‘కలిమా’లోని కోణాలన్నీ మీకు తెలిసి వుండాలి | ప్రతి ముస్లింకు ప్రాథమిక పాఠాలు 

అసలు ‘కలిమా‘ అంటే ఏమిటి? 

లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్రసూలుల్లాహ్” 

అనువాదం: అల్లాహ్ తప్ప వేరొక నిజ ఆరాధ్య దైవం లేడు. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క ప్రవక్త, సందేశహరులు”. 

– కలిమా అంటే ఇదే! 

మీ విశ్వాసానికి బలం ‘కలిమా’ భావం 

ఇస్లాంలో ప్రవేశించటానికి ఏకైక ద్వారం కలిమా. ‘కలిమా’ను ఎంతగా అర్థం చేసుకుంటే అంతగా విశ్వాసం బలపడుతుంది. తద్వారా ఇతరులకు కూడా ఇస్లాం గురించి చక్కగా బోధించటానికి వీలవుతుంది. 

ఇస్లాంలో ప్రవేశించటానికి బాప్తిజం (Baptism) అవసరం లేదు 

ఈ పాఠంలో చెప్పబడిన ప్రకారంగా కలిమా (సద్వచనం)ను మనసా, వాచా, కర్మణా పఠించిన వారెవరైనా ముస్లింలు అవుతారు. ముస్లిం కావటానికి మతపెద్దల ద్వారా బాప్తిజము పొందవలసిన అవసరం లేదు. మరే పూజలూ, ఆచారాలు ఇస్లాంలో ప్రవేశించటానికి అవసరం ఉండవు. 

సద్వచనం (కలిమా) సారాంశం 

విశ్వాసానికి (ఈమాన్ కు) మూలమైన “లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్రసూలుల్లాహ్” అనే కలిమాలో రెండు అంశాలున్నాయి. 

ఒకటి : లా ఇలాహ ఇల్లల్లాహ్
రెండవది: ముహమ్మదు రసూలుల్లాహ్

‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అంటే అల్లాహ్ తప్ప వేరొక నిజ ఆరాధ్య దైవం లేడని అర్థం. ఇందులో కూడా రెండు భావనలు ఇమిడి ఉన్నాయి. 

1) తిరస్కరణ (మనఃపూర్వకంగా నిరాకరించటం) 
2) ధృవీకరణ (మనసారా ఒప్పుకుంటూ పైకి గట్టిగా చెప్పటం) 

మొదటిది: 

దైవత్వం అనేది మహోన్నతుడైన అల్లాహ్ కు స్వంతం. కాబట్టి ఒక్కడైన అల్లాహ్ ను కాదని వేరెవరికయినా దైవత్వాన్ని ఆపాదించటాన్ని కలిమా (సద్వచనం)లోని ఈ భాగం ఖండిస్తుంది. ఉదాహరణకు: దైవదూతలు, ప్రవక్తలు, పుణ్యపురుషులు, వలీలు, స్వాములు, విగ్రహాలు, ప్రపంచ రాజ్యాధికారులు – వీరెవరూ దేవుళ్ళు కారు. కాబట్టి వీరిలో ఏ ఒక్కరూ ఆరాధనలకు, సృష్టి దాస్యానికి అర్హులు కారు. 

రెండవది : 

కలిమాలోని రెండవ భాగం ప్రకారం అల్లాహ్ మాత్రమే నిజ ఆరాధ్య దైవం. కనుక ఈ మొత్తం కలిమాను అంగీకరించిన వారు అల్లాహ్ యే నిజ ఆరాధ్య దైవమని నమ్మి నడుచుకోవాలి. తమ సమస్త ఆరాధనలను, ఉపాసనలను ఆయనకే ప్రత్యేకించుకోవాలి. దైవత్వంలో అల్లాహ్ కు భాగస్వామిగా వేరొకరిని నిలబెట్టకూడదు. అంటే అల్లాహ్ ఆరాధనతో పాటు ఇతరులను ఆరాధించకూడదు. 

ముహమ్మదుర్రుసూలుల్లాహ్ అంటే… 

“ఓ అల్లాహ్ ! ముహమ్మద్ (సఅసం) నీ సందేశహరుడు” అని నోటితో పలకటమేగాక హృదయపూర్వకంగా ఈ వాక్కును విశ్వసించటం. అంటే అల్లాహ్ ఆజ్ఞలను శిరసావహించిన మీదట, అంతిమ దైవప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చూపిన మార్గమే అనుసరణీయమని మీరు మాటిస్తు న్నారు. 

అల్లాహ్ స్వయంగా ఇలా సెలవిచ్చాడు- 

(ఓ ప్రవక్తా) వారికి చెప్పు: 

దివ్యఖుర్ఆన్లోని పై వాక్యాల ద్వారా బోధపడేదేమిటంటే ఇస్లాం ధర్మంలో అల్లాహ్ మరియు ఆయన అంతిమ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పినట్లుగా నడుచుకోవాలి. ఇతరత్రా వ్యక్తుల అభిప్రాయాలు అల్లాహ్ గ్రంథానికి (ఖుర్ఆను), దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విధానానికి, ఆయన సూచించిన చట్టాలకు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలకు, ఆరాధనా పద్ధతులకు, ప్రవచనాలకు (ఒక్క మాటలో చెప్పాలంటే ప్రవక్త సున్నతుకు) అనుగుణంగా ఉంటే స్వీకరిం చాలి. లేదంటే వాటిని త్రోసిపుచ్చాలి. 

‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ మన నుండి కోరేదేమిటి? 

1. జ్ఞానం: అల్లాహ్ యే సిసలైన ఆరాధ్యదైవమని మనం తెలుసుకోవాలి. మన ఆరాధనలు, ఉపాసనలు ఆయనకు మాత్రమే ప్రత్యేకించ బడాలి. అల్లాహ్ తప్ప వేరితర దేవుళ్ళంతా మిథ్య, అసత్యం, బూటకం. వారిలో ఏ ఒక్కరూ లాభంగానీ, నష్టంగానీ కలిగించ లేరన్న వాస్తవాన్ని గుర్తెరగాలి. 

2. దృఢ నమ్మకం: అల్లాహ్ ఒక్కడే నిజదైవమనీ, దైవత్వం ఆయనకే సొంతమని విశ్వసించటంలో ఎలాంటి సందేహానికి, సంకోచానికి, ఊగిసలాటకు తావు ఉండరాదు. 

3. సమ్మతి, అంగీకారం: ఈ ప్రకటనతో ముడిపడి ఉన్న నియమ నిబంధనలను, షరతులన్నింటినీ ఒప్పుకోవాలి. 

4. సమర్పణ : అల్లాహ్ యే ప్రభువు, పోషకుడనీ, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ తరఫున మానవ మార్గదర్శకత్వం నిమిత్తం పంపబడిన ఆఖరి ప్రవక్త అనే విషయానికి కట్టుబడి ఉంటానని మాట ఇవ్వాలి. ఆ మాటను కడదాకా నిలబెట్టుకోవాలి. దానిపట్ల ఆత్మసమర్పణా భావంతో మసలుకోవాలి. 

5. నిజాయితి: కలిమా కోరే అంశాలను మనస్ఫూర్తిగా, నిజాయితీగా నెరవేర్చాలి. 

6. చిత్తశుద్ధి : అల్లాహ్ ను ఆరాధించే విషయంలో ఎలాంటి కల్మషం, కపటత్వం ఉండకూడదు. నిష్కల్మషమైన మనసుతో ధర్మాన్ని అల్లాహ్ ప్రత్యేకించుకుని మరీ ఆరాధించాలి. అన్ని రకాల ఆరాధనలను కేవలం అల్లాహు మాత్రమే అంకితం చేయాలి. 

7. ప్రేమ: మహోన్నతుడైన అల్లాహు ను, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను, వారికి విధేయులై ఉండే సాటి సోదరులందరినీ, అనగా ముస్లింలందరినీ హృదయపూర్వకంగా ప్రేమించాలి. 

మొత్తమ్మీద అర్థమయ్యేదేమిటంటే అల్లాహ్ కు ఆజ్ఞాబద్ధులై నడుచు కోవాలి. ఆయనకు విధేయత చూపాలి. ఆయన చేయమన్న దానిని చేయాలి. చేయకూడదన్న దానికి దూరంగా ఉండాలి. అప్పుడే మన మనస్సుల్లో విశ్వాస (ఈమాన్) బీజం నాటుకుంటుంది. అల్లాహ్ కు విధేయత చూపటమంటే ఆయన్ని ప్రేమించటం, ఆయన విధించే శిక్షలకు భయపడటం, ఆయన ప్రతిఫలం ఇస్తాడని ఆశపడటం, క్షమాపణకై ఆయన్ని వేడుకోవటం, మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశాలను, ఆదేశాలను ఖచ్చితంగా అనుసరించటం. 

అల్లాహ్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు షరీఅతును (ఇస్లామీయ చట్టాలను, ధార్మిక నియమావళిని) ఇచ్చి పంపాడు. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) షరీఅతు రాకతో గతకాలపు చట్టాలు, ధార్మిక నిబంధనలు అన్నీ రద్దయిపోయాయి. ఇప్పుడు ఈ షరీఅతు అన్ని విధాలుగా గత షరీఅతులన్నిటి కంటే సమున్నతంగా, సంపూర్ణంగా ఉంది. 

ప్రతి ముస్లింకు ప్రాథమిక పాఠాలు [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]
సంకలనం : అబ్దుల్ అజీజ్ సాలెహ్ అష్ షౌమార్,సౌదీఅరేబియా. ఈ పుస్తకం షేఖ్ ఇబ్నె బాజ్ (రహిమహుల్లాహ్) గారి మూలరచన “అద్దురూసుల్ ముహిమ్మ లిఆమ్మతిల్ ఉమ్మహ్” యొక్క వ్యాఖ్యానంతో కూడుకున్న పుస్తక సంకలనం

ఇస్లాంలో కలిమాలు ఎన్ని? అవి ఇంట్లో గోడకి అంటిచవచ్చా? [వీడియో]

బిస్మిల్లాహ్

[4:05 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[విశ్వాసము] మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/belief-iman-telugu-islam/