ఎక్కువ ఆస్తిపాస్తులు, సంతానం, మంచి హోదా లభిస్తే అల్లాహ్ మనతో సంతోషంగా ఉన్నాడు అని అర్థమా? [ఆడియో & టెక్స్ట్]

ఎక్కువ ఆస్తిపాస్తులు, సంతానం, మంచి హోదా లభిస్తే అల్లాహ్ మనతో సంతోషంగా ఉన్నాడు అని అర్థమా?
https://youtu.be/dd1Bmuwy75Q [6 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ఆడియోలో, ప్రపంచంలో కొందరికి సంపద, సంతానం, మరియు ఇతర సౌకర్యాలు లభించడం అల్లాహ్ ప్రేమకు చిహ్నమా, మరియు అవి లేకపోవడం ఆయన అసంతృప్తికి సంకేతమా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది. దీనికి సమాధానంగా, ఒక సహీహ్ హదీసు ఉల్లేఖించబడింది. ఆ హదీసు ప్రకారం, అల్లాహ్ ఈ ప్రపంచ (దున్యా) వస్తువులను తాను ప్రేమించేవారికి మరియు ప్రేమించనివారికి కూడా ఇస్తాడు, కానీ ఈమాన్ (విశ్వాసం) మరియు సదాచరణ భాగ్యాన్ని కేవలం తాను ప్రేమించేవారికి మాత్రమే ప్రసాదిస్తాడు. అందువల్ల, ప్రాపంచిక వస్తువులు అల్లాహ్ ప్రేమకు నిజమైన కొలమానం కాదని, అసలైన అనుగ్రహం విశ్వాసం కలిగి ఉండటమేనని స్పష్టం చేయబడింది. మనిషి మరణించినప్పుడు, అతని బంధువులు, ధనం తిరిగి వెళ్ళిపోతాయని, కేవలం అతని ఆచరణ మాత్రమే అతనితో సమాధిలోకి వస్తుందని కూడా గుర్తుచేయబడింది.

ప్రపంచ వస్తువులు అల్లాహ్ ప్రేమకు చిహ్నమా?

ఒకరు మీతో ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానం ఖురాన్ హదీసుల వెలుగులో కావాలని కోరారు. మీరు చెప్పిన ఆ ప్రశ్న యొక్క సారాంశం ఏమిటంటే, ఈ లోకంలో కొందరికి డబ్బు, సంతానం, మంచి భర్త లేదా పురుషునికి మంచి భార్య ఇంకా ఇతరత్రా ఏ సౌకర్యాలు, భోగభాగ్యాలు కలుగుతున్నాయో, వారితో అల్లాహ్ ప్రేమగా, ఇష్టంగా ఉన్నాడు అని, మరెవరికైతే ఇవి దొరకట్లేదో వారికి, వారిని అల్లాహ్ ఇష్టపడటం లేదు అన్నటువంటి భావాల్లో కొందరు డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు.

హదీసు వెలుగులో సమాధానం

అయితే చూడండి, ఖురాన్ లో ఎన్నో సందర్భాలలో ఆయతులు వచ్చి ఉన్నాయి మీ యొక్క ప్రశ్నకు సమాధానంగా. కానీ నేను ఒక హదీసు వినిపిస్తున్నాను. డైరెక్ట్ మీ ప్రశ్నకు సమాధానం ఈ హదీసులోని కొన్ని పదాల్లో ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో మనకు గొప్ప గుణపాఠంతో పాటు, మనం అసలు చేయవలసిన పని ఏమిటి, మన పుట్టుక ఉద్దేశం ఏమిటి, ఈ విషయాలు కూడా బోధపడుతున్నాయి.

ఈ హదీస్ ఎన్నో హదీస్ గ్రంథాల్లో వచ్చి ఉంది. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహా లో ప్రస్తావించారు. హదీస్ నెంబర్ రెండు ఏడు ఒకటి నాలుగు (2714).

إِنَّ اللهَ قَسَمَ بَيْنَكُمْ أَخْلَاقَكُمْ كَمَا قَسَمَ بَيْنَكُمْ أَرْزَاقَكُمْ
[ఇన్నల్లాహ ఖసమ బైనకుమ్ అఖ్ లాఖకుమ్ కమా ఖసమ బైనకుమ్ అర్జాఖకుమ్]
“నిశ్చయంగా అల్లాహ్ మీ మధ్య మీ ఉపాధిని ఎలాగైతే పంచిపెట్టాడో, అలాగే మీ మధ్య మీ ప్రవర్తనలను కూడా పంచిపెట్టాడు.”

وَإِنَّ اللهَ يُعْطِي الدُّنْيَا مَنْ يُحِبُّ وَمَنْ لَا يُحِبُّ
[వ ఇన్నల్లాహ యుఅతీ అద్దున్యా మన్ యుహిబ్బు వ మన్ లా యుహిబ్బు]
“మరియు నిశ్చయంగా అల్లాహ్ ఈ ప్రపంచాన్ని (దున్యా) తాను ప్రేమించేవారికి మరియు ప్రేమించనివారికి కూడా ఇస్తాడు.”

وَلَا يُعْطِي الْإِيمَانَ إِلَّا مَنْ أَحَبَّ
[వలా యుఅతీ అల్-ఈమాన ఇల్లా మన్ అహబ్బ్]
“కానీ విశ్వాసాన్ని (ఈమాన్) తాను ప్రేమించిన వారికి తప్ప (మరెవ్వరికీ) ఇవ్వడు.”

فَمَنْ ضَنَّ بِالْمَالِ أَنْ يُنْفِقَهُ، وَخَافَ الْعَدُوَّ أَنْ يُجَاهِدَهُ
[ఫమన్ జన్న బిల్ మాలి అన్ యున్ఫిఖహు, వ ఖాఫల్ అదువ్వ అన్ యుజాహిదహు]
“ఎవరైతే ధనాన్ని ఖర్చు చేయడానికి పిసినారితనం చేస్తాడో, మరియు శత్రువుతో జిహాద్ చేయడానికి భయపడతాడో,”

وَهَابَ اللَّيْلَ أَنْ يُكَابِدَهُ، فَلْيُكْثِرْ مِنْ قَوْلِ
[వ హాబల్లైల అన్ యుకాబిదహు, ఫల్యుక్ సిర్ మిన్ ఖవ్లి]
“మరియు రాత్రి (ఇబాదత్ కోసం) మేల్కోవడానికి కష్టపడతాడో, అతను ఈ మాటలను ఎక్కువగా పలకాలి:”

سُبْحَانَ اللهِ وَالْحَمْدُ لِلهِ وَلَا إِلَهَ إِلَّا اللهُ وَاللهُ أَكْبَرُ
[సుబ్ హానల్లాహి వల్ హమ్దులిల్లాహి వ లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్]
“అల్లాహ్ పవిత్రుడు, సర్వ స్తోత్రాలు అల్లాహ్ కే, అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు మరియు అల్లాహ్ గొప్పవాడు.”

హదీసు యొక్క వివరణ

నిశ్చయంగా అల్లాహ్ త’ఆలా మీ మధ్యలో ఉపాధిని ఎలా పంచిపెట్టాడో అలాగే మీ యొక్క ప్రవర్తనను కూడా మీ మధ్యలో పంచిపెట్టాడు. నిశ్చయంగా అల్లాహ్ త’ఆలా ఎవరిని ప్రేమిస్తున్నాడో, మరెవరిని ప్రేమించడో, ప్రతి ఒక్కరికీ ఈ ప్రపంచ సామాగ్రి ఇస్తాడు. వలా యుఅతీ అల్-ఈమాన ఇల్లా మన్ అహబ్బ్. కానీ విశ్వాసం అన్నది తాను ప్రేమించిన వారికి మాత్రమే ప్రసాదిస్తాడు.

గమనించండి. ఈ లోకం, ఇందులో ఉన్నటువంటి సామాగ్రి అల్లాహ్ ప్రేమించిన వారికి లభిస్తుంది మరియు ప్రేమించని వారికి లభిస్తుంది. కానీ విశ్వాసం ఏదైతే ఉందో, సదాచరణ భాగ్యం ఏదైతే ఉందో అది ఎవరికి ప్రాప్తిస్తుంది? ఇల్లా మన్ అహబ్బ్. కేవలం ఎవరైతే అల్లాహ్, ఎవరినైతే అల్లాహ్ ప్రేమిస్తున్నాడో వారికి మాత్రమే ఈ విశ్వాస భాగ్యం, సదాచరణ భాగ్యం, అల్లాహ్ ధర్మంపై స్థిరంగా ఉండేటువంటి భాగ్యం ప్రాప్తిస్తుంది.

ఇక ఎవరైతే డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారో మీరు అడిగిన ప్రశ్నలో ఉన్నటువంటి పదాలు, వాస్తవంగా వారు అల్లాహ్ యొక్క ఉద్దేశ్యాన్ని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇలాంటి హదీసులను అర్థం చేసుకోలేదు. మనం విశ్వాసం పొంది ఉన్నాము, సదాచరణలో ముందుకు సాగుతూ ఉన్నాము, ఇది అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం. ఇది తప్ప ప్రపంచ సామాగ్రి ఇదంతా కూడా ఇహలోకంలోనే అంతమైపోయేది. మనకు తోడుగా వచ్చేది కాదు. దీనికి సంబంధించి కూడా హదీసులో చాలా స్పష్టంగా ఉంది కదా. మనిషి చనిపోయినప్పుడు మూడు విషయాలు అతని, మూడు వస్తువులు, మూడు రకాల విషయాలు అతని వెంట వస్తాయి. అతని బంధువులు, అతను సంపాదించిన సామాగ్రి, ధనం, మరియు అతని యొక్క ఆచరణ. కానీ బంధువులు మరియు అతని డబ్బు, ధనం ఇదంతా కూడా వెనుతిరిగిపోతుంది. అతనికి తోడుగా సమాధిలో ఉండేది, అతనికి పనికివచ్చేది అతని యొక్క ఆచరణ. ఒకవేళ మంచి ఆచరణ ఉండేది ఉంటే అతనికి తప్పకుండా లాభం కలుగుతుంది. చెడు ఆచరణ ఉండేది ఉంటే అతనికి చాలా నష్టం కలుగుతుంది.

అందుకొరకు ఇలాంటి మోసంలో నుండి, మోసాల నుండి బయటపడండి. ప్రియులారా, మిత్రులారా, సోదర సోదరీమణులారా, ఎవరికైనా ఈ లోకంలో ఏదైనా డబ్బు, ధనం అదంతా లభించినది అంటే అల్లాహ్ ప్రేమిస్తున్నాడని భావం కాదు. అతనికి విశ్వాసం లభించినది, అతడు అల్లాహ్ కు ఇష్టమైన సత్కార్యాలు, అల్లాహ్ కు ఇష్టమైన మంచి పనులు చేస్తున్నాడంటే అది అల్లాహ్ అతన్ని ప్రేమిస్తున్నాడు అన్నటువంటి భావం. అల్లాహ్ మనందరికీ కూడా విశ్వాసం, సదాచరణ భాగ్యం ప్రసాదించుగాక. అయితే ఇహలోక సామాగ్రి మన అవసరం. వాటిని మనం అల్లాహ్ కు ఇష్టమైన రీతిలో, విశ్వాసంతో పాటు సదాచరణతో వాటిని ఉపయోగిస్తూ ఉండేది ఉంటే ఇంకా మనకు లాభం అనేది ఇహపరలోకాల్లో పెరుగుతూ ఉంటుంది.

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ : https://teluguislam.net/?p=18622


మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1