సూరతుల్ కహఫ్ సూరాలో ప్రస్తావించబడిన అల్లాహ్ కారుణ్యం సూరతుల్ కహఫ్ తఫ్సీర్ : 3వ భాగం [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

సూరతుల్ కహఫ్ సూరాలో ప్రస్తావించబడిన అల్లాహ్ కారుణ్యం
సూరతుల్ కహఫ్ తఫ్సీర్ : 3వ భాగం
https://www.youtube.com/watch?v=H8kEmHrBPyM [27:51 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త సూరతుల్ కహఫ్ యొక్క ప్రాముఖ్యతను, ముఖ్యంగా శుక్రవారం నాడు దానిని పఠించడం యొక్క విశిష్టతను వివరిస్తారు. అల్లాహ్ యొక్క కారుణ్యం (రహ్మత్) అనే అంశం ఈ సూరాలో ఎంత బలంగా ప్రస్తావించబడిందో వారు నొక్కిచెప్పారు. గుహలోని యువకులు అల్లాహ్ కారుణ్యం కోసం ప్రార్థించడం, మూసా (అలైహిస్సలాం) మరియు ఖిద్ర్ (అలైహిస్సలాం) ల సంఘటన, మరియు జుల్-ఖర్నైన్ నిర్మించిన గోడ వంటి వివిధ ఘట్టాలను ఉదాహరణలుగా చూపుతూ, విశ్వాసం, జ్ఞానం మరియు సత్కార్యాల ద్వారా అల్లాహ్ కారుణ్యాన్ని ఎలా పొందాలో వివరిస్తారు. కేవలం చిలుక పలుకుల్లా కాకుండా, అర్థం చేసుకుని ఖురాన్‌ను చదవడం ద్వారానే అల్లాహ్ యొక్క అసలైన కారుణ్యాన్ని పొందగలమని వక్త ఉద్భోదిస్తారు.

అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ’అలా ఆలిహి వ’సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.

సోదర మహాశయులారా! ఈ రోజు అల్లాహ్ యొక్క దయవల్ల మనం సూరతుల్ కహఫ్‌లో అల్లాహు తాలా చాలా గొప్ప రహస్యాలు, చాలా గొప్ప విషయాలు మన కొరకు పెట్టాడు. అందుకొరకే ప్రత్యేకంగా ప్రతి జుమా రోజు దీని యొక్క తిలావత్ ఆదేశం ఇవ్వడం జరిగింది. అయితే అందులో అనేక లాభాలు, అనేక విషయాలు, అనేక రహస్యాలు ఉన్నాయి.

అయితే ధర్మవేత్తలు ఒక విషయాన్ని చాలా హైలైట్‌గా, గొప్పగా చెప్పారు. ఆ విషయాన్ని నేను ఈరోజు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. దయచేసి శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను.

సోదర మహాశయులారా, అల్లాహు తాలా అర్-రహ్మాన్ అర్-రహీమ్. ఈ విషయం మనం ఖురాన్ ఆరంభంలో బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీంలోనే చూస్తున్నాము. అల్లాహు తాలా ఈ దివ్య గ్రంథం ఖురాన్‌ని ఏ ప్రవక్త ద్వారా మనకు అందజేశాడో, ఆ ప్రవక్త గురించి ఏం చెప్పాడు? సూరతు తౌబాలో చెప్పాడు, వబిల్ మూమినీన రవూఫుర్రహీమ్. విశ్వాసుల పట్ల చాలా కనికరం గలవారు.

అలాగే సూరతుల్ అంబియాలో తెలిపాడు,

وَمَا أَرْسَلْنَاكَ إِلَّا رَحْمَةً لِّلْعَالَمِينَ
[వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్]
మేము మిమ్మల్ని సర్వలోకాల కొరకు కారుణ్యమూర్తిగా చేసి పంపాము.

అల్లాహ్ కరుణామయుడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కారుణ్యమూర్తిగా స్వయంగా అల్లాహు తాలా తెలియ బరిచాడు. మరియు ఈ ఖురాన్ ఇది కూడా సర్వమానవాళికి ఒక గొప్ప కారుణ్య సందేశం. ఈ విషయం స్వయంగా ఖురాన్‌లో అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది.

అయితే ఖురాన్‌లోని 114 సూరాలలో ప్రతి సూరా మన పట్ల ఎంతో కరుణ, కారుణ్య సందేశం తీసుకుని వచ్చింది. అందులో సూరతుల్ కహఫ్ ప్రత్యేకంగా ఇందులో ఈ విషయం ఉంది. సూరతుల్ కహఫ్ యొక్క ఆరంభంలోనే అల్లాహు తాలా ఏం తెలియజేశాడో ఒకసారి ఇక్కడ చూడండి, ఆయత్ నంబర్ 10.

فَقَالُوا رَبَّنَا آتِنَا مِن لَّدُنكَ رَحْمَةً
[ఫకాలూ రబ్బనా ఆతినా మిల్ లదున్క రహ్మహ్]
మా ప్రభువా, నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు.

అల్లాహు తాలా ఇక్కడ ఈ ఆయత్, సూరా యొక్క సుమారు ఆరంభంలోనే, ఏ యువకుల విశ్వాస గాధను మనకు తెలియబరిచాడో, వారు ప్రత్యేకంగా అల్లాహ్‌తో కోరుకున్నది ఏమిటి?

رَبَّنَا آتِنَا مِن لَّدُنكَ رَحْمَةً
[రబ్బనా ఆతినా మిల్ లదున్క రహ్మహ్]
ఓ మా ప్రభువా, నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు.

وَهَيِّئْ لَنَا مِنْ أَمْرِنَا رَشَدًا
[వ హయ్యి లనా మిన్ అమ్రినా రషదా]
మా పనిలో మాకోసం సన్మార్గాన్ని సులభతరం చెయ్యి.

సోదర మహాశయులారా, ఇక్కడ ఇది మొదలైంది అంటే, ఈ “రహ్మత్” అన్న పదం ఈ సూరాలో సుమారు ఆరు సార్లు వచ్చింది. ఆయత్ నంబర్ 10 లో ఇలా కోరారు వారు. అయితే ఇంకా ముందుకు వెళ్లి మనం చూశామంటే, ఇదే సూరాలోని ఆయత్ నంబర్ 16 లో,

يَنشُرْ لَكُمْ رَبُّكُم مِّن رَّحْمَتِهِ
[యన్షుర్ లకుమ్ రబ్బుకుమ్ మిర్ రహ్మతిహి]
మీరు బహుదైవారాధన, ఈ షిర్క్ పనుల నుండి రక్షణ పొందుటకు గుహలోకి ప్రవేశించండి. అక్కడ మీ ప్రభువు మీకు కారుణ్యాన్ని ప్రసాదిస్తాడు.

ఇంకా ఎక్కడెక్కడ వచ్చిందో నేను తర్వాత తెలియజేస్తాను. కానీ ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని మీరు గ్రహించండి. మీరు ఒక గొప్ప విషయాన్ని గ్రహించండి. అదేమిటి?

ఇమామ్ ఖుర్తుబీ రహమహుల్లా తన తఫ్సీర్‌లో, సూరత్ కహఫ్‌లోని తఫ్సీర్‌లో పేర్కొన్నారు, ఈ కొంతమంది యువకులు ఎవరైతే తమ విశ్వాసాన్ని, తమ సత్య ధర్మాన్ని కాపాడుకొనుటకు ఆ రాజు మరియు ఆనాటి కాలంలో ఉన్నటువంటి వారి సమాజంలోని బహుదైవారాధకుల నుండి పారిపోయి ఒక గుహలో ఏదైతే శరణు తీసుకున్నారో, వారు ఏదో పిచ్చివాళ్ళ లాంటి వారు, అనాథ లాంటి వారు, లేక ఏమీ గతి లేని వారు, అలాంటి వారు కాదు సుమా! సమాజంలో ఉన్నత శ్రేణికి చెందిన కుటుంబాలకు సంబంధించిన ఆ యువకులు. కానీ సమాజమంతా ఏ షిర్క్‌లో, ఏ బహుదైవారాధనలో కూరుకుపోయిందో, దాని నుండి రక్షణ పొంది, అల్లాహ్ యొక్క తౌహీద్ గొప్పతనాన్ని, దైవ ఏకత్వం యొక్క మహత్వాన్ని, గొప్పతనాన్ని ఎప్పుడైతే వారు గ్రహించారో, అన్ని రకాల ఆస్తిపాస్తులను, హోదా అంతస్తులను అన్నిటినీ కూడా వారు వదిలేశారు. ఇక ఎప్పుడైతే వారికి ప్రాణ నష్టం కలుగుతుందన్నటువంటి భయం కలిగిందో, ఒక గుహలో వారు శరణు తీసుకోవడానికి వెళ్లారు.

గమనించండి, ఆయత్ నంబర్ 10 మరియు ఆయత్ నంబర్ 16 పై మీరు శ్రద్ధ వహించారంటే, మీకు ఈ అల్లాహ్ యొక్క కరుణ ఏదైతే కోరుతున్నారో, అల్లాహు తాలా తన కరుణ విషయాన్ని ఖురాన్‌లో ప్రత్యేకంగా సూరతుల్ కహఫ్‌లో ఇంత గొప్పగా ఏదైతే చెప్పాడో, దాన్ని గమనించండి. ఇంతకుముందు మనం చదివాము ఆయత్ నంబర్ 10 ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక ఇది ఎప్పుడు చెప్పారు వారు?

أَمْ حَسِبْتَ أَنَّ أَصْحَابَ الْكَهْفِ وَالرَّقِيمِ كَانُوا مِنْ آيَاتِنَا عَجَبًا
ఏమిటి గుహవారిని, శిలా ఫలకం వారిని నువ్వు మా శక్తి సూచనలలో మహా విచిత్రమైన సూచనగా తలపోస్తున్నావా?

إِذْ أَوَى الْفِتْيَةُ إِلَى الْكَهْفِ فَقَالُوا رَبَّنَا آتِنَا مِن لَّدُنكَ رَحْمَةً وَهَيِّئْ لَنَا مِنْ أَمْرِنَا رَشَدًا
ఆ యువకులు గుహలో ఆశ్రయం పొందినప్పుడు ఇలా ప్రార్థించారు, ‘మా ప్రభు, నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు, మా పనిలో మా కోసం సన్మార్గాన్ని సులభతరం చెయ్యి.’

ఆ తర్వాత వారి సంఘటనే ఉంది. ఇక ఆయత్ నంబర్ 16 లో చూడండి.

وَإِذِ اعْتَزَلْتُمُوهُمْ وَمَا يَعْبُدُونَ إِلَّا اللَّهَ فَأْوُوا إِلَى الْكَهْفِ يَنشُرْ لَكُمْ رَبُّكُم مِّن رَّحْمَتِهِ وَيُهَيِّئْ لَكُم مِّنْ أَمْرِكُم مِّرْفَقًا
ఇప్పుడు మీరు వాళ్ళతోను, అల్లాహ్‌ను కాకుండా వారు పూజిస్తున్న ఇతర దైవాలతోను తెగతెంపులు చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఏదన్నా గుహలోకి పోయి కూర్చోండి. మీ ప్రభువు మీపై తన కారుణ్యాన్ని విస్తరింపజేస్తాడు.

పదాన్ని గమనించండి. యన్షుర్ లకుమ్. కారుణ్యాన్ని విస్తరింపజేస్తాడు. అంతేనా? కాదు, మరో శుభవార్త.

وَيُهَيِّئْ لَكُم مِّنْ أَمْرِكُم مِّرْفَقًا
మీ కార్యసిద్ధికై సౌలభ్యాన్ని సమకూరుస్తాడు.

గమనించారా ఇక్కడ?

వాస్తవానికి దీని యొక్క గొప్పతనం మీరు ప్రత్యేకంగా గ్రహించారంటే, ముస్లింలు ముందు గ్రహించారంటే, మరియు మా ముస్లిమేతర సోదర సోదరీమణులు కూడా గ్రహించారంటే, ఎంతో బాగుండును. ఎందుకంటే ఇహలోకంలో మనిషికి లాభాన్ని చేకూర్చేది, ఇహపరలోకాల్లో అతనికి ఆనందాన్ని, సుఖాన్ని కలగజేసేది ఏమిటి? ఏకదైవారాధన, విశ్వాసం. గమనించండి, పెద్ద హోదా అంతస్తులకు చెందిన సంతానం అయినప్పటికీ అన్నిటినీ వదులుకున్నారు, తౌహీద్ యొక్క వారికి విషయం అర్థమైన తర్వాత, గుహలో వారు శరణు తీసుకున్నారు. ఇక అక్కడ అల్లాహ్ కారుణ్యానికి దూరమయ్యారా?

ఈ రోజుల్లో ఏమంటారు? అరే, వీడు పిచ్చివాడు, ఏదో సమాజంలో అందరితోని కలిసి ఉండకుండా. అందరూ చేసినట్లు చేస్తూ ఉండాలి, నీ కల్మ నీతో ఉంటుంది, నీ ఇస్లాం నీతో ఉంటుంది. పర్వాలేదు, కొంచెం ఒకసారి సమాధి కాడికి వెళ్లి అక్కడ వంగినా గానీ, ఏదైనా వినాయకునికి అక్కడ ఏదైనా చేసినా గానీ, ఇంకా వేరే ఏదైనా పనులు… ఈ విధంగా ఎంతో మంది ఎలాంటి షిర్క్ పనులకు పాల్పడుతున్నారు? అసలు విషయం ఏంటంటే విశ్వాసం, తౌహీద్ యొక్క మాధుర్యాన్ని వారు గ్రహించలేదు.

మీరు ఇక్కడ చూడండి, ఖురాన్ ఆయతుల ద్వారా గ్రహించండి. నేను ఏదో పెద్ద వ్యాఖ్యానాల లోతులోకి వెళ్తలేను. కారుణ్యం అన్నది సోదర మహాశయులారా, అల్లాహ్ యొక్క తౌహీద్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఎంత మనం అల్లాహ్ యొక్క తౌహీద్ పై స్థిరంగా ఉంటామో, అంతే ఎక్కువగా మనం అల్లాహ్ యొక్క కారుణ్యాలను గ్రహించగలుగుతాము.

ఎప్పుడైతే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఇదే సూరత్లో పరలోకానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలియజేశాడు, ఆ మధ్యలో కూడా వ రబ్బుకల్ గఫూరు జుర్రహ్మహ్. నిశ్చయంగా నీ ప్రభువు ఎంతో క్షమించేవాడు, ఎంతో మీ పాపాలను మన్నించేవాడు. మరియు మరో గొప్ప విషయం ఏం చెప్పాడు? జుర్రహ్మహ్. నీ ప్రభువు ఎంతో కారుణ్యం గలవాడు. ఇది ఎక్కడుంది? ఆయత్ నంబర్ 58లో ఒకసారి మీరు చూడండి, గమనించండి. దీని ద్వారా మనకు తెలుస్తుంది ఏమిటి? మనిషి ఇహలోకంలో, పరలోకంలో అల్లాహ్ యొక్క సత్య గ్రంథాన్ని విశ్వసించడం ద్వారానే అల్లాహ్ కారుణ్యాన్ని అతడు పొందగలుగుతాడు. అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని విశ్వసించి దానిని అనుసరించడంలోనే అతడు అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని పొందగలుగుతాడు. అందుకొరకే ఆయత్ నంబర్ 57 మీరు చూశారంటే “నేను అరబీ ఆయత్ కాకుండా అనువాదం చదువుతున్నాను మీకు తొందరగా అర్థం కావాలని: “తన ప్రభువు వచనాల ద్వారా హితబోధ చేసినప్పటికీ విముఖత చూపి, తన చేతులతో ముందుగా చేసి పంపుకున్న దానినే మరిచిపోయిన వానికన్నా ఎక్కువ దుర్మార్గుడు ఎవడు ఉంటాడు?” వారు దానిని, అంటే ఖురాన్‌ను, అర్థం చేసుకోకుండా మేము వారి హృదయాలపై తెరలు వేసేసాము. ఇన్నాలిల్లాహ్. అల్లాహ్ మన హృదయాన్ని అలా చేయకూడదు. మనం దుఆ చేయాలి, ఓ అల్లాహ్, మా హృదయాన్ని నీ సన్మార్గం వైపునకు, అల్లాహుమ్మష్రహ్ సుదూరనా. మూసా అలైహిస్సలాం దుఆ చేశారు. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి షరహ సద్ర్ గురించి అల్లాహు తాలా శుభవార్త ఇచ్చాడు. వారి చెవులకు చెవుడు కలిగించాము. అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్. ప్రపంచ మాటలన్నీ వింటున్నారు, కానీ ధర్మబోధ అనేది వినకుండా వారు, వారికి చెవుడు అనేది ఏర్పడింది. నువ్వు సన్మార్గం వైపుకు వారిని పిలుస్తూ ఉన్నప్పటికీ, వారు ఎన్నటికీ సన్మార్గం పొందే వారు కారు. ఎందుకంటే వారు నీ మాట వినకుండా పరిగెత్తిపోతున్నారు. ఆ తర్వాత ఏం చెప్పాడు?

وَرَبُّكَ الْغَفُورُ ذُو الرَّحْمَةِ
[వ రబ్బుకల్ గఫూరు జుర్రహ్మహ్]
వీరు చేస్తున్నటువంటి ఈ పాపాలు ఏవైతే ఉన్నాయో,

لَّوْ يُؤَاخِذُهُم بِمَا كَسَبُوا لَعَجَّلَ لَهُمُ الْعَذَابَ
[లౌ యుఆఖిదుహుమ్ బిమా కసబూ లఅజ్జల లహుముల్ అదాబ్]
వారి చేష్టలకు శిక్షగా ఆయన గనక వారిని పట్టుకున్నట్లయితే, వారిని తొందరగా శిక్షించి ఉండేవాడు.

بَل لَّهُم مَّوْعِدٌ
[బల్ లహుమ్ మౌయిదున్]
అసలు విషయం ఏమిటంటే వారి కోసం ఒక వాగ్దాన సమయం నిర్ధారితమై ఉంది. దాని నుంచి తప్పించుకొని పోయే చోటేదీ వారికి దొరకదు.

అల్లాహు తాలా చాలా కనికరం గలవాడు, ఎంతో కరుణామయుడు. అందుకొరకే అల్లాహు తాలా వారిని వారి కుఫ్ర్, వారి యొక్క షిర్క్, వారి బహుదైవారాధన, ఖురాన్‌ను తిరస్కరించడం ఇలాంటి పనులకు వెంటనే శిక్షిస్తలేడు అల్లాహు తాలా. ఈ రోజుల్లో కూడా ఎంతో మంది ముస్లింలు ఏమంటారు? ఫలానా కాఫిర్ వాళ్లు, ఫలానా అవిశ్వాసులు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు, ఇంత ఇబ్బంది పెడుతున్నారు, ఏమేమో జరుగుతుంది, అల్లాహు తాలా వారిని ఇంకా ఎందుకు తొందరగా శిక్షిస్తలేడు? అల్లాహు తాలా ఎంతో కరుణామయుడు. ఓపిక సహనాలు వహిస్తున్నాడు. ప్రజలు సత్యాన్ని తెలుసుకొని దానిని నమ్మాలి అని.

సోదర మహాశయులారా, ఇక్కడ ఏదైతే తెలిసిందో, మనిషి ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకొని చదివితే అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని తొందరగా పొందగలుగుతాడు. సూరతుల్ ఆరాఫ్ యొక్క చివరలో చూశారు కదా మీరు?

وَإِذَا قُرِئَ الْقُرْآنُ فَاسْتَمِعُوا لَهُ وَأَنصِتُوا لَعَلَّكُمْ تُرْحَمُونَ
దివ్య ఖుర్‌ఆన్‌ పారాయణం జరుగుతున్నప్పుడు దానిని శ్రద్ధగా వినండి, నిశ్శబ్దంగా ఉండండి. తద్వారా మీరు కరుణించబడవచ్చు.

అల్లాహు అక్బర్. ఈ ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో ఎందరో సలఫుస్సాలిహీన్ చెప్పారు, నీవు అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని త్వరగా పొందాలనుకుంటే ఖురాన్ శ్రద్ధగా విను, ఖురాన్ వింటున్నప్పుడు మౌనం వహించు, మరియు ఖురాన్‌ను మంచి విధంగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి.

ఇంకా సోదర మహాశయులారా, అలాగే అల్లాహు తాలా ఇదే సూరాలోని ఆయత్ నంబర్ 65 లో కూడా ఈ “రహ్మహ్” అన్న పదాన్ని ప్రస్తావించాడు. అక్కడ ఏ విషయంలో ఉందో ఒకసారి మీరు గమనించండి.

ఇక్కడ ఈ సంఘటన మీకు గుర్తుండే కదా? సూరతుల్ కహఫ్ మీరు ఎన్నో సార్లు అనువాదంతో చదివి ఉండవచ్చును. మూసా అలైహిస్సలాం ఒకసారి తమ జాతి మధ్యలో ఉన్నప్పుడు, అందరికంటే ఎక్కువ విద్య గలవారు ఎవరు అని అడిగినప్పుడు, పొరపాటున తొందరగా ఆయన నోట వెళ్తుంది “నేను” అని. ఈ సమాధానం అల్లాహ్‌కు ఇష్టం ఉండదు. అల్లాహు తాలా అంటాడు, ఓ మూసా, నా యొక్క దాసుడు ఉన్నాడు, అతని వద్దకు వెళ్ళు, అతనికి ఏ జ్ఞానం అయితే ఉందో దాన్ని కూడా నువ్వు నేర్చుకో. అయితే అక్కడికి వెళ్తారు. ఆ సంఘటన ఇక్కడ ఉంది.

فَوَجَدَا عَبْدًا مِّنْ عِبَادِنَا آتَيْنَاهُ رَحْمَةً مِّنْ عِندِنَا
అక్కడ వారు మా దాసులలోని ఒక దాసుణ్ణి కనుగొన్నారు. మేము అతనికి మా వద్ద నుంచి ఒక ప్రత్యేక కారుణ్యాన్ని ప్రసాదించి ఉన్నాము.

وَعَلَّمْنَاهُ مِن لَّدُنَّا عِلْمًا
ఇంకా మా వద్ద నుంచి అతనికి ఓ ప్రత్యేక విద్యను నేర్పి ఉన్నాము.

గమనిస్తున్నారా? మనిషి ఎంత ఎక్కువగా విద్య నేర్చుకొని దాని ప్రకారంగా ఆచరిస్తూ ఉంటాడో, అంతే ఎక్కువగా అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని నోచుకుంటాడు. అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని పొందడానికి అల్లాహ్ తన ప్రవక్తల ద్వారా పంపిన విద్య నేర్చుకోవడం చాలా ముఖ్యం.

ఇక మీరు ఆ తర్వాత ఇదే సూరాలోని మరో ఆయత్ గమనించండి. ఆయత్ నంబర్ 82. ఇందులో ఏ విషయం ఉంది?

మూసా మరియు ఖిద్ర్ ఇద్దరు కలిసి బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు ఏమవుతుంది? అక్కడ ఒక గోడ ఉంటుంది. అక్కడ ఒక గోడ ఉంటుంది, పడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే ఆ గోడను ఖిద్ర్ అలైహిస్సలాం ఒక్కరే దానిని నిలబెడతారు, బాగు చేస్తారు.

يَسْتَخْرِجَا كَنزَهُمَا رَحْمَةً مِّن رَّبِّكَ

అది ఇద్దరు అనాథలకు సంబంధించిన గోడ. ఆ గోడ కింద ఆ అనాథల కొరకు వారి తండ్రి చనిపోయేకి ముందు ఒక ధనం అనేది దాచి పెట్టి పోతాడు. ఈ పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు. ఇప్పుడే ఒకవేళ ఆ గోడ పడిపోయింది, అది బయటికి వచ్చింది అంటే, ప్రజలు దోచుకుంటారు. ఈ పిల్లలు పెరిగే వరకు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ దాన్ని కాపాడడానికి ఖిద్ర్‌ను పంపి ఆ గోడను సరి చేయించాడు. అయితే అక్కడ అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఏమంటున్నాడు? ఈ అనాథలిద్దరు యుక్త వయస్సుకు చేరినప్పుడు నీ ప్రభువు దయానుగ్రహంతో తమ ఈ నిధిని వెలికి తీసుకోవాలన్నది నీ ప్రభువు సంకల్పం. నీ ప్రభువు దయానుగ్రహం.

అల్లాహు అక్బర్. ఇక్కడ ఏం తెలిసింది? మనం విశ్వాసంపై ఉండి, మన పిల్లల కొరకు విశ్వాస మార్గాన్ని మరియు వారి కొరకు సదాచరణ, సత్కార్యాల గురించి బోధించి ఉన్నాము అంటే, మనము ఒకవేళ తొందరగా చనిపోయినా, మన పిల్లలు చిన్నగా ఉన్నా అల్లాహ్ వారిని వృధా కానివ్వడు. ఎందుకు? అల్లాహ్ తన కరుణతో వారిని రక్షిస్తాడు, సంరక్షిస్తాడు, వారి యొక్క బాగోగులు అల్లాహ్ చూసుకుంటాడు.

సోదర మహాశయులారా, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. అంతేకాదు, మనిషికి ఇహలోకంలో ఏదైనా పెద్ద హోదా, అంతస్తు లభించింది, మనిషికి ఇహలోకంలో ఒక పెద్ద రాజ్యం లభించింది, అతడు దానిని అల్లాహ్ యొక్క ఇష్ట ప్రకారంగా ప్రజల పట్ల మేలు చేయడానికి పూర్తి చేశాడంటే ఇది కూడా అల్లాహ్ వైపు నుండి చాలా గొప్ప కరుణ విషయం. ఇదే సూరా ఆయత్ నంబర్ 98 లో అల్లాహు తాలా మరోసారి ఈ రహ్మత్ యొక్క ప్రస్తావన చేశాడు. ఏముంది అక్కడ? జుల్-ఖర్నైన్.

అల్లాహ్ ఏం చెప్పాడు? మష్రిఖ్ (తూర్పు), మగ్రిబ్ (పడమర), మరియు నార్త్ (ఉత్తర) అన్ని దిశలో వెళ్లారు. అక్కడ జయించారు, ప్రజల పట్ల మేలు చేశారు, ఎందరో ప్రజలు ఇస్లాం స్వీకరించారు. చివరికి ఎక్కడికి వచ్చారు? సద్, యాజూజ్ మాజూజ్. అక్కడ గమనించండి, యాజూజ్ మాజూజ్ చాలా దుష్టులు, దౌర్జన్యులు. వారు అల్లాహ్ ధర్మాన్ని ధిక్కరించి ప్రజలపై చాలా హింస చేస్తూ ఉండేవారు. ఎప్పుడైతే ఆ ప్రాంతానికి చేరుకున్నారో, ఆ బాధితులు జుల్-ఖర్నైన్‌తో చెప్పారు,

نَجْعَلُ لَكَ خَرْجًا
మేము కావాలంటే నీకు కొంత ఇచ్చేస్తాము డబ్బు.

عَلَىٰ أَن تَجْعَلَ بَيْنَنَا وَبَيْنَهُمْ سَدًّا
నీవు ఒక డ్యాం లాంటిది, ఒక పెద్ద గోడ లాంటిది, మాకు వారికి మధ్యలో వారు మాపై వచ్చి దండయాత్ర చేయకుండా, దౌర్జన్యం చేయకుండా ఒక అడ్డు నిర్మించు.

జుల్-ఖర్నైన్ ఏం చేశారు? ఎలాంటి నాకు అవసరం లేదు, అల్లాహ్ నాకు ఇచ్చిన ధనం చాలా ఉంది. కేవలం మీరు ఒకవేళ ఏమైనా చేయగలిగితే, నాకు మీ యొక్క సపోర్ట్ కొంత ఇవ్వండి. ఎందుకంటే మనుషులు నాతో పాటు తక్కువ ఉన్నారు, మీరు ఇందులో కొంత సహాయపడ్డారంటే ఒక పటిష్టమైన గోడ మనం తయారు చేద్దాము. అయితే గోడనే తయారు చేయలేదు. ఒక పెద్ద గుట్ట లాంటిది వారి మధ్యలో, వీరి మధ్యలో చేసి, అంతే వదలలేదు.

آتُونِي زُبَرَ الْحَدِيدِ
నాకు ఇనుప రేకులను తెచ్చి ఇవ్వండి.

حَتَّىٰ إِذَا سَاوَىٰ بَيْنَ الصَّدَفَيْنِ
ఆ విధంగా అతను ఆ రెండు పర్వతాల మధ్య గోడను సమానంగా లేపిన తర్వాత, అగ్నిని రాజేయండి అని ఆజ్ఞాపించాడు. ఆ ఇనుప రేకులు బాగా కాలి అగ్నిగా మారిన తర్వాత, కరిగిన రాగిని తెండి, దానిపై పోస్తాను అని అన్నాడు.

వ్యాఖ్యానకర్తలు ఏమంటున్నారు, ముఫస్సిరీన్ రహమహుముల్లా చెబుతున్నారు, ఇది వారు దాటడం మరీ ఇబ్బందికరంగా ఉంటది, అందుకొరకు ఆయన ఇలాంటి ఉపాయాన్ని అవలంబించారు. కానీ ఇదంతా చేసిన తర్వాత ఏమంటున్నారు? గమనించండి. ఇక వారిలో అంటే యాజూజ్ మాజూజ్‌లో ఆ గోడను ఎక్కే శక్తి లేకపోయింది, దానికి రంధ్రం వేయటం కూడా వారి తరం కాదు. గమనించారా? ఆ వెంటనే ఏమంటున్నారు? ఇది కేవలం నా ప్రభువు కటాక్షం.

هَٰذَا رَحْمَةٌ مِّن رَّبِّي
[హాదా రహ్మతుమ్ మిర్రబ్బీ]

ఈ రోజుల్లో ఎవరెవరైతే తమ యొక్క శక్తిశాలిని, తమ యొక్క ఆర్థిక శక్తిని, తమ యొక్క అణువు శక్తిని, తమ యొక్క సైన్య శక్తిని, ఇంకా పెద్ద పెద్ద సైంటిస్టుల మా వద్ద శక్తి ఉంది అన్నటువంటి విషయాల ద్వారా ప్రజలకు నష్టం చేకూరుస్తున్నారు, ప్రజలకు వారికి సౌకర్యాలు, వారు ఉన్నటువంటి ఇబ్బందుల నుండి బయట తీయకుండా వారిని మరింత పీడిస్తున్నారు. చివరికి కొన్ని దేశాలలో ఏమవుతుంది? ధనవంతులు మరింత ధనవంతులు అయిపోతున్నారు, బీదవాళ్లు ఇంకా బీదవాళ్లు అయిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఏదైతే కొందరు చేస్తున్నారో, జుల్-ఖర్నైన్ యొక్క ప్రస్తావన అల్లాహ్ ఖురాన్‌లో ఏదైతే చేశాడో గమనించాలి. ఇంత పెద్ద ఒక పని చేసిన తర్వాత కూడా అతను ఏమంటున్నాడు? ఇది నాది గొప్పతనం ఏమీ కాదు, కేవలం నా ప్రభువు కటాక్షం. అయితే నా ప్రభువు వాగ్దాన సమయం వచ్చినప్పుడు ఆయన దాన్ని నేలమట్టం చేసేస్తాడు.

అల్లాహు అక్బర్! అల్లాహు అక్బర్! గమనించారా? ఇంత పటిష్టమైన గోడ, కరిగిన రాగిని అందులో పోయడం జరిగింది. ఇనుప రేకులతో తయారు చేయడం జరిగింది. కానీ ఏమంటున్నారు? నా ప్రభువు కోరినప్పుడు అది పూర్తిగా నేలమట్టం అయిపోతుంది.

అల్లాహు అక్బర్! ఈ విధంగా సోదర మహాశయులారా, చెప్పే నా యొక్క ఉద్దేశాన్ని మీరు గమనించారా లేదా? ఈ సూరాలో సుమారు ఏడు సార్లు “రుహ్మా”, “రహ్మత్”, “రహ్మతిహి” అన్నటువంటి పదాలు, కారుణ్యం గురించి ఏదైతే చెప్పబడ్డాయో, దీని ద్వారా మనకు బోధ పడుతున్నది ఏమిటంటే, మనం ప్రతి జుమా పూర్తి శ్రద్ధతో ఈ సూరాను చదివామంటే, పూర్తి వారంలో మనం దీనిని మంచి విధంగా గ్రహించామంటే, అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని పొందడానికి ఎంతో మంచి ఆస్కారం ఉంటుంది. కానీ తోతా మైనా కీ తరహా సే పడ్నా నహీ హోనా. చిలుక చదివినట్టుగా చదవడం కాదు. ఈ రోజుల్లో ఎన్నో వీడియోలు యూట్యూబ్‌లో చూస్తారు కావచ్చు మీరు. ఎందరో చిలుకలకు సూరే ఫాతిహా మొత్తం నేర్పడం జరిగింది. కొన్ని చిలుకలకు సూరే యాసీన్ యొక్క రుకూ, రెండు రుకూలు యాద్ చేయడం, చేపించడం జరిగింది. కానీ ఏమైనా అర్థమవుతాయా వాటికి? గాడిద పై నీవు సిమెంట్ బస్తాలు వేసినా గానీ, లేక మంచి పుస్తకాల, ఖురాన్ గ్రంథాలు దానిపై వేసి ఎక్కడికైనా తీసుకెళ్లినా గానీ, గాడిద గాడిద. తన వీపు మీద ఏది ఉన్నదో తెలియదు. మన పరిస్థితి అలా కాకూడదు. మనం అర్థం చేసుకొని చదవాలి.

నేను ప్రత్యేకంగా ఈ రోజు అల్లాహ్ యొక్క కారుణ్యం గురించి ఈ సూరాలో ఎంత గొప్పగా చెప్పడం జరిగింది, ధర్మవేత్తలు ఈ సూరాలో ఉన్నటువంటి రహస్యాలలో ఈ “రహ్మత్” కారుణ్యం యొక్క రహస్యం చాలా గొప్పది. బహుశా ఆరోగ్యం కొంచెం తోడు ఇవ్వనందుకు నేను మంచి విధంగా చెప్పలేకపోయాను కావచ్చు, కానీ ఆయతుల యొక్క రిఫరెన్స్ మీకు చూపిస్తూ ఏదైతే నేను చిన్న ప్రయత్నం చేశానో, కనీసం మీరు చదివేటప్పుడు శ్రద్ధగా చదవండి. అల్లాహ్ యొక్క దయతో మీకు నేను చెప్పిన దానికన్నా ఎక్కువ మంచి రీతిలో విషయం అర్థం కావచ్చు.

జజాకుముల్లాహు ఖైరా వ అహసనల్ జజా వ బారకల్లాహు ఫీకుమ్. అల్లాహ్ మీరు వచ్చి ఇంత శ్రద్ధగా విన్న యొక్క మీ కృషిని స్వీకరించు గాక. ధర్మ విద్య ఎక్కువగా నేర్చుకుంటూ ఉండేటువంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించు గాక. ఆమీన్.

వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.


సూరతుల్ కహఫ్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) – మెయిన్ పేజీ. (అన్నీ పాఠాల కోసం)
https://teluguislam.net/tafsir-kahf/

ఖురాన్ మెయిన్ పేజీ
https://teluguislam.net/quran

సూరతుల్ కహఫ్ పారాయణం: సాద్ అల్-ఘమిడి | తెలుగు సబ్ టైటిల్స్: అహ్సనుల్ బయాన్ |వీడియో
https://teluguislam.net/2020/06/25/18-al-kahf