[24 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
విశ్వాసం, దాని మూల స్తంభాలు :
వాచాకర్మను విశ్వాసం అంటారు. అది సత్కార్యాలతో పెరుగుతుంది, పాపాలతో తరుగుతుంది. హృదయం మరియు నాలుక మాటను ఇంకా హృదయం, నాలుక మరియు అవయవాల పనిని విశ్వాసం అంటారు. హృదయ మాట అంటే: హృదయపూర్వకంగా విశ్వసించుట, సత్యపరచుట. నాలుక మాట అంటే: అంగీకరించుట. హృదయ పని అంటే: సమ్మతించుట, ఇఖ్లాస్, లొంగిపోవుట, ప్రేమ, సత్కార్యాల సంకల్పం. అవయవాల పని అంటే: ఇస్తాం ఇచ్చిన ఆదేశాలను నెరవేర్చుట మరియు నిశిద్ధతలను విడనాడుట.
విశ్వాసానికి కొన్ని మూలసూత్రాలున్నాయని ఖుర్ఆన్ మరియు సున్నతుల ద్వారా రుజువైనది. అవి: (1) అల్లాహ్ను, (2) ఆయన దూతలను, (3) ఆయన పంపిన గ్రంథాలను, (4) ఆయన ప్రవక్తలను, (5) ప్రళయదినాన్ని, (6) మంచి, చెడు తఖ్దీర్ (అదృష్టాాల)ను విశ్వసించడం. అందులో కొన్ని ఈ ఆయతులో ప్రస్తావించబడినవి:
آمَنَ الرَّسُولُ بِمَا أُنزِلَ إِلَيْهِ مِن رَّبِّهِ وَالْمُؤْمِنُونَ ۚ كُلٌّ آمَنَ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّن رُّسُلِهِ ۚ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا ۖ غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ الْمَصِيرُ
(ప్రవక్తతన ప్రభువు నుండి తనపై అవతరించి ప్రబోధాన్ని విశ్వసించాడు. ప్రవక్తను విశ్వసించినవారు కూడా దాన్ని మనసారా స్వీకరించారు. వీరంతా అల్లాహ్ ను, ఆయన దూతల్ని ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తల్ని నమ్ముతారు; వారిలా పలుకుతారుః ‘మేము అల్లాహ్ ప్రవక్తల్లో ఏ ఒక్కరి పట్లనూ తారతమ్యాన్ని పాటించము, మేము ఆజ్ఞ విన్నాము, దానికి విధేయులమయ్యాము, స్వామీ మేము క్షమాభిక్షను అర్ధిస్తున్నాము, మరి మేము నీ వైపునకే మరలవలసినవారము). (సూ. బఖర 2: 285).
సహీ ముస్లింలో ఉంది: అమీరుల్ మోమినీన్ హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో విశ్వాసం (ఈమాన్) అంటేమిటి అని అడిగాడు. దానికి ప్రవక్త ఇలా జవాబిచ్చారు: “విశ్వాసం అంటే నీవు (1) అల్లాహ్ను, ఆయన (2) దూతలను, ఆయన (3) గ్రంథాలను, ఆయన (4) ప్రవక్తలను, (5) పరలోకదినాన్ని మరియు (6) మంచి చెడు అదృష్టాన్ని విశ్వసించుట”. (ముస్లిం 8).
ఈ ఆరు విషయాలే సత్యవిశ్వాసం యొక్క మూలసూత్రాలు. వీటిని తీసుకొని ఖుర్ఆను అవతరించింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు. వీటినే విశ్వాస మూల సూత్రాలు (అర్కానె ఈమాన్) అంటారు. వీటి వివరణ క్రింద చదవండి:
1- అల్లాహ్ పై విశ్వాసం:
అంటే: ఉలూహియత్, రుబూబియత్ మరియు అస్మా వ సిఫాత్ లో అల్లాహ్ అద్వితీయుడని విశ్వసించాలి. అల్లాహ్ పై విశ్వాసంలో ఈ క్రింది విషయాలు కూడా వచ్చును.
అల్లాహ్ యే వాస్తవ ఆరాధ్యుడు, సర్వ ఆరాధనలకు అర్హుడు. ఆయన గాక వేరే లేదా ఆయనతో పాటు మరొకడు ఏ మాత్రం అర్హుడు కాడు. ఎందుకనగా మానవుల సృష్టికర్త, వారికి మేలు చేయువాడు, వారికి ఆహారం నొసంగువాడు, వారి రహస్య బహిరంగ విషయాలన్నీ తెలిసినవాడు, పుణ్యాత్ములకు సత్ఫలితం మరియు పాపాత్ములను శిక్షించు శక్తిగలవాడు ఆయన మాత్రమే.
ఈ ఆరాధన యొక్క వాస్తవికత ఏమిటంటేః సర్వ ఆరాధనలు వినయ నమ్రతలతో, ఆయన ఔన్నత్యాల ముందు హీనభావంతో, పూర్తి ప్రేమతో, కంపిస్తూ, కారుణ్యాశలతో అద్వితీయుడైన అల్హాహ్కే ప్రత్యేకించి చేయాలి. ఈ గొప్ప మౌలిక విషయంతోనే ఖుర్ఆన్ అవతరించింది. అల్లాహ్ ఆదేశం సూర జుమర్ 39: 2,3లో చదవండి:
فَاعْبُدِ اللَّهَ مُخْلِصًا لَّهُ الدِّينَ أَلَا لِلَّهِ الدِّينُ الْخَالِصُ
(కనుక నీవు ధర్మాన్ని అల్లాహ్ కే ప్రత్యేకిస్తూ, అల్లాహ్ కు మాత్రమే దాస్యం చెయ్యి. జాగ్రత్త ధర్మం ప్రత్యేకంగా అల్లాహ్ కు చెందిన హక్కు మాత్రమే).
మరో ఆదేశం:
وَقَضَىٰ رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ
(మీరు ఆయన్ని తప్ప మరెవ్వరినీ ఆరాధించకండి అని మీ ప్రభువు నిర్ణయం చేశాడు). (బనీ ఇస్రాఈల్ 17:23). మరో ఆదేశం మోమిన్ 40:14లో
فَادْعُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ
(అల్లాహ్ ను మాత్రమే వేడుకోండి. మీ ధర్మాన్ని ఆయనకై ప్రత్యేకించుకొని. మీరు చేసే ఈ పని అవిశ్వానులకు ఎంత అయిష్టంగా ఉన్నాసరే).
అరాధన యొక్క రకాలు అనేకమున్నాయి, అందులో కొన్ని ఇవి: దుఆ (ప్రార్ధన, వేడుకోలు), ఖౌఫ్ (భయం), రజా (ఆశ), తవక్కుల్ (నమ్మకం), రగ్బత్ (ఆసక్తి), రహబ్ (మహాభీతి), ఖుషూ (నమ్రత), ఖషియత్ (గౌరవభావంతో భీతి), ఇనాబత్ (మరలుట), ఇస్తిఆనత్ (సహాయం అర్థించుట), ఇస్తిఆజ (శరణు కోరుట), ఇస్తిఘాస (మొరపెట్టు కొనుట), జిబహ్ (బలిదానం), నజ్ర్ (మొక్కుబడి) తదితర ఆరాధన రకాలు. ఇవన్నియూ అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు చేయుట యోగ్యం లేదు. అలా చేయుట షిర్క్ (బహుదైవారాధన) మరియు కుఫ్ర్ (సత్యతిరస్కారం)లో పరిగణించబడుతుంది.
2- అల్లాహ్ దూతలపై విశ్వాసం:
ఒక ముస్లిం సంక్షిప్త రూపంలో అల్లాహ్ దూతలను గురించి ఇలా విశ్వసించాలి: వారిని అల్లాహ్ పుట్టించాడు. వారి స్వభావం లోనే విధేయత వ్రాసాడు. వారిలో అనేకానేక రకాలు గలవు. ‘అర్ష్ (అల్లాహ్ సింహాసనము)ను మోసేవారు, స్వర్గనరక భటులు, మానవుల కర్మములను భద్రపరుచువారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరి పేర్లతో సహా ఏ వివరం తెలిపారో అలాగే వారిని విశ్వసించాలి. ఉదా: జిబ్రీల్, మీకాఈల్, నరక పాలకుడు మాలిక్, శంకు ఊదే బాధ్యత కలిగి ఉన్న ఇస్రాఫీల్. అల్లాహ్ వారిని కాంతితో పుట్టించాడు. ప్రవక్త సల్లల్హాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని, ఆయిషా (రది అల్లాహు అన్హా) ఉల్లేఖించారు:
“అల్లాహ్ దూతలు నూర్ (కాంతి)తో వుట్టించబడ్డారు. జిన్నాతులు అగ్నిజ్వాలలతో మరియు ఆదము ముందే మీకు ప్రస్తావించ బడిన దానితో (మట్టితో) వుట్టించబడ్డారు”. (ముస్లిం 2996).
3- గ్రంథములపై విశ్వాసం:
గ్రంథములపై సంక్షిప్తంగా ఇలా విశ్వసించుట విధిగా ఉంది: ప్రవక్తలు తమ తమ జాతులకు ధర్మం బోధించుటకు, వారిని దాని వైపునకు పిలుచుటకు అల్లాహ్ వారిపై (ప్రవక్తలపై) గ్రంథాల్ని అవతరింపజేశాడు. అల్లాహ్ ఏ గ్రంథముల పేరుతో సహా తెలిపాడో వాటిని వివరంగా విశ్వసించాలి. ఉదా: ప్రవక్త మూసా అలైహిస్సలాంపై ‘తౌరాత్‘, ప్రవక్త దావూద్ అలైహిస్సలాంపై ‘జబూర్‘, ప్రవక్త యేసు మసీహ్ అలైహిస్సలాంపై ‘ఇంజీల్‘ మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్హాహు అలైహి వసల్లంపై ‘దివ్య ఖుర్ఆన్‘లు అవతరించాయి. అన్నిట్లో ఖుర్ఆన్ అతిగొప్పది మరియు చిట్టచివరిది. అది పూర్వ గ్రంథాలను రుజువు పరుచునది మరియు పరిరక్షించునది. దానిని అనుసరించుట, దాని ద్వారా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహీ హదీసుల ద్వారా తీర్పులు చేయుట తప్పనిసరి. ఎందుకనగా అల్లాహ్, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఇరుజాతుల వైపునకు ప్రవక్తగా పంపాడు. ఆయనపై ఈ దివ్య ఖుర్ఆనును అవతరింపజేశాడు, ఆయన (ప్రవక్త) దాని ద్వారా వారి మధ్య తీర్పు చేయుటకు. ఇంక దానిని హృదయ వ్యాధులకు స్వస్థతగా చేశాడు. అది ప్రతి విషయాన్ని స్పష్టంగా వివరిస్తుంది. ఇంకా అది సర్వ లోకాల కొరకు సన్మార్గం, కారుణ్యం. అల్లాహ్ ఆదేశాలు చదవండి:
وَهَٰذَا كِتَابٌ أَنزَلْنَاهُ مُبَارَكٌ فَاتَّبِعُوهُ وَاتَّقُوا لَعَلَّكُمْ تُرْحَمُونَ
(మేము ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము. ఇది శుభాలుకల గ్రంథం. కావున మీరు దీనిని అనుసరించండి. భయభక్తుల వైఖరిని అవలంబించండి. మీరు కరుణింపబడటం సాధ్యం కావచ్చు). (సూరె అన్ఆమ్ 6: 155).
وَنَزَّلْنَا عَلَيْكَ الْكِتَابَ تِبْيَانًا لِّكُلِّ شَيْءٍ وَهُدًى وَرَحْمَةً وَبُشْرَىٰ لِلْمُسْلِمِينَ
(మేము ఈ గ్రంథాన్ని నీపై అవతరింవజేశాము. అది ప్రతి విషయాన్ని స్పష్టంగా వివరిస్తుంది. విధేయులైన వారికి అది ఉపదేశం, కారుణ్యం, శుభవార్త). (సూరె నహ్ల్ 16: 89).
4- ప్రవక్తలపై విశ్వాసం:
ప్రవక్తలపై సంక్షిప్తంగా ఇలా విశ్వసించాలి: అల్లాహ్ తన దాసుల వైపునకు ప్రవక్తల్ని శుభవార్తనిచ్చువారిగా, హెచ్చరించువారిగా, ధర్మం వైపునకు పిలుచువారిగా జేసి పంపాడు.
وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَّسُولًا أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ
(మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా అందరికీ ఇలా హెచ్చరిక చేశాము: ‘అల్లాహ్ ను ఆరాధించండి. మిథ్యా దైవాల ఆరాధనకు దూరంగా ఉండండి’). (సూరె నహ్ల్ 16: 36).
ప్రవక్తల్ని విశ్వసించినవారే సాఫల్యం పొందువారు. వారిని తిరస్కరించినవారే నష్టం, అవమానం పాలయ్యేవారు.
ప్రవక్తలందరి పిలుపు ఒక్కటేనని మనం విశ్నసించాలి. అది అల్లాహ్ ఏకత్వం మరియు సర్వ ఆరాధనల్లో ఆయన్ని అద్వితీయునిగా నమ్మటం. అయితే వారికి నొసంగబడిన ధర్మశాస్త్రాలు, ఆదేశాలు, శాసనాలు వేరు వేరు. అల్లాహ్ కొందరికి మరి కొందరిపై ఘనత ప్రసాదించాడు. అందరిలోకెల్లా గొప్ప ఘనతగల మరియు చిట్టచివరి, అంతిమ ప్రవక్త ముహమ్మద్ స సల్లల్లాహు అలైహి వసల్లం. చదవండి అల్లాహ్ ఆదేశాలు:
وَلَقَدْ فَضَّلْنَا بَعْضَ النَّبِيِّينَ عَلَىٰ بَعْضٍ
(మేము కొందరు ప్రవక్తలకు మరికొందరు ప్రవక్తల కంటే ఉన్నత స్థానాలను ఇచ్చాము). (సూరె బనీ ఇస్రాఈల్ 17: 55). మరో చోట ఆదేశించాడు;
مَّا كَانَ مُحَمَّدٌ أَبَا أَحَدٍ مِّن رِّجَالِكُمْ وَلَٰكِن رَّسُولَ اللَّهِ وَخَاتَمَ النَّبِيِّينَ
((మానవులారా) ముహమ్మద్ మీలోని ఏ వురుషునికీ తండ్రి కారు. కాని ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త, దైవప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరివారు). (అహ్ జాబ్ 33: 40).
ఇక ఏ ప్రవక్తల పేర్తతో సహా అల్లాహ్ లేక ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారో వారిని అదే వివరంగా విశ్వసించాలి. ఉదా: నూహ్, హూద్, సాలిహ్, ఇబ్రాహీం, వగైరా ప్రవక్తలు. అల్లాహ్ వారందరిపై అనేకానేక దయాకరుణా మేఘాలు కురిపించుగాకా! ఆమీన్.
5- పరలోక విశ్వాసం:
అల్లాహ్, ఆయన ప్రవక్త సల్లల్హ్లాహు అలైహి వసల్లం మరణానంతరం సంభవించే ఏ ఏ విషయాల గురించి తెలిపారో అవన్నీ ఇందులోనే వస్తాయి. ఉదా: సమాధి యాతన, పరీక్షలు, శుభాలు, ప్రళయ దినం నాటి ఘోర సంఘటనలు, వంతెన, త్రాసు, లెక్క, ప్రతి కర్మ యొక్క ఫలితం, కర్మ పత్రాలు ప్రజల ముందు తెరువబడుట, వారు దాన్ని కుడి లేక ఎడమ చేతితో లేక వీపు వెనక నుంచి తీసుకొనుట, ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు లభించే హౌజె కౌసర్, స్వర్గం, నరకం, విశ్వాసులకు అల్లాహ్ దర్శనం, సంభాషణ. ఇంకా ఖుర్ఆను మరియు సహీ హదీసుల్లో వచ్చిన విషయాలన్నిటినీ విశ్వసించాలి. అవి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తెలిపిన ప్రకారమే సంభవించునని నమ్మాలి.
6- మంచి, చెడు ‘ తఖ్దీర్’ (అదృష్టం)పై విశ్వాసం:
‘తఖ్దీర్’ పై విశ్వాసంలో నాలుగు విషయాలు వస్తాయి:
మొదటిది: భూతకాలములో జరిగినది, భవిష్యత్తులో జరగబోయేది సర్వమూ తెలిసినవాడు అల్లాహ్. తన దాసుల పరిస్థితులు సయితం ఆయనకు తెలుసు. ఇంకా వారి జీవనోపాయం, వారి చావు, వారు చేసే కర్మలన్నియూ ఎరిగినవాడు ఆయనే. ఆ పరమ పవిత్రునికి వారి ఏ విషయమూ మరుగుగా లేదు.
إِنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
(నిశ్చయముగా అల్లాహ్ కు సర్వమూ తెలియును). (సూరె తౌబా 9: 115).
రెండవది: ఆయన సృష్టిలో ఉన్న ప్రతీ దాని అదృష్టాన్ని వ్రాసి పెట్టాడు.
وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ فِي إِمَامٍ مُّبِينٍ
(ప్రతి విషయాన్నీ మేము ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాసి పెట్టాము). (సూరె యాసీన్ 36: 12).
మూడవది: ప్రతి విషయం అల్లాహ్ ఇష్టముపై ఆధారపడి యుంది. ఆయన తలచినది తక్షణమే అవుతుంది. తలచనిది కానే కాదు అని విశ్వసించాలి. సూర ఆలి ఇమ్రాన్ (3:40)లో ఉంది:
كَذَٰلِكَ اللَّهُ يَفْعَلُ مَا يَشَاءُ
(అలానే అవుతుంది. అల్లాహ్ తాను కోరినదానిని చేస్తాడు).
నాల్గవది: అల్లాహ్ దేని తఖ్దీర్ నిర్ణయించాడో అది సంభవించక ముందే దానిని పుట్టించి ఉన్నాడు.
وَاللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ
(వాస్తవానికి అల్లాహ్ యే మిమ్మల్నీ మీరు చేసిన వాటినీ సృష్టించాడు). (సూరె సాఫ్ఫాత్ 37: 96).
పుస్తకం మరియు మిగతా వీడియో భాగాలు కోసం క్రింద క్లిక్ చెయ్యండి
విశ్వాస మూల సూత్రాలు (Aqeedah)
ఇతరములు: [విశ్వాసము]
You must be logged in to post a comment.