మొహర్రం నెల మరియు శోక గీతాలాపన | జాదుల్ ఖతీబ్

మీకు తెలిసే వుంటుంది చాలా మంది మొహర్రం నెలలో, దుఃఖ సూచిత దుస్తులు ధరించి శోక గీతాలాపన చేస్తూ, ఏడ్పులు, పెడబొబ్బలు పెడుతూ ఛాతీని బాదుకోవడం చేస్తూ వుంటారు. మా దృష్టిలో ఇది కూడా నిషేధించబడ్డ దౌర్జన్యపు ఒక రూపమే. ఈ కార్యాలనుద్దేశించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా సెలవిచ్చారు: 

అజ్ఞానకాలం నాటి నాలుగు ఆచరణలను ఈ అనుచర సమాజం విడనాడడానికి సిద్ధంగా ఉండదు. తమ వంశంపై గర్వపడడం, ఇతరుల వంశాన్ని తక్కువగా భావించడం, నక్షత్రాల ద్వారా అదృష్టాన్ని తెలుసుకోవడం (లేదా వాటి ద్వారా వర్షాన్ని అర్థించడం) మరియు శోకగీతాలాపనలు చేయడం.” (సహీ ముస్లిం – అల్ జనాయెజ్ : 936) 

ఇంకా ఈ విధంగా కూడా ఉద్భోదించారు: 

శోక గీతాలాపన చేసే స్త్రీ తన మరణానికి ముందు గనక తౌబా (పశ్చాతాపం) చెందకపోతే, ప్రళయం రోజు తన శరీరంపై గజ్జి, దురద వ్యాపించి వుండగా, గంధకపు వస్త్రాలు ధరించి వున్న స్థితిలో లేపబడుతుంది.” 

ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే – శోక గీతాలాపనలు వగైరా… చేయడం అనేవి అజ్ఞానపు చేష్టలు మరియు ఇస్లాంతో వీటికేమాత్రం సంబంధం లేదు. అందుకే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) శోకగీతాలాపన … వగైరా… లాంటి పనులు చేసే వ్యక్తితో తనకే మాత్రం సంబంధం లేదని ప్రకటిస్తూ ఇలా పేర్కొన్నారు: 

తన చెంపలను బాదుకొనేవాడు, వస్త్రాలను చింపుకొనేవాడు, అజ్ఞాన కాలపు కార్యాలను గూర్చి ఘనంగా చర్చించేవాడు, కష్ట సమయాల్లో వినాశనాన్ని, మరణాన్ని కోరుకునేవాడు మాలోని వాడు కాడు.” (సహీ బుఖారీ – అల్ జనాయెజ్ : 1294) 

అబూ దర్ద బిన్ అబూ మూసా అష్రీ (రదియల్లాహు అన్హు) కథనం : అబూ మూసా అష్రీ ఓసారి తీవ్ర అనారోగ్యానికి గురై మూర్చపోయినట్లు అయిపోయారు. ఆయన తల ఆయన సతీమణుల్లో ఒకరి ఒడిలో వుంది. (ఈ స్థితిని చూసి) అమె పెద్దగా ఏడ్వడం ఆరంభించింది. కానీ ఆయన మాత్రం ఆమెకు జవాబు ఇవ్వలేకపోయారు. కాసేపటికి, కాస్త కుదుటపడ్డాక, ఆమె నిర్వాకం చూసి ఇలా సెలవిచ్చారు: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) విముక్తి ప్రకటించుకున్న ప్రతి వ్యక్తితో నేను కూడా విముక్తుణ్ణి. నిస్సందేహంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టే, దుఃఖ, విచార ఘడియల్లో తల గొరికించుకునే మరియు వస్త్రాలు చింపుకొనే స్త్రీ నుండి విముక్తిని ప్రకటించుకున్నారు. (సహీ బుఖారీ – అల్ జనాయెజ్: 1296, ముస్లిం : 1167) 

ఈ హదీసుల ద్వారా రూఢీ అయిన విషయమేమిటంటే – ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టడం, ఛాతీని బాదుకోవడం…. లాంటి పనులు పూర్తిగా నిషేధిం చబడ్డాయి. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ పనులను, వీటిలో లిప్తమైవున్న వారిని గూర్చి తనను తాను పూర్తిగా విముక్తుడిగా, ఏ మాత్రం సంబంధం లేని వానిగా ప్రకటించుకున్నారు. కనుక ముస్లిములందరూ ఇలాంటి దుష్కార్యాలను గూర్చి జాగ్రత్తపడాలి. మరియు (ఒకవేళ లిప్తమై వుంటే) వెంటనే వీటిని మనః పూర్వకంగా త్యజించాలి. 

ప్రియ శ్రోతలారా! 

మొహర్రం మాసంలో శోక గీతాలాపన మరియు ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టడం అనేవి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి మనవడు హుస్సేన్ (రదియల్లాహు అన్హు ) వీర మరణం దృష్ట్యా దుఃఖంలో చేస్తూ వుంటారు. 

ఆయన వీరమరణంపై దుఃఖించని, విచారపడని వ్యక్తి ఎవరున్నారు చెప్పండి? నిశ్చయంగా ప్రతి ముస్లింకు ఈ విషయంలో దుఃఖం కలుగుతుంది. కానీ, ప్రతి దుఃఖ, విచార ఘడియల్లో ఎలాగైతే సహనం పాటించాలో హుస్సేన్ (రదియల్లాహు అన్హు ) వీరమరణంపై కూడా అదే విధంగా సంయమనం పాటించాలి. అంతేగాని, శోక గీతాలాపన, ఛాతీని బాదుకోవడం, ఏడ్పులు పెడబొబ్బలు పెట్టడం వంటి అజ్ఞానపు చేష్టలు మాత్రం చేయకూడదు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

وَلَنَبْلُوَنَّكُم بِشَيْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِّنَ الْأَمْوَالِ وَالْأَنفُسِ وَالثَّمَرَاتِ ۗ وَبَشِّرِ الصَّابِرِينَ الَّذِينَ إِذَا أَصَابَتْهُم مُّصِيبَةٌ قَالُوا إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ أُولَٰئِكَ عَلَيْهِمْ صَلَوَاتٌ مِّن رَّبِّهِمْ وَرَحْمَةٌ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُهْتَدُونَ

భయ ప్రమాదాలకు, ఆకలి బాధకు, ధన ప్రాణ ఆదాయాల నష్టానికి గురి చేసి మేము మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాము. ఈ పరిస్థితులలో మనఃస్థయిర్యంతో వుండేవారు, కష్టకాలం దాపురించినపుడు ‘మేమంతా అల్లాహ్ కే చెందిన వారము, అల్లాహ్ వైపునకే మరలిపోవలసినవారము’ అని అనేవారికి శుభవార్తలు తెలుపు. వారిపై వారి ప్రభువు దయాను గ్రహాలు, కారుణ్యం వున్నాయి. సన్మార్గాన్ని పొందిన వారు కూడా వీరే.” (బఖర 2 : 155-157) 

సహనం పాటించే వారికి అల్లాహ్ లెక్కలేనంతగా అనుగ్రహిస్తాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

إِنَّمَا يُوَفَّى الصَّابِرُونَ أَجْرَهُم بِغَيْرِ حِسَابٍ
సహనం వహించే వారికి లెక్కలేనంత పుణ్యఫలం ప్రసాదించ బడుతుంది.” (జుమర్ 39 : 10) 

హుస్సేన్ (రదియల్లాహు అన్హు ) ఒక విశిష్టమైన సహాబి (దైవ ప్రవక్త (స) సహచరుడు) అవడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆయన మహత్యం గురించి చెప్పాలంటే -ఆయన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి చిన్న మరియు ప్రియ కూతురైన ఫాతిమా (రదియల్లాహు  అన్హా) పుత్రులు అన్న ఒక్క విషయమే చాలు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఆయన మరియు హసన్ (రదియల్లాహు అన్హు ) అంటే వల్ల మాలిన ప్రేమాభిమానాలు వుండేవి. 

అతా బిన్ యసార్ (రహిమహుల్లాహ్) కథనం: ఒక సహాబీ (ప్రవక్త సహచరుడు) నాకు తెలియజేసిన విషయమేమిటంటే – “దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హసన్ మరియు హుస్సేన్ (రదియల్లాహు  అన్హుమ్)లను తన ఛాతీతో హత్తుకొని ఇలా అన్నారు: ఓ అల్లాహ్! వీరిద్దరినీ నేను ప్రేమిస్తు న్నాను. కనుక నీవు కూడా వీరిని ప్రేమించు”

(ముస్నద్ అహ్మద్ – 38వ సంపుటం 211 పేజీ, నెం. 23133 – సహీ పరంపరతో, తిర్మిజి – బరా బిన్ ఆజిబ్ ఉల్లేఖనం -3782, అస్సహీహ అలా ్బనీ : 2789) 

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంటి నుండి బయలుదేరి మా వద్దకు విచ్చేశారు. ఆయనతో పాటు హసన్, హుస్సేన్ (రదియల్లాహు  అన్హుమ్)లు కూడా వున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఓసారి ఒకర్ని ముద్దాడితే మరోసారి ఇంకొకర్ని ముద్దాడేవారు. ఇదిచూసి ఓ వ్యక్తి ఇలా ప్రశ్నించాడు: ఓ దైవప్రవక్తా! మీరు వారిని ప్రేమిస్తారా? దీనిపై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్పందిస్తూ- ఎవరైతే వీరిని ప్రేమిస్తారో వారు నన్ను ప్రేమించినట్లు. ఇక ఎవరైతే వీరి పట్ల ద్వేషం కలిగి ఉంటారో వారు నా పట్ల కూడా ద్వేషం కలిగి వున్నట్లే. 

(అహ్మద్: 15వ సంపుటం, 42వ పేజీ, నెం. 9673 మరియు 13వ సంపుటం, 26వ పేజీ, నెం.: 7876, ఇబ్నెమాజా సంక్షిప్తం : 143, హసన్ -అల్బానీ) 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ఇద్దరు మనువళ్ళను ఎంత గాఢంగా ప్రేమించే వారంటే – తన ప్రసంగాన్ని సయితం ఆపి వారిని లేపడానికి మింబర్ దిగి వచ్చి వారిని లేపి, తిరిగి మింబర్ వేదిక) పైకి వెళ్ళి తన ప్రసంగాన్ని పూర్తి చేసేవారు. 

బరీరా (రదియల్లాహు అన్హా)  కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఓసారి ప్రసంగిస్తున్నారు. ఈ తరుణంలో హసన్, హుస్సేన్ (రదియల్లాహు  అన్హుమ్)లు అక్కడికి విచ్చేశారు, వారు ఎరుపు రంగు చొక్కాలు ధరించి వున్నారు. వాటిలో వారు మాటిమాటికీ జారుతూ వున్నారు. ఇది గమనించిన దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మింబర్ నుండి క్రిందికి దిగి ప్రసంగం ఆపేశారు. వారిద్దరినీ లేపి తన ఒడిలో కూర్చోబెట్టు కున్నారు. తదుపరి వారిని తీసుకొని మింబర్ పై  ఎక్కారు. తిరిగి మాట్లాడుతూ – “అల్లాహ్ సత్యం పలికాడు. నిశ్చయంగా మీ సంపద మరియు మీ సంతానం మీకొక పరీక్ష. నేను వారి స్థితిని చూసి ఆగలేకపోయాను.” అని పలికి తదుపరి తన ప్రసంగాన్ని పూర్తిచేశారు. (అబూ దావూద్ : 1109, నసాయి : 1413, ఇబ్నెమాజా : 3600, సహీ · అల్బానీ) 

అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) తో – ఇహ్రాం స్థితిలో ఎవరైనా ఒక ఈగను చంపితే, దాని గురించి ఆదేశం ఏమిటి? అని అడగబడింది. దానికాయన ఇలా జవాబిచ్చారు: ఇరాక్ వాసులు ఈగను గూర్చి ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి వారు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనవడి హంతకులు! దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన మనవళ్ళ గురించి ఇలా సెలవిచ్చారు. “వీరిద్దరూ (హసన్, హుస్సేన్లు) ఈ ప్రపంచంలో నా రెండు పుష్పాలు.” (సహీ బుఖారీ : 3753, 5994) 

సునన్ తిర్మిజి లో ఈ హదీసు పదాలు ఇలా వున్నాయి: 

ఇరాక్ వాసుల్లోని ఓ వ్యక్తి అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు  అన్హు)తో -దోమ రక్తం బట్టలపై అంటుకుంటే దాని గురించిన ఆదేశం ఏమిటి? అని ప్రశ్నించాడు. దానికాయన ఇలా బదులిచ్చారు. ఈ వ్యక్తిని చూడండి! ఇతను దోమ రక్తాన్ని గూర్చి ప్రశ్నిస్తున్నాడు: వాస్తవానికి వీరు (ఇరాక్ వాసులు) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ప్రాణమైన ప్రియ మనవడిని హత్య చేశారు. నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నోట ఇలా సెలవిస్తుండగా విన్నాను: “నిశ్చయంగా హసన్, హుస్సేన్లు ఈ లోకంలో నా రెండు పుష్పాలు.” (తిర్మిజి : 377, సహీ -అల్బానీ) 

హుజైఫా (రదియల్లాహు అన్హు)  కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: 

నిశ్చయంగా ఈ దైవదూత (మొదటిసారి) ఈ రాత్రే భూమిపైకి విచ్చేశాడు. గతంలో ఎప్పుడూ తను భూమిపైకి రాలేదు. అతను అల్లాహ్, నన్ను కలవాలని విన్నవించుకోగా, అల్లాహ్ తనకు ఈ శుభవార్తలు నాకిమ్మని చెప్పి పంపించాడు. అవేమిటంటే – ఫాతిమా (రదియల్లాహు అన్హా ) స్వర్గంలో స్త్రీల నాయకురాలిగా వుంటుంది మరియు హసన్, హుస్సేన్లు స్వర్గంలో యువకులకు నాయకులుగా వుంటారు”. (తిర్మిజీ: 3781, సహీ – అల్బానీ) 

అనస్ (రదియల్లాహు  అన్హు) కథనం: హుస్సేన్ బిన్ అలీ (రదియల్లాహు అన్హు ) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను ఎక్కువగా పోలి వుండేవారు. (సహీ బుఖారీ : 3748) 

ప్రియ శ్రోతలారా! 

ఈ హదీసులన్నింటిలోనూ, హసన్, హుస్సేన్ (రదియల్లాహు  అన్హుమ్)ల మహత్యం వివరించబడింది. ఈ హదీసులను దృష్టిలో వుంచుకొనే మేము వీరిద్దరిని ప్రేమిస్తాము మరియు వీరిని ప్రేమించడం విశ్వాసంలో అంతర్భాగం అని తలుస్తాము. అంతేగాక, హుస్సేన్ (రజియల్లాహు అన్హు) వీరమరణం ఒక దురదృష్టకరమైన, విచారకరమైన సంఘటన అని స్వీకరిస్తాం. కానీ, మేము దీని కోసం, శోకగీతాలాపన చేయడం, ఏడ్పులు పెడబొబ్బలు పెట్టడం, ఛాతీని బాదుకోవడం లాంటి చర్యలు చేయడాన్ని అనుచితంగానూ, నిషేధంగానూ భావిస్తాము. ఎందుకంటే – ఇంతకు ముందు వివరించినట్లు, స్వయంగా మన ప్రియ దైవప్రవక్తే (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలాంటి చర్యలను నిషేధిం చారు. కనుక, ఈ సంఘటనపై కేవలం సహనం పాటించడం మినహా మనకు వేరే మార్గం లేదు. 

గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే- హుస్సేన్ (రదియల్లాహు అన్హు ) వీరమరణం గూర్చి జిబ్రాయీల్ (అలైహిస్సలాం) ముందే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు సూచించి వున్నారు. 

ఉమ్మె సలమా (రదియల్లాహు  అన్హా) కథనం : ఓసారి జిబ్రయీల్ (అలైహిస్సలాం) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు విచ్చేశారు. ఆ సమయంలో హుస్సేన్ (రదియల్లాహు అన్హు ) నా దగ్గర వున్నారు. అకస్మాత్తుగా ఆయన ఏడ్వడం ప్రారంభించారు. నేనాయన్ని వదిలిపెట్టగా, ఆయన తిన్నగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికెళ్ళి కూర్చున్నారు. జిబ్రయీల్ (అలైహిస్సలాం) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో : ఓ ముహమ్మద్ ! మీరితన్ని ప్రేమిస్తారా? అని అడిగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘అవునని’ జవాబిచ్చారు. జిబ్రయీల్ (అలైహిస్సలాం) మాట్లాడుతూ : నిశ్చయంగా మీ అనుచర సమాజం అతి త్వరలో ఇతణ్ణి హత్య చేస్తుంది. మీరు కోరుకుంటే అతను హత్య చేయబడే స్థలం యొక్క మట్టిని మీకు చూపిస్తాను. తదుపరి ఆయన దానిని చూపించారు. అదే ‘కర్బలా’ అనే స్థలం. (అబ్రజ అహ్మద్ ఫీ ఫజాయెల్ సహాబా హసన్ పరంపరతో, 2వ సంపుటం, 782 పేజీ, నెం. 1391) 

కనుక మేము, హుస్సేన్ (రదియల్లాహు అన్హు ) వీరమరణాన్ని అల్లాహ్ యొక్క విధి వ్రాత అని నమ్ముతాము. ఇలాగే హుస్సేన్ (రదియల్లాహు అన్హు ) తండ్రి అయిన అలీ (రదియల్లాహు అన్హు ) కూడా అల్లాహ్ విధి వ్రాత ప్రకారం వీరమరణం పొందారు. ఆయనైతే హిజ్రీ  శకం 40వ సంవత్సరంలో రమజాన్ 17వ తేదీ నాడు, శుక్రవారం తెల్లవారుఝామున ఫజర్ నమాజు కోసం వెళు తుండగా వీరమరణం పొందారు! 

ఇదే విధంగా, ఆయనకు ముందు, ఉస్మాన్ (రదియల్లాహు  అన్షు) ను కూడా కొంతమంది దుర్మార్గులు కలిసి అతి భయంకరంగా తుదముట్టించారు. ఆయన హి.శ. 36వ సంవత్సరంలో జిల్  హిజ్జ మాసపు, ఖుర్బానీ దినాలలో అమరగతులయ్యారు. ఆయన కన్నా ముందు, ఉమర్ (రదియల్లాహు అన్హు ) కూడా ఫజర్ నమాజులో దివ్య ఖుర్ఆన్ పఠిస్తూ వీరమరణం పొందారు. వీరందరూ నిస్సందేహంగా హుస్సేన్ (రదియల్లాహు అన్హు) కన్నా ఉత్తములు మరియు వీరి వీరమరణ వృత్తాంతాలు కూడా అత్యంత భయంకరంగా, విచారకరంగా వున్నాయి. కానీ ఈ సంఘటనలన్నింటిపై మనం “ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్” అని అనడం తప్ప ఇంకేం చేయగలం! 

ఈ పోస్ట్ మొహర్రం నెల మరియు ఆషూరా దినం | జాదుల్ ఖతీబ్ అనే ఖుత్బా నుండి తీసుకోబడింది
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్