వీడ్కోలు హజ్జ్ (హజ్జతుల్ విదా) సందర్భంలో అరాఫాత్ లో దైవప్రవక్త ﷺ ఇచ్చిన ఖుత్బా & వివరణ | జాదుల్ ఖతీబ్

[డౌన్ లోడ్ PDF]

జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అరాఫాత్ చేరుకున్నారు. అక్కడ ఆయన కోసం ‘నిమ్రా‘ లో ఒక గుడారం ఏర్పాటు చేయబడింది. సూర్యుడు (పశ్చిమం వైపుకు) వంగడం ప్రారంభించగానే, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ఒంటె (ఖస్వ) ను సిద్ధం చేయమని ఆజ్ఞాపించారు. ఆయన ఆజ్ఞకనుగుణంగా దానిపై సీటు అమర్చబడింది. తదుపరి, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) దాని పైకెక్కి, లోయ మధ్య భాగంలోకి చేరుకొని ఖుత్బా ఇస్తూ ఇలా సెలవిచ్చారు. 

“నిశ్చయంగా ఈ దినం, ఈ మాసం, ఈ నగరం ఎంత గౌరవప్రదమైనవో అలాగే మీ రక్తం, సంపదలు కూడా అంతే గౌరవ ప్రదమైనవి. జాగ్రత్తగా వినండి! అజ్ఞాన కాలపు ఆచారాలన్నీ నా పాదాల క్రింద సమాధి చేయబడ్డాయి మరియు అజ్ఞాన కాలపు హత్యలు సమాప్తం గావించబడ్డాయి. బనూసాద్ లో ప్రాలు త్రాగుతూ హుజైల్ చేతిలో హత్యకు గురైన ‘ఇబ్నె రబియా బిన్ హారిస్’ హత్యను సమాప్తం చేస్తున్నాను. అజ్ఞాన కాలపు వడ్డీ సమాప్తం అయ్యింది. అందరికన్నా ముందుగా నా కుటుంబంలో వడ్డీని సమాప్తం చేస్తున్నట్లు ప్రకటిస్తున్నాను. అంటే, అబ్బాస్ బిన్ ముత్తలిబ్ (కు రావాల్సిన) వడ్డీ. అది పూర్తిగా సమాప్తం చేయబడింది. మీరు స్త్రీల విషయంలో అల్లాహ్ కు భయపడుతూ వుండండి. ఎందుకంటే, మీరు వారిని ‘అల్లాహ్ అమానతుల’ రూపంలో స్వీకరించారు మరియు అల్లాహ్ యొక్క కలిమా (సద్వచనం) ద్వారా వారి గుప్తాంగాలను హలాల్ చేసుకున్నారు. వారిపై మీకున్న హక్కు ఏమిటంటే మీరు ఇష్టపడని వారిని వారు మీ పడకలపై రానివ్వకూడదు. ఒకవేళ వారు ఇలా చేయకపోతే మీరు వారిని మెల్లగా కొట్టవచ్చు. వారికి మీపై వున్న హక్కు ఏమిటంటే – మీరు వారికి న్యాయమైన రీతిలో భోజన, వస్త్రాలు కల్పించాలి. 

(బాగా గుర్తుంచుకోండి!) నేను మీ మధ్య ఎలాంటి వస్తువును విడిచి వెళుతున్నానంటే, దానిని గనక మీరు గట్టిగా పట్టుకుంటే ఎన్నటికీ మార్గ భ్రష్టులవ్వరు. అది అల్లాహ్ గ్రంథం. 

నా గురించి మిమ్మల్ని అడిగినప్పుడు మీరేం సమాధానం ఇస్తారు? సహాబాలు – ‘నిస్సందేహంగా మీరు ధర్మాన్ని చేరవేసారని మేము సాక్ష్యమిస్తాం. మీరు (దైవ దౌత్య బాధ్యతను నెరవేర్చారు మరియు అనుచర సమాజం శ్రేయస్సు కోసం ఏ ప్రయత్నమూ వదల్లేదు’ అని అన్నారు. తదుపరి, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం), తన సాక్ష్యం ఇచ్చే వ్రేలిని ఆకాశం వైపుకు పైకి లేపి ప్రజలవైపుకు త్రిప్పుతూ, “ఓ అల్లాహ్ ! నువ్వు కూడా సాక్షిగా వుండు, ఓ అల్లాహ్! నువ్వు కూడా సాక్షిగా వుండు, ఓ అల్లాహ్ ! నువ్వు కూడా సాక్షిగా వుండు” అని పలికారు. (ముస్లిం:1218) 

ఈ ఖుత్బాలో, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పది విషయాలు తెలియజేశారు. 

1) ముస్లిముల రక్తం నిషేధం

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నిషేధిత నగరం, నిషేధిత మాసం, నిషేధిత దినం లాగే ముస్లిముల రక్తాన్ని కూడా నిషేధించారు. అకారణంగా దీనిని చిందించడాన్ని హరామ్ చేశారు. అందుకే ముస్లిముల రక్తాన్ని కాపాడడం ఎంతైనా అవసరం. 

ఏ వ్యక్తి అయినా ఒక ముస్లిమును హత్య చేస్తే అతని కోసం గట్టి హెచ్చరిక వుంది. ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

 وَمَن يَقْتُلْ مُؤْمِنًا مُّتَعَمِّدًا فَجَزَاؤُهُ جَهَنَّمُ خَالِدًا فِيهَا وَغَضِبَ اللَّهُ عَلَيْهِ وَلَعَنَهُ وَأَعَدَّ لَهُ عَذَابًا عَظِيمًا

“ఉద్దేశ్యపూర్వకంగా ఒక విశ్వాసిని చంపేవానికి ప్రతిఫలం నరకమే. అందులో వాడు కలకాలం పడి వుంటాడు. వాడిపై అల్లాహ్ ఆగ్రహం, ఆయన శాపం పడుతుంది. ఇంకా ఆయన అతని కోసం పెద్ద శిక్షను సిద్ధం చేసి వుంచాడు.” (నిసా 4:93) 

ఈ ఆయతులో అల్లాహ్, ఒక విశ్వాసిని చంపేవానికి ఐదు హెచ్చరికలు చేసాడు. అందులో మొదటిది – అతని శిక్ష నరకమే. రెండవది అందులో అతను కలకాలం వుంటాడు. మూడవది – అతనిపై అల్లాహ్ ఆగ్రహం విరుచుకు పడుతుంది. నాల్గవది – అతను అల్లాహ్ శాపానికి అర్హుడవుతాడు. ఐదవది – అతని కోసం అల్లాహ్ పెద్ద శిక్షను సిద్ధం చేసి వుంచాడు. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక హదీసులో ముస్లిముల రక్త నిషేధం గురించి ఇలా సెలవిచ్చారు: 

“అల్లాహ్ తప్ప మరో నిజమైన ఆరాధ్యదైవం ఎవ్వరూ లేరని మరియు నేను అల్లాహ్ ప్రవక్తను అని సాక్ష్యమిచ్చే ముస్లిం రక్తం హలాల్ కాదు. కేవలం ఈ మూడు వ్యక్తుల్లో ఒకరిని చంపవచ్చు. వారెవరంటే – పెళ్ళయిన తర్వాత వ్యభిచరించే వ్యక్తి, ధర్మాన్ని (ఇస్లాంను) త్యజించిన వ్యక్తి, జమాత్ (సమూహం) నుండి దూరమయిన వ్యక్తి.”

ఒక విశ్వాసిని చంపటం అనేది పెద్ద పాపం. ఇది ఎంత పెద్ద పాపమో, ఈ హదీసు ద్వారా మనం గ్రహించవచ్చు.

బరా బిన్ అజిబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

అల్లాహ్ దృష్టిలో ఈ ప్రపంచం ముగింపు అనేది ఒక విశ్వాసి అకారణ హత్య కన్నా చాలా తేలిక,”(ఇబ్నెమాజ: 2619, తిర్మిజీ:1395, సహీ – అల్బానీ) 

అబూ సయీద్ ఖుద్రి (రదియల్లాహు అన్హు) మరియు అబూ హురైరా (రదియల్లాహు అన్షు) ల కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు. 

ఒక వేళ ఆకాశవాసులు, భూవాసులూ – (అందరూ కలిసి) ఒక విశ్వాసి హత్యలో కనక పాలుపంచుకొని వుంటే, అల్లాహ్ వారందినీ నరకంలో వేసేవాడు.” (తిర్మిజి : 1398, సహీ – అల్బానీ) 

ఈ కారణం వల్లే, ప్రళయం రోజు అన్నిటి కన్నా ముందుగా హత్యల లెక్క తీసుకోబడుతుంది. దీని గురించి, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

ప్రళయం రోజు, ప్రజల మధ్య అన్నిటి కన్నా ముందుగా హత్యల గురించి తీర్పు చేయబడుతుంది.” (బుఖారీ, ముస్లిం) 

అందుకే, ప్రతి ముస్లింపై విధిగా వున్న విషయమేమిటంటే – ముస్లిముల రక్తం చిందించడం నుండి తన చేతులను కాపాడుకోవాలి మరియు ఎవరినీ అకారణంగా చంపకూడదు. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

ఏ వ్యక్తి అయినా అల్లాహ్ ను – ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ కల్పించని స్థితిలో (షిర్క్ చేయకుండా) మరియు నిషిద్ద రక్తాన్ని చిందించని స్థితిలో – గనక కలిస్తే, అతను స్వర్గంలోకి ప్రవేశిస్తాడు.” (ఇబ్నెమాజ: 2618, సహీ – అల్బానీ) 

అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు)తో ఒక వ్యక్తి గురించి ప్రశ్నించబడింది: 

అతను ఉద్దేశ్యపూర్వకంగా ఒక విశ్వాసిని హత్య చేశాడు. ఆ తర్వాత, పశ్చాత్తాపం చెంది, విశ్వసించి, మంచి పనులు చేస్తూ సన్మార్గం వైపుకు మరలాడు.దీనిపై ఆయన ఇలా జవాబిచ్చారు: అతను నాశనమవుగాక, అతనికి సన్మార్గం ఎలా సాధ్యం? దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిస్తుండగా నేను విన్నాను “ప్రళయం రోజు హంతకుడు, హతుడు – ఇద్దరూ వస్తారు. హతుడు తన హంతకుని తలను పట్టుకొని ఇలా అంటాడు: ఓ నా ప్రభువా! ఇతను నన్ను ఎందుకు హత్య చేశాడో ఇతణ్ణి అడుగు.” 

తదుపరి, ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా సెలవిచ్చారు: 

అల్లాహ్ సాక్షి! అల్లాహ్ తన ప్రవక్త మీద –  “ఉద్దేశ్య పూర్వకంగా ఒక విశ్వాసిని చంపేవానికి ప్రతిఫలం నరకమే” … (నిసా:93) అన్న ఆయతును అవతరింపజేశాడు మరియు దానిని రద్దు చేయలేదు. (ఇబ్నెమాజ: 2621, సహీ – అల్బానీ) 

2) ముస్లిం సంపద నిషేధం

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముస్లిం రక్తం లాగే, ముస్లిం సంపదను కూడా (పవిత్రంగా ఖరారు చేసి) నిషేధించారు. అందుకే, అన్యాయంగా ఒక ముస్లిం సంపదను లాక్కోవడం హరామ్. 

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَأْكُلُوا أَمْوَالَكُم بَيْنَكُم بِالْبَاطِلِ إِلَّا أَن تَكُونَ تِجَارَةً عَن تَرَاضٍ مِّنكُمْ ۚ

ఓ విశ్వసించిన వారలారా! ఒండొకరి సొమ్మును అధర్మంగా తినకండి. అయితే, పరస్పర అంగీకారంతో జరిగే క్రయ విక్రయాల ద్వారా లభించే దానిని ( తినవచ్చు).  (నిసా 4:29) 

ఇంకా ఇలా సెలవిచ్చాడు:

وَلَا تَأْكُلُوا أَمْوَالَكُم بَيْنَكُم بِالْبَاطِلِ وَتُدْلُوا بِهَا إِلَى الْحُكَّامِ لِتَأْكُلُوا فَرِيقًا مِّنْ أَمْوَالِ النَّاسِ بِالْإِثْمِ وَأَنتُمْ تَعْلَمُونَ

ఒకరి సొమ్మును ఇంకొకరు అన్యాయంగా స్వాహా చేయకండి. బుద్ధి పూర్వకంగా, అక్రమమైన రీతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగం కాజేయటం కోసం అధికారులకు ముడుపులు చెల్లించకండి. అది (న్యాయం కాదన్న సంగతి) మీకూ తెలిసినదే”. (బఖర 2: 188) 

ఈ రెండు ఆయతులలో ‘బిల్ బాతిల్’ అంటే అక్రమ పద్ధతిలో (ఇతరుల) సొమ్ము తినడాన్ని వారించబడింది. దీనిలో అక్రమమైన ప్రతి పద్దతి చేరివుంది. 

ఉదా॥ కు దొంగిలించడం, ఒకరి సొమ్మును తినేయడం, క్రయ విక్రయా లలో మోసం చేయడం, లూటీ చేయడం, వడ్డీ తినడం, అమానతులను కాజేయడం, జూద మాడడం, హరామ్ (నిషిద్ధ) వస్తువుల వ్యాపారం చేయడం వగైరా|| 

రెండవ ఆయతులో ప్రత్యేకించి, అధికారులకు ముడుపులు చెల్లించి ఇతరుల సొమ్మును అక్రమంగా కాజేయడాన్ని వారించడం జరిగింది. మరి చూడబోతే, ఈ రోజుల్లో ఇది సర్వ సామాన్య మైపోయింది. పోలిస్ స్టేషన్లలో పోలీసులకు ముడుపులు చెల్లించి చిన్న కేసులు పెట్టి సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేయడమేకాక వారిపై దౌర్జన్యం కూడా చేయడం జరుగు తుంది. సాక్ష్యులకు, లాయర్లకు, జడ్జిలకు ముడుపులు చెల్లించి తీర్పును తమ కనుకూలంగా చేసుకుంటారు. ఇదంతా, కేవలం నిజాయితీ తో వున్న ఒక మనిషి సంపదను అక్రమంగా కాజేయడానికి జరుగుతుంది. 

ఫ ఇలల్లాహి ముష్తకీ వలాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ ! 

సంపద నిషేధాన్ని దృష్టిలో వుంచుకొని అల్లాహ్, ఇతరుల సొమ్మును దొంగిలించే వానికి కఠిన శిక్షను ఖరారు చేశాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

وَالسَّارِقُ وَالسَّارِقَةُ فَاقْطَعُوا أَيْدِيَهُمَا جَزَاءً بِمَا كَسَبَا نَكَالًا مِّنَ اللَّهِ ۗ وَاللَّهُ عَزِيزٌ حَكِيمٌ

దొంగతనం చేసినది – పురుషుడైనా, స్త్రీ అయినా- ఉభయుల చేతులూ నరకండి. అది వారు చేసిన దానికి ప్రతిఫలం. అల్లాహ్ తరఫున విధిం చబడిన శిక్ష. అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేచనాశీలి కూడా.” (మాఇద 5: 38) 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “ఏ వ్యక్తి అయినా అసత్య ప్రమాణం చేసి ముస్లిం సొమ్మును కాజేస్తే, అతను – (ప్రళయం నాడు) అల్లాహ్ (అతని పట్ల) అయిష్టంగా వున్న స్థితిలో కలుస్తాడు”. (బుఖారీ, ముస్లిం) 

జూదం గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنَّمَا الْخَمْرُ وَالْمَيْسِرُ وَالْأَنصَابُ وَالْأَزْلَامُ رِجْسٌ مِّنْ عَمَلِ الشَّيْطَانِ فَاجْتَنِبُوهُ لَعَلَّكُمْ تُفْلِحُونَ

ఓ విశ్వసించిన వారలారా! సారాయి, జూదం, బలిపీఠాలు, జోస్యం కోసం వాడే బాణాలు ఇవన్నీ పరమ జుగుప్సాకరమైన విషయాలు, షైతాన్ చేష్టలు. కాబట్టి వాటికి దూరంగా వుండండి. మీరలా చేస్తే సాఫల్యం పొందవచ్చు.” (మాఇద5 : 90) 

3) అజ్ఞాన కాలపు ఆచారాల సమాప్తి 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: 

జాగ్రత్త ! అజ్ఞాత కాలపు ఆచారాలన్నీ నా పాదాల క్రింద సమాధి చేయబడ్డాయి.” 

ఇలా ఆయన (సల్లల్లాహు అలైహివ సల్లం), దైవ దౌత్యానికి ముందు ప్రజలలో చలామణిలో వున్న ఆచారాలన్నీ సమాప్తమైనట్లు ప్రకటించారు. ఆయన (సల్లల్లాహు అలైహివ సల్లం) ఇతర హదీసులలో, ఆ ఆచారాలలో కొన్నింటిని ప్రస్తావించారు కూడా. 

ఉదా॥ కు ఆయన (సల్లల్లాహు అలైహివ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

నా అనుచర సమాజంలో, ప్రజలు విడిచి పెట్టడానికి సిద్దపడని అజ్ఞాన కాలపు నాలుగు ఆచారాలుంటాయి. అవేమిటంటే – వంశాన్ని ఆధారంగా చేసుకొని ఒకరిపై నొకరు గర్వపడుట, ఇతరుల వంశాన్ని నిందించడం, నక్షత్రాల ద్వారా వర్షాన్ని అర్ధించడం మరియు మరణ సమయంలో ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టడం.” (ముస్లిం: 934) 

4) అజ్ఞాన కాలపు హత్యల సమాప్తి 

హజ్జతుల్ విదా ఖుత్బాలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అజ్ఞాన కాలపు ఆచారాలు సమాప్తమయ్యాయని ప్రకటిస్తూ వాటిలో ప్రత్యేకించి ఆజ్ఞాన కాలపు హత్యలు సమాప్తం గావించబడ్డాయని సెలవిచ్చారు. అంటే, అజ్ఞానకాలంలో ఎవరైనా మరొకరిని హత్య చేసివుంటే, అతనితో ఖిసాస్ (ప్రతీకారం) తీసుకోబడదు. 

అజ్ఞాన కాలంలో తరాలకొద్దీ హత్యా ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రజల మధ్య యుద్దాలు జరిగేవి. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలాంటి అజ్ఞాన కాలపు హత్యలన్నింటినీ సమాప్తం చేశారు. అందరి కన్నా ముందుగా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) తన జాతి లోని రబియా బిన్ హారిస్ కుమారుని హత్యను క్షమించివేసారు. మరి చూడబోతే, అజ్ఞాన కాలపు ప్రజల స్థితిని గూర్చి వివరిస్తూ అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

  وَاذْكُرُوا نِعْمَتَ اللَّهِ عَلَيْكُمْ إِذْ كُنتُمْ أَعْدَاءً فَأَلَّفَ بَيْنَ قُلُوبِكُمْ فَأَصْبَحْتُم بِنِعْمَتِهِ إِخْوَانًا وَكُنتُمْ عَلَىٰ شَفَا حُفْرَةٍ مِّنَ النَّارِ فَأَنقَذَكُم مِّنْهَا

అల్లాహ్ మీపై కురిపించిన దయానుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి అప్పుడు మీరు ఒండొకరికి శత్రువులుగా ఉండేవారు. ఆయన మీ హృదయాలలో పరస్పరం ప్రేమానురాగాలను సృజించాడు. దాంతో ఆయన అనుగ్రహం వల్ల మీరు ఒకరికొకరు అన్నదమ్ములుగా మారారు. మీరు అగ్ని గుండం ఆఖరి అంచులకు చేరుకోగా, ఆయన మిమ్మల్ని దాన్నుంచి కాపాడాడు.” (ఆలి ఇమ్రాన్ 3:103) 

5) వడ్డీ సమాప్తి 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్జతుల్ విదా ఖుత్బాలో అజ్ఞాన కాలపు వడ్డీని కూడా సమాప్తం చేశారు. అజ్ఞాన కాలంలో, అప్పు ఇచ్చేటప్పుడు ధనవంతుడు వడ్డీ ప్రాతిపదికన అప్పు ఇచ్చిన వాడి గడువును పెంచేవాడు, దానితో పాటు వడ్డీ రేటును కూడా పెంచేవాడు. ఇలా చేస్తూ, చివరికి వడ్డీయే, అసలు పైకం కన్నా ఎక్కువై పోయేది. ఇదెంతో నీచమైన దౌర్జన్యం. ఇస్లాం లో ఇది పూర్తిగా నిషేధం (హరామ్). 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَأْكُلُوا الرِّبَا أَضْعَافًا مُّضَاعَفَةً ۖ وَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ

“ఓ విశ్వసించిన వారలారా! ద్విగుణీకృతం, బహు గుణీకృతం చేసి వడ్డీని తినకండి. మీరు సాఫల్యం పొందటానికి గాను అల్లాహ్ కు భయపడండి.” (ఆలి ఇమ్రాన్ 3:130) 

ఇంకా ఇలా సెలవిచ్చాడు: 

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَذَرُوا مَا بَقِيَ مِنَ الرِّبَا إِن كُنتُم مُّؤْمِنِينَ فَإِن لَّمْ تَفْعَلُوا فَأْذَنُوا بِحَرْبٍ مِّنَ اللَّهِ وَرَسُولِهِ ۖ وَإِن تُبْتُمْ فَلَكُمْ رُءُوسُ أَمْوَالِكُمْ لَا تَظْلِمُونَ وَلَا تُظْلَمُونَ

ఓ విశ్వసించిన వారలారా! అల్లాహ్ కు భయపడండి. మీరు నికార్సయిన విశ్వాసులే అయివున్నట్లయితే మిగిలివున్న వడ్డీని విడిచిపెట్టండి. ఒకవేళ మీరు గనక అలా చేయనట్లయితే, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధం కండి. ఒకవేళ మీరు పశ్చాత్తాపం చెందితే మీ అసలు సొమ్ము మీకే వుంటుంది. మీరూ ఒకరికి అన్యాయం చేయకూడదు. మీకు కూడా అన్యాయం జరుగకూడదు.” (బఖర 2: 278 – 279) 

అందుకే, వడ్డీ లావాదేవీలను మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందుతూ, వెంటనే వదిలి పెట్టండి. వడ్డీ ప్రాతిపదికపై ఎవరి వద్ద నుండి గానీ, బ్యాంకు నుండి గానీ అప్పు తీసుకోకండి, మన అవసరాలు తీరడం కోసం కానివ్వండి లేదా వ్యాపార నిమిత్తం కానివ్వండి. అలాగే వడ్డీ ప్రాతిపదికపై ఇతరులకు కూడా అప్పు ఇవ్వకండి. బ్యాంకులలో ‘ఫిక్స్డ్ డిపాజిట్లలో డబ్బును జమ చేయకండి. ఎందుకంటే వడ్డీ స్వరూపాల్లో ఇది కూడా ఒకటి. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ఈ ప్రవచనాన్ని బట్టి, వడ్డీ ఎంతో ఘోరమైన పాపమో మనం గ్రహించవచ్చు. 

వడ్డీ లో 70 పాపాలు (ఇమిడి వున్నాయి. వాటిలో అన్నిటికన్నా తేలికైన పాపం – మనిషి తన తల్లిని వివాహమాడటంతో సమానం.” (ఇబ్నెమాజ: 2274, సహీ – అల్బానీ) 

మరో ఉల్లేఖనంలో ఇలా వుంది: 

వడ్డీకి 72 ద్వారాలు వున్నాయి. వాటిలో అన్నిటికన్నా తేలికైక పాపం మనిషి తన తల్లితో వ్యభిచరించిన దానితో సమానం.” (తబ్రానీ, సహీఉల్ జామె లిల్ అల్బానీ: 3537) 

అబ్దుల్లా బిన్ హంజల అర్రాహిబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:

వడ్డీ నిషేధం గురించి తెలిసి కూడా ఒక దిర్హమ్ వడ్డీ తినడం అల్లాహ్ దృష్టిలో – 36 సార్లు వ్యభిచరించడం కన్నా ఎక్కువ చెడ్డది”. (అస్సహీహ: 1033) 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన కల గురించి వివరిస్తూ ఇలా సెలవిచ్చారు: 

…జిబ్రయీల్ (అలైహిస్సలాం) ఇలా అన్నారు- ముందుకు పదండి. ఇలా మేము కాస్త ముందుకు వెళ్ళి ఒక రక్తపు కాలువ వద్దకు చేరుకున్నాం. ఒక వ్యక్తి దానిలోపల వుండగా, మరో వ్యక్తి దాని ఒడ్డున వున్నాడు. ఒడ్డుపై వున్న వ్యక్తి ముందు ఒక రాయి వుంది. లోపలున్న వ్యక్తి బయటికి రావాలని ప్రయత్నించినప్పుడు, ఒడ్డుపై వున్న వ్యక్తి రాయి తీసుకొని అతని ముఖంపై కొట్టి, అతన్ని అతని స్థానంలోకి పంపించేవాడు. ఇలా ప్రతిసారీ జరుగుతూ వుంది. 
నేను (దైవ ప్రవక్త): ఏమిటది? అని అడిగాను. 
ఆయన (జిబ్రయీల్): ముందుకు పదండి అని అన్నారు. 
మేము ముందుకు నడిచాము.. తదుపరి జిబ్రయీల్(అలైహిస్సలాం) మాట్లాడుతూ…… మీరు రక్తపు కాలువలో చూసిన వ్యక్తి వడ్డీ తినే వ్యక్తి… అని వివరించారు. (బుఖారీ) 

జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం: 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) – వడ్డీ తినేవారిని, వడ్డీ తినిపించే వారిని, దానిని వ్రాసేవారిని, దాని సాక్ష్యులను శపించారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “వీరంతా పాపంలో సమానులే.” (ముస్లిం:1598) 

ఇస్లామీయ సోదరులారా! 
వడ్డీ వలన సంపదలో వృద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తారు. కానీ, అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

وَمَا آتَيْتُم مِّن رِّبًا لِّيَرْبُوَ فِي أَمْوَالِ النَّاسِ فَلَا يَرْبُو عِندَ اللَّهِ ۖ وَمَا آتَيْتُم مِّن زَكَاةٍ تُرِيدُونَ وَجْهَ اللَّهِ فَأُولَٰئِكَ هُمُ الْمُضْعِفُونَ

ప్రజల సొమ్ములో చేరి వృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో మీరు ఇచ్చే వడ్డీ అల్లాహ్ దృషిలో ఎంత మాత్రం వృద్ధి చెందదు. అయితే అల్లాహ్ ముఖాన్ని చూసేందుకు (ప్రసన్నతను చూర గొనేందుకు) మీరు జకాతు దానం ఇచ్చినట్లయితే అలాంటి వారే (తమ సంపదలను) ఎన్నో రెట్లు వృద్ధి పరచుకున్న వారవుతారు.” (రూమ్ 30: 39) 

ఇంకా ఇలా సెలవిచ్చాడు: 

يَمْحَقُ اللَّهُ الرِّبَا وَيُرْبِي الصَّدَقَاتِ
అల్లాహ్ వడ్డీని హరింపజేస్తాడు, దాన ధర్మాలను పెంచుతాడు.” (బఖర 2: 276) 

ఈ రెండు ఆయతుల ద్వారా తెలిసిందేమిటంటే-వడ్డీ వలన సంపదలో వృద్ధి జరగదు, తగ్గుదల వస్తుంది. దాన ధర్మాల మూలంగా సంపదలో వృద్ధి కలుగుతుంది! 

ఇక ఎవరైతే వడ్డీ లావాదేవీలు చేస్తూ తమ డబ్బును అధికం చేసే ప్రయత్నం లో వుంటారో, వారు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) యొక్క ఈ ప్రవచనాన్ని దృష్టిలో వుంచుకోవాలి. 

ఎవరైనా వడ్డీని ఎంతగా తీసుకున్నప్పటికీ, దాని అంతిమ ఫలితం మాత్రం తగ్గుదల మరియు నష్టమే.” (ఇబ్నెమాజ: 2279, సహీ – అల్బానీ) 

6) ఆచరణలో ఆదర్శం 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) – అజ్ఞాన కాలపు హత్యల ప్రతీ కారాన్ని క్షమించినప్పుడు అందరి కన్నా ముందుగా తన కుటుంబంలోని హత్ లను క్షమించి ఆదర్శంగా నిలిచారు. అలాగే, అజ్ఞాన కాలపు వడ్డీని చెడుగా ఖరారు చేసినప్పుడు, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) అందరి కన్నా ముందుగా తన కుటుంబం లోని అబ్బాస్ బిన్ ముత్తలిబ్ (రదియల్లాహు అను) వడ్డీని సమాప్తం చేశారు. 

దీని ద్వారా నిరూపించడబడిందేమిటంటే – సందేశ ప్రచారకులందరూ తమ సందేశాలపై ముందుగా తాము స్వయంగా ఆచరించి ప్రజల ముందు ఆదర్శాన్ని నెలకొల్పాలి. ఇది, అతని సందేశ ప్రచారంలో ఎంతగానో ప్రభావం చూపుతుంది. తద్వారా ఇతరులు కూడా త్వరగా అతని సందేశాన్ని స్వీకరించ గలుగుతారు, 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

أَتَأْمُرُونَ النَّاسَ بِالْبِرِّ وَتَنسَوْنَ أَنفُسَكُمْ وَأَنتُمْ تَتْلُونَ الْكِتَابَ ۚ أَفَلَا تَعْقِلُونَ

ప్రజలకైతే మీరు మంచిని గురించి ఆదేశిస్తారు, కాని మీ స్వయాన్ని మరచిపోతారే?! చూడబోతే మీరు గ్రంథ పారాయణం చేస్తారాయె. మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా?” (బఖర 2: 44) 

ఇంకా ఇలా సెలవిచ్చాడు: 

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لِمَ تَقُولُونَ مَا لَا تَفْعَلُونَ كَبُرَ مَقْتًا عِندَ اللَّهِ أَن تَقُولُوا مَا لَا تَفْعَلُونَ

ఓ విశ్వాసులారా! మీరు చేయ(లే)ని దాన్ని గురించి ఎందుకు చెబుతారు? మీరు చేయని దాన్ని గురించి చెప్పటం అల్లాహ్ సమక్షంలో ఎంతో సహించరానిది.” (సఫ్ 61: 2-3) 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “నేను మేరాజ్ రాత్రి – కొందరి నాలుకలను, పెదవులను అగ్ని కత్తెరలతో కోయబడడం చూసి, ఓ జిబ్రయీల్ ! ఎవరు వీళ్ళు? అని అడిగాను. ఆయన: మీ అనుచర సమాజంలోని ఉపన్యాసకులు, వీళ్ళు ప్రజలకైతే మంచిని గూర్చి బోధించేవారు, కానీ స్వయాన్ని మరిచిపోయేవారు. వాస్తవానికి వాళ్ళు అల్లాహ్ గ్రంథాన్ని పారాయణం కూడా చేస్తారు. మరి వీరికి బుద్ధి లేదా? అని అన్నారు. (అహ్మద్: 3వ సంపుటం, 120, 180 పేజీలు – హసన్) 

7) స్త్రీల విషయంలో అల్లాహ్ కు భయపడుతూ వుండమని ఆదేశం 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన చారిత్రక ‘హజ్జతుల్ విదా’ ఖుత్బా యందు స్త్రీల హక్కుల గురించి ప్రత్యేకంగా తాకీదు చేసి, వారి విషయంలో అల్లాహ్ కు భయపడుతూ వుండమని ఆదేశించారు. 

దీని ద్వారా రూఢీ అయిన విషయమేమిటంటే – ఈ రోజుల్లో చెడుగా ప్రస్తావించబడే విధంగా, ఇస్లాం- స్త్రీల ప్రాథమిక హక్కులను కాలరాయదు. వాస్తవం ఏమిటంటే – స్త్రీల సంరక్షణకు గాను నియమాలు నెలకొల్పి ఇస్లాం ఎలాగైతే, వారి హక్కులు వారికిచ్చిందో, అలా ఏ ధర్మం కూడా వారికి ఇవ్వలేదు. 

ఒకవేళ అజ్ఞాన కాలపు స్త్రీ మరియు ఇస్లామీయ స్త్రీ ని గనక పోల్చి చూస్తే, ఈ వాస్తవం ఇంకా తేట తెల్లమవుతుంది. మనం ఎంతో దూరం కూడా వెళ్ళాల్సిన పని లేదు. నేడు స్త్రీల హక్కుల గురించి మాట్లాడుతూ, ఇస్లాం గురించి చెడుగా ప్రచారం చేసే దేశాలలోని స్త్రీల పరిస్థితులు కాస్త చూడండి! స్త్రీలకు వాళ్ళెంత గౌరవ మర్యాదలిస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది! (వారి దృష్టిలో) స్త్రీ విలువ దారిలో పడివున్న వస్తువు కన్నా ఎక్కువేం కాదు. ఏ వ్యక్తి అయినా, తను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఆమెను తన మాయాజాలంలో ఇరికిస్తాడు. మరి, ముస్లిం సమాజంలో నివసిస్తూ, పరదా పాటించే స్త్రీ జీవితాన్ని గనక ముందుంచితే, ఇద్దరి మధ్య తేడాను స్పష్టంగా గ్రహించగలం. ఆ జీవితం అవమానాలతో నిండుకొనివుంటే, ముస్లిం సమాజ స్త్రీ జీవితం మాత్రం గౌరవ మర్యాదలతో నిండుకొని వుంది! 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎన్నో హదీసులలో స్త్రీల హక్కులను గురించి తాకీదు చేశారు. 

అబూ హురైరా (రదియల్లాహు అను) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

మీరు స్త్రీలతో మంచిగా మెలగమని నేనిచ్చే వసీయతును స్వీకరించండి. ఎందుకంటే, స్త్రీ ప్రక్కటెముకతో సృష్టించబడింది. ప్రక్కటెముకలో పై భాగం ఎక్కువ వంకరగా వుంటుంది. ఒకవేళ మీరు దానిని తిన్నగా చేయాలనుకుంటే, అది విరిగిపోతుంది. ఒకవేళ అలాగే వదిలేస్తే, దాని వంకరతనం కూడా అలాగే వుంటుంది. అందుకే మీరు స్త్రీలతో మంచిగా మెలగండి.” (బుఖారీ: 5185, 5186, ముస్లిం: 1468) 

8) భార్యభర్తల కొన్ని హక్కులు

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్త్రీల ప్రాథమిక హక్కులను గూర్చి తాకీదు చేశాక, భార్యభర్తల కొన్ని హక్కులను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఇలా సెలవిచ్చారు: 

మీకు వారిపై ఉన్న హక్కు ఏమిటంటే – మీరు ఇష్టపడని వ్యక్తులను వారు మీ పడకలపై రానీయకూడదు. ఒకవేళ వారలా చేయకపోతే, వారిని మెల్లగా మీరు కొట్టవచ్చు. ఇక, వారికి మీపై ఉన్న హక్కు ఏమిటంటే – మీరు న్యాయోచితంగా వారికి భోజన వస్త్రాలు సమకూర్చాలి.”

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివరించిన హక్కులలో, భర్తకు భార్యపై కల ఒక హక్కు ఏమిటంటే భర్త అనుమతి లేకుండా ఏ వ్యక్తినీ ఇంట్లో ప్రవేశింప నీయకూడదు. అలాగే, భర్త ఇష్టపడని వ్యక్తిని అతని పడకపై రానీయకూడదు. 

మరో హదీసులో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

ఆమె (భార్య) తన భర్త అనుమతి లేకుండా, అతని ఇంట్లో ఎవరినీ అనుమతించ కూడదు.” 

తదుపరి, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమె (భార్య) గనక ఇలా చేయకపోతే, భర్త ఆమెకు దెబ్బ తగలకుండా, ఎముకలు విరక్కుండా మెల్లగా కొట్టవచ్చని సెలవిచ్చారు. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

మీలో ఏ వ్యక్తి అయినా బానిసను కొట్టినట్లు, తన భార్యను కొట్టవద్దు. తదుపరి సాయంకాలానాకి ఆమెతో సంభోగం కూడా చేస్తారు మరి.” (బుఖారీ: 5204, ముస్లిం: 2855) 

ఆ తర్వాత, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) భర్తపై భార్యకు గల హక్కులను వివరిస్తూ న్యాయోచితంగా తన స్థోమతను బట్టి భర్త ఆమెకు భోజన వస్త్రాలను సమకూర్చాలని ఆదేశించారు. 

ముఆవియ అల్ ఖషీరీ (రదియల్లాహు అన్హు) కథనం: 

నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను – భార్యకు భర్తపై గల హక్కు ఏమిటి? అని అడిగాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ– ఆమె హక్కు ఏమిటంటే – “నువ్వు తినేది ఆమెకు కూడా తినిపించు, నువ్వు తొడిగేది ఆమెకు కూడా తొడిగించు. ముఖంపై కొట్టకు మరియు దుర్భాషలాడకు. ఒకవేళ, (ఎప్పుడైనా) ఆమెను వదలాల్సి వస్తే, ఇంట్లోనే వదులు.” 

(అహ్మద్:4వ సంపుటం, 447 పేజీ, అబూ దావూద్: 2142, ఇబ్నెమాజ:185, సహీ అత్తరీబ్ వ తరహీబ్ లిల్ అల్బానీ: 1929) 

9) అల్లాహ్ గ్రంథాన్ని గట్టిగా పట్టుకోమని ఆదేశం 

అరాఫాత్ లోని హజ్జతుల్ విదా ఖుత్బా యందలి మరొక ప్రముఖ విషయం ఏమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన అనుచర సమాజానికి – అల్లాహ్ గ్రంథాన్ని గట్టిగా పట్టుకోమని, తద్వారా మార్గభ్రష్టులు కాలేరని, ఉపదేశించారు. 

అందుకే మనమంతా తప్పనిసరిగా ఖుర్ఆన్ నేర్చుకోవాలి. దానిపై ఆలోచన చేస్తూ దాని ప్రకారం ఆచరించాలి. 

కానీ, దురదృష్ట వశాత్తూ, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంత గట్టిగా తాకీదు చేసినప్పటికీ, ఆయన అనుచర సమాజం (ఉమ్మత్) ఖుర్ఆన్ నుండి దూరమయ్యింది. ఖుర్ఆన్ నేడు అల్మారా (బీరువా)ల అలంకరణగా అయి వుండి పోయింది. ఎంతో మందికి అసలు ఖుర్ఆన్ చదవడమే రాదు. ఇక ఎవరైతే చదువుతారో, వారు మొత్తం ఖుర్ఆన్ అటుంచి, ఫాతిహా సూరా అర్ధం కూడా వివరించ లేరు. 

(నేడు) ఖుర్ఆన్ కంఠస్తులైతే మాషా అల్లాహ్ చాలా మంది వున్నారు. కాని, దానిపై ఆచరిస్తూ దానిని తమ జీవన శైలిగా మార్చుకున్న వారు చాలా తక్కువగా వున్నారు. 

ప్రియ సోదరులారా! 

దివ్య ఖుర్ఆన్, అల్లాహ్ గ్రంథాలలో అన్నింటికన్నా శ్రేష్టమైనది. వక్తృత్వం మరియు సాహిత్య పరంగా ఈ గ్రంథం ఏ మాత్రం పోలిక లేనిది. అందుకే ఈ గ్రంథం – వాక్చాతుర్యులను, సాహితీవేత్తలను, అందరూ కలిసి – కనీసం దీనిలాంటి ఒక్క సూరా నైనా (రచించి) తీసుకు రమ్మని ఛాలెంజ్ చేస్తుంది. అంతేగాక, జిన్నాతులు, మానవులు – అందరూ ఏకమైనా ఇలాంటి ఖుర్ఆన్ ను తీసుకు రాలేరని బాహాటంగా ప్రకటిస్తుంది. 

దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

قُل لَّئِنِ اجْتَمَعَتِ الْإِنسُ وَالْجِنُّ عَلَىٰ أَن يَأْتُوا بِمِثْلِ هَٰذَا الْقُرْآنِ لَا يَأْتُونَ بِمِثْلِهِ وَلَوْ كَانَ بَعْضُهُمْ لِبَعْضٍ ظَهِيرًا

వారికి చెప్పు: ఒకవేళ సమస్త మానవులు, యావత్తు జిన్నాతులు అందరూ కలిసి ఈ ఖుర్ఆన్ లాంటి గ్రంథాన్ని తేదలచినా- వారు ఒకరి కొకరు తోడ్పాటును అందజేసుకున్నా ఇటువంటి దానిని తీసుకు రావటం వారివల్ల కాని పని.” (బనీ ఇస్రాయీల్ 17 : 88) 

ఇక, ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే – ఇంతటి మహోన్నతమైన గ్రంథాన్ని అల్లాహ్ ఎందుకు అవతరింపజేశాడు? ఈ ప్రశ్నకు సమాధానం స్వయంగా అల్లాహ్ యే తన గ్రంథంలో ఇలా తెలియజేశాడు: 

كِتَابٌ أَنزَلْنَاهُ إِلَيْكَ مُبَارَكٌ لِّيَدَّبَّرُوا آيَاتِهِ وَلِيَتَذَكَّرَ أُولُو الْأَلْبَابِ

ఇదొక శుభ ప్రదమైన గ్రంథం. ప్రజలు దీని వాక్యాలపై చింతన చేసేటందుకు, బుద్ధిజీవులు దీని ద్వారా గుణపాఠం నేర్చుకునేందుకు మేము దీనిని నీ వైపుకు పంపాము.” (సాద్ 38: 29) 

అందుకే, మనపై విధిగా వున్న విషయమేమిటంటే – స్వయంగా మనం కూడా దీనిని నేర్చుకోవాలి మరియు మన పిల్లలకు కూడా దీనిని నేర్పించాలి. స్వయంగా దీనిపై ఆలోచన చేయడంతో పాటు మన పిల్లలను కూడా ఖుర్ఆన్ కంఠస్థం చేయించడంతోపాటు, దాని అర్థం, విశ్లేషణలను కూడా నేర్పించాలి. తద్వారా వారు కూడా గుణపాఠం నేర్చుకుంటారు. ఎందుకంటే, ఖుర్ఆన్ అర్థాన్ని, విశ్లేషణనను తెలుసుకోకుండా దాని ద్వారా గుణపాఠం నేర్చుకోవడం అసంభవం. 

ఖుర్ఆన్ ఇహపర లోకాల మేళ్ళ వైపునకు మనిషికి మార్గదర్శకత్వం వహిస్తుంది. అతనికి స్వర్గానికి తీసుకెళ్ళే బలమైన మార్గాన్ని చూపుతుంది. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. “నిశ్చయంగా ఈ ఖుర్ఆన్ అన్నిటికంటే సవ్యమైన మార్గాన్ని చూపిస్తుంది. మంచి పనులు చేసే విశ్వాసులకు గొప్ప పుణ్యఫలముందన్న శుభవార్తను అది వినిపిస్తుంది.” 

గుర్తుంచుకోవాల్సిన మరో విషయమేమిటంటే – అల్లాహ్ గ్రంథం (ఖుర్ఆన్) లో ఇతర ఆదేశాలతో పాటు వున్న మరొక ఆదేశమేమిటంటే అల్లాహు విధేయత చూపడంతోపాటు ఆయన ప్రియ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు కూడా విధేయత చూపాలి. ఆయన ఆజ్ఞాపించిన దానిని ఆచరించాలి మరియు ఆయన వారించిన దాని నుండి దూరంగా వుండాలి.  

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ وَلَا تُبْطِلُوا أَعْمَالَكُمْ

ఓ విశ్వాసులారా! అల్లాహ్ కు విధేయత చూపండి, ప్రవక్త చెప్పినట్లు వినండి. మీ కర్మలను పాడు చేసుకోకండి.” (ముహమ్మద్ 47: 33) 

ఈ ఆయతు మరియు ఇతర ఎన్నో ఆయతుల ద్వారా తెలిసేదేమిటంటే- అల్లాహ్ గ్రంథాన్ని (ఖుర్ఆన్ను) గట్టిగా పట్టుకొని, దానిని మన జీవన శైలిగా మార్చుకోవడం ఎలాగైతే మనపై విధిగా వుందో, అలాగే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సున్నతుల ప్రకారం ఆచరించడం కూడా మనపై విధి (ఫర్జ్)గా వుంది. 

అందుకే, అల్లాహ్- దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జీవితాన్ని ఆదర్శవంతమైనదిగా ఖరారు చేశాడు. అందుకే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్జతుల్ విదా సందర్భంలో ఇలా సెలవిచ్చారు. 

“ప్రజలారా! నా మాటలను బాగా అర్థం చేసుకోండి. నిస్సందేహంగా నేను అల్లాహ్ ధర్మాన్ని మీకు చేరవేశాను. నేను మీ మధ్య ఎలాంటి వస్తువును విడిచి వెళుతున్నానంటే, దానిని గనక మీరు గట్టిగా పట్టుకుంటే ఎప్పుడూ మార్గభ్రష్టులు కాలేరు. అదేమింటే – అల్లాహ్ గ్రంథం మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సున్నత్.” (అస్సున్నహ్ లిల్ మర్వజి : 68) 

దీనిద్వారా తెలిసిందేమిటంటే – అల్లాహ్ గ్రంథం మరియు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సున్నత్ – ఈ రెండూ సన్మార్గ చెలమలు. ఈ రెండింటినీ గట్టిగా పట్టుకోవడం ద్వారానే మార్గభ్రష్టత నుండి తప్పించుకోగలం. 

10) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన అనుచర సమాజానికి ధర్మాన్ని సంపూర్ణంగా చేరవేయడం 

అరాఫాత్లో హజ్జతుల్ విదా ఖుత్బా యందు ఉపన్యసిస్తూ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆఖరిలో ప్రజలతో ఇలా అడిగారు: ప్రజలారా! నా గురించి మీకు అడగబడినప్పుడు ఏమని సమాధానం ఇస్తారు? దీనిపై, ప్రజలంతా ముక్త కంఠంతో- మీరు మాకు అల్లాహ్ ధర్నాన్ని చేరవేశారు. 

అల్లాహ్ అమానతును నెరవేర్చారు మరియు మా శ్రేయస్సు కోసం ఏ ప్రయత్నమూ వదల్లేదు అని పలికారు. తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్ ను కూడా మూడు సార్లు సాక్షిగా నిలిపారు. 

దీని ద్వారా రూఢీ అయిన విషయమేమిటంటే – ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్ ధర్మాన్ని సంపూర్ణంగా, అమానతు లాగా తన అనుచర సమాజానికి చేరవేశారు. 

తన అనుచర సమాజపు శ్రేయస్సు ఇమిడి వున్న ప్రతి అంశం వైపునకు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మార్గం చూపారు. 

అల్లాహ్ కు దగ్గరగా చేర్చే, నరకం నుండి దూరం చేసే ప్రతి విషయం గురించి నేను మీకు అజ్ఞాపించి వున్నాను. అలాగే, నరకం దగ్గరకు చేర్చే, అల్లాహ్ నుండి దూరం చేసే ప్రతి విషయం గురించి నేను మీకు వారించి వున్నాను.” (హజ్జతున్నబీ లిల్ అల్బానీ : 103 పేజి) 

ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన అనుచర సమాజానికి, సత్కార్యాలకు సంబంధించిన ఏ విషయమూ ఆజ్ఞాపించకుండా వుండలేదు. అలాగే, దుష్కార్యాలకు సంబంధించిన ఏ విషయమూ ఆయన వారించకుండా వుండలేదు. ఈ వాస్తవాన్ని తెలుసు కున్నాక, “ధర్మంలో ఏ విధమైన హెచ్చుతగ్గులకు ఏ మాత్రం ఆస్కారం లేదు” అన్న నిర్ణయానికి మనం తేలికగా రావచ్చు. 

కొత్త విషయాలు సృష్టించి ధర్మంలో కలపడం ద్వారా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) (అల్లాహ్ శరణు) ధర్మాన్ని, ప్రజలకు చేరవేయలేదు, మంచికి సంబంధించిన కొన్ని కార్యాలు ఆయన ద్వారా మరియు మొదట ఆయనను విశ్వసించిన వారి ద్వారా, వదిలివేయబడ్డాయి – అన్న అర్థం వస్తుంది మరి ! 

ఇమామ్ మాలిక్ రహిమహుల్లాహ్ ఇలా వివరించారు: 

ఎవరైనా ఇస్లామ్లో ఏదైనా బిద్అత్ ను సృష్టించి, తదుపరి దానిని ఒక మంచి కార్యంగా తలపోస్తే, అతను – ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) దైవదౌత్య బాధ్యత (ధర్మాన్ని చేరవేయడం)ను సరిగా నిర్వర్తించలేదు (అంటే ధర్మాన్ని సంపూర్ణంగా చేరవేయలేదు) అని భావించినట్లే!” 

అల్లాహ్ యొక్క ఈ ఆదేశం చదువుకోండి: 

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا

“ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను…” (మాఇద 5 : 3) 

తదుపరి ఇమామ్ మాలిక్ రహిమహుల్లాహ్ ఇలా సెలవిచ్చారు: 

“ఈ అనుచర సమాజపు మొదటి తరాల వారు ఏ విషయంతోనయితే సరిగా అయ్యారో (సన్మార్గం పొందారో) ఆ విషయంతోనే ఈ అనుచర సమాజపు ఆఖరి తరాల వారు కూడా సరిగా అవగలుగుతారు (సన్మార్గం పొంద గలుగుతారు). ఆ సమయంలో ధర్మంలో భాగం కాని ఆచరణ ఏదైనా, ఈ రోజు కూడా ధర్మం కాలేదు. (అంటే ధర్మంలో అంతర్భాగం కాలేదు.)”

ఈ వాస్తవాన్ని, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘హజ్జతుల్ విదా’ సందర్భంలో అరాఫాత్ మైదానంలో ఇలా స్పష్టంగా వివరించారు: 

అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అరాఫాత్ లో తన ఒంటెపై కూర్చొని వున్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

“జాగ్రత్త! నేను చెరువు (కౌసర్) వద్ద మీకు స్వాగతం పలుకుతాను. మీ ద్వారా, ఇతర అనుచర సమాజాలపై నా అనుచర సమాజపు అధిక సంఖ్యను రుజువుచేస్తాను. అందుకే మీరు నన్ను అవమాన పరచవద్దు. జాగ్రత్త! నేను మనుషులను రక్షిస్తాను. కొంతమందిని నా నుండి దూరంగా వుంచడం జరుగుతుంది. నేను నా ప్రభూ! వీళ్ళు నా అనుచర సమాజం వాళ్ళే అని వేడుకుంటాను. ఆయన – మీ తర్వాత వీళ్లు ధర్మంలో ఏమేం సృష్టించారో మీకు తెలియదు! అని జవాబిస్తాడు.” (ఇబ్నెమాజ: 3057, సహీ – అల్బానీ) 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విషయం ప్రాధాన్యతను నొక్కి చెప్పడానికే, ప్రతి శుక్రవారం ఖుత్బాలో ఇలా సెలవిస్తూ వుండేవారు: 

అల్లాహ్ స్తోత్రం తరువాత! నిస్సందేహంగా అన్నిటికన్నా ఉత్తమ గ్రంథం అల్లాహ్ గ్రంథం (ఖుర్ఆన్), అన్నిటికన్నా ఉత్తమ పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) పద్ధతి, అన్నిటికన్నా చెడ్డకార్యం (ధర్మంలో క్రొత్తగా) సృష్టించబడిన కార్యం మరియు ప్రతి బిత్ మార్గభ్రష్టతే.” (ముస్లిం : 867) 

ఇంకా ఇలా సెలవిచ్చారు: 

“మీరు నా సున్నతును గట్టిగా పట్టుకోండి, అలాగే సన్మార్గగాములైన ఖలీఫాల పద్దతిని తప్పక పాటించండి. దీనిని వదలకుండా, ఎల్లప్పుడూ గట్టిగా పట్టుకోండి. మీరు ధర్మంలో క్రొత్త విషయాలు సృష్టించడం నుండి దూరంగా వుండండి. ఎందుకంటే ప్రతి క్రొత్త విషయం బిత్ మరియు ప్రతి బిర్అత్ మార్గభ్రష్టతకు ఆనవాలు.” (అబూదావూద్ : 4607, సహీ -అల్బానీ) 

ఆయెషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

ఎవరైనా మా ఈ ధర్మంలో లేని క్రొత్త విషయం గనక ప్రవేశపెడితే అది రద్దు గావించబడుతుంది.” (బుఖారీ, ముస్లిం) 

ముస్లిం లోని మరో ఉల్లేఖనంలో పదాలు ఇలా వున్నాయి: 

“ఏ వ్యక్తి అయినా మా ఈ ధర్మంలో లేని క్రొత్త విషయాన్ని గనక ఆచరిస్తే అది రద్దు గావించబడుతుంది.” 

ప్రియ సోదరులారా! 

హజ్జతుల్ విదా సందర్భంలో, అరాఫాత్లో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇచ్చిన ఖుత్బా ఇది ! అల్లాహ్ ను వేడుకొనేదేమిటంటే – ఆయన మనందరినీ సత్యాన్ని గ్రహించి, దాని కనుగుణంగా ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక! ఆమీన్!

ఈ ఖుత్బా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్