ఈ వ్యాసం క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:
హజ్, ఉమ్రహ్ & జియారహ్ – ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో
షేఖ్ అబ్దుల్ అజీజ్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్).
అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్, పునర్విమర్శ : షేక్ నజీర్ అహ్మద్
ఏడవ అధ్యాయం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మస్జిదు సందర్శనం
హజ్ ప్రారంభం గాక ముందు లేదా హజ్ పూర్తయిన తర్వాత, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క మస్జిదును సందర్శించడం సున్నతు. బుఖారీ మరియు ముస్లిం హదీథు గ్రంథాలలో నమోదు చేయబడిన అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:
صَلاَةٌ فـِي مَسْجِـدِي هَذَا خَيْـرٌ مِنْ أَلـْفِ صَلاَةٍ فِـيْمـاَ سِـوَاهُ إِلاَّ الـْمَسْجِـدَ الْـحَرَامَ
సలాతున్ ఫీ మస్జిదీ హదా ఖైరున్ మిన్ అల్ఫి సలాతిన్ ఫీమా సివాహు ఇల్లల్ మస్జిదల్ హరామ
మస్జిదె హరమ్ (కాబా) లో తప్ప, ఇతర మస్జిదులలో చేసే ఒక నమాజు కంటే నా మస్జిదులో చేసే ఒక నమాజు వెయ్యి రెట్లు ఉత్తమమైనది.
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించిన హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:
صَلاَةٌ فِـي مَسْجِدِي هَذَا أَفْضَلُ مِنْ أَلْفِ صَلاَةٍ فِـيْمـاَ سِوَاهُ إِلاَّ الْـمَسْجِدَ الْـحَرَامَ
సలాతున్ ఫీ మస్జిదీ హదా అఫ్జలు మిన్ అల్ఫి సలాతిన్ ఫీమా సివాహు ఇల్లల్ మస్జిదిల్ హరామ
నా ఈ మస్జిదులో నమాజు చేయడమనేది, మస్జిదె హరమ్ లో తప్ప, ఇతర మస్జిదులలో నమాజు చేయడం కంటే వెయ్యి రెట్లు ఉత్తమమైనది. (ముస్లిం హదీథు గ్రంథం)
అబ్దుల్లాహు బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించిన హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:
صَلاَةٌ فِـي مَسْجِـدِي هَذَا أَفْـضَلُ مِنْ أَلْـفِ صَلاَةٍ فِـيْمـاَ سِوَاهُ إِلاَّ الْـمَسْجِـدِ الْـحَـرَامَ، وَصَلاَةٌ فِـي الْـمَسْجِـدِ الْـحَـرَامِ أَفْـضَلُ مِنْ مِائَـةٍ صَلاَةٍ فِـي مَسْجِـدِي هَـذَا
సలాతున్ ఫీ మస్జిదీ హదా అఫ్జలు మిన్ అల్ఫి సలాతిన్ ఫీమా సివాహు ఇల్లల్ మస్జిదిల్ హరామ వ సలాతున్ ఫిల్ మస్జిదిల్ హరామి అఫ్జలు మిన్ మిఅతిన్ సలాతిన్ ఫీ మస్జిదీహదా
నా మస్జిదులో నమాజు చేయడమనేది, మస్జిదె హరమ్ లో తప్ప ఇతర మస్జిదులలో చేసే నమాజు కంటే వెయ్యి రెట్లు ఉత్తమమైనది. మరియు మస్జిదె హరమ్ చేసే నమాజు నా మస్జిదులో చేసే నమాజు కంటే వంద రెట్లు ఉత్తమమైనది.
జాబిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:
صَلاَةٌ فِـي مَسْجِدِي هَذَا أَفْضَلُ مِنْ أَلْفِ صَلاَةٍ فِـيْمـاَ سِوَاهُ إِلاَّ الْـمَسْجِدَ الْـحَرَامَ، وَصَلاَةٌ فِـي الْـمَسْجِدِ الْـحَرَامِ أَفْضَلُ مِنْ مِائَةِ أَلْفِ صَلاَةٍ فِـيْمـاَ سِوَاهُ
సలాతున్ ఫీ మస్జిదీ హదా అఫ్జలు మిన్ అల్ఫి సలాతిన్ ఫీమా సివాహు ఇల్లల్ మస్జిదల్ హరామ వ సలాతున్ ఫిల్ మస్జిదిల్ హరామి అఫ్జలు మిన్ మిఅతి అల్ఫి సలాతిన్ ఫీమా సివాహు
నా మస్జిదులో నమాజు చేయడమనేది, మస్జిదె హరమ్ లో తప్ప ఇతర మస్జిదులలో చేసే నమాజు కంటే వెయ్యి రెట్లు ఉత్తమమైనది. మరియు మస్జిదె హరమ్ చేసే నమాజు ఇతర మస్జిదులలో చేసే నమాజు కంటే లక్ష రెట్లు ఉత్తమమైనది. (అహ్మద్ &ఇబ్నె మాజహ్)
దీని గురించి అనేక హదీథులు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదును సందర్శించే యాత్రికులు ముందుగా తమ కుడికాలు మస్జిదుల లోపల పెట్టి, ఈ దుఆ చేసుకుంటూ మస్జిదులోనికి ప్రవేశించాలి:
بِسْمِ اللهِ وَالصَّلاَةُ وَالسَّلاَمُ عَلَى رَسُولِ اللهِ، أَعُوْذُ بِاللهِ الْعَظِيْمِ وَبِوَجْهِهِ الْكَرِيْمِ وَسُلْطَانِهِ الْقَدِيْمِ مِنْ الشَّيْطاَنِ الرَّجِيْمِ، اَللَّهُمَّ افْتَحْ لـِي أَبْوَابَ رَحْمَتِكَ
బిస్మిల్లాహి, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి, అఊదు బిల్లాహిల్ అజీమి వబి వజ్హిహిల్ కరీమి, వ సుల్తానిహిల్ ఖదీమి, మినష్షయితా నిర్రజీమి, అల్లాహుమ్మఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక.
అల్లాహ్ పేరుతో, అల్లాహ్ యొక్క ప్రవక్త పై శాంతి మరియు దీవెనలు కురుయుగాక. నన్ను షైతాను బారి నుండి కాపాడమని, అత్యంత పవిత్రమైన ముఖం, అత్యంత పురాతనమైన పరిపాలన మరియు అధికారం కలిగి ఉన్న అల్లాహ్ యొక్క శరణు కోరుకుంటున్నాను. ఓ అల్లాహ్! నీ కరుణాకటాక్షాల ద్వారాలు నా కొరకు తెరుచు.
ఇతర మస్జిదులలో ప్రవేశించేటపుడు దుఆ చేసే విధంగానే ఇక్కడ కూడా దుఆ చేయాలి. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహ అలైహి వసల్లం) మస్జిదులో ప్రవేశించేటపుడు చేయవలసిన ప్రత్యేక దుఆ ఏమీ లేదు.
మస్జిదులో ప్రవేశించిన తర్వాత, రెండు రకాతుల తహయ్యతుల్ మస్జిదు నమాజు చేయాలి. ఇహపరలోకాలలో మేలైన విషయాలు ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకోవలెను. ఒకవేళ ఈ రెండు రకాతుల నమాజును మస్జిదులోని రౌధతుల్ జన్నహ్ (స్వర్గవనం) అనే ప్రాంతంలో చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం ఇలా తెలిపారు:
مَا بَـيـْنَ بَـيـْتِـي وَمِـنْـبَـرِي رَوْضَـةٌ مِـنْ رِيَـاضِ الْـجَـنَّـةِ
మా బైన బైతీ వ మిన్బరీ రౌదతున్ మిన్ రియాదిల్ జన్నతి
నా ఇంటికీ మరియు నా ప్రసంగ స్థానానికీ మధ్య స్వర్గంలోని ఒక ఉద్యానవనం ఉంది.
నమాజు చేసిన తర్వాత, ప్రవక్త (సల్లల్లాహు అలైహ వసల్లం) కు మరియు ఆయన యొక్క ఇద్దరు సహచరులు అబూ బకర్ (రదియల్లాహు అన్హు) మరియు ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు)లకు సలాము చేయవలెను. గౌరవ పూర్వకంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి వైపు తిరిగి నిలబడి, తక్కువ స్వరంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఇలా అభివాదం చేయవలెను.
أَلسَّلاَمُ عَلَيـْكَ يَا رَسُولُ اللهِ وَرَحْـمَـةُ اللهِ وَبَـرَكَاتَـهُ
అస్సలము అలైక యా రసూలుల్లాహ్, వ రహ్మతుల్లాహి వ బరకాతహు
ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా! మీ పై శాంతి కురుయుగాక, మరియు అల్లాహ్ యొక్క దయాదాక్షిణ్యాలు మరియు శుభాశీస్సులూను.
అబూ దావూద్ హదీథు గ్రంథంలో నమోదు చేయబడిన ఒక హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పలుకులను అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖించారు:
مَا مِنْ أَحَدٍ يُسَلِّمُ عَلَـيَّ إِلاَّ رَدَّ اللهُ عَلَـَّي رُوْحِـي حَـتَّـى أَرُدَّ عَـلَيْـهِ السَّلاَمَ
మామిన్ అహదిన్ యుసల్లిము అలయ్య ఇల్లా రద్దల్లాహు అలయ్య రూహీ హత్త అరుద్ద అలైహి స్సలామ
ఎవరైనా నా పై సలాములు పంపినపుడు, అతని సలాముకు జవాబిచ్చేవరకు అల్లాహ్ నా ఆత్మను నా శరీరంలోనికి పంపుతాడు.
తన సలాములో ఎవరైనా క్రింది పదాలను పలికితే ఎలాంటి దోషమూ లేదు:
أَلسَّلاَمُ عَلَيْكَ يَا نَبِيَ الله، أَلسَّلاَمُ عَلَيْكَ يَا خِيْـرَةَ اللهِ مِنْ خَلْـقِـهِ، أَلسَّلاَمُ عَلَيـْكَ يَا سَيِّـدَ الْـمُرْسَلِيْـنْ وَإِمَامَ الْـمُتَّـقِيْنْ، أَشْهَدُ أَنَّـكَ قَدْ بَلَّغْتِ الرَّسَالَـةَ وَأَدَّيْتَ الْأَمَانَـةَ، وَنَـصَحَتَ الْأُمَّـةَ، وَجَاهَدْتَ فِي اللهِ حَقَّ جِهَادِهِ
అస్సలాము అలైక యా నబీయల్లాహ్, అస్సలాము అలైక యా ఖీరతల్లాహి మిన్ ఖల్ఖిహి , అస్సలాము అలైక యా సయ్యదల్ ముర్సలీన్ వ ఇమామల్ ముత్తఖీన్, అష్హదు అన్నక ఖద్ బలగతిర్రసాలత, వ అద్దయితల్ అమానత, వ నసహతల్ ఉమ్మత, వ జాహదత ఫీ అల్లాహి హఖ్ఖ జిహాదిహి.
మీ పై శాంతి కురుయుగాక, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా! మీ పై శాంతి కురుయుగాక, ఓ అల్లాహ్ యొక్క సృష్టిలోని ఉత్తముడా! నీపై శాంతి కురుయుగాక, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తల మరియు సజ్జనుల నాయకుడా! మీరు మీ సందేశాన్ని అందజేసారని, మీకు అప్పజెప్పబడిన బాధ్యతను పూర్తిగా నెరవేర్చారని, సమాజానికి మార్గదర్శకత్వం వహించారని, అల్లాహ్ మార్గంలో పూర్తిగా ప్రయాస పడినారని మరియు శ్రమించారని నేను సాక్ష్యమిస్తున్నాను.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ప్రవర్తనలో, నడతలో ఈ ఉత్తమ గుణగణాలన్నీ ఉండినాయి. ప్రతి ఒక్కరూ ఆయనపై దీవెనలు పంపటాన్ని, ఆయన కొరకు దుఆ చేయటాన్ని షరిఅహ్ పూర్తిగా సమర్ధించింది. అల్లాహ్ యొక్క ఆజ్ఞ ఇలా ఉంది:
يَا أَ يُّـهَا الَّذِيـْنَ آمَـنـُوا صَلُّوا عَلَيْـهِ وَسَلِّـمُـوا تَـسْلِـيـمـًا
యా అయ్యుహలాదీన ఆమనూ సల్లూ అలైహి వసల్లిమూ తస్లీమన్
ఓ విశ్వాసులారా! ఆయనపై దీవెనలు పంపండి మరియు ఆయనపై ఇస్లామీయ పద్ధతిలో సలాములు పంపండి. 33:56
ఆ తర్వాత అబూ బకర్ (రదియల్లాహు అన్హు) మరియు ఉమర్ (రదియల్లాహు అన్హు)లపై సలాములు పంపి, అక్కడి నుండి ముందుకు కదల వలెను.
لَعَـنَ رَسُولُ اللهِ صَلَّى الله عَلَيْـهِ وَ سَلَّمَ زُوَّارَاتِ الْـقُـبُـوْرِ مِنَ النِّساَءِ، وَالْـمُـتَّـخِـذِيْـنَ عَلَيْـهاَ الْـمسَاجِدَ وَالسُّرُجَ
లఅన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వ సల్లమ జువ్వరాతిల్ ఖుబూరి మిన్నన్నిసాయి వల్ ముత్తఖిదీన అలైహాల్ మసాజిద వస్సురుజ
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధిని సందర్శించే అనుమతిని షరిఅహ్ పురుషులకు మాత్రమే ఇచ్చింది. సమాధుల సందర్శించే అనుమతి మహిళలకు ఇవ్వబడలేదు. అలా షరిఅహ్ కు వ్యతిరేకంగా తమ ఇష్టానుసారం సమాధులను సందర్శించే మహిళలను, సమాధులపై మస్జిదులు నిర్మించేవారిని మరియు అక్కడ దీపాలు వెలిగించేవారిని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శపించి ఉన్నారు.
ఒకవేళ ఎవరైనా మస్జిదె నబవీ లోపల నమాజు చేయాలని, దుఆలు చేయాలనే సంకల్పంతో మదీనా సందర్శిస్తే, షరిఅహ్ సమర్ధించి ఉండటం వలన అలా చేయడం పూర్తిగా సరైనదే. పై హదీథులో కూడా మేము దీనిని గుర్తించాము. సందర్శకుడు ఐదు పూటలా మస్జిదె నబవీలోనే నమాజులు చేయవలెను మరియు వీలయినంత ఎక్కువగా అల్లాహ్ ను స్మరించవలెను, దుఆలు చేయవలెను మరియు నఫిల్ నమాజులు చేయవలెను. ఈ క్రింది హదీథును మేము ఇంతకు ముందు ఉదహరించి ఉన్నాము,
مَا بَـيـْنَ بَـيـْتِـي وَمِـنْـبَـرِي رَوْضَـةٌ مِـنْ رِيَـاضِ الْـجَـنَّـةِ
మా బైన బైతీ వ మిన్బరీ రౌదతున్ మిన్ రియాదిల్ జన్నతి
నా ఇంటికీ మరియు నా ప్రసంగ స్థానానికీ మధ్య స్వర్గంలోని ఒక ఉద్యానవనం ఉంది.
తప్పనిసరి ఐదు ఫర్ద్ చేసేటపుడు, మీరు వీలయినంత వరకు ముందు వరుసలో నిలబడటానికి ప్రయత్నించవలెను, ముందు పంక్తిని పొడిగింపులో మీకు చోటు దొరికినా దానిని వదలకూడదు. ముందు వరుసలో నమాజు చేయటం గురించి క్రింది ప్రామాణిక హదీథు సూచిస్తున్నది.
لَوْ يَعْلَمُ النَّاسَ مَا فِـي النِّدَاءِ وَالصَّفِّ الْأَوَّلِ ثُمَّ لَـمْ يَـجِدُوْا إِلاَّ أَنْ يَسْتَـهِمُـوْا عَلَيْهِ لاَسْتَهَمُوْا عَلَيْـهِ
లౌ యఅలమున్నాస మాఫీ న్నిదాయి వ సఫ్ఫిల్ అవ్వలి థుమ్మ లమ్ యజిదూ ఇల్లా అన్ యస్తహిమూ అలైహి అస్తహమూ అలైహి
ఒకవేళ అదాన్ పిలుపునివ్వడంలో మరియు ముందు వరుసలో నిలబడి నమాజు చేయడంలో ఉన్న పుణ్యాల గురించి తెలిసి ఉండి, వారికి గనక వాటిలో స్థానం లభించకపోతే, వాటిని పొందుట కొరకు ప్రజలు లాటరీ వేయవలసి వచ్చినా, తప్పకుండా వారు లాటరీ వేస్తారు.
మరో హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు:
تَـقَـدِّمُـوْا فَأْتَـمُّـوا بـِي وَلْـيَـأْتَـمَّ بِكـُمْ مَنْ بَعْدَكُمْ، وَلاَ يَزَالُ الرَّجُلَ يَـتَـأَخَّـرُّ عَنِ الصَّلاَةِ حَتَّى يُـؤَخِّـرَهُ الله
తఖద్దిమూ ఫఅతమ్మూబీ వల్ యఅతమ్మ బికుమ్ మన్ బఅదకుమ్ వలా యజాలుర్రజుల యతఅఖ్ఖర్రు అనిస్సలాతి హత్త యుఅఖ్ఖిరహుల్లాహ్
ముందుకు కదలండి మరియు నన్ను అనుసరించండి. మరియు ఎవరైతే మీ వెనుక ఉన్నారో, వారు మిమ్ముల్ని అనుసరించాలి. అల్లాహ్ అతనిని వెనుక వదిలి వేయునంత వరకు ఆ వ్యక్తి నమాజును అందుకోవటంలో వెనుకబడి ఉంటాడు. ముస్లిం హదీథు గ్రంథం.
అబూ దావూద్ హదీథు గ్రంథంలో నమోదు చేయబడిన ఆయెషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:
لاَ يَزَالُ الرَّجُلُ يَتَأَخَّرْ عَنِ الصَّفِّ الْـمُقَدِّمِ حَتـَّى يُؤَخِّرَهُ اللهََ فِي النَّارِ
లా యజాలుర్రజులు యతఅఖ్ఖర్ అనిస్సఫ్ఫిల్ ముఖద్దమి హత్త యుఅఖ్ఖిరహుల్లాహ ఫిన్నారి
అల్లాహ్ ఆ వ్యక్తిని నరకానికి పంపే వరకు, (ఫర్ద్ నమాజులో) ముందు వరుస అందుకోవటంలో అతను వెనుకబడే ఉంటాడు.
ఒక ప్రామాణిక హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సహచరులకు ఇలా బోధించారు:
أَلاَ تَصُفُّوْنَ كَمـَا تَـصُفُّ الْـمَلَائِكَـةُ عِـنْدَ رَبِّـهَا قَالُوْا يَا رَسُولُ الله وَكَـيْفَ تَـصُفُّ الْـمَلاَئِكَـةُ عِـنْـدَ رَبِّـهاَ؟ قَالَ يُـتِـمُّوْنَ الصُّفُوْفَ الْأَوَّلَ وَيَـتَـرَاصُّوْنَ فِـي الصَّفِّ
అలా తసుఫ్ఫూన కమా తసుఫ్ఫుల్ మలాయికతు ఇంద రబ్బిహా ఖాలూ యా రసూలుల్లాహ్ వ కైఫ తసుఫ్ఫుల్ మలాయికతు ఇంద రబ్బిహా ఖాల యుతిమ్మూనస్సుఫూఫల్ అవ్వల వ యతరస్సూన ఫీస్సఫ్ఫి
తమ ప్రభువు ఎదురుగా దైవదూతలు పంక్తులలో నిలబడినట్లు, మీరు ఎందుకని పంక్తులలో నిలబడరు. దైవదూతలు ఎలాంటి పంక్తులను ఏర్పరుచుకున్నారని సహచరులు ప్రశ్నించగా, ఆయనిలా జవాబిచ్చారు: వారు ముందుగా మొదటి పంక్తిని పూర్తి చేసారు మరియు పంక్తులలో వారు ఒకరిని ఆనుకొని మరొకరు నిలబడినారు. (ముస్లిం హదీథు గ్రంథం).
మస్జిదె నబవీ మరియు ఇతర మస్జిదులకు వెళ్ళడం గురించి మామూలుగా అనేక హదీథులు ఉన్నాయి. కుడివైపు పంక్తిలో నిలబడిమని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రతి ఒక్కరికీ చెప్పేవారు. అప్పటి మస్జిదె నబవీలోని కుడి వైపు పంక్తి, రౌధతుల్ జన్నహ్ ప్రాంతానికి బయట ఉండేదనే విషయం అందరికీ తెలిసినదే. కాబట్టి సామూహిక నమాజును ముందు వరుసలో, పంక్తి యొక్క కుడివైపున నిలబడి చేయటమనేది రౌధతుల్ జన్నహ్ ప్రాంతంలో నిలబడి నమాజు చేయడం కంటే ఉత్తమమైనదనే ఇక్కడ ముఖ్యంగా గ్రహించదగినది. ఎవరైనా ఇలాంటి ఇతర హదీథులను కూడా పరిశీలిస్తే, పై విషయాన్ని సులభంగా తెలుసుకుంటారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి యొక్క గ్రిల్ ను స్పర్శించడం లేదా ముద్దాడటం లేదా దాని చుట్టూ తవాఫ్ చేయడం లాంటివి అనుమతించబడలేదు. ఇలాంటి ఆచారం గురించి ముందు తరం సజ్జనులలో నుండి ఎవ్వరూ తెలుపలేదు. ఇలా చేయడమనేది ఒక హీనమైన కల్పితాచారం. తమ అవసరాలు పూర్తి చేయమని లేదా తమ కష్టాలు తొలగించమని లేదా తమ అనారోగ్యాన్ని నయం చేయమని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఎవరైనా వేడుకోవడమనేది ధర్మబద్ధం కాదు. అయితే వీటన్నింటి కోసం తప్పనిసరిగా వారు కేవలం అల్లాహ్ ను మాత్రమే వేడుకోవలసి ఉంది. మృతులను వేడుకోవడమనేది అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించడం మరియు ఇతరులను ఆరాధించడమే అవుతుంది. ఈ క్రింది రెండు ముఖ్య అంశాలపై ఇస్లాం ఆధారపడి ఉంది:
- అల్లాహ్ ఏకైకుడు, ఆయనకెవ్వరూ భాగస్వాములు లేరు మరియు ఆయనకెవ్వరూ సాటి లేరు. కేవలం ఆయన మాత్రమే ఆరాధింపబడాలి.
- ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పద్ధతిని అనుసరించి ఆరాధనలు జరగాలి.
ఇస్లామీయ ధర్మం యొక్క క్రింది మూలవచనపు అసలు అర్థం ఇదే.
شَهَادَةً أَنْ لاَّ إِلَهَ إِلاَّ اللهِ وَأَنَّ مُـحَمَّداً رَسُوْلُ الله
షహాదతన్ అల్లా ఇలాహ ఇల్లల్లాహి వ అన్న ముహమ్మదన్ రసూలుల్లాహ్
ఆరాధింపబడే వారెవ్వరూ లేరు – ఒక్క అల్లాహ్ తప్ప అని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్, అల్లాహ్ యొక్క సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను.
అలాగే, అల్లాహ్ వద్ద సిఫారసు చేయమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంనే నేరుగా వేడుకోవడమనేది ఇస్లాంలో అనుమతింపబడలేదు. ఎందుకంటే ప్రార్థింపబడే హక్కు కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందుతుంది. ఖుర్ఆన్ లో అల్లాహ్ ప్రకటన ఇలా ఉంది.
قُـلْ ِلِله الشَّـفَـاعَـةُ جَـمِـيـعًا
ఖుల్ లిల్లాహిష్షఫాఅతు జమీఅన్
(ఓ ప్రవక్తా) చెప్పు, సిఫారసులన్నీ అల్లాహ్ కే చెందుతాయి. 39:44
అయితే, క్రింది విధంగా వేడుకోవచ్చు.
أَللَّهُمَّ شَفَّعِ فِـي نَـبِـيُّكَ، أَللَّهُمَّ شَفَّعِ فِـي مَلاَئِكَـتِـكَ وَعِبَادِكَ الْـمُؤمِـنِـيْـنَ، أَللَّهُمَّ شَفَّعِ فِـي أَفَرَاطِـي
అల్లాహుమ్మ షఫ్ఫఇ ఫీ నబియ్యుక, అల్లాహుమ్మ షఫ్ఫఇ ఫీ మలాయికతిక, వ ఇబాదతికల్ మోమినీన. అల్లాహుమ్మ షఫ్ఫఇ ఫీ అఫరాతీ.
ఓ అల్లాహ్! నీ ప్రవక్త నా కొరకు సిఫారసు చేసేలా చేయి. ఓ అల్లాహ్! నీ దైవదూతలు మరియు నిన్ను విశ్వసించినవారు నా కొరకు సిఫారసు చేసేలా చేయి. ఓ అల్లాహ్! చనిపోయిన నా సంతానం నా కొరకు సిఫారసు చేసేలా చేయి.
అయితే, మృతులను సిఫారసు చేయుట కొరకు లేదా వారినే నేరుగా వేడుకోకూడదు – వారు అల్లాహ్ యొక్క సందేశహరులైనా, ప్రవక్తలైనా లేదా పుణ్యపురుషులైన అవులియాలైనా సరే. ఇలా చేయటానికి షరిఅహ్ అనుమతి లేదు. మృతుని గురించిన వాస్తవం ఏమిటంటే, షరిఅహ్ లో మినహాయించబడిన ఆచరణులు తప్ప, అతని ఇతర ఆచరణలన్నీ సమాప్తమై పోతాయి. సహీహ్ ముస్లింలో నమోదు చేయబడిన అబూ హురైరహ్ రదియల్లాహు ఉల్లేఖన:
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికారు,
إِذَا مَاتَ ابْنَ آدَمَ أَنْقَطَعَ عَمَلَهُ إِلاَّ مِنْ ثَلاَثٍ: صَدْقَةٍ جَارِيَـةٍ، أَوْ عِلْمٍ يُـنـْتَـفَـعُ بِـهِ، أَوْ وَلَـدٍ صَالِـحٍ يَـدْعُـوْ لَـهُ
ఇదా మాతబ్న ఆదమ అంఖతఅ అమలహు ఇల్లా మిన్ థలాతిన్ సదఖతిన్ జారియతిన్ అవ్ ఇల్మిన్ యుంతఫఉ బిహి అవ్ వలదిన్ సాలిహిన్ యద్ఊ లహు
ఎపుడైతే ఆదం సంతానంలో ఎవరైనా చనిపోతారో, ఈ మూడు తప్ప అతని ఇతర ఆచరణలు సమాప్తమైపోతాయి: నిరంతరాయంగా కొనసాగుతున్న అతని దానం, ఇతరులకు ప్రయోజనం కలిగిస్తున్న అతని జ్ఞానం, దైవభీతిపరులైన సంతానం చేసే అతని కొరకు చేసే దుఆలు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత కాలంలో తన కొరకు అల్లాహ్ ను ప్రార్థించమని ఆయనను వేడుకోవడం అన్ని విధాలా సరైన మంచి పనే. అలాగే అంతిమ దినాన కూడా ఆయనను నేరుగా వేడుకోవడం సరైన పనే, ఎందుకంటే ఆనాడు సిఫారసు చేయడానికి ఆయనకు అనుమతి ఇవ్వబడుతుంది. ఆనాడు తనను సిఫారసు చేయమని అడిగిన వారి కొరకు ఆయన అల్లాహ్ ను ప్రార్థించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రపంచంలో మరణించిన తర్వాత ఆయనకు ఆ శక్తి లేదు. ఇది కేవలం ఆయన కొరకు మాత్రమే ప్రత్యేకం కాదు. మీతో పాటు సర్వసామాన్యంగా ప్రతి ఒక్కరికిది వర్తిస్తుంది. ప్రాణంతో ఉన్న తన తోటి సోదరులతో తన కొరకు అల్లాహ్ వద్ద సిఫారసు చేయమని అంటే అల్లాహ్ ను ప్రార్థించమని అడగటం ధర్మసమ్మతమైనదే. తీర్పుదినం నాడు ఎవ్వరూ అల్లాహ్ అనుమతి లేకుండా సిఫారసు చేయలేరు. దీని గురించి అల్లాహ్ యొక్క స్పష్టమైన ప్రకటన ఇలా ఉంది.
مَـنْ ذَا الَّـذِي يَـشْـفَـعُ عِـنْـدَهُ إِلاَّ بِـإِذْنِـهِ
మందల్లదీ యష్ఫఉ ఇందహు ఇల్లా బిఇద్నిహి
ఆయన అనుమతి లేకుండా ఆయన వద్ద సిఫారసు చేయగలిగేది ఎవరు?
ఇక ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క స్థితి గురించి మనం ఒక వాస్తవాన్ని గుర్తించాలి. ఆయన యొక్క ప్రస్తుత స్థితి ఒక ప్రత్యేకమైన స్థితి. అది ఈ ప్రపంచంలో ఆయన సజీవంగా ఉన్నప్పటి స్థితికి మరియు అంతిమ దినం నాటి స్థితికి భిన్నమైనది. చనిపోయిన వ్యక్తి ఏ పనీ చేయలేడు. ఈ ప్రపంచంలో జీవించి ఉన్నపుడు అతను చేసిన పనులే అతనికి ప్రతిఫలాన్ని అందజేస్తాయి – షరిఅహ్ లో మినహాయించబడిన ప్రత్యేక పనులు తప్ప. మృతులను వేడుకోవడమనేది షరిఅహ్ మినహాయించిన పనులలో లేదు. కాబట్టి దానిని ఈ ప్రత్యేక తరగతికి చెందిన పనిగా పరిగణించలేము. నిస్సందేహంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన బరజఖ్ జీవితంలో సజీవంగా ఉన్నారు. ఆయన ఉన్న స్థితి ఒక షహీద్ యొక్క మరణానంతర స్థితి కంటే ఎంతో ఘనమైనది. అయితే ఇది చనిపోయే ముందు జీవించే ఈ ప్రాపంచిక జీవితం కంటే మరియు తీర్పుదినం తర్వాత రాబోయే జీవితం కంటే భిన్నమైనది. బరజఖ్ అంటే సమాధి జీవితం యొక్క స్వభావం అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ తెలియదు. దీని గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికారు,
مَا مِنْ أَحَدٍ يُسَلِّمُ عَلَـيَّ إِلاَّ رَدَّ اللهُ عَلَـَّي رُوْحِـي حَـتَّـى أَرُدَّ عَـلَيْـهِ السَّلاَمَ
మా మిన్ అహదిన్ యుసల్లిమూ అలయ్య ఇల్లా రద్దల్లాహు అలయ్య రూహీ హత్త అరుద్దఅలైహిస్సల్లామ
ఎవరైనా నా పై సలాములు పంపినపుడు, అతని సలాముకు బదులిచ్చే వరకు అల్లాహ్ నా శరీరంలోనికి నా ఆత్మను పునః ప్రవేశింపజేస్తాడు.
పై హదీథు ఆధారంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చనిపోయారని, ఆయన ఆత్మ ఆయన శరీరం నుండి విడిగా ఉంటుంది మరియు సలాము చేయబడినపుడు మాత్రమే అది ఆయన శరీరంలోనికి ప్రవేశింపజేయబడుతుందనేది స్పష్టమవుతున్నది. ఆయన మరణం గురించి ఖుర్ఆన్ మరియు సున్నతులలో తెలుపబడిన వాదనలు అందరికీ తెలిసినవే. ఉలేమాల వద్ద ఇది ఎలాంటి అనుమానాలు లేని విషయం. అయితే ఆయన యొక్క బరజఖ్ జీవితానికి మరణమనేది ఆటంకం కాదు. షహీదుల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఖుర్ఆన్ లో దీని గురించి ఇలా స్పష్టం చేయబడింది:
وَلا تَـحْسَـبَنَّ الَّـذِيـنَ قُـتِـلُوا فِي سَبِـيـلِ اللهِ أَمْـوَاتًا بَلْ أَحْيَاءٌ عِـنْـدَ رَبِّـهِمْ يُـرْزَقُـونَ
వలా తహ్సబన్నల్లదీన ఖుతిలూ ఫీ సబీలిల్లాహి అంవాతన్ బల్ అహ్యాఉన్ ఇంద రబ్బిహిం యుర్జఖూన
మరియు ఎవరైతే అల్లాహ్ మార్గంలో చంపబడినారో, వారిని ఎప్పుడూ మృతులుగా భావించకండి. వాస్తవానికి వారు సజీవులే. వారికి తమ ప్రభువు వద్ద ఆహారం ఇవ్వబడుతున్నది. 3:169
ఇది షిర్క్ (అల్లాహ్ కు సాటి కల్పించడం) వైపు పిలిచే వారు, అల్లాహ్ ను వదిలి మృతులను ఆరాధించేవారు తికమకపెట్టే ఒక ముఖ్యమైన విషయం కావటం వలన దీనిని మేము వివరంగా చర్చించినాము. షరిఅహ్ కు వ్యతిరేకమైన వాటన్నింటి నుండి అల్లాహ్ మనల్ని కాపాడుగాక.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి వద్ద తమ స్వరం పెంచే వారి చర్యలు మరియు చాలా ఎక్కువ సేపు వరకు అక్కడే నిలిచిపోయే వారి చర్యలు షరిఅహ్ కు విరుద్ధమైనవి. ఎందుకంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్ద ఆయన కంటే హెచ్చు స్వరంతో మాట్లాడవద్దని అల్లాహ్ ప్రజలకు ఆదేశించినాడు. అలాగే తమలో తాము మాట్లాడుకునే విధంగా ఆయనతో హెచ్చు స్వరంలో మాట్లాడకూడదని కూడా అల్లాహ్ ఆజ్ఞాపించినాడు. అంతేగాక, ఆయనతో ప్రజలు తక్కువ స్వరంలో మాట్లాడాలని ఆదేశించబడింది. ఖుర్ఆన్ లోని అల్లాహ్ ఆదేశం ఇలా ఉంది:
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لا تَرْفَعُوا أَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِيِّ وَلا تَجْهَرُوا لَهُ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ أَنْ تَحْبَطَ أَعْمَالُكُمْ وَأَنْتُمْ لا تَشْعُرُونَ * إِنَّ الَّذِينَ يَغُضُّونَ أَصْوَاتَهُمْ عِنْدَ رَسُولِ اللَّهِ أُولَئِكَ الَّذِينَ امْتَحَنَ اللَّهُ قُلُوبَهُمْ لِلتَّقْوَى لَهُمْ مَغْفِرَةٌ وَأَجْرٌ عَظِيمٌ
యాఅయ్యుహల్లదీన్ ఆమనూ లా తర్ఫఊ అస్వాతకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి వలా తజ్ హరూ లహు బిల్ఖౌలి కజహ్రి బఅదికుమ్ లిబఅదిన్ అన్ తహ్బత అమాలుకుమ్ వ అంతుమ్ లా తష్ఉరూన ఇన్నల్లదీన యగుద్దూన అస్వాతహుమ్ ఇంద రసూలిల్లాహి ఉలాయికల్లదీన అంతహనల్లాహ ఖులూబహుమ్ లిత్తఖ్వా లహుమ్మగ్ఫిరతున్ వ అజ్రున్ అజీమున్
ఓ విశ్వసించిన ప్రజలారా! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వరం కంటే ఎక్కువగా మీ స్వరాన్ని పెంచి గానీ, మీలో మీరు బిగ్గరగా మాట్లాడుకునేటట్లుగా ఆయనతో బిగ్గరగా గానీ మాట్లాడవద్దు. అలా చేస్తే మీరు గ్రహించకుండానే, మీ ఆచరణలకు ప్రతిఫలం ఏమీ లేకుండా పోతుంది. నిశ్చయంగా, అల్లాహ్ యొక్క ప్రవక్త సమక్షంలో తక్కువ స్వరంతో మాట్లాడే వారి హృదయాలు, అల్లాహ్ యొక్క ధర్మనిష్ఠ పరీక్షలో నిగ్గుతేలుతాయి. అలాంటి వారి కొరకే మన్నింపు మరియు ఘనమైన ప్రతిఫలం ఉంది. 49:2,3.
అంతేగాక, ఆయన సమాధి వద్ద ఎక్కువ సేపు నిలబడటం వలన, రద్దీ మరియు సందడి బాగా పెరిగి పోతుంది. పైగా ఇలా చేయడం పై ఖుర్ఆన్ వచనాలకు విరుద్ధంగా చేసినట్లవుతుంది కూడా. ఒక ముస్లిం కొరకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అత్యంత ఆదరణీయులు. ఆయన సన్నిధిలో షరిఅహ్ కు వ్యతిరేకమైన అలాంటి చర్యలు చేయడమనేది గర్హణీయమైన విషయం. అలాగే, ఆయన సమాధి వద్ద నిలబడినపుడు లేదా సమాధికి ఎదురుగా నిలబడినపుడు రెండు చేతులు పైకెత్తి దుఆలు చేయడమనేది కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరుల, తాబయీన్ ల మరియు పూర్వం గతించిన పుణ్యపురుషుల ఆచారానికి వ్యతిరేకం. అలా చేయడం ఒక కల్పితాచారం మాత్రమే. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు,
عَلَيْكُمْ بِسُنَّـتِـي وَسُنَّـةِ الْـخُلَفاَءِ الرَّاشِدِيْنَ الْـمَهْدِيِيِّنَ مِنْ بَعَدِي، تَـمَسَّكُوْا بِـهَا وَعَضُّوْا عَلَيْهَا بِالنَّوَاجِذِ، وَإِيَّاكُمْ وَمُـحْدَثَاتِ الْأُمُوْرِ، فَإِنَّ كُلَّ مُـحْدَثَـةٍ بِدْعَـةٌ وَكُلَّ بِدْعَـةٌ ضَلاَلَـةٌ
అలైకుమ్ బిసున్నతీ వ సున్నతిల్ ఖుల్ఫాఇర్రాషిదీనల్మహ్దియ్యిన మిన్ బఅదీ తమస్సకూ బిహా వ అద్దూ అలైహా బిన్నవాజిది వ ఇయ్యాకుమ్ వ ముహ్దథాతిల్ ఉమూరి ఫ ఇన్న కుల్లి ముహ్దథతిన్ బిద్అతున్ వ కుల్ల బిద్అతున్ దలాలతున్
నా మార్గాన్ని గట్టిగా పట్టుకోండి. నా తర్వాత సన్మార్గంలో నడిచే ఖలీఫాల మార్గాన్ని గట్టిగా పట్టుకోండి. దానినే అంటిపెట్టుకుని ఉండండి మరియు మీ దవడ పళ్ళతో గట్టిగా కరిచి పట్టుకోండి. నూతన కల్పితాలకు దూరంగా ఉండండి. కొత్తగా కనిపెట్టబడిన ఏ విషయమైనా నూతన కల్పితమే అవుతుంది మరియు అది మార్గభ్రష్టత్వానికి దారి తీస్తుంది.
ఇంకా ఆయనిలా అన్నారు,
مَنْ أَحْدَثَ فِـي أَمْرِنَا هَذَا مَا لَـيْـسَ مِـنْـهُ فَـهُـوَ رَدٌّ
మన్ అహ్దథ ఫీ అమ్రినా హదా మాలైస మిన్హు ఫహువ రద్దున్
మా విషయంలో లేని విషయాన్ని ఎవరైనా కొత్తగా కల్పిస్తే, అది తిరస్కరించబడుతుంది.
ఒకసారి అలీ బిన్ హుసైన్ జైనుల్ ఆబిదీన్ ఎవరో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి వద్ద నిలబడి ప్రార్థించడాన్ని చూసారు. వెంటనే ఆయన అతడిని ఆపి, దానిని ఆయన తన తండ్రి నుండి నేర్చుకున్నానని, మరియు ఆయన తండ్రి దానిని తాత అయిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా నేర్చుకున్నారని పలికారు,
لاَ تَـتَّـخِذُوْا قَبَرِي عِيْداً وَلاَ بُـيُـوتَـكُمْ قُـبُـوْرًا، وَصَلُّوْا عَلَـيَّ فَإِنَّ تَسْلِيْمَكُمْ يَـبْلُغُـنِـيْ أَيْـنَمـَا كُنْـتُـمْ
లాతత్తఖిదూ ఖబరీ ఇయ్ దన్ వలా బుయూతకుమ్ ఖుబూరన్ వ సల్లూ అలయ్య ఫఇన్న తస్లీమకుమ్ యబ్లుగునీ అయ్ నమా కుంతుమ్
నా సమాధిని సందర్శనా స్థలంగా చేయవద్దు. మీ ఇళ్ళను స్మశాన స్థలంగా మార్చవద్దు (ఇళ్ళలో నమాజు చేయకుండా ఉండవద్దు). మరియు నాపై దరూద్ పంపుతూ ఉండండి. ఎందుకంటే మీరెక్కడ నుండి పంపినా, మీ సలాము నాకు చేరుతుంది.
అలాగే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పంపేటపుడు కొందరు కుడి చేతిని తమ గుండెకు ఎడమవైపు ఉంచుతారు. ఆయనపై సలాము పంపేటపుడు లేదా ఎవరైనా రాజు, నాయకుడికి సలాము చేసేటపుడు ఈ భంగిమలో నిలబడటం ధర్మబద్ధం కాదు. ఎందుకంటే, ఇలా చేయడంలో చూపే వినయం, అణుకువ, నమ్రత మరియు సమర్పణలు కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందుతాయి.
ఈ విషయాన్ని గొప్ప ఉలేమాల ప్రామాణిక అభిప్రాయాల ఆధారంగా హాఫిజ్ ఇబ్నె హజర్ చర్చించారు. దీనిపై దృష్టి కేంద్రీకరించినా వారెవరికైనా ఇది స్పష్టమవుతుంది. అయితే అతను అల్లాహ్ కు అంగీకారమైన ముందుతరం పుణ్యపురుషుల మార్గాన్ని అనుసరించాలనే సంకల్పం ఉన్నవాడై ఉండాలి. పక్షపాతంలో, స్వార్థంతో కూడిన కోరికలలో మరియు గుడ్డిగా అనుకరించడంలో, సజ్జనుల మార్గానికి విరుద్ధంగా పోవడంలో మునిగిపోయిన వారి దుర్గతిని అల్లాహ్ త్వరలోనే నిర్ణయిస్తాడు. అల్లాహ్, మాకూ మరియు వారికీ సన్మార్గం చూపు గాక. ప్రతి దానిపై సత్యానికే ప్రాధాన్యత నిచ్చేటట్లు చేయుగాక. అలాగే దూరంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వైపు తిరిగి నిలబడి, సలాము కొరకు లేదా దుఆ కొరకు తమ పెదాలను కదిపే వారు కూడా మతభ్రష్ఠుల కోవలోనికే వస్తారు. ధర్మంలో ఇలాంటి నూతన పోకడలు కల్పించడం ఒక విశ్వాసికి తగదు. ఎందుకంటే అలా చేయడానికి అల్లాహ్ అనుమతి నివ్వలేదు. అలా చేయడమనేది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ప్రేమ చూపడం క్రిందికైతే రాదు గానీ, అల్లాహ్ ఆజ్ఞలను దాటి హద్దు మీరిపోవడం క్రిందికి మాత్రం తప్పక వస్తుంది. ఇలాంటి వాటిని ఖండిస్తూ, తర్వాతి తరాల సంస్కరణ కూడా ముందు తరాల సంస్కరణ మాదిరిగానే జరగాలని ఇమాం మలిక్ అన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మార్గాన్ని మరియు సన్మార్గంలో నడిచిన ఖలీఫాల మార్గాన్ని, సహాబాల మార్గాన్ని మరియు తాబయీనుల మార్గాన్ని అనుసరించే, ముందు తరాల ప్రజలు తమను తాము సంస్కరించుకున్నారు. తర్వాత తరం ప్రజలకు కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పద్ధతిని అనుసరించటంలోనే ఋజుమార్గం కనబడుతుంది. ఇలా చేయడం ద్వారా మాత్రమే వారి సంస్కరణ సరిగ్గా జరుగుతుంది. తమ సంక్షేమాన్ని పదిలం చేసుకునేందుకు మరియు ఇహపర లోకాలలో సాఫల్యం సాధించేందుకు, అలా చేసే శక్తిని అల్లాహ్ ముస్లింలకు ప్రసాదించుగాక.
మస్జిదె నబవీని సందర్శించడమనేది తప్పనిసరి హజ్ ఆచరణ క్రిందికి రాదు:
హెచ్చరిక: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని సందర్శించడమనేది ఫర్ద్ (తప్పనిసరి) కాదు మరియు హజ్ నియమాలలోనికీ రాదు. ఇది కొందరి ప్రజల అపోహ మాత్రమే. అయితే ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి సమీపానికి లేదా దాని పరిసర ప్రాంతాలకు చేరుకున్నవారు, మస్జిదె నబవీని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని సందర్శించడం ఉత్తమం. అయితే, మదీనహ్ నగరానికి దూరంగా నివసించే ప్రజలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని సందర్శించే సంకల్పంతో ప్రయాణించడం ధర్మబద్ధం కాదు. కానీ, మస్జిదె నబవీని సందర్శించే సంకల్పంతో అలా ప్రయాణించ వచ్చు. మదీనహ్ నగరంలోనికి చేరుకున్న తర్వాత వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని మరియు సహాబాల సమాధులను సందర్శించాలి. సహీహ్ బుఖారీ మరీయు ముస్లిం హదీథు గ్రంథాలు రెండింటిలోనూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినట్లుగా నమోదు చేయబడింది:
لاَ تُـشَـدُّ الرِّحَالُ إِلاَّ إِلَى ثَـلاَ ثَـةِ مَسَاجِـدَ: أَلْـمَسْجِدِ الْـحَـرَامِ، وَمَسْجِـدِي هَـذَا، وَالْـمَسْجِـدِ الْأَ قْـصَى
లాతుషద్దుర్రిహాల ఇల్లా ఇలా థలాథతి మసాజిద అల్ మస్జిదిల్ హరామి వ మస్జిదీ హదా వల్ మస్జిదిల్ అఖ్సా
ఈ మూడు మస్జిదులను సందర్శించడం కొరకు మాత్రమే ఎవరైనా ధార్మిక ప్రయాణం చేయవచ్చు: మస్జిద్ అల్ హరామ్ (కఅబహ్ మస్జిద్), నా మస్జిద్ (మస్జిదె నబవీ) మరియు మస్జిద్ అల్ అఖ్సా.
ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని లేదా ఎవరైనా ఇతరుల సమాధిని సందర్శించుట ధర్మసమ్మతమైనదైతే, తప్పకుండా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సమాజాన్ని అలా చేయమని ఆదేశించి ఉండేవారు. ఎందుకంటే వారి గురించి ఆయన చాలా సద్భావంతో ఉండేవారు, అల్లాహ్ కు ఎక్కువగా భయపడేవారు మరియు అల్లాహ్ గురించి బాగా ఎరిగిన ఉండినారు. తనకివ్వబడిన ప్రవక్త బాధ్యతను ఆయన పూర్తిగా నిర్వహించినారు. సమాజాన్ని ప్రతి మంచితనం వైపు దారి చూపినారు మరియు ప్రతి చెడు నుండి హెచ్చరించినారు. పై మూడింటిని సందర్శించడానికి చేసే ప్రయాణం తప్ప ఇతర మస్జిదులను సందర్శించడానికి చేసే ప్రయాణాన్ని ఆయన నిషేధించినారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికారు,
لاَ تَـتَّـخِذُوا قَبَرِي عِيْداً، وَلاَ بُـيُـوتَـكُمْ قُبُـوراً، وَصَلُّوا عَلَـيَّ فَإِنَّ صَلاَتِـكُمْ تَبْلُغُـنِـي حَيْثُ كُـنْـتُمْ
లాతత్తఖిదూ ఖబరీ ఇయ్ దన్ వలా బుయూతకుమ్ ఖుబూరన్ వ సల్లూ అలయ్య ఫఇన్న సలాతికుమ్ యబ్లుగునీ హైథు కుంతుమ్
నా సమాధిని తిరునాళ్ళ ప్రాంతంగా మార్చవద్దు. మీ ఇళ్ళను స్మశాన స్థలంగా మార్చవద్దు. నా పై దరూద్ పంపండి. మీరెక్కడ నుండి దరూద్ పంపినా, అది నాకు చేర్చబడుతుంది.
ఆయన సమాధిని దర్శించడమనేది షరిఅహ్ ఆచరణయే అని సమర్ధించుకోవడానికి, దానిని యాత్రా స్థలంగా మార్చడం మరియు హద్దు మీరి ఆదరించడం జరగవచ్చని ఆయన భయపడి ఉండవచ్చు. ప్రస్తుత కాలంలో ఆయన భయపడినట్లుగానే అనేక మంది ప్రజలు ఆయన సమాధిని దర్శించడమనేది షరిఅహ్ లోని భాగమేనని నమ్ముతూ, దారి తప్పిపోతున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని దర్శించుట షరిఅహ్ లోని భాగమనే తమ అభిప్రాయానికి సమర్ధనగా వారు పేర్కొనే హదీథులు ఉల్లేఖకుల పరంపర విషయంలో బలహీనమైనవే గాక, అవన్నీ కల్పితమైనవి కూడా. ప్రఖ్యాత హదీథు పండితులు దర్ఖుత్నీ, బైహఖీ మరియు హాఫిద్ ఇబ్నె హజర్ మొదలైన వారు ఆ హదీథుల బలహీనత గురించి హెచ్చరించారు. కాబట్టి అలాంటి బలహీనమైన హదీథులను మూడు మస్జిదులను సందర్శించడానికి తప్ప, ఏ సంకల్పంతోనైనా సరే చేసే ఇతర సందర్శన ప్రయాణాలు నిషేధించబడినాయనే ప్రామాణిక హదీథుకు వ్యతిరేకంగా పేర్కొనడమనేది అస్సలు చేయకూడదు. అలాంటి అసత్య హదీథులను గుర్తించి, దారి తప్పిపోకుండా తమను తాము కాపాడుకొనుట కొరకు పాఠకులు వాటిని తెలుసుకొనుట అవసరమని భావిస్తూ, అలాంటి కొన్నింటిని క్రింద పేర్కొంటున్నాము.
ఎవరైతే హజ్ చేస్తారో మరియు నన్ను సందర్శించరో, అలాంటి వారు నా విషయంలో తప్పు చేసారు – అసత్య హదీథు.
నా మరణం తర్వాత ఎవరైతే నన్ను దర్శిస్తారో, వారు నా జీవితంలో నన్ను దర్శించినట్లే – అసత్య హదీథు.
ఎవరైతే నన్ను మరియు నా పూర్వీకులైన ఇబ్రాహీంను ఒకే సంవత్సరంలో దర్శిస్తారో, అల్లాహ్ ప్రమాణంగా వారికి స్వర్గం లభిస్తుందని గ్యారంటీ ఇస్తున్నాను – అసత్య హదీథు
ఎవరైతే నా సమాధిని దర్శిస్తారో, వారి పై నా సిఫారసు తప్పని సరై పోతుంది – అసత్య హదీథు.
అలాంటి హదీథులకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వరకు చేర్చే సరైన జాడ ఉండదు. హాఫిద్ ఇబ్నె హజర్ పరిశోధన ప్రకారం అలాంటి వాటి ఉల్లేఖకుల పరంపర కల్పితమైనది. హాఫిద్ ఉఖైలీ ఇలా పలికారు, “అలాంటి ఏ హదీథు ప్రామాణిక మైనది కాదు”. ఇబ్నె తైమియా అభిప్రాయం ప్రకారం అలాంటి హదీథులు అక్రమంగా కల్పించబడినవే. మీ జ్ఞానం కోసం మరియు సంరక్షణ కోసం కల్పిత హదీథుల గురించి ఇక్కడి వరకు ఇవ్వబడిన సమాచారం సరిపోతుందని భావిస్తున్నాము. ఒకవేళ పై వాటిలో ఏ హదీథైనా ప్రామాణికమైనదై ఉండినట్లయితే, మన కంటే ముందు సహాబాలు దానిని ఆచరించి ఉండేవారే మరియు అలా చేయమని సమాజానికి కూడా దారి చూపి ఉండేవారే. ఎందుకంటే ప్రవక్తల తర్వాత అంతటి ఉత్తములైన ప్రజలు సహాబాలే కదా. మరియు అల్లాహ్ విధించిన హద్దుల గురించి వారు బాగా ఎరిగినవారు. అల్లాహ్ తన దాసులకు ఆదేశించిన షరిఅహ్ గురించి వారికి చాలా బాగా తెలుసు. అల్లాహ్ గురించి మరియు అల్లాహ్ దాసుల గురించి వారు చాలా ఎక్కువ చిత్తశుద్ధి కలిగి ఉండినారు. పై వాటి గురించి వారి నుండి ఎలాంటి వ్యాఖ్యానం లేదు కాబట్టి, ఇవన్నీ అసత్యమైన హదీథులని మనం గ్రహించవచ్చు. ఒకవేళ ఏదైనా హదీథు ప్రామాణికమైనదైతే, దానికి సంబంధించిన షరిఅహ్ నియమం ఆచరణలో ఉండేది. పై హదీథులు అసత్యమైనవి లేదా కల్పితమైనవనే తుది నిర్ణయాన్ని ఇది ధృవీకరిస్తున్నది. అన్నీ ఎరిగిన అల్లాహ్ యే మహోన్నతుడు, లోపాలకు అతీతుడు, ఘనమైన వాడు.
ఖుబాఅ మస్జిదును మరియు జన్నతుల్ బఖీని దర్శించడం ఉత్తమం:
మదీనహ్ దర్శించే ప్రజలు ఖుబా మస్జిదును దర్శించడం మరియు దానిలో నమాజు చేయడం ఉత్తమం. అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కోసారి కాలి నడకన, ఒక్కోసారి సవారీపై ఈ మస్జిదును దర్శించేవారు మరియు అందులో రెండు రకాతుల నమాజు చేసేవారు. బుఖారీ మరియు ముస్లిం హదీథు గ్రంథాలు
సహల్ బిన్ హనీఫ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖ: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు,
مَنْ تَـطَهَّـرَ فِـي بَـيْـتِـهِ ثُـمَّ أَتَـى مَسْجِـدَ قُـبَاءَ فَصَلَّى فِـيْـهِ صَلاَةً كَانَ لَـهُ كَـأَجْـرِ عُـمْـرَةٍ
మన్ తతహ్హర ఫీ బైతిహి థుమ్మ ఆతా మస్జిద ఖుబాఅ ఫసల్ల ఫీహి సలాతన్ కాన లహు కఅజ్రి ఉమ్రతిన్
ఎవరైతే ఇంటిలో వుదూ చేసి, తర్వాత ఖుబాఅ మస్జిదుకు వెళ్ళి, అందులో నమాజు చేస్తారో, అలాంటి వారికి ఉమ్రహ్ చేసినంత పుణ్యం లభిస్తుంది. (అహ్మద్, నసాయి, ఇబ్నె మాజా మరియు హాకిమ్)
అలాగే, జన్నతుల్ బఖీ (స్మశానం) దర్శించడం, షహీదుల సమాధులను దర్శించడం మరియు హంజా రదియల్లాహు అన్హు సమాధిని దర్శించడం కూడా సున్నతులోనివే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాటిని దర్శించేవారు మరియు వారి కొరకు ప్రార్థించేవారు. దీని గురించిన హదీథు ఇలా ఉంది:
زُوْرُوْا الْـقُـبُـورَ فَـإِ نَّـهَا تُـذَكِّـرُكُمْ اَلْآخِـرَةَ
జూరుల్ ఖుబూర ఫఇన్నహా తుదక్కిరుకుమ్ అల్ ఆఖిరత
స్మశానాల్ని దర్శించండి. ఎందుకంటే అవి మీకు పరలోకం గురించి జ్ఞాపకం చేస్తాయి. ముస్లిం హదీథు.
సమాధులను దర్శించేటపుడు, క్రింది విధంగా పలుకమని ఆయన తన సహచరులకు బోధించారు,
أَلسَّلاَمُ عَلَيْكُمْ أَهْلٌ الدِّيَارْ مِنَ الْـمُؤمِـنِـيْـنَ وَالْـمُسْلِـمِيْنْ وَإِنَّا إِنْ شَاءَ الله بِكُمْ لاَحِقُوْنَ، نَسْأَلُ اللهَ لَنَا وَلَكُمْ الْـعَافِـيَـةٌ
అస్సలాము అలైకుమ్ అహలుద్దియార్ మినల్ మోమినీన్ వల్ ముస్లిమీన్. వ అనా ఇన్ షాఅ అల్లాహ్ బికుమ్ లాహిఖూన్. నస్అలుల్లాహ లనా వ లకుమ్ అల్ ఆఫియహ్.
మోమినుల మరియు ముస్లిముల ప్రాంతంలో ఉన్న నివాసితులారా, అస్సలాము అలైకుమ్. అల్లాహ్ తలిచినపుడు, నేను కూడా మీతో చేరబోతున్నాను. నా కొరకు మరియు మీకొరకు మేలు ప్రసాదించమని నేను అల్లాహ్ ను వేడుకుంటున్నాను. (ముస్లిం హదీథు గ్రంథం)
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనహ్ లోని స్మశానం దగ్గర నుండి వెళ్తున్నపుడు, దాని వైపు తిరిగి ఇలా పలికారని అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన హదీథు అత్తిర్మిథీ హదీథు గ్రంథంలో ఇలా నమోదు చేయబడింది:
أَلسَّلاَمُ عَلَـيْكُمْ يَا أَهْلُ الْـقُـبُـورْ يَـغْـفِـرَ اللهُ لَـنَـا وَلَـكُـمْ أَنْـتُـمْ سَلَـفَـنَا وَنَـحْنُ بِالْأَ ثَـرْ
అస్సలాము అలైకుమ్ యా అహలుల్ ఖుబూర్, యగ్ఫిరల్లాహు లనా వ లకుమ్, అంతుమ్ సలఫనా వ నహ్ను బిల్అథర్
సమాధులలో ఉన్న వారలారా! అస్సలాము అలైకుమ్. మమ్ముల్ని మరియు మిమ్ముల్ని అల్లాహ్ క్షమించు గాక. మీరు మా కంటే ముందు వెళ్ళిపోయారు మరియు మేము మీ వెనుక వస్తున్నాము.
ఈ హదీథుల ద్వారా మనం నేర్చుకునేదేమిటంటే సమాధులను సందర్శించమనే షరిఅహ్ ఆదేశం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే దాని ద్వారా మనం మరణానంతర జీవితం గురించి గుర్తు చేసుకోవాలని.
మృతులతో ఉత్తమంగా వ్యవహరించే, వారిపై అల్లాహ్ యొక్క కారుణ్యం కురిపించమని వేడుకునే మరియు వారి కొరకు మరిన్ని దుఆలు చేసే అవకాశాల్ని ఈ సమాధి సందర్శనం కల్పిస్తున్నది.
అయితే, మృతులను వేడుకోవడానికి సమాధులను సందర్శించడం, అక్కడ కూర్చోవడం, తమ అవసరాలు తీర్చమని మృతులను అర్థించడం, రోగుల స్వస్థత కొరకు వారి సహాయాన్ని కోరటం, వారి ద్వారా లేదా వారి స్థాయి ద్వారా అల్లాహ్ ను వేడుకోవడం మొదలైనవి నిషేధించబడినాయి. ఎందుకంటే అలా చేయడం షిర్క్ క్రిందకి వస్తుంది. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అలా చేయడానికి అనుమతించ లేదు. అంతేగాక ముందుతరం సజ్జనులు కూడా అలా చేయలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించిన ఘోరమైన చెడు పనులలో అదొకటి. ఆయన పలుకులు:
زُوْرُوْا الْـقُـبُـورَ وَلاَ تَـقُـوْلُـوْا هُـجْـراً
జూరుల్ ఖుబూర వలా తఖూలు హుజ్ రన్
సమాధులను దర్శించండం, కానీ చెడు పలుకులు పలుకవద్దు.
ఈ పనులన్నింటిలోనూ కామన్ గా ఉన్న విషయం ఏమిటంటే ఇవి కొత్తగా కనిపెట్టబడిన నూతన కల్పితాలు. అయితే అవి వేర్వేరు స్థాయిలో ఉన్నాయి. వాటిలో కొన్ని పూర్తిగా దారి తప్పిన నూతన కల్పితాలే అయినా ఇంకా షిర్క్ స్థాయికి చేరుకోలేదు. ఉదాహరణకు, సమాధుల వద్ద నిలబడి అల్లాహ్ ను ప్రార్థించడం, మృతుల అంతస్తును పేర్కొంటూ ప్రార్థించడం మొదలైనవి. వాటిలో కొన్ని షిర్క్ అక్బర్ క్రిందికి వస్తాయి, ఉదాహరణకు – మృతులను వేడుకోవడం మరియు వారి సహాయాన్ని అర్థించడం.
ఈ విషయాల గురించి మేము ఇంతకు ముందు వివరంగా చర్చించాము. కాబట్టి వీటి గురించి మనం అప్రమత్తంగా ఉండాలి. సత్యాన్ని మాత్రమే అనుసరించే శక్తిని ప్రసాదించమని మరియు సరైన దారి చూపమని మనం అల్లాహ్ ను ప్రార్థించాలి. కేవలం అల్లాహ్ మాత్రమే మనకు సన్మార్గాన్ని అనుసరించే శక్తిని ప్రసాదించగలడు. అల్లాహ్ తప్ప, నిజమైన వేరే ఆరాధ్యుడు, ప్రభువు ఎవ్వరూ లేరు.
ఇది ఈ చిరు పుస్తకం యొక్క అంతిమ చివరి విషయం.
وَالْـحَمْـدُ للهِ أَ وَّلاً وَآخِراً، وَصَلَّى اللهُ وَسَلَّمَ عَلَى عَبْـدُهُ وَرَسُـولُـهُ وَخَـيْـرَتِـهُ مِنْ خَـلَـقَـهُ مُـحَـمَّـدٍ وَعَلَى آلِـهِ وَأَصْحَابِـهِ وَمَـنْ تَـبَـعَـهُمْ بِـإِحْـسَانِ إِلَى يَـوْمُ الـدِّيْـنَ
వల్ హందులిల్లాహి అవ్వలన్ వ ఆఖిరన్. సల్లల్లాహు అలైహి వసల్లం అలా అబ్దుహు, వ రసూలుహు, వ ఖైరతిహు మిన్ ఖలఖహు ముహమ్మదిన్ వ ఆలా ఆలిహి, వ అస్హాబిహి, వ మన్ తబఅహుమ్ బిఇహ్సాని ఇలా యౌముద్దీన్.
ఆరంభంలో మరియు అంతంలో సకల స్తోత్రములు అల్లాహ్ కే. అల్లాహ్ దాసుడు, ప్రవక్త మరియు సృష్టితాలలో అత్యుత్తములూ అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబంపై, ఆయన సహచరులపై, అంతిమ దినం వరకు మంచితనంలో వారిని అనుసరించేవారిపై అల్లాహ్ యొక్క కరుణ కురియుగాక.
నిలకడగా ఆయన ధర్మాన్ని అనుసరించేలా అల్లాహ్ మనకు సహాయపడుగాక. ఆయనను వ్యతిరేకించడం నుండి మమ్ముల్ని కాపాడుగాక. నిశ్చయంగా ఆయన చాలా ఉదారవంతుడు మరియు మహోన్నతుడూను.