ఉమ్రా విధానం [పుస్తకం & వీడియో| టెక్స్ట్ ]

బిస్మిల్లాహ్

ఉమ్రా విధానం
https://youtu.be/u_fL5H0JOCY [18:29 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ఉపన్యాసంలో ఉమ్రా చేసే విధానం గురించి వివరంగా చెప్పబడింది. జీవితంలో ఒక్కసారైనా ఉమ్రా చేయడం విధి అని తెలిపి, దాని సంక్షిప్త విధానాన్ని వివరించారు. ముఖ్యంగా, ఇహ్రాం ధరించడం, దాని నియమాలు, మగవారికి మరియు ఆడవారికి ఉండే వస్త్రధారణ, ఇహ్రాంలో నిషేధించబడిన పనులు (మహ్‌దూరాతుల్ ఇహ్రాం) గురించి స్పష్టంగా వివరించారు. ఆ తర్వాత, కాబా చుట్టూ చేసే తవాఫ్ విధానం, మొదటి మూడు రౌండ్లలో పురుషులు చేయవలసిన రమల్ (వేగంగా నడవడం), భుజం తెరవడం (ఇద్‌తిబా) వంటి విషయాలను తెలిపారు. తవాఫ్ తర్వాత సఫా, మర్వా పర్వతాల మధ్య సయీ చేసే పద్ధతి, మధ్యలో పచ్చని లైట్ల వద్ద పరుగెత్తడం, దుఆలు చేయడం గురించి వివరించారు. చివరగా, పురుషులు శిరోముండనం లేదా కత్తిరించుకోవడం, స్త్రీలు జుట్టు చివర కత్తిరించుకోవడంతో ఉమ్రా ఎలా పూర్తవుతుందో వివరించి, ప్రతి కార్యాన్ని ఖురాన్, హదీసుల వెలుగులో చేయాలని ముగించారు.


అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

జీవితంలో ఒక్కసారి ఉమ్రా చేయుట విధిగా ఉంది.

ఉమ్రా యొక్క సంక్షిప్త విధానం ఏమిటంటే, ఏదైనా ఒక మీఖాత్ నుండి ఉమ్రా యొక్క ఇహ్రాం చేసి, మక్కా చేరుకొని, కాబతుల్లా తవాఫ్ చేసి, ఆ తర్వాత రెండు రకాతులు చేసి, సఫా మరియు మర్వా మధ్యలో సయీ చేసి, ఆ తర్వాత పురుషుడు పూర్తిగా క్షవరం చేయించుకోవడం, స్త్రీ తన జడ చివరి భాగంలో నుండి 3 సెంటీమీటర్లు కత్తిరించుకోవడం, ఈ విధంగా ఉమ్రా పూర్తవుతుంది.

ఇక రండి, దీని యొక్క వివరణ, సంపూర్ణ విధానం మనం తెలుసుకుందాము.

ఇహ్రాం చేయుట అంటే ఉమ్రా యొక్క ఆరాధనలో ప్రవేశించుట. ఎవరైతే ఉమ్రా చేయాలనుకుంటున్నారో, వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నియమించిన ఐదు మీఖాత్‌లలోని ఏదైనా ఒక మీఖాత్ నుండి ఇహ్రాం చేయాలి.

ఒకటి, ధుల్ హులైఫా (ذُو الْحُلَيْفَة). ఇది మదీనా సమీపంలో ఉన్నది. ఇది మదీనా వాసుల మీఖాత్. ఈ రోజుల్లో దానిని అబ్ యారె అలీ’ (أَبِيَار عَلِيّ) అని అంటారు.

రెండవది, అల్ జుహ్ ఫ (جُحْفَة). ఇది రాబిగ్ సమీపంలో ఒక పల్లెటూరు. ఈ రోజుల్లో రాబిగ్ నుండే ఇహ్రాం చేస్తూ ఉంటారు. ఇది సిరియా వారి యొక్క మీఖాత్.

మూడు, అల్ ఖర్నుల్ మనాజిల్ (اَلْقَرْنُ الْمَنَازِل). దీని మరో పేరు అస్ సైలుల్ కబీర్ (اَلسَّيْلُ الْكَبِير). ఇది తాయిఫ్‌కు సమీపంలో ఉంటుంది. ఇది నజ్ద్ వారి మీఖాత్.

నాలుగు, యలమ్ లమ్'(يَلَمْلَم). ఇది మక్కా నుండి దక్షిణ దిశలో ఉంటుంది. యమన్ వాసుల మీఖాత్.

ఐదవది, జాతు ఇర్ఖ్’ (ذَاتُ عِرْق). ఇది ఇరాఖ్ వారి యొక్క మీఖాత్.

ఈ ఐదు మీఖ్యాతులు, మేము తెలిపిన ఆ పట్టణ వాసులు మరియు ఎవరైతే ఉమ్రా లేదా హజ్ యొక్క ఉద్దేశంతో వీటిలో ఏ ఒక్క దాని నుండి దాటుతారో, వారు తప్పకుండా అక్కడి నుండి ఇహ్రాం చేయాలి.

1. గోళ్ళు తీయడం మరియు చంక వెంట్రుకలు, నాభి కింది వెంట్రుకలు తీయడం, స్నానం చేయడం, సువాసన శరీరానికి పూసుకోవడం, ఇహ్రాం దుస్తులకు సువాసన పూయరాదు.

2. శరీర అవయవాలకు అనుగుణంగా ఉండే అటువంటి దుస్తులు తీసేసి, రెండు బట్టలు, అంటే ఒకటి లుంగీ మాదిరిగా, మరొకటి పైన దుప్పటిగా వేసుకోవాలి. స్త్రీలు తమకిష్టమైన దుస్తులు ధరించవచ్చును కానీ అలంకరణను ప్రదర్శించకూడదు. మరియు వారు చేతులలో గ్లౌసులు వేసుకోరాదు, అలాగే ముఖమును కప్పి ఉంచరాదు, అంటే ముఖముపై నఖబ్ వేసుకోరాదు. కానీ పర పురుషులు ఎదురయ్యే సమయంలో తమ ముఖాన్ని మరియు అరచేతులను సైతం వారికి కనబడకుండా దాచి ఉంచడం తప్పనిసరి.

3. ఏదైనా ఫర్ద్ నమాజ్ సమయం అయితే, దగ్గరలో ఉన్న మస్జిద్‌లో నమాజు చేసుకొని లేదా తహియ్యతుల్ వుదూ లేదా తహియతుల్ మస్జిద్ చేసుకొని ఆ తర్వాత ఇహ్రాం చేయాలి.

ఇక, ఇహ్రాం ఈ విధంగా చేయాలి. మనసులో ఉమ్రా యొక్క నియ్మత్ చేసుకొని, నాలుకతో لَبَّيْكَ عُمْرَةً [లబ్బైక్ ఉమ్రతన్] అని అనాలి. అయితే గుర్తుంచుకోండి, లబ్బైక్ ఉమ్రతన్ ఇది నియ్మత్ యొక్క పదం కాదు. ఎలాగైతే నమాజుకు ముందు అల్లాహు అక్బర్ అని తక్బీరె తహ్రీమా అంటామో, ఆ విధంగా అనుకోండి.

ఇహ్రాం తర్వాత నుండి మొదలుకొని కాబతుల్లాహ్ యొక్క తవాఫ్ ప్రారంభించే వరకు అధికంగా తల్బియా చదువుతూ ఉండాలి.

لَبَّيْكَ اللَّهُمَّ لَبَّيْكَ، لَبَّيْكَ لاَ شَرِيكَ لَكَ لَبَّيْكَ، إِنَّ الْحَمْدَ، وَالنِّعْمَةَ، لَكَ وَالْمُلْكَ، لاَ شَرِيكَ لَكَ
[లబ్బైకల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక లా షరీక లక లబ్బైక్, ఇన్నల్ హమ్ ద, వన్ ని’మత, లక వల్ ముల్క్, లా షరీక లక్]

ఇక మనము మహ్‌దూరాతుల్ ఇహ్రాం గురించి తెలుసుకుందాము. అంటే, ఇహ్రాం చేసిన తర్వాత, అంటే ఉమ్రా లేదా హజ్ యొక్క ఆరాధనలో ప్రవేశించిన తర్వాత, ఇహ్రాంకు ముందు మన కొరకు యోగ్యమైన కొన్ని విషయాలు ఇప్పుడు నిషిద్ధమవుతాయి. వీటిని ఇహ్రాం నిషిద్ధతలు అని కూడా అంటారు.

ఒకటి, తల మరియు శరీరంలోని ఏ వెంట్రుకలు తీయకూడదు. అవసరం ఉన్నప్పుడు గోక్కొనుట యోగ్యం.

రెండు, గోళ్ళు తీయకూడదు. కానీ ఏదైనా పోటు రాయి తగిలి, గోరు ఊడిపోతే లేదా కొంచెం బయటికి వెళ్ళింది, అవస్థ బాగా ఉంది, అలాంటప్పుడు దాన్ని తీసివేయడంలో పాపం లేదు.

నాలుగు, భార్యాభర్తలు సంభోగించుకోరాదు మరియు దీనికి సంబంధించిన ఏ పనులు కూడా చేయరాదు. చివరికి, ఈ సందర్భంలో అంటే ఇహ్రాం స్థితిలో, ఇహ్రాం స్థితిలో వివాహము చేయుట, చేయించుట ఇవన్నీ కూడా నిషిద్ధం.

ఐదు, హ్యాండ్ గ్లౌస్, చేతులలో గ్లౌసులు వేసుకోవడం.

ఆరు, వేటాడడం.

ఈ ఆరు విషయాలు స్త్రీ, పురుషులందరిపై నిషిద్ధం.

ఈ ఆరు కాకుండా, మరో మూడు విషయాలు ఉన్నాయి, అవి కేవలం పురుషులపై నిషిద్ధం.

ఒకటి, ఈ ఇహ్రాం స్థితిలో శరీర అవయవాలకు అనుగుణంగా కుట్టబడిన ఏ బట్టలు ధరించరాదు. అయితే, బెల్ట్ మరియు పాకెట్, గడియారం ఇలాంటివి ఉపయోగించుట నిషిద్ధం కాదు. ఒకవేళ అందులో ఏదైనా కుట్టు ఉన్నా పర్వాలేదు. అలాగే, ఇహ్రాం యొక్క దుస్తులు, అవి చినిగినందుకు ఏదైనా కుట్టు వేయడం, చిన్నగా ఉన్నందుకు మధ్యలో కలిపి కుట్టు వేసి పెద్దగా ఒక పంచి మాదిరిగా కట్టుకోవడం, ఇందులో కూడా ఎలాంటి అభ్యంతరం లేదు.

రెండు, తలకు అంటునట్లుగా టోపీ గాని, మరేదైనా గుడ్డ గాని, తల పాగా గాని వేసుకోరాదు. కానీ తలకు తాకి ఉండకుండా ఏదైనా గొడుగు ఉపయోగించడం, ఏదైనా గుడారం యొక్క నీడలో కూర్చోవడం, అలాగే కారు, బస్సు దాని యొక్క టాప్ కింద కూర్చొని ఉండడం ఎలాంటి అభ్యంతరం లేదు.

మూడు, మేజోళ్ళు వేసుకోవడం.

ఇక ఈ నిషిద్ధ వాటిలో ఏ ఒక్క దానికి పాల్పడిన వ్యక్తి, అతని యొక్క పరిస్థితి ఏమిటి? మూడు స్థితులు ఉన్నాయి.

  1. ఒకవేళ అతను తెలిసి, కావాలని చేసి ఉండేది ఉంటే, అతడు పాపాత్ముడు అవుతాడు, అతనిపై ప్రాయశ్చిత్తము కూడా ఉంటుంది.
  2. మరి ఎవరైనా ఏదైనా కారణంగా చేస్తే, వాటికి పాల్పడితే, పాపాత్ముడు కాదు కానీ ప్రాయశ్చిత్తము చెల్లించవలసి ఉంటుంది.
  3. మరి ఎవరైతే తెలియక లేదా మరిచిపోయి లేదా ఎవరి యొక్క ఒత్తిడి వల్ల ఏదైనా నిషిద్ధతకు పాల్పడి ఉంటే, అతడు పాపాత్ముడు కాడు మరియు అతడు ప్రాయశ్చిత్తము చెల్లించవలసిన అవసరము కూడా ఉండదు.

ఇక రండి, తవాఫ్ గురించి మనం తెలుసుకుందాము. మస్జిదె హరాంలో ప్రవేశిస్తూ, వేరే మస్జిదులలో ప్రవేశిస్తున్నప్పుడు చదువునటువంటి దుఆ చదవాలి.

بِسْمِ اللهِ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُوْلِ اللهِ، اَللّهُمَّ افْتَحْ لِيْ أَبْوَابَ رَحْمَتِكَ
[బిస్మిల్లాహి, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి, అల్లాహుమ్మఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక్]

మళ్ళీ, తవాఫ్ చేయుటకు కాబా వైపునకు వెళ్ళాలి. తవాఫ్ అంటే, వుదూ స్థితిలో కాబా చుట్టున ఏడుసార్లు ప్రదక్షిణం చేయడం. హజరె అస్వద్ నుండి మొదలవుతుంది, హజరె అస్వద్ వరకే అది సమాప్తమవుతుంది. కాబతుల్లాహ్ యొక్క తవాఫ్ చేసేటప్పుడు వుదూ స్థితిలో ఉండడం కూడా తప్పనిసరి.

ఇక రండి, తవాఫ్ యొక్క విధానం తెలుసుకుందాము.

ఒకటి, బిస్మిల్లా అని హజరె అస్వద్‌ను చుంబించాలి, వీలు కాకుంటే చేతితో తాకి చేతిని చుంబించాలి, ఇది కూడా వీలు పడకుంటే దూరము నుండి హజరె అస్వద్ వైపునకు సైగ చేయాలి.

ఆ తర్వాత కాబతుల్లాహ్ యొక్క చుట్టున తిరగాలి. ఇలా తిరుగుతూ ఎప్పుడైతే హజరె అస్వద్ కంటే ముందు ఏ కార్నర్, మూల ఉన్నదో దానిని రుక్నె యమాని అని అంటారు. ఒకవేళ కాబతుల్లాహ్ కు దగ్గరి నుండి వెళితే దానిని తాకాలి, ఏమీ పలకకూడదు. దూరం నుండి వెళ్ళినప్పుడు ఏమీ పలికే అవసరం లేదు, సైగ చేసే అవసరం కూడా లేదు. అయితే, ఈ రుక్నె యమాని మరియు హజరె అస్వద్ మధ్యలో క్రింది దుఆ చదువుతూ ఉండాలి.

رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَفِي الآخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ النَّارِ
[రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతౌ వ ఫిల్ ఆఖిరతి హసనతౌ వఖినా అదాబన్నార్]
మా ప్రభూ! మాకు ఇహలోకంలో మంచిని ప్రసాదించు. పరలోకంలోనూ మంచిని ప్రసాదించు. మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడు (2:201)

హజరె అస్వద్ వరకు చేరుకున్నప్పుడు ఒక్క రౌండ్ పూర్తి అయిపోయింది.

మిగతా ఆరు రౌండ్లు ఇదే విధంగా పూర్తి చేయాలి. అయితే కొన్ని విషయాలు శ్రద్ధ వహించండి. హజరె అస్వద్ నుండి మొదలు పెట్టాలి, అక్కడి వరకే ఒక రౌండ్ పూర్తి అవుతుంది. అక్కడికి చేరుకున్నప్పుడల్లా వీలవుతే చుంబించాలి, కాకుంటే ముట్టుకోవాలి, ఇది కాకుంటే దూరం నుండి దాని వైపునకు సైగ చేయాలి. మొదటిసారి బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అన్నారు, కానీ ప్రతిసారి కేవలం అల్లాహు అక్బర్ అనాలి.

రుక్నె యమాని మరియు హజరె అస్వద్ మధ్యలోనైతే క్రింది దుఆ చదువుతూ ఉండాలి.

رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَفِي الآخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ النَّارِ
[రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతౌ వ ఫిల్ ఆఖిరతి హసనతౌ వఖినా అదాబన్నార్]

మిగతా మూడు దిక్కుల్లో మనం తిరుగుతున్నప్పుడు ఖురాన్ చూసి చదవచ్చు, జిక్ర్ అజ్కార్ చేయవచ్చు లేదా మన భాషలో మనం మన కొరకు, మన బంధువుల కొరకు, ముస్లింలందరి కొరకు అధికంగా దుఆ చేస్తూ ఉండవచ్చు.

ఈ తవాఫ్ విషయంలో గుర్తుంచుకోవలసిన మరో ముఖ్యమైన రెండు విషయాలు ఏమిటంటే, ఏడు చక్కర్లలో, ఏడు రౌండ్లలో మొదటి మూడు రౌండ్లు చిన్న చిన్న అడుగులు వేస్తూ కొంచెం పరుగెత్తాలి. కానీ ఇందులో ఎవరికీ ఏ బాధ కలిగించకూడదు. అలాగే భుజాల మీద ఏ చాదర్ (దుప్పటి) వేసుకొని ఉన్నామో దానిని కుడి చేతి కింది నుండి తీసుకోవాలి, ఈ కుడి భుజం కనబడే విధంగా ఉండాలి. ఇది కేవలం తవాఫ్ చేసినప్పుడు మాత్రమే. మిగతా సందర్భాలలో, ప్రత్యేకంగా నమాజులో రెండు భుజాలు కప్పి ఉంచడం తప్పనిసరి.

తవాఫ్ పూర్తయిన తర్వాత వీలుపడితే మఖామె ఇబ్రాహీం వెనక, అంటే మఖామె ఇబ్రాహీం తన ముందు మరియు దాని ముందు కాబతుల్లా ఉన్నట్లుగా రెండు రకాతులు చేయాలి. ఒకవేళ అక్కడ వీలు కాకుంటే మస్జిదె హరాంలో ఎక్కడైనా ఈ రెండు రకాతులు చేయవచ్చును.

ఆ తర్వాత సఫా, మర్వా మధ్యలో సయీ చేయడానికి సఫా వైపునకు వెళ్ళాలి. ఎప్పుడైతే ఆ సఫా పర్వతాన్ని చూస్తామో, క్రింది దుఆ చదవాలి.

إِنَّ الصَّفَا وَالْمَرْوَةَ مِن شَعَائِرِ اللَّهِ
[ఇన్నస్సఫా వల్ మర్వత మిన్ షఆఇరిల్లాహ్]
నిశ్చయంగా సఫా, మర్వాలు అల్లాహ్ చిహ్నాలలో రెండు. (2:158)

ఆ తర్వాత వీలు పడేది ఉంటే సఫా కొండపై ఎక్కి, అది వీలు కాకుంటే దాని దగ్గరలో ఎక్కడైనా కాబతుల్లా వైపునకు ముఖము చేసి, రెండు చేతులు భుజాల వరకు ఎత్తి మూడుసార్లు అల్లాహు అక్బర్ అని, ఆ తర్వాత క్రింది దుఆ మూడుసార్లు చదవాలి.

لَا إِلٰهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ، يُحْيِي وَيُمِيتُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ، لَا إِلٰهَ إِلَّا اللهُ وَحْدَهُ، أَنْجَزَ وَعْدَهُ، وَنَصَرَ عَبْدَهُ، وَهَزَمَ الْأَحْزَابَ وَحْدَهُ

[లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహు, లహుల్ ముల్కు వ లహుల్ హమ్ దు, యుహ్యీ వ యుమీతు వ హువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు, అన్జజ వఅదహు, వ నసర అబ్దహు, వ హజమల్ అహ్ జాబ వహ్ దహు]

మూడు సార్ల మధ్యలో రెండు సార్లు తమ భాషలో ఇష్టమైన దుఆ చేసుకోవచ్చు. ఆ తర్వాత దిగి మర్వా వైపునకు వెళ్ళాలి. అయితే మధ్యలో ఎక్కడైతే పచ్చని లైట్లు ఉంటాయో, దాని మధ్యలో పరుగెత్తాలి. అయితే గుర్తుంచుకోండి, ఎవరికీ బాధ కలిగించకూడదు. సఫా మర్వా సయీలో ఈ పచ్చ గుర్తులు ఉన్న దాని మధ్యలో పరుగెత్తడం కేవలం పురుషులకే పరిమితం, స్త్రీలకు దీని అనుమతి లేదు.

ఈ విధంగా నడుస్తూ మర్వా వరకు చేరుకోవాలి. మర్వా వరకు చేరుకొని అక్కడ మర్వా పైన నిలబడి ఖిబ్లా దిశలో ముఖము చేసి, రెండు చేతులు భుజాల వరకు ఎత్తి, సఫా పై ఎలా దుఆ చేశారో అలాగే ఇక్కడ కూడా దుఆ చేయాలి. మధ్యలో రెండుసార్లు తనకిష్టమైన ఏ దుఆ అయినా చేసుకోవచ్చు.

సఫా నుండి మర్వా వరకు ఒక రౌండ్ పూర్తి అయిపోయింది. ఇక మర్వా నుండి సఫాకు వెళ్ళారంటే రెండు పూర్తి అవుతాయి. సఫా, మర్వాల మధ్యలో ఏడు రౌండ్లు పూర్తి చేయాలి. మొదలవుతుంది సఫా పై, పూర్తి అవుతుంది ఏడవ చక్కర్ మర్వా పై. ఇక ఈ సఫా మర్వాల మధ్యలో నడుస్తూ, ఖురాన్ తిలావత్ చేయవచ్చును, జిక్ర్ అజ్కార్ చేయవచ్చును, తమ భాషలో దుఆ చేస్తూ ఉండవచ్చును.

సఫా మర్వాల మధ్య సయీ పూర్తి అయిన తర్వాత, పురుషులు శిరోముండనం (గుండు) చేయించుకోవడం ఎక్కువ పుణ్యం. మరియు ఎవరైనా కటింగ్ చేయించుకుంటే పాపం లేదు, కానీ కటింగ్ అంటే మూడు, నాలుగు చోట్ల వెంట్రుకలు కొంచెం కత్తిరించడం కాదు, పూర్తి తల యొక్క వెంట్రుకలలో తగ్గించడం, సామాన్యంగా మనం ఏదైతే మన ఊళ్లలో కటింగ్ చేయించుకోవడం అంటామో.

స్త్రీలు 3 సెంటీమీటర్ల వరకు తమ జడ చివరి భాగం నుండి వారు కత్తిరించుకోవాలి. ఈ విధంగా ఉమ్రా పూర్తి అయిపోయింది.

అల్లాహ్ త’ఆలా మనకు మన జీవితంలోని ప్రతి కార్యం ఖురాన్, హదీస్‌కు అనుగుణంగా సహాబాలు అర్థం చేసుకొని పాటించిన విధంగా చేసే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. వ ఆఖిరు ద’వానా అనిల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఉమ్రా విధానం (Book)

ప్రతీ ముస్లిం స్త్రీ పురుషునిపై జీవితంలో ఒకసారి ఉమ్రా చేయుట విధిగా ఉంది. అల్లాహ్ ఆదేశం సూర బఖర (2:196)లో ఇలా ఉంది:

وَأَتِمُّوا۟ ٱلْحَجَّ وَٱلْعُمْرَةَ لِلَّهِ

అల్లాహ్ కొరకు హజ్, ఉమ్రా పూర్తి చేయండి.” [సూర బఖర 2:196]

అది సర్వ సత్కార్యాల్లో అతి ఉత్తమమైనది గనక శక్తిగల ముస్లిం మరే మరీ చేస్తూ ఉండుట పుణ్య కార్యం. ‘ముఅతమిర్’ (ఉమ్రా చేయు వ్యక్తి) ఉమ్రా విధుల్లో అన్నిటికి ముందు ఇహ్రామ్ చేయాలి.

ఇహ్రామ్:

అంటే ఉమ్రా ఆరాధనలోకి ప్రవేశం. ముహ్రిమ్ (ఇహ్రామ్ స్థితిలో ఉన్న వ్యక్తి)పై ఇహ్రామ్ కు ముందు యోగ్యమున్న కొన్ని విషయాలు నిషిద్ధమగును. ఎందుకనగా అతడు ఒక ఆరాధన లో ప్రవేశించాడు. ఉమ్రా చేయాలనుకున్న ప్రతి వ్యక్తిపై ‘ఇహ్రామ్’ విధిగా ఉంది. ముఅతమిర్ మక్కా వెలుపలి నుండి వచ్చే వారయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నియమించిన మీఖాతుల్లో ఏ ఒక మీఖాతు నుండైనా ఇహ్రామ్ చెయ్యాలి. ఆ మీఖాతులు ఇవి:

  • 1- ‘జుల్ హులైఫ’: అది మదీనకు సమీపం లో ఒక చిన్న పల్లెటూరు. ఇప్పుడు దాని పేరు ‘అబ్ యారె అలీ’. అది మదీనవాసుల మీఖాతు.
  • 2- ‘అల్ జుహ్ ఫ’: అది రాబిగ్ సమీపంలో ఒక పల్లెటూరు. ఈ రోజుల్లో రాబిగ్ నుంచే ఇహ్రామ్ చేస్తున్నారు. అది సిరీయా వారి మీఖాతు.
  • 3- ‘అస్సైలుల్ కబీర్’: తాయిఫ్ కు సమీపం లో ఒక ప్రాంతం. అది నజ్ద్ వారి మీఖాతు.
  • 4- ‘యలమ్ లమ్’: ఇది యమన్ వారి మీఖాతు.
  • 5- ‘జాతు ఇర్ఖ్’: ఇది ఇరాఖ్ వారి మీఖాత్.

పై మీఖాతులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నియమించారు. అవి మేము తెలిపిన వారి ప్రాంత నివాసుల మరియు వారి తప్ప ఎవరైతే హజ్ లేక ఉమ్రా చేయుటకు వాటి నుండి దాటుతారో వారికి కూడాను. ఇక మక్కా నివాసులు మరియు ‘అహ్లుల్ హిల్ల్’ (మక్కా నగరానికి వెలుపల మరియు మీఖాతు లోపల నివసించువారు) తమ ఇంటి నుండి ఇహ్రామ్ చేయాలి.

ఇహ్రామ్ ధర్మములు:

ఇహ్రామ్ కు ముందు చేయవలసిన ధర్మములు:

1- గోర్లు, చంకల మరియు నాభి క్రింది వెంట్రుకలు తీయాలి. మీసాలు కత్తిరించాలి. స్నానం చేసి, సువాసన శరీరానికి పూసుకోవాలి. ఇహ్రామ్ దుస్తులకు పూసుకోవద్దు.

2- కుట్టిన బట్టలు తీసి, ఒక పంచి కట్టుకొని, ఒక దుప్పటి వేసుకోవాలి. స్త్రీ తనకిష్టమైన బట్టలు ధరించవచ్చును. అయితే పూర్తి పర్ద చేయాలి. అలంకరణ ప్రదర్శించకుండా ఉండాలి. పరపురు- షులు ఎదురయ్యే సమయాన ముఖము, అరచేతుల పర్ద కూడా చేయుటకు ప్రయత్నిం- చాలి. చేతుల్లో గ్లౌసులు, ముఖముపై నఖాబ్ వేసుకోకూడదు.

3- మస్జిద్ కు వెళ్ళి నమాజ్ సమయమయితే జమాఅతుతో నమాజు చేసుకోవాలి. లేనిచో రెండు రకాతులు ‘తహియ్యతుల్ వుజూ’ చేసుకోవచ్చు. ఆ తరువాత ఇహ్రామ్ చేయాలి.

విమానంలో ప్రయాణించువారు మీఖాత్ కు సమాన ప్రాంతం వద్దనే ఇహ్రామ్ చేయాలి. మీఖాత్ ఏర్పాటు కష్టంగా ఉంటే దానికి కొంచెం ముందు కూడా చేయవచ్చును. ఇక మీఖాత్ వద్ద చేసే పనులు; గోళ్ళు తీయడం, స్నానం చేసి, శరీరానికి సువాసన పూసుకోవడం మరియు ఇహ్రామ్ దుస్తులు ధరించడం లాంటివన్నీ విమానంలో లేదా అందులో పయనమయ్యే ముందు పూర్తి చేసుకోవాలి. మీఖాత్ వద్ద లేదా దానికి కొంచెం ముందు చేరుకున్నప్పుడు ఇహ్రాం సంకంల్పం చేయాలి.

ఇహ్రమ్ నుండి మొదలుకొని కాబా ప్రదక్షిణం ప్రారంభించే వరకు “తల్ బియ” చదువుతూ ఉండాలి: లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక లా షరీక లక లబ్బైక్, ఇన్నల్ హంద వన్నిఅమత లక వల్ ముల్క, లా షరీక లక.

لَبَّيْكَ اللَّهُمَّ لَبَّيْكَ لَبَّيْكَ لَا شَرِيكَ لَكَ لَبَّيْكَ

إِنَّ الحَمْدَ وَالنِّعْمَةَ لَكَ وَالمُلْكَ لَا شَرِيكَ لَكَ

ఇహ్రామ్ నిషిద్ధతలు:

ఇహ్రామ్ స్థితిలో ఉన్న వ్యక్తిపై ఇహ్రామ్ కు ముందు యోగ్యమున్న కొన్ని విషయాలు నిషిద్ధం అగును. ఎందుకనగా అతడు ఒక ఆరాధనలో ప్రవేశించాడు. అతనిపై క్రింది విషయాలు నిషిద్ధం:

  • 1- తల వెంట్రుకలు మరియు శరీర వెంట్రుకలు తీయడం నిషిద్ధం. కాని అవసరమున్నప్పుడు మెల్లగా తల గోకుట నేరం కాదు.
  • 2- గోళ్ళు తీయుట నిషిద్ధం. కాని గోరు విరిగినా, నొప్పి ఉన్నా దానిని తీయుట పాపం కాదు.
  • 3- సుగంధం మరియు సువాసన సబ్బుల ఉపయోగం నిషిద్ధం.
  • 4- సంభోగం మరియు దానికి సంబంధించిన విషయాలు నిషిద్ధం. ఉదా: పెళ్ళి చేసుకొనుట, చేయించుట, భార్యభర్తల సరసాలడడం వగైరా.
  • 5- చేతులలో గ్లౌసులు వేసుకొనుట నిషిద్ధం.
  • 6- వేటాడుట నిషిద్ధం.

 పై ఆరు విషయాలు స్త్రీ పురుషులందరిపై నిషిద్ధం. ఇక ప్రత్యేకంగా పురుషులపై నిషిద్ధం ఉన్న విషయాలు దిగువ తెలుపబడుతున్నవి.

  • 1- కుట్టిన బట్టలు ధరించడం నిషిద్ధం. కాని అవసరముంటే బెల్ట్, గడియారం మరియు కళ్ళ జోళ్ళు ఉపయోగించవచ్చును.
  • 2- తలకు అంటుకొని ఉండే ఏదైనా వస్తువు ఉప- యోగించడం నిషిద్ధం. కాని అంటుకొని ఉండని గొడుగు, వాహణము మరియు గుడారాలు లాంటివి ఉపయోగించడం యోగ్యం.
  • 3- మేజోళ్ళు తొడుగుట నిషిద్ధం. కాని సైండిల్ మరియు చెప్పులు లేనప్పుడు మడమలు కనబడే బూట్లు ఉపయోగించ వచ్చును.

పై నిషిద్ధ కార్యాలు చేసినవాని 3 స్థితులు:

  • 1- అకారణంగా చేసిన వ్యక్తి పాపాత్ముడగును. ఇంకా అతనిపై ‘ఫిద్య’ (ప్రాయశ్చితం) కూడా విధియగును.
  • 2- ఏదైనా అవసరం ఉండి చేసిన వ్యక్తి పాపాత్ముడు కాడు. కాని ప్రాయశ్చితం చెల్లించాలి.
  • 3- ఏదో కారణంగా -ఉదా: తెలియక, మరచి- పోయి, లేదా ఒకరి ఒత్తిడితో నిస్సహాయుడై- చేసిన వ్యక్తి పాపాత్ముడూ కాడు, అతనిపై ప్రాయశ్చితమూ లేదు.

తవాఫ్:

ఇతర మస్జిదుల మాదిరిగా మస్జిదె హరాంలో కూడా కుడి కాలుతో ప్రవేశిస్తూ ఈ దుఆ చదవడం ధర్మం.

బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అల్లాహుమ్మగ్ ఫిర్లీ జునూబి వఫ్ తహ్ లీ అబ్వాబ రహ్మతిక.

بِسْمِ الله وَالصَّلاَةُ وَالسَّلَامُ عَلَى رَسُولِ الله اللَّهُمَّ اغْفِرْلِي ذُنُوبِي وَافْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ

కాబా తవాఫ్ చేయుటకు దానివైపున వెళ్ళాలి.

తవాఫ్: అంటే అల్లాహ్ యొక్క ఇబాదత్ ఉద్దేశ్యంతో కాబా చుట్టున ఏడు సార్లు ప్రదక్షిణం చేయుట. అది హజ్రె అస్వద్ నుండి ప్రారంభించి అక్కడే ముగించాలి. మొదటి మూడిట్లో దగ్గర దగ్గర అడుగులు వేసి పరుగెత్తుట ధర్మం. కాని ఎవరికీ ఇబ్బంది కలగించకూడదు. దీనినే ‘రమ్ల్’ అంటారు. పైన కప్పుకున్న దుప్పటిని కుడి భుజము క్రింది నుండి తీసుకొని ఎడమ భుజముపై వేసుకోవాలి. అంటే కుడి భుజము పైన బట్ట ఉండకూడదు. దీనిని ‘ఇజ్తిబాఅ’ అంటారు. ఇవి రెండు (రమ్ల్, ఇజ్తిబాఅ) ఉమ్రా లేక హజ్ ఉద్దేశ్యంతో మక్కా వచ్చి చేసే తొలి తవాఫ్ లో మాత్రమే చేయాలి. కాబా ఎడమ వైపు ఉండాలి. తవాఫ్ వుజూ స్థితిలో చేయుట తప్పనిసరి. ఇక తవాఫ్ ఈ విధంగా చేయాలి:

1- హజ్రె అస్వద్ వద్దకు వెళ్ళి కుడి చేయితో దానిని ముట్టుకొని బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అనాలి. వీలవుతే దాన్ని చుంబించాలి. చుంబిం- చడం వీలు కాకుంటే దాన్ని చెయ్యితో ముట్టుకొని చెయ్యిని చుంబించాలి. చెయ్యితో ముట్టుకొనుట కూడా సాధ్యపడకుంటే దాని సూటిగా నిలబడి దాని వైపు చెయ్యితో సైగ చేస్తూ బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అనాలి. కాని చెయ్యిని చుంబించ- కూడదు. ఇక తవాఫ్ ప్రారంభించాలి. ఇష్టానుసా రం, తన భాషలో తన కొరకు, తను కోరినవారి కొరకు దుఆ చేస్తూ లేదా ఖుర్ఆన్ పారయణం చేస్తూ ఉండాలి. ఇచ్చట ప్రత్యేకంగా ఏ దుఆ లేదు.

2- రుక్నె యమాని వద్ద చేరుకున్నాక వీలవుతే దాన్ని ముట్టుకుంటూ అల్లాహు అక్బర్ అనాలి. కాని చెయ్యిని చుంబించకూడదు. వీలు కాకుంటే (తవాఫ్ చేస్తూ ఉండాలి). చెయ్యితో సైగ చేయకూడదు. అల్లాహు అక్బర్ అనకూడదు. ఈ రుక్నె యమాని మరియు హజ్రె అస్వద్ మధ్య ఈ దుఆ చదవాలి: రబ్బనా ఆతినా ఫిద్దున్ యా హసనతౌఁ వఫిల్ ఆఖిరతి హసనతౌఁ వఖినా అజాబన్నార్.

[رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَفِي الآَخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ النَّارِ]. {البقرة:201}.

3- హజ్రె అస్వద్ వద్ద చేరుకొని దాన్ని చెయ్యితో ముట్టుకుంటూ, వీలు కాకుంటే దాని వైపు చెయ్యితో సైగ చేస్తూ అల్లాహు అక్బర్ అనాలి.

ఈ విధంగా ఏడు ప్రదక్షిణాల్లో ఒకటి పూర్తయింది.

4- మిగితవి మొదటి దాని లాగే చేస్తూ, హజ్రె అస్వద్ చేరుకున్నప్పుడల్లా మరియు ఏడవది పూర్త-యిన తరువాత కూడా అల్లాహు అక్బర్ అనాలి.

తవాఫ్ తరువాత:

తవాఫ్ తరువాత మఖామె ఇబ్రాహీం వెనక – అనగా అది తనకు మరియు కాబాకు మధ్యలో ఉన్నట్లుగా- నిలబడి రెండు రకాతుల నమాజు చేయుట ధర్మం. నమాజు చేస్తున్నప్పుడు దుప్పటి రెండు భుజాలపై ఉండుట తప్పనిసరి. ఏ ఒక్క భుజము నగ్నంగా ఉండకుడదు. మొదటి రకాతులో సూరె ఫాతిహా తరువాత ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ రెండవ రకాతులో సూరె ఫాతిహా తరువాత ఖుల్ హువల్లాహు అహద్ చదవాలి. జనసమ్మర్థంలో దాని వెనక నమాజ్ చేయుట సాధ్యపడకుంటే మస్జిదె హరాంలో ఏక్కడైనా చేయవచ్చును.

సఈ:

ఇక ‘మస్అ’ (సఫా, మర్వాల మధ్యలో ‘సఈ’ చేసే స్థలం) వైపుకు వెళ్ళి సఫా దగ్గరికి చేరుకుంటూ “ఇన్నస్సఫా వల్ మర్వత మిన్ షఆఇరిల్లాహ్” చదివాలి. సఫా కొండపై ఎక్కి కాబా దిశలో నిలబడి చేతులు ఎత్తి అల్లాహ్ స్తోత్రము పఠించి, ఈ దుఆ మూడు సార్లు చదవాలి. దాని మధ్యలో రెండు సార్లు తనిష్టానుసారం దుఆ చేసుకోవాలిః లాఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లాషరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు యుహ్ యీ వ యుమీతు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ అంజజ వఅదహూ వనసర అబ్దహూ వహజమల్ అహ్ జాబ వహ్దహూ.

لَا إِلَهَ إِلَّا اللهُ  وَ الله أَكْبَر، لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ لَهُ المُلْكُ وَلَهُ الحَمْدُ يُحْيِى وَ يُمِيتُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ أَنْجَزَ وَعْدَهُ وَنَصَرَ عَبْدَهُ وَهَزَمَ الْأَحْزَابَ وَحْدَهُ

ఆ తరువాత సఫా నుండి దిగి మర్వా వైపు నడవాలి. పచ్చరంగు స్తంభం వద్దకు చేరినప్పుడు శక్తి ప్రకారం పరుగుతీయడం ధర్మం. ఇలా రెండవ పచ్చరంగు స్తంభం వరకు. ఇతరులకు బాధ కలిగించకూడదన్న షరతును మరవవద్దు. ఈ పరుగు పురుషులకే ప్రత్యేకం. స్త్రీలకు దీని అనుమతి లేదు. మర్వా చేరుకొని దానిపై ఎక్కి ఖిబ్లా దిశలో నిలబడి చేతులు ఎత్తి సఫాపై చేసినటువంటి దుఆ చెయ్యాలి. అయితే మన భాషలో మనకిష్టమున్న దుఆ కూడా చేసు కోవాలి. ఇక్కడికి ఏడిట్లో ఒకటి పూర్తయింది. మిగిత ఆరు ఇలాగే పూర్తి చేయాలి. ప్రతీ సారి సఫా మరియు మర్వాల వద్ద దుఆ చేయాలి. పచ్చ రంగు స్తంభాల మధ్య పరుగుతీయాలి. సఈ మధ్యలో దుఆ ఎక్కువగా చేయాలి. ఏడిట్లో ప్రతీ ఒక దానికొక వేరు దుఆ అంటూ ప్రవక్తతో రుజువు లేదు. (సఫా నుండి మర్వా వరకు ఒకటి. మర్వా నుండి సఫా వరకు రెండు పరుగులగును. ఇలా మొదటి పరుగు సఫా నుండి మొదలై ఏడవ పరుగు మర్వాపై ముగియును).

సఈ తురవాత శిరోముండనం చేయించు- కోవాలి. ఇందులో ఎక్కువ పుణ్యం ఉంది. కటింగ్ కూడా చేయించుకోవచ్చు. ఇక ఇహ్రామ్ దుస్తులు తీసి ఉమ్రా ముగించాలి. ఇహ్రామ్ కు సంబంధిం- చిన నిషిద్ధతలు ఇక ముగించాయి.

అర్కానె ఉమ్రా (ఉమ్రా మూల స్థంబాలు)

  • 1- ఇహ్రామ్.        
  • 2- తవాఫ్.          
  • 3- సఈ.

ఇందులో ఏ ఒక్క రుకున్ వదలినా తిరిగి అది చేయనంత వరకు ఉమ్రా నెరవేరదు.

వాజిబాతె ఉమ్రా:

  • 1- మీఖాత్ నుండి ఇహ్రామ్ చేయుట.
  • 2- శిరోముండనం.

వీటిలో ఏ ఒక్కటి వదలినా అతనిపై దమ్ విధి అవుతుంది. అంటే ఒక మేక జిబహ్ చేసి లేదా ఒంటె మరియు ఆవులోని ఏడిట్లో ఒక భాగం హరమ్ లో ఉండే బీదవాళ్ళకు దానం చేయాలి.

ఇతర ముఖ్యమైన పోస్ట్:

ఉమ్రా విధానం (చిత్రాలతో సహా )
https://teluguislam.net/2019/12/23/umrah-vidhanam/