ఈదుల్ అద్ హా  ఖుత్బా  | జాదుల్ ఖతీబ్

ఖుత్బా యందలి ముఖ్యాంశాలు 

1. ఖుర్బానీ: ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ (అలైహిస్సలాం) సున్నత్
2. ఖుర్ఆన్ లో ఇబ్రాహీం (అలైహిస్సలాం) ప్రశంస. 
3. ఖుర్బానీ: ప్రవక్తల నాయకులైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) సున్నత్. 
4. ఖుర్బానీకి సంబంధించిన కొన్ని ప్రముఖ విషయాలు, మర్యాదలు. 
5. పండుగ దినాలలో కొన్ని చెడు కార్యాలు చేయడం! 

ఇస్లామీయ సోదరులారా! 

ఈరోజు ఈదుల్ అద్ హా అంటే ఖుర్బానీ దినం. ఈ దినం ఎంత మహోన్నతమైనదంటే – ప్రపంచంలోని ముస్లిములు ఈ రోజు ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ (అలైహిస్సలాం) సున్నతును బ్రతికిస్తూ, తమ ప్రియ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) పద్ధతిని ఆచరిస్తూ లక్షల కొద్దీ పశువులను కేవలం అల్లాహ్ పేరుతో ఖుర్బానీ చేస్తారు. 

ఇబ్రాహీం (అలైహిస్సలాం) అల్లాహ్ యొక్క గొప్ప ప్రవక్త, అల్లాహ్ ఆయనను తన మిత్రునిగా చేసుకున్నాడు. దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

وَاتَّخَذَ اللَّهُ إِبْرَاهِيمَ خَلِيلً
ఇబ్రాహీం (అలైహిస్సలాం) ను అల్లాహ్ తన మిత్రునిగా చేసుకున్నాడు.” (నిసా 4:125) 

అల్లాహ్, ఆయనకు ఎంతటి మహోన్నత స్థానం కల్పించాడంటే – ఆయన తర్వాత వచ్చిన ప్రవక్తలంతా ఆయన వంశంనుండే ప్రభవించబడ్డారు. ఆయన తరువాత అవతరించిన అల్లాహ్ గ్రంథాలన్నీ, ప్రవక్తలుగా వున్న ఆయన సంతతి మీదే అవతరించాయి. ఖుర్ఆన్ అల్లాహ్ తన ఈ ప్రియ ప్రవక్తను గూర్చి 69 సార్లు ప్రస్తావించాడు. ఆయన వృత్తాంతాలను మాటిమాటికీ వివరిస్తూ, ఆయనను ప్రశంసించాడు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

إِنَّ إِبْرَاهِيمَ كَانَ أُمَّةً قَانِتًا لِّلَّهِ حَنِيفًا وَلَمْ يَكُ مِنَ الْمُشْرِكِينَ شَاكِرًا لِّأَنْعُمِهِ ۚ اجْتَبَاهُ وَهَدَاهُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ وَآتَيْنَاهُ فِي الدُّنْيَا حَسَنَةً ۖ وَإِنَّهُ فِي الْآخِرَةِ لَمِنَ الصَّالِحِينَ ثُمَّ أَوْحَيْنَا إِلَيْكَ أَنِ اتَّبِعْ مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا ۖ وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ

నిశ్చయంగా ఇబ్రాహీం ఒక అనుసరణీయ నాయకుడు. నికార్సయిన దైవ విధేయుడు. అల్లాహ్ యందే మనస్సు నిలిపినవాడు. అతడు బహు దైవారాధకులలో చేరిన వాడు కాడు. అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతజ్ఞతా భావం కలవాడు. అల్లాహ్ అతన్ని ఎన్నుకున్నాడు. అతనికి రుజుమార్గం చూపించాడు. మేమతనికి ప్రపంచంలోనూ మేలును ప్రసాదించాము. పరలోకంలోనూ అతను సజ్జనులలో చేరి వుంటాడు. తరువాత మేము, ఏకాగ్రచిత్తుడైన ఇబ్రాహీం ధర్మాన్ని అనుసరించమని నీ వద్దకు వహీ పంపాము. అతడు బహుదైవోపాసకులలో చేరిన వాడు కాడు.”  (నహల్ 16: 120-123) 

అలాగే, ఇలా సెలవిచ్చాడు: 

وَمَن يَرْغَبُ عَن مِّلَّةِ إِبْرَاهِيمَ إِلَّا مَن سَفِهَ نَفْسَهُ ۚ وَلَقَدِ اصْطَفَيْنَاهُ فِي الدُّنْيَا ۖ وَإِنَّهُ فِي الْآخِرَةِ لَمِنَ الصَّالِحِينَ إِذْ قَالَ لَهُ رَبُّهُ أَسْلِمْ ۖ قَالَ أَسْلَمْتُ لِرَبِّ الْعَالَمِينَ

శుద్ధ అవివేకి మాత్రమే ఇబ్రాహీం ధర్మం (విధానం) పట్ల విరక్తి చెందు తాడు. మేము అతన్ని ప్రపంచంలోనూ ఎన్నుకున్నాము. పరలోకంలో కూడా అతడు సజ్జనుల సరసన ఉంటాడు. ‘(ఆత్మ) సమర్పణ చేసుకో’ అని అతని ప్రభువు అతన్ని ఆదేశించి నప్పుడల్లా, ‘సకల లోకాల ప్రభువు సమక్షంలో నన్ను నేను సమర్పించుకున్నాను’ అని అతను సమాధానం ఇచ్చాడు.” (బఖర 2: 130-131) 

అలాగే, అల్లాహ్ ఇలా కూడా సెలవిచ్చాడు: 

مَا كَانَ إِبْرَاهِيمُ يَهُودِيًّا وَلَا نَصْرَانِيًّا وَلَٰكِن كَانَ حَنِيفًا مُّسْلِمًا وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ

ఇబ్రాహీం యూదుడూ కాదు, క్రైస్తవుడూ కాదు. ఆయన ఒకే దేవుని వైపు అభిముఖుడైన ముస్లిం. ఆయన ముష్రిక్కులలోని వాడు ఎంత మాత్రం కాదు.” (ఆలి ఇమ్రాన్ 3:67) 

అల్లాహ్ – ఇబ్రాహీం (అలైహిస్సలాం) ను ఎన్నో విధాలుగా పరీక్షించాడు. ఆయన ప్రతి పరీక్షలోనూ నెగ్గారు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

وَإِذِ ابْتَلَىٰ إِبْرَاهِيمَ رَبُّهُ بِكَلِمَاتٍ فَأَتَمَّهُنَّ ۖ قَالَ إِنِّي جَاعِلُكَ لِلنَّاسِ إِمَامًا ۖ قَالَ وَمِن ذُرِّيَّتِي ۖ قَالَ لَا يَنَالُ عَهْدِي الظَّالِمِينَ

ఇబ్రాహీం (అలైహిస్సలాం)ను అతని ప్రభువు అనేక విషయాలలో పరీక్షించగా, అతను అన్నింటి లోనూ (నికార్సుగా) నెగ్గుకు వచ్చాడు. అప్పుడు అల్లాహ్ అతన్ని ఉద్దేశించి, ‘నేను నిన్ను ప్రజలకు నాయకునిగా చేస్తాను’ అన్నాడు. దానికి అతను ‘నా సంతానాన్ని కూడానా!’ అని అడిగాడు. అప్పుడు అల్లాహ్, ‘దుర్మార్గులకు నా వాగ్దానం వర్తించదు’ అని సమాధానం ఇచ్చాడు. ” (బఖర 2: 124) 

“ఇక్కడ ‘అనేక విషయాలు’ అంటే సమస్త ఆజ్ఞలు మరియు నిషేధాలు అని అర్ధం. ప్రత్యేకించి హిజ్రత్ చేయమని మరియు కుమారుణ్ణి ఖుర్బానీ చేయమని ఇవ్వబడ్డ ఆజ్ఞలు. 

ఇబ్రాహీం (అలైహిస్సలాం) విశ్వాస పాత్రత గురించి అల్లాహ్ ఇలా ప్రశింసించాడు: 

“(అలాగే) విశ్వాస పాత్రుడైన ఇబ్రాహీము గ్రంథ ప్రతుల్లోని విషయం గురించి”. (నజ్మ్  : 37) 

ఆయనకు పెట్టబడిన పరీక్షలలో ఒక పరీక్ష – ఆయన పుత్రరత్నం ఇస్మాయిల్ (అలైహిస్సలాం) గురించి. దీని గురించి అల్లాహ్ ఖుర్ఆన్లో ఇలా సెలవిచ్చాడు.: 

وَقَالَ إِنِّي ذَاهِبٌ إِلَىٰ رَبِّي سَيَهْدِينِ رَبِّ هَبْ لِي مِنَ الصَّالِحِين فَبَشَّرْنَاهُ بِغُلَامٍ حَلِيمٍ. فَلَمَّا بَلَغَ مَعَهُ السَّعْيَ قَالَ يَا بُنَيَّ إِنِّي أَرَىٰ فِي الْمَنَامِ أَنِّي أَذْبَحُكَ فَانظُرْ مَاذَا تَرَىٰ ۚ قَالَ يَا أَبَتِ افْعَلْ مَا تُؤْمَرُ ۖ سَتَجِدُنِي إِن شَاءَ اللَّهُ مِنَ الصَّابِرِينَ فَلَمَّا أَسْلَمَا وَتَلَّهُ لِلْجَبِينِ وَنَادَيْنَاهُ أَن يَا إِبْرَاهِيم قَدْ صَدَّقْتَ الرُّؤْيَا ۚ إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ إِنَّ هَٰذَا لَهُوَ الْبَلَاءُ الْمُبِينُ وَفَدَيْنَاهُ بِذِبْحٍ عَظِيمٍ

అతను (ఇబ్రాహీమ్‌) ఇలా అన్నాడు : “నేను నా ప్రభువు వైపుకే పోతాను. ఆయన తప్పకుండా నాకు మార్గం చూపుతాడు. “నా ప్రభూ! నాకు గుణవంతుడైన కుమారుణ్ణి ప్రసాదించు” (అని ప్రార్థించాడు). అందువల్ల మేమతనికి, సహనశీలుడైన ఒక అబ్బాయి గురించిన శుభవార్తను అందజేశాము.మరి ఆ కుర్రాడు అతని వెంట పరుగెత్తే ఈడుకు చేరుకున్నప్పుడు, “ఒరేయ్‌ చంటీ! నేను నిన్ను ‘జిబహ్‌’ చేస్తున్నట్లు కల చూస్తున్నాను! మరి నీ అభిప్రాయమేమిటో చెప్పు” అని అతను (ఇబ్రాహీం) అన్నాడు. “నాన్నగారూ! మీకు ఆజ్ఞాపించబడిన దానిని (నిస్సంకోచంగా) నెరవేర్చండి. అల్లాహ్‌ తలిస్తే మీరు నన్ను సహనశీలిగా పొందుతారు” అని ఆ బాలుడు అన్నాడు.మరి వారిరువురూ (దైవాజ్ఞను) శిరసావహించినప్పుడు అతను తన కుమారుణ్ణి ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టాడు.అప్పుడు మేమతన్ని పిలిచాము – “ఓ ఇబ్రాహీం!“నువ్వు కలను నిజంచేసి చూపావు.” నిశ్చయంగా మేము సదాచార సంపన్నులకు ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము.యదార్థానికి అదొక బహిరంగ పరీక్ష! మేము ఒక పెద్ద బలిపశువుని పరిహారంగా ఇచ్చి ఆ బాలుణ్ణి విడిపించాము. (సాఫ్ఫాత్ 37: 99-107)

ఈ ఆయతులలో అల్లాహ్, తన మిత్రుడైన ఇబ్రాహీం (అలైహిస్సలాం) గురించి సెలవిచ్చిందేమిటంటే – ఆయన తన పుట్టిన ప్రదేశాన్ని విడిచిపెట్టినపుడు  అల్లాహ్ “నా ప్రభూ ! నాకు గుణవంతుడైన కుమారుణ్ని ప్రసాదించు అని ప్రార్ధించారు. అల్లాహ్ ఆయనకు ఒక విధేయుడైన కుమారుని గురించి శుభవార్త ఇచ్చాడు. ఆయన వయస్సు అప్పుడు 80 సం॥లకు పైబడి వుంది. ఆ సమయంలో అల్లాహ్ ఆయనకు ‘హాజిరా’ ద్వారా ఒక కుమారుణ్ణి ప్రసాదిం చాడు. ఆయన అతని పేరు ‘ఇస్మాయీల్’ అని పెట్టారు. 

ఈ కుమారుని గురించి అల్లాహ్, ఇబ్రాహాం (అలైహిస్సలాం) కు పెట్టిన మొదటి పరీక్ష ఏమిటంటే – అతన్ని మరియు అతని తల్లిని నీటి, వృక్ష వనరులు లేని, జన సంచారం లేని లోయలో విడిచిపెట్టి రమ్మని ఆజ్ఞాపించాడు. అల్లాహ్ వైపు నుండి పెట్టబడిన పరీక్షలో ఇబ్రాహీం (అలైహిస్సలాం) పూర్తిగా నెగ్గారు. కేవలం అల్లాహ్ పై నమ్మకం వుంచి, తన చిన్న కుటుంబాన్ని అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం మక్కా ముకర్రమ లో వదిలి వెళ్ళిపోగా, అల్లాహ్ ఆ కుటుంబంపై తన కారుణ్య వర్షాన్ని అవతరింపజేశాడు. 

ఇబ్న్ అబ్బాస్ (రజి అల్లాహు అన్ను కథనం: స్త్రీలలో మొదటి సారిగా వడ్డాణం ఉపయోగించినవారు ‘హాజిరా.’ తద్వారా ‘సారా’ కు ఆమె గురించి తెలియకుండా ఉండటానికి, ఇబ్రాహీం (అలైహిస్సలాం) హాజిరా ను, ఆమె కొడుకు ఇస్మాయిల్ (అలైహి స్సలాం) ను అక్కడి నుండి తీసుకెళ్ళారు. ఆ సమయంలో హాజిరా, ఇస్మాయిల్ (అలైహిస్సలాం) కు పాలుపడుతుండేవారు. ఇబ్రాహీం (అలైహిస్సలాం) వారిద్దరినీ బైతుల్లాహ్ దగ్గర ఎత్తైన స్థలం వద్ద, నేడు జమ్ జమ్ నీళ్ళు వున్నచోట, ఒక పెద్ద వృక్షం క్రింద కూర్చోబెట్టారు. ఆ సమయంలో అక్కడ ఒక్క మనిషి కూడా లేడు, నీటి సౌకర్యం కూడా లేదు. ఆయన వారికి ఖర్జూరాలు కలిగిన ఒక సంచి మరియు నీళ్ళు కలిగిన ఒక తోలు సంచి ఇచ్చి వెళ్ళసాగారు. హాజిరా, ఆయన వెనుకనే వస్తూ ఇలా అడిగారు: ఓ ఇబ్రాహీం! మమ్మల్ని ఏ మాత్రం జన సంచారం లేని, నీటి సౌకర్యం లేని లోయలో విడిచి వెళుతున్నారు? హాజిరా పలుసార్లు ఇలా అడిగారు, కానీ ఇబ్రాహీం (అలైహిస్సలాం) కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు. దీనితో ఆమె మీకిలా చెయ్యమని అల్లాహ్ ఆజ్ఞాపించాడా? అని అడిగారు. ఇబ్రాహీం (అలైహిస్సలాం) జవాబిస్తూ ‘అవును’ అని అన్నారు. ఆమె – అలాగా! (అయితే వెళ్ళండి), అల్లాహ్ మమ్మల్ని వృథా చేయడు అని చెప్పి తిరిగి వచ్చేసారు. 

ఇబ్రాహీం (అలైహిస్సలాం) అక్కణ్ణుంచి బయలుదేరి ఒక ఇసుక దిబ్బ పైకి చేరుకున్నారు. అక్కడి నుండి ఆయన వారిని చూడలేరు. తదుపరి, ఆయన బైతుల్లాహ్ వైపు తిరిగి తన చేతులెత్తి ఇలా ప్రార్ధించారు: 

మా ప్రభూ! నా సంతానంలో కొందరిని పంటలు పండని కటిక లోయలో, నీ పవిత్ర గృహం వద్ద వసింపజేశాను…..” 

ఇటు, హాజిరా, ఇస్మాయీల్ (అలైహిస్సలాం) కు పాలుపట్టి నీళ్ళు త్రాగిస్తూ వున్నారు. చివరికి ఆ నీళ్ళు అయిపోయాయి. దీనితో ఇద్దరూ దాహార్తులై పోయారు. పిల్లవాడు దాహంతో కొట్టుమిట్టాడడం ఆమె గమనించారు. పిల్లవాడి పరిస్థితి చూసి ఆమె చలించి పోయారు. చుట్టూ దృష్టి సారించారు. సఫా కొండ ఆమెకు దగ్గరగా కనిపించింది. దీనితో ఆమె దాని పైకి ఎక్కి తదుపరి లోయలోకి దిగారు, తద్వారా జన సంచారం ఏదైనా కనబడుతుందేమో అని అటూ ఇటూ చూశారు. కానీ ఆమెకు ఎవరూ కనిపించలేదు. ఆమె సఫా కొండ నుండి దిగి లోయలోకి వచ్చేశారు. తన వస్త్రాన్ని కాస్తపైకి లేపి కష్టాల్లో వున్న వ్యక్తి లాగా పరుగెత్తుతూ లోయను దాటి మర్వా కొండ పైకి వచ్చేశారు. తదుపరి దానిపై నిలబడి, జనసంచారం ఏమైనా కనబడుతుందేమో అని అటూ ఇటూ చూశారు. కానీ ఆమెకు అక్కడ కూడా ఎవరూ కనిపించలేదు. ఈ స్థితిలోనే ఆమె సఫా, మర్వాల మధ్య ఏడుసార్లు ప్రదక్షిణ చేశారు. 

ఆయన (సల్లల్లాహు అలైహివసల్లం) ఇలా సెలవిచ్చారు: “అప్పటి నుంచే ప్రజలు సఫా, మర్వాల తవాఫ్ (ప్రదక్షిణ) ప్రారంభించారు.” 

ఆమె ఏడవసారి పరుగెత్తుతూ, మర్వా పైకి ఎక్కినప్పుడు ఒక శబ్దాన్ని విన్నారు. ఆమె తన మనసులో 

నిశ్శబ్దంగా వుండి ముందు ఆ మాటలు వినాలనుకొని మనసును అటువైపు కేంద్రీకరించారు. తదుపరి ఆమె – మేము నీ మాటలు విన్నాం, మాకు నీవేమైనా సహాయం చేయగలవా? అని అడిగారు. ఆ సమయంలో ఆమె జమ్ జమ్  వున్న స్థానంలో ఒక దైవదూతను చూసారు. అతను తన కాలితో లేదా తన రెక్కతో భూమిని త్రవ్వగా దాని నుండి నీళ్ళు బయటికి వచ్చాయి. హాజిరా ఆ నీటిని నియంత్రంచే ఉద్దేశ్యంతో చేతులతో అడ్డుకట్టవేసి, తనవద్ద నున్న తోలు సంచిని నీళ్ళతో నింపుకున్నారు. ఆమె చేతులలో నీళ్ళు నింపి బయటకు తీయగానే నీళ్ళు మరింత వేగంగా భూమి నుండి బయటికొచ్చేవి. 

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు. 

అల్లాహ్, ఇస్మాయీల్ తల్లిపై కరుణించుగాక! ఆమె ఒకవేళ జమ్ జమ్  యధావిధిగా వదిలిపెట్టి వుంటే (లేదా ఇలా సెలవిచ్చారు) తన చేతులతో దానిని మాటిమాటికి తీసి వుండక పోతే జమ్ జమ్  ఒక ప్రవహించే కాలువ లాగా వుండేది”. 

తదుపరి హాజిరా ఆ నీళ్ళు త్రాగారు మరియు పిల్లవాడికి పాలుపట్టారు. దైవదూత, ఆమెతో మీరు భయపడకండి, ఇక్కడ అల్లాహ్ గృహం వుంది. ఈ పిల్లవాడూ మరియు ఇతని తండ్రి దానిని నిర్మిస్తారు. ప్రస్తుతం కాబాగృహం వున్న స్థలం ఆ సమయంలో నేలనుండి కొంత ఎత్తుగా వున్నది. వర్షపునీరు దాని ఇరుప్రక్కలనుండి ప్రవహించేది. 

కొంత కాలం గడిచాక ‘జుర్ హమ్’ తెగవారు లేదా వారి కుటుంబీకులు (కదా అనబడే) మార్గం ద్వారా ప్రయాణిస్తూ అక్కడి నుండి వెళుతూ మక్కా లోయలో బసచేశారు. అక్కడ ఒక పక్షి ఎగురుతూ వుండడం చూసి – ఈ పక్షి (సాధారణంగా) నీళ్ళున్న స్థలం లోనే తిరుగుతూ వుంటుంది, కానీ మనకీ ప్రదేశం గురించి బాగా తెలుసు, ఈ ప్రదేశంలో నీరు ఎక్కడా లభించదు అనుకొని, ఎక్కడైనా నీరు లభిస్తుందేమో చూసి రమ్మని ఒక వ్యక్తిని పంపించారు. అతను నీళ్ళున్న ఆ స్థలాన్ని కనుక్కొని తిరిగి వెళ్ళి తన తెగ వారికి తెలియ జేశాడు. దీనితో వారంతా అక్కడికి చేరుకున్నారు. హాజిరా నీళ్ళ వద్దే కూర్చొని వున్నారు. వాళ్ళు ఆమెను – మేమిక్కడ బస చేయడానికి మీరు అనుమతిస్తారా? అని అడిగారు. అమె సరే, కానీ ఈ నీటిపై మీకు ఏ విధమైన అధికారం వుండదు అని జవాబిచ్చారు. వాళ్ళు- సరే, మంచిది అని అన్నారు. 

ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: 

ఇస్మాయీల్ (అలైహిస్సలాం) తల్లి కూడా మనషులు అక్కడ స్థిరపడాలనే కోరుకొనేవారు. ఇలా వారంతా అక్కడ స్థిర పడ్డారు మరియు తమ కుటుంబీకులను కూడా పిలిపించుకున్నారు. దీనితో అక్కడ ఎన్నో ఇళ్ళు వెలిశాయి (నిర్మించబడ్డాయి). ఇటు ఇస్మాయీల్ (అలైహిస్సలాం) కూడా యౌవన దశకు చేరుకొని, వారి నుండే అరబ్బీ భాషను నేర్చుకొని వాళ్ళ దృష్టిలో ఒక మంచి యువకుడిగా పేరు తెచ్చుకున్నారు. వాళ్ళు ఆయనను ప్రేమిస్తూ తమ కుటుంబంలోని ఒక యువతినిచ్చి ఆయనతో వివాహం జరిపించారు. ఆ తర్వాత ఆయన తల్లి (హాజిరా) మరణించారు.” (బుఖారీ: 3364) 

ఇస్లామీయ సోదరులారా! 

పరీక్షల గురించి అల్లాహ్ వివరించిన ఆయతులలో, తను సెలవిచ్చిందేమి టంటే – ఇస్మాయీల్ (అలైహిస్సలాం) యౌవనం లోని అడుగుపెట్టాక, ఇబ్రాహీం (అలైహిస్సలాం) తన పుత్రరత్నాన్ని ‘జిబహ్’ చేస్తున్నట్లు కలలో చూశారు. దైవ ప్రవక్తల స్వప్నాలు కూడా వహీ (దైవ వాక్కు) అవుతాయి గనుక, ఆయన, తన పుత్రరత్నాన్ని జిబహ్ చెయ్యడానికి నిశ్చయించుకున్నారు. దీనిని అమలులోకి తేవడానికి ముందు ఆయన తన కుమారునికి విషయమంతా వివరించి, అతని అభిప్రాయం అడిగారు. గుణవంతుడు, అత్యంత విధేయుడూ అయిన ఆ కుమారుడు వెంటనే – “నాన్న గారూ! మీకు ఆజ్ఞాపించబడిన దానిని (నిస్సంకోచంగా) నెరవేర్చండి.” అని అన్నాడు. అంతే కాదు, తన ముసలి తండ్రిని, తన సహనం గురించి నమ్మకాన్ని కలుగజేస్తూ- “అల్లాహ్ తలిస్తే మీరు నన్ను సహన శీలిగా పొందుతారు” అని అన్నాడు. తండ్రీ కొడుకుల ఉత్సాహం చూడండి! అల్లాహ్ ఆజ్ఞను పాలించడానికి ఎల్లప్పుడూ సిద్ధం! 

తండ్రి తన పుత్రరత్నాన్ని జిబహ్ చెయ్యడానికి ఆతృత కనబరిస్తే, కుమా రుడు జిబహ్ కావడానికి ఆతృత చూపించాడు. నిశ్చయంగా ఒక కఠిన పరీక్ష నుండి ఇద్దరూ సఫలీకృతులయ్యారు. అల్లాహ్ దీనిని ‘యదార్థానికి అదొక బహిరంగ పరీక్ష’ అని పేర్కొన్నాడు. 

తదుపరి, ఇబ్రాహీం (అలైహిస్సలాం) తన కుమారుణ్ణి తీసుకొని మినా వైపుకు వెళ్ళారు. ప్రపంచంలోనే మొదటి సారిగా ఒక ముసలి తండ్రి, యౌవనంలో వున్న తన కుమారుడి మెడపై కత్తి వుంచిన దృశ్యం కనబడింది! అదే తరుణంలో అల్లాహ్ తరఫు నుండి ప్రకటన వచ్చింది. “ఓ ఇబ్రాహీం! నువ్వు కలను నిజం చేసి చూపావు.” 

విశ్వప్రభువు తన ప్రవక్త యొక్క విధేయతా ఉత్సాహాన్ని ధృవీకరించాడు మరియు ఇస్మాయీల్ (అలైహిస్సలాం) స్థానంలో ఒక గొర్రెను పంపించగా, ఇబ్రాహీం (అలైహిస్సలాం) దానిని జిబహ్ చేశారు. 

ఎంతో విశిష్టమైన ఖుర్బానీ ఇది. దీనిని ఆధారంగా చేసుకొనే, లక్షల కొద్దీ ముస్లిములు ప్రతియేడూ అల్లాహ్ సామీప్యాన్ని పొందటానికి ప్రయత్ని స్తుంటారు. 

గత శుక్రవారం ఖుత్బాలో మేము – ఖుర్బానీ చేయడం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సున్నత్ అనీ, మదీనాలో వున్నంత కాలం, ప్రతియేడూ ఆయన ఖుర్బానీ చేశారని వివరించాం. పైగా, శక్తి సామర్ధ్యాలు వున్నప్పటికీ, ఖుర్బానీ చేయని వారి గురించి ఆయన గట్టిగా హెచ్చరించారు. “స్థోమత కలిగి వున్నప్పటికీ ఖుర్బానీ చేయనివారు మా ఈద్గాహ్ లోకి రాకూడదు.” (హాకిమ్, హసన్ – అల్బానీ, సహీ అత్ తర్హీబ్ వ తర్గీబ్ : 1087) 

అలాగే, ఆరాఫాత్ లో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

ప్రజలారా! ప్రతి ఇంటి నుండి ప్రతియేడూ ఖుర్బానీ చేయడం తప్పని సరి.” (అబూదావూద్:2788, తిర్మిజి:1518,ఇబ్నెమాజ:3125, సహీ – అల్బానీ) 

అందుకే, స్థోమత గనక వుంటే, ఖుర్బానీ చేయడం వదిలి పెట్టకూడదు. 

మరొక విషయం కూడా గుర్తించుకోవాలి. అదేమిటంటే – అన్ని ఆరాధనల లాగానే, ఖుర్బానీలో కూడా సంకల్ప శుద్ధి ఎంతో అవసరం. అందుకే కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకే ఖుర్బానీ చేయాలి. ప్రదర్శనా బుద్ధిని కలిగి వుండడం గానీ, తన గురించి ప్రజలు -ఇతను ఖుర్బానీ చేశాడు – అని మాట్లాడు కోవాలన్న తలంపు గానీ వుంటే, ఈ రెండూ, ఖుర్బానీ పుణ్య ఫలాన్ని వ్యర్ధం చేసేస్తాయి. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

فَصَلِّ لِرَبِّكَ وَانْحَ
నువ్వు నీ ప్రభువు కోసమే నమాజు చెయ్యి మరియు (అతని కోసమే) ఖుర్వానీ ఇవ్వు.” (అల్ కౌసర్ 108: 2) 

అలాగే, అల్లాహ్ ఇలా కూడా సెలవిచ్చాడు: 

قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ لَا شَرِيكَ لَهُ ۖ وَبِذَٰلِكَ أُمِرْتُ وَأَنَا أَوَّلُ الْمُسْلِمِينَ

ఈ విధంగా ప్రకటించు: నిస్సందేహంగా నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం – ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే, ఆయనకు భాగస్వాము లెవరూలేరు. దీని గురించే నాకు ఆజ్ఞాపించ బడింది. ఆజ్ఞాపాలన చేసేవారిలో నేను మొదటివాణ్ణి.” (ఆన్ ఆమ్ 6: 162, 163) 

దీనితో పాటు మీకు తెలియజేసే మరొక విషయమేమిటంటే – ఖుర్బానీ పశువైనా, ఇతర పశువైనా, ప్రతి పశువునూ కేవలం అల్లాహ్ పేరుతోనే జిబహ్ చెయ్యాలి. దైవేతరుల పేరుతో జిబహ్ చెయ్యబడే పశువు హలాల్ కాదు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:  

إِنَّمَا حَرَّمَ عَلَيْكُمُ الْمَيْتَةَ وَالدَّمَ وَلَحْمَ الْخِنزِيرِ وَمَا أُهِلَّ بِهِ لِغَيْرِ اللَّهِ

అల్లాహ్ మీ కొరకు నిషేధించినవి ఇవే: మరణించిన జంతువులు, (ప్రవహించిన) రక్తం, పంది మాంసం, ఇంకా అల్లాహ్ తప్ప ఇతరుల పేరు ఉచ్చరించబడినది.” (బఖర 2: 173) 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ఒక హదీసు ప్రకారం, దైవేతరుల కోసం జిబహ్ చేసే వ్యక్తి శపించబడ్డ వ్యక్తి.  ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు. 

దైవేతురుల కోసం జిబహ్ చేసే వ్యక్తి పై అల్లాహ్ శాపం అతరించుగాక.” 

అందుకే, ఖుర్బానీ పశువును జిబహ్ చేసే ముందు రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. 

ఇందులో మొదటిది- సంకల్ప శుద్ధి అంటే ఖుర్బానీ ద్వారా కేవలం అల్లాహ్ ప్రసన్నత పొందే ఉద్దేశ్యం వుండాలి. ఇక రెండవది- ఆ పశువు కేవలం అల్లాహ్ పేరుతోనే జిబహ్ చెయ్యాలి. దైవేతరుల పేరుతో కాదు. 

అలాగే, గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటంటే – ఖుర్బానీ సమయం, ఈదుల్ అజ్ నమాజు తర్వాత వుంది. ఒకవేళ ఎవరైనా, పండుగ నమాజు చదవడానికి ముందే గనక ఖుర్బానీ చేసి వుంటే, దానికి బదులు మరో పశువును అతను ఖుర్బానీ చెయ్యాలి. 

జున్దుబ్ బిన్ సుఫ్యాన్ (రదియల్లాహు అన్హు) కథనం: 

“నేను, ఖుర్బానీ (చేసే) సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో పాటు ఉన్నాను. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) పండుగ నమాజును ముగించిన వెంటనే, నమాజుకు ముందు జిబహ్ చెయ్యబడిన పశువుల మాంసం చూశారు. దీనిపై ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

ఏ వ్యక్తి అయితే ఖుర్బానీ పశువును పండుగ నమాజుకు ముందు జిబహ్ చేశాడో, అతను దాని స్థానంలో మరో పశువును జిబహ్ చెయ్యాలి. ఇక ఎవరైతే, జిబహ్ చేయలేదో వారు ‘బిస్మిల్లాహ్’ అని పలికి జిబహ్ చేయవచ్చు.” (బుఖారీ: 985, ముస్లిం: 1960) 

మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. 

ఖుర్బానీ కొరకు మీరు ప్రత్యేకించుకున్న పశువు లేదా దీని కోసం ఈ రోజే మీరు కొనుగోలు చేసిన పశువు లావుగా, లోపాలు లేకుండా వుండాలి. 

అబూ ఉమామా బిన్ సహల్ ఇలా సెలవిచ్చారు: 

మేము మదీనాలో ఖుర్బానీ పశువులను బాగా మేపి లావుగా చేసేవాళ్ళం. అలాగే ఇతర ముస్లిములు కూడా ఖుర్బానీ పశువులను లావుగా చేసేవారు“. (బుఖారీ) 

బరా బిన్ అజిబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

ఖుర్బానీ కోసం నాలుగు రకాల పశువులు సరైనవికావు. మెల్ల కన్ను గల పశువు దాని మెల్ల కన్ను స్పష్టంగా తెలియాలి. రోగం బారిన పడ్డ పశువు – దాని రోగం స్పష్టంగా కనబడాలి. కుంటుతున్న పశువు – దాని కుంటి తనం బహిర్గతమవ్వాలి. (అలాగే) ఎముకల్లో ఏ మాత్రం గుజ్జు లేకుండా అత్యంత బలహీనమైపోయిన పశువు.” (అబూదావూద్: 2802, తిర్మిజీ: 1497, సహీ – అల్బానీ) 

అందుకే, ఈ లోపాలలో ఏది వున్నా, అలాంటి పశువును ఖుర్బానీ చేయడం సరైనది కాదు. అలాగే చెవులు తెగి వుండకూడదు మరియు కొమ్ములు కూడా విరిగి వుండకూడదు. కానీ వృషణాలు లేకపోవడం లోపం అనిపించు కోదు. 

ప్రియ సోదరులారా! 

ఈ ప్రాథమిక విషయాల తర్వాత, ఖుర్బానీ కి సంబంధించి, తప్పని సరిగా పాటించాల్సిన కొన్ని మర్యాదలు కూడా తెలుసుకోండి. 

1. ఖుర్బానీ పశువును జిబహ్ చేసే ముందు కత్తి లేదా చాకు ను పదునుగా చేసుకోవాలి. 

షద్దాబ్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

“నిశ్చయంగా అల్లాహ్ ప్రతి దానిపై ఉపకారాన్ని (ఇహ్సన్) విధిగా చేశాడు. అందుకే మీరు (ఖిసాస్లో ) ఒకవేళ చంపితే సరిగా చంపండి. పశు వును జిబహ్ చేసేటప్పుడు సరిగా జిబహ్ చెయ్యండి. మీలో ప్రతి వ్యక్తి తన కత్తిని పదును చేసుకోవాలి మరియు జిబహ్ చెయ్యబడే పశువుకు ప్రశాంతతను అందించాలి.” (ముస్లిం: 1955) 

అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక వ్యక్తి దగ్గరి నుంచి వెళ్ళసాగారు. అతను, ఒక మేక మెడపై తన కాలు నుంచి, కత్తిని పదును చేస్తున్నాడు. మేక అతని వైపే చూస్తూవుంది. (ఇది చూసి) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)-నువ్వు దీనికి ముందే ఎందుకిలా చేయలేదు? (కత్తిని ఎందుకు పదును చేసుకోలేదు) నువ్వు దానిని పలుసార్లు చంపాలను కుంటున్నావా? అని అన్నారు. (తబ్రానీ, సహీ అత్తర్బ్ వ తర్హిబ్ : 1090) 

2. మనిషి తన స్వహస్తాలతో జిబహ్ చెయ్యటం మేలు. ఒకవేళ అతను జిబహ్ చెయ్యలేక పోతే ఇతరులెవరైనా జిబహ్ చెయ్యవచ్చు. ఒక వేళ స్త్రీలు కూడా జిబహ్ చేయాలనుకుంటే జిబహ్ చెయ్యవచ్చు. 

పశువును జిబహ్ చేసే సున్నత్ పద్ధతి ఏమిటంటే దానిని ఎడమ వైపుకు పడుకో బెట్టి, దాని మెడపై తన కాలు పెట్టి, “బిస్మిల్లాహ్ అల్లాహు అక్బర్” అని పలికి కుడి చేత్తో జిబహ్ చెయ్యాలి. 

అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), నలుపు తెలుపు రంగులు కలిగిన రెండు గొర్రెలను ఖుర్బానీ చేశారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వాటి మెడలపై కాలుపెట్టి ‘బిస్మిల్లాహ్ అల్లాహు అక్బర్’ అని పలికి, వాటిని తన చేతితో జిబహ్ చెయ్యడం నేను చూశాను.” (బుఖారీ:5558, ముస్లిం 1966) 

ఆయెషా (రదియల్లాహుఅన్హా) కథనం: 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కాళ్ళు నలుపురంగులో, పొట్ట కూడా నలుపురంగులో, కళ్ళ చుట్టు ప్రక్కల కూడా నలుపు రంగులో వున్న కొమ్ములు గల ఒక గొర్రె (పొట్టేలు) తీసుకు రమ్మని ఆజ్ఞాపించారు. ఆయన ఖుర్బానీ చేసేందుకు, అది తీసుకురాబడింది. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) అయేషా (రదియల్లాహు అన్హా) తో – ‘కత్తి ని తీసుకురా’ అని పలికి, తదుపరి, ‘దానిని రాతిబండ సహాయంతో పదునుగా చేయి’ అని అన్నారు. అయేషా (రదియల్లాహు అన్హా) కత్తిని పదును చేసి ఇవ్వగా, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) దానిని చేతిలో తీసుకొని, గొర్రెను పట్టుకొని జిబహ్ చేస్తూ ఇలా పలికారు – “అల్లాహ్ పేరుతో, ఓ అల్లాహ్ ! ముహమ్మద్, ముహమ్మద్ కుటుంబీకులు మరియు ముహమ్మద్ అనుచర సమాజం తరఫు నుండి (దీనిని) స్వీకరించు.” తదుపరి, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) దానిని జిబహ్ చేశారు. 

3. ఖుర్బానీ మాంసాన్ని స్వయంగా తినాలి, తమ బంధువులకు, ఇంటికి వస్తూ పోతూ ఉండేవారికి, బీదవారికి కూడా తినిపించాలి. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

فَكُلُوا مِنْهَا وَأَطْعِمُوا الْبَائِسَ الْفَقِيرَ
ఆ తరువాత వాటిని మీరూ తినండి, దుర్భర స్థితిలో ఉన్న అగత్య పరులకు కూడా తినిపించండి.” (హజ్22: 28) 

ఇంకా ఇలా సెలవిచ్చాడు: 

 فَكُلُوا مِنْهَا وَأَطْعِمُوا الْقَانِعَ وَالْمُعْتَرَّ
వాటిని (మీరూ) తినండి, అడగని అభాగ్యులకు, అడిగే అగత్య పరులకు కూడా తినిపించండి.” (హజ్ 22: 36) 

ఈ ఆయతులను ఆధారంగా చేసుకొని, విద్వాంసులు – ఖుర్బానీ మాంసాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు. ఒక భాగం స్వయం కోసం, రెండవది బంధువులు, పరిచితుల కోసం మరియు మూడవది నిరుపేదలు, అగత్యపరుల కోసం. 

ఇక్కడ, గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే- తమ వాట లోని మాంసాన్ని నిల్వ చేసుకోవడం కూడా సరైనదే. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముందుగా దీనిని వారించారు, కానీ తర్వాత అనుమతి ఇచ్చారు. 

జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) –ఖుర్బానీ మాంసాన్ని మూడు రోజులకు మించి తినడాన్ని వారించారు. ఆ తర్వాత ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “ఇప్పుడు మీరు తినవచ్చు ప్రయాణ సామగ్రిగా ఉపయోగించవచ్చు మరియు నిల్వ కూడాచేసుకోవచ్చు”. (ముస్లిం: 1972) 

సల్మా బిన్ ఉకూ (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చివున్నారు. “మీలో ఎవరైనా ఖుర్బానీ చేస్తే అతని ఇంట్లో మూడు రోజులకు మించి దాని మాంసంఉండకూడదు.” దాని తర్వాత, మరుసటి సం॥ వచ్చినప్పుడు, ప్రజలు ఆయనతో – ఓ దైవ ప్రవక్తా! గత సం|| మేము పాటించినట్లుగానే ఈ సం॥ కూడా ఆచరించాలా? అని అడిగారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ “ఇప్పుడు మీరూ తినండి, ఇతరులకూ తినిపించండి మరియు నిల్వ కూడా చేసుకోండి. ఎందు కంటే గత సం|| ప్రజలు దారిద్య్ర స్థితిలో వున్నారు, అందుకే నేను (మిగిలిన మాంసం ద్వారా) ఒకరి కొకరు సహాయపడ్డారని భావించాను” అని వివరించారు. (బుఖారీ: 5569, ముస్లిం:1974) 

4. ఖుర్బానీ చర్మాలు 

ఖుర్బానీ మాంసం ఎలాగైతే అమ్మడం సరికాదో, అలాగే, దాని చర్మాలు కూడా అమ్మి వాటి ధరను తమ ఉపయోగాలకు గాను వాడుకోవడం సరికాదు. ఆ చర్మాలను స్వయంగా ఉపయోగించుకోవాలి లేదా దానం చేసేయాలి. 

అలీ (రదియల్లాహు అన్హు) కథనం: 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నన్ను – ఖుర్బానీ పశువుల దగ్గరుండి వాటిని కనిపెట్టుకొని వుండమని, వాటి మాంసాన్ని, చర్మాలను, వాటి అంతర్భాగాలను (ప్రేగులు వగైరా॥) ఖసాబ్ (పశువులను జిబహ్ చేసి విక్రయించేవాడు) కు కూలీ (వేతనం) క్రింద ఇవ్వకుండా, దానం చేయమని ఆజ్ఞాపించారు. (బుఖారీ:1717, ముస్లిం:1317) 

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

ఏ వ్యక్తి అయినా తన ఖుర్బానీ చర్మాన్ని విక్రయిస్తే, అతని ఖుర్బానీ నెరవేరదు.” (హాకిమ్, హసన్- అల్బానీ, సహీ అత్తర్ గీబ్ వ తర్హిబ్: 1088) 

5. ఖుర్బానీ దినాలు 

ఖుర్బానీ దినాలు 4 రోజులు. పండుగ రోజు తోపాటు దాని తర్వాత వచ్చే మూడు రోజులు (11,12,13 తేదీలు). వీటిని ‘తష్ రీ ఖ్ దినాలు’ అని పిలుస్తారు. కనుక, ఈ నాలుగు దినాలలో ఏ దినమైనా ఖుర్బానీ చేయవచ్చు. (జాదుల్ మిఆద్: 2వ సంపుటం, 319 పేజి, ఫతావా అలల్ జన్నతుల్ దాయిమ 8వ సంపుటం, 406 పేజీ) 

పండుగ రోజుల్లో వినోదం 

పండుగ రోజుల్లో వినోదం సరైనదే. కానీ షరతు ఏమిటంటే దీనిలో షరీయత్తుకు విరుద్ధంగా ఏ కార్యం జరుగకూడదు. అందుకే, ముస్లిములందరూ ఈ తరుణంలో తమ ఇంటి వారిని, బంధువులను, మిత్రులను కలిసి షరియత్తు హద్దులకు లోబడి ఆనందం వ్యక్తం చేయాలి. 

ఆయెషా (రదియల్లాహు అన్హా) కథనం:

అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) నా దగ్గరికి విచ్చేశారు. ఆ సమయంలో అన్సారీ యువతుల్లోని ఇద్దరు యువతులు ‘బుఆస్’ దినం నాడు అన్సారీలు చదివిన కవితలతో పాడుతున్నారు. వాస్తవానికి వారు పాటలు పాడే వాళ్ళు కారు. కానీ ఆ రోజు పండుగ రోజు. అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంట్లోనే షైతాను మాట మారుమ్రోగు తోందా? అని అడిగారు. దీనిపై, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ – “ఓ అబూ బకర్! ప్రతి జాతికి ఒక పండుగ వుంటుంది మరియు ఈ రోజు మన పండుగ” అని అన్నారు. (బుఖారీ: 454, ముస్లిం: 892) 

సహీ ముస్లిం లోని మరో ఉల్లేఖనంలో, ఆయేషా (రదియల్లాహు అన్హా) ఇలా వివరించారు:

“దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘మినా’ లో వున్న రోజుల్లో అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) ఆయన వద్దకు వచ్చారు. ఆ సమయంలో ఇద్దరు యువతులు డప్పు వాయిస్తూ పాడుతున్నారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దుప్పటి కప్పుకొని నడుంవాల్చి ఉన్నారు. అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) (ఆ యువతులను) కోపగించుకున్నారు. దీనితో, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన ముఖాన్ని దుప్పటి నుంచి బయటకు తీసి – ఓ అబూబక్ర్ ! వారిని వదిలి పెట్టండి (అంటే పాడుకోనివ్వండి), ఎందు కంటే ఈ రోజులు పండుగ రోజులు అని హితవు పలికారు. 

అలాగే, ఆయెషా (రదియల్లాహు అన్హా) ఇలా వివరించారు: 

“పండుగ రోజు కొందరు నల్ల జాతీయులు మస్జిద్ కు వచ్చారు మరియు (యుద్ధానికి ఉపయోగించే) ఆయుధాలతో ఆటను ప్రదర్శించ సాగారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నా కుటీరం యొక్క ద్వారం వద్ద కొచ్చి స్వయంగా దీనిని వీక్షిస్తూ నన్ను కూడా పిలిచారు. నేను రాగానే ఆయన తన దుప్పటిని ద్వారానికి అడ్డుగా పెట్టారు. తద్వారా నేను పరదాలో వుంటూ వారి ఆటను వీక్షించవచ్చు అని. ఇలా నేను ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) భుజంపై నా తలపెట్టి వారి ఆటను వీక్షించాను. తదుపరి నేను అలసిపోవడం చూసి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) నాతో ఇక చాలా? అని అడిగారు. నేను అవును అని అన్నాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) – సరే, నువ్వు లోపలికి వెళ్ళిపో అని అన్నారు. (బుఖారీ: 454, ముస్లిం: 892) 

ఈ హదీసుల ద్వారా తెలిసిందేమిటంటే పండుగ రోజుల్లో వినోదం ధర్మసమ్మతమే. కానీ వినోదం పేరుతో సంగీతం, పాటలు వినడం, టి.వి.లలో సినిమా హాళ్ళలో సినిమాలు, నాటకాలు చూడడం మాత్రం సరైనది కాదు. 

ఎందుకంటే పాటలు మరియు సంగీత వాయిద్యాలు అన్నీ నిషేధం. ఖాళీ సమయాన్ని ఇలాంటి విషయాల్లో గడపడం మహాపాపం. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. 

وَمِنَ النَّاسِ مَن يَشْتَرِي لَهْوَ الْحَدِيثِ لِيُضِلَّ عَن سَبِيلِ اللَّهِ بِغَيْرِ عِلْمٍ وَيَتَّخِذَهَا هُزُوًا ۚ أُولَٰئِكَ لَهُمْ عَذَابٌ مُّهِينٌ وَإِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا وَلَّىٰ مُسْتَكْبِرًا كَأَن لَّمْ يَسْمَعْهَا كَأَنَّ فِي أُذُنَيْهِ وَقْرًا ۖ فَبَشِّرْهُ بِعَذَابٍ أَلِيمٍ

జ్ఞానంతో నిమిత్తం లేకుండానే ప్రజలను అల్లాహ్ మార్గం నుంచి తప్పించడానికి, దాన్ని వేళాకోళం చేయడానికి మనసును వశీకరించే విషయాలను కొనుగోలు చేసేవాడు కూడా మనుషుల్లో వున్నాడు. పరాభవం పాలు చేసే శిక్ష వున్నది ఇలాంటి వారి కోసమే. వాడి ముందు మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు వాడు అహంకారంతో, తాను వాటిని అసలు విననే లేదన్నట్లుగా, తన రెండు చెవులలోనూ చెవుడు వున్నట్లుగా ముఖం త్రిప్పుకొని పోతాడు. కాబట్టి నువ్వు వాడికి వ్యధా భరితమైన శిక్ష యొక్క శుభవార్తను వినిపించు.” (లుఖ్మాన్ 31: 6-7) 

ఈ ఆయతులో ‘లహ్వల్ హదీస్’ అంటే పాటలు మరియు సంగీతం అని అర్ధం. ఎంతో మంది సహాబాలు దీని అర్ధాన్ని ఇలాగే వివరించారు. అబ్దుల్లా బిన్ మస్ ఊ ద్ (రదియల్లాహు అన్హు) అయితే ప్రయాణం చేసి మరీ ‘లహ్వల్ హదీసు’ అంటే పాటలు అని అర్ధం అని అన్నారు. 

ఇక ఎవరైనా, పాటలు వింటూ, వినిపిస్తూ, సంగీత, నాట్య కార్యక్రమాలలో పాలుపంచుకుంటాడో లేదా ఇంట్లో కూర్చొని ఈ కార్యక్రమాలను వీక్షిస్తుంటాడో అలాంటి వ్యక్తికి ఈ ఆయతులో వివరించనట్లు వ్యధా భరితమైన శిక్ష వుంది. వల్ ఇయాజ్ బిల్లాహ్! 

అలాగే, అబూ మాలిక్ అష్రీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

నా అనుచర సమాజంలోని కొందరు తప్పకుండా మద్యపానం చేస్తారు. మద్యం పేరును మార్చుకుంటారు. వారి తలల వద్ద సంగీత వాయిద్యాలు వాయించబడతాయి, పాటలు పాడే యువతులు పాడుతూ వుంటారు. అల్లాహ్ వారిని భూమిలోకి దిగత్రొక్కుతాడు మరియు వీరిలో ఎంతో మందిని కోతులు గానూ, పందులుగానూ చేసేస్తాడు.” (ఇబ్నె మాజ: 4020, సహీ – అల్బానీ) 

ఈ హదీసులో- నాట్యం మరియు ఇతర కార్యక్రమాలలో పాలుపంచుకునే వారికి లేదా వీటిని టి.వి., కంప్యూటర్లలో వీక్షించే వారికి స్పష్టమైన హెచ్చరిక వుంది. 

అబూ ఆమీర్ లేదా అబూ మాలిక్ అష్  అరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “నిశ్చయంగా నా ఉమ్మత్ (అనుచర సమాజం) లో – వ్యభిచారం, సిల్కు వస్త్రాలు, మద్యం మరియు సంగీతాన్ని హలాల్ (ధర్మసమ్మతం) అని భావించేవారు వస్తారు”. (బుఖారీ: 5590) 

ఈ హదీసులో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) – ఈ నాలుగు విషయాలను హలాల్ చేసుకొనే వారు వస్తారని భవిష్యవాణి చేశారు. వాస్తవానికి ఈ నాలుగు విషయాలు ఇస్లాంలో హరామ్ (నిషేధం). 

ఈ రోజుల్లో వీటిని హలాల్ గా చేసుకున్న వారు ఎంతో మంది వున్నారు. ఇక పాటల విషయానికొస్తే దీనిని పాపకార్యమని అనుకోక పోవడమే కాకుండా, నేటి సోకాల్డ్ నాగరికులు దీని ధర్మయుక్తత (హలాల్) పై ఫత్వాలు (ధార్మిక తీర్పులు) కూడా జారీ చేసేస్తారు. ఏ ఆధారమూ లేకుండా కేవలం మనుష్యుల అభిరుచులు మరియు తమ కోరికలను పూర్తి చేయడానికి వారిలా చేస్తారు. 

అంతే కాక, దీని కోసం వీరు – కొందరు విద్యావంతుల బలహీన ప్రవచనాలను ఆసరాగా తీసుకొని, ఇబ్నె హజమ్ ను గ్రుడ్డిగా అనుసరిస్తూ సహీ బుఖారీ లోని ఈ హదీసును బలహీనమైనదని నిరూపించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. 

మరి చూడబోతే, పాటలు మరియు నాట్యం హరాం అన్న విషయంలో ఇమాములందరూ ఏకాభిప్రాయం కలిగి వున్నారు. వీటి నిషేధం గురించి మేము వివరించిన ఆధారాలు ఒక బుద్ధిమంతునికి సరిపోతాయి. వీటితో పాటు మరో ఆధారం మీ ముందు వుంచుతాను. దీని ప్రకారం డోలు వగైరా॥లు నిషేధించబడ్డాయి అని స్పష్టంగా తెలుస్తుంది. 

అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు. 

నిశ్చయంగా అల్లాహ్ మీపై మద్యం, జూదం, డోలు ను నిషేధం చేశాడు, ఆయన ఇలా కూడా సెలవిచ్చారు – మత్తు కలిగించే ప్రతి వస్తువూ హరామ్“. (అబూదావూద్: 3696, సహీ – అల్బానీ) 

ఈ స్పష్టమైన ఆధారాలతో, ఎవరి మనసులోనూ ఏ విధమైన అనుమానం ఇక మిగిలి వుండకూడదు. అందరూ – పాటలు మరియు సంగీతం హరామ్ (నిషేధం) అని గట్టిగా నమ్మాలి. కాని దురదృష్టవశాత్తూ నేడు ఆ సోకాల్డ్ నాగరికుల ఫత్వాలనూ ఆధారంగా చేసుకొని సంగీతాన్ని కొందరు – మనస్సును సంతృప్తి పరిచే, ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకొనే సాధనంగా భావిస్తు న్నారు. మరిచూడబోతే, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) – సంగీత వాయిద్యాలు వ్యాపించినప్పుడు, పాటలు సర్వ సాధారణమై పోయినప్పుడు, మద్యపానాన్ని హలాల్గా భావించినప్పుడు అల్లాహ్ యొక్క వ్యధాభరితమైన శిక్ష అవతరిస్తుందని భవిష్యవాణి చేసి వున్నారు. 

సహల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: 

(ప్రళయానికి ముందు) ఆఖరి కాలంలో జనాలను భూమిలోకి దిగ త్రొక్క బడవేయడం జరుగుతుంది. వారిపై రాళ్ళ వర్షం కురిపించ బడుతుంది, వారి స్వరూపాలు మార్చివేయబడతాయి.” “ఇలా ఎప్పుడు జరుగుతుంది?” అని ఆయనతో అడగబడింది. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ – “సంగీత వాయిద్యాలు వ్యాపించబడినప్పుడు, పాటలు పాడే యువతులు సర్వసాధారణమై పోయినపుడు, మద్యాన్ని హలాల్ గా భావించినపుడు” అని అన్నారు. (సహీఉల్ జామె లిల్ అల్బానీ: 3665)

ఇస్లామీయ సోదరులారా! 

పాటలూ, వాయిద్యం – ఇవి ఎలా సరైనవి కాగలగుతాయి? దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వీటిని ‘శపించబడ్డ విషయాలు’గా ఖరారు చేశారు. 

అనస్ (రజి అల్లాహు అన్ను) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు. 

రెండు శబ్దాలు ఇహలోకంలోనూ, పరలోకం లోనూ శపించబడ్డాయి. సంతోషపడే సమయంలో పాటల శబ్దం మరియు దుఃఖ సమయంలో (గొంతు చించుకొని) ఏడిచే శబ్దం.” (సహీ ఉల్ జామె లిల్ అల్బానీ: 3695) 

అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ప్రకారం “పాట కపటత్వాన్ని కలిగిస్తుంది. ‘నీరు పంటను మొలకెత్తించినట్లే, పాట కపటత్వాన్ని మొలకెత్తిస్తుంది.’ 

చెప్పొచ్చే సారాంశం ఏమిటంటే పండుగ రోజుల్లో తప్పకుండా ఆనందాన్ని వ్యక్తం చేయండి. కానీ మేము వివరించిన ఆధారాలను దృష్టిలో వుంచుకొని పాటలు, సంగీతం వంటి విషయాలకు దూరంగా వుండడం ఎంతైనా అవసరం. 

పండుగ రోజుల్లో చేయబడే కొన్ని చెడు కార్యాలు 

ఇస్లామీయ సోదరులారా! 

పండుగ దినాలలో ప్రత్యేకించి కొన్ని చెడులు కానవస్తాయి. వాటి గురించి కూడా వివరించడం ఎంతైనా అవసరం. ఆ చెడు కార్యాలలో కొన్ని ఇవి: 

1. వస్త్రాలను చీల మండ క్రింది వరకు వ్రేలాడదీయడం, గర్వం, గొప్ప తనాన్ని ప్రదర్శించడం. 

పండుగ రోజుల్లో ఎంతో మంది ధరించే వస్త్రాలు చీలమండ క్రింది వరకు వ్రేలాడుతూ వుంటాయి. మరి చూడబోతే, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దీని గురించి ఇలా సెలవిచ్చి వున్నారు: 

మూడు రకాల వ్యక్తులతో అల్లాహ్ ప్రళయం నాడు ఏమాత్రం సంభాషించడు, వారి వైపు కన్నెత్తి కూడా చూడడు, వారిని పరిశుద్ధ పరచడు. వారి కోసం వ్యధాభరితమైన శిక్ష వుంటుంది. ” ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాటను మూడు సార్లు పలికారు. 

అబూజర్ (రదియల్లాహు అన్హు) – నిశ్చయంగా వారు పరాభవం పాలు చేయబడి, ఎంతగానో నష్టపోతారు. ఓ దైవ ప్రవక్తా! వాళ్ళు ఎవరు? అని అడిగారు. 

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ – “తన లుంగీ/ప్యాంట్ ని క్రిందికి వ్రేలాడదీసేవాడు, సహాయం చేసి దెప్పిపొడిచేవాడు, అసత్య ప్రమాణం చేసి (సరుకులు) అమ్మేవాడు” అని అన్నారు. (ముస్లిం: 106) 

అబూ హురైరా (రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

చీలమండ క్రింద వుండే వస్త్రం నరకాగ్ని లో వుంటుంది.” (బుఖారీ: 5787) 

ఈ రెండు హదీసుల ద్వారా తెలిసిందేమిటంటే – వస్త్రాలను చీలమండ క్రిందికి వ్రేలాడదీయడం హరామ్ మరియు మహాపాపం. 

అందుకే ఏ వస్త్రమైనా చీలమండ క్రిందికి వ్రేలాడదీయబడి వుంటే – అది షల్వార్ దైనా, దుప్పటి అయినా, పైజామా దైనా, ప్యాంటు దైనా, (లుంగీ దైనా), దానిని చీలమండపై వరకే వుంచాలి. దీనితో పాటు గర్వం కూడా కలిగి వుంటే అలాంటప్పుడు ఇది మరింత పెద్ద పాపకార్యం అవుతుంది. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

ఒక వ్యక్తి తన లుంగీని (క్రింది వరకు వ్రేలాడదీసి) ఈడ్చుతున్నాడు. అల్లాహ్ అతన్ని భూమి లోకి దిగత్రొక్కాడు. ఇలా అతను ప్రళయం వరకు భూగర్భంలోకి పోతూనే వుంటాడు.” (బుఖారీ: 5790) 

మరో ఉల్లేఖనం లో ఈ హదీసు పదాలు ఇలా వున్నాయి: 

ఒక వ్యక్తి తన పొడుగాటి వెంట్రుకలను దువ్వుకొని, అందమైన వస్త్రాలు ధరించి, నిక్కుతూ వెళుతూ గర్వాతిశయానికి లోనై వున్నాడు. ఈ తరుణంలోనే అకస్మాత్తుగా అల్లాహ్ అతన్ని భూమిలోకి దిగత్రొక్కాడు. ఇలా అతను ప్రళయం వరకు భూ గర్భంలోకి పోతూనే వుంటాడు.” (బుఖారీ:5789, ముస్లిం: 2088) 

మరి చూడబోతే, అల్లాహ్ ఇలా సెలవిచ్చి ఉన్నాడు: 

وَلَا تُصَعِّرْ خَدَّكَ لِلنَّاسِ وَلَا تَمْشِ فِي الْأَرْضِ مَرَحًا ۖ إِنَّ اللَّهَ لَا يُحِبُّ كُلَّ مُخْتَالٍ فَخُورٍ

జనుల ముందు (గర్వంతో మొహం తిప్పుకొని మాట్లాడకు, భూమిపై నిక్కుతూ నడవకు. ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్ డాబులు చెప్పుకునే గర్విష్టిని ఇష్టపడడు.” (లుఖ్మాన్ 31: 18) 

“గర్వం” ఎంత పెద్ద అపరాధమంటే – ఒకవేళ ఎవరి మనసులోనైనా ఆవగింజంత గర్వం వున్నా అతను గనక తౌబా చేయకుండా మరణిస్తే స్వర్గంలోకి ప్రవేశించలేడు. 

దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: 

హృదయంలో ఆవగింజంత గర్వం వున్నా, అవ్యక్తి స్వర్గంలోకి ప్రవేశించలేడు.” దీనిపై ఓవ్యక్తి – ఓ దైవ ప్రవక్తా! నిశ్చయంగా ఒక వ్యక్తి తన బట్టలు, బూట్లు అందంగా వుండాలని కోరుకుంటాడు. (మరి ఇది కూడా గర్వానికి సూచనేనా?) అని అడిగాడు. 

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ – “నిశ్చయంగా అల్లాహ్ సౌందర్యవంతుడు, సౌందర్యాన్ని ఇష్టపడతాడు. (వాస్తవానికి) గర్వం అంటే సత్యాన్ని త్రోసిపుచ్చడం మరియు ఇతరులను అల్పులుగా భావించడం” అని వివరించారు.  (ముస్లిం: 91) 

అందుకే, పండుగ దినాల ఆనందోత్సాహాలలో డాబులు, గర్వం మిళితం కాకుడదు. పైగా, ప్రజలతో చిరునవ్వుతో, వినయ విధేయతలతో కలవాలి మరియు ఇంటివారితో, బంధువులతో, మిత్రులతో మన ప్రేమను, ఆనందాన్ని పంచుకోవాలి. 

2. గడ్డం గొరికించు కోవడం లేదా దానిని చిన్నదిగా చేసుకోవడం. 

ఎంతో మంది సాధారణంగా గడ్డాన్ని గొరికించుకోవడమో లేదా దానిని చిన్నదిగా కత్తిరించుకోవడమో చేస్తూ వుంటారు. పండుగ రోజుల్లో అయితే దీనిని ప్రత్యేకించి చేస్తూ వుంటారు. కానీ, వాస్తవానికి ఇలా చేయడం హరామ్, 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: 

మీరు ముష్రిక్కులను (బహు దైవారాధకులు) వ్యతిరేకిస్తూ వుండండి, గడ్డాలను పెంచండి మరియు మీసాన్ని కత్తిరించండి.” (బుఖారీ: 5892, 5893, ముస్లిం: 259) 

మరో ఉల్లేఖనంలో ఇలా సెలవిచ్చారు: 

మీరు మీసాన్ని కత్తిరించండి, గడ్డాన్ని పొడిగించండి, అగ్ని పూజారులను వ్యతిరేకించండి.” (ముస్లిం: 260) 

కానీ, నేడు చాలా మంది ముస్లిములు, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ఈ ఆదేశాలకు పూర్తి విరుద్ధంగా మీసాలను పెద్దవిగా చేసి గడ్డాన్ని పూర్తిగా గొరికించు కోవడమో లేదా చిన్నగా కత్తిరించుకోవడమో చేస్తున్నారు. 

ఇలా వారు ముష్రిక్కులను , అగ్ని పూజారులకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి వాళ్ళను వ్యతిరేకించమని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆజ్ఞాపించి వున్నారు. 

3. పరాయి స్త్రీలతో కరచాలనం చేయడం 

ఎంతో మంది, ప్రత్యేకించి పండుగ రోజుల్లో ఇతరుల ఇళ్ళకు వెళ్ళినప్పుడు అక్కడి పరాయి స్త్రీలతో కరచాలనం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతారు. మరి చూడబోతే, మన ధర్మం అపరిచిత (పరాయి) స్త్రీలతో కరచాలనం చేయడానికి అనుమతించదు. 

మాఖిల్ బిన్ యసార్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

మీలో ఏ వ్యక్తి కైనా అతని తలపై ఇనుప సూదితో కొడుతూ వుంటే- ఇది అతనికి – తనకు ధర్మ సమ్మతం కాని స్త్రీని ముట్టుకోవడం కన్నా మేలైనది.” (అస్సహీహ: 226) 

అందుకే, మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్త్రీలతో ‘ బైత్’ (ప్రమాణం) తీసుకున్నప్పుడు కేవలం నోటితో తీసుకున్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏ స్త్రీతోనూ కరచాలనం చేయలేదు. (ముస్లిం: 1866) 

4. పరాయి స్త్రీలతో ఏకాంతంలో సంభాషించడం. 

ప్రత్యేకించి పండుగ రోజుల్లో ఎంతో మంది పరాయి స్త్రీలతో ఏకాంతంలో సంభాషిస్తూ వుంటారు. కానీ, మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివ సల్లం) దీనిని వారించి వున్నారు. 

ఉఖ్బా బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

మీరు (పరాయి) స్త్రీల వద్దకు వెళ్ళడం నుండి దూరంగా వుండండి.” దీనిపై ఒక అన్సారీ – ఓ దైవ ప్రవక్తా ! మరి మీరు భర్త సోదరుని (మరిది) వద్దకు వెళ్ళడం గురించి ఏమంటారు? అని అడిగాడు. 

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)- “మరిది అయితే మృత్యువు (లాంటి వాడు)” అని వివరించారు. (బుఖారీ: 5233, ముస్లిం: 2083) 

ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

మీలో ఏ వ్యక్తి కూడా ఇతర స్త్రీతో ఏకాంతంలో సంభాషించకండి. ఒకవేళ ఆమెతో పాటు ఎవరైనా ‘మహ్రమ్’ వుంటే అది వేరే విషయం. అలాగే ఏ స్త్రీ అయినా ‘మహ్రమ్’ లేకుండా ప్రయాణం చేయకూడదు.” (బుఖారీ: 2862, ముస్లిం:1341) 

5. స్త్రీలు పరదా (బురఖా) లేకుండా తిరగడం. 

ప్రత్యేకించి పండుగ రోజుల్లో ఎంతో మంది స్త్రీలు పరదా లేకుండా బయటికొస్తారు. అందంగా సింగారించుకుని బజార్లలో, మార్కెట్లలో, పార్కులలో తిరుగుతూ ఎంతో మందిని పరీక్షకు గురిచేస్తారు. మరి చూడబోతే, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దీని నుండి గట్టిగా వారించారు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

మీరు మీ ఇండ్లల్లోనే ఆగి వుండండి. పూర్వపు ఆజ్ఞాన కాలంలో మాదిరిగా మీ సింగారాన్ని చూపిస్తూ తిరగకండి.” (అహ్ జాబ్ :33) 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

స్త్రీ – సతర్ (దాచిపెట్టే వస్తువు) లాంటిది. అందుకే ఆమె ఇంటినుండి బయలుదేరినప్పుడు షైతాను ఆమెను కనిపెడుతూ వుంటాడు. ఆమె తన ఇంట్లో వున్నప్పుడు అల్లాహ్ కారుణ్యానికి అత్యంత సమీపంలో వుంటుంది.” (ఇబ్నెహిబ్బాన్: 5599, తిర్మిజీ: 1773, మిష్కాత్: 3109) 

పరదా పాటించకుండా, పలుచటి వస్త్రాలు ధరించి ఇండ్ల నుండి బయటి కొచ్చే స్త్రీలను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) – ‘వారు స్వర్గంలో ప్రవేశించలేరు’ అని గట్టిగా హెచ్చరించారు. 

అబూ హురైరా (రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

రెండు రకాల నరకవాసులను నేను చూడలేదు. అందులో ఒకరు ఎవరంటే ఆవుల తోకల్లాంటి కొరడాలతో ప్రజలను గెదిమే వారు. ఇక రెండవ వారు ఎవరంటే – వస్త్రాలు ధరించినప్పటికీ నగ్నంగా కనబడే స్త్రీలు. ప్రజల మనస్సులను తమవైపుకు ఆకర్షింపజేస్తూ, గర్వంతో నిక్కుతూ నడుస్తారు. వారి శిరస్సులు ఒంటెల మూపురము లాగా ఒకవైపుకు వంగి వుంటాయి. ఇలాంటి స్త్రీలు స్వర్గంలోకి ప్రవేశించలేరు, స్వర్గపు సువాసనను సైతం పొందలేరు. వాస్తవానికి స్వర్గపు సువాసన చాలా దూరం నుండి వస్తూ వుంటుంది.” (ముస్లిం: 2128) 

అలాగే, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా కూడా సెలవిచ్చారు: 

ఏ స్త్రీ అయినా తన సువాసనను అనుభవింప జేయాలన్న ఉద్దేశ్యంతో కొందరి దగ్గరి నుంచి వెళితే, అలాంటి స్త్రీ అశ్లీల (చెడు నడతగల) స్త్రీ.”

6. బంధువులు, బీదవారి హక్కులను దృష్టిలో వుంచుకోవడం. 

పండుగ రోజుల్లో ఎంతో మంది బాగా తింటారు, అందమైన వస్త్రాలు ధరిస్తారు. తమ సంతోషాన్ని వ్యక్తం కూడా చేస్తారు. కానీ తమ బంధువులనూ, బీదవారిని మరిచిపోతారు. కానీ ఇస్లాం మనకు మన సంతోషాలలో బంధువులనూ, బీదవారిని కూడా చేర్చడాన్ని ప్రోత్సహిస్తుంది. 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

మీరు మీ కోసం ఇష్టపడేదే, మీ సోదరుని కోసం కూడా ఇష్టపడనంత వరకు (పరిపూర్ణ) విశ్వాసులు కాలేరు. ” (బుఖారీ: 13, ముస్లిం: 45) 

బంధుత్వాన్ని నెరవేర్చటం గురించి, అనస్ (రజి అల్లాహు అన్ను) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

ఏ వ్యక్తి అయినా తన ఉపాధిలో వృద్ధి మరియు దాని అంతం (మరణం)లో ఆలస్యం కావాలనుకుంటే, అతను బంధుత్వాన్ని నెరవేర్చాలి.” (బుఖారీ: 5986, ముస్లిం: 2557) 

బంధుత్వాన్ని నెరవేర్చటం గురించి చాలా మంది ఏమనుకుంటారంటే ఒకవేళ వారి బంధువులు దానిని నెరవేర్చితే తాము కూడా దానిని నెరవేర్చాలి అని. కానీ, ఈ దృక్పథం సరైనది కాదు. 

బంధుత్వాన్ని నెరవేర్చటం యొక్క సరైన దృక్పథం ఏమిటంటే – ఒకవేళ బంధువు బంధుత్వాన్ని నెరవేర్చక పోయినా తను మాత్రం దానిని నెరవేర్చాలి. ఒకవేళ వారు చెడుగా ప్రవర్తిస్తే వారితో మంచిగా ప్రవర్తించాలి. ఒకవేళ వారు ఇవ్వక పోయినా వారికి ఇస్తూ వుండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే – బంధువు, బంధుత్వాన్ని నెరవేర్చినా, నెరవేర్చక పోయినా, రెండు పరిస్థితుల్లోనూ మనిషి తన శాయశక్తులా తన బంధువుతో బంధుత్వాన్ని నెరవేరుస్తూ వుండాలి. 

అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

బంధుత్వాన్ని నెరవేర్చేవాడంటే – ఒకరు నెరవేర్చిన దానికి బదులుగా నెరవేర్చేవాడు కాదు. పైగా బంధుత్వాన్ని నెరవేర్చే వాడంటే – ఒకరు నెరవేర్చక పోయినా తను మాత్రం బంధుత్వాన్ని నెరవేర్చుతూ వుండేవాడు“. (బుఖారీ: 5991) 

అందుకే, పండుగ సంతోషాలలో బంధువులను, బీదవారిని కూడా చేర్చుతూ వుండాలి. 

ఇస్లామీయ సోదరులారా! 

ఆఖరుగా మీకు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ఒక సున్నత్ను గుర్తుకు తెప్పిస్తాం. అదేమిటంటే – పండుగ నమాజు అనంతరం దారిని మార్చి తిరిగి వెళ్ళడం. 

 అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం: 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పండుగ రోజు (నమాజు కోసం) బయటికొచ్చినప్పుడు ఒక దారిలో వెళ్ళేవారు, తదుపరి (నమాజు అనంతరం) వేరే దారిలో తిరిగి వచ్చేవారు.” (తిర్మిజీ: 541, సహీ-అల్బానీ) 

అందుకే, పండుగ నమాజు కోసం వచ్చిన దారిలో కాకుండా, తిరిగి వెళ్ళేటప్పుడు వేరే దారిలో వెళ్ళాలి. ఖుర్బానీ పశువును జిబహ్ చెయ్యాలి. 

అల్లాహ్ మనందరి ఖుర్బానీలను స్వీకరించుగాక! మరియు దానిని (పుణ్య ఫలాన్ని) మనకోసం పరలోకపు నిల్వగా చేయుగాక! ఆమీన్! 

ఈ ఖుత్బా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్