నిజమైన ప్రభువు ఎవరు ? ఆయనను ఎలా గుర్తించాలి ?

నిజమైన ప్రభువు ఎవరు ? ఆయనను ఎలా గుర్తించాలి ?
https://youtu.be/QT4n1LDIPiw [26 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు, సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుభానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి.

ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా, అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.

అభిమాన సోదరులారా! ఈనాటి ప్రసంగంలో మనం ప్రభువు గురించి పరిచయం చేసుకుందాం. ప్రభువు అనే పదం వినగానే చాలా మంది ప్రభువు అంటే ఏసు అని అనుకుంటారు. దీనికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, మన క్రైస్తవ సోదరులు ఎక్కువగా ప్రభువు, ప్రభువు, ప్రభువు అని ప్రచారం చేస్తూ ఉంటారు కాబట్టి, ప్రభువు అంటే ఏసు, ఏసు అంటే ప్రభువు అన్నట్టుగా బాగా ప్రచారం అయిపోయి ఉంది కాబట్టి, ప్రభువు అనగానే వెంటనే మనిషి ఆలోచనలో ఏసు అనే ఒక పేరు వచ్చేస్తాది.

నిజం ఏమిటంటే అభిమాన సోదరులారా, ప్రభువు అనే పదానికి నిఘంటువు ప్రకారంగా చాలా అర్థాలు వస్తాయి. ప్రభువు అంటే సృష్టికర్త, ప్రభువు అంటే యజమాని, ప్రభువు అంటే చక్రవర్తి. ఇలా చాలా అర్థాలు వస్తాయి. సందర్భానుసారంగా ప్రభువు అనే పదానికి అర్థము కూడా మారుతూ ఉంటుంది. రాజదర్బార్లో ఉన్న సిపాయిలు రాజుని మహాప్రభు, మహాప్రభు అంటూ ఉంటారు. అక్కడ అర్థము దేవుడు అని కాదు, చక్రవర్తి, రాజు అని.

ఆ ప్రకారంగా అభిమాన సోదరులారా, ప్రభువు అంటే చాలా అర్థాలు ఉన్నాయి, సందర్భానుసారంగా దాని అర్థం మారుతూ ఉంటుంది. అయితే, ఈ రోజు నేను ప్రభువు అనే అర్థం వచ్చే అర్థాలలో ఒక అర్థము సృష్టికర్త. సృష్టికర్త అయిన ప్రభువు గురించి ఇన్షా అల్లాహ్ కొన్ని విషయాలు మీ ముందర ఉంచదలచాను. ఇన్షా అల్లాహ్, మనము ధార్మిక గ్రంథాల వెలుగులో మన సృష్టికర్త, మన ప్రభువు ఎవరు? ఆయనను మనము ఎలా గుర్తించాలి? అనే విషయాన్ని తెలుసుకుందాం.

అభిమాన సోదరులారా, ఈ ప్రపంచంలో అధిక శాతం ప్రజలు సృష్టికర్త ఉన్నాడు అని, ప్రభువు ఉన్నాడు అని నమ్ముతారు, విశ్వసిస్తారు. అయితే కొంతమంది హేతువాదులుగా మారి, నాస్తికులుగా మారి, దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని వ్యతిరేకిస్తారు. అయితే అభిమాన సోదరులారా, నిజం ఏమిటంటే సృష్టికర్త లేనిదే సృష్టి ఉనికిలోకి రాదు. నేడు ప్రపంచంలో మనం చూస్తున్నాం, ఈ సృష్టిలో గొప్ప గొప్ప విషయాలు మన కళ్లారా మనం చూస్తున్నాం. ఎలాంటి స్తంభము లేని ఆకాశాన్ని చూస్తున్నాం, ప్రపంచం మొత్తాన్ని వెలుగునిచ్చే సూర్యుడిని చూస్తున్నాం, చల్లని జాబిల్లిని పంచే చంద్రుడిని చూస్తున్నాం. మనిషి జీవితానికి క్షణం క్షణం ఉపయోగపడే గాలి ఉంది. మనిషి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నీళ్లు ఉన్నాయి, భూమి ఉన్నది, ఎత్తైన పర్వతాలు ఉన్నాయి, గాలిలో ఎగిరే పక్షులు ఉన్నాయి, భూమి మీద నడిచే అనేక జీవులు ఉన్నాయి, నీటిలో ఈదే జలచరాలు ఉన్నాయి, క్రిమి కీటకాలు ఉన్నాయి, సూక్ష్మ జీవులు ఉన్నాయి. ఇవన్నీ సృష్టిలో ఎలా వచ్చాయి? ఏదైనా దేశంలో ఒక ఫ్యాక్టరీలో ఇవన్నీ తయారు అవుతున్నాయా? ఏదైనా దేశస్థుడు వీటన్నింటినీ తయారు చేసి మార్కెట్లోకి వదిలేటట్టుగా ఈ భూమి మీద వదులుతున్నాడా? లేదు. ఇవన్నీ మానవుని ద్వారా సృష్టించబడినవి కావు. మానవుని కంటే ఈ సృష్టిలో ఉన్న ఆకాశాలు, భూమి, సూర్య చంద్రుల కంటే గొప్ప శక్తిమంతుడు ఒకడు ఉన్నాడు, ఆయనే సృష్టికర్త, ప్రభువు అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు అభిమాన సోదరులారా.

అందుకోసమే సృష్టికర్త ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, “సృష్టికర్తను గుర్తించడానికి మీరు సృష్టిలోని విషయాలను చూడండి, సృష్టిలోని విషయాలను చూసి మీరు సృష్టికర్తను గుర్తుపట్టండి. అంతెందుకు, మీ శరీరాన్నే ఒకసారి చూడండి, మీ శరీరంలో అనేక నిదర్శనాలు సృష్టికర్త ఉన్నాడు అని చెప్పటానికి ఉన్నాయి” అంటున్నాడు.

మనం కళ్ళతో చూస్తున్నాం, చెవులతో వింటున్నాం, నోటితో మాట్లాడుతున్నాం. మన శరీరంలో గుండె ఒకటి ఉంది, ప్రతి క్షణము రక్తాన్ని మన శరీరంలో సరఫరా చేస్తూ ఉంది. మనము వాయువును పీలుస్తూ ఉన్నాము. గుండె ఒక్క నిమిషం కోసం ఆగిపోతే మనిషి చనిపోతాడు. ఐదు నిమిషముల కోసము ఈ ప్రపంచంలో నుంచి గాలి తీసుకుంటే, ఈ ప్రపంచంలో ఉన్న జీవులన్నీ చనిపోతాయి.

అభిమాన సోదరులారా, ఇవన్నీ దేవుడు ఉన్నాడు, ఇవన్నీ దేవుని ద్వారా ఉనికిలోకి వచ్చాయి, మనకు ఇవన్నీ శక్తులు, మన కోసం ఇవన్నీ ఏర్పాటులు ఆ సృష్టికర్త చేశాడు అని చెప్పడానికి ఇవన్నీ సాక్షాలు అభిమాన సోదరులారా. సరే, సృష్టికర్త ఉన్నాడు, సృష్టికర్త ద్వారానే ఇదంతా ఉనికిలోకి వచ్చింది, మనము కూడా ఉనికిలోకి వచ్చాము అని మనము అర్థం చేసుకున్నాం.

ఇక రండి అభిమాన సోదరులారా, సృష్టికర్త ఈ ప్రపంచానికి ఒకడు ఉన్నాడా లేదా చాలా మంది ఉన్నారా అనేది ముందు మనం తెలుసుకుంటే ఆ తర్వాత మిగతా విషయాలు తెలుసుకోవచ్చు. సృష్టికర్త గురించి ధార్మిక గ్రంథాలలో వెతికితే విషయాలు తెలుస్తాయి. గణిత శాస్త్రంలో వెళ్లి సృష్టికర్త గురించి పరిశీలిస్తే ఏమైనా దొరుకుతాదండి అక్కడ? గణిత శాస్త్రంలో లెక్కలు ఉంటాయి అక్కడ. కాబట్టి సృష్టికర్త గురించి తెలుసుకోవాలంటే గ్రంథాలు, ధార్మిక గ్రంథాలు, ఆకాశ గ్రంథాలు వాటిని మనం పరిశీలించాలి. ఆ గ్రంథాలలో సృష్టికర్త గురించి స్పష్టమైన విషయాలు తెలుపబడి ఉన్నాయి.

ఏమని తెలుపబడి ఉన్నాయి అంటే, ముందుగా మనము ఖురాన్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే, ఖురాన్ గ్రంథము, ఇది కూడా దైవ గ్రంథము, అంతిమ దైవ గ్రంథము, ఎలాంటి మార్పు చేర్పులకు గురి కాని గ్రంథము. ఈ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హానహు వతఆలా, సృష్టికర్త తెలియజేస్తున్నాడు:

أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم
(అఊజు బిల్లాహి మినష్-షైతా నిర్రజీమ్, బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)
శపించబడిన షైతాన్ నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను, కరుణామయుడు మరియు కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో (ప్రారంభిస్తున్నాను).

اِنَّمَاۤ اِلٰهُكُمُ اللّٰهُ
(ఇన్నమా ఇలాహుకుముల్లాహు)
నిశ్చయంగా మీ ఆరాధ్యుడు అల్లాహ్ ఒక్కడే.

మనము చూసినట్లయితే ఖురాన్ లోని సూరా బఖరా, రెండవ అధ్యాయం, 163 వ వాక్యంలో ఈ విధంగా తెలుపబడింది:

وَاِلٰهُكُمْ اِلٰهٌ وَّاحِدٌ
(వ ఇలాహుకుమ్ ఇలాహున్ వాహిద్)
మీ ప్రభువు ఒక్కడే.

ఇక మనం వేరే గ్రంథాలను కూడా పరిశీలించినట్లయితే, ఋగ్వేదంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక విషయం తెలుపబడింది: “ఒక్కడు, సాటి సమానము లేని ఆయన నే స్తుతించండి. ఎవరైతే ఈ లోకాలను తన ప్రభావంతో రక్షించి పాలిస్తాడో, ఆ దేవుడు ఒక్కడే.”

అలాగే, మన క్రైస్తవ సోదరులు విశ్వసించే గ్రంథాన్ని మనం చూచినట్లయితే, బైబిల్ గ్రంథము మత్తయి సువార్తలో ఈ విధంగా తెలుపబడి ఉంది: “ఒక్కడే మీ తండ్రి. ఒక్కడే మీ దేవుడు, ఆయన పరలోకమందు ఉన్నాడు.”

అభిమాన సోదరులారా, ఖురాన్ గ్రంథము నుండి, బైబిల్ గ్రంథము నుండి, వేదాల నుండి మనము తెలుసుకున్న విషయం ఏమిటంటే, ఒక్కడే మన సృష్టికర్త, ఒక్కడే మన ప్రభువు, ఒక్కడే మన దేవుడు అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాం. అయితే అభిమాన సోదరులారా, సృష్టికర్త ఉన్నాడు అని తెలుసుకున్న తర్వాత, సృష్టికర్త ఒక్కడే అని తెలుసుకున్న తర్వాత, ఆ సృష్టికర్త ఎవరు? అనేది తెలుసుకోవాలి, ఇది ముఖ్యమైన విషయం.

మనం సాధారణంగా ప్రపంచం నలుమూలలా ఎక్కడ వెళ్లి ఎవరిని ప్రశ్నించినా, ఏమండీ దేవుడు ఉన్నాడు అని మీరు నమ్ముతున్నారా అంటే “అవును” అంటాడు. దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు అని మీరు నమ్ముతున్నారు అండి అంటే “ఒక్కడే” అంటాడు. అతను చదువుకున్న వ్యక్తి అయినా సరే, చదువు రాని వ్యక్తి అయినా సరే. “దేవుడు అందరికీ ఒక్కడే అండి, అందరికీ ప్రభువు ఒక్కడే అండి” అని ప్రతి ఒక్కరూ చెబుతారు. అయితే, ఒక్కడే దేవుడు అయినప్పుడు, న్యాయంగా చెప్పాలంటే ప్రపంచం మొత్తం కలిసి ఒకే దేవుడిని పూజించుకోవాలి కదా? సృష్టికర్త ఒక్కడే అని చెప్పేటప్పుడు, న్యాయంగా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒకే సృష్టికర్తని పూజించాలి కదా? మరి ప్రపంచంలో అలా జరుగుతూ ఉందా? దేవుడు ఒక్కడే అని అందరూ చెబుతారు, కానీ ఒకే దేవుడిని పూజించకుండా అనేక దేవుళ్ళను పూజిస్తున్నారు. సృష్టికర్త ఒక్కడే అని అందరూ చెబుతారు, కానీ ఒకే సృష్టికర్తని పూజించకుండా అనేక సృష్టికర్తలు ఉన్నారు అని పూజిస్తున్నారు. ఇది అన్యాయం కదా? ఏకంగా సృష్టికర్త, దేవుని విషయంలో మానవులు అన్యాయం చేస్తున్నారా లేదా అభిమాన సోదరులారా? మనము ఏకంగా దేవుని విషయంలోనే అన్యాయానికి పాల్పడుతున్నాం. సృష్టికర్త ఒక్కడని నమ్ముతూ అనేక దేవుళ్ళను పూజించేస్తున్నాము కాబట్టి మనము దైవానికి ద్రోహం చేస్తున్నాము. అలా చేయడం తగదు అభిమాన సోదరులారా.

కాబట్టి, నిజమైన సృష్టికర్త ఎవరు? ఇంతమంది దేవుళ్ళలో, ప్రపంచంలో నేడు ఎవరెవరైతే పూజించబడుతున్నారో వాళ్ళందరూ నిజమైన ప్రభువులు కాజాలరు. ఎందుకంటే సృష్టికర్త ఒక్కడే కాబట్టి. ఇక రండి, ఇంతమంది ప్రపంచంలో పూజించబడుతున్న దేవుళ్ళందరిలో నిజమైన ప్రభువు, నిజమైన సృష్టికర్త ఎవరు అనేది మనం తెలుసుకుందాం.

సాధారణంగా ఏదైనా ఒక వస్తువు, అది మంచిదా లేదా చెడ్డదా, నిజమైనదా లేదా కల్పితమైనదా, ఒరిజినలా లేదా డూప్లికేటా అని తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన కొన్ని గుర్తులు చెబుతూ ఉంటారు. ఫలానా ఫలానా లక్షణాలు అందులో ఉంటేనే అది వాస్తవమైనది, అది ఒరిజనల్. ఆ లక్షణం అందులో కనిపించకపోతే అది డూప్లికేట్ అని తేల్చేస్తూ ఉంటారు. అంతెందుకండీ, మనము డబ్బును తీసుకొని వెళితే కూడా, ఆ డబ్బుని కూడా కొన్ని లక్షణాల ద్వారా, కొన్ని గుర్తుల ద్వారా ఆ నోటు ఒరిజినలా, డూప్లికేటా అని పరిశీలిస్తూ ఉంటారు. అంటే లక్షణాల ద్వారా ఒరిజినల్, డూప్లికేట్ అనేది మనం తెలుసుకోవచ్చు. దేవుని విషయంలో కూడా మనము కొన్ని లక్షణాల ద్వారా, దేవుడు ఎవరు నిజమైన వాడు, ఎవరు కల్పిత దేవుడు అనేది మనము తెలుసుకోవచ్చు.

సాధారణంగా దేవుని లక్షణాలను ప్రస్తావిస్తూ, దేవుని గుణాలను ప్రస్తావిస్తూ ఏమంటూ ఉంటారంటే, “ఆకాశాలను సృష్టించినవాడు, భూమిని సృష్టించినవాడు, ఆకాశాల భూమి మధ్య ఉంటున్న జీవరాశులన్నింటినీ సృష్టించినవాడు, సంతానం ప్రసాదించేవాడు, వర్షాలు కురిపించేవాడు, మరణం ప్రసాదించేవాడు.” ఇతనే, ఈ లక్షణాలు కలిగినవాడు దేవుడు అని చెబుతూ ఉంటారు. ఇలా చెబితే చాలామంది ఏమంటారంటే, “ఎవరినైతే నేను దేవుడిని అని నమ్ముతున్నానో, అతనిలో కూడా ఈ శక్తులు ఉన్నాయి” అని అనేస్తారు.

కాబట్టి రండి అభిమాన సోదరులారా, ఓ రెండు గుర్తులు నేను చెబుతాను, రెండు లేదంటే మూడు గుర్తులు. రెండు లేదా మూడు లక్షణాలు, అవి ఎలాంటి లక్షణాలు అంటే, ఆ లక్షణాలు “నా దేవుడిలో కూడా ఉన్నాయి, ఎవరినైతే నేను దేవుడని నమ్ముతున్నానో అతనిలో కూడా ఉన్నాయి” అని వెంటనే మనిషి చెప్పలేడు. కాసేపు ఆగి పరిశీలించాల్సి వస్తాది. ఆ మూడు లక్షణాలు ఏమిటంటే:

మొదటి లక్షణం: ఈ ప్రపంచాన్ని పుట్టించిన, సృష్టించిన ఆ ఏకైక అద్వితీయ ప్రభువు ఎవరి కంటికీ కనిపించడు. కనిపిస్తాడా? ఎవరికైనా కనిపించాడా? మానవుల మాట పక్కన పెట్టండి, ధార్మిక గ్రంథాలు ఏమంటున్నాయో అది కూడా చూడండి. దేవుడు కనిపిస్తాడా, కనిపించడా అనే విషయాన్ని ధార్మిక గ్రంథాలు ఏమంటున్నాయంటే, ఖురాన్ లోని సూరా అన్ఆమ్, ఆరవ అధ్యాయం, 103 వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హనహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు:

لَّا تُدۡرِكُهُ الۡاَبۡصَارُ وَهُوَ يُدۡرِكُ الۡاَبۡصَارَ وَهُوَ اللَّطِيۡفُ الۡخَبِيۡرُ
(లా తుద్రికుహుల్ అబ్సార్, వ హువ యుద్రికుల్ అబ్సార్, వ హువల్ లతీఫుల్ ఖబీర్)
ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మ దృష్టి కలవాడు, సర్వమూ తెలిసినవాడు.

అంటే, మానవులు గానీ, ప్రపంచంలో ఉన్న ఏ జీవి గానీ తమ కళ్ళతో ఆ సృష్టికర్తను, ఆ దేవుడిని చూడలేదు అని స్పష్టంగా అల్లాహ్ సుబ్ హనహు వ తఆలా ఖురాన్ లో తెలియజేశాడు.

ఇదే విషయం మనం వేరే గ్రంథాలలో కూడా చూడవచ్చు. ముఖ్యంగా ఉపనిషత్తుల్లో ఏమని తెలియబడి ఉంది అంటే: “దేవుని రూపం ఇంద్రియాల పరిధిలో నిలువదు, కన్నులతో ఆయన్ను ఎవరూ చూడలేరు.” ఈ విషయం మన హిందూ సోదరులు ఎవరైతే ఉపనిషత్తుల్ని నమ్ముతున్నారో, విశ్వసిస్తున్నారో అందులో కూడా తెలుపబడి ఉంది.

అలాగే, మన క్రైస్తవ సోదరులు విశ్వసించే బైబిల్ గ్రంథంలో కూడా, దేవుడు కనిపిస్తాడా లేదా అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే, అక్కడ కొత్త నిబంధన యోహాను గ్రంథంలో ఈ విధంగా తెలుపబడింది: “మీరు ఏ కాలమందైననూ ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు.”

చూశారా? ఇటు ఖురాను, అటు ఉపనిషత్తులు, అటు బైబిలు, ఈ ముఖ్యమైన గ్రంథాలు ఏమని తెలియజేస్తున్నాయి అంటే మానవులు ఆ సృష్టికర్తను కళ్ళతో చూడలేరు. అంటే దేవుడు కనిపించడని స్పష్టం అయిపోయింది కదా? ఇది మొదటి లక్షణం.

ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో ఎవరెవరైతే దేవుళ్ళు అని పూజించబడుతున్నారో, వారు మానవులకు కనిపించిన వారా, కాదా? ప్రతి దేవుడికి ఒక చరిత్ర ఉంది. ఆయన ఫలానా దేశంలో, ఫలానా ప్రదేశంలో, ఫలానా అమ్మ నాన్నల ఇంట్లో అతను పుట్టాడు, అతని బాల్యాన్ని ఫలానా ఫలానా వ్యక్తులు చూశారు, అతని యవ్వనాన్ని ఫలానా ఫలానా వ్యక్తులు చూశారు, అతను ఫలానా మహిళతో వివాహం చేసుకున్నాడు, అతనికి ఇంతమంది సంతానం కలిగారు అని చరిత్ర చెబుతూ ఉంది, అతను కనిపించాడు అని. గ్రంథాలు చెబుతున్నాయి దేవుడు కనిపించడు అని. కనిపించేవాడు దేవుడు ఎలా అవుతాడండీ? కాబట్టి మనం ఎవరినైతే పూజిస్తున్నామో, అతను కనిపించిన వాడా, కనిపించని వాడా అనేది తెలుసుకోవాలి.

అలాగే, సృష్టికర్తకు ఉన్న మరొక ముఖ్యమైన రెండవ లక్షణం: సృష్టికర్త, సృష్టిని సృష్టిస్తాడు. సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి జన్మిస్తుంది, మళ్ళీ మరణించి ఆ సృష్టికర్త దగ్గరికి వెళ్ళిపోతుంది. మన తాత ముత్తాతలు అందరూ ఈ ప్రపంచంలోకి వచ్చి వెళ్ళిపోయారా లేదా? మనము కూడా ఇప్పుడు వచ్చాము, జీవిస్తున్నాము, ఏదో ఒక రోజు మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళా ఆ సృష్టికర్త దగ్గరికి వెళ్ళిపోతాం. అలాగే ప్రతి జీవి ఈ సృష్టిలోకి వస్తుంది, తన జీవితాన్ని ముగించుకుని మళ్ళీ ఆ సృష్టికర్త దగ్గరికి వెళ్ళిపోతుంది. అయితే, సృష్టికర్త మరణిస్తాడా? సృష్టికర్తకు మరణం ఉందా? ప్రభువుకి, దేవునికి మరణం ఉందా? చదువు వచ్చినవాడు గానీ, చదువు రాని వాడు గానీ, “దేవునికి మరణం లేదండి” అని చెప్తాడు. “దేవుడే చనిపోతే మరి ఈ ప్రపంచాన్ని ఎవరు పరిపాలిస్తాడండి?” అని చెప్తాడు. గ్రంథాలు ఏమంటున్నాయి అభిమాన సోదరులారా? ఈ గ్రంథాలు ఏమంటున్నాయి? సృష్టికర్తకు, ప్రభువుకి మరణం ఉందా? రండి చూద్దాం గ్రంథాలలో ఏమని ఉందో.

ఇంతకు ముందు చెప్పినట్టే, ఖురాన్ లోని సూరా రహ్మాన్, 55వ అధ్యాయం, 26, 27 వాక్యాలలో అల్లాహ్ సుబ్ హనహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు:

كُلُّ مَنْ عَلَيْهَا فَانٍ ۖ وَيَبْقَىٰ وَجْهُ رَبِّكَ ذُو الْجَلَالِ وَالْإِكْرَامِ
(కుల్లు మన్ అలైహా ఫాన్. వ యబ్ ఖా వజ్హు రబ్బిక జుల్ జలాలి వల్ ఇక్రామ్)
భూమండలంపై ఉన్న వారంతా నశించిపోవలసినవారే. ఎప్పటికీ మిగిలి ఉండేది ఘనత, గౌరవం గల నీ ప్రభువు అస్తిత్వం మాత్రమే.

అంటే, భూమండలం మీద ఉన్న ప్రతి ఒక్కటి నశించిపోతుంది గానీ, ఆ అల్లాహ్ సుబ్ హనహు వ తఆలా యొక్క అస్తిత్వం ఎన్నటికీ నశించిపోదు. ఆయన ఎన్నటికీ అలాగే ఉంటాడు. ఇది ఖురాన్ చెబుతున్న విషయం.

అలాగే మనము ఇతర గ్రంథాలలో కూడా ఒకసారి పరిశీలించి చూసినట్లయితే, ఇతర గ్రంథాలలో కూడా అదే విషయం తెలుపబడి ఉంది. ఏమని తెలుపబడి ఉంది? “జననము, మరణము అనే దోషములు లేనివాడే శుభప్రదుడైన దేవుడు.” ఈ విషయం యోగ శిఖోపనిషత్ లో తెలుపబడి ఉంది.

అలాగే బైబిల్ ని మనం చూసినట్లయితే, యిర్మీయా గ్రంథంలో ఈ విధంగా తెలుపబడి ఉంది: “యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే జీవము గల చావు లేని దేవుడు.”

చూడండి, ఇటు ఖురాను, అటు ఉపనిషత్తులు, అటు బైబిలు ఈ ప్రధానమైన గ్రంథాలు ఏమని చెబుతున్నాయి అంటే, దేవునికి, సృష్టికర్తకి మరణము లేదు.

ఇప్పుడు ఒక్కసారి మనం ఆగి పరిశీలించాలి. ఎవరిని మనం పూజిస్తున్నాం? చనిపోయిన వాడిని పూజిస్తున్నామా? చనిపోకుండా సజీవంగా ఉన్న దేవుడిని పూజిస్తున్నామా? ప్రపంచంలో ఒకసారి అభిమాన సోదరులారా, ఎవరెవరైతే దేవుళ్ళు అని ప్రచారంలో ఉన్నారో, ఎవరెవరైతే దేవుళ్ళు అని పూజించబడుతూ ఉన్నారో, వారి చరిత్రలు చూడండి. ఫలానా దేవుడు ఫలానా ప్రదేశంలో మరణించాడు, ఆయన సమాధి ఫలానా చోట ఉంది. ఫలానా దేవుడు ఫలానా చోట శిల్పం లాగా మారిపోయాడు. ఫలానా దేవుడు ఫలానా చోట ఆ విధంగా మారిపోయాడు, ఈ విధంగా మారిపోయాడు అంటున్నారు. అంటే చనిపోయిన వాడు దేవుడు కాదు అని గ్రంథాలు చెబుతూ ఉంటే, చనిపోయిన వారిని మనము దేవుళ్ళని పూజిస్తున్నాము. ఇది వివేకవంతమైన విషయమా అభిమాన సోదరులారా?

గ్రంథాల ద్వారా రెండు విషయాలు మనకు తెలుపబడ్డాయి. అదేమిటంటే, దేవుడు కనిపించడు, దేవుడు మరణించడు. ఈ విషయం తెలియక చాలామంది ప్రజలు ప్రతి సంవత్సరము మోసిపోతున్నారు, ప్రతి కాలంలో మోసిపోతున్నారు. ఎలాగండీ? ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది, సందర్భం వచ్చింది కాబట్టి ఎవరూ తప్పుగా అనుకోకండి.

చాలామంది బాబాలు ఉనికిలోకి వస్తున్నారు. ప్రజలు అంధులైపోయి వారిని దేవుళ్ళని పూజిస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత, టీవీ ఛానెళ్ళ వాళ్ళ కెమెరా దృష్టిలో వారి అగత్యాలన్నీ బయటపడుతున్నాయి, వారి రాసలీలలన్నీ బయటపడుతున్నాయి. ఆ తర్వాత అతను కన్య పిల్లల్ని హతమార్చాడని, ఎంతోమంది మహిళలతో రాసలీలలు గడిపాడని, అతని ఆశ్రమంలో కండోములు, సారాయి సీసాలు ఇవన్నీ దొరికాయని పట్టుబడుతున్నాడు. ఆ తర్వాత కోర్టు అతనికి జీవిత ఖైదు విధిస్తా ఉంది. అలాంటి చాలామంది బాబాలు మనకు కనిపిస్తూ ఉన్నారు.

అలాంటి వ్యక్తులు వచ్చి “నేను దేవుడిని, దేవుని స్వరూపాన్ని” అని చెప్పగానే ప్రజలు ఎందుకు వాళ్ళ మోసపోతున్నారంటే ఈ రెండు విషయాలు మర్చిపోయారు కాబట్టి. కనిపించేవాడు దేవుడు కాదు, మరణించేవాడు దేవుడు కాదు అని తెలియదు కాబట్టి, ఆ విషయాన్ని అర్థం చేసుకోలేదు కాబట్టి, కనిపిస్తున్న ఆ వ్యక్తిని దేవుడు అని చెబుతున్నారు, మరణిస్తున్న ఆ సమాధిని దేవుడు అని నమ్ముతున్నారు. కనిపిస్తున్న వాడు దేవుడు కాదు అని నమ్మితే ఇలాంటి బాబాల మాటలు చెల్లవు, వారి ఏ ప్రయత్నము చెల్లదు.

అయితే అభిమాన సోదరులారా, దేవుడు కనిపించడు, దేవుడు మరణించడు. కనిపించకుండా, మరణించకుండా మరి ఎక్కడ ఉంటాడు ఆయన?

ٱلرَّحْمَـٰنُ عَلَى ٱلْعَرْشِ ٱسْتَوَىٰ
(అర్రహ్మాను అలల్ అర్షిస్తవా)
ఆ కరుణామయుడు (అల్లాహ్) సింహాసనం (అర్ష్) మీద ఆశీనుడయ్యాడు.

ఆ కరుణామయుడు, ఆ సృష్టికర్త పైన సింహాసనం మీద, అర్ష్ మీద ఆశీనుడై ఉన్నాడు. ఇదే విషయం ఇతర గ్రంథాలలో కూడా తెలుపబడి ఉంది, ఆయన పరలోకమందు ఉన్నాడని తెలుపబడి ఉంది.

ఇప్పుడు ఒక్కసారి జల్లెడ పట్టండి అభిమాన సోదరులారా. ఈ మూడు లక్షణాలు చాలు. ఈ మూడు లక్షణాలను దృష్టిలో పెట్టుకొని ఒకసారి జల్లెడ పట్టండి. కనిపించకుండా, మరణించకుండా, పైనుండి ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తున్న దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడు ఎవరో ఒకసారి జల్లెడ పట్టి చూడండి. మన ముందరికి వచ్చే సారాంశం ఏమిటంటే, రిజల్ట్ ఏమిటంటే, ఈ లక్షణాలు కలిగిన ఒకే ఒక సృష్టికర్త, నిజమైన సృష్టికర్త ఆయనే అల్లాహ్. ఒక అల్లాహ్ లో మాత్రమే ఈ లక్షణాలు ఉన్నాయి. అల్లాహ్ ఎవ్వరికీ కనిపించడు, అల్లాహ్ కి మరణము లేదు, అల్లాహ్ పైనుంటాడు.

కాబట్టి అభిమాన సోదరులారా, గ్రంథాల ద్వారా మనకు స్పష్టమైన విషయం ఏమిటంటే, మన ప్రభువు, మన సృష్టికర్త, మన ఆరాధ్యుడు, నిజమైన దేవుడు ఒకే ఒక్కడు. ఆయనే అల్లాహ్ సుబ్ హనహు వ తఆలా.

ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఇక మన బాధ్యత ఏమిటి? మన బాధ్యత ఏమిటంటే, మనం ఎవరైనా సరే, ఎవరి ఇంట్లో పుట్టిన వాళ్ళమైనా సరే, ఏ దేశంలో పుట్టిన వాళ్ళమైనా సరే, ఎప్పుడైతే మనకు తెలిసిపోయిందో మన నిజమైన సృష్టికర్త, ఆరాధ్యుడు, ప్రభువు కనిపించని వాడు, మరణించని వాడు, సజీవుడు, పైనున్న అల్లాహ్ అని తెలిసిపోయిందో, ఆ అల్లాహ్ ని మనము ప్రభువు అని నమ్మాలి, ఆ అల్లాహ్ నే ఆరాధించాలి, ఆ అల్లాహ్ చూపిన మార్గంలో నడుచుకోవాలి. ఆ అల్లాహ్ చూపిన మార్గమే ఇస్లాం మార్గం.

ఆ ఇస్లాం మార్గాన్ని ఆదిమానవుడైన ఆదం అలైహిస్సలాం నుండి అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు అనేక ప్రవక్తలు వచ్చి ప్రచారం చేశారు. అంతిమంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చి ఆ ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణం చేసి వెళ్లారు. వారి తర్వాత మనం పుట్టిన వాళ్ళము కాబట్టి, మనము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ప్రకారంగా ఇస్లామీయ ఆచారాలను పాటించాలి. ఇది మన బాధ్యత.

ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత, ఎవరైతే ఎంత బాగా ఈ విషయాలను అమలుపరుస్తారో, వారు రేపు పరలోకంలో అల్లాహ్ దగ్గర అంత ఉన్నతమైన గౌరవ స్థానాలను పొందుతారు. ఎవరైతే ఎంతగా ఈ విషయాలను చెవిజాడను పెట్టేసి వదిలేస్తారో, కనుమరుగైపోయేటట్టు చేసేస్తారో, వారు ఆ విధంగా రేపు పరలోకంలో కఠినమైన శిక్షలకు గురవుతారు.

కాబట్టి, ఇంతటితో నా మాటను ముగిస్తూ, నేను ఆ నిజమైన సృష్టికర్త, నిజమైన ప్రభువు అల్లాహ్ సుబ్ హనహు వ తఆలా తో దుఆ చేస్తున్నాను, “ఓ అల్లాహ్, నీవే నిజమైన ప్రభువు అన్న విషయాన్ని మనందరికీ అర్థమయ్యేటట్టు చేసి, నిన్నే పూజించే వారిలాగా, నిన్నే ఆరాధించే వారిలాగా మార్చు.” ఆమీన్.

أقول قولي هذا وأستغفر الله لي ولكم ولسائر المسلمين، فاستغفروه، إنه هو الغفور الرحيم.
(అఖూలు ఖవ్లీ హాజా వ అస్తగ్ఫిరుల్లాహ లీ వలకుమ్ వలిసాఇరిల్ ముస్లిమీన్, ఫస్తగ్ఫిరూహు, ఇన్నహూ హువల్ గఫూరుర్రహీమ్)
నేను ఈ మాట చెప్పి, నా కోసం, మీ కోసం, మరియు సమస్త ముస్లింల కోసం అల్లాహ్ నుండి క్షమాపణ కోరుతున్నాను. కాబట్టి మీరు కూడా ఆయన నుండి క్షమాపణ కోరండి. నిశ్చయంగా, ఆయనే క్షమాశీలుడు, కరుణామయుడు.

అల్లాహ్ (త’ఆలా):
https://teluguislam.net/allah/