రమజాన్ నెలలో రఫీ ఏం చేస్తాడు?

ramadhan-telugu-islam(రంజాన్ నెలలో ముస్లిం దిన చర్యను తెలిపే ఓ కల్పిత కధ)
అంశాల నుండి : దారుస్సలాం పుస్తకాలయం
అనువాదం : హాఫిజ్ S.M.రసూల్ షర్ఫీ
ప్రకాశకులు:శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్
క్లుప్త వివరణ: రమదాన్ నెలలో ముస్లింల దినచర్య గురించి తెలిపే ఒక కల్పిత కథ.

[ఇక్కడ చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]

రఫీ చాలా మంచి బాలుడు. చదివేది ఐదో తరగతి అయినా అసామాన్య తెలివి తేటలు కలిగినవాడని అందరూ అతన్ని కొనియాడుతుంటారు. అతని నడవడికలో, కదలికల్లో తెలివిని మించిన సంస్కారం ఉట్టిపడుతుంది. ముక్కుపచ్చలారని వయసులో ముద్దులొలికే అతని మంచితనం అందరిని ముచ్చట గొలుపుతుంది. మురిపెమైన అతని మాట తీరు శ్రోతలను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఐదో తరగతిలో అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చేది అతనికే. దివ్యఖుర్ఆన్ మొత్తం కంఠతా, మధురాతి మధురంగా పారాయణం చేస్తాడు రఫీ. అంతేకాదు, దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించిన ఎన్నో హదీసులు కూడా అతనికి బాగా జ్ఞాపకం ఉన్నాయి.

తనకు అవసరం లేని విషయాలను రఫీ అస్సలు పట్టించుకోడు. చెడు సావాసాలకు ఎల్లప్పుడూ ఆమడ దూరంలో ఉంటాడు. ఇరుగు పొరుగువారికి, టీచర్లకు, తోటి విద్యార్థులకు, అందరికి అతనంటే చాలా ఇష్టం. అతను అందర్నీ గౌరవిస్తాడు. కనుక అందరూ అతన్ని గౌరవిస్తారు. అతను ఎవరి మనసూ నొప్పించడు. పరులకు కీడు చేయటం కలలోనైనా ఊహించలేని విషయం అతనికి.

రమజాన్ నెల అంటే రఫీకు వల్లమాలిన అభిమానం. కొన్ని నెలల ముందు నుంచే దాని కోసం అతని ఎదురు చూపులు మొదలవుతాయి. ఆ శుభప్రదమైన నెలకోసం అన్ని విధాలా సిద్ధమై ఉంటాడు. రమజాన్ ద్వారా వీలైనంత ఎక్కువ ప్రయోజనం పొందాలన్నది అతని ఆశ. అల్లాహ్ ను అమితంగా సంతోష పెట్టాలన్నది అతని తపన. పొద్దస్తమానం టి.వి. ముందు కూర్చొని సమయం వృధా చేసేవాళ్ళంటే అతనికి పరమ చిరాకు. కాలం విలువను లెక్క చేయకుండా సినిమాలు, క్రికెట్లు చూస్తూ జాలీగా గడిపేవాళ్ళ పరిస్థితి మీద ఎంతో జాలిపడతాడు రఫీ. రేపు పరలోకంలో వారు అల్లాహ్ కు సమాధానం చెప్పబోయే దృశ్యాన్ని తలచుకొని అతని మనసు పరిపరి విధాలా చింతిస్తుంది.

ఫీ మాత్రం తన ఖాళీ సమయాన్ని చక్కగా మంచి పనుల కోసమే వినియోగిస్తాడు. కాస్త వీలు దొరికితే త్వరగా ఏదైనా ధర్మకార్యం పూర్తిచేసి అల్లాహ్ ప్రసన్నత పొందాలని ఉవ్విళ్లూరుతూ ఉంటాడు.

ప్రతి సంవత్సరం షాబాన్ నెల పూర్తి కావస్తున్నప్పుడు రఫీలో ఆనందం గంతులేస్తుంది. రమజాన్ నెల దగ్గర పడుతున్న కొద్దీ అతనిలో సంతోషం పరవళ్లు తొక్కుతూ ఉంటుంది. షాబాన్ నెల చివరి రోజైతే నెల పొడుపు కోసం అతని కళ్లు ఆకాశం కేసి ఆశగా చూస్తుంటాయి. నెలపొడుపు కనిపించగానే అప్రయత్నంగా అతని నోటి నుంచి దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించిన ఈ క్రింది ప్రార్థనా వచనాలు వెలువడుతాయి:

“అల్లాహు అక్బర్, అల్లాహుమ్మ అహిల్లహూ అలైనా బిల్ అమ్ ని వల్ ఈమాని, వస్సలామతి వల్ ఇస్లామి, వత్తాఫీఖి లిమా తుహిబ్బు వ తర్ జా, రబ్బునా వ రబ్బుకల్లాహ్”

(అల్లాహ్ అందరికంటే గొప్పవాడు. ఓ అల్లాహ్! ఈనెలవంకను మా కొరకు శాంతీ విశ్వాసాలకు, ప్రశాంతం విధేయతలకు, నీవు ఇష్టపడే, నీవు ప్రసన్నుడవయ్యే మా సద్బుద్ధికి ప్రతీకగా చెయ్యి. ఓ నెలవంకా! మా ప్రభువూ, నీ ప్రభువూ అల్లాహ్ యే సుమా! )

ఇక ఆ రోజు రాత్రి, ఇషా నమాజు అనంతరం అందరితో కలిసి ఇమాము వెనుక చక్కగా తరావీహ్ నమాజు పూర్తి చేస్తాడు రఫీ. అప్పటి వరకు మస్జిద్ వదలిపెట్టి ఇంటికి వెళ్ళడు. తరావీహ్ నమాజు గొప్పదనం గురించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించిన విషయాలు ఎన్నటికీ మరిచిపోలేని విధంగా అతనికి గుర్తున్నాయి.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:

“ఎవరయితే పరిపూర్ణ విశ్వాసంతో, పుణ్యం కోసమని రమజాన్ నెల (రాత్రి వేళల్లో) నమాజు చేస్తారో, వారి గడిచిన పాపాలన్నీ క్షమించబడతాయి.”

ఆయన ఇంకా ఇలా అన్నారు:

“ఇమాము వెనుక చివరికంటూ నిలబడి నమాజు పూర్తి చేసిన వ్యక్తికి ఆరాత్రంతా నిలబడి నమాజు చేసినంత పుణ్యం లభిస్తుంది.”

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పిన ఈ మాటలు గుర్తుకు వస్తే చాలు, అతని మనస్సు భక్తి భావంతో పొంగిపొరలుతుంది.

రమజాన్ నెల, ఉపవాసాల నెల అని మనందరికి తెలుసు. ఈ నెలలో ఉపవాసాలు పాటించే మనుషులు రెండు రకాలు. మొదటి రకం మనుషులు ఎల్లప్పుడూ అల్లాహ్ విధేయతలోనే కాలం గడుపుతారు. ఉపవాస కాలంలో వీరు మాటల్లోనూ, చేతల్లోనూ చాలా ఖచ్చితంగా ఉంటారు. అత్యధికంగా ఖుర్ఆన్ పారాయణం చేస్తారు. మస్జిదులో సామూహికంగా నమాజులు పాటిస్తారు. ఆకలిగొన్న వారికి అన్నం పెడతారు. అవసరాల్లో ఉన్న వారిని ఆదుకుంటారు. తమ దగ్గర వున్న డబ్బుల్లో నుంచి కొంత డబ్బు తీసి నిరుపేదలకు సహాయం చేస్తారు. ఏ చిన్న మంచి పనినీ వారు అల్పంగా భావించరు. పుణ్యం తెచ్చిపెట్టే ఏ అవకాశాన్ని చేజారనివ్వరు. ఆ నోట ఈ నోట విన్న మాటల్ని నిజానిజాలు నిర్ధారించుకోకుండా నలుగురిలో వ్యాపింపజేస్తూ తిరుగరు. చాడీలు చెప్పటం, ఇతరుల్ని మోసం చేయటం లాంటి విషయాల్లో తమ విలువైన సమయాన్ని వారు అస్సలు వృధా కానివ్వరు. ఒకవేళ ఎవరైనా తమ మీద కొట్లాటకు గాని, తగవులాటకు గాని దిగితే మర్యాదగా వారితో, “మేము ఉపవాసం ఉన్నామండీ” అని చెప్పి, తెలివిగా ఆ తప్పుడు కార్యం నుంచి తప్పించుకుంటారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎలా చేయమని బోధించారో అలాగే చేస్తారు. మరి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏం ప్రబోధించారో తెలుసా?!

“(యుద్ధంలో సైనికుడు ఉపయోగించే) డాలు వంటిది ఉపవాసం. మీలో ఎవరయినా ఉపవాసం పాటిస్తున్నట్లయితే వారు ఆ రోజు వ్యర్ధమైన మాటలు మాట్లాడరాదు. నోరు పారేసుకోరాదు. మూర్ఖంగా ప్రవర్తించరాదు. ఒకవేళ తమ మీద ఎవరయినా దుర్భాషకు దిగితే లేక కయ్యానికి కాలు దువ్వితే వారితో, ‘నేను ఉపవాసం ఉన్న మనిషినండీ’ అని చెప్పేయాలి.”

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంకా ఇలా అన్నారు :

“అన్నపానీయాలకు దూరంగా ఉండటం మాత్రమే ఉపవాసం కాదు సుమా! వ్యర్ధమైన పలుకులకు, అశ్లీల మాటలకు దూరంగా మసలుకోవటమూ ఉపవాసంలో అంతర్భాగమే!”

ఉపవాసం పాటించే వారిలో మరి కొందరుంటారు. వారు పొద్దస్తమానం తిండి గురించే ఆలోచిస్తుంటారు. పడమట దిక్కు సూర్యుడు అస్తమించాడో లేదో ఇక వారు భోజనం మీద పడతారు. తినే వస్తువులు ఏవి దొరికితే అవి గబగబా లాగించేస్తారు. పీకల దాకా మెక్కిన తర్వాత ఇక వారి ఇక్కట్లు మొదలవుతాయి. లేచి నిలబడాలన్నా వారికి కష్టంగా ఉంటుంది. అందుకని టి.వి. ముందు కుర్చీలకు అతుక్కొని కూర్చుంటారు. బాగా పొద్దుపోయే దాకా టి.వి. ఛానెళ్ళు మార్చి మార్చి చూస్తూ ఉంటారు. . ఎప్పుడో అర్ధరాత్రి తర్వాత మెల్లగా నిద్రలోకి జారుకుంటారు. ఫలితంగా రాత్రిపూట వారికి నిద్ర సరిపోదు. ఇక తెల్లవారు జామున సహ్రీ కోసం నిద్ర లేవటం చాలా భారంగా అనిపిస్తుంది.  తప్పదు గనక సహరీ పేరుతో బలవంతాన రెండు ముద్దలు మింగుతారు.  సహరీ కార్యం అయిపోగానే మళ్లీ మంచం పట్టెలు వెతుక్కుంటారు. నడుంలో అసలు బలమే లేనట్టు పడకల మీద వాలిపోతారు. ఇంకేమవుతుంది?! తెల్లవారు జామున తప్పకుండా చేయవలసిన ఫజ్ర్ నమాజుకు ఎగనామం!!

రమజాన్ నెల, మనుషుల ప్రవర్తనలో మార్పు తీసుకు వచ్చే నెల అన్న మాట నిజమే, కాని అది ఇలాంటి వారి కోసం కాదు. అసలు మనసుల్లో మారాలన్న తలంపే లేనివారిని ఎవరూ మార్చలేరు. అందుకనే రమజాన్ నెలలోనూ ఇలాంటి వారి అలవాట్లలో పెద్దగా తేడా ఏమీ ఉండదు. వీరి దృష్టిలో రమజాన్ మాసం ఆరాధనల మాసం కాదు. వరాలు పొందే వసంతం కాదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అవతరించిన ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని పారాయణం చేయవలసిన పుణ్యకాలమూ కాదు. అల్లాహ్ విధేయతలో గడపాల్సిన శుభ ఘడియలూ కావు.

పైగా వీరి దృష్టిలో రమజాన్ అంటే ఇతర రోజుల్లో కంటే ఎక్కువగా తిని, తాగి సోమరితనాన్ని పెంచుకునే మాసం. రమజాన్ పేరుతో దొరికే సెలవల్ని అనవసరమైన పనుల్లో ఖర్చుచేసే కాలం. సందేహం లేదు. ఇలాంటి వాళ్లు జీవితంలో చాలా నష్టపోతున్నారు. రమజాన్ మాసం గొప్పదనాన్ని వీరు గ్రహిం చలేకపోతున్నారు. రమజాన్ నెలలోనూ వ్యర్ధ విషయాల్లో కాలం గడపటం పరమ దురదృష్టం. రమజాన్ నెలను పొంది, అందులో సత్కార్యాలు చేసి తద్వారా తమ పాపాలకు క్షమాభిక్ష సంపాదించుకోలేని వారు పరమ దౌర్భాగ్యులని ఒక హదీసులో చెప్పబడింది.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పిన ఆ మాట గుర్తొస్తే చాలు, రఫీ నిలువెల్లా కంపించిపోతాడు. రమజాన్ మాసం అతని దృష్టిలో వజ్ర వైఢూర్యాలు, మణిమాణిక్యాల నిధుల కన్నా ఎంతో ఎక్కువ. అంత శుభవంతమైన మాసాన్ని వృధాగా పోనివ్వటం అతని వల్ల కాని పని. పైగా అలా చేసేవాళ్ల అమాయకత్వం మీద అతను చాలా జాలి పడతాడు.

ఖుర్ఆన్లో మొత్తం ముప్పయి పారాలు (కాండములు)  ఉన్నాయి కదా! వాటిలో ప్రతి రోజూ మూడు పారాలను పారాయణం చేయటం నియమంగా పెట్టుకుంటాడు రఫీ. రమజాన్ నెల సాంతం ఆ నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తాడు.

ఒక యేడు రమజాన్ నెల పదవ తేదినాటి సంఘటన. అస్ర్ నమాజు ముగిసింది. చాలా మంది జనం ఇండ్లకు వెళ్ళ లేదు. మస్జిదులోనే ఉండి వివిధ పనుల్లో నిమగ్నులై ఉన్నారు. కొంతమంది ఖుర్ఆన్ పారాయణం చేస్తున్నారు. దైవగ్రంథ పారాయణ శబ్దం తుమ్మెద గానంలా ఇంపుగా వినిపిస్తోంది. మరి కొంత మంది మస్జిదులోనే ఓ పక్కకు వాలి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంకొందరు పక్కనున్న వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్లవెంట వచ్చిన చిన్న పిల్లలు పరుగెత్తుతూ అల్లరి చేస్తున్నారు. మస్జిదులో వారు అల్లరి చేస్తున్నా వారి పెద్దలు వారిని ఏమీ అనటం లేదు. ప్రశాంతంగా ఉండవలసిన మస్జిదులో పిల్లలు అల్లరి చేయటం రఫీకు నచ్చలేదు. అందుకని అతను ఆ పిల్లలకు, ఇంకా మస్జిదులో పడుకొని మాట్లాడుకుంటున్న వారికి దూరంగా ఒక మంచి స్థలం చూసుకున్నాడు. మధురమైన కంఠంతో దివ్యఖుర్ఆన్ పారాయణం మొదలు పెట్టాడు. అతని స్వరం చాలా ఇంపుగా, వినసొంపుగా ఉంటుంది. అతను గొంతెత్తి ఖుర్ఆన్ పారాయణం చేస్తే విన్నవారెవరైనా ముగ్ధులవుతారు.

రఫీ ఖుర్ఆన్ పారాయణం చేస్తున్నప్పుడు అతని పక్కనే ఆతిఫ్ మాస్టారు కూర్చొని ఉన్నారు. అతను ఆయన్ని గమనించ లేదు. అతని మంచితనం, తెలివి తేటలు మాస్టారుకు చాలా బాగా తెలుసు. రఫీని అమితంగా మెచ్చుకుంటారాయన. బయట కనిపించినప్పుడల్లా ప్రేమగా పలకరిస్తుంటారు.

ఖుర్ఆన్ పారాయణం పూర్తయింది. గ్రంథం మూసి ప్రక్కకు తిరిగి చూశాడు రఫీ. ఆతిఫ్ మాస్టారు తన ప్రక్కనే ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. మాస్టారును గమనించుకో నందుకు మనసులో అతనికి కొద్దిగా అసంతృప్తి కలిగింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయనకు సలాం చెప్పాడు. మాస్టారు రఫీని ఆప్యాయంగా దగ్గరకు పిలిచారు. అతను దగ్గరకు రాగానే, “రఫీ! చిన్న పిల్లలు ఉపవాసాలు పాటించటం అవసరమా?! ” అని అడిగారు. ప్రక్కనున్నవారు కూడా వినాలని కాస్త బిగ్గరగానే మాట్లాడారు.

“లేదు మాస్టారూ! చిన్న పిల్లలు ఉపవాసాలు పాటించటం విధి కాదు. అయితే కాస్త పెద్ద పిల్లలకు ఉపవాసం అలవాటు చేయటం మంచి విషయమే.”

ఎంతో వినయంగా సమాధానం చెప్పాడు రఫీ.

ఆ సంగతి మాస్టారుకూ తెలుసు. కాని అక్కడున్న వాళ్లలో చాలామందికి వయోజనులైన పిల్లలు ఉన్నారు. అయినా వాళ్ళు తమ పిల్లలకు ఉపవాసాలు పాటించమని ఆజ్ఞాపించటం లేదు. అలాంటి వారికి విషయం బోధపడాలని మాస్టారు బిగ్గరగా అడిగారు. మాస్టారు ఉద్దేశం పసికట్టిన రఫీ కూడా నలుగురికీ వినపడేలా గట్టిగా సమాధానమిచ్చాడు. –

వారి మాటలు మస్జిదులో కాలక్షేపం చేస్తున్న చాలా మంది దృష్టిని ఆకర్షించాయి. గురుశిష్యుల సంభాషణను వినటానికి వారూ దగ్గరకు జరిగి కూర్చున్నారు.

“అంత రూఢీగా ఎలా చెప్పగల్గుతున్నావు రఫీ!?” మళ్లీ అడిగారు మాస్టారు.

“దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవితం, ఆయన సహచరుల ఆచరణ, పండితుల పలుకులు ఆ విషయమే కదా బోధిస్తున్నవి?” అంటూ అసలు ఆ విషయంలో సందేహమే అక్కర్లేదన్నట్లు చాలా గట్టిగా సమాధానం చెప్పాడు రఫీ.

“ఏంటేంటి? అందరికి వినపడేలా, ఇంకాస్త వివరంగా చెప్పు?” – మస్జిదులో పడుకొని కబుర్లు చెప్పుకుంటున్న వారి వైపు సైగ చేస్తూ అడిగారు మాస్టారు.
ఆయన మాటలు పడుకున్న వారందరిని లేపి కూర్చో బెట్టాయి. రఫీ సమాధానం వినటానికి అందరూ చెవులు రిక్కించారు.

అందరి కళ్ళు తనవైపే చూస్తున్నాయి. తాను అక్కడున్న వారందరి కంటే చిన్నవాడు. అలాంటప్పుడు తాను వారికి బోధ పరచటం అమర్యాద అవుతుందేమోనని రఫీ కాస్త తటపటాయించాడు. కాని మాస్టారు మాత్రం అతన్ని మళ్ళీ మళ్లీ అడుగుతున్నారు.

“చెప్పు రఫీ! దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మనకు ఏం బోధించారు?” – మాస్టారు మాటను నిర్లక్ష్యం చేయటం మంచిది కాదని భావించాడు రఫీ. “సరే, చెబుతానండీ” అంటూ మొదలుపెట్టాడు.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మనకు ఏమని బోధించారంటే:

“పిల్లలకు ఏడేళ్లు రాగానే వారికి నమాజు చేయమని ఆజ్ఞాపించండి. పదేళ్ళ ప్రాయంలోనూ వారు నమాజును అలవర్చుకోకపోతే (కాస్త) దండించండి. ఇంకా వారిని వేర్వేరుగా పడుకోబెట్టండి.” (అహ్మద్, అబూదావూద్, హాకిమ్ గ్రంథాలలో ఈ హదీసు ఉంది.)

పై హదీసు ఉద్దేశం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. పిల్లలు యుక్త వయస్సుకు చేరుకున్నప్పుడే వారికి నమాజు గురించి ఆజ్ఞాపించాలన్న నియమం ఏమీ లేదు. పైగా పసితనం నుంచే వారిలో నమాజు పట్ల శ్రద్ధను, ఆశక్తిని పెంచాలి. బాల్యం నుంచే నమాజు అలవాటు చేయాలి. ప్రాజ్ఞ వయస్సు దగ్గర పడుతున్న ప్పటికీ పిల్లలు నమాజుకు అలవాటు కానట్లయితే తల్లిదండ్రులు తమ పెంపకం గురించి పునరాలోచించుకోవాలని పై హదీసు చూచాయగా బోధపరుస్తోంది. అంతేకాదు, మంచి ఫలితం ఉంటుందని భావిస్తే, ఈ విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలను దండించినా ఫర్వాలేదని కూడా దైవప్రవక్త ప్రవచనం చెబుతోంది.

విధి రీత్యా ఉపవాసం కూడా నమాజు లాంటిదే. కనుక కొన్ని గంటలపాటు ఆకలిని, దప్పికను అవలీలగా తట్టుకోగల దశకు పిల్లలు చేరుకోగానే తల్లిదండ్రులు అటువంటి పిల్లలను ఉపవాసం పాటించమని ఆదేశించాలి. ఆ వయసు నుంచే పిల్లలకు ఉపవాసం పాటించటం అలవాటు చేయాలి. ప్రవక్త సహచరులు (సహాబీలు) తమ పిల్లల్ని చిన్నతనం నుంచే ఉపవాసాలు పాటించేందుకు ప్రోత్సహిస్తుండేవారని ఇస్లామీయ చరిత్ర చెబుతోంది. బుఖారీ, ముస్లిం ఉభయ పండితులు తమ గ్రంథాల్లో ఒక హదీసును ఉల్లేఖించారు. రుబయీ బిన్తె ముఅవ్విస్ చెప్పిన విషయం అది:

ఒకనాటి సంఘటన. అది ముహర్రమ్ నెల పదో తేది (అంటే ఆషూరా రోజు) ఉదయం. అన్సార్ సహచరులు ఉండే ప్రదేశానికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక మనిషిని పంపించారు. ప్రవక్త ఆదేశం మేరకు ఆ మనిషి ఇలా ప్రకటించాడు:

“తెల్లవార్లు ఏదైనా తిని వున్నవారు ఇక సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలి. అలాగే ఏమీ తినకుండా ఉన్నవారు కూడా రోజంతా ఉపవాసాన్ని కొనసాగించాలి.”

ఇక అప్పట్నుంచి మేము ప్రతి యేడు ముహర్రమ్ నెల పదో తేదీన తప్పకుండా ఉపవాసం పాటిస్తూ ఉండేవాళ్లం. అంతేకాదు, మా పిల్లల చేత కూడా ఉపవాసాలు పెట్టించే వాళ్ళం.పిల్లల కోసం మేము ఉన్ని బొమ్మలు తయారు చేసి పెట్టుకునే వాళ్ళం. ఏ పిల్లవాడైనా అన్నం కోసం ఏడిస్తే ఉపవాసాన్ని విరమించే సమయం దాకా అతన్ని ఆ బొమ్మలతో బుజ్జగించే వాళ్ళం .

రఫీ బోధిస్తున్న తీరును చూసి అక్కడున్న పెద్దవాళ్లు విస్తు పోయారు. ఇంత పసితనంలోనే అతనిలో అంతటి ఇస్లామీయ పరిజ్ఞానం వారిని ఔరా అనిపించింది. మొత్తానికి అతని తెలివి తేటల్ని, ప్రతిభను అక్కడున్న వారు మెచ్చుకోకుండా ఉండలేక పోయారు. మంత్రముగ్ధులై గురుశిష్యుల సంభాషణనువినసాగారు.

రఫీకు తెలుగు సామెతలు చాలా తెలుసు. సామెతల ద్వారా ప్రజలకు ఖుర్ఆన్ హదీసులను చక్కగా వివరించవచ్చని కూడా అతను అర్థం చేసుకున్నాడు. కనుక తరచూ ఆ ప్రయోగం చేస్తుండేవాడు. ఈ సందర్భంగా అతనికి ఓ మంచి సామెత గుర్తొచ్చింది.

“మొక్కై వంగనిది మ్రానై వంగునా?” అని ప్రశ్నించాడు

అతని మాట తీరు అక్కడున్న వారిని కట్టిపడేస్తోంది. ఒంటి మీద పిచ్చుకలు వాలినట్లు కదలకుండా కూర్చొని ఆసక్తిగా ఆ బుడతడి మాటల్ని వింటున్నారు.

– “చిన్న మొక్కను మనం ఎలా కోరుకుంటే అలా వంచవచ్చు. ఆ మొక్కే పెరిగి మ్రానైనప్పుడు ఇక దాన్ని వంచటమూ చేతకాదు, మనకు నచ్చిన రీతిలో పెంచటమూ చేతకాదు. అందు కనే పిల్లలకు పసితనంలోనే అన్నీ నేర్పించాలి. మంచి విషయాలు అలవాటు చేయాలి. పెద్దయిన తర్వాత అవి వారికి చాలా . ఉపయోగపడతాయి. అంతేకాదు, వారి మంచి అలవాట్లు తల్లిదండ్రులకు కూడా సౌకర్యాన్ని కలుగజేస్తాయి.”

“యధా రాజా తథా ప్రజ.”

మరో సామెతను ప్రయోగించాడు రఫీ.

చిన్న పిల్లలు ప్రతిదీ తమ చుట్టుప్రక్కల వాతావరణం నుంచే నేర్చుకుంటారు. తల్లిదండ్రులు, అన్నలు, అక్కలు ఏది చేస్తే పిల్లలూ అదే చేయటానికి ప్రయత్నిస్తారు. కనుక పెద్దవారు చిన్న పిల్లల అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటలతో, చేతలతో వీలైనంత వరకు వారికి మంచి విషయాలు నేర్పించటానికి ప్రయత్నించాలి. మంచి అలవాట్లు వచ్చేలా చూడాలి. చిన్నప్పుడు నమాజులు, ఉపవాసాలు పాటిస్తుండేవారికి పెద్దయిన తర్వాత అవి ఏమాత్రం కఠినంగా అనిపించవు.

రఫీ ఇక్కడ ఆగి కాసేపు ఏదో ఆలోచించాడు. తర్వాత ఇలా అన్నాడు:

అల్లాహ్ మా నాన్న గారిని కరుణించాలని నేను నిత్యం ప్రార్థిస్తుంటాను. ఆయనే నాకు నమాజు అలవాటు చేశారు. క్రమశిక్షణతో జీవితం గడపటం నేర్పారు. అందరితో కలిసి నమాజు చేయటానికి గాను ఆయన ఎల్లప్పుడూ నన్ను తన వెంట మస్జిదకు తీసుకువెళ్తుండేవారు. నేను బడికి వెళ్లటం మొదలు పెట్టకముందే ఆయన నాకు రమజాన్ నెలలో ఉపవాసాలు పాటించటం అలవాటు చేశారు. కాని నేను ఉపవాసం ఉండటం మా అమ్మకు నచ్చేది కాదు. ఆకలితో బాధపడతానని అమ్మకు భయం. అయితే నాన్నగారు ఆమెకు నచ్చజెప్పేవారు.

“వీణ్ణి కనీసం సగం రోజైనా ఉపవాసం ఉండనీ. భయ పడాల్సిన విషయం ఏమీ లేదు. ఉపవాసం వల్ల లాభమే గాని నష్టం అస్సలు లేదు. ఉపవాసం జీవితంలో కష్టాలను, బాధలను ఎదుర్కోవటం నేర్పుతుంది. ఓర్పును, ధైర్యసాహసాలను నూరి పోస్తుంది. ఉపవాసం వల్ల స్థిరమైన వ్యక్తిత్వం అలవడుతుంది” అని అమ్మకు ఆయన బోధిస్తుండేవారు.

ఈ మాటలు చెబుతున్నప్పుడు రఫీకు దుఃఖం ముంచు కొచ్చింది. కళ్ళ నుంచి జలజలా నీళ్ళు రాలాయి. నాన్న గుర్తుకు రాగానే ఇక అతనికి ఏడ్పు ఆగలేదు.

నిజం ఏమిటంటే, రఫీ ఒక అనాధ పిల్లవాడు. కొన్ని నెలల క్రితమే అతని తండ్రి చనిపోయాడు. ఆ పసివాడి రోదన అక్క డున్న చాలామంది పెద్దలను కంటతడి పెట్టించింది. వాళ్లందరికి అతని తండ్రి బాగా తెలుసు. అతని తండ్రి ఆత్మీయులు కూడా వారిలో కొందరు ఉన్నారు. వారైతే నిగ్రహించుకోలేక పోయారు. ఉద్వేగంతో వచ్చి ఆ బాలుణ్ణి కావలించుకున్నారు. లోపలి నుంచి తన్నుకొస్తున్న ఏడ్పును బలవంతాన ఆపుకోగలిగారు.

ఇక అందరి దగ్గర సెలవు తీసుకొని ఇంటిముఖం పట్టాడు రఫీ. మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ ఇంటి దగ్గరికి చేరుకున్నాడు. దూరం నుంచే అమ్మ కనిపించింది. ఇక అతని కాలు ఆగలేదు. పరుగెత్తుకుంటూ వెళ్ళి అమ్మను చుట్టు కున్నాడు. వలవలా ఏడ్చాడు. తల్లి ఎంత అడిగినా సమాధానం చెప్పలేకపోయాడు.

కాసేపటికి అతని ఏడ్పు ఆగింది. మస్జిద్ లో జరిగిన దంతా తల్లికి వివరించాడు. భర్త జ్ఞాపకం ఆ ఇల్లాలినీ శోక సంద్రంలో ముంచివేసింది. కళ్లల్లో నీళ్లు సుడిగుండాలై పొంగాయి. గుండె చెరువు అయినట్లు అనిపించింది. పిల్లవాడి ముందు రోదించటం సబబు కాదని భావించింది ఆమె. గట్టిగా నోరు అదిమిపట్టుకుంది. దుఃఖాన్ని అతికష్టం మీద ఆపుకో గల్గింది. తరువాత కుమారుణ్ణి ఓదార్చటానికి ప్రయత్నించింది.

సూర్యుడు అస్తమించే సమయం. చెల్లి తమ్ముళ్లతో కలసి ఇంట్లోనే ఒక శుభ్రమైన స్థలంలో కూర్చున్నాడు రఫీ. సాయంత్రం పూట పఠించవలసిన ప్రార్థనా వచనాలు పఠిస్తున్నాడు. మధ్యలో తమ్ముళ్లకు కూడా నేర్పిస్తున్నాడు. కాసేపటికి సూర్యాస్తమయం అయింది. జనం కొందరు ఇండ్లల్లో, మరికొందరు మస్జిదుల్లో ఉపవాసం విరమిస్తున్నారు. ఉపవాసం విరమించటాన్ని “ఇఫ్తార్” అంటారు. అందరితోపాటు రఫీ కూడా కొన్ని ఖర్జూర పండ్లతో ఇఫ్తార్ చేశాడు. మామూలుగా అతను ఖర్జూర పండ్లతోనే ఇఫ్తార్ చేస్తాడు. ఒకవేళ ఇంట్లో ఖర్జూర పండ్లు లేకపోతే కాసిన్ని మంచినీళ్లు త్రాగి ఉపవాసం ఆపేస్తాడు. తర్వాత ఈ వచనాలు పఠిస్తాడు:

“జహబజ్జమవు వబ్ తల్లతిల్ ఉరూఖు వ సబతల్ అజ్రు ఇన్ షా అల్లాహ్” (దాహం తీరింది. నరాలు తడిచాయి. అల్లాహ్ తలిస్తే పుణ్యం కూడా తప్పకుండా లభిస్తుంది.)

ఇంకా తనకు ఆహారం తినిపించిన అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ రఫీ ఇలా పలుకుతాడు:
.
“అల్ హము లిల్లాహిల్లజీ అత్ అమనీ హాజా వ రజఖనీహి మిన్ గైరి హౌలిమ్ మిన్నీ వలా ఖువ్వతిన్” (నాకు ఈ భోజనం తినిపించిన, నా శక్తియుక్తుల ప్రమేయం లేకుండానే నాకు ఈ ఆహారం ప్రసాదించిన అల్లాహ్ కు కృతజ్ఞతలు.)

‘ఇఫ్తార్’ సమయంలో మరెన్నో ప్రార్థనలు చేస్తాడు రఫీ. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పిన ఈ క్రింది మాట రమజాన్ నెల మొత్తం అతనికి గుర్తుంటుంది.

“ఉపవాసం విరమించేటప్పుడు ఒక ఉపవాసి చేసుకునే విన్నపం మన్నించబడకుండా ఉండదు. (అంటే అతని ప్రార్థన తప్పక నెరవేరుతుంది)”

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించిన ఈ విషయం కూడా అతని మనసులో బాగా నాటుకుపోయింది.

“ముగ్గురి ప్రార్థనలు తిరస్కరించబడవు. ఆ ముగ్గురు ఎవరంటే, ఒకరు న్యాయం చేసే రాజు. మరొకరు ఇఫ్తార్ చేస్తున్న ఉపవాసి. ఇంకొకరు పరుల చేత పీడించబడిన వ్యక్తి.”

ఆహా! ఎంత మనోహరమైనది రమజాన్ మాసం! ఈ మాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇందులో అపారమైన మేళ్లు ఉన్నాయి. అల్లాహ్ గ్రంథమైన ఖుర్ఆన్ మానవుల సన్మార్గం నిమిత్తం ఈ నెలలోనే అవతరించింది; అల్లాహ్ ఎంతో మందిని ఈ నెలలోనే నరకాగ్ని నుంచి రక్షిస్తాడు. స్వర్గ ద్వారాలు తెరుచు కునేది, నరక ద్వారాలు మూతపడేది ఈ శుభమాసంలోనే. అంతేకాదు, ఈ నెలలో షైతానులను సంకెళ్ళతో బంధించటం జరుగుతాయి. తన దాసుల పాపాలను అల్లాహ్ ఈ నెలలో విపరీతంగా మన్నిస్తాడు. మామూలు రోజుల్లో ఒక మంచి పనికి ఒక పుణ్యం మాత్రమే లభిస్తుంది. కాని రమజాన్ నెలలో అదే మంచి పనికి మరెన్నో రెట్లు పుణ్యం లభిస్తుంది. స్వర్గంలో స్థానాలు ఉన్నతమయ్యేది ఈ నెలలోనే.

రమజాన్ నెలకు ఇంకో ప్రత్యేకత కూడా ఉందండోయ్! సంవత్సరంలో మరే నెలలోనూ రాని ఒక ఘనమైన రేయి ఈ నెలలో వస్తుంది. ఆ రేయి మానవాళి కొరకు ఒక మహత్తర వరం. దానికి “లైలతుల్  ఖద్ర్” అని పేరు. తెలుసా మీకు?! ఈ ఒక్క రాత్రి కొన్ని వేల రాత్రుల కంటే గొప్పది. కావాలంటే ఖుర్ఆన్ తీసి చదవండి. 97వ అధ్యాయంలో అల్లాహ్ ఇలా అంటున్నాడు:

“నిశ్చయంగా – మేము దీనిని (ఈ ఖుర్ఆనును) ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము. ఘనమైన రాత్రి గురించి నువ్వేమనుకున్నావు? ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే కూడా మేలైనది. ఆ రాత్రి యందు దైవ దూతలు, ఆత్మ (జిబ్రయీల్) తమ ప్రభువు ఉత్తర్వుపై సమస్త విషయాల (నిర్వహణ) నిమిత్తం (దివి నుంచి భువికి) దిగివస్తారు. ఆ రాత్రి ఆసాంతం శాంతి యుతమైనది – తెల్లవారే ‘ వరకూ (అది ఉంటుంది).”.

ఈ నెల ముస్లింలకు దానధర్మాల కోసం డబ్బు ఖర్చు పెట్టడం నేర్పిస్తుంది. పసిపిల్లల్లోనూ ఉదార భావాన్ని అలవరు స్తుంది. ఈ నెల చలువతో ఒక పిసినారి మహా దానశీలిగా మారి పోయినా ఆశ్చర్యం లేదు. భయభక్తులు (తఖ్వా)తో కూడుకున్న జీవితాన్ని పొందాలనే ఆశతో ముస్లింలు ఈ నెలలో ఎన్నో మంచి పనులు చేస్తారు. ఈ దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా అంటున్నాడు:
.
“ఓ విశ్వసించిన వారలారా! ఉపవాసాలుండటం మీపై విధిగా నిర్ణయించబడింది – మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు (తఖ్వా) పెంపొందే అవకాశం ఉంది.” (ఖుర్ఆన్ 2 : 183)

మరి “తఖ్వా” అంటే ఏమిటో తెలుసా? తఖ్వా అనేది ఓ గొప్ప సుగుణం. విశ్వాసికి అత్యంత విలువైన సంపద. అల్లాహ్ పట్ల భీతితో, భక్తితో చెడులకు దూరంగా జీవితం గడపటమే తఖ్వా. విశ్వాసి జీవిత మహాశయం తఖ్వా. ముస్లింలైనవారు ఈ “తఖ్వా” స్థానాన్ని పొందటానికి అనునిత్యం ప్రయత్నిస్తూ ఉండాలి. రమజాన్ నెలలో అందుకు మార్గాలు మెండుగా ఉంటాయి. అందుకే ముస్లింల మనసుల్లో రమజాన్ నెలకు అంతటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత!

రమజాన్ నెల రాక కోసం ముస్లింలు కొన్ని నెలల ముందు నుంచే ఎదురు చూస్తుంటారు. ప్రపంచంలో ఉన్న ముస్లింలందరూ రమజాన్ నెలను సాదరంగా ఆహ్వానిస్తారు. సగౌరవంగా ఆ నెల కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఈ నెలలో ఉపవాసాలు ఉండటానికి, ప్రార్థనలు జరుపుకోవటానికి, మంచి పనులు చేసుకోవటానికి శక్తిసామర్థ్యాలను ప్రసాదించమని సంవత్సరమంతా అల్లాహ్ సన్నిధిలో దీనంగా వేడుకుంటూ ఉంటారు.

అందరికి తెలిసిన సత్యమే ఇది. సంతోషకాలం కర్పూరంలా కరిగిపోతుంది. కాని దుఃఖ ఘడియలు దుర్భరంగా గడుస్తాయి. రమజాన్ నెల ముస్లింల కోసం ఒక పండుగ కాలం. ప్రతి రోజూ ఆ నెలలో ఓ పర్వదినమే. కాబట్టి ముస్లింల కళ్ళకు రమజాన్ పుణ్యకాలం కర్పూరంలా కరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. ముప్పయి రోజులు ముప్పయి ఘడియల్లోనే అయిపోతున్న అనుభూతి కలుగుతుంది. రమజాన్ మాసపు ప్రతి నిమిషం ఓ పుణ్యకాలం. అనుక్షణం ఆధ్యాత్మికత వెల్లివిరిసే శుభసమయం. కనుకనే ఈ నెలలో మరెప్పుడూ లేనంతగా దైవారాధన భావన మనుషుల్లో జాగృతమవుతుంది.

ఇరవై రోజుల ఉపవాసం అనంతరం ముస్లింల కోసం ఈ నెలలో ఒక తాయం వేచి ఉంటుంది. ఆఖరి పదిరోజుల్లో అమితంగా అల్లాహ్ ను ఆరాధిస్తూ, గత పాపాల మన్నింపు కోసం వేడుకుంటూ కాలం గడిపిన వారికి మాత్రమే అది ప్రాప్తమవుతుంది. రమజాన్ నెల చివరి పది రోజుల్లో ఒక మహత్తరమైన రాత్రి ఉంది. అది వెయ్యి రాత్రుల కంటే గొప్పది. ఆ ఒక్క రాత్రి ఆరాధన చేస్తే 83 యేండ్లు ఆరాధన చేసినంత పుణ్యం లభి స్తుంది. ఆ రేయి ద్వారా ప్రయోజనం పొందగలిగినవారు ఎంతో అదృష్టవంతులు. మన ప్రియప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ రేత్రికి ఎనలేని ప్రాముఖ్యతను ఇచ్చేవారు.

ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) శుభఆచరణను ఆదర్శంగా తీసుకుని ముస్లిం లందరూ ఈ నెల ఆఖరు పది రోజుల్లో అతి ఎక్కువగా ఆరాధన చేస్తారు. విరివిగా ధర్మవిధులు ఆచరించి అల్లాహ్ తమ కోసం రాసివుంచిన పుణ్యాన్ని పొందేందుకు కృషి చేస్తారు.

“రమజాన్ నెలలో చివరి పది రోజులు మొదలైనప్పుడు (ప్రార్థనల్లో నిమగ్నులవటం కోసం) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రాత్రిళ్ళు మేల్కొని ఉండేవారు. ఇంట్లో వారిని కూడా నిద్రలేపేవారు. అమితంగా అల్లాహ్ ను ఆరాధించటానికి సన్నద్ధులయ్యేవారు.”

అల్లాహ్ తన పొరపాట్లన్నిటినీ క్షమించినప్పటికీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విరివిగా సత్కార్యాలు చేస్తుండేవారు. ఎంత గొప్ప విషయం!

ప్రతి యేడు రమజాన్ నెల చివరి పది రోజులు రఫీ మస్జిద్ లోనే గడుపుతాడు. రేయింబవళ్ళు అక్కడే దైవధ్యానంలో, ప్రార్ధనల్లో నిమగ్నుడై ఉంటాడు. ఆరాధన కోసం ఇలా మస్జిద్ లో వుండిపోవటాన్ని “ఏతికాఫ్” అంటారు. రఫీ తన స్నేహితులకు కూడా ఏతికాఫ్ ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తుంటాడు. కాని ఈ సంవత్సరం అతని ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేవు. నాన్న చనిపోయారు. ఇంట్లో అమ్మకు తోడుగా పెద్దవాళ్ళు ఎవరూ లేరు. కనుక ఈ సంవత్సరం ఎతెకాఫ్ పాటించే ప్రయత్నం మానుకోవాలని భావించాడు రఫీ. ఇంటిపట్టున ఉండి చెల్లి తమ్ముళ్ల బాగోగులు చూసుకోవాలనుకున్నాడు. ఇంటి పనుల్లో అమ్మకు సాయంగా ఉందామనుకున్నాడు. ఈ అతని తండ్రి బ్రతికి వున్నప్పుడు తండ్రి కుమారులు ఇద్దరూ కలిసి మస్జిద్ లో ఎతెకాఫ్ పాటించేవారు. ఆ అనుభూతి రఫీకు చెప్పలేని ఆనందాన్నిచ్చేది. కాని ఈ సంవత్సరం తను ఒంటరివాడైపోయాడు. గతం గుర్తుకురాగానే మళ్ళీ ఏడ్పు ముంచుకు వచ్చింది అతనికి. “నాన్నా, ఎక్కడున్నావు?!” అనేశాడు అప్రయత్నంగానే. పాలుగారే అతని బుగ్గల మీద అశ్రువులు ధారలై ప్రవహించాయి. కాసేపటికి నాన్న గదిలోకి వెళ్ళాడు. అక్కడ నాన్న వస్తువులు కనపడగానే భోరుమన్నాడు. పిల్లవాడి ఏడ్పు విని పరుగెత్తుకుంటూ వచ్చింది తల్లి. విషయం అర్ధం చేసుకుంది. కొడుకుని ఓదార్చటానికి ప్రయత్నించింది.

అలవికాని ఒక రొద ఆమె ఎదలోనూ కాసేపు పెనుగులాడింది. ముఖం చాటుకు తిప్పుకోని గుట్టుగా కన్నీళ్ళు తుడుచుకుంది. … “ఎందుకు ఏడుస్తున్నావు కన్నా! నీ కన్నీళ్లు మీ నాన్నను తిరిగి తీసుకు రాలేవురా!” అంది కొడుకుని గాఢంగా గుండెలకు . హత్తుకుంటూ. – “నాకు తెలుసమ్మా! అయినా ఏం చేయను. నాన్నంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు ప్రతిదీ నేర్పించారు. చిన్న తనంలోనే నాకు నమాజ్, ఉపవాసాలు అలవాటు చేశారు. ఖుర్ఆన్ చదివించారు. ఆయన్ని నేను సులువుగా మరిచి పోలేనమ్మా!” ఏడుస్తూనే సమాధానమిచ్చాడు రఫీ. ఆ పసివాడి మాటలు తల్లిని మరింత దుఃఖానికి గురి చేశాయి. “మీ నాన్నను ఎవరూ మరిచిపోలేరు చిన్నా! అల్లాహ్ తోడు, నేనెప్పుడూ మీ నాన్ననే తలచుకొని ఏడుస్తుంటాను. కాని ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనం? ఇది అల్లాహ్ రాసిన రాత. మనమంతా అల్లాహ్ కు చెందిన వాళ్ళం. ఒకరి తర్వాత ఒకరం అందరం ఆయన వద్దకు చేరుకోవలసిన వాళ్ళమే. ఈ బాధలో సహనం వహిస్తున్నందుకు పుణ్యం ప్రసాదించమని మాత్రం మనం అల్లాహ్ ను వేడుకుంటూ ఉండాలి. సరేగాని రఫీ! నువ్వు ఎప్పటిలాగా ఈ సారి కూడా మస్జిద్ కు వెళ్ళి ఈ చివరి పది రోజులు ‘ఏతికాఫ్’ పాటించు. మీ నాన్న కోసం బాగా ప్రార్థించు. మా గురించి దిగులుపడొద్దు. మమ్మల్ని చూసుకోవటానికి మీ మామయ్య మన ఇంట్లో ఉంటానంటున్నారు.”రఫీ కన్నీళ్లు తుడుస్తూ, అతనికి ధైర్యం చెప్పింది తల్లి.

ప్రతి యేడులాగే ఈ యేడు కూడా మస్జిద్ లో ఏతికాఫ్ పాటించే అవకాశం లభించగానే అతని ముఖంలో ఆనందం తొంగిచూసింది. మనసుని మెలిపెట్టిన దుఃఖం సయితం క్షణాల్లో ఆవిరయింది. తల్లికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు. ప్రేమగా ఆమె చెంపను ముద్దాడి మస్జిద్ కు బయలుదేరాడు.

రమజాన్ నెల చివరి పది రోజులు మస్జిద్ లోనే గడిచాయి. అందరితో కలిసి నమాజ్ చేయటం, ఖుర్ఆన్ పారాయణం చేయటం, క్షమాభిక్షకై వేడుకోవటం, అల్లాహ్ ను స్తుతించటం – ఈ పది రోజులు ఇవే అతని నిత్యకృత్యాలు. అన్ని రోజులు మస్జిద్ లో ఉన్నా అతనికి ఏమాత్రం విసుగు అనిపించలేదు. పైగా అతని మనసు అల్లాహ్ ధ్యానంలో లీనమై పోయింది, అల్లాహ్ ఆరాధనా మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోయింది. ఏతికాఫ్ దీక్షలో అతను ఈ క్రింది ప్రార్థనా వచనాన్ని ఎన్ని వందలసార్లు పఠించాడో. అతనికే తెలియదు.

“అల్లాహుమ్మ ఇన్నక అపువ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫాఫు అన్నీ”

ఓ అల్లాహ్! నీవు అమితంగా మన్నించేవాడవు. మన్నిం పును ఇష్టపడతావు. నన్ను మన్నించు (ప్రభూ!)”

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించిన ఈ క్రింది హిత వచనాలను కూడా రఫీ నిత్యం గుర్తుపెట్టుకునేవాడు.

“పరిపూర్ణ విశ్వాసంతో, పుణ్యం దొరుకుతుందన్న ఆశతో ఘనమైన రేత్రిన నమాజుకై నిలబడినవాని గత పాపాలన్నీ క్షమించబడతాయి.” (బుఖారి, ముస్లిం గ్రంథాల్లో ఈ హదీసు ఉంది)

“ఘనమైన రేయిని (లైలతుల్ ఖద్రీను) రమజాన్ నెలలోని చివరి పది రోజుల్లో వెతకండి.” (బుఖారీ గ్రంథంలో ఈ హదీసు ఉంది).

పండుగ రేపు అనగా ఈ రోజు సాయంత్రానికి ఏతికాఫ్ దీక్ష ముగిసిపోతుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా దీక్షను పరిపూర్ణంగా నెరవేర్చినందుకు రఫీ మది ఆనందంతో నిండి పోయింది. మస్జిద్ లో మగ్రిబ్ నమాజు ముగించుకొని సంతోషంగా ఇంటికి వెళ్లాడు. అమ్మ దగ్గర డబ్బులు తీసుకొని కొన్ని కిలోలు బియ్యం కొనుగోలు చేశాడు. నిరుపేదలకు, అభాగ్యులకు ఆ బియ్యం పంచిపెట్టాడు. పండుగ నాడు అందరి మొహాలు ఆనందంతో కళకళలాడాలన్నది అతని కోరిక. పండుగ రోజు అందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంటే అతని మది పులకించిపోతుంది. రఫీ కోరిక ప్రకారమే అతని ఇంట్లో, బంధుమిత్రుల్లో ఫిత్ర (రమజాన్) పండుగ చాలా సంతోషంగా గడిచిపోయింది.

ఇప్పుడు అతని మనసు మరుసటి రమజాన్ మాసం కోసం ఎదురు చూస్తోంది. వచ్చే యేడాది మరిన్ని పుణ్యకార్యాలు చేసి “తఖ్వా” (దైవభీతి) స్థానాన్ని పొందే అవకాశం కోసం అది నిరీక్షిస్తోంది.


%d bloggers like this: