మహాప్రవక్త పుట్టిన రోజు పేరుతో పండుగ జరుపుకోవటం వాస్తవానికి క్రైస్తవుల అనుకరణ – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

ప్రస్తుత కాలంలో బిద్‌అతులు (కల్పిత ఆచారాలు) హెచ్చరిల్లిపోయాయి. దీనికి ప్రధాన కారణం నేటి కాలానికీ – దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) కాలానికీ మధ్య చాలా ఎక్కువ అంతరం ఉండటం, నిజ జ్ఞానం కొరవడటం, షరీయత్‌కు వ్యతిరేకమయిన విషయాల వైపు పిలుపు ఇచ్చేవారు అధికంగా ఉండటం.

మహనీయ ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) వారు ఇలా చెప్పి ఉన్నారు :

“మీరు తప్పకుండా మీ పూర్వీకుల అడుగు జాడల్లో నడుస్తారు.”
(దీనిని ఇబ్నెమాజా-3994 ఉల్లేఖించి, ప్రామాణికంగా పేర్కొన్నారు)

ఈ హదీసు ప్రకారం ముస్లిములు అన్యుల ఆచార వ్యవహారాలను ఎక్కువగా అనుకరించటం మొదలెట్టారు.

మీలాదున్నబీ పేరిట ఉత్సవాలు :

మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) పుట్టిన రోజు పేరుతో పండుగ జరుపుకోవటం వాస్తవానికి క్రైస్తవుల అనుకరణ. క్రైస్తవులు ఏసుక్రీస్తు (ఈసా అలైహిస్సలాం) పుట్టిన రోజు పండుగ జరుపుకుంటారు. విద్యాగంధం లేని ముస్లిములు, రుజుమార్గానికి కుడిఎడమ వైపుల్లో కాలిబాటలు తీసుకున్న విద్వాంసులు (ఉలమా) ఏటేటా రబీవుల్‌ అవ్వల్‌ మాసంలో మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) పుట్టిన రోజును పురస్కరించుకుని సంబరాలు జరుపుకుంటారు. కొంతమంది ఈ ఉత్సవాన్ని మస్జిదుల్లో జరుపుకుంటే, మరికొంతమంది తమ ఇండ్లలో చేసుకుంటారు. ఇంకా కొందరు కొన్ని నిర్ణీత బహిరంగ స్థలాలలో ఈ ఉత్సవం జరుపుకుంటారు. ఈ ఉత్సవంలో ముస్లిం సమాజానికి చెందినవారు చాలాపెద్ద సంఖ్యలోనే హాజరవుతారు. ఇంతకుముందు చెప్పినట్లు ఇది క్రైస్తవుల నుండి పుణికిపుచ్చుకున్న పోకడ. పూర్వం క్రైస్తవులు ఏసుక్రీస్తు పుట్టిన రోజు పండుగను తమంతట తామే కల్పించుకున్నారు. సాధారణంగా ఈ మీలాద్‌ ఉత్సవాలలో క్రైస్తవులను పోలిన ఎన్నో బిద్‌అతులు చేయబడతాయి. కొన్ని షిర్కుతో కూడిన పనులు కూడా జరుగుతుంటాయి. ఉదాహరణకు:

ఈ సందర్భంలో చదవబడే నాతులు, కవితలలో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) విషయంలో అతిశయిల్లడం కద్దు. వారు ఆ నాతులలో అల్లాహ్‌ బదులు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను మొరపెట్టుకోవటం మొదలెడతారు. సహాయం కొరకు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)నే అర్ధించసాగుతారు. కాగా; తనను పొగిడే విషయంలో అవధులు మీరరాదని దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) స్వయంగా తాకీదు చేసి ఉన్నారు. ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు :

“క్రైస్తవులు మర్యమ్‌ కుమారుడగు ఈసాను పొగడటంలో మితిమీరిపోయినట్లుగా మీరు నన్ను పొగడటంలో మితిమీరకండి (కడకు వారు తమ ప్రవక్తను దేవుని కుమారునిగా చేసేశారు). చూడండి! నేనొక దాసుడను. కాబట్టి నన్ను అల్లాహ్‌ దాసుడు, అల్లాహ్‌ సందేశహరుడు అని అనండి.” (బుఖారి, ముస్లిం)

ఒక్కోసారి ‘మీలాద్‌’ పేరిట జరిగే ఈ సదనాలలో స్త్రీలు పురుషులు కలిసిపోతారు. ఈ మిశ్రమ సమ్మేళనాలు నైతిక పతనానికి, భావ కాలుష్యానికి కూడా కారణం అవుతాయి.

ఒక్కోసారి వారు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తమ సమావేశాలకు హాజరవుతారని కూడా నమ్ముతుంటారు. ఈ సమావేశాలలో సామూహికంగా (కొన్నిచోట్ల స్రీలు – పురుషులు కూడా) నాతె షరీఫ్‌ పఠిస్తారు. కవి సమ్మేళనాలు నిర్వహిస్తారు. బృందగానాలు ఆలాపిస్తారు. సూఫీ మహాశయులు కల్పించుకున్న ప్రత్యేక ధ్యానాలు కూడా ఈ సందర్భంగా పాటించబడతాయి. అదలా ఉంచితే స్త్రీ, పురుషుల మిశ్రమ సమావేశాలు ఉపద్రవానికి కారణభూతం అయ్యే ప్రమాదం ఉంటుంది.

అలాంటిదేమీ లేదండీ! కేవలం మేమిక్కడ సమావేశమై భోజనాలు చేసి వెళ్ళిపోతామండీ అని కొంతమంది చెబుతుంటారు. వారు చెప్పిందే నిజమే అయినా అది కూడా ఇస్లాం ధర్మంలో ఓ కొత్తపోకడే. (ధర్మంలో ప్రతి కొత్త విషయావిష్కరణ బిద్‌అతే. ప్రతి బిద్‌అత్‌ మార్గభ్రష్టత వైపు గొనిపోతుంది). కాలక్రమేణా ఈ చిన్న విషయాలే చెడుల వైపునకు, నీతి బాహ్యత వైపునకు దారితెరుస్తాయి.

మేము దీనిని బిద్‌అత్‌ అని ఎందుకన్నామంటే ఖుర్‌ఆన్‌ హదీసులలో ఈ ఉత్సవానికి ఎలాంటి ఆధారం లేదు. సలఫె సాలిహీన్‌ ఆచరణ ద్వారా కూడా దీనికి సంబంధించిన ఉపమానం ఏదీ లభించటం లేదు. హిజ్రీ 4వ శతాబ్ది తరువాతనే ఇది ఉనికిలోనికి వచ్చింది. ఫాతిమీ షియాలు దీనిని మొదలు పెట్టారు.

ఇమామ్‌ అబూ హఫస్‌ తాజుద్దీన్‌ అల్ఫాఖానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు :

ముబారికీన్‌కు చెందిన ఒక బృందం తరఫున – రబీవుల్‌ అవ్వల్‌ నెలలో మీలాద్‌ ఉత్సవం పేరిట నిర్వహించబడే ఈ సమావేశం గురించి, “ధర్మం (దీన్‌)లో దీనికేదన్నా ఆధారం ఉందా?” అని ప్రశ్నించటం జరిగింది. దీనికి సంబంధించి వారు స్పష్టమయిన, నిర్దిష్టమైన సమాధానం కావాలని కోరారు. కాబటి  దేవుడిచ్చిన సద్బుద్ధితో సమాధానం ఇవ్వబడుతోంది :

“దైవగ్రంథంలోగానీ, దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సంప్రదాయంలో గానీ నేడు చెలామణీలో ఉన్న మీలాద్‌కు ఎలాంటి ‘మూలం’ లేదు. ఎలాంటి నిదర్శనం కూడా నాకు కనిపించలేదు. ఉమ్మత్‌కు చెందిన ఎన్నదగ్గ ఉలమాలు, ఆదర్శప్రాయులైన వారు కూడా ఈ విధంగా ఆచరించినట్లు లేదు. పైగా ఇదొక బిద్‌అత్‌. దీనిని పనీ పాటా లేని వ్యక్తులు, నిరుద్యోగులు కనుగొన్నారు. ఇదొక మనోవాంఛ. పదార్థ పూజారులు దీనిని తమ పబ్బం గడుపుకునేందుకు వాడుకుంటున్నారు.” (రిసాలతుల్‌ మోరిద్‌ ఫీ అమలుల్‌ మౌలిద్‌)

షేఖుల్‌ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఏమంటున్నారో చూడండి :

“ఇదేవిధంగా కొంతమంది ఏసుక్రీస్తు (ఈసా – అలైహిస్సలాం) పుట్టిన రోజు విషయంలో క్రైస్తవులను అనుకరిస్తూ లేదా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రేమలో, భక్తితత్పరతలో ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) పుట్టిన రోజు పండుగను ఆవిష్కరించారు. వాస్తవానికి ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) వుట్టినరోజు నిర్ధారణ విషయంలో ఇప్పటికీ ప్రజల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. తొలికాలపు సజ్జనులు సయితం ఈ ‘ఉత్సవం’ జరుపుకోలేదు. ఒకవేళ ఇలా చేయటంలో ‘మంచి’ అనేది ఏదయినా ఉంటే, లేదా మంచికి ఆస్కార ముంటుందని అయినా ఆశాభావం ఉండి ఉంటే ఆ సజ్జనులు (రహిమహుముల్లాహ్) ఇలాంటి సంబరం తప్పకుండా జరుపుకునేవారే. ఎందుకంటే దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) యెడల ప్రేమాదరణల విషయంలో ఆ మహనీయులు మనకన్నా గొప్పవారే. వారు ఎల్లప్పుడూ మేలును, శుభాన్ని కాంక్షించేవారు. యదార్దానికి దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను అనుసరించటం ద్వారానే ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) యెడల (పేమాదరణలకు సార్ధకత లభిన్తుంది. ఆయన ఆజ్ఞలను శిరసావహించేవారు, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) నెలకొల్పిన సంప్రదాయాల పునరుద్ధరణకు చిత్తశుద్ధితో పాటువడేవారు, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) రాకలోని లక్ష్యాన్ని నెరవేర్చటానికి మనోవాక్కాయ కర్మల చేత కృషిచేసేవారు మాత్రమే నిజంగా ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) యెడల ప్రేమాదరణలు గలవారు. ఎందుకంటే అన్సార్‌ – ముహాజిర్లలోని ప్రథమశ్రేణి సహాబీలు గానీ, వారిని అనుసరించే తరువాతి తరాల వారుగానీ ఇలాగే చేసేవారు.” (ఇఖ్తెజా అస్సిరాతల్‌ ముస్తఖీమ్‌ – 2/615, డా. నాసిరుల్‌ అఖల్‌ పరిశోధన)

ఈ కొత్త పోకడను ఖండిస్తూ లెక్కలేనన్ని పుస్తకాలు (పాతవి, కొత్తవి) ప్రచురించ బడ్డాయి. ఈ మీలాద్‌ ఉత్సవం స్వతహాగా ఒక బిద్‌అత్‌ అవటంతో పాటు అది మరెన్నో మీలాదుల నిర్వహణకు ప్రేరకం అయ్యే అవకావం ఉంది. మరెందరో ఔలియాల, పెద్ద విద్వాంసుల, నాయకుల మీలాద్‌ (బర్త్‌డే) లకు శ్రీకారం చుట్టవచ్చు. ఈ విధంగా ముస్లిం సముదాయం కీడుకు, ఉపద్రవానికి ద్వారం తెరుచుకుంటుంది.


ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది (పేజీలు 222-224)

మీలాద్ ఉన్ నబీ:

మీలాదున్నబీ ఎలా చేయాలి? احتفال مولد النبيﷺ [వీడియో]

బిస్మిల్లాహ్

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జన్మదిన వేడుకలు, బర్త్ డే పార్టీలు, మీలాదున్నబీ ఉత్సవాలు జరుపుకొనుట ఇస్లామీయ కార్యమేనా? మనకంటే ఎంతో అధికంగా ప్రవక్తను ప్రేమించే సహాబాలు (ప్రవక్త సహచరులు) ఈ మీలాద్ చేశారా? ఇది చేయడం పుణ్యమైతే వారు ఎందుకు చేయలేదు? అది పుణ్యం కాకపోతే మరి మనం ఎందుకు చేయాలి? ఇంకా మరిన్ని వివరాలు, వాస్తవాలు ఈ వీడియోలో తెలుసుకోండి.

[40 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

ఈ ప్రసంగం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పుట్టినరోజు (మీలాద్-ఉన్-నబీ) వేడుకల యొక్క వాస్తవికతను చర్చిస్తుంది. ఇస్లాం ఒక సంపూర్ణమైన మతమని, దానిలో కొత్త ఆచారాలకు, ప్రత్యేకంగా ఆరాధనల విషయంలో, స్థానం లేదని వక్త స్పష్టం చేస్తున్నారు. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాంలో కేవలం రెండు పండుగలు (ఈదుల్ ఫితర్ మరియు ఈదుల్ అద్హా) మాత్రమే ఉన్నాయని, మీలాద్ వేడుకలను పండుగగా జరుపుకోవడం ప్రవక్త మరియు ఆయన సహచరుల పద్ధతికి విరుద్ధమని వివరిస్తున్నారు. ఈ వేడుకను సమర్థించడానికి ఉపయోగించే వాదనలను విశ్లేషించి, వాటిలోని వైరుధ్యాలను ఎత్తిచూపుతూ, ఇది ఇస్లాంలోకి తరువాత చేర్చబడిన ఒక నూతన ఆచారం (బిద్అత్) అని, దీనిని పాటించడం పుణ్యకార్యం కాదని, పాపమని తేల్చిచెప్పారు. ఇస్లాం యొక్క మూల సూత్రాలను అనుసరించాలని, ఇతర మతాల వారిని అనుకరించరాదని ఆయన ముస్లింలకు హితవు పలికారు.

(الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ)
అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబీయ్యినా ముహమ్మద్ వ ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్. (సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. ప్రవక్తల నాయకుడైన మా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)పై, ఆయన కుటుంబ సభ్యులు మరియు సహచరులందరిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక).

ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన వేడుకలు, దీని యొక్క వాస్తవికత ఏమిటి? ఇస్లాంకు సంబంధించిన విషయమేనా ఇది, కాదా?

మహాశయులారా, మొట్టమొదటి విషయం మనం తెలుసుకోవలసినది, ఇస్లాం ధర్మం సంపూర్ణమైనది. “అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్ వ అత్మమ్తు అలైకుమ్ నిఅమతీ వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా” ( الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا) అని అల్లాహుతాలా చాలా స్పష్టంగా తెలియజేశాడు. అంటే ఏమిటి? “అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్” ( الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ) – ఈనాడు నేను మీ ధర్మాన్ని సంపూర్ణం చేశాను. “వ అత్మమ్తు అలైకుమ్ నిఅమతీ” (وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي) – మరియు నా అనుగ్రహాన్ని మీపై పరిపూర్ణం చేశాను. “వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా” (وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا) – మరియు మీ కొరకు ధర్మంగా ఇస్లాంను ఇష్టపడ్డాను.

ఈనాడు మీ ధర్మాన్ని నేను సంపూర్ణం చేశాను అంటే ఏ నాడు అది? ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానికి ఇంచుమించు ఒక 80-83 రోజుల క్రితం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఈ ఆయత్ అవతరింపజేయబడినది. అయితే, ఇస్లాం ధర్మం సంపూర్ణమైనది అని ఏదైతే మనం అంటున్నామో, ఈ ఆయత్ దానికి ఒక ఆధారంగా, నిదర్శనంగా తెలుసుకున్నామో, దీని భావం ఏమిటి? ధర్మం పేరుతో ఇక ఏ విషయం కూడా మనం ఇందులో చేర్చలేము. ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి చెప్పినట్లు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణానికి ముందు ఏ విషయం అయితే దీన్లో లేనిదో, అది ఇప్పుడు దీన్లో లెక్కించబడదు. ధర్మంలో లెక్కించబడదు. మరియు ధర్మంలో ఉన్న ఏ విషయాన్ని కూడా తీసివేయడానికి కూడా మనకు ఎలాంటి అర్హత లేదు.

రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ధర్మం సంపూర్ణమైనది అని అన్నదానికి భావం రెండు రకాలుగా. ఒకటి, ఇందులో అదనంగా మనం ఏదీ చేర్చలేము. అరే ఇది కూడా చాలా మంచిగా ఉంది కదా, దీన్ని కూడా ధర్మంగా భావిద్దాము, ఇది కూడా మనం ఆచరిద్దాము, ఇలా కూడా చేద్దాము, ఇది కూడా ధర్మంగా పుణ్యంగా ఉంటుంది మనకు, ఇలా చెప్పలేము మన ఇష్టానుసారం. అలాగే అల్లాహుతాలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విషయాన్ని ధర్మంలో తెలిపారో, అందులో నుండి ఏ విషయాన్ని కూడా మనం మినహాయించలేము, తీసివేయలేము. ఆ అర్హత కూడా మనకు లేదు.

ఇంకా మహాశయులారా, ఇందులో మనం తెలుసుకోవాల్సిన రెండవ విషయం ఏమిటంటే, ఇస్లాం ధర్మం, ఇందులో అల్లాహ్ మనకు ఏది తెలిపాడో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏది తెలిపారో, అదే ధర్మం. దానినే మనం అనుసరించాలి. ఇది కాకుండా మన ఇష్టానుసారం ఏదైనా విషయాన్ని చేర్చుకోవడాన్ని, అనుసరించడాన్ని అల్లాహ్ ఖండించాడు. దీనికి సంబంధించిన ఎన్నో ఆయతులు ఉన్నాయి, కానీ ఉదాహరణకు సూరె జాథియాలోని ఆయత్ నంబర్ 18: “సుమ్మ జఅల్నాక అలా షరీఅతిమ్ మినల్ అమ్రి ఫత్తబిఅహా వలా తత్తబిఅ అహ్వా అల్లజీన లా యఅలమూన్” (ثُمَّ جَعَلْنَاكَ عَلَىٰ شَرِيعَةٍ مِّنَ الْأَمْرِ فَاتَّبِعْهَا وَلَا تَتَّبِعْ أَهْوَاءَ الَّذِينَ لَا يَعْلَمُونَ). (మేము నిన్ను ధర్మానికి సంబంధించిన ఒక రాజబాటపై నిలబెట్టాము. అయితే నీవు దీనిని అనుసరించు. జ్ఞానం లేని వారి కోరికలను అనుసరించకు). అల్లాహ్ పంపిన షరీఅత్, అల్లాహ్ పంపిన ధర్మం దానినే మనం అనుసరించాలి అని అల్లాహ్ మనకు ఆదేశిస్తున్నాడు.

అలాగే మహాశయులారా, మూడవ విషయం, ఇస్లాంలో పండుగలు, ఈద్ అని ఏదైతే మనం అంటామో, ఎన్ని ఉన్నాయి సంవత్సరానికి? రెండు మాత్రమే. ఒకటి ఈదుల్ అద్హా, ఇంకొకటి ఈదుల్ ఫితర్. ఈదుల్ ఫితర్, ఈదుల్ అద్హా ఈ రెండు మాత్రమే. సునన్ అబీ దావూద్ లోని సహీహ్ హదీస్, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చినప్పుడు అక్కడ ప్రజలు పండుగగా, ఈద్‌గా కొన్ని రెండు రోజులు జరుపుకునేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆ రెండు రోజులను పండుగగా జరుపుకోకూడదు అని, వారిని ఆ రెండు రోజులను పండుగగా జరుపుకోవడాన్ని నిషేధించి, రద్దు చేసి, “ఖద్ అబ్దలకుముల్లాహు బిహిమా ఖైరమ్ మిన్హుమా” (قَدْ أَبْدَلَكُمُ اللَّهُ بِهِمَا خَيْرًا مِنْهُمَا). (అల్లాహుతాలా మీ కొరకు ఆ రెండు రోజుల కంటే మరీ ఉత్తమమైన వేరే రెండు రోజులు మీకు ప్రసాదించాడు, వాటిని మీరు పండుగగా జరుపుకోండి, ఈద్‌గా జరుపుకోండి అని తెలిపారు). ఆ రెండు ఏమిటి? ఈదుల్ ఫితర్ మరియు ఈదుల్ అద్హా. ఈ విధంగా సంవత్సరంలో ఇక మూడవ ఈద్, మూడవ పండుగ ముస్లింలకు ఏదీ లేదు. మూడవ పండుగ, మూడవ ఈద్ ఏదైనా ఉండేది ఉంటే, అది వారంలో ఒకసారి జుమా రోజు. జుమా కూడా ఈదుల్ మూమినీన్ అని చెప్పడం జరిగింది.

ఇక మీలాదున్నబీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన వేడుకలు, దానిని ఈద్ అని ఏదైతే ఈ రోజుల్లో అనడం జరుగుతుందో, ఈద్ మీలాదున్నబీ అని, ధర్మపరంగా దానిని ఈద్ అని అనడం కూడా తప్పు, అలాగే దానిని ఈద్‌గా జరుపుకోవడం కూడా తప్పు. ఒకవేళ ఎవరైనా, సరే మంచిది, దానికి ఈద్ అన్న పదం మేము తీసేస్తాము, మీలాదున్నబీ అని జరుపుకుంటాము అని అంటే, అది కూడా కుదరని పని.

కానీ ఇంతవరకే విషయం సరిపోదు. మరికొందరు ఒక రాంగ్ క్వశ్చన్, ఒక అడ్డ ప్రశ్న వేస్తారు. అదేమిటంటే, సరే మంచిది, ఈద్ అని దానికి పేరు పెట్టుకోము. మీలాదున్నబీ అన్న పేరుతో ఆ రోజును మేము గడుపుకోవడం, ఒక సంతోషంగా, సంతోషక దినంగా భావించి జరుపుకోవడం, ప్రజల్ని ఆ రోజు ఒకచోట జమా చేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చరిత్ర తెలపడం, ఇందులో ఏమిటి తప్పు? పాపం ఏమున్నది ఇందులో? ఇలా అడ్డంగా ప్రశ్నిస్తారు. అయితే, ఇందులో పాపం ఏమున్నదో, అది ఇప్పుడే తెలియజేస్తాను, కానీ దానికంటే ముందు ఒక విషయం మనం ఆలోచించాలి. అదేమిటి?

ఇది ఒకవేళ మంచి విషయం అని మనం భావించి చేస్తూ ఉండేది ఉంటే, నవూజుబిల్లాహ్, అస్తగఫిరుల్లాహ్, ఈ యొక్క మంచి విషయం మనకు తెలపడం అల్లాహ్ మర్చిపోయాడా? నవూజుబిల్లాహ్, అస్తగఫిరుల్లాహ్. అల్లాహ్ ప్రవక్తకు తెలియజేశారు కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలపడం మర్చిపోయారా? అలా ఏమైనా ఉందా? గమనించండి. ఈ రోజు ఇందులో తప్పేమున్నది? మనం మంచి పనులే చేస్తాము కదా ఈ రోజుల్లో. అయితే, మనం మన ఇష్టానుసారం ఏ పనినైనా మంచిదిగా భావించి చేయడం, ఇది ధర్మం కాదు. ఇది అల్లాహ్‌కు ఇష్టమైన రీతిలో స్వీకరించబడదు. అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త తెలిపిన విషయాన్నే మనం ఆచరించాలి.

ఇక నష్టం ఏమిటి? అందులో వేరే ఏ చెడు పని చేయకున్నా, మహా నష్టం ఇప్పుడే నేను మీకు తెలియజేసినట్లు, ఒకవేళ అది మంచి పని అని మనం చేస్తూ ఉంటే, ఆ మంచి పని విషయంలో అల్లాహ్ లేదా అల్లాహ్ యొక్క ప్రవక్త మర్చిపోయారా? ఇటువంటి ఒక పెద్ద అభాండం ఏర్పడుతుంది. రెండవ విషయం, ఒకవేళ ఇది చెడైతే ఏమీ కాదు, మంచి అని అని మనం చేసుకుంటూ ఉంటే, మనకంటే ఎక్కువగా ధర్మం పట్ల ప్రేమ కలిగిన సహాబాలు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనకంటే ఎక్కువగా ప్రేమించేవారు సహాబాలు. సహాబా కంటే ఎక్కువ మనం ప్రేమిస్తామా ప్రవక్తను? చెప్పండి. మనం ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నామా ప్రవక్తను లేక సహాబాలు ఎక్కువ ప్రేమించేవారా? సహాబాలు కదా. అయితే వారు మరి ఈ విషయం పాటించలేదు కదా?

ఈ విధంగా చూసుకుంటే ఎన్నో రకాలు. అందుగురించి ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి ఒక సందర్భంలో ఏమి చెప్పారు? ఎవరైతే ఒక పని ఇస్లాంలో కొత్తగా ఏర్పాటు చేసి దానిని ఆచరిస్తాడో, అతడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఒక మహా అపనింద, ఒక పెద్ద అబద్ధాన్ని మోపుతున్నాడు. ఎందుకు? “ఇది మంచి కార్యం, ఇది సత్కార్యం, ఇది చాలా అల్లాహ్‌కు ఇష్టమైన పని” అని మనం అంటుంటే, అల్లాహుతాలా మర్చిపోయాడు లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు తెలియజేయడం మర్చిపోయాడు అని ఈ విధంగా, “ఫఖద్ ఖాన రిసాలా” (فقد خان الرسالة) (సందేశాన్ని అందజేయడంలో మోసం చేశాడు). ప్రవక్త రిసాలత్, సందేశం అందజేయడంలో, నవూజుబిల్లాహ్, అమానత్ పాటించలేదు అన్నటువంటి ఒక పెద్ద అపనింద ప్రవక్తపై వస్తుంది. అందుగురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఇక, ఈ విషయాలు మీకు అర్థమయ్యాయి. అర్థమయ్యాయి కదా? అయితే, ఇదే విషయాన్ని మరో రకంగా కూడా కొంచెం మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజుల్లో ఎందరో ముస్లిం సోదరులని మనం మీలాదున్నబీ జరుపుకుంటున్నది చూస్తూ ఉన్నాము. చూస్తున్నాము కదా? అచ్చా, మీలాదున్నబీ అంటే ఏంటో తెలుసా? మీలాదున్నబీ అన్న ఈ అరబీ పదానికి భావం ఏంటి? ప్రవక్త బర్త్‌డే. నబీ అంటే ప్రవక్త, మీలాద్ అంటే “ఉష్ మీలాద్ అంతా?” (وش ميلادك أنت؟) (నీ పుట్టినరోజు ఏది?). నీ జన్మదినం ఏది? నీ బర్త్‌డే ఏది? అని మనం సామాన్యంగా అరబీలో అడుగుతాము కదా.

అయితే మహాశయులారా, ఇస్లాంలో మనం మన బర్త్‌డే జరుపుకోవడానికి అనుమతి లేదు, ప్రవక్తల బర్త్‌డే జరుపుకోవడానికి అనుమతి లేదు, ఇంకా ఏ పుణ్యపురుషులు, మహాభక్తులు, ఔలియా అల్లాహ్, బుజుర్గ్ బాబా, అచ్చే అచ్చే లోగా, ఈ విధంగా ఎవరి ఏ బర్త్‌డేలు, జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి అవకాశం ఉందా? లేదు. “అరే ఏం చేయమండి మేము? కేవలం ఆ రోజు మేము పుట్టిన దినం అని చాక్లెట్లు పంచుకుంటాము. ఆ రోజు మేము పుట్టిన దినము అని అందరం ఒకచోట జమా అయ్యి కేక్ తీసుకొచ్చి దాన్ని కోసి మేము అందరం కలిసి తింటాము. ఇందులో మేమేం హరామ్ కార్యం చేస్తున్నాము?” అని అంటారు. కానీ ఇది ఇస్లాంకు సంబంధించిన విషయం ఎంత మాత్రం కాదు.

ఇంకా మహాశయులారా, ఎందరో సోదరులు ఈద్-ఎ-మీలాదున్నబీ పాటిస్తున్నారు. కానీ వారి యొక్క ఈ మీలాదున్నబీ ఉత్సవాల విషయం మరియు వారు చెప్పే మాటలలో ఎన్నో రకాల వైరుధ్యం కనబడుతుంది. కాంట్రడిక్షన్. ఏ విధంగా? ఒక మౌల్వీ సాబ్ ప్రసంగం చేస్తూ ఏమన్నాడు? మనం తప్పకుండా మీలాదున్నబీ ఉత్సవాలు పాటిస్తూ ఉండాలి. దీనికి మనకు ఆధారాలు కూడా ఉన్నాయి, అని చెప్పుకొచ్చాడు. ఇక దానికి దలీల్ ఉంది, ఆధారం ఉంది అని అంటే, ప్రజలు చాలా సంతోషపడిపోతారు కదా. ఏంటి ఆధారం అండి? సహీహ్ ముస్లిం షరీఫ్‌లో హదీస్ ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి సోమవారం ఉపవాసం ఉండేవారు. అయితే, ప్రవక్తా మీరు ఎందుకు ఉపవాసం ఉంటారు అని ప్రవక్తను ప్రశ్నించినప్పుడు, “జాక యౌమున్ వులిద్తు ఫీహి” (ذَاكَ يَوْمٌ وُلِدْتُ فِيهِ) (అది నేను జన్మించిన రోజు). నేను ఆ సోమవారం రోజున జన్మించాను గనుక నేను ఉపవాసం ఉంటున్నాను. చూడండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తమ జన్మదిన వేడుకలు పాటిస్తూ ఉన్నారు. మనం కూడా పాటించడం చాలా మంచిది.

కానీ అస్తగఫిరుల్లాహ్! వాస్తవంగా ఈ హదీస్ ముస్లిం షరీఫ్‌లో ఉన్నది వాస్తవమే. కానీ దీని ద్వారా మీలాదున్నబీ మనం చేసుకోవచ్చు అన్నదానికి ఏదైతే ఆధారం తీసుకుంటున్నారో, ఆ ఆధారం కుదరదు. ఎందుకు కుదరదు? గమనించండి. మొదటి విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేసేవారు హదీస్ ప్రకారంగా? ఉపవాసం పాటించేవారు, రోజా రఖ్తే థే. ఉపవాసం పాటించేవారు. మరి ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నారు? మీలాదున్నబీ అని ఏదైతే ఉత్సవాలు జరుపుకుంటున్నారో, ఉపవాసమే పాటిస్తున్నారా కేవలం? విరుద్ధమా లేదా?

రెండో రకంగా చూసుకోండి. ఈద్-ఎ-మీలాదున్నబీ అని ఉత్సవాలు జరుపుకుంటున్నారు. మరి ఈద్ రోజున ఉపవాసం ఉండవచ్చా? వేరొక హదీస్‌లో ఉంది, అది కూడా సహీహ్ హదీస్. ఎవరైతే సహీహ్ బుఖారీ, ముస్లింలో వచ్చి ఉంది. ఎవరైతే పండుగ రోజు ఉపవాసం ఉంటారో, వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అవిధేయులు. నాఫర్మానీ చేసేవాళ్ళు. అయితే ఇక చెప్పండి. ఈద్ అని అంటున్నారు, ప్రవక్త ఉపవాసం ఉండే ఆ హదీస్ ద్వారా దలీల్ తీసుకుంటున్నారు. మరి ఈద్ రోజున, పండుగ రోజున ఉపవాసం ఉండరాదు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నవూజుబిల్లాహ్ అస్తగఫిరుల్లాహ్, అస్తగఫిరుల్లాహ్ అస్తగఫిరుల్లాహ్, ప్రవక్త స్వయంగా పండుగ రోజు ఉపవాసం ఉండరాదు అని, పండుగ రోజు ఉపవాసం ఉన్నారా? ఇది మీలాదున్నబీ అని అంటున్నారు కదా.

ఇంకా మూడో రకంగా దీన్ని ఆలోచించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి సోమవారం, అంటే సోమవారం సంవత్సరంలో ఒకసారి వస్తుందా? వారంలో ఒకసారి. అయితే వారంలో ఒకసారి వచ్చేదాన్ని, ఉపవాసం పాటించేదాన్ని వదిలేశారు, సంవత్సరంలో ఒకసారి ఈద్-ఎ-మీలాదున్నబీ అని జరుపుకుంటున్నారు. ఇది ఎక్కడ కుదురుతుంది? గమనించండి.

ఈ రకంగా చూసుకుంటూ పోతే, నాలుగో విషయం గమనించండి. అదేమిటి? సామాన్యంగా ఎవరైతే మీలాదున్నబీ ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారో, సామాన్యంగా మీలాదున్నబీ ఉత్సవాలు ఎవరు జరుపుతారు? తమకు తాము మేము ముఖల్లిద్‌లం. ఏదైనా ఒక ఇమామ్‌ను పట్టుకోవాలి, ఏదైనా ఒక ఇమామ్ యొక్క తఖ్లీద్ తప్పకుండా చేయాలి, అని అంటూ ఉంటారు కదా. అలాంటివారే మరొక విషయం ఏమంటారు? వారిలోని పండితులు కూడా, అల్లాహ్ మనందరికీ హిదాయత్ ఇవ్వుగాక, వారిలోని పండితులు కూడా ఏమంటారు? మేము ఇజ్తిహాద్ చేయడానికి, ఖురాన్ హదీస్ ద్వారా విషయాలు గ్రహించడానికి, మన ముందు ఉన్న సమస్యలకు ఖురాన్ హదీస్ ద్వారా పరిష్కారం వెతకడానికి మాకు అనుమతి లేదు. మేము ఏ ఇమామ్ యొక్క తఖ్లీద్ పాటిస్తున్నామో, ఆ ఇమామ్ ఏం చెబితే అదే మేము చేయాలి. అయితే, అటువైపున తప్పకుండా తఖ్లీద్‌ను పాటించాలి అని అంటారు. ఇటు ఈద్-ఎ-మీలాదున్నబీ వచ్చినప్పుడు స్వయంగా వారే దలీల్‌లు ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు. మరి ఇమామ్‌ల విషయం చూస్తే, ఏ ఒక్క ఇమామ్ కూడా మీలాదున్నబీ చేయాలని చెప్పలేదు. విషయం అర్థమవుతుందా? నమాజ్ విషయానికి వస్తే ఉదాహరణకు, ఎందుకు మీరు ఇలా నమాజ్ చేస్తున్నారు? ప్రవక్త యొక్క విధానం ఇది కదా అంటే, లేదు లేదు మేము ఫలానా ఇమామ్‌ను అనుసరిస్తాము. హమ్ ఫలా ఇమామ్ కే ముఖల్లిద్ హై. ఈ విధంగా అంటారు. ఇక మీలాదున్నబీ వచ్చే విషయం వచ్చేసరికి, స్వయంగా ఎన్నో దలీల్ ఆధారాలు వెతుకుతూ వెతుకుతూ వేటికి తీసుకొస్తారు. ఈ రకంగా కూడా…

ఇంకా మహాశయులారా, మరికొందరు ఏమంటారో తెలుసా? మీరు ఈద్-ఎ-మీలాదున్నబీ చేయవద్దు, చేయవద్దు, చేయవద్దు అంటారు కదా. ఈద్-ఎ-మీలాదున్నబీ చేయవద్దు అని ఎక్కడైనా దలీల్ ఉందా చూపించండి. అర్థమవుతుందా? ఈద్-ఎ-మీలాదున్నబీ చేయవద్దు అని ఎక్కడైనా దలీల్ ఉందా చూపించండి అని అంటారు. మరి వారితోనే ఈ ప్రశ్న అడిగితే, ఏమని? ఈద్-ఎ-మీలాదున్నబీ చేయవచ్చు అని ఎక్కడ దలీల్ ఉంది చూపించండి. ఈద్-ఎ-మీలాదున్నబీ అన్న పదాలతో. ఎక్కడా లేదు హదీసులలో. సోమవారం రోజు ఉపవాసం ఉండేవారు ప్రవక్త. హదీస్ ఏదైతే వచ్చి ఉందో, దాని ద్వారా దలీల్ తీసుకుంటున్నారు. ఇంకా వేరే ఎలాంటి దలీల్‌లు నేను చూపిస్తాను ఇన్షా అల్లాహ్, అందులో కూడా భావం వారు తప్పుగా ఎలా తీసుకుంటున్నారో. అయితే, ఈద్-ఎ-మీలాదున్నబీ చేయకూడదు అని దలీల్ మాతోనే అడుగుతున్నారు. అప్పుడు మేమే అడిగినప్పుడు, ఈద్-ఎ-మీలాదున్నబీ చేయవచ్చు అని ఎక్కడ దలీల్ ఉంది చూపించండి అంటే, వారి వద్ద ఎలాంటి సమాధానం లేదు. ఈద్-ఎ-మీలాదున్నబీ చేయవచ్చు అని ఎక్కడా దలీల్ లేదు.

ఇక మాట వచ్చింది గనుక ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. అదేమిటంటే, ఆరాధనలు, ఇబాదాత్, వీటిలో దలీల్, ఆధారం చేయడానికి ఉండాలి. ప్రవక్త ఇలా చేశారు. అల్లాహ్ ఇలా ఆదేశించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు అని చేయడానికి ఆధారం ఉండాలి. చేయకూడదు అన్నదానికి కాదు. మరియు ఏ విషయం చేయమని ఉందో, అది మాత్రమే మనం చేయాలి. ఏ విషయం ప్రస్తావన లేదో, దానిని చేయకూడదు. ఎందులో ఇది? ఇబాదాత్‌లో, ఆరాధనలలో. ఉదాహరణకు, ఉపవాసం, రోజా, మంచి విషయమేనా కాదా? అల్లాహ్‌కు చాలా ఇష్టమైన సత్కార్యం కదా. రమదాన్‌లో ఇది ఫర్జ్, విధి. ఎవరైనా ఒక మనిషి వచ్చి, ఎవరైనా ఒకరు వచ్చి, ఇస్లామీయ ప్రకారం నాలుగో నెల రబీఉల్ ఆఖర్. ఇందులో కూడా మనం ఇన్ని రోజులు ఉపవాసం ఉంటే మనకు ఇలాంటి లాభాలు అని చెప్తే, దానిని మనం ఒప్పుకోవచ్చా? ఎక్కడుంది ఆధారం చూపించు.

ఇప్పుడు ఆ మనిషి మళ్లీ, రబీఉల్ అవ్వల్‌లోని ఈ మాసంలో ఉపవాసాలు ఉండకండి అని ప్రవక్త ఎక్కడైనా చెప్పారా అని మనకు అడ్డ ప్రశ్న వేస్తే, ఆ ప్రశ్నయే తప్పు అక్కడ. అర్థమైందా? ఉదాహరణకు నమాజ్ విషయం తీసుకోండి. నమాజ్ విషయం. ఐదు పూటల నమాజ్‌లు విధి అని మనకు తెలుసు కదా. ఇవి కాకుండా ఫర్జ్ నమాజ్‌ల కంటే ముందు సున్నతులు, ఫర్జ్ నమాజ్‌ల కంటే తర్వాత సున్నతులు, నఫిల్ నమాజ్‌లు, ఇంకా వేరే చాష్త్, సలాతుల్ ఇస్తిస్కా వర్షం గురించి నమాజ్, సలాతుల్ కుసూఫ్ సూర్య గ్రహణ, చంద్ర గ్రహణ నమాజ్‌లు, జుమ్మా నమాజ్, ఈ విధంగా ఎన్నో రకాల నమాజ్‌లు ఉన్నాయి కదా. వాటన్ని వివరాలు వచ్చి ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి 15వ తారీఖు షాబాను రాత్రి ఎవరైనా 100 రకాతుల నమాజ్‌లు చేసి, ప్రతి ఒక్క రకాతులో 10, 10 సార్లు ఖుల్ హువల్లాహ్ చదవాలి సూరె ఫాతిహా తర్వాత అని ఈ విధంగా ఒక పద్ధతి మనకు నేర్పుతే, మనం ఏమడుగుతాము? నమాజ్ మంచి విషయమే. కానీ ఈ విధంగా ఒక తారీఖు ముకర్రర్ చేసి, ఒక పద్ధతి నిర్ణయించి నువ్వు ఏదైతే చెబుతున్నావో, దానికి ఏమిటి ఆధారం? ఆ, 15వ తారీఖు షాబానున ఈ రకంగా నమాజ్ చేయవద్దు అని ఎక్కడ దలీల్ ఉంది చూపించు అని అంటే? అతని ఆ ప్రశ్నయే అడ్డ ప్రశ్న, అలా అడగడమే తప్పు. ఇప్పుడు మాట అర్థమైంది కదా? ఇంతకంటే మరొక చిన్న ఉదాహరణ ఇచ్చేసి నేను ఇక ముందుకు వెళ్తాను. అదేమిటి?

ప్రతి రోజు మనం అజాన్ వింటున్నాము కదా? అజాన్ యొక్క చివరి పదాలు ఏంటి చెప్పండి? అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్. సామాన్యంగా మనం వుజూ చేసుకున్న తర్వాత గాని, తషహుద్‌లో గాని, వేరే సందర్భాల్లో అవ్వల్ కలిమా తయ్యిబ్ ఏమంటాము తర్వాత? లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. మనం చిన్నప్పుడు వినేవాళ్ళం కదా, చదివేవాళ్ళం కదా. ఆరు కల్మాల యొక్క వాస్తవికత మరి ఎప్పుడైనా తెలియజేస్తాను ఏంటి అనేది. దానిలో ఉన్న బిద్అతులు ఏంటి అది మరి ఎప్పుడైనా తెలుసుకోండి. కానీ ఇక్కడ అవ్వల్ కలిమా తయ్యిబ్ అని మనలో చాలా ఫేమస్ ఉంది, చిన్నప్పటి నుండి మనం నేర్చుకుంటూ వస్తాము. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. కదా? ఇప్పుడు ఎవరైనా అజాన్ తర్వాత చివరిలో అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని అంటే, మంచిదేనా? ఎందుకు? మంచిది కాదు అని అంటున్నాము కదా మనం, ధర్మం కాదు అని అంటున్నాము కదా. అయితే ముహమ్మదుర్ రసూలుల్లాహ్ ఈ పదం తప్పా? కాదు. ఇక్కడ ఏమంటాము మనం? ప్రవక్త ఇంతే మనకు నేర్పారు ఇక్కడ అజాన్‌లో. లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ వేరే సందర్భాల్లో చదువుతాం మనం. వుజూ చేసిన తర్వాత అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహ్ అని చదువుతాము. తషహుద్‌లో ఉన్నప్పుడు కూడా మనము అవన్నీ ఎక్కడ చదువుతాము. ఎక్కడ ఏ విధంగా నేర్పారో అక్కడ అలా చదువుతాము. కానీ అజాన్ తర్వాత ఇక్కడ మనకు ఏం నేర్పబడింది? కేవలం లా ఇలాహ ఇల్లల్లాహ్ మీద చదివి అజాన్ ఆపేసేయాలి. ఇప్పుడు ఎవరైనా వచ్చి అడ్డ ప్రశ్న అడిగితే, అరే నేను ముహమ్మదుర్ రసూలుల్లాహ్ కూడా అంటానయ్యా. ఎక్కడైనా ఉందా హదీస్‌లో ముహమ్మదుర్ రసూలుల్లాహ్ చెప్పొద్దు అజాన్ చివరలో అని? అంటే ఏమంటాము? నీ ప్రశ్నయే తప్పు ఇక్కడ. అర్థమైంది కదా? ఆరాధనలలో ప్రవక్త ఎలా చేశారు, ఎలా చేయాలని చెప్పారు, ఎలా చేయాలని అనుమతించారు, లేదా అల్లాహ్ ఎలా మనకు ఆదేశించాడు, అలాగే చేయాలి. కానీ వివిధ జీవితంలోని విషయాలు ఏవైతే ఉన్నాయో, ముఆమలాత్ అని దేనినైతే అనబడడం జరుగుతుందో, పెళ్లిళ్లు గాని, ఇంకా వ్యాపారాలు గాని, లావాదేవీలు గాని, ఇవన్నిటిలో, భోజనాలు తినే, త్రాగే విషయాల్లో, దుస్తులు ధరించే విషయాల్లో, ఇవన్నీ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇందులో నహీ, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు. పురుషులు చీలమండలానికి కిందిగా డ్రెస్ తొడుగకూడదు. భోజనం చేసేటప్పుడు ఆనుకొని, టేకా తీసుకొని తినకూడదు. ఈ విధంగా ఏ విషయాల నుండి మనల్ని నివారించడం జరిగిందో, వాటికి మనం దూరంగా ఉండాలి. అవి తప్ప మిగతావన్నీ కూడా హలాల్‌గా పరిగణించడం జరుగుతుంది. ఇంకా వేరే ఎన్నో ఆయతులు ఉన్నాయి, హదీసులు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే రండి ఇక.

చాలా దూరం వెళ్ళిపోలేదు. ఈద్-ఎ-మీలాదున్నబీ విషయం ఏదైతే ఉందో, దాని విషయంలో కూడా ఈద్-ఎ-మీలాదున్నబీ చేయకూడదు అని దలీల్ ఎక్కడుంది చూపించండి అని అడగడానికి హక్కు లేదు. ఎందుకంటే ఈ ప్రశ్నయే తప్పు. ప్రవక్త ఎక్కడ చేశారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి 40 సంవత్సరాల వయసులో ప్రవక్త పదవి లభించినది. ఆ తర్వాత 23 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. ఆ తర్వాత సహాబాలు ఇంచుమించు 100 సంవత్సరాల వరకు ఉన్నారు. చివరి సహాబీ 110 లో చనిపోయారు. ఆ తర్వాత తాబయీన్ కాలం, ఆ తర్వాత తబఎ తాబయీన్ కాలం. సహీహ్ బుఖారీలో వచ్చిన హదీస్ ప్రకారంగా, “ఖైరుల్ ఖురూని ఖర్నీ సుమ్మల్లజీన యలూనహుమ్ సుమ్మల్లజీన యలూనహుమ్” ( خَيْرُ الْقُرُونِ قَرْنِي ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ). (అనువాదం: నా కాలం, నా తర్వాత వచ్చే కాలం, ఆ తర్వాత వచ్చే కాలం, సర్వ కాలాల్లో అతి ఉత్తమమైన కాలాలు ఇవి మూడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు). అలాంటి ఉత్తమమైన కాలంలో ఈ బిద్అత్ లేనే లేదు.

అందుగురించి మహాశయులారా, ఇది మంచి కార్యమే కదా, ఎందుకు చేయకూడదు? ఇలాంటి ప్రశ్నల్లో మనం పడే అవసరం లేదు. ప్రవక్త గారు చేశారా? సహాబాలు చేశారా? సహాబాలను అనుసరించినవారైనటువంటి తాబయీన్‌లు చేశారా? ఈ విషయం మనం చూడాలి. మరొక విచిత్రమైన విషయం, అదేమిటంటే కాంట్రడిక్షన్. ఎవరైతే సామాన్యంగా మీలాదున్నబీ జరుపుకుంటూ ఉంటారో, ఏ తారీఖున జరుపుకుంటారు? తారీఖు తెలియదా? 12 రబీఉల్ అవ్వల్. కదా? అయితే ఈ తారీఖు అని మనం ఏదైతే అంటామో, డేట్, ఇవి ఎప్పటి నుండి ఉన్నాయి? ఎప్పటి నుండి? భూమి, ఆకాశాలు, సూర్య, చంద్రులు అప్పటి నుండి, అవును కదా? “ఇన్న ఇద్దతష్షుహూరి ఇందల్లాహి ఇస్నా అషర షహ్రన్ ఫీ కితాబిల్లాహ్” సూరె తౌబా లోని ఆయత్. అయితే, మీలాదున్నబీ జరుపుకునే వాళ్లలో అధికులు, ఇంచుమించు అందరూ ప్రవక్త గారి గురించి ఒక మాట వారి వద్ద ఏమున్నదంటే, నవూజుబిల్లాహ్ అస్తగఫిరుల్లాహ్, ఒక హదీస్ అని వారు అంటారు కానీ హదీస్ కాదు అది. “అవ్వలు మా ఖలఖల్లాహు నూరీ” (أَوَّلُ مَا خَلَقَ اللَّهُ نُورِي) (అనువాదం: అల్లాహ్ సృష్టించిన వాటిలో మొదటిది నా జ్యోతి). ప్రప్రథమంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నూర్‌ను అల్లాహుతాలా పుట్టించాడు, ఆ తర్వాతనే ఈ లోకమంతా పుట్టించబడింది అని. మొట్టమొదటిసారిగా, తొలిసారిగా, ప్రప్రథమంగా ఎవరిని పుట్టించడం జరిగింది అంటారు వాళ్ళు? సహీహ్ హదీస్ లేదు దానికి కానీ వారు చెప్పే ప్రకారంగా ఎవరిని పుట్టించడం జరిగింది? ప్రవక్త గారి నూర్‌ను. అంటే వారి ప్రకారంగా ప్రవక్త అందరికంటే మొదటిసారిగా పుట్టించబడ్డారు. అయితే మీ విశ్వాస ప్రకారం ప్రవక్త పుట్టినప్పుడు సూర్య చంద్రులు లేవు, భూమి ఆకాశాలు లేవు, పగలు రాత్రి అనేదే లేదు, డేట్ అన్నదే లేదు. మరి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఎందుకు మళ్ళీ బర్త్‌డేలు జరుపుకుంటున్నారు? అర్థమైందా? అర్థమైందా లేదా విషయం? మీ విశ్వాస ప్రకారం అందరికంటే ముందు ఎవరు పుట్టారు? ప్రవక్త, ప్రవక్త యొక్క నూర్. అప్పుడు సూర్య చంద్రులు, ఈ నక్షత్రాలు, ఈ లోకమే లేదు. మరి ఈ తారీఖు అన్న విషయం, డేట్ అన్న విషయం భూమి ఆకాశాలు పుట్టి, సూర్య చంద్రులు తర్వాత కదా? రాత్రి, పగలు ద్వారా మనకు డేట్స్ అనేది ఏర్పడతాయి. ఈ విధంగా వారి మాటయే వారికి విరుద్ధంగా ఉంది.

మరొక విచిత్రమైన విషయం. ఒక మౌల్వీ సాబ్ చాలా పుస్తకం రాశారు, మీలాదున్నబీ చేయవచ్చు అని రుజువు చేయడానికి. స్వయంగా ఆయన ఒకచోట ఏం రాశాడో తెలుసా? ఒక్కచోట రాయలేదు, ఒక హెడ్డింగ్, ఒక సైడ్ హెడ్డింగ్ అని ఏదైతే అంటారో. ఖులఫాయే రాషిదీన్ మరియు సహాబాల కాలంలో మీలాదున్నబీ జరుపుకోకపోవడానికి కారణాలు. అంటే, సహాబాల కాలంలో మీలాదున్నబీ జరగలేదు అని ఒప్పుకుంటున్నారు. కానీ ఇక తర్వాత వచ్చి ఏం చేస్తున్నారు? కొన్ని కారణాలు తెలుపుతున్నారు. అయితే ఎప్పుడైతే వారు ఒప్పుకుంటున్నారో సహాబాలు కూడా దీనిని చేయలేదు అని, అంటే ఇక ఖురాన్ హదీస్‌లో లేనట్లే కదా. మళ్ళీ మీలాదున్నబీ జరుపుకోవడానికి ఆ ఆయత్ కూడా ఉన్నది, ఫలానా ఆయత్ ఉన్నది, ఫలానా హదీస్ ఉన్నది, ఫలానా హదీస్ ఉన్నది అని అంటే, ఈ రోజు ఈ హదీసులు, ఈ ఆయతులతోనైతే మీరు దలీల్ చూపుతున్నారో, ఆ ఆయతులు, ఆ హదీసులు సహాబాలకు తెలియలేదా? మరి తెలిస్తే వారెందుకు జరుపుకోలేదు? గమనించండి.

మరియు మన ఏ సోదరులైతే మీలాదున్నబీ జరుపుకుంటున్నారో, వారు ఈ విషయాలపై గ్రహించాలి, ఆలోచించాలి. సూరె యూనుస్ ఆయత్ నంబర్ 57, 58 ద్వారా మీలాదున్నబీ చేయవచ్చు అన్నటువంటి ఒక ఆధారం, సాకు తీసుకునే ప్రయత్నం చేస్తారు. గమనించండి కొంచెం. “కుల్ బి ఫద్లిల్లాహి వ బిరహ్మతిహి, ఫబిజాలిక ఫల్ యఫ్రహూ” (قُلْ بِفَضْلِ اللَّهِ وَبِرَحْمَتِهِ فَبِذَٰلِكَ فَلْيَفْرَحُوا). బి ఫద్లిల్లాహి, అల్లాహ్ యొక్క దయ, వ రహ్మతిహి, అల్లాహ్ యొక్క కారుణ్యం. అల్లాహ్ యొక్క దయ మరియు కారుణ్యం మీకు లభించినది అంటే, మీరు సంతోషించండి. ఖురాన్ యొక్క ఆయత్ యొక్క భావం, తర్జుమా. కానీ ఉర్దూలో అల్లాహ్ కా ఫజ్ల్ ఔర్ ఉస్కి రహ్మత్ జబ్ యే పాయే తో వో ఖుష్ హో జాయే. సంబరపడాలి, సంతోషించాలి. దాంట్లో కొంచెం పదం ఏలుపు… పెంచుతారు. ఖుషీ మనాయో. ఖుష్ హో జావో, ఖుషీ మనాయో. సంతోషించండి, సంబరపడండి. సంతోషాలను, మీ సంబరాలను ఒక ఉత్సవంగా జరుపుకోండి. ఈ రెండిటిలో తేడా ఉందా లేదా? ఒక నిమిషం.

అయితే ఇది 58వ ఆయత్. కానీ ఈ అల్లాహ్ యొక్క దయ, ఈ అల్లాహ్ యొక్క కారుణ్యం, అల్లాహ్ దేని గురించి చెప్తున్నాడు? ఏంటిది అది? అయితే 57వ ఆయత్‌లో ఉంది. “యా అయ్యుహన్నాసు కద్ జాఅత్కుమ్ మౌఇజతుమ్ మిర్రబ్బికుమ్” (يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَتْكُم مَّوْعِظَةٌ مِّن رَّبِّكُمْ). ఖురాన్ గురించి. అంటే ఈ ఖురాన్ గ్రంథం అల్లాహ్ యొక్క గొప్ప దయ, అల్లాహ్ యొక్క గొప్ప కారుణ్యం. ఇది రావడం ద్వారా మీ మనసులో ఉన్నటువంటి రోగాలు దూరమైపోయినాయి, మీలో ఉన్నటువంటి పరస్పరం కోపాలు, ద్వేషాలు ఇవన్నీ దూరమయ్యాయి, షిర్క్, బిద్అతులు ఇవన్నీ దూరమైపోయాయి, విశ్వాస మార్గం మీకు లభించినది, మీ సమాజంలో ఉన్నటువంటి ఎన్నో దుర్మార్గాలు కూడా దూరమైపోయి మీరు సన్మార్గం వైపునకు వచ్చారు. ఖురాన్ అల్లాహ్ యొక్క గొప్ప దయ, గొప్ప కారుణ్యం. ఇది వచ్చినప్పుడు మీరు దీనిని సంతోషించాలి. అయితే ఏమంటారో తెలుసా? ఖురాన్ అవతరించినప్పుడు అల్లాహ్ దీనిని ఒక గొప్ప కారుణ్యం, గొప్ప దయ అని తెలిపి సంతోషపడాలి, సంతోషించాలి, ఉత్సవాలు జరుపుకోవాలి అని ఏదైతే మనకు అల్లాహ్ తెలుపుతున్నాడో, ఈ ఖురాన్ ఎవరి ద్వారా వచ్చింది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక ప్రవక్త పుట్టిన రోజును మనం ఎంత గొప్పగా జరుపుకోవాలి, మీరే ఆలోచించండి. ఓ నిజంగానే చాలా గొప్ప విషయం అని ప్రజలు అనుకుంటారు. కానీ ఇక్కడ మళ్ళీ ప్రశ్న, అదేంటి? ఈ ఆయత్ ఎవరిపై అవతరించింది? ఈ రోజు మనపై అవతరించిందా? మీలాదున్నబీ జరుపుకునే వాళ్ళ మీద అవతరించిందా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించింది. మరి ప్రవక్త ఇలాంటి మీలాదున్నబీ జరుపుకోవాలి అని ఈ ఆయత్ ద్వారా ఎక్కడైనా చెప్పారా? మరి ఈ విషయం సహాబాలకు బోధపడలేదా? ఈ రోజు ఈ భావం తీసుకోవడానికి ఎక్కడ మనకు హక్కు ఉన్నది?

మరియు ఖురాన్ హదీసులను మనం పరిశీలిస్తే, అక్కడ మనకు తెలిసే విషయం ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పుట్టుకను కేవలం గొప్ప కారుణ్యంగా చెప్పలేదు అల్లాహుతాలా. ఏ రోజు ప్రవక్తకు ప్రవక్త పదవి లభించినదో, ఏ రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఖురాన్ లభించినదో, దానిని అల్లాహుతాలా ఒక గొప్ప కారుణ్యంగా చెబుతున్నాడు. సూరె ఆలి ఇమ్రాన్‌లో “లఖద్ మన్నల్లాహు అలల్ ముఅమినీన ఇజ్ బఅస ఫీహిమ్” ( لَقَدْ مَنَّ اللَّهُ عَلَى الْمُؤْمِنِينَ إِذْ بَعَثَ فِيهِمْ). అల్లాహుతాలా విశ్వాసులపై ఎంతో అనుగ్రహించాడు. “ఇజ్ బఅస ఫీహిమ్” ( إِذْ بَعَثَ فِيهِمْ) (వారిలో ఒక ప్రవక్తను పంపినప్పుడు). ఎలా? వారిలో నుండే ఒక ప్రవక్తను ఎన్నుకొని వారి మధ్య ఒక సందేశ దూతగా అల్లాహుతాలా పంపాడు. ఆ సందేశ దూత ఖురాన్ ఆయతులను పఠిస్తారు వారి మధ్యలో. మరియు వారిని శుభ్రపరుస్తారు. చక్కదిద్దుతారు. వారికి ఖురాన్, హదీసులను నేర్పుతారు. గమనించండి. ఖురాన్, హదీసులను నేర్పడం, అల్లాహ్ ఆయతులను పఠించడం, ప్రజలను షిర్క్, దుర్మార్గం, బిద్అత్, అన్ని రకాల చెడుల నుండి మంచి వైపునకు తీసుకురావడం, దీనిని ఒక గొప్ప అనుగ్రహంగా ప్రస్తావిస్తున్నారు. మరి ఇంతకుముందు మనం ముస్లిం షరీఫ్ హదీస్ ఏదైతే విన్నామో, అందులో మరొక విషయం కూడా ఉన్నది. అదేమిటి?

ప్రవక్తా, మీరు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు ఈ సోమవారం రోజున అని అడిగినప్పుడు, ఇదే రోజు నేను పుట్టాను, జన్మించాను. “వ బుఇస్తు” ( وَبُعِثْتُ). మరియు అదే రోజు నాకు ప్రవక్త పదవి లభించినది. ప్రవక్త పదవి లభించినది. అయితే ఈ ప్రవక్త పదవి లభించడం, ప్రవక్తకు ప్రవక్త పదవి లభించి మనకు ఏ సన్మార్గం అయితే లభించినదో, ఇది చాలా గొప్ప విషయం.

అందుగురించి సోదరులారా, ఈ విధంగా మనం ఆలోచిస్తూ పోతే, గ్రహిస్తూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. చివరికి ఒక సంక్షిప్తంగా, ఇంతకుముందు కూడా కొన్ని సంవత్సరాల క్రితం మీలాదున్నబీకి సంబంధించిన ఒక తెలుగులో ఒక టాపిక్, ఒక ప్రసంగం చేశాను. అందులో ఈ బిద్అత్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అది కూడా వివరంగా తెలిపాను, తెలియజేశాను. కానీ మన అఖండ భారత్‌లో అంటే, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇదంతా విడిపోక ముందు, సంగతి గురించి అప్పుడు తొలిసారిగా మన ఏరియాలో, భారతదేశంలో ఈ మీలాదున్నబీ యొక్క జులూస్ ఏదైతే వెళ్తుందో, ఆ జులూస్ 5 జులై 1933లో స్టార్ట్ అయింది అని, ఈ మీలాదున్నబీ యొక్క జులూస్ ఏదైతే వెళ్తుందో, అది 5 జులై 1933లో మన ఇండియాలో స్టార్ట్ అయింది. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలన అక్కడ జరుగుతుంది. వారి నుండి దీని గురించి ప్రత్యేకమైన లైసెన్స్ తీసుకొని వారు కొందరు దీనిని చేశారు. దీనిని ఇలా జరుపుకోవడానికి కారణం ముఖ్యంగా ఏంటో తెలుసా? పండితులు కాదు దీనిని స్టార్ట్ చేసిన వారు.

క్రైస్తవులు, ఇంకా వేరే మతస్తులు వారి మత పెద్దల జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. జరుపుకుంటూ ఉంటారు కదా? క్రిస్మస్ అని కానీ, గాంధీ జయంతి అని కానీ, ఇంకా అంబేద్కర్ గారు జన్మించిన జన్మదినం గాని, ఇంకా వేరే ఎన్నో రకాలుగా ఎందరో పెద్దలు, మహానుభావుల జన్మదిన వేడుకలు జరుగుతూ ఉంటాయి. అయితే వాళ్ళందరూ వారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నప్పుడు, మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే గొప్పవారు ఎవరు? వారి యొక్క జన్మదిన వేడుకలు మనం ఎందుకు జరుపుకోకూడదు? మనం ఆ రోజున ఎందుకు జులూస్ తీయకూడదు? ఇలాంటి ఆలోచన వారిలో వచ్చి, ఇలాంటి ఒక బిద్అత్‌కు వారు ఒక పునాది నాటారు. అప్పటి నుండి ఇది మొదలైంది ఈ ఏరియాలో. మరి ఇక్కడ మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసును గ్రహించాలి. “మన్ తషబ్బహ బి కౌమిన్ ఫహువ మిన్హుమ్” (مَنْ تَشَبَّهَ بِقَوْمٍ فَهُوَ مِنْهُمْ). (ఎవరైతే ఇతర జాతుల, ఇతర మతస్తుల, ఇతర ధర్మాలను అనుసరించే వారి యొక్క పోలికను అవలంబిస్తాడో, వారి గతి వారితోనే అయిపోతుంది). అల్లాహు అక్బర్ అస్తగఫిరుల్లాహ్. ఇది ఇష్టమేనా మనలో ఎవరికైనా?

అల్లాహ్ ఏమంటున్నాడు మనకు? “వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్” (وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ). (మీకు చావు వచ్చినా కానీ ఇస్లాంపై, కల్మా చదువుతూ, ఇస్లాం ప్రకారంగా మీ చావు రావాలి). అంటే, చచ్చేవరకు మీరు ఇస్లాంపై జీవించాలి. అందుగురించి, బర్త్‌డేలు జరుపుకోవడం, అది ప్రవక్త బర్త్‌డే గాని, స్వయంగా మన బర్త్‌డేలు గాని, ఇంకా వేరే ఏ విషయాలు కానీ, ఇస్లాంకు వీటికి ఎలాంటి సంబంధం అనేది లేదు. ఇందులో మనకు పుణ్యం లభించదు, పాపం అవుతుంది. అల్లాహ్ ఇలాంటి బిద్అతుల నుండి, దురాచారాల నుండి మనందరినీ కూడా కాపాడుగాక.

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఇంకా చదవండి: