ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్తయీన్ (మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్నే అర్ధిస్తున్నాము)
https://youtu.be/6PT6tpRuaE4 [9 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, సూరహ్ అల్-ఫాతిహాలోని ఒక ముఖ్యమైన వాక్యం, ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్త’ఈన్, యొక్క లోతైన అర్థం వివరించబడింది. మొదటగా, వాక్యం యొక్క పదాల వారీగా అర్థం, అంటే ‘నిన్ను మాత్రమే మేము ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్ని మాత్రమే మేము అర్థిస్తున్నాము’ అని వివరించబడింది. తరువాత, ‘మాత్రమే’ అనే పదం యొక్క ప్రాముఖ్యతను ఒక భార్యాభర్తల ఉదాహరణతో స్పష్టం చేశారు, ఇది అల్లాహ్ పట్ల ఆరాధనలో సంపూర్ణ ఏకత్వాన్ని నొక్కి చెబుతుంది. వాక్య నిర్మాణంలో ‘ఇయ్యాక’ (నిన్ను మాత్రమే) పదాన్ని ముందు ఉంచడం ద్వారా, ఆరాధన కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకం అని మరియు ఇతరులను ఆరాధించడం ఘోరమైన పాపం అని చెప్పబడింది. చివరగా, ఆరాధన (ఇబాదత్) మరియు సహాయం కోరడం (ఇస్తి’ఆనత్) వేరువేరుగా ఎందుకు ప్రస్తావించబడ్డాయో వివరిస్తూ, అల్లాహ్ సహాయం లేకుండా మనం ఆయనను సరిగ్గా ఆరాధించలేమని, ఇది వినయాన్ని పెంపొందిస్తుందని తెలియజేశారు.
ఆయతు యొక్క పదాల అర్ధం
إِيَّاكَ نَعْبُدُ
(ఇయ్యాక న’అబుదు)
నిన్ను మాత్రమే మేము ఆరాధిస్తున్నాము.
సోదర మహాశయులారా, ఇక్కడ ముందు ఈ పదాల యొక్క అర్థం తెలుసుకుందాము. ఆ తర్వాత సరళమైన ఒక భావం దీనికి మనం తెలుసుకుందాం.
إِيَّاكَ
(ఇయ్యాక)
ఇయ్యాక అంటే ఏంటి? నిన్ను మాత్రమే.
نَعْبُدُ
(న’అబుదు)
మేము ఆరాధిస్తున్నాము.
وَإِيَّاكَ
(వ ఇయ్యాక)
మరియు నిన్ను మాత్రమే.
نَسْتَعِينُ
(నస్త’ఈన్)
మేము అర్ధిస్తున్నాము.
అర్థమైందా? ఇయ్యాక అంటే ఏంటి? నిన్ను మాత్రమే. న’అబుదు అంటే? ఆరాధిస్తున్నాము. వ ఇయ్యాక, ‘వ’ మరియు ఇయ్యాక అదే భావం, నిన్ను మాత్రమే.
نَسْتَعِينُ
(నస్త’ఈన్)
మేము అర్ధిస్తున్నాము. మేము సహాయం కొరకు నిన్ను అర్ధిస్తున్నాము. మేము సహాయం కోరుతున్నాము.
సహాయానికై అర్ధిస్తున్నాము. ‘అవ్న్’ అనే పదం నుండి వచ్చింది నస్త’ఈన్. సహాయం అన్న భావం అక్కడ. ఇస్తి’ఆనా ఉంది గనుక, సీన్ వచ్చింది, అందులో ‘తలబ్‘ అనే భావం అంటే కోరడం. సహాయం కోరుతున్నాము, సహాయం కొరకు అర్ధిస్తున్నాము.
ఇక సరళమైన భావం ఏముంటుంది?
إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ
(ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్త’ఈన్)
మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు సహాయం కొరకు నిన్ను మాత్రమే అర్ధిస్తున్నాము.
‘మాత్రమే’ అను పదము యొక్క ప్రాముఖ్యత
సోదర మహాశయులారా, ఇక్కడ ఒక మాట కేవలం అర్థం అవ్వడానికి చెప్తున్నా. ఒక సామెతగా. మీలో ఎవరైనా తమ భార్యతో, “నేను నీకు మాత్రమే భర్త,” “నేను నీకు కూడా భర్త.” ఈ రెండిటిలో తేడా ఏదైనా అర్థమవుతుందా మీకు? దీన్ని కొంచెం అపోసిట్ గా, మీ యొక్క భార్య మీతో చెప్పింది, “నేను నీకు మాత్రమే భార్యను.” అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఒకవేళ మీ భార్య చెప్పింది అనుకోండి, “నేను నీకు కూడా భార్యను.” అప్పుడు? మీ మైండ్ 180, 360 వరకు తిరిగిపోతుంది కదా, వేడి ఎక్కుతుందిగా. ఇక్కడ ‘కూడా’ మరియు ‘మాత్రమే’ అన్నటువంటి పదాలలో భావం తెలుస్తుందా?
నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన రోజువారీ జీవితంలో ఈ విషయాన్ని మనం గ్రహిస్తాము కదా. కానీ అల్లాహ్ యొక్క ఆరాధన విషయంలో. వలిల్లాహిల్ మసలుల్ అ’అలా. నేను మాటిమాటికీ చెబుతున్నాను, కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఉపమానాలు, ఉదాహరణలు, సామెతలు మనం చెప్పుకున్నప్పుడు న’ఊజుబిల్లాహ్, అల్లాహ్ కొరకు కాదు ఈ సామెతలు, మన బుద్ధి జ్ఞానాలలో మాట సరిగా అర్థం అవ్వడానికి, మన అజ్ఞానం దూరం అవ్వడానికి.
ఎవరైనా ఒక భార్య, “నేను నీకు కూడా భార్య” అంటే మనం సహించము. “ఓ అల్లాహ్ నిన్ను కూడా ఆరాధిస్తున్నాము” అని అంటే ఇది బాగుంటుందా? తప్పు విషయం ఇది. “నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాము.”
అందుకొరకే ఇక్కడ, ఇయ్యాక ముందు వచ్చింది, తర్వాత న’అబుదు అని చెప్పారు. తెలుగు సాహిత్య పరంగా మనం చూసుకుంటే సర్వసాధారణంగా ఎలా చెబుతారు? కర్త, కర్మ, క్రియ. రాయడంలో మాట ఈ క్రమంలో వస్తుంది కదా. అరబీలో, అరబీ సాహిత్య పరంగా, న’అబుదుక, ఇలా రావాలి. కానీ ఇక్కడ అల్లాహు త’ఆలా, ఇయ్యాకను ముందు పెట్టాడు అంటే, ఈ ప్రత్యేకతను తెలియజేయడానికి. ఆరాధన అన్నది అల్లాహ్ తప్ప ఇంకా వేరే ఎవరికీ చెల్లదు. అలా చేసేవారు చాలా ఘోరమైన పాపానికి ఒడిగడుతున్నారు. ఎంతటి ఘోరమైనది? వ్యభిచారం కంటే, మత్తుపానీయాలు సేవించడం కంటే, ఇంకా వేరే ప్రపంచంలో ఉన్న చెడ్డ పనుల కంటే అతి నీచమైన చెడ్డ పని, అల్లాహ్ ను వదలి లేదా అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఎవరినైనా ఆరాధించడం.
అలాంటి ఏ భావాలు ఉండకుండా కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తున్నాము అన్న భావం రావడానికి అల్లాహు త’ఆలా, ఇయ్యాక అన్న పదం ముందు ఇక్కడ పేర్కొన్నాడు. అర్థమైందా దీని యొక్క ప్రాముఖ్యత? తెలుస్తుందా?
ఆరాధన మరియు సహాయం కోరడం
ఇక ఆ తర్వాత, ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్త’ఈన్ లో ఉన్నటువంటి మరో విషయం గమనించండి. అదేంటి?
إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ
(ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్త’ఈన్)
న’అబుదు, ఆరాధన. ఆరాధన అంటే, నాలుక సంబంధమైన, హృదయ సంబంధమైన, మన శరీర సంబంధమైన, శరీరావయవాలకు సంబంధమైన, మన ధన సంబంధమైన అన్ని రకాల ఆరాధనలు వచ్చేసాయి. ఆరాధన అంటే, నమాజు వచ్చింది, ప్రేమ వచ్చింది, నమ్మకం వచ్చింది, భయము వచ్చింది, ఆశ వచ్చింది, ఉపవాసము వచ్చింది, ఖుర్బానీ వచ్చింది, దానధర్మాలు వచ్చినాయి, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. అన్నీ కూడా కేవలం అల్లాహ్ కు మాత్రమే అంకితం చేయాలి.
అయితే, కేవలం అల్లాహ్ తో మాత్రమే సహాయం కోరడం, నస్త’ఈన్ అని ఉంది కదా తర్వాత. ఆరాధనల యొక్క ఎన్నో రకాలు ఇప్పుడు నేను తెలిపాను కదా? నమాజ్, భయము, ఉపవాసాలు, ఇంకా ఆశ ఇట్లాంటివి. వాటిలో ఒకటి, సహాయం కోరడం కూడా. సహాయం కోరడం అనేది ఆరాధనలలోని ఒక రకం. ఇక ఆరాధన అంటే అన్ని వచ్చేసాయి, మళ్లీ ప్రత్యేకంగా సహాయం అన్న దాన్ని ఎందుకు అల్లాహ్ ప్రస్తావించాడు? ఇక్కడ ఒక గొప్ప భావం ఉంది. అదేమిటంటే, అల్లాహ్ యొక్క ఆరాధన మనం సరైన రీతిలో చేయాలంటే, అల్లాహ్ యొక్క సహాయం మనకు అందాలి, అప్పుడే మనం సరైన రీతిలో చేయగలుగుతాం.
అందుకొరకే చూడండి, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, సలాం తిప్పిన తర్వాత ఏ దువాలైతే మనకు నేర్పారో, అందులో ఒకటేముంది?
అల్లాహుమ్మ అని కూడా ఉంది, రబ్బీ అని కూడా ఉంది.
“اللَّهمَّ أعنِّي على ذِكْرِكَ، وشُكْرِكَ، وحُسنِ عبادتِكَ
(అల్లాహుమ్మ అ’ఇన్నీ ‘అలా జిక్రిక వ షుక్రిక వ హుస్ని ‘ఇబాదతిక)
ఓ అల్లాహ్ నాకు సహాయం అందించు, ‘అలా జిక్రిక, నీ జిక్రు చేయడంలో, స్మరించడంలో, వ షుక్రిక, నీ యొక్క కృతజ్ఞత చెల్లించడంలో, వ హుస్ని ‘ఇబాదతిక, నీ యొక్క ఆరాధన ఉత్తమమైన రీతిలో చేయడంలో నీవు నాకు సహాయం అందించు.
అయితే ఇక్కడ ఏం తెలుస్తుంది? సహాయం కూడా కేవలం అల్లాహ్ తో కోరాలి అని తెలియడంతో పాటు మరొక గొప్ప విషయం ఏం తెలిసింది? అరే, నేను చేశాను అన్నటువంటి గొప్పలు చెప్పుకోవడం కాదు, అల్లాహ్ సహాయపడ్డాడు, అల్లాహ్ భాగ్యం కలుగజేశాడు, అల్లాహ్ మనకు తోడు ఇచ్చాడు, అల్లాహు త’ఆలా యొక్క దయ కలిగినది, అప్పుడే మనం ఏదైనా చేయగలిగాము అన్నటువంటి భావన ఉండాలి. అందుకొరకు ఎల్లవేళల్లో అల్లాహ్ ముందు మనం వినయ వినమ్రతతో ఎంతో మంచి రీతిలో మనం ఆ అల్లాహ్ యొక్క ఆరాధనలో గడుపుతూ ఉండాలి.
—
తఫ్సీర్ సూరతుల్ ఫాతిహా – ప్రతీ పదానికి అర్థ భావాలు & వివరణ (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0y1S_HJBYajOm3yyF4a16J
ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259