మరణాంతర జీవితం – పార్ట్ 16: సిఫారసు కు సంబంధించిన మూఢ నమ్మకాలు, చెడు విశ్వాసాలు [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 16 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 16. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 21:24 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్.

ఈనాటి మన శీర్షిక సిఫారసుకు సంబంధించిన మూఢ నమ్మకాలు, దుర విశ్వాసాలు. ఈ రోజుల్లో కొన్ని సామెతలు, కొన్ని ఉదాహరణలు చాలా ప్రఖ్యాతిగాంచి ఉన్నాయి మన అనేక మంది ప్రజల మధ్యలో. అవేమిటంటే మనం ఇహలోకంలో చీఫ్ మినిస్టర్ వద్దకు పోవాలంటే, ప్రైమ్ మినిస్టర్ వద్దకు పోవాలంటే వారి యొక్క P.A లేదా వారి యొక్క సెక్రటరీ యొక్క సిఫారసు ద్వారా అక్కడికి చేరుకుంటాము. అలాగే అల్లాహ్ వద్దకు మనం డైరెక్టుగా చేరుకోలేము గనక మనం పాపాత్ములము, మనతో చాలా తప్పిదాలు, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మనం ఎలా అల్లాహ్ కు ముఖం చూపించుకొని ఆయన వద్దకు వెళ్తాము? అందు గురించి ఆయన పుణ్యదాసులు, భక్తులు, విశ్వాసులు, ప్రవక్తలు, దైవ దూతలు అలాంటి వారితో మనం మొర పెట్టుకుంటే, అలాంటి వారి యొక్క సిఫారసు గురించి వారిని మనం కోరుతూ ఉంటే వారు మనల్ని అల్లాహ్ వద్దకు చేర్పిస్తారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్. మహాశయులారా! ఇలాంటి విషయం చాలా వరకు మీరు వింటారా లేదా? వింటూ ఉంటారు కానీ ఒక్కసారి అల్లాహ్ మనందరినీ క్షమించు గాక! గమనించండి. ఈలోకంలో ఉన్న నాయకులు వారితో అల్లాహ్ ను మనం పోల్చుతున్నామా? అవూదు బిల్లాహ్. ఎవరైతే ఇలాంటి ఒక సామెత ప్రైమ్ మినిస్టర్ వరకు చీఫ్ మినిస్టర్ వరకు వెళ్ళాలంటే మనకు వారి యొక్క సెక్రటరీ కింది అధికారుల సిఫారసుతో వెళ్ళాలి అని అంటూ ఉంటారో అలాంటి వారిని మీరు కూడా ఒక చిన్న ప్రేమ పూర్వకమైన ప్రశ్న అడగండి. అదేమిటంటే ఒకవేళ చీఫ్ మినిస్టర్ మరియు ప్రైమ్ మినిస్టర్ మీ క్లాసుమేట్, మీ ఇంటి పక్కన ఉండేవాడు, మీ యొక్క వాడలో ఉండేవాడు, మీ యొక్క చిన్ననాటి స్నేహితుడు అయితే అతనితో నీవు డైరెక్ట్ గా నీ సమస్యను ముందు పెట్టి నువ్వు మాట్లాడుతావా? లేక వేరే వాళ్లను అతని వద్దకు సిఫారసుకు తీసుకెళ్తావా? ప్రతి బుద్ధిమంతుడు ఏమి సమాధానం ఇస్తాడు? ప్రైమ్ మినిస్టర్ నాకు తెలిసిన వాడై ఉంటే, నాకు దగ్గరి వాడై ఉంటే నేను ఇతరులను ఎందుకు సిఫారసుగా తీసుకెళ్తాను? నేనే డైరెక్ట్ గా అతనితో మాట్లాడుకుంటాను. అవునా లేదా? మరి అల్లాహ్. అవూదు బిల్లాహ్. నేను అల్లాహ్ కు ఎలాంటి పోలికలు ఇవ్వడం లేదు. ఎవరైతే ఇలాంటి పోలికలు ఇస్తున్నారో వారి యొక్క ఆ పోలికకు సమాధానంగా ఇలాంటి ఒక విషయం చెప్పి, అల్లాహ్ గురించి మన విశ్వాసం ఏమిటి? అల్లాహ్ గురించి మన నమ్మకమేమిటి? మనం ఎంత పాపాత్ములమైనా, ఎన్ని దుష్కార్యాల్లో పడి ఉన్నా, ఆ అల్లాహ్ మనల్ని ఎలా సంబోధిస్తున్నాడు?

۞ قُلْ يَـٰعِبَادِىَ ٱلَّذِينَ أَسْرَفُوا۟ عَلَىٰٓ أَنفُسِهِمْ لَا تَقْنَطُوا۟ مِن رَّحْمَةِ ٱللَّهِ ۚ إِنَّ ٱللَّهَ يَغْفِرُ ٱلذُّنُوبَ جَمِيعًا ۚ إِنَّهُۥ هُوَ ٱلْغَفُورُ ٱلرَّحِيمُ

(ఓ ప్రవక్తా! నా తరఫున వారికి ఇలా) చెప్పు: “తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా! మీరు అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్‌ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు. (సూరా అజ్-జుమర్ 39:53)

“ఓ నా దాసులారా!” గమనించండి ఎవరిని అంటున్నాడు? నా దాసులారా అని అల్లాహు తఆలా ఇక్కడ దైవదూతలను అంటున్నాడా? ప్రవక్తలను అంటున్నాడా? పుణ్యపురుషులను అంటున్నాడా? మహా భక్తులని అంటున్నాడా? ఔలియా అల్లాహ్ ఇంకా మంచి మంచి సత్కార్యాలు చేసేవారిని అంటున్నాడా? కాదు, ఎవరైతే పాపాల మీద పాపాలు చేసుకొని తమ ఆత్మల మీద అన్యాయం చేసుకున్నారో, అల్లాహ్ యొక్క కారుణ్యం నుండి మీరు ఏమాత్రం నిరాశ చెందకండి.

అల్లాహు అక్బర్. అల్లాహ్ మనకు ఎంత దగ్గర ఉన్నాడు. అల్లాహు తఆలా డైరెక్ట్ మనలో ఎవరు ఎంత పాపాత్ములు అయినా కానీ నా దాసుడా! నా కారుణ్యం పట్ల నిరాశ చెందకు.

وَقَالَ رَبُّكُمُ ٱدْعُونِىٓ أَسْتَجِبْ لَكُمْ ۚ إِنَّ ٱلَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِى سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ

మరి మీ ప్రభువు ఏమంటున్నాడంటే, “మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. నా దాస్యం పట్ల గర్వాహంకారం ప్రదర్శించేవారు త్వరలోనే అవమానితులై నరకంలో ప్రవేశించటం తథ్యం.” (సూరా అల్ మూమిన్ 40:60)

మీ ప్రభువు మీతో చెబుతున్నాడు. నాతో డైరెక్ట్ మీరు దువా చేయండి, నేను మీ దుఆను అంగీకరిస్తాను. ఖురాన్ యొక్క ఆయతులు కదా ఇవి శ్రద్ద వహించండి. వీటి యొక్క భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి.

మరో చిన్న ఉదాహరణ ఇస్తాను. ఈ ఉదాహరణ అల్లాహ్ విషయంలో కాదు, అల్లాహ్ గురించి కాదు. మన అల్ప జ్ఞానులకు మరియు మన బుర్రలో ఈ విషయాలు కొంచెం దిగి అర్థం చేసుకోవడానికి. ఇక్కడి నుండి వెయ్యి కిలోమీటర్ల దూరంలో నేను ఏ బాబాను, ఏ వలీని, ఏ పుణ్యాత్ముడ్ని నమ్ముకుంటున్నానో అతని యొక్క సమాధి అక్కడ ఉంది. నేను ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు అల్లాహ్ ను మొరపెట్టుకొని ఓ అల్లాహ్! నా ఈ కష్టాన్ని దూరం చెయ్యి అని పలకాలా? లేకుంటే నాకు ప్రియమైన ఫలానా బాబా, ఫలానా వలి మరియు నాకు నేను మీ యొక్క మురీద్ ని, నేను ఈ కష్టంలో ఉన్నాను. నా ఈ కష్టాన్ని మీరు దూరం చేయడానికి అల్లాహ్ ను మొరపెట్టుకోండి అని అనాలా?. ఎలా చెప్పాలి? ఆలోచించండి కొంచెం. మన ఈ కష్టాన్ని ఎవరు చూస్తున్నారు? అల్లాహ్ మంచిగా చూస్తున్నాడా లేక అతనా? నా కష్టం దూరం చెయ్యి అని మనం నోట ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ మాటను అల్లాహ్ స్పష్టంగా ఏ అడ్డు లేకుండా వింటున్నాడా? లేకుంటే మనకు ప్రియమైన ఆ పుణ్యాత్ముడా? గమనించండి. ప్రతి ఒక్కరి ద్వారా సమాధానం ఏం వస్తుంది? వెయ్యి కిలోమీటర్లు వదిలేయండి. మన పక్క సమాధిలో ఉన్నప్పటికీ మనం ఏ పుణ్యాత్మునికి మురీద్ గా, ఏ పుణ్యాత్మునికి శిష్యునిగా, ఏ పుణ్యాత్మునికి మనం ప్రియునిగా ఉంటిమో అతను అతని యొక్క సమాధి మన పక్కలో ఉన్నప్పటికీ అల్లాహ్ కంటే మంచి విధంగా నా కష్టాన్ని చూసేవారు ఎవరు లేరు, అల్లాహ్ కంటే మంచి విధంగా నేను నా కష్టాన్ని నోటితో చెప్పుకున్నప్పుడు వినేవారు అంతకంటే గొప్పవారు ఎవరూ లేరు. మరియు నా కష్టాన్ని తొలిగించే విషయంలో కూడా అల్లాహ్ కు ఉన్నటువంటి శక్తి ఎవరికీ లేదు. అలాంటప్పుడు ఎవరికి మనం మొరపెట్టుకోవాలి?

ఇంకా విషయం అర్ధం కాలేదా? ఉదాహరణకి 105 డిగ్రీలు నీకు జ్వరం ఉంది. నీ పక్కనే డాక్టర్ ఉన్నాడు. నీ చుట్టుపక్కల నీ భార్య లేదు, నీ పిల్లలు లేరు, ఎవరూ లేరు. నీవు ఒంటరిగా నీవు ఆ గదిలో ఉన్నావు. పక్క గదిలో డాక్టర్ ఉన్నాడు మరియు నీ కొడుకు లేదా నీ భార్య లేదా నీవు ఎవనికి శిష్యునివో ఆ పుణ్యాత్ముడు అతని యొక్క సమాధి ఎడమ పక్కన ఉంది. నువ్వు ఎవరిని పిలుస్తావు ఈ సందర్భంలో? ఓ డాక్టర్ సాబ్ వచ్చి నాకు ఇంజక్షన్ ఇవ్వు, నన్ను చూడు అని అంటావా? లేకుంటే ఓ పుణ్యాత్ములు, ఓ నా బాబా సాహెబ్ నాకు ఈ జ్వరం ఉన్నది. నా కష్టాన్ని దూరం చెయ్యి. నా జ్వరాన్ని దూరం చెయ్యి అని అంటామా? బహుశా ఈ చిన్నపాటి ఉదాహరణల ద్వారా మాట అర్థమైంది అనుకుంటాను.

విషయం ఏంటంటే సోదరులారా! సిఫారసు యొక్క సంపూర్ణ అధికారం అల్లాహ్ చేతిలో ఉందన్న విషయం మనం తెలుసుకున్నాం. అయితే ఇంకా ఎవరైనా మనకు సిఫారసు ప్రళయ దినాన చేయగలరు అని వారితో మొరపెట్టుకోవడం, వారితో సిఫారసు గురించి కోరడం, ఇది పాతకాలపు నుండి అవిశ్వాసులు, ముష్రికులు, బహు దైవారాధకులు పాటిస్తూ వస్తున్నటువంటి ఒక ఆచారం.

ఈ విషయాన్ని అల్లాహ్ (తఆల) సూరయే యూనుస్ ఆయత్ నెంబర్ 18 లో ఎంత స్పష్టంగా తెలిపాడో మీరు ఒకసారి గమనించండి.

وَيَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ وَيَقُولُونَ هَٰؤُلَاءِ شُفَعَاؤُنَا عِندَ اللَّهِ ۚ قُلْ أَتُنَبِّئُونَ اللَّهَ بِمَا لَا يَعْلَمُ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ

వారు అల్లాహ్‌ను వదలి తమకు నష్టాన్నిగానీ, లాభాన్ని గానీ చేకూర్చలేని వాటిని పూజిస్తున్నారు. ఇంకా, “అల్లాహ్‌ సమక్షంలో ఇవి మాకు సిఫారసు చేస్తాయి” అని చెబుతున్నారు. “ఏమిటీ, ఆకాశాలలో గానీ, భూమిలో గానీ అల్లాహ్‌కు తెలియని దానిని గురించి మీరు ఆయనకు తెలియజేస్తున్నారా?” వారు కల్పించే భాగస్వామ్యాల నుంచి ఆయన పవిత్రుడు, ఉన్నతుడు అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. (సూరా యూనుస్ 10:18)

అల్లాహ్ ఆ ముష్రికుల విషయంలో తెలుపుతున్నాడు. “వారు అల్లాహ్ ను వదిలి వారికి ఏ మాత్రం లాభాన్ని చేకూర్చే లేదా వారికి ఏ మాత్రం నష్టాన్ని చేకూర్చ లేని వారిని ఆరాధిస్తున్నారు. వారు అల్లాహ్ ను వదిలి వారికి ఏ మాత్రం నష్టం గాని, లాభం కానీ చేకూర్చలేని వారిని ఆరాధిస్తున్నారు. ఇలా ఆరాధిస్తూ వారు వారి యొక్క నమ్మకాన్ని ఇలా తెలుపుతున్నారు: “మేము ఎవరినైతే ఆరాధిస్తున్నామో, ఎవరి వద్దకైతే వెళ్లి కొన్ని ఆరాధనకు సంబంధించిన విషయాలు పాటిస్తున్నామో వారు మా గురుంచి అల్లాహ్ వద్ద సిఫారసులు అవుతారు. వీరు అల్లాహ్ వద్ద మాకు సిఫారసులు అవుతారు”. వారికి చెప్పండి – ఏమిటి? అల్లాహ్ కు ఆకాశాలలో, భూమిలో తెలియని ఒక విషయాన్ని మీరు అల్లాహ్ కు తెలియపరుస్తున్నారా? ఇలాంటి సిఫారసులు చేసేవారితో, ఇలాంటి భాగస్వాములతో, అల్లాహ్ ఎంతో అతి ఉత్తముడు, పవిత్రుడు. వారు ఈ షిర్క్ పనిచేస్తున్నారు. ఇలాంటి షిర్క్ కు అల్లాహు (తఆలా) కు ఎలాంటి సంబంధం లేదు. అన్ని రకాల షిర్క్ పనులకు అతను ఎంతో ఉన్నతుడు”. గమనించారా? స్వయంగా అల్లాహ్ సూరయే యూనుస్ ఆయత్ నెంబర్ 18 లో ఇలాంటి ఎవరినైనా సిఫారసు చేస్తారు అని నమ్ముకొని వారి వద్ద ఏదైనా కొన్ని కార్యాలు చేస్తూ వారు మా గురించి అల్లాహ్ వద్ద సిఫారసు చేయాలి అని నమ్ముకోవడం ఇది షిర్క్ అని అల్లాహ్ ఎంత స్పష్టంగా తెలియ పరుస్తున్నాడు.

మరి కొన్ని ఆధారాలు, మరికొన్ని విషయాలు ఉన్నాయి. సూరతుల్ జుమర్ ఆయత్ నెంబర్ 3 ను కూడా .

 أَلَا لِلَّهِ الدِّينُ الْخَالِصُ ۚ وَالَّذِينَ اتَّخَذُوا مِن دُونِهِ أَوْلِيَاءَ مَا نَعْبُدُهُمْ إِلَّا لِيُقَرِّبُونَا إِلَى اللَّهِ زُلْفَىٰ إِنَّ اللَّهَ يَحْكُمُ بَيْنَهُمْ فِي مَا هُمْ فِيهِ يَخْتَلِفُونَ ۗ إِنَّ اللَّهَ لَا يَهْدِي مَنْ هُوَ كَاذِبٌ كَفَّارٌ

జాగ్రత్త! నిష్కల్మషమైన ఆరాధన మాత్రమే అల్లాహ్‌కు చెందుతుంది. ఎవరయితే అల్లాహ్‌ను గాకుండా ఇతరులను సంరక్షకులుగా ఆశ్రయించారో వారు, “ఈ పెద్దలు మమ్మల్ని అల్లాహ్‌ సాన్నిధ్యానికి చేర్చటంలో తోడ్పడతారని భావించి మాత్రమే మేము వీళ్లను ఆరాధిస్తున్నామ”ని అంటారు. ఏ విషయం గురించి వారు భేదాభిప్రాయానికి లోనై ఉన్నారో దానికి సంబంధించిన (అసలు) తీర్పు అల్లాహ్‌ (స్వయంగా) చేస్తాడు. అబద్ధాలకోరులకు, కృతఘ్నులకు అల్లాహ్‌ ఎట్టి పరిస్థితిలోనూ సన్మార్గం చూపడు. (సూరతుల్ జుమర్ 39:3

మీరు గమనిస్తే వారు ఇలాంటి మూడ నమ్మకాలకి గురి అయ్యి షిర్క్ చేస్తున్నారు అని అల్లాహ్ (తఆలా) మరి ఎంతో స్పష్టంగా తెలియ చేస్తున్నాడు. “ఎవరైతే అల్లాహ్ ను కాదని, ఇంకా వేరే ఔలియాలను నిలబెట్టుకున్నారో, ఎవరైతే అల్లాహ్ ను కాదని, ఇంకా వేరే ఔలియాలను నమ్ముతున్నారో, ఆ ఔలియాల వద్ద వారు సంతోషించడానికి ఏఏ కార్యాలు చేస్తున్నారో, దానికి ఒక సాకు తెలుపుకుంటూ ఏమంటారు వారు? మేము అక్కడ వారి యొక్క ఆరాధన ఏదైతే చేస్తున్నామో, ఆరాధనకు సంబంధించిన కొన్ని విషయాలు ఏదైతే వారి వద్ద పాటిస్తున్నామో, వారు మమ్మల్ని అల్లాహ్ కు చేరువుగా చేయాలని, అంటే మేము స్వయంగా అల్లాహ్ వద్ద చేరుకోలేము అందుకు గురించి వీరిని మధ్యలో సిఫారసుగా పెడుతున్నాము. వారు అల్లాహ్ వద్ద మాకు సిఫారసు చేసి మమ్మల్ని అల్లాహ్ కుదగ్గరగా చేస్తారు. అల్లాహు అక్బర్. అయితే అల్లాహ్ ఏమంటున్నాడు? ఇలాంటి విభేదాలకు వారు ఏదైతే గురి అయ్యారో, ప్రవక్తల అందరిని ఏదైతే మేము పంపామో, ఇలాంటి షిర్క్ నుండి ఆపడానికే పంపాము. కానీ వారు ఈ సరైన మార్గాన్ని వదిలి ఏదైతే భిన్నత్వానికి, విభేదానికి గురి అయ్యారో, దానికి సంబంధించిన తీర్పులు అన్నీ కూడా మేము సమీపంలో చేస్తాము ప్రళయ దినాన.

మళ్ళీ ఆ తర్వాత ఆయత్ యొక్క చివరి భాగం ఎలా ఉందో గమనించండి. “ఎవరైతే అబద్ధాలకు మరియు కృతఘ్నత, సత్య తిరస్కారానికి గురి అవుతారో, వారికి అల్లాహ్ సన్మార్గం చూపడు“.

అంటే మాట ఏంటి? అల్లాహ్ మధ్యలో ఎవరిని కూడా ఇలా మధ్యవర్తిగా నియమించలేదు. వారిని మనం సిఫారసులుగా చేసుకోవాలని అల్లాహ్ ఎవరిని కూడా నిర్ణయించలేదు. చివరికి ప్రవక్త మహానీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అందరికంటే శ్రేష్ఠులు గొప్పవారు. వారు కూడా ప్రళయ దినాన ఏ సిఫారసు అయితే చేస్తారో, దాని విషయంలో మనం హదీసులు విన్నాము. ఈ విషయం సహచరులకు కూడా తెలుసు. అయినప్పటికీ ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క సహాబి కూడా ప్రవక్తా! ప్రళయదినాన మాకు మీరు సిఫారసుగా నిలబడి మా పాపాలను క్షమించి, క్షమించడానికి అల్లాహ్ తో చెప్పుకొని, మమ్మల్ని అల్లాహ్ కు చేరువుగా చేయాలి అని ఈవిధంగా ఎప్పుడూ కూడా మొర పెట్టుకోలేదు.

అందుగురించి మహాశయులారా! ఇక్కడ సూరయే యాసీన్ లో ఒక పుణ్యాత్ముని సంఘటన అల్లాహ్ (తఆలా) ఏదైతే ప్రస్తావించాడో, అతను తౌహీదు పై ఉండి, షిర్క్ ని ఏదైతే విడనాడాడో మరియు అతని జాతివారు అతన్ని అందుకని హత్య చేశారో ఆ సంఘటన మొత్తం సూరయే యాసీన్ లో ఉంది. ఆ పుణ్యాత్ముడు ఏమంటాడు?

أَأَتَّخِذُ مِن دُونِهِ آلِهَةً إِن يُرِدْنِ الرَّحْمَٰنُ بِضُرٍّ لَّا تُغْنِ عَنِّي شَفَاعَتُهُمْ شَيْئًا وَلَا يُنقِذُونِ

అట్టి (నిజ) దైవాన్ని వదిలేసి నేను ఇతరులను ఆరాధ్యులుగా ఆశ్రయించాలా? ఒకవేళ కరుణామయుడు (అయిన అల్లాహ్‌) నాకేదైనా నష్టం కలిగించదలిస్తే వారి సిఫారసు నాకెలాంటి లాభమూ చేకూర్చదు. వారు నన్ను కాపాడనూ లేరు”. (36:23)

“ఏమిటి? అల్లాహ్, రహ్మాన్ ను కాదని ఇంకా వేరే వారు ఎవరినైనా నేను, నాకు ఆరాధ్యనీయునిగా చేసుకోవాలా? ఒకవేళ అల్లాహ్, రహ్మాన్ నాకు ఏదైనా నష్టం చేకూర్చాలని అంటే వారు ఆ నష్టాన్ని ఏమైనా దూరం చేయగలుగుతారా? ఆ సందర్భంలో వారి యొక్క ఏ సిఫారసు కూడా నాకు పని చేయదు. వారి యొక్క ఏ సిఫారసు నాకు లాభాన్ని చేకూర్చదు”.

ఈ విధంగా మహాశయులారా! ఇహలోకంలో ఎవరినీ కూడా మనం ఫలానా అతను నాకు సిఫారసు చేస్తాడు పరలోక దినాన అని భావించి వారి వద్ద ఏదైనా ఆరాధనకు సంబంధించిన విషయాలు పాటిస్తూ ఉండడం ఇది అల్లాహ్ కు ఎంత మాత్రం ఇష్టం లేదు.

ప్రళయదినాన నరకవాసులు నరకంలో పోయిన తర్వాత, స్వర్గవాసులు ఆ నరకవాసులను అడుగుతారు. మీరు ఎందుకు నరకంలో పడి ఉన్నారు? కారణం ఏంటి? ఏ పాపం వల్ల మీరు ఇక్కడ వచ్చి పడి ఉన్నారు? అని అంటే వారు స్వయంగా ఏ సత్కార్యాలని విడనాడినందుకు నరకంలో వచ్చి పడ్డారో, మరి ఏ మూఢనమ్మకాల వల్ల నరకంలో చేరవలసి వచ్చిందో స్వయంగా వారి నోట వారు తెలుపుతున్నారు. అల్లాహ్ ఈవిషయాన్ని సూరయే ముద్దస్సిర్ లో తెలిపాడు.

 مَا سَلَكَكُمْ فِي سَقَرَ قَالُوا لَمْ نَكُ مِنَ الْمُصَلِّينَ وَلَمْ نَكُ نُطْعِمُ الْمِسْكِينَ وَكُنَّا نَخُوضُ مَعَ الْخَائِضِينَ وَكُنَّا نُكَذِّبُ بِيَوْمِ الدِّينِ حَتَّىٰ أَتَانَا الْيَقِينُ فَمَا تَنفَعُهُمْ شَفَاعَةُ الشَّافِعِينَ

“ఇంతకీ ఏ విషయం మిమ్మల్ని నరకానికి తీసుకు వచ్చింది?” (అని ప్రశ్నిస్తారు). వారిలా సమాధానమిస్తారు : “మేము నమాజు చేసే వారము కాము. నిరుపేదలకు అన్నం పెట్టే వారమూ కాము. పైగా, మేము పిడివాదన చేసే వారితో (తిరస్కారులతో) చేరి, వాదోపవాదాలలో మునిగి ఉండేవారం. ప్రతిఫల దినాన్ని ధిక్కరించేవాళ్ళం. తుదకు మాకు మరణం వచ్చేసింది.” మరి సిఫారసు చేసేవారి సిఫారసు వారికి ఏమాత్రం ఉపయోగపడదు. (74:42-48)

వారు అంటారు. మేము నమాజ్ చేసే వారిలో కాకుంటిమి. నిరుపేదలకు అన్నం పెట్టే వారిమి కాకుంటిమి. అలాగే కాలక్షేపాలు చేసి సమయాన్ని వృధా చేసే వారిలో మేము కలిసి ఉంటిమి. మరియు మేము ఈ పరలోక దినాన్ని తిరస్కరిస్తుంటిమి. చివరికి మాకు చావు వచ్చేసింది. చావు వచ్చిన తర్వాత మేము సజీవంగా ఉన్నప్పుడు ఎవరెవరినైతే సిఫారసు చేస్తారు అని అనుకుంటూ ఉంటిమో, ఏ సిఫారసు చేసేవారి సిఫారసు మాకు ఏ లాభాన్ని చేకూర్చలేదు.

అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా! ఇలాంటి మూఢనమ్మకాల వల్ల ఎంత నష్టం చేకూరుస్తుందో, ఎలా నరకంలో పోవలసి వస్తుందో అల్లాహ్ ఎంత స్పష్టంగా మనకు తెలియపరిచాడో గమనించండి.

కొందరు మరో రకమైన తప్పుడు భావంలో పడి ఉన్నారు. ప్రళయదినాన ప్రజలందరూ కలిసి ప్రవక్తల వద్దకు సిఫారసు కోరుతూ ఏదైతే వెళ్తారో దాన్ని ఆధారంగా పెట్టుకున్నారు. దాన్ని ఆధారంగా పెట్టుకొని ఏమంటారు? ప్రళయదినాన ప్రవక్తల వద్దకు సిఫారసు కోరుతూ వెళ్తారు కదా! అయితే ఈ రోజు మేము ఇహలోకంలో ఇలా పుణ్యాత్ముల వద్దకు సిఫారసు కోరుతూ వెళ్తే ఏమి నష్టం అవుతుంది? అయితే మహాశయులారా! ఆ విషయం ఇక్కడ వీరు పాటిస్తున్న దానికి ఎంత మాత్రం ఆధారంగా నిలవదు. ఎందుకంటే ఇక్కడ సామాన్య ప్రజలు చనిపోయిన వారిని సిఫారసులుగా కోరుతున్నారు. సిఫారసులుగా వారికి నిలబెట్టుకొని వారి వద్ద కొన్ని ఆరాధనలు చేస్తున్నారు మరియు ఆరోజు ప్రవక్తలు సజీవంగా ఉండి వారితో మాట్లాడుతున్నారు. రెండవ విషయం అక్కడ ఏదైతే ప్రజలు సిఫారసు గురించి కోరుతున్నారో, దేని గురించి? మా పాపాలు క్షమించమని కాదు, మా కష్టాలు దూరం చేయమని కాదు, మేము మా ఇబ్బందులు మీరే డైరెక్టుగా దూరం చెయ్యాలి అని కాదు. దేని గురించి అల్లాహ్ తీర్పు చేయడానికి రావాలి. తీర్పు మొదలు కావాలి అని మీరు సిఫారసు చేయండి అంతే! కానీ ఈ రోజుల్లో దానిని సాకుగా పెట్టుకొని ఎవరినైతే సిఫారసు గా నిలబెట్టుకున్నారో వారితో అన్ని రకాల సంతానం లేకుంటే సంతానము కోరడం, అనారోగ్యాన్ని దూరం చేయడానికి వారితో కోరడం, ఇంకా ఎన్నో రకాల కష్టాలు దూరం చేయాలని వారితో డైరెక్టుగా దుఆ చేయడం ఇలాంటివన్నీ షిర్క్ పనులు జరుగుతున్నాయి కదా! మరి ఆ విషయం ఎలా ఆధారంగా ఉంటుంది? అగత్యపరుడు, మరీ కష్టంలో ఉన్నవాడు దుఆ చేసినప్పుడు దుఆను స్వీకరించి విని అతని కష్టాన్ని దూరం చేసేవాడు అల్లాహ్ తప్ప ఇంక ఎవరు లేరు.

అందుగురించి మహాశయులారా! ఇలాంటి మూఢనమ్మకాలను వదులుకోవాలి. కేవలం యోగ్యమైన రీతిలో అల్లాహ్ మరియు మనకు ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపిన రీతిలోనే సిఫారసు యొక్క మార్గాలను అవలంభించాలి. కానీ ఇలాంటి మూఢనమ్మకాలు, ఇలాంటి దురవిశ్వాసాలకు లోనైతే చాలా నష్టానికి కూరుకుపోతాము.

అయితే మహాశయులారా! ఇహలోకంలో మనం ఏ కష్టాల్లో, ఏ ఆపదలో, ఏ ఇబ్బందులు, ఎన్ని రకాల బాధలకు, చింతలకు మనం గురి అవుతామో వాటిలో మరి మనం ఏదైనా మధ్యవర్తిత్వాన్ని అవలంబించి దుఆలు చేయడానికి ఏదైనా ఆస్కారం ఉందా? అలాంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఇలా పుణ్యాత్ములని, మరి ఇంకా చనిపోయిన మహాపురుషులని మధ్యవర్తిత్వంగా పెట్టుకొని వారిని సిఫారసుగా నిలబెట్టుకొని వారితో ఎలాంటి దుఆలు చేయకూడదు అని అంటున్నారు కదా? మరి మనం ఏదైనా ఇబ్బంది లో ఉన్నప్పుడు ఏ మధ్యవర్తిత్వాన్ని అవలంబించి ఎలా దుఆ చెయ్యాలి? అనే విషయం ఇన్షా అల్లాహ్ దీని తరువాయి భాగంలో మనం తెలుసుకోబోతున్నాము. అల్లాహు తఆలా మనందరికీ సత్-భాగ్యం ప్రసాదించుగాక!

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

పరలోకం (The Hereafter) మెయిన్ పేజీ:
https://teluguislam.net/hereafter/