
సంకలనం: అమల్ అన్-నష్వాన్.
సమీక్ష: సనావుల్లాహ్ సిద్ధీఖి, ప్రత్యక్ష వ్యాఖ్యాత, అల్ మస్జిద్ అల్ హరమ్.
తెలుగు అనువాదం: ముహమ్మద్ కరీముల్లాహ్.
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్
అనంత కరుణాప్రదాత, అపార కృశీలుడైన అల్లాహ్ పేరుతో
తొలి అభిప్రాయం
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్
సకల ప్రశంసలు, స్తోత్రములు, కృతజ్ఞతలు సర్వ లోకాల ప్రభువైన అల్లాహ్ కే శోభిస్తాయి మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై మరియు ఆయన సహచరులపై అనేక దీవెనలు వర్షించు గాక!
అమల్ బింత్ ఇబ్రాహీం అన్-నష్వాన్ రచించిన “దుఆ: అల్లాహ్ అనుబంధానికి తాళంచెవి” అనే సంకలనం గురించి నాకు తెలిసినది. ఇది కీలకమైన ప్రముఖ సమస్యలను వివరించే ప్రయోజనకరమైన సంకలనం అని గుర్తించాను. దీనిని సంకలనం చేయడంలో అనుసరించిన ఆచరణాత్మక విధానాలు పూర్తిగా ప్రయోజనకరంగా మరియు అత్యుత్తమంగా ఉన్నాయి. దీనిని అమూల్యమైనదిగా చేయమని మరియు ఈ ప్రయోజనకరమైన పనికి బదులుగా దీని రచయిత్రికి తగిన ప్రతిఫలం ప్రసాదించమని నేను అల్లాహ్ ను అర్థిస్తున్నాను. రచయిత్రి యొక్క అభ్యర్థన మేరకు, నేను ఈ తొలి అభిప్రాయాన్ని వ్రాసాను.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై మరియు ఆయన సహచరులపై అనేక దీవెనలు వర్షించు గాక!
డాక్టర్ ఫాలిహ్ బిన్ ముహమ్మద్ అస్-సగీర్.
విషయసూచిక
1.తొలి అభిప్రాయం
2. అంకితం
3. ఒక అద్భుత ఆశాకిరణం
4. పీఠిక
5. దుఆ: ఒక అనుగ్రహం, దీవెన, ఆశీర్వాదం
6. దుఆ యొక్క ప్రాముఖ్యత
7. దుఆలో పాటించవలసిన ఆవశ్యకతలు మరియు మర్యాదలు
8. కొన్ని యథార్థ గాథలు
9. చివరి మాట
అంకితం
- అల్లాహ్ వైపు చేతులు ఎత్తే ప్రతి ఒక్కరికీ.
- నిరాశ చెందకుండా నిరంతరం అల్లాహ్‌ను ప్రార్థించే ప్రతి ఒక్కరికీ.
- విశ్వాసం, ప్రతీక్ష మరియు ఆశతో ప్రార్థించే ప్రతి ఒక్కరికీ.
- ఇక కేవలం అల్లాహ్ మాత్రమే తనకు బాధల నుండి ఉపశమనం ప్రసాదించ గలడని విశ్వసించే పూర్తిగా నిరుత్సాహానికి గురైన వ్యక్తికీ.
- తన ప్రార్థన ఆమోదింప బడుతుందనే ఆశ కోల్పోయి, నిరాశ అంచున నిలబడి ఉన్న ప్రతి ఒక్కరికీ.
- తన అవసరాల కొరకు అల్లాహ్ వైపు చేతులు ఎత్తే ప్రతి ఒక్కరికీ.
ఒక అద్భుత ఆశాకిరణం
{وَإِذَا سَأَلَكَ عِبَادِى عَنِّى فَإِنِّى قَرِيبٌ ۖ أُجِيبُ دَعْوَةَ ٱلدَّاعِ إِذَا دَعَانِ ۖ فَلْيَسْتَجِيبُوا لِى وَلْيُؤْمِنُوا بِى لَعَلَّهُمْ يَرْشُدُونَ} البقرة: ١٨٦
[నా దాసులు నా గురించి నిన్ను అడిగినప్పుడు, (వారితో చెప్పు) నిశ్చయంగా నేను వారికి సమీపంలోనే ఉన్నాను. వేడుకునేవారు నన్ను వేడుకున్నప్పుడు, నేను వారి వేడుకోలుకు బదులిస్తాను. కనుక వారు నా ఆజ్ఞను పాటించాలి మరియు నన్ను విశ్వసించాలి. తద్వారా వారు సన్మార్గం పొందగలగుతారు.] 2:186
ఈ ప్రకాశించే పదాలు, ఒకరి తెలివితేటలను మరియు అతని హృదయాన్ని ఆకర్షించే పదబంధాలు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఎంత గొప్పవాడు మరియు ఎంత మహిమాన్వితుడు, అయినా ఆయన మీకు ఎంత దగ్గరగా ఉన్నాడు అనే భావనతో ఈ ఆయతు మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. ఇది మీ హృదయంలో అల్లాహ్ యొక్క అపారమైన అనుగ్రహం మరియు దీవెనలపై ఆశలను నింపుతుంది.
పీఠిక
మనం ఎవరిని స్తుతిస్తామో మరియు ఎవరి నుండి మనం సహాయం, క్షమాపణ అర్థిస్తామో ఆ అల్లాహ్‌కే ప్రశంసలన్నీ చెందుతాయి. మనలోని చెడుల నుండి మేము అల్లాహ్ శరణు వేడుకుంటున్నాము. అల్లాహ్ ఎవరిని సన్మార్గంలో నడిపిస్తాడో, అతడిని తప్పుదారి పట్టించే వారెవ్వరూ ఉండరు మరియు ఎవరిని ఆయన మార్గభ్రష్టత్వంలో వదిలి వేస్తాడో, అతనికి దారి చూపే వారెవ్వరూ ఉండరు. ఒక్క అల్లాహ్ తప్ప, ఆరాధనలకు అర్హుడైన వాడెవ్వడూ లేడని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను.
{وَإِذَا سَأَلَكَ عِبَادِى عَنِّى فَإِنِّى قَرِيبٌ ۖ أُجِيبُ دَعْوَةَ ٱلدَّاعِ إِذَا دَعَانِ ۖ فَلْيَسْتَجِيبُوا لِى وَلْيُؤْمِنُوا بِى لَعَلَّهُمْ يَرْشُدُونَ} البقرة: ١٨٦
[నా దాసులు నా గురించి నిన్ను అడిగినప్పుడు, (వారితో చెప్పు) నిశ్చయంగా నేను వారికి సమీపంలోనే ఉన్నాను. వేడుకునేవారు నన్ను వేడుకున్నప్పుడు, నేను వారి వేడుకోలుకు బదులిస్తాను. కనుక వారు నా ఆజ్ఞను పాటించాలి మరియు నన్ను విశ్వసించాలి. తద్వారా వారు సన్మార్గం పొందగలగుతారు.] 2:186
అల్లాహ్ యొక్క సామీప్యత & ఆప్యాయతల అనుభూతిని కలిగించే అపూర్వమైన, అద్భుతమైన వచనం ఇది. ఒక విచిత్రమైన తేజస్సును మనలో నింపుతుంది మరియు దాసుడికి మరియు ప్రభువుకు మధ్య గల బలమైన దాస్యం ఉనికిని సంతృప్తి మరియు ఉపశమనంతో కప్పి వేస్తుంది.
దీనిపై నా దీర్ఘాలోచన కొన్ని అర్థవంతమైన మార్గదర్శకాలు, ప్రయోజనాలు, వచనం యొక్క భావాలు మరియు అర్థాల గురించి లోతైన అంతర్దృష్టులతో ముగిసింది. దుఆలతో దాసులను వారి ప్రభువుకు దగ్గరగా తీసుకు వెళ్ళే అనేక కథలు, వృత్తాంతాలు మరియు కథనాలను నేను గుర్తు చేసుకున్నాను; దాసులు తమ ప్రార్థనలు అంగీకరించబడటమే కాకుండా చాలా ఆశీర్వాదాలు మరియు అనుగ్రహాలతో ప్రతిఫలం పొందారు. ఇది నేను ఉపన్యాస శ్రేణిని ప్రారంభిస్తున్నానని ప్రకటించడానికి నాలో తగినంత నమ్మకం కలిగించింది. ఈ వచనానికి సంబంధించిన తమ తమ నిజమైన అనుభవాలు మరియు కథనాలతో నాకు సహాయం చేయవలసిందిగా నేను కొంతమంది సోదరీమణులను అభ్యర్థించాను. అల్లాహ్ వారికి పుష్కలంగా ప్రతిఫలం ప్రసాదించు గాక!
నా స్వంత అనుభవాలు మరియు కథనాలతో నా పరిశోధనను రుజువు చేస్తూ ఉపన్యాసాలు ఇచ్చాను. ఈ పద్ధతి నా ఉపన్యాసాలను చాలా బాగా ప్రభావితం చేసింది. ఇంకా ఎక్కువ ప్రయోజనం కోసం, ఆ ఉపన్యాసాలను వ్రాతరూపంలో సంకలనం చేయాలనే ఆలోచన వచ్చింది.
ఈ పుస్తకంలో వివరించిన అనుభవాలు మరియు కథనాలతో, అల్లాహ్ వాగ్దానం యొక్క సాధ్యతను నేను దృఢంగా ధృవీకరించాలని నా సంకల్పం ఎంతమాత్రమూ కాదు. నిజానికి, అల్లాహ్ హామీ ఇచ్చిన వాగ్దానం యొక్క ప్రామాణికతపై నాకు ఎటువంటి సందేహం లేదు. శ్రోతల, పాఠకుల ఆసక్తిని రేకెత్తించడానికి మాత్రమే ఆ గాథలు పుస్తకంలో ప్రస్తావించబడ్డాయి.
దీనిని విస్తృతంగా వ్యాపింప జేయాలని మరియు ప్రయోజనకర మైనదిగా చేయాలని, గాయపడిన ఆత్మలను నయం చేయడానికి, గాయ పడిన గుండెలలో సంతృప్తిని కలిగించడానికి మరియు విరిగిన మనస్సులు కోలుకోవడానికి విరుగుడుగా చేయమని అల్లాహ్ ను వేడుకుంటున్నాను.
రకరకాల ఆలోచనలతో, ఉపయోగకరమైన సమాచారంతో లేదా సూచనలతో నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ మరియు పుస్తక ప్రచురణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అల్లాహ్ వారికి పూర్తి ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక!
ఈ పుస్తకంపై ‘తొలి అభిప్రాయం’ వ్రాయడానికి తన విలువైన సమయాన్ని వెచ్చించినందుకు నేను డా. ఫాలిహ్ అస్-సగీర్ గారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను.
ప్రజలందరికీ తన పుష్కలమైన ప్రతిఫలాన్ని ప్రసాదించమని నేను అల్లాహ్‌ను వేడుకుంటున్నాను. ఆయన అన్నింటిపై సాటిలేని సమర్థుడు. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అనేక దురూద్ లు.
అమల్ బింత్ ఇబ్రాహీమ్ అన్-నష్వాన్
am.alnashwan2@gmail.com
దుఆ: ఒక అనుగ్రహం, దీవెన, ఆశీర్వాదం
దుఆ (ప్రార్థన) అనేది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మనకు ప్రసాదించిన అసాధారణమైన, అమోఘమైన అనుగ్రహం. తనకే దుఆ చేయమని అల్లాహ్ మనల్ని ఆదేశించినాడు మరియు మన దుఆలకు జవాబు ఇస్తానని వాగ్దానం చేసినాడు. దుఆకు (ప్రార్థనకు) అత్యంత ప్రాముఖ్యత మరియు అనంతమైన ప్రయోజనాలు ఉన్నాయి. మన ధర్మంలో, ఇది ఉన్నతమైన స్థాయిని ఆక్రమించింది. ఇది లెక్కలేనన్ని ఆశీర్వాదాలను తీసుకు వస్తుంది మరియు అసంఖ్యాక ప్రతికూలతలను, ఇబ్బందులను దూరం చేస్తుంది.
దుఆ అనేది తౌహిద్ (ఏకేశ్వరోపాసన) విషయంలో సమగ్రమైనది మరియు ఆరాధనలో అల్లాహ్ పట్ల ప్రత్యేకమైన భయభక్తులు కలిగి ఉన్నది. మనం అల్లాహ్‌ను అర్థించినప్పుడు, మన దుఆకు జవాబు ఇచ్చేది ఆయన మాత్రమే అనే దృఢమైన నమ్మకంతో ప్రత్యేకంగా ఆయనను ఆరాధిస్తాం. అల్లాహ్ తప్ప మరెవ్వరూ దుఆకు అర్హులు కారు. కేవలం అల్లాహ్ నే ఆరాధించాలనేది దుఆలోని ప్రధాన సారాంశం మరియు ప్రాథమిక షరతు.
ప్రపంచంలోని విశ్వాసిని రక్షించడానికి దుఆ ఒక కవచం వంటిది. అల్లాహ్ మనకు ఈ దీవెనను ప్రసాదించాడు, మనం ఏ పరిస్థితిలోనైనా మరియు ఏ సమయంలోనైనా ఆయనను పిలవడానికి వీలు కల్పించాడు. దుఆ చేయటం నుండి మనల్ని ఏదీ నిరోధించదు, ఎందుకంటే ఇది ఏదైనా నిర్ణీత సమయానికి లేదా అనుకూలమైన పరిస్థితికి ప్రత్యేకించబడలేదు. హదీథులలో పేర్కొన్నట్లు, కొన్ని నిర్దిష్ట సమయాల్లో దుఆ స్వీకరించబడే అవకాశం ఎక్కువగా ఉందనేది నిజమే. అయితే, కేవలం ఆ సమయాల్లో మాత్రమే దుఆ చేయాలని అది సూచించదు.
ఇబ్న్ ఖయ్యిమ్ ఇలా పలికారు: అల్లాహ్ తన అనుగ్రహాన్ని ఎవరి పైనైనా కురిపించాని తలచినప్పుడు, ఆయన అతడి కొరకు వినయ విధేయతల మరియు అణుకువ, నమ్రత, సౌమ్యతల ద్వారాలు తెరుస్తాడు. అతడు ఎల్లప్పుడూ తనను మాత్రమే ఆశ్రయించేలా చేస్తాడు, అతడు తనలోని లోపాలు, కొరతలు, అజ్ఞానం మరియు ధిక్కారాన్ని గుర్తించేలా చేస్తాడు. అది తన ప్రభువు యొక్క అపారమైన దయ, ఆశీర్వాదం, కరుణ, అనుగ్రహం మరియు దీవెనల మహత్యాన్ని, ఘనతను ఊహించడానికి అతడికి శక్తినిస్తుంది.[1]
అల్లాహ్ మీ కోసం దుఆ తలుపులు తెరిచినప్పుడు, ఆయన తన ఆశీర్వాదాలను మీపై కురిపించాలనుకుంటున్నాడని ఇది సూచిస్తుంది. అల్లాహ్ తన ముందు మీ కొరకు సౌమ్యత మరియు వినయముల తలుపులు తెరిచినప్పుడు మరియు ఆయనను ఆశ్రయించిన ప్రతిసారీ, ఆయన తన ఆనందం మరియు అనుగ్రహంతో మిమ్మల్ని కప్పి వేయాలని భావిస్తున్నాడని కూడా సూచిస్తుంది.
చాలా దయనీయంగా, నిరుత్సాహంగా, నిరాశగా పేదరికంలో గడుపుతున్న వ్యక్తులు కనబడినప్పుడు ఒకింత ఆశ్చర్యం కలగవచ్చు. కానీ, వారు ఇప్పటికీ అల్లాహ్ ను ప్రార్థించాలనే ఆలోచనే రాకపోవటం అనేది మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అల్లాహ్ ప్రమాణంగా! ఇది ఒక తీవ్రమైన లోటు మరియు దౌర్భాగ్యం. అలాంటి వారు తమ ఇబ్బందిని తొలగించమని అల్లాహ్‌ను ప్రార్థించడంలో, వేడుకొనడంలో మరియు గుసగుసలాడుతూ అల్లాహ్ వద్ద మొరపెట్టు కోవడంలోని ఆనందాన్ని కోల్పోతున్నారు.
అల్లాహ్ ఎట్టి పరిస్థితుల్లోనూ దుఆ తలుపులు తెరిచే ఉంచుతాడు. ఒకవేళ ఆయన మన దుఆ అంగీకరించక పోయినా, మన మనస్సును ప్రశాంతతతో నింపుతాడు. మరి అలాంటప్పుడు, అల్లాహ్ ను అర్థించకుండా మనల్ని ఏమి అడ్డుకుంటున్నది? ప్రజల తలుపులు తట్టడం, మానవీయ ప్రయత్నాలను మరియు మార్గాలను ఆశ్రయించడం అనేది దుఆ తలుపు తట్టాలనే ఆలోచనను విస్మరించేలా చేస్తున్నదా? కేవలం దుఆ మాత్రమే చేయమని మరియు ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా వేచి ఉండమని నేను మీకు సలహా ఇవ్వడం లేదు. దానికి బదులుగా, దుఆను మొదటి మరియు ప్రధానమైన ప్రయత్నంగా చేయమని మీకు సూచిస్తున్నాను. సలఫ్ సాలిహీన్ (ఉత్తమ పూర్వీకులు) తమ బూట్ల లేసులు తెగి పోయినా, పరిష్కారం కొరకు అల్లాహ్ నే ప్రార్థించి, తమ ప్రయత్నం మొదలు పెట్టేవారు. వారి హృదయాలు అల్లాహ్ పట్ల ఎంత అపారమైన విశ్వాసంతో నిండి ఉండేవో దీన్ని బట్టి తెలుస్తున్నది. తమ వ్యవహారాలన్నింటినీ అల్లాహ్‌కు అప్పగించే వారు మరియు పూర్తిగా అల్లాహ్ పైనే ఆధారపడేవారు. అల్లాహ్ ప్రకటన:
{إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ} الفاتحة: ٥
[మేము కేవలం నిన్ను మాత్రమే ఆరాధిస్తాము మరియు సహాయం కోసం మేము కేవలం నిన్ను మాత్రమే అర్థిస్తాము] 1:5
మనం కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తాము. ఆయన సహాయాన్ని కోరకుండా మనం ఆయనను ఆరాధించలేము. ఈ రెండు పదబంధాలను కలిపే అంశం ఇది: [మేము కేవలం నిన్ను మాత్రమే ఆరాధిస్తాము మరియు సహాయం కోసం మేము కోవలం నిన్ను మాత్రమే అర్థిస్తాము]. కాబట్టి, ప్రతి ముస్లిం తనకు ఆరాధనలో సహాయం చేయమని అల్లాహ్ ను అర్థించాలి.
దుఆ కూడా ఒక రకమైన ఆరాధన కాబట్టి, అల్లాహ్ సహాయం లేకపోతే, మనం ఆయనను వేడుకోలేము అంటే దుఆ చేయలేము.
అల్లాహ్ స్వయం సంపన్నుడు. కాబట్టి, ఆయన ఆధీనంలో లేని దానిని మీరు ఆయనను అడగకూడదని మీరు అనుకోకూడదు.
అల్లాహ్ అమిత దయాళువు. కాబట్టి, తన లోభత్వం వలన మీకు ఆయన ప్రసాదించకుండా ఉండ వచ్చనే ఆలోచనతో మీరు ఆయను వేడుకోవడం నుండి దూరం కాకూడదు.
అల్లాహ్ మాత్రమే సర్వశక్తిమంతుడు. కాబట్టి, మీరు ఆయన అధికార పరిధిలో లేని దాని కోసం మరియు మీకు ఇవ్వలేని దానిని ఆయనతో అడగ కూడదని మీరు అస్సలు సంకోచించకూడదు. సృష్టిలోని ప్రతిదీ ఆయన ఆధీనంలోనే ఉన్నది, ప్రతిదీ ప్రసాదించగల సమర్ధత ఆయనకు ఉన్నది.
కేవలం అల్లాహ్ మాత్రమే మన ప్రార్థనలకు జవాబు ఇచ్చే శక్తీ మరియు సామర్ధ్యం కలిగి ఉన్నాడు. తనను పిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన స్పందిస్తాడు. దుఆ చేస్తున్నది ఎవరు, వారు ఏ పరిస్థితిలో ఉన్నారనే దాంతో సంబంధం లేకుండా ఆయన ప్రతిస్పందన అందరికీ సమగ్రంగా ఉంటుంది. దుఆకు జవాబు ఇస్తానని ఆయన చేసిన వాగ్దానం సాధారణంగా అందరికీ వర్తిస్తుంది. అంతే గాక, దుఆకు జవాబు ఇవ్వడంలో, తనకు మరియు తాను నియమించిన చట్టాలకు విధేయత చూపే వారికి ఆయన కొంత ప్రాధాన్యత నిస్తాడు. సృష్టిరాశుల నుండి ఏ మాత్రం ఆశించకుండా, అల్లాహ్ తో తన ఆశ, నిరీక్షణ మరియు భయభీతితో తమ బంధాన్ని ఏకీకృతం చేసిన వారికి ఆయన ప్రత్యేకంగా ప్రతిస్పందిస్తాడు.
అల్లాహ్ అపారమైన దయగలవాడు మరియు సర్వశక్తిమంతుడు. అందువల్ల, అత్యంత దారుణమైన పరిస్థితుల్లోనూ నిరాశకులోను కాకండి. అల్లాహ్ వాగ్దానాన్ని విశ్వసించండి. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఎంతో ఉదారుడు, సర్వసంపన్నుడు, సమర్థుడు మరియు ప్రతిస్పందించేవాడు. ఆయన అన్నింటిపై సమర్ధుడు. ఏదీ ఆయనను అసమర్ధునిగా మార్చదు. ఆయన స్థంభాలు లేకుండా ఆకాశాన్ని నిలబెట్టాడు. అసమర్థత మరియు సోమరితనం ఆయనను అధిగమించదు. ఏదైనా జరగాలంటే, ఆయన కేవలం ఇలా నిర్దేశిస్తాడు: “అయిపో!” అంతే, అది అయిపోతుంది. ఏదైనా పూర్తి చేయడానికి, ఆయనకు తన పేదల నుండి మరియు శక్తి లేని బానిసల నుండి ఎలాంటి మద్దతూ అక్కర లేదు.
ఒక ప్రామాణికమైన హదీథు ఖుద్సీలోని అల్లాహ్ ప్రకటన: “ఓ నా దాసులారా! మీలో నుండి అంటే మొత్తం జిన్నాతులు మరియు మానవులలో మొట్టమొదటి వాని నుండి చిట్టచివరివాని వరకు అందరూ ఒకచోట నిలబడి, తమ అవసరాలన్నీ నా వద్ద మొరపెట్టుకున్నా, నేను వాటన్నింటినీ తీర్చినా, అది నా దగ్గర ఉన్న దాంట్లో నుండి కొంచెం కూడా తగ్గించదు – సూదికి అంటుకునే సముద్రపు నీరంత కూడా తగ్గించదు“.[2]
మానవజాతి మరియు జిన్నాతులలో నుండి గతంలో జన్మించిన మరియు రాబోయే కాలంలో జన్మించబోయే వారందరూ ఒకే చోట, ఒకే సమయంలో సమావేశమై తమ రకరకాల అవసరాలు తీర్చమని అల్లాహ్ ను కోరినట్లయితే, ఆయన వారి అవసరాలన్నింటినీ తీర్చినా, అది ఆయన స్వాధీనంలో ఉన్నదాని నుండి దేనినీ తగ్గించదు. అల్లాహ్ యొక్క మహాశక్తి, మహాసామ్రాజ్యం మరియు మహాసంపద ఎంత పరిపూర్ణంగా ఉన్నాయో ఊహించండి. అవి ఎన్నటికీ తరగనివి. ఇబ్న్ రజబ్ ఇలా పలికారు: “అల్లాహ్ ను మాత్రమే అర్థించమని మరియు వారి అవసరాలను ఆయనకు మాత్రమే అప్పగించమని ఈ హదీథు దాసులను ప్రేరేపిస్తున్నది.”[3]
ఒకవేళ మీ వద్ద లెక్కించలేనన్ని అవసరాలు ఉండి, సంకోచం వలన వాటిలో నుండి దేనినైనా తీర్చమని అల్లాహ్ ను అడగలేకపోతే, ఆయన మీ అవసరాలన్నింటినీ తీర్చలేడని భావించడం సరికాదు. కొన్ని పరిమిత అవసరాలను మాత్రమే తీర్చమని అల్లాహ్‌ను అడగకండి, కానీ మీ ఆశయాలన్నింటినీ, అవసరాలన్నింటినీ, అభిలాషలన్నింటినీ ఆయన వద్ద మొరపెట్టుకోండి. ఆయన చేతులు రాత్రింబవళ్ళంతా దాతృత్వంలో నిరంతరం పాలు పంచుకుంటూ ఉంటాయి మరియు ఆయన ఆశీర్వాదాల నిక్షేపాలు ఎన్నటికీ తరగనివి. ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ సర్వసంపన్నుడు, అనంతమైన దయగలవాడు మరియు అన్నింటికీ ప్రతిస్పందించేవాడు అనే వాస్తవాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. దేనినీ ఆయన కొరకు అసాధ్య మైనదిగా మరియు ఆయన శక్తికి మించినంత పెద్దదిగా భావించవద్దు. అల్లాహ్ ఎల్లప్పుడూ ప్రతిస్పందిస్తాడు, అయితే మనం దుఆలతో తనను ఆరాధించాలనేదే ఆయన కోరిక. దుఆ అనేది మనపై ఉన్న అల్లాహ్ యొక్క అనుగ్రహాలలో ఒక గొప్ప అనుగ్రహం. ప్రతి ఒక్కరికీ తమ మనసులోని భావాలను తమకు నచ్చిన పదాలలో వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉన్నది. దుఆ కోసం, అల్లాహ్ ఏదైనా నిర్దిష్ట భాషను లేదా అనర్గళంగా ఉచ్చరించబడిన పదబంధాలను మాత్రమే వాడమని ఆజ్ఞాపించ లేదు. దుఆ చక్కగా అమర్చబడిన పదాలతో, మంచి శైలిలో ఉచ్చరించాలని కూడా అల్లాహ్ ఆదేశించలేదు. అంతిమ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) నిర్దేశించిన దుఆల మర్యాదలను మనం పాటిస్తే చాలు, అల్లాహ్ మన దుఆకు జవాబిచ్చే అవకాశం ఉంది. అయితే, ఖుర్ఆన్ & సున్నతులలో పేర్కొన బడిన దుఆలను ఉచ్ఛరించడం అభినందనీయం.
లుక్మాన్ తన కుమారునితో ఇలా పలికినాడు: “ఓ నా కుమారుడా! నీ నాలుకను క్షమాపణ కోరడాన్ని అలవాటు చేసుకోనివ్వు, ఎందుకంటే అల్లాహ్ కొన్ని నిర్ణీత సమయాల్లో తనను ఎవరైనా ఏదైనా కోరితే దానిని తిరస్కరించ కూడదని నిర్ణయించాడు.”[4]
క్రింది ఆయతు తౌహిద్ (ఏకధర్మం) మరియు ఇస్తిగ్ఫార్ (క్షమాపణ కోరడం) రెండింటినీ కలిగి ఉంది.
{فَٱعْلَمْ أَنَّهُۥ لَآ إِلَـٰهَ إِلَّا ٱللَّهُ وَٱسْتَغْفِرْ لِذَنۢبِكَ} محمد: ١٩ 47:19
[కాబట్టి, (ఓ ప్రవక్తా!) బాగా తెలుసుకో! అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన వాడెవ్వడూ లేడు మరియు నీ లోపాలను క్షమించమని వేడుకో.]
అందువలన, దుఆ తౌహిద్ తో దగ్గరి సంబంధం కలిగి ఉంది. పరిపూర్ణ హృదయంతో అల్లాహ్‌కు మాత్రమే కట్టుబడిన ప్రతి ఒక్కడూ తన ఆశయాలను సాధిస్తాడు. తౌహిద్ పేరుతో అల్లాహ్ ను అడగడం మరియు వేడుకోవడమే ఉత్తమం, అల్లాహ్ ప్రకటన:
{رَّبَّنَآ إِنَّنَا سَمِعْنَا مُنَادِيًۭا يُنَادِى لِلْإِيمَـٰنِ أَنْ ءَامِنُوا بِرَبِّكُمْ فَـَٔامَنَّا ۚ رَبَّنَا فَٱغْفِرْ لَنَا ذُنُوبَنَا وَكَفِّرْ عَنَّا سَيِّـَٔاتِنَا وَتَوَفَّنَا مَعَ ٱلْأَبْرَارِ} آل عمران ١٩٣
[ఓ మా ప్రభూ! నిశ్చయంగా మేము ఎలుగెత్తి పిలిచే ఒకతనిని విన్నాము –అతను విశ్వాసం వైపునకు పిలుస్తున్నాడు–‘మీ ప్రభువును విశ్వసించండి’ అని. అంతే, మేము విశ్వసించినాము. ఓ మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మా పాపాలను క్షమించు. మా చెడులను మా నుంచి దూరం చేయి. మరియు సజ్జనులతో పాటు మాకు మృత్యువును ప్రసాదించు.] 3:193
ఈ ఆయతులో, వారు తమ ఈమాన్ (విశ్వాసం) మరియు తౌహీద్ పేరిట అల్లాహ్‌ను క్షమాపణ అర్థించారు. ఖుతైబా బిన్ ముస్లిం తన దండయాత్రలో ఒట్టోమన్ల (ottomans) వద్దకు వెళ్ళినప్పుడు, అతను వారిని చూసి చాలా భయపడ్డాడని ఉల్లేఖించ బడినది. వెంటనే అతను మహమ్మద్ బిన్ వాసీ ఎక్కడ ఉన్నాడని ఆరా తీశారు. అతను కుడివైపు సైన్యపటాలంలో తన విల్లుపై ఆనుకుని స్వర్గం వైపు చేతివేళ్లను పైకి లేపి ఉన్నాడని (దుఆలో నిమగ్నమై ఉన్నాడని) అతనికి తెలియ జేయబడింది. దీనిని చూసిన ఖుతైబా ఇలా అన్నారు: “ఆ వేళ్లు నాకు మెరిసే ఖడ్గాలతో తయారుగా ఉన్న లక్ష మంది ధైర్యవంతులైన వీరయువకుల కంటే ఎక్కువ ఆదరణీయమైనవి.”[5]
దుఆ అనేది నిజమైన శక్తి మరియు సామర్ధ్యము యొక్క ప్రధాన మూలం. నిరంకుశుడు ఎంత బలవంతుడు, క్రూరుడు, రాక్షసుడు, కిరాతకుడు, ఉగ్రుడు మరియు వెర్రి ఆవేశం గలవాడు, ఉన్మాదుడు అయినా సరే, అతడు తన ద్వారా దౌర్జన్యానికి గురైన ఒక బాధితుడు స్వర్గం వైపు చేతులు ఎత్తడం చూసి గాభరా పడి పోతాడు మరియు బెంబేలెత్తి పోతాడు. ఇది అతడిని విస్మయంతో మరియు భయంతో అర్ధం పర్థం లేకుండా మూర్ఖంగా ప్రవర్తించే వాడిగా చేస్తుంది. ఎందుకంటే అతడి బాధితుడు తన ప్రార్థనలో అతడి గురించి ఏమి ఫిర్యాదు చేస్తున్నాడో అతడికి తెలియదు. అంతేగాక, అణచివేతకు గురైన బాధితుల ప్రార్థనలకు ప్రత్యేకంగా ప్రతిస్పందించే ప్రభువు ఉన్నాడనే వాస్తవం అతడికి ఖచ్చితంగా తెలుసును.
దుఆ యొక్క ప్రాముఖ్యత
దుఆ అనేది అల్లాహ్ యొక్క అపారమైన ఆశీర్వాదాలలో ఒకటి అని గ్రహించిన వారు అత్యంత ఎక్కువగా అనుగ్రహించబడిన వారని గ్రహించండి. అల్లాహ్ మీకు దుఆ చేసే అనుగ్రహం ప్రసాదించి, మీకు గొప్ప ఉపకారం చేసాడనే ఈ వాస్తవాన్ని మీరు గ్రహించినప్పుడు, మీ అవసరాలు తీరక పోయినా మీరు ప్రార్థిస్తారు. ఎందుకంటే అది అల్లాహ్ మీకు దగ్గరగా ఉన్నాడని మరియు ఇతరులకు ప్రసాదించని దానిని మీకు ప్రసాదించాడనే భావనను మీలో కలిగిస్తుంది.
మీరు దుఆ చేసినప్పుడు, నిశ్చయంగా అల్లాహ్ మీ దుఆ వింటాడనే భావన మీలో చాలా గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. తమ దుఆలకు జవాబు లభిస్తుందనే మరియు అల్లాహ్ తమ పిలుపును వింటాడనే అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్నవారు చాలా ధన్యులు. మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
{ قَدْ سَمِعَ ٱللَّهُ قَوْلَ ٱلَّتِى تُجَـٰدِلُكَ فِى زَوْجِهَا} المجادلة: ١
[(ఓ ప్రవక్తా!) తన భర్త విషయమై నీతో వాదిస్తూ, అల్లాహ్ కు ఫిర్యాదు చేసుకుంటూ ఉన్న ఆ స్త్రీ మాటను అల్లాహ్ విన్నాడు. ఇంకా, అల్లాహ్ మీరిద్దరి మధ్య జరిగిన సంవాదనను (కూడా) విన్నాడు. నిశ్చయంగా అల్లాహ్ (అంతా) వినేవాడు, చూసేవాడు.] 58:1
అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “దుఆ అంటే ఆరాధన” అని అన్నారనే అన్-నోమన్ బిన్ బషీర్ (అల్లాహ్ అతనిపై దయజూపు గాక) ఉల్లేఖన ప్రకారం దుఆ అనేది ఒక ఆరాధన. తరువాత ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ ఆయతును పఠించారు:
{وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكم} غافر:٦٠
[మరి మీ ప్రభువు ఏమంటున్నాడంటే, “మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను.”] 40:60[6]
దుఆ మిమ్మల్ని శత్రువుల బారి నుండి మరియు కష్టాల బారి నుండి రక్షించే ఒక కవచం వంటిది. అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “నాలుగు విషయాలకు వ్యతిరేకంగా అల్లాహ్ వద్ద శరణు వేడుకోండి. అవి గందరగోళం, దురదృష్టాల దాడులు, చెడు వైపుకు తీసుకు పోయే వాటికి వ్యతిరేకంగా మరియు శత్రువుల హానికరమైన ఆనందానికి వ్యతిరేకంగా ఆశ్రయం పొందండి.”[7]
ఈ హదీథుపై వ్యాఖ్యానిస్తూ, షేక్ ఇబ్న్ బాజ్ రహిమహుల్లా ఇలా అన్నారు: “ఈ విపత్తుల నుండి వాటి హానికరమైన ప్రభావాలను నివారించడానికి అల్లాహ్ వద్ద శరణు వేడుకోవాలి.”
“దురదృష్టాల దాడులు” అనే పదానికి దురదృష్టం మరియు దుఃఖం కలిగించే, పాపాలు మరియు షిర్క్‌ల అగాధానికి నెట్టివేసే కొన్ని చెడుల దాడులు అని అర్థం. అల్లాహ్ మనల్ని రక్షించుగాక!
మనిషి విమోచన మార్గాలను ఆశ్రయిస్తాడు మరియు సంభవించే దుఃఖం, అయాచిత దురదృష్టం, శత్రువుల ప్రాణాంతక వినోద క్రీడలు మరియు చెడుకు గురి కావడానికి వ్యతిరేకంగా అల్లాహ్ ను ఆశ్రయిస్తాడు. ఇది ఒక విశ్వాసి యొక్క లక్షణం. అతను భద్రత కోసం తన ప్రభువును వేడుకుంటాడు. అతనికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు, శత్రువులు సంతోషంతో ఉప్పొంగిపోతూ, అతడిని ఎగతాళి చేస్తారు. ఈ కారణంగా, అతను తనకు ఎదురయ్యే కష్టాలు లేదా విపత్తుల నుండి భద్రత పొందడం కోసం ప్రయత్నిస్తాడు. అదేవిధంగా, అల్లాహ్ నిషేధించిన పాపకార్యాలు మరియు నిషేధించబడిన విషయాల గుంటలో తనను నెట్టి వేసే గందరగోళానికి, అరాచకాలకు వ్యతిరేకంగా అతను అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటాడు. అందువల్ల, అలాంటి పాపాలు, చెడులు మరియు శత్రువుల పరిహాసాన్ని ప్రేరేపించే దురదృష్టాల వంటి వాటి యొక్క ఘోరమైన పరిణామాలను నివారించడానికి ఒక విశ్వాసి ఈ వినాశకరమైన కష్టాల నుండి అల్లాహ్‌ను ఆశ్రయిస్తాడు. తనపై దురదృష్టాన్ని తెచ్చే అల్లాహ్ నిషేధించిన విషయాలలో పాల్గొనకుండా అతను అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటాడు. చెడు మరియు మంచి విధిని నిర్ణయించేవాడు అల్లాహ్ మాత్రమే. విధేయత మరియు అవిధేయత యొక్క చర్యలు కూడా సర్వశక్తిమంతుడైన అల్లాహ్ చే ఉద్దేశించబడ్డాయి. అందువల్ల, ఎల్లప్పుడూ విశ్వాసి తనను పాపాలు, చెడులు మరియు షిర్క్ చర్యల బురదలో పడేసే దురదృష్టం నుండి తనను రక్షించమని తన ప్రభువును కోరుకుంటూ ఉంటాడు. అల్లాహ్ మనల్ని రక్షించుగాక![8]
దుఆ అన్ని విషాదాలను విడుదల చేయడానికి మరియు పూర్తి చేయని వాటిని పూర్తి చేయడానికి ఒకరి హృదయాన్ని తెరుస్తుంది. ఒకరి దుఆ పూర్తి కాకపోయినా, అల్లాహ్ “సర్వశక్తిమంతుడు, సర్వసంపన్నుడు, దుఆలు వినేవాడు, అమితమైన దయగలవాడు” అని గ్రహించడం ద్వారా అతని హృదయం సంతృప్తి మరియు ప్రశాంతతలతో నిండిపోతుంది. అందువలన, అల్లాహ్ ను ఆశ్రయించడానికి, సర్వశక్తిమంతుడి మహిమ, ఆయన ప్రతిస్పందనపై విశ్వాసాన్ని కలిగించడానికి మరియు అల్లాహ్ నిర్ణయం మరియు దైవిక ఆశీర్వాదంతో సంతృప్తి చెందడానికి దుఆ ఒక స్వచ్ఛమైన సాధనం. దుఆ యొక్క అలాంటి అంశాలన్నీ ప్రశాంతత మరియు ప్రసన్నతల భావాన్ని కలిగిస్తాయి. మీ కోసం ఈ బాధను నిర్ణయించిన మహాశక్తి తెలివిగా అన్ని వ్యవహారాలను నిర్వహిస్తాడని మరియు ప్రతిదీ ఆయనకు తెలుసని మీకు అచంచలమైన విశ్వాసం ఏర్పడినప్పుడు కొన్నిసార్లు మీరు మీ బాధలో కూడా ఆనందాన్ని అనుభవిస్తారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ఒక ముస్లిం, పురుషుడు లేదా స్త్రీ, తన జీవితం, ఆస్తి మరియు సంతానం విషయంలో ఎటువంటి పాపపు చర్యలు లేకుండా అల్లాహ్ ను ఎదుర్కొనే వరకు బాధను అనుభవిస్తూనే ఉంటాడు“.[9]
అందువలన, మీరు ఓర్పు, సంతృప్తి, ప్రార్థన మరియు విశ్వాసానికి కట్టుబడి ఉంటే, మరింత ఎక్కువగా అల్లాహ్ మీకు తన ప్రతిఫలాన్ని అందించడానికి మీ కొరకు బాధలను (పరీక్షలను) నిర్ణయిస్తాడు.
దుఆ అనేది మిమ్మల్ని మీ ప్రియమైనవారికి దగ్గరగా నడిపిస్తుంది. ప్రశాంతత మరియు ప్రసన్నతలతో మిమ్మల్ని నింపుతుంది. ఇది ఆప్యాయతతో నిండిన తల్లి యొక్క వెచ్చని, సుఖప్రదమైన ఒడిలో హాయిగా పడుకొని ఉన్న శిశువు వలె మీకు ప్రశాంతతను ఇస్తుంది. కాబట్టి, మీ కోసం దుఆ చేసే మీ శ్రేయోభిలాషి ఉపకారాన్ని మీరు తప్పక అంగీకరించాలి. మనం ప్రార్థన చేసిన తర్వాత మనల్ని సంతుష్టత, పారవశ్యం మరియు సంతృప్తితో నింపడానికి సర్వశక్తిమంతుడు తన అద్భుతమైన కారుణ్యాన్ని పంపుతాడు. మన కోరికలు పూర్తికాక పోయినా, దుఆ మన హృదయాలను సంతృప్తి మరియు ఆనందంతో నింపుతుంది.
మీ కష్టాల గురించి మీరు ఎవరి ముందైనా ఏకరువు పెట్టినప్పుడు, అది మీకు అవమానకరంగా అనిస్తుంది. అతను మీ సమస్యను పట్టించు కోవచ్చు లేదా దాన్ని పరిష్కరించేందుకు శ్రద్ధ చూపకపోవచ్చు లేదా బిజీగా, తీరిక లేకుండా ఉన్నట్లు నటించవచ్చు. మీ సమస్యను పరిష్కరించడంలో అతను మీకు సహాయపడవచ్చు లేదా సహాయం చేయకపోవచ్చు. ఒకవేళ అతని ద్వారా మీకు ఒక పరిష్కారం లభించినా, అది కావలసిన స్థాయిలో ఉండక పోవచ్చు. కానీ, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ వద్ద సహాయం అర్థించడం అనేది దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. మీరు ఆయనను వేడుకున్నప్పుడు, మీ హృదయం సంతృప్తితో నిండిపోతుంది. అల్లాహ్ తనను అర్థించే వారిని ప్రేమిస్తాడు మరియు మీరు ఆయనను అర్థించకపోతే ఆయన కోపంగా ఉంటాడు. దీనిని ఒక అరబ్ కవి ఇలా ఉదహరించాడు:
మీరు అల్లాహ్ ను అర్థించకపోతే, అల్లాహ్ కు కోపం వస్తుంది. దీనికి విరుద్ధంగా, మీరు మానవులను అడిగితే, వారికి కోపం వస్తుంది.
అన్నింటి కంటే మించి, అల్లాహ్ మీ కోసం ఎంచుకున్నది మీ కొరకు ఖచ్చితంగా అనుకూలంగా, సౌలభ్యంగా ఉంటుందని మీరు విశ్వసించి నప్పుడు, అది మిమ్మల్ని ప్రశాంతత మరియు స్థిమితత్వం, ఉపశమనం, నిశ్చలత స్థితికి చేర్చుతుంది.
దుఆ అల్లాహ్ పై నమ్మకాన్ని సూచిస్తుంది. ఎందుకంటే అతను అల్లాహ్ వైపు చేతులు ఎత్తినప్పుడు, అది అల్లాహ్ పై అతనికి ఉన్న గట్టి నమ్మకాన్ని సూచిస్తుంది.
ఎవరైనా తన మనస్సు, ఆస్తి, పిల్లలు మరియు కష్టతరమైన పరిస్థితుల పరంగా బాధపడినప్పుడు, అతడు తన బాధలను మానవ దృక్పథంతో కొలిచినప్పుడు అతను నిరాశకు గురవుతాడు. ఈ దుర్భరమైన పరిస్థితిలో, అతను అల్లాహ్‌ను ఆశ్రయిస్తాడు, అల్లాహ్ తన కోసం ఏదైతే నియమించాడో అది మానవ కొలతలతో కొలవ లేనంతగా తనకు అనుకూలంగా ఉంటుందని, ప్రకృతి నియమాలు దైవిక రాజ్యానికి వర్తించవని తన అచంచలమైన విశ్వాసంతో ఆయనను వేడుకుంటున్నాడు. సర్వశక్తిమంతుడు, విశ్వం యొక్క అన్ని వ్యవహారాలను నిర్వహించేవాడైన అల్లాహ్ ఏదైనా ఉనికిలోకి రావాలని కోరుకుంటే, కేవలం “అయిపో” అని అంటాడు మరియు వెంటనే అది ఉనికిలోకి వచ్చేస్తుంది. అలాంటి భావన అతని హృదయాన్ని అల్లాహ్ పై సంపూర్ణమైన విశ్వాసంతో మరియు దృఢమైన నమ్మకంతో పొంగిపొయేలా చేస్తుంది మరియు అతడిని దుఆ కోసం తన రెండు చేతులు పైకి ఎత్తేలా చేస్తుంది.
ఒకవేళ మీరు రెండు నెలల పాటు పూర్తిగా మంచాన పడిన రోగి అయినా, మీరు మీ కుటుంబానికి భారంగా మారినట్లు భావించినా మరియు మీ వైద్యుడు మీరు కోలుకునే అవకాశం లేదని తన మానవ దృక్పథంతో, వైద్యపరిజ్ఞానంతో మిమ్మల్ని కలవరపెట్టినా, మీరు కృంగిపోకూడదు. బదులుగా మీ హృదయాన్ని మీరు భూమ్యాకాశాల వ్యవహారాలన్నింటినీ నిర్వహించే వానితో మరియు ఎవరి గురించైతే ఖుర్ఆన్ లో ఇలా చెప్పబడిందో ఆ అల్లాహ్ తో జత చేసుకోవాలి:
{وَإِذَا مَرِضْتُ فَهُوَ يَشْفِينِ} الشعراء: ٨٠
[“నేను జబ్బు పడినప్పుడు, ఆయనే నన్ను నయం చేస్తున్నాడు“.] 26:80
అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అల్లాహ్ ఏదైనా వ్యాధిని దాని నివారణను పంపకుండా పంపలేదు.”[10]
ఎవరి గురించి అయితే స్వచ్ఛమైన ఆలోచనలు కలిగి ఉండటమనేది ఉత్తమ ఆరాధనలో భాగంగా పరిగణించబడుతుందో, ఎవరి కారుణ్యం ఆరాధనలకు ప్రతిస్పందిస్తుందో, ఎవరైతే కేవలం “అయిపో” అనగానే ఉనికి లోనికి తీసుకు రాగల మహాశక్తి కలిగి ఉన్నాడో, ఎవరైతే అన్ని రకాల చెడులను నిర్మూలించగలడో, ఎవరైతే సృష్టి మొత్తం పై సాటిలేని వాడుగా ఉన్నాడో, ఎవరినైతే భూమ్యాకాశాలలోని ఏ శక్తీ అధిగమించలేదో, ఆ మహాశక్తిమంతుడితో మీరు మీ హృదయాన్ని తప్పకుండా జోడించాలి.
మీరు అల్లాహ్ తో వేడుకున్నప్పుడు, మీరు మహిమాన్వితుడు, సకల లోకాల సార్వభౌముడు, అద్భుతమైన సంపన్నుడు మరియు అపారమైన దయగల వాడితో వేడుకుంటున్న భావనలతో మీరు ఉన్నతమైన అనుభూతి పొందుతారు. మీరు అలాంటి అద్భుతమైన అస్తిత్వంతో జతకట్టిన తరువాత, మీ ఆత్మను జడగా మరియు నిస్సత్తువగా మార్చగలవారు ఇంకెవరు ఉంటారు? ఇది మీ ఆధ్యాత్మికతలో మరియు ధైర్యంలో ఉన్నతమైన అనుభూతిని కలిగిస్తుంది, ఉత్కృష్టతకు చేర వేస్తుంది మరియు ఉత్తమమైన వాటిని సాధించాలని ఆకాంక్షిస్తుంది. దుఆ చేసే వ్యక్తి, తన అన్ని వ్యవహారాలలో అతనికి సహాయపడే స్థిరమైన మహాశక్తిలో ఆశ్రయం పొందుతాడు. ఇక అతడు జీవుల నుండి ఏమీ ఆశించడు.
ఇబ్న్ తైమియా ఇలా అన్నారు: “ఎవరైనా సర్వశక్తిమంతుడి అనుగ్రహం మరియు ఆశీర్వాదంపై మంచి ఆశను కలిగి ఉంటే మరియు ఆయన మాత్రమే తన అవసరాలను తీర్చగలడు అనే దృఢనమ్మకం కలిగి ఉంటే, అది అతడిని దృఢంగా అల్లాహ్ కు అంకితం చేస్తుంది మరియు జీవుల బానిసత్వం నుండి అతడిని విముక్తి చేస్తుంది. అందువల్ల, జీవులపై ఒకరి ఆశ అతడిని వారికి లోబడేలా చేస్తుంది, అయితే సర్వశక్తిమంతుడిపై అతడి ఆశ అతని హృదయాన్ని ఐశ్వర్యంతో, ప్రశాంతతో నింపుతుంది.”[11]
దుఆ ప్రతిస్పందించ బడటానికి అవసరమైన అన్ని నిబంధనలకు అనుగుణంగా ఒకరి దుఆ ఉన్నప్పుడు, అతడి దుఆ పుష్కలమైన ఫలాలను మరియు ఆశీర్వాదాలను ఇస్తుందని అల్లాహ్ హామీ ఇచ్చాడు.
అబూ సయీద్ అల్-ఖుద్రీ ఉల్లేఖన: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా పలికారు, “ఏ ముస్లిం అయినా పాపం లేదా రక్తబంధాన్ని విచ్ఛిన్నం చేసేదేదీ లేని దాని కొరకు దుఆ చేస్తే, మూడు విషయాలలో ఒక దానిని అల్లాహ్ అతడికి ప్రసాదిస్తాడు: వెనువెంటనే దానిని అతడికి ప్రసాదిస్తాడు, లేదా అతడి దుఆకు బదులుగా అతడి కొరకు పరలోకంలో ప్రతిఫలాన్ని భద్ర పరుస్తాడు లేదా అతడి నుండి సమానమైన చెడును దూరం చేస్తాడు.” అది విన్న వారు వెంటనే తాము చాలా దుఆలు చేస్తామని చెప్పారు. దానికి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు అడిగే దాని కంటే అధికంగా సమాధానం ఇవ్వడానికి అల్లాహ్ సిద్ధంగా ఉన్నాడని జవాబిచ్చారు.[12]
ఏ వ్యక్తి అయినా తనకు అవసరమైనన్ని దుఆలు చేయవచ్చు. ఎంత ఎక్కువగా ప్రార్థిస్తే, అల్లాహ్ అంత ఎక్కువగా ప్రసాదిస్తాడు మరియు ఆయన యొక్క మహాఖజానాకు ఎలాంటి కొరతా ఉండదు.
అతని దుఆలో పాపాత్మకమైన అంశాలు లేదా రక్తసంబంధాలను విచ్ఛిన్నం చేసే అంశాలు లేనట్లయితే అతని దుఆకు జవాబు ఇవ్వబడుతుందని ఈ హదీథు హామీ ఇస్తున్నది. అతని దుఆకు ఈ మూడింటిలో ఒక జవాబు ఇవ్వబడుతుంది. దుఆ ఎల్లప్పుడూ అతనికి శుభాల్నే అందజేస్తుంది. మొదటిది దుఆకు తక్షణమే జవాబు లభిస్తుంది. రెండవది అతని దుఆకు జవాబు కొంత కాలం వరకు వాయిదా వేయబడుతుంది. ఇక మూడవది దుఆ అతని నుండి చెడును లేదా బాధను దూరం చేస్తుంది, ఇది అతని అవసరాల్ని పూర్తి చేసుకోవడం కంటే చాలా మెరుగైనది. కొన్నిసార్లు అతని దుఆ అతని నుండి ఏదైనా హానికరమైన చెడును దూరం చేసిందనే విషయం తెలియక, తన దుఆకు జవాబు లభించలేదని ఎవరైనా భావించవచ్చు. ఇది ముస్లింల దుఆ ఎన్నడూ వ్యర్థం కాదని సూచిస్తుంది, బదులుగా అది సర్వశక్తిమంతుడి దయతో వెంటనే లేదా ఆలస్యంగా జవాబు తీసుకు వస్తుంది. కాబట్టి, విశ్వాసి ఎట్టి పరిస్థితుల్లోనూ తన ప్రభువును అడగడం మానుకోకూడదు. అల్లాహ్ ప్రకటన:
{وَإِذَا سَأَلَكَ عِبَادِى عَنِّى فَإِنِّى قَرِيبٌ} البقرة: ١٨٦
[నా దాసులు నా గురించి నిన్ను అడిగినప్పుడు, (వారితో చెప్పు) నిశ్చయంగా నేను వారికి సమీపంలోనే ఉన్నాను.] 2:186
ఇతర ఆయతులకు భిన్నంగా, ఈ ఆయతులో సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా ప్రకటించాడు: “నా దాసులు నా గురించి అడిగినప్పుడు, నిశ్చయంగా నేను వారికి సమీపంలోనే ఉన్నాను.” మరోవైపు, చాలా ఆయతులలో, వారు అడిగినప్పుడు, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ దీనికి భిన్నంగా సమాధానం చెప్పాడు. ఉదాహరణకు, ఈ ఆయతులు చూడండి:
{وَيَسْـَٔلُونَكَ عَنِ ٱلْيَتَـٰمَىٰ ۖ قُلْ إِصْلَاحٌۭ لَّهُمْ خَيْرٌۭ} البقرة: ٢٢٠
[మరియు వారు నిన్ను అనాథల గురించి ప్రశ్నిస్తున్నారు. వారికి చెప్పు “వారి వ్యవహారాలు చక్కదిద్దటమే ఉత్తమమైనది.] 2:220
{وَيَسْـَٔلُونَكَ عَنِ ٱلْمَحِيضِ ۖ قُلْ هُوَ أَذًۭى فَٱعْتَزِلُوا ٱلنِّسَآءَ فِى ٱلْمَحِيضِ وَلَا تَقْرَبُوهُنَّ حَتَّىٰ يَطْهُرْنَ} البقرة: ٢٢٢
[మరియు వారు నిన్ను ఋతుస్రావం (బహష్టు) గురించి ప్రశ్నిస్తున్నారు. వారితో చెప్పు: “అదొక అశుద్ధ స్థితి. కాబట్టి ఋతుస్రావంలో ఉన్నప్పుడు, స్త్రీల నుండి మీరు వేరుగా ఉండండి. మరియు దాని నుండి పరిశుద్ధులు కానంత వరకు వారిని సమీపించకండి. ఎప్పుడైతే పరిశుద్ధులవుతారో, అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ఆదేశించిన స్థానం నుండి వారిని సమీపించండి.] 2:222
{وَيَسْـَٔلُونَكَ عَنِ ٱلرُّوحِ ۖ قُلِ ٱلرُّوحُ مِنْ أَمْرِ رَبِّى} الإسراء: ٨٥
[వారు ఆత్మను గురించి నిన్ను ప్రశ్నిస్తున్నారు. “ఆత్మ నా ప్రభువు ఆజ్ఞతో (ముడిపడి) ఉంది. మీకు ఒసగబడిన జ్ఞానం బహుస్వల్పం” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.] 17:85
ఇప్పుడు ఈ ఆయతును మరలా పరిశీలించడం:
{وَإِذَا سَأَلَكَ عِبَادِى عَنِّى فَإِنِّى قَرِيبٌ} البقرة: ١٨٦
[నా దాసులు నా గురించి నిన్ను అడిగినప్పుడు, (వారితో చెప్పు) నిశ్చయంగా నేను వారికి సమీపంలోనే ఉన్నాను.] 2:186
దైవసామ్రాజ్యం నుండి అంటే అల్లాహ్ నుండి ప్రత్యక్ష జవాబు గురించి తెలుపుతున్న ఏకైక ఆయతు ఇది. ఇక్కడ సర్వశక్తిమంతుడే తన దాసులకు తన సాన్నిహిత్యం మరియు సత్వర జవాబును సూచించడానికి ఎటువంటి మాధ్యమం లేకుండా ప్రత్యుత్తరం ఇస్తున్నాడు.
ఓ అల్లాహ్ దాసుడా! నీవు భక్తితో అల్లాహ్‌ను ప్రార్థించినప్పుడు, నిస్సంకోచంగా నీ వ్యవహారమంతా సర్వశక్తిమంతుడికి అప్పగించు. ఆయన ఒకవేళ నీ దుఆకు వెంటనే జవాబు ఇవ్వనప్పటికీ, ఆయన నీ మనస్సుకు ఆనందాన్ని మరియు ప్రశాంతతను ప్రసాదిస్తాడు. అది నీకు నిరాశ నుండి మరియు దుఃఖం నుండి ఉపశమనం కలుగ చేస్తుంది లేదా దుఃఖాన్ని దూరం చేస్తుంది లేదా నీ కోసం ప్రతిఫలాన్ని భద్ర పరుస్తుంది. కాబట్టి, ఎల్లప్పుడూ దుఆ అనేది దాసుడికి ప్రయోజనకరంగానే ఉంటుంది.
అల్లాహ్‌ను సంవత్సరాలకు తరబడి ఏ విధమైన ప్రతిస్పందన లేక పోయినా, దుఆ చేయడం కొనసాగించే వ్యక్తులను మీరు చూసి ఉండవచ్చు. వారు తమ దుఆల ఆమోదం గురించి ఆందోళన చెందుతూ ఉంటారు, అయితే అల్లాహ్ వారి ప్రార్థన వినలేదని దీని అర్థం కాదు. ఎవరైనా తన వైపు చేతులు ఎత్తినప్పుడు అల్లాహ్ వారిని ఖాళీ చేతులతో వాపసు చేయడానికి బిడియ పడతాడు. పైన పేర్కొన్న వాటిలో మన దుఆలకు అల్లాహ్ ఖచ్చితంగా ప్రతిస్పందిస్తాడని మనం గట్టిగా విశ్వసించినప్పుడు, అన్ని నిబంధనలకు లోబడి ఉన్నప్పటికీ దుఆలకు సమాధానం లభించటం లేదని భావించే వారి పరిస్థితిని మనం అర్థం చేసుకుని, వారికి ఉపశమనం కలిగించ గలుగుతాము మరియు దాని ద్వారా మన విశ్వాసం మరింత స్థిరపడుతుంది. విశ్వాసి దుఆ ఎన్నడూ వక్రంగా పోదు, వ్యర్థం కాదు.
పూర్వకాలపు సజ్జనులలో ఒకరు (సలఫ్) ఇలా అన్నారు:
“నేను నా అవసరాన్ని తీర్చమని అల్లాహ్ ను కోరినప్పుడు మరియు ఆయన దానిని నెరవేర్చినప్పుడు, నేను ఒకసారి సంతోషిస్తాను, మరియు ఆయన వెంటనే తీర్చకపోతే, నేను మరింతగా సంతోషిస్తాను, ఎందుకంటే తరువాతది అగోచరాలన్నీ ఎరిగిన సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క ఎంపిక”.
కొందరు దుఆ చేస్తారని, ఒకవేళ వారి దుఆలకు జవాబు లభించక పోతే దుఆ చేయడమే మానేస్తారని తెలుపగా, ఇబ్న్ బాజ్ ఇలా అన్నారు:
అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: అసహనానికి లోనవకుండా ఉంటే, మీలో ప్రతి ఒక్కరి దుఆకు జవాబు లభిస్తుంది. ఇంకా ఇలా అన్నారు: నేనూ దుఆ చేస్తాను, కానీ ఒక్కోసారి దానికి జవాబు రాదు. నేను దుఆ చేస్తూనే ఉన్నాను కానీ ఇప్పటికీ దానికి జవాబు రాలేదని, చివరికి తను దుఆ చేయడం మానేస్తానని చెప్పే వ్యక్తుల విషయంలో కూడా అదే నిజం. మీరు వెనక్కి తగ్గకూడదు మరియు దుఆను విడిచి పెట్టకూడదు, బదులుగా మీరు దానిని మరింత గట్టిగా అంటి పెట్టుకుని, ఆత్మపరిశీలన చేసుకోవాలి, తమ లోపాలను సరిదిద్దుకోవాలి.[13]
అల్లాహ్ సర్వజ్ఞుడు మరియు అత్యంత వివేకవంతుడని గుర్తుంచుకోండి. ఆయన యొక్క లోతైన జ్ఞానం, మహావివేకం మీ దుఆల స్పందనను వాయిదా వేయవచ్చు. ఉదా, అతను ప్రవక్త అయినప్పటికీ, యూఖూబ్ (అలైహిస్సలాం) దుఆకు జవాబు వాయిదా వేయబడింది. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కొన్నిసార్లు తన మహావివేకంతో జవాబును వాయిదా వేస్తాడు, దానికి బదులుగా ఆయన మీకు దాని కంటే ఉత్తమమైన మరేదైనా మంచిని ఇవ్వగలడు లేదా మీ నుండి కొంత బాధను దూరం చేయగలడు. దీని గురించి ఈ హదీథులో ఇలా ఉదహరించబడింది: “ఎవరైనా ముస్లిం పాప కార్యాలు లేదా రక్తసంబంధాలు త్రెంచే విషయాలేమీ లేకుండా చేసే దుఆకు బదులుగా మూడింటిలో ఒకటి అల్లాహ్ చే ఇవ్వబడుతుంది : ఆయన అతని దుఆకు వెంటనే జవాబు ఇస్తాడు లేదా పరలోకంలో అతని కోసం దాని ప్రతిఫలాన్ని భద్రం చేస్తాడు లేదా అతని నుండి అతని దుఆకు సమానమైన చెడును దూరం చేస్తాడు.” అది విన్న వారు వెంటనే తాము చాలా అధికంగా ప్రార్థనలు చేస్తామని పలికారు. దానికి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు అడిగే దానికి వెంటనే జవాబు ఇవ్వడానికి అల్లాహ్ సిద్ధంగా ఉన్నాడని జవాబిచ్చారు.[14]
దుఆ రాబోయే కష్టాలను దూరం చేస్తుంది. ఇంకా అప్పటికే మిక్కిలి భారంగా ఉన్న అతని బాధల నుండి కూడా అతనికి ఉపశమనం ఇస్తుంది.
అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “దుఆ తప్ప దైవ శాసనాన్ని (విధివ్రాతను) ఏదీ అడ్డుకోదు“.[15]
ఈ హదీథుపై వ్యాఖ్యానిస్తూ, షేక్ ఇబ్న్ బాజ్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఈ హదీథులో ఎటువంటి వైరుధ్యం లేదు. వేదన మరియు దుఃఖం నుండి తప్పించు కోవడానికి దుఆ ఒక ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి అని ఇది సూచిస్తుంది. సర్వశక్తిమంతుడైన అల్లాహ్, వాటి కారణజన్ములతో పాటు విధిని ముందే నిర్ణయించాడు. కొన్ని గమ్యాలు మరణం మరియు వృద్ధాప్యం వంటి వాటిని ఎన్నటికీ తప్పించుకోలేవు, అయితే కొన్ని గమ్యాలు కారణానికి అనుసంధానించబడి ఉంటాయి. మనం తరచు గమనించినట్లు, కొన్నిసార్లు ఒకరి మరణం ఎక్కడికో తీసుకువెళ్ళే అతని ప్రయాణంతో ముడిపడి ఉంటుంది, అయితే కొందరు అనారోగ్యం లేదా ఏదైనా తినడం వల్ల హఠాత్తుగా మరణిస్తారు. కాబట్టి, మరణానికి ఇలాంటివి కొన్ని కారణాలు మాత్రమే. దుఆతో వాటిని దూరంగా నెట్టే అవకాశం ఉన్నది. హదీథులోని ఈ ప్రస్తావన దీనినే సూచిస్తుంది: “నైతికత తప్ప మరేదీ ఒకరి జీవిత కాలాన్ని పొడిగించదు, దుఆ తప్ప దైవిక శాసనాన్ని (విధివ్రాతను, తక్దీర్ ను) ఏదీ అడ్డుకోదు మరియు అతను చేసే పాపం తప్ప మరేదీ ఒక వ్యక్తి కొరకు అతని పోషణను కోల్పోనివ్వదు.”[16]
షేక్ సాలిహ్ అల్ ఫౌజాన్ ఇలా అన్నారు: ఒక వ్యక్తి కారుణ్యంతో దీవించబడటానికి దుఆ ఒక కారణమని ఈ హదీథు సూచిస్తుంది. కారణ వాదంతో చాలా విషయాలు అనుసంధానించబడి ఉంటాయి. కారణం ఉనికిపై ప్రభావాన్ని ఉనికిలోకి వస్తుంది. ఒక ముస్లిం దుఆ చేసినప్పుడు, అతను ఆశీర్వాదం పొందే అదృష్టవంతుడై పోవచ్చు. మరియు దుఆ చేయకపోతే, అతను బాధలలో కొట్టుమిట్టాడే వాడై పోవచ్చు. ఇంకా తన బంధువులతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటే ఒకరి జీవితాన్ని అల్లాహ్ పొడిగిస్తాడు మరియు అతను అలా చేయకపోతే అతని ఆయుర్దాయం తగ్గిపోతుంది. ప్రతిదీ అల్లాహ్ బాగా ఎరుగును![17]
షౌకాని ఇలా అన్నారు: ఒకరి దుఆ కారణంగా, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తను ముందుగా అతని కొరకు నిర్ణయించిన దురదృష్టాన్ని అతని నుండి దూరం చేస్తాడు మరియు ఇది చాలా హదీథులలో ఉదహరించబడింది.[18]
తమ పిల్లలు మరియు భార్యలు అనారోగ్యంలో మరియు కష్టాలలో భారంగా జీవితం గడుపుతున్న వ్యక్తులు ఉన్నారు, మరియు వారు కొన్ని సంవత్సరాలుగా దుఆ చేస్తూనే ఉన్నారు, అయినప్పటికీ వారి దుఆలకు జవాబు రాలేదు. మన అల్పజ్ఞాన దృష్టి కోణం వలన వారి దుఆలు ఫలించలేదని మనం అనుకుంటాము. అయినప్పటికీ, అల్లాహ్ యొక్క మహావివేకం వారి దుఆకు తక్షణమే స్పందించకూడదని నిర్ణయించుకుందని లేదా చెడును నిరోధించడం ద్వారా జవాబు ఇవ్వబడిందని లేదా కష్టాలలో అతనికి మరిన్ని పుణ్యాలు ప్రసాదించ బడుతున్నాయనే విషయం అల్లాహ్ కు తెలుసు అని మనం నమ్మాలి. బాధలో ఉండటం ఒక విధంగా మంచిదే, ఎందుకంటే అది సర్వశక్తిమంతుడికి దగ్గరగా తీసుకు పోతుంది, నమ్రత, అణుకువతో మరియు విధేయతతో ఆయనను ప్రార్థించడానికి మరియు తన వ్యవహారాన్ని ఆయనకు అప్పగించడానికి ప్రేరేపిస్తుంది. అల్లాహ్ అతడిని అణుకువ మరియు విధేయతలతో చూసినప్పుడు, ఆయన ఆ స్థితిని అతని కోసం ఎంచుకుంటాడు, ఎందుకంటే అది అతని కొరకు చాలా మంచిది.
బాధకు ముందు ఉన్న పరిస్థితి కంటే బాధలో ఉన్న పరిస్థితిలో మరింత ఉత్తమంగా జీవిస్తూ, మెరుగ్గా కనబడే వ్యక్తులు ఉన్నారు. వారి కష్టాలు వారి కొరకు చాలా సుఖంగా ఉన్నాయని స్వయంగా వారే అంటారు. అది బాధల పట్ల వారికున్న ప్రేమ వల్ల కాదు, అల్లాహ్ పట్ల వారికి ఉన్న బలమైన అనుబంధం వల్ల. వారు భక్తితో అల్లాహ్ ను ఆరాధించే రోజుల్లో, వారి హృదయాలు అణుకువ మరియు ఆధ్యాత్మికతతో మరింత ఉత్సాహంగా మారతాయి. వారి అభిరుచులు భిన్నంగా ఉంటాయి, వారు అవిధేయతా చర్యలను తృణీకరిస్తారు మరియు విధేయతా చర్యలను ప్రేమిస్తారు, వారు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఆజ్ఞకు తమను తాము సమర్పించుకుంటారు. ఈ ప్రశంసనీయమైన అలవాట్లన్నీ వారి బాధలకు రుణపడి ఉన్నాయి. మీరు బాధలో ఉండటమే మంచిదని అల్లాహ్ భావించినప్పుడు, అది మీతో పాటు కొనసాగేలా చేస్తాడు. అతను మీ శ్రేయస్సు కొరకు తనకు మాత్రమే తెలిసిన సమయం వరకు ఆయన మీ దుఆల జవాబును వాయిదా వేస్తాడు; ఆ సమయం మీరు ఊహించని లేదా కోరుకోని శుభాలతో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే సమయం.
మీరు అల్లాహ్‌ను అడిగినప్పుడు, ఆయన హామీపై విశ్వాసం కలిగి ఉండాలి, మీ కోసం ఆయన చేసే ఎంపిక మీ ఎంపిక కంటే చాలా గొప్పదని దృఢంగా నమ్మాలి మరియు మీ దుఆకు జవాబు లభించలేదని నిరాశను చెందకూడదు. బదులుగా మీ బాధలు మంచి శ్రేయస్సు కోసం వేచి ఉన్నాయని మీకు మీరు భరోసా ఇచ్చుకోవడమనేది కూడా ఒక రకమైన ఆరాధనే. మీ బాధలు ఎంతకాలం కొనసాగినా, ఓపిగ్గా వేచి ఉండటం అనేది మీ దుఆలకు తప్పక జవాబు ఇస్తాననే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇచ్చిన హామీపై మీకు అచంచలమైన విశ్వాసం ఉందని సూచిస్తుంది.
ప్రవక్తలలో మనకు ఓదార్పు లభిస్తుంది. వారు భూమి ఉపరితలంపై అత్యంత గొప్ప వ్యక్తులైనప్పటికీ, వారిలో చాలామంది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నుండి ఎలాంటి జవాబు లేకుండా సంవత్సరాలకు సంవత్సరాలు తరబడి ప్రార్థించారు. మీరు ప్రార్థించినప్పుడు, మీ చింతనలన్నింటినీ ఆయనకు మరియు ఆయన యొక్క అపూర్వమైన తెలివి మరియు శక్తికి అప్పగిస్తారు. అందుచేత, మీరు శాంతియుత ప్రకంపనలలో మరియు ప్రశాంతతలో మునిగిపోతారు, ఎందుకంటే మీరు మీ వ్యవహారాన్నింటినీ సర్వం ఎరిగిన మరియు మహాజ్ఞాని అయిన అల్లాహ్ కు అప్పగించేసారు.
దుఃఖం ఒకరిని తాకక ముందే, దుఆ దాన్ని అతని నుండి దూరంగా నెట్టి వేస్తుంది. ఒకవేళ అతనిని తాకితే, దానిని తరిమి కొడుతుంది. అది కారుణ్యపు తలుపులు తెరుస్తుంది మరియు అది అల్లాహ్ నుండి వేడుకునే అమూల్యమైన విషయం. కాబట్టి, దుఆకు కట్టుబడి ఉండండి.
విధివ్రాతలో ముందుగా నిర్ణయించబడిన బాధ ఒకరికి ఎదురైతే, దానిని పారద్రోలడానికి దుఆ సహాయపడుతుంది మరియు అది అతనికి ఇంకా తాకకపోతే , దుఆ దానిని నిరోధిస్తుంది. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ముందుగా నిర్ణయించినది ఏమిటో ఎవరికీ తెలియదు. కాబట్టి, మనం అల్లాహ్ పై, ఆయన ఎంపికపై, మరియు ఆయన నిర్ణయించిన విధివ్రాతపై నమ్మకం ఉంచాల్సి ఉంది. మిమ్మల్ని తాకక ముందే దుఃఖాన్ని మీ దుఆ ఎదుర్కొంటుందని లేదా అది మీకు సంభవించిన తర్వాత దానిని తరిమి కొడుతుందని గ్రహించండి. సర్వశక్తిమంతుడికి దుఆ చేయడానికి మరియు తనను తాను అంకితం చేసుకోవడానికి తగినంత శక్తి మరియు ఉత్సాహం ఉన్నప్పుడు, అతను దానిని తనకు సాధ్యమైనంత ఎక్కువగా చేయాలి, ముఖ్యంగా దుఆ ఆమోదించ బడుతుందని పేర్కొన్న ప్రత్యేక సమయాల్లో.
ఘోరమైన ప్రమాదం, తీవ్రమైన గాయం మరియు ఆపదల అంచున ఉన్న చాలా మందిని మనం చూస్తాము. కాని సర్వశక్తిమంతుడైన అల్లాహ్ వారి దుఆ లేదా ఇతరులు వారి కోసం చేసే దుఆల కారణంగా వారిని చక్కగా రక్షిస్తాడు. వారి విధివ్రాతలో అది వ్రాయబడి ఉన్నప్పటికీ, దుఆల కారణంగా అల్లాహ్ దాని నుండి వారిని రక్షించాడని వారికి తెలియదు. మరోవైపు, చాలా కాలంగా బాధలు, కష్టాలు మరియు దుఃఖాలలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తులూ ఉన్నారు. వారి చుట్టూ ఉన్నవారు వారి కష్టాలు ఖచ్చితంగా వారి జీవితాలను ముగించి వేస్తాయని భావిస్తారు. కాని అల్లాహ్ వారిని దుఆ చేయమని నిర్దేశిస్తాడు. అది వారికి సందిగ్ధత నుండి బయట పడటానికి మరియు అసాధ్యమని భావించిన సాధారణ జీవితానికి తిరిగి మరలడానికి కారణమవుతుంది. అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “ముందు జాగ్రత్తలు విధివ్రాతకు వ్యతిరేకంగా ప్రయోజనం చేకూర్చలేవు. తమపై వచ్చి పడే మరియు తమపై వచ్చి పడని వాటి నుండి దుఆ కాపాడుతుంది.”[19]
ఇబ్న్ రజబ్ ఇలా అన్నారు: “ఎల్లప్పుడూ దుఆ చేయుటకు కట్టుబడి ఉన్నంత కాలం మరియు దానికి తప్పక జవాబు లభిస్తుందనే ఆశతో ఉన్నంత కాలం, అతని దుఆకు జవాబు లభించే అవకాశం ఉంది. ఎవరైతే నిలకడగా తలుపు తడతారో, ఖచ్చితంగా అది అతని కోసం తెరుచు కుంటుంది.”[20]
ఎడతెగని ప్రార్థన ఉపశమనం మరియు శ్రేయస్సుల తలుపులు తెరవడానికి చాలా అవకాశం ఉన్నది. అందువల్ల, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నుండి జవాబు రావడం అసాధ్యం అని భావించవద్దు. దుఆ యొక్క ముందస్తు అవసరాలన్నీ, మర్యాదలన్నీ, ఇంకా చేయవలసినవి మరియు చేయకూడనివి అన్నీ పాటించండి, ఎందుకంటే అవి మీ దుఆకు జవాబును నిర్ధారించడానికి కీలకమైనవి.
{وَإِذَا سَأَلَكَ عِبَادِى عَنِّى فَإِنِّى قَرِيبٌ ۖ أُجِيبُ دَعْوَةَ ٱلدَّاعِ إِذَا دَعَانِ ۖ فَلْيَسْتَجِيبُوا لِى وَلْيُؤْمِنُوا بِى لَعَلَّهُمْ يَرْشُدُونَ} البقرة: ١٨٦
[నా దాసులు నా గురించి నిన్ను అడిగినప్పుడు, (వారితో చెప్పు) నిశ్చయంగా నేను వారికి సమీపంలోనే ఉన్నాను. వేడుకునేవారు నన్ను వేడుకున్నప్పుడు, నేను వారి వేడుకోలుకు బదులిస్తాను. కనుక వారు నా ఆజ్ఞను పాటించాలి మరియు నన్ను విశ్వసించాలి. తద్వారా వారు సన్మార్గం పొందగలగుతారు.] 2:186
ఈ ఆయతుకు ముందు మరియు ఈ ఆయతుకు తరువాత, రమదాను మాసంలో తప్పనిసరిగా పాటించ వలసిన ఉపవాసాల గురించి వివరించే ఆయతులు పేర్కొనబడినాయి:
{يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا كُتِبَ عَلَيْكُمُ ٱلصِّيَامُ كَمَا كُتِبَ عَلَى ٱلَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ} البقرة: ١٨٣
[ఓ విశ్వాసులారా! మీ పై ఉపవాసములు విధిగావించబడినవి – ఏవిధంగానైతే మీకన్నా ముందు వారిపై విధిగావించబడినవో – తద్వారా మీరు భయభక్తులు కలిగినవారు అవుతారని.] 2:183
ఈ ఆయతుపై వ్యాఖ్యానిస్తూ, ఇబ్న్ ఆషుర్ ఇలా అన్నారు: “ఈ ఆయతు రమదాన్ లో ఉపవాసం పాటించే వారెవరైనా సరే, వారు చేసే దుఆ జవాబు పొందేందుకు యోగ్యమైనదని సూచిస్తుంది.”[21]
దీనిలోని “నేను నిజంగా సమీపంలోనే ఉన్నాను” అనే పదాలు పరిశీలిద్దాం:
ఇంతకు ముందు చర్చించినట్లుగా, ఈ ఆయతు అల్లాహ్ కు మరియు ఆయన దాసులకు మధ్య అత్యంత సామీప్యతను సూచిస్తుంది.
ఇబాదీ (నా దాసులు) అనే పదంలోని అరబీ అక్షరం “ي”, దీనికి స్వాధీన రూపాన్ని (possessive form) ఇస్తూ, అసమర్ధతను మరియు లోపాన్ని సూచించే ఇబాద్ (దాసులు) అనే పదానికి విరుద్ధంగా సమృద్ధి, వ్యాప్తి, తీవ్రతలను సూచిస్తుంది. ఉదాహరణకు, ఈ ఖుర్ఆన్ పదబంధంలో (فبشر عباد) [నా దాసులకు శుభవార్త ప్రకటించు], ఇబాద్ అనే పదం “ي” అనే అక్షరం లేకుండా పేర్కొనబడింది, ఇది సంతోషకరమైన వార్తలతో దీవించబడిన అతి తక్కువ మంది దాసులను సూచిస్తుంది. దీనికి విరుద్ధంగా, ఈ ఆయతు “ఇబాదీ” (عبادي) అని పేర్కొంటున్నది, అంటే ఇది సర్వశక్తిమంతుడు ‘అందరికీ’ సమీపంలో ఉన్నాడని సూచిస్తుంది.
దుఆ అనేది ముస్లింలలో ప్రేమ మరియు స్నేహాన్ని పెంపొందిస్తుంది. ఒక ముస్లిం, తన సోదరుడి పరోక్షంలో అతని కోసం దుఆ చేసినప్పుడు, దానికి జవాబు లభిస్తుంది. అలాంటి దుఆలో ఎవరి పైనైనా బాహ్యంగా ప్రేమను ప్రదర్శించడం అనేది అతని అంతర్గత మనస్సాక్షికి అనుగుణంగా ఉందని సూచిస్తుంది. మీ పరోక్షంలో మీ కోసం అతను చేసే దుఆల వంటి కొన్ని సంకేతాలతో మాత్రమే మీరు మీ పట్ల అతని ప్రేమను గుర్తించగలరు. ఇది అతని బాహ్య భావోద్వేగం అతని అంతర్గత భావాలకు అనుగుణంగా ఉందని తెలుపుతూ, అతని ప్రేమాభిమానాలలోని చిత్తశుద్ధిని మరియు ప్రగాఢమైన అనుబంధాన్ని సూచిస్తుంది.
అబీ దర్దా (రదియల్లాహు అన్హు) ఇలా పలికారు: “నేను సజ్దా (సాష్టాంగం) చేసినప్పుడు నా డెబ్బై మంది సోదరుల కోసం వారి పేరు పేరునా దుఆ చేస్తాను.”[22]
మీకూ మరియు ఇతరులకూ ప్రసాదించిన అనుగ్రహాల గురించి మీరు అల్లాహ్ ను స్తుతించినప్పుడు మరియు ప్రతి ఉదయం మీరు ఈ క్రింది దుఆ చేస్తుంటే, అది మీరు స్వచ్ఛమైన హృదయాన్ని మరియు నిష్కళంకమైన స్వభావాన్ని కలిగి ఉన్నారనటానికి ఒక సంకేతం:
అల్లాహుమ్మ మాఅస్బహ బిమిన్ నఅమతిన్, ఔ బిఅహదిన్ మిన్ ఖల్’ఖిక్, ఫ మిన్’క వహ్’దక లా షరీక లక్, ఫలకల్ హమ్’దు వ లకష్’షుక్రు.
ఓ అల్లాహ్! నాకు లేదా నీ సృష్టిలో ఎవరికైనా ఏ శుభం లభించినా అది నీ నుండి మాత్రమే. నీకు భాగస్వామి లేరు. సకల ప్రశంసలు మరియు ధన్యవాదాలు నీకు మాత్రమే శోభిస్తాయి.
మరణించిన ప్రతి వ్యక్తి కొరకు, అతను మనకు తెలియక పోయినా సరే, అతని కొరకు దుఆ చేయడమనదే చాలా అభినందనీయమైన అలవాటు.
{رَبَّنَا ٱغْفِرْ لَنَا وَلِإِخْوَٰنِنَا ٱلَّذِينَ سَبَقُونَا بِٱلْإِيمَـٰنِ} الحشر: ١٠
[ఓ మా ప్రభూ! మమ్ముల్ని మన్నించు మరియు మా కంటే ముందు జీవించిన విశ్వాసులను కూడా] 59:10
కొంతమంది సత్ప్రవర్తన కలిగిన యువకులు జనాజా సలాహ్ జరిగే మస్జిద్ లలో సలాహ్ చేయడానికి కట్టుబడి ఉంటారు. దానికి కారణం, ఆ మస్జిదులలో తరచుగా జరిగే జనాజా నమాజులో పాల్గొని, పుణ్యాలు పొందాలనే మరియు ఆ మృతుల కొరకు ప్రార్థించాలనే తపన. అలాంటి వారు నిజంగా స్వచ్ఛమైన మరియు నిష్కళంకమైన హృదయాన్ని కలిగి ఉంటారు.
ముస్లింల కోసం దుఆ చేయడానికి మీరు మీ సమయాన్ని వెచ్చించి నప్పుడు, అల్లాహ్ తన ఉత్తమ దాసుల గురించి ఖుర్ఆన్‌లో ఏమి చెబుతున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి:
{وَٱلَّذِينَ جَآءُو مِنۢ بَعْدِهِمْ يَقُولُونَ رَبَّنَا ٱغْفِرْ لَنَا وَلِإِخْوَٰنِنَا ٱلَّذِينَ سَبَقُونَا بِٱلْإِيمَـٰنِ} الحشر: ١٠
[మరియు వారి తరువాత వచ్చిన వారు ఇలా ప్రార్థిస్తారు, “ఓ మా ప్రభూ! మమ్ముల్ని మన్నించు మరియు మా కంటే ముందు జీవించిన విశ్వాసులను కూడా] 59:10
ఇబ్నె తైమియహ్ ఇలా పలికారు:
“ఒక వ్యక్తి అతని ముందు ఉన్న వ్యక్తి కోసం అతని ఎదురుగా చేసే దుఆ కంటే అతని ముందు లేని వ్యక్తి కోసం అతని పరోక్షంలో చేసే దుఆకు, జవాబు లభించే అవకాశం చాలా అధికం, ఎందుకంటే అది చాలా నిజాయితీగా మరియు అన్నిరకాల షిర్క్ కు దూరంగా ఉంటుంది.” [23]
పాపాలు చేసే వారి గురించి మీరు విన్నప్పుడు మరియు వారు అల్లాహ్ ఆజ్ఞలను ఉల్లంఘించడాన్ని చూసి మీ రక్తం ఉడికి పోతుంది. అయితే, అలాంటి స్థితిలో మీ కోపాన్ని తప్పుడు దిశలో వెళ్లనివ్వకుండా జాగ్రత్త వహించండి. ఎందుకంటే అది మీపై అల్లాహ్ యొక్క శాపానికి దారి తీయవచ్చు. అలాంటి వారిపై పగ పెంచుకోకండి. అలా కాకుండా, మీరు వారిని మీ కుటుంబం మరియు బంధువులుగా పరిగణించండి మరియు వారికి మార్గనిర్దేశం చేయమని అల్లాహ్ తో వేడుకోండి. వారి పట్ల కనీసం దుఆ అయినా చేయకుండా మౌనం వహించడమనేది కూడా ఒక రకమైన లోపమే, ఎందుకంటే మన తోటి ముస్లిం సోదరుల మార్గదర్శకత్వం కోసం దుఆ చేయడం మనకు అత్యవసరం. వారి కోసం మీ దుఆ మీరు గుర్తించ కుండానే వారి జీవితంలో అద్భుతమైన మార్పు తీసుకు రావచ్చు.
అల్లాహ్ పట్ల భయభక్తులు గలవారి లక్షణాలలో దుఆ కూడా ఒకటి. ప్రవక్తల గురించి అల్లాహ్ యొక్క ప్రకటన ఇలా ఉన్నది:
{إِنَّهُمْ كَانُوا يُسَـٰرِعُونَ فِى ٱلْخَيْرَٰتِ وَيَدْعُونَنَا رَغَبًۭا وَرَهَبًۭا ۖ وَكَانُوا لَنَا خَـٰشِعِينَ} الأنبياء:٩٠
[ఈ సద్వర్తనులు సత్కార్యాల కోసం త్వరపడేవారు. ఆశతోనూ, భయం తోనూ మమ్మల్ని వేడుకునేవారు. మా ముందు అశక్తతను, అణకువను కనబరచేవారు.] 21:90
కాబాగృహాన్ని నిర్మిస్తున్న ఇబ్రాహీం మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం గురించి ప్రస్తావిస్తూ అల్లాహ్ ఇలా పలికినాడు:
{وَإِذْ يَرْفَعُ إِبْرَٰهِـۧمُ ٱلْقَوَاعِدَ مِنَ ٱلْبَيْتِ وَإِسْمَـٰعِيلُ رَبَّنَا تَقَبَّلْ مِنَّآ ۖ
إِنَّكَ أَنتَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ} البقرة: ١٢٧
[మరియు ఇబ్రాహీము, ఇస్మాయిలుతో కలిసి కాబాగృహపు పునాదులు లేపుతున్నప్పుడు (ఇలా వేడుకున్నారు) “మా ప్రభూ! మా నుండి (ఈ సేవను) స్వీకరించు. నిశ్చయంగా, నీవు మాత్రమే అన్నీ వినేవాడవు, సర్వమూ తెలిసినవాడవు.”] 2:127
ఈ ఆయతుపై వ్యాఖ్యానిస్తూ ఇబ్న్ కథీర్ ఇలా అన్నారు: వారు ఒక మంచి పని చేస్తూ, దానిని ఆమోదించమని అల్లాహ్‌ను వేడుకున్నారు.[24]
అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒకసారి ఈ ఆయతు పఠించినపుడు, ఆయన స్థితి గురించి వుహైబ్ ఇబ్న్ వర్ద్ ఇలా ఉల్లేఖించారు:
{وَإِذْ يَرْفَعُ إِبْرَٰهِـۧمُ ٱلْقَوَاعِدَ مِنَ ٱلْبَيْتِ وَإِسْمَـٰعِيلُ رَبَّنَا تَقَبَّلْ مِنَّآ ۖ
إِنَّكَ أَنتَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ} البقرة: ١٢٧
[మరియు ఇబ్రాహీము, ఇస్మాయిలుతో కలిసి కాబాగృహపు పునాదులు లేపుతున్నప్పుడు (ఇలా వేడుకున్నారు) “మా ప్రభూ! మా నుండి (ఈ సేవను) స్వీకరించు. నిశ్చయంగా, నీవు మాత్రమే అన్నీ వినేవాడవు, సర్వమూ తెలిసినవాడవు.”] 2:127
అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కన్నీళ్ళతో ఇలా అన్నారు:”ఓ రహ్మాన్ యొక్క ఖలీల్ (ఓ అల్లాహ్ స్నేహితుడా)! నీవు ఆయన పవిత్ర కాబాగృహం స్థంభాలు లేపుతూ కూడా (నీ కృషి) ఆమోదించ బడదేమోనని భయపడు తున్నావే. (అల్లాహ్ ఆజ్ఞతోనే అల్లాహ్ యొక్క కాబాగృహాన్ని నిర్మిస్తున్నా, ఆ పని ఆమోదించ బడదేమోనని భయపడుతున్నావే, అంత పవిత్రమైన పని అంతకంటే ఎక్కువగా ఆమోదించబడే పని మరేదైనా ఉన్నదా).” [25]
నిజాయతీపరులైన విశ్వాసుల గురించి అల్లాహ్ సరిగ్గా ఇలానే పలికాడు:
{وَٱلَّذِينَ يُؤْتُونَ مَآ ءَاتَوا وَّقُلُوبُهُمْ وَجِلَةٌ أَنَّهُمْ إِلَىٰ رَبِّهِمْ رَٰجِعُونَ} المؤمنون: ٦٠
[ఇంకా (దైవమార్గంలో) ఇవ్వవలసిన దాన్ని ఇస్తూ కూడా, తమ ప్రభువు వద్దకు మరలిపోవలసి ఉందనే భావనతో ఎవరి హృదయాలు వణుకుతూ ఉంటాయో,] 23:60
దీనిని వివరిస్తూ సాదీ ఇలా అన్నారు: వారు సర్వశక్తిమంతుడి ఆజ్ఞలను పాటిస్తారు మరియు సాధ్యమైనంత వరకు సలాహ్, జకాత్, హజ్ మరియు సదఖాను ఆచరిస్తారు, అయినప్పటికీ వారు తమ కర్మలు సర్వశక్తిమంతుడి ముందు ప్రదర్శించబడే రోజు గురించి మరియు ఆయన ముందు హాజరు కావలసి ఉందన్న విషయం గురించి భయపడతారు.
ప్రవక్త ఇబ్రహీం, తన కుమారుడు ఇస్మాయిల్ తో కలిసి అల్లాహ్ ను ఇలా వేడు కున్నారు:
{رَبَّنَا وَٱجْعَلْنَا مُسْلِمَيْنِ لَكَ وَمِن ذُرِّيَّتِنَآ أُمَّةًۭ مُّسْلِمَةًۭ لَّكَ} البقرة: ١٢٨
[“మా ప్రభూ! మమ్మల్ని ముస్లిములుగా (మా అభీష్టాన్ని నీకు సమర్పించు కునే వారిగా) చేయి, అలాగే మా సంతతి నుండి ముస్లిములైన సమాజాన్ని ప్రభవింపజేయి.] 2:128
వారు అప్పటికే ముస్లింలుగా ఉన్నప్పటికీ, తమను ముస్లింలుగా చేయమని వారు ఎందుకు అల్లాహ్‌ను కోరారు? ఈ విషయాన్ని సలామ్ బిన్ ముతీ ఇలా వివరించారు, “వారు అప్పటికే ముస్లింలని, అయితే, తమను ఇంకా దృఢంగా చేయమని వారు అల్లాహ్‌ను కోరారు.”[26]
దుఆ అనేది అణచి వేయబడిన మరియు అణగారిన ప్రజల (పీడితుల) అంతిమ ఆశ్రయం & అంతిమ ప్రయత్నం. అల్లాహ్ ప్రకటన:
{وَلَا تَحْسَبَنَّ ٱللَّهَ غَـٰفِلًا عَمَّا يَعْمَلُ ٱلظَّـٰلِمُونَ ۚ إِنَّمَا يُؤَخِّرُهُمْ لِيَوْمٍۢ تَشْخَصُ فِيهِ ٱلْأَبْصَـٰرُ} إبراهيم: ٤٢
[దుర్మార్గుల కార్యకలాపాల పట్ల అల్లాహ్ అశ్రద్ధ వహిస్తున్నాడని అనుకోకు. ఆయన వారికి ఒకానొక రోజు వరకు గడువు ఇస్తున్నాడు – ఆ రోజు వారు కన్నులు తేలవేస్తారు.] 14:42
ఈ ఆయతు దౌర్జన్యపరుల కొరకు హెచ్చరిక మరియు అణచివేతకు గురైనవారికి ఓదార్పు. ఖుర్ఆన్ లోని అల్లాహ్ ప్రకటన:
{أَلَمْ يَعْلَمُوٓا أَنَّ ٱللَّهَ يَعْلَمُ سِرَّهُمْ وَنَجْوَىٰهُمْ وَأَنَّ ٱللَّهَ عَلَّـٰمُ ٱلْغُيُوبِ} التوبة: ٧٨
[ఏమిటీ, తమలోగుట్టు గురించి, తమ గుసగుసల గురించి అల్లాహ్‌కు అంతా తెలుసుననీ, అల్లాహ్ అగోచర విషయాలన్నింటినీ ఎరిగినవాడనీ వారికి తెలియదా?] 9:78
ఇబ్న్ తైమియహ్ ఇలా అన్నారు: మీరు అల్లాహ్ ను ఎంత ఎక్కువగా వేడుకుంటారో, అంత ఎక్కువగా మీరు ఆయనకు ఆరాధనీయంగా ఉంటారు అంటే ప్రియపాత్రులవుతారు. [27]
ఒకసారి మనం ఇప్పుడు సూరహ్ అత్-తలాఖ్‌లోని కొన్ని ఆయతులు పరిశీలిద్దాం. ఇవి విడాకుల గురించి చర్చిస్తున్నా, మన ఆశలను ప్రేరేపించే గొప్ప సందేశాన్ని అందిస్తున్నాయి.
{وَمَن يَتَّقِ ٱللَّهَ يَجْعَل لَّهُۥ مَخْرَجًۭا وَيَرْزُقْهُ مِنْ حَيْثُ لَا يَحْتَسِبُ ۚ
وَمَن يَتَوَكَّلْ عَلَى ٱللَّهِ فَهُوَ حَسْبُهُۥٓ ۚ إِنَّ ٱللَّهَ بَـٰلِغُ أَمْرِهِۦ } الطلاق: ٢-٣
[ఎవడైతే అల్లాహ్ కు భయపడుతూ మసలుకుంటాడో అతనికి అల్లాహ్ (ఈ సంక్షోభం నుండి) బయటపడే మార్గం కల్పిస్తాడు. అతను ఊహించనైనాలేని చోటు నుండి అతనికి ఉపాధిని సమకూరుస్తాడు. అల్లాహ్ పై భారం మోపిన వానికి అల్లాహ్ యే చాలు. అల్లాహ్ తన కార్యాన్ని చేసి తీరుతాడు. అల్లాహ్ ప్రతి విషయానికీ ఒక లెక్కను నిర్ధారించాడు.] 65:2-3
{قَدْ جَعَلَ ٱللَّهُ لِكُلِّ شَىْءٍۢ قَدْرًۭا} الطلاق: ٣
[అల్లాహ్ ప్రతి విషయానికీ ఒక లెక్కను నిర్ధారించాడు.] 65:3
{وَمَن يَتَّقِ ٱللَّهَ يَجْعَل لَّهُۥ مِنْ أَمْرِهِۦ يُسْرًۭا} الطلاق: ٤
[ఎవడు అల్లాహ్ కు భయపడతాడో అతనికి అల్లాహ్ అతని వ్యవహారంలో అన్ని విధాలా సౌలభ్యం కల్పిస్తాడు.] 65:4
{وَمَن يَتَّقِ ٱللَّهَ يُكَفِّرْ عَنْهُ سَيِّـَٔاتِهِۦ وَيُعْظِمْ لَهُۥٓ أَجْرًا} الطلاق: ٥
[ఎవడు అల్లాహ్ కు భయపడతాడో అతని పాపాలను అల్లాహ్ అతని నుండి రూపుమాపుతాడు. అతనికి గొప్ప పుణ్యఫలాన్ని వొసగుతాడు.] 65:5
{سَيَجْعَلُ ٱللَّهُ بَعْدَ عُسْرٍۢ يُسْرًۭا} الطلاق: ٧
[అల్లాహ్ ఇబ్బందుల తరువాత సౌలభ్యాన్ని కూడా కల్పిస్తాడు.] 65:7
{لَا تَدْرِى لَعَلَّ ٱللَّهَ يُحْدِثُ بَعْدَ ذَٰلِكَ أَمْرًۭا} الطلاق: ١
[నీకు తెలీదు – బహుశా అల్లాహ్ దీని తరువాత ఏదైనా కొత్త పరిస్థితిని కల్పిస్తాడేమో!] 65:1
దీని గురించి ఒక కవి ఇలా అన్నాడు: నేను అల్లాహ్ ను ప్రార్థించగానే నాలో సందిగ్ధంలో ఉన్నది ఏదైనా సరే, దాన్నుండి త్వరగా బయటపడి పోతాను.
చాలా మందికి తమ ప్రార్థనల వల్లనే వారి వారి కష్టాల నుండి బయటపడే మార్గం లభించింది.
ఇబ్న్ ఖయ్యిమ్ ఇలా అన్నారు: కొందరు పూర్వకాలపు సజ్జనులు (సలఫ్) ఇలా పలికారు, “నాకు అవసరం కలిగినప్పుడు, దానిని నెరవర్చమని నేను అల్లాహ్‌ను ప్రార్థించడమనేది నా కొరకు నన్ను నేను ఆయనకు సమర్పించు కోవడానికి, ఆయనకు సంభాషించడానికి, ఆయనను గురించి తెలుసు కోవటానికి, నా అణుకువ మరియు సౌమ్యత చూపించడానికి తలుపులు తెరిచింది. అలాంటి స్థితి కొనసాగడం నాకు చాలా ఇష్టం మరియు నా దుఆ ఆమోదించబడటం కంటే నాకిది చాలా ఆరాధనీయమైనది, ఇష్టమైనది.”[28]
దీనిపై ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి! మీ అవసరం అల్లాహ్ తో సంభాషించడానికి, మిమ్మల్ని ఆయనకు సమర్పించుకోవడానికి మరియు మీ అణుకువ మరియు సాత్వికతను ఆయనకు చూపించడానికి తలుపులు తెరుస్తుంది. మరి, ఇక్కడ మీ అవసరం తీరకపోయినా, అది అల్లాహ్ తో మీ అనుబంధాన్ని మెరుగు పరుస్తుంది. కాబట్టి, మీ అవసరాలను తీర్చుకోవడం కంటే ఇది మీకు చాలా మంచిది కదా. నిజానికి, దుఆ మనకు అమితమైన ఆనందాన్ని ఇస్తుంది. (ఇంకేమీ లేకుండా) కేవలం అది మాత్రమే ఆరాధన అయినా, అది మాకు సరిపోయేది.
దీనిపై ఒక కవి ఇలా అన్నాడు: అల్లాహ్ మనిషికి అతడి జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించేందుకు వీలు కానంతటి గొప్ప అనుగ్రహాలను ప్రసాదిస్తాడు.
అతని విచారకరమైన హృదయం నుండి అన్ని బాధలను తుడిచి వేయడానికి ఒక వ్యక్తి కొరకు కష్టకాలం తర్వాత వెంటనే సుఖసంతోషాల కాలం కూడా వస్తుంది. అనేక ప్రతికూల పరిస్థితులు, ఇబ్బందులు ఉదయం తాకుతాయి, కానీ సాయంత్రం అయ్యేటప్పటికీ అదృశ్యమై పోతాయి.
మీరు కష్టాల్లో ఉన్నప్పుడు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను మాత్రమే మీరు నమ్ముకోండి, ఆయనపైనే అచంచల విశ్వాసం ఉంచండి. మీరు బాధలో ఉంటే చింతించకండి, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మీ కోసం చాలా గోప్యమైన అనుగ్రహాల భద్రపరచి ఉంచాడు.
దుఆలో పాటించవలసిన ఆవశ్యకతలు & మర్యాదలు
మదారిజ్ అస్-సాలికీన్‌లో ఇబ్న్ ఖయ్యిమ్ ఇలా అన్నారు: “ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటూ ఉండేవారు:
“నా దుఆకు జవాబు లభించడం గురించి నేను చింతించను, బదులుగా నేను అసలు ఆ దుఆ గురించే ఆందోళన చెందుతాను. ఒకవేళ నేను దుఆ చేయడానికి ప్రేరేపించ బడితే, దానికి జవాబు ఇవ్వబడుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటాను.” [29]
కొన్ని షరతులకు అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే దుఆకు జవాబు లభిస్తుంది. వాటిలో కొన్ని:
దుఆ చేసే వారు ఎవరైనా సరే వారి దుఆకు ప్రతిస్పందించేది కేవలం అల్లాహ్ మాత్రమే అని ఖచ్చితంగా నమ్మాలి. తన దుఆకు జవాబు ఇచ్చేందుకు కేవలం అల్లాహ్ మాత్రమే సమర్థుడని అతనికి అచంచలమైన విశ్వాసం ఉండాలి. దీని గురించి అల్లాహ్ ప్రకటన:
{أَلَمْ تَعْلَمْ أَنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَىْءٍۢ قَدِيرٌ} البقرة: ١٠٦
[నీకు తెలియదా – నిశ్చయంగా అల్లాహ్ అన్నింటిపై అధికారం కలవాడని?] 2:106
{أَمَّن يُجِيبُ ٱلْمُضْطَرَّ إِذَا دَعَاهُ} النمل: ٦٢
[కలత చెందినవాడు మొరపెట్టుకున్నప్పుడు, అతని మొరను ఆలకించి, అతని వ్యాకులతను దూరం చేసేవాడెవడు?] 27:62
{وَمَا كَانَ ٱللَّهُ لِيُعْجِزَهُۥ مِن شَىْءٍۢ فِى ٱلسَّمَـٰوَٰتِ وَلَا فِى ٱلْأَرْضِ } فاطر: ٤٤
[ఆకాశాలలోగానీ, భూమిలో గానీ ఉన్న ఏ వస్తువూ అల్లాహ్‌ను లొంగదీసుకోజాలదు.] 35:44
దుఆకు ప్రతిస్పందించగల సామర్థ్యం ఉన్న ఏకైక శక్తి అల్లాహ్ మాత్రమేనని తప్పనిసరిగా తెలుసుకుని మరీ ఎవరైనా దుఆ చేయాలి. అల్లాహ్ నుండి మద్దతు లేకుండా ఏ సలహాదారుడూ, స్నేహితుడూ, మద్దతుదారుడూ మరియు సహచరుడూ తనకు ఏ సహాయమూ చేయలేరని అతను దృఢమైన నమ్మకం కలిగి ఉండాలి. మానవ వనరులు సర్వశక్తిమంతుడు, మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ఆదేశాలనుసారం మాత్రమే పనిచేస్తాయి.
అతని దుఆ ఎంత అసాధ్యంగా, అసంబద్ధంగా అనిపించినా నిరాశ చెందకూడదు. మనిషి కొరకు విషయాలు అగమ్యగోచరంగా ఉండవచ్చు, అయినప్పటికీ, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కొరకు, అవి ఆయన ఆజ్ఞ మరియు క్రమం ప్రకారమే ఉంటాయి. దుఆకు ప్రతిస్పందిస్తాననే అల్లాహ్ యొక్క వాగ్దానం గురించి స్వయంగా మనకు మనం హామీ ఇచ్చుకోవలసిన అవసరం లేదు, బదులుగా మనం అల్లాహ్ పై అచంచలమైన విశ్వాసం కలిగి ఉండటం అత్యవసరం. అలాంటి విశ్వాసాన్ని మనం ఎలా కలిగి ఉండగలం? కాబట్టి, అల్లాహ్ మాత్రమే సమర్ధుడు, సర్వసంపన్నుడు, ఔదార్యం మరియు దయగలవాడు అని మనం ఖచ్చితంగా గ్రహించాలి. ఈ వాస్తవాన్ని మనం గ్రహిస్తే, మనం దుఆను ఎన్నడూ విడిచి పెట్టము మరియు దుఆలు చేయడంలో అలసిపోము. ఎవరైతే తలుపు తట్టడం కొనసాగిస్తారో, అది ఖచ్చితంగా అతని కొరకు అది తెరుచు కుంటుంది.
- చెల్లుబాటు అయ్యే మధ్యవర్తిత్వ మార్గాలతో (వసీలాతో) దుఆ చేయడం. మరియు అవి క్రింది విధంగా ఉన్నాయి:
- అల్లాహ్ యొక్క దివ్యనామములు మరియు ఆయన గుణగుణాలు, లేదా ఒకరి మంచి పనులు, గుహ ద్వారం మూసివేసిన భారీ బండ వలన గుహలో చిక్కుకున్న వారి విషయంలో వివరించబడినట్లుగా:
గుహలో చిక్కుకున్నవారి వృత్తాంతం:
ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: రసూలుల్లాహ్ (ﷺ) సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు,
“మీ కంటే ముందు గతించిన వారిలో ముగ్గురు వ్యక్తులు ఒకసారి ప్రయాణిస్తూ ఉండగా, ఆకస్మాత్తుగా వర్షంలో చిక్కుకున్నారు. అపుడు వారు ఒక కొండగుహలోనికి వెళ్ళి తలదాచుకున్నారు. ఇంతలో ఒక పెద్ద బండరాయి దొర్లుకుంటూ వచ్చి, గుహ ముఖద్వారాన్ని మూసివేసింది. అపుడు వారు పరస్పరం ఇలా అనుకున్నారు, “అల్లాహ్ సాక్షి! నిశ్చయంగా మనల్ని సత్యం తప్ప ఇంకేదీ రక్షించలేదు. కనుక, మనలోని ప్రతి ఒక్కరమూ ఏ పనినైతే నిజాయితీగా కేవలం అల్లాహ్ కోసమే చేశామని భావిస్తున్నామో, దాని ద్వారా అల్లాహ్ యొక్క సహాయం వేడుకుందాము”.
అపుడు వారిలో ఒకడు ఇలా అన్నాడు “ఓ అల్లాహ్! నీకు తెలుసు. నా వద్ద ఒక కూలివాడు ఉండేవాడు. అతడు ఒక ఫరఖ్* వరి ధాన్యం కూలిపై పనిచేసేవాడు. అయితే ఒకరోజు అతను తన కూలి తీసుకోకుండానే వెళ్ళిపోయాడు. నేను స్వచ్ఛందంగా ఆ ఫరఖ్ ధాన్యాన్ని నాటాను. దాని దిగుబడితో ఆవులను కొన్నాను. కొన్నాళ్ళ తరువాత అతడు నా వద్దకు తిరిగి వచ్చి, తన కూలి నివ్వమని అడిగాడు. నేను అతడిని ఆ ఆవుల మంద వద్దకు తీసుకుని వెళ్లి “వాటిని తోలుకుని పో’ అని అన్నాను. దానికి అతడు నాతో ఇలా అన్నాడు, ‘వాస్తవానికి నీ వద్ద నుండి నాకు రావలసింది కేవలం ఒక్క ఫరఖ్ వరి ధాన్యం మాత్రమే కదా!’. అపుడు నేను అతడితో “వెళ్ళు, వెళ్ళి ఆ ఆవుల మందను తోలుకొని పో. నిశ్చయంగా ఆ మంద అంతా ఆ ఫరఖ్ వరిధాన్యం దిగుబడి నుండి వచ్చినదే.” అన్నాను. దానితో అతడు ఆ ఆవుల మందను తోలుకొని వెళ్ళిపోయాడు. “ఓ అల్లాహ్! ఒకవేళ నేను కేవలం నీ భయం వలన మాత్రమే ఈ పనిని చేశానని నీవు తలచినట్లయితే, మాపై నుండి ఈ ఆపదను తొలగించు”. వెంటనే ఆ రాయి గుహ ముఖద్వారం నుండి కొద్దిగా పక్కకు జరిగింది.
(* ఒక ఫరఖ్ = మూడు సా’లు; ఒక సా’ = నాలుగు దోసెళ్ళు)
తరువాత రెండో వ్యక్తి ఇలా అన్నాడు, “ఓ అల్లాహ్! నీకు తెలుసు, నాకు వృద్ధులైన తల్లిదండ్రులు ఉండేవారు. నేను వారిద్దరికి ప్రతిరాత్రీ నా మేకల పాలు త్రాగించేవాడిని. ఒక రాత్రి నేను వారి వద్దకు ఆలస్యంగా చేరాను. అప్పటికే వారిద్దరు నిద్రపోయారు. నా భార్యా మరియు పిల్లలు ఆకలితో నకనకలాడుతున్నారు. అయితే నా తల్లిదండ్రులు పాలు త్రాగనంత వరకు నేను వారికి పాలు త్రాగటానికి ఇచ్చేవాడిని కాదు. కానీ, నా తల్లిదండ్రులను నిద్ర నుండి లేపి నిద్రాభంగం కలిగించడం కూడా నాకు ఇష్టం లేకపోయింది. అలాగే, వారు పాలు త్రాగకుండానే పడుకోవటం కూడా నాకు ఇష్టం లేకపోయింది. అందుకని, నా తల్లిదండ్రులు నిద్ర నుండి మేల్కొనుట కొరకు ఎదురు చూడసాగాను. ఇంతలో తెల్లవారి పోయింది. “ఓ అల్లాహ్! ఒకవేళ నేను కేవలం నీ భయం వలన మాత్రమే ఈ పనిని చేశానని నీవు తలచినట్లయితే, మాపై నుండి ఈ ఆపదను తొలగించు”. వెంటనే ఆ రాయి గుహ ముఖద్వారం నుండి మరింత పక్కకు జరుగగా, వారు ఆకాశాన్ని చూడగలిగారు.
ఆ తరువాత మూడవ వ్యక్తి ఇలా అన్నాడు, “ఓ అల్లాహ్! నీకు తెలుసు, నా తండ్రి సోదరుని కూతురు ఉండేది. అందరిలో ఆమె అంటే నాకు చాలా ఇష్టం. ఎలాగైనా ఆమెతో సంభోగించాలని కోరుకునేవాడిని, కానీ ఆమె తిరస్కరించేది. (ఒకానొక దీనస్థితిలో) ‘వంద దీనారులు ఇస్తే తప్ప, నీ కోరిక తీర్చను’ అని ఒప్పుకున్నది. చివరికి నేను ఆ వంద దీనారులు కూడబెట్టుకోగలిగాను. వాటిని తీసుకుని వెళ్ళి, ఆమెకు ఇచ్చాను. అపుడామె నా కోరిక తీర్చడానికి అంగీకరించింది. ఎప్పుడైతే నేను ఆమె రెండు కాళ్ళ మధ్య కూర్చున్నానో, ఆమె ఇలా అన్నది, “అల్లాహ్ కు భయపడు. ధర్మబద్దంగా తప్ప, నా కన్యత్వాన్ని హరించకు (నీ భార్యగా చేసుకో)!”
అంతే, ఆ మాట వినగానే నేను లేచి, ఆ వంద దీనార్లు కూడా ఆమె వద్దనే వదిలేసి, వెళ్ళిపోయాను. “ఓ అల్లాహ్! ఒకవేళ నేను కేవలం నీ భయం వలన మాత్రమే ఈ పనిని చేశానని నీవు తలచినట్లయితే, మాపై నుండి ఈ ఆపదను తొలగించు”. అపుడు అల్లాహ్ ఆ బండరాయిని పూర్తిగా తొలిగించి, వారికి విముక్తిని కలిగించాడు మరియు వారు ఆ గుహ నుండి బయటకు వచ్చారు.” [30]
[‘అల్లాహ్ ను సహాయం కొరకు నేరుగానే అర్థించాలని లేదా తాను చేసిన మంచిపనులను ప్రస్తావిస్తూ, అల్లాహ్ సహాయాన్ని అర్థించ వచ్చునని’ ఈ హదీథు సూచిస్తున్నది. అంతేగాని, చనిపోయిన వారి ద్వారా లేక అక్కడ హాజరుగా లేని వారి ద్వారా (అనగా ప్రవక్తలు, దైవదూతలు, జిన్నులు, ఔలియాలు, పుణ్యపురుషులు, బాబాలు, సన్యాసులు …. మొదలైన వారి ద్వారా) లేదా విగ్రహాలు, రాళ్ళు రప్పలు, చెట్లుచేమలు మొదలైన వాటిని వేడుకొనుట, అర్థించుట ఇస్లాంలో పూర్తిగా నిషిద్ధం. అలా చేయడం షిర్క్ అవుతుంది (బహుదైవారాధన – అల్లాహ్ కు సాటి కల్పించడం అవుతుంది)].
ఈ హదీథుపై వ్యాఖ్యానిస్తూ, ఇబ్న్ బాజ్ ఇలా అన్నారు: పూర్వ సమాజ గాథకు సంబంధించిన ఈ వివరణాత్మక హదీథు అల్లాహ్ పట్ల ఒకరి ఉద్దేశం మరియు అతని చిత్తశుద్ధి యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది మరియు ఆయన ఎప్పుడూ నిజాయితీగా అల్లాహ్ కొరకు చేసిన మంచిపనులకు బదులుగా ఒకరి ఒత్తిడిని మరియు విపరీతమైన బాధలను తొలగిస్తాడు. మరియు ఆయన అతనికి స్వర్గంలో కూడా తగిన ప్రతిఫలమిస్తాడు, నరకాగ్ని నుండి అతనిని రక్షిస్తాడు మరియు అతని మంచి పనులను రెట్టింపు చేస్తాడు. [31]
- సజీవంగా ఉన్న మరియు సరిగ్గా దుఆ చేయగల సమర్థత కలిగి ఉన్న సత్’పురుషుల దుఆతో మధ్యవర్తిత్వం కోరడం. “సోదరా, నీ ప్రార్థనలో నన్ను మరచిపోకు” అనే అభ్యర్థనల గురించి ఇబ్న్ బాజ్ ను అడిగినప్పుడు, ఆయన ఇలా జవాబిచ్చారు: ఇలా అడగడం సరైనదే, అయితే, దానిని నివారించడం మంచిది, ఎందుకంటే ఒకరు తన సోదరుడిని తరచుగా అలాంటి అభ్యర్థనలతో ఇబ్బంది పెట్టవచ్చు, కానీ అప్పుడప్పుడు దుఆ చేయమని తోటి సోదరుడిని అభ్యర్థించడం వల్ల ఎటువంటి హాని లేదు. అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పినట్లు ముస్లిం గ్రంథంలో నమోదు చేయబడిన ప్రామాణికమైన హదీథులో ఉన్నది: యెమెన్ నుండి ఉవైస్ అని పిలువబడే ఒక వ్యక్తి మీ వద్దకు వస్తాడు మరియు అతను తన తల్లిని తప్ప మరెవరినీ (అతని వెనుక) యెమెన్‌లో వదిలిపెట్టడు. (కుష్టు వ్యాధి కారణంగా అతని శరీరంపై) తెల్లటి మచ్చలు ఉండగా, అతను అల్లాహ్‌ను వేడుకున్నాడు మరియు అది ఒక దినార్ లేదా దిర్హామ్ పరిమాణం మినహా మిగిలిన శరీరం పై నుండి ఆ తెల్లటి మచ్చలు మాయమైపోతాయి. మీలో ఎవరైతే అతనిని కలుసు కుంటారో, అతనిని మీ క్షమాపణ కోసం (అల్లాహ్ ను) ప్రార్థించమని అడగండి. ఇంకా ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉమ్రా కోసం వెళ్ళినప్పుడు, ఆయన ఇలా అన్నారు: “సోదరా, నీ ప్రార్థనలో నన్ను మరచిపోకు.” కానీ ఈ హదీథు సనద్ లో (ఉల్లేఖకుల పరంపరలో) బలహీనంగా ఉంది, కానీ, ఉవైస్ యొక్క హదీథు సహీహ్ ముస్లిం గ్రంథంలో పొందు పరచబడింది. సంక్షిప్తంగా, ఒక వ్యక్తి తన తోటి ముస్లిం సోదరుడు లేదా సహచరులు లేదా స్నేహితుల కోసం చేసే దుఆ ప్రశంసనీయం మరియు ఇది ఒక రకమైన మంచి పనే.
ఖుర్ఆన్ లోని అల్లాహ్ ప్రకటన:
{وَأَحْسِنُوٓا ۛ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلْمُحْسِنِينَ} البقرة: ١٩٥
[మరియు సత్కార్యాలు చేయండి. నిశ్చయంగా, సత్కార్యాలు చేసేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు.] 2:195
ఆయన ఇంకా ఇలా అన్నారు: అల్లాహ్ అతని దుఆను స్వీకరిస్తాడనే ఆశతో ఒక మంచి వ్యక్తిని తన మన్నింపు కొరకు ప్రార్థించమని అభ్యర్థించడంలో ఎటువంటి సమస్య లేదని ఇది సూచిస్తుంది. మిమ్మల్ని క్షమించమని, మీ హృదయాన్ని సరిదిద్దమని, అల్లాహ్ యొక్క విశ్వాసంలో మిమ్మల్ని స్థిరంగా ఉంచమని, మీకు ప్రయోజనకరమైన జ్ఞానాన్ని ప్రసాదించమని లేదా మీకు మంచి జీవిత భాగస్వామిని ఇవ్వమని అల్లాహ్‌ను అడగమని మీరు ఎవరినైనా అభ్యర్థించడంలో ఎటువంటి హాని లేదు. [32]
- ఒకరు తన దుఆ ఆమోదింపబడటం గురించి తొందరపడకూడదు. అది ఎలా జరుగుతుంది? అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “పాపకార్యం కోసం కాకుండా లేదా రక్త సంబంధాన్ని తెంచుకోవడం కోసం కాకుండా లేదా అతను అసహనానికి లోను కాకుండా దాసుడు చేసే దుఆ మంజూరు చేయబడుతుంది. అపుడు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో “అతను అసహనానికి లోను కాకుండా” అంటే అర్థం ఏమిటి అని అడుగగా, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా జవాబిచ్చారు: “అతను ఒకవేళ ఇలా పలికితే (అసహానికి లోను అయినట్లు): నేను దుఆ చేసాను, ఇంకా మరింతగా నేను దుఆ చేసాను, కానీ దానికి జవాబు కనిపించడం లేదు. ఆపై అతను విసుగు చెంది దుఆ చేయడాన్ని విడిచిపెడతాడు.”[33]
ఒక నెల లేదా ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు దుఆ చేసి, ప్రతిస్పందన ఆలస్యం అవటం వలన విసుగు చెందే వ్యక్తి గురించి ఇబ్న్ ఖయ్యిమ్ ఒక అద్భుతమైన ఉపమానాన్ని వివరిస్తూ, ఆయనిలా అంటున్నారు: “అటువంటి వ్యక్తి విత్తనాన్ని విత్తిన లేదా ఒక మొక్కను నాటిన వ్యక్తిలా ఉంటాడు మరియు నీరు పోస్తూ దానిని జాగ్రత్తగా చూసుకుంటాడు, కానీ పరిపూర్ణత దశకు ఎదగడానికి ఇంకా చాలా సమయం పడుతుందని అతను భావించినప్పుడు, అతను దాని మానాన దానిని విడిచి పెట్టేస్తాడు.” [34]
అల్లాహ్ ను ప్రార్థించి, తక్షణ ప్రతిస్పందనను పొందాలని ఆశించే వ్యక్తికి కూడా అదే వర్తిస్తుంది మరియు వెంటనే స్పందించనప్పుడు దుఆ చేయడాన్ని విడిచి పెట్టేస్తాడు.
ప్రవక్త జకరియా (అ) ప్రార్ధించినప్పుడు తన ప్రార్థనకు జవాబు లభించడానికి ఎంతసేపు వేచి ఉన్నారో చూడండి:
{رَبِّ لَا تَذَرْنِى فَرْدًۭا وَأَنتَ خَيْرُ ٱلْوَٰرِثِينَ} الأنبياء: ٨٩
[“నా ప్రభూ! నన్ను ఒంటరివానిగా వదలకు. నీవు అందరికన్నా అత్యుత్తమ వారసుడవు”] 21:89
ప్రవక్త యాకూబ్ (అ) తన కుమారుడు యూసుఫ్ తప్పిపోయినప్పుడు ఎంతసేపు వేచి ఉండాల్సి వచ్చింది. ఆయన వేచి ఉండటం మరియు తన ప్రభువును ప్రార్థించడం కొనసాగించాడు. ఆయన అచంచలమైన విశ్వాసం ఈ శాశ్వతమైన ఆయతు భాగాన్ని పునరావృతం చేసేలా చేసింది:
{إِنِّى لَأَجِدُ رِيحَ يُوسُفَ ۖ لَوْلَآ أَن تُفَنِّدُونِ} يوسف: ٩٤
[ముసలితనం వలన నాకు మతి భ్రమించిందని మీరు అనుకోనంటే (ఒక విషయం చెబుతాను) – నాకు యూసుఫ్ సువాసన వస్తోంది.] 12:94
{وَأَعْلَمُ مِنَ ٱللَّهِ مَا لَا تَعْلَمُونَ} يوسف: ٨٦
[మరియు మీకు తెలియని విషయాలు అల్లాహ్ ద్వారా నాకు తెలుసు] 12:86
{فَصَبْرٌۭ جَمِيلٌۭ ۖ وَٱللَّهُ ٱلْمُسْتَعَانُ عَلَىٰ مَا تَصِفُونَ} يوسف: ١٨
[సరే, ఇక ఓర్పు వహించటమే ఉత్తమం. మీరు కల్పించే మాటలపై నేను అల్లాహ్ సహాయాన్నేఅర్థిస్తున్నాను] 12:18
{عَسَى ٱللَّهُ أَن يَأْتِيَنِى بِهِمْ جَمِيعًا ۚ إِنَّهُۥ هُوَ ٱلْعَلِيمُ ٱلْحَكِيمُ} يوسف: ٨٣
[సరే, ఇప్పుడు ఓర్పు వహించడమే మంచిది. బహుశా అల్లాహ్ వారందరినీ త్వరలోనే నా దగ్గరకు చేర్చవచ్చు! నిశ్చయంగా ఆయన సర్వం తెలిసినవాడు, వివేచనాపరుడూను] 12:83
{وَلَا تَايْـَٔسُوا مِن رَّوْحِ ٱللَّهِ ۖ إِنَّهُۥ لَا يَايْـَٔسُ مِن رَّوْحِ ٱللَّهِ إِلَّا ٱلْقَوْمُ ٱلْكَـٰفِرُونَ} يوسف: ٨٧
[అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. అల్లాహ్‌ను తిరస్కరించిన వారు మాత్రమే ఆయన కారుణ్యం పట్ల నిరాశ చెందుతారు] 12:87
కాబట్టి, మన ప్రార్థనలు వ్యర్థం కావు అనే భరోసాతో ఉండాలి. ఒకవేళ అవి వెంటనే పూర్తి కాకపోతే, అల్లాహ్ వాటిని మరింత మంచి సమయం వరకు వాయిదా వేసి ఉండవచ్చు. మనకు ఏది ఉత్తమమో మరియు ఎప్పుడు, ఎక్కడ అది మనకు బాగా సరిపోతుందో కేవలం అల్లాహ్ మాత్రమే ఎరుగును. మనకు బాగా సరిపోతాయని మనం భావించిన విషయాలు మన కొరకు ఇబ్బందికరంగా తయారు కావచ్చు. నిర్దిష్ట ప్రణాళికల అమలుకు మనం నిర్ణయించిన సమయం మెరుగ్గా ఉంటుందని మనం ఊహిస్తాము, కానీ దాని కంటే ఆలస్యం లేదా ముందస్తుగా అమలు చేయడం ఇంకా మంచిది కావచ్చేమో. మనకు నచ్చనివి చాలా ఉండి ఉండవచ్చు, కానీ అవే మన కొరకు మంచిని తెచ్చి పెడతాయేమో. మీ నుండి తప్పిపోయిన ఏదైనా మంచి విషయం, ఒకవేళ అలా తప్పి పోకుండా ఉండి ఉంటే, దాని వలన మీకు చెడు జరిగేదేమో.
బాలుడిని చంపిన ఖిదర్ (అ) కథలో నేర్చుకోవలసిన పాఠం ఒకటి ఉంది.
{وَأَمَّا ٱلْغُلَـٰمُ فَكَانَ أَبَوَاهُ مُؤْمِنَيْنِ فَخَشِينَآ أَن يُرْهِقَهُمَا طُغْيَـٰنًۭا وَكُفْرًۭا} الكهف: ٨٠
[ఇకపోతే ఆ అబ్బాయి సంగతి; అతని తల్లిదండ్రులు విశ్వాసులు. అతను తన తలబిరుసుతనంతో, తిరస్కారవైఖరితో వారిని వేధిస్తాడని మాకు భయమేసింది.] 18:80
సాది ఇలా అన్నారు: అతను పెద్దయ్యాక, తన తల్లిదండ్రులు సత్యాన్ని ధిక్కరించేలా మరియు అవిశ్వాసులాగా మారేలా బలవంతం చేయడం అనేది ఆ అబ్బాయి కొరకు నిర్ణయించబడింది. అతని తల్లితండ్రులు తన బిడ్డ పట్ల ప్రేమ లేదా గారాబం కారణంగా అతనికి లొంగిపోతారు లేదా వారు సత్య ధిక్కారానికి లొంగిపోయేలా అతడు వారిని ఒత్తిడి చేస్తాడు. అందుకే, ఖిదర్ అతని తల్లిదండ్రుల ధర్మాన్ని రక్షించడానికి అతన్ని చంపాడు. ఈ హత్య అసందర్భంగా కనిపించినా, ఆ తండ్రి సంతానాన్ని కోల్పోయినా, ఆ తండ్రి కొరకు ఇంత కంటే మంచి ప్రయోజనం ఇంకా ఏముంది? అల్లాహ్ వారికి మరో మంచి సంతానాన్ని ఇస్తాడు.[35]
- సంపూర్ణ విశ్వాసంతో అల్లాహ్ గురించి మంచి ఆలోచన కలిగి ఉండాలి. మనం ప్రార్థిస్తున్నప్పుడు, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మన ప్రార్థనను వింటాడని మరియు ఆయన మనకు ఏ విధంగానైనా ప్రతిస్పందిస్తాడని పూర్తిగా నమ్మాలి. ఈ ఆయతులో తెలిపినట్లుగా:
{أُجِيبُ دَعْوَةَ ٱلدَّاعِ إِذَا دَعَانِ} البقرة: ١٨٦
[వేడుకునేవారు నన్ను వేడుకున్నప్పుడు, నేను వారి వేడుకోలుకు బదులిస్తాను] 2:186
షరతులతో కూడిన వాక్యం మొదట షరతులతో కూడిన ప్రిపోజిషన్ తర్వాత షరతులతో కూడిన క్రియ మరియు చివరి నిబంధన వచ్చే నమూనాలో రూపొందించబడింది, అయితే, ఈ పద్యంలో, హామీ మరియు అనివార్యతను సూచించడానికి షరతులకు ముందు చివరి నిబంధన మొదట వచ్చింది. అదేవిధంగా, ఇది “إذا” అనే షరతులతో కూడిన ప్రిపోజిషన్‌తో వచ్చింది, ఇది “إن”కి బదులుగా అల్లాహ్ చెప్పినట్లుగా, నిర్దిష్ట మరియు అనిశ్చిత విషయాలకు పరస్పరం మార్చుకోబడింది:
{قُلْ إِن كَانَ لِلرَّحْمَـٰنِ وَلَدٌۭ فَأَنَا۠ أَوَّلُ ٱلْعَـٰبِدِينَ} الزخرف: ٨١
[(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “కరుణామయునికి సంతానమే గనక ఉంటే, అందరికన్నా ముందు నేనే వారిని ఆరాధించి ఉండేవాణ్ణి.”] 43:81
మరోవైపు, ఇక్కడ “إذا” అనే ప్రిపోజిషన్ ఖచ్చితత్వాన్ని సూచించడానికి మాత్రమే ఉపయోగించబడింది. అందువల్ల, దుఆ ఆమోదించబడుతుందనే దృఢ విశ్వాసంతో అల్లాహ్‌ను ప్రార్థించండి. నిశ్చయంగా అల్లాహ్ గురించి మంచి ఆలోచన కలిగి ఉండాలి, ఎందుకంటే అది మంచి పని చేయడానికి ప్రేరేపిస్తుంది. దాసుడు ప్రార్థన, పశ్చాత్తాపం మరియు క్షమాపణ కోరుతూ చేస్తున్న తన దుఆ తప్పకుండా ఆమోదించబడుతుందనే దృఢమైన నమ్మకానికి కట్టుబడి ఉండాలి.
- ప్రార్థన చేసేటప్పుడు ఏమరుపాటు లేకుండా పూర్తి అప్రమత్తతో, సావధానంతో చింతనాశీలమై దుఆలో మనస్పూర్తిగా లీనమయ్యేటట్లు శ్రద్ధ వహించాలి. ప్రార్ధన చేస్తున్నప్పుడు అజాగ్రత్తగా ఉండటం అనేది లక్ష్యం చేస్తున్నప్పుడు ఒకరి విల్లును వదులు చేసినట్లే. మీ విల్లును ఎంత శక్తివంతంగా సాగదీస్తే, మీరు లక్ష్యాన్ని చేధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ప్రార్థన చేసే వారు ఎవరైనా దుఆలో మనస్పూర్తిగా లీనమై పోయేలా శ్రద్ధ వహించాలి. అతను ఎవరిని ప్రార్థిస్తున్నాడో, ఆ మహాశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క మహిమను మరియు ప్రార్థనలో ఏమి అడుగుతున్నాడో దానిని గుర్తుంచుకోవాలి. మహోన్నతుడైన ప్రభువును అశ్రద్ధతో నిండిన హృదయంతో సంబోధించడం అనేది ఆయన క్రింది దాసుడికి న్యాయం కాదు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “ఎవరైతే దుఃఖం, బాధ లేదా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, “భాగస్వామి లేని అల్లాహ్ యే నా ప్రభువు” అని పలికితే, అతను దాని నుండి ఉపశమనం పొందుతాడు.” [36]
మునావి ఇలా అన్నారు: ఎవరైతే “భాగస్వామి లేని అల్లాహ్ యే నా ప్రభువు” అని దాని అర్థాన్ని గ్రహించి మరియు దానిని తు.చ. తప్పకుండా పాటిస్తూ, భాగస్వామి లేని అల్లాహ్ యే తన ప్రభువని మరియు కేవలం అల్లాహ్ మాత్రమే తన బాధను దూరం చేయగలడని దృఢంగా నమ్ముతూ, చిత్తశుద్ధితో పలుకుతారో మరియు ఆయన వైపుకే మరలుతాడో, అల్లాహ్ అతడి నిరాశ పరుచడు. ఎవరైనా తన ప్రభువు వైపుకు మరలి, అతని వ్యవహారాన్ని అల్లాహ్ కు అప్పగించి, అల్లాహ్ సార్వభౌమత్వంలో ఎవరినీ భాగస్వాములుగా చేర్చకుండా తనను తాను అల్లాహ్ కు సమర్పించు కున్నప్పుడు, అతని బాధ ఖచ్చితంగా తగ్గిపోతుంది మరియు ఎవరైనా అజాగ్రత్తతో ప్రార్థించినప్పుడు, అతని ప్రార్థనకు అస్సలు జవాబు లభించదు.[37]
కొంతమంది పూర్వకాలపు సజ్జనులు (సలఫ్) ఇలా అన్నారు: “ప్రార్థన వ్యాధికి సమర్థవంతమైన విరుగుడు, కానీ అజాగ్రత్త దానిని అసమర్థంగా మారుస్తుంది, చట్టవిరుద్ధమైన (హరాం) మార్గాల ద్వారా సంపాదించిన జీవనోపాధి వలె.”
- ఒకరి దుఆకు జవాబు లభించాలంటే, అతని జీవనోపాధి సక్రమంగా, ధర్మబద్ధంగా మరియు స్వచ్ఛంగా ఉండాలి. అబీ హురైరహ్ ఇలా ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు, “ఓ ప్రజలారా! అల్లాహ్ పరిశుద్ధుడు మరియు అందువల్ల పవిత్రమైన దానిని మాత్రమే స్వీకరిస్తాడు. అల్లాహ్ తన ప్రవక్తలకు ఆజ్ఞాపించినట్లుగా విశ్వాసులకు కూడా ఇలా ఆజ్ఞాపించాడు: ‘ఓ ప్రవక్తలారా! మంచివి తినండి మరియు మంచి పనులు చేయండి.’ (23:51) మరియు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: ‘ఓ (అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని అంటే ఇస్లామీయ ఏకధర్మాన్ని) విశ్వసించేవారలారా! మేము మీకు అందించిన చట్టబద్ధమైన వాటిని మాత్రమే తినండి…” (2:172). అప్పుడు ఆయన (ﷺ) చాలా కాలం పాటు ప్రయాణించే వ్యక్తి గురించి ఇలా ప్రస్తావించారు, అతని జుట్టు చిరిగి పోయి, దుమ్ముతో కప్పబడి ఉంటుంది. అతను ఆకాశం వైపు తన చేతులు ఎత్తి ఇలా వేడుకున్నాడు: ‘ఓ నా ప్రభూ! ఓ నా ప్రభూ!’ కానీ అతని ఆహారం అధర్మమైనది, అతని పానీయం అధర్మమైనది, అతని బట్టలు అధర్మమైనవి మరియు అతని పోషణ అధర్మమైనది, అలాంటప్పుడు అతని ప్రార్థన ఎలా ఆమోదించ బడుతుంది?” [38]
ఈ హదీథుపై వ్యాఖ్యానిస్తూ, ఇబ్న్ బాజ్ ఇలా అన్నారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన జుట్టు చిందరవందరగా మరియు దుమ్ముతో చాలా దూరం ప్రయాణించే వ్యక్తి గురించి ప్రస్తావించారు, అతను “నా ప్రభువా, నా ప్రభువా” అని స్వర్గం వైపు తన చేతులను పైకి లేపాడు. ఈ వ్యక్తి ఒకరి ప్రార్థన ఆమోదించ బడటానికి సంబంధించిన అన్ని అంశాలను బాగా పూర్తి చేస్తున్నది. అతను చిందర వందరగా మరియు దుమ్ముతో నిండిన జుట్టు కలిగి, అసహాయ స్థితిలో ఉన్న ప్రయాణికుడు. వాని గురించి అల్లాహ్ ప్రకటన ఇలా ఉన్నది:
{أَمَّن يُجِيبُ ٱلْمُضْطَرَّ إِذَا دَعَاهُ} النمل: ٦٢
[కలత చెందినవాడు మొరపెట్టుకున్నప్పుడు, అతని మొరను ఆలకించి, అతని వ్యాకులతను దూరం చేసేవాడెవడు?] 27:62
అతను “ఓ ప్రభూ, ఓ ప్రభూ” అని ప్రభువును ఏడుస్తూ మొరపెట్టుకోవడం, ఆమోదించ బడటానికి సంబంధించిన అన్ని అంశాలకు కట్టుబడి ఉన్నప్పటికీ, అతని ప్రార్థన అంగీకరించబడలేదు. ఎందుకు? ఎందుకంటే అతని జీవనోపాధి, పోషణ మరియు దుస్తులు ఇవన్నీ అధర్మమైనవి. అందువల్ల, పౌష్టికాహారం, ఆహారపదార్థాలు మరియు దుస్తుల కొరకు అధర్మమైన మార్గాలపై ఆధారపడటం అనేది అతని ప్రార్థనకు జవాబు ఇవ్వబడే అవకాశాలు కోల్పోయేలా చేస్తుంది.
అందువల్ల, విశ్వాసి అల్లాహ్‌కు భయపడాలి మరియు ఆయనను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. అతను తన జీవనోపాధి మరియు ఆహారాన్ని సంపాదించడానికి ధర్మబద్ధమైన మార్గాలను మాత్రమే అన్వేషించాలి. అతను ధర్మబద్ధమైన జీవనోపాధికి కట్టుబడి ఉండకపోతే మరియు అధర్మమైన వాటిని వదులుకోకుంటే, ఆమోదించబడే ఇతర అంశాలకు కట్టుబడి ఉన్నప్పటికీ అతని ప్రార్థన అంగీకరించబడదు. కొన్నిసార్లు అవిశ్వాసి బాధలో, కష్టంలో ఉన్నప్పుడు అతని ప్రార్థన కూడా అంగీకరించ బడుతుంది. అధర్మమైన జీవనోపాధిని సంపాదించే వానికి భిన్నంగా, హలాల్ (చట్టబద్ధమైనది) సంపాదన మరియు అల్లాహ్ పట్ల చిత్తశుద్ధితో కూడిన భయభక్తులు కలిగి ఉండటమనే అంశాలకు ఒక వ్యక్తి కట్టుబడి ఉండటం, అతని ప్రార్థన ఆమోదించబడటానికి గల బలమైన కారణాలలో ఒకటి అవుతుంది. అల్లాహ్ ద్వారా తప్ప, మనకు (ఈ అంశాలకు అనుగుణంగా) జీవించే శక్తి మరియు సామర్ధ్యం లేదు. భద్రత కోసం మనం ఆయనను వేడుకుందాము. [39]
దీనిపై కొందరు పూర్వకాలపు సజ్జనులు (సలఫ్), ఇలా అన్నారు: “ప్రార్థన వ్యాధికి ప్రభావవంతమైన విరుగుడు, కానీ అజాగ్రత్త దానిని అసమర్థంగా మారుస్తుంది, అధర్మం ద్వారా సంపాదించిన జీవనోపాధి వలె.”
- మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన అసహాయతను ప్రదర్శించాలి మరియు ఇస్తిఖారహ్ దుఆలో మన వేడుకున్నట్లు, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క మహాశక్తిని మరియు సామర్ధ్యాన్ని ఆశ్రయించాలి:
اللَّهُمَّ إِنِّي أَسْتَخِيرُكَ بِعِلْمِكَ وَأَسْتَقْدِرُكَ بِقُدْرَتِكَ وَأَسْأَلُكَ مِنْ فَضْلِكَ ، فَإِنَّكَ تَقْدِرُ وَلا أَقْدِرُ وَتَعْلَمُ وَلا أَعْلَمُ وَأَنْتَ عَلامُ الْغُيُوبِ اللَّهُمَّ فَإِنْ كُنْتَ تَعْلَمُ هَذَا الأَمْرَ ثُمَّ تُسَمِّيهِ بِعَيْنِهِ خَيْرًا لِي فِي عَاجِلِ أَمْرِي وَآجِلِهِ قَالَ أَوْ فِي دِينِي وَمَعَاشِي وَعَاقِبَةِ أَمْرِي فَاقْدُرْهُ لِي وَيَسِّرْهُ لِي ثُمَّ بَارِكْ لِي فِيهِ اللَّهُمَّ وَإِنْ كُنْتَ تَعْلَمُ أَنَّهُ شَرٌّ لِي فِي دِينِي وَمَعَاشِي وَعَاقِبَةِ أَمْرِي أَوْ قَالَ فِي عَاجِلِ أَمْرِي وَآجِلِهِ فَاصْرِفْنِي عَنْهُ [ واصرفه عني ] وَاقْدُرْ لِي الْخَيْرَ حَيْثُ كَانَ ثُمَّ رَضِّنِي بِهِ .
“ ‘అల్లాహుమ్మా ఇన్నీ అస్తఖీరుక బి‘ఇల్మిక, వ అస్తఖ్’దిరుక బి ఖుద్’రతిక, వ అస్’అలుక మిన్ ఫద్’లిక, ఫఇన్నక తఖ్’దిరు వలా అఖ్’దిరు, వ త‘లము వలా అ‘లము, వ అంత ‘అల్లాముల్ గుయూబ్. అల్లాహుమ్మ ఫఇన్ కుంత తఅ’లము *హాదల్ అమ్’ర (ఈ విషయం), తుమ్మ తుసమ్మీహి బి ఐ’నిహి ఖైరన్ లీ ఫీ ఆజిలి అమ్’రీ వ ఆజిలిహి ఖాల ఔ ఫీ దీనీ వ మఆషీ వ ఆఖిబతి అమ్’రీ ఫఖ్’దుర్’హు లీ వ యస్సిర్’హు లీ తుమ్మ బారిక్ లీ ఫీహి. అల్లాహుమ్మ వ ఇన్ కుంత త’అలము అన్నహు షర్రున్ లీ దీనీ వ మఆషీ వ ఆఖిబతి అమ్’రీ, ఔ ఖాల ఫీ ఆజిలి అమ్’రీ వ ఆజిలిహి ఫస్’రిఫ్’నీ అన్’హు (వ ఇస్’రఫ్’హు అన్నీ) వఖ్’దుర్ లిల్ ఖైర హైతు కాన థుమ్మ రద్దినీ బిహి.
*హాదల్-అమ్ర్ (ఈ విషయం) – మీరు ఈ పదాన్ని మీరు అల్లాహ్‌ను సహాయం కోసం అడుగుతున్న దానితో భర్తీ చేయాలి ఉదా. వివాహం గురించి, ఉద్యోగం, ఇల్లు వదిలివెళ్ళడం…
అనువాదం: ఓ అల్లాహ్! నేను నీ జ్ఞానం ద్వారా నీ మార్గదర్శకత్వాన్ని [ఎంపిక చేసుకోవడంలో] కోరుతున్నాను మరియు నీవు మహాశక్తివంతుడివి గనుక నాకు కూడా (నా వ్యవహారాలు చక్కబెట్టే) శక్తిని ప్రసాదించమని వేడుకుంటున్నాను మరియు నాపై నీ గొప్ప అనుగ్రహం ప్రసాదించమని నేను నిన్ను అర్థిస్తున్నాను. నీ వద్ద తిరుగులేని అధికారం ఉంది, నా వద్ద ఏమీ లేదు. మరియు నీకు ప్రతిదీ తెలుసు, నాకు ఏమీ తెలియదు. నీవు అగోచరమైన విషయాలు కూడా ఎరిగిన వాడవు. ఓ అల్లాహ్! నీ జ్ఞానంలో, ఒకవేళ ఈ విషయం (పేరుతో పేర్కొనాలి) నాకు ఇహలోకంలో మరియు పరలోకంలో (లేదా: నా ధర్మంలో, నా జీవనోపాధిలో మరియు నా వ్యవహారాలలో) మంచిదైతే, నాకు దీనిని ప్రసాదించు, దీనిని నా కొరకు సులభతరం చేయి మరియు దీనిలో నా కోసం శుభాల్ని ప్రసాదించు. మరియు నీ జ్ఞానంలో ఒకవేళ ఈ విషయం నాకు మరియు నా ధర్మానికి, నా జీవనోపాధికి మరియు నా వ్యవహారాలకు (లేదా: నాకు ఇహలోకంలో మరియు పరలోకంలో) చెడ్డది అయితే, నన్ను దీని నుండి దూరం చేయి, [మరియు దీనిని నా నుండి దూరం చేయి], మరియు అది ఎక్కడ ఉన్నా నాకు మంచిని ప్రసాదించు మరియు దానితో నన్ను సంతోషపడేలా, సంతుష్టపడేలా చేయి.[40]
మన వ్యవహారాల్ని అల్లాహ్‌కు అప్పగించాలి మరియు ప్రతిదానిలో ఆయన అనుగ్రహాన్ని అర్థించాలి. మన జ్ఞానం పరిమితమైనది. కాబట్టి మన కొరకు ఏది న్యాయమైనది మరియు ఏది అన్యాయమైనది అనే దానిపై ఆయన జ్ఞానంతో మన అవసరాలను సరిచూసుకోవడానికి, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క సమగ్ర జ్ఞానం గ్రహించడం ఎంతో అవసరం.
- దుఆల ఆమోదం కోసం, ముందుగా మనం పశ్చాత్తాపం చెందాలి అంటే మన తప్పుల నుండి, మన పాపాల నుండి తౌబా చేసుకోవాలి మరియు మన దుష్కర్మలకు పరిహారం చెల్లించాలి. తన పాపాన్ని, తప్పును ఒప్పుకోవడం దుఆ యొక్క ప్రధాన మర్యాదలలో ఒకటి. అందుచేత ప్రార్థించడానికి చేతులు పైకెత్తే ముందు పశ్చాత్తాప పడి, ఇతరులకు చేసిన అన్యాయాలకు బదులు చెల్లించుకోవాలి అంటే వారి క్షమాపణ కోరుకోవాలి, అవసరమైన చోట వారికి పరిహారం చెల్లించుకోవాలి.
ఇబ్నుల్ జౌజీ ఇలా అన్నారు: “ఒకరి దుఆ అంగీకరించబడే సూక్ష్మమైన మరియు ప్రధానమైన మర్యాదలలో ఒకటి పశ్చాత్తాపం చెందడం మరియు ఇతరులకు చేసిన అన్యాయానికి పరిహారం చెల్లిచడం.”[41]
ముస్లింలకు అల్లాహ్, ఆయన మద్దతు, సహాయం, ప్రోత్సాహం, దయ మరియు తమ ప్రార్థనలకు ఆయన ప్రతిస్పందన చాలా అవసరం. అలాంటప్పుడు ఆయనను ధిక్కరించి, ఆయన జీవులకు అన్యాయం చేసి, తన ప్రార్థనను అంగీకరించమని అడగడానికి అతను ఎలా ధైర్యం చేయగలడు! పశ్చాత్తాపం చెందడానికి, పాపాన్ని విడిచిపెట్టడానికి మరియు ఆయన దాసులపై దౌర్జన్యం చేయకుండా ఆగిపోవడానికి మన ప్రార్థనలను మరియు అల్లాహ్ యొక్క అవసరాన్ని మన కొరకు ఒక శక్తివంతమైన కారణంగా ఎందుకు పరిగణించకూడదు? సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్‌లో మనం ఈ పదాలు పలకడం లేదా:
اللَّهُمَّ أَنْتَ رَبِّي لَا إِلَهَ إِلَّا أَنْتَ خَلَقْتَنِي وَأَنَا عَبْدُكَ وَأَنَا عَلَى عَهْدِكَ وَوَعْدِكَ مَا اسْتَطَعْتُ ، أَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا صَنَعْتُ ، أَبُوءُ لَكَ بِنِعْمَتِكَ عَلَيَّ وَأَبُوءُ لَكَ بِذَنْبِي فَاغْفِرْ لِي فَإِنَّهُ لَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ
అల్లాహుమ్మ అంత రబ్బీ, లా ఇలాహ ఇల్లా అంత ఖలఖ్’తనీ వ అన అ’బ్’దుక వ అ’న అలా అహ్’దిక వ వవా’దిక మస్’తత’అతు. అఊదుబిక మిన్ షర్రి మాసన’అతు, అబూఉ లక అలయ్య వ అబూఉ లక బిదంబీ, ఫగ్’ఫిర్’లీ ఫఇన్నహు లా యగ్’ఫిరుద్’దునూబ ఇల్లా అంత.
ఓ అల్లాహ్, నువ్వే నా ప్రభువు, నువ్వు తప్ప ఆరాధనకు అర్హుడు మరొకడు లేడు. నీవే నన్ను సృష్టించావు మరియు నేను నీ దాసుడిని. నాకు సాధ్యమైనంత వరకు నేను నీ ఒడంబడికను మరియు నీతో నా ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటాను. నేను చేసిన చెడు నుండి నేను నిన్ను శరణు వేడు కుంటున్నాను. నాపై నీవు చూపిన అనుగ్రహాలను నేను అంగీకరిస్తున్నాను, మరియు నేను నా తప్పులను ఒప్పుకుంటాను. నన్ను క్షమించు, ఎందుకంటే నీవు తప్ప పాపాలను క్షమించేవారు ఎవ్వరూ లేరు.[42]
కాబట్టి, ముందుగా మన పాపాలను గుర్తించి, అల్లాహ్‌ను ఆశ్రయించి, మనల్ని క్షమించమని కోరుకుందాం.
ప్రవక్త యూనుస్ (అ) తన ప్రభువును మొరపెట్టుకున్నప్పుడు ప్రవక్త హోదాలో ఉన్నప్పటికీ తాను తప్పు చేశానని అంగీకరించాడు:
{فَنَادَىٰ فِى ٱلظُّلُمَـٰتِ أَن لَّآ إِلَـٰهَ إِلَّآ أَنتَ سُبْحَـٰنَكَ إِنِّى كُنتُ مِنَ ٱلظَّـٰلِمِينَ} الأنبياء: ٨٧
[ఆఖరికి అతను చీకట్లలో నుంచి, “అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు. నిజానికి నేనే దోషులలో చేరిన వాణ్ణి” అని మొర పెట్టుకున్నాడు.] 21:87
- ఎవరైనా స్వయంగా తనకు, తన ఆస్తికి, తన కుటుంబానికి మరియు తన పిల్లలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయకూడదు. అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “ప్రార్థనలు ఆమోదించబడే సమయంలో మరియు మీ ప్రార్థన మన్నించబడే క్షణంలో మీరు స్వయంగా మీపై లేదా మీ పిల్లలపై లేదా మీ ఆస్తులపై శాపనార్థాలు పెట్టకండి.”[43]
అల్లాహ్ ఆగ్రహాన్ని క్రిందికి పంపే సమయం యాదృచ్ఛికంగా ఒకవేళ వారి శపించే సమయంతో ఏకీభవించి, తమలో, కుటుంబంలో, ఆస్తులలో మరియు పిల్లలలో చాలా మందికి దుస్థితి ఏర్పడింది. కాబట్టి, జీవితకాల పశ్చాత్తాపాన్ని నివారించడానికి మనకు, మన పిల్లలకు, స్మార్ట్‌ఫోన్‌లు, వాహనాలు మరియు మన వద్ద ఉన్న ప్రతిదానికీ వ్యతిరేకంగా శాపాన్ని ప్రేరేపించకుండా ఉండటాన్ని మనం అలవాటు చేసుకోవాలి.
దుఆ చేయడంలో పాటించవలసిన కొన్ని ప్రధాన మర్యాదలు:
- తన దుఆను మూడుసార్లు పునరావృతం చేయాలి, తన ముఖాన్ని ఖిబ్లా వైపు త్రిప్పి ఉంచాలి మరియు చేతులు పైకెత్తాలి. అబ్దుల్లాహ్ ఇబ్న్ మసూద్ (రదియల్లాహు అన్హు)ఉల్లేఖన ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నమాజు చేసినప్పుడు, తన దుఆను మూడుసార్లు రిపీట్ చేసారు మరియు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్ ను అడిగినప్పుడు, మూడుసార్లు అడిగారు.[44]
షేఖ్ ఇబ్న్ బాజ్ దుఆ చేసేటప్పుడు ఒకరి ముఖాన్ని ఖిబ్లా వైపు మళ్లించడం ఉత్తమమని చెప్పారు.[45]
ఆయన ఇంకా ఇలా అన్నారు: దుఆ చేస్తున్నప్పుడు చేతులు పైకెత్తడం అనేది ఒకరి ప్రార్థన ఎక్కడైనా ప్రతిస్పందించడానికి కారణం. అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “మీ ప్రభువు నిరాడంబరత మరియు దాపరికానికి ప్రతీక. ఆయన తన దాసుడు తన వైపు చేతులు ఎత్తినప్పుడు ఖాళీ చేతులతో అతడిని వాపసు చేయడానికి బిడియ పడతాడు.” [46]
- దుఆ చేసేటప్పుడు స్వచ్ఛతను కాపాడుకోవాలి. షేఖ్ ఇబ్న్ బాజ్ ఇలా అన్నారు: “ఒకరి దుఆ సలాత్ (దరూద్) మరియు స్వచ్ఛతతో జత చేయబడి నప్పుడు, అది అంగీకరించబడే అవకాశం ఉంది.” [47]
- దుఆ చేసేటప్పుడు కన్నీళ్లు పారాలి. ఎవరో చెప్పిన ఈ క్రింది మాటలు ఎంతగానో హృదయాన్ని తాకుతున్నాయి:
అణుకువ మరియు వినయంతో అపార కరుణాప్రదాత అయిన అల్లాహ్ యొక్క తలుపు దగ్గర నిలబడండి. ఆయనకు తల వంచండి, దీనంగా వేడుకోండి, మీ కళ్ళు కన్నీళ్లు పారేలా చేయండి మరియు మీ హృదయాన్ని అణుకువతో, నమ్రతతో నింపండి. నీ ప్రభువు ద్వారం వద్దకు తప్ప నీవు ఇంకెక్కడికీ వెళ్ళే అవకాశం అస్సలు లేనప్పుడు, ఒకవేళ ఆయన నిన్ను తరిమివేస్తే, నీవు ఎక్కడికి వెళ్తావు మరియు ఎవరిని ఆశ్రయిస్తావు?
తన కోరికలను తన తల్లిదండ్రులతో వ్యక్తపరిచే చిన్నపిల్లవాడిలా ప్రవర్తించు, మరియు వారు ఆ పసివాడిని ఆపినప్పుడు లేదా అతను అడిగినది ఇవ్వనపుడు, అతను ఏడుపు ప్రారంభిస్తాడు. నీవు కూడా ఈ పిల్లాడి వలే మారు. నీవు నీ ప్రభువును అడిగినప్పుడు మరియు ఆయన నీ అభ్యర్థనను స్వీకరించనప్పుడు, పసిబిడ్డలా ఏడపు ప్రారంభించు. ప్రతిస్పందన ఆలస్యమైతే, నీ పరిస్థితిని ఈ మాటలతో నీ ప్రభువుతో చెప్పే విధంగా నీ ప్రభువు తలుపు వద్ద కన్నీళ్లు పెట్టుకో: నా ప్రభూ, నేను నీ తలుపు దగ్గర నిలబడి, నీ రక్షణలో ఆశ్రయం పొందగోరు తున్నాను, నీ క్షమాపణ, మెప్పుదల మరియు అనుగ్రహాన్ని ఆశిస్తున్నాను. నీవు నన్ను పట్టించుకోకపోతే, నన్ను దగ్గరకు తీసుకోవడానికి ఇంకెవరు ఉన్నారు? నీవు నన్ను విడిచిపెడితే, నన్ను అంగీకరించడానికి ఎవరు ఉన్నారు ? మరియు నీవు నన్ను విడిచిపెట్టినట్లయితే, నాకు సహాయం చేయడానికి ఎవరు ఉన్నారు? నీవు తప్ప నాకు వేరే ప్రభువు మరియు యజమాని లేడు. నీ కోపం నుండి నీ ఆనందంలో, నీ శిక్ష నుండి నీ భద్రతలో మరియు నీ నుండి నీలో నేను శరణు కోరుతున్నాను. నీ ప్రశంసలను నేను లెక్కించలేను. నిన్ను నీవు పొగిడినట్లే నీవు ఉన్నావు. నీవు అత్యంత ఉదారమైన వాడివి మరియు దాతృత్వము గలవాడివి. నీ శక్తి మరియు సామర్ధ్యము తప్ప మరే శక్తీ మరియు సామర్ధ్యమూ మొత్తం సృష్టిలోనే లేదు.
దుఆ యొక్క ఉద్దేశ్యం ధర్మబద్ధంగా ఉండాలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మోసెస్ చేసిన ప్రార్థనలో మనం చూస్తున్నట్లుగా, మంచి పనులు చేయడానికి తనను నడిపించే సమ్మతి కొరకు అతను అల్లాహ్ ను అడగాలి:
{هَـٰرُونَ أَخِى ٱشْدُدْ بِهِۦٓ أَزْرِى وَأَشْرِكْهُ فِىٓ أَمْرِى كَىْ نُسَبِّحَكَ كَثِيرًۭا وَنَذْكُرَكَ كَثِيرًا} طه: ٣٠-٣٥
“అంటే, నా సోదరుడైన హారూనును (నియమించు) ! అతని ద్వారా నా బలాన్ని పెంచు. నా కార్యంలో అతన్ని నా భాగస్థునిగాచేయి. తద్వారా మేమిద్దరం నీ పవిత్రతను అత్యధికంగా కొనియాడ గలగటానికి! నిన్ను అత్యధికంగా స్మరిస్తూ ఉండటానికి!! నిశ్చయంగా నువ్వు మమ్మల్ని బాగా కనిపెట్టుకుని ఉండే వాడవు.” 20:30-35
- అల్లాహ్ వద్ద ప్రవక్త అయ్యూబ్ (అ) ఇలా అర్థించినట్లు మీ దుఃఖం, కష్టం, నష్టం మరియు అవసరాన్ని గురించి మీరు కూడా అల్లాహ్ ను అర్థించండి:
{وَأَيُّوبَ إِذْ نَادَىٰ رَبَّهُۥٓ أَنِّى مَسَّنِىَ ٱلضُّرُّ وَأَنتَ أَرْحَمُ ٱلرَّٰحِمِينَ} الأنبياء: ٨٣
[మరి అయ్యూబు (స్థితిని గురించి కూడా ఓసారి మననం చేసుకోండి). అతను “నాకు ఈ వ్యాధి సోకింది. నువ్వు కరుణించే వారందరిలోకీ అపారంగా కరుణించేవాడవని” తన ప్రభువును మొరపెట్టు కున్నప్పుడు,] 21:83
- మీ స్వరాన్ని తగ్గించండి మరియు ఖుర్ఆన్‌లో పేర్కొన్న విధంగా నిశ్శబ్దంగా, లోగొంతుతో దుఆ చేయండి:
{ٱدْعُوا رَبَّكُمْ تَضَرُّعًۭا وَخُفْيَةً ۚ إِنَّهُۥ لَا يُحِبُّ ٱلْمُعْتَدِينَ} الأعراف: ٥٥
[వినయంగా మరియు రహస్యంగా మీ ప్రభువును ప్రార్థించండి. నిశ్చయంగా, ఆయన అతిక్రమించేవారిని ఇష్టపడడు.] 7:55
ఈ ఆయతును వివరిస్తూ ఇబ్న్ కతీర్ ఇలా అన్నారు: సహీహైన్‌లో, అబీ మూసా అష్‌అరీ (ర.అ) ఉల్లేఖన ప్రకారం అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “ఓ ప్రజలారా! తేలికగా తీసుకోండి. మీరు ఎవరిని పిలుస్తున్నారో ఆయన చెవిటివాడూ కాదు లేదా మీకు దూరంగానూ లేడు. ఆయన మీకు చేరువలోనే (అంటే, తన అపూర్వ జ్ఞానం ద్వారా) ఉన్నాడు, ఆయన ప్రతిదీ వినేవాడు మరియు ఆయన మీ సమీపంలోనే ఉన్నాడు.”
అతా అల్-ఖుర్సానీ నుండి ఇబ్న్ జురైజ్ ఇలా తెలిపారు, ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: ఆయతులోని “تَضَرُّعًۭا وَخُفۡيَةً” అనే పదానికి ‘రహస్యంగా’ అని అర్థం. అంటే మీ ప్రభువును మీ ప్రభువు యొక్క ఏకత్వం మరియు రుబుబియా (లార్డ్‌షిప్) పట్ల మీకున్న నమ్మకంతో మీకు మరియు ఆయనకు మధ్య రహస్యంగా మాత్రమే, బహిరంగంగా మరియు ఆడంబరంగా కాకుండా మీ వినయ హృదయంతో ప్రార్థించండి.
జైద్ బిన్ థాబిత్ నుండి అబూ దర్దా (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖించారు, అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తనకు ఒక దుఆ బోధించారని మరియు దానిని ప్రతి రోజు చేసేలా తన కుటుంబ సభ్యులకు ఆజ్ఞాపించమని ఆదేశించారు. ప్రతిరోజూ ఉదయం ఈ దుఆను ఉచ్చరించండని ఆయన అన్నారు:
లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ వ సదైక్ వల్ ఖైరు ఫీ యదైక్ వ మింక వ బికా వ ఇలైక్. అస్అలుక అల్లాహుమ్మ అర్-రిదా బదల్ ఖదా, వ అష్’హదు అన్నక ఇన్ తకిల్ని ఇలా నఫ్సీ, తకిల్ని ఇలా ధై’అతిన్ వ ఔరతిన్ వ దంబిన్ వ ఖతీ’అతిన్. వ ఇన్నీ లా అతిఖు ఇల్లా బి రహ్మతిక్. ఫగ్ఫిర్ లి దంబీ కుల్లహు. ఇన్నహు లా యగ్ఫిరూజ్ దునూబ ఇల్లా అంత, వ తుబ్ అలయ్య ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీమ్.
ఓ అల్లాహ్, లబ్బైక్ (నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను), వ సదైక్ (నాకు శుభాల తర్వాత శుభాలు ప్రసాదించు). మంచి నీ చేతిలోనే ఉంది మరియు అది నీ నుండి, నీ ద్వారా మరియు నీ వైపుకు. ఓ అల్లాహ్, నేను విధివ్రాతతో సంతృప్తి పడేలా చేయమని అర్థిస్తున్నాను. నీవు నాకు నన్ను అప్పగించి నట్లయితే (నా మానాన నన్ను విడిచి పెట్టినట్లయితే), నీవు నన్ను నష్టానికి, వ్యర్థానికి, పాపానికి మరియు అతిక్రమానికి గురయ్యేలా వదిలి వేసినట్లు అవుతుందని నేను సాక్ష్యమిస్తున్నాను. నేను నీ దయను మాత్రమే విశ్వసిస్తున్నాను. నా పాపాన్ని క్షమించు, ఎందుకంటే నీవు తప్ప మరెవరూ పాపాలను క్షమించేవారు లేరు మరియు నా పశ్చాత్తాపాన్ని అంగీకరించు. నిశ్చయంగా, నీవు సర్వాన్ని ఆమోదించే వాడివి మరియు అమితమైన దయగలవాడివి.[48]
వివిధ దేశాల నుండి ప్రార్థన ప్రభావంపై నేను నేరుగా విన్న నిజమైన గాథలు మరియు నేను వాటి శైలిలో మరియు కథనంలో చిన్న మార్పుతో ఇక్కడ వివరించాను:
మొదటి వృత్తాంతం:
నేను తీవ్రమైన క్యాన్సర్‌తో బాధపడ్డాను. అటువంటి క్యాన్సర్‌కు ప్రభావిత ప్రాంతాన్ని సర్జరీ ద్వారా తొలగించడం తప్ప రోగాన్ని నిరోధించే మరో చికిత్స లేదని వైద్యులు చెప్పారు. నేను పూర్తి ఖుర్ఆన్‌తో నిరంతరం రుఖయా చేసాను మరియు హృదయాన్ని హత్తుకునే ఆయతులను మరలా మరలా పఠించాను. నేను నిరంతరం అల్లాహ్ ను ప్రార్థిస్తూ పదే పదే ఇలా అర్థించాను: “ఓ అల్లాహ్, నీ దయ అన్నింటికి సమగ్రమైనదని నీవు నిజముగానే చెప్పావు మరియు నేను వీటిలో ఒకడిని, అన్నిటికీ సమగ్రమైన నీ దయను అభ్యర్థిస్తున్నాను.” నేను అల్లాహ్ ను పదే పదే స్మరించుకున్నాను, ధ్యానించాను, వేడుకున్నాను. నేను బలహీన పడినట్లు మరియు సాతానుచే తప్పుదారి పట్టినట్లు అనిపించినప్పుడు, నేను మరలా బలాన్ని పొందడానికి (ఇస్లామీయ) ఉపన్యాసాలు విన్నాను మరియు నా ప్రభావిత భాగాన్ని తొలగించే ప్రక్రియ కోసం ఇస్తిఖారహ్ చేసాను.
చివరికి సర్జరీ సమయం ఆసన్నమైనప్పుడు, నా వ్యాధి నయమై పోయిందనే ఒక వింత భావన నాలో కలిగింది. నాకు ఇంకా సర్జరీ ప్రక్రియ అవసరమా కాదా అని నిర్ధారించుకోవడానికి మరలా స్కానింగ్ చేయమని నేను డాక్టర్ ని అడిగాను, కానీ ఆమె సర్జరీ చేయవలసినదే అని నొక్కి చెప్పింది. ఎందుకంటే నా క్యాన్సర్ చాలా తీవ్రమైన దశలో ఉందని మరియు దాని తొలగింపు శస్త్రచికిత్స తప్పనిసరిగా చేయవలసినదేనని ఆమెకు ఖచ్చితంగా తెలుసు. నేను ఆమె పట్టుదలకు లొంగిపోయాను. శస్త్రచికిత్స మొదలు పెట్టిన తరువాత, నా రొమ్ములో క్యాన్సర్ కణాలు లేవని తెలుసు కుని ఆమె ఆశ్చర్యపోయింది. నేను అల్లాహ్ ను మెచ్చుకున్నాను మరియు నా దుఆలు ఆమోదించినందుకు కృతజ్ఞతగా ఆయనకు సజ్దా చేసాను. అల్లాహ్ నా దుఆను ఆమోదించిన ఆనందం నా క్యాన్సర్ కణాల తొలగింపు శస్త్రచికిత్స యొక్క బాధను మరచి పోయేలా చేసింది.
కొన్నాళ్ళ తర్వాత వారు క్యాన్సర్ నా ఎముకలకు చేరిందని చెప్పారు. నేను మరలా నా దుఆ పునరావృతం చేసాను: యా ఖవియ్యు, యా అజీజ్, యా మన్ లా ఘాలిబ లక్. (ఓ బలవంతుడా, ఓ శక్తిమంతుడా, ఎవరి చేతను అధిగమింపబడని వాడా) ఆ తర్వాత వారు మరోసారి CT స్కాన్ చేశారు, అది నా ఎముకలు దెబ్బతినకుండా చెక్కుచెదరకుండా ఉన్నాయని చూపించింది. రమదాన్ మాసం రాగానే వారు క్యాన్సర్ నా కడుపులోకి చేరిందని చెప్పారు. నేను ప్రత్యేకంగా బేసి రాత్రులలో క్రమం తప్పకుండా మరియు తీవ్రంగా ప్రార్థించాను. థిక్ర్ మరియు దువాతో నా నాలుక ఎప్పుడూ అలసిపోలేదు. నేను మరలా మరలా ఇలా దుఆ చేసాను: “నా ప్రభూ, ప్రార్థన నొప్పి నుండి ఉపశమనం ప్రసాదిస్తుందని నీ ప్రవక్త మాకు చెప్పారు. నా ప్రభూ, నువ్వు అన్నింటికీ సమర్థుడని నాకు తెలుసు.” CT స్కాన్ చేయగా, నా గర్భంలో క్యాన్సర్ కణాలు లేవని చెప్పారు. అల్లాహ్ కు నా కృతజ్ఞతలు తెలియ జేయడానికి నేను ఆసుపత్రిలోనే సాష్టాంగ పడ్డాను మరియు నా ప్రభువు దయగలవాడని మరియు ఆయన అనుగ్రహాలు సమృద్ధిగా ఉన్నాయని నేను గ్రహించాను.
నా రొమ్ము తొలగించ బడితే, అది నన్ను అందవిహీనంగా మార్చు తుంది, నన్ను ముసలిదానిలా మరియు బలహీనమైన దానిలా చేస్తుంది. నేను వివాహానికి సరైన సమయాన్ని కోల్పోతాను. అలా ఏమీ జరగక పోయినప్పటికీ అల్లాహ్ సద్గుణమైన జీవిత భాగస్వామిని ఇస్తాడని నాకు గట్టి నమ్మకం ఉంది, ఆ పై నేను నా కథను వివరిస్తాను; అల్లాహ్ కు ఏదీ ఆటంకం కాదనీ మరియు ఆయన శక్తి ముందు ఏ ఆటంకం నిలబడదనీ మీకు నిరూపించడానికి. అల్లాహ్ తన మహావివేకం ద్వారా నిర్ణయించినంత కాలం నేను సహనం మరియు విశ్వాసానికి కట్టుబడి ఉంటాను.
రెండో వృత్తాంతం:
నాకు ఏడేళ్ల క్రితం పెళ్లయింది. ఒక కొడుకు కూడా పుట్టాడు. అల్లాహ్ అనుజ్ఞతో, నా కొడుకు అతి నెమ్మది ఎదుగుదలతో బాధపడ్డాడు. మేము అనేక ఆసుపత్రులు సందర్శించాము మరియు ప్రత్యేక కేంద్రాలలో చికిత్స ప్రక్రియను నిర్వహించాము, కానీ మెరుగుదల చాలా నెమ్మదిగా ఉంది మరియు అతి కష్టం మీద ఆ మెరుగుదల కనబడేది. నాకు మరియు నా భర్తకు మధ్య ఉద్రిక్తత ఏర్పడింది మరియు కుటుంబ ఒత్తిడి తీవ్రమైంది. నా కొడుకు రెండు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, నేను మరలా గర్భవతిని అయ్యాను. బిడ్డ కదలికలపై నాకు అసంబద్ధ సందేహాలు ఉండేవి. గర్భం ఆరవ నెలకు చేరుకున్నప్పుడు, నేను శిశు ఎదుగుదల విభాగంలో నిపుణుడైన ఒక మహిళా వైద్యురాలిని సంప్రదించాను. ఆమె మాట్లాడుతూ, మీ కుమార్తె అండర్‌గ్రోత్ సమస్యను ఎదుర్కొంటోంది మరియు చికిత్స అవసరం. ఆమె సోదరుడు అనుభవించింది కూడా అదే స్థితి అని నేను గుర్తించాను. దృఢత్వం, బలం మరియు సహనంతో నిండిన అల్లాహ్ కే అన్ని ప్రశంసలు. నేను ఇంటికి వెళ్ళే మార్గంలో ఏడ్చాను మరియు నా కూతురి గురించి నా కుటుంబ సభ్యులకు ఎలా చెప్పగలనని కలవరపడ్డాను; అయినప్పటికీ, నేను ధైర్యం తెచ్చుకుని, విషయం గురించి వారికి తెలియ జేసాను. వారు కన్నీళ్ల పర్యంతమయ్యారు, మరియు నేను వారిని శాంతింప జేశాను, ఇది అల్లాహ్ చే నిర్ణయించబడినది, ఆయన ఎవరిపైనా అతని సామర్థ్యానికి మించి భారం వేయడు. ఏడవకండి, కోలుకోవాలని ప్రార్థించండి.
ప్రజలు మాతో అనుచితంగా ప్రవర్తించేవారు మరియు వారి వ్యాఖ్యలు మమ్మల్ని ఇబ్బంది పెట్టేవి. మీ పిల్లలు వికలాంగులని వారు తమ మాటలతో మాపై ఎగతాళి చేసేవారు. మా పిల్లలు ఎప్పుడు మాట్లాడతారు? వారు అద్దాలు ఎందుకు ధరిస్తారు? మీ కుమార్తె ఎందుకు చిందిస్తుంది?
మొదట్లో, వారి వ్యాఖ్యలు నన్ను పూర్తిగా నిరాశపరిచేవి. అయితే, ఇప్పుడు నేను వాటిని అస్సలు పట్టించుకోను. ఆయన ఎవరినైనా ప్రేమించి నప్పుడు, ఆయన అతనికి కష్టాల పాలు చేసి పరీక్షిస్తాడు అనే నమ్మకంతో నేను నా వ్యవహారాన్ని అల్లాహ్ కు మాత్రమే అప్పగించాను. నేను చదివిన ఒక ఉల్లేఖనాన్ని నేను గుర్తుచేసుకున్నాను: “అల్లాహ్ తన నిర్దయ కారణంగా ఎవరినీ పరీక్షించడు, బదులుగా అతను తనకు ప్రియమైనవాడు కాబట్టి అతనిని అలా పరీక్షిస్తాడు” అని బాధపడేవారు తెలుసుకోవాలి. అల్లాహ్ తన రక్షణలో ఉన్నవారి పట్ల దయతో ఉంటాడని మరియు ఏదైనా ఉనికిలోకి రావాలని ఆయన తలచి నప్పుడు, ఆయన కేవలం “అయిపో” అనగానే, అది వెంటనే ఉనికిలోకి వస్తుందని నేను ఎప్పుడూ నాతో చెప్పుకునేదాన్ని. అల్లాహ్ వారిని స్వస్థ పరుస్తాడని, వారికి ఆరోగ్యం మరియు భద్రతను అనుగ్రహిస్తాడని మరియు వారితో మనలను ఆశీర్వదించేలా చేస్తాడని నేను దృఢ నిశ్చయంతో ప్రార్థించాను, మరలా మరలా ప్రార్థించాను. అల్’హమ్’దులిల్లాహ్, నేను సంతోషకరమైన వార్తల గురించి కలలు కన్నాను. నా కొడుకు, నా కూతురు క్షేమంగా నడవగలరని కలలు కన్నాను. రమదాన్‌లో అల్లాహ్ మాకు శుభవార్త నిచ్చాడు. ఆశ్చర్యంగా, నా కొడుకు నడవడం ప్రారంభించాడు. ఈ ఆనందకరమైన సంఘటనలో అపారమైన ఆనందం మరియు సంతోషం మమ్మల్ని చుట్టుముట్టాయి. ఆ క్షణంలో నా భావాలు వర్ణించలేనివి మరియు నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. అతను తన మొదటి అడుగు వేసినప్పుడు, అతనికి ఐదు సంవత్సరాలు. అదే సంవత్సరం రమదాన్‌లో, నా కుమార్తె నాలుగు సంవత్సరాల వయస్సులో తక్బీర్ (అల్లాహు అక్బర్) మరియు తహ్లీల్ (అల్’హమ్’దులిల్లాహ్) ల మధ్య తన మొదటి అడుగు వేసినప్పుడు అల్లాహ్ మమ్ముల్ని మరొక సంతోషకరమైన వార్తతో ఆశీర్వదించాడు. అన్ని ప్రశంసలు అల్లాహ్ కే!
ఇదంతా అల్లాహ్ అనుగ్రహం వల్లనే జరిగింది. ప్రసాదించినప్పుడు ప్రభువు యొక్క ప్రతిఫలం సమృద్ధిగా ఉంటుంది, మన ఊహలకు అందని విధంగా ప్రసాదించినప్పుడు ఆయన ప్రతిఫలం అపురూపంగానూ ఉంటుంది.
మూడో వృత్తాంతం:
హిజ్రీ 1411 సంవత్సరంలో నా అబ్బాయి 6వ తరగతి చదువు తున్నప్పుడు మద్యపానం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అతనికి మొదటిసారి తెలిసింది. అతను తనలో ఆల్కహాల్ గురించి అసాధారణమైన ఆందోళన పెంచుకున్నాడు, ఆ మేరకు ఆల్కహాల్‌తో కూడిన మందులన్నీ విసిరేయమని అతను కోరాడు, ఎందుకంటే సాతాను మద్యం సేవించమని ప్రలోభపెట్టవచ్చు మరియు అతను దానికి బానిసగా మారిపోవచ్చు.
ఈ ఆందోళన అతనిని సలాహ్ (నమాజు) మరియు ఇతర ఆరాధనలలో కలవరపెట్టేది. ప్రతిరోజూ చెమ్మగిల్లిన కళ్లతో నా దగ్గరకు వచ్చి, సాతాను నాతో అలా చేయి, ఇలా చేయి అంటున్నాడని చెప్పేవాడు.
ఐదేళ్లపాటు నేను అతడిని ఒప్పించటానికి ప్రయత్నించాను, కానీ నా ప్రయత్నాలు ఫలించలేదు. ఒకరోజు అతను నాతో ఇలా అనడంతో విషయం చాలా దారుణంగా మారిందని అర్థమైంది: అమ్మా, నేను ఈ ఆందోళనను ఎప్పటికీ వదిలించుకోలేనని సాతాను నాతో చెప్పాడు మరియు నేను నా కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను, అందుకే నేను కిటికీలో నుండి క్రిందికి దూకేయాలి అంటున్నాడు. ఇది విని నా మనసు చలించిపోయింది. రుఖయా చేసే ఒక మహిళను సందర్శించమని నా బంధువులు కొందరు నాకు సలహా ఇచ్చారు. నేను అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు, నా స్నేహితురాలు నాతో ఇలా చెప్పింది: “ఆ మహిళ మిమ్మల్ని మీ తల్లి పేరు మరియు మరికొన్ని సంబంధిత విషయాలు అడుగుతుంది. ఇలాంటి ప్రశ్నలకు చింతించకండి.” అయితే ఆ రుఖయా చేసే మహిళ తన విశ్వాసంలో దారి తప్పిందని నేను నిర్ధారించుకున్న తరువాత, ఆమె వ్రాసి ఇచ్చిన కొన్ని అంకెలు ఉన్న కాగితాన్ని నేను చింపి వేసాను. అప్పుడు గడియారం రాత్రి 11 గంటలు కొట్టింది. వెంటనే లేచి నేను ఉదూ చేసాను. తరువాత సలాహ్ చేసి, నా ప్రభువును ఇలా ప్రార్థించాను, “ఓ అల్లాహ్, నేను ఈ స్త్రీని విడిచిపెట్టాను, నీ సంతోషం కోసం మాత్రమే. మెరుగైన పరిష్కారంతో నాకు ప్రతిఫలమివ్వమని నేను నిన్ను అర్థిస్తున్నాను.”
పొద్దున్నే నా కొడుకు గురించి ఏదో ఒక రకంగా కంగారుపడుతూనే నా పని మీద వెళ్ళాను. రోజు గడిచి పోయింది. నేను ఇంటికి తిరిగి రాగానే, నా కొడుకు ప్రకాశించే ముఖంతో నన్ను స్వాగతిస్తూ, ఇలా అన్నాడు: అమ్మా, నా ఆందోళన ఇక లేదు. వెంటనే నేను అడిగాను: అదెలా జరిగింది?
ఉపాధ్యాయులలో ఒకరు ఉపన్యాసం ఇచ్చారు, అది విన్న తరువాత నా అసాధారణ ఆందోళన నాలో ఇక లేదని మరియు నేను జీవితంలోకి వచ్చినట్లు అనిపించింది.
నా ప్రభువా, అన్ని స్తుతులు నీకే. నీతో మాత్రమే జీవితం ఆనందంగా అనిపిస్తుంది. ఆ రోజు నుండి, అల్లాహ్ దయ మరియు కారుణ్యం వలన మా జీవితం తిరిగి సాధారణ స్థితికి వచ్చింది. ఇప్పుడు నా కొడుకు సివిల్ ఇంజనీర్ అయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు మరియు అతనికి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. అల్హమ్దులిల్లాహ్!
నాలుగో వృత్తాంతం:
తన దయతో, అల్లాహ్ నాకు చిన్నతనంలోనే మార్గనిర్దేశం చేశాడు. నేను పద్నాలుగు సంవత్సరాల వయస్సులో నఖాబ్ (ముసుగు) ధరించాను, ఇది నా సామాజిక పరిసరాలలో అసాధారణమైనది. నాకు ఇరవై సంవత్సరాల వయస్సు వచ్చినప్పటి నుండి, దయగల మరియు సద్గుణాలు కలిగిన భర్తను నాకు ప్రసాదించమని నేను అల్లాహ్ ను తీవ్రంగా ప్రార్థించాను. అయితే, నేను ముప్పై ఏళ్ల వరకు ఒంటరిగా ఉండాలని విధివ్రాతలో వ్రాయబడింది. ఒకరిద్దరు తప్ప నా చేతిని ఎవరూ అడగలేదు.
నా దుఆ ఎలా ఉన్నప్పటికీ, నేను కోరుకున్న లక్షణాలు ఉన్న ఒక్క మనిషిని కూడా నా సమాజంలో నేను కనుగొన లేకపోయాను. ఇతర అమ్మాయిలలో ఉన్న లక్షణాలు నాకు లేవని భావించాను. కొన్నిసార్లు నేను ఇతర అమ్మాయిల నుండి నా బురఖాపై ప్రతికూల వ్యాఖ్యలు విన్నాను. నా వివాహం ఆలస్యం కావడానికి అదే కారణమని నేను విన్నాను, కానీ వారి వ్యాఖ్య నన్ను ప్రభావితం చేయలేదు మరియు అది నన్ను అస్థిర పరచ లేదు. నేను నా దుఆలో ఇలా వేడుకున్నాను: నా ప్రభూ, నేను కోరుకున్న సంబంధం నా సమాజంలో లేక పోయినా, నా కోసం అలాంటి సంబంధాన్ని నీవు సృష్టించగలవని నాకు ఖచ్చితంగా తెలుసు. నేను కోరుకున్న వరుడి వివరాలన్నీ సజ్దా (సాష్టాంగం)లో అల్లాహ్ తో చెప్పు కున్నాను.
అల్లాహ్ ప్రమాణంగా! నా పరిసరాల్లో అలాంటి సంబంధం లేదు. ఇన్ని అసమానతలు ఉన్నప్పటికీ, నేను అల్లాహ్ శక్తినే నమ్ముకున్నాను. నేను ఇలా వేడుకున్నాను: నా ప్రభూ, నాకు దూరదృష్టి లేదు కానీ నీకు ఉంది, నాకు తెలియదు కానీ నీకు తెలుసు, నాకు సామర్థ్యం లేదు కానీ నీకుంది.
నాకు ముప్పై మూడు సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు, నేను కోరుకున్న వాటి కంటే చాలా ఎక్కువ మంచి లక్షణాలున్న వ్యక్తి నా చేతిని అడిగాడు. మా వివాహానికి కేవలం ఒక నెల మాత్రమే మిగిలి ఉంది. పరిమిత సమయంలో వ్యవహారాలన్నీ అద్భుతంగా పరిష్కరించ బడ్డాయి.
ఇప్పుడు నా పెళ్లయి ఆరున్నరేళ్లు దాటింది. అల్లాహ్ నా ప్రార్థనను ఆమోదించాడు మరియు నా అంచనాలను మించిన వర్ణించలేనన్ని మంచి లక్షణాలను కలిగి ఉన్న భర్తను నాకు ప్రసాదించాడు. అతను ఉత్తమ భర్త మరియు మంచి స్నేహితుడు. నా ప్రభువా, సర్వ స్తుతులు నీకే శోభిస్తాయి.
నాకు ఇంకా సంతానం కలగలేదు, నేను ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాను, కానీ నా భర్తను చూడగానే, నాలో నేను ఇలా చెప్పుకుంటాను: అటువంటి అద్భుతమైన భర్తను నాకు అనుగ్రహించిన వాడు నాకు కూడా మంచి సంతానాన్ని కూడా ప్రసాదిస్తాడు.
ఐదవ వృత్తాంతం:
నేను, నా భర్త మరియు అత్తమామలు ఒకే ఇంట్లో ఉంటున్నాము. మా మామగారు చాలా ఖరీదైన వ్యాపారం చేసేవారు. అతను తన డబ్బును మా ఇంట్లో దాచి ఉంచాడు. ఒకరోజు తన డబ్బు తీసుకోవడానికి వచ్చాడు. ఎంత వెతికినా ఆ డబ్బు కనిపించలేదు. అతను తన భార్యను అడిగాడు: డబ్బు ఎక్కడ ఉంది? డబ్బు మరియు దానిని భద్రపరిచిన స్థలం గురించి ఎలాంటి సమాచారాన్నీ ఇవ్వడానికి ఆమె నిరాకరించింది. అతను నన్ను పిలిచి డబ్బు గురించి అడిగాడు, దాని గురించి నా వద్ద కూడా ఎలాంటి సమాచారమూ లేదని చెప్పాను. అది వినగానే అతను పిచ్చెక్కి పోయి నాపై దొంగతనం కేసు పెట్టాడు. ఈ గంభీరమైన ఆరోపణ నన్ను భోరున ఏడ్చేలా చేసింది మరియు వారు నా గదిని సోదా చేయాలని నిర్ణయించుకున్నారు, కానీ వారికి ఏమీ దొరకలేదు. నేను వారితో ఆగకుండా కారుతున్న కన్నీళ్లతో ఇలా అన్నాను: ‘నేను దొంగతనం చేయలేదు, కానీ నా వ్యవహారాన్ని అల్లాహ్ కు అప్పగిస్తున్నాను.’ వారు మా అత్తగారి గది మినహాయించి, ఇంట్లోని ప్రతి మూలా వెతికారు. ఎందుకంటే ఆమె దొంగతనం చేయదని వారికి గట్టి నమ్మకం ఉండింది. ఆమె గది సోదా చేయనందుకు నేను గట్టిగా అభ్యంతరం చెప్పాను, కాని వారు ఆమె గదిలో డబ్బు పొందే అవకాశాన్ని అస్సలు లేదని జవాబిచ్చారు. అయితే, వారు నాతో చేసినట్లుగా ఆమె గదిని కూడా సోదా చేయాలని నేను మరలా పట్టుబట్టాను. అయితే, ఆ గది మొత్తం వెతికినా, వారికేమీ దొరకలేదు. సోదా చేయని ఒక సూట్‌కేస్ ఇంకా మిగిలి ఉందని నేను దర్యాప్తు బృందానికి చెప్పాను. వెంటనే మా అత్తగారు ‘అది చాలా ఎత్తైన చోట ఉంది మరియు ఆ సూట్‌కేస్‌లో ఏమీ లేదు’ అన్నారు. మా మామగారు ఆమెకు మద్దతుగా నిలిచారు. అయినా సరే, దానిని కూడా సోదా చేయమని నేను పట్టుబట్టాను. కాని వారు దానిని క్రిందికి దించడం అసాధ్యం అనే సాకుతో నా అభ్యర్థనను తిరస్కరించారు. అప్పుడు నేనే స్వయంగా ఆ సూట్‌కేస్ ను క్రిందికి దించడానికి నిచ్చెన పైకి ఎక్కాను. కానీ దాన్ని కిందకు దించకుండా వారు అడ్డుకోవడంతో నా కన్నీళ్లు ఆగలేదు. నా జీవాన్ని కదిలించే బాధతో నేను అల్లాహ్ ను ప్రార్థించాను. వాళ్ళు నాకు చేసిన అన్యాయానికి నా శరీరం వణికి పోతున్నట్టు అనిపించింది. నేను దిగుతున్నప్పుడు, దొంగ తలపై బలమైన దెబ్బ కొట్టమని నేను పెద్ద స్వరంతో అల్లాహ్‌ను వేడుకున్నాను.
అల్లాహ్ మహిమ!
నేను ఇంకా నిచ్చెన నుండి నేల పైకి దిగలేదు, ఆ సూట్‌కేస్ మా అత్తగారి తలపగిలేలా ఆమెపై పడిపోయింది మరియు వారికి అందులో డబ్బు దొరికింది. నా ప్రార్థనను వెంటనే అంగీకరించిన సంతోషంతో మరియు నాకు అన్యాయం చేసిన వారిపై అల్లాహ్ నాకు వెంటనే మద్దతు ఇచ్చిన సంతోషంతో నేను నిచ్చెన పైనుండి దిగాను. దొంగతనానికి పాల్పడింది మా అత్తగారేనని స్పష్టం అయిపోయింది. ఆమె తన జీవితాంతం మరవలేని కఠినమైన శిక్షను పొందింది.
గమనిక:
షేఖ్ బిన్ బాజ్ ఇలా అన్నారు:
అన్యాయం చేసే వారెవరైనా సరే, వారిని శపించకుండా ఉండటం మంచిది, వారికి మార్గనిర్దేశం చేయమని, అతన్ని సరైన మార్గంలో తీసుకెళ్ళమని మరియు అన్యాయానికి గురైన వారికి వారి హక్కును ఇప్పించమని అల్లాహ్ ను అడగాలి. ఎవరైనా అతన్ని తిట్టినట్లయితే, ఒకవేళ అతను తనకు జరిగిన అన్యాయం మేరకు మాత్రమే అలా చేస్తే సరే. అన్యాయం చేసినవాడిపై శిక్ష పడటాన్ని అతను గమనించినప్పుడు, అతని ప్రార్థన అంగీకరించబడిందని అర్థం చేసుకోవాలి. అతని పిల్లలు, ఆస్తి మరియు వాహనంపై అల్లాహ్ అతనికి శిక్ష విధించమని అతను శపించినప్పుడు, అతను ఏదైనా అనుకోని ప్రమాదానికి గురైతే అతని శాపం అంగీకరించబడటం స్పష్టంగా కనిపిస్తుంది. అయినప్పటికీ, దౌర్జన్యపరుడిని శపించవద్దని మేము సిఫారసు చేస్తున్నాము, బదులుగా అతనికి మార్గనిర్దేశం చేయమని, అతను తన తప్పును గ్రహించి మరియు అతను అన్యాయంగా స్వాధీనం చేసుకున్న హక్కును హక్కుదారులకు వాపసు ఇచ్చేలా మార్గనిర్దేశం చేయమని అల్లాహ్‌ను అడగాలి. తిట్టడం అనేది ఒక రకమైన ప్రతీకారం మరియు పగతీర్చుకోవడం. అందువలన, శపించకపోవడమే మంచిది, బదులుగా అతనికి మార్గదర్శకత్వం ప్రసాదించమని మరియు అల్లాహ్ అతన్ని సరైన మార్గంలోకి తీసుకెళ్లి, అతను అన్యాయంగా కాాజేసిన ఇతరుల హక్కును వారికి వాపసు ఇచ్చేలా చేయమని అల్లాహ్ ను ప్రార్థించాలి.
ఆరో వృత్తాంతం:
నా కొడుకు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. రోజురోజుకీ అతని పరిస్థితి మరింత దిగజారుతూ ఉంది మరియు వైద్యులు అతని వ్యాధిని నిర్ధారించ లేక పోతున్నారు. మేము రకరకాల ఎక్సురేలు, రోగనిర్ధారణ టెష్టులు మరియు అధ్యయనాలు చేయించాము, కానీ వ్యాధి ఏమిటో తెలియ లేదు. మేము రుఖయా మొదలు పెట్టాము మరియు దాని శుభాల కోసం సూరతుల్-బఖరా పఠించడం కొనసాగించాము.
అతను నెలల తరబడి అనారోగ్యంతో ఉన్నాడు. హజ్ నెలలో, అతని పరిస్థితి మరింత తీవ్రంగా మారిపోయింది మరియు అతను స్పృహ కోల్పోయాడు, ఇది అతనిని చలనం లేకుండా చేసింది. నా కుమారుడు ఇంతటి భయంకరమైన వ్యాధితో పోరాడుతూ ఉండటం చూసి నేను చాలా బాధపడ్డాను. ఈ పవిత్ర స్థలం యొక్క ఆశీర్వాదంతో నా కొడుకు కోసం ప్రార్థన చేయడానికి నేను మక్కాకు వెళ్లాలని నిర్ణయించు కున్నాను. ఇది హజ్ సీజన్ మరియు మక్కా రద్దీగా ఉన్నందున నా భర్త నా ప్రణాళికను తిరస్కరించాడు. హజ్ నెల తొమ్మిదో తేదీన యాత్రికులు అరాఫాలో ఉన్నప్పుడు, హరమ్ ఆవరణ ఖాళీగా ఉంటుంది. అప్పుడు అక్కడికి తీసుకు వెళ్లమని నేను పట్టుబట్టి మరీ నా భర్తను అభ్యర్థించాను.
నేను మక్కాకు బయలుదేరాను. అరఫా దినం ఉదయాన అక్కడికి చేరుకున్నాను. నేను రోజంతా హరామ్‌లో ఉండి పోయాను. కేవలం బాత్రూముకు మాత్రమే వెళ్లాను. ఆ రోజంతా నేను సలాహ్ చేయడం, దుఆ చేయడం, అల్లాహ్ ముందు ఏడుస్తూ అర్థించడం మరియు రాత్రి వరకు నా బాధను ఆయనకు విన్నవించుకోవడంలో నిమగ్నమై ఉన్నాను. తరువాత నేను నా నగరానికి తిరిగి వచ్చాను మరియు తరువాత నేను నా కొడుకు తప్పకుండా కోలుకుంటాడనే పూర్తి నమ్మకంతో నేను అతనిని చూడటానికి వెళ్ళాను. నేను అతని చేతిపై నా చేయి వేసి అతనిని ఉద్దేశించి ఇలా అన్నాను: బాబూ, నేను నీ అమ్మను, నా స్పర్శ నీకు తెలుస్తుందా? అది వింటున్న, అతని తండ్రి ఇలా వ్యాఖ్యానించారు: అతను స్పృహలో లేడు. మరి నీకు జవాబు ఇస్తాడని నీవెలా ఆశిస్తున్నావు? నేను నా కొడుకు వైపు తిరిగి ఇలా అన్నాను: నా స్వీటీ, నీకు నా ఉనికి తెలుస్తున్నదని వారికి తెలుపు. అది వినగానే అతను తన వేలిని కదిపి నా చేతిని నొక్కాడు. అంతే! విపరీతమైన ఆనందంలో నేను వెఱ్ఱిగా అరిచాను. అల్లాహ్ నాపై దయ జూపాడని, ఆయన నా కన్నీళ్లు మరియు ప్రార్థనను అంగీకరించడని నేను ఆయనను ప్రశంసించాను, కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
నా కొడుకు ఇంకా అనారోగ్యంతో ఉన్నప్పటికీ మరియు అతని అనేక అవయవాలు ఇప్పటికీ పని చేయకుండా ఉన్నప్పటికీ, అతను స్థిరమైన ఆరోగ్యంతో, మా ఇంటిలో మాతో ఉన్నందుకు నేను అల్లాహ్ ను స్తుతిస్తున్నాను. ముస్లిం రోగులందరూ కోలుకోవాలని కోరుతున్నట్లుగా అతను కూడా పూర్తిగా కోలుకోవాలని మరియు అతనికి ఉపశమనం కలగాలని నేను అల్లాహ్ ను వేడుకుంటున్నాను.
ఏడో వృత్తాంతం:
అక్కడ సుఖంగా ఉండాలనే ఆశతో మా కొత్త ఇంట్లోకి మారాము. అక్కడ బాధలు, ఆనందం కలగలిసిన జీవితాన్ని గడిపాం.
ఒక సంవత్సరం తర్వాత, మా నాన్నకు వ్యాధి సోకింది, అది అతని శరీరంలోకి చొచ్చుకుపోయి, కృశించిపోయింది. ఈ వ్యాధితో, అతను ఇక ఎప్పుడూ ఇంట్లో ఆనందకరమైన జీవితాన్ని గడపలేదు మరియు అతను మరణం వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అతని శరీరం కృంగిపోయి మరింత క్షీణించింది. ఈ సమయంలో, నాకు నిశ్చితార్థం జరిగింది మరియు నా వివాహ తేదీని నిర్ణయించారు. పెళ్లి రాత్రే నా పెళ్లి రద్దు చేయబడింది. కొద్ది కాలం తర్వాత నాన్న చనిపోయారు. మేము మా జీవితాన్ని దాని బాధ మరియు ఆనందంతో ఓర్పుతో, సంతృప్తితో మరియు మా బాధలో ప్రతిఫలం కోసం ఎదురుచూస్తూ జీవించాము.
అల్లాహ్ ను ప్రార్థించి, వేడుకున్న తర్వాత నా సోదరి వివాహం జరిగింది. ఆమె తన భర్తతో తన జీవితాన్ని ఆస్వాదించలేదు, బదులుగా ఆమె మానసిక గాయాలు, ఇతర శారీరక విషాదాలు మరియు ఆరోగ్య సమస్యలతో చాలా బాధపడింది. ఆమెకు సంతానం కలగలేదు. ఆమె రాత్రింబవళ్ళంతా ప్రార్థనలతో అల్లాహ్ వైపు మరలింది. మేము ఆమె కష్టాలు మరియు బాధల నుండి ఉపశమనం కోసం దుఆ చేయడం కొనసాగించాము మరియు ఆమె విడాకులు తీసుకునే వరకు మేము రుఖయ కూడా చేస్తూనే ఉన్నాము. ఇంత ఇబ్బందులున్నా ఆమె అల్లాహ్‌ను స్తుతిస్తునే ఉంది, సహనం కలిగి ఉంది, ప్రతిఫలం కోసం ఎదురుచూసింది మరియు ప్రార్థించడం అస్సలు మానలేదు.
ఆమె ఆరేళ్లుగా ఆరోగ్య రుగ్మతలతో బాధపడుతున్నా, దుఆ మరియు రుఖయాలకు కట్టుబడే ఉంది. ఇన్నేళ్లలో మా అన్న జబ్బుపడి అనుకోని విధంగా చనిపోయాడు. మేము వినయ పూర్వకమైన సలాహ్ తో పాటు దుఆ, రుఖయా మరియు దానధర్మాలకు కట్టుబడి ఉన్నాము. నా సోదరి తరచుగా అలసిపోయేది, కానీ ఆమె ఎప్పుడూ పశ్చాత్తాపపడలేదు మరియు నిరాశ చెందలేదు – ఇది నా కుటుంబంలోని సభ్యులందరినీ బాధలకు గురి చేసిన మంత్రజాలమని మేము తెలుసుకునే వరకు. చివరికి ఖుర్అన్ పఠనంతో అది విచ్ఛిన్నమైంది. అల్లాహ్ మరింత ప్రమాదకరమైన పరిణామాల నుండి మమ్మల్ని రక్షించాడని మరియు ప్రార్థనతో అతను వారిని తరిమివేసాడని మేము నిశ్చయించుకున్నాము.
ఇప్పుడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ దయతో, మా జీవితం శుభాలతో గడుస్తున్నది మరియు అల్లాహ్ మా ధర్మాన్ని రక్షించినందుకు, దానిపై స్థిరంగా ఉండటానికి సహాయం చేసినందుకు, మా ప్రార్థనను అంగీకరించినందుకు మరియు మా బాధ నుండి మాకు ఉపశమనం కలిగించినందుకు మేము అల్లాహ్‌ను పుష్కలంగా స్తుతిస్తాము మరియు కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
ఎనిమిదో వృత్తాంతం:
నా కొడుకు అకస్మాత్తుగా కంటి వ్యాధికి గురయ్యాడు. ఇది అతని చాలా అవయవాలు మరియు భౌతిక వ్యవస్థలను ప్రభావితం చేసేలా మరింత తీవ్రమైంది. వ్యాధిని గుర్తించడానికి మేము అనేక స్క్రీనింగ్‌లను నిర్వహించాము. వారు రెండు క్రానియోటమీ శస్త్రచికిత్సలు నిర్వహించారు, అయినప్పటికీ వ్యాధిని నిర్ధారించడానికి ఎటువంటి క్లూ లభించ లేదు. ఒకరోజు, అతని మెదడులో చిన్న కణితి ఉందని, దానికి కీమోథెరపీ అవసరమని వైద్యులు చెప్పారు.
మేము ఇది విని బాధపడ్డాము మరియు అల్లాహ్‌ను గట్టిగా ప్రార్థించాము, కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రార్థించమని అభ్యర్థించాము మరియు మేమంతా ఆ రాత్రి ప్రార్థన మరియు ఇస్తిఖారాతో అల్లాహ్ ను వేడుకున్నాము. ఆ రాత్రి మేం నిద్రపోలేదు. నేను అతని తండ్రి వద్దకు వెళ్ళిన ప్రతిసారీ, అతను సజ్దా (సాష్టాంగం)లో ఏడుస్తూ ప్రార్థించడం చూసాను. అలసిపోవటం వలన, తెల్లవారకముందే అతనికి కొంత మగత వచ్చింది. తర్వాత ఫజ్ర్ సలాహ్ చేసేందుకు నిద్ర లేచాడు. తిరిగి వచ్చిన తరువాత, తెల్లటి దుస్తులు ధరించిన ఒక వ్యక్తి ప్రకాశిస్తూ నా వద్దకు వచ్చి ప్రార్థనను ఆపమని తన చేతితో నా వైపు చూపించినట్లు నాకు కల వచ్చిందని అతను నాతో చెప్పాడు.
తెల్లవారుజామున, అతను వైద్యుడిని సందర్శించడానికి ఆసుపత్రికి వెళ్లి కీమోథెరపీకి తుది ఆమోదం తెలిపాడు.
అతను ఇలా అన్నాడు: నేను దుఃఖంతో ఆసుపత్రిలో నా దృష్టిని క్రిందికి దించుకున్నాను. అకస్మాత్తుగా అడుగులు వస్తున్నట్లు భావించి, తల ఎత్తాను. నాకు ఆశ్చర్యం కలిగించే విధంగా, నా కలలో నేను సందర్శించిన అదే దుస్తులు మరియు అదే రంగులో అదే వ్యక్తి నన్ను సమీపించి, అతను నాతో ఇలా అన్నాడు: నీవు ఈ బిడ్డకు తండ్రివా? నేను అవునని తల ఊపాను. తనతో పాటు తన క్లినిక్‌కి రమ్మని చెప్పాడు. అతని ముఖం నేను కలలో చూసిన దానితో సరిగ్గా సరిపోలడం గమనించి పూర్తిగా ఆశ్చర్యపడి అతని క్లినిక్‌లోకి ప్రవేశించాను. అతను ఇలా అన్నాడు: నేను మీ కొడుకుకు వైద్యం చేస్తున్న డాక్టర్ని. నేను అతని నివేదికలను పరిశీలించాను మరియు అతని పరిస్థితిని గమనించాను. ఇప్పుడు నా రిపోర్టు ఇతర వైద్యులందరికి వ్యతిరేకంగా ఉంది. అతను కణితి కాకుండా మెదడు కణాల వాపుతో బాధపడుతున్నాడని నేను నిర్ధారించాను మరియు కీమోథెరపీ లేకుండా శోథ నిరోధక చికిత్సతో దానిని నయం చేయవచ్చు. ఇది విన్న నేను తక్బీర్ మరియు తహ్లీల్ అని చెప్పాను మరియు నేను కృతజ్ఞతలు తెలుపుతూ అల్లాహ్ కు సజ్దా చేసాను. నా కల గురించి డాక్టర్‌కి తెలియ జేసినప్పుడు నా చెంప మీద కన్నీళ్లు ధారలు కారుతున్నాయి. దీనికి అతను చాలా ఆశ్చర్యపోయాడు!
నా కొడుకు నాలుగు సంవత్సరాలుగా చాలా అవయవాలు సరిగ్గా పనిచేయక అనారోగ్యంతో ఉన్నప్పటికీ, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మా ప్రార్థనను అంగీకరించినందుకు నేను సంతోషిస్తున్నాను. అతను మరియు ముస్లిం రోగులందరు త్వరగా కోలుకోవాలని మరియు అతని వైద్యంతో నా కళ్ళకు సాంత్వన కలిగించాలని నేను అల్లాహ్ ను వేడుకుంటున్నాను.
తొమ్మిదో వృత్తాంతం
నా భర్తతో కలిసి నేను అందమైన జీవితాన్ని గడిపాను. ఈ సుందరమైన జీవితంపై నా చుట్టూ ఉన్నవారంతా అసూయపడేవారు. నా కుటుంబంలోని కొందరు స్త్రీలు నాపై విపరీతంగా అసూయపడ్డారు.
అకస్మాత్తుగా నా జీవితంలో ఒక మలుపు వచ్చింది, మరియు నా పట్ల నా భర్త వైఖరి మారిపోయింది. అతను నాతో అగౌరవంగా, నిర్లక్ష్యంగా, మొరటుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇది మునుపటి ప్రవర్తనకు పూర్తి భిన్నంగా ఉండేది. ఇది నన్ను ద్వేషించేవారి ఆగ్రహాన్ని తీర్చింది. నా భర్త నాతో అసభ్యంగా ప్రవర్తించడం చూసి వారు సంతోషించారు. ఈ ఆకస్మిక మార్పు గురించి నేను అతనిని అడిగాను, కానీ ఎటువంటి సమాధానం రాలేదు. నేను ఓపికగా ఉండి పిల్లల కోసం భరించాను. నేను ప్రార్థనను నా కవచంగా ఉపయోగించాను.
అది రమదాన్ మాసం. నేను తీవ్రంగా ప్రార్థించాను, ఇప్పటికీ నాకు ఎటువంటి మార్పు కనబడలేదు. అయినప్పటికీ, నేను నిరాశకు గురికాలేదు, ఎందుకంటే నా ప్రార్థనతో నేను అల్లాహ్ తో అనుబంధాన్ని పెంచుకున్నాను. నేను అరఫా దినం వరకు ప్రార్థిస్తూనే ఉన్నాను, ఇది నన్ను గతంలో కంటే మరింత గట్టిగా ప్రార్థించేలా చేసింది. నేను అల్లాహ్ ను వేడుకున్నాను, నా ప్రార్థనకు స్వర్గం తలుపులు విశాలంగా తెరిచి ఉన్నాయని నేను ఆయన ముందు అణుకువతో మోకరిల్లాను.
అల్లాహ్ నాకు వరుస బహుమతులతో అనుగ్రహించాడు. ఆయన నాకు కొత్త ఇంటిని ప్రసాదించాడు, నేను ఖుర్ఆన్ కంఠస్థం చేయడానికి ఒక సర్కిల్ లో చేరాను. కలలో కూడా ఊహించని ఉద్యోగం నాకు లభించింది.
నా భర్త ఇంతకుముందులా ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టనప్పటికీ, జీవితంలోని ఆనందాలు మరచిపోయేలా చేసి, వాటిని వదిలించు కోవడాన్ని సులభతరం చేసిన సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రార్థనలో నాకు ఆనందం మరియు అనుబంధం పెరిగింది.
పదో వృత్తంతం
నేను ఒక ఫ్లాట్‌లో నివసించాను మరియు అదే భవనంలో మరికొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. మేం పేదవాళ్లం. నీటి బిల్లు, కరెంటు బిల్లు అందరితో పంచుకునే వారం. నీటి బిల్లు జారీ చేయబడినప్పుడు, మాలో ఎవరూ నెలల తరబడి దానిని చెల్లించలేకపోయారు, అది ఇంటి సగం ధరతో సమానమైన భారీ మొత్తానికి చేరుకునే వరకు.
ఈ మధ్య కొన్నాళ్లుగా కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. కొందరు చనిపోయారు, కొందరు దూరంగా వెళ్ళిపోయారు, మరికొందరు తమ ఫ్లాట్ ను అమ్మి వెళ్లిపోయారు. ఇక అక్కడ మా కుటుంబం మాత్రమే మిగిలింది. దీంతో చెల్లించని బిల్లుల ఖర్చు అంతా మాపైనే పడింది. మేము జీవించడానికి జీవనోపాధిని సంపాదించుకోలేని సమయంలో ఇంత పెద్ద బిల్లును ఎలా చెల్లించాలా అని కలవరపడ్డాము. ప్రపంచం చాలా విశాలంగా ఉన్నప్పటికీ మాకు ఇరుకైనదిగా అనిపించింది. బాధను తగ్గించేవాడు, కష్టాలను తగ్గించేవాడు, దుఃఖాన్ని తగ్గించేవాడు మరియు సమస్యలను పరిష్కరించేవాడైన అల్లాహ్ నే మేము ఆశ్రయించాము. నేను ప్రార్థన మరియు విధేయతతో అల్లాహ్ వైపు వెళ్ళాను. అరఫా దినం వచ్చినప్పుడు, నేను మరింత గట్టిగా ప్రార్థించాను, ఏడుస్తూ మరియు ఏడుస్తూ మరియు కన్నీళ్లతో అల్లాహ్ కు నా అవసరాన్ని తెలియ జేసాను. ఈద్ ముగిసిన తరువాత, నా భర్త తక్కువ మొత్తం అయినా సరే బిల్లులో కొంతభాగం చెల్లించాలని నిర్ణయించుకున్నాడు. అతను చెల్లించాల్సిన మొత్తాన్ని చెప్పమని ఉద్యోగిని అడిగాడు, అతను ఊహించిన దాని కంటే చాలా తక్కువ మొత్తాన్ని ఆ ఉద్యోగి అతనికి చెప్పాడు. అది విన్న నా భర్త ఆశ్చర్య పోయాడు మరియు ఆ ఉద్యోగిని ఇలా అడిగాడు: ఇది ఎలా సాధ్యం?. బకాయి మొత్తం దీని కంటే చాలా ఎక్కువగా ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. దానికి ఆ ఉద్యోగి ఇలా అన్నాడు: ఈ రోజుల్లో, సిస్టమ్ సరిగ్గా పనిచేయడం లేదు, గతం డేటాను తిరిగి పొందలేక పోతున్నాము. మేము మీ పేరు మీదు ఇంత బకాయి మొత్తాన్ని మాత్రమే గుర్తించాము.
మేము చాలా సంతోషించాము మరియు అల్లాహ్ ను ఏదీ అధిగమించలేదని గ్రహించాము. మేము కృతజ్ఞతాపూర్వకంగా సర్వశక్తిమంతుడికి తల వంచాము. అన్ని వ్యవహారాలను నిర్వహించేవాడు మహిమాన్వితుడు ఆయనే.
పదకొండో వృత్తాంతం:
అల్హమ్దులిల్లాహ్ నాకు ఆడబిడ్డ పుట్టింది. ఆమె వినికిడి లోపంతో ఉంది. ఆమెకు మూడు సంవత్సరాల వయస్సు నుండి వినికిడి యంత్రాన్ని కొనుగోలు చేసాము. ఆమెకు ఉచ్చారణ మరియు అక్షరాలు నేర్పడానికి ఆమె తల్లి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేది. ఆమెకు ఏడు సంవత్సరాలు నిండాయి, మరియు ఆమె ఇప్పటికీ పదం స్పష్టంగా పలక లేక పోతుంది. సంవత్సరాలు గడిచాయి, నేను ఈ మాటలతో ప్రార్థిస్తూనే ఉన్నాను: “ఓ రెహ్మాన్, ఓ రెహ్మాన్, ఓ రెహ్మాన్, ఖుర్ఆన్ బోధించి, మానవాళిని సృష్టించిన వాడా, నా కుమార్తె స్పష్టంగా మాట్లాడటానికి సహాయం చేయి.”
అల్హమ్దులిల్లాహ్, ఇప్పుడు ఆమె సెకండరీ తరగతుల్లో ఉత్తీర్ణు రాలైనది మరియు అనర్గళంగా మాట్లాడుతుంది. వచ్చే నెలలో ఖుర్ఆన్ కంఠస్థం పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది. సర్వస్తుతులు అల్లాహ్ కే! తనను పిలిచేవారికి ప్రతిస్పందించే దయగల ప్రభువు ఎంతో మహిమాన్వితుడు.
పన్నెండో వృత్తాంతం:
నా మొదటి బిడ్డ పుట్టినప్పటి నుండి రాత్రింబవళ్ళు తరచుగా ఏడుస్తుంది. అతని పరిస్థితి చూసి వైద్యులు నిరాశ చెందారు. వ్యాధిని గుర్తించి నయం చేయడంలో తమ అసమర్థతను వ్యక్తం చేశారు. ఇది అతని కోలుకోవడం మరియు మనుగడపై నాకు ఆశ కోల్పోయేలా చేసింది. అయినప్పటికీ, ప్రతిసారీ నేను మరింత ఆశతో, ఆశావాదంతో, విశ్వ ప్రభువుపై నమ్మకంతో మరియు అల్లాహ్ మాత్రమే నా కొడుకును నయం చేయగలడనే విశ్వాసంతో బలపరచబడిన ఆత్మతో ఏ వ్యాధీ తనను అధిగమించని సర్వశక్తిమంతుడైన అల్లాహ్ వైపు మరలే దాన్ని.
నేను అతను నయం కావాలని కాదు కానీ అతనికి మంచి స్వభావం, శ్రేష్ఠత, ప్రత్యేకత మరియు ఒక రోజు నా కొడుకు కూడా డాక్టర్ కావాలే బలమైన ఆశతో ప్రార్థన కొనసాగించాను.
సంవత్సరాలు గడిచాయి, నా కొడుకు పెరిగాడు, నయం అయ్యాడు మరియు ఎటువంటి అనారోగ్యం లేకుండా బాగా అభివృద్ధి చెందిన ఆరోగ్యకరమైన యువకుడిగా మారాడు, బదులుగా అతను అందరిచే విస్తృతంగా ప్రశంసించబడిన ప్రఖ్యాత వైద్యుడు అయ్యాడు.
ఓ అల్లాహ్, అతనిని నా కళ్లకు ఓదార్పునిచ్చే చేయి.
చివరిమాట
ఓ అల్లాహ్ దాసుడా! నిన్ను ప్రార్థన చేయమని అడిగే మరియు దాని ఆమోదం గురించి హామీ ఇచ్చే ప్రభువు నీకు ఉన్నాడని గుర్తుంచుకో. దేనిచేతా అణచివేయబడని ప్రభువు, సంపన్నుడు, దయగలవాడు మరియు సర్వ సమర్థుడు.
మీ అవసరాలలో దేనినీ అడగకుండా వదిలి పెట్టవద్దు మరియు మీ అవసరాలను ప్రాపంచిక వ్యవహారాలకు మాత్రమే పరిమితం చేయవద్దు, బదులుగా మీ పరలోక అవసరాలకు కూడా శ్రద్ధ వహించండి, ఎందుకంటే మీ ప్రాపంచిక అవసరాల కంటే మీకు ఇది ఎక్కువ అవసరం.
మీ ప్రార్థన జవాబుకు ఎంత సమయం పట్టినా ప్రతిస్పందించాలనే ఆశను కోల్పోకండి, ఎందుకంటే మీ కొరకు అత్యంత వివేకవంతుడు మరియు సర్వజ్ఞుడైన ప్రభువు ఉన్నాడు. జవాబు ఆలస్యం అయినా దుఆ విడిచి పెట్టవద్దు, ఎందుకంటే దాని ఆమోదానికి సర్వజ్ఞుడు, దయగలవాడు మరియు కృపాశీలుడు తగిన సమయాన్ని నిర్ణయించాడు. మీరు ఎంత కాలం బాధపడ్డా, నిరుత్సాహం మిమ్మల్ని ముంచెత్త వద్దు. కొన్నిసార్లు మీ విశ్వాసం దీర్ఘకాలిక బాధలతో పరీక్షించబడుతుంది మరియు మీ బాధలకు ప్రతిఫలమివ్వడానికి మరియు దానితో మీ స్థాయిని పెంచడానికి మీ కొరకు మీ ప్రభువు ఉన్నాడని గుర్తుంచుకోండి.
చీకటిగా ఉన్న రాత్రి ఎంత సుదీర్ఘంగా ఉన్నా, ఒక రోజు తెల్లవారుజాము ఖచ్చితంగా దాని ప్రకాశవంతమైన మెరుపుతో మీ హృదయంలో మరియు ఆత్మలో ఆనందం మరియు శక్తిని నింపుతుంది.
మీ ప్రార్థనలను అంగీకరించమని, అందమైన హృదయం, సంతృప్తికరమైన ఆత్మ మరియు చెదరని చిరునవ్వుతో మిమ్మల్ని ఆశీర్వదించమని నేను అల్లాహ్‌ను వేడుకుంటున్నాను.
మన ప్రవక్త ముహమ్మద్ పై శాంతి మరియు ఆశీర్వాదాలు మరియు సత్కార్యాలకు తన అనుగ్రహంతో పరిపూర్ణతను ప్రసాదించే ఆ అల్లాహ్ కే సకల ప్రశంసలు, కృతజ్ఞతలు శోభిస్తాయి.
Footnotes (పాద సూచికలు)
[1] కితాబ్ అల్ వాబిల్ అస్-సయ్యిబ్ మినల్ కలిమ అత-త్తయ్యిబి (1/7).
[2] సహీహ్ ముస్లిం (2577)
[3] జమియుల్ ఉలూమ్ వల్ హికామ్ (2/673)
[4] తఫ్సీర్ ఇబ్ను రజబ్ (2/653)
[5] సియార్ ఆలమీన్ నుబాల (6/270)
[6] అత్-తిర్మిథి (3247)
[7] సహీహ్ అల్ బుఖారీ (6616)
[8] నూర్ అలా అద్దర్బ్ ప్రోగ్రామ్, షేఖ్ ఇబ్నె బాజ్ (రహిమహుల్లాహ్) వెబ్సైట్
[9] సహీహ్ అత్-తిర్మిథి (2399)
[10] సహీహ్ అల్ బుఖారీ (5678)
[11] రిసాలతుల్ ఉబూదియ్యహ్ (86)
[12] సాలిహ్ అత్-తర్గీబ్ (1633)
[13] నూర్ అలా అద్’దర్’బ్ షేఖ్ ఇబ్నె బాజ్ (రహిమహుల్లాహ్) వెబ్’సైటు.
[14] సహీహ్ అత్-తర్గీబ్ (1633)
[15] సహీహ్ ఇబ్ను మాజహ్ (73)
[16] ఫతావా అల్ జామయి అల్ కబీర్, షేఖ్ ఇబ్ను బాజ్ (రహిమహుల్లాహ్) వెబ్’సైటు
[17] షేఖ్ సాలిహ్ అల్ ఫౌజాన్ వెబ్’సైటు
[18] తుహ్’ఫతుజ్ జాకిరీన్ (34)
[19] సహీహ్ అల్ జామైలో షేఖ్ అల్’బానీ చే హసన్ గా వర్గీకరించబడింది (7739)
[20] జామిఉల్ ఉలూమ్ వల్ హికమ్ (3/1157)
[21] అత్-తహ్’రీర్ వత్-తన్’వీర్ (2/179)
[22] ముసన్నఫ్ ఇబ్నె అబీ షేబా (2/199)
[23] మజ్ముఉల్ ఫతావా (1/328)
[24] తఫ్సీర్ ఇబ్ను కథీర్ (1/427)
[25] షర్’హుద్ దుఆ మినల్ కితాబ్ వ సున్నహ్ (1/116)
[26] మసుఅహ్ అఖ్వల్ ఇమామ్ అహ్మద్ (2/433)
[27] మజ్ముఉల్ ఫతావా (1/39)
[28] మదారిజ్ అస్-సాలికీన్ (2/229)
[29] మదారిజ్ అస్-సాలికీన్ (3/103)
[30] ముత్తఫిఖున్ అలైహి.
[31] రియాదుస్-సాలిహీన్ వ్యాఖ్యానం, షేఖ్ బిన్ బాజ్ వెబ్’సైటు
[32] ఫతావా అద్’దురూస్, షేఖ్ బిన్ బాజ్ వెబ్’సైటు
[33] సహీహ్ అల్ జామయి లో అల్’బానీ చే సహీహ్ గా వర్గీకరించబడింది (7705)
[34] అద్-దఆ వద్-దుఆ (1/15).
[35] తఫ్సీర్ అస్-సాదీ (482).
[36] సహీద్ హదీథ్ సిరీస్ (6/592)
[37] ఫైద్ అల్-ఖాదిర్ (6/66)
[38] సహీహ్ అత్-తిర్మిథి (2989)
[39] అల్ అర్’బయీన్ అన్-నవవియ్యహ్ వ్యాఖ్యానం, షేఖ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్) వెబ్’సైట్
[40] సహీహ్ అల్ బుఖారీ (7390)
[41] ముఖ్తసర్ మిన్’హాజుల్ ఖాసిదీన్ (56)
[42] సహీహ్ అల్ బుఖారీ (6306)
[43] ముస్లిం హదీథు గ్రంథం (3009)
[44] ముస్లిం (1794)
[45] షేఖ్ బిన్ బాజ్ వెబ’సైటు (ఫతావా అద్-దురుస్)
[46] షేఖ్ బిన్ బాజ్ వెబ’సైటు (ఫతావా అద్-దురుస్)
[47] షేఖ్ బిన్ బాజ్ వెబ’సైటు (ఫతావా అద్-దురుస్)
[48] అహ్మద్, అల్’బానీ చే సహీహ్ గా వర్గీకరించబడింది.