మహ్రమ్ లేకుండా స్త్రీ ఒంటరిగా ప్రయాణించడం
https://youtu.be/C3dCKJ4yoEo [5 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]
మహ్రమ్ (వివాహం నిషిద్ధమైన దగ్గరి బంధువు లేదా భర్త) లేకుండా స్త్రీలు ఒంటరిగా ప్రయాణించకూడదని ఇస్లాం స్పష్టంగా బోధిస్తోంది. అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని విశ్వసించే స్త్రీలు తండ్రి, కొడుకు, సోదరుడు లేదా భర్త వంటి మహ్రమ్ తోడు లేకుండా చేయకూడదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. ఇది హజ్ యాత్రకు కూడా వర్తిస్తుంది; భార్య హజ్ కు వెళ్తుంటే, భర్త జిహాద్ నుండి పేరు వెనక్కి తీసుకొని ఆమెతో వెళ్లాలని ప్రవక్త ఆదేశించారు. ఈ నిబంధన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం స్త్రీల రక్షణ, గౌరవం మరియు భద్రత. విమాన ప్రయాణాలైనా, బస్సు ప్రయాణాలైనా, తోడు లేకుండా వెళ్లడం వల్ల అనుకోని ఆటంకాలు, పరాయి పురుషుల సాహచర్యం వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. మహ్రమ్ గా ఉండేవారికి ముస్లిం అయి ఉండటం, యుక్తవయసు, మానసిక స్థితి సరిగ్గా ఉండటం మరియు పురుషుడై ఉండటం అనే నాలుగు షరతులు తప్పనిసరి అని ఈ ప్రసంగం వివరిస్తుంది.
మహ్రమ్ అంటే ఎవరు?
మహ్రమ్ లేకుండా స్త్రీ ఒంటరిగా ప్రయాణించడం. మహ్రమ్ అంటే ఎవరు? భర్త లేదా వివాహ నిషిద్ధమైన బంధువు. వివాహం ఏ స్త్రీ అయితే ఏ పురుషునితో వివాహం చేసుకోరాదో, అలాంటి పురుషుడు ఆ స్త్రీకి మహ్రమ్ అవుతాడు. ఉదాహరణకు తండ్రి, కొడుకు, సోదరుడు, పెదనాన్న, చిన్నాన్న ఈ విధంగా ఇలాంటి బంధువులు.
స్త్రీ ప్రయాణంపై ప్రవక్త ఆజ్ఞ
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః
لَا يَحِلُّ لِامْرَأَةٍ تُؤْمِنُ بِالله وَالْيَوْمِ الْآخِرِ تُسَافِرُ مَسِيرَةَ يَوْمٍ إِلَّا مَعَ ذِي مَحْرَمٍ
(లా యహిల్లు లిమ్ర అతిన్ తు’మిను బిల్లహి వల్ యౌమిల్ ఆఖిరి తుసాఫిరు మసీరత యౌమిన్ ఇల్లా మఅ జీ మహ్రమ్)
“అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని విశ్వసించే ఏ స్త్రీ కూడా తనవెంట ఆమె మహ్రమ్ లేనిదే ఒక రోజు జరిగే ప్రయాణం చేయుట యోగ్యం కాదు”. (ముస్లిం 1339, బుఖారి 1088).
హజ్ ప్రయాణం మరియు మహ్రమ్ ఆవశ్యకత
ఈ ఆదేశం అన్ని రకాల ప్రయాణాలకు వర్తిస్తుంది. చివరికి హజ్ ప్రయాణం అయినా సరే.
హజ్ కు సంబంధించిన హదీస్ కూడా చాలా ఫేమస్ గా ఉంది. హజ్ కు సంబంధించిన హదీస్ ఏమిటంటే, ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో అడుగుతారు, “ప్రవక్తా! నేను ఫలానా కొందరితో కలిసి జిహాద్ కొరకు వెళ్తున్నాను మరియు నా భార్య హజ్ కొరకు వెళ్తుంది.” అప్పుడు ప్రవక్త చెప్పారు, “ఆ ముజాహిదీన్ ల టీమ్ నుండి నీ యొక్క పేరును తీసేసి, వారికి చెప్పేసి, నీవు నీ భార్యతో పాటు కలిసి హజ్ కొరకు వెళ్ళు.” ఆమెను ఒంటరిగా వెళ్లనివ్వకు.
నిబంధన వెనుక ఉన్న ఆంతర్యం – స్త్రీ రక్షణ
అదే విషయం, చివరికి హజ్ ప్రయాణం అయినా సరే, మహ్రమ్ లేకుండా స్త్రీ ప్రయాణం దుర్మార్గులను ఆమె పట్ల ప్రేరేపణకు గురి చేస్తుంది. అందుకు వారు ఆమెను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. మరియు ఆమె స్వాభావికంగా బలహీనురాలు గనుక వారి వలలో చిక్కుకుపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఆమె తన అతి విలువైన గౌరవ మానాన్ని కోల్పోతుంది, కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. లేదా కనీసం ఆమె పరువు ప్రతిష్ఠలపై ఒక మచ్చయినా పడవచ్చు.
ఆధునిక ప్రయాణాలు (విమానం/బస్సు) – ప్రమాదాలు
అదే విధంగా విమానంలో ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. ఒక వైపు మహ్రమ్ వీడ్కోలు తెలిపి మరో వైపు ఆమెను రిసీవ్ చేసుకోవడానికి మరో మహ్రమ్ వచ్చినా సరే. ఆమె పక్క సీటులో కూర్చునే వారు ఎవరై ఉంటారు? లేదా ఒకవేళ ఏదైనా ఆటంకం కలిగి విమానం వేరే విమానాశ్రయంలో దిగితే, లేదా ఆలస్యం అయి సమయం తప్పి వస్తే, ఆమె ఎలాంటి ఇబ్బందులకు గురవుతుందో ఆలోచించండి. ఇలా జరగవచ్చు అని కాదు, వాస్తవంగా జరిగిన ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అందుకే వివాహ నిషిద్ధమైన ఏ బంధువైనా ఒకరు ఆమెకు తోడుగా ఉండాలి.
మహ్రమ్ కు ఉండవలసిన అర్హతలు
అయితే ఆ మహ్రమ్ లో ఈ నాలుగు షరతులు ఉండడం తప్పనిసరి:
- అతడు ముస్లిం అయి ఉండాలి.
- అతడు యుక్త వయసు గలవాడై ఉండాలి, పిల్లవాడు కాదు.
- జ్ఞాని అయి ఉండాలి, అజ్ఞానుడై (మతిస్థిమితం లేనివాడై) మొత్తానికే కాదు.
- పురుషుడు అయి ఉండాలి.
మూడు రోజుల ప్రయాణంపై హదీస్
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారని అబూసఈద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః
لَا يَحِلُّ لِامْرَأَةٍ تُؤْمِنُ بِالله وَالْيَوْمِ الْآخِرِ أَنْ تُسَافِرَ سَفَرًا يَكُونُ ثَلَاثَةَ أَيَّامٍ فَصَاعِدًا إِلَّا وَمَعَهَا أَبُوهَا أَوْ ابْنُهَا أَوْ زَوْجُهَا أَوْ أَخُوهَا أَوْ ذُو مَحْرَمٍ مِنْهَا
(లా యహిల్లు లిమ్ర అతిన్ తు’మిను బిల్లహి వల్ యౌమిల్ ఆఖిర్ అన్ తుసాఫిర సఫరన్ యకూను సలాసత అయ్యామిన్ ఫ సాఇదన్ ఇల్లా వ మఅహా అబూహా ఔ ఇబ్నుహా ఔ జౌజుహా ఔ అఖూహా ఔ జూ మహ్రమిన్ మిన్ హా)
“అల్లాహ్ మరియు పరలోకదినాన్ని విశ్వసించే ఏ స్త్రీ అయినా మూడు, అంతకంటే ఎక్కువ రోజుల ప్రయాణం ఒంటరిగా చేయడం యోగ్యం కాదు. ఆమెతో అతని తండ్రి, లేదా కొడుకు, లేదా భర్త, లేదా సోదరుడు, లేదా మరెవరైనా మహ్రమ్ తప్పక ఉండాలి”. (ముస్లిం 1340).
అల్లాహ్ మరియు పరలోక దినాన్ని విశ్వసించే ఏ స్త్రీ అయినా.. (గమనించండి అల్లాహ్ ను మరియు పరలోక దినాన్ని.. ఇలాంటి మాట ఎన్నో సందర్భాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తారు. అందుకొరకే మనం ఇలాంటి విషయాలకు వ్యతిరేకంగా చేస్తున్నామంటే ఈ విశ్వాసం మనది తగ్గిపోతుంది అని కూడా మనం గ్రహించాలి.)
షైతాన్ అడుగుజాడలు
ఇవన్నీ కూడా ఎందుకు మీరు గమనిస్తున్నారు కదా,
لا تَتَّبِعُوا خُطُواتِ الشَّيْطانِ
(లా తత్తబిఉ ఖుతువాతిష్ షైతాన్)
షైతాన్ అడుగుజాడలను అనుసరించకండి.
షైతాన్ అడుగుజాడలు ఇవన్నీ కూడా. ఒకవేళ వీటి నుండి మనం జాగ్రత్త పడకుంటే.., ఇలా మనం చూస్తూనే ఉన్నాము. చూడడానికి కాలేజీ మంచిది అయి ఉండవచ్చు, అక్కడ శిక్షణ ఇచ్చేవారు, టీచర్లు అందరూ చాలా మంచివారు అయి ఉండవచ్చు. పదిహేను నిమిషాలు, అరగంట ఇంటి నుండి అక్కడి వరకు బస్సులో, లేదా ఆటో లేదా చిన్న ఏదైనా బస్సులో వెళ్లడం రావడం, పోవడం రావడం పోవడం.. ఇలా ప్రయాణంలో ఎవరెవరు కలుస్తూ ఉంటారో, ప్రతి రోజు చూస్తూ ఉంటారు. ఈ విధంగా ఎన్ని చెడులకు దారి తీస్తుందో ఈ విషయం, గమనిస్తున్నారా?