ఇస్లాం ధర్మం సంపూర్ణమయింది. కొత్త పోకడలు , నూతన ఆచారాలను సృష్టించరాదు [వీడియో, టెక్స్ట్ ]

ఇస్లాం ధర్మం సంపూర్ణమయింది, కొత్త పోకడలు , నూతన ఆచారాలను సృష్టించరాదు
కూర్పు : ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
https://www.youtube.com/watch?v=s1wHqzntmgE [5 నిముషాలు]

ఈ ప్రసంగంలో వక్త, సూరహ్ అల్ మాయిదాలోని 3వ ఆయతును వివరిస్తూ, అల్లాహ్ ఇస్లాం ధర్మాన్ని ఎలా సంపూర్ణం చేశాడో తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణానికి సుమారు 83-84 రోజుల ముందు, అరఫా మైదానంలో అవతరించిన ఈ ఆయతు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, దీని గురించి ఒక యూదు పండితుడు మరియు ఉమర్ (రదియల్లాహు అన్హు) మధ్య జరిగిన సంభాషణను సహీహ్ బుఖారీ హదీసు ద్వారా ఉదహరించారు. నిండుగా ఉన్న గ్లాసులో నీరు ఎలాగైతే ఇంకా పట్టదో, అలాగే సంపూర్ణమైన ఇస్లాంలో కొత్తగా చేర్చడానికి ఏమీ లేదని స్పష్టం చేశారు. చివరగా, ధర్మంలో లేని మొహర్రం పీరీలు, రజబ్ కుండల వంటి బిద్అత్ (నూతన కల్పనల) కు ఆస్కారం లేదని, ఖురాన్ మరియు హదీసులను మాత్రమే అనుసరించాలని హెచ్చరించారు.

ధర్మం పరిపూర్ణం చేయబడింది

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

మహాశయులారా ! సూరతుల్ మాయిదా ఆయతు నంబర్ మూడులోని ఒక భాగం:

అల్లాహ్ ఏమంటున్నాడు?

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا
[అల్ యౌమ అక్ మల్తు లకుమ్ దీనకుమ్ వ అత్ మమ్తు అలైకుమ్ నిఅమతీ వ రజీతు లకుముల్ ఇస్లామ దీనా]
ఈరోజు నేను మీ ధర్మాన్ని సంపూర్ణం చేశాను మరియు నా యొక్క అనుగ్రహాన్ని మీపై పరిపూర్ణం చేశాను మరియు మీ కొరకు ఇస్లాంను మీ ధర్మంగా ఇష్టపడ్డాను”.(5:3)

ఈ ఆయతు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణాని కంటే 83, 84 రోజుల ముందు మాత్రమే అవతరించింది. అంటే ఇంచుమించు ప్రవక్త జీవితంలోని చివరి రోజుల్లో అవతరించింది. ఈ ఆయతు ఎంత గొప్ప ఆయతు, ఇందులో ఎంత గొప్ప సందేశం ఇవ్వబడింది అంటే, సహీహ్ బుఖారీలో ఈ హదీస్ వచ్చి ఉంది.

యూదులలోని ధర్మ పండితుడు హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హుతో కలిసి, “ఓ ఉమర్! మీ ఖురాన్ లో ఒక ఆయతు ఉంది, అది గనక తౌరాత్ లో అవతరించి ఉంటే, ఆ అవతరించిన దినాన్ని మేము పండుగ రోజుగా చేసుకునేవాళ్ళము” అన్నాడు. హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు అడిగారు, “ఏ ఆయతు గురించి నీవు అంటున్నావు?”. ఆ యూదుడు:

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا
[అల్ యౌమ అక్ మల్తు లకుమ్ దీనకుమ్ వ అత్ మమ్తు అలైకుమ్ నిఅమతీ వ రజీతు లకుముల్ ఇస్లామ దీనా]

అని చదివి వినిపించాడు.

హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు తెలిపారు: “నాకు తెలుసు, ఇది ఏ రోజు అవతరించింది, ఏ సందర్భంలో అవతరించింది, ఏ ప్రదేశంలో అవతరించింది, అప్పుడు ప్రవక్త ఎక్కడ ఏ స్థితిలో ఉన్నారో నాకు బాగా తెలుసు. అది విశ్వాసుల కొరకు ఒక వీక్లీ ఫెస్టివల్ (వారాంతపు పండుగ) లాంటిది, అంటే వారము రోజుల్లో ఒక రోజు ఏదైతే పండుగ రోజుగా ఉందో, ‘ఈదుల్ మోమినిన్’ జుమా రోజు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అరఫాత్ మైదానంలో లక్ష కంటే పైగా సహాబాల మధ్యలో నిలబడి ఉన్నారు. ఆ సందర్భంలో ఈ ఆయతు అవతరించింది. ఈ రకంగా ఆ రోజు ముస్లింల కొరకు రెండు రెండు పండుగలు ఉండేవి, అప్పుడు అవతరించింది”.

అంటే దీని భావం ఏంటో అర్థమైందా మీకు? అల్లాహ్ యే ఇస్లాం ధర్మాన్ని ఇక సంపూర్ణం చేశాడు. ఇస్లాం ధర్మమే సర్వ మానవాళి కొరకు అతి పెద్ద అనుగ్రహం, అతి గొప్ప వరం. దీనిని అల్లాహ్ యే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై పరిపూర్ణం చేశాడు. ఇక సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా, ఒక గ్లాస్ ఈ గ్లాస్ నీళ్లతో సంపూర్ణంగా నిండి ఉన్నది అని ఎప్పుడైతే మనం అంటామో, అందులో ఇంకా నీళ్లు చేర్చడానికి ఏదైనా అవకాశం ఉంటుందా? ఉండదు కదా.

అలాగే ఈ ధర్మం సంపూర్ణమైనది అని అంటే, ఇందులో ఏ విషయాన్ని కూడా మనం ధర్మం పేరుతో కలపడానికి, యాడ్ చేయడానికి అవకాశం లేదు, అలాంటి అవసరం లేనే లేదు. మరియు సంపూర్ణమైనది అన్నదానికి మరొక భావం, ఇందులో నుండి ఏ విషయం కూడా తీయకూడదు. అందుగురించే ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి ఏం తెలిపారు? “ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణాని కంటే ముందు ఏదైతే ధర్మంగా ఉండినదో, అదే ధర్మం. ఆ తర్వాత ఏవైనా విషయాలు పుట్టుకొచ్చాయి అంటే అవి ధర్మంలోనివి కావు. ఎందుకంటే అల్లాహ్ అంటున్నాడు, “ఈరోజు నేను మీ ధర్మాన్ని సంపూర్ణం చేశాను”.

ఇక మొహర్రం మాసంలో నిలబెట్టే పీరీలు గాని, వాటికి సంబంధించిన ఎన్ని దురాచారాలు, షిర్క్ పనులు ఉన్నాయో. రజబ్ మాసంలో రజబ్ కే కుండే అని, లేదా ఇంకా వేరే రోజుల్లో ఏ ఏ ఉత్సవాలు పండుగల పేరు మీద ముస్లింలు జరుపుకుంటున్నారో, అవి వాస్తవానికి వాటి ప్రస్తావన ఖురాన్ లో ఉన్నాయా? హదీసులో వాటి ప్రస్తావన ఉందా? మనం తప్పకుండా తెలుసుకోవాలి. లేని విషయాల్ని వదిలేసేయాలి. లేదా అంటే మనం చాలా నష్టానికి గురవుతాము.

వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.