శుచీశుభ్రత: నాల్గవ పాఠం: హైజ్ (బహిష్టు), నిఫాస్ (పురిటి రక్తం) [వీడియో]

బిస్మిల్లాహ్హైజ్ (బహిష్టు), నిఫాస్ (పురిటి రక్తం) الحيض والنفس

[11 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


హైజ్ అంటే ప్రసవం జరగకుండా, ఏ రోగంతో కాకుండా ఆరోగ్య స్థితిలో నిర్ణీత రోజుల్లో గర్భాశయం నుండి వెలువడే రక్తం. నలుపు రంగు, దుర్వాసన ఉంటుంది.

నిఫాస్ అంటే ప్రసవించినందుకు గర్భాశయం నుండి వెలువడే రక్తం.

స్త్రీలు తమ ఋతుస్రావము మరియు బాలంత గడువులో ఉన్నప్పుడు నమాజు, ఉపవాసాలు పాటించకూడదు. హజ్రత్ ఆయిష రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

إِذَا أَقْبَلَتِ الْحَيْضَةُ فَدَعِي الصَّلَاةَ وَإِذَا أَدْبَرَتْ فَاغْسِلِي عَنْكِ الدَّمَ وَصَلِّي {صحيح البخاري 331، صحيح مسلم 333}.

“నీవు ఋతువు రోజుల్లో ఉన్నప్పుడు నమాజు చేయడం మానేయి. ఋతు స్రావం ముగిసాక రక్తాన్ని కడిగి, తలంటు స్నానం చేసి నమాజు చేస్తూ ఉండు”. (బుఖారి 331, ముస్లిం 333).

ఈ రోజుల్లో చేయని నమాజులు తిరిగి చేయకూడదు.కాని ఈ రోజుల్లో తప్పిపోయిన ఉపవాసాలు మాత్రం పూర్తి చేయాలి.అలాగే వీరు కాబా ప్రదక్షిణం (తవాఫ్) కూడా చేయకూడదు. ఈ రోజుల్లో భర్త తన భార్యతో సంభోగించడం కూడా నిషిధ్ధం. అయితే రమించడం తప్ప పరస్పరం ఏ రకమైన ఆనందం పొందినా తప్పు లేదు. ఈ స్థితిలో స్త్రీ ఖుర్ఆనును ముట్టుకోవద్దు.

నమాజు సమయం ప్రవేశించిన తరువాత, ఆ నమాజు చేయక ముందే ఏ స్త్రీకైనా ఋతు స్రావం మొదలవుతే, లేదా ప్రసవిస్తే ఆమె పరిశుద్ధురాలయిన తరువాత ఆ నమాజును తిరిగి చేయాలి. (ఉదాహరణకు: జొహ్ర్ నమాజు వేళ ఆరంభమయింది పగలు పన్నెండు గంటల నలబై నిమిషాలకు, ఒక స్త్రీ ఒకటింటి వరకు కూడా జొహ్ర్ నమాజు చేసుకోలేక పోయింది. ఒకటింటికి ఋతు స్రావం మొదలయింది, లేదా ప్రసవించింది. అలాంటప్పుడు ఆ స్త్రీ పరిశుద్ధురాలయిన తరువాత జొహ్ర్ నమాజు చేయాలి).

ఒక రకాతు మాత్రమే చేయునంత సమయం ఉన్నప్పుడు పరిశుద్ధుమైన స్త్రీ గుస్ల్ చేసిన తరువాత ఆ నమాజు చేసుకోవాలి. ఉదాహరణకు: ఇషా నమాజు సమయం రాత్రి 11 గం.లకు సమాప్తమవుతుందనుకుందాము, ఒక స్త్రీ 11 గం.కంటే కొంచెం ముందు పరిశుద్ధురాలైతే ఆమె స్నానం చేసిన తర్వాత ఇషా నమాజు చేసుకోవాలి.

ఉపవాస స్థితిలో సూర్యాస్తమయానికి (ఇఫ్తార్ కి) కొన్ని క్షణాల మందైనా ఎవరికైనా ఋతుస్రావం లేదా ప్రసవం జరిగితే ఆ ఉపవాసం లెక్కలోకి రాదు, ఒకవేళ అది రమజాను ఉపవాసం లాంటి విధి ఉపవాసమయితే పరిశుద్ధురాలయిన తర్వాత దానికి బదులుగా మరో ఉపవాసం ఉండడం విధిగా ఉంది.

ఫజ్ర్ సమయం ప్రవేశించే వరకు స్త్రీ బహిష్టులో ఉంటే ఆ రోజు ఉపవాసం ఉండడం ధర్మం కాదు, ఒక వేళ ఆమె ఫజ్ర్ ప్రవేశించిన కొన్ని క్షణాల ముందు పరిశుద్ధురాలయినా సరే. అదే ఫజ్ర్ ప్రవేశించిన కొద్ది క్షణాల ముందు పరిశుద్ధరాలయితే ఉపవాసం ఉండాలి. స్నానం ఉషోదయం తరువాత చేసినా అభ్యంతరం లేదు.

అలాగే జునుబీ (అంటే సంభోగం లేదా స్వప్నస్ఖలనం వల్ల అశుద్ధ స్థితిలో ఉన్న వ్యక్తి) ఫజ్ర్ కు కొంచెం ముందు ఉపవాసం నియ్యత్ చేసుకొని ఫజ్ర్ తర్వాత స్నానం చేసినా అతని ఉపవాసం సరియగును.

బహిష్టు, బాలంత స్త్రీలు జిక్ర్, తక్బీర్, తస్బీహ్ చేయుట, అల్ హందులిల్లాహ్ పలుకుట, దుఆ చేయుట మరియు తినుత్రాగినప్పుడు బిస్మిల్లాహ్ అనుట యోగ్యమే. అలాగే హదీస్, ఫిఖ్హ్ చదువుట, ఖుర్ఆన్ పారాయణం వినుట లాంటివేవీ నిషిద్ధం కావు. అలాగే ఖుర్ఆనును ముట్టుకోకుండా తనకు కంఠస్తమున్నదానిలో నుండి పారాయణం చేయవచ్చును.

రక్త స్రావం ఆగిన తరవాత స్నానం చేయడం విధిగా ఉంది(*). స్నానం తర్వాత వారి ఈ గడువులో నిశిద్ధంగా ఉన్నవన్నీ ధర్మ సమ్మతమవుతాయి. ఉదా: నమాజు, ఉపవాసాలు, ఖుర్ఆన్ ను ముట్టుకోవడం లాంటివి.

(*) కొందరు బాలంతలు 15, లేదా 20, 25 రోజుల్లో రక్త స్రావం నిలిచిపోయినా 40 రోజుల తరువాతే గుస్ల్ చేస్తారు. ఆ తరువాతే నమాజు ఆరంభిస్తారు. వారు ఇలా చేసేది చాలా ఘోరమైన తప్పు. ఎప్పుడు రక్త స్రావం నిలిచినదో అప్పుడే గుస్ల్ చేయాలి. నమాజు మొదలెట్టాలి. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు


ఇతరములుతహారా

%d bloggers like this: