, జకాత్ చెల్లించడం, బైతుల్లాహ్ హజ్ చేయడం మరియు రమజాన్ మాసపు ఉపవాసాలు పాటించడం”. (బుఖారీ, ముస్లిం)
పూర్తి జీవితంలో, స్థోమత కల పురుషులకు, స్త్రీలకు కనీసం ఒక్క సారి హజ్ చేయడం విధిగా వుంది.
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాకు సంబోధిస్తూ ఇలా సెలవిచ్చారు:
“ప్రజలారా! మీ కోసం హజ్ విధిగా చేయబడింది. కనుక మీరు హజ్ చేయండి”. ఇది విని, ఒక వ్యక్తి- ఓ దైవ ప్రవక్తా! ప్రతి సంవత్సరం ఇది విధిగా వుందా? అని అడిగాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మౌనంగా వుండి పోయారు. అతను మూడుసార్లు ఇలానే ప్రశ్నించాడు. దీనిపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ – ఒకవేళ నేను అవునని అని వుంటే, అప్పుడు మీకు ప్రతి యేడూ తప్పనిసరి అయిపోయేది. ఒకవేళ ఇలా జరిగితే మీరు దానిని నెరవేర్చే శక్తి కలిగి వుండేవారు కాదు”. (ముస్లిం: 1337)
హజ్ విధిత్వానికి గల షరతులు
హజ్ ఫర్జ్ కావడానికి ఐదు షరతులున్నాయి.
1) ఇస్లాం: అంటే, హజ్ కేవలం ముస్లిములపై విధిగా వుంది. కాఫిర్ల పై విధిగా లేదు. ఒకవేళ కాఫిర్ (తిరస్కారి) ఎవరైనా హజ్ చేసినా సరిపోదు (అంటే స్వీకరించబడుదు). ఎందుకంటే, అతను హజ్ కు ముందు (ఇస్లాం స్వీకరించి) ముస్లిం కావడం తప్పనిసరి. కనుక ఇస్లాం స్వీకరించాక అతను ఆర్థిక స్థోమత కలిగి వుంటే అప్పుడు అతనిపై హజ్ ఫర్జ్ అవుతుంది.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముఆజ్ (రదియల్లాహు అన్హు) కు యమన్ వైపునకు పంపిస్తూ ఇలా హితబోధ చేసారు: “నువ్వు గ్రంథ ప్రజలు గల ప్రాంతానికి వెళుతున్నావు. అందుకే (అన్నిటికన్నా ముందుగా) వారికి లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్రసూలుల్లాహ్ సాక్ష్యం వైపునకు ఆహ్వానించు. ఒకవేళ వారు నీ మాటను ఒప్పుకుంటే, వారికి అల్లాహ్ రేయింబవళ్ళలో ఐదు నమాజులు ఫర్జ్ చేసాడని చెప్పు…..” (బుఖారీ: 1496, ముస్లిం: 19)
ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే, అన్నిటి కన్నా ముందుగా ఇస్లాం స్వీకరణ తప్పనిసరి. దాని తర్వాతే ఇతర ఆదేశాలు వర్తిస్తాయి.
2) బుద్ధి: అంటే హజ్, బుద్ధి వివేకాలు కలవారిపైనే ఫర్జ్ వుంది. బుద్ధి మందగించిన పిచ్చి వాళ్ళపై లేదు. పిచ్చివాళ్ళ గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) (కర్మలు వ్రాసే) కలాలు లేపేయబడ్డాయి (వారి కర్మలు వ్రాయబడవు) అని వివరించారు.
3) యౌవనం: హజ్ విధిగా కావటానికి యౌవనం కూడా ఒక షరతే. ఎందుకంటే, చిన్న పిల్లలు దానికి బాధ్యులు కారు. కానీ చిన్న పిల్లలు హజ్ చేయవచ్చు.
దీని గురించి, ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా సెలవిచ్చారు: ఒక స్త్రీ తన పిల్లవాణ్ణి ఎత్తి చూపిస్తూ, ఓ దైవ ప్రవక్తా! ఇతను హజ్ చేయవచ్చా? అని అడిగింది. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ – చేయవచ్చు. (అతనితో పాటు) నీక్కూడా పుణ్యం దొరుకుతుంది అని అన్నారు”. (ముస్లిం: 1336)
కానీ ఈ హజ్, ఫర్జ్ హజ్ కు సరిపోదు, ఆ పిల్లవాడు యౌవన దశకు చేరుకున్న తర్వాత, ఒకవేళ ఆర్థిక స్థోమత గనక కలిగి వుంటే విధిగా వున్న హజ్ ను మరలా చేయాలి.
(4) స్వేచ్ఛ: అంటే హజ్ కేవలం స్వతంత్య్ర ముస్లిములపై విధిగా వుంది. బానిస ముస్లిములపై కాదు. బానిస ముస్లిం హజ్ చేయవచ్చు. కానీ ఆ హజ్, ఫర్జ్ హజ్ కు సరిపోదు. అతను స్వతంత్రుడయ్యాక, ఒకవేళ ఆర్థిక స్థోమత గనక కలిగివుంటే విధిగా వున్న హజ్ ను మరలా చేయాలి.
(5) ఆర్థిక స్థోమత: అంటే హజ్ చేయగలిగే శక్తి కలిగి వుండాలి. ఆర్థికంగా హజ్ ఖర్చులు భరించ గలిగే స్థోమత కలిగి వుండడంతో పాటు శారీరకంగా కూడా హజ్ ప్రయాణం చేయగలిగే స్థితిలో వుండాలి. హజ్ మార్గం శాంతియుతంగా వుండి, పరిస్థితులు చక్కబడ్డాక హజ్ రోజుల లోపు మక్కా ముకర్రమ కు చేరడం సాధ్యమైనప్పుడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“అక్కడికి వెళ్ళే స్థోమత గలవారికి ఆ గృహం (యాత్ర) హజ్ చేయడాన్ని అల్లాహ్ విధిగా చేశాడు”. (ఆలి ఇమ్రాన్ : 97)
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను స్థోమత గురించి అడిగినప్పుడు ఇలా సెలవిచ్చారు- స్థోమత అంటే – (హజ్ యాత్రకు) కావాల్సిన ప్రయాణ సామగ్రి మరియు వాహనం కలిగి వున్నప్పుడు (వాహనానికి బదులు దాని ఖర్చులు భరించగలిగే సామర్థ్యం కలవాడు) అని అర్థం. (ఇబ్నె మాజ, సహీహ్ అత్తరీబ్ వ తరీబ్ – అల్బానీ: 1131)
ఒకవేళ ఏ వ్యక్తి అయినా, ఆర్థిక స్థోమత కలిగివున్నప్పటికీ శారీరకంగా హజ్ ప్రయాణం చేయగలిగే స్థితిలో లేకపోతే, అతను తన తరఫు నుండి అంత కన్నా ముందుగానే తన హజ్ ను పూర్తి చేసుకున్న వ్యక్తిని, హజ్ చేయడానికి పంపించవచ్చు.
అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం: ‘హజ్జతుల్ విదా’ లో ‘ఖస్అమ్’ తెగకు చెందిన ఒక స్త్రీ వచ్చి, ఓ దైవప్రవక్తా! నా తండ్రి గారిపై హజ్ విధిగా అయివుంది. కానీ ఆయన చాలా ముసలి వారైపోయారు మరియు వాహనంపై కూర్చో గలిగే స్థితిలో కూడా లేరు. ఈ స్థితిలో నేను ఆయన తరఫు నుండి హజ్ చేయవచ్చా? అని అడిగింది. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం): “తప్పకుండా, నువ్వు అతని తరఫు నుండి హజ్ చేయవచ్చు” అని అన్నారు. (బుఖారీ: 1531, ముస్లిం: 1334)
అలాగే అబ్దుల్లా బిన్ అబ్బాస్ ( రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక వ్యక్తిని – ‘లభ్బైక అన్ షుబ్రుమా’ అని అనడం విని, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) షుబ్రుమా ఎవరు? అని అతన్ని అడిగారు. అతను – నా సోదరుడు (లేదా నా బంధువు) అని అన్నాడు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం). ఇది వరకు నువ్వు నీ హజ్ ను పూర్తి చేసుకున్నావా? అని అడిగారు. అతను – లేదండి అని అన్నాడు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముందు నీ తరఫు నుండి హజ్ చేయి, ఆ తర్వాత షుబ్రుమా తరఫు నుండి చేయవచ్చు అని అన్నారు. (అబూదావూద్ : 1811, ఇబ్నెమాజ: 2903, సహీహ్- అల్బానీ)
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయమేమింటే – స్త్రీలకు ఈ షరతులతో పాటు మరో షరతు కూడా నెరవేర్చాల్సి వుంటుంది. అదేమిటంటే ఈ ప్రయాణంలో ఆమెతో పాటు ఎవరైనా ‘మహ్రమ్’ గానీ, ఆమె భర్త గానీ ఆమెకు తోడుగా వుండాలి. ఒకవేళ ఈ షరతును గనక నెరవేర్చలేకపోతే ఆమెపై హజ్ విధిగా వుండదు.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “తన మూడు రోజుల ప్రయాణాన్ని ‘మహ్రమ్’ లేకుండా కొనసాగించడం ఏ స్త్రీకి కూడా ధర్మసమ్మతం కాదు.” (బుఖారీ:1086, ముస్లిం:1338)
ఇలా, ఈ షరతులన్నీ నెరవేర్చగలిగే సామర్థ్యం కలవారు వీలైనంత త్వరగా హజ్ చేసుకోవాలి. దానిని మరుసటి సంవత్సరం వరకు వాయిదా వేసుకో కూడదు. ఎందుకంటే, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “హజ్ చేసే సంకల్పం వున్నవారు వీలైనంత త్వరగా దానిని చేసుకోవాలి. ఎందుకంటే, అతను వ్యాధిగ్రస్తుడవ్వ వచ్చు, అతని వస్తువేదైనా అదృశ్యం కావచ్చు లేదా అతనికి ఏదైనా అవసరం రావచ్చు.” (అహ్మద్, ఇబ్నెమాజ, సహీ ఉల్ జామె అస్సగీర్: 6004, ఇర్వా: 990)
ఉమర్ (రదియల్లాహు అన్హు ఇలా అనేవారు:
నా మనసు కోరుకొనే దేమిటంటే ఈ నగరాలకు కొంత మందిని పంపించి వారి ద్వారా ఎవరి వద్ద ధనం వుంది? అయినా వారు హజ్ ఎందుకు చేయలేదు? అన్న వివరాలు సేకరించి, తదుపరి వారిపై జిజియా పన్ను విధించాలని. ఎందుకంటే, నిశ్చయంగా వారు ముస్లిములు కారు. (సహీహ్ – ఇబ్నె హజర్ ఫీ అల్ కబాయెర్)
హజ్ మహత్యాలు
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్ యొక్క ఎన్నో మహత్యాలను వివరించారు. రండి! మీరు కూడా ఆ మహత్యాలను విని మీ విశ్వాసాన్ని తాజా చేసుకోండి.
1. స్వీకరించబడే హజ్ కు పరిహారం స్వర్గమే.
అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “మబ్రూర్ హజ్ (స్వీకరించబడే హజ్) కు పరిహారం స్వర్గమే”. (బుఖారీ: 1773, ముస్లిం: 1349)
స్వీకరించబడే హజ్ (మబ్రూర్ హజ్) అంటే – అల్లాహ్ అవిధేయతకు పాల్పడకుండా చేయబడే హజ్. దీని సూచన ఏమిటంటే – హజ్ తర్వాత హాజీ సత్కార్యాలను ఎక్కువగా చేస్తూ చెడు కార్యాల నుండి దూరంగా వుండాలి.
2. హజ్ పాపాలను తుడిచి వేస్తుంది.
అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) కథనం: ” అల్లాహ్ నా హృదయంలో ఇస్లాం మీద ప్రేమ కలుగజేసినప్పుడు, నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధిలో హాజరై – మీరు గనక మీ చేతులను ముందుకు చాపితే నేను మీదగ్గర బైత్ (ప్రమాణం) చేస్తాను అని విన్నవించుకున్నాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన చేతులు ముందుకు చాపగానే నేను నా చేతిని వెనక్కు తీసుకున్నాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)- అమ్ర్ ! ఏమైంది నీకు? అని అడిగారు. నేను – నేనొక షరతు పెట్టాలను కుంటున్నాను అని అన్నాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) – ఏమిటా షరతు? అని అడిగారు. నేను – నా షరతు ఏమిటంటే, అల్లాహ్ నా పాపాలను క్షమించాలి అని అన్నాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం): “నీకీ విషయం తెలియదా! ఇస్లాం (స్వీకరణ) గత పాపాలను తుడిచి వేస్తుంది, హిజ్రత్ గత పొరపాట్లను సమాప్తం చేస్తుంది మరియు హజ్ పాపాలలన్నింటినీ తుడిచి వేస్తుంది”అని (ముస్లిం: 121)
జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “హజ్ మరియు ఉమ్రాలను ఎల్లప్పుడూ చేస్తూ వుండండి. కొలిమి, త్రుప్పును తొలగించినట్లే ఈ రెండూ పేదరికాన్నీ, పాపాలను సమాప్తం చేస్తాయి.” అని వివరించారు. (తబ్రానీ, దారెఖుత్ని, అస్సహీహ: 1185)
3. ఈమాన్ (విశ్వాసం) మరియు జిహాద్ ల తర్వాత అన్నిటి కన్నా శ్రేష్ఠమైన ఆచరణ హజ్.
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో – అన్నింటి కన్నా శ్రేష్టమైన ఆచరణ ఏది? అని అడగబడింది. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ – అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను విశ్వసించడం అని అన్నారు. ఆ తర్వాత? అని అడగ్గా, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) -జిహాద్ చేయడం అని అన్నారు. ఆ తర్వాత? అని అడగ్గా, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మబ్రూర్ హజ్ ( స్వీకరించబడే హజ్ ) అని అన్నారు. (బుఖారీ: 1519, ముస్లిం: 83)
4. హజ్ – అన్నిటి కన్నా ఉత్తమ జిహాద్.
ఆయెషా (రదియల్లాహు అన్హా) కథనం: నేను, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో – ఓ దైవ ప్రవక్తా! అన్నిటి కన్నా ఉత్తమ ఆచరణ జిహాద్ అని మేము అనుకొంటూ వుంటాం. మరయితే మేము కూడా జిహాద్ చేయవచ్చా? అని అడిగాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) – అన్నిటి కన్నా ఉత్తమ జిహాద్ ‘మబ్రూర్ హజ్’ (స్వీకరించబడే హజ్) అని వివరించారు. (బుఖారీ : 1520)
5. వయసు మీరిన, బలహీన స్త్రీ యొక్క జిహాద్ – హజ్ మరియు ఉమ్రాలు.
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “వయసు మీరిన, బలహీన స్త్రీ యొక్క జిహాద్ – హజ్ మరియు ఉమ్రాలు.” ( నసాయి, సహీ – అల్బానీ)
6. హజ్ చేసే వాళ్ళు అల్లాహ్ అతిథులు మరియు వారి దుఆ స్వీకరించ బడుతుంది.
అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “అల్లాహ్ మార్గంలో జిహాద్ చేసే వ్యక్తి, హజ్ చేసే వ్యక్తి మరియు ఉమ్రా చేసే వ్యక్తి – వీరంతా అల్లాహ్ అతిథులు. అల్లాహ్ ఆహ్వానంపై వీరంతా వచ్చారు. అందుకే వీరు అల్లాహ్ ను అడిగేవన్నీ వీరికి అనుగ్రహించ బడతాయి.” (ఇబ్నెమాజా, ఇబ్నెహిబ్బాన్, సహీ అత్తర్బ్ వ తర్ హీబ్: 1108)
7. హజ్ ప్రయాణం లో మరణిస్తే గనక మనిషి నేరుగా స్వర్గంలోకి వెళతాడు.
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “ఏ వ్యక్తి అయినా హజ్ కోసం బయలుదేరి, మార్గంలోనే గనక మరణిస్తే, ప్రళయ దినం వరకు అతనికి హాజీ (హజ్ చేసే వ్యక్తి) కి దొరికే పుణ్యఫలం లిఖించబడుతుంది. అలాగే, ఏ వ్యక్తి అయినా ఉమ్రా కోసం బయలుదేరి మార్గం మధ్యలోనే మరణిస్తే అతనికి ప్రళయ దినం వరకు ఉమ్రా చేసే వ్యక్తి కి లభించే పుణ్యం లిఖించబడుతుంది.” (అబూ యాలా, సహీ అత్తర్బ్ వ తర్హీబ్ : 1114)
అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం: అరాఫాత్ మైదానంలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో పాటు గడిపిన ఓ వ్యక్తిని అతని ఒంటె అకస్మాత్తుగా క్రిందికి పడేసింది. దీనితో అతను మెడ విరిగి మరణించాడు. దీనిపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) : “అతనికి నీళ్ళు మరియు రేగాకులతో స్నానం చేయించండి. అతని రెండు దుప్పట్లతోనే అతనికి కఫన్ తొడిగించండి. అతని శిరస్సును మూయకండి. అతనికి సువాసన కూడా పూయకండి. ప్రళయం రోజు అతను ‘తల్బియ’ పఠిస్తున్న స్థితిలో లేపబడతాడు.” (బుఖారీ: 1849, 1850, ముస్లిం: 1206)
8. హజ్ ఆచారాల మహత్యం – ఒక మహోన్నత హదీసు.
అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“మీరు బైతుల్లాహ్ (సందర్శన) గురించి సంకల్పించుకొని ఇంటి నుండి బయలు దేరినప్పుడు మీ వాహనం యొక్క ప్రతి అడుగుకు గాను అల్లాహ్ మీకొక పుణ్యాన్ని వ్రాస్తాడు మరియు ఒక పాపాన్ని క్షమిస్తాడు. మీరు అరాఫాత్ మైదానంలో గడిపేటప్పుడు అల్లాహ్, భూలోక ఆకాశంపైకి వచ్చి దైవదూతల ముందు, హజ్ చేసే వారి గురించి గర్విస్తూ ఇలా సెలవిస్తాడు: “చూడండీ! వీరంతా నా దాసులు ఎంతో దూర దూరాల నుండి శ్రమ పడుతూ, దుమ్ము ధూళిలో లిప్తమై నా వద్ద కొచ్చారు. వీళ్ళు నా కారుణ్యాన్ని ఆశిస్తున్నారు, నా శిక్షకు భయపడుతున్నారు. (వాస్తవానికి వారు నన్ను చూడనే లేదు) ఒకవేళ వీరు నన్ను చూసివుంటే అప్పుడు వారి స్థితి ఎలావుండేది! “ తదుపరి, ఒకవేళ మీ పాపాలు – పొరలు పొరలుగా వుండే ఇసుక రేణువులంత వున్నా, ప్రాపంచిక దినాల సంఖ్యకు సమానంగా వున్నా, వర్షపు నీటి చినుకులకు సమానంగా వున్నా పాపాలన్నిటినీ అల్లాహ్ కడిగేస్తాడు. మీరు ‘జమ్రాత్’ కు కంకర్రాళ్ళు విసిరినప్పుడు దాని పుణ్యఫలాన్ని అల్లాహ్ మీకోసం ప్రోగు చేసి నిల్వ వుంచుతాడు. మీరు శిరోముండనం చేయించు కున్నప్పుడు మీ కోసం, మీ ఒక్క వెంట్రుకకు గాను ఓ పుణ్యాన్ని వ్రాస్తాడు. తదుపరి, తవాఫ్ చేసినప్పుడు మీ తల్లి గర్భం నుంచి మీరు పరిశుద్ధంగా పుట్టినట్లే పాపాలన్నింటి నుండి మీరు పరిశుద్ధులౌతారు.” (తబ్రానీ, సహీ ఉల్ జామె అస్సగీర్ – అల్బానీ : 1360)
ఇదే హదీసు యొక్క మరొక ఉల్లేఖనంలో పదాలు ఇలా వున్నాయి:
“మీరు బైతుల్లాహ్ (సందర్శన) గురించి సంకల్పించుకొని ఇంటి నుండి బయలుదేరినప్పుడు మీ వాహనం యొక్క ప్రతి అడుగుకు గాను అల్లాహ్ మీకొక పుణ్యాన్ని వ్రాస్తాడు మరియు ఒక పాపాన్ని క్షమిస్తాడు. తవాఫ్ తర్వాతి రెండు రకాతులు, ఇస్మాయీల్ (అలైహిస్సలాం) సంతానంలోని ఒక బానిసను విముక్తి కలిగించిన దానికి సమానం అవుతాయి మరియు సఫా, మర్వా ల మధ్య చేసే ‘సయీ’ 70 బానిసలను విముక్తి కలిగించిన దానికి సమానమవుతుంది.
అరాఫాత్ రోజు సాయంత్రం అల్లాహ్ భూలోక ఆకాశంపైకి వచ్చి మీ గురించి గర్విస్తూ ఇలా అంటాడు: “చూడండీ! వీరంతా నా దాసులు. ఎంతో దూర దూరాల నుండి శ్రమపడుతూ దుమ్ము, ధూళిలో లిప్తమై నా వద్ద కొచ్చారు. నా కారుణ్యాన్ని ఆశిస్తున్నారు.” ఒక వేళ మీ పాపాలు ఇసుక రేణువులకు సమానంగా వున్నా, వర్షపు నీటి చినుకులను సమానంగా వున్నా, సముద్రపు నురుగుకు సమానంగా వున్నా – ఆ పాపాలన్నిటినీ అల్లాహ్ క్షమించి వేస్తాడు.
“నా దాసులారా! శ్రద్ధగా వినండి! మీరు ముజ్ఙలిఫ వైపుకు మరలిపోండి, నేను మిమ్మల్ని మరియు ఎవరి కోసమైతే మీరు ప్రార్ధించారో వారందరినీ మన్నించేశాను.”
తదుపరి, మీరు ‘జమ్రాత్’ లో కంకరాళ్ళను విసురుతున్నప్పుడు, ప్రతి కంకర్రాయికి బదులుగా ఒక పెద్దపాపం (కబీరా గునాహ్) తుడుచి వేయబడుతుంది. మీరు ఖుర్బానీ చేసేటప్పుడు దాని పుణ్యఫలం మీ ప్రభువు వద్ద ప్రోగు చేసి నిల్వ వుంచబడుతుంది. మీరు శిరోముండనం చేయించు కున్నప్పుడు ఒక్కో వెంట్రుకకు గాను మీకోసం ఒక పుణ్యం వ్రాస్తాడు మరియు ఒక పాపం తుడిచేస్తాడు. తదుపరి, మీరు తవాఫ్ చేస్తున్నప్పుడు మీ తల్లి గర్భం నుండి మీరు పరిశుద్ధంగా పుట్టినట్లే పాపాలన్నింటి నుండి మీరు పరిశుద్ధు లౌతారు. ఒక దైవ దూత వచ్చి, మీ భుజాల మధ్య చేయి వేసి ఇలా అంటాడు: వెళ్ళండి, వెళ్ళి మీ భవిష్యత్తు కోసం ఆచరించుకోండి. ఎందుకంటే మీ గత పాపాలన్నీ తుడిచివేయబడ్డాయి. ” (తబ్రానీ, సహీ అత్తర్దేబ్ వ తరీబ్ లిల్ అల్బానీ: 1112)
హజ్ ప్రయాణానికి ముందు కొన్ని మర్యాదలు
1.హజ్ కు వెళ్ళే వ్యక్తి పై తప్పనిసరిగా వున్న విషయమేమిటంటే హజ్ మరియు ఉమ్రాలను అతను కేవలం అల్లాహ్ సంతృప్తి కోసం, ఆయన సాన్నిధ్యం కోసమే అని సంకల్పించుకోవాలి. ఎందుకంటే ప్రతి సత్కార్యం స్వీకరించ బడటానికి చిత్తశుద్ధి మొదటి షరతు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“వారు అల్లాహ్ ఆరాధించాలని, ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించు కోవాలనీ, ఏకాగ్ర చిత్తులై – నమాజును నెలకొల్పాలనీ, జకాత్ ఇస్తూ ఉండాలని మాత్రమే వారికి ఆదేశించబడింది. ఇదే స్థిరమైన, సవ్యమైన ధర్మం”. (బయ్యినహ్ : 5)
2. హజ్ కు వెళ్ళే వ్యక్తి, హజ్ ఖర్చులను ధర్మయుక్త (హలాల్) సంపాదనతో సమకూర్చుకోవాలి.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చి వున్నారు:
“ప్రజలారా! అల్లాహ్ ఎంతో పరిశుద్ధుడు. కనుక, కేవలం పరిశుద్ధ వస్తువునే స్వీకరిస్తాడు.” తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక వ్యక్తి గురించి వివరించారు: “ఎంతో సుదీర్ఘంగా ప్రయాణం చేసి, దుమ్ము, దూళిలో లిప్తమై వున్న స్థితిలో (హజ్ కోసం వస్తాడు) మరియు ఆకాశం వైపుకు చేతులెత్తి – ఓ నా ప్రభువా! ఓ నా ప్రభువా! అని ప్రార్ధిస్తాడు. వాస్తవానికి అతని తినడం, అతని త్రాగడం, అతని దుస్తులు – అన్నీ అధర్మ సంపాదన లోనివి. అతని శరీరం కూడా అధర్మ ఆహారంతో పోషించబడింది. ఈ పరిస్థితిలో అతని దుఆ ఎలా స్వీకరించబడుతుంది?!” (ముస్లిం:1014)
ఈ హదీసును గూర్చి కాస్త ఆలోచించండి!
ఆ వ్యక్తి, దుఆ స్వీకరించబడడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ప్రయాణం, దుమ్ము దూళిలో లిప్తమైన స్థితి, అల్లాహ్ ముందు చేతులెత్తడం… వగైరా, కానీ, ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, అల్లాహ్ వద్ద అతని దుఆ అమోదయోగ్యం కాలేదు. దానికి కారణం – అతని తినడం, త్రాగడం, దుస్తులు వగైరా || అన్నీ అక్రమ (అధర్మ) సంపాదనతో జరిగేవి. అందుకే ముస్లిములందరి, ప్రత్యేకించి హజ్ చేసే వారిపై తప్పనిసరిగా వున్న విషయమేమిటంటే – వారు అక్రమ సంపాదనకు దూరంగా వుండాలి మరియు హజ్ ఖర్చులు హలాల్ సంపాదన తోనే చేసుకోవాలి.
3. పాపాలన్నిటిపై చిత్తశుద్ధితో పశ్చాత్తాపం చెందాలి. ఒకవేళ అతనిపై, ఇతరుల హక్కు (అప్పు వగైరా) ఏదైనా వుంటే దానిని నెరవేర్చాలి. తన ఇంటివారిని అల్లాహ్ కు భయపడుతూ వుండమని బోధించాలి. ఒకవేళ ఏదైనా హక్కును నెరవేర్చలేకపోతే దాని గురించి, ఇంటి వారికి, దీని గురించి వసీయతు చేయాలి.
4. ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో హజ్ మరియు ఉమ్రా పద్ధతులను, ఆచారాలను నేర్చుకోవాలి. కేవలం ఇతరుల ద్వారా వినే మాటలపైనే నమ్మకం పెట్టుకోకూడదు. ఎందుకంటే- ‘హజ్జతుల్ విదా’ (వీడ్కోలు హజ్) సందర్భంగా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చి వున్నారు. “మీరు హజ్ పద్ధతులను, ఆచారాలను (నానుండి) నేర్చుకోండి. బహుశా నేను ఈ హజ్ తర్వాత మరొక హజ్ చేయకపోవచ్చేమో!” (ముస్లిం: 1297)
అందుకే, ఇతర ఆచరణలన్నింటికీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సున్నత్ ఎలాగైతే అవసరమో, హజ్ పద్ధతులు, ఆచారాలు కూడా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సున్నత్ కు అనుగుణంగానే ఆచరించాలి.
ప్రయాణ సమయంలో, హజ్ చేస్తున్నప్పుడు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన మర్యాదలు
1. ఇహ్రాం గురించి సంకల్పించుకున్న తర్వాత నోటిని ప్రత్యేకంగా జాగ్రత్త పరచుకోవాలి. అనవసరమైన వాటిని చర్చించ కూడదు, తన సహెూదరులను కష్టపెట్టకూడదు మరియు వారితో మంచిగా మెలగాలి. తన ఖాళీ సమయాన్నంతటిని అల్లాహ్ విధేయతలో గడపాలి.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“హజ్ మాసాలు నిర్ధారితమై ఉన్నాయి. కనుక ఈ నిర్ణీత మాసాలలో హజ్ ను తనకొరకు విధించుకున్న వ్యక్తి హజ్ దినాలలో కామక్రీడలకు, పాప కార్యాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి. మీరు ఏ సత్కార్యం చేసినా దాని గురించి అల్లాహ్ కు తెలుసు. (హజ్ యాత్రకు బయలు దేరినప్పుడు) ప్రయాణ సామగ్రి (ఖర్చు) ని వెంట తీసుకెళ్ళండి. అయితే, అన్నింటి కంటే అత్యుత్తమ సామగ్రి దైవభీతి (అని బాగా గుర్తుంచుకోండి). కనుక ఓ బుద్ధిమంతులారా! నాకు భయపడుతూ వుండండి.” (బఖర:197)
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఎవరైనా హజ్ చేసి, దానిలో చెడు విషయాలకు, అల్లాహ్ అవిధేయతకు గనక దూరంగా వుంటే అతను – తన తల్లి గర్భం నుంచి పుట్టిన స్థితిలో (పాపాలేవీ లేని పరిశుద్ధ స్థితిలో) తిరిగివెళ్తాడు.” (బుఖారీ :1819, ముస్లిం: 1350)
2. హజ్ చేసే వారి రద్దీ ఎక్కువగా వుండే స్థితులు, ప్రత్యేకించి తవాఫ్, సయీ మరియు కంకర్రాళ్ళు విసిరే సమయాల్లో మీ మూలంగా ఇతరులకు కష్టం కలగకుండా చూసుకోవాలి.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో – మంచి విశ్వాసి ఎవరు? అని అడగబడింది. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) – ‘అందరికన్నా మంచి ముస్లిం ఎవరంటే – అతని నోటి ద్వారా, అతని చేతుల ద్వారా ఇతర ముస్లిములు సురక్షితంగా వుంటారు’ అని వివరించారు. (బుఖారీ:11, ముస్లిం: 42)
ఒకవేళ, ఇతరుల మూలంగా మీకేమైనా కష్టం కలిగితే, ఘర్షణ పడకుండా, మన్నించి వేయండి.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“వారు (విశ్వాసులు) పెద్ద పెద్ద పాపాలకు, నీతిమాలిన చేష్టలకు దూరంగా ఉంటారు. కోపం వచ్చినప్పుడు (కూడా) క్షమిస్తారు.” (అష్ షూరా:37)
ఇంకా ఇలా సెలవిచ్చాడు:
“అపకారానికి బదులు అటువంటి అపకారమే. కానీ ఎవరైనా (ప్రత్యర్థిని) క్షమించి, సయోధ్యకు వస్తే అతనికి పుణ్యఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లాహ్ దుర్మార్గులను ప్రేమించడు.” (అష్ షూరా:40)
3. క్రమం తప్పకుండా సామూహిక నమాజు చేస్తుండాలి. దానిలో ఎలాంటి అశ్రద్ధ చూపకూడదు.
4. స్త్రీలు ఇతరుల (గైర్ మహ్రమ్) ముందు పరదా పాటించకుండా వుండకూడదు. పైగా వారి ముందు ఓణీలు, దుప్పట్లు, (బురఖాలు) వగైరా|| లతో పరదా పాటించాలి.
హజ్ మహత్యాలు మరియు హజ్ ప్రయాణానికి సంబంధించిన కొన్ని మర్యాదలు వివరించిన తర్వాత, మేము ‘హజ్ తమత్తు’ కు సంబంధించిన ఆదేశాలను వివరిస్తాం. ఎందుకంటే – భారతదేశం, పాకిస్తాన్ ల నుండి హజ్ కోసం బయలుదేరే వారు సాధారణంగా ‘హజ్ తమత్తు’ నే చేస్తారు. ‘హజ్ తమత్తు’ ఏమిటంటే – హాజీ (హజ్ చేసే వ్యక్తి) తన దేశం నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు మీఖాత్ (ఇహ్రాం ధరించే స్థలం) కు చేరుకోగానే ఇహ్రాం దుస్తులు ధరించి అక్కడ కేవలం ఉమ్రా సంకల్పం చేసుకోవాలి. తదుపరి మక్కా ముకర్రమ చేరుకొని ఉమ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఇహ్రాం దుస్తులు విప్పేసి, నిషేదాజ్ఞల నుండి బయటికి వచ్చేయాలి. తదుపరి, జిల్ హిజ్జ 8వ తారీఖున, తను వుంటున్న స్థలం నుండి మళ్ళీ ఇహ్రాం ధరించి, హజ్ సంకల్పం చేసుకొని మినా వైపుకు ప్రయాణమై, ఆ తర్వాత హజ్ ఆచారాలను పూర్తి చేసుకోవాలి.
కనుక, రండి! ముందుగా మేము ఉమ్రాకు సంబంధించిన ఆదేశాలను వివరిస్తున్నాం.
ఉమ్రా ఆదేశాలు పద్ధతి, ఆచారాలు
1) ఇహ్రాం
1. ఇహ్రాం అనేది హజ్ మరియు ఉమ్రాలకు సంబంధించిన మొదటి అంశం. అంటే – ఇహ్రాం దుస్తులు ధరించి, తల్బియా (లబ్బెక్ అల్లాహుమ్మ లబైక్…..) పఠిస్తూ హజ్ మరియు ఉమ్రా ఆచారాలను ప్రారంభించడానికి సంకల్పించు కోవడం. ఇలా చేయడం ద్వారా అతను కొన్ని నిషేదాజ్ఞలను పాటించాల్సి వుంటుంది.
ఉమ్రా యొక్క ఇహ్రాం ‘మీఖాత్’ నుండి ప్రారంభమవుతుంది. ఒకవేళ ఇహ్రాం దుస్తులు ముందుగానే ధరిస్తే మీఖాత్ స్థలానికి చేరుకున్నాక సంకల్పం చేసుకోవాలి. ఇహ్రాం ధరించకుండా, మీఖాత్ను దాటి పోవడం నిషిద్దం. ఒకవేళ ఎవరైనా ఇలా చేస్తే, అతను మీఖాత్కు తిరిగి వెళ్ళాలి లేదా మక్కా ముకర్రమ చేరుకున్నాక ఒక పశువును ఖుర్బానీ ఇవ్వాలి.
మీఖాతులు
అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రజి అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మదీనా వాసుల కోసం ‘జుల్ హులైఫా’ (అబియార్ అలీ) ను, సిరియా వాసుల కోసం ‘జుహ్ఫ’ ను, నజద్ వాసుల కోసం ‘ఖర్నల్ మనాజిల్’ ను, యమన్ వాసుల కోసం ‘యలమ్లమ్’ ను మీఖాత్ స్థలాలుగా నిర్ధారించారు. ఈ స్థలాలు ఆయా దేశస్థుల కోసం మరియు ఆ ప్రదేశాల మీదుగా ప్రయాణించే వారికోసం. ఇక, మీఖాతుల లోపల (మక్కా ముకర్రమ వైపు) నివాసముండే వారు, తమ ఇండ్ల నుంచే ఇహ్రాం సంకల్పం చేసుకోవాలి. ఇలా మక్కా వాసులు, మక్కా నుండే ఇహ్రాం సంకల్పం చేసుకోవాలి. (బుఖారీ:1524, ముస్లిం:1181)
2. ఇహ్రాం ధరించేటప్పుడు స్నానం చేయడం, పరిశుభ్రతను పాటించడం, సువాసన ఉపయోగించటం సున్నత్.
ఆయెషా (రదియల్లాహు అన్హా) ఇలా సెలవిచ్చారు: “నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఇహ్రాం నిమిత్తం, ఇహ్రాం దుస్తులు తొడిగించి సువాసన పూసే దాన్ని. అలాగే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) హలాల్ స్థితి లోకి వచ్చి (నిషేదాజ్ఞల నుండి బయటి కొచ్చాక) బైతుల్లాహ్ తవాఫ్ (ఇఫాజా తవాఫ్) కు ముందు కూడా ఆయనకు సువాసన పూసే దాన్ని. ” (బుఖారీ: 1539, ముస్లిం: 1189)
3. పురుషులు శుభ్రమైన తెల్లటి దుప్పట్లతో ఇహ్రాం కట్టుకోవాలి.
స్త్రీలు మాత్రం తమ సాధారణ దుస్తుల్లోనే ఇహ్రాం సంకల్పం చేసుకోవచ్చు. ఒకవేళ మీఖాత్ వద్ద స్త్రీ గనక అపరిశుద్ధ స్థితికి లోనయివుంటే, తను స్నానం చేసి ఆ తర్వాత ఇహ్రాం సంకల్పం చేసుకోవాలి.
ఆయెషా (రదియల్లాహు అన్హా) మరియు జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం అస్మా బిన్తె ఉమైస్ (రదియల్లాహు అన్హా) (అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) భార్య) జుల్ హులైఫా లోని బేదా (ఒక స్థలం)లో (ముహమ్మద్ బిన్ అబూబక్ర్ ను) జన్మ నిచ్చారు. తదుపరి ఆమె నిఫాస్ స్థితిలో వున్నారు. దీనితో, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) కు – మీ భార్యకు, స్నానం చేసి ఆ తర్వాత ఇహ్రాం సంకల్పం చేసుకోమని చెప్పండి అని ఆజ్ఞాపించారు. (ముస్లిం:1209,1210)
4.ఇహ్రాం సంకల్పం ఈ పదాలతో చేసుకోవాలి: “లబ్బైకల్లాహుమ్మ ఉమ్రతన్”.
ఒకవేళ మార్గం మధ్యలో ఏదైనా అడ్డుగా తగిలే ప్రమాదముంటే అప్పుడు ఇలా కూడా ప్రార్థించవచ్చు. “ఓ అల్లాహ్ ! (మార్గం మధ్యలో) ఆపగలిగేదేదైనా నన్ను గనక ఆపేస్తే, అదే నా స్థానం అవుతుంది.” తదుపరి, తల్బియ పఠించడం మొదలుపెట్టి, తవాఫ్ ప్రారంభించేవరకు పఠిస్తూ వుండాలి.
తల్బియ పదాలు ఇవి: “లబ్బై కల్లాహుమ్మ లబ్జ్బెక్, లబ్జ్బెక లాషరీ కలక లబ్జెక్, ఇన్నల్ హమ్ద్, వన్నేమత, లకవల్ ముల్క్, లాషరీకలక.” (బుఖారీ:1549, ముస్లిం: 1184)
“నేను హజరయ్యాను, ఓ అల్లాహ్! నేను హజరయ్యాను, నీకు భాగస్వాములు ఎవరూ లేరు, నేను హాజరయ్యాను, నిశ్చయంగా సమస్త స్తోత్రాలు, అనుగ్రహాలు మరియు సామ్రాజ్యాధికారాలు నీకే చెందుతాయి. నీకు భాగస్వాములు ఎవరూ లేరు.”
5. పురుషులు తల్బియ ను బిగ్గరగా పఠించడం ఉత్తమం.
ఎందుకంటే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన సహాబాలకు ఇలా ఆదేశించారు:
“నా వద్దకు జిబ్రయీల్ (అలైహిస్సలాం) వచ్చి -మీ సహాబాలకు, మీతో పాటు వున్న వారందరికీ ‘తల్బియ’ బిగ్గరగా పఠించమని ఆదేశించండి అని నాకు ఆజ్ఞాపించారు.” (తిర్మిజీ:829, అబూదావూద్: 1814, సహీ – అల్బానీ)
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తల్బియ పఠనం మహత్యాన్ని గూర్చి ఇలా సెలవిచ్చారు:
“ఏ ముస్లిం అయినా తల్బియ పఠించేటప్పుడు, అతనికి ఇరువైపులా వున్న రాళ్ళు, చెట్లు మరియు ఇసుక రేణువులు కూడా తల్బియ పఠిస్తాయి.” (తిర్మిజీ:828, సహీహ్-అల్బానీ)
అబూహురైరా (రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“తల్బియ పఠించే వారు ఎవరైనా తల్బియ పఠించేటప్పుడు అతనికి శుభవార్త ఇవ్వబడుతుంది. అలాగే, తక్బీర్ పలికే వారు తక్బీర్ పలికినప్పుడు అతనికి శుభవార్త ఇవ్వబడుతుంది. (ఇది విని) ఓ దైవ ప్రవక్తా! స్వర్గం యొక్క శుభవార్త ఇవ్వబడుతుందా? అని అడగ బడింది. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) అవును అని అన్నారు. (తబ్రానీ – ఔసత్, సహీ అత్తర్బ్ వ తర్హిబ్ : 1137)
6. కొన్ని పొరపాట్లు.
ఇహ్రాం ధరించకుండా మీఖాత్ను దాటిపోవడం,
ఇహ్రాం ధరించగానే కుడిభుజాన్ని నగ్నంగా చేసు కోవడం. వాస్తవానికి ఇలా ‘ఖుద్దూమ్ తవాఫ్’ లోనే చేయాలి.
ప్రత్యేక శైలిలో రూపొందించబడ్డ బూట్లనే ధరించడం. (వాస్తవానికి చీలమండ కనబడే విధంగా ఏ రకమైన బూట్లు అయిన (చెప్పులు అయినా) ధరించవచ్చు).
ఇహ్రాం ధరించాక వీలైనంత ఎక్కువగా అల్లాహ్ స్మరణ, అస్తగ్ ఫార్ మరియు తల్బియ పఠించకుండా ప్రాపంచిక విషయాలలో నిమగ్నమై వుండడం.
సామూహిక నమాజు పట్ల అశ్రద్ధ చూపడం.
స్త్రీలు తమ భర్తలు లేదా మహరమ్ లేకుండా ప్రయాణం చెయ్యడం.
ఇతరుల ముందు స్త్రీలు పరదా పాటించక పోవడం.
ఇహ్రాం ధరించాక అందరితో కలిసి ఫోటోలు దిగడం.
7. ఇహ్రాం స్థితిలో నిషేధాలు.
ఇహ్రాం సంకల్పం చేసుకున్న తర్వాత కొన్ని విషయాలు నిషేధం అయిపోతాయి. శరీర భాగాల నుండి వెంట్రుకలను కత్తించడం లేదా పీకడం, గోర్లు కత్తిరించడం, సువాసన ఉపయోగించడం, భార్యతో సంభోగం లేదా ముద్దు పెట్టుకోవడం, చేతి తొడుగులు ధరించడం, వేటాడడం….. ఈ పనులన్నీ, పురుషులూ, స్త్రీలు – ఇద్దరికీ నిషేధం అయిపోతాయి. పురుషులకు, కుట్టబడిన వస్త్రాలు, తలను కప్పుకోవడం కూడా నిషేధమయి పోతాయి.
అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ఒక వ్యక్తి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను – ఓ దైవప్రవక్తా! ఇహ్రాం స్థితిలోని వ్యక్తి ఎలాంటి దుస్తులు ధరించాలి? అని అడిగాడు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) – అతను షర్టు, తలపాగ, షల్వార్ (లేదా పైజామా) మరియు ‘రేన్ కోట్’ ధరించకూడదు. అలాగే సాక్సులు కూడా ధరించకూడదు. ఒకవేళ ఎవరికైనా బూట్లు దొరక్కపోతే సాక్సులు తొడగ వచ్చు, కానీ వాటిని చీలమండ క్రింది వరకు కత్తిరించాలి. జాఫ్రాను లేదా విరస్ (ఒక రకమైన గడ్డి) సువాసన లేదా వాటి రంగు పూయబడిన దుస్తులు ధరించకూడదు. స్త్రీ అయితే నిఖాబ్ (ముఖానికి అడ్డంగా వుండే బట్ట) కట్టు కోవడం హరామ్ అయి పోతుంది.
అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారి ఈ హదీసు యొక్క మరొక ఉల్లేఖనం ఆఖరిలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఇహ్రాం స్త్రీ నిఖాబ్ కట్టు కోకూడదు, చేతి తొడుగులు కూడా ధరించ కూడదు.” (బుఖారీ:1838)
కానీ, పర పురుషుల ముందు తను పరదా పాటించాల్సి వుంటుంది. బట్ట ఆమె ముఖానికి తగులుతూ వున్నప్పటికీ.
ఫాతిమా బిన్తె మున్జిర్ (రదియల్లాహు అన్హా) కథనం: “మేము ఇహ్రాం స్థితిలో అస్మా బిన్తె అబూబక్ర్ సిద్దీఖ్ తోపాటు మా ముఖాలను కప్పుకొనే వాళ్ళం.”
అస్మా బిన్తె అబూబక్ర్ (రదియల్లాహు అన్హా) కథనం:
“ఇహ్రాం స్థితిలో మేము, ముఖాలను పర పురుషుల నుండి దాచివుంచే వాళ్ళం మరియు పరదాను ముఖం మీదికి ముందుకు లాక్కునే వాళ్ళం.” (ఇర్వాఉల్ గలీల్: 4వ సంపుటం, 212 పేజీ, సహీ-అల్బానీ)
ఆయెషా (రదియల్లాహు అన్హా కథనం:
“మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో పాటు ఇహ్రాం లో వున్నాం. పర పురుషులు మా ముందుకు రాగానే మాలోని ప్రతి స్త్రీ తన దుప్పటిని ముఖంపై వ్రేలాడ దీసేది. వాళ్ళు (పర పురుషులు) ముందుకు వెళ్ళిపోయాక మా ముఖాల మీది పరదాలను మేము తొలగించే వాళ్ళం.’
(అబూదావూద్:1833, ఇబ్నెమాజా: 2935, జయీఫ్ – అల్బానీ, కానీ దీని రెండు సాక్ష్యాలు ముందు వివరించబడ్డాయి)
8. ఇహ్రాం స్థితిలో స్నానం చేయటం, తలను గోక్కోవడం, గొడుగును ఉపయోగించడం మరియు బెల్టులు వాడడం సరైనదే.
నీడ కలిగించడం గురించి ఉమ్మె హుసైన్ (రజి అల్లాహు అన్హా) కథనం ప్రకారం ఆమె ‘హజ్జతుల్ విదా’ లో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో పాటు వున్నారు. ఆమె, ఉసామా (రజి అల్లాహు అన్హు) మరియు బిలాల్ (రదియల్లాహు అన్హు) లను చూడగా వారిలో ఒకరు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒంటె త్రాడు పట్టుకొని వుండగా మరొకరు, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఎండ తగలకుండా, వస్త్రాన్ని పైకి లేపి పట్టుకొని వున్నారు. (ముస్లిం:1298)
2) తవాఫ్
1. మస్జిదుల్ హరామ్ కు చేరుకున్నాక ‘తల్బియ’ పఠించడం ఆపేయాలి. తదుపరి ‘హజ్ర అస్వద్’ ముందుకు వచ్చి తన కుడి భుజాన్ని నగ్నంగా చేసుకోవాలి. దీనిని ‘ఇజ్ తిబా’ అంటారు. (అబూదావూద్:1883,1884, సహీహ్ – అల్బానీ)
ఒకవేళ ‘హజ్రె అస్వద్’ ను తేలిగ్గా ముద్దాడ గలిగితే మంచిదే. లేకపోతే చేత్తో తాకి దానిని ముద్దాడవచ్చు. ఒకవేళ ఇది కూడా సాధ్యం కాకపోతే, కుడిచేత్తో దాని వైపుకు సంజ్ఞ చేస్తూ ‘బిస్మిల్లాహ్, అల్లాహు అక్బర్’ అని పలికి తవాఫ్ ప్రారంభించాలి.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉమర్ (రదియల్లాహు అన్హు) తో ఇలా అన్నారు:
“ఓ ఉమర్ ! మీరు బలవంతులు, కనుక హజ్రె అస్వద్ వద్ద ఇబ్బంది పెట్టి (మీ పరాక్రమం చూపి) బలహీనులకు కష్టం కలిగించకండి. హజ్ర అస్వద్ ఇస్తెలాం (తాకడం) చేయాల్సి వచ్చినప్పుడు ఒకసారి చూసుకోండి. ఒకవేళ తేలిగ్గా చేయగలిగితే మంచిదే. లేకపోతే, దాని ముందుకు వచ్చి తవాఫ్ సంకల్పం చేసుకొని తక్బీర్ పలకండి. “ (ముస్నద్ అహ్మద్ : 1/321)
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్రె అస్వద్ మహత్యాన్ని గూర్చి ఇలా సెలవిచ్చారు.
“హజ్రె అస్వద్ స్వర్గం నుండి అవతరిచినప్పుడు పాల కన్నా తెలుపుగా వుంది. ఆదం సంతానం తప్పులు దానిని నల్లగా మార్చేశాయి.” (తిర్మిజి: 877, సహీహ్- అల్బానీ)
ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రె అస్వద్ గురించి ఇలా సెలవిచ్చారు:
“అల్లాహ్ సాక్షి! ప్రళయం రోజు అది – తను చూడగలిగే రెండు కళ్ళు, మాట్లాడ గలిగే గొంతు వున్న స్థితిలో లేపబడుతుంది. అది – సత్యంతో తనను తాకిన వారి గురించి సాక్ష్యమిస్తుంది.” (తిర్మిజి, ఇబ్నె హిబ్బాన్, సహీ అత్తర్ గీబ్ వ తర్హిబ్: 1144)
కానీ, హజ్ర అస్వద్ లాభం కానీ, నష్టం కానీ చేకూర్చలేదు అన్న విషయాన్ని హాజీ గుర్తుంచుకోవాలి. ఉమర్ (రదియల్లాహు అన్హు) ద్వారా ఉల్లేఖించబడిన దేమిటంటే ఆయన హజ్రి అస్వద్ ను ముద్దాడారు. తదుపరి, ఇలా సెలవిచ్చారు:
“నువ్వొక రాయివని నాకు తెలుసు. నువ్వు లాభం కానీ, నష్టం కానీ చేకూర్చలేవు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నిన్ను ముద్దాడుతుండగా నేను గనక చూసివుండక పోతే, నేనెప్పుడూ నిన్ను ముద్దాడే వాణ్ణి కాను.” (బుఖారీ:1597, ముస్లిం:1270)
2. తవాఫ్ చేస్తున్నప్పుడు, మొదటి మూడు ప్రదక్షిణలు భుజాలను కదుపుతూ, చిన్న చిన్న అడుగులు వేస్తూ వేగంగా నడవాలి. దీనిని ‘రమల్’ అంటారు. కానీ, ఒకవేళ రద్దీ ఎక్కువగా వుంటే కేవలం భుజాలను కదిపినా సరిపోతుంది. ఈ ఆజ్ఞ స్త్రీలకు, వారితో కలిసి వెళ్ళిన పురుషులకు వర్తించదు.
అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్ లేదా ఉమ్రా కోసం తవాఫ్ చేస్తున్నప్పుడు, మొదటి మూడు ప్రదక్షిణలు వడివడిగా అడుగులు వేస్తూ, వేగంగా చేసేవారు. మిగిలిన నాలుగు ప్రదక్షిణలు సాధారణ వేగంతో చేసేవారు. తదుపరి రెండు రకాతులు చదివి, ఆ తర్వాత సఫా, మర్వాల మధ్య ‘సయీ’ చేసేవారు. (బుఖారీ:1616, ముస్లిం 1261)
3. తవాఫ్ చేస్తున్నప్పుడు స్మరణ(జిక్ర్), దుఆ, ఖుర్ఆన్ పారాయణంలలో నిమగ్నమై వుండాలి. ప్రతి ప్రదక్షిణ కోసం ప్రత్యేకమైన దుఆ ఏదీ లేదు. కానీ, రుక్నె యమానీ మరియు హజ్ర అస్వద్ ల మధ్య ‘రబ్బనా ఆతినా ఫిద్దునియా హసనతవ్వఫిల్ ఆఖిరతి హసనతవ్వఖినా అజాబన్నార్’ పఠించండం సున్నత్. (అబూ దావూద్: 1892, హసన్-అల్బానీ)
జిక్ర్, దుఆల ను బిగ్గరగా చేయడం సరైనది కాదు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“నీ మనసు లోనే – కడు వినమ్రతతో, భయంతో – నీ ప్రభువును స్మరించు. ఉదయం, సాయంత్రం బిగ్గరగా కాకుండా, మెల్లగా నోటితో కూడా (స్మరించు). విస్మరించే వారిలో చేరిపోకు.” (ఆరాఫ్: 205)
ఇంకా, ఇలా సెలవిచ్చాడు:
“మీరు మీ ప్రభువును కడుదీనంగా వేడుకోండి. గోప్యంగా కూడా విన్నవించుకోండి. హద్దు మీరిపోయే వారిని ఆయన ఎంత మాత్రం ఇష్టపడడు.” (ఆరాఫ్:55)
4. ” బిస్మిల్లాహ్, అల్లాహు అక్బర్” అంటూ రుక్నె యమానీని తాకడం కూడా సున్నత్. అందుకే ఎవరైనా, దీనిని తేలిగ్గా గనక చేయగలిగితే మంచిదే. కానీ, ఒకవేళ అలా చేయలేక పోతే చేత్తో సైగ చేయకుండానే, ముద్దాడ కుండానే దానిని దాటిపోవాలి.
అబ్దుల్లా బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు. “నిశ్చయంగా రుక్న్ (హజ్ర అస్వద్) మరియు మఖామ్ (మఖామె ఇబ్రాహీం) స్వర్గంలోని విలువైన రాళ్ళలో రెండు రాళ్ళు. అల్లాహ్ వాటిని కాంతిహీనంగా చేసేశాడు. ఒకవేళ ఆయన వాటిని కాంతిహీనంగాచేసి వుండక పోతే, అవి తూర్పు పడమరల మధ్య ప్రపంచం మొత్తాన్నీ కాంతివంతం చేసేవి.” (తిర్మిజి:878, సహీహ్-అల్బానీ)
5. ఏడు ప్రదక్షిణలు పూర్తయ్యాక, మఖామె ఇబ్రాహీం వెనుక, ఒకవేళ స్థలం దొరికితే మంచిది, లేకపోతే మస్జిదుల్ హారామ్ లోని ఏ భాగంలో నయినా రెండు రకాతులు చదవాలి. దీనిలో – మొదటి రకాతులో ఫాతిహా సూరాతో పాటు ‘కాఫిరూన్’ సూరా మరియు రెండవ రకాతులో ‘ఇక్లాస్’ సూరా పఠించాలి (ముస్లిం:1218)
తదపరి, జమ్ జమ్ నీళ్ళు త్రాగాలి మరియు తలపై వేసుకోవాలి. ఆ తర్వాత, ఒకవేళ అవకాశం దొరికితే హజ్రె అస్వద్ ను తాకాలి. ఎందుకంటే ఇలా చేయడం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సున్నత్. ఒకవేళ ఇలా చేయడం కుదరకపోతే, నేరుగా సఫా కొండవైపుకు వెళ్ళాలి.
జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మక్కా ముకర్రమ చేరుకొని, మస్జిదుల్ హరాంలో ప్రవేశించారు. తదుపరి, హజ్ర అస్వద్ను తాకి, తన కుడి వైపుకు నడిచారు. మొదటి మూడు ప్రదక్షిణలలో ఆయన ‘రమల్’ చేసారు. మిగిలిన నాలుగు ప్రదక్షిణలు సామాన్య వేగంతో పూర్తి చేసారు. ఆ తర్వాత ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మఖామె ఇబ్రాహీం వద్ద కొచ్చి – ‘మీరు ఇబ్రాహీం నిలబడిన ప్రదేశాన్ని నమాజు స్థలంగా చేసుకోండి’ (బఖర:125) అన్న ఆయతును పఠించారు. మఖామె ఇబ్రాహీంను తనకూ, బెతుల్లాహ్ కు మధ్యగా వుంచి రెండు రకాతులు నమాజు చదివారు. తదుపరి మళ్ళీ హజ్రె అస్వద్ వద్ద కొచ్చి ఇస్తెలామ్ (తాకడం) చేశారు. ఆ తర్వాత సఫా వైపుకు వెళ్ళి పోయారు.” (ముస్లిం:1218)
తవాఫ్ లో జరిగే కొన్ని పొరపాట్లు:
హజ్ర అస్వద్ ను ముద్దాడేటప్పుడు ఇబ్బంది పెట్టి ముస్లిములకు కష్టం కలిగించడం, రెండు చేతులెత్తి హజ్రె అస్వద్ వైపు సైగ చేయడం, హతీమ్ నుంచి పోతూ తవాఫ్ చేయడం, రుక్నె యమానీ ని ముద్దాడడం, ఇలా చేయలేకపోతే దానివైపు సైగ చేయడం, ప్రతి ప్రదక్షిణ కొరకు ఒక దుఆను ప్రత్యేకించుకోవడం, కాబా గోడలపై, ఆశీర్వాద సంకల్పంతో చేతులు త్రిప్పడం, ఖుద్దూమ్ తవాఫ్ తర్వాత కూడా కుడిభుజాన్ని నగ్నంగా వుంచడం. తవాఫ్ చేస్తున్నప్పుడు బిగ్గరగా దుఆలు పఠించడం.
జమ్ జమ్ మహత్యం
ఇబ్నె అబ్బాస్ (రజి అల్లాహు అన్ము కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“యావత్ భూమండలంలో అన్నింటికన్నా శ్రేష్టమైన నీరు జమ్ జమ్ నీరు. అది (తినేవారికి) భోజనం కూడాను. దీనితో పాటు, దీనిలో వ్యాధులకు ఉపశమనం కూడా వుంది.” (తబ్రానీ, ఇబ్నె హిబ్బాన్, సహీ అత్తరీబ్ వ తర్బ్ : 1161)
ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“జమ్ జమ్ నీటిని ఏ ఉద్దేశ్యంతో త్రాగితే, అతని ఆ ఉద్దేశ్యం పూర్తి చేయబడుతుంది.” (దారెఖుత్ని, హాకిం, సహీ అత్తర్బ్ వ తర్హీబ్:1164)
6. తవాఫ్, రెండు రకాతులు, హజ్రె అస్వద్ ఇస్తెలామ్ ల తర్వాత ‘ముల్తజమ్’ వద్దకు వెళ్ళాలను కుంటే వెళ్ళవచ్చు. ఎందుకంటే ఇలా చేయడం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా నిరూపించబడి వుంది.
అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం, ఆయన తవాఫ్ చేసారు, తదుపరి రెండు రకాతులు నమాజు చేసి, ఇస్తెలామ్ చేసారు. ఆ తర్వాత హజ్రె అస్వద్ మరియు కాబా ద్వారం మధ్య నిలబడి తన ఛాతీని, చేతులను, చెంపలను బైతుల్లాహ్ తో కలిపారు. తదుపరి ఇలా సెలవిచ్చారు: నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలాగే చేస్తుండగా చూశాను. (తిర్మిజీ: 2962, అస్సహీహ లిల్ అల్బానీ: 2138)
3) సయీ
సఫా దగ్గరికి వెళ్ళి – ‘ఇన్నస్సఫా వల్ మర్వత మిన్ షాఇరిల్లాహ్‘ (నిస్సందేహంగా సఫా, మర్వాలు అల్లాహ్ చిహ్నాల లోనివి) అని పఠించి తదుపరి సఫా పైకెక్కి, కాబా గృహం వైపు ముఖం త్రిప్పి ఈ దుఆ పఠించాలి:
“లా ఇలాహ ఇల్లల్లాహు, వహదహూ లాషరీకలహు, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు, యుహ్యీ వయుమీతు, వహువ అలాకుల్లి షయ్యిన్ ఖదీర్. లా ఇలాహ ఇల్లల్లాహు వహదహూ లాషరీ కలహు అన్జజ వాదహు వ నసర అబ్దహు వ హజమల్ అహ్బ వహదహు.”
తదుపరి చేతులెత్తి ప్రార్థించాలి. మూడుసార్లు ఇలాగే చేసి ఆ తర్వాత మర్వా వైపుకు వెళ్ళాలి. దారిలో రెండు ఆకుపచ్చరంగు చిహ్నాల మధ్య పరుగెత్తాలి. కానీ, స్త్రీలు, వారివెంట వున్న పురుషులు పరుగెత్త కూడదు. తదుపరి మామూలుగా నడుచుకుంటూ మర్వా చేరుకోవాలి. అక్కడికి చేరగానే ఒక ప్రదక్షిణ పూర్తవుతుంది. అక్కడ కూడా, సఫాపైన చేసినట్లే చేయాలి. తదుపరి సఫా వైపుకు రావాలి. దారిలో రెండు ఆకుపచ్చరంగు చిహ్నాల మధ్య పరుగెత్తాలి. సఫా చేరుకోగానే రెండవ ప్రదక్షిణం పూర్తవుతుంది. ఇలా ఏడు ప్రదక్షిణలు పూర్తి చేయాలి. ఆఖరి ప్రదక్షిణం మర్వాలో పూర్తవుతుంది. సయీ చేస్తున్నప్పుడు జిక్ర్, దుఆ, ఖుర్ఆన్ పారాయణంలలో నిమగ్నమై వుండాలి.
కొన్ని పొరపాట్లు: సఫా, మర్వాలపై ఖిల్లా వైపు తిరిగి రెండు చేతులతో సైగ చేయడం. నమాజ్ కోసం ఇఖామత్ చెప్పబడిన తర్వాత కూడా సయీ ని ఆపక పోవడం, సయీ కోసం ఏడు ప్రదక్షిణలు కాకుండా 14 ప్రదక్షిణలు చేయడం
4) శిరోముండనం లేదా వెంట్రుకలు కత్తిరించడం.
సఫా, మర్వాల మధ్య సయీ పూర్తి చేసిన తర్వాత శిరోముండనం చేసుకోవాలి లేదా వెంట్రుకలన్నీ చిన్నగా కత్తిరించుకోవాలి. శిరోముండనం చేసుకోవడం ఉత్తమం. స్త్రీ తన జడలలో, ప్రతి జడ నుండి వ్రేలి ఒక కట్టుకు సమానంగా వెంట్రుకలు కత్తిరించుకోవాలి. పురుషులు తలలో, కేవలం కొంతభాగం లోని వెంట్రుకలను చిన్నగా కత్తిరించుకొని హలాల్ కావడం సున్నత్కు విరుద్ధం.
ఇలా, మీ ఉమ్రా పూర్తవుతుంది. ఇహ్రాం మూలంగా ఏవైతే నిషేధాలు పాటించబడ్డాయో, అవి సమాప్తమై పోతాయి. ఇక మీరు ఇహ్రాం ను విప్పేయ వచ్చు.
అల్లాహ్ మనందరికీ, హజ్ చేసేవారికి, స్వీకరించబడే ఉమ్రాను చేసే భాగ్యాన్ని ప్రసాదించు గాక! ఆమీన్!
రెండవ ఖుత్బా
మొదటి ఖుత్బాలో మేము హజ్ ప్రాధాన్యత, విధిత్వము, హజ్ మహత్యాలు, హజ్ ప్రయాణ మర్యాదలు మరియు ఉమ్రా ఆదేశాల గురించి వివరించాం.
ఇక, ఉదయించే ప్రశ్న ఏమిటంటే, హజ్ కోసం వెళ్ళిన వారు (హాజీలు) ఉమ్రా పూర్తి చేసుకున్నాక జిలా జ్జ 8 వ తారీఖు (యౌముత్తర్వియా) వరకు ఏం చెయ్యాలి?
1- కొంతమంది ఉమ్రా పూర్తి చేసుకున్నాక, వివిధ మస్జిద్ల మరియు పర్వాతాలను పుణ్యఫలాపేక్షతో సందర్శిస్తారు. కానీ ఇది సమయాన్ని వృథా చేయడమే అవుతుంది. అలాగే, మస్జిద్ ఆయెషా (రదియల్లాహు అన్హా) నుండి ఇహ్రాం ధరించి మాటిమాటికి ఉమ్రా చేయడం కూడా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు ఆయన సహాబాల ద్వారా నిరూపించబడిలేదు. కేవలం ఆయేషా (రదియల్లాహు అన్హా) ద్వారా నిరూపించడి వున్న విషయమేమిటంటే –
ఆమె, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో పాటు మక్కా ముకర్రమ చేరుకున్నప్పుడు అపరిశుద్ధ అవస్థలో వున్నారు. అందుకే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెను ఉమ్రా చేయడం గురించి వారించారు. తదుపరి ఆమె, ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) తో కలిసి హజ్ చేసారు. తదుపరి మదీనా మునవ్వర కు తిరిగి వెళ్ళే ముందు ఆమె, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో – ప్రజలంతా హజ్ మరియు ఉమ్రా, రెండూ చేయగా నేను మాత్రం హజ్ మాత్రమే చేశాను అన్న విషయం నా మనసులో వుండిపోతుంది అని అన్నారు. దీనితో, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమె సోదరునికి ఆమెను తీసుకొని ‘తనీమ్’ వద్ద కెళ్ళి, అక్కడ ఇహ్రాం సంకల్పం చేసుకొని వచ్చి ఉమ్రా చేయించమని ఆజ్ఞాపించారు. ఇలా ఆమె ఉమ్రా పూర్తి చేసుకున్నారు. (బుఖారీ:1556, ముస్లిం:1211)
ఇదొక ప్రత్యేక విషయం. కానీ ప్రజలు దీనిని సాకుగా తీసుకొని ఉమ్రా మరియు హజ్ ల మధ్య మాటిమాటికీ తనీమ్ వద్దకెళ్ళి ఇహ్రాం ధరించి ఎన్నో ఉమ్రాలు చేస్తుంటారు. వాస్తవానికి ఇది దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా కానీ, సహాబాల ద్వారా గానీ నిరూపించబడి లేదు. అందుకే మేము అనుకునే దేమిటంటే – మాటి మాటికీ ఉమ్రా చేసే బదులు, మస్జిదుల్ హరామ్ సామూహిక నమాజ్ చేస్తూ, ఐచ్చిక కాబా గృహం ప్రదక్షిణ (నఫిల్ తవాఫ్) పలుసార్లు చేయడం ఎంతో ఉత్తమం.
2. మస్జిదుల్ హరామ్ సామూహిక నమాజ్ క్రమం తప్పకుండా నెలకొల్పుతూ వుండాలి. దీని మహత్యం గురించి చెప్పాలంటే, కేవలం ఈ విషయం చాలు – దీనిలోని ఒక్క నమాజ్ ఇతర మస్జిద్లలోని లక్ష నమాజుల కన్నా మేలైనది. ఈ విషయం మేము గత శుక్రవారపు ఖుత్బాలో వివరించి వున్నాం.
3. కాబా గృహం ఐచ్చిక పదక్షిణ (నఫిల్ తవాఫ్) చేస్తూ వుండాలి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “ఎవరైనా బైతుల్లాహ్ తవాఫ్ చేసి, రెండు రకాతులు నమాజ్ చదివితే అతనికి, ఒక వ్యక్తికి స్వేచ్ఛ ప్రసాదించినంత పుణ్యం దొరుకుతుంది.” (ఇబ్నెమాజ: 2956, సహీ – అల్బానీ)
మరో సహీ హదీసులో ఇలా వచ్చింది:
“(తవాఫ్ చేస్తున్నప్పుడు) వేసే ప్రతి అడుగుకు గాను 10 పుణ్యాలు వ్రాయబడతాయి, 10 పాపాలు తుడిచి వేయ బడతాయి, 10 అంతస్తులు (పైకి) లేపబడతాయి.” (అహ్మద్, సహీ అత్తరీబ్ వ తర్పీబ్ లిల్ అల్బానీ: 1139)
4. ఒకవేళ మీరు కాబా గృహం లోపల నమాజ్ చదివిన గౌరవాన్ని పొందాలనుకుంటే ‘హతీమ్’లో చదువుకోండి. ఎందుకంటే, హతీమ్ కూడా కాబాలోని అంతర్భాగమే.
ఆయేషా (రదియల్లాహు అన్హా కథనం: నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను, కాబా గృహం లోపలికి వెళ్ళి నమాజు చేస్తానని విన్నవించుకున్నాను. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నా చేయి పట్టుకొని అల్ హిజ్ర్ (హతీమ్) లోపలికి తీసుకెళ్ళి ఇలా సెలవిచ్చారు:
“ఒకవేళ నువ్వు బైతూల్లాహ్ లోపలికి ప్రవేశించాలనుకుంటే హతీమ్ లోపలే నమాజు చేసుకో. ఎందుకంటే ఇది (హతీమ్) కూడా కాబా యొక్క ఒక భాగమే, కానీ నీ జాతివారు కాబా గృహాన్ని నిర్మించేటప్పుడు చిన్నదిగా చేద్దామనుకున్నారు. అందుకేవారు దీనిని (హతీమ ను) బైతుల్లాహ్ నుండి వేరు చేసారు.” (తిర్మిజి: 876, సహీ – అల్బానీ)
హజ్ కు సంబంధించిన మిగతా ఆదేశాలు ఇన్షా అల్లాహ్ వచ్చే శుక్రవారం వివరించబడతాయి. అల్లాహ్ హాజీలందరి మరియు మనందరి ఆరాధనలన్నీ స్వీకరించుగాక! ఆమీన్!
—
హజ్ మహత్యాలు, ఆదేశాలు మరియు మర్యాదలు – (2)
ఖుత్బాయందలి ముఖ్యాంశాలు
1. హజ్ కు సంబంధించిన సమగ్ర ఆదేశాలు, వివరాలు.
2. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్ కు సంబంధించి బాగా ప్రాచుర్యం పొందిన జాబిర్ (రదియల్లాహు అన్హు) హదీసు.
3. మదీనా సందర్శన మర్యాదలు.
మొదటి ఖుత్బా
గత శుక్రవారపు ఖుత్బాలో ఖుర్ఆన్ మరియు హదీసుల వెలుగులో హజ్ ప్రాధాన్యత, విధిత్వము, హజ్ మహత్యాలు, హజ్ ప్రయాణానికి సంబంధించిన కొన్ని మర్యాదలు, ఉమ్రాకు సంబంధించిన సమగ్ర ఆదేశాలు, వివరాలు వివరించాం. నేటి ఖుత్బాలో, హజ్ ఆదేశాలు, దాని వివరాలతో పాటు మదీనా మునవ్వర సందర్శనకు సంబంధించిన మర్యాదలను సమగ్రంగా వివరిస్తాం.
హజ్ కు సంబంధించిన సమగ్ర ఆదేశాలు, వివరాలు
జిల్ హిజ్జ – 8వ తేది (యౌముత్తర్వియా)
మక్కా ముకర్రమ లో మీరు నివాసముంటున్న స్థలం నుంచే ఇహ్రాం కట్టుకోవాలి. ఇహ్రాం కట్టుకోవడానికి ఉమ్రా కోసం అవలంబించిన పద్ధతే హజ్ కు కూడా వర్తిస్తుంది. కనుక, పరిశుభ్రత, స్నానం ముగించి, శరీరంపై సువాసన పూసుకొని ఇహ్రాం దుస్తులు ధరించాలి.
తదుపరి ‘లబ్బైకల్లాహుమ్మ హజ్జన్‘ అని అంటూ హజ్ గురించి సంకల్పించుకొని ‘తల్బియ’ పఠించడం ప్రారంభించాలి. జిల్ హిజ్జ 10 వ తేదీనాడు కంకర్రాళ్ళను కొట్టే వరకు తల్బియ పఠిస్తూనే వుండాలి. ఎందుకంటే, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘రమీ’ చేసే వరకు తల్బియ పఠిస్తూనే వున్నారు. (బుఖారీ:1670,1685, ముస్లిం: 1281)
ఇహ్రాం ధరించాక, జొహర్ కు ముందు ‘మీనా’ బయలుదేరాలి. ‘మినా’ లో జొహర్, అసర్, మగ్రిబ్, ఇషా మరియు జిల్ హిజ్జ 9వ తేది ఫజర్ నమాజులను ‘ఖసర్’ చేస్తూ వాటి వాటి సమయాల్లో చదవాలి మరియు రాత్రి అక్కడే గడపాలి. ఇది దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సున్నత్. (బుఖారీ: 1653,1655, ముస్లిం: 694,1309)
అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:
“దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మినా లో మాకు జొహర్, అసర్, మగ్రిబ్, ఇషా మరియు ఫజర్ నమాజులు చేయించారు. ఆ తర్వాత అరాఫాత్ వైపుకు ప్రయాణమయ్యారు.” (తిర్మిజి: 879, సహీ – అల్బానీ)
ఈ విషయాన్నే జాబిర్ (రదియల్లాహు అన్హు) తన సుదీర్ఘ హదీసులో ఉల్లేఖించారు. (ముస్లిం:1218)
జిల్ హిజ్జ 9వ తేది (యౌమె అరఫా)
అరఫా దినం (యౌమె అరఫా) ఎంతో మహోన్నతమైన దినం. ఈరోజు అరాఫాత్ లో గడపడం. హజ్ మౌలికాంశాలలో అన్నిటి కన్నా ముఖ్యమైన అంశం. అందుకే, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అరాఫాత్ లో గడపడాన్ని హజ్ గా ఖరారు చేశారు. (తిర్మిజీ:889, ఇబ్నెమాజ:3015, సహీ – అల్బానీ)
ఈ దినపు మహత్యాన్ని గూర్చి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “అల్లాహ్ అరాఫాత్ దినం నాడు అత్యధికంగా తన దాసులను నరకాగ్ని నుండి విముక్తి కలిగిస్తాడు మరియు దగ్గరగా వచ్చి దైవదూతల ముందు ఇలా అడుగుతాడు. వీరేం కోరుకుంటున్నారు?”
అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం:
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆరాఫాత్ లో బస చేశారు. తదుపరి, సూర్యాస్తమయం కాబోయే సమయంలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) బిలాల్ (రదియల్లాహు అన్హు) తో – ఓ బిలాల్! నిశ్శబ్దంగా వుండి నా వైపు దృష్టి సారించమని ప్రజలకు చెప్పు అని అన్నారు. దీనితో ఆయన, ప్రజలను నిశ్శబ్దం గావించగా, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ప్రజలారా! ఇంతకు ముందే జిబ్రయీల్ (అలైహిస్సలాం) నావద్ద కొచ్చారు. ఆయన నాకు, నా ప్రభువు సలాం అందజేసి ఇలా సెలవిచ్చారు – అల్లాహ్ అరాఫాత్ వాసులను, మష్అర్ వాసులను మన్నించాడు మరియు వారి హక్కుల బాధ్యతను తనపై వేసుకున్నాడు.” దీనిపై, ఉమర్ (రదియల్లాహు అన్హు) లేచి నిలబడి – ఓ దైవ ప్రవక్తా! ఇది కేవలం మా కోసమే ప్రత్యేకమా? అని అడిగారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) – “ఇది మీ కొరకు మరియు ప్రళయం వరకు వచ్చే ప్రతి వ్యక్తి కొరకు” అని జవాబిచ్చారు. (సహీ అత్తర్బ్ వ తర్హిబ్ లిల్ అల్బానీ : 1151)
అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:
“దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అరాఫాత్ దినం నాడు ఫజర్ నమాజు మినా లో చేశారు. తదుపరి (సూర్యోదయం తర్వాత) ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) అరాఫాత్ వైపుకు ప్రయాణమయ్యారు. అరాఫాత్ చేరుకొని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘నిమ్ర’ (స్థలం) వద్ద ఆగారు. అరాఫాత్ లో ఇమామ్ దిగే స్థలం ఇదే. జొహర్ సమయం కాగానే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) దాని (జొహర్ సమయం) ఆరంభంలోనే జొహర్ మరియు అసర్ నమాజులను కలిపి చదివారు. తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజల కోసం ఉపన్యసించారు. ఆ తర్వాత అరాఫాత్లో బస చేశారు.” (అబూదావూద్:1913, హసన్ – అల్బానీ)
1) జిల్ హిజ్జ 9వ తేది, సూర్యోదయం తర్వాత తక్బీర్ మరియు తల్బియ పఠిస్తూ అరాఫాత్ వైపుకు ప్రయాణమవ్వాలి.
ముహమ్మద్ బిన్ అబూబక్ర్ అస్సఖఫీ కథనం ప్రకారం ఆయన మరియు అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) మినా నుండి అరాఫాత్ కు వెళు తున్నప్పుడు, దారిలో ఆయన, అనస్ (రదియల్లాహు అన్హు) తో – మీరు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో పాటు ఈరోజు ఏం పఠించేవారు అని అడగ్గా, ఆయన జవాబిస్తూ – మాలో ఒకరు తల్బియ పఠించగా అది నిరోధించ బడేది కాదు, మరొకరు తక్బీర్ పలికినా అది కూడా నిరోధించబడేది కాదు. (బుఖారీ:1659, ముస్లిం:1285)
అరాఫాత్ చేరుకున్నాక, అరాఫాత్ హద్దులలో వున్నామో లేదో అని నిర్ధారించుకోవాలి. తదుపరి, మధ్యాహ్నం తర్వాత వీలైతే ఇమామ్ ఇచ్చే ఖుత్బాను వినాలి, అతనితో పాటు జొహర్, అసర్ నమాజులను ఖసర్ చేసి చదవడానికి ప్రయత్నించాలి. ఒకవేళ సాధ్యం కాకపోతే, మీ గుడారాలలోనే రెండు నమాజులను కలిపి మరియు ఖసర్ చేసి సామూహికంగా చేసుకోవాలి.
2) ఆ తర్వాత సూర్యాస్తమయం అయ్యే వరకు జిక్ర్, దుఆ, తల్బియ, ఖుర్ఆన్ పారాయణంలలో నిమగ్నమై వుండాలి. అల్లాహ్ ముందు వినయ విధేయతలు కనబర్చాలి. తమ పాపాలకు గాను మనస్ఫూర్తిగా తౌబా (పశ్చాత్తాపం) చేసుకోవాలి. చేతులెత్తి ఇహపరలోకాలలో మంచి మరియు సాఫల్యం కొరకు ప్రార్థించాలి.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“అన్నిటికన్నా ఉత్తమమైన దుఆ ఆరాఫాత్ దినపు దుఆ మరియు నేను, నాకు ముందు గతించిన ప్రవక్తలు చేసిన ఉత్తమమైన దుఆ ఇది: “లా ఇలాహ ఇల్లల్లాహు వహదహూ లా షరీ కలహు, లహులుల్కు, వలహుల్ హమ్దు వహువ అలాకుల్లి షయ్యిన్ ఖదీర్.” (తిర్మిజి: 3585, హసన్ – అల్బానీ, అస్సహీహ:1503)
3) అరాఫాత్ లో బస చేసే సమయం
మధ్యాహ్నం తర్వాత జిల్ హిజ్జ 10వ తేది ఫజర్ కు ముందు వరకు వుంటుంది. ఈ వ్యవధిలో హాజీ ఒక్క నిమిషం కోసమైనా, అరాఫాత్లోకి వెళితే, అతని ఈ అంశం నెరవేరుతుంది.
ఉర్వా బిన్ ముజర్రస్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) కథనం:
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముజ్ దలిఫా లో ఫజర్ నమాజు కోసం తయారవుతున్న సమయంలో నేను ఆయన వద్దకు వచ్చి – ఓ దైవ ప్రవక్తా! నేను (తై) యొక్క రెండు పర్వతాల గుండా (ప్రయాణం చేసి) వచ్చాను. నేను నా వాహనాన్ని కష్టానికి గురి చేయటంతో పాటు స్వయంగా కూడా బాగా అలసి పోయాను. నేను (అరాఫాత్ లో) రాత్రి ప్రదేశాన్ని దేనినీ వదలకుండా ప్రతిచోటా బస చేశాను. మరి నా హజ్ సరైనదేనా? అని అడిగాను.
ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు. : “ఏ వ్యక్తి అయినా మాతో పాటు నమాజ్లో పాలుపంచుకొని, మేమిక్కడి నుండి (మినాకు) బయలుదేరే వరకు మాతో గడిపి, అతను, దానికి ముందు రాత్రి లేదా పగటి వేళలో ఏదో ఒక సమయంలో అరాఫాత్లో గడిపివుంటే అతని హజ్ సంపూర్ణమైనట్లే మరియు అతను తన (హజ్) ఆచారాలను పూర్తి చేసిన వాడవుతాడు.” (తిర్మిజీ: 891, ఇబ్నెమాజ:3026,సహీ – అల్బానీ)
అరాఫాత్ సరిహద్దులో ఎక్కడ బస చేసినా సరిపోతుంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“నేనిక్కడ బస చేశాను అరాఫాత్ మైదానం అంతా బస చేయబడే స్థలం.” (ముస్లిం: 1218) 4)
సూర్యాస్తమయం అయ్యాక ఎంతో ప్రశాంతంగా అరాఫాత్ నుండి ముజ్ఙలిఫాకు ప్రయాణమవ్వాలి.
అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం, ఆయన, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో పాటు అరాఫాత్ దినం నాడు అరాఫాత్ నుండి తిరిగి వచ్చారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన వెనుక – వాహనాలను కొడుతూ, తీవ్రంగా కోపగించుకుంటున్న శబ్దాలు విని, తన వద్దనున్న కొరడాతో వారివైపు సైగ చేస్తూ ఇలా సెలవిచ్చారు: “ప్రజలారా! ఎంతో ప్రశాంతంగా బయలుదేరి వెళ్ళండి. ఎందుకంటే త్వరత్వరగా చేయడంలో పుణ్యం లేదు.” (బుఖారీ : 1671)
5) అరాఫాత్ దినం నాడు మగ్రిబ్ నమాజును అరాఫాత్ లో కాకుండా ముజ్ఙలిఫా చేరుకొని ఇషా నమాజుతో జతచేసి చదవాలి.
ఉసామా బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) కథనం:
“నేను, అరాఫాత్ నుండి (బయలుదేరినప్పటి నుండి) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వాహనం పై ఆయన వెనుక కూర్చొని వున్నాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముజ్ఙలిఫా కు ముందు, ఎడమవైపున గల ఒక లోయలో తన వాహనాన్ని కూర్చోబెట్టారు. తదుపరి ఆయన కాలకృత్యాలు తీర్చుకున్నారు. ఆ తర్వాత ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తిరిగి రాగా, నేను ఆయనకు నీళ్ళు పోసాను. ఆయన తేలిక పాటి వుజూ చేసు కున్నారు. నేను ఓ దైవ ప్రవక్తా! నమాజ్ చదువుతారా? అని అడిగాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) – “ఇంకా కొంచెం ముందుకెళ్ళి నమాజ్చదువుదాం” అని అన్నారు. తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వాహనం ఎక్కి ముజ్జలిఫా చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) నమాజ్ చదివారు.
6) ముజ్ఙలిఫా లో అన్నిటికన్నా ముందుగా మగ్రిబ్ మరియు ఇషా నమాజులు జత మరియు ఖసర్ చేసి సామూహికంగా చదవాలి. తదుపరి, తమ అవసరాలు తీర్చుకొని నిద్రపోవాలి.
అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మగ్రిబ్ మరియు ఇషా నమాజులను ముజ్ఙలిఫా లో జత చేసారు. ప్రతి నమాజుకు ప్రత్యేకంగా ఇఖామత్ చెప్ప బడింది. ఈ రెండింటి మధ్యలో గానీ మరియు వీటి తర్వాత గానీ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎలాంటి నఫిల్ నమాజ్ చదవలేదు. (బుఖారీ: 1673)
7) స్త్రీలు మరియు వారితో పాటు వున్న పురుషులు, పిల్లలు, అలాగే బలహీనులు అర్ధరాత్రి దాటాక ముజ్ఙలిఫా నుండి బయలుదేరి మినా కు వెళ్ళవచ్చు.
అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం, ఆయన ఇంట్లోని బలహీనులు ముజ్ఞలిఫాలో మష్అరుల్ హరాం వద్ద రాత్రి బస చేసేవారు. వారికిష్టమైనంత సేపు అల్లాహ్ స్మరణ చేసేవారు. తదుపరి, ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు), ఇమామ్ తన విడిది తర్వాత మినా తిరిగి వచ్చే లోపు ఆ బలహీనులను ముజ్ఙలిఫా నుండి త్వరగా పంపించేసే వారు. ఇలా, వారిలో ఒకరు ఫజర్ కు ముందు మినా చేరుకుంటే మరొకతను ఫజర్ తర్వాత చేరుకునే వారు. మినా చేరుకోగానే ‘జమ్రా -ఏ-అఖ్బా) (సామాన్యంగా పెద్ద షైతాను అని పిలుస్తూ వుంటారు) ను ‘రమీ’ (కంకరాళ్ళు విసరడం) చేసేవారు. అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా అనేవారు (బలహీనులకు) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) (ముజ్ఙలిఫా నుండి మినా కు ముందుగా వెళ్ళడానికి) వారికి అనుమతి ఇచ్చారు. (బుఖారీ: 1676, ముస్లిం: 1295)
ఆయెషా (రదియల్లాహు అన్హు) కథనం:
మేము ముజ్ఞలిఫాలో బస చేసినప్పుడు, సౌదా (రదియల్లాహు అన్హు) – ప్రజల రద్దీ కన్నా ముందుగానే తను మినా వెళ్ళిపోవడానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు అనుమతి అడిగారు, తను భారీ కాయం కలవారు, మెల్లమెల్లగా నడిచేవారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెకు అనుమతి నిచ్చారు. అందుకే ఆమె ప్రజల రద్దీ కన్నా ముందుగానే బయలుదేరారు. మేము మాత్రం తెల్లవారే వరకు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో పాటే వున్నాం. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో పాటే మినా కు తిరిగి వచ్చాం. ఒకవేళ నేను కూడా సౌదా (రదియల్లాహు అన్హు) లాగా అనుమతి తీసుకొని వుంటే అది నేను సంతోషపడిన (ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తో పాటు వుండవచ్చు అన్న) విషయం కన్నా మేలుగా వుండేది. (బుఖారీ:1681, ముస్లిం: 1290)
అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ఇంట్లోని బలహీనులతో పాటు ముజ్ఙలిఫా నుండి (మినాకు) ముందుగానే పంపించిన వారిలో నేనూ వున్నాను. (బుఖారీ: 1678, ముస్లిం: 1293)
కొన్ని పొరపాట్లు:
1. అరాఫాత్ సరిహద్దుకు బయట బస చేయడం.
2. జబలె రహ్మత్ ను అధిరోహించక పోతే ఆరాఫాత్ విడిది సంపూర్ణం కాదని విశ్వసించడం. వాస్తవానికి జబలె రహ్మత్ ఎక్కడానికి ప్రత్యేక మహత్య మేమీ లేదు. ఇలా చేయడం సత్కార్యం కూడా కాదు.
3. సూర్యాస్తమయానికి ముందుగానే అరాఫాత్ నుండి వెళ్ళిపోవడం.
4. ముజ్జలిఫా కు చేరుకున్నాక అన్నిటికన్నా ముందుగా మగ్రిబ్, ఇషా నమాజులు చదవడానికి బదులు కంకర్రాళ్ళు ఏరుకోవడం.
5. ముజ్ఞలిఫాలో రాత్రి నఫిల్ నమాజులు చేయడం.
జిల్ హిజ్జ 10వ తేది (యౌమె ఈద్)
1) ఫజర్ నమాజు ముజ్ణలిఫా లో చేయాలి. తదుపరి వెలుతురు వ్యాపించే వరకు ఖిబ్లా వైపుకు తిరిగి జిక్ర్, దుఆ మరియు ఖుర్ఆన్ పారాయణంలో నిమగ్నమవ్వాలి.
2) పెద్ద జమ్రాకు కంకర్రాళ్ళు కొట్టడానికి ముజ్రలిఫాలో లావు శనగల సైజుకు సమానంగా వున్న కంకర్రాళ్ళును తీసుకోవచ్చు. కానీ, ముజ్జలిఫా లోనే తీసుకోవాలన్న నియమం ఏమీ లేదు.
అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) ముజ్ఙలిఫా నుండి మినాకు తిరిగి వెళుతూ మినా లోని ‘ముహుస్సిర్’ కు చేరుకున్నాక ఇలా సెలవిచ్చారు. “రమీ చేయడానికి మీరు కంకర్రాళ్ళను ఏరుకోండి.” (ముస్లిం:1282) ‘అయ్యామె తష్రీఖ్’ లో జమ్రాత్ కు కంకర్రాళ్ళు కొట్టడానికి, వాటిని (కంకర్రాళ్ళను) ముజ్జలిఫా నుండి తీసుకోవటం తప్పనిసరి కాదు. మినాలో కూడా తీసుకోవచ్చు.
3) తదుపరి సూర్యోదయానికి ముందు మినాకు ప్రయాణమవ్వాలి. దారిలో ముహుస్సిర్ లోయను దాటేటప్పుడు వేగంగా నడవాలి.
4) మినా లో పెద్ద జమ్రా వద్దకు చేరుకొని తల్బియ పఠించడం ఆపేయాలి మరియు మక్కా ముకర్రమ వైపు ఉన్న పెద్ద జమ్రాకు ఏడు కంకర్రాళ్ళు, ఒక్కొక్కటిగా కొట్టాలి. ప్రతి కంకర్రాయి తో పాటు ‘అల్లాహు అక్బర్’ అని అనాలి. బలహీనులు, వ్యాధిగ్రస్తులైన పురుషులు, చిన్న పిల్లలు, అలాగే బలహీనులు, వయసు మీరిన స్త్రీలు కంకర్రాళ్ళను కొట్టడానికి ఇతరులను పంపించవచ్చు.
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) యౌమున్నహర్ (ఖుర్బానీ రోజు) లో చాప్త్ సమయంలో కంకర్రాళ్ళు కొట్టేవారు మరియు మిగతా రోజుల్లో మధ్యాహ్నం తర్వాత రమీ చేసేవారు. (ముస్లిం:1299)
అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు ) ‘అల్ జమ్రతుల్ కుబ్రా’ (పెద్ద జమ్రా) వద్దకు చేరుకొని, బైతుల్లాహ్ను తన ఎడమవైపుకు మరియు మినా ను తన కుడివైపుకు చేసుకొని పెద్ద జమ్రాకు ఏడు కంకర్రాళ్ళు కొట్టారు. తదుపరి ఇలా సెలవిచ్చారు: బఖర సూరా అతరించిన వ్యక్తి (దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కూడా ఇలాగే కంకర్రాళ్ళు కొట్టారు. (బుఖారీ:1748, ముస్లిం: 1296)
5) ఆ తర్వాత ఖుర్బానీ పశువును జిబహ్ చెయ్యాలి. అది ఏలోపమూ లేనిదై, తగినంత వయస్సు కలిగినదై వుండాలి. ఖుర్బానీ కోసం పశువు యొక్క వయస్సును పట్టించుకోకుండా, ఏదైనా లోపం గల పశువులను ఉపయోగించడం సరికాదు. గురించుకోవాల్సిన విషయమేమిటంటే – మీరు ఖుర్బానీని జిల్ హిజ్జ 11 లేదా 12 లేదా 13 తేదీలలో కూడా చేయవచ్చు.
ఖుర్బానీ పశువును జిబహ్ చేశాక దాని మాంసాన్ని మీ కోసం కూడా తీసుకోండి మరియు బీదవారికి కూడా పంచిపెట్టండి.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“అల్లాహ్ తమకు ప్రసాదించిన తమ పెంపుడు పశువుల మీద ఆ నిర్ణీత దినాలలో అల్లాహ్ నామాన్ని స్మరించాలి (ఉచ్చరించాలి). ఆ తర్వాత వాటిని మీరూ తినండి, దుర్భర పరిస్థితిలో ఉన్న అగత్య పరులకు కూడా తినిపించండి.” (హజ్ : 28)
మీ వైపు నుంచి ఖుర్బానీ ఇచ్చే బాధ్యతను తీసుకున్న కంపనీలో కూడా డబ్బును జమ చేయవచ్చు. ఒకవేళ మీరు (హజ్ తమత్తు చేస్తూ) ఆర్ధిక ఇబ్బందుల దృష్యా ఖుర్బానీ ఇవ్వగలిగే స్థితిలో గనక లేకపోతే అప్పుడు 10 రోజులు ఉపవాసం ఉండాలి. హజ్ దినాలలో మూడు మరియు ఇంటికి తిరిగొచ్చాక 7 రోజులు ఉపవాసం ఉండాలి.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“ప్రశాంతతను పొంది ఉన్న స్థితిలో మీలో ఎవరైనా ఉమ్రా మొదలు కొని హజ్ వరకు సంకల్పం బూని ప్రయోజనం (తమత్తు) పొంది నట్లయితే, వారు తయ వద్ద నున్న ఖుర్బానీని ఇచ్చి వేయాలి. ఖుర్బానీ ఇవ్వలేని వారు హజ్ దినాలలో మూడు రోజులు ఉపవాసం పాటించాలి. హజ్ నుండి తిరిగి వచ్చిన తరువాత ఏడు రోజులు ఉపవాసముండాలి. ఈ విధంగా మొత్తం 10 ఉపవాసాలవుతాయి. మస్జిద్ హరామ్ కు సమీపంలో ఉండని వారికి మాత్రమే ఈ ఆదేశం వర్తిస్తుంది. (ప్రజలారా!) అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. అల్లాహ్ కఠినంగా శిక్షించే వాడన్న సంగతిని తెలుసుకోండి.” (బఖర : 196)
6) తదుపరి శిరోముండనం చేసుకోవాలి లేదా తలవెంట్రుకలన్నీ చిన్నగా కత్తిరించుకోవాలి. ముండనం చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) శిరోముండనం చేసుకొనే వారి కోసం మన్నింపు ప్రార్థన (మరో ఉల్లేఖనం ప్రకారం కారుణ్య ప్రార్ధన) మూడు సార్లు చేశారు, కానీ వెంట్రుకలు చిన్నగా కత్తిరించుకొనే వారికోసం ఒక్కసారే దుఆ చేశారు.
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఓ అల్లాహ్ ! ముండనం చేసుకున్న వారిని మన్నించు” ప్రజలు – ఓ దైవ ప్రవక్తా! వెంట్రుకలు చిన్నగా కత్తించుకున్న వారిని కూడా (ప్రార్థించండి) అని అన్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మళ్ళీ – ‘ఓ అల్లాహ్ ! ముండనం చేసుకున్న వారిని మన్నించు’ అని ప్రార్థించారు. ప్రజలు మళ్ళీ – ఓ దైవ ప్రవక్తా! వెంట్రుకలు చిన్నగా కత్తిరించుకున్న వారిని కూడా (ప్రార్థించండి) అని అన్నారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మళ్ళీ – ‘ఓ అల్లాహ్! ముండనం చేసుకున్న వారిని మన్నించు’ అని ప్రార్థించారు. ప్రజలు మళ్ళీ – ఓ దైవప్రవక్తా! వెంట్రుకలు చిన్నగా కత్తిరించుకున్నవారిని కూడా (ప్రార్థించండి) అని అన్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) నాల్గవ సారి, ‘ఓ అల్లాహ్ ! వెంట్రుకలు చిన్నగా కత్తిరించు కున్న వారిని కూడా మన్నించు’ అని ప్రార్థించారు. (బుఖారీ: 1727, ముస్లిం:1301)
అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం, “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘జమ్రా – ఏ – కుబ్బా’ కు కంకర్రాళ్ళు కొట్టారు. తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ఒంటెల వద్ద కెళ్ళి వాటిని ఖుర్బానీ ఇచ్చారు. అక్కడే క్షవరం చేసే వాడు కూర్చొని వున్నాడు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన తలవైపు సైగ చేస్తూ అతనితో – (దీని) ముండనం చేయి అని అన్నారు. అతను ముందుగా కుడివైపు ముండనం చేసాడు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ వెంట్రుకలను తన చుట్టు పక్కల వున్న వారికి పంచేశారు. తదుపరి ఆయన ‘ఇక ఎడమవైపు ముండనం చేయి’ అని అతనితో అన్నారు. ఆ తర్వాత ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) అబూ తల్హా (రదియల్లాహు అన్హు) ను పిలిచి ఆ వెంట్రుకలను ఆయన కిచ్చేశారు.” (ముస్లిం:1305)
స్త్రీలు తమ జడ నుంచి, వ్రేలి ఒక కట్టుకు సమానంగా వెంట్రుకలు కత్తిరించుకోవాలి.
ఇలా, మీరు పాక్షికంగా హలాల్ అయిపోతారు. అంటే భార్యదగ్గరికి వెళ్ళడం మినహాయించి ఇహ్రాం స్థితిలో నిషిద్ధంగా వున్న కార్యాలన్నీ హలాల్ అయిపోతాయి. భార్య దగ్గరికి వెళ్ళడం అనేది ‘ఇఫాజా తవాఫ్’ తర్వాత ధర్మ సమ్మత మవుతుంది. అందుకే మీరు ఇహ్రాం దించేసి శుచి, శుభ్రతలు, స్నానం వగైరా ॥ ముగించుకొని సాధారణ దుస్తులు ధరించి ‘ఇఫాజా తవాఫ్ ‘ కోసం కాబా గృహానికి వెళ్ళాలి.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“ఆ తరువాత వారు తమ మురికిని దూరం చేసుకోవాలి, తమ మొక్కుబడులను చెల్లించాలి. (అనంతరం దేవుని) ఆ ప్రాచీన గృహానికి ప్రదక్షిణ చేయాలి.” (హజ్:29)
7) ‘ఇఫాజా తవాఫ్’ అనేది హజ్ యొక్క అంశం. ఒకవేళ జుల్ హిజ్జా 10 వ తేదీ నాడు గనక దానిని చేయలేకపోతే, తర్వాత కూడా చేయవచ్చు. స్త్రీలు ఒకవేళ అపరిశుద్ధావస్థలో గనక వుంటే, పరిశుద్ధులయ్యాక తవాఫ్ చేయాలి. ఒకవేళ వారు ‘అయ్యామె తష్ రీఖ్’ (తష్రీఖ్ దినాలు) లలో కంకర్రాళ్ళు కొట్టిన తర్వాత పరిశుద్దులైతే, ఈలోగా వారి తిరుగు ప్రయాణానికి సమయం ఆసన్నమైతే అప్పుడు ‘ఇఫాజా తవాఫ్’ చేస్తూ ‘వీడ్కోలు తవాఫ్’ సంకల్పం కూడా చేసుకుంటే ఇది సరైనదే. ఒకవేళ తిరుగు ప్రయాణం వరకు పరిశుద్ధులు కాలేకపోయి, వారి బృందం కూడా వేచిచూసే పరిస్థితిలో లేకపోతే ఈ స్థితిలో ఆమె స్నానం చేసి, బట్టను బిగుతుగా కట్టుకొని ఆ తర్వాత తవాఫ్ చేసుకోవాలి.
8) తవాఫ్ తర్వాత మఖామె ఇబ్రాహీం వెనుక రెండు రకాతులు చేయాలి. తదుపరి సఫా మర్వాల మధ్య సయీ చేసి, మినా తిరిగి వెళ్ళి పోవాలి. 11వ తేది రాత్రి మినా లో గడపడం తప్పనిసరి.
9) జిల్ హిజ్జ 10 వ తేది నాటి నాలుగు పనులు (కంకర్రాళ్ళు కొట్టడం, ఖుర్బానీ ఇవ్వడం, శిరోముండనం లేదా కత్తిరించుకోవడం, తవాఫ్ మరియు సయీ) ఏ క్రమంలోనైతే వివరించబడ్డాయో, ఆ క్రమం లోనే చేయడం సున్నత్, అయినప్పటికీ వెనుకా, ముందూ చేసి కూడా వీటిని నెరవేర్చవచ్చు.
అబ్దుల్లా బిన్ అమ్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు ) కథనం ప్రకారం, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మినాలో నిలబడిననప్పుడు, ప్రజలు ఆయన ( సల్లల్లాహు అలైహి వలస్లం) ను ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఓ వ్యక్తి వచ్చి – ఓ దైవ ప్రవక్తా! నాకు విషయం సరిగ్గా తెలియలేదు. (దీనితో) నేను ఖుర్బానీ చేయడానికి ముందే శిరోముండనం చేసుకున్నాను అని విన్నవించుకోగా, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) – వెళ్ళు, వెళ్ళి ఖుర్బానీ చేయి. దీనిలో తప్పేమీ లేదు అని వివరించారు. మరో వ్యక్తి వచ్చి – ఓ దైవ ప్రవక్తా! నాక్కూడా విషయం సరిగ్గా తెలియలేదు. (దీనితో నేను రమీ చేయడానికి ముందుగానే ఖుర్బానీ చేశాను అని విన్నవించుకున్నాడు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతనితో – వెళ్ళు, వెళ్ళి రమీ చేసుకో, ఇందులో తప్పేమీ లేదు అని వివరించారు. ఆ తర్వాత దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను, ఈ పనులను వెనుకా, ముందు చేయడం గురించి ప్రశ్నించగా, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) – ‘వెళ్ళి చేసుకోండి, అందులో తప్పేమీ లేదు’ అని జవాబిచ్చారు. (బుఖారీ: 1736, ముస్లిం: 1306).
తష్రీఖ్ దినాలు (అయ్యామె తష్రీఖ్)
1) జిల్ హిజ్జ 11,12 తేదీల రాత్రులు మినా లో గడపడం తప్పనిసరి.
12వ తేదీనాడు కంకర్రాళ్ళు కొట్టిన తర్వాత మినా నుండి వెళ్ళిపోవచ్చు. కానీ 13వ తేదీ రాత్రి అక్కడే గడిపి 13వ తేదీ పగలు కంకర్రాళ్ళు కొట్టిన తర్వాత అక్కడి నుండి బయలుదేరడం ఉత్తమం. ఈ రోజుల్లో మూడు జమ్రాలకు కంకర్రాళ్ళు కొట్టాలి. దాని సమయం మద్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు వుంటుంది.
ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ (అలైహిస్సలాం) ఆచారాలను పాటించడానికి రాగా, షైతాను ‘జమ్రా – ఏ- అఖబా’ వద్ద ఆయన ముందుకు వచ్చాడు. ఆయన వాడికి ఏడు కంకర్రాళ్ళతో కొట్టగా వాడు భూమిలోకి దిగి ద్రొక్కబడ్డాడు. తదుపరి వాడు రెండవ జమ్రా వద్ద ఆయన ముందుకు రాగా, ఆయన మళ్ళీ ఏడు కంకర్రాళ్ళను తీసుకొని వాడిని కొట్టగా వాడు భూమిలోకి దిగి ద్రొక్క బడ్డాడు. ఆ తర్వాత మూడవ జమ్రా వద్ద ఆయన ముందుకు రాగా, ఆయన మళ్ళీ వాడిని ఏడు కంకర్రాళ్ళతో కొట్టగా వాడు భూమి లోకి దిగ ద్రొక్కబడ్డాడు”. తదుపరి, ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: మీరు షైతాను ను ‘రజమ్’ చేస్తారు మరియు మీ తండ్రి గారైన ఇబ్రాహీం (అలైహిస్సలాం) ధర్మాన్ని అనుసరిస్తారు. (ఇబ్నె ఖుజైమా, హాకిమ్, సహీ అత్తర్ గీబ్ వ తర్హిబ్ : 1156)
2) అందరి కన్నా ముందుగా చిన్న జమ్రాకు ఏడు కంకర్రాళ్ళు, ఒక్కొక్కటిగా కొట్టాలి.
పతి కంకర్రాయితో పాటు ‘అల్లాహు అక్బర్’ అని అనాలి. ఆ తర్వాత ఇలాగే మధ్యలో వున్న జమ్రాకు కంకర్రాళ్ళు కొట్టాలి. ఒకవేళ మీరు ఇతరుల వైపు నుండి కూడా కంకర్రాళ్ళు కొట్టాల్సి వుంటే, ముందు మీ కంకర్రాళ్ళను కొట్టి, ఆ తర్వాత వాళ్ళ కంకర్రాళ్ళను కొట్టాలి. చిన్న జమ్రా మరియు మధ్యలో వున్న జమ్రాకు కంకర్రాళ్ళు కొట్టిన తర్వాత, ఖిబ్లా వైపుకు తిరిగి, చేతు లెత్తి దుఆ చేయడం సున్నత్.
3) ఆ తర్వాత పెద్ద జమ్రాకు కూడా ఇలాగే కంకర్రాళ్ళు కొట్టాలి. తదుపరి, దుఆ చేయడం సున్నత్.
సాలిబ్ బిన్ అబ్దుల్లాహ్ రహిమహుల్లాహ్ ఇలా ఉల్లేఖించారు: అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) చిన్న జమ్రాకు ఏడు కంకర్రాళ్ళు కొట్టేవారు. ప్రతి కంకర్రాయితో పాటు ‘అల్లాహు అక్బర్’ అని పలికేవారు. తదుపరి కాస్త ముందుకెళ్ళి, సమతల ప్రదేశానికి చేరుకొని, ఖిబ్లా వైపుకు తిరిగి ఎంతో సేపు నిలబడి, చేతులెత్తి దుఆ చేసేవారు. ఆ తర్వాత మధ్యలో వున్న జమ్రాకు కంకర్రాళ్ళు కొట్టేవారు, తదుపరి ఎడమవైపుకు వెళ్ళి సమతల ప్రదేశానికి చేరుకొని, ఖిబ్లా వైపుకు తిరిగి ఎంతో సేపు నిలబడి, చేతులెత్తి దుఆ చేసేవారు. ఆ తర్వాత ‘జమ్రా-ఏ- అఖబా’ ను లోయ క్రింది భాగం నుండి కంకర్రాళ్ళు కొట్టి, అక్కడ నిలబడకుండా వెళ్ళిపోయేవారు. తదుపరి ఇలా సెలవిచ్చేవారు- నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను ఇలానే చేస్తుండగా చూశాను. (బుఖారీ: 1751, 1752, 1753)
4) మూడు జమ్రాతులను కొట్టడానికి కంకర్రాళ్ళను మినా లో ఏ స్థలం లోనైనా ఏరుకోవచ్చు.
5) కంకర్రాళ్ళను – జమ్రాతులను లక్ష్యంగా చేసుకొని, వీలైనంత దగ్గరగా వెళ్ళి కొట్టాలి.
6) జమ్రాతులను – షైతాన్ గా భావించి వాటిని తిట్టడం లేదా చెప్పులు విసరడం అజ్ఞానానికి నిదర్శనం.
7) తష్రీఖ్ దినాలలో, ఖాళీ సమయాల్లో, అల్లాహ్ విధేయతలో గడుపుతూ, వీలైనంత ఎక్కువగా అల్లాహ్ ను స్మరించాలి.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“హజ్ క్రియలన్నింటినీ నిర్వర్తించిన తర్వాత అల్లాహ్ ను ధ్యానించండి. మీ తాతముత్తాతలను జ్ఞాపకం చేసుకున్నట్లే. ఇంకా అంతకంటే అధికంగానే అల్లాహ్ ను స్మరించండి.” (బఖర : 200)
ఇంకా ఇలా సెలవిచ్చాడు:
“గణించ దగిన ఆ దినాలలో ( తషీఖ్ దినాలలో) అల్లాహ్ ను స్మరించండి. రెండు దినాలలోనే ఇక్కడి నుండి తిరిగి వెళ్ళేందుకు ఎవరైనా తొందరపాటు కనబరచినా తప్పులేదు. వెనుక ఉండిపోయిన వారు కూడా నిందార్హులు కారు. ఇది భయభక్తులు కలవారికై ఉద్దేశించినది.” (బఖర: 203)
ఈ ఆయతు తెలిసిందేమిటంటే ద్వారా జిల్ హిజ్జ 12వ తేదీనాడు మీరు, మినా నుండి వెళ్ళదలుచుకుంటే వెళ్ళవచ్చు. కానీ, సూర్యాస్తమయానికి ముందే కంకర్రాళ్ళను కొట్టి మినా సరిహద్దుల నుండి బయటకు రావాల్సి వుంటుంది. అలా కాకపోతే, 13వ రాత్రి అక్కడే బస చేసి, ఆ తర్వాత పగలు కంకర్రాళ్ళను కొట్టిన తర్వాత మినా నుండి వెళ్ళడం ఉత్తమం.
కొన్ని పొరపాట్లు:
1) కంకర్రాళ్ళను కడగడం.
2) ఏడు కంకర్రాళ్ళను ఒక్కొక్కటిగా కొట్టడానికి బదులు ఏడింటిని కలిపి ఒకేసారి కొట్టడం.
3) కంకర్రాళ్ళను కొట్టడంలో నిర్దేశింపబడిన సమయాన్ని పాటించక పోవడం.
4) ముందుగా చిన్నది, తరువాత మధ్యలోనిది, ఆ తర్వాత పెద్ద జమ్రాను కంకర్రాళ్ళు కొట్టే బదులు దీని క్రమాన్ని మార్చి వేయడం.
5) చిన్న మరియు మధ్యలో వున్న జమ్రాలను కంకర్రాళ్ళతో కొట్టిన తర్వాత దుఆ చేయకపోవడం.
6) పెద్ద సైజు కంకర్రాళ్ళను కొట్టడం.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చిన్న సైజు కంకర్రాళ్ళను కొట్టారు. (ముస్లిం : 1299)
7) తష్రీఖ్ దినాలలోని రాత్రులలో మినాలో బస చేయక పోవడం.
వీడ్కోలు తవాఫ్ (తవాఫుల్ విదా)
మక్కా ముకర్రమ నుండి బయలుదేరే ముందు వీడ్కోలు తవాఫ్ చేయడం తప్పనిసరి. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “అన్నిటికన్నా ఆఖరుగా బైతుల్లాహ్ తవాఫ్ చేయనంత వరకు ఎవ్వరూ తిరిగి వెళ్ళకూడదు.” (ముస్లిం:1327)
ఒకవేళ స్త్రీలు అపరిశుద్ధావస్థలో వుంటే, వారికి వీడ్కోలు తవాఫ్ తప్పనిసరి కాదు.
అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజలకు – హజ్ ప్రక్రియల్లో వారి ఆఖరి ప్రక్రియ బైతుల్లాహ్ తవాఫ్ కావాలని ఆదేశించారు. అయితే ఈ విషయంలో, అపరిశుద్దావస్థలో వున్న స్త్రీలకు మాత్రం (దీని నుండి) మినహాయింపు లభించింది.
(బుఖారీ: 1755, ముస్లిం:1328)
ఈ హదీసు ద్వారా తెలిసిందేమింటంటే –
హజ్ ప్రక్రియల్లో ఆఖరి ప్రక్రియ బైతుల్లాహ్ తవాఫ్, అందుకే జిల్ హిజ్జ 12,13 తేదీలలో కంకర్రాళ్ళు కొట్టడానికి ముందుగా వీడ్కోలు తవాఫ్ చేయడం సరికాదు.
గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే – వీడ్కోలు తవాఫ్ తర్వాత వెనుకడుగులు వేస్తూ మస్జిదుల్ హరామ్ నుండి బయటకు రావడం కూడా సరైనది కాదు.
అల్లాహ్ మనందరినీ స్వీకార యోగ్యమయ్యే హజ్ చేసే మహాభాగ్యాన్ని ప్రసాదించుగాక! ఆమీన్!
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) హజ్ గురించి పేరుగాంచిన జాబిర్ (రదియల్లాహు అన్హు) హదీసు
ఇక మేము, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్ స్వరూపం గురించి ఎంతో ప్రాచుర్యం పొందిన జాబిర్ (రదియల్లాహు అన్హు) హదీసును వివరిస్తాం. దీనిని వివరించడంలో గల ఒక ఉద్దేశ్యం ఏమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్ స్వరూపం ఎలా వుందో తెలుసుకోవచ్చు. దీనితో పాటు మరో ఉద్దేశ్యమేమిటంటే – ఇప్పటి వరకూ వివరించబడ్డ హజ్ ఆచారాలు, ప్రక్రియలను మరోసారి నెమరువేసుకోవడం ద్వారా మరింత బాగా గుర్తుంచుకోవచ్చు.
ముహమ్మద్ బిన్ అలీ బిన్ హుసేన్ రహిమహుల్లాహ్ కథనం ప్రకారం, ఆయన, జాబిర్ (రదియల్లాహు అన్హు) ను, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్ గురించి ప్రశ్నించగా, ఆయన ఇలా జవాబిచ్చారు:
“దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) 9 సం॥ల వరకు (మదీనా మునవ్వర లో) వేచి ఉన్నారు. ఈ వ్యవధి లో ఆయన హజ్ చేయలేదు. 10వ సం॥ వచ్చాక ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ సం॥ హజ్ చేయ బోతున్నారని ప్రకటన గావించారు. ఇది విని మదీనా మునవ్వరలో ఎంతో మంది గుమిగూడారు. ప్రతి ఒక్కరూ – తాను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాయకత్వంలో ఆయన లాగే హజ్ చేయవచ్చని కోరుకున్నారు. ఇలా మేమంతా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో కలిసి బయలుదేరాం. మేము ‘జుల్ హులైఫా’ కు చేరుకొనే సరికి, అస్మా బిన్తె ఉమైస్ (రదియల్లాహు అన్హు) ముహమ్మద్ బిన్ అబూ బక్ర్ కు జన్మ నిచ్చారు. తదుపరి, ఆమె, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు- ఇప్పుడు తానేం చేయాలి? అని కబురు పంపారు.
ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెకు – ‘స్నానం చేసి, బట్టను గట్టిగా బిగించి కట్టుకొని ఇహ్రాం సంకల్పం చేసుకోమని’ సందేశం పంపారు.
ఆ తర్వాత ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మస్జిద్ లో నమాజ్ చదివారు. తదుపరి ఆయన తన ఒంటె (ఖస్వ) నెక్కి ప్రయాణం చేస్తూ బైదా (ఒక ప్రదేశం) వద్దకొచ్చి నిలబడగా నేను చూసిందేమిటంటే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ముందూ, వెనుకా, కుడివైపు, ఎడమవైపు – నలుదిక్కులా, కనుచూపు మేరకు ఎటుచూసినా మనుషులే కనిపించారు. ఒకరు వాహనంపై వుంటే మరొకరు నడుస్తూ వున్నారు.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మా మధ్యనే వున్నారప్పుడు. ఖుర్ఆన్ అవతరణ క్రమం కూడా కొనసాగుతూనే వుంది మరియు దాని విశ్లేషణ గూర్చి కూడా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) బాగా తెలిసి వున్నారు.
ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏ పనైతే చేశారో, మేము కూడా అదే చేశాం.
ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తౌహీద్ ఇహ్రాం సంకల్పం చేసుకొని ఈ తల్బియ పఠించారు. “లబ్బై కల్లాహుమ్మ లబ్జ్బెక్, లబ్బైక లాషరీ క లక లబ్జ్బెక్, ఇన్నల్ హమ్ద్, వన్నేమత, లకవల్ ముల్క్, లాషరీ కలక్” “నేను హాజరయ్యాను, ఓ అల్లాహ్ ! నేను హాజరయ్యాను, నీకు భాగస్వాము లెవ్వరూ లేరు, సమస్త స్తోత్రాలు, అనుగ్రహాలు, విశ్వసామ్రాజ్యాధికారం నీ కోసమే, నీకు భాగస్వాము లెవ్వరూ లేరు”.
ప్రజలంతా ఈ తల్బియానే పఠించడం మొదలుపెట్టారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారికోసం తల్బియ లోని ఏ పదాన్నీ రద్దు చేయలేదు ( మార్చలేదు). ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) నిరంతరం ఈ ‘తల్బియ’ ను పఠిస్తూనే వున్నారు.
జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం: మేము హజ్ కోసమే సంకల్పించుకొని వున్నాం. ఉమ్రా గురించి మాకప్పటి వరకు అసలు తెలియనే తెలియదు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో కలిసి మేము బైతుల్లాహ్ కు చేరుకున్నాక, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్ర అస్వద్ కు ‘ఇస్తెలాం’ చేశారు. ఆ తర్వాత (మొదటి) మూడు ప్రదక్షిణలలో ‘రమల్’ చేశారు. మిగిలిన నాలుగు ప్రదక్షిణలు ఆయన సామాన్య వేగంతో పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మఖామె ఇబ్రాహీం వద్ద కెళ్ళి “మీరు ఇబ్రాహీము నిలబడిన ప్రదేశాన్ని నమాజు స్థలంగా చేసుకోండి” అన్న ఆయత్ పఠించి, తనకూ, బైతుల్లాహ్ కు మధ్యలో వుంచి రెండు రకాతులు నమాజ్ చేశారు. దానిలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) కాఫిరూన్ సూరా మరియు ఇఖ్లాస్ సూరా పఠించారు. తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మళ్ళీ హజ్ర అస్వద్ వద్ద కొచ్చి దాని ఇస్తెలాం’ చేశారు. ఆ తర్వాత ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సఫా వైపుకు బయలుదేరి వెళ్ళారు. సఫా దగ్గరికి చేరుకున్నాక ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘నిస్సందేహంగా సఫా, మర్వా లు అల్లాహ్ చిహ్నాల లోనివి’ అన్న ఆయత్ పఠించి ఇలా సెలవిచ్చారు:
“అల్లాహ్ ప్రారంభించిన దగ్గర్నుంచే (ప్రారంభించమని ఆజ్ఞాపించిన దగ్గర్నుంచే) నేను కూడా ప్రారంభిస్తున్నాను.”
ఇలా, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సఫా నుండి ప్రారంభించి, దానిపైకి ఎక్కి, బైతుల్లాహ్ కనిపించాక, దానివైపుకు తిరిగి అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని, గొప్పతనాన్ని చాటుతూ ఇలా పలికారు:
“లా ఇలాహ ఇల్లల్లాహు వహదహూ లాషరీ కలహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలాకుల్లి షయ్యిన్ ఖదీర్, లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు, అన్జజ వాదహు, వ నసర అబ్దహు వ హజమల్ అహ్ జాబ వహద.” తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) దుఆ చేశారు.
ఇలా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మూడు సార్లు చేశారు. ఆ తర్వాత ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మర్వా వైపుకు వెళుతూ లోయ మధ్య లో ఆయన అడుగులు స్థిరపడగానే ఆయన పరుగెత్తుతూ, మర్వా కొండ ప్రారంభం కాగానే సామన్య వేగంతో నడుస్తూ మర్వా చేరుకున్నారు.
అక్కడ కూడా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సఫా పైన చేసినట్లే చేసారు. ఇలా, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆఖరి ప్రదక్షిణ మర్వాలో పూర్తయ్యాక, ఇలా సెలవిచ్చారు.
“నాకు ఇప్పుడు తెలిసిన (తెలియ జేయబడిన) విషయం గనక ముందుగా తెలిసి వుంటే, నేను ఖుర్బానీ కోసం పశువును తీసుకు రాకుండా దీనిని ఉమ్రాగా చేసుకొనే వాణ్ణి. అందుకే, మీలో ఎవరివద్ద నైతే ఖుర్బానీ పశువు లేదో, వారు దీనిని ఉమ్రాగా భావించి హలాల్ కావచ్చు.”
ఇది విని, సురాఖ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) లేచి నిలబడి – ఓ దైవ ప్రవక్తా! ఈ ఆజ్ఞ కేవలం ఈ సంవత్సరం కోసమేనా లేక ఎల్లప్పటికా? అని అడిగారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన చేతివ్రేళ్ళను ఒకదానిలో ఒకటి పోనిచ్చి రెండు సార్లు ఇలా సెలవిచ్చారు: “ఉమ్రా, హజ్ లో ప్రవేశించింది (కలిసిపోయింది), ఇక ఎల్లప్పుడూ ఇలాగే వుంటుంది.”
(ఈ లోగా) అలీ (రదియల్లాహు అన్హు) యమన్ నుండి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒంటెలను తీసుకొని వచ్చారు. ఆయన, ఫాతిమా (రదియల్లాహు అన్హు) ను – హలాల్ అయి, రంగుల దుస్తులు ధరించి, కాటుక పెట్టుకొని వుండడం చూసి, ఆమెతో- నువ్విలా చేయకుండా వుండాల్సింది అని అన్నారు. ఆమె జవాబిస్తూ – మా నాన్నగారు (ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం) దీని గురించి ఆజ్ఞాపించారు అని అన్నారు.
జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం: అలీ (రదియల్లాహు అన్హు) ఇరాక్ లో వున్నప్పుడు ఇలా చెబుతూ వుండేవారు – ఫాతిమా (రదియల్లాహు అన్హు) చేసిన దాని గురించి ఫిర్యాదు చేయడానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్ద కెళ్ళాను. ఫాతిమ (రదియల్లాహు అన) చెప్పిన విషయం గురించి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) అభిప్రాయం తెలుసుకుందామని నేను భావించాను. అంతే కాక, ఆమెతో నేను చెప్పిన విషయం కూడా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముందు ప్రస్తావించాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ: ఆమె సత్యం పలికింది, ఆమె సత్యం పలికింది అని చెప్పి, నాతో నువ్వు హజ్ చేద్దామని నిర్ణయించుకున్నప్పుడు ఏమని సంకల్పించుకున్నావు? అని అడిగారు. నేను – ‘ఓ అల్లాహ్! నీ ప్రవక్త ఏ సంకల్పంతోనైతే ఇహ్రాం సంకల్పం చేసుకున్నారో నేను కూడా అలాగే ఇహ్రాం సంకల్పం చేసుకుంటున్నాను’ అని అనుకొన్నానని, మనవి చేసుకున్నాను. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: నాతో పాటు ఖుర్బానీ (పశువు) వుంది. (కనుక నేను హలాల్ కాలేను), అందుకే (నాలాగే సంకల్పం చేసుకున్నావు కాబట్టి) నువ్వు కూడా హలాల్ కాలేవు.
జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం: అలీ (రదియల్లాహు అన్హు) యమన్ నుండి 100 ఒంటెలను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు తీసుకొచ్చారు. తదుపరి ప్రజలంతా హలాల్ అయ్యారు మరియు తమ వెంట్రుకలను కత్తించుకున్నారు. కేవలం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు ఖుర్బానీ (పశువులు) కలిగి వున్నవారు తప్ప.
ఇలా, ‘యౌముత్తర్వియ’ (జిల్ హిజ్జ 8వ తేది) వచ్చాక హజ్ సంకల్పం చేసుకొని మినా వైపుకు బయలుదేరి వెళ్ళారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కూడా తన వాహనంపై మినా చేరుకొని, అక్కడ జొహర్, అసర్,మగ్రిబ్, ఇషా మరియు (జిల్ హిజ్జ 9వ లేది) ఫజర్ నమాజులు చదివారు. ఫజర్ తర్వాత ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) కాసేపు అక్కడే గడిపారు. తదుపరి సూర్యోదయమయ్యాక ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) (అరాఫాత్కు వెళ్ళి) తన కోసం ‘నిమ్రా’లో ఒక గుడారం ఏర్పాటు చేయమని ఆజ్ఞాపించారు. ఆ తర్వాత ఆయన అక్కణ్ణుంచి బయలుదేరారు. అజ్ఞాన కాలంలో తాము ‘మష్ అరుల్ హరామ్’లో బసచేసినట్లు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కూడా అక్కడ బస చేస్తారని ఖురైషీయులు భావించారు. కానీ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దానిని దాటుకుంటూ వెళ్ళి అరాఫాత్కు చేరుకున్నారు. తన కోసం ‘నిమ్రా’లో ఒక గుడారం ఏర్పాటు చేయబడడం ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) చూశారు. దీనితో, ఆయన అక్కడే దిగారు. తదుపరి, సూర్యుడు (పశ్చిమం వైపుకు) వంగడం ప్రారంభించగానే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ఒంటె (ఖస్వ)ను సిద్ధం చేయమని ఆజ్ఞాపించారు. ఆయన ఆజ్ఞ కనుగుణంగా దానిపై సీటు అమర్చబడింది. తదుపరి, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) దాని పైకెక్కి, లోయ మధ్య భాగంలోకి చేరుకొని ఖుత్బా ఇచ్చారు…. (ఈదుల్ అజ్ హా తరువాత ఈ ఖుత్బా గురించి వివరంగా చర్చించడం జరుగుతుంది ఇన్షా అల్లాహ్).
ఆ తర్వాత (ముఅజ్జిన్) అజాన్ మరియు ఇఖామత్ పలికారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జొహర్ నమాజు చేయించారు. తదుపరి రెండవ ఇఖామత్ పలకబడింది మరియు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) అసర్ నమాజు చేయించారు. ఈ రెండు నమాజుల మధ్య ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏ విధమైన (నఫిల్) నమాజు చేయలేదు.
ఆ తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన వాహనం ఎక్కి (అరాఫాత్ లో) తాను బస చేసిన స్థలానికి చేరుకున్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన బంటె (ఖస్వ) పొట్టను రాళ్ళ వైపు చేసి, నడుస్తున్న వారిని తనకు ముందుగా చేసుకొని, ఖిల్లా వైపుకు తిరిగి సూర్యాస్తమయం వరకు అక్కడే గడిపారు.
ఆ తర్వాత దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉసామా (రదియల్లాహు అన్హు)ను తన వెనుక కూర్చోబెట్టుకొని ముజ్ఞలిఫా వైపుకు బయలు దేరారు. ఆ సమయంలో ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒంటె త్రాడును ఎంత గట్టిగా లాగి పట్టుకున్నారంటే, దాని తల- రౌతు గనక అలసినప్పుడు
కాళ్ళను ఎక్కడికైతే చాపుతాడో, అక్కడి దాకా చేరుకొంది. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన కుడి చేత్తో సైగ చేస్తూ ఇలా సెలవిచ్చారు: “ప్రజలారా! ఎంతో ప్రశాంతంగా, సంతృప్తిగా నడవండి.”
ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ముజ్ఞలిఫా చేరుకున్నాక మగ్రిబ్ మరియు ఇషా నమాజులను ఒక అజాన్, రెండు ఇఖామతు లతో పూర్తి చేసుకున్నారు. వీటి మధ్య ఏ విధమైన (నఫిల్) నమాజుగానీ చేయలేదు. ఆ తర్వాత ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఫజర్ వేళ అయ్యే వరకు నిద్రపోయారు. ఫజర్ వేళ అయ్యాక ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) అజాన్ మరియు ఇఖామత్లతో ఫజర్ నమాజు చేశారు. తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ఒంటె (ఖస్వ) పై ఎక్కి ‘మష్ అ రుల్ హరామ్’ వచ్చి ఖిల్లా వైపుకు తిరిగి దురి చేశారు. అల్లాహ్ స్తోత్రం చేస్తూ, ఆయన గొప్పతనాన్ని, ఏకత్వాన్ని స్మరించారు. ఉదయం వెలుతురు వ్యాపించే వరకు ఈ స్థితిలోనే గడిపారు.
ఆ తర్వాత సూర్యోదయానికి ముందే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) అక్కణ్ణుంచి బయలుదేరి మీనా వైపుకు వెళ్ళారు. ఈ ప్రయాణంలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఫజల్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ను తన వెనక కూర్చో బెట్టుకున్నారు. ఆయన (ఫజల్ బిన్ అబ్బాస్) సొగసైన వెంట్రుకలు కలిగివుండి ఎంతో అందంగా వుండేవారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గర నుండి స్త్రీలు వెళుతున్నప్పుడు ఫజల్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) వారి వైపు చూడసాగారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన చేతిని ఆయన ముఖానికి అడ్డంగా ఉంచారు. దీనితో ఆయన, తన ముఖాన్ని త్రిప్పుకొని వేరే వైపు స్త్రీలను చూడ సాగారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), రెండో వైపు నుంచి కూడా ఆయన స్త్రీలను చూడకుండా వుండటానికి తన చేతిని ఆయన ముఖానికి అడ్డంగా వుంచారు. ఇలా తన వాహనం వేగాన్ని పెంచి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జమ్రా – ఏ-అఖ్బా వెళ్ళే దారికి మరలారు.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) ఒక వృక్షం దగ్గరే వున్న పెద్ద జమ్రాకు చేరుకోగానే, లోయ మధ్యలో నుండి దానికి ఏడు కంకర్రాళ్ళు కొట్టారు. ప్రతి కంకర్రాయితో పాటు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తక్బీర్ పలికేవారు. కంకర్రాళ్ళు చిన్న సైజులో వున్నాయి.
ఆ తర్వాత ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఖుర్బానీ ఇచ్చే స్థలం వైపుకు వెళ్ళి 63 ఒంటెలను జిబహ్ చేశారు. మిగతా వాటిని అలీ (రదియల్లాహు అన్హు) కు ఇవ్వగా, ఆయన జిబహ్ చేశారు. తదుపరి, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రతి ఖుర్బానీ నుండి కొంత మాంసం తీయమని ఆజ్ఞాపించారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆజ్ఞానుసారం ప్రతి ఖుర్బానీ జంతువు నుండి కొంత మాంసం తీసి ఒక పెద్ద కుండలో వేయడం జరిగింది. మాంసం ఉడికిన తర్వాత ఇద్దరూ ఆ మాంసాన్ని తిన్నారు మరియు దాని రసాన్ని త్రాగారు.
ఆ తర్వాత ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) తన వాహనంపై ఎక్కి ఇఫాజా తవాఫ్’ కోసం బైతుల్లాహ్ కు ప్రయాణమయ్యారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) బైతుల్లాహ్ లో జొహర్ నమాజు చదివారు. ఆ తర్వాత ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) (హాజీలకు) జమ్ జమ్ నీళ్ళు త్రాగిస్తున్న ‘బనూ అబ్దుల్ ముత్తలిబ్’ దగ్గరి కొచ్చి ఇలా సెలవిచ్చారు:
“ఓ బనూ అబ్దుల్ ముత్తలిబ్. మీరు బొక్కెనతో నీళ్ళు తీయండి. ఒకవేళ ప్రజలు మీ మీదకు వచ్చి పడిపోతారేమోనన్న భయం నాకు లేకుంటే, నేను కూడా మీతో పాటు నీళ్ళు తీసేవాణ్ణి (మరియు హాజీలకు త్రాగించే వాణ్ణి). తదుపరి వాళ్ళు, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు బొక్కెన అందించగా ఆయన జమ్ జమ్ నీరు సేవించారు. (ముస్లిం:1218)
ఇదండీ, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్ పద్ధతి.
మేము అల్లాహ్ ను వేడుకొనే దేమిటంటే – ఆయన మనందరినీ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను అనుసరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక!
రెండవ ఖుత్బా
ప్రియ సోదరులారా!
హజ్ అయితే మక్కా ముకర్రమ లోనే సంపూర్ణమవుతుంది. అయినప్పటికీ, మస్జిదె నబవి లో నమాజ్ చదివే పుణ్యాన్ని పొందే నిమిత్తం మదీనా తయ్యబా కు ప్రయాణించడం ముస్తహబ్ (అభిలషణీయం).
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“నా ఈ మస్జిద్ (మస్దిదె నబవి) లోని ఒక్క నమాజు, ఇతర మస్జిదులలోని వెయ్యి నమాజుల కన్నా శ్రేష్టమైనది, కేవలం మస్జిదుల్ హరామ్ లో తప్ప.” (బుఖారీ: 1190, ముస్లిం: 1394)
మస్జిదె నబవి సందర్శన మర్యాదలు
1) మస్జిదె నబవిలోకి ప్రవేశించాక ‘తహ్యతుల్ మస్జిద్’ చదవాలి. ఒకవేళ వీలయితే, దానిని ‘రౌజతు మిన్ రియాజిల్ జన్నహ్’ లోకి వెళ్ళి చదవాలి. ఎందుకంటే, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దీనిని స్వర్గపు ఉద్యాన వనాలలో ఒకటిగా ఖరారు చేశారు.
దీని గురించి ఇలా సెలవిచ్చారు:
“నా గృహం మరియు మింబర్ (వేదిక) కు మధ్య గల భాగం స్వర్గపు ఉద్యాన వనాలలో ఒక ఉద్యానవనం.” (బుఖారీ: 1195, ముస్లిం: 1390)
2) ఆ తర్వాత దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి ముందు కొచ్చి దరూర్ మరియు సలాములు పఠించాలి. నమాజులో పఠించబడే దరూదె ఇబ్రాహీం పఠించడం ఉత్తమం. తదుపరి ఆయన సహచరులైన అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) మరియు ఉమర్ (రదియల్లాహు అన్హు) లకు సలామ్ పలకాలి.
3) ఒకవేళ దుఆ చేయాలనుకుంటే, మస్జిద్ నబవి లో ఎక్కడైన గానీ, ఖిబ్లా వైపుకు తిరిగి చేయండి.
4) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి వద్ద ఆశీర్వాదం నిమిత్తం దానిపై చేతులు త్రిప్పడం లేదా దాని ప్రదక్షిణ చేయడం ఎంతమాత్రం సరికాదు.
5) పురుషులు ‘బఖీ ఉల్ గరఖద్’ (మదీనా స్మశాన వాటిక) లో ఖనన మైవున్న వారి గురించి, అలాగే ఉహద్ షహీదుల సమాధుల వద్ద కెళ్ళి వారికి సలాం పలికి వారి గురించి దుఆ చేయడం ముస్తహబ్ (అభిలషణీయం).
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన అనుచర సమాజానికి ఈ దుఆ నేర్పారు.
“ఈ ఇండ్లలో వున్న మోమిన్ మరియు ముస్లిములపై శాంతి కురియు గాక! ఇన్షా అల్లాహ్, మేము కూడా మీతో కలుస్తాం. మాపై, మీపై మరియు మీ వెనుక ఉండిపోయిన వారిపై అల్లాహ్ కారుణ్యం అవతరించు గాక! మేము మా శ్రేయస్సు మరియు మీ శ్రేయస్సు గురించి అల్లాహ్ను అర్ధిస్తున్నాం.” (ముస్లిం: 974, నసాయి: 2037, 2040, ఇబ్నెమాజ: 1547)
6) మస్జిదె నబవి తో పాటు మదీనా తయ్యబాలో కేవలం ఖుబా మస్జిద్ నమాజు చదవడానికి ప్రత్యేకత వుంది. ఎందుకంటే, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్వయంగా అక్కడికి వెళ్ళేవారు మరియు అక్కడ రెండు రకాతులు నమాజు చదివేవారు.
దీని మహత్యాన్ని గూర్చి వివరిస్తూ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఏ వ్యక్తి అయినా తన ఇంట్లో వుజూ చేసుకొని, తదుపరి ఖుబా మస్జిద్ కు వచ్చి నమాజు చదివితే అతనికి ఉమ్రా చేసినంత పుణ్యం లభిస్తుంది.” (తిర్మిజి, నసాయి, ఇబ్నెమాజ, ఇబ్నె హిబ్బాన్, సహీ అల్బానీ)
మిగతా మస్జిదులలో నమాజు చేయడానికి ప్రత్యేకత ఏదీ నిరూపించ బడిలేదు. అందుకే పుణ్యఫలాపేక్షతో వాటిని సందర్శించడం సరైనది కాదు.
కొన్ని పొరపాట్లు:
1. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధిని సందర్శించే సంకల్పంతో మదీనా తయ్యబా కు ప్రయాణమవడం.
2. హాజీల ద్వారా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు సలాములు పంపించడం.
3. ప్రతి నమాజు తర్వాత దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి వద్దకు చేరుకొని దాని ముందు వినయంగా నిలబడడం.
4. దుఆ లో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను వసీలా గా చేయడం.
5. మజ్జిదె నబవి లో 40 నమాజులను బాధ్యతగా పాటించడం (చదవడం). వాస్తవానికి ఈ విషయంలో వివరించబడే హదీసులన్నీ బలహీనమైనవి మరియు ఆధారాలుగా అయోగ్యమైనవి.
ఖుత్బా ఆఖరిలో మేము అల్లాహ్ ను వేడుకొనేదేమిటంటే ఆయన మనందరికీ ‘మబ్ రూర్ హజ్’ (స్వీకారయోగ్యమయ్యే హజ్) భాగ్యాన్ని ప్రసాదించు గాక!
—
ఈ ఖుత్బా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్