సంతాన శిక్షణ – పార్ట్ 02 [వీడియో]

బిస్మిల్లాహ్

[1:09:20 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
పుస్తకం : సంతాన శిక్షణకై తల్లిదండ్రులకు మార్గదర్శి

4. ఆవేదన వెలిబుచ్చే అవకాశమిచ్చుట

ఓ రోజు ఏ కొడుకైనా తన తండ్రి వద్దకు వచ్చి “మత్తు సేవించుటకు, డ్రగ్స్ ఉపయోగించుటకు లేదా వ్యభిచారం చేయుటకు -అల్లాహ్ మనందరిని వీటి నుండి కాపాడుగాక!- నాకు అనుమతివ్వండి అని తండ్రిని అడుగుతే, సమాధానం ఏముంటుందని భావిస్తారు? సామాన్యంగా ఇలాంటి దురాలోచనగల కొడుకులు స్పష్టంగా ఎన్నడూ తమ తండ్రులతో సలహా తీసుకోరు, తమ స్నేహితుల వైపే మరలుతారు వారు వారి అల్ప అనుభవం, తక్కువ జ్ఞానం వల్ల చెడుకే సహాయపడతారు. కాని ఇలాంటి ప్రశ్న ఎదురైన చోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వేరే పద్ధతి అనుసరించారు. అబూ ఉమామ రజియల్లాహు అన్హు ఉల్లేఖనాన్ని ఇమాం అహ్మద్ రహిమహుల్లాహ్ తెలిపారుః ఒక యువకుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ప్రవక్తా! నాకు వ్యభిచరించే అనుమతివ్వండి అని అడిగాడు. దానికి అక్కడున్న ప్రజలు అతడ్ని గద్దించి చీవాట్లు పెట్టారు. కాని ప్రవక్త అన్నారుః అతడ్ని నా దగ్గరికి తీసుకురండి. అతడు దగ్గరికి వచ్చాక, కూర్చోమన్నారు. అతడు కూర్చున్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారుః “నీవడిగిన విషయం నీ తల్లితో జరిగితే నీవు ఇష్టపడతావా?” లేదు, అల్లాహ్ సాక్షిగా! నేను మీ కొరకు అర్పితులయ్యే భాగ్యం అల్లాహ్ నాకు ప్రసాదించు గాక! అని అతడన్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ప్రజలు కూడా తమ తల్లులతో ఈ వ్యవహారం ఇష్టపడరు” అని చెప్పి “నీ చెల్లి, నీ కూతురు, నీ మేనత్త, నీ పినతల్లులతో ఈ వ్యవహారం ఇష్టపడతావా” అని అడిగారు. ఆ యువకుడు అదే సమాధానం పలికాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ (శుభ) హస్తం అతని మీద పెట్టి ఇలా దుఆ ఇచ్చారుః

اللَّهُمَّ اغْفِرْ ذَنْبَهُ وَطَهِّرْ قَلْبَهُ وَحَصِّنْ فَرْجَهُ

అల్లాహ్! ఇతని పాపాల్ని మన్నించు. ఇతని హృదయాన్ని శుద్ధ పరచు. ఇతని మర్మాన్ని (మానాన్ని) కాపాడు“.

ఇక్కడ గమనించండి, ప్రవక్త యువకుని ఆలోచన విధానాన్ని ఎలా మల్లించారో, అతను ఆలోచించలేని కోణాలను ఎలా స్పష్ట పరిచారో. మాట్లాడి, తన ఆవేదన వెళిబుచ్చే స్వేఛ్ఛ ప్రవక్త ఇస్తారన్న నమ్మకం అతనికి ఉన్నందుకే సృష్టిలో అతి పరిశుద్ధులైన వారితోనే ఈ ప్రశ్న అడుగుటకు ధైర్యం చేశాడు.

దీనికి భిన్నంగా ఒక తండ్రి నవయువకుడైన తన 16 సం. కొడుకును ఇంటి నుండి తరిమి వేశాడు. దీనికి కారణం: ఇంటికి ఆలస్యంగా ఎందుకు వచ్చావని ఒకసారి తన తండ్రి అడిగిన ప్రశ్నకు ‘నేను స్వతంతృడిని’ అన్న ఒక్క పదం పలికే ధైర్యం అతడు చేశాడు. తండ్రి ఇంటి నుండి గెంటివేసినందుకు తన బంధువుల వద్దకు వెళ్ళి కొద్ది రోజులు గడిపాడు. ఆ తర్వాత తండ్రి కొడుకుల మధ్య సంధి కుదిరింది. అయితే తండ్రి కొడుకుల మధ్య స్పష్టమైన సంభాషణపై నిలబడే ప్రేమపూర్వకమైన సంబంధం చెడిపోయిన తర్వాత. ఓ రకంగా కొడుకు తప్పు చేశాడు. కాని తండ్రి తప్పు దానికంటే పెద్దది.

ఈ రోజుల్లో సంతానంతో సంభాషించే, మాట్లాడే మరియు వారి ఆవేదనలు, అవసరాలను (ప్రేమపూర్వకంగా) వినే అవసరం చాలా ఉంది. కాని అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతి ప్రకారం, దాని ఓ కోణాన్ని పైన తెలుపడం జరిగింది. ఫిర్ఔన్ పద్ధతి ప్రకారం కాదు. వాడన్నాడుః ]నాకు సముచితంగా తోచిన సలహానే మీకు ఇస్తున్నాను. సక్రమమైన మార్గం వైపునకే నేను మిమ్మల్ని నడుపుతున్నాను[. (మోమిన్ 40: 29). ఈ పద్ధతి ద్వారా పిల్లలపై ఒత్తిడి వేస్తే వారు దాన్ని ఒప్పుకోరు.

5. సమంజసమైన మందలింపు

మందలింపు విషయంలో ప్రజలు హెచ్చుతగ్గులకు గురయ్యే వారితో పాటు మధ్యరకమైన వారు కొందరున్నారు. కొందరు అతిగా ప్రేమించి వారిని ఏ మాత్రం మందలించరు. ఇది ఓ రకమైన నిర్లక్ష్యం. ఇది సవ్యమైన విధానం కాదు. ఇంకొందరు ప్రతీ చిన్న పెద్ద దానిపై గట్టిగా మందలిస్తారు. ఇది కూడా మెచ్చదగినది విధానం కాదు. మధ్యరకమైన విధానమే ప్రవక్త విధానం.

నవయువకుల తప్పిదాలపై ప్రవక్తగారు మందిలించేవారు, అయితే ఆ మందలింపు హెచ్చుతగ్గులకు అతీతంగా మధ్యరకంగా ఉండేది. అది ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండేది కాదు. తప్పు, దాని అపాయ పరిమాణాన్ని బట్టి మారేది. తప్పు చేసినవాడు తెలిసి కావాలని చేశాడా? లేదా చేసి పశ్చాత్తాపం పడ్డాడా? తెలియక చేశాడా? తెలిసి చేశాడా? ఇలాంటి ఇంకెన్నో రకాలుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నవయువకుల శిక్షణలో శ్రద్ధ వహించే వారు. ఇలాంటి ఓ మందలింపు ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హుతో జరిగింది. అతను ఓ యువకుడు. ఒక మస్జిదులో సామూహిక నమాజు చేయించే ఇమాం కూడాను. ఒకసారి చాలా దీర్ఘంగా నమాజు చేయించారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారుః “జనాన్ని చిక్కుల్లో పడవేసి ధర్మం పట్ల వారికి వెగటు కలిగించ దలిచావా?” (బుఖారి 705, ముస్లిం 6106). అతను చేసిన తప్పుపై ఊర్కోలేదు. అలా అని అతని తప్పుకు మించి మందలించలేదు.

ఒక్కోసారి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మౌనం వహించి, ముఖవర్చస్సుపై కోపం వ్యక్తం చేసి సరిపుచ్చుకునేవారు. ఇలాంటి ఓ ఘటన మాతృమూర్తి ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖించారుః ఆమె చిత్రాలున్న ఓ దిండు ఖరీదు చేశారు. ప్రవక్త దాన్ని చూసి గడపపైనే ఆగిపోయారు. లోనికి ప్రవేశించలేదు. నేను ఆయన ముఖంలో అయిష్ట ఛాయల్ని గమనించి, “ప్రవక్తా! అల్లాహ్, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపునకు మరలుతున్నాను. నాతో జరిగిన తప్పేమిటి? అని అడిగాను. దానికి ప్రవక్త “ఈ దిండు సంగతేమిటి?” అని మందలించారు. (బుఖారి 2105, ముస్లిం 2107).

దీనికి భిన్నంగా ఒక్కసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉసామా బిన్ జైద్ ను చాలా గట్టిగా మందలించారు. దానికి కారణం ఏమిటంటే; మఖ్జూమియా వంశానికి చెందిన ఒక స్త్రీ దొంగతనం చేసింది, దానికి శిక్షగా ఆమె చేతులు నరికేయబడకుండా కొందరు ఉసామాను సిఫారసు చేయుటకై ప్రవక్త వద్దకు పంపారు. అతను వెళ్ళి అల్లాహ్ నిర్ణయించిన హద్దుల విషయంలో సిఫారసు చేశాడు అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ హద్దుల్లో ఒకదాని గురించా నీవు సిఫారసు చేసేది” (ఇలా కాజాలదు) అని గట్టిగా మందలించారు.

6. ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం నేర్పుట

పిల్లల మరియు టీనేజరుల ఆత్మస్థైర్యం బలహీనపడినదని మనం మొరపెట్టుకున్నప్పుడు లేదా పాశ్చాత్యుల పిల్లలు ఆత్మ స్థైర్యం మరియు తమ భావాలను వ్యక్తపరిచే శక్తి కలిగి ఉండడం మరియు మనలోని ఎక్కువ పిల్లల్లో ఈ అతిముఖ్య గుణం క్షీణించి పోవడంలో అంచన వేసినప్పుడు ప్రవక్తగారి శిక్షణశాలకు మరలుట మనపై విధిగా ఉంది, అక్కడ ఈ రోగానికి వైద్యం క్రియాత్మకంగా జరుగుతుంది.

మన పిల్లల్లో ఆత్మస్థైర్యం జనించాలంటే వారు స్వయంగా వారిని గౌరవించుకోవాలి మరియు వారు ముఖ్యులు అన్న బావం వారిలో కలగాలి. కాని వారు దాన్ని ఎలా గ్రహించగలరు? ఎందుకంటే మనం వారికి ఓ ప్రాముఖ్యత, గౌరవం ఇస్తున్నామని అనేక సందర్భాల్లో వ్యక్త పరచము.

వారు తమ స్వంత భావాలను వ్యక్తం చేసే అనుమతి మనం ఇస్తామా? ఎన్నుకునే స్వేచ్ఛ వారికి ప్రసాదిస్తామా? వారికి ప్రత్యేకించిన విషయాల్లో వారి అనుమతి కోరుతామా? లేదా గద్దించి, చిన్నచూపు చూచి, వారి ఇష్టం, కోరికలను అణచి, వారి -ప్రత్యేక విషయాల్లో- వారి అనుమతిని పట్టించుకోకుండా ప్రవర్తిస్తామా? మనలోని అనేకుల వద్ద ఇదే ప్రవర్తన చెలామణి ఉంది. కొందరు పరిశోధకులు దీనికి “నోరుమూయించే ప్రవర్తన” అని పేరు పెట్టారు.

ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఓ పాలపాత్ర వచ్చింది ఆయన పాలు త్రాగారు, అప్పుడు ఆయన కుడి ప్రక్కన పిల్లవాడున్నాడు, ఎడమ ప్రక్కన పెద్దవారున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబ్బాయిని ఉద్దేశించి “ఈ పాత్ర నా ఎడమ ప్రక్క ఉన్నవారికి ఇవ్వడానికి నీవు అనుమతి ఇస్తావా” అని అడిగారు. అందుకు అబ్బాయి ‘లేదు, అల్లాహ్ సాక్షిగా! మీ నుండి పొందే నావంతు భాగంలో ఇతరులకు ప్రాధాన్యత’నివ్వను అని చెప్పాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ పాత్ర అతని చేతిలో పెట్టేశారు. (బుఖారి, ముస్లిం).

ఈ సంఘటనలో; పిల్లల్లో స్వయ గౌరవాన్ని పెంచుటకు, వారు ముఖ్యులు అన్న భావన కలిగించుటకు శిక్షణ సంబంధమైన నాలుగు సూచనలున్నాయి.

1. పిల్లవాడు ప్రవక్తకు అతి సమీపములో కూర్చుండే స్థానం ఎలా పొందాడు? అది కూడా గొప్ప శ్రేష్ఠులైనవారి కుడి ప్రక్కన. మరి అందులో పెద్దలూ ఉన్నారు.

2. స్వయం త్రాగిన తర్వాత అతనికి వచ్చిన హక్కు నుండి అతను తొలిగి పోవుటకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిన్న పిలవాడితో అనుమతి కోరుతున్నారంటే అతనిలో ఎంత ఆత్మ స్థైర్యం పెరగవచ్చు. అయినా ఇది ఏమంతా గాంభీర్యమైన, ముఖ్య సమస్య అని? (కాని ప్రవక్త ఎంత శ్రద్ధ చూపారో చూడండి).

3. ప్రవక్త అడిగిన దానిని తిరస్కరించి, దానికి అనుకూలమైన సాకు/కారణం చెప్పగలిగాడంటే, ప్రవక్తగారి శిక్షణశాలలో పిల్లలకు ఎంతటి ఆత్మస్థైర్యం లభించిందో గమనించండి.

4. శిక్షణ విషయంలో క్రియ, మాట కంటే సంపూర్ణంగా ఉంటుంది. అందుకే ఉల్లేఖకుడు చెప్పాడుః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ పాత్ర అతని చేతిలో పెట్టేశారు. అంటే ఆ పాలపాత్ర అతనికి ఇస్తూ అతడు చెప్పిన నిదర్శనాన్ని మెచ్చుకుంటూ అతనికి గౌరవం ప్రసాదిస్తున్నట్లు అతను గ్రహించే విధంగా ప్రవక్త అతని చేతిలో ఆ పాత్ర పెట్టారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శిక్షణశాలలో నవయువకులకు వారి ప్రాముఖ్యత మరియు వారి గౌరవం వారికి తెలియజేయడం వరకే సరిపుచ్చు కోకుండా, ప్రయోగాత్మకంగా వారి శక్తికి తగిన కొన్ని బాధ్యతలు వారికి అప్పజెప్పి వారి ఆత్మస్థైర్యాన్ని పెంచేవారు.

ఇదిగో, ఇతను ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు; ఈ యువకుడు ప్రజలకు నమాజు చేయించేవాడు. ఎందుకనగా ఈ పని ఇతని శక్తికి తగినదైయుండెను.

ఇతను ఉసామా బిన్ జైద్ ఒక సైన్యానికే అధిపతిగా నిర్ణయించబడ్డాడు. అందులో పెద్ద పెద్ద సహాబాలు (ప్రవక్త సహచరులు)న్నారు. అప్పుటికి అతని వయసు 17 సంవత్సరాలు దాటలేదు. ఎందుకు? అతని ఆత్మస్థైర్యం పెరగాలని, తద్వారా సమాజము అతనితో ప్రయోజనం పొందాలని. వీరిద్దరికంటే ముందు అలీ బిన్ అబీ తాలిబ్ ప్రవక్త వలస వెళ్ళే రాత్రి ఆయన పడకపై పడుకుంటాడు. అది ఓ పెద్ద బాధ్యత, అందులో ధైర్యత్యాగాల అవసరముంటుంది.

కాని ఈ రోజుల్లో మనలోని అనేకులు తమ సంతానంపై నమ్మకం కలిగి ఉండరు. కనీసం ఏ చిన్న బాధ్యత కూడా వారికి అప్పజెప్పరు.


సంతాన శిక్షణ – పార్ట్ 01 [వీడియో]

బిస్మిల్లాహ్

[1:05:01 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
పుస్తకం : సంతాన శిక్షణకై తల్లిదండ్రులకు మార్గదర్శి

సంతాన శిక్షణకై ప్రవక్త పద్ధతిలోని సూచనలు

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా ఖుద్వతిస్సాలికీన్, వఅలా ఆలిహీ వసహబిహీ అజ్మఈన్, అమ్మాబఅ’ద్:

ఇది ఓ శిక్షణ పుస్తకం. ఇది మన సమాజములోని పిల్లల శిక్షణ స్థాయిని పెంచుటకు దోహదపడుతుంది. అందుకు ఈ([1]) తొలి చిరు పుస్తకంలో “సంతాన శిక్షణకై ప్రవక్త పద్ధతిలోని సూచనలు” అనే శీర్షికను పొందుపరుచుటయే సహజం. ఎందుకనగాః

1.పిల్లల, టీనేజరుల శిక్షణలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ఉత్తమ పద్ధతి అవలంబించిన వారు సర్వమానవాళిలో ఎవ్వరూ లేరు.

2. మనం మన జీవిత సర్వ వ్యవహారాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను అనుసరించాలని అల్లాహ్ ఆదేశం ఉంది. వాటిలో పిల్లల, టీనేజరుల (యుక్తవయస్కుల) శిక్షణ అతిముఖ్యమైనది. అల్లాహ్ ఆదేశం:

[لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللهِ أُسْوَةٌ حَسَنَةٌ لِمَنْ كَانَ يَرْجُو اللهَ وَاليَوْمَ الآَخِرَ] {الأحزاب:21}

నిశ్చయంగా అల్లాహ్ యొక్క ప్రవక్తలో మీకు ఒక మంచి ఆదర్శం ఉంది; అల్లాహ్ పై, అంతిమ దినంపై నమ్మకం కలిగి ఉన్నవారికి“. (అహ్ జాబ్ 33: 21).

మనలో అనేక మంది తమ సంతాన శిక్షణ విషయంలో ప్రవక్త పద్ధతికి చాలా దూరంగా ఉన్నారు.

మనలో అనేక మంది – ప్రత్యేకంగా కొన్ని విషయాల్లో ప్రత్యేకత కలిగి ఉన్నవారు- పాశ్చాత్యుల సిద్ధాంతాలను, విధానాలను ఆశ్చర్యకంగా, ఆదర్శవంతమైనవిగా భావిస్తున్నారు. అయితే ఆ సిద్ధాంతాల్లో, విధానాల్లో అనేక విషయాల మూలం మన ప్రవక్త పద్ధతిలో ఉన్న విషయం వారికి తెలియదు.

1. విశ్వాసం పట్ల శ్రద్ధ

ఇది ప్రతి ముస్లిం శిక్షకునిపై ఉన్న తొలి బాధ్యత. అల్లాహ్ ఈ ఉద్దేశ్యంతోనే సృష్టిని సృష్టించాడు. అల్లాహ్ ఆదేశం చదవండిః

[وَمَا خَلَقْتُ الجِنَّ وَالإِنْسَ إِلَّا لِيَعْبُدُونِ] {الذاريات:56}

నేను జిన్నాతులను మరియు మానవులను నన్ను ఆరాధించు టకే పుట్టించాను“. (జారియాత్ 51: 56).

ఈ ఉద్దేశ్యం నెరవేరుటకే ప్రవక్తలు పంపబడ్డారు.

[وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَسُولًا أَنِ اُعْبُدُوا اللهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ] {النحل:36}

మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా అందరికీ ఇలా హెచ్చరిక చేశాము: ‘అల్లాహ్ ను ఆరాధిం చండి. మిథ్యా దైవాల ఆరాధనకు దూరంగా ఉండండి“. (నహ్ల్ 16: 36).

పిల్లల మరియు టీనేజరుల హృదయాలు ఏ భాగస్వామి లేని ఏకైక అల్లాహ్ పట్ల అంకితం అయి ఉండాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా కాంక్షించేవారు. చిన్నారి అయిన ఇబ్ను అబ్బాస్ (రదియల్లాహు అన్హు)కు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన ఉపదేశంలో ఈ విషయం స్పష్టంగా తెలుస్తుతుంది.

(احْفَظِ اللهَ يَحْفَظْكَ ، احْفَظِ اللهَ تَجِدْهُ تُجَاهَكَ ، إِذَا سَأَلْتَ فَاسْأَلٍ اللهَ ، وَإِذَا اسْتَعَنْتَ فَاسْتَعِنْ بِاللهِ ،{تَعَرَّفْ إِلَيهِ فِي الرَّخَاءِ يَعْرِفُكَ فِي الشِّدَّة} وَاعْلَمْ أَنَّ الْأُمَّةَ لَوْ اجْتَمَعَتْ عَلَى أَنْ يَنْفَعُوكَ بِشَيْءٍ لَمْ يَنْفَعُوكَ إِلَّا بِشَيْءٍ قَدْ كَتَبَهُ اللهُ لَكَ ، وَلَوْ اجْتَمَعُوا عَلَى أَنْ يَضُرُّوكَ بِشَيْءٍ لَمْ يَضُرُّوكَ إِلَّا بِشَيْءٍ قَدْ كَتَبَهُ اللهُ عَلَيْكَ ، رُفِعَتِ الْأَقْلَامُ وَجَفَّتِ الصُّحُفُ ، {وَأَنَّ النَّصْرَ مَعَ الصَّبرِ وَأَنَّ الْفَرجَ مَعَ الْكَربِ }.

“నీవు అల్లాహ్ (ధర్మం)ను కాపాడు అల్లాహ్ నిన్ను కాపాడతాడు. నీవు అల్లాహ్ (ధర్మం)ను కాపాడు నీవు అల్లాహ్ ను నీ ముందు పొందుతావు. (అంటే ఎల్లవేళల్లో అతని సహాయం నీ వెంట ఉంటుంది). [ఆనంద ఘడియల్లో నీవు ఆయన్ని జ్ఞాపకముంచుకో, ఆపద సమయాల్లో ఆయన నిన్ను జ్ఞాపకముంచుకుంటాడు] ఏదైనా అడగవలసినప్పుడు అల్లాహ్ తో మాత్రమే అడుగు. సహాయం కోర వలసినప్పుడు అల్లాహ్­తో మాత్రమే సహాయం కోరు. తెలుసుకో! ప్రపంచవాసులంతా కలసి నీకేదైనా లాభం చేగూర్చుదలచితే అల్లాహ్ వ్రాసి ఉంచినది తప్ప ఏ లాభం చేగూర్చలేరు. వారంతా కలసి నీకేదైనా నష్టం కలిగించాలన్నా అల్లాహ్ వ్రాసి ఉంచినది తప్ప ఏ నష్టమూ కలిగించలేరు. (విధి వ్రాత వ్రాసే) కలములు లేపబడ్డాయి. (ఇక ఏమీ వ్రాయవు). ఆ పత్రాలు ఎండిపోయినవి (అంటే అందులో ఏ మార్పు కూడా ఇక జరుగదు. [సహనం వెంటే సహాయం ఉంటుంది. కలిమితో పాటే లేమి ఉంటుంది]”. (తిర్మిజి, సిఫతుల్ ఖియామ, 2516. ముస్నద్ అహ్మద్ 1/308).

ప్రవక్త ﷺ ఈ విధంగా పిల్లల విశ్వాసం పట్ల శ్రద్ధ చూపేవారు. ఈ రోజుల్లో మనలోని అనేక మంది విశ్వాసం మరీ అందులో విధివ్రాతపై విశ్వాసం పట్ల మరియు సర్వ వ్యవహారాలు అల్లాహ్ చేతులో ఉన్నాయనే దాని పట్ల చాలా అశ్రద్ధగా ఉన్నారు. వారు దీని ప్రకారం తమ సంతానానికి శిక్షణ ఇవ్వడం లేదు.

2. నమాజు పట్ల శ్రద్ధ

ప్రవక్త ఇచ్చిన శిక్షణలో వచ్చిన ఒక గొప్ప సూచన ఇలా ఉందిః

(مُرُوا أَوْلَادَكُمْ بِالصَّلَاةِ وَهُمْ أَبْنَاءُ سَبْعِ سِنِينَ وَاضْرِبُوهُمْ عَلَيْهَا وَهُمْ أَبْنَاءُ عَشْر).

మీ పిల్లలు ఏడు సంవత్సరాల వయసుకు చేరుకున్నప్పుడు మీరు వారికి నమాజు గురించి ఆదేశించండి. పది సంవత్సరాలకు చేరు కున్నప్పుడు దాని గురించి వారిని దండించండి“. (అబూ దావూద్ 495).

ఈ నమాజు విషయంలో తప్ప మరే విషయంలోనైనా దండించే ఆదేశం ఏదైనా హదీసులో ఉందా? నాకు తెలిసిన ప్రకారం లేదు. ఇది నమాజు ప్రాముఖ్యత మరియు దాని పట్ల గల తాకీదు వల్లనే. ఈ దండించడం కూడా పిల్లవాడు బుద్ధిగలవాడై (అంటే ఏడేళ్ళవాడై) అతనికి నమాజు ఆదేశమిచ్చిన తర్వాత 1080 రోజులకు వచ్చింది. ఈ వ్యవధిలో సుమారు 5400 సార్లు నమాజు ఆదేశం మరీమరీ ఇవ్వడమే కాకుండా పిల్లవాడు తన తల్లిదండ్రులను అనేక సార్లు నమాజు చేస్తూ ఉన్నది చూస్తూ ఉంటాడు.

సంతానం చెడిపోవడం గాని, వారు అవిధేయులవడం గాని, చదువే భాగ్యం కలగకపోవడం గాని, వీటన్నిటికి నమాజు చేయడం, చేయకపోవడం మరియు దానిని కాపాడడంతో నేరుగా  సంబంధం కలిగి ఉన్నది. సంతాన సద్వర్తన మరియు వారి ఉన్నత విద్యలో నమాజు ప్రభావంపై గనక శిక్షణపరమైన సైంటిఫిక్ పరిశో ధన జరిగితే నమ్మశక్యం కలిగే ఫలితం వెలువడుతుంది. సంపూర్ణ సాఫల్యానికి నమాజు సంబంధం లోతుగా ఉందని తెలుస్తుంది.

3. ముందు జాగ్రత్త వైద్యము కంటే మేలు

పిల్లల మరియు టీనేజరుల పట్ల ప్రవక్త గారి శిక్షణ విధానంలో వైద్యము కంటే ముందు జాగ్రత్తే ప్రధానంగా ఉండేది. అల్లాహ్ దయతో ఇలాంటి శిక్షణ సంతానం అపాయాల్లో పడకుండా ఉండటానికి పటిష్ఠమైన అడ్డుగా నిలుస్తుంది.

ఈ నాటి శిక్షణలో మన స్పష్టమైన తప్పు ఏమిటంటే మనం ముందు జాగ్రత్తను విడనాడి అశ్రద్ధగా ఉంటాము, మరెప్పుడైతే మన పిల్లలు ఏదైనా అపాయానికి గురవుతారో అప్పుడు దాని చికిత్స కొరకు ప్రయత్నం చేస్తాము.

ఈ సందర్భంగా మనం, పదేళ్ళ పిల్లల గురించి “వారి పడకలను వేరుగా చేయండి” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన ఆదేశాన్ని పసిగట్టగలం. అలాగే ఓసారి ఫజ్ల్ బిన్ అబ్బాస్ అను ఓ నవయువకుడిని ప్రవక్త తమ వెనక వాహనముపై ఎక్కించుకున్నారు. అక్కడ ఖస్అమియా వంశానికి చెందిన ఓ స్త్రీ వచ్చి ఏదో ప్రశ్న ప్రవక్తతో అడుగుతుంది. అప్పుడు ఆ నవయువకుడు తదేకంగా ఆమె వైపే చూస్తున్నాడు. ఇది గమనించిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే అతని ముఖాన్ని మరో వైపు మరలించారు.

ముందుజాగ్రతను విడనాడుటలో; ఏ కట్టుబాట్లు లేకుండా కొడుకులు, కుమార్తెలు టీవీ ఛానళ్ళు చూడడం. వాటిలో కొన్ని ప్రోగ్రాములు తుచ్ఛమైనవి అయితే మరికొన్ని ఆలోచన, నడతలో ఘోర ప్రమాదాల్ని తెచ్చి పెడతాయి. ఏ ఆటంకము లేకుండా వారు ఇష్టమున్నవారితో ఇంటర్నెట్టుల ద్వారా సంబంధాలు ఏర్పరుచు కొనుట. ఏలాంటి పర్వవేక్షణ, అప్రమత్తత లేకుండా సెల్ ఫోన్ల ఉపయోగం. ఇలాంటి పనులు విచ్చలవిడిగా జరుగుతున్నప్పుడు ప్రవక్త గారి ముందుజాగ్రత్త పద్ధతిని ఎక్కడ అనుసరిస్తున్నట్లు మనం?

ఈ పరికరాల ఉపయోగంలో వారి వయస్సు, వారి మానసిక ఎదుగుదలను గమనిస్తూ ఉండటం చాలా అవసరం. ఉదాహరణకుః ఇంటర్నెట్, కొడుకు లేదా కూతుళ్ళ బెడ్ రూంలోనే ఎందుకు? ఎలాంటి పర్వవేక్షణ లేకుండా అన్ని వేళల్లో ఎందుకు దానిని వారు ఉపయోగించడం? అందరి దృష్టిలో ఉండే విధంగా అది హాలులో ఎందుకు ఉంచరాదు? దానిని అందరూ ఎందుకు ఉపయోగించలేరు? తండ్రి మరియు తల్లికి కొడుకు మరియు కూతుళ్ళు వాడే వాటి కోడ్ లు ఎందుకు తెలియకూడదు? అయితే తల్లిదండ్రులు ఉత్తమ పద్ధతిలో వారికి బోధించాక, (ఇంటర్నెట్ లాభనష్టాలు వారికి తెలిపాక) పర్యవేక్షణ జరపాలి.


[1] మూడు చిరు పుస్తకాలను కలిపి ఒక పుస్తకంగా ముద్రించబడుతుంది. అయితే వాటిలో ఈ చిరుపుస్తకం మొదటిది.

సంతానానికి హిబా చేస్తున్నప్పుడు (giving gifts) వివక్ష చూపకూడదు

1049. హజ్రత్ ఆమిర్ (రహ్మతుల్లా అలై) కధనం :-

హజ్రత్ నూమాన్ బిన్ బషీర్ (రధి అల్లాహు అన్హు) వేదిక ఎక్కి ఇలా అనడం నేను విన్నాను – “మా నాన్నగారు నాకొక కానుక ఇచ్చారు. అయితే (నా తల్లి) హజ్రత్ ఉమ్రా బిన్తె రావాహ (రధి అల్లాహు అన్హ) దీనిపై తన అభిప్రాయం వెలిబుచ్చుతూ “మీరీ కానుక ఇవ్వడం పై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ని సాక్షిగా నిలబెట్టనంతవరకు నేను సంతోషించలేను” అని అన్నారు. అందువల్ల మా నాన్నగారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్లి “ధైవప్రవక్తా! నేను ఉమ్రా బిన్తె రావాహా (రధి అల్లాహు అన్హ) కడుపున పుట్టిన నా కొడుక్కు ఒక కానుక ఇస్తే దానికి మిమ్మల్ని సాక్షిగా నిలబెట్టాలని అన్నది ఆమె” అని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాట విని “మరి నీవు నీ కొడుకులందరికీ ఇలాగే కానుకలిచ్చావా?” అని అడిగారు. దానికి మా నాన్న లేదన్నారు. అప్పుడు దైవప్రవక్త “దేవునికి భయపడి, నీ కొడుకుల మధ్య న్యాయాన్ని పాటించు” అని బోధించారు. దాంతో మా నాన్నగారు (ఇంటికి) తిరిగొచ్చి తానిచ్చిన కానుకను నా దగ్గరనుండి వాపసు తీసుకున్నారు”.

[సహీహ్ బుఖారీ : 51 వ ప్రకరణం – హిబా, 13 వ అధ్యాయం – లా షహాద ఫిల్ హిబా]

హిబా (స్వయం సమర్పణ) ప్రకరణం : 3 వ అధ్యాయం – సంతానానికి హిబా చేస్తున్నప్పుడు (giving gifts) వివక్ష చూపకూడదు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్