రుఖ్ యా (మంత్రించి ఊదటం) [వీడియో & టెక్స్ట్]

రుఖ్ యా (మంత్రించి ఊదటం)
https://youtu.be/9SIgD5D56yo [14 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో “రుఖ్ యా” (మంత్రించి ఊదడం) అనే అంశం గురించి వివరించబడింది. రుఖ్ యా అంటే, అనారోగ్యంతో లేదా ఇతర బాధలతో ఉన్న వ్యక్తిపై ఖుర్ఆన్ వచనాలు, అల్లాహ్ నామ-గుణాలు లేదా ప్రవక్త నేర్పిన దుఆలు పఠించి ఊదటం. రుఖ్ యాలో రెండు రకాలు ఉన్నాయి: ధర్మసమ్మతమైనది (రుఖ్ యా షరియా) మరియు నిషిద్ధమైనది (షిర్క్ తో కూడినది). ధర్మసమ్మతమైన రుఖ్ యాకు మూడు షరతులు ఉన్నాయి: అది అల్లాహ్ వాక్యాలు లేదా నామ-గుణాలతో ఉండాలి, అరబి భాషలో స్పష్టమైన అర్థంతో ఉండాలి, మరియు దాని ప్రభావం అల్లాహ్ యే కలుగజేస్తాడనే నమ్మకం ఉండాలి. దైవేతరుల సహాయం కోరే, షిర్క్ తో కూడిన రుఖ్ యా ఇస్లాంలో తీవ్రంగా నిషిద్ధం. సహాబాలు, సలఫ్ సాలెహీన్‌లు ఎవరూ రుఖ్ యాను వ్యాపారంగా లేదా జీవనోపాధిగా చేసుకోలేదని, ఈ విషయంలో జాగ్రత్త వహించాలని ప్రసంగీకులు హెచ్చరించారు.

أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ وَمَنْ تَبِعَهُمْ بِإِحْسَانٍ إِلَى يَوْمِ الدِّينِ أَمَّا بَعْدُ
సమస్త ప్రశంసలు సకల లోకాల ప్రభువైన అల్లాహ్ కు మాత్రమే శోభాయమానం. మరియు అంతిమ విజయం దైవభక్తిపరుల కొరకే. మరియు దైవ ప్రవక్తల నాయకునిపై మరియు ఆయనను అనుసరించిన వారిపై ప్రళయదినం వరకు శాంతి మరియు శుభాలు వర్షించుగాక!

ప్రియ వీక్షకుల్లారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమం లోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక!

ప్రియ వీక్షకుల్లారా! ఈరోజు మనం ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలో, రుఖ్ యా అంటే మంత్రించి ఊదటం అనే విషయం గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం.

అరబీ భాషలో, హదీస్ గ్రంథాలలో రుఖ్ యా ఇది ఏకవచనం, దానికి బహువచనం రుఖా. రుఖ్ యా అంటే తెలుగు అనువాదకులు రుఖ్ యా అనే దానికి మంత్రం, మంత్రించి ఊదటం అని అనువదించారు. ఇది షరియత్ పరిభాషలో అరబీలో రుఖ్ యా అంటారు. మంత్రించి ఊదటం.

ఈ విషయం గురించి షరియత్ లో దాని ఆదేశం ఏమిటి? అది తప్పా ఒప్పా అనే విషయం గురించి తెలుసుకుందాం.

అసలు రుఖ్ యా అంటే ఏమిటి, మంత్రించి ఊదటం అది ఏమిటో తెలుసుకుందాం ఇన్షా అల్లాహ్. రుఖ్ యా దానికి అర్థం ఏమిటంటే మానసికంగానైనా శారీరకంగానైనా బాధలో ఉన్న వ్యక్తిపై ఏదైనా పఠించి ఊదటం. జ్వరం, మూర్ఛ రోగం, మొదలుగైన బాధలు, కష్టాలు, సమస్యలు, అనారోగ్యంకి గురైన వారికి, రోగులపై ఏదైనా పఠించి ఊదటాన్ని రుఖ్ యా అంటారు, మంత్రించి ఊదటం అంటారు.

ఇవి రెండు రకాలు.

మొదటి విషయం, మొదటి రకం ఏమిటంటే షిర్క్ ప్రమేయం లేకుండా, షిర్క్ లేని మంత్రం, షిర్క్ లేని రుఖ్ యా. ఆ రుఖ్ యాలో, ఆ మంత్రంలో ఎటువంటి షిర్క్ లేదు. సూటిగా చెప్పాలంటే దివ్య ఖుర్ఆన్ లోని ఆయతులు లేదా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యాలు, ఆయన నామ గుణాలని పఠించి ఆ రోగిని, ఎవరిపైన ఊదుతున్నామో ఆయన్ని అల్లాహ్ రక్షణలో ఇవ్వటం.

ఈ రకమైన రుఖ్ యా, ఈ రకమైన మంత్రం ధర్మ సమ్మతమే. ఏ రుఖ్ యాలో షిర్క్ లేదో, బిద్అత్ లేదో, కొత్త విధానం లేదో, కేవలం అల్లాహ్ వాక్యాలు, అల్లాహ్ నామం, ఆయన గుణాలు మాత్రమే దాంట్లో ఉంటే ఇటువంటి రుఖ్ యా, ఇటువంటి మంత్రం ధర్మ సమ్మతమే. ఈ విధంగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చేశారు, మరి అది ధర్మ సమ్మతం అని ఖరారు కూడా చేశారు.

దీనికి ఆధారం, ఒక సందర్భంలో ఔఫ్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: “ఓ దైవ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం, మేము అజ్ఞాన కాలంలో మంత్రించి ఊదే వారము. ఇప్పుడు మీరు దీని గురించి, ఈ రుఖ్ యా గురించి, ఈ మంత్రం గురించి ఏదైతే మేము అజ్ఞాన కాలంలో ఇలా మంత్రించి ఊదుతూ ఉన్నాము కదా, ఇప్పుడు మీరు ఆ విషయం గురించి ఏమంటారు, మీ అభిప్రాయం ఏమిటి?” అని ఔఫ్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రశ్నించారు.

దానికి సమాధానంగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

اعْرِضُوا عَلَىَّ رُقَاكُمْ لاَ بَأْسَ بِالرُّقَى مَا لَمْ يَكُنْ فِيهِ شِرْكٌ
(ఇఅరిదూ అలయ్య రుఖాకుమ్, లా బ’స బిర్రుఖా మా లమ్ తకున్ షిర్కన్)
“మీ మంత్రాలు ఏమిటో నా ముందు సమర్పించండి. షిర్క్ ప్రమేయం లేకుండా ఉన్నంత వరకు మంత్రించి ఊదటంలో అభ్యంతరం ఏమీ లేదు” (సహీహ్ ముస్లిం)

అభిమాన సోదరులారా! ఈ హదీస్ లో రెండు భాగాలు ఉన్నాయి, బాగా గమనించాలి. మొదటి భాగం ఏమిటి? “ఇఅరిదూ అలయ్య రుఖాకుమ్” అన్నారు. అంటే ఆలోచన చేయకుండా, అడగకుండా, ఏ మంత్రమైనా, ఎలాగైనా కరెక్టే అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కితాబు ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. “ఇఅరిదూ అలయ్య రుఖాకుమ్” – మీరు ముందు నాకు సమర్పించండి, చూపించండి. మీరు ఎటువంటి మంత్రం మీరు చేస్తారు, ఎలా ఊదుతారు, విధానం ఏమిటి, పదాలు ఏమిటి, వాక్యాలు ఏమిటి, అది నాకు ముందు చూపించండి, నా సమక్షంలో సమర్పించండి, నేను చూస్తాను అన్నారు.

ఆ తర్వాత రెండో భాగం ఏమిటి ఈ హదీస్ లో? “లా బ’స బిర్రుఖా మా లమ్ తకున్ షిర్కన్”. అంటే మీరు మంత్రించి ఊదటంలో ఎటువంటి షిర్క్ ఉండకూడదు. ఆ మంత్రంలో, ఆ రుఖ్ యాలో షిర్క్ లేనంత వరకు అది ధర్మ సమ్మతమే అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా! కావున, ఈ రుఖ్ యా గురించి మనము ఇంకా పరిశీలిస్తే, ఇది ధర్మ సమ్మతం అవటానికి మూడు షరతులు ఉన్నాయి. ఈ మూడు షరతులు అబ్దుర్రహ్మాన్ బిన్ హసన్ అత్తమీమీ రహ్మతుల్లాహి అలై తన పుస్తకం ‘ఫత్ హుల్ మజీద్ షరహ్ కితాబుత్ తౌహీద్‘ లో తెలియజేశారు ఈ మూడు షరతులు.

అంటే రుఖ్ యా ధర్మ సమ్మతం, జాయజ్, చేయవచ్చు అనటానికి ఆ మూడు షరతులు ఉన్నాయి.

  1. మొదటి షరతు ఏమిటి? ఆ రుఖ్ యా దైవ వచనాల, దైవ నామాల ఆధారంగా మంత్రించి ఊదాలి. మొదటి షరతు ఇది. ఏదైతే మనము రుఖ్ యా చేస్తున్నామో, మొదటి షరతు ఏమిటి? దైవ వచనాలు, అల్లాహ్ ఆయతులు, ఖుర్ఆన్ లోని వాక్యాలు, అల్లాహ్ నామ గుణాలు ఆధారంగా మంత్రించి, పఠించి ఊదాలి. ఇది మొదటి కండిషన్.
  2. రెండవ షరతు: ఆ రుఖ్ యా అనేది, ఆ పదాలు అనేవి అరబీ భాషలోనే ఉండాలి. దాని భావం కూడా స్పష్టంగా ఉండాలి. ఇది రెండవ కండిషన్.
  3. మూడవ కండిషన్: ఆ మంత్రం, ఆ రుఖ్ యా, ఆ విధంగా మంత్రించి ఊదటం, అది అల్లాహ్ విధివ్రాత ప్రకారమే దాని ప్రభావం ఉంటుందని నమ్మకం కలిగి ఉండాలి.

ఈ మూడు కండిషన్లు ఉంటే అటువంటి రుఖ్ యా ధర్మ సమ్మతం, కరెక్టే, చేయవచ్చు. దానివల్ల ఇన్షా అల్లాహ్, అల్లాహ్ తలిస్తే ప్రయోజనం కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది ఇన్షా అల్లాహ్ రోగికి. ఆ మూడు కండిషన్లు బాగా మనము గుర్తు పెట్టుకోవాలి.

మొదటి కండిషన్ ఏమిటి? అల్లాహ్ వచనాల, అల్లాహ్ నామాల ఆధారంగా మంత్రించి ఊదాలి. రెండవది అది అరబీ భాషలోనే ఉండాలి, దాని భావం స్పష్టంగా ఉండాలి. మూడవది, అది ఆ విధివ్రాత ప్రకారమే దాని ప్రభావం ఉంటుందని నమ్మకం కలిగి ఉండాలి. ఈ మూడు కండిషన్లు, ఈ మూడు షరతులు ఆ మంత్రంలో, ఆ రుఖ్ యాలో కలిగి ఉంటే, అటువంటి రుఖ్ యా, అటువంటి మంత్రం, అటువంటి మంత్రించి ఊదటం కరెక్టే, ధర్మ సమ్మతమే.

దాని విధానం ఏమిటంటే, మంత్రించే పద్ధతి ఏమిటంటే, నిర్దిష్ట దైవ వచనాలు, నిర్దిష్ట వాక్యాలు, ఖుర్ఆన్ వాక్యాలు పఠించి రోగిపై ఊదాలి. మొదటి విషయం ఏమిటి? స్వయంగా రోగి తన కోసం అది చేసుకోవాలి. ఆ రోగికి, ఆ బాధలో, సమస్యలో ఉన్న వ్యక్తికి ఆ వచనాలు, ఆ దుఆలు అవి రాని యెడల, వచ్చే వారు రోగిపై పఠించి ఊదవచ్చు. లేదా నీటిపై మంత్రించి దానిని రోగికి త్రాగించాలి. ఇది సరైన విధానం, రుఖ్ యా షరియా అనేది.

రెండవ విధానం ధర్మ సమ్మతం కాదు, జాయజ్ కాదు, అధర్మం. అదేమిటి? షిర్క్ కు ప్రమేయం ఉన్నది. అంటే దైవేతరుల సహాయం అర్థించే మంత్ర తంత్రాలు. ఇందు నిమిత్తం దైవేతరులను మొరపెట్టుకోవటం, వారి సహాయం కోరటం, వారి శరణు కోరటం, జిన్నాతుల పేర్లతో, ప్రవక్తల పేర్లతో, దైవదూతల పేర్లతో, పుణ్య పురుషుల పేర్లతో మంత్రించి ఊదటం. ఇదంతా దైవేతరులను మొరపెట్టుకోవటం క్రిందికే వస్తుంది, కావున ఇది షిర్కే అక్బర్ అవుతుంది. ఇది ఎటువంటి పరిస్థితుల్లో ధర్మ సమ్మతం కాదు, హరాం.

అలాగే కొన్ని పదాలు, కొన్ని మంత్రాలు వాటిలో అవిశ్వాసంతో, షిర్క్ తో కూడిన వాక్యాలు కూడా ఉండవచ్చు. ఆ విషయం మనకు తెలియవచ్చు, తెలియకపోవచ్చు. ఈ విధమైన మంత్రాలు కూడా సమ్మతం కావు అని మనం బాగా తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి.

అభిమాన సోదరులారా! సారాంశం ఏమనగా చిన్న పిల్లలైనా, పెద్దవారైనా, ఎవరైనా సరే ఏదైనా రోగం వస్తే, అనారోగ్యానికి గురైతే, ఖుర్ఆన్ మరియు హదీస్ ఆధారంగా, ఖుర్ఆన్ లోని ఆయతులు, వాక్యాలు, అల్లాహ్ నామాలు, అల్లాహ్ గుణ గణాలను పఠించి ఊదవచ్చు. ఏదైతే ఖుర్ఆన్ లో వాక్యాలు ఉన్నాయో, ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పించారో. అవి కూడా మూడు కండిషన్లు మనం తెలుసుకున్నాము. ఆ మూడు కండిషన్లతో సహా ఉంటే మనము ఈ రుఖ్ యా షరియా పఠించవచ్చు, పఠించి ఊదవచ్చు, మంత్రించవచ్చు, రుఖ్ యా చేయవచ్చు.

ఈ విషయంలో లాస్ట్ లో ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. అది ఏమిటంటే, ఈ కాలంలో కొందరు దీనిని వ్యాపారంగా చేసుకున్నారు. వారి జీవనోపాధికి కూడా ఇదే మంత్రం, రుఖ్ యా మాత్రమే అయిపోయింది. ఈ విషయం గురించి ఒకే ఒక్క మాట. రుఖ్ యా షరియాను, ఈ మంత్రించి ఊదటాన్ని సహాబాలు, ఆ తర్వాత తాబయీన్లు, తబే తాబయీన్లు, ముహద్దీసీన్లు, అయిమ్మాలు, మన పూర్వం సజ్జనులు, సలఫ్ సాలెహీన్లు ఎవ్వరూ కూడా ఈ రుఖ్ యాను, ఈ మంత్రించి ఊదటాన్ని వ్యాపారంగా, తన జీవన ఉపాధిగా ఎవ్వరూ, ఏ వ్యక్తి కూడా చేసుకోలేదు. ఇది గమనించాల్సిన విషయం. కావున, అవసరం రీత్యా మనము ఈ వ్యాపారం లేకుండా ఈ విధంగా మనము దీనిని రోగిపై పఠించి ఊదవచ్చు.

స్వస్థత కల్పించేవాడు, చికిత్స చేసేవాడు అల్లాహ్ మాత్రమే. ఆరోగ్యం ఇచ్చేవాడు, అనారోగ్యం ఇచ్చేవాడు అల్లాహ్ మాత్రమే. కావున ఇది రుఖ్ యా గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు.

అలాగే దీనికే సంబంధించిన విషయం ఒకటి ఉంది, అది తావీజు, తాయెత్తు. కొందరు తావీజులు, తాయెత్తులు కట్టుకుంటారు, మెడలో వేలాడదీసుకుంటారు, చేతికి కట్టుకుంటారు. ఇది ధర్మ సమ్మతమా కాదా? ఈ తావీజు యొక్క వాస్తవికత ఏమిటి? అది తప్పా ఒప్పా? అనే విషయం ఇన్షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా ఆఖరి పలుకు ఏమిటంటే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మరియు మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక!

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=24566

మంత్రించి ఊదటం, తావీజులు కట్టటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [PDF] [4పేజీలు]
https://teluguislam.net/wp-content/uploads/2022/10/at-sh.fawzan-4.10.pdf

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/