ఏమిటి? తన దాసునికి అల్లాహ్ సరిపోడా? [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ఏమిటి? తన దాసునికి అల్లాహ్ సరిపోడా?
https://youtu.be/d0gnnL2PGE8 [11 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ‘అల్లాహ్ తన దాసునికి చాలడా?’ అనే ఖురాన్ వాక్యం యొక్క లోతైన భావాన్ని వివరించబడింది. దాసులలో రెండు రకాలు ఉంటారని, సాధారణ దాసులు (సృష్టి మొత్తం) మరియు ప్రత్యేక దాసులు (అల్లాహ్ కు సంపూర్ణంగా విధేయత చూపి, ఆయన దాస్యాన్ని వాస్తవ రూపంలో నెరవేర్చేవారు) అని బోధించారు. అల్లాహ్ తన ప్రత్యేక దాసులకు అన్ని కష్టాలు, శత్రువుల కుతంత్రాల నుండి తప్పకుండా సరిపోతాడని, వారిని కాపాడుతాడని నొక్కిచెప్పారు. దీనికి ఉదాహరణగా, రాజు హింస నుండి అల్లాహ్ ను వేడుకుని రక్షణ పొందిన నవయువకుని గాథను (సూరతుల్ బురూజ్) వివరించారు. మనం కూడా అల్లాహ్ యొక్క నిజమైన దాసులుగా మారినప్పుడు, ఎలాంటి కష్టంలోనైనా ఆయనపై సంపూర్ణ నమ్మకంతో ధైర్యంగా ఉండాలని, ఎందుకంటే ఆయనే మనకు చాలినవాడని ఈ ప్రసంగం యొక్క సారాంశం.

أَلَيْسَ اللَّهُ بِكَافٍ عَبْدَهُ
అలైసల్లాహు బికాఫిన్ అబ్దహ్
అల్లాహ్ తన దాసునికి చాలడా?

అబ్దహ్. ఇక్కడ దీని యొక్క భావం తన దాసుడు. కానీ ఇందులో మరో గొప్ప భావం దాగి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ద్వారా, ఖురాన్ వ్యాఖ్యానాల ద్వారా మనకు స్పష్టమవుతుంది. ఏంటి?

ఒక రకంగానైతే ఈ సర్వ సృష్టి కూడా అల్లాహ్ దాస్యంలో ఉంది. మనం మానవులందరమూ కూడా అల్లాహ్ యొక్క దాసులమే.

قُلْ يَا عِبَادِيَ الَّذِينَ أَسْرَفُوا عَلَىٰ أَنفُسِهِمْ
ఖుల్ యా ఇబాది యల్లజీన అస్రఫూ అలా అన్ఫుసిహిమ్
(ఓ ప్రవక్తా!) చెప్పు: “ఓ నా దాసులారా! ఎవరైతే తమ ఆత్మలపై హద్దుమీరారో…”

ఇదే సూరతు జ్జుమర్ లో అల్లాహుతాలా, “ఓ నా దాసులారా! ఎవరైతే తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్నారో” అని అన్నాడు. మనమందరం ఈ రకంగా చూస్తే అల్లాహ్ యొక్క దాసులమే. కానీ అల్లాహ్ యొక్క దాసులం అన్న ఈ సర్వసామాన్య భావంలో విశ్వాసులు, అవిశ్వాసులు, నమ్మేవారు, నమ్మనివారు, ఆస్తికులు, నాస్తికులు అందరూ వచ్చేస్తున్నారు. కానీ

أَلَيْسَ اللَّهُ بِكَافٍ عَبْدَهُ
అలైసల్లాహు బికాఫిన్ అబ్దహ్
అల్లాహ్ తన దాసునికి చాలడా?

అబ్దహ్ – తన దాసుడు అన్న భావంలో మరో మాట ఏదైతే మర్మంగా ఉందో, దాచి ఉందో, దాగి ఉందో అదేమిటంటే, ఎవరైతే అల్లాహ్ యొక్క సామాన్య దాసునిగా కాకుండా అతని యొక్క ప్రత్యేక దాసుడైపోతాడో, అంటే వాస్తవ రూపంలో అల్లాహ్ యొక్క దాస్యాన్ని మరియు తనకు దాసుడుగా ఉన్న ఈ ఉద్దేశాన్ని పూర్తి చేస్తాడో అతడికి, అలాంటి వానికి అల్లాహ్ తప్పకుండా సరిపోతాడు. అల్లాహు అక్బర్. తప్పకుండా అల్లాహ్ సరిపోతాడు.

అందుకొరకే ఒక హదీసులో మనకు ఏం తెలుస్తుంది? ఇమామ్ ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ ఆ హదీసును తన తఫ్సీర్ లో, ఈ ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో పేర్కొన్నారు. ఫుదాలా బిన్ ఉబైద్ అల్ అన్సారీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా ఆయన విన్నారు. తిర్మిజీ మరియు ముస్నద్ అహ్మద్ లోని హదీస్:

أَفْلَحَ مَنْ هُدِيَ إِلَى الإِسْلامِ، وَكَانَ عَيْشُهُ كَفَافًا، وَقَنَّعَهُ اللَّهُ بِمَا آتَاهُ
అఫ్లహ మన్ హుదియ ఇలల్ ఇస్లాం, వకాన ఐషుహు కఫాఫన్, వ ఖన్న అహుల్లాహు బిమా ఆతాహ్
ఇస్లాం వైపు మార్గనిర్దేశం పొందినవాడు, అతని జీవనం సరిపడినంతగా ఉంది, మరియు అల్లాహ్ అతనికి ఇచ్చిన దానితోనే అతన్ని సంతృప్తిపరిచినవాడు సాఫల్యుడయ్యాడు.

ఎవరైతే ఇస్లాం యొక్క సన్మార్గాన్ని పొందారో, అతని యొక్క ఇహలోకపు జీవితం, అతని యొక్క ఆర్థిక వ్యవస్థ అతనికి సరిపడే విధంగా ఉంది, అల్లాహ్ ఎంత ఇచ్చాడో అంతలోనే సరిపుచ్చుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కానీ ఇస్లాంపై స్థిరంగా ఉన్నాడు. అఫ్లహ! అతడు సాఫల్యుడైపోయాడు.

గమనించండి. ఖురాన్ లో సూరతుల్ బఖరాలో మొదటి పారా, అలిఫ్ లామ్ మీమ్ అది ఎండ్ అయ్యేకి ముందు, ఒక నాలుగైదు ఆయతుల ముందు

فَسَيَكْفِيكَهُمُ اللَّهُ
ఫస యక్ఫీక హుముల్లాహ్
అయితే వారి నుండి (వారి కీడుకు వ్యతిరేకంగా) అల్లాహ్ నీకు సరిపోతాడు.

ఫస యక్ఫీక హుముల్లాహ్. అల్లాహ్ వారి నుండి నీ కొరకు సరిపోతాడు. అంటే, నీకు ఎలాంటి భయపడవలసిన అవసరం లేదు. అల్లాహ్ నీ కొరకు చాలు. నిన్ను కాపాడడానికి, నీకు రక్షణ ఇవ్వడానికి, నీ అవసరాలు తీరడానికి, నీవు ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు నిన్ను ఆదుకోవడానికి.

ఆ నవయువకుని సంఘటన మీకు తెలుసు కదా? సూరతుల్ బురూజ్ లో వచ్చి ఉంది. ఏమిటి సంఘటన? చాలా పొడుగ్గా ఉంది. సహీ హదీసులో దాని ప్రస్తావన వచ్చి ఉంది. అతడు ఒక మాంత్రికుని దగ్గర మంత్రజాలం కూడా నేర్చుకుంటాడు, మరోవైపు ధర్మ విద్య కూడా నేర్చుకుంటాడు. తర్వాత అతనికి తెలుస్తుంది, ఈ మంత్ర విద్య, జాల విద్య అల్లాహ్ కు ఇష్టం లేనిది. ఇందులో షిర్క్, కుఫ్ర్, బహుదైవారాధన, అవిశ్వాసం, సత్య తిరస్కారం ఇంకా ఎన్నో చెడులు ఉన్నాయి. ఈ ధర్మ బోధకుడు అల్లాహ్ గురించి ఏ విషయాలైతే చెబుతున్నాడో ఇవి సత్యమైనవి, నిజమైనవి. అల్లాహ్ ను నమ్ముకుంటాడు.

ఆ తర్వాత ఒక దారిలో ఏదో పెద్ద జంతువు ప్రజల రాకపోకలను కూడా అది ఆపేస్తుంది. దాన్ని అల్లాహ్ యొక్క పేరుతో ఒక రాయి దాని మీద విసిరితే అది చనిపోతుంది. ప్రజలు తమ రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఆ సందర్భంలో ప్రజలకు ఈ నవయువకుని గురించి, ఇతడు ఎంత మహిమ గలవాడు, అంత పెద్ద జంతువును ఎవరు కొట్టగలుగుతారు, ఎవరు చంపగలుగుతారు, దాన్ని దారిలో నుండి ఎవరు తీయగలుగుతారు? ఈ అబ్బాయి తీశాడు అని అతని వద్దకు వచ్చి అతన్ని చాలా గొప్పగా చెప్పుకుంటే, అతడు చాలా స్పష్టంగా చెప్పేస్తాడు, “నేను చేసింది ఏమీ లేదు, ఆ అల్లాహ్ సర్వశక్తిమంతుడే చేశాడు. మీరు అల్లాహ్ ను నమ్ముకోండి.” ఇక మన సమాజంలో చూస్తాము కదా, ఎక్కడైనా ఏదైనా కొత్త బాబా పుట్టగొడుగుల్లా మొలకెత్తుకొని వచ్చాడు అంటే, ప్రజలు పిచ్చోళ్ళ మాదిరిగా వారి వెంట పడి, నా ఈ కష్టం దూరం కావాలి, నాకు సంతానం కావాలి, నా ఫలానా పని కావాలి అని ఎలా వస్తారో, అలా రావడం మొదలుపెట్టారు ఆ అబ్బాయి దగ్గరికి. అప్పుడు అతను తన గొప్పతనాన్ని చాటుకోలేదు. ఇస్లాం యొక్క దావత్ ఇచ్చాడు. అల్లాహ్ ను నమ్ముకోండి అని చెప్పాడు. చివరికి ఈ విధంగా ఆ కాలంలో ఉన్న రాజు వద్ద ఒక మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో, అతడు అంధుడైపోయాడు, అతనికి ఈ విషయం తెలిసింది. అతడూ వచ్చాడు. అతనికి కూడా ఈ అబ్బాయి అదే మాట చెప్పాడు, “నేను ఎవరికీ కన్ను ప్రసాదించను, చూపులు ఇవ్వను, ఎవరి ఏ కష్టాన్ని దూరం చేసేవాణ్ణి నేను కాదు. అల్లాహ్ మాత్రమే. అల్లాహ్ ను నమ్ముకోండి, అతనితో దుఆ చేయండి.” ఆ మినిస్టర్ కూడా అల్లాహ్ ను నమ్ముకుంటాడు, అల్లాహ్ తో దుఆ చేస్తాడు, అల్లాహ్ అతనికి కళ్ళు ప్రసాదిస్తాడు, చూపు ఇచ్చేస్తాడు. అక్కడి నుండి ఇక కష్టాలు, పరీక్షలు, ఎన్నో రకాల హింసా దౌర్జన్యాలు ఆ మినిస్టర్ పై మొదలవుతాయి, తర్వాత ఆ బోధకునిపై వస్తాయి, చివరికి ఈ అబ్బాయిపై కూడా వస్తాయి.

ఆ సందర్భంలో సంక్షిప్త మాట ఏమిటంటే, ఈ అబ్బాయిని తీసుకెళ్ళండి, గుట్ట మీదికి తీసుకెళ్ళిన తర్వాత మీరు కలిసి ఇతన్ని కింద పారేసేయండి, మీరు తిరిగి రండి. ఆ అతని యొక్క సైనికులు కొందరు ఈ అబ్బాయిని తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఆ గుట్ట మీద నిలబడతారు. ఇక ఇతన్ని విసిరేద్దాము, పారేద్దాము అని అనుకునే సందర్భంలో ఆ అబ్బాయి ఏం దుఆ చేస్తాడు?

اللَّهُمَّ اكْفِنِيهِمْ بِمَا شِئْتَ
అల్లాహుమ్మక్ఫినీహిమ్ బిమా షి’త్
ఓ అల్లాహ్, నీకు ఇష్టమైన రీతిలో వారి నుండి (వారి కీడుకు వ్యతిరేకంగా) నాకు సరిపో.

ఓ అల్లాహ్, నీకు ఇష్టమైన రీతిలో వీరి కుతంత్రాల నుండి, వీరి దుశ్చేష్టల నుండి నీవే నాకు సరిపోవాలి, నీవే నన్ను కాపాడుకోవాలి. అల్లాహు అక్బర్. యా అల్లాహ్, తూ మేరే లియే కాఫీ హో జా. ఓ అల్లాహ్, నీవు నాకు సరిపడిపోవాలి, నీవే నన్ను కాపాడుకోవాలి. అప్పుడు ఏం జరిగింది? ఆ గుట్టలో ఒక భూకంపం మాదిరిగా ఏర్పడింది. అతన్ని తీసుకొచ్చిన సైనికులందరూ కూడా అక్కడే నాశనమైపోయారు, ధ్వంసమైపోయారు. ఈ అబ్బాయి క్షేమంగా తిరిగి వచ్చేసాడు. ఎక్కడికి? రాజు దగ్గరికి.

ఆ రాజు చాలా ఆశ్చర్యపోయాడు. మళ్ళీ కొంతమంది సైనికులను ఇచ్చి, ఇతన్ని తీసుకెళ్ళండి, షిప్ లో, ఒక బోట్ లో కూర్చోబెట్టుకొని, పడవలో నడి సముద్రంలో తీసుకెళ్ళి అక్కడ ఇతన్ని పారేయండి, మీరు తిరిగి వచ్చేసేయండి. తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత మధ్యలోకి వెళ్ళాక ఇతన్ని పారేయాలని అనుకున్నప్పుడు ఆ అబ్బాయి మళ్ళీ దుఆ చేస్తాడు: అల్లాహుమ్మక్ఫినీహిమ్ బిమా షి’త్. అల్లాహుతాలా వారందరినీ అందులో ముంచేస్తాడు, ఇతన్ని కాపాడుతాడు.

సోదర మహాశయులారా! చెప్పే విషయం ఏంటంటే, ఇలాంటి సంఘటనలు మనకు ఎన్నో ఉన్నాయి. మనకు కావలసింది ఏంటి? అల్లాహ్ పై ఎలాంటి నమ్మకం ఉండాలో, మనం అల్లాహ్ యొక్క నిజమైన దాసులమవ్వాలి. నిజంగా, వాస్తవ రూపంలో అతని దాస్యత్వాన్ని పాటించాలి. మనం గమనించాలి, సత్య నిజమైన దాసుడు ఎప్పుడూ కూడా తన యజమానికి అవిధేయత చూపడు. ఈ సత్యాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, మనం అల్లాహ్ యొక్క దాసులమన్నటువంటి సత్య భావనలో ఎల్లప్పుడూ ఉంటామో, అల్లాహ్ ను మనం ఆరాధించడంలో, అల్లాహ్ ను నమ్మడంలో, మనపై ఏమైనా కష్టాలు వచ్చాయి అంటే ఆ కష్టాలు వచ్చినప్పుడు అల్లాహ్ యే మనల్ని కాపాడువాడు, రక్షించేవాడు అన్నటువంటి సంపూర్ణ నమ్మకంతో మనం ధైర్యంగా ఉండాలి.