హృదయ శోధన – షేఖ్ షరీఫ్ మదనీ [ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

హృదయ శోధన
(హృదయ ఆచరణలు – 3వ భాగం)
వక్త: షరీఫ్ (హఫిజహుల్లాహ్), వైజాగ్
https://youtu.be/9ol7QWzS3Fw [14 నిముషాలు]
హృదయ ఆచరణలు (భాగాలు 1 – 12) [2 గంటల 8 నిముషాలు]

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ. نَحْمَدُهُ وَنُصَلِّي عَلَى رَسُولِهِ الْكَرِيمِ أَمَّا بَعْدُ
అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. నహ్మదుహు వ నుసల్లీ అలా రసూలిహిల్ కరీమ్ అమ్మాబాద్.

ప్రియమైన ధార్మిక సోదరులారా! ప్రియమైన ధార్మిక సోదరీమణులారా! హృదయ ఆచరణలు అనే ఈ అంశములో మూడవ భాగానికి మీకు స్వాగతం. సోదరులారా ఈరోజు మనము తెలుసుకునే అంశం హృదయము, కన్ను మరియు చెవి. వీటిని అల్లాహ్ మనకు ప్రసాదించాడు. ఇవి మన దేహములో గొప్ప ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. కాబట్టి వీటిని గురించి కూడా మనల్ని ప్రశ్నించటం జరుగుతుంది. అల్లాహ్ త’ఆలా ఖురాన్ గ్రంథములో తెలియజేస్తున్నారు 17వ సూరా, సూరె బనీ ఇస్రాయీల్ వాక్యము సంఖ్య 36. అల్లాహ్ అంటూ ఉన్నారు,

إِنَّ السَّمْعَ وَالْبَصَرَ وَالْفُؤَادَ كُلُّ أُولَٰئِكَ كَانَ عَنْهُ مَسْئُولًا
ఇన్నస్సమ్’అ వల్ బసర వల్ ఫుఆద కుల్లు ఉలాయిక కాన అన్హు మస్’ఊలా
నిశ్చయముగా చెవి, కన్ను, హృదయము వీటన్నింటిని గురించి ప్రశ్నించటం జరుగుతుంది.

కాబట్టి సోదరులారా మనం మన కళ్ళతో మంచిని చూడాలి. మన చెవులతో మంచిని వినాలి. మన హృదయముతో మంచిని గురించి ఆలోచించాలి.

ఆ తర్వాత ప్రియులారా ఈ మూడింటిలో కూడా ఎక్కువ ప్రాధాన్యత హృదయానికి ఉంది అనగా చెవి, కన్ను కంటే హృదయానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నది.

హజరతే ఖాలిద్ బిన్ మాదాన్ రహమహుల్లాహ్ ఇలా తెలియజేస్తున్నారు, ప్రతి వ్యక్తికి నాలుగు కళ్ళు ఉంటాయి. రెండు కళ్ళు అతని ముఖంపై ఉంటాయి వేటితోనైతే అతడు ప్రాపంచిక వ్యవహారాలను చూస్తాడో. ఆ తర్వాత,

وَعَيْنَانِ فِي قَلْبِهِ
వ ఐనాని ఫీ ఖల్బిహీ
మరియు రెండు కళ్ళు అతని హృదయంలో ఉంటాయి.

వాటితో అతడు పరలోక జీవితమును చూస్తాడు ప్రియులారా. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏ దాసునికైనా మేలు చేయాలనుకుంటాడో, మంచి చేయాలనుకుంటాడో అప్పుడు ఆ వ్యక్తి యొక్క హృదయములో ఉన్న ఆ కళ్ళను అల్లాహ్ తెరచి వేస్తాడు ప్రియులారా. అప్పుడు అతడు ఆ హృదయములో ఉన్న ఆ కళ్ళతో అల్లాహ్ యొక్క అనుగ్రహాలన్నింటినీ చూస్తాడు. ఎలాగైతే అల్లాహ్ త’ఆలా ఖురాన్ గ్రంథములో తెలియజేస్తూ ఉన్నారో 47వ సూరా, సూరె ముహమ్మద్ వాక్యము సంఖ్య 24 లో అల్లాహ్ అంటూ ఉన్నారు ప్రియులారా,

أَمْ عَلَىٰ قُلُوبٍ أَقْفَالُهَا
అమ్ అలా కులూబిన్ అఖ్ఫాలుహా
ఏమిటి వారు ఆలోచించరా లేక వారి హృదయాలపై తాళాలు పడి ఉన్నాయా?

కాబట్టి సోదరులారా దీని ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏమిటంటే, హృదయం యొక్క స్థాయి చాలా గొప్పది ప్రియులారా. దీని గురించి మనము తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఈ హృదయాన్ని భయభక్తి కలిగినదిగా మనం ఎలా తయారు చేసుకోవాలి, మంచి హృదయంగా ఎలా మరల్చుకోవాలి, ఖల్బే సలీం, నిర్మలమైన హృదయంగా దీనిని ఎలా తయారు చేసుకోవాలి, దీని విషయమై మీకు మరియు నాకు చింతింపవలసి ఉన్నది సోదరులారా. ఎందుకంటే ప్రతి హృదయంలోనైతే, ప్రతి శరీరంలోనైతే హృదయం ఉంటుంది ప్రియులారా, కానీ ఎలాంటి హృదయం ఆ శరీరములో ఉంది? మంచి హృదయమా? భయభక్తితో, భయభక్తితో కూడిన హృదయమా? ఎలాంటి హృదయం ఆ శరీరంలో ఉన్నది? మరి అలాంటి హృదయం కోసం మనం ఏమి చేయాలి? పదండి సోదరులారా దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా అయితే మనం మన హృదయాన్ని మంచి హృదయంగా మార్చుకోగలం.

మొదటి విషయం ప్రియులారా, పూర్తి ఇఖ్లాస్, చిత్తశుద్ధితో మనం అల్లాహ్ వైపునకు మరలాలి. ఆ విధంగా మన హృదయం దాని ప్రభువుతో దృఢ సంబంధం ఏర్పరచుకోవాలి. అది దానిని సృష్టించిన వానితో సంబంధం పెట్టుకోవాలి. అంటే పూర్తి విశ్వాసం, చిత్తశుద్ధితో అల్లాహ్ వైపునకు మరలాలి. ఇంకా నేను మీకు ఒక వాస్తవ విషయం గురించి తెలుపుతున్నాను ప్రియులారా. అది మీకు చాలా అవసరమైనది, నాకు చాలా అవసరమైనది. ఆ వాస్తవ విషయం ఏమిటంటే మన హృదయం దానిని సృష్టించిన దాని సృష్టికర్త అల్లాహ్‌తో కాకుండా వేరే వాటితో దాని సంబంధం పెట్టుకుంటే అది రాయి అయినా, స్త్రీ అయినా, ఆస్తిపాస్తులైనా, సిరిసంపదలైనా అవి ఆ హృదయం కొరకు నష్టాన్ని తీసుకువచ్చే కారణాలు అయిపోతాయి ప్రియులారా. ఇది చాలా ముఖ్యమైన విషయం ప్రియులారా. హృదయాన్ని దాని సృష్టికర్త ఎందుకు తయారు చేశాడంటే అది ఆయనతోనే బంధాన్ని ఏర్పరచుకోవటానికి, ఆయనతో కాకుండా వేరే వాటితో మన హృదయం బంధాన్ని ఏర్పరచుకుంటే అది అతనికి ప్రమాద ఘంటిక వంటిది ప్రియులారా. అంటే అల్లాహ్ కంటే ఎక్కువ ప్రాధాన్యత, అల్లాహ్ ఆరాధన కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇతర విషయాలకు గనుక ఇస్తే అది మన కోసం ప్రమాద ఘంటిక ప్రియులారా. కాబట్టి మనం అన్ని విషయాల కంటే ఎక్కువగా ప్రాధాన్యత అల్లాహ్ యొక్క ఆరాధనకే కల్పించాలి.

మన హృదయాలలో మన తండ్రి తాతల కంటే, అన్నదమ్ముల కంటే, భార్యల కంటే, ఆస్తిపాస్తుల కంటే, బంధు మిత్రుల కంటే, వ్యాపారము కంటే, మనం ఎంతగానో ప్రేమించే మన నివాసాల కంటే, సమస్త ప్రాపంచిక విషయాల కంటే ఎక్కువ ప్రేమ మన హృదయంలో అల్లాహ్ పై ఉండాలి ప్రియులారా. అల్లాహ్ పై అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి, అప్పుడే మన హృదయం మహోన్నతమైన హృదయంగా మారుతుంది ప్రియులారా.

ఇక రెండవ విషయం:

اسْتِعْمَالُ الْقَلْبِ فِيمَا خُلِقَ
ఇస్తి’మాలుల్ ఖల్బి ఫీమా ఖులిక
హృదయాన్ని దాని కోసం ఉపయోగించాలి దేనికోసమైతే అల్లాహ్ దానిని పుట్టించాడో.

అల్లాహ్ దానిని అల్లాహ్ దాస్యము కోసం పుట్టించాడు ప్రియులారా. హృదయం గురించి ఇలా చెప్పడం జరుగుతుంది:

سَيِّدُ الْأَعْضَاءِ وَرَأْسُهَا
సయ్యిదుల్ ఆ’దా వ రా’సుహా
అది అవయవాలన్నింటికీ నాయకుని లాంటిది మరియు అవయవాలన్నింటికీ శిరస్సు లాంటిది.

కాబట్టి సోదరులారా ఆ హృదయాన్ని మనం మంచి పనుల కోసం ఉపయోగించాలి, అల్లాహ్ ఆరాధనలో ఉపయోగించాలి, మంచి పనుల కోసం ఆలోచించటంలో ఉపయోగించాలి, అల్లాహ్ యొక్క జిక్ర్ లో ఉపయోగించాలి, ఖురాన్ యొక్క పారాయణములో ఉపయోగించాలి. దానిలోనే ప్రశాంతత ఉంది ప్రియులారా. అల్లాహ్ తెలియజేస్తున్నారు, 13వ సూరా, అర్ రాద్ వాక్యము సంఖ్య 28. అల్లాహ్ అంటూ ఉన్నారు:

أَلَا بِذِكْرِ اللَّهِ تَطْمَئِنُّ الْقُلُوبُ
అలా బి జిక్రిల్లాహి తత్మఇన్నుల్ కులూబ్
తెలుసుకోండి, అల్లాహ్ నామ స్మరణలోనే హృదయాలకు ప్రశాంతత ఉంది.

కాబట్టి మనం జిక్ర్, అల్లాహ్ యొక్క స్మరణలోనే ప్రశాంతత పొందగలం ప్రియులారా. అల్లాహ్‌కు విధేయత చూపే హృదయం అల్లాహ్ యొక్క నామస్మరణలో ప్రశాంతత పొందుతుంది. మరి మనము నేడు అల్లాహ్ యొక్క జిక్ర్ లో ప్రశాంతత పొందుతున్నామా లేక సినిమాలలో, డాన్సులలో, నృత్యాలలో, పాటలు వినటములో, సంగీతములో, టీవీ సీరియల్లు చూడటములో, ఇతరత్రా పనికిమాలిన విషయాలలో ప్రశాంతతను పొందుతున్నామా ప్రియులారా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ మనము గనుక ఈ సినిమాలతో, సంగీతముతో మన హృదయానికి ప్రశాంతత గనుక లభిస్తుంటే మన హృదయం ఒక రోగగ్రస్తమైన హృదయం ప్రియులారా.

షేఖుల్ ఇస్లామ్ ఇబ్నె తైమియా రహమహుల్లాహ్ తెలియజేస్తున్నారు ప్రియులారా, సంగీతం మ్యూజిక్ మనిషి హృదయానికి మద్యపానము లాంటి ఒక వ్యసనము. మ్యూజిక్, సంగీతం వినటము హృదయానికి ఎలాంటిది? మద్యపానము లాంటి ఒక వ్యసనం ప్రియులారా. అది మనిషిని సన్మార్గము నుండి తప్పించేస్తుంది సుబ్ హా నల్లాహ్! అల్లాహు అక్బర్ ప్రియులారా! కానీ జిక్ర్ మనిషి హృదయానికి ఎలాంటిది ప్రియులారా? నీటిలో ఉన్న చేపకు నీరు లాంటిది సుబ్ హా నల్లాహ్!. ఆ నీరు ఉంటేనే ఆ నీరు ఉంటేనే ఆ చేప బ్రతుకుతుంది ప్రియులారా. అదే విధంగా అల్లాహ్ యొక్క జిక్ర్ ఉంటేనే మన హృదయం బ్రతుకుతుంది, అల్లాహ్ యొక్క జిక్ర్ లేకపోతే మన హృదయం కూడా చనిపోతుంది ప్రియులారా. ఏ విధంగానైతే నీళ్లు లేకపోతే చేప చనిపోతుందో, అల్లాహ్ యొక్క జిక్ర్ లేకపోతే మన హృదయం చనిపోతుంది ప్రియులారా. కాబట్టి సోదరులారా, ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన యొక్క హృదయాలకు ప్రశాంతత కచ్చితంగా అల్లాహ్ యొక్క స్మరణలో మాత్రమే, అల్లాహ్ యొక్క జిక్ర్ లో మాత్రమే మన హృదయాలకు ప్రశాంతత రావాలి ప్రియులారా. మనము గనక అల్లాహ్ యొక్క జిక్ర్ చేయకపోతే మన హృదయాలు చనిపోయిన హృదయాలు అవుతాయి ప్రియులారా.

బుఖారీ గ్రంథములో ఒక హదీసు నఖలు చేయబడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు ప్రియులారా:

مَثَلُ الَّذِي يَذْكُرُ رَبَّهُ وَالَّذِي لَا يَذْكُرُ رَبَّهُ مَثَلُ الْحَيِّ وَالْمَيِّتِ
మసలుల్లజీ యజ్కురు రబ్బహు వల్లజీ లా యజ్కురు రబ్బహు మసలుల్ హయ్యి వల్ మయ్యితి
అల్లాహ్ యొక్క జిక్ర్ చేసే హృదయం సజీవమైన వారితో సమానము. అల్లాహ్ యొక్క జిక్ర్ చేయని వారి హృదయం, అల్లాహ్ యొక్క జిక్ర్ చేయని వారు మరణించిన వారితో సమానము.

కాబట్టి సోదరులారా మనం జిక్ర్ అలవాటు చేసుకోవాలి, ఎల్లవేళలా అల్లాహ్‌ను స్మరిస్తూ ఉండాలి, “సుబ్ హా నల్లాహ్” దీని అర్థం ప్రియులారా అల్లాహ్ పరమ పవిత్రుడు. “అల్హందులిల్లాహ్” దీని అర్థము సర్వ స్తోత్రములు అల్లాహ్‌కే శోభిస్తాయి. “అల్లాహు అక్బర్” అంటే అల్లాహ్ చాలా గొప్పవాడు ప్రియులారా. మనం అల్లాహ్‌ను జ్ఞాపకం చేసుకుంటే అల్లాహ్ మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ప్రియులారా. అల్లాహ్ సెలవిస్తున్నారు:

فَاذْكُرُونِي أَذْكُرْكُمْ
ఫజ్కురూనీ అజ్కుర్కుమ్
మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను.

కాబట్టి సోదరులారా, చివరిగా జిక్ర్ కు సంబంధించి కొన్ని విషయాలు చెప్పటానికి ప్రయత్నిస్తాను ప్రియులారా. మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, బుఖారీ గ్రంథములో హదీసు నఖలు చేయబడుతుంది. ప్రవక్త వారు అంటూ ఉన్నారు,

రెండు పదాలు, రెండు వచనాలు పలకటానికి చాలా తేలికైనవి, త్రాసులో చాలా బరువైనవి, కరుణామయుడైన అల్లాహ్‌కు చాలా ఇష్టమైనవి. ఆ రెండు పదాలు “సుబ్ హా నల్లాహి వ బిహందిహీ, సుబ్ హా నల్లాహిల్ అజీమ్”.

ఈ రెండు వచనాలు అల్లాహ్‌కు చాలా ఇష్టం ప్రియులారా. ఆ తర్వాత ముస్లిం హదీసు గ్రంథములో ఇలా ఉంది ప్రియులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటూ ఉన్నారు,

“సుబ్ హా నల్లాహి వల్హందులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లహు అక్బర్” అని పలకటం సూర్యుడు ఉదయించే ఈ ప్రపంచములో ఉన్న వస్తువులన్నింటికంటే నాకు ప్రియమైనది.”

ఏమిటి ప్రియులారా? “సుబ్ హా నల్లాహి వల్హందులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లహు అక్బర్” అని పలకటం ప్రియులారా సూర్యుడు ఉదయించే ఈ ప్రపంచములో వస్తువులన్నింటికంటే ఎక్కువగా ప్రవక్తకు ప్రియమైనది ప్రియులారా.

అదే విధంగా సోదరులారా, బుఖారీ గ్రంథములో ఇలా ఉంది, ఎవరైతే రోజుకు వంద సార్లు “లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీకలహు లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్” అని పలుకుతారో వారి కోసం వంద పుణ్యాలు లిఖించబడతాయి. వంద పాపాలు క్షమించబడతాయి. ఆ రోజు సాయంత్రం వరకు ఆ పలుకులు వారిని షైతాన్ బారి నుండి రక్షిస్తాయి.

ఆ తర్వాత సోదరులారా బుఖారీ గ్రంథములో ఇలా ఉంది, ఎవరైతే వంద సార్లు “సుబ్ హా నల్లాహి వ బిహందిహీ” అని పలుకుతారో వారి పాపాలు క్షమించబడతాయి ప్రియులారా అవి సముద్రపు నురుగుకు సమానంగా ఉన్నా సరే.

ఆ తర్వాత ప్రవక్త తెలియజేస్తున్నారు ప్రియులారా, అల్హందులిల్లాహ్ అనే పదం త్రాసును నింపి వేస్తుంది. “సుబ్ హా నల్లాహ్, అల్హందులిల్లాహ్” అని పలుకులు భూమి ఆకాశాల మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని నింపేస్తాయి ప్రియులారా.

కాబట్టి అల్లాహ్ యొక్క నామస్మరణతో మన హృదయానికి ప్రశాంతత లభిస్తుంది ప్రియులారా. కాబట్టి జిక్ర్ అనే ఆ హృదయ ఆచరణ మనం చేయాలి. ఏదైతే జిక్ర్ మనం చేస్తున్నామో అదే సమయములో దాని యొక్క అర్థము కూడా మన హృదయంలో రావాలి ప్రియులారా. మనం చేసే జిక్ర్ యొక్క అర్థాన్ని కూడా మనం తెలుసుకొని ఆ జిక్ర్ చేస్తే మనం దాని యొక్క మాధుర్యాన్ని పొందుతాం ప్రియులారా.

ఇన్షా అల్లాహ్ మరిన్ని విషయాలు తర్వాత దర్సులో మీ ముందు ఉంచటానికి ప్రయత్నం చేస్తాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ చెప్పటం, వినటం కంటే ఎక్కువగా ఆచరణ చేసే భాగ్యాన్ని ప్రసాదించు గాక.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

షేఖ్ షరీఫ్, మదీనా గ్రాడ్యుయేట్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5Ii