[16:36 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [16:36 నిముషాలు]
ఈ ప్రసంగం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) శుభ జననానికి ముందు అరబ్ ద్వీపకల్పం యొక్క మత, ఆర్థిక మరియు సామాజిక పరిస్థితులను వివరిస్తుంది. బహుదేవతారాధన, అజ్ఞానం మరియు అన్యాయం ప్రబలంగా ఉన్న ఆ కాలాన్ని ఇది విశ్లేషిస్తుంది. ప్రవక్త గారి తండ్రి అయిన అబ్దుల్లా మరియు ఇస్మాయీల్ (అలైహిస్సలాం) లను ‘ఇబ్నుద్-దబీహైన్’ (బలి ఇవ్వబడిన ఇద్దరి కుమారుడు) అని ఎందుకు అంటారో చారిత్రక సంఘటనలతో వివరిస్తుంది. అబ్దుల్ ముత్తలిబ్ మొక్కుబడి, అబ్దుల్లా వివాహం, ఆయన మరణం, మరియు చివరకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జననం గురించి చర్చిస్తుంది. ప్రవక్త జననానికి కొద్ది కాలం ముందు జరిగిన ‘ఏనుగుల సంఘటన’ (ఆముల్ ఫీల్) గురించి కూడా ఇది వివరంగా తెలియజేస్తుంది, దీనిలో అబ్రహా మరియు అతని సైన్యం కాబాగృహాన్ని కూల్చివేయడానికి వచ్చి అల్లాహ్ యొక్క అద్భుత శక్తి ద్వారా ఎలా నాశనమయ్యారో వివరిస్తుంది.
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكاتُهُ
(అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
(మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు కలుగుగాక)
اَلْحَمْدُ لِلّٰهِ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُوْلِ اللّٰهِ، أَمَّا بَعْدُ
(అల్హమ్దులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్)
(సర్వ స్తోత్రాలు అల్లాహ్ కొరకే. అల్లాహ్ యొక్క ప్రవక్తపై శాంతి మరియు శుభాలు కలుగుగాక. ఆ తర్వాత…)
సీరత్ పాఠాలు. మొదటి పాఠం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభ జననానికి పూర్వపు అరబ్ స్థితి.
సోదర సోదరీమణులారా! అల్లాహ్ తర్వాత ఈ సర్వ సృష్టిలో అత్యంత శ్రేష్ఠులైన, సర్వ మానవాళి కొరకు కారుణ్య మూర్తిగా, ఆదర్శ మూర్తిగా పంపబడినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభ జీవిత చరిత్ర మనం తెలుసుకోబోతున్నాము. ఇన్ షా అల్లాహ్ (అల్లాహ్ తలిస్తే), చిన్న చిన్న పాఠాలు మనం వింటూ ఉందాము. చివరి వరకు మీరు ప్రతి ఎపిసోడ్ పూర్తి శ్రద్ధాభక్తులతో విని, ఒక ఆదర్శవంతమైన, మంచి జీవితం గడపడానికి ఉత్తమ గుణపాఠాలు పొందుతారని ఆశిస్తున్నాను.
ఈనాటి మొదటి పాఠంలో మనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు అరబ్ యొక్క స్థితిగతులు ఎలా ఉండినవి తెలుసుకుందాము.
వారి యొక్క ధార్మిక జీవితం
అరబ్బులు ఏకదైవారాధనను వదులుకొని బహుదేవతారాధన మీదనే ఆధారపడి జీవిస్తున్నందువల్ల, వారి ఆ కాలాన్ని అజ్ఞాన కాలం అని చెప్పడం జరిగింది. అరబ్బులు ఏ విగ్రహాలనైతే పూజించేవారో, వాటిలో ప్రఖ్యాతి గాంచినవి లాత్ (اللَّات), ఉజ్జా (الْعُزَّى), మనాత్ (مَنَاة) మరియు హుబుల్ (هُبَل). అయితే వారిలో కొంతమంది యూదుల మతాన్ని, క్రైస్తవ మతాన్ని అవలంబించిన వారు కూడా ఉండిరి. అలాగే కొందరు పార్శీలు, అగ్ని పూజారులు కూడా ఉండిరి. బహు తక్కువ మంది బహుదేవతారాధనకు అతీతమైన, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క సవ్యమైన, సన్మార్గమైన సత్య ధర్మంపై కూడా ఉండిరి.
ఆర్థిక జీవితం
ఇక వారి ఆర్థిక జీవితం, ఎడారి వాసుల (అనాగరికుల) పూర్తి ఆధారం పశు సంపద, వాటిని మేపుటయే ఉండింది. నాగరికతలో ఉన్నవారు వ్యవసాయం మరియు వ్యాపారంపై ఆధారపడి ఉండిరి. ఇస్లాం ధర్మజ్యోతి ప్రకాశించేకి కొంచెం ముందు, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు, ఆది మానవుడు ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఎంతరు ప్రవక్తలైతే వచ్చారో వారందరూ తీసుకువచ్చిన ధర్మం ఒకే ఒక సత్యమైన ధర్మం ఇస్లాం. కాకపోతే, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందు కాలంలో ఆ సత్యమైన ధర్మం ఇస్లాం యొక్క రూపు మాపేశారు. దానిని దాని అసలు రూపంలో తెలుపుతూ సంపూర్ణం చేయడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పంపడం జరిగింది. అయితే ఇస్లాం ధర్మజ్యోతి ప్రకాశించేకి ముందు, ఈ జ్యోతిని తీసుకువచ్చినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శుభ జననానికి ముందు, మక్కా అరబ్ ద్వీపంలో ఒక గొప్ప వ్యాపార కేంద్రంగా, ఆర్థిక కేంద్రంగా పేరు దాల్చింది. తాయిఫ్ మరియు మదీనా లాంటి కొన్ని నగరాల్లో మంచి నాగరికత ఉండినది.
సామాజిక వ్యవస్థ
ఇక వారి సామాజిక వ్యవస్థను చూసుకుంటే, చాలా బాధాకరంగా ఉండినది. అన్యాయం విపరీతంగా వ్యాపించి, బలహీనులకు ఏ హక్కు లేకుండా ఉండింది. ఆడబిడ్డలను కొందరు సజీవ సమాధి చేసేవారు. మానభంగాలకు పాల్పడేవారు. బలహీనుల హక్కులను బలవంతుడు కాజేసేవాడు. హద్దు లేకుండా భార్యలను ఉంచుకోవడం సర్వసామాన్యమైపోయి ఉండినది. వ్యభిచారం కూడా కొన్ని తెగలలో విచ్చలవిడిగా మొదలైపోయింది. తుచ్ఛమైన కారణాలపై సంవత్సరాల తరబడి అంతర్యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఒకప్పుడు ఒకే తెగకు సంబంధించిన సంతానంలో కూడా కొంత కాలం వరకు యుద్ధం జరుగుతూ ఉండేది. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శుభ జననానికి ముందు ఉన్నటువంటి ధార్మిక, ఆర్థిక మరియు సామాజిక వ్యవస్థ యొక్క సంక్షిప్త రూపం.
ఇబ్నుద్-దబీహైన్ (ابْنُ الذَّبِيحَيْنِ) గురించి
ఇక రండి మనం తెలుసుకుందాము ఇబ్నుద్-దబీహైన్ (ابْنُ الذَّبِيحَيْنِ) గురించి. అంటే ఏమిటి? ఇబ్న్ (ابْن) అంటే కుమారుడు, దబీహైన్ (الذَّبِيحَيْنِ) అంటే బలి చేయబడటానికి సిద్ధమైనటువంటి ఇద్దరు వ్యక్తులు. ఒకరైతే తెలుసు కదా? ఇస్మాయీల్ దబీహుల్లాహ్ (إِسْمَاعِيلُ ذَبِيحُ اللهِ) అని చాలా ఫేమస్. ఇబ్రాహీం అలైహిస్సలాం వృద్ధాప్యంలో చేరినప్పుడు మొట్టమొదటి సంతానం ఇస్మాయీల్ ప్రసాదించబడ్డారు. అయితే ఎప్పుడైతే ఇస్మాయీల్ తండ్రి వేలు పట్టుకొని, తండ్రితో పాటు పరిగెత్తే అటువంటి వయసుకు చేరుకున్నాడో, “నీ ఏకైక సంతానాన్ని నీవు జిబహ్ (ذِبْح – బలి) చేయమని” అల్లాహు తఆలా స్వప్నంలో చూపాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ ఆదేశం మేరకు సిద్ధమయ్యారు, కానీ అల్లాహు తఆలా ఒక పొట్టేలును పంపించేశాడు. ఇస్మాయీల్ కు బదులుగా దానిని జిబహ్ చేయడం జరిగింది. ఈ సంఘటన చాలా ఫేమస్. మరి రెండవ దబీహ్ (ذَبِيح – బలి ఇవ్వబడినవాడు) ఎవరు? అదే విషయం ఇప్పుడు మనం వినబోతున్నాము.
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క తాత అబ్దుల్ ముత్తలిబ్, అధిక ధనం, అధిక సంతానం వల్ల ఖురైషులు అతన్ని చాలా గౌరవించేవారు. ఒకప్పుడు అబ్దుల్ ముత్తలిబ్, “అల్లాహ్ గనక నాకు పది మంది మగ సంతానం ప్రసాదిస్తే వారిలో ఒకరిని నేను జిబహ్ చేస్తాను, బలిదానం ఇస్తాను” అని మొక్కుకున్నాడు. అతని కోరిక నెరవేరింది. పది మగ సంతానం కలిగారు అతనికి. వారిలోనే ఒకరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క తండ్రి అబ్దుల్లా.
అబ్దుల్ ముత్తలిబ్ తన మొక్కుబడిని పూర్తి చేయడానికి తన పది మంది సంతానంలో పాచిక చీటీ వేశారు. వారిలో అబ్దుల్లా యొక్క పేరు వచ్చింది. ఇక అబ్దుల్లాను బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళేటప్పుడు ఖురైషులు అడ్డుకున్నారు. “ఇలా జిబహ్ చేయకూడదు, బలిదానం ఇవ్వకూడదు” అని. తర్వాత కాలాల్లో ఇదే ఒక ఆచారంగా మారిపోతే ఎంత ప్రమాదం అన్నటువంటి భయాందోళనకు గురి అయ్యారు. అయితే వారు ఒక నిర్ణయానికి వచ్చారు. అబ్దుల్లాకు బదులుగా పది ఒంటెలను నిర్ణయించి, వారి మధ్యలో చీటీ వెయ్యాలి. మరియు ఒంటెలను అబ్దుల్లాకు బదులుగా జిబహ్ చేయాలి. చీటీ వేశారు, మళ్ళీ అబ్దుల్లా పేరు వచ్చింది. అయితే వారు పది ఒంటెలను ఇంకా పెంచి ఇరవై చేశారు. మళ్ళీ చీటీ వేశారు, మళ్ళీ అబ్దుల్లా పేరు వచ్చింది. ఈ విధంగా ప్రతిసారీ అబ్దుల్లా పేరు వస్తుంది, పది ఒంటెలను పెంచుతూ పోయారు. ఎప్పుడైతే అబ్దుల్లా ఒకవైపు మరియు వంద ఒంటెలు ఒకవైపు పూర్తి అయ్యాయో, అప్పుడు ఒంటెల పేరు మీద చీటీ వెళ్ళింది. అయితే అబ్దుల్లాకు బదులుగా ఆ ఒంటెలను జిబహ్ చేయడం జరిగింది. ఈ విధంగా జిబహ్ నుండి, బలిదానం నుండి అబ్దుల్లాను తప్పించడం జరిగింది. అందుకొరకే ఈ రెండవ వ్యక్తి జిబహ్ కు సిద్ధమైన తర్వాత కూడా తప్పించబడిన వారు. మరియు ఈయనకి బదులుగా జంతువును బలిదానం ఇవ్వడం ఏదైతే జరిగిందో, ఈ రకంగా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇటు అబ్దుల్లా కుమారుడు మరియు వీరి యొక్క వంశంలోనే ఇస్మాయీల్ అలైహిస్సలాం వస్తారు. ముహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిమ్… ఈ విధంగా పూర్తి వంశావళి.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జననం
అబ్దుల్ ముత్తలిబ్ కు మొదటి నుండే అతని సంతానంలో అబ్దుల్లా తన హృదయానికి అతి చేరువుగా ఉండి, ఎక్కువ ప్రేమగా ఉన్నారు. అయితే ప్రత్యేకంగా ఈ బలిదానం యొక్క సంఘటన తర్వాత మరింత చాలా దగ్గరయ్యారు, ఇంకా అధికంగా అతన్ని ప్రేమించగలిగారు. అబ్దుల్లా యువకుడై, పెళ్ళీడుకు వచ్చిన తర్వాత, పెళ్ళి వయస్సుకు చేరిన తర్వాత, అబ్దుల్ ముత్తలిబ్, జొహ్రా వంశానికి చెందినటువంటి ఒక మంచి అమ్మాయి, ఆమినా బిన్తె వహబ్ ను ఎన్నుకొని అబ్దుల్లాతో వివాహం చేసేశారు.
అబ్దుల్లా తన భార్య ఆమినాతో ఆనందమైన వైవాహిక జీవితం గడుపుతూ ఉన్నాడు. ఆమినా మూడు నెలల గర్భంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మోస్తూ ఉండగా, అబ్దుల్లా ఒక వ్యాపార బృందంతో సిరియా వైపునకు బయలుదేరారు. తిరిగి వస్తుండగా అనారోగ్యానికి గురయ్యారు. అయితే మదీనాలో వారి యొక్క మేనమామలు ఉంటారు. అందుకని బనీ నజ్జార్ లోని వారి మేనమామల దగ్గర అక్కడ ఆగిపోయారు. కొన్ని రోజుల తర్వాత అక్కడే వారు చనిపోయారు. మదీనాలోనే వారిని ఖననం చేయడం, సమాధి చేయడం జరిగింది.
ఇటు ఆమినాకు నెలలు నిండినవి. సోమవారం రోజున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆమినా జన్మనిచ్చింది. అయితే నెల మరియు తారీఖు విషయంలో ఏకాభిప్రాయం కుదరలేకపోయింది. అయినా, తొమ్మిదవ తారీఖు, రబీఉల్ అవ్వల్ (رَبِيع ٱلْأَوَّل) యొక్క మాసం అని పరిశోధనలో తేలింది. ఎందుకంటే సోమవారం అన్న విషయం ఖచ్చితమైనది. అయితే ఈ రోజుల్లో పన్నెండవ రబీఉల్ అవ్వల్ అని కూడా చాలా ప్రఖ్యాతి గాంచింది. మరో ఉల్లేఖనం రమదాన్ ముబారక్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించారని కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా, క్రీస్తు శకం ప్రకారం 571 అన్న విషయం ఖచ్చితం.
ఆముల్ ఫీల్ (عَامُ الْفِيلِ) – ఏనుగుల సంవత్సరం
అదే సంవత్సరాన్ని ఆముల్ ఫీల్ (عَامُ الْفِيلِ) అని అంటారు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శుభ జననానికి కేవలం 50 రోజుల ముందు ఏనుగుల సంఘటన జరిగింది. అదేమిటి? అదే ఇప్పుడు మనం విందాము.
నజ్జాషీ అను రాజు యొక్క గవర్నర్ యమన్ లో ఉండేవాడు. అతని పేరు అబ్రహా. అతడు అరబ్బులను చూశాడు, వారు హజ్ చేయడానికి మక్కా వస్తున్నారు. అయితే అతడు సన్ఆ (صَنْعَاء) (యమన్ లోని ప్రస్తుత క్యాపిటల్) అక్కడ ఒక పెద్ద చర్చి నిర్మించాడు. అరబ్బులందరూ కూడా హజ్ చేయడానికి ఇక్కడికి రావాలి అన్నటువంటి కోరిక అతనిది. అప్పట్లోనే అక్కడ అరబ్బుకు సంబంధించిన కినానా తెగకు సంబంధించిన ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఈ విషయం తెలిసి ఒక సమయంలో వెళ్లి ఆ చర్చి గోడలను మలినం చేసేసాడు. ఈ విషయం అబ్రహాకు తెలిసి ఆగ్రహోదగ్రుడయ్యాడు. చాలా కోపానికి వచ్చి ఒక పెద్ద సైన్యం సిద్ధపరిచాడు. మక్కాలో ఉన్న కా’బా గృహాన్ని (నవూదుబిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్) ధ్వంసం చేద్దామని, కూలగొడదామన్న యొక్క దురుద్దేశంతో 60,000 సైన్యంతో బయలుదేరాడు. తొమ్మిది ఏనుగులను కూడా వెంట తీసుకున్నాడు. అతి పెద్ద ఏనుగుపై స్వయం తాను ప్రయాణమయ్యాడు.
మక్కాకు సమీపంలో చేరుకొని అక్కడ తన సైన్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. పూర్తి సంసిద్ధతలు, సంసిద్ధతలన్నీ కూడా పూర్తయ్యాక, ఇక తన ఏనుగును కా’బా వైపునకు ముఖం చేసి లేపాడు. కానీ అది ముమ్మాటికీ లేవకుండా కూలబడిపోయింది. ఎప్పుడైతే కా’బా దిశకు కాకుండా వేరే దిశలో దాన్ని లేపుతున్నారో, పరుగెడుతుంది. కానీ అదే ఎప్పుడైతే దాని ముఖం కా’బా వైపునకు చేస్తారో, అక్కడే కూలబడిపోతుంది. వారు ఈ ప్రయత్నాల్లోనే ఉండగా, అల్లాహు తఆలా గుంపులు గుంపులుగా పక్షులను పంపాడు. నరకంలో కాల్చబడినటువంటి శనగ గింజంత పరిమాణంలో మూడు మూడు రాళ్లు ప్రతి పక్షి వెంట. ఒకటి వారి చుంచువులో, రెండు వాళ్ళ పంజాలలో. ఎవరిపై ఆ రాళ్లు పడుతున్నాయో, వాడు అక్కడే ముక్కలు ముక్కలు అయ్యేవాడు. ఈ విధంగా సైన్యం పరుగులు తీసింది. కొందరు అటు, కొందరు ఇటు పరుగెత్తుతూ దారిలో నాశనం అవుతూ పోయారు.
కానీ అల్లాహు తఆలా అబ్రహా పై ఎలాంటి శిక్ష పంపాడంటే, అతని వేళ్లు ఊడిపోతూ ఉండేవి. అతడు కూడా పరుగెత్తాడు, చివరికి సన్ఆ చేరుకునేసరికి అతని రోగం మరీ ముదిరిపోయి, అక్కడ చేరుకున్న వెంటనే అతడు కూడా నాశనమైపోయాడు. ఇక ఇటు ఖురైషులు, ఎప్పుడైతే అబ్రహా తన సైన్యంతో, (నవూదుబిల్లాహ్) కా’బా గృహాన్ని పడగొట్టడానికి వస్తున్నారని తెలిసిందో, వీళ్ళందరూ కూడా పర్వతాల్లో, లోయల్లో తమను తాము రక్షించుకోవడానికి పరుగెత్తారు. ఎప్పుడైతే వారికి తెలిసిందో, అబ్రహా అతని యొక్క సైన్యంపై అల్లాహ్ యొక్క ఈ విపత్తు కురిసింది అని, శాంతిగా, క్షేమంగా తిరిగి తమ ఇండ్లల్లోకి వచ్చారు.
ఈ విధంగా ఇది మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభ జననం కంటే 50 రోజుల ముందు జరిగిన సంఘటన. అందుకొరకే ఆ సంవత్సరాన్ని ఆముల్ ఫీల్ – ఏనుగుల సంవత్సరం అని అనడం జరిగింది. ఈ విధంగా మనం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శుభ జీవిత చరిత్రలోని మొదటి ఘట్టం పూర్తిగా విన్నాము. ఇంకా మిగతా ఎన్నో ఇలాంటి ఎపిసోడ్స్ వినడం మర్చిపోకండి.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ. وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
(మా చివరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు. మరియు మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు కలుగుగాక.)
ఇతరములు:
ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం):
ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం]
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్
మహా ప్రవక్త జీవిత చరిత్ర పాఠాలు [15 వీడియోలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
మొత్తం వీడియోల వ్యవధి: దాదాపు 70 నిముషాలు
“ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అంటే అర్ధం ఏమిటి? [వీడియో]
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్

You must be logged in to post a comment.