ప్రవక్త సమాధికి సంభందించిన దురాచారాలు – ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[13:33 నిముషాలు ]
ఈ ప్రసంగంలో, ఇస్లాంలో మూఢనమ్మకాలకు స్థానం లేదని, ఇది ఒక స్పష్టమైన మరియు తేజోవంతమైన ధర్మమని వక్త వివరిస్తున్నారు. ధర్మానుసారం ఏవి అనుమతించబడినవి (హలాల్) మరియు ఏవి నిషిద్ధం (హరామ్) అనే విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయని ఒక హదీసును ఉదహరించారు. ముఖ్యంగా, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సమాధి విషయంలో ప్రజలలో ఉన్న అపోహలు మరియు మోసాలను ఖండించారు. ప్రవక్త సమాధి చిత్రపటాలు, మట్టిని అమ్ముతూ కొందరు ప్రజల భక్తిని వ్యాపారంగా మార్చుకుంటున్నారని, ఇది ఇస్లాంకు విరుద్ధమని స్పష్టం చేశారు. ప్రవక్త (స) తన జీవితకాలంలోనే తన సమాధిని పూజించే ప్రదేశంగా లేదా ఉత్సవాలు జరుపుకునే స్థలంగా మార్చవద్దని హెచ్చరించారని, మరియు సమాధులను ఆరాధనాలయాలుగా మార్చుకున్న యూదులు, క్రైస్తవులను అల్లాహ్ శపించాడని చెప్పిన హదీసులను గుర్తుచేశారు. ప్రవక్త సమాధి ఎలా నిర్మించబడింది, దాని చుట్టూ ఉన్న గోడల నిర్మాణం వెనుక ఉన్న కారణాలను వివరించి, ఇస్లాం విగ్రహారాధనను, సమాధుల పూజను తీవ్రంగా వ్యతిరేకిస్తుందని నొక్కి చెప్పారు.
ఇంకా కొన్ని ప్రశ్నలైతే ఏదైతే వచ్చాయో ఆ ప్రశ్నల్లో మూఢనమ్మకాలు. ఈ పదం మూఢనమ్మకాలు, ఈ పదమే ఏ మనిషికి అవసరం లేని విషయం అని అర్థమవుతుంది.ఇస్లాం ధర్మం ఏ విషయంలో మనకు ఎలాంటి నమ్మకం ఉండాలి? దేని విషయంలో మనం ఎలా విశ్వసించాలి? అన్ని విషయాలు చాలా క్లియర్ గా, క్లుప్తంగా తెలియజేసింది. సహీహ్ బుఖారీలోని ఒక హదీస్ లో ఏముంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు:
إِنَّ الْحَلَالَ بَيِّنٌ، وَإِنَّ الْحَرَامَ بَيِّنٌ، وَبَيْنَهُمَا أُمُورٌ مُشْتَبِهَاتٌ لَا يَعْلَمُهُنَّ كَثِيرٌ مِنَ النَّاسِ
ఇన్నల్ హలాల బయ్యినున్, వ ఇన్నల్ హరామ బయ్యినున్, వ బైనహుమా ఉమూరున్ ముశ్తబిహాతున్ లా యఅలముహున్న కసీరున్ మినన్-నాస్.
నిశ్చయంగా, ధర్మసమ్మతమైనవి (హలాల్) స్పష్టంగా ఉన్నాయి మరియు నిషిద్ధమైనవి (హరామ్) కూడా స్పష్టంగా ఉన్నాయి. ఆ రెండింటి మధ్యలో సందేహాస్పదమైన కొన్ని విషయాలు ఉన్నాయి, వాటి గురించి చాలా మందికి తెలియదు.
ధర్మసమ్మతమైన విషయాలు కూడా స్పష్టంగా ఉన్నాయి మరియు నిషిద్ధ విషయాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. వాటి మధ్యలో చాలా కొన్ని విషయాలు మాత్రమే, కొన్ని విషయాలు మాత్రమే ఎంతో మందికి తెలియకుండా అనుమానాస్పదంలో ఉన్నాయి. అంటే అవి వారు నిజ జ్ఞానంతో, సరైన బుద్ధి ఆలోచనలతో తెలుసుకునే ప్రయత్నం చేస్తే తెలిసిపోతాయి. కానీ చాలామంది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు.
ఇస్లాం ధర్మం, దీని యొక్క గొప్పతనం గురించి ఒక హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు? “నేను మీకు చాలా స్పష్టమైన విషయం మీ ముందు తీసుకొచ్చాను. దీని పగలు ఎంతో కాంతివంతమైనది, వెలుతురుతో కూడి ఉన్నది, ఇందులోని రాత్రులు కూడా ఎంతో తేజోవంతమైనవి” అని చెప్పారు. అంటే రాత్రి ఏముంటుంది? చీకటి ఉంటుంది కదా. కానీ ఇస్లాం ధర్మం ఇలాంటి చీకటిలోని ధర్మం కాదు. దీని పగలు కాదు, దీని రాత్రులు కూడా ఎంతో కాంతివంతమైనవి అన్నట్లుగా. అంటే ఇందులోని విషయాలు వాస్తవానికి అర్థం చేసుకోగలిగితే చాలా స్పష్టమైనవి. మనిషి యొక్క స్వభావానికి, ప్రకృతికి అర్థమయ్యేటివి. కానీ మనిషి యొక్క స్వభావం వక్రమార్గంలో వెళ్లి ఉండకూడదు ముందు నుండి. ఎందుకంటే ఒక విషయం కొన్ని సందర్భాల్లో చూడండి, ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు మీకు, చౌరస్తా మీద నిలబడి, “అయ్యా నేను ఇటు పోవాలి, ఏ దారి పోతుంది?” అని. నీవు ఆ ఊరి వానివి, ఆ గ్రామం వానివి, నీకు కచ్చితంగా తెలుసు ఇటు పోతుందని. అయినా గానీ కొందరు ఎట్లా ఉంటాడు? “అబ్బో లేదు, ఏదో నువ్వు అబద్ధం చెప్తున్నట్టు ఏర్పడుతుంది, ఇటు పోదా?” “ఇంతకుముందు నేనెప్పుడో వచ్చినప్పుడు ఇటు పోయినట్టు నాకు గుర్తు ఉన్నది.” అంటే అతని ఆలోచనల్లో, అతని ఊహలో ముందే ఏదైనా తప్పు, వక్రం ఉండేది ఉంటే, అతనికి స్పష్టమైన మార్గం కూడా అతనికి స్పష్టంగా కనబడదు.
కానీ ఇస్లాంలో మూఢనమ్మకాలకు ఎలాంటి ఛాన్స్ అనేది లేదు. అన్ని విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి.
సోదరులారా, ఇంతకుముందు మనం, మనలోని కొంతమంది సోదరులు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చివరి నగరం, అంటే ఆయన పుట్టింది మక్కాలో, మరణించింది మదీనాలో. ఆ మదీనా నగరాన్ని మనం దర్శించి వచ్చాము. అయితే అక్కడ మనం కొన్ని విషయాలు చూసి వచ్చాము. దాని గురించి చెప్తే బాగుంటుంది అని కూడా ఒక ప్రశ్న వచ్చింది. అయితే అన్ని విషయాలు చెప్పడానికి టైం సరిపడదు, కానీ అందులోని కొన్ని ముఖ్య విషయాలు ఏంటంటే, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధి విషయంలో చాలా మంది ప్రజలు మూఢనమ్మకాలకు, మోసాలకు గురై ఉన్నారు. ఎందుకు? ఎప్పుడైతే కరెక్ట్, సరైన, నిజమైన ఇస్లాం ధర్మాన్ని ప్రజలు వదులుకున్నారో—వదులుకున్నారు అంటే దీని నుండి విముఖత చూపి తిరిగి వెళ్లిపోయినా లేదా ముస్లిం అని తమకు తాము అనుకున్నా ఇస్లాంను చదవడం లేదు, ఇస్లాం ధర్మాన్ని నేర్చుకోవడం లేదు, ఆచరించడం లేదు. “అరే నేను నా ముస్లిం ఖాన్దాన్లో పుట్టాను,” ఐదు పూటల నమాజు చేయడం, గడ్డం వదలడం, ముస్లింగా జీవించడం, “అంతా ఏం అవసరం లేదులే, అల్లాహ్ మనల్ని అట్లనే క్షమిస్తాడు,” ఇలాంటి మూఢనమ్మకాల్లో ఉన్నారు చాలామంది.
దీనివల్ల కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి విషయంలో ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి. ఈ మూఢనమ్మకాల కారణంగా కొందరు అక్రమంగా, అన్యాయంగా డబ్బు సంపాదించే వాళ్ళు కొన్ని దేశాల్లో ఏం చేస్తున్నారు? కొన్ని ఫోటోలు చూపిస్తున్నారు. “ఇది ప్రవక్త గారి యొక్క సమాధి, ఇది ప్రవక్త గారి యొక్క దర్గా, ఈ ప్రవక్త గారి యొక్క సమాధి మీద ఉన్నటువంటి గోపురం” అని చెప్పడమే కాదు, ఆ చిత్రపటాలను అమ్ముతున్నారు. కొన్ని దేశాల్లోనైతే ఒక్కొక్క చిత్రపటం 40 డాలర్లలో అమ్ముతున్నారంట. అంటే ఇంచుమించు ఇక్కడి 120, 110-120 రియాల్లు అవుతాయి. ఒక్కొక్క చిత్రపటం. ప్రజలు, వారి యొక్క హృదయాల్లో ప్రవక్త గారి పట్ల ప్రేమ ఉంది కదా. కానీ ప్రేమ కేవలం ఉండడం సరిపోదు. ప్రవక్త గారి గురించి సరైన విధంగా, హదీసుల్లో ఏ వివరణ వచ్చి ఉందో తెలుసుకోవడం అవసరం. అలా తెలుసుకుంటలేరు గనుక, కేవలం ఎవరైనా వచ్చి ఇలా మోసం చేసి, “ఇది ప్రవక్త గారి సమాధి, ఇది ప్రవక్త గారి యొక్క సమాధి చిత్రం” అని అమ్ముతూ ఉంటే కొనేసి తమ ఇళ్లల్లో పెట్టుకొని, “ఇలా కూడా మనకు శుభాలు కలుగుతాయి” అన్నటువంటి మూఢనమ్మకాల్లో ఉన్నారు.
మరి కొందరు ఏం చేస్తారంట తెలుసా? వేరే బయట దేశాల్లో వెళ్లి, “ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమాధి నుండి తీసుకురాబడినటువంటి మట్టి. ఇందులో మీకు ఈ రోగాలు దూరమవుతాయి, మీకు ఇలా ఇలా లాభం కలుగుతుంది” అని ఆ మట్టి కూడా అమ్ముతూ ఉంటారట. కొంచెం చిన్నపాటి బుద్ధి జ్ఞానం ఉన్న వ్యక్తి కూడా, ఈ విధంగా అక్కడి మట్టి తీసి అమ్ముతూ ఉంటే ఇప్పటివరకు ఆ సమాధుల నుండి ఎంత మట్టి పోయి ఉండవచ్చు 1400 సంవత్సరాల నుండి? కానీ ఈ అమ్మేవాళ్ళు కూడా అబ్బో తక్కువేం ఉండరు. “లేదు లేదు, అక్కడ బరకత్ కలుగుతూ ఉంటుంది, ఇంకా పెరుగుతూనే ఉంటుంది” అని కూడా అంటారు. మాటలు కలపడానికి కూడా ఏమీ తక్కువ లేదు.
కానీ సోదరులారా, ఇస్లాం ధర్మం మనకు సమాధుల మట్టి ద్వారా ఈ లాభం కలుగుతుంది, సమాధి వద్ద ఏదైనా గట్టి కట్టడం కట్టడం ద్వారా మనకి లాభం కలుగుతుంది అని ఎక్కడా ఖురాన్లో, ఏ హదీస్లో ఎలాంటి ఆదేశం ఇవ్వలేదు.
వాస్తవానికి ఏమిటంటే, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ జీవితకాలంలోనే మనకు కొన్ని సూచనలు ఇచ్చి ఉన్నారు, వాటిని మనలోని చాలామంది మర్చిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణానికి కొన్ని గంటల ముందు—రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు కాదు—కొన్ని గంటల ముందు ఒక మాట ఏం చెప్పారు? “అల్లాహ్ యూదులపై తన శాపం కురిపించుగాక! అల్లాహ్ క్రైస్తవులపై తన శాపం కురిపించుగాక!” ఏ క్రైస్తవులు, ఏ యూదులు? ఎవరైతే తమ ప్రవక్తల మరియు పుణ్యపురుషుల సమాధులను ఆరాధనాలయంగా చేసుకున్నారో. అంటే ఏంటి? ప్రవక్త తన మరణానికి కొన్ని గంటల ముందు ఇలా చెబుతున్నారు అంటే భావం ఏంటి? రేపటి రోజు నా యొక్క సమాధిని ఇలా మీరు చేయకూడదు. అందుగురించి ఆయిషా (రజియల్లాహు అన్హా) ఏం చెప్తున్నారు? అందరిలాగే ప్రవక్త వారిని కూడా ‘బఖీ’ ఖబరిస్తాన్ ఏదైతే ఉందో అక్కడ లేదా వేరే ఏదైనా బయటి ప్రదేశంలో సమాధి చేయకపోవడానికి ఒక కారణం ఏంటి? ఆయన సమాధి భద్రంగా ఉండాలి, రేపటి రోజు ప్రజలు దాన్ని ఒక ప్రార్థన స్థలంగా చేసుకోకూడదు అన్న ఉద్దేశం.
అంతేకాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ సమాధి గురించి రెండు దుఆలు చేశారు. ఒకటి, “నా సమాధిని మీరు ఒక పండుగగా, ఉరుసు, జాతర మాదిరిగా చేసుకోకండి.” నెలకు ఒకసారి గానీ, సంవత్సరానికి ఒకసారి గానీ, వారానికి ఒకసారి గానీ, ఈ రోజుల్లో సమాధుల వద్దకు జాతరల పేరు మీద వస్తూ పోతూ ఉంటారు కదా, ఉరుసులు గిట్ల చేస్తూ ఉంటారు.
لَا تَجْعَلُوا قَبْرِي عِيدًا
లా తజ్అలూ ఖబ్రీ ఈదన్.
నా సమాధిని ఒక పండుగ (ఉత్సవ స్థలం)గా చేయకండి.
మరియు అల్లాహ్‌తో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంకో దుఆ ఏం చేశారు?
اللَّهُمَّ لَا تَجْعَلْ قَبْرِي وَثَنًا يُعْبَدُ
అల్లాహుమ్మ లా తజ్అల్ ఖబ్రీ వసనన్ యుఅబద్.
ఓ అల్లాహ్, నా సమాధిని ఆరాధించబడే ఒక విగ్రహంగా చేయకు.
ఓ అల్లాహ్, నా సమాధిని ఒక విగ్రహంగా, ఆరాధించబడే ఒక విగ్రహంగా చేయకు ఓ అల్లాహ్, అని కూడా దుఆ చేశారు. ప్రవక్త గారి ఆ దుఆలను అల్లాహ్ స్వీకరించాడు. అయితే ఏం జరిగింది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమాధి… ఉదాహరణకు కేవలం అర్థం కావడానికి, అల్లాహ్ క్షమించుగాక, చూడని వాళ్లకు, అక్కడికి వెళ్లి ఈ వివరాలు వినని వారికి కొంచెం అర్థం కావడానికి ఒక పోలికగా నేను ఇస్తున్నాను. ఉదాహరణకు ప్రవక్త గారి సమాధి ఇది అనుకోండి. ఈ విధంగా దఫన్ చేయడం జరిగింది, ఇలా ఇటువైపున ఖిబ్లా ఉంది, ఇది ప్రవక్త గారి యొక్క శుభ శిరస్సు, తల వైపున తల భాగం అనుకోండి. దీనికి వెనుక, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి భుజాల వరకు అబూబక్ర్ (రజియల్లాహు త’ఆలా అన్హు) గారి యొక్క సమాధి ఉంది. దానికి వెనుక, హజ్రత్ అబూబక్ర్ (రజియల్లాహు అన్హు) వారి యొక్క భుజాల వరకు హజ్రత్ ఉమర్ వారి యొక్క తల, ఈ విధంగా హజ్రత్ ఉమర్ (రజియల్లాహు అన్హు) వారి యొక్క సమాధి ఉంది.
మరియు ఆ సమాధి, అందులో వారిని పెట్టబడిన తర్వాత, అదే మట్టి వారిపై ఏదైతే పూడ్చడం జరిగిందో, దాని మీద ఎలాంటి ఏ కట్టడం లేదు. కానీ ఒక కాలంలో కొందరు దుష్టులు ఏదైనా దుష్టకార్యం గురించి పాలుపడినప్పుడు, అప్పటి రాజు ఆ మూడు సమాధులను ఒక గోడతో బంధించాడు. ఆ గోడకు అవతల మరొక, ఇంచుమించు మూడున్నర మీటర్ల గోడ, మూడున్నర ఎత్తు మీటర్ల మరొక గోడ ఎలా ఉంది? ఫైవ్ కార్నర్స్ (five corners). అర్థమవుతుందా? పంచ… ఏమంటారు దాన్ని… చతురస్రం కాదు. మురబ్బా (స్క్వేర్) అంటే చతురస్రం కదా, నాలుగు మూలలు ఉంటాయి. ఇది ఐదు మూలలది. అర్థమవుతుందా లేదా? ఇలా ఒక గోడ, ఈ రెండు మూలలు. ఇలా, ఇటు ఒక గోడ, ఇటు ఒక గోడ, ఈ నాలుగు మూలలు. ఇంకొకటి ఇట్లా గోడ, ఇక్కడ ఐదు మూలలు. ఎందుకు? రేపటి రోజు ఎవరైనా అజ్ఞాని ప్రవక్త ప్రేమ పేరుతో ‘ఘులువ్’ (అతివాదానికి) దిగి ప్రవక్తకు డైరెక్టుగా ఖిబ్లా చేసుకోకుండా.
ఇది బయటి గోడ. మళ్లీ దాని తర్వాత జాలీ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏముంది? సామాన్య ప్రజలు ఆ జాలీ ఏదైతే ఉందో, దాని వైపు నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమాధిని దర్శిస్తారు. “అస్సలాము అలైక, అస్సలాతు వస్సలాము అలైక యా రసూలల్లాహ్” అని అంటారు. “అస్సలాము అలైక యా అబూబకర్ వ రజియల్లాహు అన్హు”, “అస్సలాము అలైక యా ఉమర్ వ రజియల్లాహు అన్హు” ఈ విధంగా అంటారు. ఎవరైనా పెద్ద నాయకులు గిట్ల, దేశ రాజులు ముస్లింలు వస్తే, జాలీ లోపటి నుండి. కానీ ఆ జాలీ లోపట ఏదైతే ఎత్తైన గోడ ఉందో, ఆ గోడకు గానీ, దాని లోపట ఉన్న మరో గోడ, దానికి ఎక్కడా ఏ తలుపు లేదు. ఏ ద్వారం లేదు, ఏ సందు లేదు. ఎవరూ కూడా లోపటికి పోవడానికి ఛాన్స్ ఉండదు.
ఈ వీడియో క్లిప్ మూలం:
రజబ్ నెల కల్పితాచారాలు, వడ్డీ తినుట, వ్యభిచారం, ప్రవక్త సమాధికి సంభందించిన దురాచారాలు [వీడియో]

You must be logged in to post a comment.