దైవ దూతల పట్ల విశ్వాసం
ముహమ్మద్ సలీమ్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/MiDl95p280k [15 నిముషాలు]
ఈ ప్రసంగంలో, ఇస్లామీయ విశ్వాస మూలస్తంభాలలో రెండవది అయిన దైవదూతల పట్ల విశ్వాసం గురించి వివరించబడింది. దైవదూతలు ఎవరనేది, వారి లక్షణాలు, వారి పుట్టుక, వారి సంఖ్య, మరియు వారి శక్తి సామర్థ్యాల గురించి చర్చించబడింది. దైవదూతలు కాంతితో సృష్టించబడినవారని, వారు పాపాలు చేయరని, ఎల్లప్పుడూ అల్లాహ్‌ను ఆరాధిస్తారని చెప్పబడింది. వారి సంఖ్య అపారమని, ప్రతిరోజు 70,000 మంది దైవదూతలు ‘బైతే మామూర్’లో ఆరాధన చేస్తారని హదీసు ద్వారా వివరించబడింది. చివరగా, జిబ్రీల్, మీకాయీల్, ఇస్రాఫీల్, మలకుల్ మౌత్ వంటి కొంతమంది ముఖ్యమైన దైవదూతల పేర్లు, వారి బాధ్యతల గురించి కూడా తెలియజేయబడింది.
అల్ హమ్దులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్. అన్ని రకాల ప్రశంసలు, పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.
సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ
[అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలలోని రెండవ ముఖ్యాంశం, దైవదూతల పట్ల విశ్వాసం గురించి ఇన్ షా అల్లాహ్ ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం.
ఇంతకు ముందు కూడా మనము హదీసు విని ఉన్నాం, జిబ్రీల్ అలైహిస్సలాం, దైవదూత, మానవ రూపంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్తా, ఈమాన్ అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏమిటి?” అని ప్రశ్నించినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈమాన్ గురించి, విశ్వాసం గురించి తెలియజేస్తూ, “అల్లాహ్‌ను విశ్వసించటం, దైవదూతలను విశ్వసించటం, దైవ గ్రంథాలను విశ్వసించటం, దైవ ప్రవక్తలను విశ్వసించటం, పరలోక దినాన్ని విశ్వసించటం, మంచి-చెడు విధివ్రాతను విశ్వసించటం,” ఈ ఆరు విషయాలను విశ్వసించటాన్ని ఈమాన్, విశ్వాసం అంటారు అని సమాధానం ఇచ్చినప్పుడు, దైవదూత, “మీరు చెప్పింది నిజమే” అని ధ్రువీకరించారు.
అయితే, ప్రవక్త వారు తెలియజేసిన ఆరు విషయాలలో నుంచి రెండవ విషయం దైవదూతల పట్ల విశ్వాసం గురించి ఇన్ షా అల్లాహ్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.
దైవదూతలు ఎవరు? దైవదూతల లక్షణాలు ఏమిటి? దైవదూతల పుట్టుక ఎలా జరిగింది? దైవదూతల సంఖ్య ఎంత? దైవదూతల శక్తి సామర్థ్యాలు ఏమిటి? కొంతమంది దైవదూతల పేర్లు మరియు బాధ్యతలు, ఇవన్నీ విషయాలు ఇన్ షా అల్లాహ్ ఈ ప్రసంగంలో మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.
దైవదూతలు ఎవరు?
ముందుగా, దైవదూతలు ఎవరు అనేది తెలుసుకుందాం. దైవదూతలు అల్లాహ్ సృష్టించిన ఒక ప్రాణి. మానవులు అల్లాహ్ సృష్టించిన ఒక ప్రాణి, జంతువులు అల్లాహ్ సృష్టించిన ఒక ప్రాణి, పక్షులు ఒక ప్రాణి, జలచరాలు ఒక ప్రాణి. అలాగే, దైవదూతలు కూడా అల్లాహ్ సృష్టించిన ఒక ప్రాణి. దైవదూతలు మానవుల కంటికి కనిపించరు. అయితే, దైవదూతలు ఉన్నారు అనేది వాస్తవము కాబట్టి, ఆ వాస్తవాన్ని మనము నమ్మాలి, విశ్వసించాలి.
దైవదూతల లక్షణాలు
దైవదూతల లక్షణాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దైవదూతలు పుణ్యాత్ములు, ఎల్లప్పుడూ అల్లాహ్‌ను స్మరిస్తూ, ఆరాధిస్తూ ఉంటారు. అల్లాహ్ ఆదేశాలను అతిక్రమించటం, పాపాలకు పాల్పడటం దైవదూతలకు రాదు. ఖురాన్ గ్రంథం, ఆరవ అధ్యాయం 66వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశారు:
لَّا يَعْصُونَ ٱللَّهَ مَآ أَمَرَهُمْ وَيَفْعَلُونَ مَا يُؤْمَرُونَ
[లా య’సూనల్లాహ మా అమరహుమ్ వ యఫ్’అలూన మా యు’మరూన్]
అల్లాహ్ ఆజ్ఞలను పాలించటంలో వారు ఏ మాత్రం అలక్ష్యం చేయరు. పైగా వారికి జారీ చేయబడిన ఆజ్ఞలను వారు ఖచ్చితంగా పాటిస్తారు, పాలిస్తారు.
చూశారా? అల్లాహ్ వారికి ఇచ్చిన బాధ్యత వారు ఖచ్చితంగా నెరవేరుస్తారు. అల్లాహ్ ఆజ్ఞలను అతిక్రమించటం వారికి రాదు. పాపాలు చేయటం, అల్లాహ్ ఆజ్ఞలను ఉల్లంఘించటం వారికి రానే రాదు.
దైవదూతలకు మానవుల లాంటి లక్షణాలు ఉండవు. ఉదాహరణకు, కామం, ఆకలి, దప్పిక, అలసట, నిద్ర మొదలైన అవసరాలు దైవదూతలకు ఉండవు. ఇవన్నీ మానవులకు ఉంటాయి, కానీ దైవదూతలకు అలాంటి అవసరాలు, లక్షణాలు లేవు అని తెలుపబడింది.
దైవదూతల పుట్టుక
మరి దైవదూతల పుట్టుక ఎలా జరిగింది అని మనం చూచినట్లయితే, దైవదూతలను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కాంతితో సృష్టించాడు. మానవులను దేనితో సృష్టించాడు? మట్టితో మానవులను సృష్టించాడు. ఇది మనం తెలుసుకొని ఉన్నాం ముందు ప్రసంగాలలో. దైవదూతలను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కాంతితో పుట్టించాడు, నూర్, కాంతితో పుట్టించాడు. మనం చూచినట్లయితే, ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:
خُلِقَتِ الْمَلَائِكَةُ مِنْ نُورٍ
[ఖులిఖతిల్ మలాయికతు మిన్ నూర్]
దైవదూతలు నూర్ అనగా కాంతితో పుట్టించబడ్డారు, సృష్టించబడ్డారు.
దైవదూతలలో ఆడ-మగ అనే లింగభేదము లేదు. కావున, దైవదూతల మధ్య వివాహాలు జరగవు. వివాహాలు జరగవు కాబట్టి, వారిలో వంశపరంపర కూడా లేదు. ఇది దైవదూతల గురించి మనం తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం.
దైవదూతల సంఖ్య
ఇక, దైవదూతల సంఖ్య ఎంత ఉంది? మానవులను ఫలానా దేశంలో ఇంతమంది ఉన్నారు, ఫలానా దేశంలో అంతమంది జనాభా ఉన్నారు మానవులు అని లెక్కింపు అనేది మనం చూస్తూ ఉంటాం. మరి, దైవదూతల లెక్కింపు ఎవరైనా చేశారా? దైవదూతలు ఎంతమంది ఉన్నారు? అంటే, మనం చూచినట్లయితే, దైవదూతల సంఖ్య చాలా ఎక్కువ. అది ఎలాగంటే, ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక రెండు హదీసులు మీ ముందర నేను ఉంచుతున్నాను చూడండి.
మేరాజ్ యాత్రలో భాగంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆకాశాల పైకి వెళ్ళినప్పుడు, అక్కడ ఆకాశాల పైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ‘బైతే మామూర్’ ఒక పుణ్యక్షేత్రము ఆకాశాల పైన ఉంది, అది చూపించడం జరిగింది. జిబ్రీల్ అలైహిస్సలాం దైవదూత, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడుతూ, “ఓ దైవ ప్రవక్తా, ఈ బైతే మామూర్‌లో ప్రతి రోజూ 70,000 మంది దైవదూతలు ఆరాధనలో పాల్గొంటారు. ఒక్కసారి ఆ బైతే మామూర్ పుణ్యక్షేత్రంలో ఆరాధన ముగించుకొని ఆ 70,000 మంది దైవదూతలు బయటికి వచ్చేస్తే, మళ్ళీ వారికి అక్కడ వెళ్లి ఆరాధన చేసుకోవడానికి వంతు రాదు. అంటే ప్రళయం వచ్చేస్తుంది గానీ, ఒక్కసారి అక్కడ ఆరాధన పూర్తి చేసుకున్న తర్వాత, ఆ దైవదూతలకు మరొకసారి అక్కడ అవకాశం దొరకదు, వారి వంతు రాదు,” అన్నారు. ఆ ప్రకారంగా ఎంతమంది దైవదూతలు ఉన్నారో మనము ఇట్టే ఆలోచించవచ్చు.
మరొక ఉల్లేఖనంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:
مَا فِيهَا مَوْضِعُ أَرْبَعِ أَصَابِعَ إِلَّا وَمَلَكٌ قَائِمٌ أَوْ رَاكِعٌ أَوْ سَاجِدٌ
[మా ఫీహా మౌదివు అర్‌బయి అసాబిఇన్ ఇల్లా వ మలకున్ ఖాయిమున్ అవ్ రాకివున్ అవ్ సాజిదున్]
దీని అర్థం ఏమిటంటే, ఆకాశం దైవదూతలతో నిండి కిటకిటలాడుతున్నది. ప్రతి నాలుగు వ్రేళ్లంతటి స్థానంలో ఒక దైవదూత ఖియాంలో, రుకూలో, సజ్దాలో నిమగ్నమై ఉన్నాడు.
అంటే, ప్రతి బెత్తెడు, నాలుగు వేళ్ళంతటి స్థానంలో ఒక్కొక్క దూత నిలబడి ఉన్నాడు ఆకాశం మీద అంటే, ఆకాశం ఎంత పెద్దది? అంత పెద్ద ఆకాశంలో ప్రతి నాలుగు వేళ్ళంతటి స్థానంలో ఒక దైవదూత నిలబడి ఉన్నారంటే, మరి వారి సంఖ్య ఎంత? మనం లెక్క చేయలేము. ఆకాశంలో ఉన్న నక్షత్రాలను మనం లెక్క చేయలేము. నక్షత్రాల కంటే బహుశా దైవదూతలు ఎక్కువ ఉన్నారేమో. కాబట్టి, దైవదూతల సరైన లెక్కింపు ఎవరికీ తెలియజేయబడలేదు. వారి లెక్కింపు అల్లాహ్‌కు మాత్రమే తెలుసు. ఈ విషయం కూడా మనము గట్టిగా విశ్వసించాలి, నమ్మాలి.
దైవదూతల శక్తి సామర్థ్యాలు
ఇక, దైవదూతల శక్తి సామర్థ్యాల గురించి మనము చూచినట్లయితే, దైవదూతలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గొప్ప గొప్ప శక్తులు ప్రసాదించాడు. దైవదూతలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రెక్కలు ఇచ్చాడు. కొంతమంది దైవదూతలకు రెండు రెక్కలు ఉంటాయి, మరికొంత మందికి నాలుగు, ఆ తర్వాత అలాగే ఎంత పెద్ద దైవదూత ఉంటే అన్ని ఎక్కువ రెక్కలు వారికి ఉంటాయి అని తెలుపబడింది. మనం చూచినట్లయితే, ఖురాన్ గ్రంథం 35వ అధ్యాయం, ఒకటవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:
جَاعِلِ ٱلْمَلَٰٓئِكَةِ رُسُلًا أُو۟لِىٓ أَجْنِحَةٍ مَّثْنَىٰ وَثُلَٰثَ وَرُبَٰعَ ۚ يَزِيدُ فِى ٱلْخَلْقِ مَا يَشَآءُ
[జాయిలిల్ మలాయికతి రుసులన్ ఉలీ అజ్నిహతిమ్ మస్నా వ సులాస వ రుబాఅ. యజీదు ఫిల్ ఖల్కి మా యషా]
ఆయన రెండేసి, మూడేసి, నాలుగేసి రెక్కలు గల దూతలను తన సందేశ వాహకులుగా చేసుకుంటాడు. సృష్టిలో తాను కోరిన దాన్ని పెంచుతాడు.
అంటే దైవదూతలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రెక్కలు ఇచ్చాడు. వారి రెక్కలు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పెంచుతూ పోయాడు అన్న విషయము ఇక్కడ తెలుపబడింది. మనము బుఖారీ, ముస్లింలో ఉన్న ఉల్లేఖనాన్ని చూసినట్లయితే, అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “మేరాజ్ యాత్రలో భాగంగా నేను ఆకాశాల పైకి వెళ్ళినప్పుడు, అక్కడ జిబ్రీల్ అలైహిస్సలాం వారిని ఆకాశాల మీద వారి నిజ స్వరూపంలో నేను ఆయనను చూశాను.” జిబ్రీల్ అలైహిస్సలాం వారిని ప్రవక్త వారు ఆకాశాల మీద వారి నిజ స్వరూపంలో చూశారు. నిజ స్వరూపంలో చూసినప్పుడు వారు ఎలా ఉన్నారంటే, జిబ్రీల్ అలైహిస్సలాం వారికి ఆరు వందల రెక్కలు ఉన్నాయి. అల్లాహు అక్బర్! ఆరు వందల రెక్కలు ఆయన ఒక్కరికే ఉన్నాయంటే, ఆయన ఎంత గొప్ప, పెద్ద దైవదూతనో మనము అర్థం చేసుకోవచ్చు.
అలాగే, దైవదూతలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రూపాలు ధరించే శక్తి కూడా ఇచ్చి ఉన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు జిబ్రీల్ అలైహిస్సలాం వారు మానవ రూపము ధరించి వచ్చి దైవ వాక్యాలు వినిపించి వెళ్ళేవారు. కొన్ని సందర్భాలలో ఆయన మానవ రూపంలో వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు శిష్యులు, సహాబాలు కూడా జిబ్రీల్ అలైహిస్సలాం వారిని మానవ రూపంలో చూశారు. అలాంటి ఉదాహరణలు మనము ప్రసంగాలలో విని ఉన్నాం.
అలాగే, దైవదూతలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వేగంగా కదిలే, ప్రయాణించే శక్తి ఇచ్చాడు. దైవదూతలు భూమి ఆకాశాల మధ్య రాకపోకలు జరుపుతూ ఉంటారు. భూమి ఆకాశాల మధ్య ఎంతో, భూమి ఆకాశాల మధ్య ఎంతో దూరము ఉంది. అంత దూరాన్ని వారు క్షణాలలో ఛేదించేస్తూ ఉంటారు. వారు అంత స్పీడుగా, వేగంగా వస్తూ వెళుతూ ఉంటారు. అంత వేగంగా కదిలే శక్తి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దూతలకు ఇచ్చి ఉన్నాడు. ఇవి దైవదూతల యొక్క లక్షణాలు, దైవదూతల యొక్క శక్తి సామర్థ్యాలు.
కొంతమంది దైవదూతల పేర్లు మరియు బాధ్యతలు
ఇక, కొంతమంది దైవదూతల పేర్లు మరియు వారి బాధ్యతల ప్రస్తావన కూడా గ్రంథాలలో వచ్చి ఉంది. అవి తెలుసుకొని ఇన్ షా అల్లాహ్ మాటను ముగిద్దాం.
దైవదూతలలో జిబ్రీల్ అలైహిస్సలాం వారు దైవదూతలందరిలో గొప్పవారు మరియు దైవదూతలందరికీ ఆయన నాయకుడు అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు. మరి జిబ్రీల్ అలైహిస్సలాం వారి యొక్క బాధ్యత ఏమిటంటే, అల్లాహ్ వద్ద నుండి వాక్యాలు తీసుకొని వచ్చి దైవ ప్రవక్తలకు దైవ వాక్యాలు వినిపించి వెళ్ళేవారు. అలాగే, ఇతర బాధ్యతలు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ఇచ్చినప్పుడు, ఆ బాధ్యతలు కూడా ఆయన నెరవేర్చేవారు. ముఖ్యంగా, దైవ వాక్యాలు అల్లాహ్ నుండి తీసుకొని వచ్చి దైవ ప్రవక్తలకు వినిపించటము ఆయన నిర్వహించిన గొప్ప బాధ్యత.
మీకాయీల్ అలైహిస్సలాం అనే ఒక దైవదూత. మీకాయీల్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వర్షం కురిపించే బాధ్యత ఇచ్చాడు. మీకాయీల్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ ఎక్కడ, ఎంత వర్షం కురిపించమని ఆదేశిస్తాడో, ఆయన ఆ ప్రదేశంలో అంత వర్షం కురిపిస్తూ ఉంటారు.
ఇస్రాఫీల్ అలైహిస్సలాం అని ఒక దైవదూత ఉన్నారు. ఆయన ప్రళయ దినాన అల్లాహ్ ఆదేశంతో శంఖంలో ఊదుతారు. ఆ శంఖం ఊదబడిన తర్వాత ప్రళయం సంభవిస్తుంది.
మలకుల్ మౌత్ అనే ఒక దైవదూత ఉన్నారు. మలకుల్ మౌత్ దైవదూత ప్రాణాలు హరిస్తూ ఉంటారు.
‘ముఅఖ్ఖిబాత్’ అని దైవదూతలు ఉన్నారు. వారు మానవుల రక్షణ కొరకు నియమించబడి ఉన్నారు. మానవులు నిద్రపోతున్నప్పుడు, నిద్ర లేచి నడుస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, స్థానికంగా ఉంటున్నప్పుడు, ఎల్లవేళలా ఆ దైవదూతలు వారి రక్షణలలో, రక్షణలో నియమించబడి ఉన్నారు. అలాంటి దైవదూతలను ‘ముఅఖ్ఖిబాత్’ అంటారు.
అలాగే, ‘ఖజనతుల్ జన్నహ్’, స్వర్గంలో కొంతమంది దైవదూతలు ఉన్నారు. వారికి ‘ఖజనతుల్ జన్నహ్’ అంటారు. స్వర్గవాసులు ఎప్పుడైతే స్వర్గంలోకి ప్రవేశిస్తారో, ఆ ‘ఖజనతుల్ జన్నహ్’ అనే దైవదూతలు స్వర్గవాసులని స్వర్గంలో వచ్చేటప్పుడు సాదరంగా ఆహ్వానిస్తారు.
అలాగే, ‘ఖజనతున్ నార్’ అని కొంతమంది దైవదూతలు ఉన్నారు. వారు నరకంలో నియమించబడి ఉన్నారు. నరకవాసులు నరకంలో వెళ్ళిపోయిన తర్వాత, ఆ బాధలు భరించక, ఆ నరకంలో ఉన్న దూతలను, “మాకు చావు ఇచ్చేయమని అల్లాహ్‌తో కోరమని” వేడుకుంటారు. ఆ ప్రకారంగా ‘ఖజనతున్ నార్’ అనే కొంతమంది దైవదూతలు నరకంలో నియమించబడి ఉన్నారు.
అలాగే, ‘సయ్యాహీన్’ అని కొంతమంది దైవదూతలు ఉన్నారు. వారు భూమండలం మొత్తము తిరుగుతూ ఉంటారు, సంచరిస్తూ ఉంటారు. ప్రజలు ఎవరైనా, ఎక్కడైనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దైవ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూద్ పఠిస్తూ ఉంటే గనక, ఆ దరూద్ వారు సేకరించి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వెళ్ళి వినిపిస్తారు.
అలాగే, ‘కిరామన్ కాతిబీన్’ అని దైవదూతలు ఉన్నారు. వారు మానవులు చేసే కర్మలన్నీ లిఖిస్తూ ఉంటారు. మంచి కార్యము, చెడు కార్యము, వారు చేసే పని, వారు మాట్లాడే ప్రతి మాట, వారు నమోదు చేస్తూ ఉంటారు. వారిని ‘కిరామన్ కాతిబీన్’ దైవదూతలు అంటారు.
ఇవి దైవదూతల గురించి మనము తెలుసుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలు. నేను అల్లాహ్‌తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనమందరికీ సంపూర్ణ విశ్వాసులుగా, ధర్మం మీద స్థిరంగా నడుచుకునే భాగ్యం ప్రసాదించుగాక, ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=30622
దేవదూతలు (ملائِكة) – మెయిన్ పేజీ
https://teluguislam.net/angels/