అల్లాహ్ కోసం మాత్రమే ఇతరులను ప్రేమించటం
(హృదయ ఆచరణలు – 12వ భాగం)
షేఖ్ షరీఫ్, మదీనా గ్రాడ్యుయేట్ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/CoiTVUw5Gq4 [10 నిముషాలు]
హృదయ ఆచరణలు (భాగాలు 1 – 12) [2 గంటల 8 నిముషాలు]
హృదయ ఆచరణలు – పన్నెండవ భాగం
السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ. الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُولِهِ الْأَمِينِ أَمَّا بَعْدُ
అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ అమ్మాబాద్.
హృదయ ఆచరణలు పన్నెండవ భాగంలో మనము తెలుసుకోబోయే విషయము అల్లాహ్ కోసం మాత్రమే ఇతరులను ప్రేమించటం.
ప్రియులారా, హృదయ ఆచరణలు ఏదైతే అంశాన్ని మనం వింటూ ఉన్నామో ఇది చాలా ప్రాధాన్యత కలిగిన అంశము మరియు అత్యంత ఆవశ్యకమైన అంశం. ఎందుకంటే స్వర్గంలో ఉన్నత స్థానాలను అధిరోహించటానికి హృదయ ఆచరణ ఒక ముఖ్యమైన కారకం, స్వర్గం. దాని గురించి ఇలా చెప్పటం జరిగింది, మీరు అర్ధిస్తే జన్నతుల్ ఫిర్దౌస్ను అర్ధించండి.
అనేకమంది సహాబాలు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాహచర్యాన్ని స్వర్గంలో పొందాలని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కలిసి స్వర్గంలో ఉండాలని కోరుకునేవారు. మరి స్వర్గంలో ఉన్నత స్థానాలను అధిరోహించటానికి హృదయ ఆచరణ ఒక ముఖ్యమైన కారకం. మరి అందులో నుండి మరొక ముఖ్యమైన ఆచరణ అల్లాహ్ కోసం మాత్రమే ఇతరులను ప్రేమించటం.
మనిషి కేవలం అల్లాహ్ కోసం మాత్రమే ఇతరులను ప్రేమించటం అనేది చాలా గొప్ప విషయం సోదరులారా. సాధారణంగా ప్రజలు తమ అవసరాల కోసం ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఈ రోజులలో ప్రజలు ఇతరుల గురించి చాలా తక్కువగా ఆలోచిస్తారు, చాలా తక్కువగా ఇతరుల బాగోగుల గురించి యోగక్షేమాల గురించి తెలుసుకుంటారు. కానీ ఇలాంటి కాలంలో ప్రస్తుత క్లిష్టతర పరిస్థితులలో ఎవరైనా ఒక వ్యక్తి అల్లాహ్ యొక్క దాసులను కేవలం అల్లాహ్ కోసం మాత్రమే ప్రేమిస్తే అలాంటి వ్యక్తికి స్వర్గంలో ఇన్షా అల్లాహ్ ఉన్నత స్థానం లభిస్తుంది ప్రియులారా.
తబ్రానీ గ్రంథంలో ఉల్లేఖించబడిన ఒక సహీ హదీసు ప్రకారం హజరతే ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు హదీసు ఉల్లేఖిస్తున్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు సోదరులారా. ప్రళయ దినాన కొంతమంది అల్లాహ్తో కలిసి కూర్చుంటారు. హదీసులో చెప్పబడింది,
إِنَّ لِلَّهِ جُلَسَاءَ
ఇన్న లిల్లాహి జులసా
కొంతమంది అల్లాహ్తో కలిసి కూర్చుంటారు.
మరియు ఆ సమావేశం గురించి చెప్పబడింది:
عَنْ يَمِينِ الْعَرْشِ
అన్ యమీనిల్ అర్ష్
అర్ష్ యొక్క కుడివైపున వారు కూర్చుంటారు. అంటే అల్లాహ్ యొక్క కుడివైపున వారు కూర్చుంటారు.
وَكِلْتَا يَدَيِ اللَّهِ يَمِينٌ
వ కిల్తా యదైల్లాహి యమీనున్
మరియు అల్లాహ్ యొక్క రెండు చేతులు కుడి చేతులే.
ఇక్కడ చెప్పడం జరుగుతుంది అల్లాహ్ యొక్క రెండు చేతులు కుడి చేతులే. దీన్ని బట్టి మనకి తెలుస్తున్న విషయం ఏమిటంటే అల్లాహ్కు చేతులు ఉన్నాయి. మరి ఆ చేతులను గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఆ రెండు చేతులు కుడి చేతులు.
ఇక్కడ మనము అల్లాహ్ యొక్క చేతులకు సంబంధించి షేఖ్ సాలెహ్ అల్ ఉసైమీన్ రహమహుల్లాహ్ వారు తెలియజేసిన విషయాలను తెలుసుకుందాం. ఎప్పుడైతే అల్లాహ్ యొక్క రెండు చేతులు కుడి చేతులు అన్న విషయాన్ని మనం వింటామో, వాస్తవానికి కొన్ని హదీసులలో ఎడమ చేతి ప్రస్తావన కూడా ఉంది. ఈ హదీసులో దైవ ప్రవక్త వారి మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి, అల్లాహ్ యొక్క రెండు చేతులు కుడి చేతులు అన్న విషయాన్ని? అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన దాని ఉద్దేశం ఏమిటంటే అల్లాహ్ యొక్క రెండు చేతులు మంచిలో, శుభాలలో, మంచిలో మరియు శుభాలలో పూర్తిగా సరిసమానమైనవే. ఎవరూ దానిని ఇలా అర్థం చేసుకోకూడదు ఎలాగైతే మనిషి చేతులు ఉంటాయో ఆ విధంగా ఎవరూ కూడా అల్లాహ్ యొక్క చేతులను పోల్చకూడదు. అల్లాహ్ మనల్ని రక్షించు గాక. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎడమ చేతితో ఇవ్వటాన్ని వారించారు, ఎడమ చేతితో పుచ్చుకోవటాన్ని వారించారు, ఎడమ చేతితో భోజనం చేయటం నుండి వారించారు, నీళ్లు త్రాగటాన్ని వారించారు. కానీ మనము అల్లాహ్ యొక్క చేతులను ఈ విధంగా మనం ఎంత మాత్రమూ ఊహించకూడదు. వాస్తవానికి అల్లాహ్ యొక్క రెండు చేతులు మేలులో, మంచిలో, సరిసమానమైనవే అన్న విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేయటం జరిగింది. ఎలాగైతే హదీసులో మనము విన్నామో. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులో ఇలా తెలియజేస్తున్నారు:
وَكِلْتَا يَدَيِ اللَّهِ يَمِينٌ عَلَىٰ مَنَابِرِهِمْ مِنْ نُورٍ
వ కిల్తా యదైల్లాహి యమీనున్ అలా మనాబిరిహిమ్ మిన్ నూర్
అల్లాహ్ ఎవరినైతే తనతో కూర్చోబెడతారో వారు కాంతిలీనుతున్న మింబర్లపై కూర్చుంటారు.
وُجُوهُهُمْ مِنْ نُورٍ
వుజూహుహుమ్ మిన్ నూర్
వారి ముఖాలు కాంతిలీనుతూ ఉంటాయి.
لَيْسُوا بِأَنْبِيَاءَ وَلَا شُهَدَاءَ وَلَا صِدِّيقِينَ
లైసూ బి అంబియా వలా షుహదా వలా సిద్దీఖీన్
ఎవరైతే కాంతిలీనుతున్న మింబర్లపై కూర్చుంటారో, ఎవరి ముఖాలైతే దగదగా మెరిసిపోతూ ఉంటాయో, వారు ప్రవక్తలు కాదు, షహీదులు కాదు, సిద్దీఖులు కారు.
మరి ఎందుకు వారికి అలాంటి ఘనత దక్కింది? అడగటం జరిగింది,
قِيلَ يَا رَسُولَ اللَّهِ مَنْ هُمْ؟
ఖీల యా రసూలల్లాహి మన్ హుమ్?
అడగబడింది, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారు ఎవరు?
ప్రవక్త వారు సమాధానం ఇచ్చారు,
هُمُ الْمُتَحَابُّونَ بِجَلَالِ اللَّهِ تَبَارَكَ وَتَعَالَى
హుముల్ ముతహాబ్బూన బి జలాలిల్లాహి తబారక వ త’ఆలా
వారు అల్లాహ్ యొక్క ఘనత కోసం, అల్లాహ్ యొక్క గొప్పతనం కోసం, కేవలం అల్లాహ్ కోసం ఒండొకరిని ప్రేమించేవారు, అల్లాహ్ కోసం ఇతరులను ప్రేమించేవారు.
ఎవరైతే అల్లాహ్కు విధేయత చూపుతారో, అల్లాహ్కు దాస్యం చేస్తారో అలాంటి వారిని వీరు ప్రేమిస్తారు. ఏ ముస్లింనైనా వారు కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసం వారు ప్రేమిస్తారు. అది తప్ప వేరే ఎలాంటి ఉద్దేశము వారికి ఉండదు. ఇలాంటి వారినే అల్లాహ్ తన అర్ష్ యొక్క కుడివైపున కూర్చోబెడతాడు. దీన్ని బట్టి తెలుస్తున్న విషయం ఏమిటంటే మనం అల్లాహ్ కోసం ఇతరులను ప్రేమించాలి. ఎవరైతే అల్లాహ్ కోసం ఇతరులను ప్రేమిస్తారో అలాంటి వారికి అల్లాహ్ త’ఆలా గొప్ప సన్మానాన్ని ఇస్తాడు.
కాబట్టి ఈ హదీసు ద్వారా మనకు తెలిసిన విషయము కొంతమంది అల్లాహ్తో పాటు అల్లాహ్ యొక్క అర్ష్ యొక్క కుడివైపున వారు కూర్చుంటారు. వారి ముఖాలు దగదగా మెరిసిపోతుంటాయి. అల్లాహ్ యొక్క రెండు చేతుల ప్రస్తావన ఉంది. ఆ తర్వాత ఎవరైతే ఆ ప్రళయ దినాన కూర్చుంటారో వారు అల్లాహ్ యొక్క అర్ష్ కు కుడివైపున మింబర్లపై కూర్చుంటారని, వారి ముఖాలు దగదగా మెరిసిపోతాయని చెప్పబడింది. అయినప్పటికీ వారు ప్రవక్తలు కానీవారు, షహీదులు కానీవారు, సిద్దీఖులు కానీవారు కానీ ప్రవక్తతో అడిగారు మరి ఎవరు ప్రవక్త? “హుముల్ ముతహాబ్బూన్ బి జలాలిల్లాహి తబారక వ త’ఆలా“, వారు అల్లాహ్ కోసం ఇతరులను ప్రేమించేవారు అన్న విషయం మనకు తెలుస్తుంది.
ఆ తర్వాత ఇదే విధంగా హృదయ ఆచరణలలో ఇతర నైతిక ఉత్తమ నైతిక కార్యాలు కూడా ఉన్నాయి. ఒకటి అల్ హయా అనగా సిగ్గు బిడియం మనిషి బిడియాన్ని కలిగి ఉండటం. అదే విధంగా రధా, అల్లాహ్ను ఇష్టపెట్టే ప్రయత్నము చేయటం. వస్సబ్ర్ ఓర్పు సహనాన్ని కలిగి ఉండటం. ఇవన్నీ హృదయ ఆచరణలకు సంబంధించిన విషయాలు.
అదే విధంగా హజరతే అబూ దర్దా రదియల్లాహు త’ఆలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం వేరే హృదయ ఆచరణ, ఉత్తమ హృదయ ఆచరణ ప్రళయ దినాన మనిషికి గౌరవాన్ని తీసుకువచ్చే ఆరాధన ప్రవక్త వారు అన్నారు,
مَا مِنْ شَيْءٍ أَثْقَلُ فِي مِيزَانِ الْمُؤْمِنِ يَوْمَ الْقِيَامَةِ مِنْ حُسْنِ الْخُلُقِ
మా మిన్ షైయిన్ అస్ఖలు ఫిల్ మీజానిల్ ము’మిని యౌమల్ ఖియామతి మిన్ హుస్నిల్ ఖులుఖి
ప్రవక్త వారు అన్నారు ఏమన్నారు, “మా మిన్ షైయిన్”, ఆ ప్రళయ దినాన ఏ వస్తువు ఉండదు, “అస్ఖలు ఫిల్ మీజానిల్ ము’మిన్” అంటే ఆ విశ్వాసి యొక్క ఆ త్రాసులో ఏ వస్తువు వేరేది బరువైనది ఉండదు, “యౌమల్ ఖియామతి యౌమల్ ఖియామతి” ప్రళయ దినాన దేనికంటే “మిన్ హుస్నిల్ ఖులుఖ్”, ఉత్తమ నడవడిక కంటే వేరే మంచి వస్తువు ఏదీ ఉండదు.
కాబట్టి ప్రియులారా ఈ హదీసులో మనకి తెలిసిన విషయము, ప్రళయ దినాన విశ్వాసి యొక్క త్రాసులో అన్నింటి కంటే బరువైన వస్తువు అతని ఉత్తమ నైతికత. కాబట్టి సోదరులారా మనిషి ప్రజలతో మంచిగా ప్రవర్తించాలి, ప్రజలను అల్లాహ్ కోసం ప్రేమించాలి, కష్టకాలంలో మనిషి ఓర్పు సహనాన్ని కలిగి ఉండాలి, మనిషిలో సిగ్గు బిడియం కూడా ఉండాలి, అల్లాహ్ను మనం ఇష్టపెట్టే కార్యాలు చేయాలి. వీటన్నింటి ద్వారా మనకి ప్రళయ దినాన అల్లాహ్ వద్ద గొప్ప గౌరవం లభిస్తుంది ప్రియులారా. ఇక చిట్టచివరిగా ఈ రోజుల్లో మనం మంచి ప్రవర్తన ప్రజల పట్ల కలిగి ఉందాం. ప్రజలకు ఈ కష్టకాలంలో ప్రజల యొక్క కష్ట నష్టాలలో వారితో మనం పాలుపంచుకోవాలి, వారికి సహాయపడాలి. ఎవరైతే ప్రజల కష్టాలు తీర్చటంలో వారికి తోడుగా ఉంటారో అలాంటి వారి కష్టాలను అల్లాహ్ త’ఆలా ప్రళయ దినాన వారి కష్టాలను అల్లాహ్ దూరము చేస్తాడు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ కేవలం అల్లాహ్ కోసం ఇతరులను ప్రేమించే సద్భాగ్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.
وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
—
హృదయ ఆచరణలు (12 భాగాలు) – షేఖ్ షరీఫ్ మదనీ [ఆడియో & టెక్స్ట్]
https://teluguislam.net/2023/09/03/actions-of-the-heart/
షేఖ్ షరీఫ్, మదీనా గ్రాడ్యుయేట్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0AKZXyDn6KYNFu5ok4ZFtb