ఆచరణలు కేవలం మనో సంకల్పంపై ఆధారపడి ఉంటాయి

عَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: (إِنَّمَا الْأَعْمَالُ بِالنِّيَّاتِ وَإِنَّمَا لِكُلِّ امْرِئٍ مَا نَوَى فَمَنْ كَانَتْ هِجْرَتُهُ إِلَى اللهِ وَرَسُولِهِ فَهِجْرَتُهُ إِلَى اللهِ وَرَسُولِهِ وَمَنْ كَانَتْ هِجْرَتُهُ لِدُنْيَا يُصِيبُهَا أَوْ امْرَأَةٍ يَتَزَوَّجُهَا فَهِجْرَتُهُ إِلَى مَا هَاجَرَ إِلَيْهِ).

1- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారని ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“ఆచరణలు కేవలం మనో సంకల్పంపై ఆధారపడి ఉంటాయి. మనిషి దేని సంకల్పం చేసుకుంటాడో, అతనికి అదే ప్రాప్తమవుతుంది. (ఉదాహరణకు:) ఎవరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొరకు వలసపోతాడో అతని వలస మాత్రమే నిజమయినది. ఎవరు ప్రపంచం కొరకు లేదా ఏదైనా స్త్రీని వివాహమాడటానికి వలసపోతాడో, అతని వలస ప్రపంచం కొరకు లేదా స్త్రీ కొరకు అనే పరిగణించబడుతుంది”. (బుఖారి 1, ముస్లిం 1907).

ఈ హదీసులో:

ఈ హదీసు ప్రతి ఆచరణకు పునాది లాంటిది. కర్మల అంగీకారం, తిరస్కారం మరియు అవి మంచివా లేదా చెడ్డవా అన్న విషయం మనోసంకల్పంపై ఆధారం పడి ఉంటుంది. ఎవరు ఏ సంకల్పం చేస్తారో అతనికి అదే ప్రాప్తమవుతుంది. ఒకప్పుడు ఆచరణ బాహ్యంగా (చూడటానికి) చాలా మంచిగా ఉండవచ్చు. కాని సత్సంకల్పం లేని కారణంగా అది చేసిన వానికి ఏ లాభమూ దొరక్కపోవచ్చు. దీనికి సంబంధించిన నిదర్శనాలు ఖుర్ఆనులో మరీ స్పష్టంగా ఉన్నాయి:

[أَلَا للهِ الدِّينُ الخَالِصُ] {الزُّمر:3} [مُخْلِصِينَ لَهُ الدِّينَ] {البيِّنة:5} [لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ] {الزُّمر:65}

{జాగ్రత్తా! ధర్మం ప్రత్యేకంగా అల్లాహ్ కు చెందిన హక్కు మాత్రమే}. (సూరె జుమర్ 39:3).

{పూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్ని అల్లాహ్ కే ప్రత్యేకించుకోవాలి}. (సూరె బయ్యినహ్ 98: 5).

{మీరు షిర్క్ చేస్తే మీ కర్మలన్నీ వ్యర్థమైపోతాయి}. (సూరె జుమర్ 39: 65).

ఈ హదీసులో తెలిసిన మరో విషయం ఏమనగా: మనస్సు కార్యమే (సంకల్పశుద్ధియే) అన్నిటికి మూలం. మనిషి తాను చేసే ప్రతీ కార్యం తన ప్రభువు కొరకే ప్రత్యేకించి చేయుటకు, దాన్ని షిర్క్ దరిదాపులకు, ఇతర ఉద్దేశాలకు దూరంగా ఉంచుటకు ప్రయత్నం చేయాలి. ఆ కార్యం ద్వారా అల్లాహ్ సంతృప్తి, ఆయన దర్శనం పొందే ఉద్దేశ్యం మాత్రమే ఉంచాలి.

సర్వకార్యాలు, వాటి ఉద్దేశ్యాల్ని బట్టి ఉంటాయి తప్ప బాహ్య రూపంతో కాదు. ఎవరూ మరొకరి బాహ్య రూపం, బాహ్యాచరణలతో మోసపోకూడదు. అతని సంకల్పంలో కీడు చోటు చేసుకోవచ్చు. అయినా ప్రజల పట్ల సదుద్దేశం కలిగి ఉండటమే అసలైన విషయం.

ఆరాధనలు చేసేవారి పుణ్యాల్లో వ్యత్యాసం వారి మనస్సంకల్పాన్ని బట్టి ఉంటుంది అని కూడా తెలుస్తుంది.

ప్రమాణం, మ్రొక్కుబడి, విడాకులు, అలాగే షరతులు, వాగ్థానం, ఒప్పందాల్లాంటి విషయాల్లో సంకల్పం (నియ్యత్) తప్పనిసరిగా ఉండాలి. మరచిపోయేవాడు, బలవంతం చేయబడినవాడు, అజ్ఞాని, పిచ్చివాడు మరియు చిన్న పిల్లలు చేసే పనులు (ఉద్దేశపూర్వకంగా ఉండవు గనక) వారిపై ఇస్లామీయ ఆదేశాలు విధిగా లేవు. ఎవరు ఏ సంకల్పం చేస్తారో అతనికి అదే ప్రాప్తమవుతుంది. వేరేది కూడా లభించవచ్చునా లేదా? అన్న విషయం సందిగ్ధంలో ఉంది. మనుషుల సంకల్పాలను అల్లాహ్ తప్ప మరెవరూ ఎరుగరు.

ప్రదర్శనాబుద్ధి, పేరుప్రఖ్యాతులు పొందే సంకల్పం ప్రశంసనీయమైనది కాదు అని ఈ హదీసు ద్వారా తెలుస్తుంది. అది అల్లాహ్ యేతరులతో ఏదైనా పొందే ఉద్దేశ్యం క్రింద లెక్కించబడుతుంది. సత్సంకల్పం లేనిదే ఏ కార్యాలూ, సత్కార్యాలుగా పరిగణింపబడవు. ఎవరైతే ప్రాపంచిక లాభానికి ప్రాముఖ్యతనిచ్చి పరలోక లాభాన్ని విస్మరిస్తారో అతను పరలోక లాభాన్ని కోల్పోతాడు. మరెవరైతే పరలోక లాభానికి ప్రాముఖ్యతనిచ్చి, దానితో పాటు ప్రాపంచిక ప్రయోజనం కూడా పొందాలనుకుంటాడో అతనికి ప్రాపంచిక లాభం లభిస్తుంది మరియు పరలోకంలో కూడా సత్ఫలితం ప్రాప్తిస్తుంది. ఎవరైతే తాను చేసే ఆచరణ ద్వారా ప్రజల ప్రసన్నత పొందాలని ఉద్దేశిస్తాడో అతడు షిర్క్ చేసినవాడవుతాడు.

అల్లాహ్ చాలా సూక్ష్మజ్ఞాని అని మరియు అతి రహస్య విషయాలు కూడా ఎరుగువాడని ఈ హదీసు ద్వారా తెలుస్తుంది. ఇంకా దుష్టులను వారి దుష్సంకల్పం వల్ల హీనపరచకుండా వారి విషయం దాచి ఉంచి అల్లాహ్ తన దాసులపై చేసిన మేలు కూడా ఈ హదీసు ద్వారా తెలుస్తుంది.

సాఫల్యానికి సబబు ఆచరణలు ఎక్కువ ఉండటం కాదు. అవి మంచివి అయి ఉండటం. ఇఖ్లాస్ (అల్లాహ్ సంతృప్తి కొరకు, ఆయనకే ప్రత్యేకించి) మరియు ప్రవక్త పద్ధతి ప్రకారం చేయబడినప్పుడే ఏదైనా కార్యం సత్కార్యం అవుతుంది. చిన్న కార్యమైనా సరే ఇఖ్లాస్ తో కూడుకుంటే అదే చాలా గొప్పది. దీనికొక హదీసు కూడా సాక్ష్యముంది. మనిషి ఏదైనా కార్యం మొదలుపెట్టే ముందు తన నియ్యత్ (సంకల్పాన్ని) నిర్థారణ చేసుకోవాలి. ఫర్జ్ అయినా, నఫిల్ అయినా, ఏ కార్యమైనా నియ్యత్ లేనిది అంగీకరింపబడదు. నియ్యత్ కొరకు నోటితో పదాలు ఉచ్చరించుట అనవసరం.


ఈ పోస్ట్ ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) గారు రాసిన “విశ్వాస పాఠాలు” అనే పుస్తకం నుండి తీసుకోబడింది. పూర్తి పుస్తకం క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి చదవవచ్చు.