చిన్న షిర్క్ (ప్రదర్శనాబుద్ధి) విషయంలో ఎక్కువగా భయపడండి | బులూగుల్ మరాం | హదీసు 1281
https://www.youtube.com/watch?v=ZodO3_eKB7c [5 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
1281. హజ్రత్ మహమూద్ బిన్ లబీద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:
“మీ గురించి అన్నింటి కన్నా ఎక్కువగా నేను చిన్న షిర్క్ (షిర్కె అస్గర్) – అంటే ప్రదర్శనా బుద్ది విషయంలో భయపడుతున్నాను.” (ఇమామ్ అహ్మద్ దీనిని ‘హసన్ పరంపర నుండి సేకరించారు)
సారాంశం: ప్రదర్శనాబుద్ధి అనేది మనిషి మాటల్లోనూ, చేతల్లోనూ కూడా ఉంటుంది. మనిషి ఏదైనా మంచి పనిచేసి దాని ద్వారా అల్లాహ్ యేతరుల మెప్పు పొందగోరటమే ప్రదర్శనాబుద్ధి. ఈ ప్రదర్శనాబుద్ధి రెండు రకాలుగా ఉంటుంది. మనిషి తాను చేసిన గొప్ప పనిని ఎవరూ చూడక పోతే దాని గురించి నలుగురికీ చెప్పుకుంటూ లేక చూపించుకుంటూ తిరగటం ఒక రకం. ప్రతి పనినీ నలుగురికీ చూపిస్తూ చేయటం రెండవ రకం. ఇవి రెండూ సమ్మతం కావు. అల్లాహ్ మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ ప్రదర్శనా భావాన్ని ఈసడించుకున్నారు. దీన్ని కపటత్వానికి నిదర్శనంగా కూడా ఖరారు చేశారు. ప్రదర్శనాబుద్ధితో కూడిన ఏ పుణ్యకార్యమూ అల్లాహ్ సమక్షంలో స్వీకరించబడదు. కాబట్టి అన్ని విధాలా – శాయశక్తులా – దీనికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచర సమాజం (ఉమ్మత్) గురించి అత్యధికంగా భయపడిన విషయం ‘షిర్కె అస్గర్’ (చిన్న షిర్క్) అని ఈ ప్రసంగం వివరిస్తుంది. ఈ చిన్న షిర్క్ అంటే ‘రియా’ – అనగా ఇతరుల మెప్పు, ప్రశంసలు పొందాలనే ఉద్దేశ్యంతో చేసే ప్రదర్శన బుద్ధి. ఇది ‘షిర్కె ఖఫీ’ (గుప్తంగా ఉండే షిర్క్) అని కూడా పిలవబడుతుంది. ప్రళయ దినాన, ప్రదర్శన బుద్ధి కోసం సత్కార్యాలు చేసిన వారిని అల్లాహ్, “మీరు ఎవరికోసం అయితే ఈ పనులు చేశారో, వారి వద్దకే వెళ్లి ప్రతిఫలం అడగండి” అని అంటాడని హదీసులో ఉంది. రియా వల్ల కలిగే నష్టాలు తీవ్రమైనవి: సత్కార్యాలు నిరర్థకం అవ్వడం, కపట విశ్వాసుల లక్షణాన్ని పోలి ఉండటం, మరియు తీవ్రమైన శిక్షకు గురికావడం. అందువల్ల, ప్రతి పనిని కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే చేయాలని, ప్రదర్శన బుద్ధికి దూరంగా ఉండాలని ఈ ప్రసంగం నొక్కి చెబుతుంది.
వ’అన్ మహమూద్ బిన్ లబీద్ రదియల్లాహు త’ఆలా అన్హు, ఖాల, ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం
وَعَنْ مَحْمُودِ بْنِ لَبِيدٍ رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم: إِنَّ أَخْوَفَ مَا أَخَافُ عَلَيْكُمُ الشِّرْكُ الأَصْغَرُ
హజ్రత్ మహమూద్ బిన్ లబీద్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: “మీ గురించి అన్నింటి కన్నా ఎక్కువగా నేను చిన్న షిర్క్ (షిర్కె అస్గర్) – అంటే ప్రదర్శనా బుద్ది విషయంలో భయపడుతున్నాను“.
అల్లాహు అక్బర్. చూడడానికి ఈ హదీస్ చాలా చిన్నగా ఉన్నప్పటికీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మన గురించి ఎంత రంది ఉండినదో తెలుస్తుంది, ఒక మాట. మనం ఏదైనా నష్టంలో పడిపోతామో, ఏదైనా పాపములో పడిపోతామో అని ప్రవక్త మన గురించి ఎంత భయం చెందేవారు. ఆ సందర్భంలో అలాంటి పరిస్థితిలో మనం ఏం చేయాలి అన్నది కూడా మనకు నేర్పేవారు.
షిర్కె అస్గర్ (చిన్న షిర్క్)
ఈ హదీస్ లో ఏం చెప్పారు ప్రవక్త వారు? షిర్కె అస్గర్. అంటే చిన్న షిర్క్ నుండి నేను మీ పట్ల చాలా భయపడుతున్నాను, మీరు దానికి పాల్పడతారని. షిర్కె అస్గర్ దేనిని అంటారు? రియా. మరొక హదీస్ ద్వారా తెలుస్తుంది, దీనినే,
الشِّرْكُ الْخَفِيُّ
(అష్షిర్కుల్ ఖఫీ)
దాగి ఉన్న, గుప్తమైన షిర్క్ అని కూడా అంటారు.
ఈ సందర్భంలో మరొక హదీస్ ను గనక మనం తెలుసుకుంటే, వాస్తవానికి మరొక హదీస్ కాదు వేరే ఉల్లేఖనాల్లో ఈ హదీస్ లోనే ఒక భాగం ఉంది. ఏంటి?
يَقُولُ اللَّهُ عَزَّ وَجَلَّ لَهُمْ يَوْمَ الْقِيَامَةِ … اذْهَبُوا إِلَى الَّذِينَ كُنْتُمْ تُرَاءُونَ فِي الدُّنْيَا فَانْظُرُوا هَلْ تَجِدُونَ عِنْدَهُمْ جَزَاءً
ఎవరైతే ఈ లోకంలో షిర్కె అస్గర్ కు, ప్రదర్శన బుద్ధికి పాల్పడతారో, ప్రళయ దినాన అల్లాహ్ వారితో అంటాడు – ఎప్పుడైతే అల్లాహు త’ఆలా ప్రజలందరికీ వారి కర్మల ప్రతిఫలం ప్రసాదిస్తాడో ఆ సమయంలో – ఏమంటాడు? “ఇహలోకంలో మీరు ఎవరి కొరకైతే మీరు మీ పనులు చేసేవారు – అంటే ప్రజలు మెచ్చుకోవాలి అని ప్రదర్శన బుద్ధితో చేశారు కదా ఈ లోకంలో – అయితే ఎవరు చూసి మిమ్మల్ని మెచ్చుకోవాలని మీరు ఆ కార్యాలు చేశారో, వారి వద్దకే వెళ్ళండి. వారు మీకు ఏదైనా ప్రతిఫలం ఇవ్వగలుగుతారా చూడండి.”
ఇస్తారా ఎవరైనా? ఇవ్వలేరు. అయితే ఏం తెలుస్తుంది మనకు? మనం ఏ మాట మాట్లాడినా, ఏ పని చేసినా, ఫలానా వారు చూసుకోవాలి, ఒరే మౌలసాబ్ ఎంత మంచిగా తఖ్రీర్ చేస్తున్నాడు అని మెచ్చుకోవాలి, అస్తగ్ ఫిరుల్లాహ్, అస్తగ్ ఫిరుల్లాహ్. నా తోటి వారు నేను ఎంత మంచిగా చదువుతున్నానో అని నన్ను మెచ్చుకోవాలి. ఇంకా ఏ పనులైనా గానీ, ఇక్కడ మనకు సంబంధించిన నేను ఉదాహరణలు ఒకటి రెండు ఇస్తున్నాను. అయితే ఇలా ప్రజలు చూసి మెచ్చుకోవాలన్నటువంటి భావనతో – ఈ మెచ్చుకోవడం రెండు రకాలు. ఒకటి, ఏదైనా పని చేయడం ప్రజలు మెచ్చుకోవాలని మన మనసులో ఉండడం. ఏదైనా మాట మాట్లాడడం లేదా ఏదైనా హోదా సంపాదించడం మరియు అక్కడ ప్రజల నోట ప్రశంసలు వెళ్ళాలి మన గురించి అని మనం అనుకోవడం. ఈ విధంగా ప్రదర్శన బుద్ధి, పేరు ప్రఖ్యాతుల కాంక్ష, ఇవన్నీ కూడా చాలా నష్టానికి పాల్పడతాయి, చాలా నష్టానికి మనల్ని గురిచేస్తాయి.
ప్రదర్శన బుద్ధి వల్ల కలిగే నష్టాలు
ఎలాంటి నష్టాలు? నంబర్ ఒకటి, మనం ఒక రకమైన షిర్క్ లో పడ్డవారమవుతాం. ఎందుకంటే మనం ప్రతీ కార్యం అల్లాహ్ ప్రసన్నత కొరకు చేయాలి. అంటే మనం అల్లాహ్ యేతరుల కొరకు చేసిన వాళ్ళం అవుతున్నాము. ఇక్కడ తప్పుడు భావములో పడకండి, పర్లేదులే చిన్న షిర్కే కదా అని. చిన్న చిన్న రాళ్లు కలిసే ఓ గుట్ట తయారవుతుంది. చిన్న చిన్న కట్టెలు కలిసే అన్నం వండుతారు, బిర్యానీలు వండుతారు. కదా? చిన్న చిన్న షిర్క్ కలిసి చాలా పెద్దగా అయిపోతే అది మరింత ఎక్కువ ప్రమాదకరమైపోతుంది.
రెండవ నష్టం, ఇది వంచకుల, కపట విశ్వాసుల, మునాఫికుల గుణం. సూరతున్నిసా ఆయత్ నంబర్ 142. అలాగే చివరి, ఖురాన్ యొక్క చివరి, ఆ సూరతుల్ మాఊన్ అని ఉంది కదా, చివరి చిన్న సూరాలలో, ఆ సూరాలో ఆయత్ నంబర్ నాలుగు నుండి ఏడు వరకు చదివి చూడండి.
మరియు అదే ఆయతులలో మూడవ నష్టం గురించి కూడా అల్లాహ్ మనకు తెలిపాడు. ఏంటి అది? వైల్ ఉన్నది, వారికి వినాశనం ఉన్నది, వారి కొరకు చాలా ఘోరమైన నరకంలో ఒక స్థానం ఉన్నది అని.
మరొక చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఎవరు ఏ సత్కార్యాలు చేస్తారో, అందులో ప్రదర్శన బుద్ధి కలిగి ఉంటారో, ఆ సత్కార్యం అన్నది అల్లాహ్ స్వీకరించడు, అల్లాహ్ దానికి ప్రతిఫలం అనేది ప్రసాదించడు.
ఈ విధంగా సోదర మహాశయులారా, ఈ ప్రదర్శన బుద్ధి అన్నది ఇహలోకంలో, పరలోకంలో మనకు చాలా నష్టంలో పడవేస్తుంది. వీటన్నిటికీ మనం దూరం ఉండాలి. అల్లాహు త’ఆలా మనందరికీ కూడా చిన్న, పెద్ద అన్ని రకాల షిర్కుల నుండి దూరం ఉంచుగాక. ఆమీన్.
—
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42249
తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/