ఆయతుల్ కుర్సీ Ayat-al-Kursi

బిస్మిల్లాహ్
Tafseer Ayatul Kursi – Youtube Play List (ఆయతుల్ కుర్సీ – యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3zZ7VizbWTYAi6VApCjfk3


اللّهُ لاَ إِلَـهَ إِلاَّ هُوَ الْحَيُّ الْقَيُّومُ لاَ تَأْخُذُهُ سِنَةٌ وَلاَ نَوْمٌ لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الأَرْضِ مَن ذَا الَّذِي يَشْفَعُ عِنْدَهُ إِلاَّ بِإِذْنِهِ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلاَ يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلاَّ بِمَا شَاء وَسِعَ كُرْسِيُّهُ السَّمَاوَاتِ وَالأَرْضَ وَلاَ يَؤُودُهُ حِفْظُهُمَا وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ

అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూము లా త ఖుజుహూ సినతువ్ వ్వలా నౌమున్ ల్లహూ మా ఫిస్సమావాతి వమా ఫిల్ అర్ జి , మన్ జల్లజీ యష్ ఫవూ ఇన్ దహూ ఇల్లా బి ఇజ్నిహీ య – లము మా బైన అయదీహిం వమా ఖల్ ఫహుం వలా యుహీతూన బిషయ్యిమ్మిన్ ఇల్మిహీ ఇల్లా బి మాషా అ వసి అకుర్ సియ్యుహు స్సమావతి వల్అర్జ వలా య ఊదుహూ హిఫ్ జుహుమా వహువల్ అలియ్యుల్ అజీం
(ఖుర్ ఆన్ 2:255).

అల్లాహ్‌ (మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం). ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనేలేడు. ఆయన సజీవుడు; అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునుకుగానీ, నిద్రగానీ పట్టదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన అధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్న దానినీ, వెనుక ఉన్నదానిని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమూ వారి గ్రాహ్యపరిధిలోకి రాదు. ఆయన కుర్చీ వైశాల్యం భూమ్యాకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించటానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు.

తెలుగు అనువాదం: అహ్సనుల్ బయాన్ నుండి

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ﷺ ఆదేశించారు:

“ఎవరు ప్రతి నమాజు తర్వాత ఆయతుల్ కుర్సీ చదువుతారో వారి స్వర్గ ప్రవేశానికి మరణమే అడ్డు”
(నిసాయి ) (సహీహ 972)

ఉదయం ఆయతుల్ కుర్సీ చదివినవారు సాయంకాలం వరకు మరియు సాయంకాలం చదివినవారు ఉదయం వరకు షైతానుల నుండి రక్షింపబడతారు. (హాకిం 2064).

పడకపై వెళ్ళి ఆయతుల్ కుర్సీ చదివినవారి పై అల్లాహ్ ఒక రక్షకుడ్ని నియమిస్తాడు మరియు తెల్లారే వరకు షైతాన్ అతని దగ్గరికి రాడు. (బుఖారి 2311 తర్వాత).

క్రిందవి హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – ఇమామ్ నవవి (Riyadh-us-Saaliheen) నుండి హదీసులు

1019. హజ్రత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తనను “ఓ అబుల్ ముంజిర్! నీ దగ్గరున్న దైవగ్రంథ ఆయతుల్లో అన్నిటికన్నా గొప్పదేదో నీకు తెలుసా?” అని అడిగారు. ‘అల్లాహు లా ఇలాహ ఇల్లాహువల్ హయ్యుల్ ఖయ్యూమ్’ అనే ఆయతు (కావచ్చు) ‘ అని అన్నాను నేను. అప్పుడాయన నా రొమ్ము తట్టి, ‘అబుల్ ముంజిర్! నీకు జ్ఞానం వల్ల శుభం కల్గుగాక!’ అని అభినందించారు. (ముస్లిం) 

(అంటే ‘ఖుర్ఆన్ జ్ఞానశుభంతోనే నీకు అన్నిటికన్నా గొప్ప ఆయతు ఏదో తెలిసింది’ అని చెప్పటమే దైవప్రవక్త ప్రవచన ఉద్దేశ్యం.) 

ముఖ్యాంశాలు 

“అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్” ‘ఆయతుల్ కుర్సీ’కు సంబంధించిన వచనం. ఇక్కడ దీనిభావం, మొత్తం ఆయతుల్ కుర్సీ అని అర్థం చేసుకోవాలి. ఈ ఆయతులో మహోన్నతమైన అల్లాహ్ గుణగణాలు, మహోజ్వలమైన ఆయన అధికారాలు ప్రస్తావించబడ్డాయి. అందుకే ఈ ఆయతు ఎంతో మహత్యంతో కూడుకున్నది.

“నీకు జ్ఞానం వల్ల శుభం కల్గుగాక!” అంటే నీకు ప్రయోజనకరమైన, గౌరవప్రదమైన, సాఫల్యాన్ని తెచ్చి పెట్టే జ్ఞానం అబ్బాలని భావం. ఇక్కడ జ్ఞానమంటే ఖుర్ఆన్ హదీసుల జ్ఞానం. ఇహపరాల్లో మనిషికి సాఫల్యాన్ని తెచ్చి పెట్టే జ్ఞానం అదే! 

1020. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం :

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నన్ను రమజాన్ మాసపు జకాత్ (అంటే ఫిత్రా) సొమ్ముకు కాపలా ఉంచారు. (ఓరోజు – రాత్రి) ఎవరో ఒకతను వచ్చి దోసిళ్ళతో ఆ ధాన్యాన్ని దొంగిలించసాగాడు. వెంటనే నేనతన్ని పట్టుకొని, “(ఎవర్నువ్వు?) పద దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికి” అని గద్దించాను. అందుకతను, (భయపడిపోతూ) “అవసరాల్లో ఉన్నానయ్యా! భార్యా బిడ్డలు గలోణ్ణి, ఇప్పుడు నాకు విపరీతమైన అవసరం వచ్చిపడింది” అన్నాడు. నేనతన్ని (దయతలచి) వదలి పెట్టాను. మరునాడు ఉదయం (నేను దైవప్రవక్త సన్నిధికి వెళ్ళాను). దైవప్రవక్త నన్ను పిలిచి “అబూహురైరా! నిన్న రాత్రి నువ్వు పట్టుకున్న వ్యక్తిని ఏం చేశావ్?” అని అడిగారు. దానికి నేను, “దైవ ప్రవక్తా! అతను తన అవసరం గురించి, తన మీద ఆధారపడి వున్నవారి గురించి మొర పెట్టుకున్నాడు. అందుకని నేనతని మీద దయతలచి అతన్ని వదలి పెట్టాను” అని చెప్పాను. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), “అతను నీతో అబద్ధం చెప్పాడు. అతను మళ్ళీ వస్తాడు. చూస్తూ ఉండు” అన్నారు.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు. కాబట్టి అతను మళ్ళీ తప్పకుండా వస్తాడని నమ్మి అతనికోసం మాటేసి ఉన్నాను. అతను వచ్చి దోసిళ్ళతో ధాన్యాన్ని నింపుకోసాగాడు. (నేను మెల్లిగా వెళ్ళి అతన్ని పట్టుకొని), ఇప్పుడు మాత్రం నేను నిన్ను తప్పకుండా దైవప్రవక్త దగ్గరికి తీసుకువెళ్తాను” అన్నాను. అందుకతను, “నన్ను వదలి పెట్టండి, అవసరాల్లో ఉన్నాను. భార్యాబిడ్డలు గలోణ్ణి. ఇంకెప్పుడూ రాను. (ఈ ఒక్క సారికి వదలి పెట్టండి)” అని బ్రతిమాలాడు. అందుకని అతన్ని వదలి పెట్టేశాను. మరునాడు ఉదయం (నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికి వెళ్ళాను) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నన్ను పిలిచి, “అబూహురైరా! నిన్న రాత్రి నువ్వు పట్టుకున్న వ్యక్తిని ఏం చేశావ్?” అని అడిగారు. “దైవ ప్రవక్తా! అతను తన అవసరం గురించి, తనమీద ఆధారపడి వున్నవారి గురించి మొర పెట్టుకున్నాడు. అందుకని నేనతని మీద దయతలచి అతన్ని వదలి పెట్టేశాను” అని చెప్పాను. అది విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), “అతను నీతో అబద్దం చెప్పాడు. అతను మళ్ళీ వస్తాడు” అని చెప్పారు.

మూడోసారి కూడా నేనతనికోసం మాటేసి కూర్చు న్నాను. అతను వచ్చి దోసిళ్లతో ధాన్యం నింపుకోసాగాడు. నేనతన్ని పట్టుకొని “ఇప్పుడు నేను నిన్ను తప్పకుండా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికి తీసుకువెళ్తాను. నువ్వు ఇలా రావటం ఇది మూడోసారి. ప్రతిసారీ నువ్వు ఇంకెప్పుడూ రానని వాగ్దానం చేసి మళ్ళీ వస్తున్నావు” అని గద్దిస్తూ అన్నాను. దానికతను, “నన్ను వదలి పెట్టండి. నేను మీకు కొన్ని వచనాలు నేర్పిస్తాను. వాటి మూలంగా అల్లాహ్ మీకు ప్రయోజనం చేకూరుస్తాడు” అని అన్నాడు. నేను, “ఏమిటా వచనాలు?” అని అడిగాను. అందుకతను, “మీరు (నిద్రపోవటానికి) పడక మీదకు వెళ్ళి నప్పుడు ఆయతుల్ కుర్సీ పఠించండి. అలా చేస్తే తెల్లవారే వరకు, మీ కొరకు అల్లాహ్ తరఫు నుండి ఒక పర్యవేక్షకుడు నియమించబడతాడు. షైతాన్ మీ దరిదాపులకు కూడా రాడు” అని చెప్పాడు. అప్పుడు కూడా నేనతన్ని వదిలేశాను.

తెల్లవారిన తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నాతో మాట్లాడుతూ, “రాత్రి నువ్వు పట్టుకున్న వాణ్ణి ఏం చేశావ్?” అని అడిగారు. “దైవప్రవక్తా! అతను నాకు కొన్ని వచనాలు నేర్పిస్తానని వాగ్దానం చేశాడు. ఆ వచనాల మూలంగా అల్లాహ్  నాకు ప్రయోజనం చేకూరుస్తాడట. అందుకని నేనతన్ని వదలి పెట్టేశాను” అని చెప్పాను. “ఏమిటా వచనాలు?” అడిగారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). అప్పుడు నేను, ఆ వచ్చిన వ్యక్తి నాతో “మీరు (నిద్రపోవటానికి) పడక మీదకు వెళ్ళినప్పుడు మొదటి నుంచి చివరి వరకు ఆయతుల్ కుర్సీ పఠించండి” అని అన్నాడని చెప్పాను. “అలాచేస్తే మీ కొరకు అల్లాహ్ తరఫు నుండి ఒక పర్యవేక్షకుడు నియమించబడతాడు. తెల్లవారే వరకు షైతాన్ మీ దరిదాపులకు కూడా రాడు” అని కూడా అన్నాడని చెప్పాను.

అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నాతో, “విను, అతను పెద్ద అబద్ధాలకోరు. అయినప్పటికీ అతను నీతో నిజం చెప్పాడు. అబూహురైరా! మూడు రాత్రుల నుంచి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?” అన్నారు. నేను “తెలీద’న్నాను. “అతను షైతాన్” అని చెప్పారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) (బుఖారీ)

ముఖ్యాంశాలు

ఈ హదీసు ద్వారా ఆయతుల్ కుర్సీ యొక్క ఘనత వెల్లడౌతోంది. రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు ఆ వచనాలను పఠించి నిద్రపోవాలని ఇందులో బోధించబడింది.