మాకు ‘కట్నం’ వద్దు కానీ ‘జాహేజ్’ (కానుకలు) ఇవ్వండి అని అంటున్నారు పెళ్ళికొడుకు వాళ్ళు, ఇది సబబేనా? [వీడియో]

బిస్మిల్లాహ్

[4 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

సంతానానికి హిబా చేస్తున్నప్పుడు (giving gifts) వివక్ష చూపకూడదు

1049. హజ్రత్ ఆమిర్ (రహ్మతుల్లా అలై) కధనం :-

హజ్రత్ నూమాన్ బిన్ బషీర్ (రధి అల్లాహు అన్హు) వేదిక ఎక్కి ఇలా అనడం నేను విన్నాను – “మా నాన్నగారు నాకొక కానుక ఇచ్చారు. అయితే (నా తల్లి) హజ్రత్ ఉమ్రా బిన్తె రావాహ (రధి అల్లాహు అన్హ) దీనిపై తన అభిప్రాయం వెలిబుచ్చుతూ “మీరీ కానుక ఇవ్వడం పై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ని సాక్షిగా నిలబెట్టనంతవరకు నేను సంతోషించలేను” అని అన్నారు. అందువల్ల మా నాన్నగారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్లి “ధైవప్రవక్తా! నేను ఉమ్రా బిన్తె రావాహా (రధి అల్లాహు అన్హ) కడుపున పుట్టిన నా కొడుక్కు ఒక కానుక ఇస్తే దానికి మిమ్మల్ని సాక్షిగా నిలబెట్టాలని అన్నది ఆమె” అని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాట విని “మరి నీవు నీ కొడుకులందరికీ ఇలాగే కానుకలిచ్చావా?” అని అడిగారు. దానికి మా నాన్న లేదన్నారు. అప్పుడు దైవప్రవక్త “దేవునికి భయపడి, నీ కొడుకుల మధ్య న్యాయాన్ని పాటించు” అని బోధించారు. దాంతో మా నాన్నగారు (ఇంటికి) తిరిగొచ్చి తానిచ్చిన కానుకను నా దగ్గరనుండి వాపసు తీసుకున్నారు”.

[సహీహ్ బుఖారీ : 51 వ ప్రకరణం – హిబా, 13 వ అధ్యాయం – లా షహాద ఫిల్ హిబా]

హిబా (స్వయం సమర్పణ) ప్రకరణం : 3 వ అధ్యాయం – సంతానానికి హిబా చేస్తున్నప్పుడు (giving gifts) వివక్ష చూపకూడదు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ప్రభుత్వోద్యోగులు పారితోషికాలు, కానుకలు స్వీకరించడం నిషిద్ధం

1202. హజ్రత్ అబూ హమీద్ సాయిదీ (రధి అల్లాహు అన్హు) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జకాత్, సదఖాలు (రెవెన్యూ) వసూలు చేయడానికి ఒక వ్యక్తిని (తహసీల్ దారుగా) నియమించారు. అతను తన కప్పగించబడిన పని పూర్తి చేసుకొని తిరిగొచ్చి “ధైవప్రవక్తా! ఈ ధనం మీది, ఇది నాకు పారితోషికంగా లభించింది” అని అన్నాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాటలు విని “నీవు నీ తల్లిదండ్రుల ఇంట్లోనే ఎందుకు కూర్చోలేదు? అప్పుడు నీకెవరైనా పారితోషికం తెచ్చిస్తారో లేదో తెలుస్తుంది కదా!” అని అన్నారు.

ఆ తరువాత ఆయన ఇషా నమాజ్ చేసి (ఉపన్యాసమివ్వడానికి) నిలబడ్డారు. ముందుగా ఆయన షహాదత్ కలిమా (సత్యసాక్ష వచనం) పఠించి ధైవస్తోత్రం చేశారు. దానికి దేవుడే యోగ్యుడు. ఆ తరువాత ఆయన ఇలా అన్నారు : “ఈ కార్యనిర్వహకులకు ఏమయింది? మేమొక వ్యక్తిని కార్య నిర్వాహకునిగా (అంటే రెవెన్యూ వసూలు చేసే ఉద్యోగిగా) నియమించి పంపితే అతను తిరిగొచ్చి ‘ఇది నన్ను వసూలు చేయడానికి పంపిన ధనం, ఇది నాకు పారితోషికంగా లభించిన ధనం’ అని అంటున్నాడు. అతను తన తల్లిదండ్రుల ఇంట్లోనే ఎందుకు కూర్చోలేదు. అప్పుడు తెలుస్తుందిగా అతనికి పారితోషికం ఎవరు తెచ్చిస్తారో! ఎవరి అధీనంలో ముహమ్మద్ ప్రాణం ఉందో ఆ శక్తిమంతుని సాక్షి! ఈ (ప్రభుత్వ) రాబడిలో ఎవరు నమ్మకద్రోహానికి పాల్పడతాడో ప్రళయదినాన దొంగిలించబడిన ఆ ధనం అతని మెడ మీద పెనుభారంగా పరిణమిస్తుంది. అతను ఒంటెను దొంగిలించి ఉంటే ఆ ఒంటె అతని మెడ మీద ఎక్కి అరుస్తూ అతనికి దుర్భరంగా మారవచ్చు. ఒకవేళ అతను ఆవును దొంగిలించి ఉంటే ఆ ఆవు అతని మెడ మీద అంబా అంటూ ఉండవచ్చు, మేకయితే ‘మేమే’ అంటూ ఉండవచ్చు. గుర్తుంచుకోండి! నేను అల్లాహ్ ఆజ్ఞలన్నీ మీకు అందజేశాను (నా బాధ్యత తీరిపోయింది, ఇక ఎవరి కర్మలకు వారే బాధ్యులు)”.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచిస్తూ తమ హస్తాన్ని బాగా పైకెత్తారు. అప్పుడు మాకు ఆయన చంకలోని తెలుపుదనం కన్పించింది”. (*)

[సహీహ్ బుఖారీ : 83 వ ప్రకరణం – అల్ ఐమాన్ వన్నుజూర్, 3 వ అధ్యాయం – కైఫా కాన యమీనున్నబియ్యి (సల్లల్లాహు అలైహి వసల్లం) ]

(*) ఈ హదీసుని బట్టి ప్రభుత్వ ఉద్యోగులు (ప్రజల నుండి) కానుకలు, పారితోషికాలు స్వీకరించకూడదని, అది ప్రభుత్వ ధనం లేక విజయప్రాప్తి నుండి దొంగిలించి నమ్మకద్రోహానికి పాల్పడినట్లవుతుందని తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగి కానుకలు (లంచం) స్వీకరించడమంటే తన హొదా, అధికారాల ద్వారా అక్రమ ప్రయోజనాలను పొందడమే; తన భాధ్యతలను దుర్వినియోగం చేయడమే. అందువల్లనే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విజయప్రాప్తిని కాజేసే వ్యక్తికి ప్రళయదినాన ఏ శిక్ష పడుతుందో, కానుక (లంచం) తీసుకునే ప్రభుత్వ ఉద్యోగికి కూడా అదే శిక్ష పడుతుందని హెచ్చరించారు.

పదవుల ప్రకరణం : 7 వ అధ్యాయం – ప్రభుత్వోద్యోగులు పారితోషికాలు, కానుకలు స్వీకరించడం నిషిద్ధం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్