సమాధి సంగతులు (ఖబర్ కా బయాన్) [పుస్తకం]
సంకలనం: ముహమ్మద్ ఇక్బాల్ కైలానీ
అనువాదం:హాఫిజ్ బద్రుల్ ఇస్లాం
ప్రకాశకులు: హదీస్ పబ్లికేషన్స్, హైదరాబాద్, ఎ.పి. ఇండియా
[డెస్క్ టాప్ ఎడిషన్]
[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/samadhi-sangathulu
[PDF] [176 పేజీలు]
[మొబైల్ ఫ్రెండ్లీ ఎడిషన్]
[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/samadhi-sanagathulu-mobile
[PDF] [176 పేజీలు] [52 MB]
విషయ సూచిక
- సోదరులారా! ఇలాంటి స్థలం (సమాధి) కోసం సన్నాహాలు చేసుకోండి!
- సంకలన కర్త – ఉపోద్ఘాతం [PDF] [38p]
- సమాధిలో మూడు ప్రశ్నలు [PDF] [10p]
- సమాధి ఉపద్రవం నుండి కాపాడే ఆచరణలు [PDF] [4p]
- సమాధిలో నమాజీకి సత్కార్యం [PDF] [3p]
- హువల్ అజీజుల్ జబ్బరుల్ ముతకబ్బిర్ [PDF] [7p]
- ఒక అపోహ (సమాధి శిక్షలు, వరాలు తిరస్కరించే వారి ఒక అపోహ) [PDF] [3p]
- సమాధి గుణపాఠం నేర్చుకొనే స్థలమా లేక జాతర స్థలమా? [PDF] [5p]
- చావు ఇచ్చే సందేశం [PDF] [4p]
- అనుబంధం 1 – సమాధి జీవితం ఎలా ఉంటుంది? [PDF] [22p]
- మృతులు వినడం – దైవ గ్రంధం, ప్రవచనాల వెలుగులో [PDF] [8p]
- అమర వీరుల సమాధి జీవితం [PDF] [4p]
- దైవ ప్రవక్త ( సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సమాధి జీవితం [PDF] [9p]
- ఒక అపోహ – దైవ ప్రవక్త ( సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సమాధి జీవితం ప్రాపంచిక లాంటిదా? [PDF] [3p]
- సమాధిలో శిక్ష ఆత్మకా లేక శరీరానికా? [PDF] [1p]
- అనుబంధం 2 – సమాధి శిక్ష,బహుమానాలకు సంబంధించి కొన్ని హితభోదాత్మక సంఘటనలు [PDF] [10p]
1. దైవ ప్రవక్త ( సల్లల్లాహు అలైహి వసల్లం) కాలం నాటి సంఘటన 2. సమాధి తేలు 3. వంకర సమాధి 4. సమాధిలో పాములు, తేళ్లు, 5.సమాధి కంపనం 6.పాము …..పాము! 7. సమాధినుంచి సువాసన 8. శవం నుంచి సువాసన 9. సమాధిలో వెలుగు 10.శవం నుంచి సువాసన
అంశాల వారీగా హదీసులు
- మరణాన్ని గుర్తుచేసుకుంటూ ఉండటం అభిలషణీయం [PDF] [2p]
- చావు రావాలని కోరుకోరాదు [PDF] [2p]
- మరణ వేదన [PDF] [2p]
- మరణసమయంలో విశ్వాసికి లభించే సత్కారాలు [PDF] [10p]
- మరణ సమయంలో అవిశ్వాసి తిప్పలు [PDF] [6p]
- మృతుడు మాట్లాడటం, వినటం. [PDF] [2p]
- సమాధికి (ఖబ్ర్ కు) అర్థం [PDF] [1p]
- సమాధి బహుమానాలు తథ్యం [PDF] [2p]
- సమాధి యాతన తథ్యం [PDF] [3p]
- సమాధి శిక్ష – ఖుర్ఆన్ వెలుగులో [PDF] [2p]
- సమాధి శిక్ష తీవ్రత [PDF] [3p]
- ఘోరపాపాలు చేస్తే సమాధిలో శిక్ష ఖాయం [PDF] [1p]
- సమాధి దూతలు – ముంకిర్ నకీర్ [PDF] [2p]
- సమాధిలో ప్రశ్నోత్తరాల వేళ మృతుని పరిస్థితి! [PDF] [1p]
- సమాధిలో అనుగ్రహాలు – వాటి రకాలు [PDF] [13p]
- సమాధిలో శిక్షలు – వాటి రకాలు [PDF] [11p]
- విశ్వాసి మృత దేహాన్ని సమాధి ఒత్తటం [PDF] [1p]
- తౌహీద్ విశ్వాసం – ముంకిర్ నకీర్ల ప్రశ్నలు [PDF] [3p]
- సత్కార్యాలు సమాధి శిక్షను ఎదుర్కోనే డాలు వంటివి! [PDF] [2p]
- సమాధి ఉపద్రవం నుంచి సురక్షితంగా ఉండేవారు [PDF] [3p]
- సమాధుల్లో శరీరాలు ఏ స్థితిలో ఉంటాయి? [PDF] [3p]
- ఆత్మ దేహాన్ని వీడిన తర్వాత ఎక్కడ ఉంటుంది? [PDF] [3p]
- ఆత్మలు ప్రపంచానికి తిరిగి రావటం సాధ్యమేనా? [PDF] [2p]
- సలఫె సాలిహీన్ దృష్టిలో సమాధి యాతన [PDF] [7p]
- సమాధి శిక్ష నుంచి శరణు వేడే దుఆలు [PDF] [2p]
- సమాధుల్లో ఉన్నవారి కొరకు మన్నింపు ప్రార్ధన [PDF] [2p]
- ఇతరత్రా విషయాలు [PDF] [5p]
- రబ్బిగ్ ఫిర్ వర్హమ్ [PDF] [3p]
[పూర్తి పుస్తకం టెక్స్ట్ క్రింద చదవండి]
సోదరులారా! ఇలాంటి స్థలం (సమాధి) కోసం సన్నాహాలు చేసుకోండి!
పచ్చని ప్రపంచంలో భోగభాగ్యాలతో కూడిన జీవితం గడుపుతున్నవారలారా! తియ్యటి, మధురమైన ప్రపంచపు సుఖాలు అనుభవిస్తున్నవారలారా! రంగురంగుల మనోహర ప్రపంచపు ఎండమావుల్లో తచ్చాడుతున్నవారలారా! అందమైన ప్రపంచ అందచందాల ఆహూతుల్లారా! శాశ్వతలోకాన్ని విడిచిపెట్టి క్షణభంగుర లోకం కోసం వెంపర్లాడుతున్న వారలారా!
అతిత్వరలోనే మనం ఓ దుర్భేద్యమైన కనుము… మరణం… గుండా వెళ్ళి ఒక సుదీర్ఘమైన అత్యంత ప్రమాదకరమైన లోయ గుండా ప్రయాణించబోతున్నాం. ఈ ప్రమాదకరలోయలో రేచీకటి లాంటి అంధకారం ఉంటుంది. సూర్య కిరణాలు ఉండవు, చంద్రుని వెన్నెల ఉండదు, నక్షత్రాల కాంతి ఉండదు, దీపాల వెలుతురూ ఉండదు, ఆఖరికి మిణుగురు పురుగుల మిణుకు కూడా కనిపించదు.
ఈ ప్రమాదకరలోయ భయంకర అడవిలాగా నిర్మానుష్యంగా ఉంటుంది.
అక్కడ తల్లిదండ్రులు ఉండరు, భార్యాపిల్లలూ ఉండరు, దుఃఖాల్లో పాలుపంచుకునేవాడు, దుఃఖాన్ని ఓదార్చేవాడు ఎవడూ ఉండడు. పీర్లు, ముర్షిద్లు ఉండరు. ఆపదలు తొలగించేవాడు, అవసరాలు తీర్చేవాడు, అంగరక్షకులు, బాడీగార్డులు ఎవరూ ఉండరు. పార్టీలు, పార్టీ నాయకులూ ఉండరు. అధ్యక్షత, మంత్రిత్వం లాంటి ఉన్నత పదవుల పలుకుబడులూ ఉండవు. సెనెట్, అసెంబ్లీల డాబు దర్పాలూ ఉండవు, కోర్టు బోనుల కోలాహలం ఉండదు. పోలీసు పదవీ పందేరాల గర్వమూ ఉండదు. సైనిక సత్కారాలు, నక్షత్రాల వైభవాలూ ఉండవు. ప్రభుత్వ ఉన్నత పదవుల హంగామా ఉండదు. విశాల జాగీరుల ప్రభుత్వం ఉండదు. కబ్జాదారుల ఆక్రమణ హస్తాలు ఉండవు. కిరాయి హంతకుల ఉగ్రవాద చర్యలు ఉండవు. రికమండేషను చేయటానికి బాబాయి మామయ్యలు ఉండరు. లంచం ఇవ్వటానికి అధర్మ సొమ్ము చెలామణి ఉండదు.
ఈ ప్రమాదకర లోయలో భయంకర కూరమృగాల భయం ఉంటుంది. మట్టి ఇల్లు, మట్టి పాన్పు, మట్టి పడక ఉంటాయి. భయాందోళనలు కలుగుతుంటాయి. పురుగులు పాములు ఉంటాయి. విషయపూరితమైన సర్పాలు, తేళ్లు ఉంటాయి. గుడ్డి, చెవిటి దూతలు గదలతో నించొని ఉంటారు. అక్కడి నుంచి పారిపోవటానికీ అవకాశం ఉండదు. నిలకడగా నించోవటానికీ వీలు పడదు!
అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను విశ్వసించిన వారలారా!
శుభవార్తాహరుడుగా, హెచ్చరికలు చేసేవాడిగా పంపబడిన దైవప్రవక్త… ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి మాట కాస్త జాగ్రత్తగా వినండి!
నేను సమాధికంటే తీవ్ర భయాందోళనకరమైన చోటు మరొకటి చూడలేదు.” ” (తిర్మిజీ)
ఓ బుద్దీ జ్ఞానాలు కలవారలారా! మనోమస్తిష్కాలు కలవారలారా!
ఒంటరితనం, అంధ కారం, ప్రమాదకరమైన నిర్మానుష్య లోయలోకి అడుగుపెట్టబోతున్న వారలారా!
వినండి! నిరాధార, నిస్సహాయ ప్రమాదకర ఈ లోయ ప్రయాణంలో విశ్వాసం మరియు సత్కర్మలు.. నమాజ్, జకాత్, ఉపవాసాలు, హజ్, ఉమ్రా, ఖుర్ఆన్ పారాయణం, దుఆలు సంకీర్తనలు, దానధర్మాలు, నఫిల్ సత్కార్యాలు, తల్లిదండ్రులపట్ల విధేయత, బంధువులతో సత్సంబంధాలు, అనాథులు, వితంతువుల పట్ల సత్ప్రవర్తన, న్యాయం ధర్మం, మంచిని గురించి ప్రబోధించటం, చెడుల నుంచి నిరోధించటం మొదలగు సత్కర్మలే ప్రయాణ సామగ్రి. ఇవి భయాందోళనలూ దూరం చేస్తాయి, వెలుతురునూ ప్రసాదిస్తాయి. ఇవి చేసుకుంటే ఒంటరితనమూ ఉండదు. ప్రాణానికి హాయిగానూ ఉంటుంది.
కనుక ప్రమాదకర లోయ ప్రయాణీకుల్లారా!
బయలుదేరేముందు మానవ మహోపకారి, పరమ దయామయుడు, అతి గొప్ప శ్రేయోభిలాషి, అందరికంటే పెద్ద సానుభూతిపరుడు, అయిన కారుణ్య ప్రవక్త హితవును ఒకసారి శ్రద్ధగా వినండి….!
ఒకసారి ఆయన ఈ ప్రమాదకర లోయ అంచున కూర్చొని విలపించసాగారు. ఆయన కన్నీటితో సమాధి మట్టి సయితం తడిచిపోయింది. ఆ సందర్భంలో ఆయన తన అనుచరులను ఉద్దేశ్యించి ఇలా అన్నారు:
సోదరులారా! ఇలాంటి ప్రదేశం (సమాధి) కోసం సన్నాహాలు చేసుకోండి (ఇబ్నెమాజా). మరి మనలో కారుణ్య ప్రవక్త మాట విని…..
ఈ అపాయకరమైన లోయ గుండా ప్రయాణించటం కోసం సన్నాహాలు చేసుకునేవారెవరండీ?!
వసల్లల్లాహు అలా నబియ్యినా ముహమ్మదిం వ్వ ఆలిహీ వ సహబిహీ అజ్మయీన్.
బిస్మిల్లా హిర్రహ్మానిర్రహీమ్
అల్హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ వల్’ ఆఖిబతు లిలమ్ముత్తఖీన్ అమ్మాబాద్!
మనోహరమైన, సుఖసౌఖ్యాలతో కూడుకున్న ఈ మూన్నాళ్ల జీవితపు ముచ్చట తీరిన తర్వాత-రాబోయే దశలు అత్యంత కఠినంగా, బాధాకరంగా, వ్యధాభరితంగా ఉంటాయి. అన్నిటికంటే మొదటిదశ చావు. ప్రాణమున్న ప్రతి జీవి చావు గుటక వేయవలసిందే. ప్రాణమున్న ప్రతిజీవి మృత్యువును చవి చూడవలసిందేనని అల్లాహ్ సెలవిస్తున్నాడు. (ఆలి ఇమ్రాన్:185) వేరొక చోట ఆయన ఇలా అన్నాడు: “అల్లాహ్ ఉనికి తప్ప ప్రతిదీ నశించిపోయేదే”. (అల్ ఖసస్:88)
మరణించిన తర్వాత ఎవరూ తిరిగిరారు. కనుక మృత్యువు సంభవించేటప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో ఖచ్చితంగా చెప్పలేము. కాని చావు తీవ్రతను గురించి, దాని దుర్భరస్థితి గురించి ఖుర్ఆన్ హదీసుల్లో చెప్పబడిన విషయాలను బట్టి చూస్తే ప్రపంచ జీవితంలో ఎదురయ్యే కష్టాలు, కడగండ్లు, ఆపదలు, బాధలు, దుఃఖవిచారాలన్నిటిని కలిపితే ఎంత నొప్పి అవుతుందో చావు సంభవించినప్పుడు అంతకన్నా ఎక్కువ నొప్పి కలుగుతుందని తెలుస్తోంది.
ఖాఫ్ సూరాలో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“మరణవేదన సత్యంతో వచ్చేసింది” (సూరా ఖాఫ్: 19వ సూక్తి).
ఇక్కడ సత్యమంటే సమాధి జీవితానికి సంబంధించిన వాస్తవాలు, నిజాలు. (మరణానంతరం) మనిషికి దైవదూతలు కనిపిస్తారు. తాను శిక్షకు గురికానున్నాడో లేక పుణ్యఫలం అనుభవించ నున్నాడో అతనికి నమ్మకంగా తెలిసిపోతుంది.
చావు తీవ్రతను, దాని దుర్భర స్థితిని ప్రస్తావిస్తూ ఖియామా సూరాలో అల్లాహ్ ఇలా అంటున్నాడు:
ప్రాణం గొంతులోకి వచ్చినప్పుడు, “మంత్రించి ఊదే వారెవరయినా ఉన్నారా?” అని అడుగుతారు. అప్పుడు మనిషి అది ప్రపంచం నుండి వేరైపోయే సమయమని తెలుసు కుంటాడు. అప్పుడు ఒక కాలు మరొక కాలుతో కలిసిపోతుంది. (సూరా ఖియామా: 26 -29)
ఒక కాలు మరొక కాలుతో కలవటమంటే చావు వచ్చినప్పుడు పుంఖాను పుంఖాలుగా బాధలు వస్తుంటాయి. (ఆ బాధకు తాళలేక మనిషి ఒక కాలుతో మరొక కాలికి రాపిడి చేసుకుంటాడు). అప్పుడు గాని ప్రాణం దేహం నుంచి బయటికి రాదు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “మృత్యువు బాధ చాలా తీవ్రంగా ఉంటుంది” అని చెప్పారు. (అహ్మద్)
వేరొక హదీసులో ఆయన ఇలా ప్రబోధించారు: “జీవన మాధుర్యాన్ని మరిపించే చావుని అత్యధికంగా గుర్తు చేసుకుంటూ ఉండండి” (తిర్మిజీ, నసాయి, ఇబ్నెమాజా)
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణవ్యాధికి గురైనప్పుడు ఎంత కలవరపడిపోయారో చూడండి. ఆయన దగ్గర ఒక నీళ్ల పాత్ర ఉండేది. అందులో ఆయన మాటిమాటికీ చేతులు ముంచేవారు. తడిచేతులతో ముఖం తుడుచుకుంటూ ఉండేవారు. కాసేపు ముఖం మీద దుప్పటి కప్పుకునేవారు. తర్వాత ఒక్కసారిగా దుప్పటి తీసి చూసేవారు. మృత్యువు బాధ తీవ్రమై నిస్పృహ ఆవహించినప్పుడు మొహం మీది చెమట తుడుచుకుంటూ “సుబహానల్లాహ్! ఇన్న లిల్ మౌతి లసకరాతిన్” (సుబహానల్లాహ్ ! చావు నొప్పులు చాలా తీవ్రంగా ఉన్నాయి)” అని అనేవారు (బుఖారీ).
“దైవప్రవక్త మరణబాధ అనుభవిస్తుండగా కళ్లారా చూసిన నేను ఇంకెవరి మరణబాధనూ తప్పుగా భావించను” అని ఆయిషా (రదియల్లాహు అన్హా) అభిప్రాయపడ్డారు (బుఖారీ).
జీవితపు చరమ గడియల్లో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాటల్లో నత్తి కూడా వచ్చింది (ఇబ్నెమాజా). ఈజిప్ట్ విజేత అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) తాను బతికి ఉన్నప్పుడు “మరణించే సమయంలో స్పృహ, తెలివి ఉండి కూడా మరణ పరిస్థితిని వివరించనివారిని చూస్తే నాకు ఆశ్చర్యమేస్తుంది” అని తరచూ అంటుండేవారు. కాని ఆ తర్వాత తనే మృత్యువు దరికి చేరుకున్నప్పుడు అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఆయనకు ఆయన అన్న మాట గుర్తుచేశారు. అప్పుడు అమ్ర్ (రదియల్లాహు అన్హు) ఓ వేడి నిట్టూర్పు విడిచి ఇలా చెప్పనారంభించారు: “మరణబాధ వర్ణించరానిది. ఒక విషయం మాత్రం చెప్పగలను. ఇప్పుడు నాకు ఆకాశం విరిగి భూమిమీద పడినట్టు, నేను వాటిమధ్య నలిగిపోతున్నట్టు అనిపిస్తోంది. నా మెడమీద పెద్ద పర్వతం ఉన్నట్లుంది. కడుపులో ఖర్జూరపు ముళ్లు నింపినట్లుంది. శ్వాస సూదిరంధ్రం గుండా పోతుందా అన్నంత కఠినంగా ఉంది నా పరిస్థితి”.
హజ్రత్ షద్దాద్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: “మృత్యువు గడియ ప్రపంచం, పరలోకంలోని బాధలన్నిటికంటే తీవ్రంగా ఉంటుంది. అది రంపపు కోతల కన్నా బాధాకరంగా, కత్తెరల కత్తిరింపుల కన్నా నొప్పిగా, కుండల ఉడుకుదనం కన్నా తీవ్రంగా ఉంటుంది. మరణించినవాడు గనక ఒకసారి బ్రతికి మరణబాధ ఎలా ఉంటుందో ప్రజలకు వివరిస్తే ఇక వారికి సుఖం ఉండదు, నిద్రా ఉండదు.”
హజ్రత్ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ (రహిమహుల్లాహ్ ) ఈ విధంగా ప్రార్థించేవారు: “అల్లాహుమ్మ హవ్విన్ అలయ్యల్ మౌత్” (ఓ అల్లాహ్! నా మరణబాధలోని తీవ్రతను తగ్గించు).
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విశ్వాసికి, అవిశ్వాసికి వేర్వేరు మరణ పరిస్థితులు వివరించారు. దాని సారాంశం ఇది:
విశ్వాసికి మరణ సమయం ఆసన్నమైనప్పుడు సూర్యతేజస్సులాంటి మొహాలు కలిగిన దైవదూతలు అతని శవవస్త్రం (కఫన్) కోసం తమ వెంట స్వర్గం నుంచి పరిమళం గుభాళిస్తూ ఉండే శ్వేతపట్టు వస్త్రం తీసుకొని వస్తారు. వచ్చి ఆ విశ్వాసికి “అస్సలాము అలైకుమ్” అని సలాం చెబుతారు. మృత్యుదూత ప్రాణం తీసేముందు “ఓ పవిత్రాత్మా! సంతోషించు, నీకు అల్లాహ్ కారుణ్యాలు లభిస్తాయి. స్వర్గానుగ్రహాలు ప్రాప్తిస్తాయి” అని శుభవార్త చెబుతాడు. ఆ శుభవార్త వినగానే విశ్వాసికి మనసులో అల్లాహ్ వద్దకు వెళ్ళాలని తీవ్రవాంఛ కలుగుతుంది. దాంతో విశ్వాసి ప్రాణం కూజ నుంచి మూత తీయగానే నీళ్లు బయటికి వచ్చినట్టు బయటికి వస్తుంది. దైవదూతలు ఆత్మను బయటికి తీసిన తర్వాత దాన్ని సువాసనలు గుభాళిస్తున్న తెల్లని పట్టువస్త్రంలో చుట్టుకొని ఆకాశంవైపు తీసుకువెళ్తారు. ఆ సమయంలో విశ్వాసి ఆత్మ నుంచి కస్తూరి లాంటి సువాసన వస్తూ ఉంటుంది. అది ఎంత ఘాటుగా ఉంటుందంటే ఆకాశంలో ఉండే దైవదూతలు ఆ వాసన చూసి “ఏ విశ్వాసి ఆత్మో పైకి వస్తోంది” అని చెప్పుకుంటారు.
దైవదూతలు ఆకాశపు ద్వారం తడతారు. లోపలినుంచి మొదటి ఆకాశపు దూతలు “ఈ పవిత్ర ఆత్మ ఎవరు? అని అడుగుతారు. దానికి దైవదూతలు సమాధానంగా “ఇతను ఫలానా ఫలానా అతని కుమారుడు” అని చెబుతారు. ఆకాశదూతలు ద్వారం తెరుస్తారు. అతనికి స్వాగతాలు చెబుతారు. ఆ పవిత్ర ఆత్మకు అల్లాహ్ కరుణాకటాక్షాలు లభిస్తాయనే శుభవార్తను అందజేస్తారు. దైవదూతలు దాన్ని రెండవ ఆకాశానికి తీసుకువెళ్తారు. మొదటి ఆకాశ దూతలు ఆ విశ్వాసి గౌరవార్ధం వారిని రెండో ఆకాశం వరకూ సాగనంపుతారు. రెండో ఆకాశంమీద కూడా ఆ విశ్వాసి ఆత్మకు మొదటి ఆకాశంలోలాగానే ఘనస్వాగతాలు పలకడం జరుగుతుంది. తర్వాత మూడు, నాలుగు ఈ విధంగా ఆత్మ ఏడో ఆకాశానికి చేరుకుంటుంది. అక్కడికి చేరుకున్న తర్వాత “నా ఈ దాసుని పేరు ఇల్లియ్యీన్ (ఉన్నతస్థాయి వ్యక్తుల జాబితా)లో రాయమ’ని దైవాజ్ఞ అవుతుంది. ఆ తర్వాత అతని ఆత్మను కొన్ని ప్రశ్నలు అడగటం కోసం తిరిగి దేహంలోకి ప్రవేశింపజేయటం జరుగుతుంది.
సమాధిలోకి వచ్చే దూతలను ముంకిర్, నకీర్ అంటారు. వారి మొహాలు నల్లగా ఉంటాయి. నీలంరంగు మెరిసేటి పెద్దకళ్లు ఉంటాయి. పళ్లు ఆవు కొమ్ముల్లా పెద్దగా ఉంటాయి. గొంతు పిడుగులా గర్జిస్తూ ఉంటుంది. వారు దంతాలతో నేలను చీలుస్తూ దగ్గరికి వచ్చి అత్యంత కఠోర శబ్దంతో అడుగుతారు, “మర్రబ్బుక… నీ ప్రభువు ఎవరు? మన్నబియ్యుక….. నీ ప్రవక్త ఎవరు? మా దీనుక… నీ ధర్మం ఏది?” అని.
సమాధి చీకటి, అందులోనూ ఒంటరితనం, ముంకిర్ నకీర్ల భయంకర మొహాలు ఇవన్నీ చూసినప్పటికీ విశ్వాసికి ఎలాంటి భయాందోళనలూ కలగవు. అతను ఎంతో ప్రశాంతంగా మంకిర్ నకీర్ల ప్రశ్నలకు సమాధానం చెబుతాడు. విశ్వాసుల్లో కొందరికి ప్రశ్నల సమయంలో సూర్యుడు అస్తమించబోతున్నట్టు చూపించటం జరుగుతుంది. అది చూసి విశ్వాసి దైవదూతల ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి సున్నితంగా నిరాకరిస్తూ “కాస్త ఆగండి. ముందు నన్ను అస్ర్ నమాజ్ చేసుకోనివ్వండి. ఆ తర్వాత నేను మీ ప్రశ్నలకు సమాధానం చెబుతాను” అంటాడు. కాని ఆ తర్వాత అది నమాజ్ చేసే స్థలం కాదని తెలియగానే ముంకిర్, నకీర్ల ప్రశ్నలకు సమాధానం చెబుతాడు.
ఈ ప్రశ్నలు-సమాధానాల తంతు ముగిసిన తర్వాత నరకం వైపు ఒక రంధ్రం చేసి దానివైపు చూపిస్తూ “ఇది అగ్ని. అల్లాహ్ తన కరుణాకటాక్షాలతో నిన్ను దీన్నుంచి కాపాడాడు”అని చెప్పటం జరుగుతుంది. ఆ తర్వాత స్వర్గంవైపు ఒక రంధ్రం చేయబడుతుంది లేక ఒక స్వర్గద్వారం తెరువబడుతుంది. విశ్వాసి దాని గుండా స్వర్గవరాలను తిలకించి ఆనందిస్తాడు. అప్పుడు విశ్వాసికి స్వర్గంలో తనకు లభించబోయే ఇల్లు కూడా చూపించబడుతుంది. అతని సమాధి డెబ్భై గజాల వరకు (లేక కనుచూపు మేరకు) విశాలమవుతుంది. అందులో పౌర్ణమి నాటి పండువెన్నెల కాస్తుంది. అతనికి పరిమళభరిత స్వర్గదుస్తులు తొడిగించటం జరుగుతుంది. సుగంధభరిత, సుఖవంతమైన, మృదువుగా మెత్తగా ఉండే స్వర్గపడక అతని కోసం ఏర్పాటు చేయబడుతుంది. ఆ తర్వాత సమాధిలో అతని దగ్గరికి అందమైన ముఖారవిందంతో, పరిమళభరిత దుస్తులు ధరించి ఉన్న వ్యక్తి ఒకడు వస్తాడు. విశ్వాసి అతన్ని “ఎవరు నువ్వు”? అని అడుగుతాడు. దానికతను “నేను నీ సదాచరణను, పరలోక జీవితంలో నీకు సుఖాలు, బహుమానాల శుభవార్త అందజేయటానికి వచ్చాను” అని చెబుతాడు. అప్పుడు విశ్వాసి “ఓ నా ప్రభూ! ప్రళయం తొందరగా రానీ, నేను నా ఇంటివారిని కలవాలి” అని కోరుకుంటాడు. మరికొన్ని హదీసుల్లో ఈ విధంగా కూడా ఉంది. విశ్వాసి ‘నేను నా ఇంటివారి దగ్గరికి. వెళ్లాలనుకుంటున్నాను. నాకు కలిగిన ఈ శుభపరిణామం గురించి వారికి తెలియజేయాలి’ అని అంటాడు. దానికి సమాధానంగా దైవదూతలు “(ఇప్పుడు ఇక్కణ్ణుంచి తిరిగి వెళ్ళటానికి వీల్లేదు) కనుక నీవు ఒక నూతన వధువులాగా హాయిగా నిదురపో” అని అంటారు. ఆ తర్వాత విశ్వాసి పడుకుంటాడు. చివరికి ప్రళయదినాన అల్లాహ్ అతన్ని అతని సమాధి నుంచి లేపుతాడు. ఇక్కణ్ణుంచి పరలోక జీవితానికి సంబంధించిన రెండవ దశ మొదలవుతుంది. దాని వివరాలు ఇన్షా అల్లాహ్ తర్వాతి పుస్తకంలో ఇవ్వబడతాయి.
అవిశ్వాసికి మరణగడియలు సమీపించినప్పుడు అతని ఆత్మను తీసుకెళ్ళటానికి అత్యంత భయంకరమైన నల్లటి మొహాలు కలిగి ఉండే దైవదూతలు అతని శవ వస్త్రం (కఫన్) కోసం దుర్గంధభరిత గోనెసంచి తీసుకొనివస్తారు. వచ్చీరాగానే “ఓ నీచాత్మా! దైవాగ్రహానికి పాత్రమైన ఆత్మా! దైవాగ్రహానికి పాత్రమైన ఆత్మా!” అని పిలుస్తారు. దైవాగ్రహం, నరక శిక్షల ‘శుభవార్తలు’ దానికి అందజేస్తారు. అవిశ్వాసి ఆత్మ భయాందోళనల వల్ల దేహం నుంచి త్వరగా బయటికి రాదు. అప్పుడు దైవదూతలు పచ్చిగా ఉన్న ఉన్నిలో నుంచి ముళ్లున్న ఇనుప కమ్మీని బలవంతంగా లాగినట్టు దాన్ని బలవంతంగా లాగి బయటికి తీస్తారు. దివ్యఖుర్ఆన్లో ఆ స్థితిని ఈ మాటల్లో వివరించటం జరిగింది. “(అవిశ్వాసుల ప్రాణాన్ని) మునిగి లాగితీసే దైవదూతల సాక్షిగా’ ‘! (నాజిఆత్ సూరా, 1 వ ఆయత్) అంటే అది బయటికి రానని మొండికేస్తుంది. అప్పుడు దైవదూతలు దాన్ని బలవంతంగా బయటికి తీస్తారు. మరో చోట అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
ఈ దుర్మార్గులు మరణవేదనలో మునిగి తేలుతూ ఉండగా, దైవదూతలు తమ హస్తాలను చాచి “ఇటు తెండి! బయటికి తీయండి మీ ప్రాణాలను, అల్లాహ్ పై అపనిందను మోపి అన్యాయంగా కూసిన కూతలకూ, ఆయన ఆయతుల పట్ల తలబిరుసుతనం ప్రదర్శించినందుకూ ఫలితంగా ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది” అని అంటూ ఉండగా ఆ దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుండు! (అన్ఆమ్ సూరా, 93వ సూక్తి)
ఆ సమయంలో అవిశ్వాసి ఆత్మ నుంచి కుళ్లి కృశించిపోయిన మృతకళేబరం నుంచి ఎంతటి అసహ్యకరమైన వాసన వస్తుందో అంతటి దుర్గంధం వస్తుంది. దైవదూతలు దాన్ని ఆకాశం వైపు తీసుకెళ్తున్నప్పుడు ఆకాశదూతలు దూరం నుంచే దాని దుర్వాసన చూసి “ఏదో పాడు ఆత్మ ఆకాశం వైపు తీసుకురాబడుతున్నట్లుంది” అని అనుకుంటారు. మృత్యుదూతలు ఆ దుర్గంధ భరిత అవిశ్వాసి ఆత్మను తీసుకొని మొదటి ఆకాశానికి చేరుకొని ద్వారం తడతారు. లోపలినుంచి ద్వారపాలకులు “ఎవరి ఆత్మ అది”? అని అడుగుతారు. దానికి మృత్యుదూతలు “ఇతను ఫలానా. ఫలానా అతని కుమారుడు” అని చెబుతారు. అది విని ద్వారపాలక దూతలు “ఈ నీచదేహపు నీచాత్మకు మా దగ్గర ఎలాంటి గౌరవం లేదు. దీనికోసం ఆకాశద్వారాలు తెరువబడవు. దీనిని పరాభవం పాలుచేసి తిరిగి భూలోకానికే తీసుకువెళ్ళండి” అని అంటారు. దాంతో మృత్యుదూతలు అతని ఆత్మను మొదటి ఆకాశం దగ్గర్నుంచే భూమి మీదకు విసిరిపారేస్తారు. అటు అల్లాహ్ తరపునుంచి దాని పేరు సిజ్జీన్ (ఖైదీల పేర్ల జాబితా)లో రాయమని ఆజ్ఞ అవుతుంది.
ఆ తర్వాత అతని ఆత్మను ప్రశ్నలు అడగటం కోసం తిరిగి దేహంలోకి వదిలేయటం జరుగుతుంది.
సమాధిలో ముంకిర్, నకీర్ తన దగ్గరకు వచ్చినప్పుడు అవిశ్వాసి తీవ్రభయాందోళనకు గురౌతాడు. ముంకిర్ నకీర్లు “ముర్రబ్బుక? మన్నబియ్యుక? మా దీనుక?” అని అడుగుతారు. దానికి అవిశ్వాసి “హా, హా లా అద్రి, అయ్యో అయ్యో…. నాకు ఈ విషయాలేవీ తెలియవే!” అని వాపోతాడు. అదే కపట విశ్వాసి అయితే “ ప్రజలు ఏం చెబుతుండగా విన్నానో నేనూ అదే చెబుతున్నాను” అని అంటాడు. అవిశ్వాసి లేక కపటి ఈ జవాబు చెప్పిన తర్వాత ఒక స్వర్గద్వారం తెరిచి అతనికి స్వర్గవరాల చిరు దర్శనం చేయించి “ఇది స్వర్గం. నీ అవిశ్వాసం లేక నీ కపటరోగం మూలంగా అల్లాహ్ నీకు ఇది దక్కకుండా చేశాడు” అని చెప్పటం జరుగుతుంది. ఆ తర్వాత అతని కొరకు నరకం వైపు ఉండే ద్వారం ఒకటి తెరువబడుతుంది. దాని ద్వారానే అతనికి అగ్నిశిక్ష విధించబడుతుంది. నరకంలో తన నివాసం కూడా అతనికి చూపెట్టబడుతుంది. అప్పుడు అతనికి అగ్నివస్త్రాలు తొడిగించమని, అతని కోసం అగ్ని పడక సిద్దం చేయమని అల్లాహ్ తరపునుంచి ఆజ్ఞ అవుతుంది. అతన్ని శిక్షించటం కోసం అంధులు, మూగలైన దూతలు నియుక్తులవుతారు. వారు అతన్ని గదలతో చితకబాదుతూ ఉంటారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెప్పారు: ఆ గద ఎంత బరువుగా ఉంటుందంటే దాంతో కొండను కొడితే కొండ కూడా తుక్కుతుక్కు అయిపోతుంది. అంతేకాదు ఆ అవిశ్వాసి మీదకు తొంభై తొమ్మిది సర్పాలు వదలటం జరుగుతుంది. అవి అతన్ని ప్రళయం వరకూ కాటేస్తూ ఉంటాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: సమాధి సర్పం ఎంత విషపూరితంగా ఉంటుందంటే, అది నేలమీద ఒకసారి ఊదితే చాలు ఇక అక్కడ మొక్క అనేది మొలకెత్తదు. ఈ శిక్షలతోపాటు ఇంకో శిక్ష కూడా అవిశ్వానికి ఇవ్వబడుతుంది. అదేమిటంటే, సమాధిగోడలు మాటిమాటికీ బిగుసుకుపోతుంటాయి. దానిమూలంగా అతని పక్కటెముకలు ఒకదానిలోకి ఒకటి చొచ్చుకుపోతాయి. అవిశ్వాసికి ఈ శిక్షలన్నీ ప్రళయం వరకూ ఇవ్వబడుతూ ఉంటాయి.
సమాధిలో అవిశ్వాసి దగ్గరికి తీవ్రభయంకరమైన, దుర్గంధభరితమైన మహాకురూపి ఒకడు వస్తాడు. అతన్ని చూడగానే అవిశ్వాసి భయంతో “ఎవర్నువ్వు?” అని అడుగుతాడు. దానికి ఆ కురూపి “నేను నీ కర్మను. నీకు చెడు పరిణామ వార్త అందజేయటానికి వచ్చాను” అంటాడు. దాంతో అవిశ్వాసి భయపడి ‘ఓ నా ప్రభూ! ప్రళయాన్ని రానీయకు’ అని వేడుకుంటాడు. ఈ విధంగా అవిశ్వాసి మృత్యు గడియ నుంచే దైవశిక్షకు గురయి ప్రళయం వరకూ నిరంతరాయంగా ఇలాంటి శిక్షలు అనుభవిస్తూ ఉంటాడు. అల్లాహ్ తన కృపతో అనుగ్రహంతో ప్రతి ముస్లింని సమాధి శిక్ష నుంచి కాపాడుగాక! (ఆమీన్)
ఈ ప్రశ్న-సమాధానాల తంతు ముగిసిన తర్వాత విశ్వాసి ఆత్మను ‘ఇల్లియ్యీన్’లో ఉంచటం జరుగుతుంది. పోతే అవిశ్వాసులు, కపటులు, బహుదైవారాధకుల ఆత్మలు ‘సిజ్జీన్’లో బంధించబడతాయి. ఇక్కడ ఒక విషయం గమనార్హం. విశ్వాసుల పేర్లు నమోదు చేయబడే గ్రంథాన్ని (రిజిష్టరును), విశ్వాసుల ఆత్మలు ప్రళయం వరకూ ఉంచబడే స్థలాన్ని-రెండిటినీ ఇల్లియ్యీన్ అనే పిలుస్తారు. అలాగే అవిశ్వాసులు, బహుదైవారాధకుల పేర్లు నమోదు చేయబడే పుస్తకానికి, వారి ఆత్మలు ప్రళయం వరకూ బంధించబడే ప్రదేశానికి రెండిటికీ సిజీన్ అనే పేరు! వాస్తవం అల్లాహ్ బాగా తెలుసు.
ఇదండీ! దుర్బేధ్య కనుమ లాంటి సమాధి గాథ! దీని గురించే దైవప్రవక్త సల్లం “నేను సమాధికంటే దుర్భరమైన, ఆందోళనకరమైన స్థలం మరొకటి చూడలేదు” అని అన్నారు (తిర్మిజీ). ఈ సమాధి యాతన బారినుంచి శరణు వేడుకోమనే ఆయన తన అనుచరులకు ఉద్బోధించారు (అహ్మద్).
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు సమాధి ఉపద్రవం నుంచి శరణు వేడే ప్రార్థన ఖుర్ఆన్ సూక్తులు నేర్పించినట్లు నేర్పించారు” (నసాయి).
ఒకసారి ఆయన ఉపన్యాసమిస్తూ తన అనుచరులను అప్రమత్తం చేయటానికి వారితో “మీరు సమాధుల్లో దజ్జాల్ ఉపద్రవం ద్వారా పరీక్షించబడినట్లు పరీక్షించబడతారు” అని అన్నారు. ఆ మాట వినగానే అనుచరులు భయంతో అశ్రువులు ధారలై ప్రవహించేలా ఏడ్చారు, (నసాయి).
విశ్వాసుల నాయకులు హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) తనకు సమాధి విషయం గుర్తుకొస్తే కన్నీళ్లతో గడ్డం తడిచిపోయేలా ఏడ్చేవారు. పైగా ఇలా అనేవారు: “పరలోక జీవితంలో సమాధి మొదటి దశ. సమాధిలో ముక్తి పొందినవాడికి తర్వాతి దశలు కూడా సులభమయిపోతాయి. ఈ దశలో ముక్తి లభించనివాడికి మిగతా దశలు దీనికంటే దుర్భరంగా ఉంటాయి”. (తిర్మిజీ)
హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) సమాధిని, పరలోక జీవితాన్ని గుర్తుకు తెచ్చుకొని ఎంతగా విలపించేవారంటే, ఆ విధంగా విలపిస్తూ విలపిస్తూ ఆయన మొహం మీద రెండు చారలు ఏర్పడ్డాయి (బైహఖీ).
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మృత్యువు మరియు సమాధి గురించి ఉపన్యాసం ఇస్తుండగా అబూజర్ గిఫారీ (రదియల్లాహు అన్హు) విని “అయ్యో! నేను చెట్టునయివుంటే బాగుండేది, ఎవరి చేతనయినా కోయబడేవాడిని” అనుకున్నారు (ఇబ్నెమాజా).
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) తనకు మరణగడియ ఆసన్నమయినప్పుడు ఏడ్వటం మొదలుపెట్టారు, ప్రజలు చూసి “అబూహురైరా! ప్రపంచాన్ని వదలిపెట్టి వెళ్ళాల్సి వస్తున్నందుకు ఏడుస్తున్నావా?” అని అడిగారు. అందుకాయన “కాదు, ప్రయాణం చూస్తే బహు సుదీర్ఘమైనది. నా దగ్గరేమో సామాగ్రి కొంతే ఉంది. అందుకని ఏడుస్తున్నాను. నా పరిస్థితి ఎలాగుందంటే నేనొక ఎత్తయిన గుట్ట మీద నించున్నాను. దాని ముందు స్వర్గమైనా ఉంటుంది లేక నరకమైనా ఉంటుంది. వాటిలో నా గమ్యస్థానం ఏదో నాకు తెలియదు” అని విచారం వ్యక్తం చేశారు. (కితాబుజ్జుహద్)
హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) మృత్యువును, సమాధిని తలచుకొని ఎంతగా భయపడిపోయేవారంటే, దాన్ని మనం ఆయనగారి ఈ వేడుకోలు కవిత ద్వారా అంచనా వేసుకోవచ్చు.
“ఓ అల్లాహ్ ! నా పరిస్థితి ఎలా ఉంటుందో? నా దగ్గర మంచి కర్మ ఒక్కటి కూడా లేదు. దుష్కర్మలు చాలా ఉన్నాయి. విధేయతా సామాగ్రి కూడా తక్కువ ఉంది” అని, దాని సారాంశం.
భయంకరమైన సమాధి కనుమను తలచుకొని మన పూర్వీకులు ఎంతగా భయపడిపోయేవారో ఈ రోజు మనం దాని గురించి అంతగా నిర్భయులైపోయాం. నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రపంచపు రంగుల హరివిల్లుకు ఎంతగా మంత్రముగ్ధులయి పోయామంటే, దాని తళుకుబెళుకులకు ఎంతగా తన్మయులై పోయామంటే ఎప్పుడయినా పొరపాటున కూడా మనకు సమాధి గుర్తుకురాదు. మన ఈ అజాగ్రత్తకు, నిర్లక్ష్యానికి, ఏమరుపాటుకు ఖుర్ఆన్ చేసిన తీర్మానం సరిగ్గా ఆనుతుంది.
“మానవుల లెక్కల సమయం సమీపించింది. అయినా వారు ఏమరుపాటులో పడి విముఖులై ఉన్నారు”. (అంబియా సూరా: 1)
అల్లాహ్ తన కరుణాకటాక్షాలతో మన పరిస్థితి మీద దయచూపుగాక! చనిపోకముందే దుర్భేధ్యమైన సమాధి కనుమ గుండా ప్రయాణించటానికి ఏమైనా సన్నాహాలు చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించు గాక! (ఆమీన్).
సమాధిలో మూడు ప్రశ్నలు
సమాధిలో ముంకిర్, నకీర్ దూతలు మూడు ప్రశ్నలు వేస్తారు. అవి (1) మర్రబ్బుక – నీ ప్రభువు ఎవరు? 2) మన్నబియ్యుక – నీ ప్రవక్త ఎవరు? (3) మా దీనుక. – నీ ధర్మం ఏది?
నీ పైకి ఈ మూడు ప్రశ్నల సమాధానం చాలా చిన్నదిగా, సులభమైనదిగా అనిపిస్తుంది, అంటే నాప్రభువు అల్లాహ్, నా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) , నా ధర్మం ఇస్లాం. కాని వాస్తవానికి ఈ మూడు ప్రశ్నలు ఎంత సమగ్రమైనవంటే మనిషి జీవితంలోని కర్మలన్నిటి సారాంశమంతా ఈ మూడు ప్రశ్నల సమాధానానికి అనుగుణంగా జీవితం గడిపిన వ్యక్తి మాత్రమే వాటికి సమాధానం చెప్పగలడు. ఉన్నత విద్యార్హతలు, ఉత్తమ బుద్ధివివేచనాలు ఆ రోజు మనిషికి ఎందుకూ పనికిరావు.
నాన్నగారు హాఫిజ్ ఇద్రీస్ కైలానీ (రహిమహుల్లాహ్) ఒక సంఘటన చెబుతూ ఉండేవారు: 1930-40 దశాబ్దం నాటి మాట. గుజ్రాన్వాలాలోని జామియా ముహమ్మదియాలో నేను విద్యాభ్యాసం చేస్తున్నాను. కీల్యాన్వాలా ఊరు నుండి గుజ్రాన్వాలా పట్టణానికి వెళ్ళేదారిలో గూంద్లన్వాలా అనే ప్రాంతముంది. అక్కడ ఒకతను గుర్రాలకోసం గడ్డి అమ్ముతుండేవాడు. మేము అటునుంచి వెళ్ళినప్పుడల్లా అతను “రెండు పైసలకు ఒక బిండ. రెండు పైసలకు ఒక బిండ” అని అరుస్తూ కనిపించేవాడు. అతని జీవితమంతా ఇలాగే గడ్డి అమ్ముకోవడంలోనే గడిచిపోయింది. ఏనాడైనా అతను నమాజ్, ఉపవాసాలు పాటించలేదు. ఖురాన్ పఠించలేదు. కనీసం అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను కూడా జ్ఞాపకం చేసుకోలేదు…. అతని చావు సమయం ఆసన్నమైనప్పుడు అతని బంధువులు అతని దగ్గర కూర్చొని “లా ఇలాహ ఇల్లల్లాహ్” పఠించటం మొదలుపెట్టారు, అతని నోటితో కూడా ఆ సద్వచనం పలికించాలని. కాని శోచనీయమైన విషయం ఏమిటంటే జీవితాంతం అతని నోటినుండి ఏ పలుకులయితే వెలువడ్డాయో మరణ సమయంలోనూ అవే పలుకులు వెలువడ్డాయి. ‘రెండు పైసలకు ఒక బిండ… రెండు పైసలకు ఒక బిండ’ ఈ పలుకులతోనే అతని ప్రాణం దేహాన్ని విడిచింది.
వాస్తవం ఏమిటంటే మరణ సమయం.. మొత్తం మనిషి జీవితానికి సారాంశ గడియలాంటిది. ఎవడయితే జీవితాంతం మనస్ఫూర్తిగా ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ‘ వచన కర్తవ్యాలను నెరవేరుస్తాడో అటువంటి అదృష్టవంతుని నోటినుంచే మరణ సమయంలో లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్న పలుకులు వెలువడుతాయి. సమాధిలో ప్రశ్నించబడే ప్రశ్నల సమాధానాల సంగతి కూడా అంతే. తమ జీవితం మొత్తం ఆ ప్రశ్నల సమాధానాలకు అనుగుణంగా గడిపినవారు మాత్రమే వాటికి సరైన సమాధానాలు ఇవ్వగలుగుతారు.
‘మర్రబ్బుక?’ అన్న ప్రశ్నకు ‘అష్ హదు అల్లా ఇల్లాహ ఇల్లల్లాహ్’ అనే సమాధానం చెప్పేవాడు జీవితాంతం నిజంగా అల్లాహ్ ను మాత్రమే తన ఆరాధ్యునిగా భావించి ఉంటాడు. ఒక్క అల్లాహ్ యందే మనసును లగ్నం చేసుకొని ఉంటాడు. ఒక్క అల్లాహ్ నే తన అనుగ్రహమూర్తిగా, ఆపదమొక్కులవాడిగా భావించి ఉంటాడు. ఒక్క అల్లాహ్ నే తన సహాయకుడిగా, కష్టాలనుంచి గట్టెక్కించే వాడిగా భావించి ఉంటాడు. తన అదృష్టానికి, తన జీవన్మరణాలకు ఒక్క అల్లాహ్ యజమానిగా భావించి ఉంటాడు. ఆయన కొరకే మొక్కుబడులు చేసుకొని ఉంటాడు. త్యాగాలు, నజరానాలు ఆయనకే సమర్పించుకొని ఉంటాడు. ఆయన పేరు మీదే నమాజులు చేసి ఉంటాడు. ఉపవాసాలు పాటించి ఉంటాడు. ఆయన పేరు మీదే దానధర్మాలు చేసి ఉంటాడు. కేవలం ఆయనకు మాత్రమే భయపడి ఉంటాడు. కాని దీనికి భిన్నంగా తన అదృష్టంలో, తన జీవన్మరణాల వ్యవహారాల్లో ఇతరుల్ని కూడా భాగస్తులుగా భావించినవాడు, అల్లాహ్ తోపాటు ఇతరులు కూడా తన అనుగ్రహమూర్తులని, ఆపదమొక్కులవారని తలంచినవాడు, ఇతరుల్ని తన సహాయకులుగా, ఆపదల నుంచి గట్టెక్కించేవారిగా భావించినవాడు, అల్లాహ్ తో పాటు ఇతరుల పేరున కూడా మొక్కుబడులు చేసుకొని వారికి త్యాగాలు, నజరానాలు సమర్పించుకున్నవాడు, అల్లాహ్ తో పాటు ఇతరుల పేరున కూడా నమాజు చేసినవాడు, వారికోసం దానధర్మాలు చేసినవాడు-అట్లాంటివాడి నోటి నుంచి లా ఇలాహ ఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యదేవుడు లేడు) అనే పలుకులు ఎలా వెలువడుతాయండీ?!
రెండవ ప్రశ్న విషయం కూడా అంతే ‘మన్నబియ్యుక’ (నీ ప్రవక్త ఎవరు)? అన్న ప్రశ్నకు సమాధానం పైకి చాలా సులువుగా, సంక్షిప్తంగా అనిపించవచ్చు. అంటే ‘అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహూ’ అని. కాని ఈ సులభమైన, సంక్షిప్తమైన సమాధానం కూడా మొత్తం మనిషి క్రియాత్మక జీవితంతో సంబంధం కలిగి ఉంది. ఎవడయితే నమాజ్ రోజాలు, దానధర్మాల దగ్గరినుంచి లేవటం, కూర్చోవటం,పడుకోవటం, మేల్కొనటం, తినటం త్రాగటం వరకు, వ్యాపార లావాదేవీల దగ్గర్నుంచి వివాహం, జీవన్మరణాలు మొదలగు వ్యవహారాలన్నిటిలో కేవలం దైవప్రవక్త పద్ధతిని మాత్రమే అనుసరించి ఉంటాడో, ఆయన్నే తన నేతగా, మార్గదర్శిగా భావిస్తాడో, ఆయన్నే తన ఇమాముగా, తన పూర్వీకునిగా భావిస్తాడో, ఆయన వ్యక్తిత్వాన్నే తనకొరకు ఆదర్శవంతమైనదిగా భావిస్తాడో, తన తల్లిదండ్రులు, భార్యాపిల్లలు ఇతర వ్యక్తులందరికంటే ఆయన్నే తన అభిమానపాత్రునిగా తలపోశాడో అలాంటివాని నోటి నుంచే ఈ ప్రశ్నకు సరైన సమాధానం వస్తుంది. దీనికి భిన్నంగా అడుగడుగునా ఆయన హదీసులకు బదులు ఇమాముల అభిప్రాయాలకు పెద్దపీట వేసేవాడు, ఆయన సలహాలకు బదులు తమ గురువులు, పెద్దల మాటలకు విలువనిచ్చేవాడు, ఆయన సున్నతులకు బదులు ఉలమాలు ప్రచారం చేసిన బిద్అత్లకు ప్రాధాన్యతనిచ్చేవాడు, ఆయన ప్రబోధనలకు బదులు తమ మహాత్ముల ప్రబోధనలకు ప్రాముఖ్యతనిచ్చినవాడు, ఆయన ప్రవచనాల కన్నా తమ హజ్రత్ ల స్వప్న విశేషాల మీద, వారి కలల మీద నమ్మకముంచేవారు, దైవప్రవక్తను వదలి ఇతర మత, రాజకీయ వ్యక్తులను అభిమానించే వారు, ఇట్లాంటి వారి నోటి నుంచి ఈ ప్రశ్నకు సరైన సమాధానం వస్తుందండీ?!
మూడో ప్రశ్న ధర్మానికి సంబంధించినది. ‘మా దీనుక’… అంటే నీ ధర్మం ఏది? అని. అరబీ భాషలో దీన్ అనే పదానికి చాలా విస్తృతమైన అర్ధం ఉందని తెలుసుకోండి. మనిషి ఏ విధంగానయితే జీవితం గడుపుతాడో ఆ విధానమే అతని ధర్మం అనిపించు కుంటుంది. కనుక ఎవరయితే జీవితాంతం ఇస్లామీయ జీవన విధానం ప్రకారం నడుచు కుంటాడో, ఇస్లామీయ జీవన సరళిని అవలంబిస్తాడో, ఇస్లామీయ సంస్కృతీ నాగరికతలను ప్రాణప్రదంగా భావిస్తాడో, ఇస్లామీయ చట్టాలను, ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తాడో ఇస్లామీయ చిహ్నాలను గౌరవిస్తాడో అతని నోటినుంచే సరైన సమాధానం వస్తుంది. దీనికి భిన్నంగా యూద, క్రైస్తవ హైందవ జీవన విధానాలను అవలంబించినవాడు, వారి సంస్కృతీనాగరికతలను ఇష్టపడ్డవాడు, వారిచిహ్నాలను అభిమానించినవాడు, వారి పండుగలు జరుపుకున్నవాడు, వారి మత, రాజకీయ, సామాజిక, సాహితీ వ్యక్తులను అభిమానించినవాడు, వారి చట్టాలను అనుసరించినవాడు, అట్లాంటివాడి నోటి నుంచి ‘నా ధర్మం ఇస్లాం’ అన్న సమాధానం వస్తుందండీ?
పరీక్ష చిన్నదైనా పెద్దదైనా దాని మానసిక ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందంటే చాలామంది పరీక్షకు ముందే బెంబేలెత్తిపోతారు. ప్రిపేర్ అవకుండా పరీక్షకు హాజరయ్యే పిల్లల విషయం అటుంచినా సంవత్సరం మొత్తం ఎంతో కష్టపడి చదివినవారు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంతగా బెదిరిపోతారంటే పరీక్షహాల్లో కూర్చున్న తర్వాత వారికి బాగా జ్ఞాపకమున్న ప్రశ్నలు కూడా గుర్తురాకుండా పోతాయి. మరి చూడబోతే ఇహలోకపు పరీక్షలో ఒక ఫెయిల్యూర్ భయం తప్ప మరే భయమూ ఉండదు!
ఒక్క క్షణం ఊహించండి. సమాధి చీకటి, ఒంటరితనం, అమానుష ఆకారాలు, వారి చేతుల్లో గదలు, జీవితంలో మొదటిసారి ఎదురయిన పరిస్థితి, సమాధానాలు చెప్పకపోతే శిక్షపడుతుందేమోనన్న భయం, విడిపించేవాడెవడూ ఉండడు, పారిపోవటానికీ అవకాశం ఉండదు. ప్రజల్లో చాలామంది ఎలా ఉంటారంటే, రాత్రిపూట హఠాత్తుగా ఎవరయినా వచ్చి తలుపుతడితేనే భయంతో వారి రక్తం చల్లబడిపోతుంది. పోలీసు సిబ్బందిలోని ఒక మామూలు సిపాయి తమ దగ్గరకు వస్తుండగా చూస్తే ఒళ్ళంతా చెమటలు పడతాయి. తలుపులు మూసివున్న గదిలో కూర్చొని ఉండగా హఠాత్తుగా కరెంటుపోతే కొన్ని నిమిషాలు చీకట్లో ఉండటానికే భయపడతాడు మనిషి. అలాంటి భయంతోనే దైవప్రవక్తను ఆయన అనుచరులు అడిగారు, “దైవప్రవక్తా! మనిషి తన తలదగ్గర దైవదూత గదపట్టుకొని ఉండటం చూస్తే భయంతో అక్కడికక్కడే మట్టి విగ్రహమైపోతాడు. (మరి అతను సమాధానం ఏం చెప్పగల్గుతాడు?” అని. దానికాయన సమాధానమిస్తూ “విశ్వాసులకు అల్లాహ్ తౌహీద్ సద్వచన చలువతో సమాధిలో జరిగే ప్రశ్న-సమాధానాల విషయంలో స్థిరంగా ఉంచుతాడు” అని చెప్పారు. (బజ్జార్). ఇతర అనుచరుల ప్రశ్నలకు కూడా ఆయన ఇదే సమాధాన మిచ్చారు. దీని ద్వారా ఈ క్రింది రెండు విషయాలు బోధపడుతున్నాయి:
1) సమాధి పరీక్షలో విజయం సాధించటానికి మొట్టమొదటి మరియు ప్రథమ నియమం ఏకదైవ విశ్వాసం. కనుక ప్రతి ముస్లిం తన విశ్వాసాన్ని చిన్న పెద్ద అన్ని రకాల షిర్క్ నుంచి పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత తన ఆచరణలన్నిటికీ దాన్నే ఆధారంగా చేసుకోవాలి.
2) దైవ ప్రవక్త ప్రవచనం ద్వారా బోధపడుతున్న రెండో విషయం ఏమిటంటే తౌహీద్ విశ్వాసాన్ని అనుసరించి ఆచరించినప్పటికీ సమాధి పరీక్షలో స్థయిర్యం అనేది కేవలం అల్లాహ్ కరుణాకటాక్షాలతోనే ప్రాప్తమవుతుంది. కనుక విశ్వాసాలను, ఆచరణలను సంస్కరించుకున్న తర్వాత దైవసన్నిధిలో చేతులెత్తి ఆయన్ని దయాభిక్ష పెట్టమని వేడుకోవాలి.
ఓ మా ప్రభూ! మేము మా ఆత్మలకు అన్యాయం చేసుకున్నాము. నీవు గనక మమ్మల్ని క్షమించకపోతే, మా మీద దయ జూపకపోతే మేము నష్టపోయేవారిలో కలిసిపోతాం. (ఆరాఫ్ సూరా. 33వ సూక్తి)
పైన పేర్కొనబడిన రెండు విషయాలనూ ఆచరిస్తే బలహీనులు, నిస్సహాయులైన తన పాపాత్మ దాసుల్ని అల్లాహ్ తప్పకుండా కరుణిస్తాడని ఆశించవచ్చు.
నాల్గవ ప్రశ్న:
పైన పేర్కొనబడిన మూడు ప్రశ్నలతోపాటు సమాధిలో ఇంకో ప్రశ్న కూడా అడగటం జరుగుతుంది. పై ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పిన వారికి, చెప్పలేకపోయినవారికి- ఇద్దరికీ ఈ ప్రశ్న వేయబడుతుంది. సరైన సమాధానం చెప్పిన అదృష్టవంతులను దైవదూతలు “మిమ్మా యుద్దీక”… ఈ విషయాలు నీకు ఎలా తెలిశాయి అని అడుగుతారు. దానికి విశ్వాసి…… “నేను దైవగ్రంథం చదివాను. దాన్ని విశ్వసించాను. దాన్ని ధృవీకరించాను” అని చెబుతాడు (అహ్మద్, అబూదావూద్). సరైన సమాధానం చెప్పలేకపోయిన దురదృష్టవంతులను దైవదూతలు “నీవు తెలుసుకోలేదా” నీవు (ఖుర్ఆన్) చదవలేదా?” అని అడుగుతారు. ఆ తర్వాత అతని రెండు చెవుల మధ్య ఇనుప సుత్తెలతో కొడతారు. ఆ దెబ్బలకు అతను చాలా భయంకరంగా అరవటం మొదలు పెడతాడు. అతని అరుపుల్ని జిన్నుల, మానవులు తప్ప మిగతా సృష్టిరాశులన్నీ వింటాయి (బుఖారీ, అబూదావూద్).
విశ్వాసి మరియు అవిశ్వాసికి వేయబడిన ఈ నాల్గవ ప్రశ్న ద్వారా ఈ క్రింది విషయాలు బోధపడుతున్నాయి:
1) ముంకిర్, నకీర్ దూతలు వేసే మూడు ప్రశ్నలకు సరైన సమాధానాలు అందించగల గ్రంథం ఖుర్ఆన్ మాత్రమే.
2) ఖుర్ఆన్ గ్రంథాన్ని విశ్వసించి, దాన్ని పారాయణం చేసి, అర్థం చేసుకొని, దాన్ని ఆచరించినవారు మాత్రమే సమాధి శిక్షలో కృతకృత్యులౌతారు.
3) మరణానంతరం అవిశ్వాసి లేక బహుదైవారాధకుని మీద మొట్టమొదట నువ్వు దివ్యఖుర్ఆన్ ఎందుకు చదవలేదు, దాన్ని అర్థం చేసుకోవటానికి ఎందుకు ప్రయత్నించలేదు? అన్న నేరం మోపబడుతుంది.
4) దివ్యఖుర్ఆన్ న్ను చదవని, అర్థం చేసుకోని నేరానికి ముద్దాయిని రెండు చెవుల మధ్య అనగా మెదడు మీద గదతో కొట్టడం జరుగుతుంది. దీని ద్వారా అర్థమయ్యేదేమిటంటే అల్లాహ్ మెదడు దివ్యఖుర్ఆన్ చదవటం కోసం, దాన్ని అర్థం చేసుకోవటం కోసం ప్రసాదించాడు. కనుక ఏ లక్ష్యం కోసమైతే అది పుట్టించబడిందో దాన్ని ఆ లక్ష్యం కోసం వినియోగించని కారణంగా అవిశ్వాసికి ఈ శిక్ష విధించబడుతుంది.
ఆ పైన పేర్కొనబడిన నాలుగు సారాంశాలు చదివిన తర్వాత ముస్లిం అయిన ప్రతి వ్యక్తి ఖుర్ఆన్ చదవటం, దాన్ని అర్థం చేసుకోవటం, దాని ప్రకారం ఆచరించటం ఎంత అవసరమో తెలుసుకోవటం ఏమంత కష్టం కాదు. దివ్యఖుర్ఆన్ వల్ల శుభాలు, మేళ్లు, పుణ్యఫలాలు అనుగ్రహాలు కలుగుతాయన్న మాట ముమ్మాటికీ నిజమే. కాని ఖుర్ఆన్ అవతరణ ముఖ్యోద్దేశం మానవులకు సన్మార్గం చూపించటం. తద్వారా వారు అపమార్గాలకు లోనుగాకుండా, పరలోక శిక్షకు గురికాకుండా సురక్షితంగా ఉండగలగటం. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
“నేను చూపిన మార్గం ప్రకారం నడుచుకున్నవాడు (ప్రపంచంలో) అపమార్గాలకు లోనుకాడు, (పరలోకంలోనూ) ఆపదలకు శిక్షకు గురికాడు”. (తాహా సూరా: 123).
వేరొక చోట అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
“నా మార్గాన్ని అనుసరించినవారికి ఎలాంటి భయాందోళనలుగాని, దుఃఖవిచారాలు గాని ఉండవు”. (సూరా బఖర: 38)
వేరే మాటల్లో ఆ విషయాన్ని మనం ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఖుర్ఆన్ గ్రంథాన్ని పారాయణం చేయనివారు, దాని ప్రకారం నడుచుకోనివారు ప్రపంచంలో తప్పకుండా భ్రష్టత్వానికి గురౌతారు. అంతేగాకుండా పరలోకంలో కూడా శిక్షకు గురౌతారు. ఆ శిక్ష సమాధినుంచే ప్రారంభమవుతుంది. ఆ ప్రకారం మనం మన కష్టం, సమయం, శక్తి సామర్థ్యాలలోని ఎక్కువ భాగాన్ని దివ్యఖుర్ఆన్ విద్యను ఆర్జించటానికి వెచ్చిస్తూ ఉండాల్సింది. ఖుర్ఆన్ పారాయణ శ్రవణం మన మనోమస్తిష్కాలకు ప్రశాంతతను చేకూర్చేదిగా మారిపోవలసింది. ఉదయం సాయంత్రం మన ఇండ్ల నుండి ఖుర్ఆన్ను సుమధురంగా పారాయణం చేసేవారి గొంతులు వినపడుతూ ఉండాల్సింది. మనపిల్లలు యుక్త వయసుకు చేరుకోకముందే ఖుర్ఆన్ గ్రంథానికి ఎంత దగ్గరయి ఉండాలంటే జీవితాంతం దాని పారాయణాన్ని, అవగాహననూ, పరిశోధనను తమ ప్రాణప్రద కార్యంగా భావించాలి. కాని శోచనీయమైన విషయం ఏమిటంటే ఈ రోజు ఆ ఖుర్ఆన్ పట్లనే అన్నిటికంటే ఎక్కువ అజాగ్రత్త, నిర్లక్ష్యం చూపటం జరుగుతోంది. మరి చూడబోతే ప్రపంచంలో, సమాధిలో, పరలోకంలో మన విజయానికి పూచికత్తు అదే!
మనకు ప్రతిరోజూ వార్తాపత్రికలు చదవటానికి ఒకటిరెండు గంటల సమయం దొరుకుతుంది. కాని దివ్యఖుర్ఆన్ చదవటానికి, అర్థం చేసుకోవటానికి, యోచన చేయటానికి పట్టుమని పది నిమిషాలయినా దొరకవు. ఎంతటి శోచనీయమైన వాస్తవమండీ ఇది! ప్రియమైన మన దేశంలో తొంభై శాతం కుటుంబాలు తమ కుటుంబ సభ్యులందరితోపాటు టి.వి. ముందు కూర్చొని ప్రియాతి ప్రియమైన తమ జీవితంలోని ఎన్నో విలువైన గంటలసమయం వృధా చేస్తారు. కాని తమ కుటుంబ సభ్యులతోపాటు కూర్చొని ఖుర్ఆన్ చదవటానికి, చదివించుకోవటానికి వారికి కొన్ని నిమిషాలయినా దొరకవు. పిల్లాడికి నాలుగైదు యేండ్లు రాగానే అతన్ని ఏ స్కూల్లో చేర్పించాలి, ఏం చదివించాలి, పెద్దయిన తర్వాత అతను ఏం కావాలి అనే ఆలోచనలతో తల్లిదండ్రులు అతని ప్రాథమిక విద్యాశిక్షణల కోసం ప్రయత్నాలు మొదలు పెడతారు. కాని జీవితాంతం పిల్లలకు ఖుర్ఆన్ విద్య నేర్పించాలన్న ధ్యాసరాదు. ప్రాపంచిక విద్యార్జన కోసం తల్లిదండ్రులు ధనం నీళ్లలా ఖర్చుపెడతారు. కాని ఖుర్ఆన్ విద్య నేర్పించటానికి అందులో వందో వంతు ఖర్చుపెట్టటానికయినా వారి మనసొప్పదు. అందుకే 24, 25 యేండ్ల వయస్సు వచ్చినప్పటికి మన విద్యార్థుల చేతుల్లో ఉపాధి అన్వేషణకు మూడు, నాలుగు డిగ్రీలుంటాయి. కాని యాభై అరవై సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా వారికి దివ్యఖుర్ఆన్ను కనీసం ఒక్కసారన్నా పూర్తిగా చదివే భాగ్యం ఉండదు.
ఖుర్ఆన్ పట్ల ఈ విధమైన అజాగ్రత్త, నిర్లక్ష్యానికి ఒక కారణం దివ్యఖుర్ఆన్ ప్రాముఖ్యత గురించి తెలియకపోవటం. ఈ ప్రపంచంలో మనకు ఎదురయ్యే వ్యక్తిగత, సామాజిక సమస్యలకు, దుఖఃవిచారాలకు, రోగాలకు చికిత్స ఖుర్ఆన్ ఒక్కటేననీ, ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించి వెళ్ళిపోయిన తర్వాత పితృలోకంలో కూడా మన ముక్తికి, భద్రతకు సాధనం ఈ ఖుర్ఆనేననీ, ఆ తర్వాత పరలోకంలో దైవసన్నిధిలో మన గురించి సిఫారసు చేసేది కూడా ఈ ఖుర్ఆన్ గ్రంథమేనని మనకు తెలియదు. ఖుర్ఆన్ రూపంలో అల్లాహ్ మనకు ఎంతటి గొప్పవరాన్ని ప్రసాదించాడో కూడా తెలుసుకోలేని నిస్పృహలో ఉన్నాం మనం. అందుకని మనం ఖుర్ఆన్ ద్వారా ఋజుమార్గం పొందే బదులు దాన్ని కేవలం శుభశ్రేయాలు ఇచ్చే గ్రంథంగా తలపోసి వివాహ వేడుకల సమయంలో కూతురికి కానుకగా ఇవ్వటం, కొడుకుని సాగనంపేటప్పుడు అతని ఛాయలోనుంచి తీసుకెళ్ళటం, గొడవలు, తగాదాలు జరిగినప్పుడు ప్రమాణాలు, సాక్ష్యాల కోసం ఉపయోగించటం, జిన్నాతులను పారదోలటానికి తావీజులు కట్టటం, అవసరమొస్తే దీనిద్వారా శకునం చూడటం, మృతులకు పుణ్యప్రాప్తి జరగటం కోసం దానిని పారాయణం చేయటం. ఇవే ఖుర్ఆన్ అవతరణ ముఖ్యోద్దేశాలుగా భావిస్తున్నారు. ఇది అచ్చం ఎలా ఉందంటే ఒక పల్లెవాసి చేతికి వజ్రాలు, మణుల నిధి దొరికితే అతను వాటిని రాళ్లనుకొని నిర్లక్ష్యంగా పారేస్తున్నట్లుంది.
ఖుర్ఆన్ కు దూరమయిపోవటానికి, దాని విషయంలో అజాగ్రత్తకు పాల్పడటానికి మరో కారణం దివ్యఖుర్ఆన్ పఠనం చాలా కష్టమని భావించటం. కేవలం పండితులు మాత్రమే దాన్ని చదివి అర్థం చేసుకోగలరు, సామాన్యులకు అది సాధ్యం కాని పని అని తలపోయటం. ఆ మాటే గనక నిజమయితే సమాధిలో ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేకపోయేవారి మీద ‘ఖుర్ఆన్ చదవలేదు. దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించలేద’న్న అభియోగం ఎందుకు మోపబడాలండీ? అల్లాహ్ కూడా ఖుర్ఆన్లో ఈ అపోహను త్రోసిపుచ్చుతున్నాడు. అల్లాహ్ సెలవు: “మేమీ ఖుర్ఆన్ని ప్రజలు గ్రహించటానికి సులభతరం చేశాం; మరి దీన్నుండి హితబోధ గ్రహించేవారు ఎవరైనా ఉన్నారా?” (ఖమర్ సూరా, 17వ సూక్తి)
అయితే ఖుర్ఆన్లోని కొన్ని వాక్యాలను అర్థం చేసుకోవటం కష్టమే. ఈ విషయాన్ని మేమూ ఒప్పుకుంటాం. కాని ఆ కారణంగా మొత్తం ఖుర్ఆన్నే చదవకుండా వదిలేయాలన్న వైఖరి సమంజసమేనా? ఏ విద్యార్థికయినా రసాయన లేక భౌతిక శాస్త్రంలోని కొన్ని సూత్రాలు అర్థం చేసుకోవటం కష్టంగా ఉంటే అతని తల్లిదండ్రులు అతనితో “బాబూ! ఈ చదువు వదిలెయ్యి. ఇది చదవటం నీ వల్లకాదు” అని ఎన్నడూ అనరు. పైగా పరీక్షలో పాసవటం కోసం అత్యంత ఖరీదైన ట్యూషన్లు పెట్టించి మరీ అతనికి ఆ శాస్త్రం బోధించటం జరుగుతుంది. ప్రపంచం విషయంలో మన మెదడు మనచేత ఈ పని చేయిస్తుంది. మరి ధర్మం విషయంలో మనం ఎందుకింత అమాయకంగా, మూర్ఖంగా ప్రవర్తిస్తాం? ఖుర్ఆన్ పఠనంలో కష్టమైన సందర్భాలు ఎదురైతే వాటిని అర్థం చేసుకోకుండా ఎందుకని వదిలేస్తున్నాం? నిజానికి మన వ్యవహారం ఇందుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండాల్సింది. ఖుర్ఆన్ గ్రంథాన్ని పూర్తి శ్రద్ధాసక్తులతో పఠించాలి. ఎక్కడైనా ఏదయినా విషయం అర్థం కాకపోతే ఏ ధర్మజ్ఞానినయినా అడిగి తెలుసుకోవాలి. సమాధి పరీక్షలో కృతకృత్యులవటానికి సాధ్యమైనంతవరకు కృషి చేయాలి. అంతేగాని మొదటిరోజే ఖుర్ఆన్ చదవనని ప్రతిజ్ఞ చేసుకొని తనకు పరాజయం ఖాయమని నిరూపించుకోరాదు.
ఖుర్ఆన్ పఠనానికి దూరమవటానికి గల మరొక కారణమేమిటంటే, కొంతమంది ఎక్కువ జ్ఞానం ఆర్జించటం వినాశకరంగా భావిస్తారు. వీరి అభిప్రాయంలో ఇబ్లీసు కూడా మహాజ్ఞానే. జ్ఞానం వల్లనే అతను మార్గభ్రష్టుడయ్యాడు. కనుక తమకు ఎంతవరకు తెలుసో అంతవరకు ఆచరిస్తే చాలు (మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు).
ఈ అపోహ కూడా పూర్తిగా షైతాన్ కుశంక. ఎందుకంటే ఇబ్లీసు తన జ్ఞానం మూలంగా కాదు నాశమయింది, తన అహంకారం మూలంగా నాశనమయ్యాడు. (బఖరా సూరాలోని 34వ సూక్తి గమనించండి) అల్లాహ్ విద్యావంతులను ఈ వాక్యాలతో ప్రశంసించాడు:
“అల్లాహ్ దాసుల్లో జ్ఞానులే ఆయనకు భయపడతారు”. (ఫాతిర్ సూరా: 28).
వేరొక చోట అల్లాహ్ ఇలా అంటున్నాడు:
“ఓ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని అడగండి జ్ఞానులు, అజ్ఞానులు సమానులు కాగలరా?” (జుమర్ సూరా 9వ సూక్తి)
దివ్య ఖుర్ఆన్ లో అల్లాహ్ దేన్నయితే ప్రశంసించాడో అది మానవుల పాలిట వినాశకారి అవుతుందా లేక ముక్తికి దోహదకారి అవుతుందా?
కొంతమంది వృద్ధాప్యం మూలంగా ఖుర్ఆన్ చదవటానికి బిడియపడతారు. తటపటాయిస్తారు. నిజానికి ఇది కూడా ఒక నకారాత్మక ఆలోచనే. ప్రాపంచిక వ్యవహారాల్లో నయితే ప్రతి మనిషి జీవితపు చివరి శ్వాసవరకూ కృషి సలుపుతూ ఉంటాడు. ఎన్నడైనా అందులో తటపటాయించటం గాని బిడియపడటం గాని చేయడు. మరి ధర్మం విషయంలో ఈ విధంగా ఆలోచించటం సమంజసమేనా అండీ? దైవ ప్రవక్త అనుచరుల్లో కొందరు యాభై యేళ్ల వయసులో ముస్లింలయ్యారు. మరికొందరు
అరవై ఏళ్ల వయసులో ఇస్లాం స్వీకరించారు. వాళ్లంతా ఆ తర్వాతే దివ్యఖుర్ఆన్ చదవటం నేర్చుకున్నారు. కొందరు దాన్ని కంఠస్తం కూడా చేసుకున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ధర్మ విద్యను ఆర్జించటం ప్రతి ముస్లిం విధి” అని ప్రవచించారు (తబ్రానీ). దానికోసం ఆయన వయోపరిమితులేవీ నిర్ధారించలేదు. కనుక సత్యం బోధపడగానే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, తటపటాయించకుండా ఖుర్ఆన్ చదవటం మొదలెట్టాలి.
ఖుర్ఆన్ కు దూరమవటానికి వేరొక కారణం- వివిధ రకాల పంజ్ సూరాలు, ఇతర పుస్తకాలు, ఆనవాయితీలు. చాలామంది వీటిని ఖుర్ఆన్ పారాయణాన్ని ఏ విధంగా దైనందిక కార్యంగా చేసుకోవాలో ఆ విధంగా చేసుకుంటారు. ఇక ఆ తర్వాత ఖుర్ఆన్ను ముట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదనుకుంటారు. ఖుర్ఆన్లోని కొన్ని సూరాలకు ప్రాధాన్యత ఉందన్న మాట వాస్తవమే. కాని ఆ కొన్ని సూరాలు మాత్రమే చాలు అనుకొని మిగతా ఖుర్ఆన్ను చదవకుండా ఉండాలని దాని భావం కాదు. పైగా ప్రతిరోజూ ఖుర్ఆన్ పారాయణం చేస్తూ, దాని భావాన్నీ ఆకళింపు చేసుకుంటూ, ఆ తర్వాత ఇంకా పుణ్యం కావాలనుకుంటున్న వ్యక్తి ఆ సూరాలు పఠించాలని దాని అసలు భావం.
అలాగే కొన్ని ధార్మిక సంఘాలు తాము సాధించదలచిన ప్రత్యేక లక్ష్యాలకోసం తమ కార్యకర్తల కొరకు ప్రత్యేకమైన సాహిత్యం, స్లిప్పులు తయారు చేస్తారు. అలా చేయటం తప్పుకాదుగాని అసలు ఎన్నడూ ఖుర్ఆన్ తెరిచి చదివే అవకాశం లేకుండా తమ సందేశమంతటికీ ఆ సాహిత్యమే ఆధారమన్నట్లు దానిపఠనాన్ని నిర్బంధం చేయటం మాత్రం అక్షరాలా తప్పు. ఖుర్ఆన్లోని కొన్ని ప్రత్యేకసూక్తులు చదువుకోవటం కాదు కావాల్సింది, మొదటినుంచి చివరిదాకా ఖుర్ఆన్ మొత్తం చదివి దాని ఆదేశాలన్నిటినీ ఆకళింపు చేసుకోవాలి, దాని ప్రకారం ఆచరించాలి. ఇది ఖుర్ఆన్ అసలు ఉద్దేశ్యం.
సామాన్య ప్రజానీకాన్ని ఖుర్ఆన్ పఠనానికి దూరంగా ఉంచటంలో బరి తెగించి కీలకమైన పాత్రను పోషించినది సూఫీ మతస్తుల విశ్వాసాలు. వారి దృష్టిలో ఖుర్ఆన్కు అంతరంగం, బాహ్యం అని రెండుంటాయి. సూఫీ మతస్తుల దృష్టిలో ఖుర్ఆన్ యొక్క ఆంతరంగిక భావం, బాహ్యార్థం కంటే గొప్పది, ప్రధానమైనదీను. అది చదువుతో అబ్బేదికాదు. ఒకరి హృదయం నుంచి మరొకరి హృదయానికి అందుతూ ఉంటుంది. సూఫీల్లో “ఇల్మ్ దర్శీ నబూద్, దర్ సీనా బూద్” అనే ఒక నానుడి ప్రఖ్యాతిగాంచినది. అంటే విద్య అనేది చదువుకునే చదివించే వస్తువు కాదు, అది హృదయాల ద్వారా లభిస్తుంది అని దాని భావం. మరికొందరు సూఫీలు ఇంకో అడుగు ముందుకు వేసి ‘ఖుర్ఆన్ విద్య వేదాంత మార్గంలో అన్నిటికంటే పెద్ద అడ్డంకి’ అని దాని భావం. ఆలోచించండి! ఏ మతమైతే ఖుర్ఆన్ పఠనానికి దూరంగా ఉండాలనే భావన మీద ఆధారపడి ఉందో ఆ మతంలో ఖుర్ఆన్ను ముట్టుకోవటానికయినా ఎవడు సిద్ధపడతాడండీ?
దివ్య ఖుర్ఆన్ పట్ల మన ఈ నిర్లక్ష్యం, అజాగ్రత్త మనల్ని తప్పకుండా నష్టానికి, పశ్చాత్తాపానికి గురి చేస్తుంది. దీన్నుంచి బయటపడటానికి ఒక్కటే మార్గం. మనలోని ప్రతి ఒక్కరూ తమకు దొరికే తొలి తీరికలోనే ఖుర్ఆన్ పఠించటం మొదలుపెట్టాలి. గత జీవితంలో ఖుర్ఆన్ పట్ల కనబరిచిన నిర్లక్ష్య పరిహారం కోసం అన్ని విధాల కృషి చేయాలి. ఖుర్ఆన్ మనకు ఈ ప్రపంచంలో సన్మార్గాన్ని, సద్బుద్ధిని శ్రేయోశుభాల సంపదలను ప్రసాదించటమే గాక సమాధిలో స్థిరత్వాన్ని కూడా ప్రసాదిస్తుంది. పరలోకంలో ముక్తికి దోహదకారిగానూ పరిణమిస్తుంది – ఇన్షా అల్లాహ్
సమాధి ఉపద్రవం నుంచి కాపాడే ఆచరణలు
సమాధి ఉపద్రవమంటే ముంకిర్, నకీర్ ప్రశ్నలతోపాటు సమాధిలో విధించబడే శిక్ష కూడా అని అర్ధం. కనుక ఒక వ్యక్తి ముంకిర్ నకీర్ ప్రశ్నల నుంచి, సమాధి శిక్ష నుంచి-రెండింటి నుంచి సురక్షితంగా ఉన్నప్పుడే అతను సమాధి ఉపద్రవం నుంచి సురక్షితంగా ఉన్నట్లవుతుంది. లేదా ముంకిర్కర్లు ప్రశ్నలు వేసినా అల్లాహ్ తన అనుగ్రహంతో అతని మనసుకి స్థిరత్వాన్ని ప్రసాదించి ఆ తర్వాత తన అనుగ్రహంతోనే అతని శిక్షార్హమైన పాపాలను క్షమించి అతన్ని సమాధి ఉపద్రవం నుంచి కాపాడతాడు. సమాధి ఉపద్రవం నుంచి సురక్షితంగా ఉండటమంటే భావం ఇది కూడా కావచ్చు. వాస్తవం అల్లాహ్ కే బాగా తెలుసు.
ఈ క్రింది ఆచరణలు సమాధి ఉపద్రవం నుంచి కాపాడతాయి:
1) దైవ మార్గంలో ప్రాణాలు కోల్పోవటం :- దైవ ప్రవక్త ప్రవచనం, “దైవమార్గంలో ప్రాణాలు అర్పించే ఆచరణ సమాధి ఉపద్రవం నుంచి సురక్షితంగా ఉంచుతుంది” (నసాయి).
2) మురాబితా :- అంటే ఇస్లామీయ రాజ్య సరిహద్దులకు లేక ఇస్లామీయ సైన్యానికి కాపలాకాయటం. ఈ ఆచరణ కూడా సమాధి ఉపద్రవం నుంచి కాపాడుతుంది. (తిర్మిజీ)
3) ముల్క్ సూరాను అత్యధికంగా పారాయణం చేయటం :- దైవప్రవక్త ప్రవచనం, “ముల్క్ సూరా సమాధి ఉపద్రవాన్ని అడ్డుకుంటుంది” (హాకిమ్). దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రతిరోజూ పడుకునే ముందు ముల్క్ సూరా పారాయణం చేసే వారు అన్న విషయం గమనార్హం. (అహ్మద్, తిర్మిజీ, దారిమి)
4) దివ్యఖుర్ఆన్ పారాయణం:- దివ్యఖుర్ఆన్ పారాయణం కూడా సమాధి ఉపద్రవం నుంచి కాపాడే ఆచరణే. (తబ్రానీ)
5) మస్జిద్ వైపు వేసే అడుగులు: మస్జిద్ వైపు వేసిన అడుగులు కూడా మనిషిని సమాధి ఉపద్రవం నుంచి సురక్షితంగా ఉంచుతాయి. (తబ్రానీ)
6) నమాజు
7) ఉపవాసాలు
8) జకాతు
9) నఫిల్ (స్వచ్ఛంద) దానధర్మాలు,
10) నఫిల్ నమాజు
11) బంధువులతో సత్సంబంధాలు
12) ప్రజలకు ఉపకారం చేయటం.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: సమాధిలో యాతన దూత (మృతుని దగ్గరకు) తలవైపు నుంచి వెళ్ళాలనుకుంటాడు. కాని నమాజు అతన్ని ఆపి “ఇటునుంచి దారిలేదు, వేరే వైపు నుంచి వెళ్ళు” అని అంటుంది. ఆ దూత మృతుని కుడివైపు నుంచి రావాలనుకుంటాడు. అంతలో ఉపవాసం అడ్డుకొని “ఇటు నుంచి దారిలేదు. వేరే దారి గుండా వెళ్ళు” అంటుంది. ఆ దూత ఎడమ వైపు నుంచి దగ్గరికి వెళ్తాడు. కాని జకాతు అతన్ని ఆపి “ఇటునుంచి దారి లేదు. వేరే దారి గుండా వెళ్ళు” అని అంటుంది. ఆ తర్వాత దూత కాళ్లవైపు నుంచి దగ్గరికి వెళ్ళబోతాడు. అప్పుడు ఇతర సత్కార్యాలు ఉదా: దానధర్మాలు, బంధువులతో సత్సంబంధాలు, ప్రజోపకారం మొదలగునవన్నీ అతన్ని అడ్డుకొని “ఇటు నుంచి దారి లేదు. వేరే దారి గుండా వెళ్ళు” అని అంటాయి. (ఇబ్నె హిబ్బాన్).
పైన పేర్కొనబడిన పన్నెండు ఆచరణలు కాకుండా సమాధి ఉపద్రవం నుంచి ముక్తి పొందటానికి కారణమయ్యే సందర్భాలు ఇంకా రెండు ఉన్నాయి. వాటిలో మొదటిది గురువారం రాత్రి లేక శుక్రవారం రోజు మరణించటం. రెండోది, ఉదర సంబంధ వ్యాధి. అయితే ఈ రెండు సందర్భాలూ మనిషి అధీనంలో లేవు.
సమాధి ఉపద్రవాలనుంచి కాపాడే ఆచరణల ఆధారంగా మేము మా పాఠకమహాశయుల దృష్టిని కాస్త ఇటు కూడా మళ్ళించాలనుకుంటున్నాం. ఇస్లాం ధర్మంలోని ఆదేశాలన్నీ కూడా పరస్పరం ఏ విధంగా ముడివడి ఉన్నాయంటే వాటిని ఒకదాన్నుంచి మరొకటి వేరు చేసి ఏదయినా ఫలితాన్ని నిర్ణయించటం చాలా పెద్ద తప్పు. ఉదాహరణకు ఎవరైనా గురువారం రాత్రిగాని శుక్రవారం పగలు గాని చనిపోయాడు. కాని మరోవైపు అతను నమాజులు ఎగవేసేవాడనుకోండి. శుక్రవారం రోజు మరణించటం అతనికి ఏ విధంగానూ ప్రయోజనదాయకం కాజాలదు. ఎవడైతే ఇస్లామీయ ప్రధానాంశాలను నిక్కచ్చిగా పాటిస్తాడో, తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు, బంధుమిత్రుల హక్కులను నెరవేరుస్తాడో, ధర్మాధర్మాల మధ్య విచక్షణ చూపుతాడో, ఇతర వ్యవహారాల్లో కూడా అల్లాహ్ కు ఆయన ప్రవక్తకు విధేయత చూపుతుంటాడో అతనికి మాత్రమే ఆ రోజు మరణం ప్రయోజనకరం కాగల్గుతుంది. అదే విధంగా ఎవరైనా ప్రతిరోజూ క్రమం తప్పకుండా ముల్క్ సూరా పారాయణం జరుపుతున్నప్పటికీ విధులను ఎగవేస్తుంటే, వడ్డీ వ్యాపారాలు చేస్తుంటే, ఇతర ఘోరపాపాలకు పాల్పడుతుంటే అలాంటివారికి కేవలం ముల్క్ సూరా పారాయణం సమాధి శిక్ష నుంచి ఎట్లా కాపాడగలదండీ?!
పైన పేర్కొనబడిన ఆచరణలను ప్రత్యేకంగా ప్రస్తావించటంలోని మర్మం ఏమిటంటే, ఎవరయితే ఇస్లామీయ విధుల్ని నిక్కచ్చిగా పాటిస్తారో, ఘోరపాపాలకు దూరంగా ఉంటారో, ప్రతి వ్యవహారం లోనూ అల్లాహూ, ఆయన ప్రవక్తకు విధేయత చూపటానికి ప్రయత్నిస్తుంటారో ఆ తర్వాత పైన పేర్కొనబడిన ఆచరణల్లో ఏదయినా ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ ఆచరణల మీద అతి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారో ఉదా: నఫిల్ నమాజులు చాలా ఎక్కువగా చేస్తే లేక అత్యధికంగా నఫిల్ ఉపవాసాలు పాటిస్తుంటే లేక బంధుత్వ సంబంధాల విషయంలో చాలా ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటున్నట్లయితే లేక అల్లాహ్ మార్గంలో చాలా ఎక్కువగా డబ్బు ఖర్చుపెడ్తున్నట్లయితే అలాంటి వ్యక్తి కొరకు ఆ ఒక్క ఆచరణ (లేక ఒకటికంటే ఎక్కువ ఆచరణలు) దైవం తలిస్తే సమాధి ఉపద్రవం నుంచి ముక్తి పొందటానికి కారణభూతం కాగలదు. వాస్తవం అల్లాహ్ బాగా తెలుసు.
ధర్మం విషయంలో మనిషి ఏ విధంగా షైతాన్ మోసంలో చిక్కుకొని ఉన్నాడన్న విషయాన్ని ప్రతి మనిషి తమ తమ ప్రాపంచిక వ్యవహారాల ద్వారానే సులువుగా అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో ఎవరికైనా మొదటిసారి విదేశాలకు ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు అతను సురక్షితంగా తన గమ్యానికి చేరుకోవటానికి మాటిమాటికి ఏ విధంగా ఆరా తీస్తుంటాడో కాస్త ఆలోచించండి. దారిలో ఎదురయ్యే ప్రతి చిన్న సమస్య గురించి తెలుసుకోవటం కోసం అతను అంతకుముందు ఆ దేశానికి వెళ్ళివచ్చిన వారినందరిని అడిగి సలహాలు తీసుకుంటుంటాడు. పనులన్నీ చట్టప్రకారం జరగాలనీ, దారిలో ఎలాంటి సమస్యలూ ఎదురుకారాదని పాస్పోర్టు, వీసా, టికెట్ల కోసం అడిగినంత డబ్బు కిమ్మనకుండా చెల్లిస్తాడు. ప్రయాణంలో వెంట ఉండరాని వస్తువేదయినా తన సామానులో ఉందేమో, మార్గమధ్యంలో చెకింగ్ చేసినప్పుడు దానివల్ల తన పరువు పోతుందేమోనని తన సామానును మాటిమాటికీ పరిశీలించుకుంటూ ఉంటాడు. విమాన మెక్కిన తర్వాత ప్రయాణంలో ఏవైనా అనూహ్యమైన సంఘటనలు సంభవిస్తే ఎలా బయటపడాలో తెలిపే ముందుజాగ్రత్త చర్యలను చాలా జాగ్రత్తగా అధ్యయనం చేస్తాడు. మొత్తానికి ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ప్రతి కష్టాన్ని అధిగమించటం కోసం తనకు తెలుపబడే ముందుజాగ్రత్త చర్యలన్నిటిని పాటించటానికి అతను అన్ని విధాలా సిద్ధంగా ఉంటాడు. ఇది ప్రపంచ విషయం… ఇప్పుడు ధర్మం విషయం చూడండి… విశ్వంలో అందరికంటే సత్యవంతుడు, అత్యంత నిజాయితీపరుడు, అత్యంత శ్రేయోభిలాషి, అమిత సానుభూతిపరుడు అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం మనకు ప్రాపంచిక జీవితం తర్వాత మొదలవబోయే ప్రయాణంలోని ఒక్కొక్క ప్రమాదం గురించి అప్రమత్తం చేశారు. అంతేకాదు, ఆ ప్రమాదాల నుంచి బయట పడే మార్గాలు కూడా సూచించారు. కాని మనలో ఆ ప్రమాదాల నుంచి బయటపడటం గురించి ఆలోచించేవారు, బయటపడే మార్గాలను అనుసరించటానికి ప్రయత్నించేవారు ఎంతమంది ఉన్నారు? అత్యధిక మంది ఈ ప్రమాదకరమైన ప్రయాణానికి ఒట్టి చేతులతోనే బయలుదేరుతున్నారు!
అల్లాహ్ మమ్మల్ని పైశాచిక ఎత్తుగడలనుంచి రక్షించుగాక! మాకు ధర్మం విషయంలో సత్యాన్ని అర్థం చేసుకొని దాన్ని పాటించే సద్బుద్ధిని ప్రసాదించుగాక! ఆమీన్.
సమాధిలో నమాజీకి సత్కారం
నమాజు ఇస్లాం ధర్మపు రెండవ ప్రధానాంశం. దీని ఘనత, విశిష్ఠతలకు సంబంధించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుంచి ఎన్నో హదీసులు ఉల్లేఖించబడ్డాయి. ఆయన ఇలా ప్రవచించారు: “రోజుకి ఐదుసార్లు స్నానం చేసేవాడు మాలిన్యం, అశుద్ధతల నుంచి ఏ విధంగా పరిశుభ్రంగా ఉంటాడో ఐదుపూటల నమాజు చేసేవాడుకూడా పాపాలనుంచి అదే విధంగా పరిశుభ్రంగా ఉంటాడు” (బుఖారీ ముస్లిం). వేరొక హదీసులో ఐదుపూటల నమాజు చేసేవారికి అల్లాహ్ స్వర్గం ఇస్తానని వాగ్దానం చేశాడని ఉంది (అహ్మద్, అబూదావూద్). దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవితంలోని చివరి విల్లు కూడా నమాజు గురించే జరిగింది, ‘ప్రజలారా! నమాజ్ను కాపాడుకోండి, మీ బానిసలను దృష్టిలో పెట్టుకోండి’ అని హితోపదేశం చేశారాయన (ఇబ్నెమాజా).
సమాధి జీవితంలో నమాజు గొప్పదనానికి సంబంధించి గొప్ప విలక్షణమైన, ముఖ్యమైన కోణం ఒకటి మనముందుకు వస్తుంది. దైవప్రవక్త ప్రబోధనం ప్రకారం సమాధిలో ముంకిర్ నకీర్ దూతలు ఒక విశ్వాసిని లేపి కూర్చోబెట్టినప్పుడు అతనికి అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత అతనికి, ముంకిర్ నకీర్ దూతలకు మధ్య క్రింది విధంగా ఎంతో ఆసక్తికరమైన భేటి జరుగుతుంది.
ముంకిర్ నకీర్ : మీ దగ్గరికి పంపబడిన ఆయన గురించి మీ నమ్మకమేంటి?
విశ్వాసి : అడ్డు లెండి, (ముందు) నన్ను నమాజు చేసుకోనివ్వండి.
ముంకిర్ నకీర్ : నమాజు తర్వాత చేసుకుంటావుగాని ముందు మా ప్రశ్నలకు సమాధానం చెప్పు.
విశ్వాసి : ఆయన (అనగా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ) గురించి మీరు నన్ను ఏం అడగాలనుకుంటున్నారు?
ముంకిర్ నకీర్ : మేం అడిగిందానికి సమాధానం చెప్పు.
విశ్వాసి : కాస్త అడ్డులెండి (ముందు) నన్ను నమాజు చేసుకోనివ్వండి. మంకిర్ నకీర్ : నమాజు తర్వాత చేస్తావుగాని ముందు మా ప్రశ్నలకు సమాధానం కావాలి.
విశ్వాసి : (ఇందాకటి నుంచి చూస్తున్నాను) అసలు మీరు నన్ను దేని గురించి అడగాలను కుంటున్నారు?
ముంకిర్ నకీర్ : మీ దగ్గరకు పంపబడిన వ్యక్తి (అనగా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి మీ నమ్మకమేంటి? ఆయన గురించి మీరు చెప్పే సాక్ష్యమేంటి?
విశ్వాసి : ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ దాసులని నేను సాక్ష్యం చెబుతున్నాను. ఆయన అల్లాహ్ దగ్గరి నుంచి సత్యం తీసుకువచ్చారని కూడా నేను సాక్ష్యం చెబుతున్నాను.
ముంకిర్ నకీర్ : నువ్వు ఈ నమ్మకం మీదే జీవితం గడిపావు. ఈ నమ్మకం మీదే మరణించావు. అల్లాహ్ తెలిస్తే (ప్రళయదినాన తిరిగి ఈ నమ్మకం మీద లేస్తావు. [ముస్తద్రక్ హాకిమ్ 1/1443]
ముంకిర్ నకీర్ మరియు విశ్వాసికి మధ్య జరిగే సంభాషణలోని పదాలను శ్రద్ధగా చదివి ఆలోచించండి. ఒకవైపు సమాధిలో అంతకుముందెన్నడూ చూడని మొహాలు, అతి భయంకరమైన రూపాలు, మాట్లాడితేనే గర్జించేలాగుండే కంఠస్వరాలు దానికితోడు ఒంటరితనం, చీకటి, ఇరుకైన చోటు- ఇన్ని అసౌకర్యాలు ఉన్నప్పటికీ మరోవైపు విశ్వాసి పరిస్థితిని గమనించండి. అతనిలో కంగారు, ఆందోళన అన్నమాటే లేదు. అతను దైవదూతలతో ప్రశాంతంగా, హుందాగా మాట్లాడుతుంటే ఒక యజమాని ముందు అతని నౌకర్లు నిలబడి మాటిమాటికి ఏదో విషయం అడుగుతుంటే యజమాని అదేమీ పట్టించుకోకుండా మరేదో ముఖ్య ఆలోచనలో నిమగ్నుడై ఉన్నంత వైభవంగా ఉంది.
సుబ్ హా నల్లాహ్ ! నమాజ్ చేసే వ్యక్తికి సమాధిలో ఇంత ప్రశాంతత, ఇంత హుందాతనం, ఇంత నిర్భయం కేవలం నమాజ్ వల్లనే లభిస్తుంది. ప్రపంచంలో అతను ఆ నమాజును ఎంత ఖచ్చితంగా నెరవేరుస్తూ ఉంటాడంటే సమాధిలో సూర్యుడు అస్తమించినట్లు కనబడగానే అతను భయాందోళనలన్నిటిని మరిచిపోయి నమాజు ఆలోచనలో పడిపోతాడు. దైవదూతలు ఎంత బతిమాలినా వారిని పట్టించుకోడు. తర్వాత తను ఉన్నది పితృలోకంలోననీ, ఇక్కడ నమాజు చేయవలసిన అవసరం లేదనీ తాను స్వయంగా గ్రహించినప్పుడు తిరిగి దైవదూతలవైపు దృష్టి సారించి ప్రశాంతంగా వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాడు.
ఇంతకు ముందు సమాధి ఉపద్రవం నుంచి కాపాడే ఆచరణల్లో మీరు నమాజు కూడా సమాధిలో మనిషిని కాపాడే ఆచరణల కోవకు చెందినదేనని చదివారు. ప్రళయానికి ముందే నమాజు తనను పాటించేవారి కొరకు ఎంతటి కారుణ్య ప్రదమైనదో, అది వారి ప్రాణాలకు ఎంతటి హాయినిస్తుందో దీని ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రళయదినాన అల్లాహ్ హక్కుల్లో అన్నిటికంటే ముందు నమాజు గుర్తించే లెక్క తీసుకో బడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. (తిర్మిజీ)
హువల్ అజీజుల్ జబ్బారుల్ ముతకబ్బిర్!
[మహాత్ములు, ఔలియాల పేరుతో చెప్పబడే కట్టుకథల వాస్తవికత]
దైవగ్రంథం, దైవప్రవక్త విధానం విషయంలో అజ్ఞానం వల్ల మననాట నిజమైన విశ్వాసాలు ఎంతగా బలహీనమైపోయాయంటే కుడివైపు, ఎడమవైపు వెనకాముందు ఎటు చూసినా బహుదైవారాధనే కనిపిస్తోంది. మహాత్ములు, వలీల పేర్లతో ప్రజలు ఎలాంటి నమ్మకాలు, కట్టుకథలు సృష్టించుకున్నారంటే యావత్తు విశ్వంలో అల్లాహ్ ఏకత్వానికి, దైవప్రవక్తల దౌత్యానికి అసలు ఆస్కారమే ఉన్నట్లు. కనిపించదు. అల్లాహ్ రక్షించుగాక!
ఈ స్వయంకల్పిత విశ్వాసాలను పరిశీలిస్తే బోధపడేదేమిటంటే మహాత్ముల వలీల పనితనం, కష్టాలను తొలగించే, అవసరాలను తీర్చే వారి ఈ పరంపర ఈ ప్రపంచం వరకే పరిమితం కాదు. పైగా పితృలోకంలో, పరలోకంలోనూ ఇది కొనసాగుతూ ఉంటుంది. ఆ మహానుభావులకు పితృలోకంలోనూ, అధికారం ఉంటుందనే మూఢ విశ్వాసానికి కొన్ని ఉదాహరణలు చూడండి.
1) ఒకసారి ఓ రాజు “నా కూతురు జబ్బుపడింది. మీ మహిమ వల్లనయినా ఆ జబ్బు నయమవు తుందేమో. కాస్త మీరొచ్చి పరామర్శించి వెళ్ళండి” అని ముహద్దీన్ ఇబ్నె అరబీ గారికి కబురు పంపించాడు. ముహయుద్దీన్ ఇబ్నె అరబీ గారు వచ్చి” (సమయం మించిపోయింది) ఇజ్రాయిల్ దూత మీ అమ్మాయి ప్రాణం తీయటానికి వచ్చేశాడు” అని అన్నారు. ఆ మాట వినగానే రాజు ఆయన కాళ్లమీద పడి “నా కూతుర్ని మీరే కాపాడాలి” అని వేడుకున్నాడు. అప్పుడు ఇబ్నె అరబీ ఇజ్రాయీల్ దూతతో “ఆగు! ఆ అమ్మాయి ప్రాణాలు తీయకు. కావాలంటే నా కూతురిని తీసుకొని వెళ్ళు” అని అన్నారు. ఇంటికి వెళ్ళి గుమ్మం వైపు తిరిగి “ఇజ్రాయీల్! ఈ అమ్మాయిని తీసుకువెళ్ళు” అన్నారు. క్షణాల్లో ఆ అమ్మాయి నేలకొరిగి మరణించింది. మరోవైపు రాజుకూతురికి నయమయి పోయింది.
[ముర్షిద్ కామిల్. సాదిఖ్ ఫరాఖానీ గారి హదాయిఖుల్ అఖ్బర్ అనువాద గ్రంథం 23వ పుట]
పై సంఘటన ద్వారా ఈ క్రింది తప్పుడు విషయాలు బోధపడుతున్నాయి:
1) ఇజ్రాయీల్ దూత అల్లాహ్ ఆజ్ఞల్ని కాదు, ఔలియాల ఆజ్ఞల్ని పాటిస్తారు.
2) జీవన్మరణాల మీద ఔలియాలకు పూర్తి అధికారాలు ఉన్నాయి
3) ఔలియాలకు అల్లాహ్ నిర్ణయాలను మార్చేందుకు తిరుగులేని శక్తి ఉంది.
2) రెండో సంఘటన- ఖాజా ముయీనుద్దీన్ చిష్తిగారి అనుచరుల్లో ఎవరో చనిపోతే ఆయన కూడా అతని జనాజా వెంట వెళ్ళారు. ఖననం జరిగిన తర్వాత జనం ఎవరి ఇండ్లకు వాళ్లు వెళ్ళిపోయారు. కాని ఖాజాగారు మాత్రం అక్కడే ఉండిపోయారు. షేఖుల్ ఇస్లామ్ ఖుత్బుద్దీన్ ఇలా అంటున్నారు: ఆ సమయంలో నేను ఆయన దగ్గరే ఉన్నాను. క్షణక్షణం ఆయన మొహంలో రంగులు మారుతూ ఉన్నాయి. కాసేపటికి మామూలు స్థితికి వచ్చారు. అప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళటానికి పైకి లేస్తూ “అల్ హమ్దు లిల్లాహ్ ! బైత్ చేయటం చాలా మంచిది” అన్నారు. షేఖుల్ ఇస్లామ్ ఖతీబుద్దీన్ గారు ఆయన్ని అలా అనటానికి కారణమేమిటని అడిగారు. అప్పుడాయన ఇలా చెప్పారు: ప్రజలు ఈ వ్యక్తిని ఖననం చేసి వెళ్ళిపోయిన తర్వాత నేను చూశాను. శిక్షించే దూతలు ఇతన్ని శిక్షించటానికి వచ్చారు. అప్పుడే షేఖ్ ఉస్మాన్ హారూనీ (ఖాజాగారి గతించిన పీరు) ప్రత్యక్షమయి “ఇతను నా అనుచరుడు” అని చెప్పి అడ్డుకున్నారు. అంతలో దూతలకు ‘ఇతను మీరు చూపిన విధానానికి విరుద్దంగా జీవితం గడిపాడని ఆయనతో చెప్పండి’ అని ఆజ్ఞ అయింది. అందుకు షేఖ్ గారు “ఏమయినా కానివ్వండి, ఇతను ఈ ఫకీరు ఆశ్రమాన్ని అంటిపెట్టుకొని ఉన్నాడు. ఇతన్ని శిక్షిస్తే నేను ఊరుకోను” అన్నారు. అప్పుడు దూతలకు ఆజ్ఞ అయింది. “దూతలారా! షేఖ్ గారి అనుచరుణ్ణి వదలిపెట్టండి. నేనతన్ని క్షమించాను” అని. [రాహతుల్ ఖులూబ్, మల్హూజాత ఖాజా ఫరీదుద్దీన్ షకర్ గంజ్ అజ్ నిజాముద్దీన్ ఔలియా 132వ పుట]
పై కథ ద్వారా ఈ క్రింది తప్పుడు విషయాలు బోధపడతాయి.
1) శిక్ష విధించే లేక రద్దు చేసే అధికారం ఔలియాలకు కూడా ఉంది.
2) ఔలియాలకు పాపాలు క్షమించే అర్హత కూడా ఉంది.
3) ఔలియాల చేతిపై ఒకసారి ప్రమాణం చేసుకుంటే జీవితపు పాపాలన్నీ క్షమించబడతాయి.
3) మూడో సంఘటన-గౌసెపాక్ (అనగా అబ్దుల్ ఖాదిర్ జీలాని) గారి కాలంలో ఒక మహాపాపాత్ముడు ఉండేవాడు. అయితే అతనికి గౌసెపాక్ మీద చాలా అభిమానం ఉండేది. అతను చనిపోయిన తర్వాత సమాధిలో ముంకిర్ నకీర్ దూతలు వచ్చి అతన్ని ప్రశ్నలు అడిగారు. అతను మాత్రం ప్రతి ప్రశ్నకు “అబ్దులాఖాదిర్” అనే జవాబు చెప్పసాగాడు. అప్పుడు అల్లాహ్ తరపునుంచి “ఈ దాసుడు ఫాసిఖ్ (పాపాత్ముడు) అయినప్పటికీ ఇతనికి అబ్దుల్ ఖాదిర్ పట్ల చాలా అభిమానం ఉంది. అందుకని నేను ఇతన్ని క్షమించేశాను” అని తెలియజేయబడింది. [ సీరతెగౌస్ 214వ పుట]
పై కథ ద్వారా సూటిగా బోధపడుతున్నదేమిటంటే ఔలియాలను అభిమానించేవాడు పాపాత్ముడైనా క్షమించబడతాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం ఫాసిఖ్ అంటే ఘోరపాపాలకు పాల్పడినవాడు. ఉదా: నమాజు ఎగ్గొట్టేవాడు. వ్యభిచారం చేసేవాడు. తాగుబోతు మొదలగువారు.
4) షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలాని (రహిమహుల్లాహ్ ) అశాశ్వతమైన ఇహలోకాన్ని వీడి శాశ్వతమైన పరలోకానికి వెళ్లినప్పుడు ఒక మహాత్ముని కలలోకి వచ్చి ఇలా చెప్పారు: ముంకిర్ నకీర్ దూతలు నా దగ్గరికి వచ్చి “మన్ రబ్బుక” (నీ ప్రభువు ఎవరు)?” అని అడిగారు. అందుకు నేను వారితో “ఇస్లామీయ విధానం ప్రకారం ముందు సలాం చేసి కరచాలనం చేయాలి” అని అన్నాను. వారు గతుక్కుమని సలాంచేసి నాతో కరచాలనం చేశారు. అప్పుడు నేను వారిద్దరి చేతులు గట్టిగా పట్టుకొని “ఆదంను పుట్టించినప్పుడు మీరు అల్లాహ్ తో “భూమిలో కల్లోలాన్ని వ్యాపింపజేసేవాణ్ణి పుట్టిస్తావా?” అని చెప్పి దైవజ్ఞానానికంటే మించిపోవటానికి ఎందుకు ప్రయత్నించారు, మీరు? అంతేకాదు, మానవజాతిమీద కల్లోలం, రక్తపాతాల అభియోగం ఎందుకు మోపారు? నా ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తేగాని నేను మిమ్మల్ని వదలిపెట్టను” అని అన్నాను.
ముంకిర్ నకీర్ దూతలు నోరెల్లబెట్టి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఆయన్నుంచి విడిపించుకోవాలని ప్రయత్నించారు. కాని ఆ వీరుడు, ఒంటరి పోరాటయోధుని ముందు దైవదూతల శక్తి ఏపాటిది? గత్యంతరం లేక వారు “ప్రభూ! ఆ మాట మేమే కాదు దూతలందరూ అన్నారు. మమ్మల్ని విడిచిపెట్టండి. మేమెళ్ళి వాళ్ళను అడిగి మీకు సమాధానం చెబుతాం” అని ప్రాధేయపడ్డారు. అప్పుడు గౌసు ఒక దూతను వదలి మరోదూతనుపట్టి ఉంచారు. ఆ దూత పైకెళ్ళి మిగతా దూతలందరికి ఆ విషయం తెలియజేశాడు. కాని వారిలో ఏ ఒక్కరూ ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు అల్లాహ్ తరపునుంచి “మీరంతా నాప్రియుని దగ్గరికి వెళ్ళి మీ తప్పుని మన్నించమని వేడుకోండి. ఆయన మన్నించనంతవరకూ మీకు ముక్తి లభించదు” అని దూతలకు ఆదేశమయింది. దాంతో దైవదూతలందరూ మహబూబ్ సుబహానీ దగ్గరికి వెళ్ళి మన్నించమని ప్రాధేయపడ్డారు. అల్లాహ్ కూడా వారి గురించి సిఫారసు చేశాడు. అప్పుడు గౌసె ఆజమ్ గారు “ఓ సృష్టికర్తా! ఓ గొప్ప ప్రభువా! నీ కరుణా కటాక్షాలతో నా అనుచరులందరినీ క్షమించు. వారికి ముంకిర్ నకీర్ ప్రశ్నల అవస్థ లేకుండా చెయ్యి. అలాచేస్తేనేగాని నేను నీ దూతల్ని మన్నించను” అని డిమాండు చేశారు. అప్పుడు అల్లాహ్ “ప్రియతమా! నేను నీ డిమాండును ఆమోదిస్తాను. నువ్వు నా దూతల్ని మన్నించు” అని అడిగాడు. గౌస్ గారు దూతల్ని మన్నించగా వారందరూ తమలోకాలకు వెళ్ళిపోయారు. [హజ్రత్ రియాజ్ అహ్మద్ గోహరాహి, ముఖ్ తసరుల్ మజాలిస్ 8-10 పుటలు]
పైన పేర్కొనబడిన కథ ద్వారా ఈ క్రింది తప్పుడు విషయాలు బోధపడుతున్నాయి:
1) దైవదూతలు ఔలియాలకు సమాధాన పడవలసి ఉంటుంది.
2) ఔలియాల ముందు దైవదూతలు కూడా నిస్సహాయులే
3) ఔలియాల ముందు అల్లాహ్ కు కూడా సిఫారసు చేయవలసిన దుస్థితి ఎదురవుతుంది.
4) అబ్దుల్ ఖాదిర్ జీలానీ సంబంధీకులందరూ సమాధి ఉపద్రవం నుంచి సురక్షితంగా ఉంటారు.
ఔలియాలు, సూఫీల కథల తర్వాత ఇప్పుడు దైవప్రవక్త కాలంలోనే చనిపోయిన ఇద్దరు గొప్ప మహామహులైన దైవప్రవక్త అనుచరులు సంఘటనలు కూడా చదవండి (చదివి ఏది నిజమో గ్రహించండి!)
1) ఔస్ తెగ సర్దారు సాద్ బిన్ ముఆజ్ (రదియల్లాహు అన్హు) చనిపోయినప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అక్కడికి వచ్చారు. సాద్ తలను తన తొడమీద పెట్టుకొని “ఓ అల్లాహ్! సాద్ నీ మార్గంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. నీ ప్రవక్తను బలపరిచాడు. ఇస్లాం ధర్మ హక్కుల్ని నెరవేర్చాడు. అల్లాహ్! నీవు నీ మిత్రుల పట్ల ఎలా వ్యవహరిస్తావో ఇతని ఆత్మపట్ల కూడా అలాగే వ్యవహరించు” అని ప్రార్థించారు. సాద్ మరణించినప్పుడు ఆయన “సాద్ మరణంతో కరుణామయుని సింహాసనం కదిలింది” అని అన్నారు (బుఖారీ- ముస్లిం). సాద్ గారి శవపేటిక ఎత్తినప్పుడు అది చాలా తేలికగా అనిపించింది. అప్పుడు దైవప్రవక్త “సాద్ జనాజాను దైవదూతలు ఎత్తుకున్నారు” అని చెప్పారు. దైవప్రవక్త స్వయంగా ఆయన జనాజా నమాజ్ చేశారు. తన కోసం ప్రాణాలు సయితం అర్పించటానికి సిద్ధంగా ఉండే తన అనుచరుల మన్నింపుకోసం ప్రార్థించారు. జనాజా నమాజ్ తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “సాద్ జనాజాలో డెబ్భైవేల దూతలు పాల్గొన్నారు” అని చెప్పారు. సాద్ ఆత్మకోసం ఆకాశపు ద్వారాలన్నీ తెరువబడ్డాయి. ఆయన ఆత్మ ఏ ద్వారం గుండానయినా లోనికి వెళ్ళవచ్చు” అని కూడా ఆయన చెప్పారు.
జన్నతుల్ బఖీ (మదీనాలోని శ్మశానం)లో ఆయన ఖననం చేయబడ్డారు. ఆయన కోసం సమాధిని తవ్వింది హజ్రత్ అబూసయీద్ ఖుద్రి (రదియల్లాహు అన్హు) . సమాధి త్రవ్వుతున్నప్పుడు ఆయన “దైవం సాక్షి! నాకు ఈ సమాధిలో నుంచి కస్తూరి సువాసన వస్తుంది” అని అన్నారు. దైవప్రవక్త స్వయంగా తన చేతులతో శవాన్ని సమాధిలో ఉంచారు. సమాధిని మట్టితో పూడ్చిన తర్వాత ఆయన చాలా సేపటి వరకు “సుబహానల్లాహ్ ! సుబ్ హానల్లాహ్!” అని అంటూ ఉన్నారు. అది చూసి ఆయన అనుచరులు కూడా అలాగే అనటం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయన “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలకసాగారు. ఆయన్ని చూసి ఆయన అనుచరులు కూడా అవే పలుకులు ఉచ్చరించటం మొదలుపెట్టారు. ప్రార్థన అయిపోయిన తర్వాత అనుచరులు “దైవప్రవక్తా! ఇందాక మీరు తస్బీహ్, తక్బీర్లు ఎందుకు పఠించారు?” అని అడిగారు. అందుకాయన ఏమాన్నరంటే “ఖననం తర్వాత సమాధి సాద్ ను ఒత్తడం మొదలు పెట్టింది. నేను అల్లాహ్ ను ప్రార్థించగా అల్లాహ్ ఆయన సమాధిని విశాలపరిచాడు”అని చెప్పారు. వేరొక సందర్భంగా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) “సమాధి పీడనం నుంచి ఎవరైనా బయటపడగలిగితే సాద్ బిన్ ముఆజ్ మాత్రమే బయటపడగల్గుతారు” అని కూడా చెప్పి ఉన్నారు. [వివరాల కోసం చూడండి ముస్తద్రక్ హాకిమ్ (4/4981-4983)]
హజ్రత్ సాద్ మరణ సంఘటన నుంచి మనం ఈ క్రింది విషయాలు తెలుసుకోవచ్చు.
1) పాపాలను క్షమించే అధికారం అల్లాహ్ కు మాత్రమే ఉంది. అలాగే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సాద్ (రదియల్లాహు అన్హు) గారి విశ్వాసాన్ని మాత్రమే ధృవీకరించారు. తర్వాత ఆయన మన్నింపు కోసం అల్లాహ్ నుప్రార్థించారు.
2) సాద్ జనాజా నమాజు దైవప్రవక్త స్వయంగా చేయించారు. ఆయనగారి జనాజా నమాజులో డెబ్భైవేలమంది దైవదూతలు పాల్గొన్నారు. ఆయన ఆత్మ కోసం ఆకాశపు ద్వారాలన్నీ తెరువబడ్డాయి. ఆయన శవాన్ని దైవప్రవక్త స్వయంగా తన చేతులతో సమాధిలోకి దించారు. అయినప్పటికీ సమాధి సాద్ ను ఒత్తకుండా వదల్లేదు. దీని ద్వారా తెలిసేదేమిటంటే అల్లాహ్ తన దాసులందరి వ్యవహారాలమీద అధికారం ఉన్నవాడు. అందుకే ఆయన విధించబోయిన శిక్షను ప్రవక్తగాని డెబ్భైవేల దూతలుగాని ఎవరూ ఆపలేకపోయారు.
3) సాద్ ను సమాధి ఒత్తుతుండటం చూసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కంగారుపడి అల్లాహ్ ను స్తుతించటం, ఆయన పవిత్రతను కొనియాడటం, ఆయన గొప్పదనాన్ని కీర్తించటం మొదలు పెట్టారు. సాద్ కు సమాధియాతన తప్పేవరకూ అలాగే చేస్తూ ఉన్నారు. దీని ద్వారా తెలిసేదేమంటే దైవానికి నమ్రతా అణకువ భావాలతో విన్నపాలు, వినతులయితే చేసుకోవచ్చుగాని బలవంతంగా తనమాటను ఒప్పించటం దైవ ప్రవక్తకు కూడా సాధ్యం కాదు.
2- రెండో సంఘటన హజ్రత్ ఉస్మాన్ బిన్ మజ్ ఊన్ ది. ఉస్మాన్ బిస్ మజ్ ఊన్ (రదియల్లాహు అన్హు) మక్కా నుంచి మదీనాకు వలసవెళ్ళిన తర్వాత అప్పుడు జరిగిన (సోదర సంబంధాల) ప్రకారం ఉమ్ముల్ ఉలా అన్సారియా (రదియల్లాహు అన్హా) ఇంట్లో ఉండేవారు.
ఆయన మరణించినప్పుడు ఉమ్ముల్ ఉలా (రదియల్లాహు అన్హా) దైవప్రవక్త సమక్షంలోనే ఇలా అన్నారు: ఓ అబూ సాయిబ్! (ఇది ఉస్మాన్ కు మారుపేరు) నీ మీద అల్లాహ్ కారుణ్యం అవతరించుగాక! (మరణానంతరం) అల్లాహ్ నీకు గౌరవాన్ని ప్రసాదించాడని నేను సాక్ష్యం చెప్పగలను” ఆ మాట విన్న దైవప్రవక్త ‘అతనికి గౌరవం లభించిందని నీకెలా తెలుసు’ అని అడిగారు. అందుకు సమాధానమిస్తూ ఉమ్ముల్ ఉలా (రదియల్లాహు అన్హా) “దైవప్రవక్తా! నా తల్లిదండ్రుల్ని మీ కోసం అర్పింతును. అల్లాహ్ ఈయనకు గౌరవం ప్రసాదించకపోతే ఇంకెవరికి ప్రసాదిస్తాడు” అని అన్నారు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏం చెప్పారో చూడండి. “ఉస్మాన్ కు మరణం వచ్చింది. దైవసాక్షి! నేను ఆయనకు మంచే జరగాలని కోరుకుంటున్నాను. (కాని ఒకరి గురించి ముందే అలా ఖచ్చితంగా చెప్పలేము, నా విషయమే తీసుకోండి) నేనొక దైవప్రవక్తను కాని దైవం తోడు! (ప్రళయదినాన) నా పరిస్థితి ఎలా ఉంటుందో నాకే తెలియదు.”
ఈ సందర్భంగా మీరు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. హజ్రత్ ఉస్మాన్ బిన్ మజ్ ఊన్ (రదియల్లాహు అన్హు) కు రెండుసార్లు ఇథియోపియాకు, మూడోసారి మదీనాకు హిజ్రత్ చేసే సౌభాగ్యం లభించింది. ఈయన చనిపోయినప్పుడు దైవప్రవక్త ఈయన నుదుటిని మూడుసార్లు ముద్దాడారు. “ఉస్మాన్! నువ్వు ఈ ప్రపంచంతో ఏ మాత్రం కలుషితం కాకుండా ఇక్కణ్ణుంచి వెళ్ళిపోయావు” అని అన్నారు.
ఉస్మాన్ బిన్ మజ్ ఊన్ (రదియల్లాహు అన్హు) సంఘటన నుంచి మనకు ఈ క్రింది విషయాలు బోధపడతాయి.
1) అల్లాహ్ దగ్గర ఎవరికి ఎలాంటి స్థానముందో ఎవరికీ తెలియదు.
2) పాపాలను మన్నించే లేక మన్నించకుండా ఉండే అధికారం అల్లాహ్ కు మాత్రమే ఉంది.
3) అల్లాహ్ ఔన్నత్యం, గొప్పదనం ముందు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా నిస్సహాయులే.
పాఠక మహాశయులారా!
ఇస్లాం ధర్మం దైవగ్రంథం, దైవప్రవక్త విధానం మీద ఆధారపడి ఉందని మీ అందరికీ తెలుసు. ఆ రెండూ మనకు బోధిస్తున్నదేమిటంటే-అల్లాహ్ కు తన దాసులందరిమీద అధికారం ఉంది. ఒకరి పాపాలను క్షమించటం క్షమించకపోవటం అనే అధికారం కేవలం ఆయనకు మాత్రమే ఉంది. ఆయన తాను తలచుకున్నది చేస్తాడు. ప్రవక్తలు, దూతలందరూ కలిసి కూడా ఆయన ఆజ్ఞల్ని మార్చలేరు. తప్పించనూ లేరు. ఆయనకు తన నిర్ణయాలన్నిటినీ అమలు పరిచే శక్తి ఉంది. ఈ విశ్వంలో ‘అజీజు’ (సర్వాధిక్యుడు) ఆయన మాత్రమే. ఆయన మాత్రమే జబ్బారు (బలవంతంగా తన ఆజ్ఞల్ని అమలుపరిచేవాడు). ఆయనే ముతకబ్బిర్ (తన సృష్టిముందు గొప్పవాడై ఉండేవాడు). ఏ ప్రవక్త లేక వలీ ముందయినా ఆయనకు సిఫారసుకర్తగా నిలబడవలసి వస్తుందనే భావనకు ఆయన చాలా అతీతుడు.
దైవప్రవక్త కాలానికి సంబంధించిన పై సంఘటనల ద్వారా మనకు ఆ విషయాలే బోధ పడుతున్నాయి. మహాత్ములు, ఔలియాల పేరుతో చెప్పబడే కట్టుకథలు ఖుర్ఆన్ హదీసుల బోధనలకు, దైవప్రవక్త కాలంలోని సంఘటనలకు విరుద్ధంగా ఉన్నాయి. నిజానికి బుజ్ రుగ్ లు , వలీల గురించి ఇలాంటి కథలు చెప్పటం అల్లాహ్ పట్ల ఎంతటి అపచారమంటే ఆ పాపానికి భూమి బ్రద్దలయినా లేక ఆకాశం విరిగి పడినా ఆశ్చర్యం లేదు. ముష్రిక్కులు కల్పించే బహుదైవత్వ భావనలకు అల్లాహ్ ఎంతో అతీతుడని మేము సాక్ష్యం చెబుతున్నాం. సుబహాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిపూన్. سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّتِ عَمَّا يَصِفُوْنَ
ఒక అపోహ!
ముస్లింలలోని ఒక వర్గం సమాధిలో శిక్షగాని లేక బహుమానంగాని ఉంటుందనే విశ్వాసాన్ని త్రోసిపుచ్చుతోంది. అందుకు ఆ వర్గం వారు చూపించే ఆధారాలు, నిదర్శనాల్లో ఒకటి ఏమిటంటే “శిక్షలు, బహుమానాలు అనేవి ప్రళయదినానికి సంబంధించినవి. అంతకుముందు శిక్షించటం లేక బహుమానం ఇవ్వటం న్యాయానికి విరుద్ధం. కనుక సమాధిలో శిక్షలుగాని బహుమానాలుగాని ఏవీ ఉండవు”.
ఈ అపోహకు కారణమేమిటంటే సమాధి జీవితం ప్రస్తుతం మనం గడుపుతున్న జీవితం కంటే వేరుగా ఉంటుంది. అది పరలోక జీవితానికి కూడా భిన్నంగా ఉంటుంది. కనుక సమాధి జీవితంలోని పరిస్థితుల స్వరూపస్వభావాలను అర్థం చేసుకోవటం బ్రతికున్న మనకు అసాధ్యం. దీనిగురించి మేము తొలిపలుకుల తర్వాత అనుబంధంలో “సమాధి జీవితం ఎలా ఉంటుంది!” అనే శీర్షికన చాలా విస్తృతంగా చర్చించాం. అది చదివితే ఇన్షా అల్లాహ్ ఇలాంటి అనేక అపోహలు దూరమవుతాయి.
పైన పేర్కొనబడిన అపోహకు రెండోకారణం, సమాధిలో లభించే శిక్ష లేక బహుమానం యొక్క స్వభావం సరిగ్గా, స్పష్టంగా తెలియకపోవటం. ఇక్కడ మేము సమాధి జీవితంలో లభించే శిక్ష లేక బహుమానపు స్వభావం సరిగ్గా ఎలా ఉంటుంది ‘అనే విషయాన్ని ఒక ఉదాహరణ ద్వారా స్పష్టం చేయటానికి ప్రయత్నిస్తాం.
పోలీసు ఉన్నతాధికారులు ఎవరైనా వ్యక్తి గురించి “ఫలానా అతను నేరాలను వృత్తిగా చేసుకొని బతుకుతున్నాడు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ మాదగ్గర ఉన్నాయి. అతన్ని అరెస్టు చేయండి” అని తమ క్రింద పనిచేసే పోలీసుల్ని ఆదేశించారనుకోండి. అప్పుడు పోలీసులు అతన్ని అరెస్టు చేస్తారు. చట్టప్రకారం కోర్టు నుంచి తీర్పు వెలువడనంతవరకూ అతన్ని ఏవిధంగానయినా శిక్షించే అధికారం పోలీసులకు లేకపోయినప్పటికీ అతన్ని తమ కస్టడీలో ఉంచిన పోలీసు వర్కర్లకు అతని నేరప్రవృత్తి గురించి తెలిసి ఉంటుంది. కనుక వారు అతన్ని విపరీతంగా అసహ్యించుకుంటారు, గదుముతూ ఉంటారు. “కోర్టు నుంచి తీర్పు రానీ, అప్పుడు నీ అంతు తేలుస్తాం” అని బెదిరిస్తారు, భయపెడ్తారు. పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు నిజానికి అతనిపట్ల చాలా నీచంగా, అవమానకరంగా ప్రవర్తించటం జరుగుతుంది. అతన్ని కూర్చీమీద కూర్చోనివ్వరు. మంచం మీద పడుకోవటానికీ అనుమతించరు. అతని దగ్గరినుంచి వెళ్ళే ప్రతిపోలీసు అతని ప్రాణం తీస్తాడా అన్నట్లు అతని వంక కోపంగా చూస్తూ వెళ్తాడు.
తెలుస్తూనే ఉంది. ఇలాంటి మనిషి తన కేసు కోర్టుకు వెళ్ళాలనిగాని, అక్కడ చట్టప్రకారం తీర్పు జరగాలని గాని ఎన్నటికీ కోరుకోడు. కాని ఎప్పుడయితే కోర్టులో అతని కేసుకు సంబంధించి విచారణ జరిగి తీర్పు వెలువడుతుందో, ఆ తీర్పు ప్రకారం అతని అసలు శిక్ష-కొరడా దెబ్బలు, ఇతర బాధలు లేక జరిమానా మొదలగునవి మొదలవుతాయి. కారాగార శిక్షకు ముందు పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు నిందితునికి కలిగే మానసిక హింస కారాగారంలో లభించే శారీరకశిక్ష కంటే వేరయినప్పటికి అది కూడా ఒక శిక్షే కదా! సమాధి శిక్ష కూడా పోలీసు కస్టడీలో నిర్బంధించబడిన నిందితునికి కలిగే మానసిక హింస లాంటిదే. న్యాయస్థానంలో ఆ నిందితుని కేసు విచారణ జరగటం, దాని ప్రకారం శిక్షపడటం ఇంకా మిగిలి ఉంది. అదిమటుకు ప్రళయదినానే జరుగుతుంది. కాని ప్రళయంకంటే ముందు అవిశ్వానికి అతని పర్యవసానం తెలియజేయటం, అతన్ని అవమానించటం పరాభవించటం, అతనికి అతని పరలోకస్థానం చూపించటం కూడా ఒక రకంగా శిక్షే. అఫ్కోర్స్ అది నరక శిక్షకు భిన్నంగా ఉండవచ్చు.
అలాగే సమాధిలో విశ్వాసికి, దైవభక్తిపరునికి లభించే శిక్ష లేక బహుమానపు ఉదాహరణ ఈ వ్యక్తిని పోలి ఉంటుంది. పోలీసులు అతన్ని ఉన్నతాధికారుల ఆదేశం మేరకు అరెస్టు అయితే చేశారు కాని, అరెస్టుకాబడిన వ్యక్తి నిర్దోషి అనీ, చట్టబద్ధుడు, మంచి పౌరుడనీ కనుక అతని పట్ల గౌరవంగా, మర్యాదగా వ్యవహరించమని కూడా ఉన్నతాధికారులు వారికి పురమాయించి ఉంటారు. అలాంటప్పుడు న్యాయస్థానం నుంచి తీర్పు వెలువడక ముందు పోలీసులు అతన్ని విడుదల చేయలేకపోయినా అతని మంచితనం, మర్యాదల మూలంగా పోలీసులందరూ అతన్ని గౌరవదృష్టితో చూస్తారు. అతని అవసరాలన్నీ తీరుస్తారు. పైగా “మీరేమి చింతించకండి. మీరు నిర్దోషులు. మీరు తప్పకుండా న్యాయస్థానంలో గౌరవంగా నిర్దోషి అయినట్లు ప్రకటించబడతారు’ అని అతనికి ధైర్యం చెబుతారు. ఇలాంటి వ్యక్తి తన కేసు త్వరగా న్యాయస్థానంలో ప్రవేశపెట్టబడాలనీ, వీలైనంత త్వరగా తను సుఖశాంతులతో కూడిన జీవితం గడపాలని విపరీతంగా కోరుకుంటాడు. న్యాయస్థానంలో కేసు విచారణకు వచ్చి న్యాయస్థానం గౌరవంగా అతన్ని నిర్దోషిగా ప్రకటించినప్పుడు పోలీసులు పూర్తి గౌరవమర్యాదలతో అతన్ని సుఖదాయకమైన శాంతిపూర్వకమైన అతని ఇంటికి చేరుస్తారు. రిమాండులో ఉన్నప్పుడు అతనికి లభించిన గౌరవం, సుఖం తన ఇంటికి చేరుకున్న తర్వాత లభించే గౌరవం, సుఖం లాంటిది కాకపోవచ్చు. అయినప్పటికీ అది కూడా అతని మంచితనానికి లభించిన బహుమానం, గౌరవమే కదా! సమాధిలో విశ్వాసికి లభించే గౌరవసత్కారాల సంగతి కూడా పూర్తిగా అంతే! స్వర్గంలో ఇంటి శుభవార్త అతనికి వినిపించబడుతుంది. ఇతర అనుగ్రహాలు చూపించబడతాయి. అన్ని విధాల సుఖశాంతులు కల్పించబడతాయి. అయితే విశ్వాసి ఆ అనుగ్రహాలను, సుఖాలను క్రియాత్మకంగా అనుభవించటం అనేది తను అల్లాహ్ న్యాయస్థానంలో నిర్దోషిగా ప్రకటించబడి పూర్తి గౌరవమర్యాదలతో స్వర్గంలోకి ప్రవేశించే రోజు మాత్రమే జరుగుతుంది. వల్లాహు ఆలము బిస్సవాబ్!
సమాధి గుణపాఠం నేర్చుకునే స్థలమా లేక జాతర స్థలమా?!
మేము ఇంతకు ముందు రాసినట్లు సమాధి నిశ్చయంగా గొప్ప భయాందోళనకరమైన ప్రదేశం. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా ఆ మాట చెప్పారు. “నేను సమాధికంటే భయాందోళనకరమైన ప్రదేశమేదీ చూడలేదు” (తిర్మిజీ). ఒకరి అంత్యక్రియల్లో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధికి తలవైపున కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో ఆయన సమాధి పీడనాన్ని గుర్తుకు తెచ్చుకుని ఎంతగా విలపించారంటే ఆయన కన్నీటితో సమాధి మట్టి తడిచిపోయింది. ఆయన ఇంకా ఇలా అన్నారు. “నా సోదరులారా! దీని కోసం ఏమైనా సన్నాహాలు చేసుకోండి” (తిర్మిజీ). ఆయన స్వయంగా సమాధి శిక్షనుంచి శరణు కోరుకోమని హితోపదేశం చేశారు. ఆయన అవలంబించిన విధానం ఫలితంగా సమాధి ప్రస్తావన రాగానే ఆయన అనుచరులు కన్నీరు మున్నీరుగా విలపించేవారు, దుఃఖ పడేవారు.
హజ్రత్ సల్మాన్ ఫార్సీ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: మూడు విషయాలు నన్ను దుఃఖానికి గురిచేస్తాయి. వాటిమూలంగా నేను కన్నీరుమున్నీరుగా విలపిస్తాను. మొదటిది. దైవప్రవక్త యెడబాటు దుఃఖం. రెండోది, సమాధి శిక్ష. మూడోది, ప్రళయభయం.
హజ్రత్ మాలిక్ బిన్ దీనార్ (రహిమహుల్లాహ్ ) చావుని, సమాధిని గుర్తుచేసుకొని సొమ్మసిల్లిపోయేలా ఏడ్చేవారు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కేవలం ప్రజలకు పరలోకం గుర్తుకురావాలన్న ఉద్దేశ్యంతోనే తన అనుచర సమాజానికి సమాధుల్ని సందర్శించేందుకు అనుమతినిచ్చారు (తిర్మిజీ).
ముస్నద్ అహ్మద్ లోని వాక్యాలు ఇలా ఉన్నాయి: “సమాధుల్ని సందర్శించండి. ఎందుకంటే సమాధుల సందర్శనం గుణపాఠం నేర్పుతుంది“. అంటే ఆ సమయంలో మనిషి ప్రపంచాన్ని మర్చిపోయి పరలోకంవైపు దృష్టిసారిస్తాడు. ప్రపంచం అశాశ్వతం అన్న విషయం గురించి ఆలోచించటానికి అవకాశం లభిస్తుంది. ఇతరుల సమాధులు చూసి తన సమాధి గుర్తొస్తుంది. తాత్కాలికమైన ప్రాపంచిక ప్రయోజనాల కోసం దేఅల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు అవిధేయత చూపుతున్నందుకు బాధ, పశ్చాత్తాపాలు కలుగుతాయి. తను చేసిన పాపాలకు పశ్చాత్తాపపడి మన్నింపుని వేడుకుందామనే కోరిక పుడుతుంది. కాని నేడు మన నాట సమాధుల దగ్గర జరుగుతున్న దాని ఫలితం పూర్తిగా భిన్నంగా ఉంది. మీరే ఆలోచించండి! ఏ సమాధుల దగ్గరయితే ప్రేమ పురాణాలు, బహుదైవా రాధన విషయాలు నిండి ఉండే ఖవ్వాలీ గాన కచేరీలు జరుగుతాయో అక్కడ పరలోక జ్ఞాపకాలు ఎలా వస్తాయి? డోలు, ఢమరుకాల వాద్యం మత్తులో యువతీయువకులు ఊగిపోతూ ఉన్నచోట ముంకిర్ నకీర్ జ్ఞాపకం ఎలా వస్తారు?
2001 ఏప్రిల్ నెలలో జరిగిన సంఘటన గుర్తుచేసుకోండి!. పాక్ పతన్ ప్రదేశంలోని బాబా ఫరీద్ దర్గా దగ్గర జాతర సందర్భంగా స్వర్గద్వారం (అనబడే ఒక ప్రత్యేకద్వారం) గుండా వెళ్ళాలని కోరుకున్న జనసందోహం మధ్య జరిగిన తొక్కిసలాటలో అరవైమంది మరణించారు. దానికి కారణం ఏమని తెలుపబడిందంటే, దర్గాపూజారి, దర్గాకు ‘సేవ’ చేస్తున్నందుకుగాను ప్రతి సంవత్సరం ప్రభుత్వం అతనికి ఒకటిన్నర లక్షలు గ్రాంటు ఇస్తుంది. ఆ పూజారి స్వర్గద్వారం తెరువకముందు తన గ్రాంటు ఒకటిన్నర నుంచి పదిహేను లక్షలకు పెంచమనీ, అప్పుడే ద్వారం తెరుస్తాననీ అక్కడి యాజమాన్యంతో గంటల తరబడి వాదులాడుతూ ఉన్నాడు. ద్వారం తెరువడంలో చాలా ఆలస్యమైంది. ద్వారం దగ్గర రద్దీ పెరిగింది. దాని మూలంగానే ఆ సంఘటన సంభవించింది. [వివరాలకు చూడండి దావత్ పత్రిక 1422 సఫర్ మాసం, మే, 2001 లాహోర్, పాకిస్తాన్]
సమాధి పూజ, బహుదైవారాధన పరలోకంలో ఎలాగూ మానవుల వినాశానికి, కారణమవుతుంది. దానితోపాటు ఈ ప్రపంచంలో కూడా దాని వల్ల జరిగే సామాజిక చెడులను, నైతికరాహిత్యాన్ని, ఇతర విషపూరిత ఫలితాలను ఈ క్రింద పేర్కొనబడిన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తల ద్వారా అంచనా వేయవచ్చు.
1) బహావల్పూర్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థినులు ఆ జిల్లాలో ఖాజా మహ్ క ముద్దీన్ మీరాయి దర్గా దగ్గర ప్రతియేటా జరిగే జాతరకు వెళ్ళారు. ఆ దర్గాపూజారి కొడుకు వారిద్దరిని అపహరించాడు. నిందితుడి తండ్రి అయిన దర్గాపూజారి కూడా మాదక ద్రవ్యాలు అమ్ముతూ పట్టుబడినవాడే. [ ‘ఖబ ‘ దినపత్రిక, లాహోర్ 15 అక్టోబర్, 1992]
2) రాయ్ వండ్ ప్రదేశంలో బాబారహ్మత్ షాహ్ దర్గా దగ్గర జరిగే జాతరలో వెరైటీ ప్రోగ్రామ్ పేరిట వేయబడిన ఏడు క్యాంపుల్లో నృత్యకచేరీలు సాగుతున్నాయి. డజనులమంది నవయువతులైన అమ్మాయిలు అశ్లీల నృత్యం చేసి చూపరుల నీరాజనాలు అందుకుంటున్నారు. చూపరులందరూ కొత్తకొత్త నోట్ల కట్టలతో ఇక్కడికి వస్తారు. రాత్రి రెండు గంటలవరకు మువ్వల సవ్వడి, తాగుబోతుల రొద వినిపిస్తూ ఉంటాయి. సైకిల్ షో అనే కార్యక్రమంలో అబ్బాయిలు అమ్మాయిల వేషం వేసి డాన్స్ చేస్తూ స్వలింగ సంపర్కానికి కారణమవుతున్నారు. జాతరలో జూదం, మద్యపానం, ఆయుధ ప్రదర్శన సర్వసామాన్యం అయిపోయింది. పౌరులు నిరసనలు చేసినా ఎలాంటి చర్య తీసుకోబడలేదు. [నవాయె వఖ్త్ దినపత్రిక లాహోర్ 6 ఆగస్టు 2001]
3) దాతా తిరునాళ్ళ ముసుగులో అశ్లీల పాటలతో ఉద్వేగభరితమైన డాన్సు, పోలీసులు, ఆలయ యజమానుల సహాయంతో డజన్లకొలది వేశ్యల రహస్యక్యాంపులు విపరీతంగా కొనసాగుతున్నాయి. అశ్లీల పాటలతో ఉద్విగ్నభరిత నత్యం చూడటానికి పదేళ్ల పిల్లల నుంచి డెబ్భైయేళ్ల కురువృద్ధులదాకా వందల సంఖ్యలో వస్తారు. గంజాయి పొగలు, అశ్లీల పదజాలంతో కూడిన ఆ పాటలు అసలే మత్తెక్కివున్న ఆ గానకచేరీలను మరింత వేడెక్కిస్తాయి. వందరూపాయల నోట్లు అర్పించబడతాయి. ఒకవేశ్య మరియు ఓ గ్లోకార్ పరస్పరం చాలా సేపటివరకు కౌగిలించుకొని అలాగే నించున్నారు. యువకులు వేశ్యల్ని పంచుకున్నారు. వారు పేరు పెట్టి పిలవగానే ఆ వేశ్యలు స్టేజీ మీదకు వచ్చి వారి మనసును రంజింపచేస్తారు. ఒక దశలో వేశ్యలు డాన్స్చేస్తూ నేలమీద వెల్లకిలా పడుకున్నారు. దాంతో ఆకతాయిలు లేచి నించున్నారు. అప్పుడు జరిగిన కోలాహలంలో వందలాది కుర్చీలు విరిగిపోయాయి. [ఖబ్రే రిపోర్ట్ షాహ్హహషపర్ సౌజన్యంతో-అమీర్ హమ్జా 79వ పుట]
4) డబ్బా పీర్లు విదేశీ ఏజెంట్ల వ్యాపారం కూడా చేబుచ్చుకున్నారు. ప్రభుత్వంతో ప్రగాఢమైన సంబంధాలు కలిగి ఉన్నారు. వారి ఈ రాజకీయ ప్రభుత్వ అండదండల మూలంగా పోలీసులు నేరాలను వృత్తిగా చేసుకుంటున్న ఎంతోమందిని అరెస్టు చేయటానికి భయపడుతున్నారు. ఇండ్ల వెంట తిరిగే ఫకీర్లు రాజకీయ సభలు సమావేశాలకు తప్పకుండా హాజరవుతారు. [ ఖబ్రే రిపోర్ట్, షాహ్హహ్ బహషపర్ సౌజన్యంతో, అమీర్ హమా-79వ పుట]
5) స్త్రీల నగ్న శరీరాల మీద తావీజులు రాసే రాస్పోటెన్ పట్టుబడ్డాడు. అతణ్ణి వ్యభిచారం హత్య, దోపిడి, స్మగ్లింగ్ మొదలగు నేరాల క్రింద అనేక జిల్లాల పోలీసులు వెతుకుతున్నారు. ముల్తాన్ తర్వాత షేఖూపూరా శివారుగ్రామాల్లో ఓ ‘మఠం’ స్థాపించి ఈ అవినీతి వ్యాపారం చేస్తుండేవాడు. [ఖబ్రే రిపోర్ట్ షాహ్హ్ బహమ్హర్ సౌజన్యంతో, అమర్ హమ్జా-67వ పుట]
పాఠక మహాశయులారా!
మన దర్గాల, మఠాల, ఆస్థాన లోకపు సంక్షిప్త సమాచారం ఇది. చూశారుగా! అవి మనం నివసిస్తున్న లోకం కన్నా ఎక్కువ రంగవైభవంగా, ఎక్కువ మనోహరంగా, ఎక్కువ ఆకర్షవంతంగా ఉంటాయి. ఇలాంటి సమాధులు, దర్గాల దగ్గరికివెళితే చావు ఎలా గుర్తుకొస్తుంది? పరలోకం జ్ఞాపకం ఎందుకు వస్తుంది? శిక్ష లేక బహుమానపు చింత ఎలా పుడుతుంది? దైవభీతి ఎవరి హృదయంలో పుడుతుంది? ఐహిక అనాసక్తత ఎలా జనిస్తుంది? అందుకే, ఈ కారణంగానే ఇస్లాం ధర్మంలో సమాధుల దగ్గర జాతరలు పెట్టడం, కచేరీలు చేయటం, క్యాంపులు నిర్వహించటం, గుంబదులు నిర్మించటం, తిరునాళ్లు చేయటం, దీపాలు పేర్చటం, పూలదుప్పట్లు పరవటం సమాధి లేక దానిమీద కట్టబడి ఉన్న కట్టడాన్ని చుంబించటం, దాని ముందు తలవంచటం, సజ్జా చేయటం సమాధి చుట్టూ ప్రదక్షిణలు చేయటం, సమాధి దగ్గర ఖుర్బానీ చేయటం, అన్నదానం చేయటం, సమాధిలో ఉన్నవారికి తమ బాధలు, అవసరాలు నివేదించుకోవటం మొదలగునవన్నీ నిషేధించబడ్డాయి. పెద్ద షిర్క్ అంత ఘోరపాపాలు ఇవి. పోతే ఏ పండితుల విధానంలోనయితే ఈ పనులన్నీ ధర్మసమ్మతంగా భావించబడ్డాయో వారిని మేము కడు బాధాతప్త హృదయంతో, చిత్తశుద్ధితో విన్నవించుకునేదేమిటంటే “ఏమండీ! మీరే ఆలోచించండి. బలులు ఇవ్వటానికని, జాతరలు చేయటానికని, మొక్కుబడులు చెల్లించుకోవటానికని విన్నపాలు చేసుకోవటానికని, దానధర్మాలు చేయటానికని, అవసరాలు తీర్చమని కోరటానికని ఏదో వంకతో సమాధుల దగ్గరికి, మఠాల దగ్గరికి, ఆస్థానాల దగ్గరికి వచ్చే స్త్రీ పురుషుల మూలంగా సమాజంలో జనిస్తున్న నైతికరాహిత్యం, అశ్లీల వాతావరణం, వ్యభిచారం, ఇతర చెడుల నిర్లజ్జాకరమైన సంస్కృతికి బాధ్యులు ఎవరు? ప్రళయదినాన దీనికి జవాబుదారీ వహించే బాధ్యత ఎవరిది?
రెండు: ఆ పండితుల దృష్టిని కాస్త ఈ మాటవైపు కూడా సారించదలిచాం. అదేమిటంటే మంచి నుంచి మంచే పుడుతుంది. మేలు నుంచి మేలే పుడుతుంది. అలాగే చెడు, పాపాల నుంచి చెడు, పాపాలే పుడతాయి. ఇది సర్వజనామోద సత్యం. మామిడిచెట్టు నాటితే కందిపప్పు రాదు. కందిపప్పు నాటితే మామిడిపండ్లు కాయవు- ఇలా ఎప్పుడూ జరగలేదు. సమాధుల దగ్గర, మఠాల్లో మొక్కుబడులు చెల్లించుకోవటం, బలులు ఇవ్వటం కోరికలు తీర్చమని వేడుకోవటం, జాతరలు, తిరునాళ్లు చేయటం గనక నిజంగా ఇస్లామీయ షరీఅత్లో సమ్మతమైనవి, పుణ్యప్రదమైనవి అయితే ఆ
మంచిపనుల నుంచి, ఆ పుణ్యకార్యాల నుంచి అశ్లీల, నిర్లజ్జాకరమైన, వ్యభిచార, నేరవృత్తితో కూడిన సంస్కృతి ఎందుకు జన్మిస్తోంది? సమాజాన్ని జూదం, వ్యభిచారం, మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగం, ఇతర నేరాల నుంచి ప్రక్షాళనం చేయాలని కోరుకునే పండితులు మా ప్రశ్న గురించి చిత్తశుద్ధితో ఆలోచిస్తారా?
చావు ఇచ్చే సందేశం!
నిస్సందేహంగా చావు ఓ ఘోరప్రమాదం. కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఒక మనిషి చనిపోవటం మూలంగా ఎన్నో జీవితవ్యవహారాలు చిందర వొందర అయిపోతాయి. ఎన్నో ప్రణాళికలు అసంపూర్ణంగా మిగిలిపోతాయి. ఎన్నో అందమైన కలలు కల్లలై పోతాయి. ఒకచోట చిన్న చిన్న పిల్లలు అనాధలైపోతే మరోచోట ముసలి తల్లిదండ్రులు నిరాధారులైపోతారు. కొన్నిచోట్ల కొందరి వైవాహిక జీవితాలు నాశనమయితే మరికొన్ని చోట్ల అన్నాచెల్లెళ్ల ఆధారాలు తొలగిపోతాయి. తీవ్ర దుఃఖవిచారకరమైన ఈ పరిస్థితిలో మృతుని ఆత్మీయుల నుంచి సాధారణంగా రెండు రకాల స్పందనలు వ్యక్తం అవుతాయి.
1) చనిపోయిన యెడబాటు దుఃఖం. ఇది పూర్తిగా ఓ సహజ విషయం. షరీఅత్ పరిధుల్లో ఉంటూ దుఃఖాన్ని, బాధను వ్యక్తం చేయటం తప్పూకాదు, నిషేధమూ కాదు.
2) మృతుని ప్రాపంచికపు పనులు చింత: ఇంట్లో ఓ ముఖ్యవ్యక్తి చనిపోవటం మూలంగా జీవన వనరులు స్తంభించిపోవటం, దాని ప్రత్యామ్నాయ వనరులను గురించి ఆలోచించటం. అతను వదలివెళ్లిన ఆస్తిని పంచటం. ఈ పనులు చేయటం మనిషికి ఎలాగూ తప్పదు. షరీఅత్ నియమించిన హద్దులు పాటిస్తూ ప్రాపంచిక వ్యవహారాల గురించి ఆలోచించటం తప్పు కాదు. పైగా అది అవసరం కూడా.
అయితే శోచనీయమైన విషయం ఏమిటంటే ఆత్మీయుల మరణం వల్ల వ్యక్తమయ్యే ఈ స్పందన షరీఅతు హద్దుల్ని దాటి వారి మనుషుల మనోమస్తిష్కాలను మరో విధంగా ఆవహిస్తుంది. దానిమూలంగా చావు ఇచ్చే అసలు సందేశం ఎవరి బుర్రలకూ తట్టదు. జీవన్మరణాల ఈ కోలాహలంలో ఎవరికీ ఈ రెండు విషయాలు తప్ప ఆలోచించదగిన విషయం మరొకటి ఆత్మీయులకు చావు ఇచ్చే అసలు సందేశం ఇదిః
‘ఈ రోజు ఇతని వంతైతే ………రేపు మీ వంతు’.
మృత్యుదూత ప్రతి మనిషి కోసం మాటువేసి ఉన్నాడు. మన చుట్టుప్రక్కల ఎన్నో ఉదాహరణలు గడుస్తుంటాయి. బాగా ఆరోగ్యంగా ఉన్న మనుషులు రాత్రిపూట రోజూలాగే తమ పడకలమీద నిద్రపోతారు. కాని వారికి ఉదయం నిద్రమేల్కొనే వ్యవధి కూడా ఉండదు. ఎంతోమంది తమ ఇండ్లనుంచి ఉమ్రా లేక హజ్ చేయాలనే ఉద్దేశ్యంతో బయలుదేరుతారు కాని వారికి తిరిగి ఇంటికి చేరుకునే అదృష్టం ఉండదు. ఎన్నో వివాహబృందాలు బాజాభజంత్రీలతో, సన్నాయి మోతలతో బయలుదేరుతాయి కాని విధివక్రించినవేళ దుఃఖవిచారాలతో గుండెలు బాదుకుంటూ తిరిగిరావలసి వస్తుంది. ఎంతోమంది తమ దైనందిన పనుల్లో నిమగ్నులై ఉంటారు. హఠాత్తుగా వారికి గుండెపోటు వస్తుంది. దాంతో ఆ పనులన్నీ ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండిపోతాయి. నేటికి రేపటికి భేదమెంతో జీవన్మరణాలమధ్య భేదం కూడా అంతే. ఈ వాస్తవాన్నే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎంతో అందమైన రీతిలో వివరించారు.
ఈ రోజు కర్మలు, విచారణ కాదు. రేపు విచారణ, కర్మలు కాదు (బుఖారీ)
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కు “అబ్దుల్లాహ్! ప్రపంచంలో ఒక బాటసారిలాగా జీవితం గడుపు” అని ఉపదేశించారు. అందుకే అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటుండేవారు: ప్రజలారా! సాయంత్రమయితే ఉదయం కోసం ఎదురుచూడకండి. ఉదయమైతే సాయంత్రం కోసం ఎదురుచూడకండి. అనారోగ్యానికి ముందు ఆరోగ్యాన్ని, చావుకు ముందు జీవితాన్ని విలువైనవిగా భావించండి.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మసూద్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేస్తున్నారు: ఒకరోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చాపమీద ఒంటికి చొక్కా లేకుండా పడుకొని ఉన్నారు. ఆయన శరీరం మీద చాపతాలూకు చారలు కూడా ఏర్పడ్డాయి. అది చూసి నేను “దైవప్రవక్తా! మీరు అనుమతిస్తే మేము మీ కోసం ఓ మంచి పడక తయారు చేసి ఇస్తాం” అని అడిగారు. అందుకాయన “నాకు ఈ ప్రపంచంతో పనేంటి? బాటసారి ఓ చెట్టుకింద కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు. ఆ తర్వాత చెట్టువదలి బయలుదేరి వెళ్ళిపోతాడు. నాకు ఈ ప్రపంచంతో ఉన్న సంబంధం అంతే!” అని అన్నారు. (అహ్మద్, తిర్మిజీ, ఇబ్నెమాజా)
ప్రపంచంలో మనిషి తాత్కాలిక నివాసాన్ని ఈ ఉదాహరణ ద్వారా కాకుండా మరో ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవటం అసాధ్యం. ఈ ప్రపంచం కేవలం ఓ సత్రం లాంటిది. ప్రతి బాటసారి అందులో కాసేపు లేక ఎక్కువసేపు ఆగి తర్వాత మళ్లీ గమ్యానికి బయలుదేరుతాడు. సత్రంలో కొన్ని గంటలు విశ్రాంతి తీసుకునే బాటసారి అక్కడ స్థలం కొనాలని, ఇల్లు కట్టాలని, వ్యాపారం నడపాలని ఎన్నడూ అనుకోడు. పైగా అక్కడి పరిసరాల పట్ల నిరపేక్షాభావం వ్యక్తం చేస్తూ కొన్ని ఘడియల తర్వాత తన దారిన తను వెళ్ళిపోతాడు. ఆ కొన్ని గడియల జీవితం కూడా మనిషిపాలిట ఎంత మోసకరమో! ఎందుకంటే నెలలు సంవత్సరాలు గడుస్తుంటే మనిషి తను యువకుణ్ణవుతున్నానని సంతోషిస్తాడు. నిజానికి గడిచే ప్రతిక్షణం అతన్ని అతని గమ్యానికి, మృత్యు కుహరానికి… చేరుస్తూ ఉంటుంది.
జీవితం గడిచిపోతున్న కొద్ది ఆశలు యవ్వనానికి చేరుకుంటూ ఉంటాయి. మనిషి తన మనో వాంఛల పరిపూర్తి కోసం రేయింబవళ్ళు కష్టపడతాడు. జీవితం ఎంతో అందంగా రమణీయంగా కనిపిస్తుంది. మనిషి అవిరామంగా పద్దెనిమిది ఇరవై గంటలు పనిలోనే గడుపుతాడు. రేయింబవళ్లు పని చేసి చేసి వెంట్రుకలు నెరవటం మొదలవుతుంది అప్పుడు కూడా మనిషి, నేను ఇంకా యువకుణ్ణి అని అనుకుంటాడు.
కాల ప్రవాహం జయాపజయాల, సుఖదుఃఖాల తరంగాలతో నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. పోను పోను మనిషి మెల్లగా తన జవసత్వాలుడిగిపోతున్నట్లు గ్రహిస్తాడు. వృద్ధాప్యం మరణ ఘంటికలు మోగిస్తూ ఉంటుంది. కాని చావు విషయంలో ఏమరుపాటు వహించే మనిషి జీవిత రహదారిపై అలాగే ముందుకు నడుస్తూ ఉంటాడు. ఇంకా చాలా సమయం ఉంది అనే అనుకుంటూ ఉంటాడు. పెద్ద పెద్ద కోరికలు, తోకలేని ఆశలు, సుదీర్ఘ ప్రణాళికలు. వీటిని సాకారం చేసుకోవటం కోసం కృషి కొనసాగుతూ ఉంటుంది. డాలర్, రియాల్, దీనార్, రూపాయలు, ప్లాటు, ఫ్లాట్లు, ఫ్యాక్టరీలు ఇల్లు, కారు వీటి చింతలోనే జీవితం గడుస్తూ ఉంటుంది. అత్యున్నత ప్రమాణజీవితాన్ని అనుభవించటం కోసం ప్రయత్నించటంలోనే రేయింబవళ్లు గడిచిపోతుంటాయి. ముందువెనుక, అటు ఇటు ఆత్మీయుల బంధుమిత్రుల మరణ సంఘటనలు సంభవిస్తూ ఉంటాయి. అప్పుడు ఏదో మొక్కుబడికి సంతాపం ప్రకటించి తర్వాత. మళ్లీ జీవిత పోరాటంలో నిమగ్నుడైపోతాడు. మృత్యుదూత తన కోసం ఏం సందేశం వదిలివెళ్ళాడో ఆలోచించటానికి కూడా అతనికి తీరిక ఉండదు. కుడ్య పత్రం కళ్లముందు కనిపిస్తూ ఉన్నా జీవితపు మనోహర దృశ్యాలు దానిని చదువనిస్తే కదా!
జనం చెప్పుకుంటారు. ఒకతనికి ఇజ్రాయీల్ దూతతో స్నేహం కుదిరిందట. అతను ఇజ్రాయీల్ దూతను “మీరు నా దగ్గరికి ( నా ప్రాణం తీయటానికి) రావలసివస్తే ఒక సంవత్సరం ముందే చెప్పండి. చావు కోసం నేను తగిన సన్నాహాలు చేసుకుంటాను” అని అడిగాడట. ఇజ్రాయీల్ దూత అలాగే వాగ్దానం చేశాడు. ఒకరోజు ఆయన హఠాత్తుగా దైవాజ్ఞ తీసుకొని వచ్చారు. మృత్యుదూత హఠాత్తుగా ప్రత్యక్షం కావటం చూసి అతను కంగారుపడ్డాడు. ‘అయ్యా! మీరు నాకు ఒక సంవత్సరం ముందే తెలియజేస్తానని వాగ్దానం చేసి ఇప్పుడు హఠాత్తుగా వచ్చేశారేమిటి?” అని అడిగాడు. దానికి ఇజ్రాయిల్ “ఈ యేడు నేను ఫలానా నీ బంధువు దగ్గరికి వచ్చాను. ఫలానా నీ మిత్రుడి దగ్గరికి వచ్చాను. ఫలానా నీ ఆత్మీయుడి దగ్గరికి వచ్చాను. నువ్వు కూడా సిద్ధంగా ఉండు, నీ దగ్గరికి కూడా రాబోతున్నాను అని తెలియజెప్పటానికే నేను నీవాళ్ల దగ్గరికి వస్తూఉన్నాను. నువ్వు తెలివి గలవాడివేమో, అర్థం చేసుకుంటావేమో అనుకున్నాను. నువ్వు ఇంత మూర్ఖుడివై ఉండి అర్థం చేసుకోలేకపోతే అందులో నా తప్పేముంది?” అని అన్నాడట.
మృత్యుదూత ప్రాణం మీదికి వచ్చి నించున్నప్పుడు జీవితపు ఆఖరి క్షణంలో మనిషి ఆలోచిస్తూ ఉంటాడు. “అరవై డెబ్భై యేళ్ల జీవితం రెప్పపాటులో గడిచిపోయింది. బాల్యం నిన్నటిమాట. యవ్వనం ఓ అందమైన కలకంటే ఎక్కువేం కాదు. సంపాదనా వ్యయాల పోరులో మంచి పనులకు తీరికే దొరకలేదు…….. ఇంత సుదీర్ఘమైన ఇంత సంక్లిష్టమైన జీవితమా!”…. అప్పుడు మనిషి దుఃఖవిచారాల, నిరాశానిస్పృహల విగ్రహమై అశ్రవణ స్వరంతో ‘నాలుగు రోజుల జీవితం అరువు తెచ్చుకుంటిని. అందులో రెండు రోజులు ఆశలో గడిచిపోగా, రెండు రోజులు నిరీక్షణలో గడిచిపోయాయి” అని అనుకుంటూ ఇహలోకం నుంచి వెళ్ళిపోతాడు.
మనక్కూడా మన ముందు వెనక కుడి ఎడమల్లో జరుగుతున్న మరణాలప్పుడు మృత్యుదూత సందేశం వినే తీరిక లభిస్తే బాగుండు!
అనుబంధం
సమాధి జీవితం ఎలా ఉంటుంది?
సమాధి జీవితం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు సంక్షిప్తంగా, సూటిగా సమాధానం చెప్పాలంటే “అల్లాహు వ రసూలుహూ ఆలమ్”, అల్లాహ్ కు ఆయన ప్రవక్తకు బాగా తెలుసు అనాలి. ఎందుకంటే దేన్నయితే మనం ఎన్నడూ చూడలేదో లేక దేని అనుభవమయితే మనకు అస్సలు ఎదురుకాలేదో దానిగురించి ఏదో ఒక మాట నమ్మకంగా చెప్పటం అసాధ్యం. అయినా కూడా ప్రభృతులు కొందరు సమాధి జీవితం గురించి దైవగ్రంథం, దైవప్రవక్త విధానంతో ఏ మాత్రం పొసగని మాటలు మాట్లాడుతుంటారు. ఉదా:
1) ఔలియాలు తమ సమాధుల్లో శాశ్వత జీవితంతో సజీవంగా ఉన్నారు. వారికి జ్ఞానం, గ్రహణం, వినటం, చూడటం మొదలగు శక్తులు మునుపటికన్నా బాగా ఉన్నాయి [అమ్ జద్ అలీ బహారె షరీఅత్ 58వ పుట]
2) షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రదియల్లాహు అన్హు) అనునిత్యం చూస్తూ, ప్రతి ఒక్కరి మొరలు
ఆలకిస్తూ ఉంటారు. [ముఫ్తి అబ్దుల్ ఖాదిర్, ఇజాలతుజ్జలాలహ్ 7వ పుట]
3) మృతులు వింటారు. మరణానంతరం తమ అభిమానులకు సహాయం చేస్తారు. [మౌలానా అహ్మద్ యార్ ఇల్ముల్ ఖుర్ఆన్ 189 పుట]
4) అల్లాహ్ ప్రియదాసులు సమాధిలోనూ వింటారు కనుక యాఅలీ, యాగౌస్ అని పిలవవచ్చు. [నూరుల్లాహ్ ఖాద్రీ ఫతావా రజియ్యా 537వ పుట]
5) ఔలియాలు నిర్యాణం తర్వాత కూడా సజీవంగానే ఉంటారు. వారి పనులు, మహిమలు, వారి అనుగ్రహాలు యథాతథంగా కొనసాగుతూ ఉంటాయి. మనలాంటి బానిసలు, నౌకర్లు, అభిమానులకు వారి సహాయసహకారాలు ఎల్లప్పుడూ తోడుంటాయి. [అహ్మద్ యార్ ఖాన్ బరేల్వీ ఫతావా రజ్వియా 4వ సంపుటి 23వ పుట]
6) అల్లాహ్ వలీలు చావరు. నిజానికి వారు ఒక ఇంటినుంచి మరో ఇంటికి మారుతారు. వారి ఆత్మలు కేవలం ఒక రోజు మాత్రమే దేహాన్ని విడిచిపెట్టి ఉంటాయి. ఆ తర్వాత శరీరంలోకి వెళ్ళి యథాప్రకారం ఉంటాయి. [ఫతావా నయీమియా, ఇఖిదార్ బిన్ అహ్మద్ యార్ బరేల్వీ. 225వ పుట]
7) వలీల ఆత్మబలం నుంచి ప్రయోజనం పొందటం, వారి హృదయాల ద్వారా, సమాధుల ద్వారా ఆంతరంగిక అనుగ్రహాలు కలగటం నిజమే. అందులో సందేహం లేదు. [ఖలీల్ అహ్మద్ సహారన్ పూరి అల్ ముహింద్ అలల్ మన్ ఫద్ 39వ పుట]
8) హాజి ఇమాదుల్లాహ్ ముహాజిర్ మక్కీగారు తమ ఆధ్యాత్మిక గురువు మియా హాజి నూర్ ముహమ్మద్ చనిపోయినప్పుడు ఆయన దగ్గరే ఉన్నారు. ఆయన ఇలా చెబుతున్నారు: “పరలోక ప్రయాణానికి సందేశం వచ్చింది” అన్న మాట గురువుగారి నోటవినగానే నేను ఆయన మంచంకోడు పట్టుకొని ఏడ్వసాగాను. అప్పుడు ఆయన నన్ను ఓదారుస్తూ “ఈ ఫకీరు చావడు. ఒకచోటు నుంచి మరో చోటుకి వెళ్తాడు అంతే. మామూలు జీవితంలో నా ద్వారా ఏ ప్రయోజనాలు అయితే కలుగుతున్నాయో (మరణానంతరం) నా సమాధి ద్వారా కూడా మీకు ఆ ప్రయోజనాలు కలుగుతాయి. [తారీఖే మషాయెఖె బిస్త్, మౌలానా జకరియా 234వ పుట]
9) హజ్రత్ (మౌలానా అహ్మద్ యార్) రహిమహుల్లాహ్ ఈ ప్రపంచం నుంచి కనుమరుగై పోయారు. ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్. కాని గుర్తుంచుకోండి. ఆ మహానుభావుడు నఖష్బందియా, అవేసియా పరంపరల స్థాపకుడు. ఇప్పుడూ ఉన్నారు. ఇకమీద కూడా ఉంటారు. అవేసియాతో సంబంధం కలిగి ఉండటమంటే ఒక ఆత్మ నుంచి మరో ఆత్మ ప్రయోజనం పొందటమే. ఇహలోకంలోనయినా, సమాధి జీవితంలోనయినా ఆత్మ నుంచి ప్రయోజనం పొందటం రెండు పరిస్థితుల్లోనూ సమానమే. కాకపోతే పై రెండిటి మధ్య కాస్త వ్యత్యాసముంది. అదేమిటంటే ఇహలోకంలో ప్రతి వ్యక్తి ఆయనగారి మహోన్నత సన్నిధికి హాజరవగలడు. అదే సమాధి జీవితంలోనయితే అక్కడి వరకు చేర్చగలిగే మనిషి అవసరం ఏర్పడుతుంది. వారి సేవకుడు, ప్రతినిధి మాత్రమే ఆ పని చేయగలడు. అనుగ్రహం మాత్రం, సమాధిలోవుండే వలీదే అయి ఉంటుంది కాని ఆ అనుగ్రహ పంపిణీ ఒక ‘ఉనికి’ ద్వారా జరుగుతుంది. ఆ ‘ఉనికి’నే ఖలీఫా అని అంటారు. [ఇర్షాదుస్సాలికీన్-మొదటిభాగం- మౌలానా ముహమ్మద్ అక్రమ్. 25వ పుట.]
10) హజ్రత్ జి (రహిమహుల్లాహ్ ) (అల్లాహ్ యార్ ఖాన్) గారి నిర్యాణం జరిగింది. ఆయన పవిత్ర భౌతిక కాయం తన కుటీరంలో విశ్రాంతి తీసుకుంటోంది. పవిత్రాత్మ అత్యున్నత ఇల్లియ్యీన్లో అల్లాహ్ వైపు తిరిగి ఫజ్ర్ నమాజు దారె ఇర్ఫాన్లో చేసింది. ఇక్కడ నాకు ఆయన విజయాత్మ దారుల్ ఇర్ఫానావైపు తిరిగి ఉన్నట్లు కనిపించింది. సోదరులు కర్నల్ మతలూబ్ హుసైన్ గారు పవిత్ర భౌతిక కాయాన్ని దారుల్ ఇర్ఫాన్లో ఖననం చేసే విషయమై హజ్రత్ జీ గారి అనుమతి తీసుకోరెందుకూ అని అదే పనిగా అడగసాగారు. నేను (అనుమతి తీసుకోవటానికి) శాయశక్తులా ప్రయత్నించాను. “మీ ఇంటివారికి ఇక్కడ ఒక ఇల్లు నిర్మించి ఇస్తాం. ఇక్కడ వారు అన్నివిధాలా సంతోషంగా ఉంటారు- ఇన్షా అల్లాహ్” అని చెప్పాను. కాని అందుకాయన ఒప్పుకోలేదు. పైగా ఇలా అన్నారు: “జీవితంలో ఎంతోమందికి నా మీద నమ్మకం ఉండేది. అల్లాహ్ నన్ను వారికి ఆధారంగా చేశాడు. మీరు వారందరిని ఇక్కడికి తీసుకురాలేరు. జీవితంలో నేను ఏ విధంగా ఆధారంగా ఉన్నానో ఇకనుంచి నా సమాధి వారికి ఆధారంగా ఉంటుంది. [ఇర్షాదుస్సాలికీన్-మొదటి భాగం- మౌలానా ముహమ్మద్ అక్రమ్-20వ పుట]
11) అబూ సయీద్ ఫరాజ్ (ఖద్దసల్లాహు సిర్రహూ) కథనం: నేను మక్కాలో ఉన్నప్పుడు బనూషైబా ద్వారం వద్ద ఒక యువకుణ్ణి చూశాను. అతను చనిపోయి ఉన్నాడు. నేను అతనివైపు దృష్టిసారించిన్పుడు అతను నా వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ “అబూ సయీద్! నీకు ఈ విషయం తెలియదా అల్లాహ్ ప్రియదాసులు పైకి చనిపోయినప్పటికి సజీవంగానే ఉంటారు. నిజానికి వారు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళతారు. [రిసాలా అహకాము ఖుబూరిల్ మూమినీన్-రెండో సంపుటి-243వ పుట]
పైన పేర్కొనబడిన విశ్వాసాలన్నిటికి మూలాధారం మృతులు వింటారనే నమ్మకం. కాని దైవగ్రంథం, దైవప్రవక్త హదీసుల వెలుగులో అసలు ఈ నమ్మకం సరైనదో కాదో చూడాలి.
మృతులు వినటం-దైవగ్రంథం, ప్రవచనాల వెలుగులో
మొదటి నుంచి చివరిదాకా మానవజీవితం మొత్తాన్ని మనం ఈ క్రింద పేర్కొనబడిన ఐదు దశలుగా వర్గీకరించగలం.
1) ఆత్మల లోకం: అల్లాహ్ ఆదం అలైహిస్సలామ్ను పుట్టించిన తర్వాత ఆయన వీపునుంచి ప్రళయంవరకూ రానున్న ఆయన సంతానం ఆత్మలను పుట్టించాడు. వాటికి ఆలోచించే, మాట్లాడేశక్తిని ప్రసాదించి వాటి చేత తాను విశ్వమంతటికీ ఏకైక ప్రభువు అన్న ఒప్పుకోలును ఈ మాటల్లో ఒప్పించాడు. వారిని ‘అలస్తు బిరబ్బికుమ్’ (నేను మీ ప్రభువును కానా!) అని అడిగాడు. దానికి ఆత్మలన్నీ “బలా (ఎందుకు కారు! మీరే మా ప్రభువు)” అని సమాధానమిచ్చారు. ఈ ఆత్మలోకం నుంచే మానవ జీవిత ప్రయాణం మొదలవుతుంది. [మరిన్ని వివరాలకు ఆరాఫ్ సూరా 172వ సూక్తి చూడండి]
2) మాతృ గర్భలోకం: మాతృగర్భంలో ఆత్మతోపాటు మనిషి దేహనిర్మాణం కూడా జరుగుతుంది. ఈ లోకంలో మనిషి ఇంచుమించు తొమ్మిది నెలలపాటు ఉంటాడు. అల్లాహ్ దివ్యఖుర్ఆన్ అక్కడక్కడా కొన్నిచోట్ల మాతృగర్భంలో మనిషి పుట్టుక పరిణామ దశలను గురించి వివరించాడు. ఒకచోట ఇలా సెలవిచ్చాడు: మానవుని తల్లి ఎంతో శ్రమకోర్చి అతన్ని తన గర్భంలో పెట్టుకొని మోసింది. ఎంతో శ్రమకోర్చి అతన్ని కన్నది. (అహ్ ఖాఫ్ సూరా. 15వ సూక్తి) మనిషి జీవిత ప్రయాణంలో ఇది రెండవ దశ. [మరిన్ని వివరాల కోసం చూడండి. నహ్ల్ సూరా 78వ సూక్తి, మూమినూన్ సూరా 14వ సూక్తి, లుఖ్మాన్ సూరా 14వ సూక్తి మొదలగునవి.]
3) జీవలోకం: జీవిత ప్రయాణంలో మూడోదశ ఇది. ఇందులో ఓ సంక్షిప్త కాలంపాటు మనిషి జీవించి ఉంటాడు. “నా సమాజంలోని ప్రజల వయస్సులు అరవై-డెబ్భై ఏళ్ల మధ్యన ఉంటాయి” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు (తిర్మిజీ). ఇంచుమించు ఇంతకాలమే మానవులు ఈ ప్రపంచంలో జీవించి ఉంటారు. ఆ తర్వాత తమ ప్రయాణంలోని తర్వాతి దశకు బయలుదేరుతారు.
4) సమాధి లోకం: మన ఈ ప్రయాణంలో సమాధిలోకం (జీవలోకంతో పోల్చుకుంటే) చాలా పెద్ద దశ. ఆదం అలైహిస్సలామ్ నుంచి నేటివరకు దాదాపు ఆరువేల సంవత్సరాల కాలం గడిచిందని చెబుతారు (నిజమేమిటో అల్లాహ్ కు తెలుసు). చనిపోయిన వారు తమసమాధుల్లో పడి ఉన్నారు. వారి ప్రయాణం కొనసాగుతోంది. ఎప్పటి వరకు కొనసాగుతుందో తెలీదు. సమయం వచ్చినప్పుడు మనలోని ప్రతి ఒక్కడూ ఈ సమాధిలోక ప్రయాణ బృందంలోకి చేరుకుంటూ ఉంటాడు. ఈ ప్రయాణం ప్రళయం వరకూ కొనసాగుతుంది.
5) పరలోకం: ఇది మన ప్రయాణానికి అంతిమగమ్యం. ఇందులో మనిషి తన ప్రాపంచిక దేహం, ప్రాణాలతో సహా బతికించబడతాడు. అతను చేసిన మంచీ చెడుల విచారణ జరుగుతుంది. ఆ తర్వాత ప్రజలు తమ తమ వాస్తవ నివాసస్థలాల్లో అంటే…. స్వర్గం లేక నరకంలో…. శాశ్వతంగా నివాసముంటారు.
పైన పేర్కొనబడిన ఐదు దశలను శ్రద్ధగా పరిశీలిస్తే బోధపడేదేమిటంటే-ప్రతి దశలోని పరిస్థితులు రెండోదశకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఉదా: మొదటి దశ అనగా ఆత్మలలోకంలో అల్లాహ్ ఆత్మలన్నిటిని ‘నేను మీ ప్రభువును కానా?’ అని అడిగాడు. ఆత్మలు విన్నాయి, ఆలోచించాయి. అర్థం చేసుకున్నాయి. ఆ తర్వాత “ఎందుకు కాదు!” అని బదులిచ్చాయి. అయితే ఆత్మలలోకంలో వినటం, ఆలోచించటం, మాట్లాడటం ఈ ప్రపంచంలో వినటం, మాట్లాడటం ఈ భౌతికలోకంలో మాట్లాడటం, ఆలోచించటం, వినటానికి భిన్నంగానే ఉంటుంది. ఆత్మలలోకంలో ఆత్మలు వింటాయని, ఆలోచిస్తాయని, మాట్లాడతాయని మనం నమ్ముతాం. అయితే దాని స్వభావం మాత్రం కేవలం అల్లాహ్ కు మాత్రమే తెలుసు.
ఇప్పుడు రెండో దశ (అనగా మాతృగర్భలోకం) ను గమనించండి. ఇందులో మనిషి దేహనిర్మాణం జరుగుతుంది. ఆత్మ-దేహం రెండూ కలుస్తాయి. హృదయం, మెదడు, కళ్లు, ముక్కు చెవులు అన్నీ తయారవుతాయి. కాని గర్భలోకం బయటిలోకానికి ఎంత భిన్నంగా ఉంటుందంటే మాతృగర్భంలో ఉన్న పిల్లవాడితో “కొంతకాలం తర్వాత నువ్వు ఒక లోకంలోకి రాబోతున్నావు. అక్కడ వేలమైళ్ల ఎత్తైన, అత్యంత విశాలమైన ఆకాశం ఉంది. కనుచూపుమేరకు పరువబడి ఉన్న నేల ఉంది. భూమికంటే పెద్దదైన భగభగమండే ఓ అగ్నిగోళం… సూర్యుడు…. ప్రతిరోజూ ఆకాశంలోని ఒక దిక్కునుంచి ఉదయించి ప్రపంచమంతటినీ వెలిగిస్తూ కొన్ని గంటల తర్వాత రెండో దిక్కున అస్తమిస్తాడు. దాంతో ప్రపంచమంతా చీకటి ఆవరిస్తుంది. రాత్రిపూట ఆకాశాన ఓ అందమైన ధగధగమెరిసే చంద్రుడు ఉదయిస్తాడు. దాంతోపాటు కోట్లాది చిన్న చిన్న నక్షత్రాలు మిణుకుమిణుకుమంటూ ప్రకాశిస్తూ ఉంటాయి” అని చెబితే అతి చిన్న మాతృగర్భలోకంలో నివసిస్తున్న ఆ చిన్ని మనిషి ఆ వాస్తవాలు నిజమని ఒప్పుకోగలడా? చెప్పండి!
నిజం చెప్పాలంటే మాతృగర్భపు అతి చిన్న లోకంలో ఉంటూ ఈ భౌతిక ప్రపంచ వాస్తవాలను గ్రహించటం అసలు సాధ్యమే కాదు. మనిషి యొక్క ఈ స్థితిని అల్లాహ్ దివ్యఖుర్ఆన్లో కొన్ని మాటల్లో చాలా చక్కగా సమీక్షించాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“అల్లాహ్ మిమ్మల్ని మీ మాతృగర్భాల నుంచి మీరు ఏమీ ఎరుగని స్థితిలో ఉండగా బయటికి తీశాడు.” (నహ్ల్ సూరా 78వ సూక్తి).
ఇప్పుడు నాల్గోదశ అనగా సమాధిలోకాన్ని గమనించండి. సమాధిలోకం గురించి దైవగ్రంథం, దైవప్రవక్త హదీసుల ద్వారా మనకు బోధపడే వాస్తవాలు క్రింద పేర్కొనబడ్డాయి.
1) మృతులు మాట్లాడతారు: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: మరణానంతరం మంచి మనిషి మృతదేహం తన ఇంటివారితో “నన్ను త్వరగా తీసుకెళ్ళండి, నన్ను త్వరగా తీసుకెళ్ళండి” అని అంటుంది. అదే చెడ్డవాడి మృతదేహమయితే “అయ్యో! నా పాడుగాను నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు” అని అంటుంది (బుఖారీ). పై హదీసు
ద్వారా మరణానంతరం మృతదేహం మాట్లాడగలదనే విషయం రుజువు అవుతోంది. ముంకిర్ నకీర్ దూతలు అడిగే ప్రశ్నలకు మంచిమనిషి తనకు అల్లాహ్ పై, దైవప్రవక్తపై విశ్వాసం ఉందని సాక్ష్యం పలుకుతాడు. అదే అవిశ్వాసో లేక కపటో అయితే “అయ్యో! అయ్యో! నాకేం తెలీదు” అని వాపోతాడు. (బుఖారీ, అబూదావూద్ వగైరా).
పై పై హదీసుల ద్వారా మృతులు మాట్లాడతారనే విషయంతోపాటు మాట్లాడే ఈ గుణానికి ఒకరి మంచితనంతో, ఒకరి దైవప్రియత్వంతో ఎలాంటి సంబంధం ఉండదనీ, మృతుడు విశ్వాసి అయినా, అవిశ్వాసి అయినా మంచివాడయినా చెడ్డవాడయినా ప్రతి ఒక్కరూ మాట్లాడగలరని రుజువు అవుతోంది.
2) మృతులు వింటారు: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: (విశ్వాసి లేక అవిశ్వాసి అయిన) దాసుడు సమాధిలో ఖననం చేయబడిన తర్వాత తన దగ్గరినుంచి తిరిగి వెళుతున్నవారి చెప్పుల శబ్దం వింటాడు (ముస్లిం).
సమాధిలో ముంకిర్ నకీర్ అడిగే ప్రశ్నలు మృతుడు వింటాడు. తన విశ్వాసం ప్రకారం దానికి సమాధానం కూడా ఇస్తాడు. (7.4వ అంశం క్రింది హదీసు చూడండి).
బద్ర్ యుద్ధానంతరం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యుద్ధంలో హతులైన అవిశ్వాసులను ఉద్దేశించి ఇలా అన్నారు: “మీ ప్రభువు మీతో చేసిన వాగ్దానం నిజమయిందా? నా ప్రభువు నాకు చేసిన వాగ్దానం మాత్రం నిజమయింది” అని అన్నారు. అది విని ఉమర్(రదియల్లాహు అన్హు) సందేహపడుతూ “దైవప్రవక్తా! వీళ్లు చచ్చిపోయారు కదా! వీరు వినగలరా? జవాబు చెప్పగలరా?” అని అడిగారు. అందుకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఎవరి చేతిలోనయితే నా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నాను. నేను వారితో చెప్పే మాటలు మీరు వారి కన్నా ఎక్కువేమీ వినలేరు. కాకపోతే వీరు (మీలాగా) సమాధానం పలకలేరు అంతే ” అని చెప్పారు (ముస్లిం).
ఈ హదీసుల ద్వారా కూడా మృతులు వింటారని బోధపడుతోంది. అంతేకాదు, మృతులు మాట్లాడటం అల్లాహ్ పట్ల వారికున్న ప్రేమకో లేక వారి మంచితనానికో నిదర్శనం కాదు. ప్రతి మృతుడు, అతను విశ్వాసి అయినా, అవిశ్వాసి అయినా మంచివాడయినా చెడ్డవాడయినా వింటాడు.
3) మృతులు చూస్తారు: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: సమాధిలో ముంకిర్ నకీర్ అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి విజయం సాధించిన విశ్వాసికి ముందు నరకం చూపెట్టబడుతుంది. తర్వాత స్వర్గంలోని అతని నివాసం చూపెట్టబడుతుంది. అలాగే విఫలుడైన అవిశ్వాసికి ముందు స్వర్గం చూపెట్ట బడుతుంది. ఆ తర్వాత నరకం, నరకంలో అతని నివాసం చూపెట్టబడుతుంది. (అహ్మద్, అబూదావూద్ వగైరా) దీని ద్వారా మృతుడు విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా అందరూ చూడగల్గుతారు.
4) మృతులు లేస్తారు, కూర్చుంటారు: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: ముంకిర్ నకీర్ దూతలు సమాధిలోకి వచ్చి మృతుణ్ణి (లేపి కూర్చోబెడతారు. (బుఖారీ, ముస్లిం, అహ్మద్ వగైరా)
5) మృతులు క్షోభను, ఆనందాన్ని అనుభవిస్తారు: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: (సమాధిలో) ముంకిర్ నకీర్ దూతలు అవిశ్వాసిని లేపినప్పుడు అతను తీవ్ర భయాందోళనలకు గురై ఉంటాడు. అదే విశ్వాసి అయితే ఎలాంటి భయాందోళనలు లేకుండా (ప్రశాంతంగా లేచి కూర్చుంటాడు (అహ్మద్). దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా కూడా చెప్పారు: నరకంలో తన నివాసం చూసుకున్న తర్వాత అవిశ్వాసికి దుఃఖం, పశ్చాత్తాపం మరింత పెరిగిపోతుంది. మరోవైపు స్వర్గంలో తన నివాసం చూసుకొని విశ్వాసి ఆనందం, మధురానుభూతులు మరింత పెరిగిపోతాయి. (తబ్రానీ, ఇబ్నె హిబ్బాన్, హాకిమ్)
6) మృతులు కోరుతారు, కాంక్షిస్తారు: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “సమాధిలో విశ్వాసికి స్వర్గదర్శనం చేయించినప్పుడు అతను “నన్ను కాస్త వదలండి. ఈ శుభవార్త మా ఇంటివారికి తెలియజేసి వస్తాను” అని కోరుతాడు. మరొక హదీసులో ఇలా ఉంది: విశ్వాసి “ప్రభూ! ప్రళయాన్ని త్వరగా నెలకొల్పు” అని కోరుకోగా అవిశ్వాసి “ప్రభూ! ప్రళయాన్ని నెలకొల్పమాకు” అని కోరుకుంటాడు. (అహ్మద్, అబూదావూద్) పై హదీసుల ద్వారా మృతులు కాంక్షిస్తారని, కోరుకుంటారని రుజువు అవుతోంది.
7) మృతులు నిద్రపోతారు, మేల్కొంటారు: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: సమాధిలో ప్రశ్నోత్తరాలు జరిగిన తర్వాత విశ్వాసితో “నూతన వధువుని ఆమె ఇంటివారిలో ఆమెకు అత్యంత ప్రియుడైన వాడు (భర్త) తప్ప మరెవరూ లేపరు. నువ్వూ ఆ విధంగా నిద్రపో” అని చెప్పటం జరుగుతుంది (తిర్మిజీ). దీని ద్వారా మృతులు నిద్రపోతారని, ప్రళయదినాన మేల్కొంటారని రుజువు అవుతోంది.
8) మృతులు గుర్తుపడతారు: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెప్పారు: సమాధిలో విశ్వాసి దగ్గరికి ఒక అందమైన వ్యక్తి అందమైన దుస్తులు ధరించి మంచి సువాసనలు పూసుకొని వస్తాడు. వచ్చి విశ్వాసికి మంచి పరిణామం ఎదురుకాబోతుందని శుభవార్త అందజేస్తాడు. విశ్వాసి “నీ ముఖం ఎంత అందంగా ఉంది? నువ్వు శుభశ్రేయాలు తీసుకొని వచ్చావు. అసలు ఎవరు నువ్వు?” అని అడుగుతాడు. దానికతను “నీ సదాచరణను” అని సమాధానం పలుకుతాడు. అవిశ్వాసి దగ్గరికి ఒక కురూపి దుర్గంధవస్త్రాలు ధరించి వస్తాడు. అతని దగ్గర దుర్వాసన వస్తూ ఉంటుంది. అతనొచ్చి అవిశ్వాసితో “నీకు దుష్పరిణామ శుభవార్త! నీకు వాగ్దానం చేయబడిన రోజే ఇది” అని అంటాడు. దానికి అవిశ్వాసి “ఒరేయ్ కురూపీ! నువ్వు అశుభం తీసుకొని వచ్చావు. అసలు ఎవరు నువ్వు” అని అడుగుతాడు. దానికతను “నేను నీ దురాచరణను” అని చెబుతాడు. (అహ్మద్, అబూదావూద్) ఈ హదీసుల ద్వారా మృతులు గుర్తుపడతారని అర్థమవుతోంది.
9) మృతులు అరుస్తారు, కేకలు పెడతారు: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: సమాధిలో అవిశ్వాసిని శిక్షించటం కోసం గుడ్డి, చెవిటి దూత (లేక దూతలు) నియమించబడతారు. వారు అతన్ని ఇనుపగదలతో మోదుతుంటారు. దాంతో అతను చాలా భయంకరంగా అరుస్తాడు. కేకలు పెడతాడు. అవిశ్వాసి అరుపులు, కేకలు జిన్నాతులు, మానవులు తప్ప సృష్టిలోని ప్రతి జీవి వింటుంది (అహ్మద్, అబూదావూద్). ఈ హదీసు ద్వారా మృతులు అరిచికేకలు కూడా పెడతాయని బోధపడుతోంది.
10) మంచిమృతులు సజీవంగానే ఉన్నారు. తింటూ తాగుతూ ఉంటారు:
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
అల్లాహ్ మార్గంలో హతులైనవారిని మృతులుగా భావించకండి. వారు (సమాధి లోకంలో) సజీవంగానే ఉన్నారు. తమ ప్రభువు దగ్గర జీవికను పొందుతున్నారు. (ఆలిఇమ్రాన్ సూరా, 169వ సూక్తి)
పైన పేర్కొనబడిన దివ్యఖుర్ఆన్ సూక్తులు, దైవప్రవక్త హదీసుల ద్వారా స్పష్టమయ్యేదేమిటంటే సమాధిలోక జీవితం ఒక పరిపూర్ణ జీవితం. అందులో మృతుడు తింటాడు, తాగుతాడు, వింటాడు, మాట్లాడతాడు, చూస్తాడు గుర్తుపడతాడు, ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, ఆనందాన్ని సంతోషాన్ని అనుభవిస్తాడు, ఏడుస్తాడు, మొత్తుకుంటాడు, అరుస్తాడు, కేకలు పెడతాడు.
కాని సమాధిలోకంలో మృతుని వినికిడి ఇహలోక వినికిడి కన్నా భిన్నమైనది. సమాధి లోకంలో మృతుడు మాట్లాడటం ఇహలోకంలో మాట్లాడటం కన్నా భిన్నమైనది. సమాధిలోకంలో మృతుడు చూసి గుర్తుపట్టటం ఇహలోకంలో మాట్లాడటం కన్నా భిన్నమైనది. సమాధిలోకంలో మృతుని తినటం తాగటం ఇహలోకంలో తినటం తాగటం కన్నా భిన్నమైనది. సమాధిలోకంలో మృతుడు ఆలోచించటం, అర్థం చేసుకోవటం ఇహలోకంలో ఆలోచించటం, అర్థం చేసుకోవటం కన్నా భిన్నమైనది. సమాధిలోకంలో మృతుడు ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించటం. ఇహలోకంలో ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించటం కంటే భిన్నమైనది. సమాధిలోకంలో అవిశ్వాసమృతుడు దుఃఖాన్ని, పశ్చాత్తాపాన్ని అనుభవించటం ఇహలోకంలో దుఃఖాన్ని, పశ్చాత్తాపాన్ని అనుభవించటం కంటే భిన్నమైనది. సమాధిలోకంలో మృతుడు ఏడ్వటం, మొత్తుకోవటం, అరచి కేకలు పెట్టటం ఇహలోకంలో ఏడ్వటం మొత్తుకోవటం, అరచికేకలు పెట్టటం కంటే భిన్నమైనది. వాటిని ఈ రోజు మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉండి అర్థం చేసుకోలేము. వాస్తవం ఏమిటంటే ఏ విధంగానయితే ఆత్మలలోకపు పరిస్థితులను అర్థం చేసుకోవటం మనకు అసాధ్యమో లేక మాతృగర్భంలో పెరిగే శిశువుకి మన ఈ భౌతిక ప్రపంచ పరిస్థితులను గ్రహించటం ఏ విధంగానయితే అసాధ్యమో అదేవిధంగా మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూ సమాధిలోకపు పరిస్థితులను అర్థం చేసుకోవటం, వాటిని గ్రహించటం మనకు అసాధ్యం. దివ్యఖుర్ఆన్ ఈ అభిప్రాయాన్ని, ఈ భావనను చాలా స్పష్టమైన మాటల్లో బలపరిచింది.
అల్లాహ్ మార్గంలో హతులైనవారిని మృతులు అని అనకండి. వారు (సమాధి లోకంలో) సజీవంగా ఉన్నారు. కాని (వారి జీవితాన్ని మీరు అర్థం చేసుకోలేరు). (బఖరా సూరా 154వ సూక్తి).
అల్లాహ్ యొక్క ఈ స్పష్టమైన సూక్తి తెలిసిన తర్వాత కూడా ఎవరయితే తాము సమాధి లోక జీవితాన్ని అర్థం చేసుకోగలమనీ, మృతులు ఇహలోకంలో విన్నట్లే వింటారు. ఇహలోకంలో మాట్లాడినట్లే మాట్లాడతారు, ఇహలోకంలో తిన్నట్లే తింటారు అన్న సంగతి తమకు తెలుసని మొండివాదన చేస్తారో వారి ఈ అభిప్రాయం బుద్ధిరీత్యా సరైనది కాకపోవటమే కాదు. వారు పైన పేర్కొనబడిన దివ్యఖుర్ఆన్ సూక్తిలోని “మీరు అర్థం చేసుకోలేరు” అన్న వాక్యాన్ని కూడా ధిక్కరిస్తున్నారు.
అసలు మృతులు (మనలాగే వింటారని నమ్మేవారినే అడుగుదాం. ఏమండి సమాధి లోకంలో ప్రతి మృతుడూ (అతను ముస్లిం అయినా కాఫిర్ అయినా, మంచివాడయినా చెడ్డవాడయినా, వలీ అయినా కాకపోయినా) వింటాడనీ, మాట్లాడతాడనీ, చూస్తాడనీ, గుర్తుపడతాడనీ, విశ్వాసి అయితే సంతోషాన్ని ఆనందాన్ని అనుభవిస్తాడనీ, ప్రళయం నెలకొనాలని కోరుకుంటారనీ రుజువు ఉండగా మీరు ఎప్పుడూ వలీల వినికిడి గురించే మాట్లాడతారెందుకు? వలీలు కాని వారి వినికిడి మాటే ఎత్తరు. రెండో ప్రశ్న ఏమిటంటే – మీరు ఎప్పుడూ వలీలు ‘వింటారనే విషయం గురించి మాత్రమే చర్చిస్తారు. వారి ఇతర పనులు అనగా మాట్లాడటం, చూడటం, గుర్తుపట్టడం, ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించటం తినటం త్రాగటం ఇతర పనులు చేయటం గురించి చర్చించుకోరు ఎందుకనీ?
కారణం తెలుస్తూనే ఉంది. ఔలియాలు, పుణ్యాత్ములు సమాధుల్లో వింటారనే నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని వారి సమాధుల దగ్గర హాజరుపలకటం, అవసరాలు తీర్చమని కోరటం, కోరికలు కోరటం, కష్టాల్లో, బాధల్లో వారిని మొరపెట్టుకోవటం, వారిచేత క్షమాభిక్ష పెట్టించుకోవటం మొదలగు పనులన్నీ చేయవచ్చనే నమ్మకం ప్రతిపాదించబడుతుంది. ఆ తర్వాత ఆ నమ్మకం ఆధారంగానే ప్రజలనుంచి కానుకలు, నజరానాలు వసూలు చేస్తారు. సమాధి జీవితంలో మృతులు వినటమే కాదు, మాట్లాడతారు, చూస్తారు, గుర్తుపడతారు, తింటారు తాగుతారు, ఆనందం, సంతోషాలు అనుభవిస్తారు, కాని ఇదంతా ప్రపంచ జీవితంలో లాగా ఉండదు.అది ఈ లోకానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది అని ప్రజలకు నిజం చెప్పేస్తే ఫలితంగా మఠాల వ్యాపారమంతా కుప్పకూలిపోతుంది. సమాధుల అందాలు, అక్కడి కచేరీలు, సమావేశాలు పాడుబడిపోతాయి. దర్గాలకు భారీమొత్తంలో ప్రభుత్వం ఇచ్చే వేతనాలు, గ్రాంట్లు ఆగిపోతాయి. సామాన్య మానవుల్లాగా ‘సజ్జాదానషీన్’ ‘గద్దీనషీన్’ ‘మఖ్ూమ్’ ‘దర్వేష్ ‘ముజావర్’ మొదలగు కుహనా పూజారులందరూ పొట్టకూటి కోసం కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. ఆ బాధ, ఆ కష్టం కావాలని ఎవరు కొని తెచ్చుకుంటారండీ?!
అమరవీరుల సమాధి జీవితం
దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ రెండుచోట్ల అమరవీరులను సజీవులు (అహ్య) అన్నాడు. తర్వాత అక్కడే వారిని మృతులు అని అనకండని కూడా వారించాడు. మృతులు వింటారని నమ్మేవారి దృష్టిలో ఈ రెండు సూక్తులు షహీదులు ఈ (వారితోపాటు ఇతర వలీలు, పుణ్యాత్ములు) సమాధుల్లో నజీవులుగా ఉన్నారనేందుకు పెద్ద రుజువులు. అహ్లెసున్నత్ల అతిగొప్ప ఇమాము అయిన అహ్మద్ రజా ఖాన్ బరేల్వీ తన ఒక గ్రంథంలో ఈ సంఘటన రాశాడు. “ఇద్దరు అన్నదమ్ములు అల్లాహ్ మార్గంలో వీర మరణం పొందారు. వారి మూడో తమ్ముడు ఇంకా బతికే ఉన్నాడు. అతని పెళ్ళిరోజున అమరగతులైన ఆ ఇద్దరు అన్నదమ్ములు కూడా అతని పెళ్ళికి హాజరయ్యారు. మూడో తమ్ముడు చాలా ఆశ్చర్యపోయాడు. “మీరు మరణించారు కదా!” అని అడిగాడు. దానికి వారు అల్లాహ్ మమ్మల్ని నీ పెళ్ళి శుభకార్యంలో పాల్గొనమని పంపించాడు అని చెప్పారు. ఆ విధంగా ఇద్దరు అన్న దమ్ములు తమ మూడో తమ్ముడి పెళ్ళిలో ఖుత్బాపఠించి తిరిగి (సమాధి లోకానికి) వెళ్ళిపోయారు. [మజూఅ రసాయెల్ ఆలా హజ్రత్ మొదటి సంపుటి 175వ పుట.]
అమరవీరులు, వలీలు, మహాత్ములు తమ సమాధుల్లో సజీవంగా ఉన్నారని రూఢీ చేసిన తర్వాత వారిని తమ అవసరాలు తీర్చమని కోరటం, వారికి విన్నపాలు చేసుకోవటం, కష్టాల్లో బాధల్లో వారిని మొరపెట్టుకోవటం, వారి పేర మొక్కుబడులు చేసుకోవటం, వారి సమాధుల దగ్గర బలులు ఇవ్వటం, జాతరలు చేయటం అంతా ధర్మసమ్మతమని రుజువు అవుతుంది.
మేము ఇంతకు ముందు పుటల్లో పేర్కొన్నట్లు మృతులు వింటారనే నమ్మకం కలిగివున్నవారికి ఇక్కడ కూడా అదే అపోహ కలిగింది. అదేమిటంటే వారు అమరగతుల సమాధి జీవితం ఇహలోకపు జీవితంలా ఉంటుందని భ్రమపడ్డారు. సమాధి లోకంలో వారి తినటం, త్రాగటం ఇహలోకంలో తినటం త్రాగటం లాంటిదనుకున్నారు. సమాధి లోకంలో వారు వినటం, మాట్లాడటం ఇహలోకంలో వినటం, మాట్లాడటం లాంటిదనుకున్నారు. ఈ విషయాన్ని మేము ఇంతకు ముందు కూడా వివరించాం. సమాధిలోక జీవితం ఒక పరిపూర్ణ జీవితం. అక్కడ మృతులు తినటం, త్రాగటం, మాట్లాడటం, వినటం, చూడటం గుర్తుపట్టడం, ఆలోచించటం, సంతోషించటం మొదలగు పనులన్నీ చేస్తారని రుజువు ఉంది. కాని అవన్నీ ప్రపంచంలోని తినటం తాగటం మాట్లాడటం వినటం, చూడటం, గుర్తుపట్టడం, ఆలోచించటం, సంతోషించటం కంటే భిన్నమైనవి.
పైన పేర్కొనబడిన రెండు ఖుర్ఆన్ సూక్తుల అవతరణ నేపథ్యం కూడా అసలు నిజాన్ని తెలుసు కోవటంలో చాలా తోడ్పడుతుంది. కనుక ఇక్కడ మేము ఆ రెండు సూక్తుల నేపథ్యాన్ని వివరించదలచుకున్నాం.
ముందుగా బఖర సూరాలోని ఈ సూక్తి:
అల్లాహ్ మార్గంలో చంపబడ్డవారిని మృతులు అని అనకండి. వారు సజీవంగానే ఉన్నారు. కాని (వారి జీవితాన్ని మీరు అర్థం చేసుకోలేరు. (బఖర:154)
ఈ అమరగతులను ‘సజీవులు’ అని అన్న నేపథ్యం ఏమిటంటే బద్ర్ యుద్ధంలో అమరగతులైన దైవప్రవక్త అనుచరుల గురించి అవిశ్వాసులు మాట్లాడుకుంటూ “ఫలానా ఫలానా వాళ్లు చచ్చిపోయారు, జీవిత సౌఖ్యాలను కోల్పోయారు” అని అన్నారు. దానికి సమాధానంగా “అమరగతులను మృతులు అని అనకండి. వారు జీవించే ఉన్నారు” అన్న ఈ సూక్తి అవతరించింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ఈ సూక్తి భావం గురించి అడగ్గా ఆయన ఈ విధంగా వివరించారు:
“అమరవీరుల ఆత్మలు పచ్చటి పక్షుల రూపంలో దైవసింహాసనానికి వేలాడబడి ఉండే గాజు గుప్పెల్లో ఉంటాయి. తాము తలచినప్పుడు స్వర్గంలో విహరించటానికి వెళ్తాయి. తర్వాత ఆ గాజుగుప్పెల్లోకి తిరిగివెళ్తాయి. ఒకసారి వారి ప్రభువు వారివైపు దృష్టిసారించి “మీరు ఏం కోరుకుంటారు?” అని అడిగాడు. అందుకు ఆత్మలు “మేము స్వర్గంలో ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళి విహరించి వస్తున్నాం. మాకు ఇంకా ఏం కావాలి?” అని అన్నారు. అల్లాహ్ వారిని మూడుసార్లు ఇదే ప్రశ్న అడిగాడు. ఆఖరికి ఆత్మలు తాము ఏదో ఒకటి అడగటం తప్పదనుకొని “ప్రభూ! మా ఆత్మలు తిరిగి మా దేహాలలోకి పంపించబడాలి. తర్వాత మేము నీ మార్గంలో మళ్ళీ చంపబడాలని మా కోరిక” అని విన్నవించుకున్నారు. దాంతో అల్లాహ్ వారికి ఇక ఏ కోరికా లేదని భావించి వారిని అలాగే వదిలేశాడు. (ముస్లిం)
రెండోది ఆలి ఇమ్రాన్ సూరాలోని ఈ సూక్తి:
అల్లాహ్ మార్గంలో చంపబడ్డవారిని మృతులుగా భావించకండి. వారు జీవించే ఉన్నారు. తమ ప్రభువు వద్ద జీవికను పొందుతున్నారు. (ఆలి ఇమ్రాన్: 169).
ఈ సూక్తిలో అమరవీరుల్ని ‘సజీవులు’ అన్న నేపథ్యం ఏమిటంటే ఉహుద్ యుద్ధ సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీనా నగరానికి బయట యుద్ధభూమిలోకి వెళ్ళి మక్కా అవిశ్వాసులతో పోరాడాలని తీర్మానించారు. కపటులు దానికి ఒప్పుకోలేదు. పైగా నగరంలోనే ఉండి పోరాడాలనే తమ తీర్మానాన్ని దైవప్రవక్త ఒప్పుకోలేదన్న వంకతో తాము యుద్ధంలో పాల్గొనమని చెప్పి జిహాద్ చేయకుండా తిరిగి వెళ్ళిపోయారు. యుద్ధం తర్వాత వారు ముస్లింలు మా మాట విని ఉంటే యుద్ధంలో ఇలా చచ్చి ఉండేవారు కాదు” అని ఎత్తిపొడవసాగారు. కపటుల ఎత్తిపొడుపులకు అల్లాహ్ ఈ మాటల్లో సమాధానం చెప్పాడు: “అల్లాహ్ మార్గంలో చంపబడేవారు మృతులు కారు. వారు జీవించే ఉంటారు. తమ ప్రభువు వద్ద జీవికను పొందుతుంటారు.”
పైన పేర్కొనబడిన ఆలి ఇమ్రాన్ సూరాలోని సూక్తికి సంబంధించి ఉహుద్ యుద్ధంలో అమరగతులైన ఒకానొక దైవప్రవక్త అనుచరుడు, అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) గారి సంఘటన కూడా హదీసుల్లో ప్రస్తావించబడుతుంది. అబ్దుల్లాహ్ గారి కుమారుడు జాబిర్ (రదియల్లాహు అన్హు) ని ఉద్దేశించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “జాబిర్! అల్లాహ్ నీ తండ్రితో పలికిన మాట నేను నీకు తెలుపనా?” అని అడిగారు. అందుకు జాబిర్ (రదియల్లాహు అన్హు) “తప్పకుండా తెలపండి దైవప్రవక్తా” అని విన్నవించుకున్నారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెప్పారు: అల్లాహ్ ఎవరితోనూ మధ్యలో అడ్డులేకుండా మాట్లాడలేదు. కాని ఆయన నీ నాన్నతో మధ్యలో అడ్డులేకుండానే (అంటే నేరుగా సంభాషించాడు. ఆయన మీ నాన్నను “ఓ నా దాసుడా! నువ్వు ఏం కోరుకుంటావో కోరుకో. నేను అది నీకు ఇస్తాను” అని అన్నాడు. అందుకు మీ నాన్న “ఓ నా ప్రభూ! నన్ను తిరిగి బ్రతికించు నేను మళ్లీ నీ మార్గంలో పోరాడి చంపబడతాను” అని కోరుకున్నాడు. దానికి అల్లాహ్ “మరణించిన తర్వాత ప్రపంచానికి తిరిగి వెళ్ళటం జరగదని మేము ముందే నిర్ణయించి ఉన్నాం కదా!” అని అన్నాడు. అందుకు మీ నాన్న “మరయితే ప్రభూ! నా తరఫున (ప్రపంచవాసులకు) ఈ సందేశం (అనగా మళ్లీ బతికి అమరగతుడవ్వాలని కోరుకోవటం) పంపించు” అని కోరుకున్నారు. అప్పుడు అల్లాహ్ ఈ సూక్తి అవతరింపజేశాడు. అల్లాహ్ మార్గంలో చంపబడేవారిని మృతులుగా భావించకండి. వారు బ్రతికే ఉన్నారు. తమ ప్రభువు దగ్గర జీవికను పొందుతున్నారు. (ఆలి ఇమ్రాన్ సూరా, 169వ సూక్తి (ఇబ్నెమాజా).
బఖర, ఆలి ఇమ్రాన్ సూరాల్లోని రెండు సూక్తుల వ్యాఖ్యానం ద్వారా ఈ క్రింది విషయాలు బోధపడుతున్నాయి.
1) షహీదుల (అమరగతుల) దేహాలు సమాధుల్లో ఉంటాయి. కాని వారి ఆత్మలను మాత్రం అమరగతి తర్వాత నేరుగా స్వర్గానికి పంపించటం జరుగుతుంది.
2) అమరవీరుల ఆత్మలు స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత ప్రపంచంలోకి తిరిగి రావటం అసాధ్యం.
పైన పేర్కొనబడిన దైవగ్రంథం, దైవప్రవక్త హదీసు ఆధారాలతో పాటు ఈ క్రింద పేర్కొనబడే షరీఅత్ ఆదేశాలను కూడా ఒకసారి పరిశీలించండి. వీటి ద్వారా కూడా అమరవీరుల సమాధి లోక జీవితం ఇహలోక జీవితం లాంటిది కాదన్న భావన మరింత పటిష్టమవుతుంది.
1) సాధారణ ముస్లింలు చనిపోతే వారి వితంతువులకు పునర్వివాహం చేసుకోవటానికి అనుమతి ఉన్నట్లే అమరవీరులు, మహాత్ములు, వలీలు చనిపోయిన తర్వాత వారి వితంతువులకు కూడా పునర్వివాహం చేసుకోవటానికి అనుమతి ఉంది. ఒకవేళ (మీరన్నట్లు) అమరవీరులు, మహాత్ములు, వలీలు చనిపోయిన తర్వాత కూడా బతికే ఉంటే వారి వితంతువులకు పునర్వివాహం చేసుకునే అనుమతి ఎందుకు ఉంది?
2) సామాన్యంగా ముస్లింలు చనిపోతే వారి ఆస్తి పంపకం జరుగుతుంది. అలాగే అమరవీరులు, మహాత్ములు, వలీలు చనిపోతే కూడా అలాగే వారసులకు పంపిణీ చేయబడుతుంది. ఒకవేళ అమరవీరులు, మహాత్ములు, వలీలు బతికే ఉంటే వారి ఆస్తిని పంపిణి చేయమని షరీఅత్లో ఎందుకు ఆదేశించబడింది.
3) సామాన్య ముస్లింలు చనిపోయినప్పుడు వారి జనాజా నమాజులో మన్నింపు ప్రార్థన చేసినట్లే అమరవీరుల, మహాత్ముల, వలీల జనాజా నమాజుల్లోనూ అదే మన్నింపు ప్రార్థన జరుగుతుంది.
4) సామాన్య ముస్లింలు చనిపోతే వారిని సమాధిలో ఎలా పాతిపెడతారో అమరవీరుల్ని, మహాత్ముల్ని, వలీలను కూడా అలాగే పాతిపెడతారు. ఒకవేళ వారు మరణించిన తర్వాత కూడా ఈ ప్రపంచపు జీవితంలా జీవించి ఉంటే మరి వారిని సమాధిలో పాతిపెట్టమని ఎందుకు ఆదేశించబడింది?
అమరవీరుల సమాధి జీవితం గురించి దైవగ్రంథం, దైవప్రవక్త సున్నతు భావన ఎంత స్పష్టంగా దాపరికం లేకుండా ఉందంటే కాస్తోకూస్తో చదువుకున్న సామాన్యముస్లింలు కూడా అల్లాహ్, దైవప్రవక్త ప్రవచనాలను బట్టి అమరవీరుల, ఔలియాల, సదాచారుల ఆత్మలు సమాధుల్లో లేవనీ, అవి స్వర్గంలోనో లేక ఇల్లియ్యీన్లోనో ఉన్నాయనీ, ఇక అవి స్వర్గం లేక ఇల్లియ్యీన్ నుంచి తిరిగి ప్రపంచంలోకి రావటంగానీ, మొరలు ఆలకించటం గాని, ప్రజల అవసరాలు తీర్చటం గాని, మురాఖబా, ముకాషఫా చేసేవారిని కలవటం గాని, ఎవరితోనయినా మట్లాడటం గాని జరగదని అర్థం చేసుకోగలరు. కేవలం ప్రాపంచిక ప్రయోజనాలు, ప్రాపంచిక సిరిసంపదలు పదవీహోదాలు లభిస్తాయనే దృష్టితో దైవ సన్నిధిలో జవాబు చెప్పుకోవలసి ఉంటుందన్న విషయాన్ని పూర్తిగా విస్మరించినవారు మాత్రమే ఇలాంటి నిరాధారమైన, భ్రష్టకరమైన తప్పుడు ఎద్దేవాలు చేయటానికి సాహసించగలరు.
దైవ ప్రవక్తగారి సమాధి జీవితం
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సమాధి జీవితం విషయమై రెండు అభిప్రాయ వర్గాలవారున్నారు. ఒక వర్గం దృష్టిలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇప్పటికీ ఈ ప్రపంచంలో ఉన్నట్లే సజీవంగా ఉన్నారు. లేదు, ఇతర మానవులకు మరణం సంభవించినట్లు దైవప్రవక్తకు కూడా మరణం సంభవించింది, కనుక ఆయన ఇప్పుడు బతికిలేరు, చనిపోయారు అని రెండోవర్గం అభిప్రాయం.
మొదటి వర్గం వారి విశ్వాసాలకు సంబంధించి కొన్ని కొసమెరుపులు గమనించండి:
1) దైవ ప్రవక్తల (సమాధి) జీవితం వాస్తవమైనది. అనుభవపూర్వకమైనది. ప్రాపంచికమైనది. దైవ నిర్ణయం రుజువు కావటం కోసం కేవలం ఒకే ఒక క్షణానికి వారికి చావు వస్తుంది. ఆ తర్వాత వెంటనే మునుపటిలాగే జీవితం ప్రసాదించ బడుతుంది. [మల్ఫూజాత్ అజ్ అహ్మద్ రజాఖాన్ బరేల్వి. మూడోభాగం, 276వ పుట]
2) దైవప్రవక్తగారి జీవన్మరణాలలో ఎలాంటి తేడా లేదు. ఆయన తన అనుచర సమాజాన్ని చూస్తున్నారు. వారి పరిస్థితులు, ఉద్దేశ్యాలు, ఆలోచనలు, మనసులోని మాటలు ఆయనకు తెలుస్తూనే ఉంటాయి. [ఖాలిసుల్ ఏతిఖాద్, 39వ పుట]
3) దైవప్రవక్తల పవిత్ర సమాధుల్లోకి వారి భార్యామణులు తీసుకురాబడతారు. దైవప్రవక్తలు అక్కడ వాళ్ళతో రాత్రిగడుపుతారు. [మల్ఫూజాత్ అజ్ అహ్మద్ రజాఖాన్ బరేల్వి మూడో భాగం 276 వ పుట]
4) ఇమాము మరియ ఖుత్ అయిన సయ్యిదినా అహ్మద్ రిఫాయీ (రదియల్లాహు అన్హు) గారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి పవిత్ర సమాధి ముందు నిలబడి “తమరి శుభకరాన్ని నా అధరాలతో ముద్దుపెట్టుకోనివ్వండి” అని అడిగారు. అప్పుడు సమాధిలో నుంచి ఆయన శుభకరం బయటికి వచ్చింది. ఇమామ్ రిఫాయీ దాన్ని చుంబించారు. [మజూఅ రసాయెల్ అజ్ అహ్మద్ రజాఖాన్ బరేల్వి మొదటి సంపుటి 173వ పుట]
5) (సాయంత్రం) ఆరున్నర గంటల సమయం. దైవవ్రక్త దర్బారు అలంకరించబడి ఉంది. నేను దైవప్రవక్త దర్బారుకు హాజరై పాతికేళ్ళయింది. అబూబక్ర్ సిద్ధిఖ్ (రదియల్లాహు అన్హు) మరియు ఉమర్ ఫారూఖ్ (రదియల్లాహు అన్హు) లు గొప్ప భక్తిశ్రద్ధలతో కూర్చొని ఉన్నట్లు కనిపించారు. వారందరూ ప్రత్యేక ఏర్పాట్లతో హజ్రత్ మౌలానా TS అల్లాహ్ యార్ఖాన్ను గుమిగూడి ఉన్నారు. నేను ఒంటరిగా అక్కడికి వెళ్ళాను. హజ్రత్గారు బ్రహ్మాండమైన వింతైన దుస్తులు ధరించి ఉన్నారు. తలమీద కిరీటం ధగధగ మెరుస్తోంది. ఏదో ప్రత్యేకమైన సమావేశం జరుగుతూ ఉంది. కారుణ్య ప్రవక్త చిరునవ్వుల కరుణారసాలు కురిపిస్తున్నారు. ఆ గౌరవమూర్తిని అలాంటి విచిత్ర స్థితిలో చూసి బహుశా హజ్రత్ గారికి ఏదో గొప్ప పదవి లభించబోతుందేమో అనుకున్నాను నేను. ఈ స్థితి ఆరున్నర నుంచి పావు తక్కువ ఎనిమిది గంటల వరకు కొనసాగింది. [ఇర్షాదుస్సాలికీన్ మొదటి భాగం అజ్ హజ్రత్ మౌలానా ముహమ్మద్ అక్రమ్ 19వ పుట]
6) దైవప్రవక్తతో నా ఆంతరంగిక ప్రమాణం (బైత్) ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా ఎలా జరిగిందంటే – నాకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక ఎత్తయిన చోట ఆసీనులై ఉన్నట్లు, సయ్యిద్ అహ్మద్ షహీద్ గారి చెయ్యి ఆయన చేతిలో షహీద్రి ఉన్నట్లు, నేను కూడా అక్కడే ఎంతో వినయంగా దూరంలో నించొని ఉన్నట్లు సయ్యిద్ గారు నా చెయ్యి పట్టుకొని దైవప్రవక్త చేతిలో పెట్టినట్లు కనిపించింది. [షమాయిమె ఇమ్హదియా అజ్ హాజీ ఇమ్రాదుల్లాహ్ 108వ పుట.]
7) హజ్రతీ (అంటే మౌలానా అల్లాహ్ యార్ఖాన్) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తనను గడ్డం గొరిగించుకున్న వారెవర్నీ (తన సన్నిధికి) వెంట తీసుకురావద్దని వారించారని బహిరంగ సభలోనే చెప్పేవారు. నిజానికి హజ్రన్జగారు ఉద్దేశ్యపూర్వకంగా అలాచేసేవారు కాదు. కాని తనకు ఆ విధంగా ఆదేశం అయినప్పటి నుంచి ఆయన దైవప్రవక్త దర్బారుకు హాజరయినప్పుడల్లా తనవెంట గడ్డం గీసుకున్న వారెవరైనా వస్తున్నారేమోనని జాగ్రత్త పడేవారు. ఇప్పటికీ జాగ్రత్తపడుతున్నారు. [ఇర్షాదుస్సాలిన్ మొదటి భాగం 80వ పుట]
‘దైవప్రవక్త బతికే ఉన్నారు’ అని నమ్మే వారి వాదనలకు సంబంధించిన ఉదాహరణలు కొన్ని మేము పైన పేర్కొన్నాము. ఇప్పుడు దైవ గ్రంథం, దైవప్రవక్త సున్నతు దృష్టిలో ఈ విధమైన నమ్మకాలు సరైనవో కావో సమీక్షిద్దాం.
దైవప్రవక్త మరణం గురించి దైవగ్రంథం, స్వయంగా దైవప్రవక్త ప్రవచించిన వాస్తవాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
1) జుమర్ సూరాలో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“ఓ ముహమ్మద్! నిస్సందేహంగా నీవూ మరణిస్తావు. వారూ మరణిస్తారు”. (జుమర్ : 30)
ఈ సూక్తిలో అల్లాహ్ దైవప్రవక్త మరణం కోసం, సామాన్య మానవుల కోసం ఉపయోగించిన పదమే వాడాడు. అంటే ఇతరులకు మరణం ఎలా సంభవిస్తుందో దైవప్రవక్తకు కూడా అలాగే సంభవించిందని భావం.
2) అంబియా సూరాలో అల్లాహ్ ఇలా అడుగుతున్నాడు:
“ఓ ప్రవక్తా! శాశ్వత జీవితాన్ని మేము నీకు పూర్వం కూడా ఏ మానవునికీ ప్రసాదించలేదు. ఒకవేళ నీవు మరణిస్తే వారు మాత్రం శాశ్వతంగా జీవించి ఉంటారా!” (అంబియా : 34)
ఈ సూక్తిలో అల్లాహ్ రెండు విషయాలు వివరించాడు. అవి ఒకటి: అంతిమప్రవక్తకు ముందు గతించిన దైవప్రవక్తలకు కూడా మరణం సంభవించింది. రెండోది నీకు కూడా మరణం సంభవిస్తుంది. శాశ్వత జీవితం నీకు పూర్వం ఏ ప్రవక్తకూ ఇవ్వలేదు. నీక్కూడా ఇవ్వబోము.
3) ఉహుద్ యుద్ధంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అమరగతులయ్యారనే వదంతి వ్యాపించగానే ఆయన అనుచరులు యుద్ధభూమిలో నిరాశానిస్పృహలకు లోనై యుద్దం చేయకుండా కూర్చున్నారు. అప్పుడు అల్లాహ్ ఈ సూక్తిని అవతరింపజేశాడు:
“ఒకవేళ ముహమ్మద్ (సహజంగా మరణిస్తే లేక హత్యచేయబడితే. మీరు వెనుకంజవేసి మరలిపోతారా?” (ఆలి ఇమ్రాన్ సూరా: 144)
ఒకవేళ దైవప్రవక్తకు కొన్ని క్షణాల మరణం తర్వాత మళ్లీ ప్రాపంచిక జీవితం లభించబోవటం నిజమైనట్లయితే దైవసూక్తి పైవిధంగా కాకుండా “ప్రజలారా! చింతించకండి. చనిపోయినా, హత్యచేయబడినా దైవప్రవక్త మీవెంటే ఉంటారు. కనుక మీరు నిరాశ చెందవలసిన అవసరం లేదు” అని ఉండాల్సింది. కాని అలా లేదు.
4) ఆలి ఇమ్రాన్ సూరాలోని సూక్తిలో అల్లాహ్ గత ప్రవక్తలను ప్రస్తావించి వారికి కూడా మరణం వచ్చింది అలాగే నీకు కూడా వస్తుంది అని చెప్పాడు. గత ప్రవక్తల్లో ఇద్దరి మరణ సంఘటన స్వయంగా ఖుర్ఆన్లోనూ వివరించబడింది. దాని ద్వారా దైవప్రవక్తలు మరణించటం నిజమని స్పష్టంగా బోధపడుతోంది.
సబా సూరాలో సులైమాన్ ప్రవక్త గురించి… కర్ర ఊతం మీద నిలబడి ఉన్నప్పుడే ఆయనకు మరణం సంభవించిందనీ, కాని తమకు అగోచర జ్ఞానం ఉందని – గొప్పలు చెప్పుకునే జిన్నాతులకు (లేక వారికి అగోచర జ్ఞానం ఉందని ప్రజలు భావించిన జిన్నాతులకు) సులైమాన్ ప్రవక్త మరణించారన్న సంగతి చాలా కాలం తర్వాత గాని తెలిసి రాలేదని అల్లాహ్ తెలియజేశాడు.
‘ఆ తరువాత సులైమాన్ పై మేము మరణ నిర్ణయాన్ని అమలు జరిపినప్పుడు జిన్నాతులకు అతని మరణం గురించి తెలియజేసిన వస్తువు అతని చేతి కర్రను తింటూ ఉన్న చీడపురుగే తప్ప మరొకటికాదు. ఈ విధంగా సులైమాన్ పడిపోగా, తమకు అగోచర విషయాలు తెలిసి ఉంటే అవమానకరమైన ఈ బాధకు గురి అయి ఉండేవారము కాము అని జిన్నాతులకు స్పష్టంగా తెలిసిపోయింది. (సబాసూరా:14)
సులైమాన్ ప్రవక్త మరణించిన తర్వాత ఆయన చేతికర్రను చెదలు తినటానికి ఒక సంవత్సరకాలం పట్టిందని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు. దాన్ని మనం ఆరునెలలు అనుకున్నా దైవప్రవక్తలకు క్షణికకాలం చావు వస్తుంది ఆ తర్వాత వెంటనే మళ్లీ ప్రాపంచిక జీవితం లభిస్తుంది అన్న భావన తప్పు అని రుజువు చేయటానికి అది చాలు. సులైమాన్ ప్రవక్త తన మరణానంతరం ఎంతకాలమైతే నించున్నారో అంతకాలం తన చేతికర్ర ఆధారంగానే నించున్నారని దైవసూక్తి ద్వారా బోధపడుతుంది. ఆయన గనక బతికుంటే ఆయనకు చేతి కర్ర ఆధారం ఎందుకు అవసరమయింది? కర్రకు చెదలు పట్టి కర్ర విరిగిపోగానే సులైమాన్ ప్రవక్త కిందపడి పోయారు. ఆయన బతికుంటే క్రింద ఎందుకు పడిపోయేవారు?
బఖరా సూరాలో అల్లాహ్ యాఖూబ్ ప్రవక్త గురించి ఇలా వివరించాడు: యాఖూబ్ కు మరణం సమీపించినప్పుడు ఆయన తన కుమారులను పిలిచి తదనంతరం మీరు ఎవరిని పూజిస్తారు?” అని అడిగారు. దానికి ఆయన కుమారులు
“మీ ఆరాధ్యుడు, మీ పూర్వీకులయిన ఇబ్రాహీమ్, ఇస్ హాఖ్ ఏకైకారాధ్యుడైన అల్లాహ్ ను ఆరాధిస్తాము” అని సమాధానమిచ్చారు (బఖరా సూరా: 133)
దైవప్రవక్తలు క్షణిక కాలంపాటు మరణించి మళ్లీ ప్రాపంచిక జీవితంలాగా జీవించబడతారన్న మాటే నిజమయితే యాఖూబ్ ప్రవక్త తన తదనంతరం తన పిల్లల పరిస్థితి గురించి ఎందుకు చింతించారు. ‘నా తర్వాత మీరు ఎవరిని ఆరాధిస్తారు’ అని వారిని అడగవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకవేళ దైవప్రవక్తలు మరణానంతరం కూడా జీవించి ఉంటారన్నమాటే నిజమయితే తండ్రి అడిగిన ప్రశ్నకు యాఖూబ్ కుమారులు ఈ విధంగా సమాధానం చెప్పాల్సింది. ‘నాన్నా మీరు మళ్ళీ ప్రాపంచిక జీవితంలోకి తిరిగి వచ్చే వారే. అప్పుడు మేము ఎవరిని ఆరాధిస్తామో మీరెలాగూ చూస్తారు కదా! మీకు మా గురించి చింత దేనికి?’ దీని ద్వారా బోధపడేదేమిటంటే దైవప్రవక్తలు మరణించిన తర్వాత మళ్లీ ప్రాపంచిక జీవితంలా బతికించబడతారనే నమ్మకం ఆ తండ్రికి లేదు, కొడుకులకూ లేదు. పైగా వారు అంతకు ముందు ప్రవక్తలు కూడా మరణించారనీ, వారిలో ఎవరూ ఈ లోకానికి తిరిగి రాలేరన్న విషయాన్నే నమ్మేవారు.
5) హజ్రత్ జుబైర్ బిన్ ముత్ ఇమ్ (రదియల్లాహు అన్హు) కథనం: ఒక మహిళ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడింది. ఆయన ఆమెను మళ్లీ ఇంకెప్పుడయినా రమ్మని ఆదేశించారు. అందుకామె “దైవప్రపక్తా! నేనొచ్చినప్పటికి మీరు లేకపోతే ఏం చెయ్యాలి”? అని అడిగింది. అంటే దైవప్రవక్త మరణించిఉంటే ఏం చెయ్యాలి అన్నది ఆమె ఉద్దేశ్యం. దానికి దైవప్రవక్త “ఒకవేళ నేను దొరక్కపోతే అబూబక్ర్ తో మాట్లాడుకో” అని చెప్పారు (బుఖారీ-ముస్లిం).
పై హదీసు ద్వారా ఈ క్రింది రెండు విషయాలు స్పష్టంగా బోధపడుతున్నాయి. 1) దైవప్రవక్త కాలంలో ఆయన అనుచరులు, అనుచరిణులు ఆయన మరణానంతరం తాము ఆయనతో మాట్లాడలేమని, ఆయన మాటలు వినలేమని, ఆయన తమకు మార్గదర్శకత్వం వహించలేరని, సహాయం కూడా చేయలేరని నమ్మేవారు. 2) దైవప్రవక్తలు మరణించరనీ, కనుక తను మరణిస్తే తన సమాధి దగ్గరికి వచ్చి మాట్లాడుకోమని లేక మరణం తర్వాత కూడా తను ప్రాపంచిక జీవితం లాగా బతికుంటాననీ, నేను మీ మాటలు వింటానని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా ఎన్నడూ బోధించలేదు. పైగా తను మరణిస్తే అబూబక్ర్ తో మాట్లాడుకోమని చెప్పారు.
6) దైవప్రవక్త మరణ సమయంలో కూడా ఆయన అనుచరుల మధ్య అసలు దైవప్రవక్తకు మరణం సంభవించిందా లేదా అన్న చర్చ మొదలయింది. ఆ సందర్భంలో ఉమర్ (రదియల్లాహు అన్హు) లాంటి దైవగ్రంథ, దైవప్రవక్త ప్రవచన పండితుడు, దూరదృష్టి ధర్మావగాహన కల సహాబీ కూడా “దైవసాక్షి! దైవప్రవక్త చనిపోలేదు. ఆయన కపటులను అంతం చేసేదాకా చనిపోరు” అన్న భ్రమకు లోనయ్యారు (ఇబ్నెమాజా). అప్పుడు అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) ఓ బ్రహ్మాండమైన, చారిత్రాత్మక ఉపన్యాసమిచ్చి దైవప్రవక్త జీవిత సమస్య ఇక ప్రళయం వరకూ తలెత్తకుండా పరిష్కరించారు. అప్పుడు ఆయన అన్న మాటలివి:
“అంటే ఎవరయితే అల్లాహ్ ను ఆరాధించేవాడో వారికి అల్లాహ్ సజీవుడనీ, ఆయనకు మృత్యువు లేదని తెలియాలి, మరెవరయితే ముహమ్మద్ ని ఆరాధించే వారో వారు ముహమ్మద్ మరణించారని తెలుసుకోవాలి” (ఇబ్నెమాజా).
అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) గారు చేసిన ఉపన్యాసం విన్న తర్వాత ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “దైవంసాక్షి! అబూబక్ర్ ఉపన్యాసం విన్నప్పుడు నాకు నా నడుం విరిగిపోయినట్లనిపించింది. నా కాళ్లు లేవలేదు. నేను నేలమీద దొర్లిపోయాను. ఎందుకంటే దైవప్రవక్త మరణించారని అప్పుడు నాకు నమ్మకం కలిగింది. (బుఖారీ).
7) దైవప్రవక్త మరణం ఆయన ఇంటివారిని, ఆయన అనుచరుల్ని శోకసముద్రంలో ముంచెత్తింది. ఫాతిమా (రదియల్లాహు అన్హా) బాధాతప్త గొంతుతో అనస్ (రదియల్లాహు అన్హు) ని ఉద్దేశించి “అనస్! దైవప్రవక్తమీద మన్నుపోయటానికి మీకు చేతులెలా వచ్చాయి?” అని అడిగారు. సాబిత్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించినప్పుడు ఫాతిమా (రదియల్లాహు అన్హా) పడ్డ బాధను వివరించినప్పుడల్లా తను స్వయంగా కన్నీరు మున్నీరుగా విలపించేవారు. “దైవప్రవక్త మరణంతో మదీనాలోని ప్రతి వస్తువుపై చీకటి ఆవరించింది. ఆయన ఖననంతోటే మాకు మా హృదయాల్లోని ప్రవక్తృత్వపు జ్యోతి ఆరిపోతున్నట్లు అనిపించింది” అని అనస్ (రదియల్లాహు అన్హు) చెప్పారు. దైవప్రవక్త మరణం క్షణికమైనదయితే ఆయన ఇంటివారికి, అబూబక్ర్ ఉమర్ (రదియల్లాహు అన్హు) లకు, ఇతర అనుచరులందరికి ప్రపంచం చీకటిమయంగా ఎందుకు అనిపించింది అన్నది ప్రశ్న. ఇనుప కండల మనిషి అయిన ఉమర్ కు నడుం విరిగినట్లు ఎందుకు అనిపించింది?
ఇప్పటి వరకు పేర్కొనబడిన ఖుర్ఆన్ హదీసు ఆధారాలను అటు ఉంచి ఇప్పుడు మరో కొత్త కోణంలో ఈ సమస్యను సమీక్షిద్దాం.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణానంతరం బనూసాయిదా సఖీఫాలో ఖిలాఫత్ గురించి గొడవ జరుగుతూ ఉంది. సిద్దిఖీ హయాంలో ప్రజలు జకాత్ ఇవ్వము అని ధిక్కరించటం, ధర్మభ్రష్టులైపోవటం లాంటి ఉపద్రవాలు తలెత్తాయి. ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) అన్యాయంగా అమర గతులయ్యారు. అనుచరుల మధ్య జమల్ యుద్ధం, సిప్పీన్ యుద్ధం లాంటి ఘోర రక్తపాతాన్ని సృష్టించిన యుద్ధాలు జరిగాయి. కర్బలా (యుద్ధ) భూమిలో ఆయనగారి ప్రియ మనవడు అత్యంత నిర్దాక్షిణ్యంగా చంపబడ్డాడు. ఈ రోజు కూడా ప్రపంచంలో వివిధ చోట్ల ముస్లిం సమాజంపై ఎలాంటి ప్రళయాలు విరుచుకుపడుతున్నాయి? మరి అదేం జీవితమండీ? దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖిలాఫత్ సమస్యలో అనుచరులకు మార్గదర్శకత్వం వహించలేదు. జకాత్ ఇవ్వకపోవటం, ధర్మభ్రష్టులైపోవటం లాంటి ఉపద్రవాలు తలెత్తినప్పుడు ఆయన అబూబక్ర్క ఎలాంటి సూచనలూ ఇవ్వలేదు. తను ఎంతో గర్వంగా చెప్పుకునే తన అల్లుడు విశ్వాసుల నాయకుడైన ఉస్మాన్కు ఎలాంటి సహాయం చేయలేదు. జమల్ యుద్ధం, సిప్పీన్ యుద్ధాలను ఆపలేదు. కర్బలాలో తన ప్రియమనవణ్ణి కాపాడలేదు. ఈ రోజు కూడా ముస్లిం సమాజం ప్రపంచంలో ఎన్నోచోట్ల అవిశ్వాసుల అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురై ఉన్నారు. కాని ఇవన్నీ తెలిసి కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మౌనం వహిస్తున్నారు. తన అనుచర సమాజానికి సరైన సూచనలు ఇవ్వటం గాని సహాయంగాని చేయట్లేదు. దౌర్జన్యం చేసేవారిని ఆపట్లేదు. వారికి వ్యతిరేకంగా ఏ ఆజ్ఞ జారీచేయట్లేదు. మరోవైపేమో ఔలియాలు, సూఫీలతో పాటు ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు? వారికి పదవులు పందేరాలు ప్రసాదిస్తున్నారు? యావత్తు ప్రపంచంలో జరిగే దరూద్సలామ్ల సమావేశాల్లో పాల్గొంటున్నారు?
మేము పూర్తి చిత్తశుద్దితో, సానుభూతితో దైవప్రవక్త (మనలాగే) జీవించి ఉన్నారని చెప్పేవారిని అడుగుతున్నాం. దయచేసి కాస్త ఆలోచించండి. దైవప్రవక్త సున్నతు ద్వారా బోధపడేదేమిటంటే – ఆయన సమాధి జీవితం ఇతర దైవప్రవక్తలు, అమరవీరులు, ఔలియాలందరికంటే గొప్పది, ఉన్నతమైనది, పరిపూర్ణమైనది. అది ఇహలోక జీవితంలా లేదు పరలోక జీవితంలా కూడా లేదు. దాని అసలు స్థితి అల్లాహ్ కు మాత్రమే తెలుసు. ఆయన పవిత్ర భౌతికకాయం మదీనాలోని ఆయన సమాధిలో నేటికి పధ్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఖననం చేసినప్పుడు ఎంత తాజాగా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. ప్రళయం వరకూ అలాగే తాజాగా, ఎలాంటి మచ్చల్లేకుండా ఉంటుంది. ఆయన ఆత్మ జన్నతుల్ ఫిర్ దోస్ లోని అత్యున్నత స్థానం మీద దైవసింహాసనానికి సమీపంలో ఉంది. అల్లాహ్ ఆయనను తాను ఏది కోరితే అది తినిపిస్తాడు. త్రాపిస్తాడు. వల్లాహు ఆలము బిస్సవాబ్!
ఒక అపోహ:
దైవప్రవక్త సమాధి జీవితం ప్రాపంచిక జీవితం లాంటిదని రుజువు చేయటానికి కొందరు ఈ క్రింది హదీసులు నిదర్శనంగా చూపిస్తారు.
(1) ఎవరైనా నాకు సలాం చేస్తే అల్లాహ్ నా ఆత్మను (తిరిగి శరీరంలోకి) పంపుతాడు. దాంతో నేను అతనికి ప్రతి సలాం చేస్తాను. (అబూదావూద్)
2) నా కొరకు అతి ఎక్కువగా దరూద్ పఠించండి. అల్లాహ్ నా సమాధి దగ్గర ఒక దూతను నియమిస్తాడు. నా అనుచర సమాజంలో ఎవరైనా నా కొరకు దరూద్ పఠిస్తే అప్పుడు ఆ దూత నాతో “ముహమ్మద్! ఫలానా అతని కుమారుడు ఫలానా మనిషి, ఫలానా సమయంలో మీ కొరకు దరూద్ పఠించాడు” అని చెబుతాడు. (దైలమీ).
3) జుమారోజు అత్యధికంగా నా కొరకు దరూద్ పఠించండి. జుమారోజు నా కొరకు పఠించబడిన దరూద్ నా ముందు సమర్పించబడుతుంది. (హాకిమ్, బైహఖీ)
షేఖ్ ముహమ్మద్ నాసిరుద్దీన్ అల్బానీ (రహిమహుల్లాహ్ ) మొదటి రెండు హదీసులను హసన్ గానూ, మూడో హదీసును సహీహ్ గాను పేర్కొన్నారు. ఈ హదీసుల ద్వారా “దైవప్రవక్త జీవితం”ను రుజువు చేయాలని ప్రయత్నించేవారు కూడా మేము ఇంతకు ముందు “సమాధి జీవితం ఎలా ఉంటుంది?” అనే శీర్షిక క్రింద ప్రస్తావించిన అపోహకే లోనై ఉన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధిలో ఇతర దైవప్రవక్తలు, వలీలు, అమరగతులకంటే ఉన్నతమైన, పరిపూర్ణమైన జీవితం గడుపుతున్న మాట నిజమే. దాన్ని నిరాకరించటానికి వీలులేదు. కాని సమాధి జీవితం ఇహలోక జీవితానికి పూర్తిగా భిన్నమైనది కనుక దాన్ని ఈ ప్రాపంచిక జీవితంతో పోల్చటం శుద్ధ తప్పు. మనిషికి ఈ ప్రపంచంలో ఉండి సమాధిలోక జీవిత వ్యవహారాలను అర్థం చేసుకునే తెలివి, అవగాహన ఇవ్వబడలేదు. (బఖర సూరా 154వ సూక్తి చూడండి).
మీరే ఆలోచించండి! ప్రజల సలాముకు జవాబు చెప్పటం కోసం ఆయన ఆత్మను ఆయన పవిత్ర దేహంలోకి పంపించటం అనేక విధాలుగా జరగవచ్చు. ఉదా: ప్రతి వ్యక్తి సలాం చేసినప్పుడల్లా ఆయన ఆత్మను దేహంలోకి పంపించవచ్చు, లేక రోజుకి ఒకసారి ఏదైనా సమయంలో పంపించవచ్చు లేక వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి లేక సంవత్సరంలో ఒకసారి ప్రజలందరి సలాములు కలిపి ఆయనకు చేరవేస్తే ఆయన వాటన్నిటికి ఒకేసారి ప్రతి సలామ్ చెప్పవచ్చు. ఆత్మ శరీరంలోకి పంపించటం పైన పేర్కొనబడిన విధాల్లో ఏదో ఒక విధంగా జరగవచ్చు లేక మరేదయినా కొత్తవిధంగా జరగవచ్చు. దాని వాస్తవస్థితి అల్లాహ్ కు మాత్రమే తెలుసు. దరూదె షరీఫ్ సంగతి కూడా అంతే. అవి దైవప్రవక్తకు రోజూ చేరవేయబడతాయా లేక ఆయన ప్రవచించినట్లు జుమారోజు చేరవేయబడతాయా? నిజం చెప్పాలంటే అల్లాహ్ కు తప్ప మరెవరికీ తెలియని విషయాలివి. మనం వాటిని విశ్వసించటం విధి. కాని వాటి స్థితిని అర్థం చేసుకోవటం మనకు అసాధ్యం. అసలు మనకు దాని అవసరం కూడా లేదు. ఒక విషయాన్ని విశ్వసించటం దాని స్థితిని అర్థం’ చేసుకోవటంతో ముడిపడిలేదు. ఎన్నో విషయాలమీద మనకు విశ్వాసం ఉంది. కాని ఇహలోక జీవితంలో మనం వాటి స్థితిని అర్థం చేసుకోలేం. ఉదా: రాత్రి చివరి భాగంలో అల్లాహ్ మొదటి ఆకాశంపైకి అవతరిస్తాడని మనకు నమ్మకం ఉంది కాని అది ఎలా జరుగుతుందో మనకు తెలియదు. కిరామన్ కాతిబీన్ దూతలు’ కర్మల చిట్టాను తయారుచేస్తారని నమ్ముతాం. కాని అది ఎలా జరుగుతుందో మనకు తెలియదు. ప్రళయదినాన కర్మలు తూయబడతాయన్న విషయాన్ని మనం నమ్ముతాం. కాని అది ఎలా జరుగుతుందో తెలీదు. దైవప్రవక్త మేరాజ్ (గగనయానం) చేశారని నమ్ముతాం. కాని అది ఎలా జరిగిందో మనకు తెలియదు. ఇలాంటి ఉదాహరణలు కొన్ని కాదు వందలకొలది ఇవ్వొచ్చు. వాటిని మనం విశ్వసిస్తాం కాని వాటి స్థితి గురించి మనకు తెలియదు. సమాధి జీవితంలో దైవప్రవక్త ఆత్మ శరీరంలోకి పంపించబడటం, ఆయన ప్రజల సలాముకు ప్రతి సలాం చెప్పటం, దూతలు ఆయనకు దరూద్ చేరవేయటం, జుమారోజు ఆయన ముందు దరూద్లలు సమర్పించబడటం. ఇవన్నీ కూడా ఆ కోవకు చెందినవే. అంటే వాటి స్థితిని, వాస్తవికతను అర్థం చేసుకోవటం మనకు అసాధ్యం. కాని వాటిని విశ్వసించటం మాత్రం విధి. కనుక పై హదీసుల ద్వారా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధిలో బతికున్నారనీ రుజువు కాదు, అలాగే ఆ హదీసులను నిదర్శనంగా చేసుకొని ఆయన మన సలాం వింటారు, దానికి ప్రతిసలాం చెబుతారు, కనుక మన ఇతర విన్నపాలు, వినతులు, మొరలు దుఆలు కూడా వింటారు, దానికి సమాధానం పలుకుతారు, మన అవసరాలు తీరుస్తారు, మన మన్నింపు కోసం ప్రార్థిస్తారు లేక సమాధి నుంచి బయటికి విచ్చేసి ఔలియాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తారని చెప్పటమూ సరికాదు. ఇవన్నీ తప్పుడు ఊహాగానాలు. జనాన్ని భ్రష్టుపట్టించేవి. గ్రంథం, సున్నతుల బోధనలతో వీటికి ఏ మాత్రం సంబంధం లేదు. అల్లాహ్ ఆయన ప్రవక్త ఎంతవరకయితే చెప్పారో అంతవరకు నిస్సంకోచంగా చెప్పాలి. దాన్ని విశ్వసించాలి. ఏ విషయమైతే అల్లాహ్, దైవప్రవక్త చెప్పలేదో దాన్ని స్వంతంగా ఊహించుకొని ఆ తర్వాత అది అల్లాహ్ యొక్క, దైవప్రవక్త మాట అని చెప్పకుండా ఉండేందుకు వెయ్యిసార్లు శరణువేడుకోవాలి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:
“ఎవరయితే ఉద్దేశపూర్వకంగా నామీద అబద్ధాన్ని మోపుతాడో అతను తన నివాసాన్ని నరకంలో ఏర్పరచుకుంటాడు”. (బుఖారీ-ముస్లిం)
సమాధిలో శిక్ష ఆత్మకా లేక శరీరానికా?
సమాధిలో లభించే శిక్షాబహుమానాల గురించి చదివినప్పుడు “సమాధిలో శిక్ష లేక బహుమానాలు లభించేది ఆత్మకా లేక శరీరానికా లేక రెండిటికా? “అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.
పండితులు ఈ విషయంపైన సుదీర్ఘమైన చర్చలు జరిపారు. కొందరు శరీరాన్ని కొంతకాలం తర్వాత మట్టి తినేస్తుంది. మరేమో బహుమానం లేక శిక్ష అనేది ప్రళయం వరకూ మిగులుంటుంది కనుక ఈ శిక్ష లేక బహుమానం అనేది ఆత్మకే లభిస్తుంది అని అభిప్రాయపడ్డారు. సమాధిలోకంలో శిక్ష లేక బహుమానం అనేది సమాధికి సంబంధించినది. విశ్వాసి కొరకు సమాధి విశాలమవుతుంది. అందులో వెలుతురు ఉంటుంది. అవిశ్వాసిపైకి సర్పాలు సమాధిలోనే వదలబడతాయి. సమాధిగోడలు మాటిమాటికీ శవాన్ని ఒత్తుతూ ఉంటాయి. సమాధిలో కేవలం శరీరం మాత్రమే ఉంటుంది. కనుక శరీరంలోని ఒక్క అణువు మిగిలి ఉన్నా సమాధి శిక్ష లేక బహుమానం దానికే కలుగుతుందని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇంకొందరి అభిప్రాయం ప్రకారం ఆత్మ మరియు శరీరం వేర్వేరుగా ఉన్నా వాటి మధ్య అగోచరమైన సంబంధం ఉంటుంది కనుక శిక్షాబహుమానాలు ఆ రెండిటికి కలుగుతాయి.
మా దృష్టిలో ఈ విషయం కూడా ఆకోవకు చెందినదే. అంటే దీనిని విశ్వసించటం విధి. అయితే దాని స్థితి గురించి మాత్రం మనకు తెలియదు. అల్లాహ్ కు పూర్తి అధికారం ఉంది. ఆయన తలచుకుంటే కుళ్లి కృశించి మట్టిలో కలిసిపోయిన శరీరానికి లేక ఆత్మకు లేక రెండిటికీ శిక్షాబహుమానాలు ఇవ్వగలడు. మా దృష్టిలో ఇది ఫలితం లేని వృధా చర్చ. అందులో పడి మేము మా సమయాన్ని, పాఠక మహాశయుల సమయాన్ని వృధా చేయదలచుకోలేదు. ఈ చర్చకు మన సన్మార్గంతో ఏ మాత్రం సంబంధం ఉండి ఉన్నా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దాన్ని తప్పకుండా వివరించి ఉండేవారు. కనుక మనం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పిన మాటతోనే సంతృప్తి చెందాలి. ఆ మాట ఏమిటంటే సమాధి శిక్ష తథ్యం. దాన్నుంచి శరణు వేడుకోండి.
విజ్ఞులారా! గుణపాఠం నేర్చుకోండి
(సమాధి శిక్షాబహుమానాలకు సంబంధించి కొన్ని హితబోధాత్మక సంఘటనలు)
సమాధిలో లభించే శిక్షా బహుమానాలకు సంబంధించి కొన్ని సంఘటనలు అప్పుడప్పుడూ వార్తాపత్రికల్లో, మ్యాగజైన్లలో ప్రచురించబడుతూ ఉంటాయి. అలాగే కొన్ని మనం వింటూ ఉంటాం కూడా. ఇలాంటి సంఘటనలను నమ్మటం లేక తిరస్కరించటం చాలా కష్టం. కనుక వాటిని రాయటానికి కాస్త తటపటాయించాను. అదే సమయంలో నాకు బుఖారీ షరీఫ్ గ్రంథంలో అనస్ (రదియల్లాహు అన్హు) వివరించిన ఒక సంఘటన కనిపించింది. అది చూసిన తర్వాత ఇలాంటి ప్రకృతి విరుద్ధ సంఘటనలు జరగటం అసంభవం మాత్రం కాదని నా మనసుకు బోధపడింది. దాసుల్ని కరుణించేదైవం ఇలాంటి సంఘటనలు ఉనికిలోకి తెచ్చి స్వచ్ఛమైన మనసుగలవారి గుణపాఠానికి సామాగ్రిని అందించాలని భావిస్తుందేమో! ఈ క్రింద పొందుపరచబడిన సంఘటనలు ఆ ఉద్దేశ్యంతోనే ఈ పుస్తకంలో కలిపి ప్రచురించబడుతున్నాయి. వాటిని చదివి సౌభాగ్య ఆత్మలుకలవారు గుణపాఠం నేర్చుకుంటారని ఆశిస్తున్నాం. అయితే వీటి ప్రామాణికతకు ఉల్లేఖకులు లేదా సంఘటనల క్రింద పేర్కొనబడిన వార్తాపత్రికలు, మ్యాగజైన్లే బాధ్యులు.
1. దైవవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాలం నాటి సంఘటన:
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: ఒక క్రైస్తవుడు ముస్లిం అయ్యాడు. బఖరా, ఆలిఇమ్రాన్ సూరాలు నేర్చుకున్నాడు. తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గర వహీలేకరిగా పనిచేయసాగాడు. ఆ తర్వాత కొంతకాలానికి అతను ధర్మభ్రష్టుడయ్యాడు. “ముహమ్మద్ కు ఏమీ రాదు. నేనురాసి ఇచ్చిందే చదువుకుంటాడు” అని చెప్పుకుంటూ తిరసాగాడు. అల్లాహ్ అతనికి మృత్యువునిస్తే అతను చనిపోయాడు. క్రైస్తవులు అతన్ని (సమాధిలో) పాతిపెట్టారు. తెల్లవారిన తర్వాత చూస్తే నేల అతన్ని బయటకు విసిరేసి ఉంది. క్రైస్తవులు ‘ఇది ముహమ్మద్ మరియు ఆయన అనుచరుల పని అయి వుంటుంది. ఇతను వాళ్ళ ధర్మం వదలిపెట్టి వచ్చాడు కదా (ఆ కోపంతో) వారు ఇతని సమాధి త్రవ్వి ఇతన్ని బయటికి తీసి పారేసి ఉంటారు’ అని అన్నారు. క్రైస్తవులు అతనికోసం మరోచోట సమాధి తవ్వారు. మునుపటి కంటే బాగా లోతుగా ఉండేట్టు చేసి శవాన్ని అందులో పాతారు. తెల్లవారిన తర్వాత చూస్తే నేల అతన్ని బయట విసరి పడేసింది. క్రైస్తవులు మళ్లీ “ఇది ముహమ్మద్ మరియు ఆయన అనుచరుల పని అయి ఉంటుంది. ఇతను వాళ్ల ధర్మం వదలిపెట్టి వచ్చాడు కదా! (ఆ కోపంతో) వారు ఇతని సమాధి త్రవ్వి ఇతని శవాన్ని బయటికి తీసిపారేసి ఉని నిందించారు. వారు మూడోసారి అతని కోసం సమాధి తవ్వారు. దాన్ని తాము చేయగలిగినంత లోతుగా చేశారు. తెల్లవారిన తర్వాత చూస్తే నేలమళ్లీ అతన్ని బయటకు విసిరేసింది. అప్పుడు వారికి అది ముస్లింల పని కాదనీ (దైవశిక్ష అని) బోధపడింది. వారు అతని శవాన్ని అలాగే వదలి పెట్టేశారు. [కితాబుల్ మనాఖిబ్ బాబు అలామతిన్నుబువ్వతి (బుఖారీ)]
2. సమాధి తేలు
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో మిత్రకూటమి భారతదేశం మీద కురిపించిన బాంబుల వర్షం మూలంగా సింగపూర్ మరియు బర్మాలోని ఆంగ్లేయ సైన్యాలు లొంగిపోవలసి వచ్చింది. ఆ సమయంలో ఆంగ్లేయ జర్నల్, సిపాయిల్లో ఎవరైనా పారిపోయి ప్రాణాలు దక్కించుకోగలిగితే పారిపోవచ్చని ప్రకటించాడు. ఆ సైన్యంలోని తుఫైల్ అనే ఒక మేజరు నిహాల్సింగ్ అనే తన మిత్రుడొకాయనతో కలిసి పారిపోయారు. మేజర్ తుఫైల్ అప్పుడు తమకు ఎదురైన అనుభవం గురించి ఇలా వివరిస్తున్నారు:
మేమిద్దరం రేచీకటిలో గుర్రాలెక్కి బర్మా సరిహద్దుల నుంచి పారిపోయాం. బర్మా దుర్భేద్యమైన, దట్టమైన, చీకటితో ఉండే అపాయకరమైన అడవులు గల దేశం. ఆ అడవుల గుండా వెళ్ళటం చాలా కష్టమైన పని. ఏమైనప్పటికీ మేము ఒక అంచనాతో భారతదేశంలోని అస్సాం రాష్ట్రం వైపు బయలుదేరాం. అక్కడ కూడా జపాన్ వాళ్లు బాంబుదాడులు జరిపినప్పటికీ అక్కడ ఆంగ్లేయ ఆధిపత్యం ఇంకా నిలకడగానే ఉంది. మేము ఆ అడవుల్లో దారి చేసుకుంటూ అడొచ్చిన కొమ్మలు నరుక్కుంటూ వెళ్ళసాగాం. అలా ఎన్ని రాత్రులు నడిచామో మాఇద్దరిలో ఒక్కరికీ గుర్తులేదు. మా దగ్గర ఉన్న అన్న పానీయ సామగ్రి తరగిపోసాగింది. అడవి పూలు తింటూ దారిమధ్యలో వచ్చే కాలువల నీళ్లు తాగుతూ ఉండేవాళ్ళం. కొన్ని సందర్భాల్లో క్రూరమృగాలు, భయంకరమైన సర్పాలు ఎదురయ్యాయి. వాటినుంచి ఎలాగో తప్పించుకొని వెళ్ళసాగాం.
ఒకరోజు మాకు ఓ ఖాళీ ప్రదేశం ఎదురయింది. అక్కడ ఓ శ్మశానం కనిపించింది. అందులో పాతిక ముప్ఫై సమాధులు ఉండి ఉంటాయి. ఒక సమాధి నుంచి దాదాపు సగం శవం బయటపడి ఉంది. అది కుళ్ళీకుళ్ళనట్లు కనిపించింది మాకు. దానిమీదే ఒక చిన్న తాబేలు అంత తేలు కూర్చొని శవాన్ని మాటిమాటికీ కుడుతూ ఉంది. అది కుట్టినప్పుడల్లా ఆ శవం నుంచి భయకరమైన అరుపులు వినపడుతున్నై.
ఆ భయంకరమైన తేలు కుడితే బతికున్నవారు ఎలా మొత్తుకుంటారో అలాగే ఉంది ఆ శబ్దం. అది బతికున్న మనుషుల్ని, జంతువుల్ని వణకిపోయేటట్లు ఇంకా చెప్పాలంటే స్పృహ తప్పి పడిపోయేట్టు చేసేలా ఉంది. అదొక కడు భయంకరమైన ఆందోళనకరమైన దృశ్యం. నేనెంత వారించినప్పటికీ మేజర్ నిహాల్సింగ్ ఆ తేలు పైకి తూటా పేల్చాడు. అది ఒక జ్వాలలా బయటికి వచ్చింది. తేలుకు మాత్రం ఏమీ కాలేదు. నిహాల్సింగ్ రెండవ తూటా పేల్చటానికి మళ్లీ గురిపెట్టాడు. నేనతన్ని కఠినంగా వారించాను. మన దారిన మనం వెళదాం అన్నాను. కాని మేజర్ నిహాల్సింగ్ సిక్కు మనిషి. అతను నా మాట పెడచెవిన పెట్టాడు. శవాన్ని తేలునుంచి కాపాడుతున్నట్టు రెండోసారి తూటా పేల్చాడు. మళ్లీ జ్వాలలాంటిది వచ్చింది కాని తేలుకు మాత్రం ఏమీ కాలేదు. అప్పుడు ఆ తేలు శవాన్ని వదిలిపెట్టి మా వైపు రాసాగింది. నేను నిహాల్సెంగ్ తో “పారిపోదాం పద. తేలు శవాన్ని వదలిపెట్టి మావైపు వస్తుందంటే ఇందులో ఏదో ప్రమాదముంది” అన్నాను.
మేము గుర్రాలు పరుగెత్తించాము. చాలా దూరం ముందుకు వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే తేలు వేగంగా మమ్మల్ని వెంబడిస్తూ వస్తోంది. మేము మళ్లీ గుర్రాలు ఉరికించాం. కొన్ని మైళ్లు వెళ్ళిన తర్వాత ఒక నది అడొచ్చింది. అదీ చాలా లోతుగా ఉన్నట్టు కనిపించింది. మేము కాసేపు అక్కడ నించొని గుర్రాలు నదిలోకి దించాలా లేక ఒడ్డుగుండా వెళ్ళి వంతెన ఏదైనా ఉందేమో తెలుసుకోవాలా అని ఆలోచిస్తున్నాం. మేమొక నిర్ణయానికి రాకముందే ఆ తేలు మా దగ్గరికి వచ్చేసింది. నిజం చెబుతున్నాను. మేము యుద్ధాలు చేసినవాళ్ళం. ఆ సమయంలో మా చేతుల్లో ఆయుధాలు కూడా ఉన్నాయి. అయినప్పటికి మేము తీవ్ర భయాందోళనలకు గురయ్యాం. మా గుర్రాలు కూడా ఆ తేలుకు బెదిరిపోతున్నట్టు ముందరికాళ్లు పైకి లేపసాగాయి. తేలు నిహాల్సెంగ్ వైపే రాసాగింది. నిహాల్సెంగ్ భయంతో, ఏం చేయాలో తోచని స్థితిలో తన గుర్రాన్ని నదిలోకి దించాడు. అతన్ని వెంబడిస్తూ తేలు కూడా నదిలోకి దిగింది. తేలు అతన్ని ఎక్కడ కుట్టిందోగాని ఆ ఆకస్మిక ఆపద రాకతో గుర్రం కూడా బెదిరివణకసాగింది. నిహాల్సెంగ్ భయంకరంగా అరుస్తూ నన్ను పిలిచి “తుఫైల్! నేను మునిగిపోతున్నాను. కాలిపోతున్నాను. నన్ను తేలు నుంచి కాపాడు. కాపాడు” అని మొత్తుకోసాగాడు. నేను కూడా నా గుర్రాన్ని నదిలోకి దించాను. చెయ్యిపట్టుకొని బయటికి రమ్మని నా ఎడమచెయ్యి చాపాను. నిహాల్సంగ్ -నా చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. కాని నాకు అక్కడ సాధారణ నదుల నీరు కాకుండా వేడి విషపూరిత లావాద్రవం ప్రవహిస్తూ ఉన్నట్టు, అది నా చెయ్యితోపాటు మొత్తం శరీరాన్ని కూడామొక్కజొన్న కండెలా ఉడకబెడుతుందేమో అనిపించింది. నేను కాస్త ధైర్యం తెచ్చుకున్నాను. త్వరగా నా ఎడమచెయ్యి నరుక్కున్నాను. ఆ విధంగా నన్ను నేను నిహాల్సెంగ్ పట్టునుంచి విడిపించుకున్నాను. వెంటనే గుర్రంతో సహా ఒడ్డున పడ్డాను. మేజర్ నిహాల్సింగ్ నన్ను కేక పెడ్తూ, బాధతో అరుస్తూ మూల్గుతూ గుర్రంతో సహా ఆ ఉడుకునీరు డేగిసాలో మునిగిపోయాడు. అతను మునిగిన చోట పెద్ద ఎత్తున అగ్ని బుడగలు లెగిశాయి. ఒడ్డున మాత్రం నీటి వేడి మామూలుగానే ఉన్నట్టు అనిపించింది.
ఆ దైవాగ్రహం…. తేలు… తనపని పూర్తిచేసుకొని వెళ్లిపోయింది. అది మళ్ళి నాకు ఎక్కడా కనపించలేదు. అల్లాహ్ సైన్యాల్లో అదీ ఓ అగోచరసైన్యం లాగుంది. అది నాకు మాత్రం ఏమీ నష్టం చేయలేదు. బహుశా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే… తన బాధ్యతా నిర్వహణ కోసం తిరిగి వెళ్ళిపోయి ఉంటుంది. [ఖబర్ కా బిచ్ఛూ ఉర్దూ డైజెస్ట్, ఏప్రిల్ 1992]
3. వంకర సమాధి
“నిన్న ఓ పోలీసు ఉన్నతాధికారిని సమాధిలో పూడ్చి పెట్టబోయినప్పుడు ఆ సమాధి వంకరయ్యింది. మరో సమాధి తవ్వితే అదీ ఒంకర అయిపోయింది. మొదట్లో అది సమాధి తవ్వేవాడి తప్పేమో అనుకున్నారు ప్రజలు. కాని ఒకదాని తర్వాత ఒకటి ఐదు సమాధులు తవ్వబడి తవ్వి ప్రతిసారీ సమాధి వంకర అయిపోవటంలో ఆ జనాజాలో పాల్గొన్న వారందరూ కలిసి మృతుని మన్నింపు కోసం దుఆ చేశారు. ఐదోసారి కూడా సమాధి ఒంకరగా ఉన్నప్పటికీ శవాన్ని బలవంతంగా సమాధిలో ఉంచటం జరిగింది. ఈ సంఘటన రావల్పిండిలోని పేరుగాంచిన శ్మశానం అత్రామిరార్లో జరిగింది. [రోజ్నామా జంగ్ లాహోర్ డిసెంబర్ 17, 1990 హి.శ. 1411, జుమాదివుల్ అవ్వల్ 28, సోమవారం.]
4. సమాధిలో పాములు, తేళ్లు
(షేఖూపూరా జిల్లాలోని) నారింగ్ నుండి శివారు ప్రాంతమైన జైసింగ్ వాలాలో రెండు ప్రత్యర్థి గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయి. దానిమూలంగా ముగ్గురు మరణించారు. వారిలో ఒకణ్ణి అతని మనుషులు శవపేటికలో పెట్టి ఖననం చేయటానికి తీసుకెళ్ళారు. సమాధి తవ్వగానే అందులో పాములు, తేళ్లు కనిపించాయి. అప్పుడు వారు భయంకొద్ది దూరంనుంచే సమాధిపైన మన్నుపోసి శవపేటిక వెనక్కి తీసుకొని వెళ్ళారు. [రోజ్నామా నవాయె వఖ్త లాహోర్ ఆగస్టు 9, 2000]
5. సమాధి కంపనం
గుజ్రాన్ వాలా శివారు ప్రాంతం ఖ్యాలీలోని శ్మశానంలో ఒక స్త్రీ మృతదేహాన్ని ఖననం చేసిన తర్వాత ఆ సమాధి కంపించిన సంఘటన స్థానికంగా భయాందోళనలు వ్యాపింపజేసింది. వివరాల్లోకి వెళితే ఆ స్త్రీ శవాన్ని ఖననం చేసిన తర్వాత అక్కడవున్న వారికి ఆమె సమాధి కంపించినట్లు అనిపించింది. కొంతమంది సమాధికి చెవులు ఆనించి విన్నారు. వారికి ఠక్….. ఠక్ అనే శబ్దాలు, గద్దింపులు వినపడ్డాయి. అప్పుడు ఓ ప్రఖ్యాత ధర్మవేత్తను సంప్రతించగా ఆయన ఆ మృతదేహాన్ని మరోచోట సమాధి చేయమని సలహా ఇచ్చారు. జనం ఆ ధర్మవేత్త సమక్షంలోనే సమాధి త్రవ్వారు. చెక్కులు తొలగించగానే ఓ విచిత్రమైన, ఘాటైన వాసన వెలువడింది. ఆ వాసన చూసి సమాధి త్రవ్వేవాడు కక్కుకునే పరిస్థితి ఏర్పడింది. దాంతో సమాధిని మళ్లీ పూడ్చిపెట్టారు. ఆ తర్వాత మృతురాలి మన్నింపుకోసం దుఆ చేయటం జరిగింది. దాంతో సమాధి కంపనం మెల్లగా ఆగిపోయింది. [రోజ్నామా నవాయె వఖ్త లాహోర్. 1993 జూన్ 23]
6. …… పాము …..పాము ….!
ఒక జమిందారు వంశంలోని బాగా ధనికులైన తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. ఆమెకు తల్లిదండ్రులనుంచి వారసత్వంగా చాలా ఆస్తి, బంగారు నిల్వలు, లెక్కలేనంత డబ్బు లభించాయి. డబ్బులు దైవమార్గంలో ఖర్చుపెట్టాలంటే ఆమెకు మహా చిరాకు. ఏ స్త్రీ అయినా ఆమెను మస్జిద్, మదర్సా లాంటిది నిర్మించమని గాని లేక అనాధలు, వితంతువులకు సహాయం చేయమనిగాని అడిగితే తన మొహం మాడిపోయేది. నేను ఆమెను చివరిసారి 1968లో లాహోర్ లోని సివిల్ హాస్పిటల్లో అత్యవసర పర్యవేక్షక విభాగం (ఐ.సి.యు)లో మరణశయ్యపై స్పృహ లేకుండా పడివున్న స్థితిలో చూశాను. ఆమె నాడి స్తంభించి ఉంది. ఆగి ఆగి శ్వాస తీసుకుంటోంది. కళ్లు బిగుసుకుపోయాయి. ఆమె చనిపోయినట్లు సర్టిఫికెట్ ఇచ్చివెళదామని డాక్టర్గారు ఆమె దగ్గరే నించొని ఉన్నారు. హఠాత్తుగా ఆమె శరీరం కదలటం ప్రారంభించింది. మొహం మీద భయం తాలూకు ఆనవాళ్లు కనిపించాయి. ఆమె రోమాలు నిక్కబొడుచుకున్నాయి. చర్మం నుంచి చెమట కారసాగింది. పెదాలు కదలసాగాయి.ఆమె వణకుతున్న స్వరంతో “పాము పాము” అంటూ తన్ను తాను కాపాడుకుంటున్నట్లు కాళ్లూచేతులు కదపటం జనమంతా చూశారు. అది చూసి నేను భయపడిపోయాను. “వైద్యశాస్త్రపరంగా మీరు ఈ చివరి కదలికల్ని ఏమని పిలుస్తారు” అని డాక్టర్ గారిని అడిగాను. ఆయన కూడా కంగారు పడిపోతూ. “నా దృష్టిలో వైద్యశాస్త్రంలో ఇంతకు ముందెన్నడూ జరగని అద్భుతం. ఈ కదలికలు, పాము పాము అనే అరుపులు నిశ్చయంగా శవం నోటి నుంచి వెలువడినవే. ఎందుకంటే అంతటి అపస్మారక స్థితిలో ఆమె మాట్లాడటం, కదలటం జరగని పని” అని అన్నారు. [దౌలత్ సే ముహబ్బత్కా అంజామ్. అజ్ ముహమ్మద్ అక్రమ్ రాండూ ‘ఏతిసామ్’ వార పత్రిక. లాహోర్ 1999 సెప్టెంబరు]
పైన పేర్కొనబడిన కొన్ని సంఘటనలు సమాధి శిక్ష (లేక బరఖ్) కు సంబంధించినవి. ఇప్పుడు కొన్ని సమాధి బహుమానాలకు సంబంధించిన సంఘటనలు కూడా చదువుకోండి.
కొన్ని సమాధి బహుమానాలకు సంబంధించిన సంఘటనలు
1. సమాధి నుంచి సువాసన!
డాక్టర్ సయ్యిద్ జాహిద్ అలీ వాసితీ గారి కథనం: “నేను ఒక యూనిట్ కాలంలో లాడ్కానా జిల్లాలోని రతూడేరూలో వైద్యనిర్ణాయక ఆఫీసరుగా పనిచేస్తున్న కాలంలో నా దగ్గరికి ఒక పోలీసునౌకరు కొన్ని డాక్యుమెంట్స్ తెచ్చి సమాధిని పరిశీలించవలసి ఉందని వచ్చాడు. సివిల్ సర్జన్ జిల్లాలోని ఆసుపత్రులన్నిటికి సెక్రటరి. జిల్లా మేజిస్ట్రేటు సమాధి పరిశోధన నిమిత్తం ఒక కమిటీని నియమించింది. అందులో సివిల్ సర్జన్ డా. ముహమ్మద్ షఫీ గారితో పాటు నేనూ ఉన్నాను. ఆ శ్మశానం రతోడే రూకు రెండు మైళ్లదూరంలో ఒక ఊరిలో ఉంది. ఆ ఊరిపేరు గుర్తురావటం లేదు. పోలీస్ డాక్యుమెంట్ల ద్వారా తెలిసిందేమిటంటే, ఆ సమాధిలో ఒక స్త్రీ శవం ఉంది. దాదాపు రెండు నెలల క్రితం ఆమె ఖననం చేయబడింది. ఆమె భర్త ఆమెకు ఎవరితోనో అక్రమ సంబంధాలు ఉన్నాయనే నెపంతో ఆమెను హతమార్చాడు.
నిర్ణీతదినం రాగానే నేను ఆ ఊరి జమీందారుగారి గుడారానికి చేరుకున్నాను. లాడ్కానా జిల్లా సివిల్సర్జన్ కూడా వచ్చారు. జమీందారుగారు టి తాగి వెళ్ళమని ఒత్తిడి చేయసాగారు. అంతలో మేజిస్ట్రేటు గారు కూడా వచ్చేశారు. పోలీసులు శ్మశానానికి వెళ్ళారు. టి వచ్చిన తర్వాత చూస్తే అది టీ కాదు పూర్తిగా భోజనమేనని తెలిసివచ్చింది. ఆ సమయంలో విచిత్రమైన విషయాలు వెలుగులోకివచ్చాయి. అవేమిటంటే- ఆ స్త్రీ చాలా మంచి ఆవిడట. ఆమె వయసు మహా అంటే ఇరవై ఏడుఏళ్లు ఉండొచ్చు. నమాజులు, ఉపవాసాలు తప్పకుండా పాటించేది. పెళ్ళి అయి ఐదు సంవత్సరాలైనా సంతానం కలగలేదు. భర్తకువేరే స్త్రీతో సంబంధాలు ఏర్పడ్డాయి. అతను తన భార్యను వదిలించుకోవాలని ప్రయత్నించసాగాడు. నీకు ఫలానా మనిషితో అక్రమ సంబంధం ఉందంటూ ఆమెను రోజూ కొట్టేవాడు. చూడబోతే అతను ఆమెకు ఎవరితోనయితే సంబంధం ఉందని నిందమోపుతున్నాడో అతను ఆవిడ తండ్రికంటే పెద్దవయసున్నవాడు. ఒకరోజు ఉదయం ఆ దురదృష్టవంతురాలు పడకమీద చచ్చిపడి కనిపించింది. ప్రజలు తలా ఓ మాట అన్నారు. ఏది ఏమైనా ఆ పరిస్థితులను గమనిస్తే ఆ స్త్రీ ఏ పాపం ఎరుగదని తెలుస్తుంది.
సమాధి పరిశోధన ఆషామాషీ పని కాదు. మా డాక్టర్లకు అది అలవాటైపోయింది. కాని సమాధిలోని వేడి తీవ్రత, దానికి తోడు శవం స్థితి పెద్ద పెద్ద ధైర్యవంతుల్ని కూడా భయకంపితుల్ని చేస్తుంది. నేను దాదాపు వంద సమాధులు పరిశోధించాను. మేజిస్ట్రేటుగాని, పోలీసులు గాని దగ్గరకు రావటానికి సాహసం చేయలేదు. వారు డ్యూటీ మీదనే ఉంటారు. కాని దూరంగా కూర్చొని చూస్తూ ఉంటారు. మునుపటిలాగా ఆ రోజు కూడా సమాధి త్రవ్వేవాడు ఆ స్త్రీ సమాధిని త్రవ్వి మన్ను తొలగించసాగాడు మేము తలవైపునించొని రాబోయే క్షణాలను ఎదుర్కోవటానికి మానసికంగా సన్నద్ధులయ్యాం. అప్పుడు సమాధిలో నుంచి ఒక్కసారిగా అత్తరులాంటి పరిమళం గుభాళించింది. మేము సంపెంగతోటలో ఉన్నామా అనిపించింది మాకు. నేను ఖననం చేసినప్పుడు ఎవరైనా సంపెంగపూలు ఉంచారేమోనని సమాధిలోకి తొంగిచూశాను. అది నా అవివేకం గాని శవం నుంచి వచ్చే దుర్గంధం కన్నా సంపెంగ పూల సుగంధం ఎక్కువ వస్తుందా? తర్వాత సివిల్ సర్జన్ తనకూ అలాంటి ఆలోచనే వచ్చిందని చెప్పారు. శవాన్ని బయటికి తీస్తున్నప్పుడు దాని పరిమళ దొంతరలతో మా మనోమస్తిష్కాలు సుగంధభరితమయ్యాయి. కాసేపట్లో ఆ సుగంధం దూరం వరకు వ్యాపించింది. పోలీసు కార్యాలయ అధికారి, మేజిస్ట్రేటు కూడా లేచి దగ్గరికి వచ్చారు. అక్కడ పోలీసులే గనక లేకుంటే చాలామంది జనం గుమిగూడేవారు. డాక్టర్ షఫీగారు “సువాసన చూడండి. మనం స్వర్గవనంలో నించొని ఉన్నట్లుంది” అని అన్నారు. సుబహానల్లాహ్, సుబహానల్లాహ్ అనే పలుకులతో ఆయన నాలుక అలసిపోసాగింది. శవం అత్యంత శుభ్రంగా తాజాగా ఉంది. ముఖం మరింత ప్రకాశవంతంగా ఉంది. హతురాలు హాయిగా నిద్రపోతున్నట్టు కనిపిస్తోంది. పోలీసువారు “అల్లాహ్ మహిమ! ఈ తల్లి మీద అబద్ధపునింద మోపబడిందని రుజువయింది” అన్నారు. నేను వెనక్కి జరగగానే సివిల్ సర్జన్ కూడా వెనక్కి జరిగారు. ఆ శవాన్ని పోస్ట్ మార్టన్ చేయటానికి మా మనసు ఒప్పటం లేదు.
అంతలోనే ఆమెను హత్యచేసి పారిపోయిన ఆమె భర్త పెద్దగా రోదిస్తూ ఎక్కడినుంచో వచ్చి పోలీసువారితో “నన్ను బంధించండి. నా భార్య ఏ పాపం ఎరుగదు. ఆమె మీద అబద్ధపు నిందమోపాను ” అన్నాడు. పోలీసు మరియు మేజిస్ట్రేటు అక్కడే ఉన్నారు. వారు అతని మాటలు నమోదు చేసుకున్నారు. విధంగా అతను తన నేరం ఒప్పుకొని ఆమెను పోస్టుమార్టం చేయకుండా ఆపాడు. [మెడికల్ ఆఫీసర్ కీ పుర్ అస్ఆర్ డైరీ. అజ్. డా. సయ్యిద్ జాహిద్ అలీ వాసితీ ఉర్దూ డైజెస్ట్ లాహోర్ 1996 నవంబరు]
2. శవం నుంచి సువాసన
మా తాత కీ.శే. నూరె ఇలాహి (రహిమహుల్లాహ్) గారి తమ్ముడు హాఫిజ్ అబ్దుల్ హై (రహిమహుల్లాహ్ ) ఖుర్ఆన్ సంస్మర్త. గొప్ప సదాచార సంపన్నులు. దైవభక్తిపరులు. చాలామంచి మనిషి. దాదాపు తొంభై యేళ్లు జీవించారు. జీవితాంతం దైవగ్రంథం, దైవప్రవక్త విధాన ప్రచార కార్యాలలోనే గడిపారు. హలాల్ సొమ్ము అనుభవించే విషయంలో ఎంత జాగ్రత్త వహించేవారంటే- ఒకసారి ఆయన లాహోర్నుంచి తన సొంతూరు ముండివార్ ఒర్టన్(షైఖూపూర్ జిల్లా) వస్తున్నారు. జేబులో డబ్బుల్లేవు. రైల్లో కూర్చుని మండివార్ బర్టన్ చేరుకున్నారు. స్టేషన్లోనే ఒకాయన దగ్గర అప్పు పుచ్చుకొని మండివార్ బర్టన్ నుంచి లాహోర్ టిక్కెటుకొని చించేశారు. ప్రభుత్వ ఖజానాకు చెల్లించవలసిన సొమ్ము చెల్లించేందుకు ఆయన అలా చేశారు. ఖుర్ఆన్ పారాయణం అంటే ఎనలేని ప్రీతి. ఎక్కడికయినా వెళ్ళవలసి ఉంటే నడిచివెళ్తే ఖుర్ఆన్ పారాయణానికి ఎక్కువ అవకాశం ఉంటుందని వాహనానికన్నా నడిచి వెళ్ళటానికి ప్రాముఖ్యతనిచ్చేవారు.
అల్లాహ్ మీద ఎంత అభిమానమంటే, ఆయనకు గుండెపోటు ఉంది. ఒకసారి ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. ఇంట్లోని వారంతా ఏడ్వటం మొదలుపెట్టారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఆయన “మీరు ఎందుకని ఏడ్చారు?” అని అడిగారు. “ఇది మీ ఆఖరి సమయమేమో. ఇక మీరు కోలుకోలేరేమోనన్న భయంతో ఏడ్చాం” అని చెప్పారు పిల్లలు. అందుకాయన “ఇందులో ఏడ్వాల్సిన విషయం ఏముంది. నేను వెళ్తుంది నా మిత్రుని దగ్గరికేగాని ఏ శత్రువు దగ్గరకో కాదు కదా!” అని అన్నారు.
ఆయనగారి కుమారులు షేఖుల్హదీస్ అల్లామా అబ్దుస్సలామ్ కైలానీ (ఫాజిల్ జామియా ఇస్లామియా. మదీనా) ఇలా చెప్పారు,ఆయన్ని ఖననం చేసినప్పుడు ఎంతటి ఘాటైన సువాసనవెలువడిందంటే ఆయన సమాధి దగ్గర ఉన్నవారందరి మనోమస్తిష్కాలూ సుగంధభరితమయ్యాయి. కొందరు సమాధిలో ఎవరైనా సుగంధం వేశారేమో అనుకున్నారు. కాని నిజానికి అలాంటిదేమీ లేదు.
3. సమాధిలో వెలుగు
(గుజ్రాన్వాలా జిల్లా) సోహుద్రా ఊరికి చెందిన ప్రఖ్యాత ధర్మ పండితుడు మౌలానా హాఫిజ్ ముహమ్మద్ యూసూఫ్ (రహిమహుల్లాహ్) కథనం: ఒకరోజు రాత్రి నేను నిద్రపోతుంటే ఒంటిగంటప్పుడు కొందరు మనుషులు వచ్చి తలుపుకొట్టారు. నేను తలుపుతెరిచాను. వారు తమ బంధువు ఒకాయన చనిపోయాడనీ, వ్యాధిమూలంగా శవాన్ని ఎక్కువసేపు ఉంచలేము కనుక తాము అప్పుడే దాన్ని సమాధి చేయాలనుకుంటున్నామనీ, అందుకు తమరు జనాజా నమాజ్ చేయించాలని నన్ను కోరారు. నేను జనాజా నమాజ్ చేయించాను. సమాధి తవ్వుతుండగా హఠాత్తుగా, పక్కనున్న సమాధికి రంధ్రం పడి అందులోనుంచి సూర్యుడు ఆకాశానికెక్కినంత ఎక్కువగా వెలుతురు రాసాగింది. వెంటనే నేను “అల్లాహ్ యొక్క ఏ మంచి దాసుడో విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సమాధి గోడ బాగుచేయండి” అని సలహా ఇచ్చాను. ఆ సమాధి గోడ బాగు చేయటం జరిగింది. తర్వాత దాని ప్రక్కనున్న సమాధిలో రెండో శవాన్ని పూడ్చిపెట్టాం.
4. శవం నుంచి సువాసన
ఈ సంఘటనను ఉల్లేఖించినది మా నాన్న హాఫిజ్ ముహమ్మద్ ఇద్రీస్ కైలానీ (రహిమహుల్లాహ్ ). ఆయన ఇలా చెప్పారు: దేశవిభజనకు ముందు ఢిల్లీలో గురువర్యులు షేఖుల్ హదీస్ సయ్యిద్ మియా ముహమ్మద్ నజీర్ హుసైన్ ముహద్దిస్ దహల్వీ (రహిమహుల్లాహ్) గారి పాఠశాలకు చెందిన ఒక విద్యార్థి చనిపోయినప్పుడు అతని శవం నుంచి మైమరిపించే సువాసన గుభాళించి అక్కడి పరిసరాలన్నిటిని సుగంధభరితం చేసింది. అప్పుడు జనం మియా ముహమ్మద్ గారిని “మీ విద్యార్థికి అల్లాహ్ ఇంతటి గౌరవాన్ని ప్రసాదించటానికి కారణమైన ఆచరణ ఏదయినా మీకు తెలుసా?” అని అడిగారు. అందుకాయన ఈ క్రింది సంఘటన వివరించారు:
“ఇతర విద్యార్థుల్లాగే ఈ విద్యార్థి భోజనవసతి కూడా ఒక ఇంట్లో ఉండేది. (ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. కొంతకాలం క్రితం ఈ రోజుల్లోలాగా విద్యార్థులకు భోజనవసతి మదర్సాలలో ఉండేది కాదు. నగరంలోని స్థితిమంతులు ఒకరిద్దరి భోజన వసతిని తమ బాధ్యతగా తీసుకునేవారు. వారిని ఇంటికి తీసుకెళ్ళి అన్నం తినిపించేవారు). ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉండేది. ఆమె ఈ విద్యార్థిని ప్రేమించింది. ఒకరోజు ఆ ఇంటివారు ఎవరో బంధువుల అంత్యక్రియలకు వెళ్ళారు. ఇంట్లో ఆ అమ్మాయి ఒక్కతే ఉంది. రోజులాగే ఆ అబ్బాయి అన్నానికి వాళ్ళింటికి వెళ్ళాడు. వెంటనే ఆమె తలుపులు మూసేసి పాడుపనికి పిలిచింది. ఆ అబ్బాయి ఆ నిరాకరించాడు. దాంతో ఆమె “నువ్వు గనక నా మాట వినకపోతే నీ గురించి అందరికి చెడ్డగా చెబుతాను” అని బెదిరించింది. విద్యార్థి కాలకృత్యాలు తీర్చుకోవలసి ఉందని అడిగాడు. అమ్మాయి ఇంటికప్పు పైకి వెళ్ళేందుకు అనుమతినిచ్చింది. అతను మరుగుదొడ్డిలోకి వెళ్ళి ఒళ్ళంతా మలినం పూసుకొని వచ్చాడు. అది చూసి ఆమె అసహ్యంతో అతన్ని బయటికి గెంటేసింది. అది చలికాలం. విద్యార్థి మస్జిద్ కు వెళ్ళి స్నానం చేసి బట్టలు ఉతుక్కున్నాడు. బయటికి వచ్చి భయంకరమైన చలికి వణకిపోతున్నాడు. అప్పుడు నేను తహజ్జుద్ నమాజ్ కోసం మస్జిద్కు వెళ్ళాను. విద్యార్థిని ఆ స్థితిలో చూసి ఆశ్చర్యపోయి విషయం ఏమిటని అడిగాను. అతను కాసేపు తటపటాయించి జరిగినదంతా నాతో చెప్పాడు. అప్పుడు నేను అల్లాహ్ తో, దుఆ చేశాను, “ఓ అల్లాహ్! ఖుర్ఆన్ హదీసుల ఈ విద్యార్థి నీ భయంతో నీ భక్తితో ఒంటికి మలినం పూసుకొని తన్నుతాను పాపం నుంచి రక్షించుకున్నాడు. నువ్వు నీ కరుణాకటాక్షాలతో ఇహలోకంలోనూ, పరలోకంలోనూ ఇతని గౌరవాన్ని ఇనుమడింపజెయ్యి. ఇంకా ఇతనికి గొప్ప స్థానాన్ని ప్రసాదించు”. బహుశా ఈ విద్యార్థి చేసిన ఆ పనికే అల్లాహ్ ఇతనికి ఇంతటి గౌరవాన్ని ప్రసాదించి ఉండవచ్చు.
[మా నాన్నగారు హాఫిజ్ ముహమ్మద్ ఇద్రీస్ కైలానీ గారు మా ఊరు కీల్యాన్వాలా (గుజ్రాన్వాలా జిల్లా) లోని జామియా మస్జిద్లో జుమా ఖుత్బా (ప్రసంగం) ఇచ్చేవారు. ఆయన రెండు మూడు ప్రసంగాల్లో ఈ సంఘటన చెప్పటం నేను విన్నాను. ఈ సంఘటన రాసిన కొద్దికాలనికే (హి.శ. 1422 ముహర్రమ్ 25వ తేదీనాటి 26 ఏప్రిల్ 2001) ‘ఏతిసామ్ అనే వారపత్రిక లోని 14వ పుటలో “పరస్త్రీతో ఏకాంతం వల్ల ప్రమాదాలు” అనే శీర్షికలో గౌరవనీయులు డాక్టర్ అబ్దుల్గాపూర్ రాషిదారు కూడా ఈ సంఘటన చాలా విపులంగా ప్రస్తావించారు. అది చదివిన తర్వాత అల్ హమ్దులిల్లాహ్-మరింత ఆత్మసంతృప్తి కలిగింది. (రచయిత)]
పైన పేర్కొనబడిన సంఘటనలు సమాధి శిక్షా బహుమానాలకు స్పష్టమైన నిదర్శనాలు మాత్రమే కాదు, మనకు గుణపాఠాలు కూడా. మరయితే గుణపాఠం నేర్చుకునేవాడు ఎవడయినా ఉన్నాడా?
మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఉండటం అభిలషణీయం
1వ అంశం: మరణాన్ని వీలైనంత ఎక్కువగా గుర్తుచేసుకుంటూ ఉండాలి.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: “రుచులను మరిపించేది…. అనగా చావుని అత్యధికంగా గుర్తు చేసుకుంటూ ఉండండి”. (ఇబ్నెమాజా – సహీహ్) [1) కితాబుజ్జుహద్, బాబు జిక్రిల్ మౌతి వల్ ఇస్తీదాదిలహూ (2/3434)]
2వ అంశం: మరణాన్ని అత్యధికంగా గుర్తుచేసుకునేవారే తెలివిగలవారు.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం: నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఉన్నప్పుడు ఒక అన్సారీ వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి సలాం చేశాడు. తర్వాత “దైవప్రవక్తా! విశ్వాసుల్లో అందరికంటే గొప్పవారు ఎవరు?” అని అడిగాడు. అందుకు సమాధానంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఉత్తమ నడవడికగలవారు” అని చెప్పారు. అతను “విశ్వాసుల్లో అందరికంటే తెలివిగలవారు ఎవరు?” అని అడిగాడు. అందుకాయన “మరణాన్ని అత్యధికంగా గుర్తు చేసుకునేవారు. మరణానంతర సమయం కోసం బాగా సన్నాహాలు చేసుకునేవారు అందరికంటే తెలివిగలవారు” అని చెప్పారు. (ఇబ్నెమాజా- హసన్) [కితాబుజ్జుహద్, బాబు జిక్రిల్ మౌతి వల్ ఇస్తీదాలహూ (2/3435)]
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం: అప్పుడు నేను దైవప్రవక్త సమావేశానికి హాజరైన పదోవ్యక్తిని. ఆ సమయంలో అన్సార్లలో ఒకతను లేచి “దైవప్రవక్తా! ప్రజల్లో అందరికంటే బుద్ధిమంతుడు, తెలివైన వాడు ఎవడు?” అని అడిగాడు. అందుకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “మరణాన్ని అందరికంటే ఎక్కువగా గుర్తుచేసుకునేవారు. దానికోసం అందరికంటే ఎక్కువగా సన్నాహాలు చేసుకునేవారు అందరికంటే గొప్ప తెలివైనవారు, ఇహపరాల్లో గౌరవాదరణలు పొందేవారు వీరే’ అని చెప్పారు. (తబ్రానీ – హసన్) [ముహ్ యుద్దీన్ దీబ్ అత్ తర్గీబ్ వత్ తర్హీబ్ గ్రంథం వాల్గో సంపుటి 4886వ హదీసు]
3వ అంశం: మరణాన్ని గుర్తుచేసుకోవటం కూడా ఒక ఆరాధన.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు ఒకతని ఆరాధన గురించి, ఆరాధనలో అతని పోరాటపటిమ గురించిన ప్రస్తావన వచ్చింది. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “మీరు చెబుతున్న ఆ వ్యక్తి మరణాన్ని ఎంతగా గుర్తు చేసుకుంటాడు” అని అడిగారు. అందుకు అనుచరులు “అతను మరణాన్ని గుర్తుచేయటం మేము ఎన్నడూ వినలేదు” అని చెప్పారు. ఆ మాటకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “మరయితే ఆ వ్యక్తి మీరు ‘చెబుతున్న ఆరాధన స్థాయికి ఇంకా చేరుకోలేదు” అని అన్నారు. (బజ్జార్ – హసన్) [ముహ్ యుద్దీన్ దీబ్ అత్ తర్గీబ్ వత్ తర్హీబ్ గ్రంథం నాల్గో సంపుటి 4888వ హదీసు]
హజ్రత్ సహ్ బిన్ సాద్ అన్సారీ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త అనుచరుల్లో ఒకతను చనిపోయాడు. అప్పుడు ఆయన అనుచరులు అతని కృషి గురించి మాట్లాడుకుంటూ అతణ్ణి ప్రశంసించారు. అతను (ఎక్కువగా) ఆరాధనలు చేసేవాడని (గొప్పగా) చెప్పుకున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏమీ అనకుండా వాళ్లమాటలు వింటూ ఉన్నారు. వాళ్లు మాట్లాడటం ఆపేసిన తర్వాత “అతను మరణాన్ని కూడా అత్యధికంగా గుర్తు చేసుకునేవాడా!” అని అడిగారు. అనుచరులు “లేదు” అని చెప్పారు. తర్వాత దైవప్రవక్త “అతను మనసు ఆకర్షించే వస్తువుల్ని త్యజించాడా?” అని అడిగారు. అనుచరులు “లేదు” అని చెప్పారు. అప్పుడు ఆయన “మీరు అతన్ని కూర్చోబెడుతున్న స్థాయికి అతను చేరుకోలేదు” అని అన్నారు. (తబ్రానీ – హసన్) [ముహ్ యుద్దీన్ దీబ్ అత్ తర్గీబ్ వత్ తర్హీబ్ గ్రంథం నాల్గోసంపుటి 4887వ హదీసు]
4వ అంశం: మరణాన్ని, సమాధిని గుర్తుచేసుకునేవాడే నిజమైన రీతిలో అల్లాహ్ పట్ల వ్రీడ పాటించే హక్కుని నెరవేరుస్తున్నాడు.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మసూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అల్లాహ్ పట్ల ఏవిధంగా వ్రీడ పాటించాలో ఆ విధంగా వ్రీడ పాటించండి” అని ప్రబోధించారు. అందుకు మేము “దైవప్రవక్తా! అల్హమ్దు లిల్లాహ్ మేము అల్లాహ్ పట్ల వ్రీడా భావంతోనే ఉంటున్నాం కదా!” అని సందేహం వ్యక్తం చేశాం. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వివరించారు: “అలా కాదు, ఏ విధంగా క్రీడ పాటించాలో ఆ విధంగా క్రీడ పాటించాలి. ఆ విధానం ఏమిటంటే మీరు తలను, తలలో ఉన్నవాటిని (అంటే కళ్ళు, చెవులు, నాలుక మొదలగు వాటిని కాపాడుకోవాలి. కడుపుని (అందులోకి నిషిద్ధ వస్తువు ఏదీ వెళ్ళకుండా) కాపాడుకోవాలి. ఇంకా కడుపుకి తగిలి ఉన్నవాటిని కూడా కాపాడుకోవాలి (అంటే మర్మాంగాలు, కాళ్లు, చేతులు మొదలగునవి). ఇంకా (సమాధిలో) ఎముకలు కుళ్లి, కృశించి పోవటాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. పరలోక జీవితాన్ని కోరుకునే వ్యక్తి ఇహలోకపు అందచందాలను వదలుకోవాలి. ఈ పనులన్నీ చేసినవ్యక్తి అల్లాహ్ పట్ల నిజంగా ఏవిధంగా వ్రీడ పాటించాలో ఆ విధంగా వ్రీడ పాటించిన వాడవుతాడు. (తిర్మిజీ-సహీహ్) అబ్వాబు సిఫతిల్ ఖియామహ్ 14వ అధ్యాయం (2/2000)
చావు రావాలని కోరుకోరాదు
5వ అంశం: చావు రావాలని కోరుకోరాదు
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “చావు త్వరగా రాకుంటే అల్లాహ్ ను క్షమాపణలు కోరుకునే అవకాశం ఉంటుంది. కనుక మీలో ఎవరూ కూడా త్వరగా చావు రావాలని కోరుకోరాదు”. (బుఖారీ) (జుబైదీ గారి సహీహ్ బుఖారీ (సంక్షిప్తం) 1960వ హదీసు)
6వ అంశం: భరించరాని ఇబ్బందిలో ఉన్నప్పుడు చావు గురించి క్రింది విధంగా ప్రార్థించాలి.
హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: మీలో ఎవరైనా బాధ లేక కష్టంలో ఉన్నప్పుడు చావుని కోరుకోరాదు. ఒకవేళ గత్యంతరం లేదనుకుంటే ఇలా వేడుకోవాలి.
“అల్లాహుమ్మ అహ్యినీ మా కానతిల్ హయాతు ఖైరన్ వ తవఫ్ఫ నీ ఇజా కానతిల్ వఫాతు ఖైరన్ లీ”
(ఓ అల్లాహ్ ! జీవితం నాకు ప్రయోజనకరంగా ఉన్నంతవరకూ నన్ను బ్రతికించి ఉంచు. ఒకవేళ మరణమే నాకు ప్రయోజనకరమైతే మరణాన్ని ఇవ్వు”. (బుఖారీ) (జుబైదీ గారి సహీహ్ బుఖారీ (సంక్షిప్తం) 1958వ హదీసు.
7వ అంశం: అమరగతి (షహాదత్) నొందటం కోసం ప్రార్థించుకోవచ్చు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అంటుండగా తాను విన్నానని అబూహురైరా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు:
“ఎవరి చేతిలోనయితే నా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నాను. అల్లాహ్ మార్గంలో చంపబడి తిరిగి బతకాలనీ, మళ్లీ చంపబడి మళ్లీ బతకాలనీ, మళ్లీ చంపబడి మళ్లీ బతకాలనీ, మళ్లీ చంపబడాలని నాకు కోరికగా ఉంది”. (బుఖారీ) (కితాబుల్ జిహాద్ బాబు తమన్నిష్షహాదహ్)
8వ అంశం: మరణాన్ని తమపాలిట శుభదాయకం చేసుకోవటానికి ఈ క్రింది దుఆ చేయాలి
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రార్థించేవారు:
అల్లాహుమ్మ అస్లిహ్లీ దీనియల్లజీ హువ ఇస్మతు అమ్రీ వ అస్లిహ్లీ దున్యా యల్లతీ ఫీహా మఆషీ వ అస్లిహ్లీ ఆఖిరతియల్లతీ ఫీహా మఆదీ వజ్ అలిల్ హయాత జియాదతన్ లీ ఫీకుల్లి ఖైరిన్ వజ్రలిల్ మౌత రాహతన్ లీ మిన్ కుల్లి షర్రిన్.
ఓ అల్లాహ్! నా ధర్మాన్ని సంస్కరించు. నా సత్పరిణామాన్ని రక్షించేది అదే. నా ప్రపంచ జీవితాన్ని చక్కబెట్టు. ఎందుకంటే అందులో నా జీవనోపాధి ఉంది. నా పరలోక జీవితాన్ని చక్కదిద్దు. ఎందుకంటే మరణించిన తర్వాత నేను తిరిగి అక్కడికే వెళ్ళవలసి ఉంది. నా జీవితాన్ని నా పాలిట మరింత ప్రయోజనకారిగా తీర్చిదిద్దు. అన్నిరకాల చెడుల నుండి నన్ను నేను కాపాడుకోవటానికి వీలుగా మరణాన్ని నాకొరకు సుఖవంతం చెయ్యి. (ముస్లిం) (అల్బానీగారి సహీహ్ ముస్లిం (సంక్షిప్తం) 1869వ హదీసు)
మరణ వేదన
9వ అంశం: మరణ సమయంలో బాధ కలగటం, కష్టమనిపించటం నిజమే
“మరణబాధ నిజం తీసుకొని వచ్చింది”. (ఖాఫ్ సూరా, 19వ సూక్తి) (19:50)
10వ అంశం : మరణబాధ చాలా తీవ్రంగా ఉంటుంది.
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు.
“మరణం రావాలని కోరుకోకండి. మరణ సమయంలో కలిగే బాధ చాలా తీవ్రంగా ఉంటుంది. అల్లాహ్ ఏ దాసునికయినా దీర్ఘాయుషునిచ్చి అతనికి తౌబా చేసుకునే అవకాశాన్ని ప్రసాదించాడంటే అతను దాన్ని తన అదృష్టానికి సూచనగా భావించాలి.” (అహ్మద్-హసన్) [ముహ్ యుద్దీన్ దీబ్ అత్ తర్గీబ్ వత్ తర్హీబ్ నాల్గో సంపుటి 4931వ హదీసు]
11వ అంశం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు కలిగినంత మరణబాధ ప్రళయం వరకూ ఇంకెవరికీ కలగదు.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు మరణబాధ మొదలయినప్పుడు ఫాతిమా (రదియల్లాహు అన్హా) (అది చూసి భరించలేక) “అయ్యో! నా తండ్రి ఎంత బాధపడుతున్నారు” అని అన్నారు. అందుకు ఆయన (ఆమెను ఓదారుస్తూ) “ఈ రోజు
తర్వాత నీ తండ్రికి ఇంకెప్పుడూ ఇలాంటి బాధలుండవు. ఇప్పుడు నీ తండ్రికి కలుగుతున్న బాధ ప్రళయం వరకు ఇంకెవరికీ కలగదు” అని చెప్పారు. (ఇబ్నెమాజా-సహీహ్) [అబ్వాబుల్ జనాయెజ్ బాబు జిక్రి వఫాతిహీ వ దఫనిహీ (సల్లల్లాహు అలైహి వసల్లం) (1/1320)]
12వ అంశం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు కలిగిన మరణబాధ గురించి ఆయిషా (రదియల్లాహు అన్హా) గారి వ్యాఖ్యానం
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా అంటున్నారు: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా రొమ్ము మరియు చుబుకం మధ్యలో ఉన్నప్పుడు మరణించారు. ఆయన మరణ బాధ చూసిన తర్వాత ఇంకెవరికి మరణబాధ కలిగినా నేను దాన్ని చెడుగా భావించటం లేదు. [కితాబుల్ మగాజీ, బాబు మరిన్నబియ్యి వవఫాతిహీ (బుఖారీ)]
మరణసమయంలో విశ్వాసికి లభించే సత్కారాలు
13వ అంశం: మరణ సమయంలో విశ్వాసిని ఈ క్రింద పేర్కొనబడిన పది రకాల సత్కారాలతో లేక వాటిలో కొన్నిటితో గౌరవించటం జరుగుతుంది.
1) దైవదూతలు ప్రాణం తీసేముందు అతనికి ‘అస్సలాము అలైకుమ్’ అని సలాం చేస్తారు.
2) విశ్వాసి ప్రాణం తీయడానికి వచ్చే దూతల మొహాలు సూర్యునిలా తేజోవంతంగా ఉంటాయి.
3) కారుణ్య దూతలు తమవెంట స్వర్గం నుంచి విశ్వాసి ఆత్మను చుట్టుకొని తీసుకెళ్ళటం కోసం తెల్లని వస్త్రం (కఫన్) తీసుకువస్తారు.
4) ఆత్మను సుగంధభరితం చేయటం కోసం దూతలు తమవెంట స్వర్గం నుంచి పరిమళం కూడా తీసుకొని వస్తారు.
5) విశ్వాసి ప్రాణం తీసేటప్పుడు దూతలు అతనికి అల్లాహ్ యొక్క మన్నింపు, ఆయన ప్రసన్నతలు లభిస్తాయని శుభవార్తను అందజేస్తారు.
6) విశ్వాసి ఆత్మ దేహాన్ని వీడి బయటికి వచ్చినప్పుడు భూమి మీద ఉండే అత్యంత మంచి కస్తూరి లాంటి సువాసన గుభాళిస్తుంది.
7) విశ్వాసి ఆత్మకోసం భూమ్యాకాశాల మధ్య ఉండే దైవదూతలందరూ కారుణ్య ప్రార్థనలు చేస్తారు.
8) విశ్వాసి ఆత్మను పైకి తీసుకెళ్ళే దూతలు అకాశ ద్వారం వద్ద అతని గురించి పరిచయం చేయగానే అక్కడి భద్రతాదూతలు స్వాగతాలు పలుకుతూ ఆకాశద్వారం తెరుస్తారు.
9) ప్రతి ఆకాశంలోనూ దైవదూతలు విశ్వాసి ఆత్మకు వీడ్కోలు పలకటం కోసం మరో ఆకాశం వరకూ వస్తారు.
10) ఏడో ఆకాశానికి చేరుకున్న తర్వాత అల్లాహ్ ఆజ్ఞమేరకు ఆ ఆత్మ పేరు ఇల్లియ్యీన్ ల జాబితాలో నమోదు చేయబడుతుంది. ఆ తర్వాత ఆత్మను తిరిగి సమాధిలోకి పంపించటం జరుగుతుంది.
14వ అంశం: ప్రాణం తీసేముందు దూతలు విశ్వాసికి అల్లాహ్ యొక్క సలాం చేరవేస్తారు.
వారు పరిశుద్ధావస్థలో ఉన్నప్పుడు దైవదూతలు వారి ప్రాణాలు తీస్తూ “మీకు శాంతి కలుగుగాక!” అని అంటారు. (44:33)
వారు ఆయనను కలిసే రోజున వారికి శాంతి వచనాలతో స్వాగతం లభిస్తుంది.
15వ అంశం:విశ్వాసి ప్రాణం తీసేముందు దూతలు అతనికి అల్లాహ్ యొక్క మన్నింపు, ఆయన ప్రసన్నతలు లభిస్తాయని శుభవార్తను అందజేస్తారు. దాంతో విశ్వాసికి త్వరగా అల్లాహ్ ను కలవాలని విపరీతమైన కోరిక పుడుతుంది.
హజ్రత్ ఉబాద్ బిన్ సామిత్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ఎవరయితే అల్లాహ్ ను కలవాలని కోరుకుంటారో అల్లాహ్ కూడా వారిని కలవాలని కోరుకుంటాడు. మరెవరయితే అల్లాహ్ ను కలుసుకోవటాన్ని అసహ్యించుకుంటారో అల్లాహ్ కూడా వారిని కలవటాన్ని అసహ్యించుకుంటాడు.”
ఆ మాటకు ఆయిషానో లేక దైవప్రవక్త గారి మరో సతీమణి “చావునయితే మేము కూడా కోరుకోము కదా!” అని సందేహం వ్యక్తం చేశారు. అందుకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వివరించారు: అల్లాహ్ ను కలుసుకోవటమంటే చావు కాదు. అసలు విషయం ఏమిటంటే విశ్వాసికి మరణం వచ్చినప్పుడు అతనికి దైవప్రసన్నత మరియు దైవ సత్కారాల శుభవార్త వినిపించ బడుతుంది. ఆ సమయంలో విశ్వాసికి మున్ముందు లభించబోయే అనుగ్రహాల కంటే ప్రియమైన వస్తువు మరేదీ ఉండదు. అతను (వీలైనంత తొందరగా) అల్లాహ్ ను కలుసుకోవాలనుకుంటాడు. అల్లాహ్ కూడా అతన్ని కలుసుకోవాలనుకుంటాడు. అదే అవిశ్వాసి అయితే మరణ సమయంలో అతనికి దైవ శిక్ష మరియు ఆయన ‘శుభవార్త’ వినిపించబడుతుంది. దాంతో ఆ సమయంలో అతనికి మున్ముందు ఎదురవబోయే పరిస్థితుల కంటే అసహ్యకరమైనది మరేదీ ఉండదు. కనుక అతను అల్లాహ్ ను కలుసుకోవటాన్ని అయిష్టపడతాడు. అల్లాహ్ కూడా అతన్ని కలవటానికి అయిష్టపడతాడు. (బుఖారీ) [కితాబుర్రిఖాఖ్ బాబు మన్ అహబ్బ లిఖా అల్లాహి అహబ్బల్లాహు లిఖాఅహూ]
16వ అంశం: విశ్వాసి ప్రాణం తీయడానికి సూర్యునిలాంటి తేజోవంతమైన మొహాలుగల దైవదూతలు వస్తారు.
17వ అంశం: విశ్వాసి ప్రాణం తీసే దూతలు తమవెంట స్వర్గం నుంచి కఫన్ మరియు అత్తరు తీసుకొని వస్తారు.
18వ అంశం: ప్రాణం తీసేముందు దూతలు విశ్వాసి ఆత్మతో ” పవిత్రాత్మా! అల్లాహ్ మన్నింపు, ఆయన ప్రసన్నత వైపు పద” అని అంటారు.
19వ అంశం: నీళ్లతిత్తి నుంచి నీరు తొందరగా బయటికి వచ్చినట్లు విశ్వాసి దేహం నుంచి ఆత్మ తొందరగా బయటికి వస్తుంది.
20వ అంశం: విశ్వాసి ఆత్మనుంచి భూమి మీద ఉండే అత్యంత మంచి కస్తూరి సువాసన వస్తూ ఉంటుంది.
21వ అంశం: విశ్వాసి ఆత్మను పైకి తీసుకువెళ్ళే దూతలు ప్రతి ఆకాశద్వారం వద్ద అతని గురించి పరిచయం చేయగానే అక్కడి భద్రతాదూతలు స్వాగతాలు చెబుతూ ఆకాశద్వారాలు తెరుస్తారు.
22వ అంశం: ప్రతి ఆకాశంలోని దూతలు విశ్వాసి ఆత్మకు వీడ్కోలు పలకటం కోసం మరో ఆకాశం వరకు వెంట వస్తారు.
23వ అంశం: ఏడో ఆకాశానికి చేరుకున్న తర్వాత అల్లాహ్ ఆజ్ఞమేరకు ఆ ఆత్మ పేరు ఇల్లియ్యీన్ల జాబితాలో నమోదు చేయబడుతుంది. ఆ తర్వాత ఆత్మను తిరిగి సమాధిలోకి పంపించటం జరుగుతుంది.
హజ్రత్ బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) కథనం: మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఒక అన్సారీ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్నాం. సమాధి దగ్గరికి వెళ్ళినప్పటికి సమాధి త్రవ్వడం ఇంకా పూర్తి కాలేదని తెలిసింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూర్చున్నారు. మేము కూడా అక్కడే ఆయన చుట్టూ మా తలల మీద పక్షులు కూర్చొని ఉన్నాయా అన్నంత (నిశ్శబ్దంగా) కూర్చున్నాం. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేతిలో ఒక బెత్తం ఉంది. దాంతో ఆయన నేలమీద గీకుతూ (ఏదో ఆలోచించుకుంటూ) కూర్చున్నారు. కాసేపటికి తలపైకెత్తి “సమాధి శిక్షనుంచి అల్లాహ్ శరణు వేడుకోండి” అని రెండు లేక మూడు సార్లు అన్నారు. ఆ తర్వాత ఇలా చెప్పారు. విశ్వాసి ప్రపంచాన్ని వదలి పరలోకం వైపు వెళ్ళినప్పుడు అతని దగ్గరికి కొందరు దూతలు వస్తారు. వారి మొహాలు సూర్యునిలా తేజోవంతంగా ప్రకాశిస్తూ ఉంటాయి. వారి దగ్గర స్వర్గ వస్త్రాల్లోని ఒక వస్త్రం (కఫన్) మరియు స్వర్గ పరిమళాలలోని ఒక పరిమళం ఉంటుంది. ఆ దూతలు కనుచూపు మేరలో వచ్చి కూర్చుంటారు. తర్వాత “మృత్యుదూత (అలైహిస్సలాం) వచ్చి విశ్వాసి తలదగ్గర కూర్చుంటాడు. అతనితో ఓ పవిత్రాత్మా! (ఈ శరీరం నుంచి) బయటికి రా అల్లాహ్ మన్నింపు…, ఆయన ప్రసన్నత వైపు పద” అని అంటారు. ఆయన అలా అనగానే దేహం నుంచి ఆత్మ నీళ్ళతిత్తి నుంచి నీరు వచ్చినట్లు బయటికి వస్తుంది. మృత్యుదూత దాన్ని పట్టుకుంటాడు. ఆ ఆత్మ మృత్యు దూత చేతిలో ఒక్క క్షణమైనా ఉంటుందో లేదో మిగతా దూతలు దాన్ని’ తీసుకొని స్వర్గవస్త్రంలో చుట్టుకొని దానికి స్వర్గసుగంధం పూస్తారు. దాంతో ఆ ఆత్మ నుంచి భూమి మిూద లభించే అన్నింటికంటే ఉత్తమమైన కస్తూరి నుంచి వచ్చే సువాసన కన్నా మంచి వాసన వస్తుంది. ఆ తర్వాత దూతలు ఆ సుగంధ భరిత ఆత్మను ఆకాశంవైపు తీసుకొని వెళ్తారు. దారిలో ఎక్కడెక్కడయితే దైవానికి సన్నిహితులైన దూతలు కలుసుకుంటారో వారు “ఈ పవిత్రాత్మ ఎవరిది?” అని అడుగుతారు. అందుకు ‘సమాధానంగా దూతలు “ఇది ఫలానా అతని కుమారుడైన ఫలానా వాడిది. ఇతను ప్రపంచంలో ఫలానా మంచిపేరుతో గుర్తింపబడేవాడు?” అని చెబుతారు. దూతలు విశ్వాసి ఆత్మను వీడ్కోలు పలకటానికి తర్వాతి ఆకాశం వరకు సాగనంపి వస్తారు. ఆఖరికి దూతలు ఆ ఆత్మను తీసుకొని ఏడో ఆకాశం దాకా వెళ్తారు. అక్కడ అల్లాహ్ తరఫున “నా ఈ దాసుని పేరు ఇల్లియ్యీన్లో రాయండి. ఆ తర్వాత అతన్ని భూమిమీదకు తీసుకెళ్ళి అతని శరీరంలోకి మరలించండి” అని ఆదేశం అవుతుంది. (అహ్మద్-హసన్) (ముహ్ యుద్దీన్ దీబ్ అత్ తర్గీబ్ వత్ తర్హీబ్ నాల్గో సంపుటి 5221వ హదీసు)
24వ అంశం: విశ్వాసి ఆత్మను తీసుకెళ్లటం కోసం కారుణ్యదూతలు తమ వెంట తెల్లని పట్టు వస్త్రం (కఫన్) తీసుకొని వస్తారు.
25వ అంశం: ఆత్మను తీసేముందు దూతలు విశ్వానికి దైవప్రసన్నత మరియు దైవకారుణ్యాల శుభవార్త వినిపిస్తారు.
26వ అంశం: విశ్వాసి ఆత్మ నుంచి వచ్చే సువాసనను ఆఘ్రాణించగానే దైవదూతలకు సంతోషం కలుగుతుంది.
27వ అంశం: చనిపోయిన విశ్వాసుల ఆత్మలు ఇల్లియ్యీన్ కు చేరుకున్న తర్వాత అక్కడ ముందునుంచి ఉన్న విశ్వాసుల ఆత్మలను కలిసి చాలా సంతోషిస్తాయి. వారు ఒకరి క్షేమం ఒకరు అడిగి తెలుసుకుంటారు.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: విశ్వాసికి మరణం సమీపించినప్పుడు కారుణ్యదూతలు తెల్లటి పట్టు వస్త్రం (కఫన్) తీసుకొని వచ్చి అతనితో “(ఓ ఆత్మా!) దైవకారుణ్యం, స్వర్గపరిమళం మరియు నీ పట్ల ప్రసన్నుడు కాబోయే ప్రభువు వైపు పద. ఈ స్థితిలో ఈ దేహం నుంచి నీవు నీ ప్రభువు పట్ల ప్రసన్నుడవయ్యావు. నీ ప్రభువు నీ పట్ల ప్రసన్నుడయ్యాడు” అని చెబుతారు. విశ్వాసి ఆత్మ శరీరం నుంచి వీడినప్పుడు అందులోనుంచి కస్తూరిలాంటి సువాసన వస్తుంది. దూతలు దాన్ని ఒకరిచేతుల్లో నుంచి ఒకరు తీసుకొని పరిమళం ఆఘ్రాణిస్తారు. ఆకాశ ద్వారం దగ్గరికి చేరుకున్నప్పుడు అక్కడి దూతలు “ఆహా ఎంతమంచి పరిమళం! భూమి వైపు నుంచి వస్తున్నది” అని చెప్పుకుంటారు. దూతలు మరో ఆకాశానికి చేరుకోగానే అక్కడి దూతలు కూడా అలాగే చెప్పుకుంటారు. చివరికి (తీసుకెళ్ళే దూతలు) ఆ ఆత్మను విశ్వాసుల ఆత్మలు ఉండేచోట (ఇల్లియ్యీన్)కు చేరుస్తారు. ఆ ఆత్మ చేరుకున్నప్పుడు మొదటి నుంచి అక్కడ ఉన్న ఆత్మలకు మీలో ఎవరైనా తన సోదరుణ్ణి కలుసుకున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కలుగుతుంది. కొన్ని ఆత్మలు (కొత్తగా వచ్చే దూతల్ని) “ఫలానా అతను ఎలా ఉన్నాడు?” అని అడుగుతాయి. తర్వాత వారిలో కొందరు “దాన్ని కాస్త ప్రశాంతంగా వదలిపెట్టండి అది ప్రపంచంలో బాధలు, కష్టాలు అనుభవించి వచ్చింది” అని అంటారు. కాసేపు సేద తీరిన తర్వాత ఆ ఆత్మ “ఫలానా ఆత్మ మీ దగ్గరికి రాలేదా? ఆ మనిషి చచ్చిపోయాడు కదా!” అని (ఆశ్చర్యపోతూ) అడుగుతుంది. దానికి మిగతా ఆత్మలు (నిట్టూర్పులు విడుస్తూ) “మరయితే అతను తన తల్లి హామియా (నరకంలోకి పంపబడి ఉంటాడు” అని అంటారు.
అవిశ్వాసి దగ్గరికి యాతనదూతలు వచ్చి “ఓ దుఃఖాత్మా! ఓ దైవాగ్రహ పాత్రురాలైన ఆత్మా! అల్లాహ్ ఆగ్రహం, ఆయన అప్రసన్నత వైపుకు పద” అని పిలుస్తారు. అవిశ్వాసి ఆత్మ శరీరం నుంచి బయటికి వచ్చినప్పుడు (కుళ్ళిపోయిన) మృతదేహం లాగా కంపుకొడుతుంది. దూతలు దాన్ని తీసుకొని భూమి ద్వారం దగ్గరికి వెళ్తారు. (భూమి ద్వారపాలకులు అయిన) దూతలు “ఎంత భయంకరంగా ఉంది ఈ కంపు” అని అనుకుంటారు. దూతలు దాన్ని తీసుకొని రెండో భూమి ద్వారం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దూతలు కూడా దాన్ని అలాగే అంటారు. ఆఖరికి యాతనా దూతలు దాన్ని అవిశ్వాసుల ఆత్మలు ఉండే నిర్ణీత చోటు (సిజ్జీన్)కు తీసుకువెళ్తాయి.
(హాకిమ్ ఇబ్నెహిబ్బాన్ – సహీహ్) [హాకిమ్ కితాబుల్ జనాయెజ్ బాబు హాలి ఖబ్ జి రూహిల్ మూమిని వ ఖబ్ జి రూహిల్ కాఫిరి (1/1342)]
గమనిక: మరణానంతరం విశ్వాసుల ఆత్మలు ప్రభుత్వ అతిథి గృహానికి తీసుకెళ్ళ బడతాయి. అది సప్తాకాశాలపైన ఉంది. దాని పేరు ఇల్లియిన్. దీనికి భిన్నంగా అవిశ్వాసుల ఆత్మలు మరణానంతరం ప్రభుత్వ కారాగారానికి తీసుకెళ్ళబడతాయి. అది ఏడు భూముల క్రింద ఉంది. దానిపేరు సిజ్జన్. వాస్తవం అల్లాహ్ కే బాగా తెలుసు.
28వ అంశం: విశ్వాసి ఆత్మ శరీరం నుంచి బయటికి వచ్చేదాకా దూతలు దానికి ఎడతెగకుండా శుభవార్తలు వినిపిస్తూనే ఉంటారు. ఆఖరికి అలాగే విశ్వాసి ఆత్మ బయటికి వచ్చేస్తుంది.
29వ అంశం : ఆత్మను మహోన్నత (దైవ) సింహాసనం వైపు తీసుకెళ్తున్నప్పుడు ప్రతి ఆకాశంలోని భద్రతాదూతలు ఎంతో గౌరవంగా మర్యాదపూర్వకంగా విశ్వాసి ఆత్మను స్వాగతిస్తారు.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: మనిషి మరణ సమయంలో అతని ఆత్మను బయటికి తీయటానికి దైవదూతలు అతని దగ్గరికి వెళ్ళినపుడు అతని ఆత్మ గనక మంచిది, సత్కార్యాలు చేసినది అయితే వారు దానితో ఇలా అంటారు: “ఓ పవిత్రాత్మా! నీవు పరిశుద్ధమైన శరీరంలో ఉండేదానివి. ఇప్పుడు నీవు శరీరం నుంచి బయటికి రా. నీవు పొగడదగినదానివి. నీకోసం స్వర్గ అనుగ్రహాలు ఉన్నాయి. అల్లాహ్ నీపట్ల సంతోషంగా ఉన్నాడు. దైవకారుణ్యం లభిస్తున్నందుకు సంతోషించు”. ఆత్మ శరీరం నుంచి బయటికి వచ్చేవరకు దూతలు మరణించేవారితో మాటిమాటికీ ఇలాగే అంటుంటారు. ఆత్మ శరీరం నుంచి బయటికి రాగానే దూతలు దాన్ని తీసుకొని ఆకాశానికి ఏగుతారు. వారికోసం ఆకాశద్వారాలు తెరువబడతాయి. “ఎవరతను?” అని అడగబడుతుంది. దైవదూతలు ‘ఫలానా అతను’ అని చెబుతారు. ఆ మాట వినగానే ఈ పవిత్రాత్మకు సుస్వాగతం. (ప్రపంచంలో) ఇది పరిశుద్ధమైన శరీరంలో ఉండేది. (ఓ పవిత్రాత్మా! ఆకాశ ద్వారంలోకి సంతోషంగా ప్రవేశించు. నీకు దైవకారుణ్య శుభవార్త. స్వర్గ అనుగ్రహాలు లభించబోతున్నందుకు సంతోషించు. ప్రసన్నుడైన ప్రభువును కలుసుకోబోతున్నందుకు అభినందనలు” అని అనబడుతుంది. ప్రతి ఆకాశపు ద్వారం దగ్గరా దానికి మాటికి మాటికి ఇలాంటి శుభవార్తలే వినపడ్తుంటాయి. ఆఖరికి అది దైవ సింహాసనము దగ్గరికి చేరుకుంటుంది. మరణించేవాడు గనక చెడ్డవాడు అయితే దైవదూతలు అతనితో “ఓ నీచాత్మా! (ఈ శరీరం నుంచి) బయటికి రా. నీవు అశుద్ధమైన శరీరంలో ఉండేదానివి. చాలా అవమానకరం! నీకు సలసల కాగే నీళ్ళు, చీము మరియు ఇతర శిక్షల శుభవార్త! ఆత్మ బయటికి వచ్చేదాకా దైవదూతలు మాటిమాటికి అలాగే అంటుంటారు. తర్వాత దాన్ని తీసుకొని ఆకాశం వైపు వెళ్తారు. దానికోసం ఆకాశద్వారం ముందు నుంచి తెరువబడి ఉండదు. ఆకాశదూతలు “ఎవరతను?” అని అడుగుతారు. ‘ఫలనా అతను’ అని సమాధానం చెప్పబడుతుంది. దానికి ఆకాశ దూతలు అశుద్ధమైన శరీరంలో ఉండిన ఈ నీచాత్మకు ఇక్కడ ఎలాంటి స్వాగతాలు లేవు. దాన్ని అవమానించి తిప్పి పంపండి’ అని అంటారు. ఇలాంటి నీచాత్మ కోసం ఆకాశద్వారాలు తెరువబడవు. అందుకని దూతలు దాన్ని ఆకాశం నుంచి క్రిందికి విసిరేస్తారు. అది సమాధిలోకి తిరిగి వచ్చేస్తుంది. (ఇబ్నెమాజా- సహీహ్) [అబ్వాబుజ్జుహద్. బాబు జక్రిల్ మౌతి వల్ ఇస్తీదాలహూ (2/3437)]
30వ అంశం: విశ్వాసి ఆత్మ ఆకాశానికి చేరుకోకముందే ఆకాశపు దూతలు దానికోసం కారుణ్య ప్రార్థనలు చేస్తుంటారు.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం: విశ్వాసి ఆత్మ బయటికి రాగానే ఇద్దరు దూతలు దాన్ని తీసుకొని ఆకాశంవైపు వెళ్తారు.
హదీసు ఉల్లేఖకుల్లో ఒకరైన హమ్మాద్ ఇలా అంటున్నారు. ఈ సందర్భంగా అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఆత్మ నుంచి సువాసన మరియు కస్తూరి గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత ఇలా చెప్పారు: ఆ సువాసన తగలగానే ఆకాశదూతలు “భూలోకం నుంచి ఏదో పవిత్రాత్మ వస్తోంది. అల్లాహ్ నిన్ను కరుణించుగాక నీవు ఉండిన ఆ శరీరాన్ని కూడా కరుణించు గాక” అని ప్రార్థిస్తారు. తర్వాత దూతలు ఆ ఆత్మను తమ ప్రభువు దగ్గరికి తీసుకువెళ్తారు. అల్లాహ్ వారిని “ప్రళయం సంభవించేవరకూ దీనికి (దీని నిర్ణీత స్థానం అనగా ఇల్లియ్యీన్లో) ఉంచండి” అని ఆదేశిస్తాడు.
హదీసు ఉల్లేఖకులు అవిశ్వాసి ఆత్మ బయటికి రావటం గురించి చెబుతూ అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఈ సందర్భంగా ఆత్మ నుంచి వచ్చే దుర్వాసన మరియు (దైవదూతల) శాపనార్థాల గురించి ప్రస్తావించారని చెప్పారు.
అప్పుడు ఆకాశదూతలు “భూలోకం నుంచి ఏదో అపవిత్రాత్మ వస్తున్నట్లుంది” అని అనుకుంటారు. తర్వాత అల్లాహ్ తరపునుంచి ప్రళయం సంభవించేవరకూ దీన్ని (దీని నిర్ణీతస్థానం అనగా సిజ్జీన్కు) తీసుకెళ్ళండి” అని ఆదేశం అవుతుంది.
అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అవిశ్వాసి ఆత్మ నుంచి దుర్వాసన వెలువడటం గురించి చెప్పినప్పుడు (అసహ్యం కొద్ది) తన దుప్పటితో ఇలా ముక్కు మూసుకున్నారు. (ఎలా మూసుకున్నారో అబూహురైరా చూపించారు).
(ముస్లిం) [కితాబుల్ జన్నహ్ బాబు అర్జిల్ మఖ్తది అలల్ మయ్యితి వ అజాబిల్ ఖబ్రి]
మరణసమయంలో అవిశ్వాసి తిప్పలు
31వ అంశం: అవిశ్వాసికి మరణ సమయంలో ఈ క్రింది పది రకాల శిక్షలు గాని వాటిలో కొన్ని గాని ఉంటాయి.
1.అవిశ్వాసి ప్రాణం తీయటానికి నల్లటి మొహాలతో అత్యంత భయంకరంగా ఉండే దైవదూతలు వస్తారు.
2. అవిశ్వాసి ప్రాణం తీసేదూతలు (ఆత్మను చుట్టుకొని తీసుకెళ్ళటం కోసం) తమ వెంట గోనెసంచి తీసుకొని వస్తారు.
3. ప్రాణం తీయకముందే దూతలు అవిశ్వాసిని “ఓ అపవిత్రాత్మా! ఈ శరీరం నుంచి బయటికి… దైవాగ్రహం వైపుకు పద” అని భయపెడ్తుంటారు.
4.అవిశ్వాసి ఆత్మను తీసేటప్పుడు దూతలు అతని మొహంమీద, వీపుమీద కొడ్తుంటారు.
5. అవిశ్వాసి ఆత్మను తీసేటప్పుడు దూతలు అతనికి అగ్నిశిక్ష ‘శుభవార్త’ కూడా వినిపిస్తారు.
6. చనిపోయేటప్పుడు అవిశ్వాసి ఆత్మ నుంచి ఈ భూమి మీద అత్యంత దారుణంగా కుళ్ళిన మృతదేహం నుంచి ఎలాంటి దుర్వాసన వస్తుందో అలాంటి వాసన వస్తుంది.
7. ఆ దుర్వాసన భరించలేక భూమ్యాకాశాల్లో ఉన్న ఇంకా వాటి మధ్యలో ఉన్న దైవదూతలందరూ అతనికి శాపనార్థాలు పెడతారు.
8. అవిశ్వాసి ఆత్మను శరీరం నుంచి బయటికి తీసిన తర్వాత దైవదూతలు దాన్ని మొదటి ఆకాశానికి (తీసుకెళ్ళి అక్కడి దారపాలకులకు) పరిచయం చేసి ద్వారం తెరువమని అడుగుతారు. కాని అక్కడి ద్వారపాలకులు ద్వారం తెరువటానికి నిరాకరిస్తారు.
9. అల్లాహ్ ఆజ్ఞ మేరకు ఆ అవిశ్వాసి ఆత్మ సిజ్జీన్లో నమోదు చేయబడుతుంది.
10. సిజ్జీన్లో నమోదు చేయటం అయిపోయిన తర్వాత అవిశ్వాసి ఆత్మను అత్యంత అవమానకరంగా మొదటి ఆకాశం నుంచి భూమిపైకి విసిరేయటం జరుగుతుంది.
గమనిక: పైన పేర్కొనబడిన శిక్షలన్నీ రాబోవు పుటల్లో ప్రస్తావించబడ్డాయి. అంశాల క్రింద పొందుపరచబడిన దివ్యఖుర్ఆన్ సూక్తుల్ని దైవప్రవక్త హదీసులను గమనించండి.
32వ అంశం: అవిశ్వాసి ఆత్మను బయటికి తీయకముందే దైవదూతలు దానికి నరకప్రవేశ ‘శుభవార్త’ వినిపిస్తారు.
الَّذِينَ تَتَوَفَّاهُمُ الْمَلَائِكَةُ ظَالِمِي أَنفُسِهِمْ ۖ فَأَلْقَوُا السَّلَمَ مَا كُنَّا نَعْمَلُ مِن سُوءٍ ۚ بَلَىٰ إِنَّ اللَّهَ عَلِيمٌ بِمَا كُنتُمْ تَعْمَلُونَ فَادْخُلُوا أَبْوَابَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۖ فَلَبِئْسَ مَثْوَى الْمُتَكَبِّرِينَ
దైవదూతలు ప్రపంచంలో తమ ఆత్మలకు అన్యాయం చేసుకుంటూ ఉన్నవారి ప్రాణాలు తీసినప్పుడు వారు (తలబిరుసుతనాన్ని విడిచిపెట్టి) వెంటనే పూర్తిగా లొంగిపోయి “మేము ఏ తప్పూ చేసి ఉండలేదు” అని అంటారు. దానికి దైవదూతలు “ఎందుకు చేసి ఉండలేదు! అల్లాహ్ మీ చేష్టలను బాగా ఎరుగును. ఇక పొండి. నరకద్వారాలలో దూరిపొండి. అక్కడనే మీరు శాశ్వతంగా ఉంటారు.” అని అంటారు. కనుక యధార్థం ఏమిటంటే, గర్విష్టులకు లభించే నివాసం చాలా చెడ్డది. (నహ్ల్ సూరా 16:28-29)
33వ అంశం: అవిశ్వాసి ఆత్మను తీసేటప్పుడు దూతలు వారికి చెంపదెబ్బలు కొడతారు. వారి వీపుల మీద కొరడాదెబ్బలు కొడ్తారు. దాంతోపాటు అగ్ని శిక్ష ‘శుభవార్త’ వినిపిస్తారు.
وَلَوْ تَرَىٰ إِذْ يَتَوَفَّى الَّذِينَ كَفَرُوا ۙ الْمَلَائِكَةُ يَضْرِبُونَ وُجُوهَهُمْ وَأَدْبَارَهُمْ وَذُوقُوا عَذَابَ الْحَرِيقِ
దైవదూతలు హతులైన అవిశ్వాసులు ప్రాణాలు తీస్తున్నప్పటి స్థితిని నీవు గనక చూడగలిగితే ఎంత బాగుండేది! వారు వారి మొహాలపైని, పిరుదుల పైని కొడ్తూ “ఇదిగో, కాల్చే శిక్షను అనుభవించండి” అని అన్నారు. (అన్ ఫాల్ సూరా 8:50)
فَكَيْفَ إِذَا تَوَفَّتْهُمُ الْمَلَائِكَةُ يَضْرِبُونَ وُجُوهَهُمْ وَأَدْبَارَهُمْ
దైవదూతలు వారి ఆత్మలను వశపరచుకునేటప్పుడు వారి మొహాలపై వీపులపై కొడ్తూ వారిని తీసుకువెళ్ళేటప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది?” (ముహమ్మద్ సూరా 47:27)
34వ అంశం : అవిశ్వాసి ప్రాణం తీసేముందు దైవదూతలు అతన్ని విపరీతంగా హూంకరిస్తారు. అవమానకరమైన శిక్షకు గురికావలసి ఉంటుందనే “శుభవార్త” వినిపిస్తారు.
ఈ దుర్మార్గులు మరణవేదనలో మునిగితేలుతూ ఉండగా, దైవదూతలు తమ హస్తాలను చాచి “ఇటు తెండి! బయటకు తియ్యండి మీ ప్రాణాలను, అల్లాహ్ పై అపనిందను మోపి అన్యాయంగా కూసిన కూతలకూ, ఆయన ఆయతుల పట్ల తలబిరుసుతనం ప్రదర్శించినందుకూ ఫలితంగా ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది” అని అంటూ ఉండగా ఆ దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుంటుంది!
35 వ అంశం : అవిశ్వాసి ఆత్మను వశపరచుకోవటం కోసం నల్లటి మొహాలుగల యాతనాదూతలు వస్తారు.
36వ అంశం : అవిశ్వాసి ఆత్మ అతని శరీరం నుంచి తడి ఇనుపచువ్వ ఉన్ని నుంచి ఎంత కష్టంగా వేరవుతుందో అంత కష్టంగా బయటపడుతుంది.
37వ అంశం: అవిశ్వాసి ఆత్మను చుట్టుకొని తీసుకెళ్ళటం కోసం యాతనాదూతలు తమవెంట కఫన్ తీసుకొని వస్తారు.
38వ అంశం: ఈ భూమిమీద అత్యంతదారుణంగా కుళ్ళిన మృతదేహం నుంచి ఎలాంటి దుర్వాసన వస్తుందో అవిశ్వాసి ఆత్మనుంచి అంతకంటే ఎక్కువ దుర్వాసన వస్తుంది.
39వ అంశం: ఆకాశం పైకి వెళ్ళినప్పుడు ఏయే దూతల దగ్గరి నుంచి ఆ ఆత్మ వెళ్తుందో వారందరూ దానికి శాపనార్థాలు పెడతారు.
40వ అంశం : అవిశ్వాసి ఆత్మను అల్లాహ్ దగ్గరికి తీసుకెళ్ళటం కోసం మొదటి ఆకాశపు ద్వారం తెరువమని అడిగితే అక్కడి ద్వారపాలకులు ద్వారం తెరువటానికి నిరాకరిస్తారు.
41వ అంశం: అవిశ్వాసి పేరు అన్నిటి కంటే క్రింది (అనగా ఏడవ) భూమి క్రింద ఉన్న సిజ్జీన్ (కారాగారపు) రిజిష్టరులో నమోదు చేయబడాలని అల్లాహ్ తరపు నుంచి ఆదేశమవుతుంది.
42 వ అంశం: సిజ్జీన్లో నమోదు చేయబడిన తర్వాత అవిశ్వాసి ఆత్మ మొదటి ఆకాశం నుంచి చాలా హీనంగా క్రిందికి విసిరేయబడుతుంది.
హజ్రత్ బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) కథనం: మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఒక అన్సారీ వ్యక్తి అంత్యక్రియలకు వెళ్ళాం. సమాధి దగ్గరికి వెళ్ళినప్పటికి సమాధి త్రవ్వటం ఇంకా పూర్తి కాలేదని తెలిసింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూర్చున్నారు. మేము కూడా అక్కడే ఆయన చుట్టూ మా తలల మీద పక్షులు కూర్చొని ఉన్నాయా అన్నంత (నిశ్శబ్దంగా) కూర్చున్నాం. దైవప్రవక్త చేతిలో ఒక బెత్తం ఉంది. దాంతో ఆయన నేలమీద గీకుతూ (ఏదో ఆలోచించుకుంటూ) ఉన్నారు. కాసేపటికి తల పైకెత్తి “సమాధి శిక్ష నుంచి అల్లాహ్ శరణు వేడుకోండి” అని అన్నారు. ఇదే మాట ఆయన రెండు మూడుసార్లు అన్నారు. ఆ తర్వాత ఇలా చెప్పటం మొదలు పెట్టారు. అవిశ్వాసి ప్రపంచాన్ని వీడి పరలోకంవైపు వెళ్ళినప్పుడు అతని దగ్గరికి కొందరు దూతలు వస్తారు. వారి మొహాలు నల్లగా ఉంటాయి. వారి దగ్గర కఫన్ ఉంటుంది. ఆ దూతలు కనుచూపుమేరలోకి వచ్చి కూర్చుంటారు. తర్వాత మృత్యుదూత వచ్చి అవిశ్వాసి తల దగ్గర కూర్చుంటాడు. అతనితో “ఓ నీచాత్మా! దైవాగ్రహం వైపుకు పద” అని అంటాడు. ఆత్మ శరీరంలో మరింత ముకుళించుకుపోతుంది. దైవదూతలు దాన్ని తడి ఉన్నిలో నుంచి ముళ్లున్న ఇనుపచువ్వను బయటికి తీసినట్లు తీస్తారు. దాన్ని బయటికి తీసిన తర్వాత అది మృత్యుదూత చేతిలో ఒక క్షణమైనా ఉంటుందో లేదో మిగతా దూతలు వచ్చి దాన్ని (కఫన్) చుట్టుకుంటారు. ఆ ఆత్మనుంచి భూమిమీద అత్యంత దారుణంగా కుళ్ళిన మృతదేహం నుంచి ఎలాంటి దుర్వాసన వస్తుందో అలాంటి దుర్వాసన వస్తూ ఉంటుంది. దూతలు దాన్ని తీసుకొని పైకి వెళ్తారు. దారిలో ఎక్కడెక్కడయితే అల్లాహ్ కు సన్నిహితులైన దూతలు కలుసుకుంటారో వారందరూ “ఈ దుర్గంధం ఏ (నీచమైన) ఆత్మది?” అని అడుగుతారు. అందుకు సమాధానంగా దూతలు “ఇది ఫలానా అతని కుమారుడైన ఫలానా వాడి ఆత్మ” అని చెబుతారు. ప్రపంచంలో అతన్ని పిలిచే పేర్లలో అత్యంత చెడ్డ పేరును పేర్కొంటారు దైవదూతలు. దాన్ని తీసుకొని ప్రపంచపు ఆకాశం దగ్గరికి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళి ద్వారం తెరువమని అడుగుతారు. కాని ద్వారం తెరువబడదు.
తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (దివ్య ఖుర్ఆన్లోని) ఈ సూక్తి పఠించారు వారి కొరకు ఆకాశ ద్వారాలు తెరువబడవు. సూది రంధ్రం గుండా ఒంటె దూరిపోవటం ఎంత అసంభవమో వారు స్వర్గంలోకి పోవటం కూడా అంతే అసంభవం.” (ఆరాఫ్ సూరా, 40వ సూక్తి)
తర్వాత అన్నిటికంటే క్రింది భూమిలో ఉన్న సిజీన్ (కారాగారం)లో దానిని నమోదు చేయమని అల్లాహ్ తరపు నుంచి ఆదేశం అవుతుంది. ఆ తర్వాత అవిశ్వాసి ఆత్మ చాలా హీనంగా భూమి పైకి విసరివేయబడుతుంది.
ఇక్కడివరకు చెప్పిన తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దివ్యఖుర్ఆన్లోని ఈ సూక్తి పఠించారు: “ఇతరులను అల్లాహ్ కు భాగస్వామిగా చేసేవాడు ఆకాశం నుండి క్రింద పడిపోయినట్లే. అతనిని ఇక పక్షులైనా తన్నుకుపోతాయి లేదా గాలి అతన్ని ముక్కలు ముక్కలయ్యే ప్రదేశంలో విసరివేస్తుంది”(హజ్ సూరా. 31వ సూక్తి) (అహ్మద్-హసన్) [ముహ్ యుద్దీన్ దీబ్ అత్ తర్గీబ్ వత్ తర్హీబ్ నాల్గో సంపుటి 5221వ హదీసు]
43వ అంశం: అవిశ్వాసి ప్రాణం తీసేముందు దైవదూతలు అతనికి దైవశిక్ష, దారుణమైన పర్యవసానాల ‘శుభవార్త’ వినిపిస్తారు. అందువల్ల అవిశ్వాసి అల్లాహ్ దగ్గరికి వెళ్ళటానికి అయిష్టపడతాడు.
సూచన : 15వ అంశం క్రింద ఉన్న హదీసు చూడండి.
44వ అంశం : విశ్వాసి ఆత్మను వశపరచుకునేముందు దైవదూతలు దానితో ఇలా అంటారు: “ఓ నీచాత్మా! నీవు నీచమైన శరీరంలో ఉండేదానివి, ఇప్పుడు అవమానకరస్థితిలో బయటికి రా. ఈ రోజు నీకు(నరకపు) సలసలకాగే నీరు, చీము, ఇతర శిక్షల శుభవార్త ఉంది”.
సూచన:- 29వ అంశం క్రింద ఉన్న హదీసు చూడండి.
45వ అంశం: అవిశ్వాసి ఆత్మ తాలూకు దుర్వాసన తగలగానే దైవదూతలు దానికి శాపనార్థాలు పెడతారు.
సూచన :- 30వ అంశం క్రింద ఉన్న హదీసు చూడండి.
46వ అంశం : అవిశ్వాసి ఆత్మను సిజ్జీన్ వైపు తీసుకెళ్ళేటప్పుడు భూమి ద్వార పాలకులైన దూతలు దాని దుర్వాసనను తీవ్రంగా అసహ్యించుకుంటారు.
సూచన :- 24 నుంచి 27 అంశాల క్రింద ప్రస్తావించబడిన హదీసులు చూడండి.
మృతుడు మాట్లాడటం, వినటం
47వ అంశం: మరణించిన తర్వాత మృతులు వారు మంచివారయినా చెడ్డవారయినా తమ పర్యవసానం చూసుకొని బ్రతికున్న తమ వారితో మాట్లాడుతారు. కాని వారు ఆ మాటలు వినలేరు. వింటే గనక సృహతప్పి పడిపోతారు.
హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: జనాజా సిద్ధమయిన తర్వాత ప్రజలు దాన్ని తమ భుజాల మీద ఎత్తుకున్నప్పుడు మృతుడు మంచివాడయితే “నన్ను త్వరగా తీసుకెళ్ళండి. నన్ను త్వరగా తీసుకెళ్ళండి” అని అంటాడు. అదే చెడ్డవాడయితే “అయ్యో! నా పాడుగాను. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు” అని అరుస్తాడు. మృతుని శబ్దం మానవులు (జిన్నాతులు) తప్ప మిగతా సృష్టిరాశులన్నీ వింటాయి. మనిషి గనక ఆ శబ్దం వింటే స్పృహతప్పి పడిపోతాడు”. (బుఖారీ) [కితాబుల్ జనాయెజ్ బాబు కలామిల్ మయ్యితి అలల్ జనాజతి ]
గమనిక:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: చనిపోయినవారిని వీలైనంత తొందరగా సమాధి చేయండి. ఎందుకంటే మృతుడు మంచివాడయితే అతను త్వరగా సాఫల్యం పొందుతాడు. అదే చెడ్డవాడయితే ఆ భారం భుజాల నుంచి త్వరగా దిగిపోతుంది. (బుఖారీ) [కితాబుల్ జనాయెజ్ బాబు కలామిల్ మయ్యితి అలల్ జనాజతి ]
48వ అంశం: బద్ర్ యుద్ధంలో చంపబడిన అవిశ్వాసులు దైవప్రవక్త మాటలు విన్నారు.
హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం: బద్ర్ యుద్ధంలో చంపబడిన అవిశ్వాసులను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మూడు రోజుల వరకు అలాగే ఉండనిచ్చారు. తర్వాత వారి దగ్గరికి వెళ్ళారు. వారి ముందు నిలబడి గట్టిగా “ఓ అబూజహల్ బిన్ హిషామ్ ! ఓ ఉమయ్యా బిన్ ఖల్ఫ్! ఓ ఉత్బా బిన్ రబీఆ! ఓ షైబా బిన్ రబీఆ! మీ ప్రభువు (నా ద్వారా) మీతో చేసిన వాగ్దానం నిజమని మీరు గ్రహించారా లేదా? నేను మటుకు ప్రభువు చేసిన వాగ్దానం నిజమని గ్రహించాను” అని అన్నారు. ఉమర్ (రదియల్లాహు అన్హు) అది చూసి “దైవప్రవక్తా.. మీరు చెప్పేది విని జవాబు చెప్పగల్గుతారా వీరు? ఇప్పుడు వీరు చచ్చిపోయి ఉన్నారు కదా?” అని సందేహపడ్డారు. అందుకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఎవరి చేతిలోనయితే నాప్రాణం ఉందో ఆయన సాక్షిగా చెబుతున్నాను. నేను చెప్పే మాటలు వీరు మీ కంటే బాగా వింటున్నారు. అయితే వీరు సమాధానం పలకలేరు అంతే” అని చెప్పారు. ఆ తర్వాత ఆయన ఆదేశం మేరకు వారిని ఈడ్చుకెళ్లి బద్ర్ ప్రాంతంలోని ఖలీబ్ (అనే బావిలో) పడేయటం జరిగింది. (ముస్లిం) (కితాబుల్ జన్నతి వ సిఫతిహా బాబు అర్జిల్ మఖ్ది అలల్ మయ్యితి వ అజాబిల్ ఖబ్రి)
49వ అంశం : ఖననం తర్వాత బంధుమిత్రులు ఇండ్లకు తిరిగి వెళ్ళినప్పుడు మృతుడు వారి అడుగుల చప్పుడు వింటాడు.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: దాసుడు సమాధిలో ఖననం చేయబడిన తర్వాత అతని ఆత్మీయులు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు మృతుడు వారి చెప్పుల శబ్దం వింటాడు. (ముస్లిం)
(కితాబుల్ జన్నతి వసిఫతిహా. బాబు అర్జిల్ మఖ్ ది అలల్ మయ్యితి వ అజాబిల్ ఖబ్రి)
సమాధికి (ఖబర్ కు) అర్థం
50వ అంశం : ఖబర్ అంటే ఏదయినా వస్తువుని దాచేయటం లేక ఖననం చేయటం అని అర్థం.
“అప్పుడు అల్లాహ్ ఒక కాకిని పంపాడు. అది నేలను త్రవ్వసాగింది. తన సోదరుని శవాన్ని ఏవిధంగా దాచాలో అతడికి తెలుపటానికి”. (మాయిదా సూరా 31వ సూక్తి)
అబస సూరాలోని 21వ సూక్తిలో అల్లాహ్ “ఫఅఖ్బరహ్” అన్నాడు. అరబ్బులు “నేను మనిషిని సమాధి చేశాను” అని చెప్పటానికి “అఖ్బరుర్రజుల” అని అంటారు. నేను అతనికోసం సమాధి తయారు చేశాను లేక అతన్ని సమాధిలో వేశాను అంటే నేను అతన్ని ఖననం చేశాను అని భావం. (బుఖారీ) (బుఖారీ కితాబుల్ జనాయెజ్ బాబు మా జాఅ ఫీ అజాబిల్ ఖబ్రి )
51 వ అంశం : సమాధి జీవితాన్ని బర్ జఖ్ (అంటే అడ్డుగా ఉన్న) జీవితం లేక ఆలమె బర్ జఖ్ అని అంటారు.
“ఇప్పుడు ఈ (మరణించేవారి అందరి వెనుక ఒక గోడ అడ్డంగా ఉన్నది” (మూమినూన్ సూరా 100వ సూక్తి)
గమనిక: మనిషి మరణానంతరం అతని శవాన్ని మట్టిలో సమాధి చేసినా లేక నీట ముంచినా లేక దాన్ని కూౄర మృగాలు తినేసినా లేక కాల్చి భస్మం చేసినా ఎక్కడెక్కడయితే ఆ శరీరం లేక దాని అణువులు ఉంటాయో అదే దాని సమాధి (ఖబ్ర్) అవుతుంది.
సమాధి బహుమానాలు తథ్యం
52వ అంశం : విశ్వాసులకు సమాధిలో స్వర్గ అనుగ్రహాలు ప్రాప్తిస్తాయి.
వారు పరిశుద్ధావస్థలో ఉన్నప్పుడు దైవదూతలు వారి ప్రాణాలు తీస్తూ “మీకు శాంతి కలుగుగాక! మీ కర్మలకు ప్రతిఫలంగా స్వర్గంలో ప్రవేశించండి” అని అంటారు. (నహ్ల్ సూరా : 32వ సూక్తి)
53వ అంశం: విశ్వాసి సమాధి సస్యశ్యామలమైన తోటలాగుంటుంది. అందులో నిండు పౌర్ణమి లాంటి వెన్నల కాస్తూ ఉంటుంది.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: విశ్వాసి తన సమాధిలో సస్యశ్యామలంగా ఉన్న తోటలో ఉన్నట్లు ఉంటాడు. అది అతని కొరకు డెబ్బై గజాలు (సుమారు 105 ఫిట్లు లేక 35 మీటర్లు) విశాలం చేయబడుతుంది. ఇంకా అందులో పౌర్ణమి వెన్నలలాంటి వెలుతురు నింపబడుతుంది. (అబూయాలా – హసన్) (ముహ్ యుద్దీన్ దీబ్ అత్ తర్గీబ్ వత్ తర్హీబ్ నాల్గోసంపుటి. 5216వ హదీసు)
గమనిక : వేరొక హదీసులో విశ్వాసి సమాధి డెబ్భై డెబ్బైల (అనగా 35×35 మీటర్ల) అంత విశాలం చేయబడుతుందని చెప్పబడింది. సమాధి వైశాల్యం విశ్వాసి సత్కర్మలను బట్టి ఉంటుంది. వల్లాహు ఆలమ్.
54వ అంశం : విశ్వాసులకు సమాధిలో ఉదయం సాయంత్రం వారి స్వర్గనివాసం చూపించ బడుతుంది.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: మీలో ఎవరైనా చనిపోతే ఉదయం సాయంత్రం అతనికి తన నివాసం చూపించబడుతుంది. అతను స్వర్గవాసి అయితే అతనికి స్వర్గభవనాలు చూపించ బడతాయి. ఒకవేళ నరకవాసి అయితే నరక నివాసాలు చూపించి ఇది నీ నివాసం. ప్రళయదినాన అల్లాహ్ నిన్ను ఇక్కడికి పంపిస్తాడు” అని చెప్పబడుతుంది. (ముస్లిం) (కితాబుల్ జన్నతి వసిఫతిహా బాబు అర్జిల్ మఖ్ అది అలలమయ్యితి)
55వ అంశం : సమాధిలో విశ్వాసికి స్వర్గ పడక మరియు స్వర్గవస్త్రాలు ఇవ్వబడతాయి.
సూచన : 91వ అంశం క్రింది హదీసు చూడండి.
56వ అంశం: విశ్వాసి సమాధికి స్వర్గం వైపున ఉండే ఒక ద్వారం తెరువబడుతుంది.
సూచన : 92వ అంశం క్రింది హదీసు చూడండి.
సమాధి యాతన తథ్యం
57వ అంశం : సమాధిలో యాతన ఉంటుందనే విషయం నిజం.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం ఆమె దగ్గరికి ఓ యూద స్త్రీ వచ్చి సమాధి యాతన గురించి మాట్లాడింది. అది విని ఆయిషా (రదియల్లాహు అన్హా) (ఆశ్చర్యంతో) “అల్లాహ్ నిన్ను సమాధి యాతన నుంచి కాపాడుగాక!” అని అన్నారు. ఆ తర్వాత ఆమె సమాధి యాతన గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అడిగారు. అందుకాయన “అవును, సమాధిలో యాతన ఉంటుందన్న విషయం నిజమే” అని అన్నారు.
ఆయిషా (రదియల్లాహు అన్హా) అంటున్నారు. అప్పటి నుంచి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏ నమాజు చేసినా అందులో సమాధి యాతన నుంచి అల్లాహ్ శరణు వేడుకోవడటం నేను చూశాను. (బుఖారీ) (బుఖారీ కితాబుల్ జనా యెజ్ బాబు మా జాఅ ఫి అజాబిల్ ఖబ్రి)
58వ అంశం : అల్లాహ్ దైవప్రవక్తకు వహీ ద్వారా సమాధి యాతన గురించి తెలియజేశాడు.
ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: ఒకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో నా ఇంట్లో ఓ యూద మహిళ కూర్చొని ఉంది. ఆమె నాతో “మీరు సమాధుల్లో పరీక్షించబడతారు (అనగా శిక్షించబడతారు)” అని చెబుతూ ఉంది. ఆ మాట విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కంగారు పడ్డారు. “నిశ్చయంగా యూదులు శిక్షించబడతారు” అని అన్నారు.
ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా అంటున్నారు. ఆ తర్వాత మేము ఎన్నో రాత్రుల వరకు (వహీ కోసం) ఎదురుచూశాం. ఒకనాడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “మీరు సమాధిలో పరీక్షించబడతారని నాకు వహీ ద్వారా తెలుపబడింది” అని చెప్పారు. ఆ తర్వాత నుంచి ఆయన ఎల్లప్పుడూ సమాధి శిక్ష నుంచి శరణు వేడుకోవటం నేను చూశాను. (నసాయి-సహీహ్) (కితాబుల్ జనాయెజ్, బాబుత్త అవ్వుజు మిన్ అజాబిల్ ఖబ్రి)
గమనిక: పైన పేర్కొనబడిన హదీసు వహీయె మత్ లూ (అనగా ఖుర్ఆన్) కాకుండా గైర్ మత్ లూ వహీకు మంచి ఉదాహరణ.
59వ అంశం : సమాధిలో అవిశ్వాసుల్ని శిక్షించటం జరుగుతుంది. వారి అరుపులు, కేకలు (మానవులు, జిన్నాతులు తప్ప) మిగతా జంతువులన్నీ వింటాయి.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మసూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: (అవిశ్వాసులు లేక బహుదైవారాధకులు అయిన) మృతులు సమాధుల్లో శిక్షించబడతారు. వారి అరుపులు, కేకలు చతుష్పాద జంతువులన్నీ వింటాయి. (తబ్రానీ – హసన్) (ముహ్ యుద్దీన్ దీబ్ అత్ తర్గీబ్ వత్ తర్హీబ్ గ్రంథం నాల్గో సంపుటి)
హజ్రత్ అయ్యూబ్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సూర్యాస్తమయం తర్వాత (ఇంటి నుంచి) బయలుదేరారు. (శ్మశానంలో) ఆయనకు ఓ శబ్దం వినిపించింది. అప్పుడాయన “యూదులను వారి సమాధుల్లో శిక్షించటం జరుగుతోంది” అని చెప్పారు. (ముస్లిం) (కితాబుల్ జన్నతివసిఫతిహా బాబు అర్జిల్ మఖ్ది అలల్మెయ్యితి వ అజాబిల్ ఖబ్రి)
60వ అంశం: దైవప్రవక్త జీవిత కాలం నాటి సమాధి శిక్షకు సంబంధించిన ఓ హితబోధాత్మక సంఘటన. మదీనావాసులందరూ దాన్ని కళ్లారా చూశారు.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒక క్రైస్తవుడు ముస్లిం అయ్యాడు. అతను బఖరా మరియు ఆలి ఇమ్రాన్ సూరాలు చదువుకున్నాడు. తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గర (వహీ) లేకరిగా పనిచేయసాగాడు. ఆ తర్వాత కొంతకాలానికి అతను మళ్ళీ ధర్మభ్రష్టుడయ్యాడు. “ముహమ్మద్ కు ఏమీ రాదు. నేను రాసి ఇచ్చిందే చదువు కుంటాడు” అని అనసాగాడు. అల్లాహ్ అతనికి మృత్యువునిచ్చాడు. అతను చనిపోయాడు. క్రైస్తవులు అతన్ని (సమాధిలో) పాతిపెట్టారు. తెల్లవారిన తర్వాత చూస్తే నేల అతన్ని బయటకు విసిరేసి ఉంది. క్రైస్తవులు “ఇది ముహమ్మద్ మరియు ఆయన అనుచరులు పని అయి ఉంటుంది. వారు ఇతను వాళ్ల ధర్మం వదలిపెట్టి వచ్చాడు కదా (ఆ కోపంతో) ఇతని సమాధి త్రవ్వి ఇతన్ని బయటికి తీసి పారేసి ఉంటారు” అని అన్నారు. క్రైస్తవులు అతని కోసం మరో చోట సమాధి త్రవ్వారు. మునుపటి కంటే బాగా లోతుగా ఉండేట్లు చేసి శవాన్ని అందులో పాతిపెట్టారు. తెల్లవారిన తర్వాత చూస్తే నేల అతన్ని బయటకు విసరి పడేసింది. క్రైస్తవులు మళ్లీ “ఇది ముహమ్మద్ మరియు ఆయన అనుచరులు పని అయి ఉంటుంది. ఇతను వాళ్ల ధర్మం వదలిపెట్టి వచ్చాడు కదా! (ఆ కోపంతో) వారు ఇతని సమాధి త్రవ్వి ఇతని శవాన్ని బయటికి తీసి పారేసి ఉంటారు” అని నిందించారు. వారు మూడోసారి అతని కోసం సమాధి త్రవ్వారు. దాన్ని తాము చేయగలిగినంత లోతుగా చేశారు. తెల్లవారిన తర్వాత చూస్తే నేల మళ్లీ అతన్ని బయటకు విసిరేసింది. అప్పుడు వారికి ఇది ముస్లింల పని కాదనీ, దైవ శిక్ష అని, నమ్మకం కలిగింది. వారు అతని శవాన్ని అలాగే వదలిపెట్టేశారు. (బుఖారీ) (కితాబుల్ మనాఖిబ్ బాబ్ అలామాతి న్నుబువ్వతి ఫిల్ ఇస్లామ్)
సమాధి శిక్ష – ఖుర్ఆన్ వెలుగులో
61వ అంశం: ఫిరౌన్ అనుచరులు సముద్రంలో మునిగి చచ్చిన తర్వాత నుంచి ప్రతిరోజూ ఉదయం సాయంత్రం వారికి అగ్ని శిక్ష విధించబడుతోంది.
ఫిరౌన్ అనుచరులు ఒక భయంకరమైన శిక్షలో చిక్కుకున్నారు. వారు ఉదయం సాయంత్రం నరకాగ్ని ముందు ఉంచబడుతూ ఉంటారు. ప్రళయ గడియ వచ్చినప్పుడు “ఫిరౌన్ ప్రజలను తీవ్రమైన శిక్షలోకి ప్రవేశింపజెయ్యండి” అని ఆజ్ఞాపించబడుతుంది. (మూమిన్ సూరా 45, 40 సూక్తులు)
62వ అంశం: అవిశ్వాసులకు మరణ సమయం నుంచే శిక్ష మొదలవుతుంది.
ఈ దుర్మార్గులు మరణవేదనలో మునిగి తేలుతూ ఉండగా దైవదూతలు తమ హస్తాలను చాచి “ఇటు తెండి! బయటకు తియ్యండి మీ ప్రాణాలను, అల్లాహ్ పై అపనిందను మోపి అన్యాయంగా కూసిన కూతలకు, ఆయన ఆయతుల పట్ల తలబిరుసు వైఖరి ప్రదర్శించినందుకూ ఫలితంగా ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది” అని అంటూ ఉండగా ఆ దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుంటుంది! (అన్ఆమ్ సూరా 93వ సూక్తి)
63వ అంశం: అవిశ్వాసుల ఆత్మల్ని వశపరచుకోగానే దైవదూతలు వారిని నరకశిక్షలోకి నెట్టి వెస్తారు.
దైవదూతలు ప్రపంచంలో తమ ఆత్మలకు అన్యాయం చేసుకుంటూ ఉన్నవారి ప్రాణాలు తీసినప్పుడు వారు (తలబిరుసుతనాన్ని విడిచిపెట్టి) వెంటనే పూర్తిగా లొంగిపోయి “మేము ఏ తప్పూ చేసి ఉండలేదు” అని అంటారు. దానికి దూతలు “ఎందుకు చేసి ఉండలేదు. అల్లాహ్ మీ చేష్టలను బాగా ఎరుగును. ఇక పొండి. నరకద్వారాలలో దూరిపొండి. అక్కడనే మీరు శాశ్వతంగా ఉంటారు” అని అంటారు. కనుక యధార్థం ఏమిటంటే గర్విష్టులకు లభించే నివాసం చాలా చెడ్డది. (నహ్ల్ సూరా 28, 29 సూక్తులు)
64వ అంశం: అవిశ్వాసుల ఆత్మలు వశపరచుకోగానే దూతలు వారిని కొట్టటం ప్రారంభిస్తారు.
దైవదూతలు హతులైన అవిశ్వాసులు ప్రాణాలు తీస్తున్నప్పటి స్థితిని నీవు గనక చూడగలిగితే ఎంత బాగుండేది! వారు వారి మొహాలపైని, పిరుదుల పైని కొట్టేవారు. ఇంకా ఇలా అనేవారు. ఇదో, కాల్చే శిక్షను అనుభవించండి. (అన్ఫాల్ సూరా 50వ సూక్తి)
“దైవదూతలు వారి ఆత్మలు వశపరచుకునేటప్పుడు, వారి ముఖాలపై, పిరుదులపై కొడుతూ వారిని తీసుకెళ్ళేటప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది!” (ముహమ్మద్ సూరా: 27వ సూక్తి)
65వ అంశం: నూహ్ జాతి ముంపుకు గురైన వెంటనే అగ్నిలోకి ప్రవేశింపజేయటం జరిగింది.
వారు తమ పాపాల మూలంగానే ముంచబడ్డారు. నరకాగ్నిలోకి తోసివేయబడ్డారు. ఆ తర్వాత వారు అల్లాహ్ నుండి తమను రక్షించే సహాయకుడెవణీ పొందలేకపోయారు. (నూహ్ సూరా 25వ సూక్తి)
సమాధి శిక్ష తీవ్రత
66వ అంశం : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి అంచు మీద కూర్చొని ఎంతగా విలపించారంటే ఆయన కన్నీటితో మట్టి తడిచిపోయింది.
హజ్రత్ బరా (రదియల్లాహు అన్హు) కథనం: మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఒక జనాజాలో పాల్గొన్నాం. అప్పుడు ఆయన సమాధి అంచు మీద కూర్చొని విలపించసాగారు. ఆయన కన్నీటితో క్రింద ఉన్న మట్టి కూడా తడిచిపోయింది. తర్వాత ఆయన “సోదరులారా! దీనికోసం సన్నాహాలు చేసుకోండి” అని అన్నారు. (ఇబ్నెమాజా-హసన్) (కితాబుజ్జుహద్ బాబుల్ హుజ్ని వల్బుకా (2/3383)
67వ అంశం : సమాధుల్లో ప్రజలు దజ్జాల్ ఉపద్రవంలో మాదిరిగా పరీక్షించబడతారు.
హజ్రత్ అస్మా బిన్తె అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :
“మీరు సమాధుల్లో దజ్జాల్ ఉపద్రవంలో మాదిరిగా లేక ఇంచుమించు అలాగే పరీక్షించబడతారని నాకు వహీ ద్వారా తెలియజేయబడింది.”
అనస్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: అస్మా బిన్తె అబూ బక్ర్ దజ్జాల్ ఉపద్రవం అన్నారో లేక ఇంచుమించు అలాంటిది అన్నారో నాకు గుర్తులేదు. (బుఖారీ) (అబ్వాబుల్ కుసూఫ్ బాబు సలాతున్నిసాయి మఅర్రిజాలి ఫిల్కుస్సూఫీ)
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి శిక్ష మరియు మసీహుద్దజ్జాల్ ఉపద్రవం నుంచి శరణు వేడుకునేవారు. “మీరు సమాధులో పరీక్షించబడతారు” అని అనేవారు. (నసాయి-సహీహ్) (కితాబుల్ జనాయెజ్ బాబుత్త అవ్వుజు మిన్ అజాబిల్ ఖబ్రి (2/1951))
68వ అంశం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి శిక్ష నుంచి శరణు వేడుకున్నారు.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రార్థించారు: “అల్లాహుమ్మ రబ్బ జిబ్రాయీల వ మికాయీల వ రబ్బ ఇస్రాఫీల అవూజు బిక మిన్ హర్రిన్నారి వమిన్ అజాబిల్ ఖబ్ర”. ఓ అల్లాహ్! జిబ్రయీల్, మికాయీల్, ఇస్రాఫీల్ దూతల ప్రభువా! అగ్ని వేడి నుంచి, సమాధి యాతన నుంచి నేను శరణు వేడుకుంటున్నాను. (నసాయి – సహీహ్) (కితాబుల్ ఇస్తిఆజతి బాబుల్ ఇస్తిఆజతి మిన్ హర్రిన్నారి. (3/5092))
69వ అంశం : ప్రజలు గనక సమాధి శిక్ష చూస్తే సమాధుల్లో శవాలను పూడ్చి పెట్టటం మానేస్తారు.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “మీరు శవాలను పూడ్చిపెట్టటం మానేస్తారేమోనన్న భయం గనక లేకుంటే సమాధి (శిక్షకు సంబంధించిన శబ్దాలు) మీకు కూడా వినిపించమని నేను అల్లాహ్ ను ప్రార్థించి ఉండేవాణ్ణి”. (ముస్లిం) (కితాబుల్ జన్నతి వ సిఫతు నయీమిహా బాబు అర్జిల్ మఖ అది అలల్ మయ్యితి)
70వ అంశం: ప్రజలు గనక సమాధి శిక్ష చూస్తే తక్కువగా నవ్వుతారు ఎక్కువగా ఏడుస్తారు. భార్యలతో కలవటం కూడా మర్చిపోతారు. జనవాసాలు వదలిపెట్టి అడవుల్లో ఎడారుల్లోకి పోయి ఉంటారు.
హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: మీరు చూడలేని విషయాలు నేను చూస్తున్నాను. ఆకాశం కిక్కిరిసిపోతోంది. కిక్కిరిసిపోక తప్పదు కూడాను! (ఎందుకంటే) అక్కడ నాలుగు అంగుళాల ఖాళీ స్థలమయినా లేకుండా ప్రతిచోటా దైవదూతలు తమ నుదుటితో దైవానికి సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నారు. అల్లాహ్ సాక్షి! నాకు తెలిసిన విషయాలు గనక మీకు తెలిస్తే మీరు తక్కువగా నవ్వుతారు. ఎక్కువగా ఏడుస్తారు. (అంతేకాదు) మీరు మీ భార్యల ద్వారా పొందే పడక సుఖాన్ని కూడా విడిచి పెడతారు. అల్లాహ్ ను వేడుకుంటూ (కొండల, అడవుల) మార్గాల్లో బయలుదేరుతారు.
(హదీసు ఉల్లేఖకులు) హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) “నేనొక చెట్టునై ఉండి దాన్ని కోయటం జరిగితే బాగుండు!” అని కోరుకున్నారు. (ఇబ్నెమాజా-హసన్) (కితాబుజ్జుహద్, బాబుల్ హుజ్ని వల్ బుకా (2/3378))
71వ అంశం: సమాధి కంటే ఎక్కువ కఠినమైన భయాందోళనకరమైన ప్రదేశం మరొకటి లేదు.
హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: నేను సమాధి కంటే ఎక్కువ కఠినమైన భయాందోళనకరమైన ప్రదేశం మరొకటి చూడలేదు. (తిర్మిజీ – హసన్) (అబ్వాబుజ్జుహద్, బాబు మా జాఅఫీ ఫిజాఅతిల్ ఖబ్రి…(2/1877))
ఘోరపాపాలు చేస్తే సమాధిలో శిక్ష ఖాయం
72వ అంశం : మూత్ర తుంపరలు మీద పడకుండా జాగ్రత్తపడకపోతే సమాధిలో శిక్ష పడుతుందని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హెచ్చరించారు
73వ అంశం: చాడీలు చెప్పేవారు కూడా సమాధిలో శిక్షించబడతారు.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రెండు సమాధుల దగ్గరి నుంచి వెళ్తూ “ఈ ఇరువురికీ (సమాధుల్లో) శిక్ష పడుతున్నది. అది కూడా చాలా పెద్ద విషయానికి కాదు” అని అన్నారు. తర్వాత “వీళ్ళల్లో ఒకడు చాడీలు చెప్పేవాడు. రెండోవాడు, మూత్రం విషయంలో జాగ్రత్త వహించేవాడు కాదు” అని చెప్పారు. (బుఖారీ) (కితాబుల్ జనాయెజ్. బాబు అజాబిల్ ఖబ్రి మినల్ గీబతి వల్ బౌలి)
గమనిక: “అది కూడా చాలా పెద్ద విషయానికి కాదు” అన్నమాటకు భావం ఏమిటంటే ఏదో కష్టమైన పని వల్లనో లేక చేయలేని పని వల్లనో వారికి శిక్ష పడటం లేదు. వారు చేయదలచుకుంటే ఆ పాపాలకు దూరంగా ఉండటం చాలా సులభం.
సమాధి దూతలు – ముంకిర్, నకీర్
74వ అంశం: మృతుణ్ణి సమాధిలో పూడ్చిపెట్టిన తర్వాత అతణ్ణి ప్రశ్నించటానికి అతని దగ్గరికి ఇద్దరు దూతలు వస్తారు. వారు నల్లగా ఉంటారు. వారి కళ్ళు నీలం రంగులో ఉంటాయి. వారిని ముంకిర్, నకీర్ అని పిలుస్తారు.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: మృతుణ్ణి ఖననం చేసినప్పుడు (లేక ఆయన “మీలో ఎవరి శవాన్నయినా అని అని ఉంటారు.) అతని దగ్గరికి ఇద్దరు దూతలు వస్తారు. వారు నల్లగా ఉంటారు. వారి ‘కళ్ళు నీలం రంగులో ఉంటాయి. వారిలో ఒకడ్ని “ముంకిర్” అనీ రెండోవాడ్ని “నకీర్’ అని పిలవటం జరుగుతుంది. వారిద్దరూ మృతుణ్ణి” నీకు ఆ వ్యక్తి (అంటే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ) గురించి ఏం తెలుసు?” అని అడుగుతారు. (తిర్మిజీ – హసన్) (అబ్వాబుల్ జనాయెజ్, బాబు మాజాఅ ఫీ అజాబిల్ ఖబ్రి (1/856))
75వ అంశం : ముంకిర్ నకీర్ల కళ్లు ఇత్తడి డేగిసాల్లాగా పెద్దగా పళ్లు, ఆవు కొమ్ములంత పొడవుగా గొంతు పిడుగు గర్జనలా భయంకరంగా ఉంటాయి.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం: మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఒక జనాజాలో పాల్గొన్నాం. ఖనన సంస్కారాలు జరిగి జనం ఇండ్లకు తిరిగి వెళుతున్నప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెప్పారు: ఇప్పుడు (మీరు వెనక్కి తిరిగినప్పుడు) ఇతను మీ చెప్పుల శబ్దం వింటాడు. ఇతని దగ్గరికి ముంకిర్, నకీర్ దూతలు వచ్చారు. వారి కళ్ళు ఇత్తడి డేగిసాల్లాగా ఉన్నాయి. పళ్లు ఆవు కొమ్ముల్లా ఉన్నాయి. వారి కంఠం పిడుగు గర్జనలా ఉంది. వారిద్దరూ ఇతన్ని కూర్చోబెట్టి తను ఎవరిని ఆరాధించేవాడో, తన ప్రవక్త ఎవరో
అడుగుతారు. (తబ్రానీ – హసన్) (ముహ్ యుద్దీన్ దీబ్ అత్ తర్గీబ్ వత్ తర్హీబ్ నాల్గో సంపుటి 5223వ హదీసు)
76వ అంశం: ముంకిర్ నకీర్లు తమ దంతాలతో నేలను తవ్వుకుంటూ మృతుని దగ్గరకు వస్తారు. వారి కంఠం గర్జించే మేఘాలు పిడుగు లాగుంటుంది. వారి కళ్లల్లో కళ్ళు చెదిరేటటువంటి మెరుపు ఉంటుంది.
హజ్రత్ బరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విశ్వాసి (చావు) గురించి చెబుతూ ఇలా అన్నారు: ఆ తర్వాత అతన్ని అతని స్థానం (సమాధి)లోకి పంపినప్పుడు ముంకిర్ నకీర్లు తమ దంతాలతో నేలను తవ్వుకొంటూ తమ రోమాలతో నేలను తొక్కుతూ అతని దగ్గరికి వస్తారు. ఆ అవిశ్వాసిని కూర్చోబెట్టి “ఓయ్! నీ ప్రభువు ఎవరు?’ అని అడుగుతారు.
ఆ తర్వాత అవిశ్వాసి గురించి చెబుతూ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: ముంకిర్ . నకీర్లు తమ దంతాలతో నేలను తవ్వుకుంటూ తమ పెద్ద పెద్ద పెదాలతో నేలను తొక్కుకుంటూ వస్తారు. వారి కంఠం మేఘాలు గర్జించినట్లు ఉంటుంది. వారి కళ్లల్లో కళ్లు చెదిరిపోయేటటువంటి మెరుపు ఉంటుంది. వారు అవిశ్వాసిని లేపి కూర్చోబెట్టి “ఓయ్! నీ ప్రభువు ఎవరు?” అని అడుగుతారు. (అహ్మద్, బైహఖీ-హసన్) (ముహ్ యుద్దీన్ దీబ్ అత్ తర్గీబ్ వత్ తర్హీబ్ గ్రంథం. నాల్గో సంపుటి 5221వ హదీసు)
సమాధిలో ప్రశ్నోత్తరాల వేళ మృతుని పరిస్థితి?!
77వ అంశం : సమాధిలో ఖననం చేయబడిన తర్వాత ఆత్మ తిరిగి మనిషి శరీరంలోకి పంపటం జరుగుతుంది. ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి కనుక ప్రతి మనిషికీ బుద్ధి, తెలివి కూడా ఇవ్వటం జరుగుతుంది.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి దూతల గురించి చెప్పినప్పుడు, ఉమర్ (రదియల్లాహు అన్హు) “దైవప్రవక్తా! మనకు అప్పుడు ఈ బుద్ధీ జ్ఞానాలు తిరిగి ఇవ్వబడతాయా?” అని అడిగారు. అందుకాయన “అవును ఇప్పుడు మీ కున్న బుద్దీ జ్ఞానాలు (సమాధిలోనూ) ఇవ్వబడతాయి” అని చెప్పారు. అందుకు ఉమర్ (రదియల్లాహు అన్హు) మరయితే దూత నోట్లో రాయే (అంటే నేనతని నోరు మూయిస్తాను)” అని అన్నారు. (తబ్రానీ – హసన్) (ముహ్ యుద్దీన్ దీబ్ అత్ తర్గీబ్ వత్ తర్హీబ్ నాల్గవ సంపుటి 5217వ హదీసు)
హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన అనుచరులకు సమాధిలో పరీక్షించబడటం గురించి, ముంకిర్ నకీర్ల ప్రశ్నోత్తరాల గురించి చెప్పినప్పుడు ఆయన “దైవప్రవక్తా! అప్పుడు నాకు నా బుద్దీ జ్ఞానాలు తిరిగి లభిస్తాయా?” అని అడిగారు. అందుకు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) “లభిస్తాయి” అన్నారు. అప్పుడు ఉమర్ (రదియల్లాహు అన్హు) “మరయితే ఆ ఇద్దరు (ముంకిర్, నకీర్) లకు నేనొక్కణ్ణి చాలు. దైవసాక్షి! ఆ దూతలు గనక నన్ను నీ ప్రభువు ఎవరు అని అడిగితే నేను “నా ప్రభువు అల్లాహ్ ! మరి మీ ప్రభువు ఎవరు? అని అడుగుతాను” అని అన్నారు. (బైహఖీ) (ఇమామ్ ఖుర్ తుబీగారి తజ్కిరహ్ గ్రంథం)
గమనిక: సమాధిలో ప్రశ్నోత్తరాల వేళ ఆలోచించి అర్థం చేసుకొని జవాబు చెప్పటం కోసం చనిపోయిన మనిషికి తిరిగి బుద్ధిజ్ఞానాలు ఇవ్వటం జరుగుతుంది. కాని ఏమైనప్పటికీ సమాధి జీవితం ఇహలోక జీవితం కన్నా భిన్నమైనది. కనుక ఆ స్థితి ఇహలోక స్థితిలాగానే ఉంటుందని భావించటం సరైనది కాదు. ఆ స్థితి గురించి అల్లాహ్ కు తప్ప మరెవరికీ తెలియదు.
సమాధిలో అనుగ్రహాలు – వాటి రకాలు
78వ అంశం : విశ్వాసి అయిన మనిషికి సమాధిలో ఈ క్రింద పేర్కొనబడిన పది అనుగ్రహలు లేక వాటిలో కొన్ని ప్రాప్తమవుతాయి.
1) సమాధిలో ప్రశాంతత, నిర్భయ స్థితి
2) నరకం నుండి రక్షించబడతాడనే శుభవార్త
3) స్వర్గ శుభవార్త. స్వర్గంలో అనుగ్రహాలు నిండివున్న తన మనోహర నివాసస్థల దర్శనం.
4) స్వర్గ అనుగ్రహాల ద్వారా ప్రయోజనం పొందటం కోసం స్వర్గం వైపున ఉన్న ఒక ద్వారం తెరువబడుతుంది.
5) స్వర్గ పడక, స్వర్గ వస్త్రాలు
6) సమాధిలో పున్నమి చంద్రుని వెలుగుతో పాటు సస్యశ్యామలమైన నందనవన దృశ్యం.
7) సమాధిలో ఒంటరితనం అనిపించకుండా ఉండటం కోసం సత్కార్యాలకు అందమైన మనిషి రూపమిచ్చి అతనికి తోడుగా ఉంచటం.
8) ప్రళయ దినాన విశ్వాస స్థితిలో లేస్తావనే శుభవార్త
9) ప్రళయం వరకూ ప్రశాంతంగా, సుఖంగా నిద్రపోగలగటం.
గమనిక: పైన పేర్కొనబడిన అనుగ్రహాలకు సంబంధించిన హదీసులు రాబోయే అంశాల క్రింద చూడండి.
79వ అంశం: సమాధిలో విశ్వాసి అయిన మనిషి ఎలాంటి బాధ ఆందోళన లేకుండా నిశ్చింతగా లేచి కూర్చుంటాడు.
80వ అంశం: ప్రశ్నోత్తరాల్లో కృతార్ధుడయిన తర్వాత అతనికి నరకం చూపించి దాన్నుంచి తను రక్షించబడతాడని శుభవార్త ఇవ్వటం జరుగుతుంది.
81వ అంశం: స్వర్గం వైపు రంధ్రం చేసి అతనికి స్వర్గ అనుగ్రహాల దర్శనం చేయించటం జరుగుతుంది. తన భవనం కూడా చూపించటం జరుగుతుంది.
82వ అంశం: విశ్వాసికి తను ప్రళయదినాన విశ్వాస స్థితిలో లేస్తావనే శుభవార్త ఇవ్వబడుతుంది.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: ఒక యూద మహిళ నా ఇంటికి వచ్చి అన్నం పెట్టమని అడుగుతూ “అల్లాహ్ నిన్ను దజ్జాల్ ఉపద్రవం నుంచి, సమాధి ఉపద్రవం నుంచి కాపాడుతాడు. నాక్కాస్త అన్నం తినిపించు తల్లీ!” అని అంది. నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చేంతవరకు ఆమెను ఆపి ఉంచాను. ఆయన వచ్చిన తర్వాత నేను “దైవప్రవక్తా! ఈ యూద మహిళ అంటున్నది ఏమిటి?” అని అడిగాను. “సమాధి ఉపద్రవం నుంచి కాపాడుగాక” అని దీవిస్తోంది” అని చెప్పాను.
ఆ మాట వినగానే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) లేచి నిలబడ్డారు. చేతులు చాపి దజ్జాల్ ఉపద్రవం నుంచి, సమాధి ఉపద్రవం నుంచి శరణు వేడుకోసాగారు. ఆ తర్వాత ఇలా చెప్పారు: ఏ దైవప్రవక్తా తన అనుచర సమాజాన్ని దజ్జాల్ ఉపద్రవం గురించి హెచ్చరించకుండా ఉండలేదు. అయితే నేను మీకు దజ్జాల్ గురించి మునుపు ఏ దైవప్రవక్తా తన అనుచర సమాజానికి చెప్పని విషయం చెబుతాను. అదేమిటంటే, దజ్జాల్ ఒంటికన్నువాడై ఉంటాడు (అతనికి ఒక కన్ను మాత్రమే ఉంటుంది). అతని కళ్లు ఉండేచోటుకి మధ్య ‘కాఫిర్’ అని రాసి ఉంటుంది. దాన్ని ప్రతి విశ్వాసి చదవగల్గుతాడు.
ఇకపోతే సమాధి ఉపద్రవానికి సంబంధించిన విషయం: మీరు సమాధుల్లో పరీక్షించబడతారు. ప్రశ్నించబడతారు. మృతుడు మంచివాడయితే సమాధిలో ఎలాంటి ఆందోళన, బాధ లేకుండా అతన్ని కూర్చోబెట్టి “ఇస్లాం గురించి నువ్వు ఏమంటావు?” అని అడగటం జరుగుతుంది. దానికి ఆ మంచి మనిషి “నా ప్రభువు అల్లాహ్” అని చెబుతాడు. తర్వాత అతన్ని “మీ దగ్గరికి వచ్చిన ఆయన ఎవరు?” అని అడగటం జరుగుతుంది. దానికి మంచి మనిషి “ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ స్పష్టమైన నిదర్శనాలు తీసుకొని వచ్చారు. మేము ఆయన్ని ధృవీకరించాం” అని చెబుతాడు. అప్పుడు నరకం వైపు ఒక రంధ్రం చేయబడుతుంది. విశ్వాసి అయిన మనిషి నరకాగ్ని చూస్తాడు. అందులోని ఒక భాగం రెండో భాగాన్ని నాశనం చేస్తూ (కాల్చుతూ) ఉన్నంత తీవ్రంగా ఉంటుంది. ఆ తర్వాత అతని కోసం స్వర్గం వైపు కూడా ఒక రంధ్రం చేయబడుతుంది. విశ్వాసి అయిన మనిషి స్వర్గ రమణీయతను, స్వర్గ వసంతాన్ని తిలకిస్తాడు. అతనితో “స్వర్గంలో ఇది నీ నివాసస్థలం” అని చెప్పటం జరుగుతుంది. తర్వాత దూతలు “నువ్వు విశ్వాసం మీద జీవితం గడిపావు. విశ్వాసం మీదే మరణించావు. (ప్రళయదినాన దైవం తలిస్తే విశ్వాసం మీదే నువ్వు లేస్తావు” అని అంటారు. (అహ్మద్ – సహీహ్) (అత్తరీబ్ వత్తరోబ్ నాల్గో సంపుటి 5220వ హదీసు)
83వ అంశం: విశ్వాసికి నరకంలోని అతని ఇల్లు చూపించి “అల్లాహ్ నిన్ను ఈ ఇంటి నుంచి రక్షించాడు” అని చెప్పటం జరుగుతుంది. ఆ తర్వాత స్వర్గంలోని అతని ఇల్లు చూపించి “అల్లాహ్ నీకు ఈ ఇల్లు ప్రసాదించాడు” అని చెప్పటం జరుగుతుంది.
84వ అంశం: విశ్వాసి తనకు మంచి పర్యవసానం దొరికిందన్న సంగతి తన ఇంటివారికి తెలియజేయాలనుకుంటాడు. కాని అందుకు అనుమతి లభించదు.
హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: విశ్వాసి అయిన మనిషిని సమాధిలో ఖననం చేసినప్పుడు అతని దగ్గరికి ఒక దూత వచ్చి అతన్ని “నువ్వు ఎవరిని ఆరాధించేవాడివి?” అని అడుగుతాడు. అల్లాహ్ అతనికి సద్బుద్ధిని ప్రసాదిస్తే నేను అల్లాహ్ ను ఆరాధించేవాణ్ణి” అని చెబుతాడతను. తర్వాత దూత అతన్ని “ఆయన (ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ) గురించి నువ్వు ఏమంటావ్?” అని అడుగుతాడు. విశ్వాసి అయిన మనిషి “ఆయన అల్లాహ్ దాసుడు. దైవప్రవక్త” అని జవాబు చెబుతాడు. ఆ తర్వాత అతన్ని ఇంకేమీ అడగటం జరగదు. అతనికి నరకంలో ఒక ఇల్లును చూపెట్టి “ఈ ఇల్లు నీకోసమే తయారు చేయబడింది. కాని అల్లాహ్ నిన్ను దీన్నుంచి రక్షించాడు. దీనికి బదులు నీకు స్వర్గంలో ఒక ఇల్లు ప్రసాదించాడు” అని చెప్పటం జరుగుతుంది. విశ్వాసి అయిన మనిషి అది చూసి “నన్ను కాస్త వదలుతారా? మా ఇంటివారికి ఈ శుభవార్త (అల్లాహ్ నాకు స్వర్గంలో ఇల్లు ప్రసాదించాడన్న విషయం) తెలియజేసివస్తాను” అని అంటాడు. కాని అతనితో “ఇప్పుడు ఇక్కడే ఉండు” అని అనబడుతుంది (అబూదావూద్ – సహీహ్) [కితాబుస్సున్నహ్ బాబున్ ఫిల్ యజ్ఞలతి ఫిల్ ఖబ్ వ అజాబిల్ ఖబ్రి (3/3977)]
గమనికలు : 1) ఇతర హదీసుల్లో సమాధిలోకి ఇద్దరు దూతలు వస్తారని చెప్పబడగా ఈ హదీసులో మాత్రం ఒకే దూత వస్తాడని చెప్పబడింది. దీని భావం ఏమిటంటే కొందరి దగ్గరికి ఇద్దరు దూతలు వస్తారు. మరికొందరి దగ్గరికి ఒక దూత మాత్రమే వస్తాడు. 2) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించి ఉన్నారు: ప్రతి మనిషికి రెండు స్థానాలుంటాయి. ఒకటి స్వర్గంలో, రెండోది నరకంలో. ఎవరైనా మరణించిన తర్వాత నరకంలోకి వెళ్ళిపోతే స్వర్గవాసులు అతని స్థానానికి వారసులవుతారు. 3) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి అడిగే ప్రశ్నవాక్యాలు అనేక హదీసుల్లో అనేక రకాలుగా ఉన్నాయి. కొన్ని పదాల ద్వారా సమాధిలో దైవప్రవక్త ముఖారవిందం చూపించి ప్రశ్నలు అడుగుతారేమో అనిపిస్తుంది. కాని నిజానికి అలా జరగదు. పరోక్షంగా ఉన్న వ్యక్తిని గురించి ఎవరైనా “ఆ వ్యక్తి ఎవరు?” అని అడుగుతారే అలాగే ఉంటుంది ఆ ప్రశ్నల తీరు.
85వ అంశం : నమాజ్ చేసే వ్యక్తికి సమాధిలో కొంచెమైనా భయాందోళనలు కలగవు.
86వ అంశం : విశ్వాసి అయిన మనిషి ప్రశ్నోత్తరాల్లో కృతార్ధుడైన తర్వాత అతనికి స్వర్గంలోని ఇతర అనుగ్రహాలతోపాటు అతని నివాస స్థల దర్శనం కూడా చేయించటం జరుగుతుంది.
87వ అంశం విశ్వాసుల్లో కొందరి సమాధులు డెబ్భైగజాల (35 మీటర్ల) వరకు విశాలమవుతాయి.
88వ అంశం: విశ్వాసుల సమాధుల్లో వెలుతురు నింపబడుతుంది.
89వ అంశం: విశ్వాసులకు అనుగ్రహాలు, శుభవార్తలన్నీ ఇచ్చిన తర్వాత వారిని ప్రశాంతమైన సుఖదాయకమైన నిద్రలోకి పంపటం జరుగుతుంది.
90వ అంశం : విశ్వాసుల్లో కొందరి ఆత్మలు పక్షుల రూపంలో స్వర్గ వృక్షాలపైన కిలకిలారావాలు చేస్తూ తిరుగుతుంటాయి.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు:, మృతుడు సమాధిలో ఖననం చేయబడిన తర్వాత లోకంలో తను వదలివచ్చినవారు (తనను సమాధిలో పూడ్చిపెట్టి తమ ఇండ్లకు తిరిగి వెళ్తున్నప్పుడు) వారి చెప్పుల శబ్దం వింటాడు. (సమాధిలో) అతనితో “లేచి కూర్చో” అని ఆదేశించటం జరుగుతుంది. అతను కూర్చుంటాడు. అతను విశ్వాసి అయితే అతనికి ఆ సమయం సూర్యుడు అస్తమించబోతున్నట్లు కనిపిస్తుంది. అతన్ని “చాలా ముందు మీ దగ్గరికి పంపబడిన ఆయన గురించి నువ్వు ఏమనేవాడివి? ఆయన గురించి నువ్వు ఏం సాక్ష్యం చెబుతావు?” అని అడగటం జరుగుతుంది. దానికి విశ్వాసి అయిన మనిషి “మీరు కాస్త కూర్చొండి. ముందు నన్ను అస్ర్ నమాజ్ చేసుకోనివ్వండి. (సూర్యాస్తమయం కాబోతోంది)” అని అంటాడు. దానికి దూతలు “నువ్వు ప్రపంచంలో నమాజ్ చేస్తూనే ఉండేవాడివి. ఇప్పుడు మేము అడిగిన దానికి సమాధానం చెప్పు. చాలా ముందు మీ దగ్గరికి పంపబడ్డారే ఆయన గురించి నువ్వు ఏమనేవాడివి. ఆయన గురించి నువ్వు ఏం సాక్ష్యం చెబుతావు” అని అడుగుతారు. ఆ మాటకు విశ్వాసి అయన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం). ఆయన దైవప్రవక్త అనీ, అల్లాహ్ తరపు నుంచి సత్యం తీసుకువచ్చారని నేను సాక్ష్యం చెబుతాను అని అంటాడు. అప్పుడు అతనితో “ఈ విశ్వాసం మీదనే నువ్వు జీవితం గడిపావు దానిమీదే మరణించావు. అల్లాహ్ తలిస్తే ఆ విశ్వాసం మీదనే లేస్తావు” అని చెప్పబడుతుంది. ఆ తర్వాత స్వర్గద్వారాల్లోని ఒక ద్వారం తెరిచి అతనితో స్వర్గంలో ఇది నీ ఇల్లు. స్వర్గంలో అల్లాహ్ నీకోసం ఏమైతే సిద్ధం చేసి ఉంచాడో (వాటిని కూడా చూసుకో)’ అని అనబడుతుంది. అవన్నీ చూడగానే అతని కోరిక ఆసక్తి పెరుగుతాయి. తర్వాత అతని సమాధి డెబ్బె గజాలు (అంటే 105 ఫిట్లు లేక 35 మీటర్లు) విశాలమవుతుంది. ఆ తర్వాత అందులో వెలుతురు నింపబడుతుంది. అతని శరీరం మొదటి స్థితిలోకి పంపించబడుతుంది. (అంటే దాన్ని నిద్రపుచ్చటం జరుగుతుంది). అతని ఆత్మ పక్షిరూపంలో స్వర్గవృక్షాల మీద ఎగురుతూ తిరుగుతూ ఉంటుంది. (సమాధిలో విశ్వాసికి కలిగే మంచి పర్యవసానం) ఈ దైవసూక్తికి వ్యాఖ్యానం: “అల్లాహ్ ఒక స్థిరమైన వాక్కు ఆధారంగా ఇహలోక జీవితంలోనూ, పరలోక జీవితం (సమాధి)లోనూ విశ్వాసులకు నిలకడను ప్రసాదిస్తాడు.’ (తబ్రానీ, ఇబ్నె హిబ్బాన్, హాకిమ్ హసన్) (ముహ్ యుద్దీన్ దీబ్ అత్తర్గీబ్ వ త్తరహీబ్ గ్రంథం నాల్గోసంపుటి 5225వ హదీసు)
91వ అంశం : విశ్వాసి ప్రశ్నోత్తరాల్లో కృతార్థుడైన తర్వాత సమాధిలో అతని కోసం స్వర్గం నుంచి పడక తెప్పించి పరవటం జరుగుతుంది. ఆ తర్వాత స్వర్గ వస్త్రాలు తొడిగించటం జరుగుతుంది.
92వ అంశం : విశ్వాసి సమాధిలో స్వర్గ అనుగ్రహాల ద్వారా ప్రయోజనం పొందటం కోసం స్వర్గం వైపు ఉండే ఒక ద్వారం తెరువబడుతుంది.
93వ అంశం : విశ్వాసుల్లో కొందరి సమాధులు కనుచూపుమేరకు విశాలమవుతాయి.
94వ అంశం : విశ్వాసి సమాధిలోకి అతని సత్కర్మలు అత్యంత అందమైన మనిషి రూపంలో వస్తాయి. వాటిని చూసి విశ్వాసి ఆనందం, సంతోషాలు మరింత పెరుగుతాయి.
95వ అంశం : విశ్వాసి తన మంచి పర్యవసానం చూసి ఎంతగా సంతోషిస్తాడంటే ప్రళయం త్వరగా సంభవించాలని ప్రార్థించటం మొదలు పెడతాడు.
96వ అంశం : విశ్వాసి తనకు మంచి పర్యవసానం లభించిన ఆనందంలో వీలైనంత త్వరగా తన ఇంటివారిని కలుసుకోవాలని కోరుకుంటాడు
హజ్రత్ బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: విశ్వాసి అయిన దాసుని సమాధిలోకి ఇద్దరు దూతలు వస్తారు. వారు అతన్ని లేపి కూర్చోబెట్టి “నీ ప్రభువు ఎవరు?” అని అడుగుతారు. “నా ప్రభువు అల్లాహ్” అని సమాధానమిస్తాడు విశ్వాసి. దూతలు “నీ ధర్మం ఏది?” అని అడుగుతారు. దానికి అతను “నా ధర్మం ఇస్లాం” అని చెబుతాడు. తర్వాత దూతలు “మీ దగ్గరికి పంపబడిన వ్యక్తి ఎవరు?” అని అడుగుతారు. దానికి విశ్వాసి “ఆయన దైవప్రవక్త” అని బదులు చెబుతాడు. దైవదూతలు మళ్లీ “నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలిశాయి?” అని అడుగుతారు. దానికి విశ్వాసి “నేను దైవగ్రంథం చదివాను. దాన్ని విశ్వసించాను, అది నిజమని ధృవీకరించాను” అని చెబుతాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దం వస్తుంది,’ “నా దాసుడు నిజం చెప్పాడు. అతని కోసం స్వర్గం నుంచి పడక తీసుకురండి, స్వర్గం నుంచి వస్త్రాలు తీసుకురండి. స్వర్గం వైపున ఉన్న ఒక ద్వారం తెరవండి” అటునుంచి ఇతనికి స్వర్గ వీచికలు, పరిమళాలు అందుతూ ఉంటాయి. అతని సమాధి కనుచూపు మేరకు విశాలమవుతుంది”.
దైవప్రవక్త ఇంకా ఇలా చెప్పారు: ఆ తర్వాత అతని దగ్గరికి ఓ అందమైన వ్యక్తి అందమైన వస్త్రాలు ధరించి మంచి సువాసనలు పూసుకొని వస్తాడు. వచ్చి “నీకు ప్రశాంతత, సుఖాల శుభవార్త! నీకు వాగ్దానం చేయబడిన రోజు ఇదే” అని అంటాడు. విశ్వాసి అతన్ని చూసి “నీ ముఖం ఎంత అందంగా ఉంది! నువ్వు శుభశ్రేయాలు తీసుకొని వచ్చావు. అసలు ఎవరు నువ్వు?” అని అడుగుతాడు. దానికతను “నేను నీ ఆచరణను” అని అంటాడు. అప్పుడు విశ్వాసి అల్లాహ్ ను ఇలా ప్రార్థిస్తాడు: “ప్రభూ! ప్రళయాన్ని నెలకొల్పు. నా ప్రభూ! ప్రళయాన్ని త్వరగా నెలకొల్పు. నేను నా ఇంటి వారిని కలవాలి.” (అహ్మద్, అబూదావూద్-హసన్) (ముహ్ యుద్దీన్ దీబ్రి అత్తరీబ్ వత్తరోబ్ గ్రంథం నాల్గో సంపుటి 5221వ హదీసు)
గమనిక:- ఇతర హదీసుల్లో సమాధి డెబ్భై డెబ్భైల గజాలు (అంటే 35 × 35 మీటర్లు) విశాల మవుతుందని చెప్పబడగా ఈ హదీసులో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కనుచూపు మేరకు విశాలమవుతుందని చెప్పినట్లు ఉంది. ఒక హదీసు లోనయితే కేవలం డెబ్భై గజాలు, వేరొక హదీసులో నలభై నలభైల గజాలు (అనగా 20 × 20 మీటర్లు) విశాలమవుతుందని ఉంది. ఈ భేదం విశ్వాసులు ఈమాన్ మరియు వారి కర్మల హెచ్చుతగ్గులను బట్టి ఉంటుంది. వల్లాహు ఆలము బిస్సవాబ్!
97వ అంశం : విశ్వాసుల్లో కొందరి సమాధులు డెబ్భై డెబ్భైల గజాలు విశాలమవుతాయి.
98వ అంశం : విశ్వాసుల సమాధుల్లో వెలుగు నింపటం జరుగుతుంది.
99వ అంశం : విశ్వాసి తనకు మంచి పర్యవసానం దొరికిందన్న సంగతి తన ఇంటివారికి తెలియజేయాలనుకుంటాడు. కాని అందుకు అనుమతి లభించదు.
100వ అంశం: విశ్వాసికి ప్రళయం వరకూ ప్రశాంతంగా, సుఖంగా నిద్రపొమ్మని చాలా గౌరవంగా మర్యాదగా చెప్పబడుతుంది. ఆ తర్వాత అతను ప్రళయదినానే నిద్రలేస్తాడు.
101వ అంశం: పశ్నోత్తరాల్లో విఫలుడయ్యే కపట విశ్వాసిని సమాధి ఒత్తుతుంది.
102వ అంశం : కపట విశ్వాసి ప్రళయం వరకు ఎడతెగకుండా అదే శిక్ష అనుభవిస్తూ ఉంటాడు.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: మృతుణ్ణి ఖననం చేసినప్పుడు (లేక ఆయన “మీలో ఎవరి శవాన్నయినా ఖననం చేసినప్పుడు) అతని దగ్గరికి ఇద్దరు దూతలు వస్తారు. వారు నల్లగా ఉంటారు. వారి కళ్లు నీలం రంగులో ఉంటాయి. వారిలో ఒకడ్ని “ముంకిర్” అని, రెండోవాడ్ని “నకీర్’ అని పిలవటం జరుగుతుంది. వారిద్దరూ మృతుణ్ణి “నీకు ఆ వ్యక్తి (అంటే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ) గురించి ఏం తెలుసు?” అని అడుగుతారు. దానికి విశ్వాసి తాను ప్రపంచంలో (ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి ఏం చెబుతూ వచ్చాడో అదే, అనగా ఆయన అల్లాహ్ దాసుడని, దైవప్రవక్త అని చెబుతాడు. “అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ దాసుడు, దైవప్రవక్త అని నేను సాక్ష్యం చెబుతున్నాను” అంటాడు. దానికి ఆ దూతలు “మాకు తెలుసు. నువ్వు ఇదే సమాధానం చెబుతావని” అంటారు. ఆ తర్వాత అతని సమాధి డెబ్బై డెబ్బైల గజాలు (అనగా 35×35 మీటర్లు) విశాలం చేయబడుతుంది. దానిలో వెలుగు నింపబడుతుంది. ఆ తర్వాత అతనితో “పడుకో” అని అంటే దానికతను “నేను మా ఇంటివారి దగ్గరికి తిరిగివెళ్ళి వారికి (ఈ మంచి పర్యవసానం గురించి తెలియజేయాలనుకుంటున్నాను” అని అంటాడు. దానికి దూతలు “(వీలు పడదు. ఇప్పుడు) నువ్వు నూతన వధువులా పడుకో” అని అంటారు. నూతన వధువుని ఆమె ఇంటివారిలో ఆమెకు అత్యంత ప్రియుడు (అంటే భర్త) తప్ప మరెవరూ లేపరు (విశ్వాసి అలాగే పడుకుంటాడు) చివరికి (ప్రళయదినాన) అల్లాహ్ అతన్ని నిద్రనుండి మేల్కొలుపుతాడు.
మరణించిన వ్యక్తి గనక కపట విశ్వాసి అయితే (దూతలు అడిగిన ప్రశ్నకు) అతను “ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి జనం ఏదో అంటుంటే విని నేను కూడా అదే అన్నాను. అంతకు మించి నాకేమీ తెలియదు” అని అంటాడు. అందుకు దూతలు “మాకు తెలుసు. నువ్వు ఇదే సమాధానం చెబుతావని” అంటారు. ఆ తర్వాత (అల్లాహ్ తరపు నుంచి) భూమికి “ఇతన్ని ఒత్తెయ్యి” అని ఆజ్ఞ అవుతుంది. భూమి అతణ్ణి ఒత్తేస్తుంది. దాంతో అతని శరీరంలోని ఒకవైపు ప్రక్కటెముకలు మరోవైపు పక్కటెముకల్లోకి చొచ్చుకుపోతాయి. ఆ తర్వాత అల్లాహ్ అతన్ని సమాధి నుంచి లేపి నిలబెట్టేవరకు అతను అదే శిక్షలో పడి ఉంటాడు. (తిర్మిజీ – హసన్) (అబ్వాబుల్ జనాయెజ్ బాబు అజాబిల్ ఖబ్రరి (1/856))
103వ అంశం: విశ్వాసి అయిన మనిషికి సమాధిలో ఎలాంటి ఆందోళనగాని, కష్టంగాని ఉండదు.
104వ అంశం: సమాధిలో విశ్వాసికి తను నరకం నుండి రక్షించబడ్డాడనీ, తనకు స్వర్గం లభిస్తుందని శుభవార్త అందజేయటం జరుగుతుంది.
105వ అంశం : అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను విశ్వసిస్తూ జీవితం గడిపిన వారికి ప్రళయ దినాన వారు అదే విశ్వాసస్థితిలో లేపబడతారనే శుభవార్త అందజేయటం జరుగుతుంది.
106వ అంశం : పాపాత్ముడికి సమాధిలో విపరీతమైన భయాందోళనలు కలుగుతాయి.
107వ అంశం: పశ్నోత్తరాల్లో విఫలుడయ్యే పాపాత్ముడికి నరకంలోని అతని స్థానం చూపెట్టబడుతుంది.
108వ అంశం : పాపాత్ముడికి “నువ్వు ఏ సందేహం మీదనయితే జీవితం గడిపావో ఆ సందేహస్థితిలోనే లేపబడతావు” అని ‘శుభవార్త’ అందజేయటం జరుగుతుంది.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: మృతుడు సమాధిలో ఖననం చేయబడిన తర్వాత అతను మంచి మనిషి అయితే ఎలాంటి భయంగాని, ఆందోళనగాని లేకుండా లేచికూర్చుంటాడు. అతన్ని “నువ్వు ఏ ధర్మంపై (జీవితం) గడిపావు?” అని అడిగితే “నేను ఇస్లాంపై (జీవితం గడిపాను” అని చెబుతాడు. తర్వాత అతన్ని “(మీ దగ్గరికి పంపబడిన) ఆ మనిషి ఎవరు” అని అడిగితే అందుకతను “ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ ప్రవక్త. ఆయన అల్లాహ్ తరఫు నుంచి మా దగ్గరికి మహిమలు తీసుకొని వచ్చారు. మేము అవి నిజమని ధృవీకరించాం” అని బదులిస్తాడు. ఆ తర్వాత అతన్ని “నువ్వు అల్లాహ్ ను చూశావా?” అని అడిగితే అందుకతను “(ప్రపంచంలో) అల్లాహ్ ను చూడటం ఎవరికీ సాధ్యం కాదు” అని అంటాడు. ఆ తర్వాత అతని కోసం అగ్నివైపు ఒక రంధ్రం తెరువబడుతుంది. అక్కడ అతను అగ్నిలోని ఒక భాగం మరోభాగాన్ని ఎలా తింటుందో చూస్తాడు. అతనితో “చూడు. అల్లాహ్ నిన్ను రక్షించింది ఈ అగ్ని నుంచే” అని చెప్పటం జరుగుతుంది. ఆ తర్వాత స్వర్గం వైపున ఒక ద్వారం తెరువబడుతుంది. విశ్వాసి స్వర్గవసంతాలు, అక్కడి అనుగ్రహాలు తిలకిస్తాడు. అతనితో “ఇది నీ నివాస స్థలం కాబోతోంది. నువ్వు విశ్వాసం విూద జీవితం గడిపావు. దాని మీదే మరణించావు. తిరిగి దైవంతలిస్తే అదే విశ్వాస స్థితిలో లేపబడతావు” అని చెప్పటం జరుగుతుంది.
పాపాత్ముణ్ణి సమాధిలో కూర్చోబెట్టినప్పుడు అతను విపరీతమైన భయాందోళనకు లోనవుతాడు. అతన్ని “నువ్వు ఏ ధర్మం ప్రకారం జీవితం గడిపావు?” అని అడిగితే, “నాకేం తెలీదు” అని అంటాడు. “మీ (దగ్గరకు పంపబడిన) ఆ మనిషి ఎవరు?” అని అడిగితే, దానికతను “నేను జనం ఏది చెబుతుండగా విన్నానో అదే చెప్పాను” అని అంటాడు. అప్పుడు స్వర్గంవైపు ఒక ద్వారం తెరువబడుతుంది. అతను స్వర్గవసంతాలను, అక్కడ ఉన్న ఇతర అనుగ్రహాలను తిలకిస్తాడు. అప్పుడు అతనితో “అల్లాహ్ నీకు లభించకుండా చెసింది ఈ స్వర్గాన్నే” అని చెప్పబడుతుంది. ఆ తర్వాత అతని కోసం ఒక నరక ద్వారం తెరువబడుతుంది. అతను అక్కడ అగ్నిలోని ఒక భాగం ఏ విధంగా మరోభాగాన్ని తింటూ ఉంటుందో చూస్తాడు. అతనితో ఇలా చెప్పబడుతుంది: “ఇదీ నీ స్థానం. నువ్వు (అల్లాహ్ గురించి మరియు దైవప్రవక్త గురించి) సందేహంలో పడి ఉన్నావు ఆ సందేహస్థితిలోనే మరణించావు. దైవం తలిస్తే తిరిగి ఆ సందేహస్థితిలోనే లేస్తావు.” (ఇబ్నెమాజా-సహీహ్) [కితాబుజ్జుహద్ బాబు జిక్రిల్ ఖబ్ వల్ బలా (2/3443)]
109వ అంశం : విశ్వాసి సమాధి సస్యశ్యామలమైన వనం అవుతుంది. అందులో నిండు పౌర్ణమిలాంటి అద్భుతమైన వెలుతురు ఉంటుంది.
గమనిక :- 53వ అంశం క్రింది హదీసు చూడండి.
సమాధిలో శిక్షలు – వాటి రకాలు
110వ అంశం : అవిశ్వాసి, కపటి మరియు పాపాత్ముడైన మనిషికి సమాధిలో ఈ క్రింద పేర్కొనబడిన పదిరకాల శిక్షలు లేక వాటిలో కొన్ని విధించబడతాయి.
1) సమాధిలో తీవ్రమైన భయాందోళనల శిక్ష
2) స్వర్గం కోల్పోయిన దుఃఖ శిక్ష
3) నరకపు విషపూరితమైన వేడి గాలి శిక్ష
4) నరకంలోని భయంకరమైన స్థాన దర్శన శిక్ష
5) అగ్ని పడక శిక్ష
6) అగ్ని వస్త్రాల శిక్ష
7) సమాధి గోడల మధ్య నలగటం
8) ఇనుప గదలతో కొట్టబడే శిక్ష
9) పాములు, తేళ్లు కుట్టే శిక్ష
10) దుష్కర్మలు అత్యంత వికృత మనిషి రూపంలో వచ్చి భయపెట్టే శిక్ష.
గమనిక :- పైన పేర్కొనబడిన అన్నిరకాల శిక్షలకు సంబంధించిన హదీసులు రాబోయే అంశాల క్రింద చూడండి.
111వ అంశం: పాపాత్ముడైన మనిషి సమాధిలో తీవ్ర భయాందోళనా స్థితిలో లేచి కూర్చుంటాడు.
112వ అంశం: ప్రశ్నోత్తరాల్లో విఫలుడైన పాపాత్ముడికి ముందు స్వర్గ దర్శనం చేయించి “అల్లాహ్ నీకు అందకుండా చేసింది ఈ స్వర్గమే” అని చెప్పటం జరుగుతుంది.
113వ అంశం: స్వర్గదర్శనం తర్వాత పాపాత్ముడికి నరకంలోని అతని నివాసస్థలం చూపెట్టబడుతుంది.
114వ అంశం: పాపాత్ముడు ఇస్లాం గురించి ఏ సందేహంతోనయితే జీవితం గడిపాడో ప్రళయదినాన అతన్ని అదే సందేహస్థితిలో లేపబడే “శుభవార్త” అతనికి తెలియజేయబడుతుంది.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: పాపాత్ముణ్ణి సమాధిలో లేపి కూర్చోబెట్టినప్పుడు అతను విపరీతమైన భయాందోళనలకు లోనై ఉంటాడు. అతన్ని “నువ్వు (ప్రపంచంలో అల్లాహ్ మరియు దైవప్రవక్త గురించి) ఏమనేవాడివి?” అని అడిగితే, అందుకతను “జనం ఏది చెబుతుండగా విన్నానో నేనూ అదే చెబుతూ ఉన్నాను” అని అంటాడు. అప్పుడు అతని కోసం స్వర్గం వైపు ఒక రంధ్రం చేయబడుతుంది. అతను స్వర్గ రమణీయతను, అందులోని ఇతర అనుగ్రహాలను చూస్తాడు. అతనితో “చూడు, అల్లాహ్ నీకు దొరక్కుండా చేసింది ఈ స్వర్గాన్నే” అని చెప్పబడుతుంది. తర్వాత అతనికోసం నరకంవైపు ఒక రంధ్రం చేయబడుతుంది. అక్కడ అతను నరకాగ్నిలోని ఒక భాగం మరో భాగాన్ని తింటుండటం చూస్తాడు. అతనితో “ఇది నీ నివాసస్థలం. నువ్వు సందేహంలో జీవితం గడిపావు. సందేహంతోనే మరణించావు. అల్లాహ్ తలిస్తే తిరిగి ఆ సందేహంతోనే లేస్తావు” అని చెప్పబడుతుంది. ఆ తర్వాత అతన్ని శిక్షకు గురిచేయటం జరుగుతుంది. (అహ్మద్ – సహీహ్) [ముహ్ యుద్దీన్ దీబ్ అత్ తర్గీబ్ వత్ తర్హీబ్ గ్రంథం నాల్గో సంపుటి 5220వ హదీసు]
115వ అంశం : ముంకిర్ నకీర్ దూతలు అవిశ్వాసుల్ని చాలా కరకుగా గద్దించే ధోరణిలో ప్రశ్నిస్తారు.
116వ అంశం : ప్రశ్నోత్తరాల్లో విఫలుడయ్యే అవిశ్వాసిని, కపటిని దూతలు ఇనుపగదలతో రెండు చెవుల మధ్య కొడతారు. దాంతో అతను చాలా భయంకరంగా అరవటం, కేకలు వేయటం ప్రారంభిస్తాడు. ఆ శబ్దాన్ని జిన్నాతులు, మానవులు తప్ప మిగతా సృష్టిరాశులన్నీ వింటాయి.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బనూ నజ్జార్ తెగవారి తోటలోకి వెళ్ళారు. అక్కడ ఆయనకు ఏదో శబ్దం వినిపించింది. అది విని ఆయన కంగారుగా “ఈ సమాధులు ఎవరివి?” అని అడిగారు. అనుచరులు “ఇవి అజ్ఞాన కాలంలో చనిపోయినవారి సమాధులు” అని చెప్పారు. అందుకాయన “అగ్ని శిక్ష నుండి, దజ్జాల్ ఉపద్రవం నుంచి అల్లాహ్ శరణు వేడుకోండి” అని బోధించారు. అనుచరులు “దైవ ప్రవక్తా! ఎందుకని (చెబుతున్నారు ఈ మాట)?” అని అడిగారు.
అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వివరించారు: ఖననం చేయబడే మృతుడు అవిశ్వాసి (లేక కపటి) అయినట్లయితే అతని దగ్గరికి ఒక దూత వచ్చి బాగా గద్దిస్తూ “నువ్వు ఎవరిని ఆరాధించేవాడివి?” అని అడుగుతాడు. దానికి అవిశ్వాసి (లేక కపటి)” నాకేం తెలీదు” అని అంటాడు. అందుకు సమాధానంగా దూత “నువ్వు నీ బుద్ధితోనూ ఆలోచించలేదు. (ఖుర్ఆనూ) చదవలేదు” అని మందలిస్తాడు. ఆ తర్వాత “ఆయన (అంటే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి నువ్వు ఏమనేవాడివి?” అని అడుగుతాడు. దానికి అవిశ్వాసి (లేక కపటి) ‘ఇతరులు ఏం చెబుతుండేవారో నేనూ అదే చెబుతుండేవాణ్ణి’ అని అంటాడు. ఆ సమాధానం వినగానే దూత అతని రెండు చెవుల మద్య (అంటే మెదడుమీద) ఇనుప గదలతో కొట్టటం మొదలు పెడతాడు. దాంతో అతను చాలా భయంకరంగా అరుస్తాడు. కేకలు పెడతాడు. అతని శబ్దం జిన్నాతులు, మానవులు తప్ప మిగతా సృష్టిరాశులన్నీ వింటాయి. (అబూదావూద్ సహీహ్)[కితాబుస్సున్నహ్ బాబుల్ మస్ అలతి ఫిల్ ఖబ్రరి వ అజాబిల్ ఖబ్రరి 3/3977]
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: దాసుడు సమాధిలో ఖననం చేయబడిన తర్వాత అతని బంధుమిత్రులు ఇండ్లకు తిరిగి వెళుతున్నప్పుడు అతను వారి చెప్పుల శబ్దం వింటాడు. అతని దగ్గరికి ఇద్దరు దూతలు వచ్చి అతన్ని కూర్చోబెట్టి “నువ్వు ఆయన (అంటే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి ఏమనేవాడివి?” అని అడుగుతారు. దానికి దాసుడు ‘ఆయన అల్లాహ్ దాసుడు మరియు దైవ ప్రవక్త అని నేను సాక్ష్యం చెబుతున్నాను” అని అంటాడు. తర్వాత అతనితో “చూడు, నరకంలో ఈ స్థలం నీది. కాని అల్లాహ్ నీకు దీనికి బదులు స్వర్గంలో స్థానం ప్రసాదించాడు” అని చెప్పబడుతుంది. ఆ విధంగా అతను తన రెండు స్థానాలూ చూసుకుంటాడు.
అదే అవిశ్వాసో లేక కపటో అయినట్లయితే (ముంకిర్ నకీర్ ప్రశ్నలకు సమాధానంగా) అతను “(ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ) ఎవరో నాకు తెలీదు. జనం ఏది చెబుతుండేవారో నేనూ అదే చెబుతుండేవాణ్ణి” అని అంటాడు. అప్పుడు అతన్ని “నువ్వు బుద్ధితో ఆలోచించలేదు (ఖుర్ఆనూ) చదవలేదు” అని మందలించి అతని రెండు చెవుల మధ్య ఇనుప సుత్తెలతో కొట్టటం జరిగింది. దాంతో అతను చాలా భయంకరంగా అరుస్తాడు. అతని శబ్దం జిన్నాతులు, మానవులు తప్ప చుట్టుప్రక్కల ఉండే సృష్టిరాశులన్నీ వింటాయి. (బుఖారీ) (కితాబుల్ జనాయెజ్ బాబుల్ మయ్యితు యస్ మవు ఖఫిఖన్నిఆలి)
117వ అంశం : అవిశ్వాసి కోసం సమాధిలో అగ్ని పడక పరవబడుతుంది. అగ్ని వస్త్రాలు తొడిగించబడతాయి.
118వ అంశం : అవిశ్వాసి సమాధిలో నరకంవైపు రంధ్రం చేసి అతనికి ఎడతెగకుండా నరకాగ్నిమరియు విషపూరితమైన గాలుల శిక్ష ఇవ్వబడుతుంది.
199వ అంశం : అవిశ్వాసిని సమాధి గోడలు ఎంతగా నలిపివేస్తాయంటే అతని కుడివైపు పక్కటెముకలు ఎడమవైపు ప్రక్కటెముకల్లో చొచ్చుకుపోతాయి.
120వ అంశం : సమాధిలో అవిశ్వాసిని ఇనుపగదతో కొట్టటానికి గుడ్డి, చెవిటి అయిన దూత నియమించబడతాడు.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: మృతుణ్ణి సమాధిలో పాతిపెట్టి అతని వారు ఇండ్లకు తిరిగివెళ్ళినపుడు అతను వారి చెప్పుల శబ్దం వింటాడు. మృతుడు గనక అవిశ్వాసి అయితే శిక్షించే దూత అతని తలవైపు నుంచి వస్తాడు. అక్కడ అతనికి (విశ్వాసం, సదాచరణ లాంటి ఆటంకాలేవీ ఉండవు. తర్వాత (శిక్షించటానికి కుడి వైపు నుంచి వస్తాడు. అటు కూడా ఎలాంటి ఆటంకాలూ ఉండవు. తర్వాత ఎడమవైపు నుంచి వస్తాడు. అక్కడ కూడా ఎలాంటి ఆటంకాలూ ఉండవు. దూత అతన్ని “లే” అంటాడు. అవిశ్వాసి భయంభయంతో లేచి కూర్చుంటాడు. దూత అతన్ని “మీ దగ్గరికి పంపబడిన వ్యక్తి గురించి నువ్వు ఏమనేవాడివి. అతని గురించి నీ సాక్ష్యం ఏమిటి?” అని అడుగుతాడు. దానికి అవిశ్వాసి “ఏ వ్యక్తి” అంటాడు. అతనికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి ఏమి తెలిసి ఉండదు. దూత “ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి” అని అంటాడు. దానికి అవిశ్వాసి “నాకేం తెలీదు. జనం ఆయన గురించి చెబుతూ ఉండగా విన్నదే నేనూ చెబుతూ ఉండేవాణ్ణి” అని అంటాడు. దూత అతనితో “నువ్వు సందేహంలో జీవితం గడిపావు. (ఆ సందేహస్థితిలోనే) మరణించావు. దైవం తలిస్తే (సందేహానికి గుణపాఠమైన పర్యవసానం) పైనే నువ్వు లేస్తావు” అని అంటాడు. ఆ తర్వాత నరకద్వారాల్లో ఒక ద్వారం తెరువబడుతుంది. అతనితో “అగ్నిలో నీ నివాసస్థలం, అల్లాహ్ నీకోసం సిద్ధం చేసి ఉంచిన ఇతర శిక్షలు ఇవిగో” అని అనటం జరుగుతుంది. అవి చూసిన తర్వాత అతని దుఃఖం, పశ్చాత్తాపం మరింత పెరిగిపోతుంది. ఆ తర్వాత అతని ముందు స్వర్గద్వారాల్లోని ఒక ద్వారం తెరువబడుతుంది. అతనితో “నువ్వు గనక (అల్లాహ్ కు , ఆయన ప్రవక్తకు విధేయత చూపి ఉన్నట్లయితే నీ స్థానం ఇదై ఉండేది” అని చెప్పబడుతుంది. అది చూసిన తర్వాత అతని దు:ఖం, పశ్చాత్తాపం మరింత పెరిగిపోతుంది. తర్వాత అతని సమాధి ఇరుకుగా చేయబడుతుంది. దాంతో అతని శరీరంలోని ఒకవైపు ప్రక్కటెముకలు మరోవైపు ప్రక్కటెముకల్లోకి చొచ్చుకుపోతాయి. ఈ బాధకర జీవితాన్నే అల్లాహ్ దివ్యఖుర్ఆన్లో ఈ మాటల్లో ప్రస్తావించాడు. వానికి ప్రపంచంలో జీవితం ఇరుకవుతుంది. ప్రళయంనాడు మేము అతనిని అంధుడుగా లేపుతాము (తాహా 124) (తబ్రానీ హాకిమ్. ఇబ్నెహిబ్బాన్) [ముహ్ యుద్దీన్ దీబ్ అత్ తర్గీబ్ వత్ తర్హీబ్ గ్రంథం. నాల్గో సంపుటి 5225వ హదీసు]
121వ అంశం : సమాధిలో అవిశ్వాసి కోసం అగ్ని పడక పరవబడుతుంది. అతనికి అగ్ని వస్త్రాలు తొడిగించబడతాయి.
122వ అంశం: సమాధిలో అవిశ్వాసికి వేడి విషపూరిత గాలి శిక్ష ఇవ్వటానికి నరకంవైపు ఒక రంధ్రం తెరువబడుతుంది.
123వ అంశం: అవిశ్వాసిని సమాధి గోడలు ఎంతగా నలిపివేస్తాయంటే దాని వల్ల అతనికుడి పక్కటెముకలు ఎడమ పక్కటెముకల్లో చొచ్చుకుపోతాయి.
124వ అంశం: సమాధిలో అవిశ్వాసి దగ్గరికి అతని దుష్కర్మలు అత్యంత వికృత మనిషి రూపంలో వస్తాయి. అతన్ని చూసి అవిశ్వాసిలో భయాందోళనలు మరింత పెరిగిపోతాయి.
125వ అంశం:అవిశ్వాసిని ఇనుప గదలతో కొట్టటానికి గుడ్డి, చెవిటి దూత నియమించబడతాడు. అతని దెబ్బలతో అవిశ్వాసి శరీరం నుజ్జు నుజ్జు అయిపోతుంది. ఆ తర్వాత దాన్ని మళ్లీ యధాతథంగా చేయబడుతుంది. మళ్లీ కొట్టి నుజ్జు నుజ్జు చేయటం జరుగుతుంది. ప్రళయం వరకూ అవిశ్వాసి ఇదే శిక్ష అనుభవిస్తూ ఉంటాడు.
హజ్రత్ బరా బిన్ ఆజిబ్(రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: (సమాధిలో) అవిశ్వాసి ఆత్మ అతని శరీరంలోకి పంపబడిన తర్వాత అతని దగ్గరికి ఇద్దరు దూతలు వచ్చి అతన్ని లేపి కూర్చోబెడతారు. తర్వాత “నీ ప్రభువు ఎవరు?” అని అడుగుతారు అందుకు అవిశ్వాసి “అయ్యో! నాకు తెలీదే” అంటాడు. దూతలు అతన్ని “నీ ధర్మం ఏది?” అని అడుగుతారు” అందుకు అవిశ్వాసి “అయ్యో! నాకు తెలీదే” అంటాడు. తర్వాత దూతలు “మీ దగ్గరికి పంపబడిన వ్యక్తి ఎవరు” అని అడుగుతారు. దానికి కూడా అతను “అయ్యో నాకు తెలిదే” అని అంటాడు. అప్పుడు ఆకాశం నుంచి ‘అతను చెప్పేది అబద్ధం, అతని కోసం అగ్ని పడక వేయండి. అతనికి అగ్ని వస్త్రాలు తొడిగించండి. తర్వాత అతని కోసం నరకం పైపు ఒక ద్వారం తెరువండి’ అని ఎవరో ఆదేశించినట్లు శబ్దం వస్తుంది. అటు నుంచి అతనికి నరకపు వేడి విషపూరిత గాలి వస్తూ ఉంటుంది. అతని సమాధి అతనికి ఇరుకుగా మారుతుంది. దాంతో అతని శరీరంలోని ఒకవైపు ఎముకలు మరోవైపు ఎముకల్లోకి చొచ్చుకుపోతాయి. ఆ తర్వాత అతని దగ్గరికి ఒక కురూపి అపరిశుభ్ర బట్టల్తో వస్తాడు. అతని దగ్గరి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. అతనొచ్చి “నీకు అవమానకరమైన, శాశ్వతమైన శిక్ష పడుతుందనే శుభవార్త విను” అని అంటాడు. దానికి అవిశ్వాసి నీ “పాడుగాను అసలు ఎవరు నువ్వు?” అని అడుగుతాడు. దానికతను “నేను నీ దురాచరణను (ప్రపంచంలో నువ్వు అల్లాహ్ కు విధేయత చూపమంటే వాయిదాలు వేసేవాడివి. ఆయన పట్ల అవిధేయతకు పాల్పడటానికయితే ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడివి. అల్లాహ్ నీకు అత్యంత హీనమైన ప్రతిఫలం ప్రసాదించుగాక!” అని శపిస్తాడు. ఆ తర్వాత ఆ అవిశ్వాసిని శిక్షించటానికి ఒక గుడ్డి, చెవిటి దూత నియమించబడతాడు. అతని చేతిలో ఇనుప గద ఉంటుంది. ఆ గదతో కొండను కొడితే కొండ కూడా తుక్కు తుక్కు అయిపోతుంది. దూత అతన్ని చాలా దారుణంగా కొడతాడు. అతని ఒకే దెబ్బకు అవిశ్వాసి నుజ్జు నుజ్జు అయిపోతాడు. అల్లాహ్ అతన్ని మళ్లీ యధాస్థితికి మారుస్తాడు. (అంటే అతని శరీరం మామూలు స్థితికి వచ్చేస్తుంది) తర్వాత దూత అతన్ని రెండోసారి కొడితే అతను చాలా భయంకరంగా అరుపులు, కేకలు మొదలుపెడతాడు. జిన్నాతులు మానవులు తప్ప ప్రాణమున్న ప్రతి సృష్టి రాశి ఆ శబ్దం వింటుంది.
బరా (రదియల్లాహు అన్హు) ఉవాచ :- ఆ తర్వాత అతని కొరకు అగ్నివైపు ద్వారం తెరువబడుతుంది. అతని కొరకు అగ్ని పడక వేయబడుతుంది. (అహ్మద్ – హసన్) (ముహ్ యుద్దీన్ దీబ్ అత్ తర్గీబ్ వత్ తర్హీబ్ గ్రంథం నాల్గో సంపుటి 5221వ హదీసు)
126వ అంశం : సమాధిలో అవిశ్వాసిని కుట్టటానికి, కాటేయటానికి తేళ్లు, పాములు ఉంటాయి. వాటిలో ఒక్కటయినా భూమ్మిద ఊదితే ఇంకెప్పుడూ భూమ్మిద ఏమీ మొలకెత్తదు.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం: మేము ఒక జనాజాలో దైవప్రవక్త వెంట ఉన్నాం. ఖనన సంస్కారాలు జరిగి జనం తిరిగి వెళ్ళి పోతున్నప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెప్పారు: ఇప్పుడు ఇతను మీ చెప్పుల శబ్దం వింటాడు. ఇతని దగ్గరికి ముంకిర్, నకీర్లు వస్తారు. వారి కళ్లు ఇత్తడి డేగిసాలంత (పెద్దవిగా) ఉంటాయి. పళ్ళు ఆవుకొమ్ముల్లా ఉంటాయి. కంఠం పిడుగు గర్జనలా ఉంటుంది. ఆ ఇద్దరు ఇతన్ని కూర్చోబెట్టి తను ఎవరిని ఆరాధించేవాడో అడుగుతారు. ఒకవేళ ఇతను అల్లాహ్ ను ఆరాధించేవాడయితే “నేను అల్లాహ్ ను ఆరాధిస్తున్నాను. నా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) . ఆయన మా దగ్గరికి (దైవదౌత్యపు) స్పష్టమైన నిదర్శనాలు తీసుకొని వచ్చారు. మేము ఆయన్ని విశ్వసించాము. ఆయన్ని అనుసరించాము” అని అంటాడు. ఒక స్థిరమైన వాక్కు ఆధారంగా ఇహలోకంలోనూ, పరలోకంలోనూ విశ్వాసులకు అల్లాహ్ నిలకడను ప్రసాదిస్తాడు” అన్న దైవ సూక్తికి భావం ఇదే (ఇబ్రాహీమ్ సూరా 27వ సూక్తి). తర్వాత అతనితో “నువ్వు నమ్మకంతో జీవితం గడిపావు. నమ్మకం ఉన్న స్థితిలోనే నీకు చావు వచ్చింది. నువ్వు నమ్మకం మీదే లేస్తావు” అని చెప్పటం జరుగుతుంది. అతని కోసం స్వర్గంవైపు ఒక ద్వారం తెరువబడుతుంది. అతని సమాధి విశాలమవుతుంది. ఒకవేళ మృతుడు (అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త గురించి)సందేహం కలవాడయితే (ముంకిర్ నకీర్ వేసే ప్రశ్నలకు అతను “నాకేం తెలీదు. జనం ఏదైతే చెబుతుండగా విన్నానో నేనూ అదే చెప్పాను” అని అంటాడు. అప్పుడు అతనితో “నువ్వు సందేహం మీద జీవితం గడిపావు. సందేహం మీదే నీకు మరణం వచ్చింది. తిరిగి సందేహం మీదే నువ్వు లేస్తావు” అని చెప్పటం జరుగుతుంది. ఆ తర్వాత అతని కొరకు నరకం వైపు ఒక ద్వారం తెరువబడుతుంది. అతని మీద ఎలాంటి విషపూరితమైన తేళ్లు, సర్పాలు వదలబడతాయంటే వాటిలో ఒక్కటయినా (ఒక తేలు లేక సర్పం అయినా) భూమ్మిద ఊదితే ఇక భూమ్మిద ఏమీ మొలకెత్తదు. అలాంటి తేళ్లు, సర్పాలు అతన్ని కాటేస్తూ ఉంటాయి. అతని కోసం ఇరుకుగా అయిపోమని భూమికి ఆజ్ఞ అవుతుంది. (అది ఎంత ఇరుకుగా అయిపోతుందంటే) ఆ ఒత్తిడికి అతని శరీరంలోని ఒకవైపు ఎముకలు, మరోవైపు ఎముకల్లోకి చొచ్చుకొని పోతాయి. (తబ్రానీ దీనిని ఔసత్ గ్రంథంలో పొందుపరిచారు) (ముహ్ యుద్దీన్ దీబ్ అత్ తర్గీబ్ వత్ తర్హీబ్ నాల్గో సంపుటి 5223వ హదీసు)
గమనిక:- పాములు, తేళ్లు కుట్టే శిక్ష అవిశ్వాసులకు నరకంలోనూ ఉంటుందన్న విషయం గమనార్హం. నరక సర్పాల గురించి చెబుతూ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అవి ఒంటెల్లా ఉంటాయనీ, అవి ఒకసారి కాటేస్తే నరకవాసికి నలభైయేండ్ల దాకా వాటి విషం ప్రభావం చూపుతుంద’ని అన్నారు. తేళ్ల గురించి అవి గాడిదలంత ఉంటాయనీ, అవి ఒకసారి కాటేస్తే నరకవాసికి నలభై యేండ్ల దాకా వాటి విషం ప్రభావం చూపుతుందని” చెప్పారు. (అహ్మద్)
127వ అంశం : సమాధిలో అవిశ్వాసి మీద తొంభైతొమ్మిది సర్పాలు వదలబడతాయి. ఒక్కో సర్పానికి డెబ్బైమూతులు ఉంటాయి. ఒక్కో మూతిపై ఏడు తలలుంటాయి. ఈ సర్పాలు ప్రళయం వరకూ అవిశ్వాసిని కాటేస్తూ ఉంటాయి.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు:
విశ్వాసి తన సమాధిలో ఒక సస్యశ్యామలమైన తోటలో ఉన్నట్లు ఉంటాడు. అతని సమాధి డెబ్భైగజాలు (అంటే 35 మీటర్లు) విశాలమవుతుంది. అందులో నిండు పౌర్ణమిలాంటి కాంతి వెదజల్లబడుతుంది. (తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన అనుచరులను) ఈ సూక్తిలో “నా జ్ఞాపికకు విముఖుడైన వానికి ప్రపంచంలో జీవితం ఇరుకవుతుంది. ప్రళయం నాడు మేము అతడిని అంధుడిగా లేపుతాము” అనే సూక్తిలో అల్లాహ్ ఏమని సెలవిచ్చాడో మీకు తెలుసా? ఇరుకైన జీవితమంటే ఏమిటో అర్థమయిందా?” అని అడిగారు. అనుచరులు “అల్లాహ్ కు, దైవప్రవక్తకే బాగా తెలుసు” అని విన్నవించుకున్నారు. అప్పుడు ఆయన ఇలా వివరించారు: “అవిశ్వాసికి ఇవ్వబడే శిక్ష అని దాని భావం. ఎవరి చేతిలోనయితే నా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నాను. (సమాధిలో) అవిశ్వాసి పైకి తొంభైతొమ్మిది సర్పాలు వదలబడతాయి. ఒక్క సర్పానికి డెబ్బై మూతులు ఉంటాయి. ఒక్కో మూతిపై ఏడు తలలుంటాయి. ఈ సర్పాలు ప్రళయం వరకూ అవిశ్వాసిని కాటేస్తూ గాయపరుస్తూ ఉంటాయి. (అబూయాలా, ఇబ్నె హిబ్బాన్ – హసన్)’ (ముహ్ యుద్దీన్ దీబ్ అత్ తర్గీబ్ వత్ తర్హీబ్ నాల్గో సంపుటి 5216వ హదీసు)
సమాధి విశ్వాసి మృతదేహాన్ని ఒత్తటం
128వ అంశం : సాద్ బిన్ ముఆజ్ (రదియల్లాహు అన్హు) ని సమాధి ఒత్తసాగింది. వెంటనే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ ను ప్రార్థించగా మళ్ళీ వదిలేసింది.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: సాద్ బిన్ ముఆజ్ (రదియల్లాహు అన్హు) ఎంత గొప్పవారంటే ఆయన (చనిపోయినప్పుడు) దైవ సింహాసనం కదిలింది. ఆయన కొరకు ఆకాశ ద్వారాలన్నీ తెరువబడ్డాయి. ఈయన (జనాజా)కు డెబ్బైవేల దూతలు హాజరయ్యారు. ఈయన్ని కూడా సమాధి ఒకసారి ఒత్తింది. మళ్లీ విశాలమయింది. (నసాయి – సహీహ్) [కితాబుల్ జనాయెజ్ బాబు జమ్మతుల్ ఖబ్రరి వ జగతతుహూ (2/1942)]
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: సాద్ గారు సమాధిలో ఒత్తబడ్డారు. ఆయన గారి బాధ దూరమవ్వాలని నేను అల్లాహ్ ను ప్రార్థించాను. (అల్లాహ్ ఆయన బాధను దూరం చేశాడు). (హాకిమ్-హసన్) [కితాబు మారిఫతిస్సహాబతి, బాబు తహర్రుకుల్ అరి లిసాదిన్ (4/4977)]
గమనిక:- సమాధి విశ్వాసి మృతదేహాన్ని ఒక తల్లి తన బిడ్డను ఒళ్ళోకి ఎత్తుకొని ప్రేమతో ఒత్తినట్టు ఒత్తుతుందనీ, అదే అవిశ్వాసి మృతదేహాన్నయితే శిక్షించే ఉద్దేశ్యంతో అతని శరీరంలోని ఒకవైపు ఎముకలు మరోవైపు ఎముకల్లోకి చొచ్చుకుపోయేంత గట్టిగా ఒత్తుతుందని అంటారు. ఒకానొక సందర్భంగా సాద్ (రదియల్లాహు అన్హు) గారి వల్ల మూత్రం విషయంలో కాస్త నిర్లక్ష్యం జరిగిపోయింది, అందుకే సమాధి ఆయన్ని ఒత్తిందని కూడా ప్రజలు చెబుతారు. వాస్తవం అల్లాహ్ కు బాగా తెలుసు.
తౌహీద్ విశ్వాసం – ముంకిర్, నకీర్ల ప్రశ్నలు
129వ అంశం : స్వచ్ఛమైన తౌహీద్ విశ్వాసం మాత్రమే దూతల ప్రశ్నోత్తరాల్లో విజయం తెచ్చిపెడుతుంది.
హజ్రత్ బరా బిన్ ఆజిబ్(రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: సమాధిలో విశ్వాసి కూర్చోబెట్టబడినప్పుడు అతని దగ్గరికి (దూతలు) వస్తారు. అప్పుడు విశ్వాసి “అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క ప్రవక్త” అని సాక్ష్యమిస్తాడు. يُثَبِّتُ اللَّهُ الَّذِينَ آمَنُوا بِالْقَوْلِ الثَّابِتِ فِي الْحَيَاةِ الدُّنْيَا وَفِي الْآخِرَةِ “ఒక స్థిరమైన వాక్కు ఆధారంగా ఇహలోకంలోనూ, పరలోకంలోనూ విశ్వాసులకు అల్లాహ్ నిలకడను ప్రసాదిస్తాడు” అన్న దైవ సూక్తి (ఇబ్రాహీమ్ సూరా 14:27)కి భావం ఇదే. (బుఖారీ) (కితాబుల్ జనాయెజ్ బాబు మా జాఅ ఫీ అజాబిల్ ఖబ్రి)
130వ అంశం: సమాధిలో ముంకిర్ నకీర్ దూతల వల్ల కలిగే భయాందోళనల నుంచి తౌహీద్ వచనం మాత్రమే కాపాడగలదు.
హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రజలు (సమాధి శిక్ష గురించి విని) “దైవ ప్రవక్తా! తల దగ్గర దూత గద తీసుకొని నించుంటే ఆ మనిషి భయాందోళనలతో (స్పృహ తప్పి) మట్టి బొమ్మలా అయిపోతాడు. (ఇక అతను సమాధానం ఏం చెప్పగల్గుతాడు?)” అని అడిగారు. అందుకు ఆయన “అల్లాహ్ ఇహలోకంలోనూ, పరలోకంలోనూ విశ్వాసులకు “కలిమయె తతయ్యిబా” చలువతో నిలకడను ప్రసాదిస్తాడు’ అని చెప్పారు. (అహ్మద్ – సహీహ్) (అత్తరీబ్ వత్తరోబ్ నాల్గో సంపుటి 5219వ హదీసు)
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హు) అనే కథనం: నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను “దైవప్రవక్తా! ప్రజలు సమాధుల్లో పరీక్షించబడతారు కదా! నేను ఓ అబలను. నా పరిస్థితి ఎలా ఉంటుంది?” అని అడిగాను. అందుకాయన “అల్లాహ్ విశ్వాసులకు తౌహీద్ వచన చలువతో ఇహలోక జీవితంలోనూ, సమాధిలోనూ నిలకడను ప్రసాదిస్తాడు.” అని చెప్పారు. (బజ్జార్ – హసన్) ( అత్తరీబ్ వత్తరోబ్, నాల్గో సంపుటి 5218వ హదీసు)
131వ అంశం : విశ్వాసులు తౌహీద్ వచన చలువతో ముంకిర్ నకీర్ ప్రశ్నలకు చాలా ప్రశాంతంగా జవాబు చెప్పగల్గుతారు.
హజ్రత్ బరా బిన్ ఆజిబ్(రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: సమాధిలో (విశ్వాసి దగ్గరికి) ఇద్దరు దూతలు వస్తారు. అతన్ని కూర్చోబెట్టి “నీ ప్రభువు ఎవరు?” అని అడుగుతారు. అందుకతను “నా ప్రభువు అల్లాహ్” అని సమాధానం చెబుతాడు. తర్వాత వారు “నీ ధర్మం ఏది?” అని అడుగుతారు. అందుకతను “నా ధర్మం ఇస్లామ్” అని చెబుతాడు. ఆ తర్వాత వారు “మీ మధ్యన (దైవప్రవక్తగా) పంపబడిన వ్యక్తి గురించి మీ అభిప్రాయం ఏమిటి?” అని అడుగుతారు. అందుకతను “ఆయన దైవప్రవక్త అని చెబుతాడు. దూతలు మళ్లీ “ఈ విషయాలన్నీ నీకు ఎలా తెలిశాయి?” అని అడుగుతారు. అందుకతను “నేను దైవ గ్రంథం చదివాను. దాన్ని విశ్వసించాను. ధృవీకరించాను” అని చెబుతాడు.
జరీర్ (రదియల్లాహు అన్హు) హదీసులో ఈ వాక్యాలు అదనంగా ఉన్నాయి: “అల్లాహ్ విశ్వాసులకు కలిమియె తొయ్యిబా ఆధారంగా ఇహలోక జీవితంలోనూ, పరలోక జీవితం (సమాధి)లోనూ నిలకడను ప్రసాదిస్తాడు” అన్న దైవసూక్తికి భావం ఇదే. (అబూదావూద్ – సహీహ్) (కితాబుస్సున్నహ్ బాబున్ ఫిల్ మన్అలతి ఫిల్ ఖబిరి వఅజాబిల్ ఖబ్రి)
132వ అంశం : కలిమయె తొయ్యిబాకు సంబంధించిన సూక్తి ప్రత్యేకంగా సమాధి శిక్ష గురించే అవతరించింది.
హజ్రత్ బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: “అల్లాహ్ విశ్వాసులకు కలిమయే తొయ్యిబా ఆధారంగా… అన్న సూక్తి సమాధి శిక్ష గురించి అవతరించింది. (సమాధిలో) మృతుణ్ణి “నీ ప్రభువు ఎవరు?” అని అడిగితే, దానికతను “నా ప్రభువు అల్లాహ్. నా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ” అని చెబుతాడు. “అల్లాహ్ విశ్వాసులకు కలిమయె తొయ్యిబా ఆధారంగా ఇహలోక జీవితంలోనూ, సమాధి జీవితంలోనూ నిలకడను ప్రసాదిస్తాడు” అన్న దైవసూక్తికి భావం ఇదే. (ముస్లిం) (కితాబుల్ జన్నతి వసిఫతిహీ బాబు అర్జిల్ మఖ్ అది అలల్ మయ్యితి వ అజాబిల్ ఖబ్రి)
సత్కర్మలు సమాధి శిక్షను ఎదుర్కొనే డాలు వంటివి!
133వ అంశం: నమాజు, ఉపవాసం, జకాత్, హజ్, బంధువులతో సత్సంబంధాలు, మంచిని గురించి ప్రబోధించటం, చెడులను నిరోధించటం… మొదలగు సత్కర్మలు సమాధిలో మృతుణ్ణి శిక్ష నుంచి కాపాడతాయి.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: మృతుణ్ణి సమాధిలో ఉంచి (పాతిపెట్టి) తిరిగి వెళ్ళేవారి చెప్పుల శబ్దం మృతుడు వింటాడు. అతను విశ్వాసి అయితే అతని తల దగ్గర దానధర్మాలు, నఫిల్ ఆరాధనలు, ప్రజలకు ఉపకారాలు, వారిపట్ల ఉత్తమ వ్యవహారం మొదలగునవి ఉండి అతన్ని రక్షిస్తూ ఉంటాయి. శిక్షించటం కోసం దూత తలవైపు నుంచి వస్తే నమాజు అడ్డుకొని నా వైపు నుంచి దారిలేదు (వేరే దారి గుండా రా)” అని అంటుంది. తర్వాత దూత కుడివైపు నుంచి రావాలని ప్రయత్నిస్తాడు. అక్కడ జకాత్ అడ్డుకొని “నావైపు నుంచి దారిలేదు (వేరేదారి గుండా రా)” అని అంటుంది. తర్వాత దూత కాళ్లవైపు నుంచి రావటానికి ప్రయత్నిస్తాడు. అక్కడ ఇతర సత్కర్మలు-దానధర్మాలు, బంధువులతో సత్సంబంధాలు, పరోపకారం మొదలగునవి అతన్ని అడ్డుకొని “ఇటుగుండా దారి లేదు (వేరే దారి గుండా రా)” అని అంటాయి. (ఇబ్నె హిబ్బాస్ హసస్) (అత్తర్బ్ వత్తర్హిబ్ నాల్గొసంపుటి 5225వ హదీసు)
134వ అంశం: సత్కర్మలన్నీ ఆఖరికి నమాజుకోసం మస్జిద్కు వెళ్ళటానికి వేసే అడుగులు కూడా మృతుణ్ణి సమాధి శిక్ష నుంచి కాపాడతాయి.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: మనిషి సమాధిలో ఖననం చేయబడినప్పుడు దూత శిక్షించటానికి తలవైపు నుంచి రాబోతే ఖుర్ఆన్ పారాయణం అతన్ని అడ్డుకుంటుంది. ముందు నుంచి రాబోతే దానధర్మాలు అతన్ని అడ్డుకుంటాయి. కాళ్లవైపు నుంచి రాబోతే మస్జిద్ వైపు నడిచివెళ్ళే సత్కార్యం అతన్ని అడ్డుకుంటుంది. (తబ్రానీ – హసన్) (ముహ్ యుద్దీన్ దీబ్ అత్ తర్గీబ్ వత్ తర్హీబ్, నాల్గో సంపుటి 5225వ హదీసు)
సమాధి ఉపద్రవం నుంచి సురక్షితంగా ఉండేవారు
135వ అంశం: ఇస్లామీయ సైన్యానికి కాపలా కాస్తూ చనిపోయినవాడు సమాధి శిక్ష నుంచి సురక్షితంగా ఉంటాడు.
హజ్రత్ ఫజాలా బిన్ ఉబైద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: చనిపోయే వారిలో ప్రతిఒక్కరి కర్మలు (అంటే వాటి పుణ్య పరంపర అతని మరణంతోనే) అంతమయిపోతుంది. కాని అల్లాహ్ మార్గంలో కాపలా కాస్తూ చనిపోయేవాని కర్మల పుణ్యం తప్ప. అతనికి ప్రళయం వరకూ ఎడతెగకుండా తన కర్మల పుణ్యం లభిస్తూనే ఉంటుంది. అంతేకాదు, అతను సమాధి ఉపద్రవం నుంచి కూడా సురక్షితంగా ఉంటాడు. (తిర్మిజీ-సహీహ్) (అల్బానీ గారి సిల్సిలతుల్ అహాదీసుస్సహీహా గ్రంథం మూడో సంపుటి 1140వ హదీసు 2)
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: దైవమార్గంలో కాపలా కాస్తూ చనిపోయిన వాడికి అతను చేస్తూ ఉండిన సత్కర్మలు (ఉదా: నమాజు, ఉపవాసాలు, ఖుర్ఆన్ పారాయణం, ఆరాధన ఇతర కీర్తనలు మొదలగు వాటి) పుణ్యం (ప్రళయం వరకూ ఎడతెగకుండా) ప్రాప్తిస్తూ ఉంటుంది. అతనికి ఆహారం కూడా ఇవ్వబడుతుంది. సమాధి ఉపద్రవం నుంచి సురక్షితంగా ఉంటాడు. అంతేకాదు ప్రళయదినాన అల్లాహ్ అతన్ని లేపినప్పుడు అతను (ఆ రోజు ఉండే) ఆందోళన నుంచి కూడా సురక్షితంగా ఉంటాడు. (ఇబ్నెమాజా- సహీహ్) (అల్బానీగారి సహీహ్ సుననె ఇబ్నెమాజా రెండో సంపుటి 2234 హదీసు)
136వ అంశం: గురువారం రాత్రి లేక శుక్రవారం పగలు మరణించేవాడు సమాధి ఉపద్రవం నుంచి సురక్షితంగా ఉంటాడు.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: గురువారం రాత్రి లేక శుక్రవారం పగలు మరణించే ముస్లింని అల్లాహ్ సమాధి ఉపద్రవం నుంచి కాపాడుతాడు. (అహ్మద్, తిర్మిజీ – హసన్) (జామె తిర్మిజీ కితాబుల్ జనాయెజ్)
137వ అంశం : ఆనవాయితీగా ముల్క్ సూరా పారాయణం చేస్తూ ఉండేవాడు, సమాధి ఉపద్రవం నుంచి సురక్షితంగా ఉంటాడు.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మసావూద్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: తబారకల్లజీ బియదిహిల్ ముల్క్ సూరా” సమాధి శిక్షను ఆపుతుంది. (హాకిమ్-హసన్) (అల్బాని గారి సిల్సిలతుల్ అహాదీసుస్సహీహా మూడో సంపుటి1140వ హదీసు)
138వ అంశం : అమరవీరుడు (షహీద్) సమాధి ఉపద్రవం నుంచి సురక్షితంగా ఉంటాడు.
హజ్రత్ రాషిద్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త గారి ఒక అనుచరుని నుంచి విన్న కథనం: ఒకతను దైవప్రవక్తను “దైవప్రవక్తా! సమాధిలో ముస్లింలందరిని పరీక్షించి, అమరవీరుణ్ణి పరీక్షించకపోవటానికి కారణం ఏమిటి?” అని అడిగాడు. అందుకాయన “వారికి ప్రపంచంలో) తలలమీద మెరుస్తూ ఉండే ఖడ్గాల పరీక్ష చాలు” అని బదులిచ్చారు. (నసాయి – సహీహ్) [కితాబుల్ జనాయెజ్, బాబుష్షహీద్ (2/1940)]
139వ అంశం: కడుపునొప్పితో చనిపోయినవాడు సమాధి ఉపద్రవం నుంచి సురక్షితంగా ఉంటాడు.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ యసార్ (రదియల్లాహు అన్హు) కథనం: నేను కూర్చొని ఉండగా సులైమాన్ బిన్ సర్ద్ (రదియల్లాహు అన్హు) మరియు ఖాలిద్ బిన్ ఉరఫత్ (రదియల్లాహు అన్హు) అక్కడికి వచ్చారు.) అక్కడున్న జనం ఫలానా మనిషి కడుపునొప్పితో చనిపోయాడని చెప్పారు. అది విని వాళ్ళిద్దరూ తాము ఆ వ్యక్తి జనాజాలో పాల్గొంటే బాగుండేదని అన్నారు. తర్వాత వారిలో ఒకాయన మరో ఆయనతో ‘ఎవరినయితే తన కడుపు మరణానికి గురిచేస్తుందో అతన్ని సమాధిలో శిక్షించటం జరగదు’ అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పలేదా? అని అడగ్గా, దానికి రెండో ఆయన “ఎందుకు చెప్పలేదు. చెప్పారు” అని అన్నారు. (నసాయి – సహీహ్) (కితాబుల్ జనాయెజ్ బాబు మన్ ఖతలహూ బతనుహూ 2/1939)
గమనిక:- యుద్ధరంగంలో వీరమరణం పొందేవాడే గాకుండా ఉదర వ్యాధితో చనిపోయే షహీద్ గురించి కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతను సమాధి శిక్ష నుంచి సురక్షితంగా ఉంటాడని శుభవార్త ఇచ్చారు. కనుక షహీదుల్లోని ఇతర రకాల వారు కూడా సమాధి శిక్ష నుంచి సురక్షితంగా ఉంటారని పండితులు ఆశాభావం వ్యక్తం చేశారు. నిజం అల్లాహ్ కే బాగా తెలుసు. పోతే షహీదుల్లోని ఇతర రకాలవారు వీరు: 1) ప్లేగువ్యాధితో చనిపోయినవాడు. 2) ఉదరవ్యాధితో చనిపోయినవాడు 3) నీటిముంపుకు గురై చనిపోయినవాడు 4) గోడక్రిందపడి చనిపోయినవాడు (బుఖారీ) 5) ప్రసవ వేదనలో మరణించే స్త్రీ 6) అగ్నిలో కాలిచనిపోయేవారు 7) ప్రక్కటెముక వ్యాధి (నిమోనియా) వచ్చి చనిపోయేవారు. 8) తన ధనాన్ని రక్షించుకోబోయి చనిపోయినవారు 9) తన ఆలుబిడ్డల్ని రక్షించుకోబోయి చనిపోయేవారు. 10) ఆత్మ రక్షణ కోసం ప్రయత్నిస్తూ చనిపోయినవారు 11) తమ ధర్మాన్ని రక్షించుకుంటూ చనిపోయిన వారు 12) అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతూ చనిపోయేవారు. 13) చిత్తశుద్ధితో వీరమరణాన్ని కోరుకునేవారు (ముస్లిం) 14) ఉదయం, సాయంత్రం హష్ర సూరాలోని మూడు సూక్తులు పఠించేవారు. (తిర్మిజీ-దారిమి)
సమాధుల్లో శరీరాలు ఏ స్థితిలో ఉంటాయి?
140వ అంశం : దైవప్రవక్తల దేహాలు సమాధుల్లో ప్రళయం వరకూ సురక్షితంగా ఉంటాయి.
హజ్రత్ ఔస్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: రోజులన్నిటిలో జుమారోజు అత్యుత్తుమమైనది. ఆ రోజు ఆదం (అలైహిస్సలాం) పుట్టించబడ్డారు. ఆ రోజే తిరిగి లేపబడే ఆజ్ఞ ఆవుతుంది. కనుక ఆ రోజు మీరు నా కోసం అతి ఎక్కువగా దరూద్ పఠించండి. మీ దరూద్లు నాకు సమర్పించబడతాయి. అది విని అనుచరులు “దైవప్రవక్తా! అప్పటికి మీ ఎముకలు కూడా కృశించిపోయి’ ఉంటాయి (లేక) మీ శరీరం మట్టిలో కలిసిపోయి ఉంటుంది కదా! మరి మా దరూద్లు మీకు ఎలా సమర్పించ బడతాయి?” అని సందేహపడ్డారు. అందుకాయన “అల్లాహ్ దైవప్రవక్తల దేహాలను భూమికొరకు నిషిద్ధం చేశాడు” అని చెప్పారు. (అబూదావూద్ – సహీహ్) (అల్బాని గారి సహీహ్ సున్న అబూదావూద్ మొదటి సంపుటి 925వ హదీసు)
141వ అంశం: మహాత్ములు, సదాచారులు, అమరవీరుల్లో ఎవరి దేహాలు ఎంతకాలం వరకు సురక్షితంగా ఉండాలని అల్లాహ్ తలుస్తాడో అవి అంతకాలం మట్టి ప్రభావం నుంచి సురక్షితంగా ఉంటాయి.
హజ్రత్ హిషామ్ బిన్ ఉర్వా (రహిమహుల్లాహ్) తన తండ్రి నుండి చేసిన కథనం వలీద్ బిన్ అబ్దుల్మలిక్ హయాంలో ఒకసారి ఆయిషా (రజి-అన్హా) గారి కుటీరపు గోడ పడిపోయింది. దాన్ని పునర్నిర్మించినప్పుడు ఒక కాలు కనిపించింది. దాన్ని చూసి జనం అది దైవప్రవక్త కాలు అనుకున్నారు. కాని వారిలో ఎవరికీ దైవప్రవక్త కాలును గుర్తుపట్టడంలో నమ్మకమైన జ్ఞానం లేదు. ఆఖరికి (ఆయిషాగారి సోదరి కుమారుడు అయిన) ఉర్వా (రదియల్లాహు అన్హు) ప్రజలకు ‘దైవసాక్షి! ఇది దైవప్రవక్త కాలు కాదు. ఉమర్ కాలు’ అని చెప్పారు. (బుఖారీ) [కితాబుల్ జనాయెజ్ బాబు మా జాఅ ఫీ ఖబ్రన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వసల్లం)]
142వ అంశం: ఉహుద్ యుద్ధంలో అమరగతులైనవారి దేహాలు నలభైఆరు సంవత్సరాల తర్వాత కూడా మునుపటిలాగే చెక్కు చెదరకుండా కనిపించాయి.
హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ అబూ సాసా (రహిమహుల్లాహ్) కథనం: అమ్ర బిన్ జుమూహ్, అబ్దుల్లాహ్ బిన్ అమ్ అన్సారీ సలమ్ (రదియల్లాహు అన్హు) లిద్దరూ ఉహుద్ యుద్ధంలో అమరగతులయ్యారు. ఆ తర్వాత ఒకసారి వరదతాకిడికి వారి సమాధి కూలిపోయింది. కాస్తయితే నీళ్లతోపాటు సమాధి కూడా కొట్టుకుపోయేది. అప్పుడు వారి శవాలను వేరేచోట పూడ్చిపెట్టే ఉద్ధేశ్యంతో సమాధిని త్రవ్వటం జరిగింది. చూస్తే వారిద్దరి శవాల్లో ఎలాంటి మార్పూ రాలేదు. వారు నిన్ననే అమరగుతులైనట్లు అనిపించింది. వారిరువురిలో ఒకాయనకు గాయం అయింది. ఆయన (నొప్పితో) తన చెయ్యి గాయం మీద పెట్టుకున్నాడు. ఆయన్ని (వేరేచోట) పూడ్చిపెట్టినప్పుడు జనం ఆయన చెయ్యి సరిగ్గా పెడితే అది మళ్లీ అక్కడికే పోయింది. ఈ సమాధి త్రవ్వకం సంఘటన ఉహుద్ సంగ్రామం జరిగిన నలభైఆరు సంవత్సరాల తర్వాత జరిగినది. (మాలిక్) (కితాబుల్ జిహాద్, బాబుద్దఫ్ని ఫీ ఖబ్రన్ వాహిదిన్ మిన్ జరూరతిన్)
143వ అంశం: దైవప్రవక్తలు కాకుండా ఇతర ప్రజల మృతదేహాల్లో వెన్నముక తప్ప మిగిలిన శరీరమంతా మట్టి తినేస్తుంది.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: మనిషి శరీరంలో ఒక ఎముక తప్ప మిగతా శరీరమంతా మట్టిలో కలిసిపోతుంది. అది వెన్నముక. ప్రళయదినాన మనిషి (దాంతోనే మళ్లీ పుట్టించబడతాడు. (ఇబ్నెమాజా-సహీహ్) [కితాబుజ్జుహద్ బాబుజిక్రిల్ ఖబ్ర వల్ బలా (2/3441)]
ఆత్మ దేహాన్ని వీడిన తర్వాత ఎక్కడ ఉంటుంది?
144వ అంశం : దైవప్రపక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణం తర్వాత నుంచి ఆయన పవిత్రాత్మ దైవ సింహాసనం సమీపాన ఉన్న జన్నతుల్ ఫిర్ ధౌస్ ఫిలోని అత్యున్నత స్థానంలో ఉంటుంది.
హజ్రత్ సమురా బిన్ జుందుబ్ (రదియల్లాహు అన్హు) కథనం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (ఫజ్ర్ నమాజ్ తర్వాత) మావైపు తిరిగి “రాత్రి మీలో ఎవరైనా కలగన్నారా?” అని అడిగేవారు. ఎవరైనా కల చూసి ఉంటే ఆయన దైవాభీష్టం ప్రకారం ఆ కలకు భావం వివరించేవారు. ఒకరోజు ఆయన మమ్మల్ని “మీలో ఎవరైనా రాత్రి కలగన్నారా?” అని అడిగారు. మేము లేదన్నాము. అప్పుడు ఆయన ఇలా చెప్పారు: సరే రాత్రి నేనొక కలచూశాను. అందులో నా దగ్గరికి ఇద్దరు మనుషులు వచ్చారు. (వారిలో ఒకరు) “నేను జిబ్రయీల్ను, ఈయన మీకాయిల్. తల పైకెత్తండి” అని అన్నారు. నేను తల పైకెత్తి చూస్తే నామీద మబ్బు లాంటి వస్తువేదో కనిపించింది. “ఇది (స్వర్గంలోని) మీ భవనం” అని వారిద్దరు చెప్పారు. నేను “కాస్త తప్పుకొండి, నేను నా భవనంలోకి వెళ్ళి (అది ఎలా ఉందో) చూస్తాను” అని అడిగాను. అందుకు వారు ((ప్రపంచంలో మీ జీవితం ఇంకా కాస్త మిగిలి ఉంది. మీరు ఇంకా దాన్ని పూర్తి చేయలేదు. మీరు మీ ఆయుష్షును పూర్తిచేసుకొని ఉన్నట్లయితే మీ భవనంలోకి వెళ్ళగలిగే వారు” అని అన్నారు. (బుఖారీ) (కితాబుల్ జనాయెజ్ బాబు మాఖిల ఫీ ఔలాదిల్ ముష్రికీన్. బాబు-2)
145వ అంశం : విశ్వాసుల్లో కొందరి ఆత్మలు స్వర్గంలో ఉంటాయి.
హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ కాబ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ఆయన తండ్రి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారని ఆయన హదీసు వివరించేవారు: విశ్వాసి (మరణానంతరం) అతని ఆత్మ స్వర్గవృక్షాలపైన ఎగురుతూ తిరుగుతూ ఉంటుంది. చివరికి మృతులు లేపబడేరోజున ఆ ఆత్మ తిరిగి తన దేహంలోకి పంపబడుతుంది. ఇబ్నె మాజ (సహీహ్)( కితాబు అజ్జుహద్, బాబు జిక్రిల్ ఖబ్రి 2/3446)
146వ అంశం : విశ్వాసుల్లో కొందరి ఆత్మలు ప్రళయం వరకూ “ఇల్లియ్యీన్”లో ఉంటాయి.
సూచన: 27వ అంశం క్రింది హదీసు చూడండి
147వ అంశం : అమరవీరుల ఆత్మలు స్వర్గంలో పచ్చని పక్షుల ఆకారంలో దైవ సింహాసనానికి వేలాడబడివున్న గాజు కుప్పెల్లో ఉంటాయి.
హజ్రత్ మస్రూఖ్ (రదియల్లాహు అన్హు) కథనం: మేము అబ్దుల్లాహ్ బిన్ మసూద్ (రదియల్లాహు అన్హు) ను ఈ దివ్యఖుర్ఆన్ సూక్తి “అల్లాహ్ మార్గంలో చంపబడ్డ వారిని మృతులుగా భావించకండి. వాస్తవానికి వారు సజీవులే. తమ ప్రభువు వద్ద జీవికను పొందుతున్నారు”. (ఆలి ఇమ్రాన్ : 169వ ఆయత్) భావం ఏమిటి?” అని అడిగాం. అందుకు అబ్దుల్లాహ్ బిన్ మసూద్ ఇలా చెప్పారు: మేము ఈ సూక్తి భావం గురించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అడిగాం. ఆయన దీని భావం ఇదని చెప్పారు: అమరవీరుల ఆత్మలు పచ్చని పక్షుల ఆకారంలో దైవ సింహాసనానికి వేలాడబడివున్న గాజు కుప్పెల్లో ఉంటాయి. ఎప్పుడు తలచుకుంటే అప్పుడు స్వర్గంలో విహరించటానికి వెళ్ళి తిరిగి కుప్పెల్లోకి చేరుకుంటాయి. ఒకసారి వారి ప్రభువు వారివైపు దృష్టిసారించి “మీరు ఏం కోరుకుంటారు?” అని అడిగాడు. అందుకు ఆత్మలు “మేము స్వర్గంలో ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళి విహరించి వస్తున్నాం. మాకు ఇంకా ఏం కావాలి?” అని అన్నారు. అల్లాహ్ వారిని మూడు సార్లు అదే ప్రశ్న అడిగాడు. ఆఖరికి ఆత్మలు తాము ఏదో ఒకటి కోరుకోవటం తప్ప వేరేదారి లేదనుకొని “ప్రభూ! మా ఆత్మలు తిరిగి మా దేహాల్లోకి పంపించబడాలని, తర్వాత మేము నీ మార్గంలో మళ్లీ చంపబడాలని మా కోరిక” అని విన్నవించుకున్నారు. దాంతో అల్లాహ్ వారికి ఇక ఏ కోరికా లేదని గ్రహించి వారిని అలాగే వదలి పెట్టేశాడు. (ముస్లిం) ( కితాబుల్ ఇమారహ్ బాబు బయాని అన్న అర్వాహహ్హహదా ఫిల్ జన్నతి)
148వ అంశం: అమరవీరుల్లో కొందరి ఆత్మలు స్వర్గద్వారం దగ్గర సెలయేరు ఒడ్డున పచ్చని గోపురాల్లో ఉంటాయి.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: (కొందరు) అమరవీరులు స్వర్గద్వారం వద్ద పారుతూ ఉండే అందమైన సెలయేరు ఒడ్డున పచ్చని గోపురాల్లో ఉన్నారు. అక్కడ వారికి ఉదయం సాయంత్రం ఆహారం ఇవ్వబడుతోంది. (తబ్రానీ, హాకిమ్ – హసన్) (అల్బానీగారి సహీహుల్ జామె అస్సగీర్ మూడో సంపుటి 3636వ హదీసు)
ఆత్మలు ప్రపంచానికి తిరిగిరావటం సాధ్యమేనా?
149వ అంశం: దైవప్రవక్త గాని, వలీగాని, షహీద్ గాని మరణించిన తర్వాత వారి ఆత్మ తిరిగి ప్రపంచంలోకి రావటం అసాధ్యం.
ఇంతలోనే పట్టణంలోని ఒక మారుమూల ప్రాంతం నుండి ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు: “నా జాతిప్రజలారా! దైవప్రవక్తలను అనుసరించండి. మీ నుండి ఏ ప్రతిఫలమూ కోరనివారిని, సత్యమార్గంలో ఉన్నవారిని అనుసరించండి. ఎవరు నన్ను సృష్టించారో, ఎవరి వైపునకు మీరంతా మరలిపోనున్నారో. ఆయనను నేనెందుకు పూజించకూడదు? ఆయనను కాదని నేను ఇతరులను ఆరాధ్యులుగా చేసుకోవాలా? వాస్తవానికి ఒకవేళ కరుణామయుడైన అల్లాహ్ నాకేదయినా నష్టం కలిగించదలిస్తే నాకు వారి సిఫారనూ ఏవిధంగానూ ఉపయోగపడదు, వారు నన్ను విడిపించనూలేరు. ఒకవేళ నేను అలా చేస్తే, స్పష్టమైన మార్గ భ్రష్టత్వానికి గురిఅవుతాను. నేను మీ ప్రభువును విశ్వసించాను. కనుక మీరు కూడా నామాట వినండి. (చివరకు వారు అతన్ని హత్య చేశారు. (ఆ వ్యక్తితో “స్వర్గంలో ప్రవేశించు” అని అనబడింది. అతను ఇలా అన్నాడు. “నా ప్రభువు ఏ విషయాన్ని బట్టి నన్ను క్షమించి గౌరవనీయులలోకి ప్రవేశింపజేశాడో, నా జాతివారికి తెలిస్తే ఎంత బాగుండును”! (యాసీన్ సూగా: 20నుంచి 27 సూక్తులు)
గమనిక: మరణించిన తర్వాత ఆత్మ తిరిగి ప్రపంచానికి రావటం, ఎవరితోనయినా మాట్లాడటం సాధ్యమే అయితే విశ్వాసి “నా ప్రభువు ఏ విషయాన్ని బట్టి నన్ను క్షమించాడో నా జాతివారికి తెలిస్తే ఎంత బాగుండు” అని బాధగా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు.
150వ అంశం: సమాధిలోని ప్రశ్నోత్తరాల్లో సఫలుడై స్వర్గఅనుగ్రహాలు చూసిన తర్వాత విశ్వాసి తిరిగి లోకానికి వచ్చి తన బంధుమిత్రులకు తన సత్పర్యవసానం గురించి తెలియ జేయాలనుకుంటాడు. కాని అతనికి అందుకు అనుమతి లభించదు.
సూచన :- 84,100వ అంశాల క్రింది హదీసులు చూడండి.
151వ అంశం : వీరమరణం పొందిన తర్వాత షహీద్ ఆత్మ ప్రపంచానికి వచ్చి మళ్లీ వీరమరణం పొందాలని కోరుకుంటుంది. కాని అందుకు దానికి అనుమతి లభించదు.
సూచన :- 147వ అంశం క్రింది హదీసు చూడండి.
సలఫె సాలిహీన్ దృష్టిలో సమాధి యాతన
152వ అంశం : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రతి నమాజులో సమాధి శిక్ష నుంచి శరణు వేడుకునేవారు.
సూచన :- 57వ అంశం క్రింది హదీసు చూడండి.
153 వ అంశం : సమాధి శిక్ష గురించి ఆయిషా (రరదియల్లాహు అన్హా)కు భయం!
సూచన :- 130వ అంశం క్రింది హదీసు చూడండి.
154వ అంశం : ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) సమాధి శిక్ష పట్ల భయంతో గడ్డం వెంట్రుకలు తడిచిపోయేలా విలపించేవారు.
ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) చేత స్వేచ్ఛనొసగబడిన బానిస హాని (రదియల్లాహు అన్హు) కథనం : ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఏదయినా సమాధి ముందు నిలబడితే గడ్డం వెంట్రుకలు తడిచిపోయేలా విలపించేవారు. “మీరు స్వర్గం నరకం గురించి చెప్పినప్పుడు ఏడ్వరు. మరి సమాధి గురించి చెప్పినప్పుడు ఎందుకని అంతలా ఏడుస్తారు?” అని అడగ్గా, అందుకాయన ఇలా సమాధానమిచ్చారు: “ఎందుకంటే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెప్పారు: పరలోక ప్రయాణ మజిలీల్లో సమాధి మొదటి మజిలి. ఎవరైనా ఈ మజిలీలో ముక్తి పొందితే రాబోయే మజిలీలు కూడా అతనికి సులభం అయిపోతాయి. ఒకవేళ ఇందులో గనక ముక్తి లభించకపోతే తర్వాతి మజిలీలు ఇంతకన్నా కఠినంగా ఉంటాయి. అంతేకాదు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాట కూడా చెప్పేవారు: “నేను సమాధికంటే ఆందోళనకరమైన కఠినమైన ప్రదేశం మరొకటి చూడలేదు.” (తిర్మిజీ-హసన్) [అబ్వాబుజ్జుహద్, బాబు మాజాఅ ఫీ ఫజాఅతిల్ ఖబ్రి]
155వ అంశం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి శిక్ష గురించి చెప్పినప్పుడు ఆయన అనుచరులు పెద్దగా రోదించటం మొదలు పెట్టారు.
హజ్రత్ అస్మా బిన్తె అబూబక్ర్ (రజి. అమ్హ) కథనం : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (ఖుత్బా ఇవ్వటం కోసం) నించొని మనిషి సమాధిలో గురయ్యే ఉపద్రవం గురించి ప్రస్తావించారు. ఆయన సమాధి ఉపద్రవం గురించి వివరించటం మొదలుపెట్టినప్పుడు ముస్లింలు పెద్దగా, దారుణంగా రోదించసాగారు. ఆ అరుపుల్లో నాకు దైవప్రవక్త మాటలు అర్థం కాలేదు. ఆ అరుపుల శబ్దం తగ్గిన తర్వాత నేను నా దగ్గర్లో కూర్చున్న మనిషిని “అల్లాహ్ నీకు శుభం ప్రసాదించుగాక! దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చివర్లో చెప్పింది ఏమిటి?” అని అడిగాను. అందుకతను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెప్పారని అన్నాడు: “మీరు సమాధుల్లో ఇంచుమించు దజ్జాల్ లాంటి ఉపద్రవం ద్వారా పరీక్షించబడతారని నాకు వహీద్వారా తెలుపబడింది.” (నసాయి-సహీహ్) (కితాబుల్ జనాయెజ్, బాబుత్త అవ్వుజు మిన్ అజాబిల్ ఖబ్ (2/1949))
హజ్రత్ అస్మా బిన్తె అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖుత్బా ఇవ్వటానికి నిలబడి మనిషి గురయ్యే సమాధి ఉపద్రవం గురించి ప్రస్తావించారు. ఆయన దాని గురించి వివరించినప్పుడు ముస్లింలు భయంకరంగా, పెద్దగా అరుస్తూ ఏడ్వటం మొదలుపెట్టారు. (బుఖారీ) (కితాబుల్ జనాయెజ్, బాబు మాజాఅ ఫీ అజాబిల్ ఖబ్రరి (2/1949))
156వ అంశం : అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) మరణించినప్పుడు ఆయన తన పర్యవసానాన్ని గుర్తుచేసుకొని చాలా సేపటివరకు ఏడుస్తూ ఉన్నారు.
157వ అంశం : అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) సమాధిలో జరిగే ప్రశ్నోత్తరాలకు భయపడి తనను సమాధిలో పూడ్చిపెట్టిన తర్వాత తన సమాధి దగ్గర నించొని చాలాసేపటివరకు దుఆ చేస్తూ ఉండమని తన కుమారులను కోరారు.
హజ్రత్ ఇబ్నె షమాసా మహా (రదియల్లాహు అన్హు) కథనం: అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) మరణావస్థలో ఉన్నప్పుడు మేము ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన చాలా సేపటిదాకా ఏడుస్తూ ఉన్నారు. తర్వాత గోడవైపు మొహం చాటేసుకున్నారు. ఆయన కుమారులు ఆయన్ని (ఓదార్చుతూ) “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మీకు ఫలానా శుభవార్తలు ఇచ్చారు కదా! మీరు ఏడ్వటం దేనికి? అని అన్నారు. అప్పుడు అమ్రి మొహం మా వైపు తిప్పి ఇలా చెప్పసాగారు.
“మేము (అనగా దైవప్రవక్త అనుచరులు) షహాదత్ వచనాన్ని (అంటే)… లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్రసూలుల్లాహ్… ను ధృవీకరించటం అత్యంత గొప్ప విషయంగా పరిగణించేవాళ్ళం. నా ముందు మూడు పరిస్థితులు గడిచాయి. మొదటి స్థితి ఏదంటే అప్పుడు నా దృష్టిలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కన్నా చెడ్డవాడు లేడు. నేను ఎల్లప్పుడూ ఆయన మీద అదుపు సాధించి ఆయన్ని హతమార్చాలని కోరుకుంటూ ఉండేవాణ్ణి. నేను గనక అదే స్థితిలో చనిపోయి ఉంటే నిశ్చయంగా నరకవాసుల్లో చేరిపోయేవాణ్ణి. ఆ తర్వాత రెండోస్థితి ఏదంటే, అప్పుడు అల్లాహ్ నా హృదయంలో ఇస్లాం పట్ల ప్రేమాభిమానాలు నాటాడు. నేను దైవప్రవక్త సన్నిధికి వెళ్ళి “చెయ్యి చాపండి (ప్రమాణం చేస్తాను ” అన్నాను. ఆయన తన కుడి చేయి చాపగానే నేను నా చెయ్యి వెనక్కి తీసుకున్నాను. ఆయన (ఆశ్చర్యపోయి) “అమ్! ఏమయింది?” అని అడిగారు. నేను ‘ఒక షరతు’ అన్నాను. “ఏమిటి ఆ షరతు?” అని అడిగారాయన. “నా పాపాలు (అన్నీ) మన్నించబడాలి” అన్నాను. అందుకాయన (చిరునవ్వు నవ్వి) “అమ్ర! నీకు తెలియదా? ఇస్లాం స్వీకరణ మునుపటి పాపాలన్నిటినీ మన్నించేస్తుంది. హిజ్రత్ చేయటం మునుపటి పాపాలన్నిటినీ మన్నించేస్తుంది. హజ్ చేయటం మునుపటి పాపాలన్నిటిని మన్నించేస్తుంది” అని అన్నారు. అప్పుడు నాకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ఎంత ప్రేమ పుట్టిందంటే అంత ప్రేమ మరెవరి మీదా లేదు. నా దృష్టిలో ఆయనకు ఉన్నంత విలువ మరెవరికీ లేదు. ఆయన గాంభీర్యత వల్ల నేనాయన్ని ఎన్నడూ కళ్లారా చూడలేదు. ఒకవేళ నేను అదే స్థితిలో మరణించి ఉంటే స్వర్గవాసి అయి ఉంటానని ఆశించగలను. కాని ఆ తర్వాత మేము కొన్ని (ప్రాపంచిక) పనుల్లో చిక్కుకున్నాం. ఇప్పుడు ఈ మూడవ స్థితిలో నా పర్యవసానం ఏమవుతుందో నాకు తెలియదు. కనుక నేను మరణించినప్పుడు నా జనాజా వెంట అరుస్తూ ఏడ్చే స్త్రీలు ఎవరూ ఉండకూడదు. ఎవరూ అగ్ని తీసుకొని నడవరాదు. మీరు నన్ను ఖననం చేసినప్పుడు సమాధిపైన చక్కగా మన్నుపోయండి ఆ తర్వాత ఒక ఒంటె జిబహ్ చేయబడి, దాని మాంసం పంచబడినంతసేపు (దుఆ చేస్తూ) నా సమాధి చుట్టూ నిలబడి ఉండండి. దానివల్ల నా మనసుకు ఓదార్పు లభిస్తుంది. నా ప్రభువు పంపిన దూతలకు నేను ఏం సమాధానం చెబుతానో తెలుసుకుంటాను. (ముస్లిం) (కితాబుల్ ఈమాన్, బాబు కౌనిల్ ఇస్లామి యహ్దిము మా ఖబ్ లహూ)
గమనిక:- ఈ సందర్భంగా మనం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) ని చాలా సందర్భాల్లో పొగిడారన్న విషయం గుర్తుంచుకోవాలి. ఒకసారి ఆయన “అమ్ర్ నిజమైన విశ్వాసి” అన్నారు. మరోసారి ‘అమ్ర్ బిన్ ఆస్ ఖురైషు తెగలోని మంచివారిలో ఒకరు’ అని అన్నారు. ఒకసారి ఆయన “అల్లాహ్! అమ్ర్ బిన్ ఆస్ను క్షమించు” అని ప్రార్థించారు. మరోసారి “అల్లాహ్ అమ్రిన్ను కరుణించాలి” అని దీవించారు. వల్లాహు ఆలము బిస్సవాబ్.
158వ అంశం : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి కంచరగాడిద సమాధి శిక్ష శబ్దం విని బెదిరిపోయింది. అప్పుడాయన తన అనుచరులను సమాధి శిక్ష నుంచి శరణువేడుకోమని ఆదేశించారు.
హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం: నేను ఈ హదీసు (స్వయంగా) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుంచి వినలేదు. జైద్ బిన్ సాబిత్ చెప్పగా విన్నాను. ఆయన నాతో ఇలా చెప్పారు: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బనూ నజ్జార్ తోటలో కంచర గాడిద మీద వెళ్తున్నారు. ఆయన వెంట మేము కూడా ఉన్నాం. అంతలో హఠాత్తుగా ఆయన గాడిద బెదిరింది. కాస్తయితే ఆయన్ని కింద పడేసేది. అక్కడ ఆరు లేక ఐదు లేక నాలుగు సమాధులు ఉన్నాయి. “ఈ సమాధుల్లో ఉన్న వారెవరో మీలో ఎవరికయినా తెలుసా?” అని ఆయన మమ్మల్ని అడిగారు. ఒకతను “నాకు తెలుసండీ” అన్నాడు. ఆయన “వీళ్లు ఎప్పుడు చనిపోయారు?” అని అడిగారు. “బహుదైవారాధన చేస్తున్న కాలంలో” అని చెప్పాడా వ్యక్తి. అప్పుడు ఆయన “ప్రజలు సమాధుల్లో పరీక్షించబడుతారు. మీరు మీ మృతులను పాతి పెట్టడం మానేస్తారనే భయమే గనక నాకు లేకపోయినట్లయితే నాకు వినపడుతున్నట్లు మీకు కూడా సమాధి శిక్ష వినిపించాలని నేను దైవాన్ని ప్రార్థించేవాణ్ణి అని అన్నారు. తర్వాత మావైపు తిరిగి “నరక శిక్ష నుంచి అల్లాహ్ శరణు వేడుకోండి” అని ఉపదేశించారు. అందుకు జనం “మేము అల్లాహ్ శరణు వేడుకుంటున్నాం – నరకాగ్ని నుంచి” అని అన్నారు. మళ్లీ ఆయన “అల్లాహ్ శరణు వేడుకోండి- సమాధి శిక్ష నుంచి” అని చెప్పారు. అందుకు జనం “మేము అల్లాహ్ శరణు వేడుకుంటున్నాం- సమాధి శిక్ష నుంచి” అని అన్నారు. తర్వాత ఆయన “శరణు వేడుకోండి బాహ్య, ఆంతరంగిక ఉపద్రవాల నుంచి” అని అన్నారు. అందుకు జనం “మేము అల్లాహ్ శరణు వేడుకుంటున్నాం. బాహ్య ఆంతరంగిక ఉపద్రవాల నుంచి” అని అన్నారు. ఆ తర్వాత ఆయన “అల్లాహ్ శరణు వేడుకోండి – దజ్జాల్ ఉపద్రవం. నుంచి” అని చెప్పారు. జనం “మేము అల్లాహ్ శరణు వేడుకుంటున్నాం దజ్జాల్ / ఉపద్రవం నుంచి” అని అన్నారు. (ముస్లిం) (కితాబుల్ జన్నతి వ సిఫతు నయీమిహా)
159వ అంశం : సమాధి మరియు పరలోకం గురించి దైవప్రవక్త ఉపన్యాసం విని అబూజర్ (రదియల్లాహు అన్హు) తాను ఒక చెట్టు అయి ఉండి, దాన్ని కొట్టేస్తే బాగుండేది అని కోరుకున్నారు.
సూచన :- 70వ అంశం క్రింది హదీసు చూడండి.
160వ అంశం : సమాధి భయం నుంచి విముక్తి కోసం అబూజర్ (రదియల్లాహు అన్హు) హితవు!
హజ్రత్ అబూ జర్ర్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటుండేవారు: ప్రజలారా! నేను మీ శ్రేయోభిలాషిని. మిమ్మల్ని ప్రేమిస్తున్నవాణ్ణి. చెబుతున్నాను వినండి! సమాధిలో భయం కలగకుండా ఉండాలంటే రేచీకటిలో నమాజులు చేయండి. (అంటే తహజ్జుద్ నమాజు) (అబూ నయీమ్) (హిల్యతుల్ ఔలియా మొదటి సంపుటి 165వ పుట)
161వ అంశం: హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) మరణించినప్పుడు తన సుదీర్ఘ ప్రయాణాన్ని తన దగ్గరున్న కొద్ది సామగ్రిని తలచుకొని భయంతో విలపించసాగారు.
అబూహురైరా (రదియల్లాహు అన్హు) తను మరణవ్యాధికి లోనైనప్పుడు విలపించసాగారు. “ఎందుకు ఏడుస్తున్నారండీ’ అని అడిగితే” “నేను మీ ఈ ప్రపంచాన్ని (విడిచిపెట్టి వెళ్తున్నందుకు) ఏడ్వటం లేదు. (రాబోయే) సుదీర్ఘ ప్రయాణం, నా దగ్గరున్న కొద్ది సామగ్రిని చూసుకొని ఏడుస్తున్నాను. నేనొక ఎత్తయిన ప్రదేశంలో గడిపాను. దాని ముందు స్వర్గముంది లేదా నరకముంది. ఈ రెండిట్లో నా స్థలం ఏది అవుతుందో నాకు తెలియదు” అని అన్నారు. [ఇబ్నె ముబారక్ గారి కితాబుజ్జహద్ 38వ పుట]
162వ అంశం: సమాధి జ్ఞాపకాలు మాలిక్ బిన్ దీనార్ (రహిమహుల్లాహ్ )ను ఎంతగా ఏడ్పించాయంటే దాని మూలంగా ఆయన సొమ్మసిల్లి పడిపోయారు.
మాలిక్ బిన్ దీనార్ (రహిమహుల్లాహ్ ) ఇలా అన్నారు: చావు తన అంతిమ పర్యవసానమనీ, సమాధి తన స్థలమని తెలిసి కూడా (ప్రపంచంలో నిశ్చింతగా హాయిగా) జీవితం గడిపేవారిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
“ఈ మాట అన్న తర్వాత మాలిక్ బిన్ దీనార్ ఏకధాటిగా ఏడ్వసాగారు. అలా ఏడుస్తూ ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోయారు” అని ఉల్లేఖకుడు తెలిపారు. (సఫ్వహ్ మూడో సంపుటి 198వ పుట)
సమాధి శిక్ష నుంచి శరణు వేడే దుఆలు
163వ అంశం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ క్రింది వాక్యాలతో సమాధి శిక్ష నుంచి రక్షణ కోరుకునేవారు:
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రార్థించేవారు: అల్లాహుమ్మ ఇన్నీ అవూజు బిక మిన్ అజాబిల్ ఖబ్ర వమిన్ అజాబిన్నారి, వ మిన్ ఫిత్నతిల్ మహ్య వల్ మమాతి వమిన్ ఫిత్ నతిల్ మసీహిద్దజ్జాలి.
ఓ అల్లాహ్! నేను సమాధి శిక్ష నుంచి, నరక శిక్ష నుంచి, జీవన్మరణాల ఉపద్రవాల నుంచి, మసీహ్ దజ్జాల్ ఉపద్రవం నుంచి నీ రక్షణ కోరుకుంటున్నాను. (బుఖారీ) (కితాబుల్ జనాయెజ్ బాబుత్త అవ్వుజు మిన్ అజాబిల్ ఖబ్రరి )
164వ అంశం : సమాధి శిక్ష నుంచి శరణు వేడుకోవటానికి మరో ప్రార్థన
హజ్రత్ ఆయిషా (రజి. అన) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రార్థించారు:
అల్లాహుమ్మ రబ్బ జిబ్రయీల వమికాయీల వరబ్బ ఇస్రాఫీల అవూజు బిక మిన్ హర్రిన్నారి వ మిన్ అజాబిల్ ఖబ్రి.
ఓ అల్లాహ్ ! జిబ్రయీల్, మికాయీల్ (దూతలకు ప్రభువా! నేను నరక తాపం నుంచి, సమాధి శిక్ష నుంచి నీ శరణు వేడుకుంటున్నాను. (నసాయి-సహీహ్) (కితాబుల్ ఇస్తిఆజహ్ బాబుల్ ఇస్తిఆజతి మిన్ హర్రిన్నారి. (2/5092))
గమనిక :- మక్కా బహుదైవారాధకులు దైవదూతల్ని అల్లాహ్ భాగస్వాములనో లేక అల్లాహ్ కుమార్తెలనో అనుకునేవారు. పై దుఆలోని ప్రారంభవాక్యాల్లో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘జిబ్రయీల్ మికాయీల్ దూతలకు ప్రభువా!” అని చెప్పి ఆ బహుదైవత్వ విశ్వాసాన్ని ఖండించారు. దూతలు అల్లాహ్ కుమార్తెలుగాని, ఆయన భాగస్వాములుగాని కారనీ, ‘నిజానికి వారు ఆయన చేత సృష్టించబడిన ఓ నిస్సహాయ సృష్టి అని బోధించారు.
165వ అంశం: సమాధి ఉపద్రవం నుంచి శరణువేడుకునే ప్రార్థన.
అబుల్ ఖాసిమ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజులో ఈ విధంగా ప్రార్థిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు:
అల్లాహుమ్మ ఇన్నీ అవూజు బిక మిన్ ఫిత నతిల్ ఖబ్రరి వమిన్ ఫిత్ నతిద్దజ్జాలి వమిన్ ఫిత్ నతిల్ మహ్య వల్ మమాతి వమిన్ హర్రి జహన్నమ”
ఓ అల్లాహ్ ! నేను సమాధి ఉపద్రవం నుంచి, దజ్జాల్ ఉపద్రవం నుంచి జీవన్మరణాల ఉపద్రవం నుంచి ఇంకా నరకతాపం నుంచి నీ శరణు వేడుకుంటున్నాను. (నసాయి – సహీహ్) (కితాబుల్ ఇస్తిఆజహ్ బాబుల్ ఇస్తిఆజతి మిన్ హర్రిన్నారి. (2/5093))
సమాధుల్లో ఉన్నవారి కొరకు మన్నింపు ప్రార్ధన
166వ అంశం : శ్మశానానికి వెళ్ళినా లేక శ్మశానం దగ్గరినుంచి వెళ్ళినా సమాధుల్లో ఉన్నవారి కోసం ఈ క్రింది విధంగా ప్రార్థించాలి:
హజ్రత్ బురైదా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజలకు శ్మశానం వైపు వెళ్ళినప్పుడు ఈ దుఆ చేయమని నేర్పించేవారు:
అస్సలాము అలైకుమ్ అహ్లద్దియారి మినల్ మూమినీన వల్ ముస్లిమీన వ ఇన్నా ఇన్షా అల్లాహు బికుమ్ లలాహిబూన అస్లుల్లాహ లనా వలకుముల్ ఆఫియహ్”
ఈ ఇంటి ముస్లిం మోమిన్ వాసులారా! అస్సలాము అలైకుమ్. దైవం తలిస్తే మేమూ మీ దగ్గరికి రానున్నాం. నేను మా కోసం మీ కోసం మరియు అందరికోసం దైవాన్ని క్షేమం ప్రసాదించమని అడుగుతున్నాను) (ముస్లిం) (కితాబుల్ జనాయెజ్ బాబు మాయుఖాలు ఇంద దుఖూలిల్ ఖుబూరి వద్దుఆ లిఅహ్హా)
167వ అంశం : సమాధి వాసుల మన్నింపు కోసం మరో ప్రార్థన ఇది
హజ్రత్ ఆయిషా (రజిఅన) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏ రాత్రి అయితే నా దగ్గరికి వస్తారో ఆ రాత్రి చివరి భాగంలో ఆయన (మదీనా శ్మశానం) బఖీకు వెళ్ళి ఇలా పలికేవారు: అస్సలాము అలైకుమ్ దారభౌమం మూమినీన వ ఆతాకుమ్ మా తూఅదూన గదన్ ముఅజ్జలూన వఇన్నా ఇన్షా అల్లాహు బికుమ్ లాహిబూన అల్లాహుమ్మగ్ ఫిర్ లిఅహ్లి బఖీయిల్ గర్భద్.
ఈ ఇంటి విశ్వాసులారా? అస్సలాము అలైకుమ్! మీకు వాగ్దానం చేయబడినది మీకు లభించింది. (అందులోని మిగతా భాగం) రేపటికోసం (అంటే ప్రళయదినానికి) వాయిదా వేయబడింది. దైవం తలిస్తే మేము కూడా మీ దగ్గరికి వస్తాం. ఓ అల్లాహ్! బఖీగర ఖద్ వారి పాపాలను క్షమించు (ముస్లిం) (కితాబుల్ జనాయెజ్ బాబు మాయుఖాలు ఇంద దుఖూలిల్ ఖుబూరి వద్దుఆ లి అహ్ లిహా)
ఇతరత్రా విషయాలు
168వ అంశం : ఏదయినా సదుద్దేశ్యంతో ప్రయాణం చేస్తూ మరణించినవాడికి స్వర్గం ప్రాప్తిస్తుంది.
అబ్దుల్లాహ్ బిన్ అమ్ర (రదియల్లాహు అన్హు) కథనం: మదీనాలో పుట్టిన ఒకతను మదీనాలోనే చనిపోయాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతని జనాజా నమాజ్ చేయించిన తర్వాత “ఇతను (మదీనాలో కాకుండా వేరేచోట మరణిస్తే బాగుండు” అని అన్నారు. అది విని అనుచరులు “ఎందుకు దైవప్రవక్తా?” అని అడిగారు. అందుకాయన “మనిషి తను జన్మించిన స్థలంలో కాకుండా వేరేచోట మరణిస్తే అతనికి తన జన్మస్థలం నుంచి మరణ స్థలం వరకు స్వర్గంలో చోటు ఇవ్వబడుతుంది.” అని చెప్పారు. (నసాయి-హసన్) (కితాబుల్ జనాయెజ్ బాబుల్ మౌతి బిగైరి మౌలిదిహీ (2/1728))
169వ అంశం:విశ్వాసి మరణం స్వయంగా తన పాలిట ముక్తిదాయకమవుతుంది. అదే పాపాత్ముని మరణంతో అల్లాహ్ యొక్క సృష్టిరాశి చివరికి జంతువులు, రాళ్లు, చెట్లు కూడా ముక్తి పొందుతాయి.
హజ్రత్ అబూఖతాదా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు నుంచి ఒక జనాజా వెళ్ళింది. అప్పుడు ఆయన ‘ఇతను సుఖం అనుభవిస్తున్నాడు లేక ఇంకొకరిని సుఖ పెడ్తున్నాడు” అన్నారు. అది విని అనుచరులు “సుఖం అనుభవిస్తున్నాడు. సుఖపెడ్తున్నాడు అంటే ఏమిటి” అని అడిగారు. అందుకాయన “విశ్వాసి అయిన మనిషి మరణానంతరం ప్రాపంచిక కష్టాలు బాధల నుంచి విముక్తి పొంది దైవకారుణ్యంలో సుఖం అనుభవిస్తాడు. అదే పాపాత్ముడు మరణిస్తే ప్రజలు, నగరాలు, చెట్లు, జంతువులు అందరూ సుఖం అనుభవిస్తారు” అని చెప్పారు. (బుఖారీ) (కితాబుర్రిఖాఖ్, బాబు సక్రాతుల్ మౌతి)
170వ అంశం: మనిషి దగ్గర వీలునామా రాయదగిన వస్తువేదయినా ఉంటే అతను వీలునామా రాసి తన దగ్గర ఉంచుకోవాలి.
అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: ఏ ముస్లిం దగ్గరయినా వీలునామా రాయదగిన వస్తువేదయినా ఉంటే అతను అది రాయకుండా రెండు రాత్రులు కూడా గడపరాదు. (బుఖారీ-ముస్లిం) (జుబైదీగారి సహీహ్ బుఖారీ సంక్షిప్తం 1194వ హదీసు)
171వ అంశం: వృద్ధాప్యంలో ఆయుష్షు మీద ఆత్రం పెరుగుతుంది.
హజ్రత్ అసన్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: రెండు విషయాలు యవ్వనానికి చేరుకుంటూ ఉంటాయి. 1) జీవితం మీద ఆశ
2) ధనవ్యామోహం. (తిర్మిజీ-సహీహ్) ( కితాబుజ్జుహద్ బాబు మాజాఅ ఫీ ఖల్బిషైఖ్… )
172వ అంశం : మరణానికి ముందు మంచి పనులు చేసే భాగ్యం కలగటం దైవానుగ్రహం
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అల్లాహ్ ఏ దాసునికయినా మంచి చేయాలని కోరుకుంటే అతని చేత పని చేయించుకుంటాడు” అని చెప్పారు. “ఏం పని చేయించుకుంటాడు?” అని అడగ్గా “మరణానికి ముందు ఆ దాసునికి మంచి పనులు చేసే భాగ్యాన్ని ప్రసాదిస్తాడు” అని చెప్పారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (హాకిమ్ – హసన్) (ముహ్ యుద్దీన్ దీబ్ అత్ తర్గీబ్ వత్ తర్హీబ్, నాల్గో భాగం 4919వ హదీసు)
173వ అంశం: విశ్వాసికి ఉపద్రవాల కంటే మరణం మేలు!
హజ్రత్ మహమూద్ బిన్ లబీద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: ఆదం పుత్రుడు (మనిషి) రెండు విషయాలను అసహ్యించు కుంటాడు. ఒకటి చావు. నిజానికి విశ్వాసిపాలిట చావు ఉపద్రవాల కంటే మేలైనది. రెండోది. మనిషి సంపద తగ్గుదలను అసహ్యించుకుంటాడు. నిజానికి సంపదలో తగ్గుదల దైవానికి చూపించే లెక్కలో తగ్గుదల కనుక అది మంచిదే! (అహ్మద్) (అల్బానిగారి మిష్కాతుల్ మసాబీహ్ మూడో సంపుటి 5251వ హదీసు)
174వ అంశం: మరణానంతరం కేవలం మనిషి ఆచరణలు మాత్రమే అతనికి తోడ్పడతాయి.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: మృతుని వెంట మూడు వస్తువులు వెళ్తాయి. వాటిలో రెండు వస్తువులు తిరిగి వస్తాయి. ఒకటి మాత్రమే అతని వెంట ఉంటుంది. మృతుని కుటుంబీకులు, సంపద, కర్మలు- ఈ మూడూ వెంట వెళ్తాయి. కుటుంబీకులు, సంపద తిరిగొస్తారు. తను చేసుకున్న కర్మలు మాత్రం వెంట ఉంటాయి. (బుఖారీ – ముస్లిం) (అల్బానీ గారి సహీహ్ ముస్లిం సంక్షిప్తం 2086వ హదీసు)
175వ అంశం: మనిషి మరణించినప్పుడు దైవదూతలు అడిగే ప్రశ్న “ఇతను పరలోకానికి ఏం పంపించుకున్నాడు?
అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఈ హదీసును దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుంచి ఉల్లేఖించారు: మనిషి చనిపోయినప్పుడు దైవదూతలు “ఇతను పరలోకానికి ఏం పంపించు కున్నాడు?” అని అడుగుతారు. మరోవైపు (ప్రపంచంలో) ప్రజలేమో “ఇతను ఏం వదలి వెళ్తున్నాడు?” అని చూస్తారు. (బైహఖీ) (కితాబుల్ మలాహిమ్ బాబున్ ఫీ తదాయిల్ ఉమమి అలల్ ఇస్లామ్ (3/3610))
176 వ అంశం : మరణబాధ విశ్వాసి పాపాలకు పరిహారం అవుతుంది.
హజ్రత్ ఆయిషా (రజి. అన్ హా) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: విశ్వాసికి ముల్లు గుచ్చుకున్నప్పుడు లేక అంతకన్నా తక్కువ బాధ కలిగినప్పుడు అల్లాహ్ అతని ఒక అంతస్తును పెంచుతాడు. ఒక పాపాన్ని క్షమిస్తాడు. (తిర్మిజీ – సహీహ్) (అబ్వాబుల్ జనాయెజ్ బాబు మాజాఅఫీ సవాబిల్ మర్జి (1/771))
హజ్రత్ అబూసయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: విశ్వాసికి ఏదయినా కష్టం, దుఃఖం, బాధ కలిగినప్పుడు ఆఖరికి అతన్ని ఏదయినా ఆలోచన పీడించినా దాని కారణంగా అల్లాహ్ విశ్వాసి పాపాలను తుడిచివేస్తాడు. (తిర్మిజీ -హసన్) (అబ్వాబుల్ జనాయెజ్ బాబు సవాబిల్ మర్జి (2/774))
హజ్రత్ అబూ ఉమామా బాహిలీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: ఏ మనిషినయినా వ్యాధి దారుణంగా కృంగదీస్తే అల్లాహ్ ఆ వ్యాధి మూలంగా అతన్ని పాపాల నుంచి శుద్ధం చేసి (ప్రపంచం నుంచి) లేపుకుంటాడు. (తబ్రానీ – హసన్) (అత్తరీబ్ వత్తరోబ్ నాల్గోసంపుటి 5038వ హదీసు)
177వ అంశం: చావు విశ్వాసికి కానుక లాంటిది!
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు. మరణం విశ్వాసి పాలిట (దైవ) కానుక. (తబ్రానీ) (ముహ్ యుద్దీన్ దీబ్ అత్ తర్గీబ్ వత్ తర్హీబ్ నాల్గో సంపుటి 5123వ హదీసు)
గమనిక :- మరణించిన తర్వాత విశ్వాసి అయిన మనిషి ప్రాపంచిక కష్టాలు, బాధల నుంచి విముక్తి పొందుతాడు. అక్కణ్ణుంచి తన పరలోక శాశ్వత అనుగ్రహాల పరంపర మొదలవుతుంది. అందుకని మరణం విశ్వాసిపాలిట కానుక అని చెప్పబడింది.
“రబ్బిగ్ ఫిర్ వరమ్”
ప్రభూ! నన్ను క్షమించు, నామీద దయజూపు
ఓ సర్వలోక ఆరాధ్య దేవా!
భూమ్యాకాశాలు, వాటిమధ్య ఉన్న సమస్త వస్తువుల సృష్టికర్తవి, వాటి యజమానివి నీవే. భూమ్యాకాశాలు, వాటిమధ్య ఉన్న సమస్త వస్తువులను నిలబెట్టినవాడివి నీవే. భూమ్యాకాశాలు, వాటి మధ్య జరిగే ప్రతి పనికి వ్యూహరచన చేసేవాడివి నీవే. భూమ్యాకాశాలు, వాటి మధ్య ఉన్న ప్రతి వస్తువుని పోషించేవాడివి నీవే. పొగడ్తలు, ప్రశంసలన్నీ నీకే శోభిస్తాయి.
మహోన్నతుడా.. మహిమాన్వితుడా!
అస్తిత్వం, గుణగణాల రీత్యా నీవు సాటిలేని మేటివి. నీకు ఉపమానం లేదు. నీకు భాగస్వాములు ఎవరూ లేరు. సహవర్తులు కూడా ఎవరూ లేరు. నీవు లోపాలకు అతీతుడవు. ప్రశంసలు, పొగడ్తలన్నీ నీకే శోభిస్తాయి.
దయామయుల్లో కెల్లా గొప్ప దయామయా….!
నీవు పరిపాలకులందరిలోకెల్లా గొప్ప పరిపాలకుడివి. కరుణించే వారందరిలో కెల్లా మహా కరుణామయుడివి. దయజూపే వారందరిలోకెల్లా పరమ దయామయుడివి. గౌరవవంతుల్లోకెల్లా గొప్ప గౌరవవంతుడివి. పౌరుషం కల వారందరిలో కెల్లా మహా పౌరుషవంతుడివి. ప్రశంసలు, పొగడ్తలన్నీ నీకే శోభిస్తాయి.
కరుణామయుల్లోకెల్లా గొప్ప కరుణామయా!
గ్రంథాన్ని అవతరింపజేసినవాడివి నీవే. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బిన్ అబ్దుల్లాహ్ ను ప్రవక్తగా నియమించి పంపింది నీవే. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను శుభవార్తాహరునిగా, హెచ్చరికలు చేసేవాడిగా నియమించి పంపించింది నీవే. మమ్మల్ని శ్రేష్ఠసమాజంగా రూపొందించినవాడివి నీవే. మాకు ఇస్లాం ధర్మం మీద నడవటం సులభం చేసినవాడివి నీవే. ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కే శోభిస్తాయి.
దానశీలుల్లోకెల్లా మహాదానశీలి…!
మా సుదీర్ఘ జీవితపు ఒక్కో క్షణాన్ని శ్రేయోశుభాలతో, సాఫల్యక్షేమాలతో గడిపేవాడివి నీవే. ఇప్పుడు.. జీవితపు ప్రయాణం అయిపోవచ్చింది. జీవిత నౌక ఒడ్డుకు చేరబోతోంది. జీవిత గమ్యం ముందు కనిపిస్తోంది. ఆ గమ్యంలో ప్రతి క్షణంలోనూ నీ దయ, నీ ఉపకారం, నీ కరుణా కటాక్షాలు అవసరమవుతాయి. నీ నిరపేక్ష సన్నిధిలో నీ పాపిష్టిదాసులమైన మేము చేతులు చాపి నీ కరుణాకటాక్షాలు భిక్షం అడుక్కుంటున్నాం. కరుణామయుడవు, కృపాశీలుడవయిన ప్రభువా…! నీ కరుణాకటాక్షాలతో జీవితపు చరమ ఘడియలు మా కొరకు సులభం చెయ్యి.
కరుణామయుడవు, కృపాశీలుడవు అయిన ప్రభువా! నీ కరుణా కటాక్షాలతో మరణ సమయంలో మా దగ్గరికి కారుణ్య దూతల్ని పంపించాలి.
కరుణామయుడవు కృపాశీలుడవయిన ప్రభువా! మరణించే సమయంలో నీ కరుణాకటాక్షాలతో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ కలిమా పఠించే అదృష్టాన్ని ప్రసాదించు.
కరుణామయుడవు, కృపాశీలుడవైన ప్రభువా! మా ఆత్మల కొరకునీ కరుణాకటాక్షాలతో ఆకాశద్వారాలు తెరువాలి.
కరుణామయుడవు కృపాశీలుడవైన ప్రభువా! నీ సన్నిహిత దూతలను నీ కరుణా కటాక్షాలతో మా పాలిట శ్రేయోశుభాల సాక్షులుగా నియమించు.
కరుణామయుడవు కృపాశీలుడవైన ప్రభువా! నీ కరుణా కటాక్షాలతో మా పేర్లు ఇల్లియ్యీన్లో నమోదు చేయమని ఆదేశించు.
కరుణామయుడవు కృపాశీలుడవైన ప్రభువా! మమ్మల్ని నీ కరుణా కటాక్షాలతో సమాధిలోని భయాందోళనల నుంచి సురక్షితంగా ఉంచాలి
కరుణామయుడవు కృపాశీలుడవైన ప్రభువా! మా సమాధుల్లో నీ కరుణా కటాక్షాలతో పౌర్ణమినాటి పండు వెన్నెల నింపాలి.
కరుణామయుడవు కృపాశీలుడవైన ప్రభువా! నీ కరుణా కటాక్షాలతో మా సమాధులను కనుచూపుమేరకు విశాల పరచు.
కరుణామయుడవు కృపాశీలుడవైన ప్రభువా! నీ కరుణాకటాక్షాలతో మా సమాధిని స్వర్గవనాల్లోని ఒక వనంగా మార్చాలి.
కరుణామయుడవు కృపాశీలుడవైన ప్రభువా! పాపాత్ములమైన మేము నీ కరుణాకటాక్షాల బిచ్చగాళ్ళం. నీ కరుణాకటాక్షాలు భిక్షం అడుక్కుంటున్నాం.
కరుణామయుడవు కృపాశీలుడవైన ప్రభువా! నీ అనంత కరుణా కటాక్షాలతో మా సంచులు నింపు.
కరుణామయుడవు కృపాశీలుడవైన ప్రభువా! కరుణించు.
కరుణామయుడవు కృపాశీలుడవైన ప్రభువా! కరుణించు.
పాపాలను మరుగుపరిచేవాడవు, క్షమాశీలుడవైన ప్రభువా! కరుణించు.
మహోపకారి, అనుగ్రహప్రదాతవు అయిన ప్రభువా….! కరుణించు.
“ప్రభూ! క్షమించు, కరుణించు, నీవే కరుణించేవారందరిలోకెల్లా గొప్ప కరుణామయుడివి. ” (సూరె మూమినూన్, 118వ సూక్తి)
![సమాధి సంగతులు (ఖబర్ కా బయాన్) [పుస్తకం]](https://teluguislam.net/wp-content/uploads/2022/02/samadhi-sangatulu.png?w=674)
You must be logged in to post a comment.