సూరతుల్ ముల్క్ తఫ్సీర్ (ఖురాన్ వ్యాఖ్యానం) [వీడియో]

యూట్యూబ్ ప్లే లిస్ట్ (6 వీడియోలు) :
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2ZyQP62CWIHGt_zGXFRRvs

67:1 تَبَارَكَ الَّذِي بِيَدِهِ الْمُلْكُ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ

ఎవరి చేతిలో విశ్వసామ్రాజ్యాధికారం ఉన్నదో ఆయన ఎంతో శుభకరుడు. ఆయన ప్రతి వస్తువుపై అధికారం కలవాడు.

67:2 الَّذِي خَلَقَ الْمَوْتَ وَالْحَيَاةَ لِيَبْلُوَكُمْ أَيُّكُمْ أَحْسَنُ عَمَلًا ۚ وَهُوَ الْعَزِيزُ الْغَفُورُ

మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం ఆయన చావుబతుకులను సృజించాడు. ఆయన శక్తిశాలి, క్షమాశీలి కూడాను.


67:3 الَّذِي خَلَقَ سَبْعَ سَمَاوَاتٍ طِبَاقًا ۖ مَّا تَرَىٰ فِي خَلْقِ الرَّحْمَٰنِ مِن تَفَاوُتٍ ۖ فَارْجِعِ الْبَصَرَ هَلْ تَرَىٰ مِن فُطُورٍ

ఆయన ఒకదానిపై ఒకటిగా సప్తాకాశాలను నిర్మించాడు. (ఓ చూచేవాడా!) నీవు కరుణామయుని సృష్టి ప్రక్రియలో ఎలాంటి అస్తవ్యస్తతను కానలేవు. కావాలంటే మరోసారి (దృష్టిని సారించి)చూడు. నీకేమైనా లోపం (బీటలు వారినట్టు) కనిపిస్తోందా?

67:4 ثُمَّ ارْجِعِ الْبَصَرَ كَرَّتَيْنِ يَنقَلِبْ إِلَيْكَ الْبَصَرُ خَاسِئًا وَهُوَ حَسِيرٌ

మళ్ళి మళ్ళి దృష్టిని సారించు. నీ దృష్టి అలసిసొలసి, విఫలమై నీ వైపు తిరిగి వస్తుంది.

67:5 وَلَقَدْ زَيَّنَّا السَّمَاءَ الدُّنْيَا بِمَصَابِيحَ وَجَعَلْنَاهَا رُجُومًا لِّلشَّيَاطِينِ ۖ وَأَعْتَدْنَا لَهُمْ عَذَابَ السَّعِيرِ

నిశ్చయంగా మేము (భూమికి) సమీపంలో ఉన్న ఆకాశాన్ని దీపాలతో (నక్షత్రాలతో)ముస్తాబు చేశాము. ఇంకా వాటిని (ఆ దీపాలను) షైతానులను తరిమికొట్టే సాధనాలుగా చేశాము. షైతానుల కొరకైతే మేము నరకాగ్నిని కూడా సిద్ధపరచి ఉంచాము.

67:6 وَلِلَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ عَذَابُ جَهَنَّمَ ۖ وَبِئْسَ الْمَصِيرُ

తమ ప్రభువును తిరస్కరించిన వారికి నరకయాతన తథ్యం. అదెంత చెడ్డ గమ్యస్థలం!?

67:7 إِذَا أُلْقُوا فِيهَا سَمِعُوا لَهَا شَهِيقًا وَهِيَ تَفُورُ

వారు అందులో పడవేయబడినప్పుడు దాని వికృత గర్జనను వారు వింటారు. అది ఉద్రేకంతో ఉడికి పోతూ ఉంటుంది.

67:8 تَكَادُ تَمَيَّزُ مِنَ الْغَيْظِ ۖ كُلَّمَا أُلْقِيَ فِيهَا فَوْجٌ سَأَلَهُمْ خَزَنَتُهَا أَلَمْ يَأْتِكُمْ نَذِيرٌ

ఆగ్రహంతో బ్రద్దలైపోయినట్లే ఉంటుంది. అందులో ఏదైనా ఒక సమూహం పడవేయబడినప్పుడల్లా, దాని రక్షకులు వారినుద్దేశించి, “ఏమిటి, మీ వద్దకు హెచ్చరించే వారెవరూ రాలేదా?” అని అడుగుతారు.

67:9 قَالُوا بَلَىٰ قَدْ جَاءَنَا نَذِيرٌ فَكَذَّبْنَا وَقُلْنَا مَا نَزَّلَ اللَّهُ مِن شَيْءٍ إِنْ أَنتُمْ إِلَّا فِي ضَلَالٍ كَبِيرٍ

“ఎందుకు రాలేదు? హెచ్చరించే వాడొకడు వచ్చాడు. కాని మేమే అతణ్ణి ధిక్కరించాము. ‘అల్లాహ్ దేనినీ అవతరింపజేయలేదు. మీరే పెద్ద అపమార్గానికి లోనై ఉన్నార’ని (సూటిగా) చెప్పేశాము” అని వారు ఒప్పుకుంటారు.

67:10 وَقَالُوا لَوْ كُنَّا نَسْمَعُ أَوْ نَعْقِلُ مَا كُنَّا فِي أَصْحَابِ السَّعِيرِ

వారు ఇంకా ఇలా అంటారు : “మేము విని ఉంటే లేదా బుద్ధిపెట్టి ఆలోచించి ఉంటే నరకాగ్నికి ఆహుతి అయిన వాళ్లతో చేరేవాళ్ళం కాము.”

67:11 فَاعْتَرَفُوا بِذَنبِهِمْ فَسُحْقًا لِّأَصْحَابِ السَّعِيرِ

ఆ విధంగా వారు తమ తప్పును (పాపాన్ని) ఒప్పుకుంటారు. కనుక ఈ నరకవాసులు (దైవకారుణ్యానికి) దూరమవుదురుగాక!

67:12 إِنَّ الَّذِينَ يَخْشَوْنَ رَبَّهُم بِالْغَيْبِ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ كَبِيرٌ

తమ ప్రభువును చూడకుండానే ఆయనకు భయపడుతూ ఉండేవారి కోసం క్షమాపణ, గొప్ప పుణ్యఫలం ఉన్నాయి.

67:13 وَأَسِرُّوا قَوْلَكُمْ أَوِ اجْهَرُوا بِهِ ۖ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ

మీరు మీ మాటలను రహస్యంగా (మెల్లగా) పలికినా, బిగ్గరగా పలికినా (అల్లాహ్ కు తెలియకుండా ఉండవు). నిశ్చయంగా ఆయన గుండెల్లోని గుట్టును సయితం ఎరిగినవాడు.

67:14 أَلَا يَعْلَمُ مَنْ خَلَقَ وَهُوَ اللَّطِيفُ الْخَبِيرُ

ఏమిటి, పుట్టించిన ఆయనే ఎరుగకుండా ఉంటాడా? ఆయనైతే సూక్ష్మగ్రాహి, సర్వాన్నీ కనిపెట్టుకుని ఉన్నవాడు.

67:15 هُوَ الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ ذَلُولًا فَامْشُوا فِي مَنَاكِبِهَا وَكُلُوا مِن رِّزْقِهِ ۖ وَإِلَيْهِ النُّشُورُ

ధరిత్రిని మీకు లోబడి ఉండేలా చేసినవాడు ఆయనే. కాబట్టి మీరు దాని మార్గాలపై నడవండి. ఆయన సమకూర్చిన ఆహారాన్ని భుజించండి. కడకు మీరు సజీవులై నిలబడవలసింది ఆయన సన్నిధిలోనే.

67:16 أَأَمِنتُم مَّن فِي السَّمَاءِ أَن يَخْسِفَ بِكُمُ الْأَرْضَ فَإِذَا هِيَ تَمُورُ

ఏమిటి, నింగినున్నవాడు మిమ్మల్ని నేలలోనికి దిగబడేలా చేసే విషయమై, ఆపై నేల అకస్మాత్తుగా ప్రకంపించటంపై మీరు నిర్భయంగా ఉన్నారా?

67:17 أَمْ أَمِنتُم مَّن فِي السَّمَاءِ أَن يُرْسِلَ عَلَيْكُمْ حَاصِبًا ۖ فَسَتَعْلَمُونَ كَيْفَ نَذِيرِ

లేక నింగినున్నవాడు మీపై రాళ్ల వాన కురిపిస్తాడన్న భయం మీకు బొత్తిగా లేదా? మరైతే నా హెచ్చరిక ఎటువంటిదో మీకు త్వరలోనే తెలిసిపోతుంది.

67:18 وَلَقَدْ كَذَّبَ الَّذِينَ مِن قَبْلِهِمْ فَكَيْفَ كَانَ نَكِيرِ

వీరి పూర్వీకులు కూడా ధిక్కరించిన వారే. మరి వారిపై నా దెబ్బ ఎలాపడిందో చూశారుగా!

67:19 أَوَلَمْ يَرَوْا إِلَى الطَّيْرِ فَوْقَهُمْ صَافَّاتٍ وَيَقْبِضْنَ ۚ مَا يُمْسِكُهُنَّ إِلَّا الرَّحْمَٰنُ ۚ إِنَّهُ بِكُلِّ شَيْءٍ بَصِيرٌ

ఏమిటీ, వీరు తమపై రెక్కల్ని చాచుతూ, (ఒక్కోసారి) ముడుచుకుంటూ ఎగిరే పక్షుల్ని చూడటం లేదా? కరుణామయుడు (అయిన అల్లాహ్) తప్ప వాటిని ఆ స్థితిలో ఎవరూ నిలిపి ఉంచటం లేదు. నిశ్చయంగా ప్రతి వస్తువు ఆయన దృష్టిలో ఉంది.

67:20 أَمَّنْ هَٰذَا الَّذِي هُوَ جُندٌ لَّكُمْ يَنصُرُكُم مِّن دُونِ الرَّحْمَٰنِ ۚ إِنِ الْكَافِرُونَ إِلَّا فِي غُرُورٍ

కరుణామయుడు (అయిన అల్లాహ్) కు విరుద్ధంగా మీకు సాయపడే సైన్యం ఏదో కాస్త చెప్పండి!? అవిశ్వాసులు మాత్రం మోసంలో పడి ఉన్నారు.

67:21 أَمَّنْ هَٰذَا الَّذِي يَرْزُقُكُمْ إِنْ أَمْسَكَ رِزْقَهُ ۚ بَل لَّجُّوا فِي عُتُوٍّ وَنُفُورٍ

ఒకవేళ ఆయన గనక తన ఉపాధిని నిలిపివేస్తే, మరి మీకు ఉపాధిని ఇచ్చేవాడెవడో చెప్పండి!? (ఎవరూ లేరు.) కాని వీరు (ఈ అవిశ్వాసులు) మాత్రం తమ తలబిరుసుతనంపై, పలాయనంపై పాతుకుపోయారు.

67:22 أَفَمَن يَمْشِي مُكِبًّا عَلَىٰ وَجْهِهِ أَهْدَىٰ أَمَّن يَمْشِي سَوِيًّا عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ

సరే, తలక్రిందులై ముఖంతో నడిచిపోయేవాడు సన్మార్గం పొందుతాడా? లేక తిన్నని బాటపై (తన కాళ్ళ మీద) నడిచిపోయేవాడు సన్మార్గం పొందుతాడా?

67:23 قُلْ هُوَ الَّذِي أَنشَأَكُمْ وَجَعَلَ لَكُمُ السَّمْعَ وَالْأَبْصَارَ وَالْأَفْئِدَةَ ۖ قَلِيلًا مَّا تَشْكُرُونَ

వారికి చెప్పు: “మిమ్మల్ని పుట్టించిన వాడు ఆయనే (అల్లాహ్ యే). మీ చెవులను, కళ్ళను, హృదయాలను చేసిన వాడూ ఆయనే. మీరు కృతఙ్ఞతలు తెలిపేది మాత్రం చాలా తక్కువ.”

67:24 قُلْ هُوَ الَّذِي ذَرَأَكُمْ فِي الْأَرْضِ وَإِلَيْهِ تُحْشَرُونَ

వారికి చెప్పు : “మిమ్మల్ని నేలలో విస్తరింపజేసినవాడు ఆయనే. (కడకు) ఆయన వైపే మీరంతా సమీకరించబడతారు.”

67:25 وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ

మీరు చెప్పేదే నిజమైతే ఆ వాగ్దానం ఎప్పుడు సంభవిస్తుంది?” అని (అవిశ్వాసులు) అడుగుతున్నారు కదూ!

67:26 قُلْ إِنَّمَا الْعِلْمُ عِندَ اللَّهِ وَإِنَّمَا أَنَا نَذِيرٌ مُّبِينٌ

(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఆ విషయం అల్లాహ్ కే తెలుసు. నేను మటుకు స్పష్టంగా హెచ్చరించే వాణ్ణి మాత్రమే.”

67:27 فَلَمَّا رَأَوْهُ زُلْفَةً سِيئَتْ وُجُوهُ الَّذِينَ كَفَرُوا وَقِيلَ هَٰذَا الَّذِي كُنتُم بِهِ تَدَّعُونَ

వారు ఆ వాగ్దానాన్ని అతి దగ్గరలో చూసుకున్నప్పుడు అవిశ్వాసుల ముఖాలు వికృతంగా మారిపోతాయి. “మీరు (పదే పదే) అడుగుతుండేది ఇదే” అని వారితో అనబడుతుంది.

67:28 قُلْ أَرَأَيْتُمْ إِنْ أَهْلَكَنِيَ اللَّهُ وَمَن مَّعِيَ أَوْ رَحِمَنَا فَمَن يُجِيرُ الْكَافِرِينَ مِنْ عَذَابٍ أَلِيمٍ

వారిని అడుగు : “చూడండి! ఒకవేళ నన్నూ, నా వెంటనున్న వారిని అల్లాహ్ అంతమొందించినా లేక మాపై దయదలిచినా (ఏది ఏమైనా) అవిశ్వాసులను వ్యధాభరితమైన యాతన నుండి కాపాడేవాడెవడో చెప్పండి?”

67:29 قُلْ هُوَ الرَّحْمَٰنُ آمَنَّا بِهِ وَعَلَيْهِ تَوَكَّلْنَا ۖ فَسَتَعْلَمُونَ مَنْ هُوَ فِي ضَلَالٍ مُّبِينٍ

(ఓ ప్రవక్తా! వారికి) చెప్పు: “ఆయనే కరుణామయుడు (అయిన అల్లాహ్). మేము ఆయన్ని విశ్వసించాము. ఆయనపైనే భారం మోపాము. ఇకపోతే, స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి గురై ఉన్నదెవరో మీకు త్వరలోనే తెలిసిపోతుంది.”

67:30 قُلْ أَرَأَيْتُمْ إِنْ أَصْبَحَ مَاؤُكُمْ غَوْرًا فَمَن يَأْتِيكُم بِمَاءٍ مَّعِينٍ

వారిని ఇలా అడుగు: “సరే, మీరు త్రాగే ఈ నీరు గనక భూమిలో ఇంకిపోతే, మీ కొరకు నీటి ఊటను బయటికి తెచ్చేదెవరో (ఇప్పుడు) చెప్పండి!?”

ఖుర్’ఆన్ (మెయిన్ పేజీ)
https://teluguislam.net/quran/