చివరకు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు హిజ్రత్ అనుమతి లభించింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నబవీ శకం 13వ యేట (27 సఫర్), క్రీ.శ 621 సెప్టంబర్ 12వ తేదీన మక్కా వదిలి మదీనాకు పయనమయ్యారు. మూడు పగళ్లు రాత్రుళ్ళు మక్కాకు సమీపంలోని సౌర్ గుహలో గడిపారు. ఆ తరువాత సుదీర్ఘ ప్రయాణం చేస్తూ చివరకు నబవీ శకం 13వ యేట రబీవుల్ అవ్వల్ 8వ తేదీ సోమవారం (అంటే క్రీ.శ 622 సెప్టెంబర్ 23వ తేదీ) మదీనా సమీపంలో గల కుబా ప్రాంతానికి చేరారు. అక్కడే బస చేసి తిరిగి 12 రబీవుల్ అవ్వల్ ఒకటవ హిజ్ర శకం శుక్రవారం అక్కడ నుంచి పయనమయ్యారు. బనీసాలిమ్ వాడకు చేరేవరకు జుమా సమయం అయ్యింది. అక్కడే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వంద మంది అనుచరులతో జుమా ప్రార్థన చేశారు. అదే ఇస్లాంలో మొదటి జుమా.
ప్రియ సోదరులారా..!
జుమా సుభదినాన దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇచ్చిన ఆ ప్రసంగం చారిత్రాత్మకంగా చాలా గొప్పస్థానాన్ని కలిగి ఉంది. ఆనాటి ఆ ఖుత్బాను ఈనాటి జుమా ప్రసంగంలో వినిపించాలనుకుంటున్నాను. ఈ చారిత్రక ప్రఖ్యాత ప్రసంగాన్ని చాలా శ్రద్ధగా వినండి అల్లాహ్ ఈ ఖుత్బాను శుభకరంగా చేయుగాక… ఆమీన్.
“సర్వస్తోత్రాలు అల్లాహ్ కే శోభిస్తాయి. నేను అల్లాహ్ ను స్తుతిస్తున్నాను, ఆయన సహాయాన్ని కోరుతున్నాను. క్షమాబిక్షకై ఆయన్ను వేడుకొంటున్నాను. నేను అల్లాహ్ ను విశ్వసించాను. అల్లాహ్ పట్ల అవిధేయత చూపను. ఆయన పట్ల అవిధేయత చూపిన వారితో నేను విరోధిస్తాను. అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన అద్వితీయుడు. ఆయనకు సాటి ఎవరూ లేరు. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన ప్రవక్త, దాసుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను. అల్లాహ్ ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) కు సన్మార్గాన్ని, జ్యోతిని ఇచ్చి యుగాలుగా ప్రవక్తలు లేని కాలంలో, జ్ఞానం విద్య లేని కాలంలో, మార్గభ్రష్టత్వం తాండవమాడుతున్న కాలంలో ప్రభవింపజేశాడు. చివరికాలంలో ప్రళయానికి దగ్గరగా, మృత్యువుకు అతి చేరువుగా ప్రభవింపజేశాడు. ఎవరయితే అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను ఆనుసరిస్తారో వారే సాఫల్యం విజయం పొందుతారు. అవిధేయత చూపేవారు, దైవాజ్ఞలను ఉల్లంఘించేవారు మార్గవిహీనులవుతారు. మార్గభ్రష్టతలో కూరుకుపోతారు.
ముస్లిములారా!
అల్లాహ్ పట్ల భయభీతిగా ఉండాలనీ తాకీదు చేస్తున్నాను. ఒక ముస్లిం మరొక ముస్లిం సోదరునికి చెయ్యాల్సిన అత్యుత్తమ హితబోధ ఏమిటంటే పరలోకం గురించి ప్రేరేపించాలి. అల్లాహ్ కు భయపడాలని బోధించాలి. అల్లాహ్ వేటికి దూరంగా ఉండమని ఆజ్ఞాపించాడో, వాటికి బహుదూరంగా ఉండాలి. వాటి జోలికి పోకూడదు. దీన్ని మించిన హితబోధ ఏదీలేదు. దీనిని మించిన జిక్ర్ (నామస్మరణం) లేదు. గుర్తుంచుకోండి! అల్లాహ్ కు భయపడుతూ పనులు చేసే వ్యక్తికి పరలోకంలో దైవభీతి ఎంతో అత్యుత్తముగా తోడ్పడుతుంది. అల్లాహ్, అతని మధ్యగల అంతర, బాహ్య వ్యవహారాల్లో, విషయాల్లో అతడు ధర్మబద్ధంగా ఉండి ఆయా పనుల్లో అతని సంకల్పశుద్ధి కూడా అల్లాహ్ కోసమే నిష్కల్మషంగా ఉంటే అతని కొరకు ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు, మృత్యువు తరువాత అతని కొరకు ఆ పనులు ఒక విధిగా మారు తాయి. ఒకవేళ ఎవరయినా అలా చేయకపోతే అలాంటి వారి గురించి అల్లాహ్ సెలవిస్తున్నాడు:
مَا يُبَدَّلُ الْقَوْلُ لَدَيَّ وَمَا أَنَا بِظَلَّامٍ لِلْعَبِيدِ
నా దగ్గర మాట మార్చడం జరగదు, నేను నా దాసులకు అన్యాయం చేసేవాడను కాను. (ఖాఫ్ 50 : 29)
కావున అల్లాహ్ కు భయపడండి. మీ ప్రాపంచిక విషయాల్లోనూ, ధార్మిక విషయాల్లోనూ అంతర విషయాల్లోనూ, బాహ్య వ్యవహారాల్లోనూ దైవభీతి కలిగి ఉండండి. ఎవరయితే అల్లాహ్ కు భయపడతారో అల్లాహ్ అతన్ని పాపాలన్నింటిని ఆయన తుడిచి వేస్తాడు. వారికి గొప్పపుణ్యఫలితాల్ని అనుగ్రహిస్తాడు. దైవభీతి ఉన్నవారే నిశ్చయంగా గొప్ప విజయం పొందిన వారు. నిశ్చయంగా దైవభీతి అవిధేయత నుండి కాపాడుతుంది. శిక్షలనుండి రక్షిస్తుంది. నిశ్చయంగా దైవభీతి మొహాలను వికసింపజేస్తుంది, దైవ ప్రసన్నతను ప్రసాదిస్తుంది, అంతస్తులను పెంచుతుంది. ప్రపంచంలో ధర్మ సమ్మతమైన పవిత్ర వస్తువుల్ని తినండి, కాని అల్లాహ్ ఆదేశాల నిర్వర్తనలో ఎలాంటి తగ్గింపు చేయకూడదు. అందుకొరకే అల్లాహ్ మీకు గ్రంథాన్ని నేర్పించాడు. దైవ మార్గాలను చూపాడు. దీని ద్వారా అల్లాహ్ సత్యవంతుల్ని, అసత్య వాదుల్ని వేరుచేస్తాడు.
అల్లాహ్ మీ పై ఎంతటి అనుగ్రహాన్ని ఉపకారాన్ని కురిపించాడో అలాగే మీరు ప్రజలతో ప్రవర్తించండి. అల్లాహ్ విరోధులను మీ విరోధులుగా భావించండి. అల్లాహ్ మార్గంలో పోరాడవలసిన విధంగా ధర్మపోరాటం చేయండి. ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీకు అల్లాహ్ విధేయులు (ముస్లింలు) అని పేరు పెట్టాడు. ఎందుకంటే దైవసందేశం, సూచనలు చూసి కూడా ఇస్లాం స్వీకరించనివాణ్ణి నాశనం చేయడానికి. ఇక ఎవరు దైవసూచనలు చూసి ఇస్లాం స్వీకరిస్తారో వారికి జీవితం ప్రసాదించడానికి, సర్వ పుణ్యాలు అల్లాహ్ ఆజ్ఞతోనే జరుగుతున్నాయి.
అల్లాహ్ నామస్మరణ (జిక్ర్)ను అత్యధికంగా చేస్తూ ఉండండి. పరలోక విజయం కొరకు పుణ్యకార్యాలు చేయండి. ఎవరయితే దైవం మధ్య తమ మధ్య ఉన్న విషయాలను సరిగ్గా పాటిస్తారో అల్లాహ్ అతని మధ్య, ప్రజల మధ్యగల విషయాలను సరిచేస్తాడు.
నిశ్చయంగా అల్లాహ్ దాసులకు ఆజ్ఞలు జారిచేస్తాడు. ఆయనపై ఎవరి ఆజ్ఞా లేదు. అల్లాహ్ దాసులు యజమాని. అల్లాహ్ సన్నిధిలో దాసులకు ఎలాంటి ఆధిపత్యమూ అధికారము లేదు.
అల్లాహ్ మహోన్నతుడు. పుణ్యకార్యాలు చేసే సద్బుద్ధి, శక్తి ఆ మహోన్నతుని కటాక్షం దయవల్లే కలుగుతుంది.
(రహ్మతుల్లిల్ ఆలమీన్ 1:92-93)
ఇస్లామీయ సోదరులారా..!
ఎంతటి మహత్తర ప్రసంగం! ఎంతటి మహాభాగ్యం!! ఆనాడు ఆరంభమైన ఈ వారంవారం పండుగ ప్రళయం వరకు జారి చేయబడింది. ఇస్లామీయ చరిత్రలోని తొలి ఖుత్బాలో పాల్గొన్న ఆ సహాబాలు ఎంతటి ధన్యజీవులో ఇప్పటికి కూడా బనూ సాలీం వీధి ఖుబాలో ఉంది. అక్కడే ఒక మహాన్నతమైన మస్జిద్ నిర్మించడం జరిగింది గత చరిత్ర వైభవానికి నిదర్శనంగా.
అల్లాహ్ మనందరికి పవిత్ర మక్కా యాత్ర చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ప్రసంగాన్ని కంఠస్తంచేసి, వాటిపై ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు గాక!. ఆమీన్.
—
ఈ పోస్ట్ హిజ్రత్ తరువాత తొలి చారిత్రక ప్రసంగం [PDF] [6p] అనే ఖుత్బా నుండి తీసుకోబడినది.
పుస్తకం: ఖుత్ బాతే నబవీ ﷺ (పార్ట్ 1) – మర్కజ్ దారుల్ బిర్ర్ పబ్లికేషన్స్