జుల్‌ఖర్‌నైన్‌ వృత్తాంతము [వీడియో]

బిస్మిల్లాహ్

మొదటి భాగం

[47 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

రెండవ భాగం

[42 నిముషాలు]

మూడవ భాగం

[48 నిముషాలు]

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

జుల్ ఖర్నైన్ (మహా సాహసవంతుడు)

నా ప్రభువు వాగ్దాన సమయం వచ్చినపుడు ఆయన దీనిని (ఈ గోడను) నేలమట్టం చేసేస్తాడు” అని జుల్ ఖర్నైన్ చెప్పాడు.
(దివ్యఖుర్ఆన్ 18 : 98)

జుల్ ఖర్నైన్ వద్ద అతిపెద్ద సైన్యం, ఒక మహాసామ్రాజ్యం ఉండేవి. అల్లాహ్ అతడికి భూమిపై అధికారం ప్రసాదించాడు. అతడికి కావలసిన సమస్తమూ ఇచ్చాడు. ఆ మహాసైన్యం అతడి ఆజ్ఞను జవదాటేది కాదు. అతడికి లొంగని దేశం లేదు. అతడికి అనువు కాని ప్రదేశం అంటూ ఏదీ లేదు. ఎలాంటి సాహసమైనా అతడికి సాధ్యం కానిది కాదు. అతడు పాల్గొన్న ప్రతి యుద్ధం లోనూ విజేతగా నిలిచాడు.

అప్పటి ప్రపంచంలో నలు మూలలా అతడు పర్యటించాడు. తూర్పు నుంచి పడమరకు ప్రతీ చోటికి వెళ్ళాడు. ఒక ప్రదేశంలో ఒక పెద్ద సరస్సు వద్ద నీరు బురదతో కలసి బుడగలుగా వస్తుండడాన్ని చూశాడు. ఈ ప్రదేశం ప్రపంచానికి చివరిదా లేక ఈ ప్రదేశం తర్వాత కూడా ప్రపంచం ఉందా అని ఆలోచించ సాగాడు. ఆ ప్రదేశంలో కొందరు మనుష్యులు కనబడ్డారు. వాళ్ళు దైవం గురించి తెలియని అవిశ్వాసులు. పరమ దుర్మార్గులు. ప్రజలను దోచుకోవడం, హత్యలు చేయడం వృత్తిగా బ్రతుకుతున్నవాళ్ళు. జుల్ ఖర్నైన్ అల్లాహ్ ను ప్రార్థించి మార్గ దర్శకత్వం కోసం మొర పెట్టుకున్నాడు. అల్లాహ్ అతడికి రెండు మార్గాలలో ఒకదాన్ని ఎంచుకోమన్నాడు. “జుల్ ఖర్నైన్ వారిని శిక్షించు లేదా వారిపై దయచూపు”. జుల్ ఖర్నైన్ తన సైనికులతో, “మనం ఇక్కడ దుర్మార్గులను శిక్షిద్దాం. వాళ్ళు ప్రభువు వద్దకు వెళ్ళిన తర్వాత మళ్ళీ తగిన శిక్ష పొందుతారు. అయితే మనం మంచివారిని దయతో చూద్దాం” అన్నాడు. జుల్ ఖర్నైన్ ఆ ప్రజలను సంస్కరిస్తూ అక్కడ కొంతకాలం గడిపాడు. అక్కడ న్యాయాన్ని స్థాపించిన తర్వాత, మంచివారిని అక్కడ పాలకులుగా నియమించిన తర్వాత వారి నుంచి సెలవు తీసుకుని వెళ్లిపోయాడు.

జుల్ ఖర్నైన్ మహాసాహసి అయిన పాలకుడు. తూర్పు దిశగా ప్రయాణం చేశాడు. అవిశ్వాసులను సంస్కరిస్తూ, వారితో యుద్ధాలు చేస్తూ తన సైన్యంతో యాత్ర కొనసాగించాడు. ఆయన ప్రతి యుద్ధంలోనూ విజేతగా నిలిచాడు. అలా ప్రయాణిస్తూ అతను ఒక ప్రదేశానికి వచ్చాడు. ఆ ప్రదేశం నాగరికతకు ఆఖరుగా భావించాడు. అక్కడ ప్రజలకు నివాస గృహాలు లేవు. ఎలాంటి ఆశ్రయం లేదు. కనీసం చెట్టు నీడ కూడా వారికి లేదు. వారంతా పరమ అజ్ఞానంలో బ్రతుకు తున్నారు. ఆయన వారి మధ్య కొంతకాలం నివసించాడు. వారికి సంస్కారాన్ని నేర్పాడు. నాగరికతను నేర్పాడు. వారికి అల్లాహ్ గురించి బోధించాడు. వారి కోసం ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత అతను పశ్చిమ దిశగా ప్రయాణం ప్రారంభించాడు.

ఆ విధంగా జుల్ ఖర్నైన్ ఒక దేశానికి చేరుకున్నాడు. ఆ దేశం రెండు కొండల నడుమ ఉంది. చాలా అభివృద్ధి చెందిన దేశం అది. అక్కడి ప్రజలు జుల్ ఖర్నైన్ ను తమకు, తమ పొరుగు దేశానికి మధ్య ఒక గోడ కట్టాలని అభ్యర్థించారు. పొరుగు దేశం ప్రజలు తమపై దాడి చేసి తమ సంపద దోచుకుని హత్యాకాండకు పాల్పడుతున్నారని అన్నారు. పొరుగున ఉంటున్నది యాజూజ్, మాజూజ్ తెగలు. అడ్డుగోడ కట్టినందుకు ప్రతిగా సుంకం చెల్లిస్తామని కూడా వారన్నారు. కాని జుల్ ఖర్నైన్ వారికి జవాబిస్తూ, “నాకు అల్లాహ్ చాలినంత ధనం ప్రసాదించాడు. కనుక మీ శ్రమ తప్ప మరేమీ నాకు అవసరంలేదు. మీకు దురాక్రమణ దారులకు మధ్య పటిష్టమైన అడ్డుగోడ నేను నిర్మిస్తాను” అన్నాడు. వారు సంతో షంగా ఒప్పుకున్నారు.

ఇనుమును భారీగా ఉపయోగించి జుల్ ఖర్నైన్ రెండు కొండల మధ్య ప్రదేశాన్ని పూరించాడు. ఒక భారీ గోడను నిర్మించి ఆ గోడపై కరిగిన లోహాన్నిపోతపోసాడు. దురాక్రమణదారులు ఆ లోహపు నునుపైన గోడపైకి ఎక్కడం కాని, గోడను పగులకొట్టి చొరబడడం కాని సాధ్యపడని విధంగా తయారుచేశాడు. ఆ దేశ ప్రజలు సంతోషించారు. గోడ నిర్మాణం పూర్తయిన తర్వాత జుల్ ఖర్నైన్ అల్లాహ్ కు కృతజ్ఞతగా నమాజు చేశాడు. “ఇది కేవలం నా ప్రభువు కటాక్షం. అయితే నా ప్రభువు వాగ్దాన సమయం వచ్చినపుడు ఆయన దాన్ని నేలమట్టం చేసేస్తాడు. నిశ్చయంగా నా ప్రభువు వాగ్దానం నెరవేరటం తథ్యం” అన్నాడు. (దివ్యఖుర్ఆన్ 18:83-98, ఇంతకు ముందు చెప్పబడిన కథ కూడా ఈ రిఫరెన్సులో ఉంది)

18:83  وَيَسْأَلُونَكَ عَن ذِي الْقَرْنَيْنِ ۖ قُلْ سَأَتْلُو عَلَيْكُم مِّنْهُ ذِكْرًا

(ఓ ప్రవక్తా!) వారు నిన్ను జుల్‌ఖర్‌నైన్‌ గురించి అడుగుతున్నారు. “నేను మీకు అతని వృత్తాంతం కొద్దిగా చదివి వినిపిస్తాన”ని వారికి చెప్పు.

18:84  إِنَّا مَكَّنَّا لَهُ فِي الْأَرْضِ وَآتَيْنَاهُ مِن كُلِّ شَيْءٍ سَبَبًا

మేము అతనికి భువిలో అధికారం ఇచ్చాము. అన్ని రకాల సాధన సంపత్తుల్నికూడా అతనికి సమకూర్చాము.

18:85  فَأَتْبَعَ سَبَبًا

అతను ఒక దిశలో పోసాగాడు.

18:86  حَتَّىٰ إِذَا بَلَغَ مَغْرِبَ الشَّمْسِ وَجَدَهَا تَغْرُبُ فِي عَيْنٍ حَمِئَةٍ وَوَجَدَ عِندَهَا قَوْمًا ۗ قُلْنَا يَا ذَا الْقَرْنَيْنِ إِمَّا أَن تُعَذِّبَ وَإِمَّا أَن تَتَّخِذَ فِيهِمْ حُسْنًا

చివరకు అతను సూర్యుడు అస్తమించే ప్రదేశానికి చేరుకుని, సూర్యుడు ఒక బురద చెలమలో అస్తమిస్తుండగా చూశాడు. దాని సమీపంలో అతను ఒక జాతి వారిని కూడా కనుగొన్నాడు. “ఓ జుల్‌ఖర్‌నైన్‌! నువ్వు వీళ్లను శిక్షించవచ్చు. లేదా వీరి విషయంలో మరేదయినా ఉత్తమ వైఖరిని అవలంబించవచ్చు” అని మేమతనికి సెలవిచ్చాము.

18:87  قَالَ أَمَّا مَن ظَلَمَ فَسَوْفَ نُعَذِّبُهُ ثُمَّ يُرَدُّ إِلَىٰ رَبِّهِ فَيُعَذِّبُهُ عَذَابًا نُّكْرًا

దానికతను, “దుర్మార్గానికి ఒడిగట్టిన వాణ్ణి మేము శిక్షిస్తాము. తరువాత అతను తన ప్రభువు వద్దకు మరలించబడతాడు. ఆయన అతనికి మరింత తీవ్రమైన శిక్ష విధిస్తాడు” అని అన్నాడు.

18:88  وَأَمَّا مَنْ آمَنَ وَعَمِلَ صَالِحًا فَلَهُ جَزَاءً الْحُسْنَىٰ ۖ وَسَنَقُولُ لَهُ مِنْ أَمْرِنَا يُسْرًا

“అయితే విశ్వసించి, మంచిపనులు చేసినవారికి ప్రతి ఫలంగా మేలు కలుగుతుంది. అలాంటి వారికి మేము సయితం మా పనిలో తేలికపాటి ఆదేశాలే ఇస్తాము” (అని అన్నాడు).

18:89  ثُمَّ أَتْبَعَ سَبَبًا

ఆ తరువాత అతను మరో దారి పట్టాడు –

18:90  حَتَّىٰ إِذَا بَلَغَ مَطْلِعَ الشَّمْسِ وَجَدَهَا تَطْلُعُ عَلَىٰ قَوْمٍ لَّمْ نَجْعَل لَّهُم مِّن دُونِهَا سِتْرًا

అతను సూర్యుడు ఉదయించే ప్రదేశానికి చేరుకున్నప్పుడు, అక్కడ సూర్యుడు ఒక జాతి వారిపై ఉదయించటం చూశాడు. మేము వారికీ – సూర్యునికీ మధ్య ఎలాంటి అడ్డునూ ఉంచలేదు.

18:91  كَذَٰلِكَ وَقَدْ أَحَطْنَا بِمَا لَدَيْهِ خُبْرًا

ఇదీ పరిస్థితి! అతనికి సంబంధించిన విషయాలన్నీ మా జ్ఞానపరిధిలో ఉన్నాయి.

18:92  ثُمَّ أَتْبَعَ سَبَبًا

ఆ తరువాత అతను ఇంకొక మార్గాన్ని అనుసరించాడు.

18:93  حَتَّىٰ إِذَا بَلَغَ بَيْنَ السَّدَّيْنِ وَجَدَ مِن دُونِهِمَا قَوْمًا لَّا يَكَادُونَ يَفْقَهُونَ قَوْلًا

అతను రెండు కొండల మధ్య ప్రదేశానికి చేరుకున్నప్పుడు, ఆ రెంటికీ నడుమ ఒక జాతివారిని చూశాడు. వారు అతని (ఒక్క) మాటనైనా అర్థం చేసుకునే స్థితిలో లేరు.

18:94  قَالُوا يَا ذَا الْقَرْنَيْنِ إِنَّ يَأْجُوجَ وَمَأْجُوجَ مُفْسِدُونَ فِي الْأَرْضِ فَهَلْ نَجْعَلُ لَكَ خَرْجًا عَلَىٰ أَن تَجْعَلَ بَيْنَنَا وَبَيْنَهُمْ سَدًّا

“ఓ జుల్‌ ఖర్‌నైన్‌! యాజూజ్‌ మాజూజ్‌లు ఈ దేశంలో కల్లోలాన్ని సృష్టిస్తున్నారు. నువ్వు మాకూ – వారికీ మధ్య ఒక అడ్డుగోడను నిర్మిస్తావా? దానికయ్యే ఖర్చులు నీకు చెల్లించమంటావా?” అని వాళ్లు విన్నవించుకున్నారు.

18:95  قَالَ مَا مَكَّنِّي فِيهِ رَبِّي خَيْرٌ فَأَعِينُونِي بِقُوَّةٍ أَجْعَلْ بَيْنَكُمْ وَبَيْنَهُمْ رَدْمًا

అతనిలా సమాధానమిచ్చాడు: “నాకు నా ప్రభువు అనుగ్రహించిన అధికారమే ఎంతో శ్రేష్ఠమైనది. మీరు మీ (శ్రమ) శక్తి ద్వారా నాకు సహాయపడండి చాలు. నేను మీకూ – వారికీ మధ్య ఒక పటిష్టమైన గోడను నిర్మిస్తాను.

18:96  آتُونِي زُبَرَ الْحَدِيدِ ۖ حَتَّىٰ إِذَا سَاوَىٰ بَيْنَ الصَّدَفَيْنِ قَالَ انفُخُوا ۖ حَتَّىٰ إِذَا جَعَلَهُ نَارًا قَالَ آتُونِي أُفْرِغْ عَلَيْهِ قِطْرًا

“….నాకు ఇనుపరేకులను తెచ్చి ఇవ్వండి.” ఆ విధంగా అతను ఆ రెండు పర్వతాల మధ్య గోడను – సమానంగా – లేపిన తరువాత, “అగ్నిని రాజేయండి” అని ఆజ్ఞాపించాడు. ఆ ఇనుప రేకులు బాగా కాలి అగ్నిగా మారిన తరువాత “కరిగిన రాగిని తెండి, దానిపై పోస్తాను” అని అన్నాడు.

18:97  فَمَا اسْطَاعُوا أَن يَظْهَرُوهُ وَمَا اسْتَطَاعُوا لَهُ نَقْبًا

ఇక వారిలో (యాజూజు మాజూజుల్లో) ఆ గోడను ఎక్కే శక్తి లేకపోయింది. దానికి రంధ్రం వేయటం కూడా వారి తరం కాదు.

18:98  قَالَ هَٰذَا رَحْمَةٌ مِّن رَّبِّي ۖ فَإِذَا جَاءَ وَعْدُ رَبِّي جَعَلَهُ دَكَّاءَ ۖ وَكَانَ وَعْدُ رَبِّي حَقًّا

“ఇది కేవలం నా ప్రభువు కటాక్షం. అయితే నా ప్రభువు వాగ్దాన సమయం వచ్చినపుడు ఆయన దాన్ని నేలమట్టం చేసేస్తాడు. నిశ్చయంగా నా ప్రభువు వాగ్దానం నెరవేరటం తథ్యం” అని జుల్‌ఖర్‌నైన్‌ చెప్పాడు.

18:99  وَتَرَكْنَا بَعْضَهُمْ يَوْمَئِذٍ يَمُوجُ فِي بَعْضٍ ۖ وَنُفِخَ فِي الصُّورِ فَجَمَعْنَاهُمْ جَمْعًا

ఆ రోజు మేము వారిని (సముద్రపు అలల మాదిరిగా) ఒండొకరిలో చొచ్చుకుపోయేలా వదలిపెడతాము. శంఖం ఊద బడుతుంది. అంతే! మేము జనులందరినీ ఒకేసారి సమీకరిస్తాము.

సూరతుల్ కహఫ్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) – మెయిన్ పేజీ. (అన్నీ పాఠాల కోసం)
https://teluguislam.net/tafsir-kahf/

ఖురాన్ మెయిన్ పేజీ
https://teluguislam.net/quran

సూరతుల్ కహఫ్ పారాయణం: సాద్ అల్-ఘమిడి | తెలుగు సబ్ టైటిల్స్: అహ్సనుల్ బయాన్ |వీడియో
https://teluguislam.net/2020/06/25/18-al-kahf