https://youtu.be/QDdFQMgriM8 [33 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, వక్త అల్లాహ్ యొక్క నామములైన అర్-రజ్జాక్ (గొప్ప ఉపాధి ప్రదాత) మరియు అర్-రాజిక్ (ఉపాధినిచ్చేవాడు) గురించి వివరిస్తారు. ఈ నామాలకు రెండు ప్రధాన భావాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు: మొదటిది, సామాన్య ఉపాధి (రిజ్క్ ఆమ్), ఇది అల్లాహ్ విశ్వాసులు, అవిశ్వాసులు అనే తేడా లేకుండా సకల జీవులకు ఇచ్చే భౌతిక అవసరాలు. రెండవది, ప్రత్యేకమైన ఉపాధి (రిజ్క్ ఖాస్), ఇది హృదయానికి సంబంధించినది, అనగా విశ్వాసం, ధర్మ జ్ఞానం, మరియు మార్గదర్శకత్వం, ఇది ఇహపరలోకాల సాఫల్యానికి దారితీస్తుంది. ఉపాధి ప్రదాత ఏకైక అల్లాహ్ మాత్రమేనని గుర్తించి, ఆయనకే ఆరాధనలు జరపాలని, ఆయన ఇచ్చిన దానిలో నుండి ఖర్చు చేయాలని, మరియు పేదరికం భయంతో సంతానాన్ని నిరోధించడం వంటి ఘోరమైన పాపాలకు దూరంగా ఉండాలని ఖురాన్ ఆయతుల ఆధారంగా వక్త ఉద్బోధించారు.
పరిచయం
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.
మీపై శాంతి, అల్లాహ్ కారుణ్యం మరియు ఆయన శుభాలు వర్షించుగాక.
الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ
అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వఆలా ఆలిహి వసహ్బిహి అజ్మయీన్ అమ్మా బాద్.
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు. ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై, ఆయన కుటుంబీకులపై, ఆయన సహచరులపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆ తర్వాత…
الْحَمْدُ لِلَّهِ، الْحَمْدُ لِلَّهِ، اللَّهُمَّ لَكَ الْحَمْدُ وَالشُّكْرُ، وَالْحَمْدُ لِلَّهِ حَمْدًا كَثِيرًا
అల్హందులిల్లాహ్, అల్హందులిల్లాహ్, అల్లాహుమ్మ లకల్ హందు వష్షుక్ర్. వల్హందులిల్లాహి హందన్ కసీరా.
సర్వస్తోత్రాలు అల్లాహ్‌కే. ఓ అల్లాహ్, నీకే సర్వస్తోత్రాలు మరియు కృతజ్ఞతలు. అల్లాహ్‌కు ఎన్నో స్తోత్రాలు.
అల్లాహ్ యొక్క శుభ నామముల గురించి మనం, మనకు ఇవ్వబడిన సమయంలో ఎంతో కొంత వివరణ తెలుసుకోవడం, మన విశ్వాసపరంగా, మన యొక్క క్యారెక్టర్ పరంగా, మన యొక్క సామాజిక పరంగా, అన్ని రకాలుగా అన్ని రంగాల్లో లాభం చేకూరుస్తుందని ఆశిస్తున్నాను.
అల్లాహ్ నామముల ఘనత
వాస్తవానికి మనం ఖురాన్ గ్రంథాన్ని శ్రద్ధగా అర్థం చేసుకున్నామంటే ఒక విషయం మనకు బోధపడుతుంది. అదేమిటి?
قُل لَّوْ كَانَ الْبَحْرُ مِدَادًا لِّكَلِمَاتِ رَبِّي لَنَفِدَ الْبَحْرُ قَبْلَ أَن تَنفَدَ كَلِمَاتُ رَبِّي وَلَوْ جِئْنَا بِمِثْلِهِ مَدَدًا
కుల్ లవ్ కానల్ బహ్రు మిదాదల్ లి కలిమాతి రబ్బీ లనఫిదల్ బహ్రు కబ్ల అన్ తన్ఫద కలిమాతు రబ్బీ వలవ్ జిఇనా బి మిస్లిహీ మదదా.
(ఓ ప్రవక్తా!) ఇలా అను: ‘నా ప్రభువు మాటలను వ్రాయటానికి సముద్రమంతా సిరాగా మారినా, నా ప్రభువు మాటలు పూర్తికాకముందే ఆ సముద్రం ఇంకిపోతుంది. సహాయంగా మేము మరొక అంతటి సముద్రాన్ని తెచ్చినాసరే.’
అల్లాహ్ యొక్క పవిత్ర వచనాల గురించి, అల్లాహ్ యొక్క శుభ నామముల గురించి, ఆయన యొక్క ఉత్తమ గుణాల గురించి మనం ఎంత చెప్పుకుంటూ పోయినా, ఎంత రాసినా, సిరాలన్నీ కూడా సమసిపోతాయి, సముద్రాలన్నీ కూడా ఎండిపోతాయి. అల్లాహ్ యొక్క పవిత్ర నామములు, వాటి యొక్క వివరణలు అంతం కావు.
మీకు గుర్తుందా ఇంతకుముందు నేను అర్-రహ్మాన్, అర్-రహీం ఈ రెండు పేర్ల యొక్క వివరణ చెప్పాను. దాని గురించి చదువుతున్న సందర్భంలో, రియాదున్ నయీమ్ ఫీ జిల్లిర్ రహ్మానిర్ రహీం అన్న ఒక పుస్తకం గురించి తెలిసింది. దాని యొక్క పి.డి.ఎఫ్ కూడా పొందాను. రెండు వాల్యూంలలో ఉంది. మొత్తం టోటల్ సుమారు 800 పేజీల వరకు, కేవలం అల్లాహ్ యొక్క రహ్మాన్, రహీం ఈ రెండు పేర్ల యొక్క వివరాలు అందులో ఉన్నాయి. గమనించండి.
గమనించండి, మనం అల్లాహ్ యొక్క పేర్ల గురించి ఎంత చెప్పుకున్నా గానీ, ఎంత వివరణతో కూడిన మాటలు తెలుసుకున్నా గానీ, తెలుసుకున్న కొన్ని విషయాలను మంచిగా అర్థం చేసుకొని, వాటి ప్రకారంగా మన విశ్వాసాన్ని సరిదిద్దుకోవడం మరియు మన యొక్క ఆచరణలో ఒక మంచి మార్పు తీసుకొని రావడం ఇది చాలా అవసరం. లేదంటే ఈ రోజుల్లో సమాచారం, ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. కానీ కావలసిన అసలైన జ్ఞానం అదే కొరత. మరి జ్ఞానం అంటారు దేన్ని? తెలుసుకున్న విషయం ప్రకారంగా, తెలుసుకున్న నేర్చుకున్న జ్ఞానం ప్రకారంగా విశ్వాసం మరియు ఆచరణ ఉండడం.
అర్-రజ్జాక్, అర్-రాజిక్ – రెండు భావాలు
ఈ రోజు, అల్లాహ్ యొక్క శుభ నామములలోని అర్-రజ్జాక్ మరియు అర్-రాజిక్. ఈ రెండు పేర్ల గురించి ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకుంటున్నాం. సోదర మహాశయులారా, సోదరీమణులారా, ఈ రెండు పేర్ల ప్రస్తావన ఖురాన్లో ఎన్నో సందర్భాలలో వచ్చి ఉంది. అయితే, సంక్షిప్తంగా నేను దీని యొక్క భావంలో ఉన్న రెండు ముఖ్య విషయాలను తెలియజేస్తున్నాను, ఇది ముందు అర్థం చేసుకోండి. ఇది చాలా ముఖ్యం. ఆ తర్వాత, దీనికి సంబంధించిన ఆధారాలు మరియు ఈ రెండు పేర్ల యొక్క ప్రభావం మన జీవితంలో ఎలా ఉండాలి, ఆ విషయాలు ఇన్షా అల్లాహ్ తర్వాత తెలుసుకుందాం.
మొదటి భావం: సామాన్య ఉపాధి (రిజ్క్ ఆమ్)
మొదటి భావం, అల్లాహ్ యొక్క పేరు రాజిక్ మరియు అర్-రజ్జాక్. ఉపాధి అని సర్వసామాన్యంగా మనం తెలుగులో అనువదిస్తాము. ఉపాధి ప్రధాత. ఉపాధిని ఇచ్చేవాడు. లేదా రాజిక్, పోషించేవాడు అన్నటువంటి భావంలో కూడా కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తారు. అయితే సోదర మహాశయులారా, ఇక్కడ నేను ఎంతవరకైతే చదివానో, ఈ రెండు పేర్ల గురించి, దానిని ఉపాధి లేదా పోషణ అన్నటువంటి భావం చాలా లిమిటెడ్ గా ఉంది. రిజ్క్, అల్లాహ్ యొక్క పేరు రజ్జాక్ అన్నటువంటి ఈ పేరులో ఎంత విశాలమైన భావం ఉందో దానికి సమానమైన తగ్గట్టు తెలుగు పదం మన వద్ద లేదు. ఎందుకు? వినండి వివరం, మీకే తెలుస్తుంది.
రిజ్క్, రజ్జాక్ యొక్క ఒక భావం, అల్లాహు తఆలా విశ్వాసులకు గానీ అవిశ్వాసులకు గానీ, పుణ్యాత్ములకు గానీ పాపాత్ములకు గానీ, మునుపటి వారికి, వెనుకటి వారికి, అల్లాహు తఆలా ఈ సృష్టిని సృష్టించినప్పటి నుండి మొదలుకొని, ఇది అంతం అయ్యేవరకు ఆ తర్వాత కూడా అందరికీ వారికి ఏ ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ ప్రసాదించేవాడు. కేవలం ఒక వారి తిండి త్రావుడుకు సంబంధించిన, వారు బ్రతకాలంటే ఏ ఆహారం అవసరమో అంత మాత్రమే కాదు. ప్రతిదీ వారి జీవితంలో వారికి అవసరమున్నది ప్రతిదీ ప్రసాదించేవాడు.
ఈ భావంలో గనక మనం చూస్తే ఖురాన్లో అనేక సందర్భాలలో ఆయతులు ఉన్నాయి. మరియు ఎవరైతే ఈ ఉపాధి అన్నటువంటి భావంలో తీసుకొని, దీనినే చాలా ముఖ్యమైనదిగా భావిస్తారో, జీవితం గడపడానికి ఏ ఏ అవసరాలు ఉన్నాయో అవి లభిస్తే ఇక మాకు స్వర్గం లభించినట్లు అని భావిస్తారో, అలాంటి వారికి హెచ్చరికలు కూడా ఉన్నాయి. అల్లాహ్ అందరికీ ఇది ప్రసాదిస్తాడు. కానీ అల్లాహ్ తన ఇష్ట ప్రకారంగా ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే.
ఒకసారి మీరు సూరత్ సబా, ఆయత్ నంబర్ 35 నుండి 37 వరకు గనక చూశారంటే, సంతానం, డబ్బు, ధనం ఇలాంటి విషయాలన్నీ కూడా పొంది ఎవరైతే గర్వపడతారో, మాకు అన్ని అనుగ్రహాలు లభించాయి అన్నటువంటి ఒక మోసంలో ఉంటారో వారికి అల్లాహు తఆలా ఎలా హెచ్చరిస్తున్నాడో ఒక్కసారి మీరు సూర సబా, సూరా నంబర్ 34, ఆయత్ నంబర్ 35 నుండి 38 వరకు అనువాదం చూడండి మరియు దీనిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడే నేను మీకు చూపిస్తున్నాను మరియు దీనిని చదువుదాము కూడా.
అవిశ్వాసులు అంటున్నారు, మేము శ్రీ సంపదలలో, సంతాన భాగ్యంలో ఎంతో అధికులము. మేము శిక్షించబడటం అనేది జరగని పని అని వారు అన్నారు. అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్. చూశారా? ఈ రోజుల్లో, మా గ్యాంగ్ చాలా పెద్దది, నా ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు, నా వెంట ఫలానా ఫలానా పెద్ద హోదా అంతస్తులు గలవారు ఉన్నారు, నా వద్ద ఇంత డబ్బు, ధనం ఉంది, మాకు ఇక ఎవరి భయము లేదు. ఇట్లాంటి ఎన్నో పదాలు మాటలు మనం వింటూ ఉంటాము.
ఇహలోక పరంగా వారికి లభించిన కొంత సమృద్ధి, దానిని పొంది ఎలా గర్విస్తున్నారో, ఆ తర్వాత వెంటనే అల్లాహ్ వారికి ఎలాంటి ఉపదేశం చేస్తున్నాడో గమనించండి. ఓ ప్రవక్త వారికి చెప్పు: నా ప్రభువు తాను కోరిన వారి ఉపాధిని విస్తృతం చేస్తాడు, తాను కోరిన వారికి కుంచింపజేస్తాడు. కానీ చాలామంది ఈ యధార్థాన్ని గ్రహించరు. ఆ తర్వాత 37 లో, మీ సిరి సంపదలు గానీ, మీ సంతానం గానీ మా సన్నిధిలో అంతస్తుల రీత్యా మిమ్మల్ని ఏమాత్రం దగ్గరకు చేర్చలేవు. అయితే, ఎవరైనా విశ్వసించి సదాచరణ చేస్తే అటువంటి వారికి వారి ఆచరణకు బదులుగా రెండింతల प्रतिఫలం ఉంటుంది, వారు ఎత్తైన మేడలలో సురక్షితంగా ఉంటారు.
గమనించారా సోదర మహాశయులారా? అల్లాహు తఆలా ఎవరికి ఎలాంటి ఉపాధిని, ఇహలోకపు వారి జీవితంలో అవసరం ఉన్నటువంటి అవసరాలు ఇస్తాడో, వాస్తవానికి ఉన్నవాడు కూడా పరీక్షలో ఉన్నాడు, లేని వాడు కూడా పరీక్షలో ఉన్నాడు. కానీ ఈ విషయాన్ని వారు గ్రహించడం లేదు. ఇలాంటి భావంలో ఇంకా అనేక ఆయతులు ఉన్నాయి. సూరత్ అల్ ముఅమినూన్ ఆయత్ నంబర్ 55, 56. అలాగే సూరతుల్ ఇస్రా, ఆయత్ నంబర్ 20, 21.
రెండవ భావం: ప్రత్యేకమైన ఉపాధి (రిజ్క్ ఖాస్)
కానీ ఇక రండి, అర్-రజ్జాక్, అర్-రాజిక్ లోని రెండో భావం. ఇది అందరితో పాటు, అందరికీ లభించే విధంగా సామాన్య రిజ్క్ తో పాటు, ప్రత్యేకమైన రిజ్క్. ముందు దానిని రిజ్క్ ఆమ్ అని అంటారు, రెండవ దానిని రిజ్క్ ఖాస్ అని అంటారు. రిజ్క్ అంటే అర్థం అయ్యింది కదా ఇప్పుడు మీకు, అర్థం అవుతుంది కదా. రజ్జాక్ ఈ రిజ్క్ నుండే వచ్చింది.
రిజ్క్ ఖాస్ ప్రత్యేకమైన ఆ ఉపాధి అనండి. ఎందుకంటే ఈ పదం చాలా ప్రబలి ఉంది, అందరికీ పరిచయం అందుకొరకు దీన్ని మనం ఉపయోగిస్తున్నాము, అల్హందులిల్లాహ్. ఆ ప్రత్యేకమైన రిజ్క్ ఏంటి? హృదయాలకు సంబంధించినది. అది ధర్మ జ్ఞానం రూపంలో, సత్యమైన, బలమైన, దృఢమైన విశ్వాస రూపంలో, దేని ద్వారానైతే ఇహలోకంలో అల్లాహ్ ను గుర్తించి, ప్రవక్త విధానంపై జీవితం గడపగలుగుతామో, దేని ద్వారానైతే పరలోకంలో నరకం నుండి రక్షణ, మోక్షం పొంది స్వర్గంలో ప్రవేశించగలుగుతామో, అలాంటి రిజ్క్.
అలాంటి రిజ్క్. ఇది అసలైన రిజ్క్. ఇది చాలా ఉత్తమమైన రిజ్క్. ఎవరైతే ఈ రిజ్క్ ను పొందుతారో, వాస్తవానికి అలాంటి వారే ఇహ పరలోకాల మేళ్లను పొందేవాళ్ళు. ఈ రిజ్క్ ను ఎవరైతే తప్పిపోయారో, ఇది ఎవరికైతే మిస్ అయిపోయిందో, ఇక వారికి వేరే ఏ ఉపాధి లభించినా, ఏ ధనం సంతానం లభించినా వాస్తవానికి అది వారి నష్టాలను, కష్టాలను, శిక్షలను పెంచుతుంది కానీ నరకం నుండి మోక్షాన్ని కలుగజేయదు.
సూరతు అత్-తలాఖ్. సూరా నంబర్ 65, ఆయత్ నంబర్ 11 లోని రెండవ సగ భాగం గమనించండి, ఇక్కడి నుండి,
وَمَن يُؤْمِن بِاللَّهِ وَيَعْمَلْ صَالِحًا
వమన్ యుఅమిన్ బిల్లాహి వయఅమల్ సాలిహా
మరి ఎవరైతే అల్లాహ్ ను విశ్వసించి సదాచరణ చేస్తారో,
يُدْخِلْهُ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ
యుద్ఖిల్ హు జన్నతిన్ తజ్రీ మిన్ తహతిహల్ అన్హారు ఖాలిదీన ఫీహా అబదా
వారిని అల్లాహ్ క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలలో ప్రవేశింపజేస్తాడు, వాటిలో వారు కలకాలం ఉంటారు.
قَدْ أَحْسَنَ اللَّهُ لَهُ رِزْقًا
ఖద్ అహ్సనల్లాహు లహు రిజ్కా
నిశ్చయంగా అల్లాహ్ అతనికి అత్యుత్తమమైన ఉపాధిని ఒసగాడు.
ఇది ప్రత్యేకమైన ఉపాధి. ఇది ప్రత్యేకమైన రిజ్క్. అల్లాహ్ మనల్ని ఇలాంటి ప్రత్యేకమైన రిజ్క్ ఉపాధిని పొందిన వారిలో చేర్చాలని మనం అల్లాహ్ యొక్క అర్-రజ్జాక్, అర్-రాజిక్ పేర్ల యొక్క వసీలాతో దుఆ చేయాలి.
ముఖ్యమైన పాఠాలు
ఇక, అల్లాహ్ యొక్క పేర్ల గురించి ఈ ముఖ్యమైన కొన్ని విషయాలు విన్న తర్వాత, మరికొన్ని ఈ పేర్ల గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకోవలసిన అవసరం చాలా చాలా ఉంది. మొట్టమొదటి విషయం ఇందులో, ఈ లోకంలో అల్లాహు తఆలా అనేకమంది ప్రవక్తలను పంపి, అల్లాహ్ ను ప్రజలు ఏదైతే మరిచిపోయి ఇతరులను ఆరాధిస్తున్నారో, వారిని అల్లాహ్ వైపునకు పిలవడానికి, ఏ ఏ అల్లాహ్ యొక్క అనుగ్రహాల ఉపమానాలు వారికి చూపించి అల్లాహ్ యొక్క అనుగ్రహాల నిదర్శనాలు వారికి చూపించి వారిని అల్లాహ్ వైపునకు ఆహ్వానించారో వాటిలో ఒకటి ఏమిటి? అల్లాహ్ మీకు ఏ రిజ్క్ అయితే ప్రసాదిస్తున్నాడో అది కేవలం అల్లాహ్ వైపు నుండే లభిస్తుంది గనక మీరు ఆ అల్లాహ్ ను వదలి ఇంకా వేరే ఎవరినీ కూడా ఆరాధించకూడదు.
సోదర మహాశయులారా, నా మాట అర్థం అవుతుంది కదా మీకు? ఎందుకంటే ఇక్కడ ఈ విషయాన్ని ఆలోచించడం చాలా అవసరం, చాలా అవసరం. ఎవరైనా ఒక మినిస్టర్, ఎవరైనా ఒక లీడర్, ఎవరైనా ఒక ధనికుడు మనకు ఏదైనా మనకు అవసరమైన వస్తువు ఇచ్చాడు, అతనికి ఎంత కృతజ్ఞత చెల్లిస్తాము మనం? అతనికి మనం ఎంత రుణపడి ఉంటాము? ఒక్కసారి, రెండుసార్లు ఎవరైనా మనుషుల్లో మనకు ఏదైనా సహాయం చేస్తే, ఇలా ఉండే మనం, రిజ్క్ ఆమ్, రిజ్క్ ఖాస్, సామాన్య ఉపాధి, ప్రత్యేకమైన ఉపాధి, బాహ్యమైన కళ్లకు కనబడే ఉపాధి రిజ్క్, కళ్లకు కనబడని ఉపాధి అంతా కూడా ప్రసాదించేవాడు ఏకైక అల్లాహ్ మాత్రమే ఉన్నాడు. ఆయన తప్ప వేరే ఎవరూ లేరు అన్న విషయం మనం ఎప్పుడు గ్రహిద్దాము? ఒకవేళ ఈ విషయాన్ని మనం గ్రహించకుంటే అల్లాహ్ యొక్క ఆరాధన సరియైన రీతిలో మనం చేయలేము.
చదవండి ఒకసారి మీరు, సూరత్ యూనుస్. సూరత్ యూనుస్ ఆయత్ నంబర్ 31. ఒకవేళ మీ వద్ద ఖురాన్ కూడా ఉంది కదా ఇప్పటివరకు, గురువుగారితో ఉండి ఖురాన్ చూస్తూ ఉన్నారు మీరు. అందుకొరకే నేను ఆయత్ నంబర్లు చాలా స్పష్టంగా చెబుతున్నాను. సూరత్ యూనుస్ ఆయత్ నంబర్ 31 గనక మీరు శ్రద్ధ వహించారంటే, అల్లాహు తఆలా ఇలా గుర్తు చేస్తున్నాడో ఒకసారి గమనించండి. ఇదిగోండి, మీరు నా తో పాటు మొబైల్ లో కూడా ల్యాండ్‌స్కేప్ లో పెట్టి శ్రద్ధగా చూడండి.
ఆనాటి కాలంలోని బహుదైవారాధకులు, ముష్రికులు కూడా అల్లాహ్‌యే రోజీ, రిజ్క్ ప్రసాదించేవాడు, ఉపాధిని ఇచ్చేవాడు అని నమ్మేవారు. ఆకాశం నుండి, భూమి నుండి మీకు ఉపాధిని సమకూర్చేవాడు ఎవడు? చెవులపై, కళ్ళపై పూర్తి అధికారం కలవాడు ఎవడు? ప్రాణమున్న దానిని ప్రాణము లేని దాని నుండి, ప్రాణము లేని దానిని ప్రాణమున్న దాని నుండి వెలికితీసేవాడు ఎవడు? సమస్త కార్యాల నిర్వాహకర్త ఎవరు? అని ఓ ప్రవక్త వారిని అడుగు. అల్లాహ్ యే అని వారు తప్పకుండా చెబుతారు. మరలాంటప్పుడు మీరు అల్లాహ్ యొక్క శిక్షకు ఎందుకు భయపడరు? అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఎంత స్పష్టంగా ఉంది చూడండి.
మనకు అన్ని రకాల రిజ్క్ ప్రసాదించేవారు అల్లాహ్ మాత్రమే అని ఆనాటి కాలంలో ఉన్న బహుదైవారాధకులు కూడా నమ్మేవారు. కానీ ఎంత విచిత్రం, బాధాకరమైన విషయం ఈ రోజుల్లో, ఈ రోజుల్లో ముస్లిమేతరుల సంగతి ఏమిటి? ఎందరో ముస్లింలు, ఎన్నో రకాల రిజ్క్ గురించి, అల్లాహ్ యొక్క మస్జిదులకు వచ్చి, అల్లాహ్ ను ఎలాంటి భాగస్వామి లేకుండా ఆరాధించడం మానేసి, లేకుంటే కొందరు ఇలా చేస్తూ ఎన్నో రకాల రిజ్క్ ల గురించి వేరే ఎన్నో దర్గాల వద్దకు, బాబాల వద్దకు, ఎందరో పుణ్యాత్ములను లేక చనిపోయిన వారిని ఆశించి అక్కడికి వెళ్లి వారితో మొరపెట్టుకుంటారు. ఎంత ఘోరమైన పాపం ఇది గమనించండి.
మనకు అసలైన రిజ్క్ ప్రసాదించేవాడు అల్లాహ్ మాత్రమే. అందుకొరకే అల్లాహు తఆలా ఈ అనుగ్రహాన్ని గుర్తించి షిర్క్ ను ఖండిస్తున్నాడు. అంతే కాదు, అల్లాహ్ మనకు ప్రసాదించిన దానిలో నుండి ఖర్చు చేయాలి అని కూడా మనకు ఆదేశిస్తున్నాడు. ఇక ఈ విషయం సర్వసామాన్యంగా మనందరికీ తెలిసినదే, దీని గురించి ఎక్కువగా వివరం చెప్పను. వేరే సందర్భాలలో ధర్మవేత్తల ప్రసంగాలు కూడా మీరు వింటారు, ఇన్ఫాక్ ఫీ సబీలిల్లాహ్.
అలాగే, మనకు ఉన్నదానిలోనే తృప్తిపడి, దాని గురించి ఎక్కువగా అల్లాహ్ కు కృతజ్ఞత చెల్లించాలి అని కూడా అల్లాహ్ మనకు మాటిమాటికి ఆదేశిస్తూ ఉంటాడు. సూరతుల్ బఖరా ఆయత్ నంబర్ 172 చూస్తే,
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُلُوا مِن طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ
యా అయ్యుహల్లజీన ఆమనూ కులూ మిన్ తయ్యిబాతి మా రజక్నాకుమ్
ఓ విశ్వాసులారా! మేము మీకు ప్రసాదించిన పరిశుభ్రమైన వస్తువులను తినండి.
وَاشْكُرُوا لِلَّهِ
వష్కురూ లిల్లాహ్
మరియు అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలపండి.
إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ
ఇన్ కున్తుమ్ ఇయ్యాహు తఅబుదూన్
ఒకవేళ మీరు ఆయన్నే ఆరాధిస్తున్నవారైతే.
ఇక చాలా ముఖ్యమైన విషయం. అందరూ శ్రద్ధగా వింటున్నారో కదా? చాలా ముఖ్యమైన విషయం. రిజ్క్ ప్రసాదించేవాడు ఎవడు? కేవలం అల్లాహ్. ఆనాటి కాలంలోని ముస్లింలు కూడా నమ్మేవారు అని మనం ఇప్పుడే తెలుసుకున్నాము.
وَاللَّهُ خَيْرُ الرَّازِقِينَ
వల్లాహు ఖైరుర్ రాజికీన్
మరియు అల్లాహ్ ఉత్తమ ఉపాధి ప్రదాత.
وَاللَّهُ يَرْزُقُ مَن يَشَاءُ بِغَيْرِ حِسَابٍ
వల్లాహు యర్జుకు మన్ యషాఉ బిగైరి హిసాబ్
మరియు అల్లాహ్ తాను కోరిన వారికి లెక్కలేనంతగా ప్రసాదిస్తాడు.
ఎన్నో ఆయతులు ఉన్నాయి.
ముఖ్యమైన విషయం ఏంటి ఇప్పుడు నేను చెప్పబోతున్నది? మనకు ఎక్కువ సంతానం అయితే ఎలా వారికి మనం తినిపిస్తాము? ఎలా వారికి త్రాపిస్తాము? ఎలా వారి ఖర్చులను చూడగలుగుతాము? మన ఉపాధి చాలా తక్కువగా ఉంది, నా యొక్క జీతం చాలా తక్కువగా ఉంది, మన యొక్క రాబడి దుకాణంలో చాలా తక్కువగా ఉంది, మన వద్ద పంటలు అంత ఎక్కువగా లేవు, భూములు ఎక్కువగా లేవు, ఆస్తిపాస్తులు లేవు, సంతానం ఎక్కువ అయ్యేది ఉంటే ఎలా వారి పెళ్ళిళ్ళు చేసేది? ఎలా వారికి డిగ్రీలు చదివించేది? అన్నటువంటి ఆలోచనల్లో పడి ఎవరైతే సంతానం పుట్టకుండా ఆపరేషన్లు చేయించుకుంటున్నారో, కడుపులో గర్భం నిలిచిన తర్వాత బిడ్డ పుడుతుందేమో అన్నటువంటి వార్త వచ్చి అబార్షన్లు చేయిస్తున్నారో, లేదా పుట్టిన తర్వాత తీసుకువెళ్లి అలాగే సజీవంగా పాతిపెడుతున్నారో లేక కాల్చేస్తున్నారో లేదా చెత్తకుండీల వద్ద పారేస్తున్నారో, ఇలాంటి వారందరూ కూడా ఎంత ఘోరాతి ఘోరమైన, నీచాతి నీచమైన పాపానికి ఒడిగడుతున్నారో, అల్లాహు అక్బర్. అల్లాహు తఆలా సూరతుల్ ఇస్రా, బనీ ఇస్రాయిల్ లోని ఆయత్ నంబర్ 31 లో
وَلَا تَقْتُلُوا أَوْلَادَكُمْ خَشْيَةَ إِمْلَاقٍ ۖ نَّحْنُ نَرْزُقُهُمْ وَإِيَّاكُمْ
వలా తక్తులు అవ్లాదకుమ్ ఖష్యత ఇమ్లాఖిన్ నహ్ను నర్జుకుహుమ్ వ ఇయ్యాకుమ్.
“పేదరికపు భయంతో మీ సంతానాన్ని చంపకండి. వారికి, మీకు కూడా మేమే ఉపాధిని ప్రసాదిస్తాము.”
సోదర మహాశయులారా, ఖురాన్లో రెండు సందర్భాల్లో, ఖురాన్లో రెండు సందర్భాల్లో ఈ ఆయత్ ప్రస్తావించబడింది. కానీ ఖురాన్ అల్లాహ్ యొక్క సత్య గ్రంథం అన్న విషయంలో, అల్లాహు అక్బర్. ఇప్పటికీ ఎంత గొప్ప నిదర్శనం ఉన్నదో దీనిని మీరు గమనించండి. ఒకచోట
نَحْنُ نَرْزُقُكُمْ وَإِيَّاهُمْ
నహ్ను నర్జుకుకుమ్ వ ఇయ్యాహుమ్.
“మేమే మీకు మరియు వారికి ఉపాధినిస్తాము.”
ఇది సూరతుల్ అన్ఆమ్ ఆయత్ నంబర్ 151 లో. అంటే ఏమిటి? మీరు మీ సంతానాన్ని పేదరికంతో ఖర్చు పెట్టవలసి వస్తుంది అన్నటువంటి భయంతో చంపకండి. ఆ తర్వాత సూరతుల్ అన్ఆమ్ లో ఏముంది?
حْنُ نَرْزُقُكُمْ
నహ్ను నర్జుకుకుమ్
“మేమే మీకు ఉపాధినిస్తాము.”
وَإِيَّاهُمْ
వ ఇయ్యాహుమ్
“మరియు వారికి.”
ఎప్పుడైతే తల్లిదండ్రులు స్వయం తమ గురించి, అయ్యో నాకు ఇంతే స్తోమత ఉంది, నాకు ఇంతే ఉంది అని తమ గురించి ఆలోచించి భయపడ్డారో, అక్కడ అల్లాహు తఆలా కుమ్ [కుమ్], మీకు అని ముందు చెప్పాడు. మరియు అదే సూరతుల్ ఇస్రా, దాని యొక్క రెండో పేరు బనీ ఇస్రాయిల్, ఆయత్ నంబర్ 31 లో,
حْنُ نَرْزُقُكُمْ
నహ్ను నర్జుకుహుమ్
“మేమే వారికి ఉపాధినిస్తాము.”
وَإِيَّاكُمْ
వ ఇయ్యాకుమ్
“మరియు మీకు.”
సంతాన ప్రస్తావన, ఇంకా ఇహలోకంలో రాని సంతానం, వారి గురించి ముందు ప్రస్తావించాడు అల్లాహు తఆలా. తర్వాత మీకు అని చెప్పాడు. ఎందుకు? ఎక్కడైతే సంతానం ఎక్కువ అయితే మనకు తినిపించడం, త్రాపించడం, వారిని పోషించడం కష్టమవుతుంది అని భావించారో, అల్లాహు తఆలా వారి ప్రస్తావన ముందు చేశాడు.
ఇది గమనించండి. అల్లాహు తఆలా ఇంతటి గొప్ప ఉపాధి ప్రధాత అయితే ఇక మనం ఎందుకని భయపడవలసింది? అయితే గమనించాలి ఇక్కడ అదేమిటి? రిజ్క్ విషయంలో, మన కొరకు ఏ విషయాలు హరామ్, ఏ విషయాలు హలాల్ ఈ నిర్ణయం చేసే హక్కు కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉన్నది. సూరతుల్ ఆరాఫ్, ఆయత్ నంబర్ 32, అలాగే సూరత్ యూనుస్ ఆయత్ నంబర్ 59 లో అల్లాహ్ దీనిని స్పష్టం చేశాడు. ఈ మాట ఎందుకు తీసుకురావడం జరిగింది? ఈ రోజుల్లో కొందరు కొన్ని ఆహార విషయాల్లో, కొన్ని ఉపాధి విషయాల్లో, వారి జీవితంలో ఉపయోగపడే విషయాల్లో తమ ఇష్టానుసారం, తమ అందా కరుణ, మా ఇమాములు, మా బుజుర్గులు, మా యొక్క పీర్లు, మా యొక్క ముర్షదులు అని కొందరు కొన్ని రకాల అందా అనుకరణలో ఏదైతే పడి ఉన్నారో, గుడ్డి విశ్వాసంలో పడి ఉన్నారో, దాని కారణంగా అల్లాహ్ హరామ్ చేసిన విషయాలను కొందరు హలాల్ చేసుకోవడం, అల్లాహ్ హలాల్ చేసిన విషయాలను మరికొందరు హరామ్ చేసుకోవడం ఇలాంటి పాపాలకు పాల్పడుతున్నారు. అందుకొరకు ఈ విషయంలో కూడా అల్లాహ్ తో భయపడాలి.
ఇక, మనకు అల్లాహు తఆలా ఇహలోకపు ఉపాధితో పాటు పరలోక ఉపాధి వృద్ధిగా, సమృద్ధిగా ప్రసాదించాలి అని అంటే, మనం అల్లాహ్ హలాల్ చేసిన విషయాలను మాత్రమే అవలంబించాలి. వాటన్నిటిలో అతి గొప్ప విషయం విశ్వాసం. అల్లాహ్ పై, అల్లాహ్ ఎవరెవరిని విశ్వసించాలని చెప్పాడో, మరియు అల్లాహ్ యొక్క ఆరాధన సరియైన రీతిలో చేస్తూ ఉండాలి.
ఈ లోకంలో అవిశ్వాసులకు ఇంకా అల్లాహ్ ను తిరస్కరించే వారికి, నాస్తికులకు అల్లాహ్ ఆహారం ప్రసాదిస్తున్నాడు కానీ అది అసలైన ఆహారం కాదు. అది అసలైన ఉపాధి కాదు. ఎందుకంటే మన జీవిత ఉద్దేశం తినడానికి మనం పుట్టలేదు. ఈ తినడం, త్రాగడం, ఉపాధి ఇవన్నీ కూడా అసలైన ఉద్దేశానికి ఒక సబబు. అయితే సబబునే అసల్ టార్గెట్ గా మనం నిర్ణయించుకుంటే చాలా పొరపాటలో పడిపోతాము. అయితే విశ్వాసం ఇది చాలా గొప్ప విషయం. ఈ విషయంలో కూడా ఒకవేళ మనం ఖురాన్లో గనక చూస్తే సూరతున్ నహ్ల్ లోనే చూడండి. ఇంకా వేరే సూరాలలో కూడా, ఈ బస్తీవాసులు గనక విశ్వాస మార్గాన్ని అవలంబిస్తే మేము వారికి సమృద్ధిగా ఉపాధి ప్రసాదించే వారిమి. అలా ప్రసాదించబడినప్పుడు అల్లాహ్ యొక్క హక్కులను గమనించడం, నెరవేర్చడం చాలా తప్పనిసరి విషయం.
ముగింపు
సోదర మహాశయులారా, మనం ఇహలోకపు మరియు పరలోకపు అతి ఉత్తమమైన, అల్లాహ్ కు ఇష్టమైన రిజ్క్ ను మనం అడిగినప్పుడు, అల్లాహ్ యొక్క ఈ రెండు పేర్లు రాజిక్ మరియు రజ్జాక్ వసీలాతో అడగాలి. దీని ద్వారా మనకు బోధపడుతున్న మరొక విషయం, అల్లాహ్ రజ్జాక్ మనకు ఏదైనా ప్రసాదించాడు అంటే దానిలో మనం ఖర్చు పెట్టే బీదవాళ్ళకు, పేదవాళ్ళకు, అవసరం ఉన్నవారికి ఇచ్చేటువంటి ఆదేశం కూడా ఇచ్చాడు, ఆ విషయాన్ని గమనించాలి. మరియు ఇహలోకంలో ఉన్నటువంటి మన శరీరానికి సంబంధించిన ఉపాధి ఒకటి ఉంటే మన ఆత్మకు సంబంధించిన ఉపాధి మరొకటి ఉన్నది.
మన శరీరానికి సంబంధించిన ఉపాధి భూమి నుండి, వర్షం రూపంలో ఆకాశం నుండి, భూమి నుండి ఆహారం రూపంలో మనం పొందుతాము. కానీ ఆత్మకు అవసరమైన ఆహారం, ఉపాధి అల్లాహ్ వహీ రూపంలో, ఖురాన్ హదీస్ రూపంలో ఆకాశం నుండి ఏదైతే పంపాడో దాన్ని కూడా మనం తీసుకోవాలి. ఎక్కువ సంఖ్యలో తీసుకోవాలి. అప్పుడే దానిని తీసుకొని మనం ఆచరించినప్పుడే మనకు పరలోకంలో ఎన్నటికీ అంతం కాని ఆహారం లభిస్తుంది. ఉదాహరణకు సూరత్ సాద్, ఆయత్ నంబర్ 54 మీరు చూశారంటే,
إِنَّ هَٰذَا لَرِزْقُنَا مَا لَهُ مِن نَّفَادٍ
ఇన్న హాదా లరిజ్కునా మా లహు మిన్ నఫాద్.
“నిశ్చయంగా ఇది మా ఉపాధి, దీనికి అంతమంటూ లేదు.”
అల్లాహు అక్బర్. ఆయత్ నంబర్ 49 లో ఏముంది?
هَٰذَا ذِكْرٌ
హాదా జిక్ర్
“ఇది ఒక హితబోధ.”
అయితే,
وَإِنَّ لِلْمُتَّقِينَ لَحُسْنَ مَآبٍ
వ ఇన్న లిల్ ముత్తకీన లహుస్న మఆబ్
“నిశ్చయంగా దైవభీతిపరులకు అత్యుత్తమ గమ్యస్థానం ఉంది.”
ఆ తర్వాత, స్వర్గంలోని కొన్ని విషయాల గురించి అల్లాహు తఆలా ప్రస్తావించాడు. చివరలో ఏమంటున్నాడు?
إِنَّ هَٰذَا لَرِزْقُنَا
ఇన్న హాదా లరిజ్కునా
“నిశ్చయంగా ఇది మా ఉపాధి.”
مَا لَهُ مِن نَّفَادٍ
మా లహు మిన్ నఫాద్
“దీనికి అంతమంటూ లేదు.”
అయితే స్వర్గంలో ఆ ఎల్లకాలం శాశ్వతంగా అంతం కాని ఆ రిజ్క్ మనకు ప్రసాదించబడటానికి తప్పకుండా మనం అల్లాహ్ యొక్క రాజిక్, రజ్జాక్ పేర్ల సహాయంతో దుఆ చేసుకుంటూ, అల్లాహ్ కు ఇష్టమైన రీతిలో మనం జీవితం గడపాలి. చివరిలో నేను రెండు ఆయతులు, వాటి యొక్క అర్థాలు తెలిపి నా యొక్క ఈ ప్రసంగాన్ని ముగించేస్తున్నాను. మొదటి ఆయత్ సూరతుల్ హజ్, ఆయత్ నంబర్ 50.
فَالَّذِينَ آمَنُوا
ఫల్లజీన ఆమనూ
“కాబట్టి ఎవరైతే విశ్వసించారో…”
وَعَمِلُوا الصَّالِحَاتِ
వ అమిలుస్ సాలిహాత్
“…మరియు సత్కార్యాలు చేశారో…”
لَهُم مَّغْفِرَةٌ
లహుమ్ మగ్ఫిరతున్
“…వారికి క్షమాపణ ఉంది…”
وَرِزْقٌ كَرِيمٌ
వ రిజ్కున్ కరీమ్
“…మరియు గౌరవప్రదమైన ఉపాధి ఉంది.”
అలాగే ఈ భావంలోనే అల్లాహు తఆలా సూరతుల్ అన్ఫాల్ ఆరంభంలో కూడా తెలిపాడు. సూరతుల్ అన్ఫాల్ ఆరంభంలో కూడా అల్లాహు తఆలా విశ్వాసం, నమాజ్ మరియు ఇంకా ఖురాన్ యొక్క తిలావత్, ఎందుకంటే ఇప్పుడు రమజాన్ కూడా వస్తుంది, ఎల్లవేళలో ఖురాన్ తిలావత్ చేయాలి, కానీ ప్రత్యేకంగా, ప్రత్యేకంగా మనం రమజాన్ లోనైతే ఇంకా ఎక్కువగా అధికంగా ఖురాన్ పారాయణం చేయాలి. అయితే సూరె అన్ఫాల్ యొక్క ఆయతులను గమనించండి. నిజమైన విశ్వాసులు ఎటువంటి వారంటే, అల్లాహ్ ప్రస్తావన రాగానే వారి హృదయాలు భయంతో వణుకుతాయి. అల్లాహ్ ఆయతులు వారి ముందు పఠించబడినప్పుడు అవి వారి విశ్వాసాన్ని మరింత వృద్ధి చేస్తాయి. వారు తమ ప్రభువునే నమ్ముకుంటారు. వారు నమాజు నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి మా మార్గంలో ఖర్చు పెడతారు.
أُولَٰئِكَ هُمُ الْمُؤْمِنُونَ حَقًّا
ఉలాయిక హుముల్ ముఅమినూన హక్కా
“వారే నిజమైన విశ్వాసులు.”
వీరి కొరకు వీరి ప్రభువు వద్ద ఉన్నత స్థానాలు ఉన్నాయి. మన్నింపు ఉంది, గౌరవప్రదమైన ఆహారం ఉంది. అల్లాహు అక్బర్.
అల్లాహు తఆలా ఇలాంటి గౌరవప్రదమైన ఆహారం, మన్నింపు, ఉన్నత స్థానాలు మనందరికీ ప్రసాదించుగాక. వాటిని పొందే విశ్వాస సత్కార్య మార్గాలను కూడా అవలంబించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
వ ఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
“మా చివరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు అని.”
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.
మీపై శాంతి, అల్లాహ్ కారుణ్యం మరియు ఆయన శుభాలు వర్షించుగాక.
—
అల్లాహ్ (త’ఆలా):
https://teluguislam.net/allah/
అల్లాహ్ శుభ నామాల వివరణ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0tSV7A9HKJzSeM0aIAiYcb