[డౌన్ లోడ్ PDF]
ముఖ్యమైన అంశాలు
1) మొహర్రం మాసం ప్రాధాన్యత
2) నాలుగు నిషిద్ధ మాసాలు మరియు వాటి ప్రత్యేక ఆదేశాలు
3) దుష్కార్యాల ప్రభావాలు
4) మొహర్రం నెలలో శోక గీతాలాపన (నోహా) మరియు హాహాకారాలు (మాతం) చేయడం
5) హుస్సేన్ (రదియల్లాహు అన్హు) వీర మరణం
6) మొహర్రం మాసం మరియు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరులు
7) మొహర్రం మాసంలో ఉపవాసం ప్రాధాన్యత
8) చరిత్రలో ఆషూరా దినం ప్రాధాన్యత
9) ఆషూరా దినపు ఉపవాసం ప్రాధాన్యత మరియు మహత్యం
మొదటి ఖుత్బా
ప్రియమైన శ్రోతలారా! మొహర్రం మాసం ఒక మహోన్నతమైన పవిత్ర మాసం. ఇది హిజ్రీ సంవత్సరపు మొదటి మాసం అవడమే గాక, నిషేధిత నాలుగు మాసాల్లో ఒకటి.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
إِنَّ عِدَّةَ الشُّهُورِ عِندَ اللَّهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّهِ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ ۚ فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ
“యథార్థం ఏమిటంటే, ఆకాశాన్నీ భూమినీ అల్లాహ్ సృష్టించినప్పటి నుండీ, మాసాల సంఖ్య అల్లాహ్ గ్రంథంలో పన్నెండు మాత్రమే. వాటిలో నాలుగు నిషిద్ధ మాసాలు. ఇదే సరైన ధర్మం. కనుక ఈ నాలుగు మాసాల్లో మీకు మీరు అన్యాయం చేసుకోకండి.” (తౌబా 9: 36)
అంటే – భూమ్యాకాశాలు సృష్టించబడినప్పటి నుండి అల్లాహ్ దృష్టిలో సంవత్సరపు మాసాల సంఖ్య పన్నెండు మాత్రమే. అందులో నాలుగు మాసాలు నిషిద్ధ మాసాలు. మరి ఆ నిషిద్ధ మాసాలు ఏవి? దీనికి సంబంధించిన ఒక హదీసు వినండి!
అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“సంవత్సరం పన్నెండు మాసాలు కలిగి వుంది. వీటిలో నాలుగు నిషిద్దమైనవి. వాటిలో మూడు మాసాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తాయి. అవి జిల్ ఖాదా, జిల్ హిజ్జ మరియు మొహర్రం మాసాలు కాగా నాల్గవది జమా దిస్సానీ మరియు షాబాన్ మాసాల మధ్య వచ్చే రజబ్ మాసం.” (సహీ బుఖారీ, తఫ్సీర్- బాబ్ సూరహ్ తౌబా)
మూడు మాసాలేమో ఒకదాని తర్వాత మరొకటి. నాల్గవది ఒంటరిది. దీనిలో దాగివున్న మర్మం ఏమిటి? హాఫిజ్ ఇబ్నె కసీర్ దీనిలోగల మర్మాన్ని గూర్చి ఇలా వివరించారు.
“హజ్ మాసానికి ముందు వచ్చే జిల్ ఖాదా మాసంలో వారు (అప్పటి ప్రజలు) యుద్ధం చేయడాన్ని పరిత్యజించేవారు. తదుపరి జిల్ హిజ్జ మాసంలో హజ్ చేసేవారు. ఆ తర్వాత, ప్రజలు శాంతియుతంగా తమ తమ ప్రదేశాలకు వెళ్ళగలిగేందుకుగాను ఆ తర్వాతి నెల కూడా నిషిద్దం గావించబడింది. తదుపరి, సంవత్సరపు మధ్య కాలంలో ఇంకో నెల నిషిద్ధం గావించబడింది. తద్వారా ప్రజలు ఉమ్రాహ్ మరియు బైతుల్లాహ్ దర్శనానికి శాంతియుతంగా వెళ్ళి రాగలగడానికి“. (తఫ్సీర్ ఇబ్నె కసీర్ : 2/468)
ప్రియ శ్రోతలారా!
అల్లాహ్ ఈ ఆయతులో నిషిద్ధ మాసాలను గూర్చి వివరించిన తర్వాత “ఈ మాసాలలో మీరు అన్యాయం చేసుకోకండి” అని సెలవిచ్చాడు. అన్యాయం, దౌర్జన్యం అనేవి సంవత్సరం పొడుగునా వారించబడినప్పటికీ ఈ నాలుగు మాసాల గౌరవ, పవిత్రతల దృష్ట్యా అల్లాహ్ ప్రత్యేకంగా వీటిలో తమ ప్రాణాలపై దౌర్జన్యం చేసుకోవడాన్ని వారించాడు.
ఈ అన్యాయం, దౌర్జన్యం అంటే అర్థం ఏమిటి?
దీని ఒక అర్థం ఏమిటంటే – ‘ఈ మాసాలలో యుద్ధాలు, ఒకర్నొకరు చంపుకోవడాలు చేయకండి‘ అని. దీన్ని సమర్థిస్తూ అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
يَسْأَلُونَكَ عَنِ الشَّهْرِ الْحَرَامِ قِتَالٍ فِيهِ ۖ قُلْ قِتَالٌ فِيهِ كَبِيرٌ
“నిషిద్ధ మాసంలో యుద్ధం చేయడాన్ని గురించి ప్రజలు నిన్ను అడుగుతారు. వారికిలా సమాధానం చెప్పు: ఆ మాసంలో యుద్ధం చెయ్యటం మహాపాపమే.” (బఖర 2 : 217)
అజ్ఞానపు కాలంలో కూడా ప్రజలు ఈ నాలుగు మాసాలను నిషిద్ధ మైనవిగా భావించి వాటిలో యుద్ధాలు చేయడాన్ని విడనాడేవారు. తదుపరి ఇస్లాం కూడా వాటి పవిత్రతను యధావిధిగా వుంచి, వాటిలో యుద్ధం చేయడాన్ని మహాపాపంగా ఖరారు చేసింది.
ఇక దౌర్జన్యం యొక్క అర్థం ఏమిటంటే – ప్రత్యేకంగా ఈ నాలుగు మాసాలలో మీరు అల్లాహ్ అవిధేయతకు దూరంగా వుండండి. ఎందుకంటే, వీటిలో ‘అవిధేయత పాపం’ ఎన్నో రెట్లు పెరిగిపోతుంది.
హాఫిజ్ ఇబ్నె కసీర్ – ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్షు) ద్వారా ఇలా ఉల్లేఖించారు:
“అల్లాహ్, దౌర్జన్యాన్ని సంవత్సరపు పన్నెండు మాసాల్లోనూ నిషేధిం చాడు. తదుపరి నాలుగు మాసాలను వాటిలో ప్రత్యేకంగా ఖరారు చేశాడు. ఎందుకంటే – వీటిలో చెడు, అవిధేయతల పాపం పెరుగుతుంది మరియు మంచి, సదాచరణల పుణ్యం కూడా ఎన్నో రెట్లు పెరుగుతుంది.”
ఇమామ్ ఖతాదా (రహిమహుల్లాహ్) అల్లాహ్ ఆదేశం – “ఈ మాసాలలో మీరు దౌర్జన్యం చేసుకోకండి.” గురించి వ్యాఖ్యానిస్తూ ఇలా వివరించారు:
“దౌర్జన్యపు పాపం ఎల్లప్పుడూ ఎక్కువగా వున్నప్పటికీ ప్రత్యేకంగా నిషిద్ధ మాసాలలో దీని పాపం మరియు బరువు ఇతర మాసాలలో కన్నా ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. దైవదూతలలో కొందరిని ప్రత్యేకంగా సందేశహరులుగా, గ్రంథాల్లో దివ్య ఖుర్ఆన్ ను, యావత్ భూమిలో మసీదులను, అలాగే మాసాలలో రమజాన్ నెలను నిషిద్ధ మాసాలతోపాటు ఎన్నుకున్నట్లే, దినాలలో శుక్రవారాన్నీ, రాత్రుల్లో లైలతుల్ ఖద్ర్ ను అల్లాహ్ ఎన్నుకున్నట్లే, ఏ మాసంలో పాప ఫలాన్ని అధికంగా చేయాలో మరియు దేనికి గొప్పతనం ప్రసాదించాలో పూర్తిగా అతని ఇష్టం. అందుకే, అల్లాహ్ దేన్నైతే గొప్పదిగా భావించాడో మీరు కూడా దానిని గొప్పదిగా భావించండి” (తఫ్సీర్ ఇబ్నె కసీర్-2/468)
ముస్లిం సోదరులారా!
సంవత్సరం పొడుగునా, ప్రత్యేకించి ఈ నాలుగు మాసాల్లో మనం అల్లాహ్ అవిధేయత నుండి దూరంగా వుండాలి మరియు పాపకార్యాలను త్యజించాలి. ఎందుకంటే అవిధేయత మరియు పాపకార్యాల మూలంగా హృదయాలకు తప్పుపట్టుతుంది.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا يَكْسِبُونَ
“ఎంత మాత్రం కాదు, అసలు వారి హృదయాలకు వారి దుష్కార్యాల తుప్పు పట్టింది.” (ముతఫ్ఫిఫీన్ 83 : 14)
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:
“విశ్వాసి ఏదైనా దుష్కార్యం చేసినప్పుడు అతని హృదయంలో ఒక నల్లటి మచ్చ ఏర్పడుతుంది. తదుపరి, ఒకవేళ అతను పశ్చాత్తాపం చెంది, ఆ దుష్కార్యాన్ని త్యజించి, క్షమించమని (అల్లాహ్ ను) వేడుకుంటే, అతని హృదయాన్ని శుభ్రం చేయడం జరుగుతుంది. ఒకవేళ అతను ఒక దుష్కార్యం తర్వాత మరో దుష్కార్యాన్ని చేస్తూ పోతూ వుంటే, అతని హృదయంలోని నల్లటి మచ్చ పెరుగుతూ పోయి చివరికి పూర్తి హృదయాన్ని ఆక్రమించు కుంటుంది”. దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చిన – “వారి హృదయాలకు వారి దుష్కార్యాల తుప్పు పట్టింది” అన్న దానికి వివరణ ఇదే. (తిర్మిజి : 3334 – హసన్ సహీ, ఇబ్నెమాజా: 4244, హసన్ – అల్బానీ)
బాగా గుర్తుంచుకోండి! దుష్కార్యాల మూలంగా జీవితం ఎంతో మనో వ్యధతో గడుస్తూ వుంటుంది మరియు వాస్తవిక సుఖశాంతులు మనిషికి కరువైపోతాయి.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
وَمَنْ أَعْرَضَ عَن ذِكْرِي فَإِنَّ لَهُ مَعِيشَةً ضَنكًا وَنَحْشُرُهُ يَوْمَ الْقِيَامَةِ أَعْمَىٰ قَالَ رَبِّ لِمَ حَشَرْتَنِي أَعْمَىٰ وَقَدْ كُنتُ بَصِيرًا قَالَ كَذَٰلِكَ أَتَتْكَ آيَاتُنَا فَنَسِيتَهَا ۖ وَكَذَٰلِكَ الْيَوْمَ تُنسَ
“నా జ్ఞాపిక (సంస్మరణము)కు విముఖుడైన వానికి ప్రపంచంలోజీవితం ఇరుకవుతుంది. ప్రళయం నాడు మేము అతనిని అంధుడుగా లేపుతాము. అప్పుడు అతడు- ప్రభూ! ప్రపంచంలో నేను చూడగలవాణ్ణి కదా! నన్ను ఇక్కడ అంధునిగా ఎందుకు లేపావు? అని అడుగుతాడు. అల్లాహ్ ఇలా సెలవిస్తాడు: మా ఆయతులు నీ వద్దకు వచ్చినప్పుడు నీవు వాటిని విస్మరించావు. అదే విధంగా ఈనాడు నీవు విస్మరించబడుతున్నావు.” (తాహా 20 : 124-126)
అంటే – దైవధర్మానికి దూరంగా వుంటూ, దివ్య ఖుర్ఆన్ ఆయతులు పఠించకుండా, వాటికనుగుణంగా ఆచరించకుండా వున్న కారణానికి గాను నలువైపుల నుండి అతని జీవితం ఇరుకైపోతుంది. జీవనోపాధి పుష్కలంగా వున్నప్పటికీ, వాస్తవిక సంతృప్తి మరియు సుఖశాంతులు కరువైపోతాయి. మరణానంతరం సమాధి కూడా ఇరుకైపోతుంది. తదుపరి సమాధి జీవితం కూడా అత్యంత ఘోర కష్టాల్లో గడుస్తుంది. చివరికి ప్రళయం నాడు లేపబడినప్పుడు అతను దృష్టిపరంగా మరియు బుద్ధిపరంగా రెండిట్లోనూ అంధుడిగా లేపబడుతాడు.
అల్లాహ్ వీటి నుండి మనల్ని రక్షించుగాక!
దుష్కార్యాలు, పాపాల మూలంగా ప్రసాదించబడ్డ అనుగ్రహాలు కూడా లాక్కోబడతాయి మరియు రాబోయే అనుగ్రహాలు కూడా ఆపివేయబడతాయి. మన తల్లిదండ్రులు ఆదమ్ (అలైహిస్సలాం) మరియు హవ్వా (అలైహిస్సలాం)ల విషయంలో కూడా వారి ఒక సాధారణ తప్పు కారణంగా వారిని స్వర్గపు అనుగ్రహాల నుండి దూరం చేయడం జరిగింది.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
وَقُلْنَا يَا آدَمُ اسْكُنْ أَنتَ وَزَوْجُكَ الْجَنَّةَ وَكُلَا مِنْهَا رَغَدًا حَيْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هَٰذِهِ الشَّجَرَةَ فَتَكُونَا مِنَ الظَّالِمِينَ فَأَزَلَّهُمَا الشَّيْطَانُ عَنْهَا فَأَخْرَجَهُمَا مِمَّا كَانَا فِيهِ
“మేము ఆదమ్ ఇలా అన్నాము: నీవూ నీ భార్య యిద్దరూ కలిసి స్వర్గంలో నివసించండి. ఇక్కడ మీరు మీకు ఇష్టమైన దానిని యధేచ్ఛగా తినండి. కానీ ఈ చెట్టు దరిదాపులకు పోవద్దు. ఒకవేళ పోతే, మీరు అతిక్రమణదారులలో కలిసిపోతారు. చివరికి షైతాను వారిద్దరినీ చెట్టు వైపునకు ఆకర్షించి మా ఆజ్ఞాపాలనం నుండి దూరం చేశాడు. వారిని వారు వుంటూ వున్న స్థితి నుండి తొలగించివేశాడు.” (బఖర 2 : 35-36)
ఇలాగే, దుష్కార్యాల మూలంగా కలిగే దుష్ఫలితాలను గురించి తెలియ జేస్తూ ఇలా సెలవిచ్చాడు:
أَلَمْ يَرَوْا كَمْ أَهْلَكْنَا مِن قَبْلِهِم مِّن قَرْنٍ مَّكَّنَّاهُمْ فِي الْأَرْضِ مَا لَمْ نُمَكِّن لَّكُمْ وَأَرْسَلْنَا السَّمَاءَ عَلَيْهِم مِّدْرَارًا وَجَعَلْنَا الْأَنْهَارَ تَجْرِي مِن تَحْتِهِمْ فَأَهْلَكْنَاهُم بِذُنُوبِهِمْ وَأَنشَأْنَا مِن بَعْدِهِمْ قَرْنًا آخَرِينَ
“ఏమిటీ, మేము వీళ్ళకు పూర్వం ఎన్ని జాతులను నాశనం చేశామో మీరు చూడలేదా? ప్రపంచంలో మీకు ప్రసాదించని బలాన్ని మేము ఆ జాతులకు ప్రసాదించాము. వారికోసం మేము ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము. వారికోసం క్రింద కాలువలు ప్రవహింప జేశాము. కానీ, వారి పాపాల మూలంగా మేము వారిని తుదముట్టించాం. వారి తర్వాత ఇతర జాతులను ప్రభవింపజేశాము.” (అన్ ఆమ్ 6 : 6)
ఈ ఆయత్ పై కాస్త దృష్టి సారించండి! అల్లాహ్ సెలవిచ్చిందేమిటంటే – గత అనుచర సమాజాలకు మీ కన్నా ఎక్కువగా బలాధిక్యతలను ప్రసాదించి ఎన్నో విధాలుగా అనుగ్రహించడం జరిగింది. కానీ వారు కృతఘ్నులైన కారణంగా ఆ అనుగ్రహాలన్నీ వారి నుండి లాక్కోబడటమే గాక వారిని నాశనం కూడా చేయడం జరిగింది. ఒకవేళ మీరు కూడా ఇప్పుడు అదే పద్దతి అవలంబిస్తే మిమ్మల్ని నాశనం చేయడం మాకేమైనా కష్టమని అనుకొంటున్నారా? అని.
అందుకే, మనం అల్లాహ్ ప్రసాదించిన ఎన్నో అనుగ్రహాలకు గాను ఎల్లప్పుడూ కృతజ్ఞులై వుండాలి. దాని ఒక్కగా నొక్క స్వరూపం ఏమిటంటే మనం అల్లాహ్ కు విధేయులైన దాసులుగా మారాలి మరియు అవిధేయతకు దూరంగా వుండాలి.
ప్రియ శ్రోతలారా!
ఈ ప్రసంగం ఆరంభంలో మేము – అల్లాహ్ ప్రత్యేకంగా నిషిద్ద మాసాల్లో తమ ప్రాణాలపై దౌర్జన్యం చేయడాన్ని నిషేధించడాని సెలవిచ్చివున్నాం. మొహర్రం మాసాన్ని దృష్టిలో వుంచుకొని ఇక్కడ రెండు విషయాలను గురించి వివరించడం తప్పనిసరి.
1) మొహర్రం నెల మరియు శోక గీతాలాపన
మీకు తెలిసే వుంటుంది చాలా మంది మొహర్రం నెలలో, దుఃఖ సూచిత దుస్తులు ధరించి శోక గీతాలాపన చేస్తూ, ఏడ్పులు, పెడబొబ్బలు పెడుతూ ఛాతీని బాదుకోవడం చేస్తూ వుంటారు.
మా దృష్టిలో ఇది కూడా నిషేధించబడ్డ దౌర్జన్యపు ఒక రూపమే. ఈ కార్యాలనుద్దేశించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా సెలవిచ్చారు:
“అజ్ఞానకాలం నాటి నాలుగు ఆచరణలను ఈ అనుచర సమాజం విడనాడడానికి సిద్ధంగా ఉండదు. తమ వంశంపై గర్వపడడం, ఇతరుల వంశాన్ని తక్కువగా భావించడం, నక్షత్రాల ద్వారా అదృష్టాన్ని తెలుసుకోవడం (లేదా వాటి ద్వారా వర్షాన్ని అర్థించడం) మరియు శోకగీతాలాపనలు చేయడం.” (సహీ ముస్లిం – అల్ జనాయెజ్ : 936)
ఇంకా ఈ విధంగా కూడా ఉద్భోదించారు:
“శోక గీతాలాపన చేసే స్త్రీ తన మరణానికి ముందు గనక తౌబా (పశ్చాతాపం) చెందకపోతే, ప్రళయం రోజు తన శరీరంపై గజ్జి, దురద వ్యాపించి వుండగా, గంధకపు వస్త్రాలు ధరించి వున్న స్థితిలో లేపబడుతుంది.”
ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే – శోక గీతాలాపనలు వగైరా… చేయడం అనేవి అజ్ఞానపు చేష్టలు మరియు ఇస్లాంతో వీటికేమాత్రం సంబంధం లేదు. అందుకే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) శోకగీతాలాపన … వగైరా… లాంటి పనులు చేసే వ్యక్తితో తనకే మాత్రం సంబంధం లేదని ప్రకటిస్తూ ఇలా పేర్కొన్నారు:
“తన చెంపలను బాదుకొనేవాడు, వస్త్రాలను చింపుకొనేవాడు, అజ్ఞాన కాలపు కార్యాలను గూర్చి ఘనంగా చర్చించేవాడు, కష్ట సమయాల్లో వినాశనాన్ని, మరణాన్ని కోరుకునేవాడు మాలోని వాడు కాడు.” (సహీ బుఖారీ – అల్ జనాయెజ్ : 1294)
అబూ దర్ద బిన్ అబూ మూసా అష్రీ (రదియల్లాహు అన్హు) కథనం : అబూ మూసా అష్రీ ఓసారి తీవ్ర అనారోగ్యానికి గురై మూర్చపోయినట్లు అయిపోయారు. ఆయన తల ఆయన సతీమణుల్లో ఒకరి ఒడిలో వుంది. (ఈ స్థితిని చూసి) అమె పెద్దగా ఏడ్వడం ఆరంభించింది. కానీ ఆయన మాత్రం ఆమెకు జవాబు ఇవ్వలేకపోయారు. కాసేపటికి, కాస్త కుదుటపడ్డాక, ఆమె నిర్వాకం చూసి ఇలా సెలవిచ్చారు: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) విముక్తి ప్రకటించుకున్న ప్రతి వ్యక్తితో నేను కూడా విముక్తుణ్ణి. నిస్సందేహంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టే, దుఃఖ, విచార ఘడియల్లో తల గొరికించుకునే మరియు వస్త్రాలు చింపుకొనే స్త్రీ నుండి విముక్తిని ప్రకటించుకున్నారు. (సహీ బుఖారీ – అల్ జనాయెజ్: 1296, ముస్లిం : 1167)
ఈ హదీసుల ద్వారా రూఢీ అయిన విషయమేమిటంటే – ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టడం, ఛాతీని బాదుకోవడం…. లాంటి పనులు పూర్తిగా నిషేధిం చబడ్డాయి.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ పనులను, వీటిలో లిప్తమైవున్న వారిని గూర్చి తనను తాను పూర్తిగా విముక్తుడిగా, ఏ మాత్రం సంబంధం లేని వానిగా ప్రకటించుకున్నారు. కనుక ముస్లిములందరూ ఇలాంటి దుష్కార్యాలను గూర్చి జాగ్రత్తపడాలి. మరియు (ఒకవేళ లిప్తమై వుంటే) వెంటనే వీటిని మనః పూర్వకంగా త్యజించాలి.
ప్రియ శ్రోతలారా!
మొహర్రం మాసంలో శోక గీతాలాపన మరియు ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టడం అనేవి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి మనవడు హుస్సేన్ (రదియల్లాహు అన్హు ) వీర మరణం దృష్ట్యా దుఃఖంలో చేస్తూ వుంటారు.
ఆయన వీరమరణంపై దుఃఖించని, విచారపడని వ్యక్తి ఎవరున్నారు చెప్పండి? నిశ్చయంగా ప్రతి ముస్లింకు ఈ విషయంలో దుఃఖం కలుగుతుంది. కానీ, ప్రతి దుఃఖ, విచార ఘడియల్లో ఎలాగైతే సహనం పాటించాలో హుస్సేన్ (రదియల్లాహు అన్హు ) వీరమరణంపై కూడా అదే విధంగా సంయమనం పాటించాలి. అంతేగాని, శోక గీతాలాపన, ఛాతీని బాదుకోవడం, ఏడ్పులు పెడబొబ్బలు పెట్టడం వంటి అజ్ఞానపు చేష్టలు మాత్రం చేయకూడదు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
وَلَنَبْلُوَنَّكُم بِشَيْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِّنَ الْأَمْوَالِ وَالْأَنفُسِ وَالثَّمَرَاتِ ۗ وَبَشِّرِ الصَّابِرِينَ الَّذِينَ إِذَا أَصَابَتْهُم مُّصِيبَةٌ قَالُوا إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ أُولَٰئِكَ عَلَيْهِمْ صَلَوَاتٌ مِّن رَّبِّهِمْ وَرَحْمَةٌ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُهْتَدُونَ
“భయ ప్రమాదాలకు, ఆకలి బాధకు, ధన ప్రాణ ఆదాయాల నష్టానికి గురి చేసి మేము మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాము. ఈ పరిస్థితులలో మనఃస్థయిర్యంతో వుండేవారు, కష్టకాలం దాపురించినపుడు ‘మేమంతా అల్లాహ్ కే చెందిన వారము, అల్లాహ్ వైపునకే మరలిపోవలసినవారము’ అని అనేవారికి శుభవార్తలు తెలుపు. వారిపై వారి ప్రభువు దయాను గ్రహాలు, కారుణ్యం వున్నాయి. సన్మార్గాన్ని పొందిన వారు కూడా వీరే.” (బఖర 2 : 155-157)
సహనం పాటించే వారికి అల్లాహ్ లెక్కలేనంతగా అనుగ్రహిస్తాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
إِنَّمَا يُوَفَّى الصَّابِرُونَ أَجْرَهُم بِغَيْرِ حِسَابٍ
“సహనం వహించే వారికి లెక్కలేనంత పుణ్యఫలం ప్రసాదించ బడుతుంది.” (జుమర్ 39 : 10)
హుస్సేన్ (రదియల్లాహు అన్హు ) ఒక విశిష్టమైన సహాబి (దైవ ప్రవక్త (స) సహచరుడు) అవడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆయన మహత్యం గురించి చెప్పాలంటే -ఆయన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి చిన్న మరియు ప్రియ కూతురైన ఫాతిమా (రదియల్లాహు అన్హా) పుత్రులు అన్న ఒక్క విషయమే చాలు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఆయన మరియు హసన్ (రదియల్లాహు అన్హు ) అంటే వల్ల మాలిన ప్రేమాభిమానాలు వుండేవి.
అతా బిన్ యసార్ (రహిమహుల్లాహ్) కథనం: ఒక సహాబీ (ప్రవక్త సహచరుడు) నాకు తెలియజేసిన విషయమేమిటంటే – “దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హసన్ మరియు హుస్సేన్ (రదియల్లాహు అన్హుమ్)లను తన ఛాతీతో హత్తుకొని ఇలా అన్నారు: ఓ అల్లాహ్! వీరిద్దరినీ నేను ప్రేమిస్తు న్నాను. కనుక నీవు కూడా వీరిని ప్రేమించు”.
(ముస్నద్ అహ్మద్ – 38వ సంపుటం 211 పేజీ, నెం. 23133 – సహీ పరంపరతో, తిర్మిజి – బరా బిన్ ఆజిబ్ ఉల్లేఖనం -3782, అస్సహీహ అలా ్బనీ : 2789)
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంటి నుండి బయలుదేరి మా వద్దకు విచ్చేశారు. ఆయనతో పాటు హసన్, హుస్సేన్ (రదియల్లాహు అన్హుమ్)లు కూడా వున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఓసారి ఒకర్ని ముద్దాడితే మరోసారి ఇంకొకర్ని ముద్దాడేవారు. ఇదిచూసి ఓ వ్యక్తి ఇలా ప్రశ్నించాడు: ఓ దైవప్రవక్తా! మీరు వారిని ప్రేమిస్తారా? దీనిపై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్పందిస్తూ- ఎవరైతే వీరిని ప్రేమిస్తారో వారు నన్ను ప్రేమించినట్లు. ఇక ఎవరైతే వీరి పట్ల ద్వేషం కలిగి ఉంటారో వారు నా పట్ల కూడా ద్వేషం కలిగి వున్నట్లే.
(అహ్మద్: 15వ సంపుటం, 42వ పేజీ, నెం. 9673 మరియు 13వ సంపుటం, 26వ పేజీ, నెం.: 7876, ఇబ్నెమాజా సంక్షిప్తం : 143, హసన్ -అల్బానీ)
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ఇద్దరు మనువళ్ళను ఎంత గాఢంగా ప్రేమించే వారంటే – తన ప్రసంగాన్ని సయితం ఆపి వారిని లేపడానికి మింబర్ దిగి వచ్చి వారిని లేపి, తిరిగి మింబర్ వేదిక) పైకి వెళ్ళి తన ప్రసంగాన్ని పూర్తి చేసేవారు.
బరీరా (రదియల్లాహు అన్హా) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఓసారి ప్రసంగిస్తున్నారు. ఈ తరుణంలో హసన్, హుస్సేన్ (రదియల్లాహు అన్హుమ్)లు అక్కడికి విచ్చేశారు, వారు ఎరుపు రంగు చొక్కాలు ధరించి వున్నారు. వాటిలో వారు మాటిమాటికీ జారుతూ వున్నారు. ఇది గమనించిన దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మింబర్ నుండి క్రిందికి దిగి ప్రసంగం ఆపేశారు. వారిద్దరినీ లేపి తన ఒడిలో కూర్చోబెట్టు కున్నారు. తదుపరి వారిని తీసుకొని మింబర్ పై ఎక్కారు. తిరిగి మాట్లాడుతూ – “అల్లాహ్ సత్యం పలికాడు. నిశ్చయంగా మీ సంపద మరియు మీ సంతానం మీకొక పరీక్ష. నేను వారి స్థితిని చూసి ఆగలేకపోయాను.” అని పలికి తదుపరి తన ప్రసంగాన్ని పూర్తిచేశారు. (అబూ దావూద్ : 1109, నసాయి : 1413, ఇబ్నెమాజా : 3600, సహీ · అల్బానీ)
అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) తో – ఇహ్రాం స్థితిలో ఎవరైనా ఒక ఈగను చంపితే, దాని గురించి ఆదేశం ఏమిటి? అని అడగబడింది. దానికాయన ఇలా జవాబిచ్చారు: ఇరాక్ వాసులు ఈగను గూర్చి ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి వారు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనవడి హంతకులు! దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన మనవళ్ళ గురించి ఇలా సెలవిచ్చారు. “వీరిద్దరూ (హసన్, హుస్సేన్లు) ఈ ప్రపంచంలో నా రెండు పుష్పాలు.” (సహీ బుఖారీ : 3753, 5994)
సునన్ తిర్మిజి లో ఈ హదీసు పదాలు ఇలా వున్నాయి:
ఇరాక్ వాసుల్లోని ఓ వ్యక్తి అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు)తో -దోమ రక్తం బట్టలపై అంటుకుంటే దాని గురించిన ఆదేశం ఏమిటి? అని ప్రశ్నించాడు. దానికాయన ఇలా బదులిచ్చారు. ఈ వ్యక్తిని చూడండి! ఇతను దోమ రక్తాన్ని గూర్చి ప్రశ్నిస్తున్నాడు: వాస్తవానికి వీరు (ఇరాక్ వాసులు) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ప్రాణమైన ప్రియ మనవడిని హత్య చేశారు. నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నోట ఇలా సెలవిస్తుండగా విన్నాను: “నిశ్చయంగా హసన్, హుస్సేన్లు ఈ లోకంలో నా రెండు పుష్పాలు.” (తిర్మిజి : 377, సహీ -అల్బానీ)
హుజైఫా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:
“నిశ్చయంగా ఈ దైవదూత (మొదటిసారి) ఈ రాత్రే భూమిపైకి విచ్చేశాడు. గతంలో ఎప్పుడూ తను భూమిపైకి రాలేదు. అతను అల్లాహ్, నన్ను కలవాలని విన్నవించుకోగా, అల్లాహ్ తనకు ఈ శుభవార్తలు నాకిమ్మని చెప్పి పంపించాడు. అవేమిటంటే – ఫాతిమా (రదియల్లాహు అన్హా ) స్వర్గంలో స్త్రీల నాయకురాలిగా వుంటుంది మరియు హసన్, హుస్సేన్లు స్వర్గంలో యువకులకు నాయకులుగా వుంటారు”. (తిర్మిజీ: 3781, సహీ – అల్బానీ)
అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: హుస్సేన్ బిన్ అలీ (రదియల్లాహు అన్హు ) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను ఎక్కువగా పోలి వుండేవారు. (సహీ బుఖారీ : 3748)
ప్రియ శ్రోతలారా!
ఈ హదీసులన్నింటిలోనూ, హసన్, హుస్సేన్ (రదియల్లాహు అన్హుమ్)ల మహత్యం వివరించబడింది. ఈ హదీసులను దృష్టిలో వుంచుకొనే మేము వీరిద్దరిని ప్రేమిస్తాము మరియు వీరిని ప్రేమించడం విశ్వాసంలో అంతర్భాగం అని తలుస్తాము. అంతేగాక, హుస్సేన్ (రజియల్లాహు అన్హు) వీరమరణం ఒక దురదృష్టకరమైన, విచారకరమైన సంఘటన అని స్వీకరిస్తాం. కానీ, మేము దీని కోసం, శోకగీతాలాపన చేయడం, ఏడ్పులు పెడబొబ్బలు పెట్టడం, ఛాతీని బాదుకోవడం లాంటి చర్యలు చేయడాన్ని అనుచితంగానూ, నిషేధంగానూ భావిస్తాము. ఎందుకంటే – ఇంతకు ముందు వివరించినట్లు, స్వయంగా మన ప్రియ దైవప్రవక్తే (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలాంటి చర్యలను నిషేధిం చారు. కనుక, ఈ సంఘటనపై కేవలం సహనం పాటించడం మినహా మనకు వేరే మార్గం లేదు.
గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే- హుస్సేన్ (రదియల్లాహు అన్హు ) వీరమరణం గూర్చి జిబ్రాయీల్ (అలైహిస్సలాం) ముందే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు సూచించి వున్నారు.
ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) కథనం : ఓసారి జిబ్రయీల్ (అలైహిస్సలాం) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు విచ్చేశారు. ఆ సమయంలో హుస్సేన్ (రదియల్లాహు అన్హు ) నా దగ్గర వున్నారు. అకస్మాత్తుగా ఆయన ఏడ్వడం ప్రారంభించారు. నేనాయన్ని వదిలిపెట్టగా, ఆయన తిన్నగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికెళ్ళి కూర్చున్నారు. జిబ్రయీల్ (అలైహిస్సలాం) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో : ఓ ముహమ్మద్ ! మీరితన్ని ప్రేమిస్తారా? అని అడిగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘అవునని’ జవాబిచ్చారు. జిబ్రయీల్ (అలైహిస్సలాం) మాట్లాడుతూ : నిశ్చయంగా మీ అనుచర సమాజం అతి త్వరలో ఇతణ్ణి హత్య చేస్తుంది. మీరు కోరుకుంటే అతను హత్య చేయబడే స్థలం యొక్క మట్టిని మీకు చూపిస్తాను. తదుపరి ఆయన దానిని చూపించారు. అదే ‘కర్బలా’ అనే స్థలం. (అబ్రజ అహ్మద్ ఫీ ఫజాయెల్ సహాబా హసన్ పరంపరతో, 2వ సంపుటం, 782 పేజీ, నెం. 1391)
కనుక మేము, హుస్సేన్ (రదియల్లాహు అన్హు ) వీరమరణాన్ని అల్లాహ్ యొక్క విధి వ్రాత అని నమ్ముతాము. ఇలాగే హుస్సేన్ (రదియల్లాహు అన్హు ) తండ్రి అయిన అలీ (రదియల్లాహు అన్హు ) కూడా అల్లాహ్ విధి వ్రాత ప్రకారం వీరమరణం పొందారు. ఆయనైతే హిజ్రీ శకం 40వ సంవత్సరంలో రమజాన్ 17వ తేదీ నాడు, శుక్రవారం తెల్లవారుఝామున ఫజర్ నమాజు కోసం వెళు తుండగా వీరమరణం పొందారు!
ఇదే విధంగా, ఆయనకు ముందు, ఉస్మాన్ (రదియల్లాహు అన్షు) ను కూడా కొంతమంది దుర్మార్గులు కలిసి అతి భయంకరంగా తుదముట్టించారు. ఆయన హి.శ. 36వ సంవత్సరంలో జిల్ హిజ్జ మాసపు, ఖుర్బానీ దినాలలో అమరగతులయ్యారు. ఆయన కన్నా ముందు, ఉమర్ (రదియల్లాహు అన్హు ) కూడా ఫజర్ నమాజులో దివ్య ఖుర్ఆన్ పఠిస్తూ వీరమరణం పొందారు. వీరందరూ నిస్సందేహంగా హుస్సేన్ (రదియల్లాహు అన్హు) కన్నా ఉత్తములు మరియు వీరి వీరమరణ వృత్తాంతాలు కూడా అత్యంత భయంకరంగా, విచారకరంగా వున్నాయి. కానీ ఈ సంఘటనలన్నింటిపై మనం “ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్” అని అనడం తప్ప ఇంకేం చేయగలం!
2) మొహర్రం మాసం మరియు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరులు
మొహర్రం మాసంలో ప్రత్యేకించి జరిగే దౌర్జన్యాలలో ఒకటి ఏమిటంటే – దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం) శిష్యులైన సహాబాల గురించి చెడుగా పలకడం మరియు వారిని తిట్టి పోయడం. వాస్తవానికి ప్రవక్త సహచరులను గూర్చి చెడు పలకడం, వారిని దుర్భాషలాడడం అనేవి పూర్తిగా నిషేధించ బడ్డాయి.
ప్రవక్త సహచరులను గూర్చి ‘అహ్లె సున్నత్ వల్ జమాత్’ యొక్క విశ్వాసాన్ని గూర్చి వివరిస్తూ ఇమామ్ తహావి (రహిమహుల్లాహ్) ఇలా సెలవిచ్చారు:
“మేము దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరులను ప్రేమిస్తాము మరియు వారిని ప్రేమించడంలో ఏ ఒక్కరి విషయంలో కూడా అతిశయోక్తిని ప్రదర్శించము. అంతేగాక, ఏ ఒక్కరితో విముక్తిని కూడా ప్రకటించుకోము. సహాబాలను ద్వేషించే ప్రతి వ్యక్తినీ, వారిని చెడుగా చిత్రీకరించే ప్రతి ఒక్కరినీ మేము కూడా ద్వేషిస్తాము. మేమైతే సహాబాలను మంచి తలంపుతో స్మరించు కుంటాము. వారిని ప్రేమిచండం ధర్మం, విశ్వాసం మరియు ఎహసాన్లలో ఓ ముఖ్యభాగం అనీ మరియు వారిని ద్వేషించడం, తిరస్కారానికి (కుఫ్ర్), కాపట్యానికి (నిఫాక్) మరియు అవిధేయతలకు చిహ్నమని భావిస్తాము”. (షరహ్ అఖీదా తహావియ : 467 పేజీ)
దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ సహాబాల మహత్యాన్ని గూర్చి వివరించిన తర్వాత – తిరస్కారులకు (అవిశ్వాసులకు) సహాబాల పట్ల అసహ్యం కలుగుతుంది మరియు ఎల్లప్పుడూ వారి గురించి (మనస్సుల్లో) ద్వేషాగ్ని రగులుకొని వుంటుంది అని సెలవిచ్చాడు.
అంటే సహాబాలను అసహ్యించుకోవటం, వారి పట్ల ద్వేషభావం కలిగి వుండడం తిరస్కారుల ప్రవృత్తి అన్న మాట. ముస్లిములది కాదు.
దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త. ఆయన వెంట వున్నవారు అవిశ్వాసుల పట్ల కఠినులుగానూ, పరస్పరం కరుణామయులుగానూ వుంటారు. దైవకృపను, దైవప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు (దైవ సన్నిధిలో) వినమ్రులై వంగటాన్ని, సాష్టాంగపడటాన్నీ నీవు చూస్తావు. వారి సాష్టాంగ ప్రణామాల ప్రత్యేక ప్రభావం వారి ముఖార విందాలపై తొణికిసలాడుతూ ఉంటుంది. వీరికి సంబంధించిన ఈ ఉపమానమే తౌరాతులో వుంది. ఇంజీలులో (కూడా వీరి ఉపమానం వుంది. అది ఒక పంట పొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తర్వాత అది లావు అయ్యింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది. రైతులను అలరించ సాగింది. వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని. వారిలో విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసివున్నాడు.” (ఫతహ్ : 29)
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కూడా తన సహచరుల గురించి దుర్భాషలాడడం నుండి గట్టిగా వారించారు. ఆయన ఇలా ఉద్బోధించారు:
“నా సహచరులను దుర్భాషలాడకండి. నా ప్రాణం ఎవరి చేతుల్లో వుందో ఆ శక్తివంతుని సాక్షి! మీలో ఎవరైనా ఉహద్ పర్వతమంత బంగారం దానం చేసినా సరే అది వీరి (సహచరులు) ఒక ముద్ లేదా అర ముద్ కు కూడా సమానం కాలేదు”. (ముద్ అంటే ఒక రకమైన కొలత)
(సహీ బుఖారీ: ఫజాయెల్ అసబున్నబీ : 3673, సహీ ముస్లిం : ఫజాయెల్ సహాబా : 254)
అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు ) ఇలా అంటూ వుండేవారు :
“ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరులను గూర్చి చెడుగా అనకండి. ఎందుకంటే – దైవప్రవక్తతో వారు నిలబడ్డ ఒక్క క్షణం అయినా మీ పూర్తి జీవితపు ఆచరణలకన్నా ఉత్తమమైనది
(ఇబ్నెమాజా : ఫజాయెల్ అసహాబున్నబీ : 162, సహీ ఇబ్నెమాజా లిల్ అల్బానీ : 1/132-133)
అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటూ వుండేవారు:
“మీరు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరులను దుర్భాష లాడకండి. ఎందుకంటే దైవప్రవక్త సహచరులలో ఎవరైనా ఒక్క క్షణం ఆయనతో నిలబడితే ఆ ఒక్క క్షణం కూడా మీ 40 సంవత్సరాల ఆచరణల కన్నా ఉత్తమమైనది.”
(ఇబ్నెబత్తా, సహీ అల్బానీ ఫీ తఖీజ్ షరహ్ అఖీదా తహావియా -469 పేజీ)
అల్లాహ్ మనందరినీ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరులను ప్రేమించే మరియు వారిని గౌరవించే సద్బుద్ధిని ప్రసాదించుగాక!
రెండవ ఖుత్బా
ప్రియ శ్రోతలారా!
గత ప్రసంగంలో మేము-మొహర్రం మాసం, నిషేధిత నాలుగు మాసాల్లో ఒకటి అనీ, మరియు ఈ నెలలో ప్రత్యేకించి దౌర్జన్యం చేయడాన్ని (అంటే అల్లాహ్ కు అవిధేయత చూపడాన్ని) అల్లాహ్ నిషేధించాడని వివరించి వున్నాం.
కనుక మనం అల్లాహ్ అవిధేయతకు దూరంగా వుంటూ దానితోపాటు ఈ మాసంలో వీలైంనత ఎక్కువగా సత్కార్యాలు చేస్తూ ఉండాలి. ప్రత్యేకించి ఐచ్ఛిక ఉపవాసాలు ఎక్కువగా వుండాలి. ఎందుకంటే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉద్భోదించారు:
“రమజాన్ తర్వాత అన్నింటి కన్నా శ్రేష్టమైన ఉపవాసాలు, అల్లాహ్ మాసమైన మొహర్రం నెల ఉపవాసాలు మరియు ఫర్జ్ నమాజ్ తర్వాత శ్రేష్టమైన నమాజ్ రాత్రి నమాజ్ (తహజ్జుద్ నమాజ్).” (సహీ ముస్లిం : కితాబుల్ సౌమ్: 1136)
ప్రత్యేకించి, ఆషూరా రోజు, 10వ మొహర్రం నాడు ఉపవాసం తప్పని సరిగా వుండాలి. ఎందుకంటే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మక్కాలో ఉన్నంత వరకు నిరాటంకంగా ఈ రోజు ఉపవాసం ఉండేవారు. తదుపరి, మదీనాకు విచ్చేసిన తర్వాత, అక్కడ కూడా తను ఈ రోజు ఉపవాసం వుండి తన సహచరులకు కూడా దీని గూర్చి ఆదేశించేవారు. తర్వాత రమజాన్ మాసపు ఉపవాసాలు ఫర్జ్ (విధి) అయ్యాక ఆయన ఇలా సెలవిచ్చారు: “మీలో ఇష్టమైన వారు ఈ రోజు ఉపవాసం వుండవచ్చు. ఇష్టంలేని వారు అవసరంలేదు.”
ఈ విషయం గురించి కొన్ని హదీసులు వినండి:
1) ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:
“నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను ఆషూరా దినం మరియు రమజాన్ మాసం తప్ప, మరే దినానికీ ఇంకో దినంపై ప్రాధాన్యత యిచ్చి ఆ రోజు ఉపవాసం పాటించాలని నిర్ణయించకోవడాన్ని చూడలేదు.” (సహీ బుఖారీ: సౌమ్ : 2006, సహీ ముస్లిం : 1132)
అంటే – ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) రమజాన్ మాసం మినహా యిస్తే ఇతర దినాలలో ఆషూరా దినానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారో అంత ప్రాధాన్యత మరే దినానికీ ఇచ్చేవారుకారు.
2) ఆయెషా (రదియల్లాహు అన్హా) కథనం : అజ్ఞాన కాలంలో ఖురైషులు ఆషూరా దినం నాడు ఉపవాసం వుండేవారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కూడా ఆ రోజు ఉపవాసం వుండేవారు. తదుపరి ఆయన మదీనా కు విచ్చేసిన తర్వాత కూడా ఆ రోజు ఉపవాసం పాటించేవారు మరియు తన సహచరులకు కూడా దీని గురించి ఆదేశించేవారు. ఆ తర్వాత రమజాన్ మాసపు ఉపవాసాలు ఫర్జ్ అయ్యాయి. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) (ఆషూరా దినపు ఉపవాసం) నిర్ణయాన్ని ప్రజలపై వదిలేస్తూ ఇలా సెలవిచ్చారు. మీలో ఇష్టమైవారు ఆ రోజు ఉపవాసం వుండవచ్చు ఇష్టంలేని వారు త్యజించ వచ్చు.” (సహీ బుఖారీ : సౌమ్: 2001, 2003 సహీ ముస్లిం : సియ్యామ్: 1125)
3) రబీ బిన్తె ముఆజ్ (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మదీనా చుట్టుప్రక్కల నివసించే బస్తీలలో “ఆషూరా దినం నాడు ఉపవాసం వుండండి” అన్న సందేశాన్ని పంపించారు. ఈ మేరకు, స్వయంగా మేము కూడా ఆ రోజు ఉపవాసం వుండేవాళ్ళం మరియు మా చిన్న పిల్లల చేత కూడా ఉపవాసం పాటింపజేసేవాళ్ళం. ఒకవేళ పిల్లలు భోజనం కోసం అల్లరి చేస్తే మేము వారికి ఇఫ్తార్ సమయం వరకు కాలం వెళ్ళబుచ్చటానికి ఆటబొమ్మలను ఇచ్చి శాంతింపజేసేవాళ్ళం. (సహీ ముస్లిం : 1136)
4) అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మదీనాకు విచ్చేసిన తర్వాత, ‘యూదులు ఆషూరా దినం నాడు ఉపవాసం ఉండడం’ చూసి వారితో మీరెందుకు ఈ దినం నాడు ఉపవాసం పాటిస్తారు? అని అడిగారు. వారు ఆయనతో- ‘ఈ రోజు ఎంతో విశిష్టమైనది. ఈ రోజే అల్లాహ్, మూసా (అలైహిస్సలాం) మరియు ఆయన సహచరులకు (ఫిరౌన్ నుండి) ముక్తిని ప్రసాదించాడు. అందుకే, మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలిపేందుకుగాను ఈ రోజే ఉపవాసం వుండేవారు. అందుకే మేము కూడా ఈ రోజు ఉపవాసం పాటిస్తాము’ అని అన్నారు. ఇది విని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “మూసా (అలైహిస్సలాం)కు (మీకన్నా) మేము దగ్గరి వాళ్ళం.” తదుపరి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్వయంగా తాను కూడా ఈ రోజు ఉపవాసం వుండేవారు మరియు తన సహచరులకు కూడా దీని గురించే ఆదేశించారు. (సహీ బుఖారీ: సౌమ్ : 2004 సహీ ముస్లిం : 113)
ఆషూరా దినం ప్రాముఖ్యత – గతించిన కాలంలో
గతించిన కాలంలో ఆషూరా దినం ప్రాముఖ్యత ఏ విధంగా వుండేది? ఈ విషయంలో చాలా విషయాలు ప్రసిద్ధి గాంచాయి. కానీ, ప్రామాణిక ఉల్లేఖనాల ద్వారా మనకు తెలిసే విషయమేమిటంటే – అల్లాహ్ ఈ రోజే మూసా (అలైహిస్సలాం) మరియు ఆయన అనుచర సమాజమైన బనీ ఇస్రాయీల్ కు ముక్తిని ప్రసాదించాడు మరియు ఫిరౌన్, అతడి జాతిని సముద్రంలో ముంచి వేశాడు. ఈ కారణంగానే యూదులు ఈ రోజు ఉపవాసం వుండేవారు.
ఇంతకు ముందు వివరించిన ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ద్వారా – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముస్లిములకు కూడా ఈ రోజు ఉపవాసం పాటించమని ఆదేశించారని మనం తెలుసుకున్నాం.
అబూ మూసా (రదియల్లాహు అన్హు ) కథనం : యూదులు ఆషూరా దినాన్ని పండుగ దినంగా భావించేవారు మరియు ఖైబర్ వాసులు (యూదులు) ఆ రోజు ప్రత్యేకంగా తమ స్త్రీలకు ఆభరణాలు వగైరా॥ ధరింపజేసి సంతోషంగా గడిపేవారు. అందుకే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “మీరు ఆ రోజు ఉపవాసం ఉండండి.” (సహీ బుఖారీ : 2005, సహీ ముస్లిం : 1131)
ఇక, మూసా(అలైహిస్సలాం) మరియు బనీ ఇస్రాయీల్ ల విముక్తి వృత్తాంతం మరియు ఫిరైన్ మూక సముద్రంలో ముంచి వేయబడడం – ఇదంతా దివ్య ఖుర్ఆన్ సవివరంగా వుంది.
అదే విధంగా, ప్రామాణిక ఉల్లేఖనాల ద్వారా, ముందు వివరించబడిన ఆయేషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం తెలిసిన మరో విషయం ఏమిటంటే – అజ్ఞాన కాలంలో కూడా ప్రజలు ఈ రోజును (ఆషూరా దినం) గౌరవించేవారు.
ఇవి తప్ప మరే విషయం కూడా (ఈ దినపు ప్రాముఖ్యతను గూర్చి) ప్రామాణికంగా ధృవీకరించబడిలేదు.
సందేహ నివారణ
ముస్నద్ అహ్మద్ లోని ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది:
“నూహ్ (అలైహిస్సలాం) పడవ జూదీ పర్వతంపై ఆగిన దినమే ఆషూరా దినం. కనుక నూహ్ (అలైహిస్సలాం) కృతజ్ఞతా పూర్వకంగా ఆరోజు ఉపవాసం పాటించారు.” కానీ, ఈ ఉల్లేఖనంలో ‘అబ్దుల్ సమద్ బిన్ హబీబ్’ అనే ఒక బలహీన ఉల్లేఖకుడు వున్నాడు మరియు రెండవ ఉల్లేఖకుడు షబిల్ బిన్ ఔఫ్ అపరిచిత (మజ్ హూల్) ఉల్లేఖకుడు. (ముస్నద్ అహ్మద్ – 14వ సంపుటం, 335 పేజీ, నెం. 8717)
ఇదే విధంగా, తబ్రానీ యొక్క ఉల్లేఖనంలో ఇలా ఉంది:
“ఆషూరా దినం నాడు అల్లాహ్, ఆదమ్ (అలైహిస్సలాం) పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు. అలాగే యూనుస్ (అలైహిస్సలాం) పట్టణానికి చెందిన ప్రజలపై కూడా అల్లాహ్ ప్రత్యేకంగా దృష్టి సారించాడు మరియు ఈ రోజే ఇబ్రాహీం (అలైహిస్సలాం) జన్మించారు.” కానీ, దీని పరంపర గురించి హాఫిజ్ హైషిమి గారి కథనం ఏమిటంటే దీనిలో ‘అబ్దుల్ గఫూర్’ అనే ఒక ఉల్లేఖకుడు వున్నాడు. అతడు (హదీసువేత్తల దృష్టిలో) త్యజించబడినవాడు. (మత్రూక్). (మజ్మ ఉజ్జవాయిద్ : 3వ సంపుటం, 188 పేజీ)
ఆషూరా దినపు ఉపవాసం శ్రేష్టత
అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో ఆషూరా దినపు ఉపవాసం గురించి ప్రశ్నించగా ఆయన ఇలా సెలవిచ్చారు:
“గడిచిన సంవత్సరపు కాలపు పాపాలను తుడిచివేస్తుంది.” (సహీ ముస్లిం: 1162)
ఈ హదీసును దృష్టిలో వుంచుకొని ప్రతి ముస్లిం, ఆషూరా దినం నాడు ఉపవాసం ఉండాలి మరియు ఇంత భారీగా పుణ్యఫలం పొందగలిగే అవకాశం దొరికినప్పుడు చేజేతులా దానిని జార విడుచుకోకూడదు.
కానీ, ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితో చూడండి! ఈ కాలంలో (ధర్మం గురించి) కొలమానాలే పూర్తిగా మారిపొయ్యాయి. ప్రజలు ఈ రోజును గురించి ఎన్నో క్రొత్త ఆచారాలు (బిద్ అత్ లు) సృష్టించుకున్నారు. సున్నత్ బిద్ అత్ గా మారిపోయింది మరియు బిద్ అత్ సున్నత్ గా భావించడం జరుగుతోంది!
ఈ రోజున ఉపవాసం వుండి, సంవత్సర కాలపు పాపాలను క్షమింప జేసుకోగల సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిపోయి ప్రజలు ఈ దినాన్ని త్రాగడానికి, తినడానికని భావించుకున్నారు. ఈ విధంగా, తినడంపై, త్రాగడంపై దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. తదనుగుణంగా ప్రత్యేక వంటలు తయారు చేయబడతాయి. పాలు, మంచినీళ్ళ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది మరియు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సున్నత్ను అపహాస్యం చేయడం జరుగుతుంది.
మరి ఇవన్నీ హుస్సేన్ (రదియల్లాహు అన్హు ) వీర మరణంపై దు:ఖానికి సూచనా లేక సంబరానికి సూచనా? అన్నది అర్థం కావడంలేదు!
ఆషూరా దినపు ఉపవాసంలో యూదులను వ్యతిరేకించడం
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఏదైనా విషయంలో అల్లాహ్ తరఫు నుండి ఆజ్ఞ ఇవ్వబడకపోతే, అలాంటి పరిస్థితిలో ఆయన గ్రంథ ప్రజల కనుగుణంగా వ్యవహరించడానికి ఇష్టపడేవారు.
సహీ బుఖారీలో ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు ) ద్వారా ఈ విషయం నిరూపించబడి వుంది. (సహీ బుఖారీ : 5917, ఇఖిజా సిరాతుల్ ముస్తఖీమ్ 1వ సంపుటం, 466 పేజీ)
చివరికి, ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) కు, గ్రంథ ప్రజలను వ్యతిరేకించమని మరియు వారికనుగుణంగా వ్యవహరించరాదని ఆదేశం ఇవ్వబడింది.
అందుకే, యూదులు మరియు క్రైస్తవులు కూడా 10వ మొహర్రం నాడు ఉపవాసం ఉంటారని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు తెలియజేయ బడినప్పుడు, ఆయన వారిని వ్యతిరేకించడానికి నిర్ణయించుకున్నారు.
అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు ) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆషూరా దినం నాడు ఉపవాసం వుండి, తన సహచరులకు కూడా దీని గురించి ఆదేశించినపుడు – “ఆ రోజును యూదులు, క్రైస్తవులు గౌరవిస్తారు” అని ఆయనకు చెప్పబడింది. దీనిపై ఆయన ఇలా సెలవిచ్చారు. వచ్చే సంవత్సరం ఇన్షా అల్లాహ్ (అల్లాహ్ తలిస్తే) మనం 9వ మొహర్రం నాడు కూడా ఉపవాసం ఉందాం. కానీ తర్వాతి సంవత్సరం (ఆషూరా దినం) రావడానికి ముందే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. (సహీ ముస్లిం – కితాబ్ సియ్యామ్ : 1134)
ఆషూరా దినపు ఉపవాసంలో యూదులు, క్రైస్తవులను వ్యతిరేకించడం ఎలా? ఈ హదీసు ద్వారా, ఆషూరా దినపు ఉపవాసంలో యూదులు, క్రైస్తవులను వ్యతిరేకించడానికి మొహర్రం 10వ తేదీతోపాటు 9న కూడా ఉపవాసం ఉండాలన్న విషయం తెలిసింది.
ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు ) అభిమతం కూడా ఇదే. దీనికను గుణంగా ఆయన ఇలా ఉల్లేఖించారు:
“యూదులను వ్యతిరేకించండి, మొహర్రం 9,10 తేదీలలో ఉపవాసం పాటించండి”. (ముస్నద్ అబ్దుర్రబ్: 7839 బైహఖి : 4వ సంపుటం, 287 పేజీ – సహీ పరంపరతో)
అంతేగాక, ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు ) ఉల్లేఖించిన మరో ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉద్భోదించారు:
“మీరు ఆషూరా దినం నాడు ఉపవాసం ఉండండి మరియు యూదులను వ్యతిరేకించండి. (అందుకే అదనంగా దానికి ఒకరోజు ముందుగా గానీ లేక ఒక రోజు తర్వాత గానీ ఉపవాసం పాటించండి”. (ముస్నద్ అహ్మద్ : 1వ సంపుటం : 241 పేజీ)
అహ్మద్ షాకిర్ దీనిని ప్రామాణికమైనదని ఖరారు చేశారు. మరికొంత మంది పండితులు దీని పరంపరలోని ఇద్దరు ఉల్లేఖకులు – ముహమ్మద్ బిన్ ఇబ్రాహీం బిన్ అబీ లైలా మరియు దావూద్ బిన్ అలీ కారణంగా దీనిని బలహీనమైనదిగా ఖరారు చేశారు. కారణం ఈ ఇద్దరు ఉల్లేఖకులపై హదీసువేత్తలు రిమార్కులు చేసి ఉన్నారు.)
ఈ హదీసును దృష్టిలో వుంచుకొని కొందరు పండితుల కథనం ఏమిటంటే – ఒకవేళ ఎవరైనా మొహర్రం 9న ఉపవాసం వుండలేకపోతే, మొహర్రం 10న ఉపవాసం పాటించిన తర్వాత యూదులు, క్రైస్తవులను వ్యతిరేకించడానికి మొహర్రం 11న కూడా ఉపవాసం ఉండాలి.
ఈ హదీసుకు సంబంధించిన మరో ఉల్లేఖనంలో పదాలు ఇలా వున్నాయి: “మొహర్రం 10వ తేదీకి ఒక రోజు ముందు కూడా ఉపవాసం వుండండి మరియు ఒక రోజు తర్వాత కూడా.”
(హైషిమి కథనం : అహ్మద్, బజ్జార్ ఆధారంగా, మజ్ఞ్మ ఉజ్జవాయిద్ : 3వ సంపుటం, 188 పేజీ, జయీఫ్ అల్ జామె : 3506)
అందుకే, బహుశా ఈ ఉల్లేఖనాన్ని దృష్టిలో వుంచుకొనే అల్లామా ఇబ్నె ఖయ్యూం (రహిమహుల్లాహ్) మరియు హాఫిజ్ ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) అనేదేమిటంటే-
“ఆషూరా దినపు ఉపవాసం గురించి మూడు దర్జాలు వున్నాయి. అన్నింటికన్నా అల్ప దర్జా (స్థాయి) ఏమిటంటే- కేవలం మొహర్రం 10 నాడు ఉపవాసం ఉండడం, దానికన్నా ఉన్నతమైన దర్జా ఏమిటంటే – దీనితోపాటు మొహర్రం 9న కూడా ఉపవాసం వుండడం మరియు దానికన్నా ఉన్నతమైన దర్జా ఏమిటంటే ఈ రెండు రోజులతోపాటు మొహర్రం 11వ తేదీనాడు కూడా ఉపవాసం వుండడం. ఎందుకంటే ఈ మాసంలో ఎంత ఎక్కువగా ఉపవాసాలుంటే, పుణ్యఫలం కూడా అంతే ఎక్కువగా దొరుకుతుంది వాస్తవం అల్లాహ్ కు తెలుసు“. (జాదుల్ మిఆద్ -2వ సంపుటం -72 పేజీ, ఫతహుల్బారి – 4వ సంపుటం- 289 పేజీ)
ఆఖరుగా అల్లాహ్ ను వేడుకొనేదేమిటంటే – ఆయన మనందరికీ నిషేధిత మాసాలను గౌరవించి, వాటిలో మరియు ఇతర మాసాల్లో కూడా ఆయన అవిధేయతకు దూరంగా వుండే సద్బుద్ధిని ప్రసాదించుగాక! ఆమీన్!
—
ఈ ఖుత్బా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్