ఖుత్బా యందలి ముఖ్యాంశాలు
1) ఆఖరి పది రోజులలో వీలైనంత ఎక్కువగా ఆరాధన చేయాలి.
2) ఏతెకాఫ్.
3) రాత్రి నమాజ్ (ఖియాముల్లైల్)
4) లైలతుల్ ఖద్ర్.
5) సదఖతుల్ ఫిత్ర్ (ఫిత్రా దానం)
6) పండుగ మర్యాదలు
మొదటి ఖుత్బా
ఇస్లామీయ సోదరులారా!
రమజాన్ మాసపు ఆఖరి పది రోజులు ఎంతో ముఖ్యమైనవి. ఎందుకంటే వీటిలో వెయ్యి నెలల ఆరాధన కన్నా శ్రేష్టమైన ఒక రాత్రి కూడా వుంది. అందుకే ఈ వ్యవధిలో వీలైనంత ఎక్కువగా ఆరాధించాలి, వీలైనంత ఎక్కువగా అల్లాహ్ సాన్నిధ్యం పొందడానికి ప్రయత్నించాలి, వీలైనంత ఎక్కువగా దుఆ చేయాలి మరియు తమ పాపాలకు గాను వీలైనంత ఎక్కువగా అల్లాహ్ తో క్షమాపణ వేడుకుంటూ మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందాలి.
ఆయెషా (రదియల్లాహు అన్హా) కథనం: “(రమజాన్ మాసపు) ఆఖరి పది రోజులు ఆరంభం కాగానే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) రాత్రంతా జాగారం చేసేవారు, తన ఇంటి వారిని కూడా మేల్కొలిపే వారు, ప్రత్యేకంగా నడుం బిగించి ఎంతో ఎక్కువగా ఆరాధించేవారు”. (బుఖారీ: 2024, ముస్లిం: 1174)
అలాగే, ఆయెషా (రదియల్లాహు అన్హా) ఇలా కూడా సెలవిచ్చారు. “దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆఖరి పది రోజుల్లో ఆరాధించినట్లు మరెప్పుడూ ఆరాధించేవారు కారు”. (ముస్లిం: 1175)
కనుక, మనం కూడా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆచరణను ముందుంచి ప్రత్యేకంగా నడుంబిగించి వీలైనంత ఎక్కువగా ఆరాధించాలి. ఎంతో శుభకరమైన ఈ వ్యవధిని ఏ మాత్రం వ్యర్థం చేయకుండా, దీని ప్రతిక్షణం ప్రయోజనం పొందటానికి ప్రయత్నించాలి.
ఏతెకాఫ్
ఆఖరి పది రోజుల్లో వీలైనంత ఎక్కువగా ఆరాధించడానికి ఉత్తమమైన స్వరూపం ఏమిటంటే, వీటిని ఏతెకాఫ్ లో గడపడం. ఎందుకంటే, ఏతెకాఫ్ ఉద్దేశ్యం ప్రాపంచిక వ్యవహారాల నుండి తెగతెంపులు చేసుకొని, పూర్తిగా అల్లాహ్ వైపునకు మరలి, ఆయనను సంతృప్తి పరచి, ఆయన సాన్నిధ్యం పొందటానికి మనస్సును కేంద్రీకరించడం. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కూడా ఈ పది రోజుల్లో ఏతెకాఫ్ లో గడిపేవారు.
ఆయేషా (రదియల్లాహు అన్హా) కథనం: “దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తాను మరణించే వరకు రమజాన్ మాసపు పది రోజులు ఏతెకాఫ్ లో గడిపేవారు. ఆ తర్వాత ఆయన సతీమణులు ఏతెకాఫ్ లో కూర్చునేవారు”. (బుఖారీ: 2026, ముస్లిం: 1172)
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం: “దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రతి రమజాన్ లో 10 రోజులు ఏతెకాఫ్ లో గడిపేవారు. కానీ, తాను మరణించిన సంవత్సరంలో 20 రోజులు ఏతెకాఫ్ లో గడిపారు”. (బుఖారీ: 2044)
అందుకే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సున్నత్ ను అనుసరిస్తూ ముస్లిములు కూడా ఆఖరి పది రోజులు ఏతెకాఫ్ లో గడపాలి. తద్వారా ప్రాపంచిక వ్యవహారాల నుండి దూరంగా వుంటూ కేవలం అల్లాహ్ వైపునకు మనస్సును కేంద్రీకరించవచ్చు. ఎల్లప్పుడూ ఆయన స్మరణలో గడపవచ్చు, దివ్య ఖుర్ఆన్ పారాయణం చేస్తూ దాని గురించి ఆలోచించి హితబోధను స్వీకరించవచ్చు, తమ పాపాలకు గాను మనస్ఫూర్తిగా తౌబా చేయవచ్చు. మాటిమాటికీ అల్లాహ్ ముందు ఏడుస్తూ, కన్నీళ్ళు పెట్టుకొని ఇహపరలోకాల సాఫల్యం కొరకు అల్లాహ్ ను అర్థించవచ్చు.
ఏతెకాఫ్ లో వున్న వ్యక్తి ప్రాపంచిక విషయాలు అటుంచి, ధార్మిక వ్యవహారాల నిమిత్తం కూడా బయటకు వెళ్ళకుండా వుండాలి. కేవలం అత్యవసర పరిస్థితుల్లో తప్ప. ఆయెషా (రదియల్లాహు అన్హా) కథనం: “ఏతెకాఫ్ లో వున్న వ్యక్తికి సున్నత్ ఏమటంటే, అతను రోగులను పరామర్శించడానికి వెళ్ళకూడదు. జనాజా కోసం వెళ్ళకూడదు, భార్యను ముట్టుకోకూడదు మరియు సంభోగించకూడదు. కేవలం గత్యంతరం లేని పరిస్థితుల్లో తప్ప ఏ పని కోసం వెళ్ళకూడదు”. (అబూ దావూద్ : 2473, సహీ అల్బానీ)
ఏతెకాఫ్ లో వున్నప్పుడు ఫర్జ్ ఆచరణలతో పాటు నఫిల్ ఆరాధనలు కూడా వీలైనంత ఎక్కువగా చేస్తూ వుండాలి. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు – ఏ వ్యక్తి అయినా నా మిత్రునితో శతృత్వం కలిగి వుంటాడో నేనతనితో యుద్ధ ప్రకటన చేస్తాను. నా దాసుడు తనపై విధి (ఫర్జ్) గా విధించబడిన వాటిని ఆచరిస్తూ నా సాన్నిధ్యాన్ని ఎక్కువగా పొందగలుగుతాడు. (అంటే ఫర్జ్ ద్వారా నా సాన్నిధ్యాన్ని పొందడం నాకెంతో ఇష్టం). ఇంకా ఐచ్ఛిక (నఫిల్) ఆరాధనల ద్వారా కూడా నా సాన్నిధ్యాన్ని పొందుతూ వుంటాడు. చివరికి నేను అతన్ని ప్రేమిస్తాను. నేనతన్ని ప్రేమించడం మొదలు పెట్టాక, అతను వినే చెవినై పోతాను, అతను చూసే కళ్ళయిపోతాను, అతను పట్టుకొనే చెయ్యినైపోతాను, అతను నడిచే కాళ్ళయి పోతాను (అంటే అతని శరీర అవయవాలన్నిటినీ నా విధేయతకు అనుగుణంగా మార్చుతాను). తదుపరి అతను ఏ విషయం గురించి అయినా అర్థిస్తే నేనతనికి అనుగ్రహిస్తాను. ఒకవేళ అతను నా శరణు కోరుకుంటే నేనతనికి నా శరణు ప్రసాదిస్తాను.” (బుఖారీ: 6502)
అందుకే ఏతెకాఫ్ లో వున్నప్పుడు ఫర్జ్ నమాజులతో పాటు ప్రత్యేకించి నఫిల్ నమాజులు కూడా చదవాలి. అంతేకాక, ఏతెకాఫ్ లో లేని వ్యక్తులు కూడా ఈ పది రోజుల్లో వీలైనంత ఎక్కువగా నఫిల్ ఆరాధనలు చేయాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే – నఫిల్ నమాజులు కూడా స్వయానా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా నిరూపించ బడిన వాటిని, ఉదా॥కు ఫర్జ్ నమాజుకు ముందు దాని తర్వాతి సున్నతులు, చాప్త్ నమాజు మరియు రాత్రి నమాజు వగైరాలను చేయాలి.
ఉమ్మె హబీబా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు. “ఒక ముస్లిం దాసుడు ప్రతి రోజు అల్లాహ్ సంతృప్తి కొరకు 12 రకాతులు నఫిల్ (ఫర్జ్ కాదు) ఆచరిస్తాడో అల్లాహ్ అతని కోసం స్వర్గంలో ఒక గృహాన్ని నిర్మిస్తాడు లేదా అతని కోసం స్వర్గంలో ఒక ఇల్లు నిర్మించబడుతుంది”.
ఈ హదీసును ఉల్లేఖించిన తర్వాత ఉమ్మె హబీబా (రదియల్లాహు అన్హా) ఇలా సెలవిచ్చారు- ‘నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నోటి నుండి ఈ 12 రకాతుల గురించి విన్నప్పట్నుండి ఎప్పుడూ వాటిని వదలలేదు’. (ముస్లిం: 728)
ఈ 12 రకాతుల వివరణ సునన్ తిర్మిజీలో వుంది. ఉమ్మె హబీబా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్ల ల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “ఏ వ్యక్తి అయినా రేయింబవళ్ళలో 12 రకాతులు గనక చదివితే అతని కోసం స్వర్గంలో ఒక ఇల్లు నిర్మించ బడుతుంది. జొహర్కు ముందు 4 మరియు తర్వాత 2, అలాగే మగ్రిబ్ తర్వాత 2, ఇషా తర్వాత 2 మరియు ఫజర్ కు ముందు 2 రకాతులు”. (తిర్మిజి: 415, సహీహ్ – అల్బానీ)
ఉమ్మె హబీబా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా కూడా సెలవిచ్చారు: ‘ఏ వ్యక్తి అయినా జొహర్కు ముందు 4 రకాతులు మరియు తర్వాత 4 రకాతులు ఎల్లప్పుడూ క్రమం తప్పకుండా చేస్తూ వుంటాడో అల్లాహ్ అతనికి నరకాగ్నిని నిషేధం చేస్తాడు”. (ముస్నద్ అహ్మద్ : 6/326, అబూ దావూద్ : 1269, తిర్మిజి: 427, నసాయి: 1814 ఇబ్నె మాజా : 1160, సహీహ్ -అల్బానీ)
అలాగే, ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు. “అసర్ కు ముందునాలుగు రకాతులు చదివే వ్యక్తిపై అల్లాహ్ కరుణించుగాక!”.(అబూ దావూద్: 1271, తిర్మిజి: 430, సహీహ్ -అల్బానీ)
ఫర్జ్ కు ముందు, దాని తర్వాత సున్నతులతో పాటు చాష్త్ నమాజ్ను కూడా చదవాలి. దీని మహత్యం ఎంతో వుంది. అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు. “ఏ వ్యక్తి అయినా ఫజర్ నమాజును సామూహికంగా ఆచరించి, ఆపై అక్కడే కూర్చొని సూర్యోదయం అయ్యే వరకు అల్లాహ్ స్మరణ చేస్తూ తదుపరి రెండు రకాతులు చదివితే అతనికి సంపూర్ణ హజ్ మరియు ఉమ్రాల పుణ్యం దొరుకుతుంది”. (తిర్మిజీ: 586, సహీహ్ అల్బానీ)
అలాగే, అబూజర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “మీలో ప్రతి ఒక్కరూ, ప్రతి రోజు (మీ శరీరం లోని) కీళ్ళన్నింటికిగాను ఒక్కో దానం చేయడం తప్పనిసరి. ఇలా, ప్రతి ‘సుబహానల్లాహ్’ ఒక దానం, ప్రతి ‘అల్హమ్దులిల్లాహ్’ ఒక దానం, ప్రతి ‘లాయిలాహ ఇల్లల్లాహ్’ ఒక దానం, ప్రతి ‘అల్లాహు అక్బర్’ ఒక దానం. అలాగే మంచిని ఆజ్ఞాపించడం ఒక దానం, చెడు నుండి వారించడం ఒక దానం. ఇక చాష్త్ యొక్క 2 రకాతులు వీటన్నింటి (కీళ్ళు) తరఫు నుండి సరి పోతాయి.” (ముస్లిం: 720)
బరీరా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “ప్రతి వ్యక్తికీ 360 కీళ్ళు వున్నాయి. (ప్రతి రోజూ) అతనిపై తప్పనిసరిగా వున్న విషయం ఏమిటంటే, ప్రతి యొక్క కీలుకు గాను ఒక దానం చేయాలి”. దీనిపై సహాబాలు, ఓ దైవ ప్రవక్తా! అంత శక్తి ఎవరికుంది? అని అడిగారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ – “మస్జిద్లో వేయబడిన ఉమ్మిని పూడ్చేయండి, మార్గంలో అడ్డుగా వున్న వస్తువును తొలగించండి. ఒకవేళ మీకిది కుదరకపోతే, చాష్త్ యొక్క 2 రకాతులు వీటికై సరిపోయతాయి”. (అబూ దావూద్: 5242, సహీహ్ – అల్బానీ)
రాత్రి నమాజ్ (ఖియాములైల్)
ఫర్జ్ కు ముందు మరియు తర్వాత సున్నత్లు, చాష్త్ నమాజుతో పాటు రాత్రి నమాజు గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలి. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా ఇలాగే చేసేవారు.
అబూజర్ (రదియల్లాహు అన్హు) కథనం: మేము దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో పాటు రమజాన్ మాసపు ఉపవాసాలున్నాం. ఈ వ్యవధిలో కేవలం ఏడు రోజులు మిగిలి వున్నంత వరకు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాకు ఖియాం చేయించలేదు. తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) 23వ రాత్రి ఖియాం చేయగా, మేము కూడా ఆయనతో పాటు ఖియాం చేశాం. దీనితో ఆయన మూడింట ఒక వంతు రాత్రి గడిచే వరకు సుదీర్ఘంగా (ఖురాన్) పారాయణం చేశారు. తదుపరి, 24వ రాత్రి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాతో ఖియాం చేయలేదు. ఆ తర్వాత 25వ రాత్రి, అర్థరాత్రి గడిచే వరకు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాతో ఖియాం చేశారు. దీనితో నేను- ఓ దైవప్రవక్తా! మీరు ఈ రోజు రాత్రంతా ఖియాం చేస్తే బాగుండేది! అని అన్నాను. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ, ‘ఏ వ్యక్తి అయినా, ఇమామ్ తన ఖియాం పూర్తి చేసుకొనే వరకు అతనితో పాటు ఖియాం చేస్తే అతనికి రాత్రంతా ఖియాం చేసినంత పుణ్యఫలం లిఖించబడుతుంది’ అని వివరించారు. తదుపరి 26వ రాత్రి గడిచిపోయింది. ఆ రాత్రి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాతో ఖియాం చేయలేదు. ఆ తర్వాత 27వ రాత్రి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మాతో పాటు ఖియాం చేశారు. తన సతీమణులను కూడా (మస్జిద్కు) తీసుకొచ్చారు. (ఆ రాత్రి) ఆయన ఎంత సుదీర్ఘంగా ఖియాం చేసారంటే, సహరీ సమయం గడిచిపోతుందేమోనని మాకు అనుమానం కలిగింది. (తిర్మిజీ: 806, అబూ దావూద్: 1375, నసాయి: 1605, ఇబ్నె మాజ: 1327, సహీహ్ -అల్బానీ)
ఇలాగే, నోమాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హు) కూడా ఇలా ఉల్లేఖించారు: “మేము దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో కలిసి 23వ రాత్రి మూడింట ఒక వంతు ఖియాం చేశాం. తదుపరి 25వ రాత్రి అర్థరాత్రి వరకు చేశాం. ఇక 27వ రాత్రి ఎంత సుదీర్ఘంగా ఖియాం చేసామంటే- బహుశా ఈ రోజు సహరీ భుజించలేమేమో అని మాకు అనుమానం కలిగింది“. (నసాయి: 1606, సహీహ్ -అల్బానీ)
గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, రాత్రి నమాజ్ (ఖియాములైల్), అంటే ఏదైనా ప్రత్యేక నమాజు కాదు, తరావీహ్ నమాజు కూడా రాత్రి నమాజే. అందుకే ఆఖరి పది రోజులో తరావీహ్ నమాజును సుదీర్ఘంగా చేయాలి. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కూడా సహాబాలకు 23, 25 మరియు 27వ రాత్రులలో సుదీర్ఘంగా నమాజు చేయించారు.
ఖుర్ఆన్ మరియు హదీసులలో రాత్రి నమాజు ఔన్నత్యాన్ని ఎంతగానో వివరించబడింది. దైవభీతి పరుల లక్షణాలను వివరిస్తూ అల్లాహ్ ఖుర్ఆన్ ఇలా సెలవిచ్చాడు:
كَانُوا قَلِيلا مِنَ الَّيْلِ مَا يَهْجَعُونَ وَبِالْأَسْحَارِ هُمْ يَسْتَغْفِرُونَO
“వారు రాత్రిపూట చాలా తక్కువగా నిద్రించేవారు. రాత్రి చివరి గడియలలో క్షమాపణకై (అల్లాహ్ ను) వేడుకునేవారు”. (జారియాత్ : 17, 18)
అలాగే ఇలా సెలవిచ్చాడు:
تَتَجَافَى جُنُوبُهُمْ عَنِ الْمَضَاجِعِ يَدْعُونَ رَبَّهُمْ خَوْفًا وَطَمَعًا وَمِمَّا رَزَقْنَهُمْ يُنْفِقُونَ
فلا تَعْلَمُ نَفْسٌ مَا اخْفِى لَهُمْ مِنْ قُرَّةٍ أَعْيُنٍ جَزَاء بِمَا كَانُوا يَعْمَلُونَ
“వారి ప్రక్కలు వారి పడకల నుంచి వేరుగా వుంటాయి. వారు తమ ప్రభువును భయంతోనూ, ఆశతోనూ ప్రార్థిస్తారు. మేము వారికి ప్రసాదించిన దాని నుండి ఖర్చు పెడతారు. వారు చేసిన కర్మలకు ప్రతిఫలంగా, వారి కళ్ళకు చలువనిచ్చే ఎలాంటి సామగ్రిని మేము దాచి పెట్టామో (దాని గురించి) ఏ ప్రాణికీ తెలియదు”. (సజ్దా: 16, 17)
అబ్దుల్లా బిన్ సలామ్ (రదియల్లాహు అన్హు) ఇలా సెలవిచ్చారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మదీనా విచ్చేసినప్పుడు, ఆయన నోటి నుంచి నేను విన్న మొట్టమొదటి హదీసు ఇది- “ప్రజలారా! సలామ్ ను వ్యాపింపజేయండి, ఆకలి గొన్న వారికి అన్నం పెట్టండి, బంధుత్వాన్ని కొనసాగించండి, ప్రజలు నిద్రపోయే సమయంలో మీరు నమాజ్ చేయండి. (మీరు గనక ఇలా చేస్తే) ప్రశాంతంగా స్వర్గంలోకి ప్రవేశించవచ్చు”.(ఇబ్నెమాజ:1334, 3251, తిర్మిజీ: 2485, 1984, అస్సహీహ: 569)
అబూ మాలిక్ అక్అరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “స్వర్గంలో – బయటి దృశ్యాలు లోపలి నుండి, లోని దృశ్యాలు బయటికి కనబడే ఎంతో ఉన్నతమైన గదులు వున్నాయి. అల్లాహ్ వీటిని అన్నం పెట్టే వాడికి, మృదువుగా మాట్లాడే వాడికి, ఏకధాటిగా ఉపవాసాలు పాటించే వాడికి, ప్రజలు నిద్రపోయే సమయంలో నమాజ్ చదివే వాడికి ప్రసాదిస్తాడు”. (అహ్మద్: 5/343, ఇబ్నె హిబ్బాన్: 641, తిర్మిజీ: 2527, సహీహ్ అల్ జామి 2119)
ఈ ఆయతులు మరియు హదీసులను దృష్టిలో వుంచుకొని ఆఖరి పది రోజుల్లో ప్రత్యేకంగా ఖియాం చెయ్యాలి. అంతేగాక, రాత్రి చివరి ఘడియలలో ప్రత్యేకించి ప్రార్థిస్తూ వుండాలి. ఎందుకంటే ప్రార్థనలు స్వీకరించబడే సమయం అది.
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు. “ఎంతో శుభవంతుడు, ఉన్నతుడూ అయిన మన ప్రభువు ప్రతి రాత్రి మూడింట ఒక వంతు మిగిలి వున్నప్పుడు భూలోకపు ఆకాశం వైపునకు అవతరిస్తాడు. తదుపరి ఇలా ప్రకటిస్తాడు- నన్ను ప్రార్థించేవారు ఎవరున్నారు? నేను వారి ప్రార్ధనలను స్వీకరిస్తాను. నన్ను ఏదైనా (కావాలని) అడిగేవారు ఎవరున్నారు? నేను వారికది ప్రసాదిస్తాను. నా మన్నింపు కోరుకునేవారు ఎవరున్నారు? నేను వారిని మన్నిస్తాను“. (బుఖారీ: 1145, 6321, 7494, ముస్లిం: 758)
ముస్లిం లోని మరొక ఉల్లేఖనంలో అదనంగా ఇలా వుంది. ఇలా (ఈ ప్రకటన) ఫజర్ వేళ వరకు కొనసాగుతూనే వుంటుంది.
లైలతుల్ ఖద్ర్
ఇస్లామీయ సోదరులారా!
రమజాన్ మాసపు ఆఖరి 10 రోజుల ప్రాధాన్యతకు గల మరో ముఖ్య కారణమేమిటంటే, వీటిలోనే 1000 నెలల ఆరాధన కన్నా శ్రేష్ఠమైన ఆరాధన గల రాత్రి వస్తుంది. దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“నిశ్చయంగా మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) ఘనమైన రాత్రి (లైలతుల్ ఖద్ర్) యందు అవతరింపజేశాము. ఘనమైన రాత్రి గురించి నువ్వేమనుకున్నావు? ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే కూడా మేలైనది. రాత్రి యందు దైవదూతలు, ఆత్మ (జిబ్రయీల్) తమ ప్రభువు ఉత్తర్వుపై సమస్త విషయాల (నిర్వహణ) నిమిత్తం (దివి నుంచి భువికి) దిగి వస్తారు. ఆ రాత్రి ఆసాంతం శాంతియుతమైనది- తెల్లవారే వరకూ (అది వుంటుంది).” (ఖద్ర్ సూరా)
ఈ ఆయతుల ద్వారా తెలిసిందేమిటంటే – లైలతుల్ ఖద్ర్ ఆరాధన వెయ్యి నెలలు, అంటే 83 సం॥ల 4 నెలల ఆరాధన కన్నా మేలైనది. ఒక్క రాత్రి ఆరాధనకు గాను 83 సం॥ల 4 నెలల ఆరాధన కన్నా ఎక్కువ పుణ్యఫలాన్ని ప్రసాదించడం అనేది నిస్సందేహంగా అల్లాహ్ ప్రసాదించిన మహానుగ్రహాలలో ఒకటి.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “ఏ వ్యక్తి అయినా విశ్వాసి అయివుండి, పుణ్యఫలాన్ని ఆశిస్తూ లైలతుల్ ఖద్ర్ లో ఖియాం చేస్తాడో అతని గత పాపాలు మన్నించబడతాయి”. (బుఖారీ: 2014, ముస్లిం: 760)
ఈ రాత్రి ఎప్పుడొస్తుంది? దీనికి సంబంధించి ఎన్నో హదీసులు ఉల్లేఖించబడ్డాయి. క్లుప్తంగా మేము కొన్నింటిని మీకు వివరిస్తాం.
అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్ల ల్లాహు అలైహి వ సల్లం) రమజాన్ మాసంలో మధ్యలోని పదిరోజులు (11 నుండి 20 వరకు) ఏతెకాఫ్ లో కూర్చునేవారు. ఇలా 21వ తేదీ రాగానే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఆయనతో పాటు ఏతెకాఫ్ లో కూర్చున్న వారు తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయేవారు. ఒకసారి ఇలాగే 21వ రాత్రి వచ్చింది. కానీ ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏతెకాఫ్ లోనే కూర్చుని, ప్రజలను సంబోధిస్తూ అల్లాహ్ తలచిన ఉపదేశాన్ని, ఆజ్ఞలనువివరించారు. తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు. నేను ఈ మధ్యలోని 10 రోజులు ఏతెకాఫ్ లో గడిపాను. కానీ ఆఖరి 10 రోజులు ఏతెకాఫ్ లో గడపడం సరైనదని నా కనిపించింది. అందుకే నాతో పాటు ఏతెకాఫ్ లో కూర్చున్నవారు అలాగే ఏతెకాఫ్ ను పాటించండి. నాకు ఈ రాత్రి (లైలతుల్ ఖద్ర్) కలలో చూపించడం జరిగింది. ఆ తర్వాత మరిపింప జేయడం జరిగింది. అందుకే మీరిక దానిని ఆఖరి పది రోజులలో అన్వేషించండి. వీటి బేసి సంఖ్యల రాత్రులలో దీనిని పొందటానికి ప్రయత్నించండి. నేనింకా (కలలో) – తడిగా వున్న నేలపై నేను సజ్దా చేయడం చూశాను. ఆ రోజు రాత్రి (21వ రాత్రి) ధారాపాతంగా వర్షం కురిసింది. చివరికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నమాజ్ చేసే స్థలం వద్ద కూడా పైకప్పు నుండి చినుకులు రాలిపడ్డాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉదయం నమాజు ముగించాక ఆయన నుదుటిపై మట్టి వుండడం నేను కళ్ళారా చూశాను.(బుఖారీ: 2016, ముస్లిం: 1161)
ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఈ రాత్రిని గూర్చి వివరించడం జరిగింది, కానీ తదుపరి దానిని మరిపింపజేయడం జరిగింది. దీనికి గల కారణం మరో హదీసులో వివరించబడింది.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ రాత్రి గురించి సహాబాలకు వివరించడానికి వస్తున్నప్పుడు, ఇద్దరు ముస్లిములు (ఏదో విషయంలో గొడవ పడుతున్నారు- ఈ తరుణంలోనే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు దీనికి సంబంధించిన జ్ఞానాన్ని మరిపింపజేయడం జరిగింది. (బుఖారీ: 2023)
బహుశా ఈ రాత్రిని మరిపింపజేయడం వెనుక మరొక మర్మం కూడా దాగి వుండవచ్చు. అదేమిటంటే, అల్లాహ్ దాసులు ఆయన సాన్నిధ్యాన్ని మరియు ఈ రాత్రిని పొందడానికి వీలైనంత ఎక్కువగా ఆరాధించాలి అని – వాస్తవం అల్లాహ్ కే తెలుసు.
అలాగే, ఈ హదీసు ద్వారా తెలిసిన మరో విషయమేమిటంటే, లైలతుల్ ఖద్ర్ రమజాన్ మాసపు ఆఖరి పది రోజుల్లోని బేసి రాత్రులలో ఒక రాత్రి వస్తుంది. అలాగే, తెలిసిన ఇంకొక విషయమేమిటంటే, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)- ఇది ఆఖరి పది రోజుల్లోని బేసి సంఖ్యల రాత్రులలో వస్తుందని ప్రకటించిన సం॥లో ఇది 21వ రాత్రి వచ్చింది. అలాగే ఈ హదీసు ద్వారా లైలతుల్ ఖద్ర్క సంబంధించిన ఒక సూచన కూడా తెలిసింది. అదేమిటంటే, వర్షం కురవడం.
ఈ సూచన మరో హదీసు ద్వారా కూడా వివరించబడింది. అబ్దుల్లా బిన్ అనీస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “నాకు లైలతుల్ ఖద్ర్ ను చూపించడం జరిగింది, తదుపరి మరిపింపజేయడం జరిగింది. దాని ఉదయం నేను తడి నేలలో సజ్దా చేయడం కలలో చూశాను”. (ముస్లిం: 1168)
ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహాబాలలో కొందరు లైలతుల్ ఖద్ర్ రమజాన్ మాసపు ఆఖరి 7 రోజుల్లో వుండడం కలలో చూశారు. దీనిపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “మీ కలలన్నీ ఒకేలా వున్నాయని నేను భావిస్తున్నాను. అదేమిటంటే, ఈ రాత్రి ఆఖరి ఏడు రాత్రుల్లో ఒకటి. అందుకే మీలో ఎవరు ఈ రాత్రిని పొందగోరుతాడో అతను దీనిని ఆఖరి ఏడు రాత్రుల్లో పొందటానికి ప్రయత్నించాలి”. (బుఖారీ: 2015, ముస్లిం: 1165)
ఈ రెండు హదీసులూ మరియు వీటితోపాటు ఇతర ఎన్నో హదీసుల ద్వారా నిరూపించబడేదేమిటంటే, లైలతుల్ ఖద్ర్ రమజాన్ మాసపు ఆఖరి పది రోజుల్లోని బేసి సంఖ్యల రాత్రుల్లో వస్తుంది. మరి కొన్ని ఉల్లేఖనాల ద్వారా తెలిసిందేమిటంటే – ఈ బేసి రాత్రులలో, 27వ రాత్రి వచ్చే అవకాశం ఎక్కువగా వుంటుంది.
జర్ బిన్ హబీష్ కథనం: నేను ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు)తో సంవత్సరమంతా ఖియాం చేసేవారే లైలతుల్ ఖద్ర్ ను పొందగలుగుతారని ఇబ్నె మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) అన్నారని చెప్పాను. దీనిపై ఆయన, అల్లాహ్ ఆయనను కరుణించుగాక! బహుశా ఆయన ఉద్దేశ్యం, కేవలం ఒకే రాత్రిని నమ్ముకొని వుండకపోవడం కావచ్చు. అంతేకానీ, ఈ రాత్రి రమజాన్ మాసంలో వస్తుందని ఆయనకు బాగా తెలుసు. అది కూడా ఆఖరి పది రోజుల్లో, 27వ రాత్రి. తదుపరి ఆయన ఒట్టు పెట్టుకొని మరీ ఇది 27వ రాత్రి వస్తుందని చెప్పారు.
జర్ బిన్ హబీష్ కథనం: నేను ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) తో, మీరు ఇలా ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు అని అడిగాను. ఆయన జవాబిస్తూ- దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు వివరించిన దాని సూచన ఆధారంగానే నేనిది చెపుతున్నాను. ఆ సూచన ఏమిటంటే, ఆ రాత్రి గడిచాక మరుసటి రోజు ఉదయం సూర్యుడు, కిరణాల తీవ్రత లేకుండానే ఉదయిస్తాడు”. (ముస్లిం)
ముఆవియా బిన్ అబూ సుఫ్యాన్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) లైలతుల్ ఖద్ర్ గురించి వివరిస్తూ ఇలా సెలవిచ్చారు: “లైలతుల్ ఖద్ర్ 27వ రాత్రి వుంటుంది”. (అబూ దావూద్: 1386, సహీహ్-అల్బానీ)
ఏది ఏమైనా, ఈ హదీసులన్నింటినీ పరికించడం ద్వారా తెలిసేదేమి టంటే, లైలతుల్ ఖద్ర్ ను పొందడానికి, ఆఖరి పది రోజుల్లోని బేసి రాత్రులన్నింటి లోనూ ప్రయత్నం చేయాలి. ప్రత్యేకించి 27వ రాత్రి. ఈ రాత్రులలో వీలైనంత ఎక్కువగా ఈ దుఆ చేయాలి: “ఓ అల్లాహ్! నిశ్చయంగా నీవు ఎంతగానో క్షమించేవాడివి, క్షమించడాన్ని ఇష్టపడేవాడివి. కనుక నన్ను కూడా క్షమించు”, ఎందుకంటే, అయిషా (రదియల్లాహు అన్హా) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో ఈ రాత్రి లైలతుల్ ఖద్ర్ రాత్రి అని నాకు గనక తెలిస్తే నేనేమని ప్రార్థించాలి అని అడిగినప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెకు ఈ దుఆ నే పఠించమని చెప్పారు. (తిర్మిజి: 3513, ఇబ్నెమాజ: 385, సహీహ్ – అల్బానీ)
అల్లాహ్ ను వేడుకొనే దేమిటంటే, ఆయన మనందరికీ ఆఖరి పది రోజుల్లో వీలైనంత ఎక్కువగా ఆరాధించే మరియు లైలతుల్ ఖద్ర్న పొందే సద్బుద్ధిని ప్రసాదించుగాక!
రెండవ ఖుత్బా
ఇస్లామీయ సోదరులారా!
ఈ శుభప్రద మాసపు ఆదేశాలలోని ఒక ఆదేశం ఏమిటంటే, ఈ నెల ముగియడానికి ముందు ఫిత్రా దానం చేయాలి. దీనిని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఫర్జ్ (విధి)గా ఖరారు చేశారు.
ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఫిత్రా దానాన్ని ఫర్జ్ చేసారు. ఖర్జూరం లేదా యవలు(జౌ) ఒక ‘సా’ అంత. బానిస మీద, స్వతంత్రుని మీద, పురుషుని మీద, స్త్రీ మీద, ముస్లిములలోని ప్రతి చిన్నా పెద్ద- అందరిపై దీనిని ఫర్జ్ ఖరారు చేశారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) దీనిని, పండుగ నమాజు కోసం ప్రజలు బయలు దేరడానికి ముందుగా చెల్లించాలని ఆజ్ఞాపించారు.(బుఖారీ: 1503, ముస్లిం: 984)
ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఫర్జ్ చేసిన ఫిత్రా దానం, తినే వస్తువులలో నుండి ఒక ‘సా’ అంత బరువు. ఒక ‘సా’ దాదాపు రెండున్నర కిలో గ్రాములు బరువు వుంటుంది. సహాబాలు కూడా తినే వస్తువులలో నుండే ఫిత్రా దానాన్ని చెల్లించే వారు. దీని గురించి అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఇలా సెలవిచ్చారు: “మేము ఫిత్రా దానం (ఇలా) చేసే వాళ్ళం – ఆహార ధాన్యాల ఒక సా లేదా యవలు(జౌ) ఒక ‘సా’ లేదా ఖర్జూరపు ‘సా’ లేదా పనీర్ ‘సా’ లేక కిస్మిస్ యొక్క ఒక ‘సా’ ” (బుఖారీ : 1506, ముస్లిం: 985)
మరో ఉల్లేఖనంలో, అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) పదాలు ఇలా వున్నాయి: “మేము దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కాలంలో ‘ఈదుల్ ఫిత్’ నాడు తినే వస్తువుల నుండి ఒక ‘సా’, ఫిత్రా దానం చెల్లించేవాళ్ళం. ఆ సమయంలో మా భోజనం యవలు(జౌ), కిస్మిస్, పనీర్ మరియు ఖర్జూరంతో కూడుకుని వుండేది”, (బుఖారీ: 1510)
అందుకే, ఫిత్రా దానం కేవలం తినే వస్తువులలో నుంచే చెల్లించాలి. ఉదా॥కు గోధుమలు మరియు బియ్యం వగైరా….
ఫిత్రా దానం వెనుక గల మర్మం ఏమిటంటే, దీని కారణంగా బీద వారికి సైతం తినడానికి ఎంతో కొంత దొరుకుతుంది. అంతేకాక, ఉపవాస వ్యవధిలో తెలిసీ తెలియకుండా ఏవైనా అనవసర, చెడు విషయాల జోలికి పోయివున్నట్లయితే ఈ దానం దానికి పరిహారం (కఫ్ఫారా)గా మారుతుంది.
ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా సెలవిచ్చారు: “దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఫిత్రా దానాన్ని ఫర్జ్ గా ఖరారు చేశారు. దీని ద్వారా ఉపవాసం పాటించిన వ్యక్తి – తాను ఈ వ్యవధిలో తెలిసీ తెలియకుండా చేసిన చెడు కార్యాల పాపఫలం నుంచి పరిశుద్ధుడవుతాడు. దీనితో పాటు బీదవారికి భోజనం కూడా దొరుకుతుంది.”(అబూ దావూద్: 1609, హసన్ – అల్బానీ)
గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటటే, ఫిత్రా దానం పండుగ నమాజుకు ముందుగా చెల్లించాలి. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విషయం గురించి ఆజ్ఞాపించి వున్నారు. దీనికి సంబంధించిన ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనాన్ని మేము ఇంతకు ముందే వివరించాం. దీనితో పాటు, ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా సెలవిచ్చారు: “ఏ వ్యక్తి అయినా పండుగ నమాజుకు ముందుగా గనక చెల్లిస్తే అది స్వీకార యోగ్యమైన జకాత్ (ఫిత్రా దానం) అవుతుంది. అలా కాక, పండుగ నమాజు తర్వాత గనక దానిని చెల్లిస్తే, అది సాధారణ దానధర్మాలలో ఒకటవుతుంది.” (అబూ దావూద్: 1609, హసన్ – అల్బానీ)
పండుగ మర్యాదలు
ఈ శుభప్రద మాసం ముగింపు సందర్భంగా ఫిత్రాదానం చెల్లించడంతో పాటు వేరే ఇతర మర్యాదలను కూడా ముస్లిములు దృష్టిలో వుంచుకోవాలి.
1) వీటిలో మొదటిది- షవ్వాల్ నెలవంక కనబడగానే, ఆ రాత్రి మరియు పండుగ రోజు ఉదయం మాటిమాటికీ తక్బీర్లను పఠిస్తూ వుండాలి:
ఈ తక్బీర్ల ద్వారా వాస్తవానికి అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపబడతాయి. ఎందుకంటే, ఆయన ప్రసాదించిన సద్బుద్ధి కారణంగానే ఈ మాసమంతా ఉపవాసాలుండి, ఖుర్ఆన్ పారాయణం చేయగలిగాం. దుఆలు చేయగలిగాం. మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందగలిగాం మరియు ఇతర ఆరాధనలు చేయగలిగాం.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
يُرِيدُ اللهُ بِكُمُ الْيُسْرَ وَلَا يُرِيدُ بِكُمُ الْعُسْرَ وَالتَّكْمِلُوا الْعِدَّةَ وَلِتُكَبِرُوا اللهَ عَلَى مَا هَدْبَكُمْ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ
“అల్లాహ్ మీకు సౌలభ్యాన్ని సమకూర్చ దలుస్తున్నాడేగానీ మిమ్మల్ని కష్టపెట్టదలచడం లేదు. మీరు (ఉపవాసాల) నిర్ణీత సంఖ్యను పూర్తి చేసుకోవాలన్నదీ, తాను అనుగ్రహించిన సన్మార్గ భాగ్యానికి ప్రతిగా ఆయన గొప్పతనాన్ని కీర్తించి, తగు రీతిలో మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నిది అల్లాహ్ అభిలాష”.(బఖర: 185)
2) పండుగ నమాజుకు బయలుదేరడానికి ముందు స్నానం చేయాలి.
(పరిశుభ్రమైన) ఉత్తమమైన దుస్తులు ధరించి, సువాసన పూసుకొని ఇంటి నుండి బయలుదేరాలి. ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) (పండుగ నమాజు నిమిత్తం) ఈద్ గాహ్ కు వెళ్లడానికి ముందు స్నానం చేసేవారు.(ముఅత్తా)
3) ఇంటినుండి బయలుదేరే ముందు బేసి సంఖ్యలో ఖర్జూర పండ్లను తినడం సున్నత్.
అనస్ (రదియల్లాహు అన్హు) ఇలా సెలవిచ్చారు: “దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈదుల్ ఫితర్ పండుగ రోజు బేసి సంఖ్యలో కొన్ని ఖర్జూర పండ్లను తిన్న తర్వాతే (నమాజ్ కోసం) బయటికొచ్చేవారు”. (బుఖారీ: 953)
4) ఈద్ గాహ్ కు నడిచి వెళ్ళడం, తిరిగి నడిచి రావడం సున్నత్.
ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) మరియు సాద్ (రదియల్లాహు అన్హు) కథనం: “దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పండుగ (నమాజ్) కోసం నడిచి వెళ్ళేవారు, మళ్ళీ నడుచుకుంటూనే తిరిగొచ్చేవారు”. (ఇబ్నెమాజ : 1294,1295, హసన్ – అల్బానీ)
5) పండుగ నమాజ్ కోసం ఇంటి వారిని కూడా తీసుకెళ్ళాలి.
ఎందుకంటే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్త్రీలను కూడా ఈద్ గాహ్ కు వెళ్ళమని ఆజ్ఞాపించి ఉన్నారు. ఈ విషయం సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలో ఉమ్మె అతియా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖించిన హదీసులో వుంది. చివరికి, రుతుస్రావంలో వున్న స్త్రీలకు కూడా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)- ఇంటి నుండి బయలుదేరి, ఈద్ గాహ్ కు వెళ్ళి ప్రక్కన కూర్చోమని, ముస్లిముల దుఆ లలో పాలుపంచుకోమని ఆజ్ఞాపించారు.(బుఖారీ: 974, ముస్లిం: 890)
6) పండుగ నమాజు ఈద్ గాహ్ లో చదవడం సున్నత్.
అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈదుల్ ఫిత్ర్ మరియు ఈదుల్ అజ్ హా నాడు ఈద్ గాహ్ కు వెళ్ళేవారు. అన్నింటి కన్నా ముందుగా ఆయన పండుగ నమాజ్ చేయించేవారు. తదుపరి, తమ తమ స్థానాల్లో అలాగే కూర్చొని వున్న ప్రజల ముందుకు వచ్చేవారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి హితబోధ చేసేవారు, వసీయతు చేసేవారు, ఆదేశించేవారు, ఒకవేళ ఏదైనా బృందాన్ని సాగనంపాల్సి వుంటే దానిపై నిర్ణయం తీసుకునేవారు. ఒకవేళ మరేదైనా ఆదేశాన్ని జారీ చేయాల్సి వస్తే దానిని జారీ చేసి తిరిగి వచ్చేవారు. (బుఖారీ: 956, ముస్లిం: 889)
7)ఈద్గాహ్ కు వెళ్ళేటప్పుడు ఈ తక్బీర్లను మాటిమాటికీ పఠిస్తూ వుండాలి.
“అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లాఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్”.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈదుల్ ఫిత్ర్ రోజు ఈద్గాహ్ కు వెళ్ళేటప్పుడు తక్బీర్లను పఠిస్తూ వెళ్ళేవారు. పండుగ నమాజు ముగించాక తక్బీర్లను పఠించేవారు కాదు. ఇలాగే ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇంటి నుండి బయలుదేరి ఈద్గాహ్ కు వెళుతున్నప్పుడు తక్బీర్లను పఠిస్తూ వెళ్ళేవారు. (అస్సహీహ : 171)
ఈద్ గాహ్ కు చేరుకున్నాక, నమాజు కోసం ఇమామ్ పంక్తులను తిన్నగా చేసుకోమని ఆజ్ఞాపించనంత వరకు, తక్బీర్లను మాటిమాటికీ పఠిస్తూనే వుండాలి.
8) పండుగ నమాజ్క ముందుగానీ, తర్వాత గానీ ఏ నఫిల్ నమాజు కూడా లేదు.
ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం: “నిశ్చయంగా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈదుల్ ఫిత్ర్ నాడు బయలుదేరి రెండు రకాతులు చేయించారు. దీనికి ముందు గానీ, తర్వాత గానీ ఎలాంటి నమాజ్ చేయలేదు”. (బుఖారీ:989, ముస్లిం: 884)
9) పండుగ నమాజు కోసం అజాన్ మరియు ఇఖామత్లు లేవు.
జాబిర్ బిన్ సమ్రా (రదియల్లాహు అన్హు) కథనం: నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో కలసి ఎన్నోసార్లు పండుగల నమాజును అజాన్ మరియు ఇఖామత్లు లేకుండా చదివాను. (ముస్లిం: 887)
ఆఖరుగా అల్లాహ్ ను వేడుకొనేదేమిటంటే, ఆయన మనందరినీ ఈ శుభప్రద మాసపు ఉపవాసాలను పూర్తిచేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక! మరియు వాటిని స్వీకరించుగాక! ఆమీన్!!
–
ఈ ఖుత్బా క్రింద పుస్తకం నుండి తీసుకోబడింది.
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్