నిఖా హలాలా ధర్మపరమైనది కాదు [వీడియో]

బిస్మిల్లాహ్

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

నిఖా హలాలా ధర్మపరమైనది కాదు (لَعَنَ اللهُ الْمُحَلِِّّلَ وَالْمُحَلََّّلَ لَهُ)

మన సమాజంలో హలాలా పేరు మీద విడాకులు పొందిన భార్యపై మహా అన్యాయం జరుగుతుంది. దాని వాస్తవం, ధర్మంలో దాని గురించి వచ్చిన ఆదేశాలు ఇందులో తెలుసుకోండి.

ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [6:57 నిమిషాలు]


హలాలా అంటే ఏమిటి!? హలాలా ధర్మ సమ్మతమేనా!?

ప్రపంచంలోనే అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ధర్మం ఇస్లాం. ఇస్లాం ధర్మాన్ని అడ్డుకోవటానికి ముస్లిమేతరులు చేస్తున్న అసత్య ప్రచారాల్లో ఒకటి హలాలా! ఇంతకి ఈ ఎలక్ట్రానిక్ మిడియా ముస్లింలపై హలాలా విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తుందో తెలుసుకుందాము. ముస్లిమేతురుల అపోహాలు దూరం చేయడానికి ఈ చిన్న ప్రయత్నాన్ని అల్లాహ్ స్వికరించుగాక ఆమీన్.

హలాలా’ను అరబిక్ లో “తహలీల్” అని కూడా అంటారు. హలాలా రెండు రకాలు వుంది:

1) హలాలా ధర్మసమ్మతమైనది.
2) హలాలా ధర్మ నిషిద్దం మరియు బహుచెడ్డది, నీచమైనది, అధర్మమైనది, శపించబడినది.

తలాక్ అనే అంశంతో హలాలా అనేది ఇమిడి వుంది.

1) ధర్మ సమ్మతమైన హలాల అంటే: ఇస్లామీయ పద్దతిలో భర్త తన భార్యకు వేర్వేరు సందర్భాల్లో రెండు సార్లు విడాకులిచ్చిన తర్వాత ఏలాంటి హలాలా అవసరం లేకుండా తిరిగి భార్యగా ఉంచుకునే అనుమతి ఉంది. దీనికి సంబంధించిన పద్ధతి, నిర్ణిత గడువు, గడువు దాటితే ఏమి చేయాలి అన్న వివరాలు సూర బఖర, సూర నం. 2 ఆయతు 228, 229 మరియు 232లో చూడవచ్చు.

ఎప్పుడైతే భర్త మూడవసారి తలాక్ ఇస్తాడో ఆ తరువాత ఆ భార్య ఈ భర్తకు భార్యగా వుండదు. ఇది సూర బకర ఆయాతు 230 లో చెప్పబడింది.

మరి ఆమెకు (మూడవసారి) గనక విడాకులిస్తే, ఆ స్త్రీ ఇతనిని తప్ప వేరొక వ్యక్తిని వివాహం చేసుకోనంతవరకూ ఇతని కోసం ఆమె ధర్మసమ్మతం కాజాలదు. (సూర బఖర 2:230)

ఇస్లాం పరంగా వారిరువురు విడిపోయారు భార్య భర్తలుగా లేరు. ఇస్లాంలో ఈ విడాకులు తీసుకున్న భార్య, భర్తలు మళ్ళీ కలిసి బ్రతకాలి జీవించాలంటే ఒకే ఒక పద్దతి వున్నది. దానినే ధర్మపరమైన హలాలా అంటారు.

అదేమిటంటే: ఎవరైనా ఒక వ్యక్తి తన ఇష్టంతో, ధర్మపరంగా విడాకులు పొందిన ఈ స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు. ఈ కొత్త దంపతుల ఇరువురీ ఉద్దేశం అల్లాహ్ దయతో కలిసి సంతోషంగా జీవించాలన్నదే. అలా జీవితం జరుగుతూ… వున్న సమయంలో ఆ రెండవ భర్త చనిపోయిన కారణంగానో.. లేక మరి ఏదైనా ఆటంకం వల్లనో.. జీవనం సాగడం ఇబ్బందికరంగా మారితే.. ఆ రెండవ భర్త కూడా ఇస్లామీయ పద్దతిలో మూడవసారి తలాక్ విడాకులు ఇచ్చేశాడు, లేదా ఆమె ఖులఅ తీసుకొని భర్తలేని జీవితం గడపుతుంది.

…ఇలా కొన్ని రోజుల తరువాత తన మొదటి భర్త కు తెలిసి తాను పెళ్ళి చేసుకుంటానని కబురు(వార్త) పంపితే ఆ స్త్రీ అతనితో వివాహానికి సిద్దమైతే మళ్ళీ కొత్తగా మహర్ ను చెల్లించి, కొత్తగా వివాహం చేసుకుంటాడు. దీనిని ఇస్లామీయ భాషలో ‘ధర్మసమ్మతమైన హలాలా’ అరబీలో తహలీల్ జాయిజ్ అంటారు. సూర బకర ఆయాత్ 230 లో దీని ప్రస్తావన వుంది.

మరి ఆమెకు (మూడవసారి) గనక విడాకులిస్తే, ఆ స్త్రీ ఇతనిని తప్ప వేరొక వ్యక్తిని వివాహం చేసుకోనంతవరకూ ఇతని కోసం ఆమె ధర్మసమ్మతం కాజాలదు. ఆ తరువాత అతను (రెండవ భర్త) కూడా ఆమెకు విడాకులిస్తే, మళ్ళీ వీరిద్దరూ అల్లాహ్‌ (విధించిన) హద్దులకు కట్టుబడి ఉండగలమన్న నమ్మకం ఉండి వివాహ బంధంలోకి రాదలిస్తే అందులో తప్పులేదు. ఇవి అల్లాహ్‌ విధించిన హద్దులు. తెలుసుకోగలవారికి ఆయన వీటిని స్పష్టపరుస్తున్నాడు. (సూర బఖర 2:230)

ఇలాంటి ఓ ప్రస్తావన హదీసులో స్పష్టంగా వచ్చి వుంది. సహీ బుఖారీ 5011, ముస్లిం 1433.

2) రెండవ హలాలా ధర్మ నిషిద్దం మరియు బహుచెడ్డది, నీచమైనది, అధర్మమైనది, శపించబడ్డది. అంటే ఈ రోజుల్లో కొందరూ ఒకేసారి ఒకే సంధర్బంలో ఒకటి కన్న ఎక్కువ సార్లు మూడు అంత కన్నా ఎక్కువ సార్లు తలాక్ తలాక్ తలాక్ అనేస్తారు. ఆ తరువాత భర్త పశ్చత్తాపపడతాడు. క్షణికావేశంలో, కోపావేశంలో చెప్పానని బాదపడతాడు. మరి వారి వారి పెద్దలు తలాక్ అయిపోయింది మీరు కలిసివుండలేరు. కలిసి బ్రతకకూడదని నిర్ణయిస్తారు.

మీరు మళ్ళీ కలిసి జీవించాలనుకుంటే ఒక రాత్రి గురించి లేదా రెండు మూడు రాత్రుల గురించి వేరే ఇతర పురుషుడు వివాహం చేసుకుంటే ఆమె అతనితో సంసారం గడిపిన తరువాత మళ్ళీ అతడు విడాకులు ఇస్తే అప్పుడు మొదటి భర్త మళ్ళీ వివాహం చేసుకోవచ్చు అని ప్రకటిస్తారు.

ఇక్కడ చూడడానికి ధర్మసమ్మతమైన హలాలా అదర్మమైన హలాలా రూపం ఒకటేగా కనిపిస్తుంది. కాని భూమ్యాకాశాల కంటే ఎక్కువ వ్యత్యాసం వాటి మధ్య ఉన్నది.

మొదటి రకంలో రెండవ భర్త ఎవరి ప్రమేయం లేకుండా, విడాకులు ఇచ్చే ఉద్దేశం లేకుండా, జీవితం గడిపే ఉద్దేశంతో వివాహం చేసుకుంటాడు కాని దురదృష్టవశాత్తు అతను చనిపోయినందుకు, ఏదైనా వైవాహిక జీవితంలో ఆటంకం వల్ల విడాకులు పొంది ఆ స్త్రీ ఒంటరిగా అయిపోయి, సమాజంపై భారమవకుండా ఉండడానికి మళ్ళీ మొదటి భర్త కొత్తగా వివాహం చేసుకోవచ్చు అని అనుమతి ఇవ్వడం జరిగినది.

కాని రెండవది అలా కాదు, ఇందులో అన్ని చెడులే చెడులున్నాయి. మొదటివాడు ఆవేశం తో తలాక్ ఇచ్చేశాడు, అదీ నిషిద్దం. ఒకటి కంటే ఎక్కువ సార్లు తలాక్ అని చెప్పాడు, అదీ నిషిద్దం. మరియు ఒకే సందర్బంలో ఒకే చోట ఒకటి కన్నా ఎక్కవ సార్లు తలాక్ చెప్పాడు, ఇదీ నిషిద్ధం. అది మూడు సార్లు తలాక్ అయింది అనుకోవడం జరుగుతుంది, ఇదీ తప్పు. భార్య విడిపోయిందని భావించటం, భార్యతో కలిసి జీవించలేను అనుకోవటం ఇది ఇస్లాంకు విరుద్దం.

దానిపై అమాయకురాలైన, ఏ తప్పు లేని భార్యను ఒకటి లేదా కొన్ని రాత్రుల కొరకు అక్రమంగా వేరేవాని పడకపై పడుకోడానికి ప్రేరేపిస్తూ దానికి హలాల అని పేరు ఇవ్వడం ఇదీ హరాం, తప్పుడు విధానం. ఈ విధంగా జరిపించబడే నికాహ్ అసలు నికాహ్ కానే కాదు. అదొక ప్రహసనం. దురద్దేశంతో కూడుకున్న చేష్ట, దైవాజ్ఞలతో చెలగాటం! ఇంకా సూటిగా చెప్పాలంటే అది వ్యభిచారం.

దుష్ట సంకల్పంతో ‘హలాలా’ చేయించినందున ఆ స్త్రీ తన మొదటి భర్త కోసం హలాల్ (ధర్మ సమ్మతం ) కాజాలదు!!

ఈ స్త్రీ ఏ తప్పు చేయకుండా పాపం తను వేరే పురుషునితో వివాహం చేసుకొని లైంగిక జీవనం చేయడం సమాగమం జరపటం ఎంత నీచమైన పని. అందుకే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతో కఠినంగా దీనిని నిషేధించారు.

అబూదావూద్ హదీసులో ఇలా వుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: “హలాల చేసేవారు మరియు చేయించేవారు ఇరివురిని అల్లాహ్ శపించాడు.” (హదీసు అబూదావూద్: 2076# ఇమామ్ అల్బాని సహీహ్ అని చెప్పారు.)

తిర్మిజి, నిసాయి హదీసులో ఇలా వుంది: “హలాలా చేసేవారు, చేయించేవారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శపించారు.”

హదీస్ తిర్మిజి : 1120 సహీహ్, నిసాయి:3416, ఇబ్నె జారూద్: 684# షేఖ్ జుబేర్ అలీ జై రహ్మతుల్లాహి అలైహి గారు హసన్ గా ఖరారు చేశారు.

హలాలా చేసేవారు, చేయించేవారిని ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం ధూత్కరించారు.

అలాగే హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారిని మూడు తలాక్ ల విషయంలో దలీల్ గా చూపేవారు స్వయంగా ఉమర్ రజియల్లాహు అన్హు హలాల విషయంలో ఏమన్నారో తెలుసుకొని బుద్ధి తెచ్చుకోవాలి.

హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: “ఎవడు తన భార్యను హలాలా కోసం నికాహ్ చేయిస్తాడో వాస్తవానికి అతడు వ్యభిచారానికి పాల్పడుతున్నాడు. హలాల్ చేసేవాడు అతడు వివాహితుడైతే వ్యబిచారికి ఏ శిక్ష అయితే పడుతుందో అదే (రాళ్ళతో రువ్వి) మరణశిక్షను విధిస్తాను అని చెప్పారు“. (ముసన్నఫ్ ఇబ్నె అబి షైబా : 1/293)

హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు చెప్పారు: “హలాలా చేసేవాడు మరెవరి గురించైతే చేయడం జరుగుతుందో వారిద్దరిని “రజ్మ్” చేయిస్తాను. అంటే వివాహితుడైన వ్యభిచారిపై విధించబడే రాళ్ళతో కొట్టే శిక్ష.”

అలాగే నాలుగు మస్లక్ వారిలో మాలికీ, షాఫిఈ, హంబలీ మరియు హనపీ మసలక్ లోని అగ్ర నాయకులైన ఇమామ్ అబూ హనీపా (రహిమహుల్లాహ్) శిష్యుడు అబూ యూసుఫ్ గారు హలాలా గురించి ఇలా అన్నారు: “హలాలా అనేది అదర్మం, నీచము, తుచ్చము, అల్లకల్లోలము, సంక్షోభం.”


టెక్స్ట్ సంకలనం :సోదరుడు  సౌలద్దీన్ ఖాసీం
రివ్యూ చేసిన వారు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

 

%d bloggers like this: