పరలోక చింతన, దాని ప్రాముఖ్యత (تذكر الآخرة) [వీడియో & టెక్స్ట్]

పరలోక చింతన, దాని ప్రాముఖ్యత (تذكر الآخرة)
https://www.youtube.com/watch?v=EI46WtFBd8U [39 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

మనిషి ఇహలోకంలో శాశ్వతంగా ఉండడు,శాశ్వత జీవితం పరలోక జీవితం. అయితే ఇక్కడ ఉండీ అక్కడి జీవితం గురించి ఎలా ఆలోచించగలం, ఊహించగలమో తెలుసుకొనుటకు ఈ వీడియో చూడండి.

ఈ ప్రసంగంలో, వక్త పరలోక జీవితం మరియు దాని కోసం సిద్ధం కావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఇహలోక జీవితం ఒక పరీక్ష అని, శాశ్వతం కాదని, మోసంతో కూడుకున్నదని ఖురాన్ ఆయతుల ద్వారా వివరించారు. మరణ సమయం ఎవరికీ తెలియదని, కాబట్టి ప్రతి ఒక్కరూ విశ్వాసంతో, సత్కార్యాలు చేస్తూ ఉత్తమమైన స్థితిలో మరణాన్ని పొందాలని కోరుకోవాలని, కేవలం కోరుకుంటే సరిపోదని, దానికి తగ్గ ఆచరణ కూడా ఉండాలని ఉద్బోధించారు. కష్టాలు, సుఖాలు రెండూ అల్లాహ్ నుండే వచ్చే పరీక్షలని, వాటిని సహనంతో, నమాజ్ తో ఎదుర్కోవాలని సూచించారు. యువత, ఆరోగ్యం, సంపద, తీరిక సమయం మరియు జీవితం వంటి ఐదు అమూల్యమైన వరాలను అవి చేజారిపోకముందే సద్వినియోగం చేసుకోవాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసును ఉటంకించారు. సమయాన్ని వృధా చేయకుండా, అల్లాహ్ ధ్యానంలో మరియు సత్కార్యాలలో గడపడం ద్వారా పరలోక సాఫల్యం కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

بِسْمِ ٱللَّٰهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహీ వ సహ్బిహీ అజ్మయీన్, అమ్మా బాద్.

أَعُوذُ بِٱللَّهِ ٱلسَّمِيعِ ٱلْعَلِيمِ مِنَ ٱلشَّيْطَانِ ٱلرَّجِيمِ
శపించబడిన షైతాన్ నుండి నేను సర్వశ్రోత మరియు సర్వజ్ఞుడైన అల్లాహ్ శరణు వేడుతున్నాను.

كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ ۗ وَإِنَّمَا تُوَفَّوْنَ أُجُورَكُمْ يَوْمَ الْقِيَامَةِ ۖ فَمَن زُحْزِحَ عَنِ النَّارِ وَأَدْخِلَ الْجَنَّةَ فَقَدْ فَازَ ۗ وَمَا الْحَيَاةُ الدُّنْيَا إِلَّا مَتَاعُ الْغُرُورِ
ప్రతి ప్రాణీ మరణ రుచి చూడవలసిందే. మరి నిశ్చయంగా ప్రళయ దినాన మీరు మీ పూర్తి ప్రతిఫలాలు పొందగలరు. కనుక ఎవరైతే నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గంలో ప్రవేశింపజేయబడతాడో అతనే సాఫల్యం పొందినవాడు. ఈ ఐహిక జీవితం కేవలం మోసపు సామాగ్రి తప్ప మరేమీ కాదు.

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వ జగత్తుకు ఏకైక యజమాని, మన ఆరాధనలకు నిజమైన ఆరాధనీయుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు స్తుతులు, పొగడ్తలు అన్నీయు చెల్లును. అంతిమ ప్రవక్త, దయామయ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అల్లాహ్ యొక్క అనేక అనేక కరుణలు, శాంతులు, శుభాలు కురియుగాక.

సోదర మహాశయులారా! ఈరోజు మనం ‘పరలోక జీవితం, దాని గురించి మనం ఏం సిద్ధపరుస్తున్నాము’ అనే శీర్షికపై కొన్ని విషయాలు విందాము, గ్రహిద్దాము, ఆచరణకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆచరించే ప్రయత్నం చేద్దాము ఇన్షా అల్లాహ్. అల్లాహ్ త’ఆలా అలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అయితే, నా ఈ చిన్న ప్రసంగంలో కొన్ని ప్రశ్నలు కూడా నేను అడుగుతాను. మీరు త్వరగా సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. ఇన్షా అల్లాహ్.

మొదటి ప్రశ్న ఏంటంటే, మనం ఎప్పుడు చనిపోతాము అన్న విషయం మనకు తెలుసా? లేదు. మనం ఎప్పుడు చనిపోతాము అన్న విషయం మనలో ఎవరికీ తెలియదు. స్వయంగా అల్లాహ్ త’ఆలా సూరె లుఖ్మాన్ చివరిలో,

وَمَا تَدْرِي نَفْسٌ مَّاذَا تَكْسِبُ غَدًا ۖ وَمَا تَدْرِي نَفْسٌ بِأَيِّ أَرْضٍ تَمُوتُ
తాను రేపు ఏం చేయనున్నదో ఏ ప్రాణీ ఎరుగదు. తాను ఏ గడ్డపై మరణిస్తాడో కూడా ఎవరికీ తెలీదు (31:34)

మనకు చావు ఎప్పుడు వస్తుందో అన్న విషయం తెలియనప్పుడు, చావు ఏ పరిస్థితిలో వస్తే బాగుంటుంది అన్న విషయం ఎప్పుడైనా ఒక్కసారైనా మనం ఆలోచించామా? ఉదాహరణకు, రెండో ప్రశ్న అనుకోండి.

ఒక వ్యక్తి లా ఇలాహ ఇల్లల్లాహ్ చదువుతూ చదువుతూ చనిపోతున్నాడు. మరో వ్యక్తి అవిశ్వాస మాటలు లేదా ఏదైనా పాటలు పాడుకుంటూ చనిపోతున్నాడు. ఒక వ్యక్తి నమాజ్ చేస్తూ సజ్దా స్థితిలో ఉండి చనిపోతున్నాడు. మరో వ్యక్తి నమాజ్ సమయాన్ని వృధా చేసి పాటలు వినుకుంటూ, ఫిలింలు చూసుకుంటూ, ఇంకా వేరే ఏదైనా చెడు కార్యాలు చూస్తూ ఆ స్థితిలో చనిపోతున్నాడు. ఒక వ్యక్తి ఎవరైనా బీదవారికి దానం చేస్తూ లేక ఎవరికైనా సహాయం చేస్తూ ఆ స్థితిలో చనిపోతున్నాడు. మరో వ్యక్తి ఎవరైనా బీదవాళ్ళను తన చేతి కింద పనిచేసే వాళ్ళను, వారిపై అన్యాయం చేస్తూ, ఏదైనా దౌర్జన్యం చేస్తూ ఆ స్థితిలో చనిపోతున్నాడు. ఒక వ్యక్తి ప్రయాణంలో వెళ్తున్నాడు, వాహనంలో ఉన్నాడు, నోటి మీద అల్లాహ్ యొక్క జిక్ర్ ఉంది, యాక్సిడెంట్ అయిపోయింది, ఆ సందర్భంలో కూడా అతనికి కలిమా నోటి మీద వచ్చేసింది. మరో వ్యక్తి తన ఫ్రెండ్లతో, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసుకుంటూ ప్రయాణం చేస్తున్నాడు, ఆ స్థితిలో అతనికి చావు వచ్చేసింది, యాక్సిడెంట్ అయింది, ఆ స్థితిలో చావు వచ్చింది.

ఇప్పుడు మీరే ఆలోచించండి, స్వయంగా మీరు, అంటే నేను, మీలో ప్రతి ఒక్కరు, స్వయంగా నేను కూడా, నేను ఏ స్థితిలో నాకు చావు వస్తే బాగుంటుంది అని ఆలోచించాలి. దేని గురించి నేను సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలి? కుడి వైపున చెప్పిన విషయాలకా లేకుంటే ఎడమ వైపున చెప్పిన విషయాలకా? మీ అందరిలో ప్రతి ఒక్కరు ఇదే కోరుకుంటున్నారా? ఇన్షా అల్లాహ్. అల్లాహ్ త’ఆలా మన ఈ కోరిక ప్రకారం అలాంటి ఆచరణ ప్రసాదించుగాక, మరి మన కోరిక ప్రకారం మన యొక్క చావు అదే స్థితిలో అల్లాహ్ త’ఆలా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్.

అయితే సోదరులారా! మాట్లాడుకున్నప్పుడు ఇది కోరుకుంటున్నాము. కుడివైపున సైగ చేసి ఏ విషయాలైతే చెప్పబడ్డాయో అవి కోరుకుంటున్నాము అని మాట్లాడేటప్పుడు, ఎవరైనా ప్రశ్న ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పడం సులభం. కానీ దానిని ఆచరణ రూపంలో కూడా మనం ఉంచాలి. ఎందుకంటే కలిమా చదువుతూ, నమాజ్ చేసుకుంటూ, ఇంకా వేరే ఉత్తమ కార్యాలు చేస్తూ మన చావు రావాలి అని కోరుకోవడం ఇది ఒక అంతు అయితే, ఎగ్జాక్ట్లీ దాని ప్రకారం లేదా కనీసం దానికి దగ్గరగా అలాంటి మంచి ఆచరణలు అవలంబించడం ఇది మరో అంతు.

కేవలం కోరికల మీద మేడలు కడతామా? ఇప్పుడు మనం ఇక్కడ విదేశ జీవితం గడుపుతున్నాము. ఇక్కడ సంపాదిస్తున్నాము. మనకన్ని కోరికలు ఉన్నాయా లేదా? ఉదాహరణకు ఇప్పుడు పెళ్లి కాని యువకులు, ఇలాంటి స్త్రీతో, ఇలాంటి అమ్మాయితో వివాహం చేయాలి, ఆ అమ్మాయిలో ఇలాంటి, ఇలాంటి గుణాలు ఉండాలి, నేను ఇక్కడ మంచిగా సంపాదించాలి, ఇంత మంచి ఒక ఇల్లు కట్టాలి, ఒక గృహం నిర్మించాలి, ఇలాంటి కోరికలు ఉన్నాయా లేవా? మనం ప్రతిరోజు పడుకునే ముందు ఇలాంటి కోరికల్ని గుర్తు చేసుకుంటూ, వాటిని వల్లించుకుంటూ, మళ్ళించుకుంటూ, తిరిగి తిరిగి వాటిని గుర్తు చేసుకుంటూ మనం పడుకున్నప్పటికీ, ఓ పది సంవత్సరాల తర్వాత ఆ మేడ కట్టి అక్కడ తయారు ఉంటుందా? బిల్డింగ్ కట్టి అక్కడ రెడీ ఉంటుందా? ఏం చేయాల్సి ఉంటుంది? దాని గురించి ప్రయత్నం చేయాలి, సంపాదించాలి, ఇల్లు కట్టడానికి దానికి సంబంధించిన మనుషులు ఎవరైతే ఉంటారో వారితో కలవాలి, ఆ పనులు చేయాలి. అలాగే కలిమా చదువుతూ, నమాజ్ చేస్తూ, మంచి స్థితిలో, ఉత్తమ రీతిలో నాకు చావు రావాలి అని కోరుకున్నంత మాత్రాన కోరిక తీరుతుందా? లేదు.

మౌత్ కా బయాన్’ అని ఉర్దూలో ఒక పుస్తకం ఉంది. దాని యొక్క రచయిత ఒక సంఘటన గుర్తు చేశాడు. ఒక వ్యక్తి రోడ్డు మీద నిలబడి సామాను అమ్ముకుంటూ ఉంటాడు. ఇలాంటి మనుషులను మనం ఎంతో మంది చూస్తూ ఉంటాం కదా. పొద్దుటి నుండి సాయంకాలం వరకు, “పాంచ్ రియాల్, పాంచ్ రియాల్, పాంచ్ రియాల్, ఐదు రూపాయలు, ఐదు రూపాయలు, ఐదు రూపాయలు, ఖంస రియాల్, ఖంస రియాల్, ఖంస రియాల్”. మార్కెట్లో ఎప్పుడైనా విన్నారా లేదా ఇట్లాంటిది? అదే పాట. నమాజ్ లేదు, అల్లాహ్ యొక్క జిక్ర్ లేదు, ఇంకా వేరే ఉత్తమ కార్యాలు ఏవీ లేవు. ముస్లిం. చనిపోయేటప్పుడు, చావు దగ్గరికి వచ్చినప్పుడు, అతని బంధువులు దగ్గరగా ఉండి, “నానా, లా ఇలాహ ఇల్లల్లాహ్ చదవండి” అని అంటున్నారు. “లా ఇలాహ ఇల్లల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్” అని పక్కన అక్కడ మెల్లమెల్లగా పలుకుతున్నారు కనీసం విని అంటారని. కొంచెం మాట్లాడడానికి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు, “ఐదు రూపాయలు, ఐదు రూపాయలు, ఐదు రూపాయలు, పాంచ్ రియాల్, పాంచ్ రియాల్, పాంచ్ రియాల్, పాంచ్ రియాల్” అదే మాట వస్తుందట. ఎందుకు?

ఈ విధంగా మనిషి ఏదైనా ఉద్యోగపరంగా ఏదైనా ఒక మాటను మాటిమాటికీ చెప్పడం, అది తప్పు అని కాదు ఇక్కడ చెప్పే ఉద్దేశం. కానీ అల్లాహ్ యొక్క జిక్ర్, ఈమాన్, విశ్వాసం, నమాజ్, ఇతర సత్కార్యాలకు ఏ స్థానం అయితే ఇవ్వాలో, ఇతర సత్కార్యాలు ఎంతగా పాటించాలో, వాటిని పాటించడం కూడా తప్పనిసరి.

చావు ఎప్పుడు వస్తుంది మనకు తెలియదు. చావు మంచి స్థితిలో రావాలి మనందరి కోరిక. కానీ జీవితం గడుపుతున్నప్పుడు, “అరే! యవ్వనం ఉంది కదా, మనం యువకులం కదా, ఇప్పుడే కదా, ఒకేసారి కదా జీవితం, ఒకేసారి కదా ఛాన్స్” అనుకుంటూ మన కోరికలు మంచిగా ఉన్నప్పటికీ, ఆచరణను మంచిగా ఉంచకుంటే, చావు మంచిగా వస్తుంది అన్న ఆశ ఏదైనా ఉంటుందా? అందుగురించి సోదరులారా!

كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ
(కుల్లు నఫ్సిన్ జాఇఖతుల్ మౌత్)
ప్రతి జీవికీ మరణ రుచి చూడక తప్పదు. (సూరె ఆలి ఇమ్రాన్ లో ఉంది ఆ ఆయత్)

وَإِنَّمَا تُوَفَّوْنَ أُجُورَكُمْ يَوْمَ الْقِيَامَةِ
(వ ఇన్నమా తువఫ్ఫౌన ఉజూరకుమ్ యౌమల్ ఖియామహ్)
ప్రళయ దినాన మీరు చేసుకున్న కర్మలకు సంపూర్ణ ఫలితం మీరు పొందుతారు.

అయితే వినండి,

فَمَن زُحْزِحَ عَنِ النَّارِ وَأَدْخِلَ الْجَنَّةَ فَقَدْ فَازَ
(ఫమన్ జుహ్జిహ అనిన్నారి వ ఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్)
ఎవరైతే నరకం నుండి దూరం చేయబడ్డారో, స్వర్గంలో ప్రవేశింపబడ్డారో, విజయం అతనిది. సాఫల్యం అతనికి లభించింది.

ఇక్కడి వరకు విషయం అర్థమైంది కదా? ఏం చెప్పాడు అల్లాహ్ త’ఆలా? ప్రతి జీవి మరణించక తప్పదు, తప్పకుండా చనిపోతారు. ఆ తర్వాత చెప్పాడు అల్లాహ్ త’ఆలా, మీరు చేసుకున్న ప్రతి కర్మలకు సంపూర్ణ ఫలితం లభిస్తుంది. ఆ తర్వాత చెప్పాడు, నరకం నుండి దూరం చేయబడి, స్వర్గంలో ప్రవేశించిన వారు వారే సాఫల్యం పొందిన వారు. కానీ ఆ మరణం రాకముందు మనం ఎక్కడున్నాము? ఈ భూమి మీదే కదా, ఈ లోకంలో కదా. ఇక్కడ ఉండే కదా మనం ఆ స్వర్గం గురించి ఏదైనా ప్రయత్నం చేయాలి? ఇక్కడ ఉండే మనం సత్కార్యాలు చేయాలి, అప్పుడు నరకం నుండి దూరం చేయబడతాము, స్వర్గంలో ప్రవేశింపజేయబడతాము. అయితే అల్లాహ్ త’ఆలా ఎంత గొప్ప విషయం ఆ తర్వాత చెప్పాడో గమనించండి, ‘ఫఖద్ ఫాజ్’, సాఫల్యం పొందాడు అని మాట అయిపోయింది, కాలేదు. ఆ తర్వాత అల్లాహ్ చెప్పాడు,

وَمَا الْحَيَاةُ الدُّنْيَا إِلَّا مَتَاعُ الْغُرُورِ
(వ మల్ హయాతుద్దున్యా ఇల్లా మతావుల్ గురూర్)
వినండి, ఇహలోక జీవితం మోసపు సామాగ్రి.

ఇహలోక జీవితం, ఇందులో ఎన్నో రకాల మీకు మోసాలు జరుగుతాయి. ఒక వ్యక్తి వ్యాపారంలో మోసపోతాడు, ఇంకో వ్యక్తి తన వ్యవసాయంలో మోసపోతాడు, ఇంకో వ్యక్తి ఉద్యోగంలో మోసపోతాడు, ఇంకో వ్యక్తి ఏదైనా పని చేసుకుంటూ మోసపోతాడు. ఇవన్నీ మోసాలు చాలా తేలికగా, ఏ లెక్క లేనివి. అతి గొప్ప మోసం, ఎలాంటి మోసం? మనిషి స్వర్గం గురించి ఆలోచిస్తూ, స్వర్గం గురించి కోరికలు ఊహించుకుంటూ దాని గురించి ఏమీ చేయకుండా, ఏ సత్కార్యం పాటించకుండా, విశ్వాస మార్గం అవలంబించకుండా జీవితం గడపడం ఇది మహా మోసం.

ఇలాంటి మోసం అర్థమవుతుందా? ఉదాహరణకు, రోజూవారీగా కూలి తీసుకొని పనిచేసే వాళ్ళ విషయం గమనించండి, “ఈరోజు నా దగ్గర నువ్వు పని చేయాలి. ఎంత? ఈరోజు పనిచేస్తే 200 రియాల్ నీకు ఇస్తాను.” ఒప్పందం అయిపోయింది. సాయంకాలం వరకు మీకు డబ్బు ఇవ్వకుండా వెళ్ళిపోతే ఏమంటారు? మోసం చేశాడు వీడు అని నాలుగు తిడతారా లేదా? ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాము. కొందరు ఇలాంటి మోసాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ మనకు మనం ముస్లింలమనుకొని, విశ్వాసులమన్నటువంటి సంతృప్తిలో ఉండి, విశ్వాస మార్గం మీద స్థిరంగా ఉండకుండా, సత్కార్యాలు చేస్తూ మనం జీవితం గడపకుండా ఆ స్వర్గం మన తాతముత్తాతల ఏదైనా ఆస్తి ఉన్నట్లుగా మనం దొరుకుతుందిలే, ఎప్పుడో ఒకసారి స్వర్గంలో పోవాల్సిందే కదా అన్నటువంటి ఆలోచనల్లో పడి, సత్కార్యాలను వదులుకోవడం, ఇష్టం వచ్చినట్లు పాపాలు చేసుకుంటూ జీవితం గడపడం, ఇది మనకు మనం మోసంలో పడిపోతలేమా? స్వర్గం యొక్క కోరిక ఉంది, చేస్తున్న కార్యాలు ఏంటి? స్వర్గంలో తీసుకెళ్ళేటివా? కాదు.

ఇప్పుడు ఎండకాలం రాబోతుంది. రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. ఏం కనబడుతుంది? ముంగట రోడ్డు మీద నీళ్లు ఉన్నట్లు కనబడుతుంది. జరుగుతుంది కదా అలాంటిది? అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటాయా నీళ్లు? మీరు అనుకోండి, ఉదాహరణకు మీరు ఒక ఎడారిలో ఉన్నారు. ఎండలో తపించిపోయి మీకు చాలా దాహం కలుగుతుంది. నీళ్లు లేక మీరు తపిస్తున్నారు. మీకు ఎండమావులు కనబడతాయి. ఎండమావులే అంటారు కదా, సురాబ్. ఆహ్! ఇంకొంచెం నేను నడిచిపోతే ఇక నాకు నా ప్రాణంలో ప్రాణం వచ్చేస్తది, ఇక నీళ్లు దొరుకుతాయి, అన్నటువంటి ఆశతో అలసిపోయి, నడవలేని శక్తి, శక్తి ఏ మాత్రం లేదు నడవడానికి, కానీ అలాంటి ఎండమావులు, ఎండమావులు కాదు దాన్ని నీళ్లు అనుకుంటున్నాం మనం. ఇంకొంచెం కష్టపడి నాలుగు అడుగులు వెళ్దాము అని అనుకొని అక్కడికి వెళ్ళేసరికి అక్కడ నీళ్లు ఉండకుండా ఎండమావులు అని మీకు అనిపించినప్పుడు ఎంత బాధ కలుగుతుంది? ఇక ఎందుకు జీవితం, ఛా! ఇక్కడే చనిపోతే బాగుంటది. అనిపిస్తదా లేదా?

ఎవరైతే అల్లాహ్ ను కాకుండా వేరే దేవతలను ఆరాధిస్తారో, అలాంటి వారికి ప్రళయ దినాన ఇలాంటి మోసపు శిక్ష కూడా జరుగుతుంది. సహీ బుఖారీలో హదీస్ వచ్చి ఉంది. అందుగురించి సోదరులారా, ఇకనైనా మనం ఉన్న కొత్త జీవితాన్ని మనం అదృష్టంగా భావించి దాన్ని విశ్వాస మార్గంలో, సత్కార్యాలు చేసుకుంటూ గడిపే ప్రయత్నం చేద్దాం. ఇన్షా అల్లాహ్.

చూడండి, ఇహలోకంలో అల్లాహ్ ఎందుకు పంపాడు మనల్ని? హాయిగా స్వర్గం లాంటి జీవితం గడపడానికా లేకుంటే పరీక్ష గురించా? ఇది మూడో ప్రశ్న అనుకోండి మీరు. ఇహలోకంలో మనం ఎందుకు వచ్చాము? హాయిగా, లగ్జరీ లైఫ్ గడపడానికా లేకుంటే ఒక పరీక్ష పరమైన జీవితం గడపడానికా? పరీక్ష. ఎలాంటి అనుమానం లేదు కదా? అలాంటప్పుడు ఇక్కడ ఎదురయ్యే కష్టాలు, ఇక్కడ మనకు కలిగే బాధలు, వాటికి మనం చిన్నబోయి లేక మనస్తాపం చెంది, ఎంతో మనకు మనం కుళ్ళిపోయాము, ఇక ఎందుకురా నా జీవితం అన్నటువంటి భావనలో వెళ్లి, విశ్వాస మార్గం, స్వర్గంలో చేర్పించే సత్కార్యాలు, వాటిని ఎందుకు మరిచిపోతాము మనం?

మన విశ్వాస మార్గాన్ని వదలకుండా ఇలాంటి కష్టాల్ని, ఇలాంటి బాధల్ని ఎదుర్కొంటే ఇంకా మనకు స్వర్గాలలో స్థానాలు రెట్టింపు అవుతాయి, పెరుగుతూ పోతాయి. ఖురాన్ లో ఒక ఆయత్ ఉంది:

وَجَعَلْنَا بَعْضَكُمْ لِبَعْضٍ فِتْنَةً
(వ జ’అల్నా బ’అదకుమ్ లి బ’అదిన్ ఫిత్న)
పరస్పరం ఒకరినొకరిని అల్లాహ్ మీకు పరీక్షగా చేశాడు.

మరో ఆయత్ ఉంది:

وَنَبْلُوكُم بِالشَّرِّ وَالْخَيْرِ فِتْنَةً
(వ నబ్లూకుమ్ బిష్షర్రి వల్ ఖైరి ఫిత్న)
ఇహలోకంలో మీకు సుఖము, శాంతి, అన్ని రకాల మంచితనాలు ఇచ్చి పరీక్షిస్తాను, బాధ, కఠోర జీవితం, ఎన్నో రకాల ఆపదల్లో మిమ్మల్ని ఇరికించి కూడా మిమ్మల్ని పరీక్షిస్తాను.

బిష్షర్రి వల్ ఖైర్. షర్ర్, ఖైర్ ఇక్కడ పదాలు వింటూ ఉంటారు కదా. షర్ర్ అంటే కీడు, చెడు. ఖైర్ అంటే మంచితనం. ఈ రెండు రకాలుగా కూడా మిమ్మల్ని నేను పరీక్షిస్తాను అని అల్లాహ్ త’ఆలా అంటున్నాడు.

కొందరు కఫీల్ (employer) యొక్క ఇబ్బంది వల్ల గాని, జీతాలు సరిగ్గా దొరకవని వల్ల గాని, లేక జీతాలు బాగానే ఉన్నాయి, కఫీల్ తోని కిరికిరి ఏం లేదు, కానీ తోడుగా పనిచేసే వాళ్ళతోని కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు, ఈర్ష్య, జిగత్సలు, ఇంకా వేరే రకాల ఏవే. సామాన్యంగా మనం ఇక్కడ చూసుకున్న కొన్ని కష్టాల గురించి నేను చెప్తున్నాను. ఇలాంటి కష్టాల్లో కొందరు ఎంతో పెద్ద కష్టంగా భావించి నమాజ్ వదులుతారు. ఇలాంటి కష్టాల్ని దూరం చేసుకోవడానికి సరైన మార్గం ఏంటో తెలుసుకోకుండా ఇంకెంత పాపాల్లో చిక్కుకుంటూ పోతారు.

సోదరులారా! ఎప్పుడు ఏ కష్టం వచ్చినా గాని, ఆ కష్టం దూరం చేసేవారు ఎవరు? అల్లాహ్. అయితే, కష్టాలు దూరం చేయమని అల్లాహ్ ను మొరపెట్టకుండా, అల్లాహ్ కు ఇష్టమైన కార్యాలు చేయకుండా, ఇంకా పాపాల్లో మనం చిక్కుకుంటూ పోతే కష్టాలు పెరుగుతాయా, తరుగుతాయా? ఆలోచించండి, ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం? “ఎందుకయ్యా నమాజ్ కు రావటం లేదయ్యా?” అంటే, “అరే! నాకు ఉన్నటువంటి బాధలు మీకు ఉంటే తెలుస్తది. మీరు ఎప్పుడు నమాజ్, నమాజ్ అనే అంటా ఉంటారు.” నమాజ్ అన్ని రకాల మేళ్లు, అన్ని రకాల మంచితనాలకు మూలం. ఎలాంటి కష్టం, ఎలాంటి బాధ ఉన్నా గాని, అది దూరం కావాలి అంటే అల్లాహ్ ఏమంటున్నాడు?

وَاسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلَاةِ
(వస్త’ఈనూ బిస్సబ్రి వస్సలాహ్)
సహనం ద్వారా మరియు నమాజ్ ద్వారా సహాయం అర్థించండి.

ఇంకా మీరు సూరహ్ బఖరాలో చూస్తే, రెండో పారాలో, “ఫద్కురూనీ అద్కుర్కుమ్ వష్కురూలీ వలా తక్ఫురూన్. యా అయ్యుహల్లజీన ఆమనూ…

اسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلَاةِ ۚ إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ
(ఇస్త’ఈనూ బిస్సబ్రి వస్సలాహ్, ఇన్నల్లాహ మ’అస్సాబిరీన్)
ఓ విశ్వాసులారా! మీరు సహాయాన్ని కోరండి, సహనం ద్వారా మరియు నమాజ్ ద్వారా. నిశ్చయంగా అల్లాహ్ సహనం పాటించే వారితో ఉన్నాడు.

ఆ తర్వాతనే వెంటనే చూడండి. సూరహ్ బఖరా, ఆయత్ నెంబర్ 153. “ఇన్నల్లాహ మ’అస్సాబిరీన్” ఆ తర్వాత, “వలా తఖూలూ లిమయ్ యుఖ్తలు ఫీ సబీలిల్లాహి అమ్వాత్, బల్ అహ్యావున్ వలాకిల్లా తష్’ఉరూన్”. అల్లాహ్ మార్గంలో ఎవరైతే హత్య చేయబడతారో వారి గురించి చెప్పబడింది, సామాన్య మృతి చెందిన వారి లాగా మీరు భావించకండి. ఆ తర్వాత అల్లాహ్ అంటున్నాడు, ఆయత్ నెంబర్ 155లో:

وَلَنَبْلُوَنَّكُم بِشَيْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوعِ
(వ లనబ్లువన్నకుమ్ బిషైఇమ్ మినల్ ఖౌఫి వల్ జూఇ’)
మేము తప్పకుండా మిమ్మల్ని పరీక్షిస్తాము కొంత భయంతో మరియు ఆకలి ద్వారా.

وَنَقْصٍ مِّنَ الْأَمْوَالِ وَالْأَنفُسِ وَالثَّمَرَاتِ
(వ నఖ్సిమ్ మినల్ అమ్వాలి వల్ అన్ఫుసి వస్సమరాత్)
మీ ధనాల్లో, మీ ప్రాణాల్లో, మీ ఉత్పత్తుల్లో కొరత చేసి, తక్కువ చేసి

మీరు ఎంత మీ ధనం పెరగాలి అని, మీ వ్యాపారం ఎంత డెవలప్ కావాలని మీరు ఆలోచిస్తారో అది అంత పెరగకుండా దాన్ని తరిగించి, మీ సంతానంలో గాని, మీ బంధువుల్లో గాని ఎవరికైనా చావు వచ్చి, వస్సమరాత్, ఇంకా మీ వ్యవసాయ పరంగా ఏదైనా ఫలాలు, ఫ్రూట్స్ అలాంటివి ఉంటే వాటిలో మీకు ఏదైనా నష్టం చేగూర్చి మిమ్మల్ని పరీక్షిస్తాము.

وَبَشِّرِ الصَّابِرِينَ
(వ బష్షిరిస్సాబిరీన్)
సబర్ విషయం గడిచింది కదా. సబర్ చేస్తే వాళ్లతోనే అల్లాహ్ ఉన్నాడు అని అన్నాడు కదా ఇంతకుముందే. ఇక్కడ ఏమన్నాడు? అలాంటి సబర్ చేసే వారి గురించి, ఇలాంటి కష్టాలు ఎవరిపై వస్తాయో, ఆ కష్టాల్లో ఎవరైతే సబర్ చేస్తారో, సహనం పాటిస్తారో, వారికి శుభవార్త ఇవ్వండి అని అల్లాహ్ అంటున్నాడు.

అయితే, చిన్నపాటి కష్టాలు వచ్చినందుకు మనం అల్లాహ్ కు ఇంకా దగ్గరగా కాకుండా, దూరమవుతూ ఉంటే, ఇది ఎలాంటి ఉదాహరణ? ఒక వ్యక్తికి కడుపు నొప్పి వేసింది, లేక బాగా తల తిరుగుతుంది, తల నొప్పి ఉంది, ఎలాంటి పరిస్థితిలోనైనా ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్ళాలి. చూసే వారందరూ అంటున్నారు, “తొందరగా ఇప్పుడే ఆంబులెన్స్ ని పిలవండి.” అతను ఏమంటున్నాడు, “వద్దు, వద్దు. అటు వెళ్తే నాకు ఇంకా రోగం పెరుగుద్ది.” అలాంటి వారిని ఏమంటారు? ఎవరికైనా అపెండిక్స్ అయింది అనుకోండి, ఒక వైపున చాలా నొప్పులు వేస్తుంది కదా, విపరీతమైన నొప్పి. నిలబడలేడు, పడుకోలేడు, కూర్చోలేడు, ఎలాంటి స్థితిలో కూడా అతనికి విశ్రాంతి అనేది దొరకదు. అలాంటి వ్యక్తికి హాస్పిటల్ తీసుకెళ్లకుండా, డాక్టర్ ను కల్పించకుండా అలాగే వదిలేస్తారా?

సోదరులారా! అలాగే కష్టాలు ఎన్ని మనకు వచ్చినా గాని, ఎటు వైపునకు మనం మరలాలి? అల్లాహ్ వైపునకు మరలాలి. అందుగురించి అల్లాహ్ త’ఆలా ఏమంటున్నాడు?

وَأَخَذْنَاهُم بِالْبَأْسَاءِ وَالضَّرَّاءِ لَعَلَّهُمْ يَتَضَرَّعُونَ
(వ అఖద్నాహుమ్ బిల్ బ’సాఇ వద్దర్రాఇ ల’అల్లహుమ్ యతదర్ర’ఊన్)
వారిని మేము కష్టాల్లో, ఆపదల్లో పట్టుకున్నాము, పరీక్షలకు గురిచేశాము. వారు అల్లాహ్ వైపునకు మరలి ఇంకా ఎక్కువగా మొరపెట్టుకోవాలని.

కానీ ఈ రోజుల్లో ఆ పని చేస్తున్నామా మనం? సోదరులారా! అందుగురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ హదీసును ఎల్లవేళల్లో మనం మన దృష్టిలో ఉంచుకోవాలి. మహనీయ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

اغتنم خمسا قبل خمس
(ఇగ్‌తనిమ్ ఖమ్సన్ ఖబ్ల ఖమ్సిన్)
ఈ ఐదు స్థితులు రాకముందు ఈ ఐదు స్థితులను మీరు అదృష్టంగా భావించి దాన్ని మీరు వినియోగించుకోండి.

حَيَاتَكَ قَبْلَ مَوْتِكَ
(హయాతక ఖబ్ల మౌతిక)
మీ జీవితాన్ని చావు రాకముందు. చావు వచ్చిన తర్వాత ఏమైనా సత్కార్యాలు చేయగలుగుతామా? చేయలేము.

وَشَبَابَكَ قَبْلَ هَرَمِكَ
(వ షబాబక ఖబ్ల హరమిక)
రెండవది, మీ యవ్వనాన్ని వృద్ధాప్యం రాకముందు. “జవానీ మే క్యా జీ, తౌబా కర్తే సో బుడ్డే హోనే కే బాద్ కర్నా.” ఇది ఒక సామెతగా అయిపోయింది చాలా మంది ప్రజల్లో ఇది. హజ్ ఎప్పుడు చేయాలి అంటే మన సామాన్యంగా ఇండియా, పాకిస్తాన్ నుండి హజ్ గురించి వచ్చే వచ్చేవాళ్లు ఎక్కువ శాతం ఎవరు ఉంటారు? ముసలివాళ్లు. ఇక్కడ కూడా కొందరు ఉన్నారు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు గడిచాయి, ఒక ఉమ్రా కూడా నసీబ్ లేదు. “ఉమ్రా చేయండి, హజ్ చేయండి” అంటే, “అరే! ఇంత తొందరగా ఎందుకు? మళ్ళీ ఏమైనా పాపాలు జరుగుతాయి కదా.” అస్తగ్‌ఫిరుల్లాహ్. అయితే ఇంకా జీవితం ముందుకు దొరుకుతుంది, ఆ తర్వాత హజ్ చేసిన తర్వాత ఇక మనం పుణ్యాల్లోనే జీవితం గడిపే అంతటి అవకాశం ఉంటుంది అన్నటువంటి నమ్మకం ఉందా మనకు? మరి అలాంటప్పుడు ఆలస్యం దేని గురించి? తౌబా ప్రతి ఒక్కరు చేస్తూ ఉండాలి. షబాబక్, యవ్వనం, ఇగ్‌తనిమ్, దీన్ని అదృష్టంగా భావించు, ఖబ్ల హరమిక్, వృద్ధాప్యానికి చేరుకునే ముందు.

సోదరులారా! ఇంతకుముందు 55, 60, 60 దాటిన తర్వాత వాళ్లను ముసలివాళ్లు అని అనేవారు, వృద్ధులు అనేవారు. కానీ ఈ రోజుల్లో 40 వరకే డల్ అయిపోతున్నారు అందరూ. అవునా లేదా? అందుగురించి, యవ్వనంలో చేసే అటువంటి ఆరాధన, దాని పుణ్యం వృద్ధాప్యంలో చేసే ఆరాధన కంటే ఎక్కువ గొప్పగా ఉంటుంది. అందుగురించి ప్రవక్త ఏం చెప్పారు? నీ యవ్వనాన్ని నీవు అదృష్టంగా భావించు వృద్ధాప్యం రాకముందు.

وَصِحَّتَكَ قَبْلَ سَقَمِكَ
(వ సిహ్హతక ఖబ్ల సఖమిక)
ఆరోగ్యాన్ని అనారోగ్యానికి గురి కాకముందే నీవు అదృష్టంగా భావించు.

وَغِنَاكَ قَبْلَ فَقْرِكَ
(వ గినాక ఖబ్ల ఫఖ్‌రిక)
అల్లాహ్ ఏదైనా ధనం ఇచ్చి ఉన్నాడు, దాన్ని బీదరికానికి గురి కాకముందే అదృష్టంగా భావించు.

وَفَرَاغَكَ قَبْلَ شُغْلِكَ
(వ ఫరాగక ఖబ్ల షుగులిక)
ఏదైనా సమయం దొరికింది, దాన్ని అదృష్టంగా భావించి సత్కార్యాలలో గడుపు, నీవు ఏదైనా పనిలో బిజీ కాకముందు.

ఇప్పుడు మనలో ఎంతో మంది యువకులు తమ యవ్వనాన్ని, తమ ఆరోగ్యాన్ని, తమ యొక్క ఫ్రీ టైమ్ ఏం చేస్తున్నారు అంటే, టైం పాస్ చేస్తున్నాను. ఏం చేస్తున్నారు? టైం పాస్ చేస్తున్నారు. పాస్ అన్నదానికి ఒక అర్థం, గడుపుతున్నాము అని కూడా వస్తుంది, కొడుకు ఎగ్జామ్ లో పాస్ అయిండా ఫెయిల్ అయిండా? ఆ భావం కూడా వస్తుంది. కానీ ఒకసారి ఆలోచించాలి. సామాన్యంగా అనుకునేవారు, టైం గడుపుతున్నాము అనే భావం తీసుకుంటున్నారు. కానీ ఎందులో? ఫిలింలు చూస్తూ, పాటలు వింటూ, లేదా క్యారమ్ బోర్డులు ఆడుకుంటూ, దాన్ని ఏమంటారు ఏదో, రాజా, రాణి, చోర్, ఏదో కాగితాలు ఉంటాయి కదా, పేకాట? పేకాట అంటారా? ఇట్లాంటి ఆటల్లో గడుపుతూ ఉంటారు. ఏం చేస్తున్నారు అంటే, అతను టైం పాస్ చేస్తున్నాము. కానీ వాస్తవానికి, ఇక్కడ టైం పాస్ అయితలేదు, ఇందులో నీవు గడిపే టైం అంతా ఫెయిల్ అవుతుంది. రేపటి రోజు అల్లాహ్ ముందు చేరుతావు, ఈ సమయం ఏదైతే నీవు వృధాగా గడిపావో, అల్లాహ్ యొక్క స్వయంగా నీకు విద్యాపరంగా, నీ మేధాపరంగా, నీ ఇహలోక పరంగా, నీ పరలోక పరంగా లాభం చేగూర్చలేని దానిలో నువ్వు ఏదైతే గడిపావో, దాని గురించి నీవు సమాధానం చెప్పవలసి ఉంది. అందుగురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఏం చెప్తారు?

మనిషి ఏ సమయాన్నైతే పడుకొని ఉండి గాని, కూర్చొని ఉండి గాని, నడుస్తూ ఉండి గాని అల్లాహ్ యొక్క ధ్యానంలో గడపకుంటే, అతని ఆ నడక, అతని ఆ కూర్చోవడం, అతని ఆ పడుకోవడం అదంతా పాపభరితంగా మరియు ఎంతో బాధకరమైన సమయంగా గడుస్తుంది. ప్రళయ దినాన దాని గురించి విచారణ, లెక్క అనేది జరుగుతుంది.

అందుగురించి సోదరులారా! ప్లీజ్, ఇక టైమ్ ను వృధా చేసుకోకండి. అల్లాహ్ త’ఆలా ఖురాన్ లోని ఒక్కో అక్షరానికి పది పది పుణ్యాలు ఇస్తానని వాగ్దానం చేస్తున్నప్పుడు, రోజు మనం ఖురాన్ చదవడంలో ఎంత సమయం గడుపుతున్నాము? ఇవన్నీ పరలోకంలో పనికి వచ్చే వస్తువులా కాదా? లేక పేకాటలా, ఫిలింలు చూడడమా, పాటలు వినడమా? అవి పనికి వస్తాయా? అందుగురించి సోదరులారా! మనం సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దాము. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ ధర్మపరంగా మన విద్య పెరగకుంటే, మనం చేస్తున్న ఆచరణలో, సత్కార్యాల్లో ఇంకా కొన్ని సత్కార్యాలు పెరగకుంటే, చెప్పండి మన జీవితం వృధా కాకుంటే ఇంకేమవుతుంది?

సౌదీలో పది సంవత్సరాలు ఉండి వచ్చిన తర్వాత, మీరు స్వదేశానికి తర్వాత మీ ఫ్రెండ్ గాని, లేక మీ బంధువులో ఎవరైనా గాని, “ఏం చేసినావురా పది సంవత్సరాలు ఉండి?” అంటే, “పని చేశాను.” “అవునురా పని చేశావు, ఇక్కడ కూడా ఎడ్లు, ఆవులు, గాడిదలు అన్నీ కూడా అవి కూడా పనిచేస్తున్నాయి. నువ్వు అక్కడికి పోయి పరదేశానికి పోయి ఏం సంపాదించావు అక్కడ, ఏం చేశావు? చెల్లె పెళ్లి చేశావా? బిడ్డ పెళ్లి చేశావా? ఇల్లు కట్టావా?” అడుగుతారా లేదా? అప్పుడు నువ్వు ఏమీ చేయలేదు అనుకో. ఇల్లు కట్టలేకపోయావు, చెల్లె పెళ్లి చేయలేకపోయావు, ఒక్క డబ్బు ఇక్కడ కూడబెట్టి ఒక పైసా అక్కడ నువ్వు ఏమీ చిన్న లాభం చేయలేకపోయావు. శబాష్ అని అంటారా లేకుంటే నాలుగు తిడతారా? కువైట్ పోయి వచ్చినా గాని, సౌదీయా పోయి వచ్చినా గాని, మలేషియా పోయి వచ్చినా గాని, అలాంటి వాళ్ళు ప్రత్యేకంగా ఏమీ చేయకుంటే, కనీసం నీ తల్లిదండ్రులకు ఉండడానికి ఒక చిన్న గూడైనా, చిన్నవాడి ఇల్లన్నా మంచిగా తయారు చేస్తే బాగుండకపోవునారా? అని నాలుగు తిడతారా లేదా?

ఎగ్జాక్ట్లీ ఇదే ఉదాహరణ మనది. ఇహలోక జీవితం మనకు టెంపరరీగా ఇచ్చాడు దేవుడు, పరీక్ష సమయంగా ఇచ్చాడు దేవుడు, అల్లాహ్ త’ఆలా. ఇక్కడ మనం సత్కార్యాలు సమకూర్చుకోవాలి ఎక్కడి గురించి? పరలోకం గురించి. ఇప్పుడు మనం ఆలోచించండి, ఇక్కడికి వచ్చి జాలియాత్ క్లాసులలో పాల్గొని సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు గడిచాయి, సూరహ్ ఫాతిహా కరెక్ట్ కాలేదు, రుకూలో సుబ్హాన రబ్బియల్ అజీమ్ తప్ప ఇంకా వేరే కొత్త ఒక దుఆ నేర్చుకోలేదు, అత్తహియాత్ సరిగా రాదు, దాని తర్వాత దరూద్-ఎ-ఇబ్రాహీం గురించి ఇప్పుడు ఆలోచించలేదు. ఆలోచించండి, లాభంలో మన జీవితం గడుస్తున్నట్లా లేకుంటే నష్టంలో గడుస్తున్నట్లా? సంవత్సరాల తరబడి మనం క్లాసులలో వస్తాము లేక సంవత్సరాల తరబడి మనం జుమా ఖుత్బాలు వింటాము, కానీ పాటలు వినడం మానుకుంటలేము, ఫిలింలు చూడడం మానుకుంటలేము, గడ్డాలు వదలడం మనం మొదలుపెట్టలేము, ఇంకా అల్లాహ్ యొక్క మార్గంలో మనం మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి, మలుచుకోవాలి అన్నటువంటి భావన మనకు కలుగుతలేదు అంటే, ఇహలోక ప్రేమ మనలో ఎక్కువ ఉన్నట్లా, పరలోక ప్రేమ ఎక్కువ ఉన్నట్లా? చెప్పండి. ఇయ్యాల ఏదో తిన్నచ్చాడు, తాగచ్చాడు, బాగానే వర్షానికి ముందు ఉరుములు ఉరిమినట్టుగా జరుగుతుంది అనుకోకండి. ఇది మన వాస్తవ జీవితం. చెప్పే విషయాలు మీ అందరికంటే ముందు స్వయంగా నా ఆత్మకు, నా ఇస్లాహ్, నాకు నేను సరిదిద్దుకోవడానికి చెప్తున్నాను. ఆ తర్వాత మీ గురించి చెప్తున్నాను. ఆలోచించాలి. ఈ విషయాల్ని మనం పరస్పరం ఆలోచించుకోకుంటే, పరస్పరం మనలో మనం చర్చించుకుంటూ మనకు మనం బాగు చేసుకునే ప్రయత్నం చేయకుంటే, మరి ఎప్పుడు మన యొక్క క్లారిఫికేషన్, మన ఇస్లాహ్, మనకు సంబంధించిన అన్ని రకాల చెడు నుండి దూరం అవ్వడం ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? చనిపోయిన తర్వాతనా? అయ్యో, పాపం, ఇన్ని రోజులు వచ్చి వచ్చి ఇదే పాప స్థితిలో చనిపోయాడు అని నలుగురు ఎన్ని దుఆలు ఇచ్చినా గాని, దుఆకు ముందు అర్హుడు కాకుంటే మనిషి, వంద మంది కాదు, వెయ్యి మంది దుఆ చేసినా గాని లాభం ఉండదు.

అబ్దుల్లా బిన్ ఉబై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఉన్నటువంటి మునాఫిక్, వంచకుడు, ప్రవక్త వెనక నమాజ్ చేసేవాడు, ప్రవక్తతోని జిహాద్ లో కూడా పాల్గొనేవాడు. కానీ అతనికి యొక్క మగ్ఫిరత్, అతనికి క్షమాపణ అయితే లభించిందా? లేదు. అల్లాహ్ త’ఆలా చెప్పాడు:

إِنَّ الْمُنَافِقِينَ فِي الدَّرْكِ الْأَسْفَلِ مِنَ النَّارِ
(ఇన్నల్ మునాఫిఖీన ఫిద్దర్కిల్ అస్ఫలి మినన్నార్)
మునాఫిక్ లు నరకంలోని అతి అధమ స్థానంలో ఉంటారు.

చివరికి అతని కొడుకు కోరాడు, ప్రవక్తా, మీరు వచ్చి మా నాన్నగారి యొక్క జనాజా చేయించండి అని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని జనాజా నమాజ్ చేయించడానికి కూడా వెళ్లారు. అల్లాహ్ త’ఆలా ఖురాన్ లో ఆయత్ అవతరింపజేశాడు,

وَلَا تُصَلِّ عَلَىٰ أَحَدٍ مِّنْهُم مَّاتَ أَبَدًا
(వలా తుసల్లి అలా అహదిమ్ మిన్హుమ్ మాత అబదా)
అలాంటి వంచకులకు నమాజ్-ఎ-జనాజా కూడా మీరు చేయించకండి అని.

ప్రవక్త నమాజ్ చేయించారు కూడా, ప్రవక్త దుఆ అతని గురించి కబూల్ అయిందా? లేదు, కాలేదు. అందుగురించి మనలో కొందరు ఏమనుకుంటారు, ఏదో చిన్నపాటి పాపాలు జరుగుతూ ఉండి, తప్పులు జరుగుతూ ఉండి, ఆ, ఏదో ఇట్లా జీవితం గడుపితే ఏమైతంది, రేపటి రోజు కొద్ది రోజుల తర్వాతనైనా స్వర్గం పోతాం కదా, అయ్యో మా ఊర్లో ఇంత మంది మౌలీ సాబులు ఉన్నారు కదా, సౌదీలో ఒకవేళ చనిపోతే ఇంకా బాగుంటుంది, ఇక్కడ ఎక్కువ మంది జనాజా నమాజ్ చదువుతారు కదా. ఇట్లాంటి ఆలోచనల్లో కూడా ఉంటారు. అయితే దాని గురించి నేను చెప్తున్నాను. స్వయంగా మనం అల్లాహ్ క్షమాపణకు అర్హులు కాకుంటే, వంద మంది కాదు, వెయ్యి మంది కాదు, లక్షల మంది నమాజ్ చేసినా గాని, మన ఊర్లే కాదు, ఇక్కడ సౌదీలో కాదు, హరమ్ షరీఫ్ లో జనాజా జరిగినా గాని, మదీనాలో జరిగినా గాని, అతని యొక్క క్షమాపణ అనేది అర్హత లేకుంటే ఎంత మంది దుఆలు కూడా పనికి రావు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఆ కూడా అబ్దుల్లా బిన్ ఉబై గురించి పనికి వచ్చిందా? రాలేదు.

అందుగురించి సోదరులారా, చెప్పే విషయం ఏంటంటే ఇహలోక జీవితం చాలా చిన్నగా ఉంది. నాలుగు రోజుల ఈ జీవితాన్ని మనం కేవలం తిండి, ఇంకా మన కోరికలు గడుపుకోవడంలోనే గడుపితే, పరలోకంలో చాలా నష్టం చూసుకోవాల్సి ఉంటుంది. అల్లాహ్ త’ఆలా అలాంటి నష్టాల నుండి మనందరినీ కాపాడుగాక. అందుగురించి ఖురాన్ యొక్క ఈ ఆయత్ ద్వారా నేను ఈనాటి ఈ ప్రసంగాన్ని సమాప్తం చేస్తాను. అల్లాహ్ త’ఆలా ఎవరైతే పరలోకానికి ప్రాధాన్యత ఇస్తారో, అల్లాహ్ వారి గురించి ఏం చెప్పారు?

إِنَّ هَٰؤُلَاءِ يُحِبُّونَ الْعَاجِلَةَ وَيَذَرُونَ وَرَاءَهُمْ يَوْمًا ثَقِيلًا
(ఇన్న హా ఉలాఇ యుహిబ్బూనల్ ఆజిలత వ యదరూన వరాఅహుమ్ యౌమన్ సఖీలా)
వీరు ఇహలోకానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు, ఇహలోకాన్ని ప్రేమిస్తున్నారు, మరియు ఆ భారీ, బరువైన ఆ రోజు ఏదైతే ఉందో దాన్ని వదిలేస్తున్నారు. (సూరహ్ ఇన్సాన్, ఆయత్ నెంబర్ 27)

ఆ రోజు చాలా శిక్ష కఠిన, ఎంతో భయంకరమైన ఆ రోజు. అది మన గురించి సులభతరంగా కావాలంటే, ఎంతో హాయిగా, మంచితనంగా గడవాలంటే, ఇహలోకంలో సత్కార్యాలు చేసుకోవాలి, సత్కార్యాల్లో జీవితం గడపాలి. అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=5502

అంతిమ దినం (తీర్పు దినం)