[డౌన్ లోడ్ PDF]
ఖుత్బా యందలి ముఖ్యాంశాలు
1. జిల్ హిజ్జ (మొదటి) పదిరోజుల ప్రాధాన్యత.
2. జిల్ హిజ్జ (మొదటి) పదిరోజుల మహత్యాలు.
3. జిల్ హిజ్జ (మొదటి) పదిరోజులలో అభిలషణీయమైన (ముస్తహబ్) ఆచరణలు.
4. ఖుర్బానీ ప్రాధాన్యత.
ఇస్లామీయ సోదరులారా!
అల్లాహ్ ప్రతి వ్యక్తినీ తన అరాధన కొరకే సృష్టించాడు కాబట్టి అతను కూడా ఆయన (అల్లాహ్) ఇష్టాయిష్టాలను లోబడి జీవితం గడపాలి మరియు ఆయనను ఆరాధిస్తూ ఎల్లప్పుడూ ఆయన సాన్నిధ్యం పొందడానికి ప్రయత్నిస్తూ వుండాలి. అల్లాహ్ ఎన్నో మహత్తర అవకాశాలను (మానవుల కోసం) కల్పించాడు. కనుక మానవులంతా ఆ మహత్తర అవకాశాలను సద్వినియోగం చేసుకొని, ఆ వ్యవధుల్లో ఆరాధన కోసం నడుం బిగించి, వివిధ సత్కార్యాలలో ఒకరినొకరు మించిపోవడానికి ప్రయత్నించాలి.
ఆ శుభకర అవకాశాల్లో ఒకటి జిల్ హిజ్జ మాసపు(మొదటి) పదిరోజులు. ఈ దినాలను అత్యుత్తమ దినాలని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సాక్ష్యమిచ్చారు మరియు వీటిలో సత్కార్యాలు చేయడం గురించి గట్టిగా తాకీదు చేశారు.
అల్లాహ్, ఖుర్ఆన్లో ఒకచోట ఈ రోజుల మీద ప్రమాణం చేశాడు.
وَالْفَجْرِ وَلَيَالٍ عَشْرٍ
“ఉషోదయం సాక్షిగా! పది రాత్రుల సాక్షిగా!” (ఫజ్ర్ 89 :1-2)
ఎంతో మంది విశ్లేషకుల దృష్టిలో పది రాత్రులంటే, జిల్ హిజ్జ మాసపు మొదటి పది రాత్రులని అర్ధం. అల్లామా ఇబ్నె కసీర్ (రహిమహుల్లాహ్) కూడా తన తఫ్సీర్ (విశ్లేషణ) లో ఈ అభిప్రాయాన్నే సరైనదిగా ఖరారు చేశారు.
అల్లాహ్ వీటి మీద ప్రమాణం చేయడం వీటి ఔన్నత్యానికీ, మహత్యానికి పెద్ద నిదర్శనం. ఎందుకంటే మహోన్నతుడైన అల్లాహ్ ఉన్నతమైన వాటిపైనే ప్రమాణం చేస్తాడు. అందుకే, అల్లాహ్ దాసులు కూడా ఈ రోజుల్లో సత్కార్యాల కోసం వీలైనంత ఎక్కువగా శ్రమించాలి. వీటి రాక తమ కోసం మేలైనదిగా, గౌరవమైనదిగా భావించాలి.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
وَالَّذِينَ جَاهَدُوا فِينَا لَنَهْدِيَنَّهُمْ سُبُلَنَا ۚ وَإِنَّ اللَّهَ لَمَعَ الْمُحْسِنِينَ
“ఎవరయితే మా మార్గంలో పాటుపడతారో, వారికి మేము తప్పకుండా మా మార్గాలు చూపుతాము. నిశ్చయంగా అల్లాహ్ సద్వర్తనులకు తోడుగా వుంటాడు.” (అన్కబూత్ 29:69)
అల్లాహ్ ను వేడుకొనేదేమిటంటే – ఆయన మనందరికీ ఈ దినాలలో వీలైనంత ఎక్కువగా ఆరాధించి వీటిద్వారా ప్రయోజనం పొందే సద్బుద్ధిని ప్రసాదించుగాక!
జిల్ హిజ్జ (మొదటి) పదిరోజుల మహత్యాలు
1. ప్రాపంచిక దినాలన్నింటిలోనూ ఈ దినాలు ఎంతో శ్రేష్టమైనవి.
జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ప్రాపంచిక దినాలన్నింటిలోనూ పది దినాలు (జిల్ హిజ్జ 10 దినాలు) ఎంతో శ్రేష్టమైనవి“.ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను – ఒక వేళ ఇన్ని రోజులే (10) అల్లాహ్ మార్గంలో జిహాద్ చేస్తూ గడిపితే, అవి కూడా వీటికి సమానం కాలేవా? అని అడగబడింది. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ – సమానం కాలేవు, కేవలం వీర మరణం పొందితే తప్ప అని వివరించారు. (బజ్జార్, ఇబ్నె హిబ్బాన్, సహీ అత్ తర్గీబ్ వ తర్హీబ్ :115)
అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“సత్కార్యాల కోసం ఈరోజులు (జిల్ హిజ్జ మొదటి పది రోజులు) అల్లాహ్ వద్ద ఎంతో ప్రియమైనవి.”
సహాబాలు ఇలా అడిగారు: ఓ దైవ ప్రవక్తా! అల్లాహ్ మార్గంలో జిహాద్ చేయడం కన్నా కూడానా? (జిహాద్ కన్నా ప్రియమైనవా?)
ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం): “అల్లాహ్ మార్గంలో జిహాద్ చేయడం కూడా అంత ప్రియమైనది కాదు. కేవలం, మనిషి తన ధనప్రాణాలతో బయలుదేరి తదుపరి దేనితోనూ తిరిగి రాకపోతే తప్ప” అని వివరించారు.
అంటే – అల్లాహ్ మార్గంలో తన సంపదనంతా ఖర్చుచేసి, వీర మరణం పొందే వ్యక్తి అన్నమాట. నిశ్చయంగా అతని ఆచరణ ప్రియమైనదే. అది తప్ప మిగతా సత్కార్యాలేవీ ఈ రోజుల కన్నా అల్లాహ్ కు ప్రియమైనవి కావు.
మరో ఉల్లేఖనంలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఖుర్బానీ పది దినాలలో చేయబడే సత్కార్యం (ఎంత శ్రేష్టమైనదంటే) – అల్లాహ్ వద్ద దాని కన్నా ఎక్కువ పవిత్రత, పుణ్యఫలం కలిగిన ఆచరణ ఏదీ లేదు. ”
“అల్లాహ్ మార్గంలో జిహాద్ చేయడం కూడానా? అని అడగబడింది. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) – అల్లాహ్ మార్గంలో జిహాద్ చేయడం కూడా లేదు. కేవలం, ఒక వ్యక్తి తన ధనప్రాణాలతో బయలుదేరి, ఆ రెండింటినీ త్యాగం చేస్తే తప్ప అని వివరించారు.
హదీసు ఉల్లేఖకులు ఇలా అంటున్నారు – “ఈ హదీసును ఆధారంగా చేసుకొని సయీద్ బిన్ జుబైర్ రహిమ హుల్లాహ్ జిల్ హిజ్జ మొదటి పదిరోజులు ప్రారంభం కాగానే ఆరాధనల్లో ఎంతగా శ్రమించే వారంటే, ఇతరలకు అలా చెయ్యడం సాధ్యమయ్యేది కాదు. (సహీ అత్తర్బ్ వ తర్హిబ్ : 1148)
అందుకే, మనం కూడా సలఫుస్సాలిహీన్ ల ఆచరణ రీతిని స్వీకరించి ఈ రోజుల్లో వీలైనంత ఎక్కువగా ఆరాధించాలి. ఎందుకంటే, ఈ హదీసు ప్రకారం, ఈ రోజుల్లో చేయబడే సత్కార్యానికి అల్లాహ్ ఎంతగా అనుగ్రహిస్తాడో, అంతగా వేరే రోజుల్లో అనుగ్రహించడు.
2) ఈ దినాలలోనే అరాఫాత్ దినం కూడా వుంది.
అవునండీ! హజ్ యొక్క అసలు దినమైన, హజ్ యొక్క ముఖ్యాంశమైన అరాఫాత్ దినం (అరాఫాత్లో గడపడం) కూడా ఈ దినాలలోనే వస్తుంది. అరాఫాత్ వాసులందరినీ అల్లాహ్ మన్నించి, అత్యధిక మందిని నరకాగ్ని నుండి స్వేచ్ఛ ప్రసాదించబడే మహోన్నత దినం అది. ఈ కారణంతో, ఒకవేళ జిల్ హిజ్జ పదిరోజులలో, ఏ దినానికి ఏ మాత్రం ప్రత్యేకత లేకపోయినా కేవలం అరాఫాత్ దినమే ఈ దినాల మహత్యానికి సరిపోతుంది.
3) ఈ దినాల్లోనే ఖుర్బానీ దినం (యౌమున్నహర్) కూడా వుంది.
కొంత మంది విద్వాంసుల ప్రకారం ‘ఖుర్బానీ దినం’ యావత్ సం॥లోని దినాలన్నిటికన్నా శ్రేష్టమైనది. ఎందుకంటే, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“అల్లాహ్ వద్ద అన్నిటికన్నా ఘనమైన, ఉన్నతమైన దినం ఖుర్బానీ దినం (అంటే జిల్ హిజ్జ 10వ దినం), ఆ తర్వాత (మినా లో) గడిపే దినం (జిల్ హిజ్జ11వ దినం)”. (అబూదావూద్, నసాయి, సహీ – అల్బానీ)
4) ఈ దినాలలో, ప్రముఖ ఆరాధనలు ఎన్నో కలిసిపోతాయి.
అల్లామా ఇబ్నె హజర్ రహిమహూల్లాహ్ ‘ఫతహుల్ బారీ’ లో దీని గురించి ఇలా వివరించారు:
“జిల్ హిజ్జ 10 దినాలకు ‘అత్యధిక శ్రేష్టత’ వొసగబడటానికి తెలిసే కారణమేమిటంటే-ప్రముఖమైన ఆరాధనలన్నీ ఈ పది దినాలలో కలిసి పోతాయి. అవి నమాజ్, ఉపవాసం, దాన ధర్మాలు మరియు హజ్. ఈ దినాలు తప్ప మిగతా దినాలలో అవి ఇలా కలిసిపోవు.” (ఫతహుల్ బారీ: 2వ సంపుటం, 460 పేజీ)
జిల్ హిజ్జ పది దినాలలో అభిలషణీయమైన ఆచరణలు
ప్రియ సోదరులారా!
సం॥లోని మిగతా రోజులకన్నా జిల్ హిజ్ఞ పది రోజుల్లో చేయబడే సత్కార్యాలకు ఎక్కువ మహత్యం వుందన్న విషయం మీరు తెలుసుకున్నారు కాబట్టి, అల్లాహ్ ప్రసాదించిన ఈ సువర్ణావకాశాన్ని మీరు అదృష్టంగా భావించి ఈ దినాలను ప్రత్యేకంగా పాటించాలి. ఇలాంటి మహత్తర అవకాశాలు మాటి మాటికి రావు. అందుకే ఈ అవకాశాలను ఏ మాత్రం వృథా చేయకుండా, వీలైనంత ఎక్కువగా సత్కార్యాలను చేయడానికి సలఫుస్సాలిహీన్లు ఎలాగైతే ప్రయత్నించే వారో మనం కూడా ఈ దినాలలో వీలైనంత ఎక్కువగా ఆరాధించ డానికి గట్టిగా ప్రయత్నించాలి.
అబూ ఉస్మాన్ అన్నహది రహిమహుల్లాహ్ ఇలా సెలవిచ్చారు:
“సలఫుస్సాలిహీన్ పదిరోజులతో కూడుకున్న మూడు వ్యవధులను ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి గౌరవించేవారు. అవేమిటంటే – రంజాన్ మాసపు ఆఖరి పది దినాలు, జిల్ హిజ్జ మరియు ముహర్రం మాసాల మొదటి పది దినాలు.”
ఈ దినాలలో అభిలషణీయమైవుండి, ముస్లిములందరూ ప్రత్యేకంగా పాటించాల్సిన ఆచరణలు ఇవి:
1) హజ్ మరియు ఉమ్రా లను నిర్వర్తించడం.
జిల్ హిజ్జ పది దినాలలో చేయబడే సత్కార్యాలన్నిటిలో శ్రేష్టమైన ఆచరణ హజ్ మరియు ఉమ్రాలను నిర్వర్తించడం. ఎందుకంటే, అల్లాహ్, ఏ వ్యక్తి కైనా తన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) సున్నత్ ప్రకారం బైతుల్లాహ్ హజ్ మరియు ఉమ్రాలను నిర్వర్తించే సద్బుద్ధిని గనక ప్రసాదిస్తే దాని ప్రతిఫలం అల్లాహ్ వద్ద స్వర్గమే.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఒక ఉమ్రా తర్వాత మరొక ఉమ్రా, రెండింటి మధ్య జరిగే వాటికి (పాపాలకు) పరిహారం (కప్పారా), అలాగే మభ్రూర్ (స్వీకార యోగ్యమయ్యే) హజ్ కు ప్రతిఫలం స్వర్గమే.”
‘మబ్రూర్ హజ్’ అంటే-దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సున్నత్ ప్రకారం చేయబడే హజ్. అన్ని రకాల పాపాల నుండి, ఉదా॥కు ప్రదర్శనా బుద్ధిని చాటే మరియు చెడు, అనవసర మాటల నుండి పవిత్రంగా వుండి, కేవలం సత్కార్యాలతో, సత్ప్రవర్తనతో నిండివున్న హజ్.
2) ఉపవాసముండడం
ఉపవాసం కూడా సత్కార్యాలలోనిదే. అల్లాహ్ వద్ద శ్రేష్టమైన, ప్రియమైన ఆచరణలలో ఒకటి. అబూ సయీద్ ఖుద్రి (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఏ వ్యక్తి అయినా అల్లాహ్ మార్గంలో ఒక రోజు ఉపవాసం ఉంటే, దీనికి ప్రతిగా అల్లాహ్ అతని ముఖాన్ని నరకం నుండి 70 సం॥ల ప్రయాణ మంత దూరం చేస్తాడు.” (బుఖారీ: 2840, ముస్లిం 1153)
ఉపవాసానికి గల సాధారణ మహత్యం ఇది. ఇక, జిల్ హిజ్జ పది దినాలలో ఉపవాసం గురించి చెప్పాలంటే- దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) భార్యలలో ఒకరి ద్వారా ఇలా సెలవియ్యబడింది:
“దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జిల్ హిజ్జ లో మొదటి తొమ్మిది దినాలు ఉపవాసముండే వారు. అలాగే అషూరా దినం మరియు ప్రతి నెలలో మూడు దినాలు ఉపవాసం ఉండేవారు.” (అబూ దావూద్ : 2437, సహీ – అల్బానీ)
ఈ కారణంగా, జిల్ హిజ్జ మాసపు మొదటి తొమ్మిది రోజులు ఉపవాసముండడం అభిలషణీయం. ఇక ఆయెషా (రదియల్లాహు అన్హా) గారి “నేను జిల్ హిజ్జ మొదటి పదిరోజుల్లో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉపవాసముండడం ఎప్పుడూ చూడలేదు” (ముస్లిం: 1176) అన్న వచనం విషయాని కొస్తే, ఇమామ్ నవవీ దీని గురించి ఇలా వివరించారు:
ఈ హదీసు ద్వారా జిల్ హిజ్జ లోని పది దినాలలో, అంటే మొదటి తొమ్మిది దినాలలో ఉపవాసముండడం అవాంఛనీయం (మక్రూహ్) అన్న అనుమానం కలుగుంది. కానీ, విద్వాంసులు దీనిని ఇలా విశ్లేషించారు – ఈ దినాలలో ఉపవాసముండడం ఏ మాత్రం అవాంఛనీయం కాదు. పైగా ఇలా చేయడం (ఉపవాసముండడం) అన్ని రకాలుగా అభిలషణీయం (ముస్తహబ్) ఎందుకంటే, వీటి మహత్యం గురించి ఎన్నో హదీసులు ఉల్లేఖించబడ్డాయి. అంతేగాక, సహీ బుఖారీలో – ఈ రోజుల్లోని ఆచరణలు, మిగతా రోజుల్లో చేయబడే ఆచరణల కన్నా అల్లాహ్ కు ఎంతో ప్రియమైనవి – అన్న దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసు కూడా వుంది. వాస్తవం ఇదైనప్పుడు, ఆయెషా (రదియల్లాహు అన్హా) – ఈ దినాలలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపవాసం పాటించలేదు. అని అన్నారంటే, దాని అర్ధం, బహుశా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) అనారోగ్యం కారణంగా లేదా ప్రయాణం మూలంగా పాటించలేదు. ఆమె చూడకపోయినంత మాత్రాన, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ దినాలలో అసలు ఉపవాసమే పాటించలేదు అని భావించడం సరికాదు. ఆ తర్వాత ఇమామ్ నవవీ (తన వివరణ కు) ఆధారంగా, మేమింతకు ముందు వివరించిన అబూదావూద్ లోని హదీసును వివరించారు. (షరన్నవవీ – సహీ ముస్లిం: 4వ సంపుటం, 58 పేజి)
హాఫిజ్ ఇబ్నె హజర్ రహిమహుల్లాహ్ ఇలా వివరించారు:
“ఆయేషా (రదియల్లాహు అన్హా) వచనం గురించి చెప్పాలంటే, అది బహుశా ఇలా జరిగి వుండవచ్చు: అదెలా అంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కొన్ని సార్లు ఏదైనా ఆచరణ ఇష్టపడినప్పటికీ, కేవలం అది ఫర్జ్ (విధి) గావించబడుతుందేమో నన్న భయంతో త్యజించే వారు. కనుక, వీటిని కూడా (జిల్ హిజ్ఞ మొదటి తొమ్మిది దినాల ఉపవాసాలు) వాటి విధిత్వ భయంతో బహుశా వదిలిపెట్టి ఉండవచ్చు.” (ఫతహుల్ బారీ: 2వ సంపుటం, 460 పేజి)
ఆయెషా (రదియల్లాహు అన్హా) వచనాన్ని ఏవిధంగా విశ్లేషించినా (అర్ధం చేసుకున్నా), దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనం దినాలలోని ఆచరణలు, ఇతర దినాలలోని ఆచరణల కన్నా అల్లాహ్ కు ఎంతో ప్రియమైనవి – లో ఉపవాసం కూడా వచ్చేస్తుంది. గుర్తించుకోవాల్సిన విషయమేమిటంటే ఈ జిల్ హిజ్జ 10 దినాలలో అరాఫాత్ దినం ఉపవాసం గురించి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రత్యేకంగా ప్రాధాన్యతనిచ్చి, దాని మహత్యం గురించి వివరిస్తూ ఇలా సెలవిచ్చారు.
“అరాఫాత్ దినపు ఉపవాసం గురించి నాకు అల్లాహ్ పై గల నమ్మకం ఏమిటంటే అది గడిచిన మరియు రాబోయే 1 సం॥లోని పాపాలకు గాను పరిహారం (కప్పారా) అవుతుంది“. (ముస్లిం: 1162) అందుకే, జిల్ హిజ్జ 9వ తేది (అరాఫాత్ దినం) నాడు ఉపవాసముండడం సున్నత్.
3) నమాజ్ చదవడం
నమాజ్ అన్నింటికన్నా ఉన్నతమైన, మహత్యం గల ఆచరణ. అందుకే దీనిని సం॥ అంతా క్రమం తప్పకుండా మరియు సామూహికంగా నెలకొల్పడం ప్రతి ముస్లింపై విధిగా వుంది. ప్రత్యేకించి ఈ దినాలలో ఫర్జ్ నమాజులతో పాటు, వీలైనంత ఎక్కువగా నఫిల్ నమాజులను కూడా చదువుతూ వాటిని కూడా పాటించాలి. ఎందుకంటే, నవాఫిల్ (ఐచ్ఛిక ఆరాధనలు) అల్లాహ్ సాన్నిధ్యం పొందడానికి ఉత్తమ సాధనాలు.
అబూహురైరా (రదియల్లాహు అను) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు. ఏ వ్యక్తి అయినా నా మిత్రునితో శత్రుత్వం కలిగి వుంటాడో నేనతనితో యుద్ధ ప్రకటన చేస్తాను. నా దాసుడు తనపై విధి (ఫర్జ్) గా విధించబడిన వాటిని ఆచరిస్తూ నా సాన్నిధ్యాన్ని ఎక్కువగా పొందగలుగుతాడు. (అంటే ఫర్జ్ ల ద్వారా నా సాన్నిధ్యాన్ని పొందడం నా కెంతో ఇష్టం). ఇంకా ఐచ్ఛిక (నఫిల్) ఆరాధనల ద్వారా కూడా నా సాన్నిధ్యాన్ని పొందుతూ వుంటాడు. చివరికి నేను అతన్ని ప్రేమిస్తాను. నేనతన్ని ప్రేమించడం మొదలు పెట్టాక, అతను వినే చెవినై పోతాను, అతను చూసే కళ్ళయిపోతాను, అతను పట్టుకొనే చెయ్యినై పోతాను, అతను నడిచే కాళ్ళయి పోతాను (అంటే అతని శరీర అవయవాలన్నిటినీ నా విధేయతకు అనుగుణంగా మార్చుతాను) తదుపరి అతను ఏ విషయం గురించి అయినా అర్ధిస్తే, నేనతనికి అనుగ్రహిస్తాను. ఒకవేళ అతను నా శరణు కోరుకుంటే, నేనతనికి నా శరణు ప్రసాదిస్తాను.” (బుఖారీ:6502)
4) అల్లాహ్ స్మరణ (జిక్ర్) చేయడం
ఈ శుభకర దినాలలో వీలైనంత ఎక్కువగా అల్లాహ్ ను స్మరించాలి. ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“అల్లాహ్ వద్ద ఘనమైన, ఎంతో ప్రియమైన దినాలు జిల్ హిజ్జ (మొదటి) పది దినాలు. వీటికి సాటిగా మరే దినమూ లేదు. అందుకే ఈ దినాలలో మీరు వీలైనంత ఎక్కువగా “లా ఇలాహా ఇల్లల్లాహ్” “అల్లాహు అక్బర్” మరియు “అల్ హమ్దులిల్లాహ్” లను పఠిస్తూ వుండండి.” (అహ్మద్: 9వ సంపుటం, 323 పేజీ మరియు 10వ సంపుటం, 296 పేజి)
అల్లాహ్ ను స్మరించడం ద్వారా ఆయన సాన్నిధ్య భాగ్యం దొరకడం కన్నా గొప్ప ప్రయోజనం ఇంకేం వుంటుంది.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు నా దాసుడు నా గురించి ఎలా ఊహించు కుంటాడో, నేను అతని పట్ల అలాగే ప్రవర్తిస్తాను. అతను నన్ను స్మరించేటప్పుడు నేనతనితో వుంటాను. ఒకవేళ అతను నన్ను మనసులో గుర్తుకు తెచ్చుకుంటే నేను కూడా అతన్ని మనసులో గుర్తుకు తెచ్చుకుంటాను. ఒకవేళ అతను ఏదైనా సమూహంలో నన్ను గుర్తు తెచ్చుకుంటే, నేను దానికన్నా ఉ త్తమమైన సమూహంలో అతన్ని గుర్తు తెచ్చుకుంటాను. ఒకవేళ అతను జానెడంత నాపైపుకు జరిగితే, నేను ఒక చెయ్యి అంత అతని వైపుకు జరుగుతాను. ఒకవేళ అతను ఒక చెయ్యి అంత నావైపు జరిగితే, నేను రెండు చేతులంత అతని వైపుకు జరుగుతాను. ఒకవేళ అతను నడుచుకొంటూ నావైపు కొస్తే, నేను పరుగెత్తు కొంటూ అతని వైపుకు వెళ్తాను.” (బుఖారీ: 7405, ముస్లిం: 2675)
ఈ హదీసు – సామాన్యంగా చేయబడే జిక్ర్ గురించి వివరించింది. ఇక దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రత్యేకంగా సెలవిచ్చిన కలిమాల (సద్వచనాలు) విషయానికొస్తే, వాటి పఠనం ద్వారా ఎన్నో ప్రయోజనాలు వున్నాయి.
అబూమాలిక్ అష్ అరీ (రదియల్లాహు అను) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
పరిశుద్దత అనేది విశ్వాసం. ‘అల్ హమ్దులిల్లాహ్’, త్రాసును (పుణ్య ఫలంతో) నింపేస్తుంది. ‘సుబహానల్లాహ్’ మరియు ‘అల్హమ్దులిల్లాహ్’ – ఈ రెండు కలిమాలు భూమ్యాకాశాల మధ్య స్థలాన్ని (పుణ్యఫలంతో) నింపేస్తాయి…. (ముస్లిం:223)
ఈ లాభాలేకాక, ఈ కలిమాల ప్రయోజనాలు మరెన్నో వున్నాయి.
1) ఈ కలిమాలు అల్లాహ్ వద్ద అత్యంత ప్రియమైన కలిమాలు (వచనాలు).
సమురా బిన్ జున్దుబ్ (రదియల్లాహు అను) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“నాలుగు కలిమాలు అల్లాహ్ కు అత్యంత ప్రియమైనవి. వాటిలో మీరు దేనితో ప్రారంభించినా తప్పులేదు. అవి – సుబహానల్లాహి వల్హమ్దు లిల్లాహి వ లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్.” (ముస్లిం:2137)
2) ఈ కలిమాలు, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు కూడా ఎంతో ప్రియమైనవి.
అబూ హురైరా (రదియల్లాహు అను) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఒకవేళ నేను ‘సుబహానల్లాహి, వల్ హమ్దులిల్లాహి, వలాఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్’ అని పరిస్తే ఇది నాకు సూర్యుడుదయించే వస్తువులన్నింటికన్నా (భూమిలోని వస్తువులన్నింటి కన్నా ) ప్రియమైనది.” (ముస్లిం:2695)
3) స్వర్గంలో వృక్షారోపణం.
అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఇస్రా వ మేరాజ్ రాత్రి నేను ఇబ్రాహీం (అలైహిస్సలాం) ను కలవడం జరిగింది. ఆయన, నాతో – ఓ ముహమ్మద్! మీ అనుచర సమాజానికి నా సలామ్ చెప్పండి. స్వర్గపు మట్టి ఎంతో మేలైనదని, దాని నీరు ఎంతో చల్లగా వుంటుందని, దాని భూమి సమతలంగా వుంటుందని మరియు ‘సుబహానల్లాహి వల్ హమ్దు లిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్’ ల (పఠనం)తో దీనిలో వృక్షారోపణం చేయవచ్చని వారికి తెలియజేయండి.” (తిర్మిజీ:3462, సహీ – అల్బానీ)
మరో హదీసులో ఇలా వుంది:
అబూహురైరా (రదియల్లాహు అన్హు ఓసారి చెట్లు నాటుతుండగా, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అటునుండి వెళుతూ, ఆయన వద్ద కొచ్చి ఓ అబూ హురైరా! దీనికన్నా మేలైన వృక్షారోపణం గురించి నేను నీకు తెలియజేయనా? అని అన్నారు. ఆయన – తప్పకుండా ఓ దైవ ప్రవక్తా అని జవాబిచ్చారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆయనతో నువ్వు ‘సుబహానల్లాహి వల్ హమ్దులిల్లాహి వ లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్’ అని పఠిస్తూ వుండు. ప్రతి యొక్క దానికి (కలిమాకు) బదులుగా స్వర్గంలో ఒక చెట్టు నాటబడుతుంది అని వివరించారు. (ఇబ్నెమాజ:3807, సహీ – అల్బానీ)
4) అబ్దుల్లా బిన్ అమ్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఈ భూమి మీద ఏ వ్యక్తి అయినా, ‘లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, వ సుబహానల్లాహి వల్ హమ్దులిల్లాహి, వలాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్’ కలిమాలు గనక పఠిస్తే సముద్రపు నురుగుకు సమానంగా అతని పాపాలున్నప్పటికీ, అవన్నీ తుడిచి వేయబడతాయి.” (తిర్మిజీ: 3460, హసన్ – అల్బానీ)
5) చెట్టు నుండి ఎండుటాకులు రాలినట్లే, దాసుని పాపాలను రాలుస్తాయి
అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అను) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక చెట్టు వద్ద నుండి వెళ్ళసాగారు. దాని ఆకులు ఎండిపోయి ఉన్నాయి. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన (చేతిలోని) కర్రతో దానిని కొట్టగానే ఆ ఎండిన ఆకులు రాలి క్రింద పడిపోయాయి. తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“నిశ్చయంగా, అల్ హమ్దులిల్లాహి వ సుబహానల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ కలిమాలు – చెట్టు నుండి ఎండుటాకులు రాలినట్లే, దాసుని పాపాలను రాలుస్తాయి.” (తిర్మిజి:3533, హసన్ – అల్బానీ)
6) అల్లాహ్ ఈ కలిమాలను తన దాసుల కోసం ఎన్నుకున్నాడు మరియు వీటిపై ఎంతో పుణ్యఫలాన్ని వుంచాడు.
అబూ హురైరా (రదియల్లాహుఅన్హు) మరియు అబూ సయీద్ (రదియల్లాహుఅన్హు) ల కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“నిశ్చయంగా అల్లాహ్, మాటలలో – నాలిగింటిని (కలిమాలను) ఎన్ను కున్నాడు. అవి ‘సుబహానల్లాహి వల్ హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. ‘ ఏ వ్యక్తి అయినా ‘సుబహానల్లాహ్” అని పఠిస్తే అతని కోసం 20 పుణ్యాలు లిఖించబడతాయి మరియు 20 పాపాలు క్షమించబడతాయి. ఏవ్యక్తి అయినా ‘అల్లాహు అక్బర్’ అని పఠిస్తే అతని క్కూడా ఇదే దొరుకుతుంది. ఏ వ్యక్తి అయినా ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అని పరిస్తే అతని క్కూడా ఇదే దొరుకుతుంది. ఏ వ్యక్తి అయినా తన వైపు నుంచి ‘అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్’ అని పఠిస్తే అతని కోసం 30 పుణ్యాలు లిఖించబడతాయి మరియు 30 పాపాలు తుడిచి వేయబడతాయి.” (ముస్నద్ అహ్మద్, ముస్తద్రక్ హాకిమ్, సహీ అల్బానీ, సహీఉల్ జామె: 1718)
తన వైపు నుంచి ‘అల్హమ్దు లిల్లాహి రబ్బిల్ అలమీన్’ అని పలకడం అంటే – కారణమేదీ లేకుండానే ‘అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్’ పఠించడం అన్నమాట. అల్లాహ్ అనుగ్రహాలకు గాను కృతజ్ఞతలు చెప్పేటప్పుడు, ఉదా॥కు తిని త్రాగిన తర్వాత, నిద్ర నుండి మేల్కొన్న తర్వాత, దొరికే పుణ్య ఫలం కన్నా దీనికే మాత్రం (కారణమేదీ లేకుండానే పఠించినప్పుడు) ఎక్కువ పుణ్య ఫలం అతనికి లభిస్తుంది.
7) ఈ కలిమాలు కవచం లాంటవి.
అబూ హురైరా (రదియల్లాహు అను కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “మీ కవచాలను తీసుకోండి.” మేము: మా దగ్గరకి వచ్చేసిన శత్రువు నుండి రక్షణ కొరకు కవచాలా! అని అడిగాం. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం): లేదు, నరకాగ్ని నుండి రక్షణ కొరకు కవచాలు అని చెప్పి తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“మీరు ఈ కలిమాలను పఠిస్తూ వుండండి – సుబహానల్లాహి వల్ హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. ఎందుకంటే ఇవి ప్రళయం రోజు (నరకాగ్ని) నుండి విముక్తి కలిగించి (స్వర్గం వైపుకు) ముందుకు తీసుకెళ్తాయి మరియు ఇవే మిగిలి వుండే సత్కార్యాలు. ” (హాకిమ్, సహీ ఉల్ జామె: 3214) 8)
ఈ కలిమాలు అర్ష్ (అల్లాహ్ సింహాసనం) చుట్టూ తమను పఠించే వారిని స్మరించుకుంటూ ఉంటాయి.
నోమాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“అల్లాహ్ మహిమతో మీరు నేర్చుకుంటూ వుంటారు. దానిలో ఈ కలిమాలు కూడా వున్నాయి- సుబహానల్లాహి, వల్ హమ్దులిల్లాహి, వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. ఇవి అల్లాహ్ అర్ష్ చుట్టూ తిరుగుతూ వుంటాయి. ఇవి తమను పఠించే వారిని స్మరించుకొంటూ తేనెటీగలు శబ్దం చేసినట్లు శబ్దం చేస్తూ వుంటాయి. మరయితే మీలో – ఇతరులు తమను స్మరించుకోడానికి ఇష్టపడేవారు ఎవరైనా వున్నారా?” (ఇబ్నెమాజ:3089, సహీ – అల్బానీ)
9) ఈ కలిమాలలో (తస్బీహ్ లో) ప్రతి ఒక్క కలిమా ఒక సదఖా (దానం)
అబూజర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహాబాలలో కొందరు ఆయనతో ఇలా విన్నవించుకున్నారు: ఓ దైవ ప్రవక్తా! ధనవంతులు మా కన్నా ఎక్కువగా పుణ్యఫలాన్ని అర్జిస్తున్నారు. మాలాగే వారు కూడా నమాజు చదువుతారు, ఉపవాసాలు కూడా వుంటారు, తమ వద్ద మిగిలిన సొమ్మును దానం కూడా చేస్తారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ – “అల్లాహ్ మీకోసం కూడా దానం చేసే అవకాశం కల్పించలేదా? నిస్సందేహంగా ప్రతి ‘సుబ్ హా నల్లాహ్’ఒక దానం, ప్రతి ‘అల్లాహు అక్బర్’ ఒక దానం, ప్రతి ‘అల్హమ్దులిల్లాహ్’ ఒక దానం మరియు ప్రతి ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ ఒక దానం. ప్రతి సత్కార్య ఆదేశం ఒక దానం, ప్రతి చెడు నుండి ఆపడం ఒక దానం …”అని వివరించారు. (ముస్లిం: 1006)
ఈ శుభప్రద కలిమాల మహోన్నత ప్రయోజనాలను దృష్టిలో వుంచు కొని వీటిని సాధారణ రోజుల్లోనూ, ప్రత్యేకించి ఈ దినాలలోనూ వీలైనంత ఎక్కువగా పఠిస్తూ వుండాలి. ప్రత్యేకించి ‘తక్బీర్లు’ పఠించడాన్ని మాత్రం వీలైనంత ఎక్కువగా పాటించాలి.
ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) మరియు అబూ హురైరా (రదియల్లాహు అన్హు) లు ఇలాగే చేసేవారు. ఇమామ్ బుఖారీ రహిమహుల్లాహ్ ఇలా సెలవిచ్చారు:
“ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) మరియు అబూ హురైరా (రదియల్లాహు అన్హు) లు జిల్ హిజ్జ మొదటి 10 రోజుల్లో బజారుకు వెళ్ళి అక్కడ ‘తక్బీర్’ పఠించేవారు. ఇది చూసి ఇతరులు కూడా వారితో పాటు తక్బీర్లు పఠించేవారు. (బుఖారీ)
ఈ దినాలలో సామాన్యంగా తక్బీర్లను బిగ్గరగా పఠించడం మరియు స్వరాన్ని వీలైనంత ఎక్కువగా పెంచడం అభిలషణీయం. ప్రత్యేకించి అరాఫాత్ దినం ఫజర్ మొదలుకొని జిల్ హిజ్జా 13వ తేదీ అసర్ నమాజు వరకు ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత వీటిని పఠిస్తూ వుండాలి.
ఈ ఐదు దినాలలో ఫర్జ్ నమాజ్ తర్వాత తక్బీర్లు పఠించడం, ఉమర్ (రదియల్లాహు అన్హు), అలీ (రదియల్లాహు అన్హు), అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు), అబ్దుల్లా బిక్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) మరియు ఇతర సహాబాల ద్వారా నిరూపించబడి వుంది. (ఇర్వా ఉల్ గలీల్: 3వ సంపుటం, 125 పేజీ)
తక్బీర్ల పదాలు ఇవి:
“అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్.”
అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అను) ఈ పదాలతోనే తక్బీర్లు పఠించేవారు. వీటి ప్రారంభంలో ‘అల్లాహు అక్బర్’ రెండు సార్లు వుంది. మరో ఉల్లేఖనం ద్వారా ఆయన ప్రారంభంలో మూడు సార్లు ‘అల్లాహు అక్బర్’ పఠించే వారని నిరూపించబడి వుంది.
అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అను) ఇలా పలికేవారు:
“అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లా హిల్ హమ్ద్, అల్లాహుఅక్బర్ వఅజల్, అల్లాహు అక్బర్ అలామా హదానా.” (ఇర్వాఉల్ గలీల్:3వ సంపుటం, పేజీ:125)
ఈ తక్బీర్లను సామూహికంగా పఠించకూడదు. ఎందుకంటే ఇలా చేయడం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ద్వారా గానీ, సలఫు స్సాలిహీన్ల ఆచరణ ద్వారా గానీ నిరూపించబడి లేదు. పైగా సున్నత్ ఏమిటంటే, ప్రతి వ్యక్తి ఒంటరిగా తక్బీర్లు పఠించాలి.
5) దాన ధర్మాలు చేయడం
ఈ దినాలలో అభిలషణీయమైన సత్కార్యాల్లో దానం చేయడం కూడా ఒకటి. అల్లాహ్, దాన ధర్మాల గురించి ఇలా సెలవిచ్చాడు:
“ఓ విశ్వాసులారా! వ్యాపార లావాదేవీలు గానీ, స్నేహబంధాలు గానీ, సిఫార్సులు గానీ ఉండని ఆ రోజు రాకముందే మేము మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు చేయండి. వాస్తవానికి తిరస్కారులే దుర్మార్గులు.” (బఖర:254)
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “ఏదైనా సంపద నుండి దానం చేస్తే, అది సంపదను తగ్గించదు.” (ముస్లిం)
అందుకే మనం ప్రత్యేకంగా ఈ దినాలలో వీలైనంత ఎక్కువగా దాన ధర్మాలు చేయాలి. అల్లాహ్ మనందరినీ ఈ (సత్) కార్యాలన్నిటినీ చేయగలిగే సద్బుద్ధిని ప్రసాదించుగాక! ఆమీన్!
రెండవ ఖుత్బా
ఇస్లామీయ సోదరులారా!
జిల్ హిజ్జ (మొదటి) పది రోజులలో అభిలషణీయమైన కార్యాల గురించి వివరంగా తెలియజేశాం. ఈ కార్యాలలోనే, షరీయత్తు ద్వారా గట్టిగా తాకీదు చేయబడి, జిల్ హిజ్జ పది దినాల సమాప్తి వేళ ఆచరించబడే మరో కార్యం కూడా వుంది. అదేమిటంటే
6) ఖుర్బానీ
ఖుర్బానీ చేయడం అల్లాహ్ సాన్నిధ్యం పొందడానికి ఒక సాధనం. ఇది దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సున్నత్. ఆయన దీనిని ప్రతి సం॥ ఆచరించేవారు. ఇమామ్ బుఖారీ రహిమహుల్లాహ్, తన ‘సహీ బుఖారీ’లో ‘కితాబుల్ అజ్ హా ‘ అధ్యాయం క్రింద ఒక శీర్షిక పెట్టారు. దాని పేరు ‘బాబ్ సున్నతుల్ అజ్ హియ’. తదుపరి ఆయన, బరా (రదియల్లాహు అన్హు) ద్వారా ఉల్లేఖించబడ్డ ఈ హదీసును వివరించారు.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఈ రోజు మేము అన్నింటికన్నా ముందుగా పండుగ నమాజు చదువుతాం. తదుపరి తిరిగొచ్చి ఖుర్బానీ చేస్తాం. ఇక ఎవరైనా ఇలా చేస్తే వారు మా సున్నత్ను పొందినట్లే. ఏ వ్యక్తి అయినా నమాజ్ కు ముందు ఖుర్బానీ చేస్తే అది ఖుర్బానీ కాలేదు. కేవలం మాంసాన్ని తన ఇంటి వారికి సమర్పించిన వాడవుతాడు.” (బుఖారీ: 5545)
ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే ఖుర్బానీ చేయడం సున్నత్ వాజిబ్ (తప్పనిసరి) కాదు. అంతే గాక, సునన్ తిర్మిజి లో ఇలా ఉల్లేఖించబడింది:
అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అను) తో ఒకతను ఇలా ప్రశ్నించాడు: “ఖుర్బానీ చేయడం వాజిబా (తప్పనిసరా?” ఆయన : ‘దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు ముస్లిములు ఖుర్బానీ చేసేవారు.’ అని అన్నారు. అతను మళ్ళీ – ఖుర్బానీ చేయడం తప్పనిసరా? అని ప్రశ్నించాడు. ఆయన జవాబిస్తూ – నీకేమైనా బుద్ధి వుందా? దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు ముస్లిములు ఖుర్బానీ చేసేవారు (అని చెబుతున్నాను గా) అని అన్నారు. (తిర్మిజి: 1506, హసన్ సహీ)
ఇమామ్ తిర్మిజి, ఈ హదీసును ఉల్లేఖించిన తర్వాత ఇలా పేర్కొన్నారు:
“ఈ హదీసు ఆధారంగానే, విద్వాంసులు దృష్టిలో ఖుర్బానీ చేయడం తప్పనిసరి (వాజిబ్) కాదు. పైగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సున్నతులలో ఒక సున్నత్. దీనిపై ఆచరించటం అభిలషణీయం (ముస్తహబ్).
అలాగే, ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అను) ఇలా సెలవిచ్చారు:
“దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మదీనాలో 10 సం॥లు గడిపారు. ఈ వ్యవధిలో ఆయన ప్రతి సం॥ ఖుర్బానీ చేస్తూ వున్నారు.” (తిర్మిజి:1507, హసన్)
ఈ రెండు హదీసుల ద్వారా తెలిసిందేమిటంటే – ఖుర్బానీ వాజిబ్ (తప్పనిసరి) కాదు. అయినప్పటికీ, స్థోమత గల ప్రతివ్యక్తీ దీనిని తప్పకుండా చేయాలి. ఎందుకంటే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చి వున్నారు.
“ఏ వ్యక్తి అయినా సామర్థ్యమున్నప్పటికీ ఖుర్బానీ చేయడో, అతను మా ‘ఈద్గాహ్’ లో రాకూడదు.” (హాకిమ్, హసన్ – అల్బానీ, సహీ తర్గీబ్ వ తర్ హీబ్ : 1087)
అలాగే, ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) అరాఫాత్ లో ఇలా సెలవిచ్చి ఉన్నారు:
“ప్రజలారా! ప్రతి ఇంటిపై, ప్రతి సం॥ ఒక ఖుర్బానీ చేయడం తప్పనిసరి.” (అబూదావూద్: 2788, తిర్మిజీ:1518, ఇబ్నెమాజ, 3125, సహీ అల్బానీ)
అందుకే, ఒకవేళ శక్తి సామర్థ్యాలు గనక కలిగివుంటే, ఖుర్బానీ ని వదిలి పెట్టకూడదు. మరి కొంతమంది అనుకొనే దేమిటంటే – ఖుర్బానీ కేవలం హజ్ యాత్రికులకే ప్రత్యేకం, ఇతరులు దీనిని చేయాల్సిన అవసరం లేదు. మరి చూడబోతే, దీనిగురించి అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వచనాన్ని మేమిదివరకే వివరించాం. దాంట్లో ఆయన – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మదీనాలో పదేళ్ళు గడిపారని, అందులో ఆయన ప్రతి సం|| ఖుర్బానీ ఇచ్చేవారని సెలవిచ్చారు. ఖుర్బానీ కేవలం హజ్ యాత్రికుల కొరకే ప్రత్యేకం కాదు, ముస్లిములందరి కోసం అని అనడానికి ఇదొక ఆధారం.
హజ్ యాత్రికులయితే, హజ్ విధులను నిర్వర్తిస్తూ ఖుర్బానీ చేస్తారు, ఇతర ముస్లిములు తమ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సున్నత్ను అనుసరిస్తూ, అల్లాహ్ సామీప్య భాగ్యాన్ని పొందడానికి ఖుర్బానీ చేస్తారు.
అలాగే, అనస్ (రదియల్లాహు అను) ఇలా సెలవిచ్చారు.
“దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) రెండు గొర్రె పోతులను ఖుర్బానీ ఇచ్చేవారు. నేను కూడా అలాగే రెండు గొర్రె పోతులను ఖుర్బానీ చేస్తాను.” (బుఖారీ: 5553)
అనస్ (రదియల్లాహు అన్హు) ప్రస్తావించిన దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) యొక్క ఈ ఆచరణ (రెండు గొర్రె పోతులను ఖుర్బానీ చేయడం) మదీనా లోనిది. ఎందుకంటే, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కేవలం ఒక్కసారే హజ్ చేశారు. అందులో ఆయన 100 ఒంటెలు ఖుర్బానీ ఇచ్చారు.
అంతే కాదు, సునన్ అబూదావూద్ లో ఇదే హదీసు యొక్క పదాలలో ‘మదీనా లో ‘ అని స్పష్టంగా వుంది. దీని ద్వారా రూఢీ అయిన విషయమేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్ లోనే కాకుండా, (ప్రతి యేడూ) ఖుర్బానీ ఇచ్చేవారు. (అబూదావూద్:2793, సహీ – అల్బానీ)
అంతే కాక, ఇంతకు ముందు మేము వివరించిన సహీ బుఖారీ లోని హదీసు – “ఈ రోజు మేము అన్నింటికన్నా ముందుగా పండుగ నమాజ్ చేస్తాం, తదుపరి తిరిగొచ్చి ఖుర్బానీ చేస్తాం” – ద్వారా కూడా నిరూపించబడే విషయమేమిటంటే, ఖుర్బానీ చేయడం ముస్లిములందరి కొరకు సున్నత్. కేవలం హాజీల కొరకు కాదు. ఎందుకంటే, ఒకవేళ ఖుర్బానీ, కేవలం హాజీల కొరకే వుండి వుంటే, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ రోజు మేము అన్నింటి కన్నా ముందుగా పండుగ నమాజు చేస్తాం, తదుపరి తిరిగొచ్చి ఖుర్బానీ చేస్తాం అని సెలవిచ్చేవారు కాదు. పైగా, జిల్ హిజ్జ 10 వ తేదీ నాడు హాజీలు పండుగ నమాజు చేయరు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా ‘హజ్జతుల్ విదా’ లో పండుగ నమాజు చేయలేదు. అందుకే, ప్రపంచం లోని ముస్లిములందరూ ఈ సున్నత్పై ఆచరించాలి.
ప్రియులారా! ఖుర్బానీ కి సంబంధించిన ప్రముఖ వివరాలను మేము ‘ఈదుల్ అజహా’ నాటి ఖుత్బాలో ఇన్షా అల్లాహ్ వివరిస్తాం. కొన్ని విషయాలు మాత్రం పండుగ కు ముందే తెలుసుకోవడం తప్పనిసరి. అవి ఇవి:
మొదటి విషయం:
ఖుర్బానీ చేయదలుచుకున్న వ్యక్తి జిల్ హిజ్జ నెలవంక కనిపించిన తర్వాత తలగొరికించుకోవడం గానీ, గోర్లు కత్తిరించుకోవడం గానీ చేయకూడదు. ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా ) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఖుర్బానీ గురించి సంకల్పించుకున్న వ్యక్తి జిల్ హిజ్జ నెలవంక చూసిన తర్వాత తల గొరికించుకోకూడదు మరియు గోర్లు కత్తిరించుకోకూడదు”. (ముస్లిం:1977)
రెండవ విషయం:
ఖుర్బానీ కోసం ఎన్నుకోబడే జంతువులు – ఆవు, ఒంటె, గొర్రె, మేకల జాతుల లోనివై వుండాలి. దీని గురించి, అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
وَلِكُلِّ أُمَّةٍ جَعَلْنَا مَنسَكًا لِّيَذْكُرُوا اسْمَ اللَّهِ عَلَىٰ مَا رَزَقَهُم مِّن بَهِيمَةِ الْأَنْعَامِ
“తమకు అల్లాహ్ ప్రసాదించిన వున్న పశువులపై, అల్లాహ్ పేరును స్మరించటానికి గాను మేము ప్రతి అనుచర సమాజం కోసం ఖుర్బానీ ఆచారాన్ని నిర్ధారించాము.” (హజ్ 22: 34)
ఇక్కడ పశువులంటే అర్ధం – ఒంటె, ఆవు, గొర్రె మరియు మేకలు. అందుకే ఇమామ్ నవవీ రహిమహుల్లాహ్ – ఖుర్బానీ కోసం కేవలం ఈ పశువులే సరిపోతాయి అని సెలవిచ్చి, దీనిపై ముస్లిం సమాజమంతా ఏకాభిప్రాయం (ఇజ్మా) కలిగి వున్నారని పేర్కొన్నారు. (షరహ్ ముస్లిం లిన్నవవీ: 13వ సంపుటం, 125 పేజి)
మూడవ విషయం:
ఖుర్బానీ పశువులు లోపాలు లేకుండా వుండాలి. అంటే, ఉదా॥కు కుంటి తనం, మెల్ల కన్ను, అత్యంత బలహీనత, లేదా వ్యాధి లాంటి లోపాలు, అందుకే ఇలాంటి లోపాలలో ఏ లోపం వున్నా, అలాంటి పశువులను ఖుర్బానీ చేయడం సరికాదు. అలాగే చెవులు తెగి వుండకూడదు మరియు కొమ్ములు కూడా విరిగి ఉండకూడదు. కాని వృషణాలు లేకపోవడం లోపం అనిపించుకోదు.
బరా బిన్ అజిబ్ (రదియల్లాహు అను) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఖుర్బానీ కోసం నాలుగు రకాల పశువులు సరైనవి కావు. మెల్లకన్ను గల పశువు, దాని మెల్ల కన్ను స్పష్టంగా తెలియాలి. రోగం బారిన పడ్డ పశువు, దాని రోగం స్పష్టంగా కనబడాలి. కుంటుతున్న పశువు, దాని కుంటితనం బహిర్గతమవ్వాలి. (అలాగే) ఎముకల్లో ఏ మాత్రం గుజ్జు లేకుండా అత్యంత బలహీనమైపోయిన పశువు.” (అబూ దావూద్: 2802, తిర్మిజీ: 1497, సహీ అల్బానీ)
నాలుగవ విషయం:
పశువుల వయస్సు: ఖుర్బానీ పశువులు లావుగా, కండ కలిగి వుండడంతో పాటు రెండు దంతాలు కలిగి వుండడం తప్పనిసరి.
జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు.
“మీరు రెండు దంతాలు కలిగిన పశువులను మాత్రమే జిబహ్ చేయండి. ఒకవేళ మీ స్థితి గనక బాగాలేకపోతే, అప్పుడు 1 సం||పు గొర్రె జిబహ్ చేసుకోండి.” (ముస్లిం:1963)
మరికొన్ని హదీసుల ద్వారా అగత్య పరిస్థితి లేక పోయినప్పటికీ, 1సం॥పు గొర్రెను ఖుర్బానీ చేయడం కూడా సరైనదే – అన్న విషయం బోధపడుతుంది. ఈమాటే ఉత్తమమైనదవి ‘తోఫతుల్ హౌజ్’ గ్రంథకర్త కూడా ఖరారు చేశారు. (తోఫతుల్ హౌజీ : 4వ సంపుటం, 440 పేజి)
ఉదా॥ కు, ఒక హదీసులో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“నిస్సందేహంగా (ఖుర్బానీ కోసం) రెండు దంతాల గొర్రె సరిపోయినట్లే, 1 సం॥ పు గొర్రె కూడా సరిపోతుంది.” (అబూ దావూద్: 2799, సహీ – అల్బానీ) ఈ హదీసులో ‘అల్ జజు అ’ అన్న పదం సాధారణమైనది, దీనిలో గొర్రె పోతు, మేక పోతు- రెండూ చేరి వున్నాయి.
కానీ, మరో హదీసు ప్రకారం, దీనిని కేవలం గొర్రె కోసం ప్రత్యేకించడం తప్పనిసరి. అది బరా (రదియల్లాహు అన్హు) హదీసు, ఆ హదీసులో, ఆయన వివరించిన దేమిటంటే – ఆయన చిన్నాన్న, పండుగ నమాజు కు ముందే ఖుర్బానీ చేశారు. దీనిపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి అన్ను) – అది కేవలం మేక మాంసమే, (ఖుర్బానీ మాంసం కాదు) అని అనడంతో ఆయన – ఓ దైవ ప్రవక్తా! నా వద్ద 1 సం॥పు మేకపోతు వుంది అని విన్నవించుకోగా, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) – “నువ్వు దానినే ఖుర్బానీ చేయి. కానీ నీకు తప్ప మరెవ్వరికీ ఇది వర్తించదు” అని వివరించారు. (బుఖారీ: 5556, ముస్లిం: 1961)
ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే 1 సం॥పు మేకపోతు ఖుర్బానీ కోసం సరిపోదు.
ఐదవ విషయం:
ఖుర్బానీ సమయం: ఖుర్బానీ సమయం పండుగ నమాజు తర్వాత వుంటుంది. అందుకే పండుగ నమాజుకు ముందు ఖుర్బానీ చేయకూడదు.
జున్దుబ్ బిన్ సుఫ్యాన్ (రదియల్లాహు అను) కథనం:
“నేను ఖుర్బానీ (చేసే) సమయంలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో పాటు ఉన్నాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) పండుగ నమాజును ముగించిన వెంటనే, నమాజుకు ముందు జిబహ్ చెయ్యబడిన పశువుల మాంసం చూశారు. దీనిపై ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “ఏ వ్యక్తి అయితే ఖుర్బానీ పశువును పండుగ నమాజుకు ముందు జిబహ్ చేశాడో, అతను దాని స్థానంలో మరో పశువును జిబహ్ చేయాలి. ఇక, ఎవరైతే జిబహ్ చేయలేదో వారు ‘జిస్మిల్లాహ్’ అని పలికి జిబహ్ చేయవచ్చు.” (బుఖారీ: 985, ముస్లిం: 1960)
బరా (రదియల్లాహు అన్హు) కథనం:
“మా చిన్నాన్న, పండుగ నమాజుకు ముందే ఖుర్బానీ చేశారు. దీనిపై, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) – అది కేవలం మేక మాంసం మాత్రమే (ఖుర్బానీ మాంసం కాదు) అని అనడంతో, ఆయన- ఓ దైవ ప్రవక్తా! నా వద్ద 1 సం|| పు మేకపోతు వుంది అని విన్నవించుకోగా, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) – నువ్వు దానినే ఖుర్బానీ చేయి. కానీ, నీకు తప్ప మరెవరికీ ఇది (ఈ ఆదేశం) వర్తించదు. ”అని పలికి, తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఏ వ్యక్తి అయినా పండుగ నమాజుకు ముందు ఖుర్బానీ చేస్తే, అతను (కేవలం) పశువును జిబహ్ చేసినట్లే. ఒకవేళ ఎవరైనా పండుగ నమాజు తర్వాత ఖుర్బానీ చేస్తే అతను ఖుర్బానీని పూర్తి చేయడంతో పాటు, ముస్లిముల సున్నతును పొందిన వాడవుతాడు.” (బుఖారీ: 5556, ముస్లిం: 1961)
ఆరవ విషయం:
ఒక మేకపోతు లేదా మేక, ఒక గొర్రె పోతు లేదా ఒక గొర్రె – ఇంటి వారందరి తరఫున సరిపోతుంది. అందుకే, ఇంట్లోని ఒక్కొక్కరి తరఫున ఒక్కొక్క పశువును జిబహ్ చెయ్యాల్సిన అవసరం లేదు. పైగా ఒకవేళ ఉద్దేశ్యం గనక ఫలానా వ్యక్తి, ఇంట్లోని ప్రతి వ్యక్తి తరఫున ఒక ఖుర్బానీ ఇచ్చాడని ప్రజలు చెప్పు కోవాలి లేదా స్వయంగా తనే – నేను ప్రత్యేకంగా నేను ప్రత్యేకంగా నా తరఫు నుంచి ఖుర్బానీ చేశాను అని చెప్పుకోవచ్చు – అని అయితే అప్పుడది ప్రదర్శనా బుద్ధి అవుతుంది మరియు అది హరామ్ (నిషిద్ధం).
అతా బిన్ యసార్ రహిమహుల్లాహ్ కథనం:
నేను, అబూ అయ్యూబ్ అన్సారీ (రదియల్లాహు అన్హు) ను – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి అలైహి వ సల్లం) కాలంలో ఖుర్బానీ ఎలా చేసేవారు? అని అడిగాను. ఆయన జవాబిస్తూ – ఒక వ్యక్తి తన మరియు తన ఇంటివారి తరఫు నుండి ఒక మేకను ఖుర్బానీ చేసేవాడు. తదుపరి దానిని స్వయంగాను తినేవాడు, ఇతరులకు కూడా తినిపించేవాడు. (ఇలాగే జరుగుతూ వుండేది). రాను రాను, (దీని గురించి) ప్రజలు ఒకరిపై నొకరు గర్వపడడం ప్రారంభించారు. ఇక నేటి ప్రజల స్థితిని మీరు స్వయంగా చూస్తూనే వున్నారు.” (తిర్మిజి: 1505, సహీ – అల్బానీ)
కనుక, ఒకరిపై నొకరు, గర్వపడేందుకు కాకుండా, మనస్ఫూర్తిగా కేవలం అల్లాహ్ మెప్పు పొందటానికే ఖుర్బానీ చెయ్యాలి.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
“ఇలా ప్రకటించు: నిస్సందేహంగా నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం – ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే. ఆయనకు భాగస్వాములెవరూ లేరు. దీని గురించే నాకు ఆజ్ఞాపించబడింది. ఆజ్ఞాపాలన చేసే వారిలో (ముస్లిములలో) నేను మొదటి వాణ్ణి.” (అన్ ఆమ్ 6: 162, 163)
ఏడవ విషయం:
ఆవులో ఏడుగురు మరియు ఒంటెలో 7 లేదా 10 మంది భాగస్వాములు కావచ్చు.
ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం: “ఒకసారి మేము దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో కలిసి ప్రయాణంలో వుండగా ‘ఈదుల్ అజ్ హా’ వచ్చింది. దీనితో మేము ఆవులో ఏడుగురు మరియు ఒంటెలో 10 మంది భాగస్వాములై ఖుర్బానీ చేశాం.” (తిర్మిజి:1501, సహీ – అల్బానీ)
జాబిర్ (రదియల్లాహు అను) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఆవు ఏడుగురికి మరియు ఒంటె కూడా ఏడుగురికి సరిపోతుంది.” (అబూదావూద్: 2808, సహీ – అల్బానీ)
ఈ రెండు హదీసుల ద్వారా నిరూపించబడిందేమిటంటే- ఆవులో ఏడుగురు మరియు ఒంటెలో 7 లేదా 10 మంది భాగస్వాములు కావచ్చు.
ఎనిమిదవ విషయం:
పండుగ నమాజు కోసం బయలు దేరేటప్పుడు ఇంట్లో ఏమీ తినకుండా, త్రాగకుండా, తక్బీర్లు పఠిస్తూ ఈద్ గాహ్ వైపుకు పోవాలి.
బరీరా (రదియల్లాహు అన్హా) కథనం: “దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈదుల్ ఫిత్ర్ నాడు (నమాజు కోసం) బయలుదేరే ముందు ఏదో ఒకటి తినే వారు. కానీ ఈదుల్ అజ్ హా నాడు పండుగ నమాజు చదివే వరకు ఏమీ తినేవారు కాదు.” (తిర్మిజీ: 542, సహీ – అల్బానీ)
ఇంట్లో స్త్రీలను కూడా తప్పనిసరిగా ఈద్గాకు తీసుకెళ్ళాలి. ఎందు కంటే, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్త్రీలను ఈద్గాహ్ కు వెళ్ళమని ఆజ్ఞాపించి వున్నారు. సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో ఉమ్మె అతియా (రదియల్లాహు అన్హా ) ఉల్లేఖించిన హదీసులో ఇది స్పష్టంగా వుంది. చివరికి, రుతుక్రమంలో వున్న స్త్రీలను కూడా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇండ్లలో నుండి బయటికొచ్చి, ఈద్ గాహ్ బయట కూర్చోమని, ముస్లిముల దుఆలో పాలుపంచుకోమని ఆజ్ఞాపించారు. (బుఖారీ: 974, ముస్లిం: 890)
తొమ్మిదవ విషయం :
ఈద్గాహ్ కు చేరుకొని, ఇమామ్ వెనుక పండుగ నమాజు చేయాలి. దీనిలో, ఇమామ్ ఖిరాత్ కు ముందు, మొదటి రకాల్లో 7 అదనపు తక్బీర్లు మరియు రెండవ రకాతులో 5 అదనపు తక్బీర్లు పలుకుతాడు. ముఖ్తదీలు కూడా ఇమామ్ తోపాటు తక్బీర్లు పలకాలి. నమాజు ముగించాక ఇమామ్ ఖుత్బా ఇస్తాడు.
ఇస్లామీయ సోదరులారా!
ఖుర్బానీకి సంబంధించిన ప్రముఖ విషయాలు, ఇన్షా అల్లాహ్ మేము ఈదుల్ అజ్ హా నాడు వివరిస్తాం. అల్లాహ్ ను వేడుకొనే దేమిటంటే ఆయన మనందరినీ జిల్ హిజ్జ లోని ఈ పది దినాలలో వీలైనంత ఎక్కువగా ఆరాధించే (సత్కార్యాలు చేసే) సద్భుద్ధిని ప్రసాదించు గాక! ఆమీన్!
—
ఈ ఖుత్బా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్