రమదాన్ స్వాగతం ఎందుకు, ఎలా? – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

రమదాన్ స్వాగతం ఎందుకు, ఎలా ?
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/QDDLcOpp8bc [28 నిముషాలు]

రమజాన్ మాసం రాకముందే దాని కోసం సన్నద్ధం అవ్వడం, రమజాన్‌ను స్వాగతించడం యొక్క ప్రాముఖ్యతను ఈ ప్రసంగం వివరిస్తుంది. రైతు వర్షాకాలానికి ముందే పొలాన్ని సిద్ధం చేయడం, ముఖ్యమైన అతిథి కోసం ఇంటిని శుభ్రపరచడం వంటి ఉదాహరణలతో ఈ విషయం స్పష్టం చేయబడింది. రమజాన్‌ను స్వాగతించడానికి, దుఆ చేయడం, అల్లాహ్‌కు కృతజ్ఞతలు చెప్పడం, సంతోషాన్ని వ్యక్తపరచడం, దృఢ సంకల్పం చేసుకోవడం, పశ్చాత్తాపం చెందడం, ఇస్లామీయ జ్ఞానాన్ని నేర్చుకోవడం, సంకల్ప శుద్ధి చేసుకోవడం, మరియు ఇతరుల పట్ల హృదయాలను శుభ్రంగా ఉంచుకోవడం వంటి పద్ధతులను పండితులు సూచించారు. ఖురాన్ పారాయణం, ఇఫ్తార్ చేయించడం, దానధర్మాలు చేయడం, ఉమ్రా చేయడం, మరియు దైవ సందేశాన్ని ప్రచారం చేయడం కోసం ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కూడా నొక్కి చెప్పబడింది. ఈ రమజాన్ మన చివరిది కావచ్చుననే భావనతో, ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రసంగం ముగుస్తుంది.

అల్ హమ్దులిల్లాహి వహ్ దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బాదహ్.

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో మనం రమజాన్ స్వాగతం ఎందుకు, ఎలా? అనే అంశం గురించి తెలుసుకోబోతున్నాం. మనం షాబాన్ నెల చివరి దశకంలో ఉన్నాం, కొద్ది రోజుల్లోనే ఇన్ షా అల్లాహ్ రమజాన్ మాసము రాబోవుచున్నది కాబట్టి, రమజాన్ రాకముందే మనం రమజాన్ నెల కోసం సన్నద్ధం అవ్వాలి, రమజాన్ నెలను స్వాగతం పలకాలి. ఏ విధంగా మనము స్వాగతం పలకాలి? ఎందుకు మనము రమజాన్ నెల కోసం ఎదురు చూసి దాని కోసము సన్నాహాలు చేసుకోవాలి? అనే కొన్ని విషయాలు ఇప్పుడు మనము ఉదాహరణలతో మరియు ఆధారాలతో తెలుసుకుందాం.

ముందుగా, రమజాన్ మాసానికి మనం ఎందుకు స్వాగతించాలి అనే విషయాన్ని ఉదాహరణలతో తెలుసుకుందాం.

చూడండి, ఒక రైతు తన పొలాన్ని వర్షాకాలము రాకముందే దున్ని చదును చేసి సిద్ధంగా ఉంచుకుంటాడు. ఎందుకంటే వర్షాలు రాగానే వర్షాల నుండి పూర్తిగా లబ్ది పొంది మంచి పంట పండించుకోవాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తాడు. సరిగ్గా అదే విధంగా ఒక విశ్వాసి రమజాన్ మాసం రాకముందే రమజాన్ మాసం కోసము పూర్తిగా సన్నాహాలు చేసుకొని సిద్ధంగా ఉంటాడు. రమజాన్ వచ్చిన తర్వాత రమజాన్ నుండి పూర్తిగా లబ్ధి పొందుతాడు.

అలాగే, ఒక అతిథి మన ఇంటికి వస్తూ ఉన్నాడు, అతను పెద్ద పెద్ద బహుమతులు కూడా మన కోసము వెంట తీసుకొని వస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసినప్పుడు, మనం ఆ అతిథి రాక కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తాం. అతని రాక కోసము మన ఇంటిని, పరిసరాలను శుభ్రంగా చేసి సిద్ధంగా ఉంచుతాం. ఒక రాజకీయ నాయకుడు వస్తూ ఉన్నాడు అంటే, ఏ ప్రదేశానికి అతను వస్తూ ఉన్నాడో ఆ ప్రదేశంలో ఉన్న వీధులు, ఆ ప్రదేశంలో ఉన్న రోడ్లు అన్నీ మారిపోతాయి. సరిగ్గా ఒక విశ్వాసి కూడా అదే విధంగా రమజాన్ మాసము ఎన్నో విశిష్టతలు, వరాలు మన కోసము తీసుకొని వస్తూ ఉందన్న విషయాన్ని తెలుసుకొని, రమజాన్ రాకముందే తనను, తన ఇంటిని, తన పరిసరాలను పూర్తిగా సిద్ధం చేసుకొని రమజాన్ మాసం కోసం ఎదురు చూస్తాడు.

ఈ ఉదాహరణల ద్వారా మనము ఒక విషయాన్ని మాత్రము తెలుసుకున్నాం, అదేమిటంటే రమజాన్ రాకముందే రమజాన్ నుండి పూర్తిగా లబ్ధి పొందటానికి, రమజాన్ వరాలు మనకు దక్కించుకోవటానికి మనము ముందస్తు చర్యలు చేపట్టాలి మరియు రమజాన్ కోసము సన్నద్ధం అవ్వాలి, రమజాన్ నెలను ఆ విధంగా స్వాగతించాలి.

అయితే, రమజాన్ నెలను స్వాగతించటానికి ఏమైనా నియమాలు ఉన్నాయా, విధానాలు ఉన్నాయా అంటే ధార్మిక పండితులు కొన్ని సలహాలు మనకు ఇచ్చి ఉన్నారు. ఏ విధంగా రమజాన్ మాసాన్ని స్వాగతించాలి? మరియు ఏ విధంగా రమజాన్ కోసం మనం సన్నద్ధం అవ్వాలి? అంటే కొన్ని సలహాలు ఉన్నాయండి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇన్ షా అల్లాహ్ ఇప్పుడు మనము విని తెలుసుకుందాం.

మొదటి సలహా ఏమిటంటే రమజాన్ మాసము దక్కాలి అని అల్లాహ్‌తో దుఆ చేస్తూ ఉండాలి. ధార్మిక పండితులు తెలియజేసిన విషయం ఏమిటంటే, మన సజ్జన పూర్వీకులు, సలఫ్ సాలిహీన్, రమజాన్ మాసం ఇంకా ఆరు నెలల తర్వాత వస్తుంది అన్నప్పటి నుండే, “ఓ అల్లాహ్, నాకు రమజాన్ మాసము దక్కించు” అని వేడుకుంటూ ఉండేవారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో. అలాగే మనము కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో రమజాన్ మాసము దక్కాలి అని, రమజాన్ మాసము మనము పొందాలి అని అల్లాహ్‌ను వేడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక్క రమజాన్ దక్కినా మనము ఎన్నో పుణ్యాలు పొందగలము.

దీనికి ఉదాహరణగా ఇబ్నె మాజా గ్రంథంలోని ఒక ఉల్లేఖనము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఇద్దరు స్నేహితులు ఒకేసారి ఇస్లాం స్వీకరించారు. ఆ ఇద్దరిలో నుండి ఒక మిత్రుడు ఇస్లాం కోసము, ఇస్లాం సేవ కోసము బాగా కష్టపడేవాడు, తపించేవాడు. ఆయన ఇస్లాంకు సేవలు అందిస్తూ అందిస్తూ చివరికి ఇస్లాం కోసము ప్రాణత్యాగం చేసేశారు, షహీద్ అయిపోయారు. ఒక మిత్రుడు షహీద్ అయిపోయి మరణించి వెళ్ళిపోయారు. ఇక రెండవ మిత్రుడు మిగిలి ఉన్నాడు కదా, ఆయన ఒక సంవత్సరము తర్వాత సాధారణ మరణం పొందారు.

తల్హా రజియల్లాహు తాలా అన్హు వారు ఒక సహాబీ. ఈ ఇద్దరు మిత్రులు మరణించిన తర్వాత ఒక కల చూశారు. ఆ కలలో ఆయన స్వర్గపు ద్వారాల వద్ద నిలబడి ఉంటే, దైవదూతలు ఏ మిత్రుడు అయితే సాధారణంగా మరణించాడో ఆయనను ముందు స్వర్గంలోకి తీసుకెళ్లారు. ఏ మిత్రుడు అయితే షహీద్ అయ్యాడో, వీర మరణం పొందాడో ఆయనను తర్వాత స్వర్గంలోకి తీసుకెళ్లారు. ఈయన మార్గం వద్ద నిలబడి ఉన్నారు కదా, ఈయనతో దైవదూతలు ఏమంటున్నారంటే “మీ సమయం ఇంకా కాలేదు, మీరు వెళ్ళండి” అని ఇంటికి పంపించేశారు, తిరిగి పంపించేశారు. ఉదయం అయ్యాక ఆయన చూసిన కల ఇతరులకు తెలియజేశారు. ఆ నోటా ఈ నోటా అది అందరికీ తెలిసిపోయింది. ప్రతి ఒక్కరూ ఆ కల గురించి విని ఆశ్చర్యపోతూ ఉన్నారు. షహీద్ అయిపోయిన మిత్రుడు ఆలస్యంగా స్వర్గంలోకి వెళ్లటం ఏమిటి? సాధారణంగా మరణించిన మిత్రుడు ముందుగా స్వర్గానికి చేరుకోవటం ఏమిటి? అని వారు మాట్లాడుకుంటూ ఉన్నారు, విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు చేరిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజల ముందరికి వచ్చి ఏమన్నారంటే, “చూడండి, ఏ మిత్రుడు అయితే ఆలస్యంగా, సాధారణంగా మరణించాడో, అతనికి ఒక సంవత్సరము ఎక్కువ ఆయుష్షు దక్కింది. అతను ఒక రమజాన్ నెల ఎక్కువగా పొందాడు. ఆ రమజాన్ నెలలో, అతను పొందిన ఆ పూర్తి సంవత్సరంలో ఎన్ని సత్కార్యాలు అతను చేసుకున్నాడు అంటే, పుణ్యాలలో ఇద్దరి మధ్య భూమి ఆకాశాల మధ్య ఎంత తేడా వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం వచ్చేసింది” అని చెప్పారు. అల్లాహు అక్బర్. చూశారా?

కాబట్టి ఒక్క రమజాన్ మాసము దక్కించుకున్నా, మనము సత్కార్యాలలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోగలము కాబట్టి, రమజాన్ మాసము దక్కాలి అని అల్లాహ్‌ను వేడుకుంటూ ఉండాలి. ఇది మొదటి సలహా.

రెండవ సలహా ఏమిటంటే, రమజాన్ మాసము దక్కిన తర్వాత అల్లాహ్‌కు కృతజ్ఞతలు చెల్లించాలి. అల్లాహ్ ఆదేశం ఖురాన్‌లో ఈ విధంగా ఉంది, రెండవ అధ్యాయము, 172 వ వాక్యం:

وَاشْكُرُوا لِلَّهِ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ
[వష్కురూ లిల్లాహి ఇన్ కున్తుమ్ ఇయ్యాహు త’అబుదూన్]
ఒకవేళ మీరు అల్లాహ్ యే ఆరాధించే వారైతే ఆయనకు కృతజ్ఞులై ఉండండి. (2:172)

అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలపాలని ఇక్కడ ఆదేశించబడి ఉంది. రమజాన్ మాసం దక్కటం అల్లాహ్ తరఫున పెద్ద అనుగ్రహము కాబట్టి, ఆ అనుగ్రహం పొందిన వారు అల్లాహ్‌కు ముందుగా కృతజ్ఞతలు చెల్లించాలి.

చూడండి, గుండె మీద ఒక్కసారి చెయ్యి పెట్టుకొని ఆత్మ విమర్శ చేసి చూడండి, ఆలోచించి చూడండి. మనతో పాటు గత సంవత్సరం రమజాన్ మాసంలో ఉపవాసాలు ఉన్నవారు, ఇఫ్తారీ ప్రోగ్రాంలలో పాల్గొన్న వారు, తరావీహ్‌లలో పాల్గొన్న వారు ఈ సంవత్సరము రమజాన్ వచ్చేసరికి మన మధ్య లేరు. వారు మరణించారు, అల్లాహ్ వద్దకు చేరుకున్నారు. మనకు మాత్రం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయుష్షు ఇచ్చాడు, మరొక రమజాన్ మన జీవితంలోకి తీసుకొని వస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు అల్లాహ్ ఇచ్చిన ఈ అనుగ్రహాన్ని మనము గుర్తించి, అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలపాలి, ఇది రెండవ సలహా.

మూడవ సలహా ఏమిటంటే, రమజాన్ మాసం వచ్చింది కాబట్టి మనము సంతోషపడాలి. రమజాన్ మాసం వచ్చిందన్న విషయం మనకు సంతోషం కలిగించాలి.

అయితే సమాజంలో రెండు రకాల ప్రజలను మనము చూస్తూ ఉన్నాం. కొందరికి రమజాన్ మాసం వచ్చిందంటే అస్సలు సంతోషం లేదు, వారు బాధపడుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే కొంతమందికి సంతోషం లేదు, వారికి బాధ కలుగుతూ ఉంది. మన విశ్వాసులకే ఎవరైతే ముస్లింలని చెప్పుకుంటున్నారో వారిలోనే కొంతమందికి అలాంటి బాధ కలుగుతూ ఉంది. కారణం ఏంటంటే, వారు ఇన్ని రోజులు బాగా తాగుతూ, తింటూ, తిరుగుతూ తందనాలు ఆడుతూ ఉండేవారు. రమజాన్ వచ్చేసింది కాబట్టి ఇక ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఇన్ని రోజులు తాగినట్టు వాళ్ళు తాగలేరు; సిగరెట్లు తాగటం కానీ, గుట్కాలు నమలటం కానీ, సారాయి మధ్యము సేవించటం కానీ, ఇవన్నీ వాళ్ళు చేస్తూ తందనాలు ఆడుతూ ఉండేవారు కాబట్టి, రమజాన్ వచ్చేసిందంటే ఇదంతా ఇక ఆగిపోతుంది. రమజాన్ మాసంలో కూడా వాళ్ళు తాగినా, తిన్నా, తిరిగినా, చూసిన వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉపవాసం ఉంటున్నారు, మీకేమైంది మీరు ఉపవాసం ఉండకుండా ఇలా తిరుగుతూ ఉన్నారు అని ప్రతి ఒక్కరూ నిందిస్తారు, వేలెత్తి చూపుతారు. కాబట్టి ఇన్ని రోజులు వారు ఏ జల్సాలైతే చేస్తూ వస్తూ ఉన్నారో అవన్నీ ఆగిపోతాయి అన్న విషయాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటారు కొంతమంది. ఇది విశ్వాసానికి విరుద్ధమైన విషయం. ఇలాంటి వారు తోబా చేసుకోవలసిన అవసరం ఉంది.

అయితే సమాజంలో మరికొంతమంది విశ్వాసులు ఉన్నారు. రమజాన్ మాసం వస్తూ ఉంది అంటే వారికి ఆత్మ లోపల నుంచి సంతోషం కలుగుతుంది. వారు లోపల నుంచి సంతోషపడుతూ ఉంటారు, నోటితో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. అలాంటి విశ్వాసులలో అల్లాహ్ మమ్మల్ని అందరిని చేర్చు గాక.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మనం చూచినట్లయితే, నిసాయి గ్రంథంలోని ఉల్లేఖనంలో అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలపబడింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రమజాన్ మాసం వచ్చిందన్న విషయాన్ని సంతోషంగా ప్రజల ముందర ప్రకటించేవారు.

أتاكم رمضان شهر مبارك
[అతాకుమ్ రమదాన్ షహ్రున్ ముబారక్]
మీ వద్దకు రమజాన్ వచ్చేసింది, ఇది పవిత్రమైన మాసము, శుభాలతో కూడిన మాసము అని సహాబాల ముందర సంతోషాన్ని వ్యక్తపరిచేవారు. కాబట్టి రమజాన్ మాసం వచ్చినప్పుడు మనం సంతోషాన్ని వ్యక్తపరచాలి. ఇది మూడవ సలహా.

నాలుగవ సలహా ఏమిటంటే, రమజాన్ మాసాన్ని పొందిన తర్వాత రమజాన్ మాసాన్ని సద్వినియోగం చేసుకోవటం కోసము మనం ముందుగానే దృఢమైన సంకల్పం చేసుకోవాలి. ఒక్క రోజు కూడా, ఒక్క ఉపవాసము కూడా చేజారకూడదు. ఒక్క ఆరాధన కూడా చేజారకూడదు. అన్ని ఆరాధనలు చేసుకొని, అన్ని ఉపవాసాలు ఉండి, అన్ని రకాల సత్కార్యాలు చేసుకొని రమజాన్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ముందుగానే మనము సంకల్పం చేసుకోవాలి. సంకల్పం నిజమైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి సంకల్పాన్ని నెరవేరుస్తాడు. ఖురాన్ గ్రంథం 47వ అధ్యాయం, 21వ వాక్యాన్ని చూడండి, అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తూ ఉన్నాడు:

فَلَوْ صَدَقُوا اللَّهَ لَكَانَ خَيْرًا لَّهُمْ
[ఫలవ్ సదఖుల్లాహ లకాన ఖైరల్ లహుమ్]
“వారు అల్లాహ్‌ పక్షాన సత్యవంతులుగా నిలబడి ఉంటే అది వారి కొరకు శ్రేయోదాయకమై ఉండేది.” (47:21)

అంటే వారి సంకల్పం సరైనదై ఉంటే అది వారికే మంచిది అని అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పేర్కొంటూ ఉన్నాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఒక పల్లెటూరి వాసి ఇస్లాం స్వీకరించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో వచ్చి జత కలిశాడు. ఆ తర్వాత అతను వలస ప్రయాణము కూడా చేశాడు. వలస ప్రయాణము చేసి మదీనాకు చేరుకున్నప్పుడు యుద్ధాలు జరిగాయి, ఆ యుద్ధాలలో ఒక యుద్ధంలో యుద్ధ ప్రాప్తి మాలె గనీమత్ దక్కింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మాలె గనీమత్‌ను ప్రజలకు పంచారు. అతనికి కూడా కొద్ది భాగము ఇచ్చారు. ఆ పల్లెటూరి వాసి ఎంత మంచి సంకల్పం కలిగిన వ్యక్తితో చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఏమంటున్నాడంటే,

“ఓ దైవ ప్రవక్త, నేను ఇస్లాం స్వీకరించి, వలస ప్రయాణము చేసుకొని ఇక్కడికి వచ్చింది ఈ ప్రాపంచిక సొమ్ము కోసము కాదు. ఈ ప్రాపంచిక సొమ్ము పొందాలనే ఉద్దేశంతో నేను ఈ విధంగా చేయలేదు. నా సంకల్పం ఏమిటంటే, నేను అల్లాహ్ ధర్మం కోసము శ్రమించాలి, వీలైతే అల్లాహ్ ధర్మం కోసము అన్ని రకాల త్యాగాలు, చివరికి నా ప్రాణము కూడా త్యాగము చేసేయాలి. ఆ ఉద్దేశంతో నేను ఇస్లాం స్వీకరించాను, మీతో జత కలిశాను, వలస ప్రయాణం చేశాను ఓ దైవ ప్రవక్త” అన్నాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు ఈ విధంగా సమాధానం ఇచ్చారు:

إن تصدق الله يصدقك
[ఇన్ తస్దుఖిల్లాహ యస్దుఖ్-క]
“నీవు నిజంగానే ఆ విధంగా సంకల్పం చేసుకొని ఉంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నీ సంకల్పాన్ని తప్పనిసరిగా నెరవేరుస్తాడు” అని సమాధానం ఇచ్చారు. (నిసాయి గ్రంథంలోని ఉల్లేఖనం).

ప్రజలు చూశారు, అలాగే జరిగింది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఇస్లాం కోసము శ్రమించాడు, శ్రమించాడు, ఎంతగా శ్రమించాడు అంటే ఒక యుద్ధంలో ఇస్లాం కోసము అతను తన ప్రాణాలను కూడా అర్పించేశాడు, షహీద్ అయిపోయాడు. చూశారా?

కాబట్టి సంకల్పంలో చిత్తశుద్ధి ఉంటే, మన సంకల్పం నిజమైనదై ఉంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దానిని నెరవేరుస్తాడు కాబట్టి, రమజాన్‌ను సద్వినియోగం చేసుకోవాలని మనము చిత్తశుద్ధితో సంకల్పం చేసుకుంటే, మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రమజాన్ నుండి లబ్ధి పొందిన వారు లాగా తీర్చిదిద్దేస్తాడు. ఇది నాలుగవ సలహా.

ఇక ఐదవ సలహా ఏమిటంటే, రమజాన్ రాకముందే పశ్చాత్తాపం పొంది పాపాలకు దూరంగా ఉండుటకు గట్టి నిర్ణయం తీసుకోవాలి.

చూడండి, రమజాన్ మాసంలో కూడా పశ్చాత్తాపం పొందాలి, రమజాన్ మాసం రాకముందే మనము పశ్చాత్తాపము ప్రారంభించేయాలి, పశ్చాత్తాపం చెందటం ప్రారంభించేయాలి. పశ్చాత్తాపం గురించి ప్రత్యేకంగా ఒక ప్రసంగం మనం విని ఉన్నాం. ఖురాన్ గ్రంథంలోని 24వ అధ్యాయం, 31వ వాక్యాన్ని ఒకసారి మనం మళ్ళీ ఒకసారి చదివి విందాం. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పశ్చాత్తాపం గురించి ఆదేశిస్తూ ఇలా అంటూ ఉన్నాడు:

وَتُوبُوا إِلَى اللَّهِ جَمِيعًا أَيُّهَ الْمُؤْمِنُونَ لَعَلَّكُمْ تُفْلِحُونَ
[వతూబూ ఇలల్లాహి జమీ’అన్ అయ్యుహల్ ముఅమినూన ల’అల్లకుమ్ తుఫ్లిహూన్]
“ఓ విశ్వాసులారా! మీరంతా కలసి అల్లాహ్ సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.” (24:31)

పవిత్రమైన మాసం, అది రాబోవుచున్నది కాబట్టి, మనం కూడా ఆ పవిత్రమైన మాసంలో ప్రవేశించేటటానికి మనము కూడా పాపాల నుండి పశ్చాత్తాపం పొంది పవిత్రులమైపోయి ఆ మాసంలో ప్రవేశించటం ఎంతో అవసరమైన విషయం కాబట్టి రమజాన్‌కు ముందే పశ్చాత్తాపం పొందండి, ఇదే అలవాటు రమజాన్‌లో కూడా కొనసాగించండి అని ధార్మిక పండితులు సలహా ఇచ్చి ఉన్నారు. ఇది ఐదవ సలహా.

ఆరవ సలహా ఏమిటంటే రమజాన్ మాసంలో అన్ని రకాల పుణ్యాలు మనం పొందాలి అంటే, రమజాన్ మరియు రమజాన్‌లో ఉన్న ఆరాధనల నియమాలు ముందుగానే తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలి.

చూడండి, రమజాన్‌లో ఉన్న ఆరాధనలు, ముఖ్యంగా ఉపవాసాలు, అలాగే నమాజులు, ఖియాముల్ లైల్, అలాగే ఖురాన్ పారాయణం, దానధర్మాలు, జకాత్ చెల్లించటాలు ఇక అనేక సత్కార్యాలు ఉన్నాయి కదండీ, వాటి గురించి నియమాలు, నిబంధనలు ముందుగానే మనము తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకుంటే తప్పులు లేకుండా మనము ప్రతి ఆరాధన, ప్రతి సత్కార్యము చక్కగా చేయగలము, అన్ని పుణ్యాలు పొందగలము. అవగాహన చేసుకోకుండానే అలాగే ప్రారంభిస్తే తప్పులు దొర్లి పుణ్యాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అడిగి తెలుసుకోవాలి, చదివి తెలుసుకోవాలి. చూడండి అల్లాహ్ ఏమంటున్నాడు, ఖురాన్ గ్రంథం 21వ అధ్యాయం, ఏడవ వాక్యం:

فَاسْأَلُوا أَهْلَ الذِّكْرِ إِن كُنتُمْ لَا تَعْلَمُونَ
[ఫస్అలూ అహలద్-ధిక్ రి ఇన్ కున్తుమ్ లా త’అలమూన్]
“మీకు తెలియకపోతే జ్ఞానులను అడిగి తెలుసుకోండి.” (21:7)

కాబట్టి రమజాన్‌లో ఉన్న ఆరాధనలు, సత్కార్యాలు అవి ఎలా చేయాలి, వాటి నియమాలు నిబంధనలు ఏమిటి అని ముందుగానే మనము తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. ఇది మరొక సలహా, ఆరవది.

ఏడవ సలహా ఏమిటంటే, సంకల్ప శుద్ధి చేసుకోవాలి. సంకల్పం చేసుకోండని చెప్పాం, కానీ ఆ సంకల్పంలో కూడా శుద్ధి చేసుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రదర్శనా బుద్ధికి లోనయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి. షైతాన్ ప్రతి ఒక్కరితో పాటు ఉన్నాడు, అతను ప్రజల హృదయాలలో ప్రదర్శనా బుద్ధి పుట్టించగలడు. కాబట్టి ప్రదర్శనా బుద్ధి రాకుండా ఉండుటకు సంకల్ప శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే ప్రదర్శనా బుద్ధితో ఏ సత్కార్యము చేసినా అది వృధా అయిపోతుంది కాబట్టి, అది అల్లాహ్ వద్ద ఆమోదించబడదు కాబట్టి, మనము రమజాన్‌లో ప్రదర్శనా బుద్ధితో సత్కార్యాలు చేస్తే, ఆరాధనలు చేస్తే రమజాన్ మాసం వృధా అయిపోతుంది. చూడండి ఖురాన్ గ్రంథం 18వ అధ్యాయం, 110వ వాక్యంలో అల్లాహ్ తెలియజేస్తూ ఉన్నాడు:

فَمَن كَانَ يَرْجُو لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا
[ఫమన్ కాన యర్జూ లిఖ్యా’అ రబ్బిహీ ఫల్-య’అమల్ ‘అమలన్ సాలిహన్ వలా యుష్రిక్ బి’ఇబాదతి రబ్బిహీ అహదా]

“తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవారు సత్కార్యాలు చేయాలి, తన ప్రభువు ఆరాధనలో వేరొకరికి భాగస్వామ్యం కల్పించకూడదు.” (18:110)

అంటే, చిత్తశుద్ధితో సత్కార్యాలు చేయాలి, ప్రదర్శనా బుద్ధికి దూరంగా ఉంటూ కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే సత్కార్యాలు చేయాలి కాబట్టి మన హృదయాలలో ప్రదర్శనా బుద్ధి రాకుండా సంకల్ప శుద్ధి చేసుకోవాలి.

ఇక ఎనిమిదవ సలహా ఏమిటంటే, ముస్లింల పట్ల మన హృదయాలను సాఫీగా ఉంచుకోవాలి. ఇతరుల పట్ల కల్మషం గానీ, కీడు గానీ హృదయాలలో ఉండనియ్యరాదు. ఎందుకంటే ఇంతకు ముందు షాబాన్ నెలలో ముఖ్యంగా షాబాన్ 15వ తేదీన ఒక హదీసు మనం పదేపదే వింటూ వస్తూ ఉన్నాం. ఏముంది అక్కడ?

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా షాబాన్ నెల 15వ తేదీ రాత్రిన ప్రజల వైపు దృష్టి సారించి అందరి పాపాలను మన్నించేస్తాడు, ఇద్దరి పాపాలను మాత్రము మన్నించకుండా వదిలేస్తాడు. ఎవరు ఆ ఇద్దరు అంటే, ఒకరు ముష్రిక్, మరొకరు తమ మిత్రుల పట్ల హృదయంలో కీడు ఉంచుకున్నవాడు.” (ఇది సహీ అత్-తర్ఘీబ్ వత్-తర్హీబ్ గ్రంథంలోని ఉల్లేఖనం.)

ఆ ఉల్లేఖనం ప్రకారంగా ఎవరైతే బహుదైవారాధన, షిర్క్ చేస్తూ ఉన్నారో వారికి పాప క్షమాపణ ఉండదు. అలాగే ఎవరైతే ఇతరుల పట్ల హృదయంలో కీడు ఉంచుకున్నారో, వాడికి, వారికి క్షమాపణ దొరకదు. కాబట్టి హృదయాలలో ఇతరుల పట్ల కీడు లేకుండా మన హృదయాన్ని కూడా మనము శుద్ధపరచుకోవాలి. ఎవరి గురించి కూడా మన హృదయంలో కీడు ఉండకూడదు.

ఇక మరొక సలహా ఏమిటంటే, ఖురాన్ పారాయణం కొరకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు లేదంటే ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. వారికి తీరిక ఎప్పుడు ఉంటుంది? ఏ సమయం వారికి దక్కుతుంది? ఆ సమయంలో వారు ఖురాన్ పారాయణం కోసము ముందుగానే టైం టేబుల్, జద్వల్ మరియు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. నాకు ఫలానా సమయంలో ఇంత సమయం దొరుకుతుంది, ఫలానా నమాజ్ తర్వాత ఇంత సమయం దొరుకుతుంది, లేదంటే ఉదయం ఇంత సమయం దొరుకుతుంది, మధ్యాహ్నం ఇంత సమయం దొరుకుతుంది, సాయంత్రం ఇంత సమయం దొరుకుతుంది, ఆ సమయాన్ని ఖురాన్ పారాయణంతో మనము నింపుకోవాలి. ఆ విధంగా ఖురాన్ పారాయణము కోసము మనము ప్రణాళిక చేసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా జిబ్రీల్ అలైహిస్సలాం వారికి రమజాన్ మాసంలో ఖురాన్ వినిపించేవారు. సహాబాలు కూడా రమజాన్ మాసంలో ఎక్కువగా ఖురాన్ పారాయణము చేసేవారు. మనము కూడా అధికసార్లు ఖురాన్ పారాయణము పూర్తి చేయుటకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి, సమయాన్ని కేటాయించుకోవాలి, ఆ సమయం ప్రకారము తర్వాత ఖురాన్ పారాయణము చేసుకుంటూ రమజాన్ మాసాన్ని గడపాలి.

మరొక ఉదాహరణ ఏమిటంటే, రమజాన్‌లో ముఖ్యంగా ఇఫ్తారీ, ఉపవాస విరమణ చేయించుటకు ముందుగానే మనము ప్రణాళిక చేసుకోవాలి. మనం ఇంతకుముందు అనేక సార్లు విని ఉన్నాం, ఉపవాసానికి అపరిమితమైన పుణ్యం ఇవ్వబడుతుంది. అలాగే ఒక ఉపవాసికి ఇఫ్తారీ చేయిస్తే, ఉపవాస విరమణ చేయిస్తే, ఉపవాసికి దక్కినంత పుణ్యము ఉపవాస విరమణ చేయించిన వ్యక్తికి కూడా అందజేయబడుతుంది. అలాగే ఎంత మందికి మనము ఇఫ్తారీ చేయిస్తామో అన్ని ఉపవాసాల పుణ్యము పొందగలము కాబట్టి, రమజాన్ మాసం రాకముందే ఎంతమందికి మనము ఇఫ్తారీ చేయించాలి, మన స్తోమత ఏమిటి అనేది ముందుగానే మనము చూసుకొని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి మిత్రులారా.

అలాగే దానధర్మాలు చెల్లించుటకు కూడా ప్లాన్ చేసుకోవాలి. మన వీధిలో, మన ఇరుగుపొరుగులో, మనం నివసిస్తున్న ఊరులో, పల్లెలో, మన పరిసరాలలో అనేకమంది వితంతువులు ఉంటారు, అనాథలు ఉంటారు, వికలాంగులు ఉంటారు, అలాగే నిరుపేదలు ఉంటారు. అలాంటి వారికి మనము దానధర్మాలు చేయాలి. రమజాన్ మాసంలో చేసిన ప్రతి సత్కార్యానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పెంచి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి, రమజాన్ మాసంలో నిరుపేదలకు, వితంతువులకు, వికలాంగులకు, అభాగ్యులకు సహాయం చేయాలి, దానధర్మాలు చేయాలి. చూడండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చూసిన సహాబాలు ఏమంటారంటే:

كان رسول الله أجود بالخير من الريح المرسلة
[కాన రసూలుల్లాహి అజ్వద బిల్-ఖైరి మినర్-రీహిల్ ముర్సల]
“వేగంగా వీస్తున్న గాలి కంటే వేగంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రమజాన్‌లో దానధర్మాలు చేసేవారు.”

అంటే అంత ఎక్కువగా ఆయన దానధర్మాలు రమజాన్ మాసంలో చేసేవారు కాబట్టి మనము కూడా విశాలమైన హృదయంతో రమజాన్ మాసంలో ఎక్కువగా దానధర్మాలు చేయాలి, దాని కోసం ముందుగానే మనము ప్రణాళిక చేసుకోవాలి మిత్రులారా. అల్లాహ్ మనందరికీ ఆ భాగ్యం ప్రసాదించు గాక.

అలాగే మరొక సలహా ఏమిటంటే, స్తోమత ఉన్నవారు రమజాన్ మాసంలో ఉమ్రా చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విషయం, రమజాన్‌లో ఆచరించిన ఉమ్రాకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా హజ్జ్ లాంటి పుణ్యం ప్రసాదిస్తాడు.

فإن عمرة في رمضان تقضي حجة أو حجة معي
[ఫఇన్న ఉమరతన్ ఫీ రమదాన తఖ్దీ హజ్జతన్ అవ్ హజ్జతన్ మ’ఈ]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు కలిసి హజ్జ్ చేసినంత పుణ్యము రమజాన్‌లో ఉమ్రా చేసిన వారికి ఇవ్వబడుతుంది.” అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు. (బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం).

కాబట్టి మిత్రులారా, రమజాన్ మాసంలో సౌకర్యము మరియు స్తోమత ఉన్నవారు రమజాన్‌లో ఉమ్రా చేయటానికి ప్రణాళిక చేసుకోవాలి, ముందస్తు చర్యలు చేపట్టాలి.

అలాగే మరొక సలహా ఏమిటంటే, ఈ రమజాన్ మాసంలో దైవ సందేశం ప్రజల వద్దకు చేర్చటానికి ముందుగానే మనము సిద్ధమవ్వాలి. ఎందుకంటే రమజాన్ మాసంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా షైతాన్‌లకు బేడీలు వేసేస్తాడు కాబట్టి అల్లాహ్ మాట ప్రజల హృదయంలో ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది కాబట్టి, మనకు వీలైతే మనం స్వయంగా అల్లాహ్ నియమాలు, అల్లాహ్ వాక్యాలు ప్రజల వరకు చేరవేయించాలి. అంత శక్తి మాకు లేదు, ఆ అర్హత మాకు లేదు అంటే కనీసం ఎవరైతే ఆ పని చేస్తూ ఉన్నారో, దైవ వాక్యాలు ప్రజలకు వినిపించే పని చేస్తూ ఉన్నారో, వారి వద్దకు ప్రజలను తీసుకొని వెళ్లి అక్కడ వారికి అల్లాహ్ వాక్యాలు వినిపించేలాగా చూడాలి. స్వయంగా అందజేయండి. ఆ అర్హత లేదు, స్తోమత లేదు, అలాంటి సౌకర్యము లేదు అంటే, కనీసం ఎవరైతే దైవ వాక్యాలు వినిపిస్తున్నారో అలాంటి చోటికి మిత్రులను తీసుకొని వెళ్లి దైవ వాక్యాలు వినిపించండి. ఇన్ షా అల్లాహ్, అల్లాహ్ వారికి హిదాయత్ ప్రసాదిస్తే వారి హిదాయత్ కొరకు మీరు కారకులు అవుతారు, మీకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పుణ్యం ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ రమజాన్ మాసంలో అలాంటి ప్రణాళిక కూడా సిద్ధం చేసుకోండి అని పండితులు తెలియజేసి ఉన్నారు.

ఇక చివర్లో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మిత్రులారా, రమజాన్ మాసం, ఇది సంవత్సరం మొత్తం ఉండేది కాదు, కేవలం ఒక నెల మాత్రమే. అల్లాహ్ ఏమంటాడంటే:

أَيَّامًا مَّعْدُودَاتٍ
[అయ్యామన్ మ’అదూదాత్]
“ఇవి లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే.” (2:184)

30 రోజులు లేదంటే 29 రోజులు. ఈ లెక్కించదగిన ఈ కొన్ని రోజుల్ని మనము వృధా చేయనియ్యకూడదు. వృధా చేయకుండా పూర్తిగా కష్టపడి, శ్రమించి, ఎక్కువగా సత్కార్యాలు చేసుకొని పాప క్షమాపణ అల్లాహ్‌తో అడుక్కొని పాపాల నుండి విముక్తి పొందాలి, నరకం నుండి విముక్తి పొందాలి, స్వర్గవాసులైపోవాలి, అధిక పుణ్యాలు సంపాదించుకున్న వారైపోవాలి.

అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సంవత్సరం అల్లాహ్ మనకు రమజాన్ ప్రసాదించు గాక. ఈ సంవత్సరం మనం బ్రతికి ఉన్నాము, ఇక వచ్చే సంవత్సరం వరకు, వచ్చే సంవత్సరం రమజాన్ వరకు బ్రతికి ఉంటామో ఉండమో తెలియదు, ఎవరికీ గ్యారెంటీ లేదు. కాబట్టి ఇదే మన చివరి రమజాన్ ఏమో అని భావించి ఎక్కువగా శ్రమించుకోవాలి మిత్రులారా.

నేను అల్లాహ్‌తో దుఆ చేస్తూ ఉన్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ రమజాన్ నెల ప్రసాదించు గాక. రమజాన్ నెల కంటే ముందే రమజాన్ కోసము ప్రణాళికలు సిద్ధము చేసుకొని సన్నద్ధమయ్యే భాగ్యం ప్రసాదించు గాక. రమజాన్ శుభాలు, వరాలు మనందరి జీవితాలలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వర్షింపజేయు గాక, ఆమీన్.

వ జజాకుముల్లాహు ఖైరన్, అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44142