హృదయ రోగాల చికిత్స – హబీబుర్రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

హృదయ రోగాల చికిత్స
https://youtu.be/g7cxTBS8jHo [25 నిముషాలు]
వక్త: హబీబుర్రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగం “హృదయ రోగాల చికిత్స” అనే అంశంపై సాగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన హదీసు ప్రకారం, శరీరంలో హృదయం (ఖల్బ్) యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, అది బాగుంటేనే శరీరమంతా బాగుంటుందని, అది చెడిపోతే శరీరమంతా చెడిపోతుందని వివరించారు. ఖురాన్ ప్రకారం ప్రవక్త ఆగమన ఉద్దేశ్యం ప్రజల ఆత్మలను పరిశుద్ధం చేయడమేనని తెలిపారు. హృదయానికి సోకే ఐదు ప్రధాన వ్యాధులైన 1. షిర్క్ (బహుదైవారాధన), 2. కపటత్వం (నిఫాఖ్), 3. రియా (ప్రదర్శనా బుద్ధి), 4. అతిగా అనుమానించడం (జన్), 5. అసూయ (హసద్) గురించి సవివరంగా చర్చించారు. చివరగా, హృదయ శుద్ధి కోసం 7 మార్గాలను (అల్లాహ్ పై పరిపూర్ణ ప్రేమ, చిత్తశుద్ధి, ప్రవక్త అనుసరణ, దైవధ్యానం/భయం, దానధర్మాలు, రాత్రి పూట నమాజు, దుఆ) సూచించారు.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, అమ్మా బాద్.

అభిమాన సోదరులారా! మీకందరికీ నా ఇస్లామీయ అభివాదం “అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు”.

ఈ రోజు మనం “హృదయ రోగాల చికిత్స” అనే అంశం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అంశంలో ముఖ్యమైన మూడు విషయాలు తెలుసుకుందాం.

మొదటి విషయం ఏమిటంటే హృదయం గురించి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక విషయం చెప్పారు. బుఖారీలో హదీసు ఉంది, అది సుదీర్ఘమైన హదీసు. ఆ హదీసులోని చివరి భాగం ఏమిటంటే:

أَلَا وَإِنَّ فِي الْجَسَدِ مُضْغَةً إِذَا صَلَحَتْ صَلَحَ الْجَسَدُ كُلُّهُ، وَإِذَا فَسَدَتْ فَسَدَ الْجَسَدُ كُلُّهُ، أَلَا وَهِيَ الْقَلْبُ
[అలా వ ఇన్న ఫిల్ జసది ముజ్ గతన్ ఇజా సలహత్ సలహల్ జసదు కుల్గుహు, వఇజా ఫసదత్ ఫసదల్ జసదు కుల్గుహు, అలా వహియల్ ఖల్బ్]

“వినండి! నిశ్చయంగా దేహంలో ఒక మాంసపు ముక్క ఉంది. ఆ ఒక్క ముక్క క్షేమంగా ఉంటే పూర్తి దేహం, పూర్తి శరీరం క్షేమంగా ఉంటుంది. అదే గనక, ఆ ఒక్క ముక్క గనక పాడైపోతే సంపూర్ణ దేహం పాడైపోతుంది. వినండి! అదే హృదయం (ఖల్బ్).”

అంటే హృదయ పరిశుభ్రత, పరిశుద్ధత చాలా అవసరము. హృదయం పాడైపోతే పూర్తి శరీరం పాడైపోతుంది అన్నమాట. కావున శరీరంలోని హృదయానికి ముఖ్యమైన స్థలం ఉంది.

అలాగే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సూర జుమాలో ఇలా తెలియజేశాడు:

هُوَ الَّذِي بَعَثَ فِي الْأُمِّيِّينَ رَسُولًا مِّنْهُمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِهِ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَإِن كَانُوا مِن قَبْلُ لَفِي ضَلَالٍ مُّبِينٍ

ఆయనే నిరక్షరాస్యులైన జనులలో – స్వయంగా వారిలోనుంచే ఒక ప్రవక్తను ప్రభవింపజేశాడు. అతడు వారికి అల్లాహ్ వాక్యాలను చదివి వినిపిస్తున్నాడు. వారిని పరిశుద్ధపరుస్తున్నాడు, వారికి గ్రంథాన్నీ, వివేకాన్ని బోధిస్తున్నాడు. అంతకు ముందు వారు స్పష్టమైన మార్గవిహీనతకు లోనైఉండేవారు. (62:2)

ఆయనే అంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నిరక్షరాస్యులైన జనులలో స్వయంగా వారిలోనే, వారిలో నుంచే ఒక ప్రవక్తను ప్రభవింపజేశాడు. ఆ ప్రవక్త చేసే పని ఏమిటి? అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నిరక్షరాస్యులలోనే ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త పని ఏమిటి? పంపడానికి గల ఉద్దేశ్యం ఏమిటి? ఆయన వారికి అల్లాహ్ వాక్యాలను చదివి వినిపిస్తున్నాడు. అంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మన కోసము మనలోనే ఒక ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్త ఖురాన్ వాక్యాలను, అల్లాహ్ వచనాలను, అల్లాహ్ వాక్యాలను చదివి వినిపిస్తున్నాడు. ఎందుకు? దాని ద్వారా వారిని పరిశుద్ధపరుస్తున్నాడు. వారికి గ్రంథాన్ని, వివేకాన్ని బోధిస్తున్నాడు. అంతకు ముందు వారు స్పష్టమైన మార్గ విహీనతకు లోనై ఉండేవారు.

ఈ వాక్యంలో అనేక విషయాలు ఉన్నాయి. ఒక్క మాట ఏమిటంటే, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ ఆయతుల ద్వారా వారిని పరిశుద్ధపరుస్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధత అంటే అసలైన పరిశుద్ధత, మానసిక పరిశుద్ధత, ఆత్మ పరిశుద్ధత, మనసు పరిశుద్ధత, హృదయ పరిశుద్ధత అని అర్థం.

అభిమాన సోదరులారా! ఇక ఖురాన్ లోని సూరా ముద్దస్సిర్ లో ఒక ఆయత్ ఉంది. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు:

وَثِيَابَكَ فَطَهِّرْ
[వ సియాబక ఫతహ్హిర్]
నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో. (74:4)

ఈ ఆయత్ లో ‘సియాబ్’ అంటే సాధారణంగా దానికి అర్థం దుస్తులే. ఇమామ్ ఇబ్నె ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి ‘వ సియాబక ఫతహ్హిర్’ ఈ ఆయత్ వివరణలో ఆయన ఇలా అన్నారు:

جُمْهُورُ الْمُفَسِّرِينَ مِنَ السَّلَفِ وَمِنْ بَعْدِهِمْ عَلَى أَنَّ الْمُرَادَ بِالثِّيَابِ هُنَا الْقَلْبُ
[జుమ్హూరుల్ ముఫస్సిరీన మినస్సలఫి వ మిన్ బాదిహిమ్ అలా అన్నల్ మురాద బిస్సియాబి హునల్ ఖల్బ్]

అంటే ఈ ఆయత్ లో ‘సియాబ్’ అంటే, దుస్తులు అంటే అర్థం, జుమ్హూర్ సలఫ్ లో ముఫస్సిరీన్లు, అలాగే సలఫ్ లోని తర్వాత తరం వారిలో కూడా, అంటే పూర్వం తరం వారిలో, తర్వాత తరం వారిలో జుమ్హూర్ ముఫస్సిరీన్ల అభిప్రాయం ఒక్కటే. అది ఏమిటంటే ఈ ఆయత్ లో ‘అస్-సియాబ్’ దుస్తులు అంటే హృదయం అన్నమాట.

అభిమాన సోదరులారా! ఇప్పుడు నేను మూడు విషయాలు (రెండు ఆయతులు, ఒక్క హదీసు) హృదయానికి, మనసుకి సంబంధించినది తెలియపరిచాను. దీని అర్థం ఏమిటి? అసలైన పరిశుద్ధత, అసలైన పరిశుభ్రత అది శరీరం కంటే ఎక్కువ, దేహం కంటే ఎక్కువ అది ఆత్మ పరిశుద్ధత, హృదయ పరిశుద్ధత అని అర్థం. ఎందుకంటే అది అసలైన విషయం. అది క్షేమంగా ఉంటే పూర్తి దేహం క్షేమంగా ఉంటుంది, అది పాడైపోతే పూర్తి దేహం పాడైపోతుంది.

ఇక రెండవ విషయం ఏమిటంటే, అటువంటి ముఖ్యమైన, విలువైన హృదయాన్ని దేని నుంచి కాపాడాలి? ఏ రోగాల నుంచి కాపాడాలి? అంటే హృదయానికి సంబంధించిన రోగాలు అనేక ఉన్నాయి. షిర్క్ ఉంది, బిద్అత్ ఉంది, కపటత్వం ఉంది, ఈ విధంగా చాలా రకాల రోగాలు ఉన్నాయి. కానీ ఈ రోజు మనం కేవలం హృదయానికి సంబంధించిన ఐదు రోగాలు తెలుసుకుందాం. ఇది ఈ రోజు అంశంలోని రెండవ ముఖ్యమైన విషయం.

మొదటిది షిర్క్. ఇది అన్నింటికంటే ముఖ్యమైన విషయం అన్నమాట. ఎందుకంటే ఇస్లాం ధర్మాన్ని అన్వేషించిన వారు, అనుసరించే వారు, వారికి ఈ విషయం బాగా తెలుస్తుంది. ఇస్లాం ధర్మంలో అన్నింటికంటే గొప్పది ‘తౌహీద్’ (ఏక దైవారాధన) అయితే, అన్నింటికంటే ఘోరమైనది అది ‘షిర్క్’. ఇస్లాం ధర్మంలో షిర్క్ కి మించిన పాపం ఏదీ లేదు. కావున షిర్క్ గురించి వివరం చెప్పడం నా ఉద్దేశ్యం కాదు ఈ రోజు టాపిక్ లో. హృదయానికి సంబంధించిన రోగాలలో మొదటి రోగం షిర్క్. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సెలవిచ్చాడు:

إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ
[ఇన్నష్ షిర్క లజుల్మున్ అజీమ్]
నిస్సందేహంగా అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించటం (షిర్క్‌ చేయటం) ఘోరమైన అన్యాయం. (31:13)

నిస్సందేహంగా షిర్క్ అనేది ఘోరమైన అన్యాయం. ఒక వ్యక్తి తౌబా (పశ్చాత్తాపం) చేసుకోకుండా షిర్క్ లోనే మరణిస్తే అతనికి క్షమాపణ లేదు. కావున అన్నింటికంటే ముందు మనం మన మనసుని షిర్క్ నుండి రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. ఇక షిర్క్ వివరాలు ఉన్నాయి, పెద్ద షిర్క్ అని, చిన్న షిర్క్ అని ఆ వివరాలు ఉన్నాయి. అది ఇప్పుడు అవసరం లేదు. షిర్క్ ఘోరమైన అన్యాయం, ఘోరమైన పాపం గనక అన్నిటికంటే ముందు మనం మన హృదయాన్ని, మనసుని షిర్క్ నుండి కాపాడుకోవాలి. ఇది మొదటి విషయం.

రెండవది, రెండవ రోగం కపటత్వం. ఇది కూడా చాలా ఘోరమైనది. సూర బఖరా మనం చదివితే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సూర బఖరా ప్రారంభంలో విశ్వాసుల గురించి ప్రస్తావన వస్తుంది, ఆ తర్వాత అవిశ్వాసుల గురించి ప్రస్తావన వస్తుంది, ఆ తర్వాత కపట విశ్వాసుల గురించి ప్రస్తావన వస్తుంది. ఖురాన్ మరియు హదీసులో కపట విశ్వాసుల శిక్ష గురించి చాలా కఠినంగా చెప్పడం జరిగింది.

కపటత్వం అంటే ఏమిటి? ఏ వ్యక్తిలో కపటత్వం ఉంటే ఆ వ్యక్తికి కపట విశ్వాసి అంటాం. అరబ్బీలో కపటత్వాన్ని ‘నిఫాఖ్‘ అంటారు, కపట విశ్వాసిని ‘మునాఫిఖ్‘ అంటారు. కపటత్వం అంటే క్లుప్తంగా చెప్పాలంటే, ఇస్లాం గురించి, మంచిని గురించి ప్రకటించటం, దాంతో పాటు మనసులో అవిశ్వాసాన్ని లేదా తిరస్కార భావాన్ని, కపటత్వాన్ని మనసులో దాచిపెట్టడం. ఓ పక్కన ఇస్లాం గురించి, మంచి గురించి ప్రకటిస్తారు, ఇంకో పక్కన మనసులో కపటత్వాన్ని దాచి ఉంచుతారు, తిరస్కార భావాన్ని దాచి ఉంచుతారు.

ఇది రెండు రకాలు:

విశ్వాసపరమైన కపటత్వం: మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఆ కపట విశ్వాసులకు నాయకుడు అబ్దుల్లాహ్ బిన్ ఉబై. అంటే విశ్వాసపరమైన కపటత్వం – మనసులో విశ్వాసం లేదు, మనసులో ఈమాన్ లేదు, హృదయంలో అల్లాహ్ ను నమ్మటం లేదు కానీ ప్రకటిస్తున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు. ఇది విశ్వాసపరమైన కపటత్వం. ఈ కపటత్వం కలవాడు ఇస్లాం నుండి పూర్తిగా బహిష్కృతుడైపోతాడు. ఇది పెద్ద కపటత్వం.

క్రియాత్మకమైన కపటత్వం (నిఫాఖె అమలీ): అంటే హృదయంలో విశ్వాసం ఉంటుంది, అతను విశ్వాసి, అతను ముస్లిం. హృదయంలో అల్లాహ్ ను, అల్లాహ్ ప్రవక్తను, ఖురాన్ ని విశ్వసిస్తున్నాడు, నమ్ముతున్నాడు మనసులో. కానీ ఆచరణలో కపటత్వం.

ఒక హదీసు మనము విందాం, అర్థమైపోతుంది. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:

أَرْبَعٌ مَنْ كُنَّ فِيهِ كَانَ مُنَافِقًا خَالِسًا
[అర్బ ఉన్ మన్ కున్న ఫీహి కాన మునాఫికన్ ఖాలిసన్]
నాలుగు లక్షణాలు ఉన్నాయి, ఆ నాలుగు లక్షణాలు ఏ వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి పక్కా కపట విశ్వాసి.

وَمَنْ كَانَتْ فِيهِ خَصْلَةٌ مِنْهُنَّ كَانَتْ فِيهِ خَصْلَةٌ مِنَ النِّفَاقِ حَتَّى يَدَعَهَا
[వమన్ కానత్ ఫీహి ఖస్లతుమ్ మిన్హున్న కానత్ ఫీహి ఖస్లతుమ్ మినన్నిఫాఖి హత్తా యదఅహా]
ఆ నాలుగు లక్షణాలు కాకుండా, ఆ నాలుగు లక్షణాలలో ఒక వ్యక్తిలో ఒక లక్షణం ఉంటే, కపటత్వానికి సంబంధించిన ఒక లక్షణం అతనిలో ఉందన్నమాట.

ఆ నాలుగు విషయాలు ఏమిటి? మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:

إِذَا اؤْتُمِنَ خَانَ
[ఇజాఉ తుమిన ఖాన]:
అమానతు అప్పగిస్తే ద్రోహానికి పాల్పడతాడు.

وَإِذَا حَدَّثَ كَذَبَ
[వఇజా హద్దస కజబ]:
మాట్లాడితే అబద్ధం చెబుతాడు.

وَإِذَا عَاهَدَ غَدَرَ
[వఇజా ఆ హద గదర]:
నమ్మి ఒడంబడిక చేసుకున్న తర్వాత (నమ్మిన తర్వాత) నమ్మక ద్రోహం చేస్తాడు.

وَإِذَا خَاصَمَ فَجَرَ
[వఇజా ఖాసమ ఫజర]:
పోట్లాట జరిగినప్పుడు దుర్భాషకు దిగుతాడు.

ఈ నాలుగు విషయాలు. ఇది క్రియాత్మకమైన కపటత్వం. ఈ నాలుగు విషయాలు ఉంటే ఆ వ్యక్తి పక్కా కపట విశ్వాసి (మునాఫిక్) విశ్వాసపరంగా కాదు, క్రియాత్మకంగా. ఈ నాలుగులో ఒకటి ఉంటే కపటత్వానికి సంబంధించిన ఒక గుణం అతనిలో ఉందని అర్థం.

హృదయానికి సంబంధించిన మొదటి రోగం షిర్క్ అయితే, రెండవది కపటత్వం.

ఇక మూడవది ‘రియా’, ప్రదర్శనా బుద్ధి. ఇది చాలా డేంజర్. ఎందుకంటే కొన్ని పుణ్యాలు చాలా గొప్పగా ఉంటాయి. హజ్, ఉమ్రా ఉంది, ఎంత గొప్పదైన పుణ్యం అది. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా చాలా గొప్ప పుణ్యం ఉమ్రా మరియు హజ్. అలాగే జకాత్, ఐదు పూటల నమాజులు, దానధర్మాలు లక్షల కొద్ది, కోట్ల కొద్ది దానాలు చేస్తారు. మరి:

إِنَّمَا الْأَعْمَالُ بِالنِّيَّاتِ
[ఇన్నమల్ ఆ మాలు బిన్నియ్యాత్]
కర్మలు, ఆచరణలు సంకల్పంపై ఆధారపడి ఉన్నాయి.

కనుక మన సంకల్పాన్ని శుద్ధి చేసుకోవాలి. సంకల్ప శుద్ధి అవసరం. ప్రదర్శనా బుద్ధితో మనము ఏ పని చేయకూడదు. అల్లాహ్ ప్రసన్నత కోసమే చేయాలి, ప్రవక్త గారి విధానం పరంగానే ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. అందుకే హృదయానికి సంబంధించిన రోగాలలో ముఖ్యమైన మూడవ రోగం, అది ప్రదర్శనా బుద్ధి (రియా).

మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

مَنْ صَامَ يُرَائِي فَقَدْ أَشْرَكَ
[మన్ సామ యురాఈ ఫఖద్ అష్రక]
ఎవరైతే ప్రదర్శనా బుద్ధితో ఉపవాసం ఉన్నాడో ఆ వ్యక్తి షిర్క్ చేశాడు.

ఇంకా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

إِنِّي أَخَافُ عَلَيْكُمُ الشِّرْكَ الْأَصْغَرَ
[ఇన్నీ అఖాఫు అలైకుముష్ షిర్కల్ అజ్గర్]
నేను మీ విషయంలో చిన్న షిర్క్ (షిర్క్ అస్గర్) గురించి భయపడుతున్నాను అన్నారు.

చిన్న షిర్క్ అంటే ఏమిటి? ప్రదర్శనా బుద్ధితో ఆచరించటం. ఏ పుణ్యం చేసినా మంచి సంకల్పంతో కాదు, చిత్తశుద్ధితో కాదు, అల్లాహ్ ప్రసన్నత కోసం కాదు, నలుగురు మెప్పు కోసం, నలుగురు నన్ను పొగుడుతారని, నా గురించి గొప్పలు చెప్పుకుంటారని ప్రదర్శనా బుద్ధితో ఆచరిస్తే, అది ‘రియా‘. దానికి అంటారు షరియత్ పరిభాషలో అది చిన్న షిర్క్ అవుతుంది. ఆ ఆచరణ స్వీకరించబడదు. కావున హృదయ రోగాలలో మూడవది రియా (ప్రదర్శనా బుద్ధి).

నాలుగవది అనుమానం. అనుమానం గురించి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اجْتَنِبُوا كَثِيرًا مِّنَ الظَّنِّ إِنَّ بَعْضَ الظَّنِّ إِثْمٌ
[యా అయ్యుహల్లజీన ఆమనుజ్ తనిబూ కసీరమ్ మినజ్జన్ని ఇన్న బ అ జజ్జన్ని ఇస్మున్]
ఓ విశ్వాసులారా! అతిగా అనుమానించటానికి దూరంగా ఉండండి. కొన్ని అనుమానాలు పాపాల క్రిందికి వస్తాయి. (49:12)

‘జన్’ అంటే అసలు అనుమానం, తలపోయటం అని అర్థం. అయితే శ్రేయోభిలాషుల, భక్తిపరుల, సత్యమూర్తుల గురించి లేనిపోని అనుమానాలకు పోవటం దురనుమానాల క్రిందికి వస్తాయి. కావున షరియత్ లో దీనిని ‘అక్జబుల్ హదీస్’ (అన్నిటికంటే పెద్ద అబద్ధం) గా అభివర్ణించబడింది.

అభిమాన సోదరులారా! సారాంశం ఏమిటంటే మాటిమాటికి అతిగా అనుమానం చేయకూడదు. హృదయంలో ఏముందో అది అల్లాహ్ కు మాత్రమే తెలుసు. ఏదైనా కొంచెం చూసేసి చాలా వివరంగా చెప్పుకోకూడదు. అసలు అనుమానం మంచిది కాదు. إِنَّ بَعْضَ الظَّنِّ إِثْمٌ “ఇన్న బాజజ్జన్ని ఇస్మున్” (కొన్ని అనుమానాలు పాపం క్రిందికి వస్తాయి) అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేశాడు.

ఇక ఐదవ విషయం ఏమిటంటే అసూయ. అసూయ ఇది కూడా చాలా చెడ్డదండి. కర్మలు పాడైపోతాయి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు, సూర నిసాలో ఉంది ఇది:

أَمْ يَحْسُدُونَ النَّاسَ عَلَىٰ مَا آتَاهُمُ اللَّهُ مِن فَضْلِهِ
[అమ్ యహ్ సుదూనన్నాస అలా మా ఆతాహుముల్లాహు మిన్ ఫజ్లిహి]
అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రజలకు ప్రసాదించిన దానిపై వారు అసూయ పడుతున్నారా? (4:54)

అంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పరీక్ష నిమిత్తం కొందరికి తక్కువ ఇస్తాడు, కొందరికి ఎక్కువ ఇచ్చేస్తాడు ఆర్థిక పరంగా, పదవి పరంగా, కొందరికి ఆరోగ్యం ఇస్తాడు, కొందరికి అనారోగ్యం ఇస్తాడు. ఇదంతా పరీక్ష నిమిత్తం అల్లాహ్ చేస్తాడు, అది అల్లాహ్ హిక్మత్ (వివేకం) లో ఉంది. కాకపోతే దాని మూలంగా ఒకరు ఇంకొకరిపై అసూయ చెందకూడదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

إِيَّاكُمْ وَالْحَسَدَ فَإِنَّ الْحَسَدَ يَأْكُلُ الْحَسَنَاتِ كَمَا تَأْكُلُ النَّارُ الْحَطَبَ
[ఇయ్యాకుమ్ వల్ హసద ఫఇన్నల్ హసద య అకులుల్ హసనాతి కమా త అకులున్నారుల్ హతబ]
అసూయకు దూరంగా ఉండండి. ఎందుకంటే అగ్ని కట్టెల్ని కాల్చినట్లు, అసూయ సత్కర్మల్ని కాల్చేస్తుంది (తినేస్తుంది).

ఏ విధంగా అగ్ని కట్టెల్ని కాల్చేసి బూడిద చేసేస్తుందో, అలాగే అసూయ అనేది మనిషి చేసిన పుణ్యాలకు, సత్కర్మలకు తినేస్తుంది అన్నమాట.

అభిమాన సోదరులారా! ఈ విధంగా హృదయ రోగాలు, హృదయానికి సంబంధించిన అనేక రోగాలు ఉన్నాయి. వాటిలో ఐదు నేను చెప్పాను. ఈ ఐదులో ప్రతి ఒక్కటికీ వివరం అవసరం ఉంది. షిర్క్ ఉంది, కపటత్వం ఉంది, అలాగే రియా ఉంది, అలాగే జన్ (అనుమానించటం) ఉంది, ఐదవది అసూయ. ఇవి కాక ఇంకా ఎన్నో ఉన్నాయి, నేను ముఖ్యమైన ఈ ఐదు చాలా ఘోరమైన పాపాలు గనక హృదయానికి సంబంధించిన రోగాలలో ఈ ఐదు తెలియజేశాను.

ఇక దీనికి చికిత్స ఏమిటి? హృదయం గురించి కొన్ని విషయాలు మొదటిగా నేను చెప్పాను. ఆ తర్వాత హృదయానికి సంబంధించిన రోగాలలో ఐదు రోగాల ప్రస్తావన వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు వాటి చికిత్స ఎలా? హృదయ రోగాల చికిత్స ఏ విధంగా చేసుకోవాలి? ముఖ్యమైన ఏడు పాయింట్లు, సమయం అయిపోయింది గనక నేను క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను.

అల్లాహ్ ప్రేమలో పరిపూర్ణత కలిగి ఉండాలి. యాక్టింగ్ మాత్రమే కాదు, అల్లాహ్ ని ప్రేమిస్తున్నామని చెప్పటము మరి పాపాలు చేయటము, అల్లాహ్ కు అవిధేయత చూపటం అలా కాదు. “కమాలు ముహబ్బతిల్లాహ్” – అల్లాహ్ యొక్క ప్రేమలో పరిపూర్ణత కలిగి ఉండాలి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కపట విశ్వాసుల, అలాగే ముష్రికుల, బహుదైవారాధకుల ప్రస్తావన చేసిన తర్వాత విశ్వాసుల గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَالَّذِينَ آمَنُوا أَشَدُّ حُبًّا لِّلَّهِ
[వల్లజీన ఆమనకూ అషద్దు హుబ్బన్ లిల్లాహి]
విశ్వసించినవారు అల్లాహ్‌ను అంతకంటే ప్రగాఢంగా (అధికంగా) ప్రేమిస్తారు. (2:165)

విశ్వసించిన వారు, విశ్వాసులు, ముమినిన్లు అల్లాహ్ కు అంతకంటే ప్రగాఢంగా, అధికంగా ప్రేమిస్తారు. అంటే విశ్వాసులు అల్లాహ్ పట్ల అమితమైన ప్రేమ కలిగి ఉంటారు అన్నమాట. ఇది మొదటి విషయం.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
[కుల్ ఇన్న సలాతీ వ నుసుకీ వ మహ్యాయ వ మమాతీ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్]
ఇంకా ఈ విధంగా ప్రకటించు : “నిస్సందేహంగా నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం – ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌ కొరకే.” (6:162)

నా నమాజ్, ‘వ నుసుకీ’ దీనికి రెండు అర్థాలు ఉన్నాయి, ఒక అర్థం నా ఖుర్బానీ, రెండో అర్థం నా సకల ఆరాధనలు. నా నమాజు, నా సకల ఆరాధనలు, అంత మాత్రమే కాదు ‘వ మహ్యాయ’ – నా జీవనం, ‘వ మమాతీ’ – నా చావు, నా మరణం. ఇవన్నీ ‘లిల్లాహి రబ్బిల్ ఆలమీన్’ – సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్ కు మాత్రమే, అల్లాహ్ కోసమే. అంటే నేను నమాజ్ చేస్తున్నాను అల్లాహ్ కోసమే చేస్తున్నాను. నా సకల ఆరాధనలు, నమాజ్ మాత్రమే కాదు నా సకల ఆరాధనలు – దానం చేసినా, ఒకరికి సహాయం చేసినా, ఒకరి హక్కు పూర్తి చేసినా, భార్య విషయంలో, పిల్లల విషయంలో, అమ్మ నాన్న విషయంలో, ఇరుగుపొరుగు వారి విషయంలో, స్నేహితుల విషయంలో, మిత్రుల విషయంలో, శత్రువుల విషయంలో, జంతువుల విషయంలో, ప్రతి విషయంలో. చివరికి నా పూర్తి జీవితం, నా మరణం కూడా అల్లాహ్ కోసమే. ఇది చిత్తశుద్ధి కలిగి ఉండాలి.

‘హుస్నుల్ ముతాబఅ’ అంటే ఆచరణ విశ్వాసపరంగా ఉండాలి. ఏదైతే చెబుతున్నామో అలాగే చేయాలి. ఏదైతే చేస్తామో అదే చెప్పాలి. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానం పరంగా ఉండాలి. దీనికి అంటారు ‘హుస్నుల్ ముతాబఅ’. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

قُلْ إِن كُنتُمْ تُحِبُّونَ اللَّهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللَّهُ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ
[కుల్ ఇన్ కున్తుమ్ తుహిబ్బూనల్లాహ ఫత్తబివూనీ యుహ్ బిబ్ కుముల్లాహు వ యగ్ఫిర్ లకుమ్ జునూబకుమ్]

(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : ”మీకు నిజంగానే అల్లాహ్‌ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (తత్ఫలితంగా) అల్లాహ్‌ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ పాపాలను మన్నిస్తాడు.” (3:31)

మీరు అల్లాహ్ కు ప్రేమిస్తున్నారా? అల్లాహ్ పట్ల మీకు ప్రేమ ఉందా? అల్లాహ్ పట్ల మీరు ప్రేమ కలిగి ఉన్నారా? అలాగైతే ‘ఫత్తబివూనీ’ – నన్ను అనుసరించండి (అంటే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను అనుసరించండి, ఇత్తెబా చేయండి). దానికి ప్రతిఫలం ఏమిటి? అల్లాహ్ అంటున్నాడు ‘యుహ్ బిబ్ కుముల్లాహ్’ – అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు, ‘వ యగ్ఫిర్ లకుమ్ జునూబకుమ్’ – అల్లాహ్ మీ పాపాలు మన్నిస్తాడు.

అంటే ఈ ఆయత్ లో ఏది చెబుతామో అలాగే మనము ఆచరించాలి. అల్లాహ్ ను ప్రేమిస్తున్నాము చెబుతున్నాము, అల్లాహ్ ను విశ్వసిస్తున్నాము చెబుతున్నాము – ఆచరించాలి. ప్రవక్త గారి పట్ల మనకు ప్రేమ ఉంది చెబుతున్నాము – ఆచరించాలి. అలా చేస్తే అల్లాహ్ మమ్మల్ని ప్రేమిస్తాడు, అల్లాహ్ మన పాపాలు మన్నిస్తాడు.

‘అల్-మురాఖబా’ అంటే దైవ ధ్యానం, జవాబుదారీ భావన. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَهُوَ مَعَكُمْ أَيْنَ مَا كُنتُمْ
[వహువ మ అకుమ్ ఐన మా కున్తుమ్]
మీరెక్కడ ఉన్నా ఆయన మీతోనే ఉంటాడు. (57:4)

మీరు ఎక్కడైనా సరే, ఎక్కడున్నా సరే అల్లాహ్ మీకు తోడుగా ఉన్నాడు, అల్లాహ్ మీతోనే ఉన్నాడు, అల్లాహ్ గమనిస్తున్నాడు, అల్లాహ్ నిఘా వేసి ఉన్నాడు. ఈ భావన ఉంటే మనం పాపం చేయము కదా. ఏకాంతంలో ఉన్నాము, ఇంట్లో ఉన్నాము, బయట ఉన్నాము, రాత్రి పూట, పగటి పూట, చీకటి, వెలుగు – ఎక్కడైనా సరే అల్లాహ్ నన్ను కనిపెట్టుకొని ఉన్నాడు, నిఘా వేసి ఉన్నాడు, గమనిస్తున్నాడు, “అల్లాహ్ అలీముమ్ బిజాతిస్ సుదూర్” – హృదయాలలో ఏముంది అది అల్లాహ్ ఎరుగును. ఈ భావన ఉంటే మనిషి పాపాలకు దూరంగా ఉంటాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

إِنَّ اللَّهَ لَا يَخْفَىٰ عَلَيْهِ شَيْءٌ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ
[ఇన్నల్లాహ లా యఖ్ ఫా అలైహి షైఉన్ ఫిల్ అర్జి వలా ఫిస్సమాఇ]
నిశ్చయంగా – భూమ్యాకాశాలలోని ఏ వస్తువూ అల్లాహ్‌కు గోప్యంగా లేదు. (3:5)

సదఖా చేస్తే కూడా దాని మూలంగా హృదయాలు శుద్ధి అవుతాయి. అల్లాహ్ సెలవిచ్చాడు:

خُذْ مِنْ أَمْوَالِهِمْ صَدَقَةً تُطَهِّرُهُمْ وَتُزَكِّيهِم بِهَا
[ఖుజ్ మిన్ అమ్ వాలిహిమ్ సదఖతన్ తుతహ్హిరుహుమ్ వ తుజక్కీహిమ్ బిహా]

(ఓ ప్రవక్తా!) నువ్వు వారిని పరిశుద్ధపరచటానికీ, వారిని తీర్చిదిద్దటానికీ వారి సంపదల నుంచి దానాలను తీసుకో. ఓ ప్రవక్త!) వారి సంపదల నుండి ‘సదఖా’ (దానధర్మాలు) వసూలు చేయి. దాని ద్వారా నీవు వారిని పరిశుద్ధులుగా, పవిత్రులుగా తీర్చిదిద్దగలవు. (9:103)

ఓ ప్రవక్త వారి నుండి దానాలను తీసుకో, దాని వల్ల ఏమవుతుంది? వారి హృదయాలు పరిశుద్ధం అవుతాయి. వారిని పరిశుభ్రపరచటానికి, వారిని తీర్చిదిద్దటానికి దానాలు తీసుకో అని అల్లాహ్ అంటున్నాడు. అంటే సదఖా మూలంగా పుణ్యంతో పాటు జీవితాలు, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తీర్చిదిద్దుతాడు, అలాగే హృదయాలు శుభ్రం అవుతాయి.

ఖియాముల్ లైల్. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

تَتَجَافَىٰ جُنُوبُهُمْ عَنِ الْمَضَاجِعِ
[తతజాఫా జునూబుహుమ్ అనిల్ మజాజిఇ]
వారి ప్రక్కలు వారి పడకల నుంచి వేరుగా ఉంటాయి. (32:16)

వారు రాత్రి పూట తక్కువగా నిద్రిస్తారు. అంటే తహజ్జుద్ నమాజ్, ఖియాముల్ లైల్ కి అమితమైన, ఎక్కువ పుణ్యం ఉంది.

‘అద్దుఆ హువల్ ఇబాద’, ‘అద్దుఆ ముఖ్ఖుల్ ఇబాద’. అసలైన ఆరాధన అది దుఆ అని ప్రవక్త సెలవిచ్చారు.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నాకు చెప్పటం కంటే ఎక్కువ, మిమ్మల్ని వినటం కంటే ఎక్కువ, అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. మనందరినీ హృదయానికి సంబంధించిన రోగాల నుండి రక్షించుగాక, శుభ్రపరచుగాక. ఇహపరలోకాలలో అల్లాహ్ సాఫల్యం ప్రసాదించుగాక. ఆమీన్.

వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=25349

చెడు అనుమానానికి దూరంగా ఉండండి [వీడియో]

చెడు అనుమానానికి దూరంగా ఉండండి | బులూగుల్ మరాం | హదీసు 1284
https://youtu.be/yLseG7LgNmM [6 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1284. హజ్రత్‌ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకాకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తాకీదు చేశారు:

దురనుమానానికి దూరంగా ఉండండి. ఎందుకంటే దురనుమానం చాలా పెద్ద అబద్ధంగా పరిగణించబడుతుంది.” (బుఖారీ, ముస్లిం)

సారాంశం: దురనుమానం ఒక పెద్ద అసత్య విషయంగా పరిగణించబడటానికి కారణం ఏమిటంటే మనిషి తనలో తానే దాన్ని పెంచి పోషించుకుంటూ పోతాడు. ఆఖరికి అసలేమీ లేని దాన్ని గురించి ఏదో ఒక సందర్భంగా నోటితో చెప్పేస్తాడు. అందుకే విద్వాంసులు దీన్ని అభాండంగా, అపనిందగా ఖరారు చేశారు. ఒకరిపై అపనింద మోపటం నిషిద్ధం కదా! దీని ద్వారా తేటతెల్లమయిందేమిటంటే దురనుమానం అపనిందకు ఆనవాలు. అపనింద మహాపరాధం. పశ్చాత్తాపం చెందనిదే ఇది క్షమార్హం కాజాలదు. అందుకే వీలయినంత వరకు దీనికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే దురనుమానాలు, సంకోచాలు పుట్టిపెరిగే సమాజంలో సదనుమానం, సద్భావన అనేవి నిలదొక్కుకోలేవు. అలాంటి సమాజంలోని సభ్యుల మధ్య పరస్పర నమ్మకం, పరస్పర సహకార భావాల వాతావరణం కూడా ఏర్పడదు. ఒండొకరిని అడుగడుగునా శంకిస్తూ ఉంటారు. ఇది సమాజ అభ్యున్నతికి, వికాసానికి శుభ సూచకం కాదు సరికదా పతనానికి, అధోగతికి ఆనవాలు అవుతుంది. సత్సమాజ రూపకల్పనకు ఉపక్రమించినపుడు దురనుమానవు సూక్ష్మక్రిములను ఎప్పటికప్పుడు సంహరించటం అవసరం.

యూట్యూబ్ ప్లే లిస్ట్ – బులూగుల్ మరాం – కితాబుల్ జామి
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV266FkpuZpGacbo51H-4DV3

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1