దైవ ప్రవక్తల పట్ల విశ్వాసం
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/4EZatwSP2Lo [15 నిముషాలు]
ఈ ప్రసంగంలో విశ్వాస ముఖ్యాంశాలలోని నాలుగవ ముఖ్యాంశం, దైవ ప్రవక్తల పట్ల విశ్వాసం గురించి మనం తెలుసుకోబోతున్నాం. దైవ ప్రవక్తలు అంటే ఎవరు, వారి సంఖ్య, ఖుర్‌ఆన్‌లో పేర్కొనబడిన 25 మంది ప్రవక్తల పేర్లు, మరియు వారిలో ఐదుగురు ముఖ్యమైన ప్రవక్తల (ఉలుల్ అజ్మ్) గురించి చర్చించబడింది. ప్రవక్తలందరూ అల్లాహ్ చేత ఎన్నుకోబడిన మానవులని, వారు దైవత్వాన్ని పంచుకోరని స్పష్టం చేయబడింది. చివరి ప్రవక్త అయిన ముహమ్మమ్ సల్లల్లాహు అలైహి వసల్లం యావత్ మానవాళికి మార్గదర్శకుడని, నేటి ప్రజలు ఆయనను అనుసరించాలని ఉద్బోధించబడింది. ప్రవక్తలకు ఇవ్వబడిన మహిమలు (అద్భుతాలు) వారి సొంత శక్తి కాదని, అవి అల్లాహ్ యొక్క శక్తి ద్వారా ప్రదర్శించబడ్డాయని కూడా వివరించబడింది.
الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
“సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు.” (1:2)
وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ
దైవప్రవక్తలలో అత్యంత శ్రేష్ఠుడు, దైవసందేశహరులలో అత్యుత్తముడైన మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన అనుచరులందరిపై శాంతి శుభాలు వర్షించుగాక.
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు)
“మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం, శుభాలు వర్షించుగాక.”
అర్కానుల్ ఈమాన్: దైవ ప్రవక్తలపై విశ్వాసం
అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలలోని నాలుగవ ముఖ్యాంశం, దైవ ప్రవక్తల పట్ల విశ్వాసం గురించి ఈ ప్రసంగంలో మనం తెలుసుకోబోతున్నాం.
ఆ హదీస్ పదేపదే మనం వింటూ వస్తున్నాము చూడండి, జిబ్రీల్ అలైహిస్సలాం వారు, దైవదూత, మానవ ఆకారంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్తా, విశ్వాసం (ఈమాన్) అంటే ఏమిటి అని ప్రశ్నించినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానమిస్తూ, “అల్లాహ్‌ను విశ్వసించటం, ప్రవక్తలను విశ్వసించటం, దూతలను విశ్వసించటం, ఆకాశ గ్రంథాలను విశ్వసించటం, పరలోక దినాన్ని విశ్వసించటం, మంచి చెడు విధి వ్రాతలను విశ్వసించటం,” ఈ ఆరు విషయాలను విశ్వసించటాన్ని ఈమాన్, విశ్వాసం అంటారు అని తెలియజేసినప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం దైవదూత, మీరు నిజం చెప్పారు అని ధ్రువీకరించారు.
ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఆ ఆరు విషయాలలో నుంచి ఒక విషయం, దైవ ప్రవక్తల పట్ల విశ్వాసం కలిగి ఉండటం.. కాబట్టి ఈ ప్రసంగంలో మనము కొన్ని ముఖ్యమైన విషయాలు దైవ ప్రవక్తల పట్ల తెలుసుకుందాం.
దైవ ప్రవక్తలు అంటే ఎవరు?
ముందుగా, దైవ ప్రవక్తలు అంటే ఎవరు? అది తెలుసుకుందాం. దైవ ప్రవక్తలు అంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచంలో మానవులు ఎప్పుడెప్పుడైతే మార్గభ్రష్టత్వానికి గురయ్యారో, ఆ సందర్భములో మానవులను మళ్లీ రుజుమార్గం పైకి తీసుకురావటానికి, మానవులలో నుంచే ఒక భక్తుడిని ఎన్నుకున్నాడు. ఆ భక్తుని వద్దకు దూతల ద్వారా దైవ వాక్యాలు పంపించగా, ఆ దైవ వాక్యాలు దూతల ద్వారా పొందిన ఆ ఎన్నుకోబడిన దైవభక్తులు ప్రజలకు ఆ దైవ వాక్యాలు బోధించారు, వినిపించారు. అల్లాహ్ వైపుకి, అల్లాహ్ మార్గం వైపుకి ప్రజలను ఆహ్వానించారు. ఆ తర్వాత, ఏ విధంగా అల్లాహ్ మార్గంలో నడుచుకోవాలో ఆచరించి చూపించారు. అలా చేసిన వారిని, అల్లాహ్ వాక్యాలు ప్రజలకు వినిపించి, అల్లాహ్ మార్గంలో ఎలా నడుచుకోవాలో ఆచరించి చూపించిన ఆ అల్లాహ్ తరఫున ఎన్నుకోబడిన భక్తులను దైవ ప్రవక్తలు అంటారు, బోధకులు అంటారు, నబీ, రసూల్ అని అరబీలో కూడా అంటారు.
అయితే, ఈ ప్రపంచంలో ఎంతమంది దైవ ప్రవక్తలు వచ్చారు అంటే, ఈ ప్రపంచంలో ఆదిమానవుడైన ఆదం అలైహిస్సలాం వద్ద నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నాటికి ఇంచుమించు 1,24,000 మంది దైవ ప్రవక్తలు వేరేవేరే యుగాలలో, ప్రపంచంలోని భూమండలంలోని వేరేవేరే ప్రదేశాలలో అవసరాన్నికి తగ్గట్టుగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పంపిస్తూ వచ్చాడు. మొదటి దైవ ప్రవక్త పేరు ఆదం అలైహిస్సలాం. అంతిమ దైవ ప్రవక్త పేరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.
ఖుర్‌ఆన్‌లో ప్రస్తావించబడిన ప్రవక్తలు
ఇక, ఖుర్‌ఆన్ గ్రంథంలో ఎంతమంది దైవ ప్రవక్తల ప్రస్తావన వచ్చి ఉంది అని మనం చూసినట్లయితే, ధార్మిక పండితులు లెక్కించి తెలియజేసిన విషయం ఏమిటంటే, ఖుర్‌ఆన్ గ్రంథంలో 25 దైవ ప్రవక్తల ప్రస్తావన వచ్చి ఉన్నది. ఎవరు వారు అంటే, ఆదం అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం, హూద్ అలైహిస్సలాం, సాలిహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయీల్ అలైహిస్సలాం, ఇస్ హాఖ్ అలైహిస్సలాం, యాఖూబ్ అలైహిస్సలాం, యూసుఫ్ అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం, అయ్యూబ్ అలైహిస్సలాం, షుఐబ్ అలైహిస్సలాం, ధుల్ కిఫ్ల్ అలైహిస్సలాం, దావూద్ అలైహిస్సలాం, సులైమాన్ అలైహిస్సలాం, ఇలియాస్ అలైహిస్సలాం, ఇద్రీస్ అలైహిస్సలాం, అల్ యస అలైహిస్సలాం, జకరియ్యా అలైహిస్సలాం, యహ్యా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, యూనుస్ అలైహిస్సలాం, లూత్ అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మొత్తం 25 దైవ ప్రవక్తల ప్రస్తావన ఖుర్‌ఆన్ గ్రంథంలో వచ్చి ఉంది. వారి పేర్లన్నీ మీ ముందర నేను ఇప్పుడు వినిపించటం జరిగింది.
ఇక ఈ 1,24,000 ప్రవక్తలలో నుంచి 25 ప్రవక్తల ప్రస్తావన ఖుర్‌ఆన్‌లో వచ్చింది కదా, వారందరిలో నుంచి ఐదుగురు దైవ ప్రవక్తలకు, ప్రవక్తలందరి మీద ఒక గౌరవ స్థానం ఇవ్వబడింది. వారిని అరబీ భాషలో “ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్” అని బిరుదు ఇవ్వబడింది ప్రత్యేకంగా. తెలుగు భాషలో దానికి అనువాదము సహనమూర్తులు అని, వజ్ర సంకల్పము గల ప్రవక్తలు అని అనువాదం చేసి ఉన్నారు. వజ్ర సంకల్పము గల దైవ ప్రవక్తలు అన్న బిరుదు పొందిన ప్రవక్తలు ఎంతమంది అంటే ఐదు మంది ఉన్నారు. ఆ ఐదు మంది ఎవరంటే నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ ఐదు మందిని “ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్” అని తెలియజేయడం జరిగింది.
అంతిమ ప్రవక్తను అనుసరించటం
ఇక, మనము ఏ ప్రవక్తను అనుసరించాలి? నేడు ప్రపంచంలో ఉన్నవారు, ప్రజలందరూ ఏ ప్రవక్తను అనుసరించాలి అంటే, మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత ప్రపంచంలో పుట్టిన వారము కాబట్టి, నేడు మన మీద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించే బాధ్యత వేయబడి ఉన్నది. మనమంతా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి. మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుయాయులు అని అంటారు.
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మనము ముఖ్యంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవి ఏమిటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమ ప్రవక్త, చివరి ప్రవక్త. ఇక ప్రళయం వరకు మరొక ప్రవక్త ఎవరూ రాజాలరు. ఆయనే చివరి ప్రవక్త. ఎవరైనా నేను ప్రవక్తను అని ఇప్పుడు గానీ, ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత గానీ ఎవరైనా ప్రకటన చేస్తే, అతను అబద్ధం పలుకుతున్నట్టు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక ప్రళయం వరకు ప్రవక్తలు రారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా ఖుర్‌ఆన్‌లో తెలియజేసి ఉన్నాడు కాబట్టి, ఇంకా అల్లాహ్ తరఫు నుంచి ప్రవక్తలు రారు.
అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మనం తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన మాట ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక దేశానికి లేదా ఒక జాతి వారికి ప్రవక్త కాదండి, పూర్తి ప్రపంచానికి ఆయన ప్రవక్తగా పంపించబడ్డారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికంటే ముందు వచ్చిన ప్రవక్తలు ఒక దేశానికి లేదా ఒక జాతి వారికి, ఒక ప్రదేశానికి మాత్రమే ప్రవక్తలుగా పంపించబడేవారు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పూర్తి ప్రపంచానికి ప్రవక్తగా చేసి పంపించాడు కాబట్టి, భూమండలంలో ఏ మూలన నివసిస్తున్న వారైనా సరే వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా విశ్వసించాలి.
అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విశ్వ ప్రవక్తల నాయకుడిగా చేసి ఉన్నాడు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా శాసనము ఇచ్చి ఉన్నాడు. ఆ శాసనాన్ని మనము అనుసరించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనము ప్రవక్తగా అభిమానించాలి, ఆయనను గౌరవించాలి.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనము అనుసరించాలి, అంటే ఆయన చూపిన మార్గంలో మనం నడుచుకోవాలి. ఏ విషయాలు అయితే ఆయన చేయమని మనకు తెలియజేశారో, అవన్నీ మనము పుణ్యకార్యాలు, సత్కార్యాలు అని తెలుసుకొని వాటిని అమలు పరచాలి. ఏ విషయాల నుండి అయితే ఆయన వారించాడో, ఆగిపోమని తెలియజేశారో, ఆ విషయాల జోలికి వెళ్ళకుండా మనము దూరంగా ఉండాలి. ఎందుకంటే, ఆయన ఏ విషయాల గురించి అయితే వారించారో అవన్నీ దుష్కార్యాలు, పాపాలు కాబట్టి వాటికి మనము దూరంగా ఉండాలి.
పూర్వ ప్రవక్తల పట్ల మన వైఖరి
ఇక, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికంటే పూర్వము కొంతమంది ప్రవక్తలు వచ్చారు కదా. ఆ ప్రవక్తల గురించి మన విశ్వాసం ఎలా ఉండాలి, మనం ఏ విధంగా వైఖరి కలిగి ఉండాలి అంటే, ధార్మిక పండితులు తెలియజేశారు, చాలా చక్కగా మరియు జాగ్రత్తగా ఆలోచించండి.
ప్రవక్తలందరూ కూడా మానవులు అని మనము విశ్వసించాలి. అలాగే, ప్రవక్తలందరూ కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తరఫున ఎన్నుకోబడిన వారు అని వారందరినీ మనము గౌరవించాలి. అలాగే ప్రవక్తలందరి వద్దకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దూతల ద్వారా వాక్యాలు పంపించగా, వారు ఆ వాక్యాలు ప్రజలకు తూచా తప్పకుండా పూర్తిగా వివరించారు. వారు ఆ బాధ్యతలో రవ్వంత కూడా జాప్యము చేయలేదు, పూర్తిగా ఆ కార్యాన్ని వారు నిర్వహించారు అని మనము విశ్వసించాలి.
అలాగే ప్రవక్తలందరూ కూడా మానవులలోనే ఉత్తములు, పుణ్యాత్ములు, సజ్జనులు అని కూడా మనము గౌరవించాలి. అలాగే, ధర్మ ప్రచారపు మార్గంలో ప్రవక్తలు బాధలు ఎదుర్కొన్నారు, విమర్శలు ఎదుర్కొన్నారు, హింసలు భరించారు, చివరికి ప్రాణత్యాగాలు కూడా కొంతమంది ప్రవక్తలు చేశారు. అవన్నీ మనకు చరిత్రలో తెలుపబడి ఉన్నాయి కాబట్టి, వారందరూ గొప్ప దైవభీతిపరులు, భక్తులు మరియు అల్లాహ్ వారికి అప్పగించిన కార్యము కోసము అవమానాలు భరించిన వారు, బాధలు భరించిన వారు, ప్రాణత్యాగాలు చేసిన వారు అని వారి భక్తి గురించి మనము తెలుసుకోవాలి, అలాగే వారిని భక్తులు అని మనం వారిని గౌరవించాలి.
ఏ ప్రవక్తను కూడా కించపరచరాదు. ప్రవక్తలను కించపరచటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ అనుమతి లేదు. ప్రవక్తలందరినీ గౌరవించాలి, ఏ ప్రవక్తను కూడా కించపరచరాదు.
మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుయాయులము, ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, చివర్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు కాబట్టి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి రాకతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పూర్వం వచ్చిన ప్రవక్తలందరి శాసనాలు మన్సూఖ్ చేయబడ్డాయి, అనగా రద్దు చేయబడ్డాయి. కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనం మాత్రమే అమలుపరుచుకోవటానికి అనుమతి ఇవ్వబడి ఉంది. ఇది మనం ముఖ్యంగా తెలుసుకొని విశ్వసించాలి మిత్రులారా.
ప్రవక్తల మహిమలు (అద్భుతాలు)
ఇక చివరిలో, ప్రవక్తలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొన్ని మహిమలు ఇచ్చి ఉన్నాడు, ఆ మహిమల గురించి తెలుసుకొని మాటను ముగిద్దాం. చూడండి, ప్రవక్తలలో కొన్ని ప్రవక్తలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సందర్భానుసారంగా కొన్ని మహిమలు ఇచ్చాడు. ఉదాహరణకు, మూసా అలైహిస్సలాం వారి కాలంలో అలనాటి ప్రజలు మూసా అలైహిస్సలాం వారితో మహిమలు అడిగినప్పుడు, ఆయన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేయగా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు కొన్ని మహిమలు ఇచ్చాడు. అందులో ఒక మహిమ ఏమిటంటే చేతికర్ర. అది కింద పడవేస్తే పెద్ద సర్పంలాగా మారిపోతుంది, మళ్లీ ముట్టుకుంటే అది మామూలు కర్రగా మారిపోతుంది. అది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ఇచ్చిన ఒక మహిమ.
అలాగే, ఈసా అలైహిస్సలాం వారికి కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మహిమలు ఇచ్చారు. ఆయన పుట్టుకతో గుడ్డివారిగా ఉన్న వారిని స్పర్శించి అల్లాహ్ తో దుఆ చేస్తే, పుట్టుకతో గుడ్డివాడిగా ఉన్న వారికి కంటి చూపు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చేసేవాడు. కఠినమైన వ్యాధిగ్రస్తులను కూడా ఆయన స్పర్శించి అల్లాహ్ తో దుఆ చేస్తే వారందరికీ స్వస్థత లభించేది. అంటే, ఈసా అలైహిస్సలాం వారికి కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొన్ని మహిమలు ఇచ్చాడు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చాలా మహిమలు ఇచ్చాడు. ఆయన అల్లాహ్ తో దుఆ చేయగా చంద్రుడు రెండు ముక్కలయ్యాడు. ఆయన వేళ్ళ మధ్య నుండి నీళ్లు ప్రవహించాయి. ఇలా అవన్నీ ఇన్ షా అల్లాహ్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మహిమలు అన్న ప్రసంగంలో మనం వింటే వివరాలు తెలుస్తాయి. కాకపోతే, ఈ మహిమల గురించి మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, మహిమలు ప్రవక్తల సొంత శక్తులు కానే కావు. వారు అల్లాహ్ తో దుఆ చేయగా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన శక్తితో అవన్నీ ప్రజల ముందర చేసి చూపించాడు.
ప్రవక్తలు దేవుళ్ళు కారు, దేవునిలో భాగస్థులు కారు, దేవునికి సరిసమానులు కూడా కారు. అల్లాహ్ ఒక్కడే నిజమైన ప్రభువు. ప్రవక్తలు అల్లాహ్ లో భాగము కాదు, అల్లాహ్ కుమారులు కాదు మరియు అల్లాహ్ కు సరిసమానులు కాదు. వారు మానవులు, మానవులలోనే ఉత్తములు, అల్లాహ్ ద్వారా ఎన్నుకోబడిన వారు.
ప్రవక్తలను ప్రతి ప్రవక్తను వారి వారి సమాజం వారు అనుసరించాల్సిన బాధ్యత ఉండేది. మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుయాయులము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి, రండి అల్లాహ్ వైపు, రండి అల్లాహ్ ను విశ్వసించండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా విశ్వసించండి. అల్లాహ్ మరియు ప్రవక్త చూపించిన మార్గం, ఇస్లాం మార్గంలో వచ్చి చేరండి. మీకు అందరికీ ఇదే నా ఆహ్వానం.
అల్లాహ్ తో నేను దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనలందరికీ అన్న విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్.
وَجَزَاكُمُ اللهُ خَيْرًا
(వ జజాకుముల్లాహు ఖైరన్)
“అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ప్రసాదించుగాక.”
السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు)
“మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం, శుభాలు వర్షించుగాక.”
—
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=30611
ప్రవక్తలు (మెయిన్ పేజీ):
https://teluguislam.net/prophets/