రుకూ
ఖుర్ఆన్ పఠనం పూర్తయిన తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాసేపు అలాగే మౌనంగా [303] నిలబడి ఉండేవారు. ఆ తర్వాత ఇంతకు ముందు ‘తక్బీరే తహ్రీమా’ అంశం క్రింద వివరించినట్టుగా చేతులు పైకెత్తేవారు (రఫయదైన్ చేసేవారు).[304] తదుపరి “అల్లాహు అక్బర్” [305] అంటూ రుకూలోకి వెళ్ళిపోయేవారు. [306]
“నమాజ్‌ను సరిగా నెరవేర్చని వ్యక్తి“కి ఈ రెండు విషయాల గురించి ఆజ్ఞాపిస్తూ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు:
“నమాజ్ చేసే వ్యక్తి ఎవరయినా ముందుగా అల్లాహ్ ఆదేశించినదాని ప్రకారం చక్కగా వుజూ చేసుకోవాలి. తర్వాత “అల్లాహు అక్బర్” అని చెబుతూ అల్లాహ్‌ను స్తుతించాలి, ఆయన పవిత్రతను కొనియాడాలి. ఆ తర్వాత ఖుర్ఆన్లో అల్లాహ్ తనకు నేర్పించిన దానిలో, తనకు అనుమతి ప్రసాదించిన దానిలో తనకు వీలు కలిగినంత పఠనం చేయాలి. ఆ తర్వాత “అల్లాహు అక్బర్” అంటూ రుకూ చేయాలి. దేహంలోని కీళ్ళన్నీ వాటి వాటి స్థానాల్లో కుదుటపడి, ప్రశాంతతను పొందే విధంగా రుకూలో రెండు చెతుల్ని మోకాళ్ల చిప్పలపై ఉంచాలి. ….(సశేషం) ఈ విధంగా చేయని వారెవరైనా, వారి నమాజు సంపూర్ణమైనదిగా భావించబడజాలదు.”” [307]
రుకూ చేసే పద్దతి
“రుకూ స్థితిలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన అరచేతుల్నిమోకాళ్ల మీద ఉంచేవారు”,[308] “అలా చేయమని ఆయన ప్రజలకు సయితం ఆదేశించేవారు”.[309] ఈ విధంగా చేయమని ఆయన “నమాజ్ సరిగా నెరవేర్చని వ్యక్తి“కి కూడా ఆజ్ఞాపించి ఉన్నారు. కొన్ని వాక్యాల క్రితమే ఈ విషయం గడిచింది.
“రుకూలో ఆయన తన రెండు చేతులతో మోకాళ్లను పట్టుకొని ఉన్నట్లుగా వాటిని గట్టిగా అదిమి ఉంచేవారు”[310] “ఆ సమయంలో చేతివేళ్లను విశాలంగా ఉంచుతారు”. [311] “నమాజ్‌ను సరిగా నెరవేర్చని వ్యక్తి”కి ఇలా చేయమని ఆజ్ఞాపిస్తూ ఆయన “రుకూ చేసినప్పుడు నీ అరిచేతుల్ని మోకాళ్ల మీద పెట్టుకో. చేతివ్రేళ్లను వదులుగానూ, విశాలంగానూ ఉంచు. ప్రతి అవయవం తన స్థానంలోకి వెళ్ళిపోయే వరకు అదే స్థితిలో ఉండు” అని పురమాయించారు.[312] రుకూ స్థితిలో ఆయన తన మోచేతుల్ని ప్రక్కలకు ఎడంగా ఉంచేవారు.[313] రుకూలో వీపును విశాలంగా,[314] నీళ్లు పోసినా అటూ ఇటూ జారిపోనంత తిన్నగా ఉంచేవారు.[315]
“రుకూ స్థితిలో నీ అరచేతుల్ని మోకాళ్ళ మీద పెట్టుకో. వీపును పొడుగ్గా ఉంచు. రుకూ స్థితికి బలాన్నివ్వు” అని ఆయన “నమాజును సరిగా నెరవేర్చని వ్యక్తి“కి సూచించారు.[316] రుకూలో తలను ఆయన వంచిగాని, పైకెత్తిగాని ఉంచేవారు కాదు.[317] పైగా ఆయన (రుకూ స్థితిలో) తన తలను వీపుకు సమాంతరంగా ఉంచేవారు. [318]
ప్రశాంతంగా రుకూ చేయటం తప్పనిసరి (వాజిబ్)
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతో ప్రశాంతంగా రుకూ చేసేవారు. అలా చేయమని ఆయన “నమాజును సరిగా నెరవేర్చని వ్యక్తి“కి కూడా ఆదేశించి ఉన్నారు. గత అంశం ప్రారంభంలో దీని ప్రస్తావన వచ్చింది.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అంటుండేవారు: “మీరు రుకూ మరియు సజ్దాలు బాగా చేయండి. ఎవరి చేతిలో నా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నాను. మీరు రుకూ చేసినప్పుడు, సజ్దా చేసినప్పుడు నేను మిమ్మల్ని నా వెనుక వైపు నుంచి చూస్తూ ఉంటాను.” [319]
ఒకతను నమాజు చేస్తున్నాడు. కాని అతను రుకూ సరిగా చేయటం లేదు. సజ్దా కూడా చాలా తొందరతొందరగా చేస్తున్నాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతన్ని చూసి, “ఒకవేళ ఇతనికి ఇదే స్థితిలో మరణం గనక వస్తే ఇతను ముహమ్మద్ ప్రవక్త ధర్మంపై మరణించినట్లు కాదు. (కాకి నెత్తురులో ముక్కు పొడిచినట్లు ఇతను చాలా వేగంగా నమాజ్ చేస్తున్నాడు). రుకూ సరిగ్గా నెరవేర్చకుండా సజ్దాలు కూడా సుడిగాలిలా చేసే వ్యక్తి బాగా ఆకలితో ఉండి, ఒకటి రెండు ఖర్జూర పండ్లు తిన్నప్పటికీ ఆకలి చల్లారని మనిషిలాంటివాడు” అని చెప్పారు. [320]
తన ముక్కును నేలకేసి పొడిచే కోడి లాగా నమాజులో తొందర చేయవద్దని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తనకు ఉపదేశించారనీ, నమాజులో నక్క లాగా కుడి ఎడమలు దిక్కులు చూడవద్దని తనను ఆదేశించారని, కోతి లాగా పిరుదుల్ని చేతులను నేలకు ఆనించి పెట్టి, పిక్కలను, తొడలను నిలబెట్టి కూర్చో రాదని కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తనకు ఆదేశించారని అబూ హురైరా (రజిఅల్లాహు అన్హు) తెలియజేశారు. [321]
“నమాజు నుండి దొంగిలించేవాడు అందరిలోకెల్లా చెడ్డ దొంగ” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అన్నారు. ఈ మాట విని ఆయన సహచరులు (ఆశ్చర్య పోయారు). “దైవవక్తా! అసలు ఎవరైనా నమాజులో నుండి ఎలా దొంగిలిస్తారు?” అని అడిగారు. దాని కాయన “అంటే అతను రుకూ, సజ్దాలు పూర్తిగా నెరవేర్చడు” అంటూ తన మాటకు అర్ధం చెప్పారు. [322]
ఒకతను నమాజు చేస్తూ రుకూ, సజ్దాల్లో వీపుని తిన్నగా ఉంచటం లేదు (దగ్గర్లో) నమాజు చేస్తున్న దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన క్రీగంట చూపులతో అతన్ని గమనించారు. నమాజు పూర్తయిన తర్వాత ఆయన అందర్ని ఉద్దేశించి “ముస్లింలారా! రుకూ, సజ్దాల్లో తమ వీపుల్ని తిన్నగా ఉంచని వారి నమాజు నెరవేరదు” అని హెచ్చరించారు. [323]
మరో హదీసు ప్రకారం ఆయన “రుకూ, సజ్దాల్లో వీపుని తిన్నగా ఉంచి చేయబడని నమాజు సరిపోదు” అని అన్నారు. [324]
హదీసు రెఫరెన్సులు:
[303]. అబూదావూద్, హాకిమ్ దీనిని సహీగా ఖరారు చేశారు, జహబీ దీనితో ఏకీభవించారు. ఈ మౌనం కేవలం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రశాంతంగా శ్వాస తీసుకోగలిగినంత పరిమాణంలో వుండేదని ఇబ్నె ఖయ్యూం (రహిమహుల్లాహ్) అభిప్రాయ పడ్డారు.
[304,305,306]. బుఖారీ, ముస్లిం.
ఈ రఫయదైన్ మరియు దీనితోపాటు రుకూ నుండి లేచేటప్పుడు చేసే రఫయదైన్ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా ఎన్నో పరంపరలతో నిరూపించబడి ఉంది. ముగ్గురు ఇమాములు, ఎంతో మంది హదీసువేత్తలు. ధార్మికజ్ఞానుల అభిమతం కూడా ఇదే. తారీఖ్ ఇబ్నె అసాకిర్ (15/78/2) నందు ఇమామ్ మాలిక్ జీవితాంతం దీనిపై ఆచరించారని వుంది. కొందరు హనఫీ ఉలమాలు కూడా దీనిని యిష్టపడ్డారు. వీరిలో ఇమామ్ అబూ యూసుఫ్ శిష్యులు ఇసామ్ బిన్ యూసుఫ్ ఖల్బీ (మరణం 210 హి.) కూడా ఒకరు. ఆయన గురించి యిది వరకే వివరించబడింది.
అబ్బుల్లా ఇబ్నె అహ్మద్ తన ‘మసాయల్’ – 60వ పేజీలో తన తండ్రి ద్వారా యిలా ఉల్లేఖించారు: ఉఖ్బా బిన్ ఆమిర్ (రజి అల్లాహు అన్హు) ద్వారా నమాజులో రఫయదైన్ గురించి యిలా ఉల్లేఖించబడింది: ఒక్కో రఫయదైన్‌కు బదులుగా పదిపుణ్యాలు దొరుకుతాయి.
నేను చెప్పేదేమిటంటే – ఉఖ్బా బీన్ ఆమిర్ మాట – బుఖారీ, ముస్లింలోని ఎవరైనా ఏదైనా సత్మార్యం చేయాలని సంకల్పించుకొని, తదుపరి దానిని పూర్తి చేస్తే దానికి బదులుగా అతనికి 10 నుంది 700 పుణ్యాలు దొరుకుతాయి అన్న హదీసుకు అనుగుణంగా వుంది. మరిన్ని వివరాల కోసం ‘సహీ అత్తర్గీబ్- 16వ పేజీ చూడగలరు.
[307]. అబూదావూద్,నసాయి. హాకిమ్ దీనిని సహీగా ఖరారు చేశారు మరియు జహబీ దీనితో ఏకీభవించారు.
[308]. బుఖారీ, అబూదావూద్.
[309]. బుఖారీ, ముస్లిం.
[310]. బుఖారీ, అబూ దావూద్.
[311]. హాకిమ్ దీనిని సహీగా ఖరారు చేశారు, జహబీ కూడా దీనితో ఏకీభవించారు. అబూదావూద్, తయాలిసీ కూడా దీనిని ఉల్లేఖించారు. దీని తఖ్రీజ్ – సహీ అబూదావూద్: 809 నందు చేయబడింది.
[312]. సహీ ఇబ్నె ఖుజైమా, సహీ ఇబ్నె హిబ్బాన్.
[313]. తిర్మిజి, ఇబ్నె ఖుజైమా దీనిని సహీగా ఖరారు చేశారు.
[314]. బైహఖీ – సహీ బుఖారీ పరంపరతో.
[315]. తబ్రానీ – మోజమిల్ కబీర్ వ సగీర్, జవాయెద్ ముస్నద్ అబ్దుల్లా బిన్ అహ్మద్,ఇబ్నెమాజా.
[316]. అహ్మద్, అబూదావూద్ – సహీ పరంపరతో.
[317]. అబూదావూద్, బుఖారీ – జుజ్ అల్ ఖీరా ఖలఫుల్ ఇమామ్ – సహీ పరంపరతో
[318]. ముస్లిం, అబూ ఆవాన
[319]. బుఖారీ, ముస్లిం. నేను చెప్పదేమిటంటే – ఇలా చూడగలగడం ఒక వాస్తవం. యిది ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) అద్భుతాలలో ఒకటి. అయితే ఇది నమాజు కొరకే ప్రత్యేకం. ఇతర సందర్భాలలో దీనికి సంబంధించిన ఆధారమేదీ లేదు.
[320]. మున్నద్ అబూ యాలా (340, 349/1), ఆజూరీ- అర్బయీన్, బైహఖీ, తబ్రానీ (1/192/1), జియా – అల్ మున్తఖా (276/1), ఇబ్నె అసాకిర్ (2/226/2, 414/1, 8/14/1,76/2) – హసన్ పరంపరతో. ఇబ్నె ఖుజైమా దీనిని సహీగా ఖరారు చేశారు (1/82/1). ఇబ్నె బత్తా, మొదటి భాగంలోని అదనపు పదజాలం లేకుందా దీనిని బలపర్చే ఒక ముర్సల్ హదీసును “అల్ ఇబానా” (5/43/1) నందు ఉల్లేఖించారు.
[321]. తయాలిసీ, అహ్మద్, ఇబ్నె అబీషైబా. ఇది హసన్ హదీసు. ఈ విషయం నేను హాఫిజ్ అబ్దుల్ హఖ్ ఇష్‌బిలీ – అల్ అహ్కామ్ – హదీసు నెం. 1348 పాద సూచికలో వివరించాను.
[322]. ఇబ్నె అబీ షైబా (1/89/2), తబ్రానీ, హాకిమ్ దీనిని సహీగా ఖరారు చేశారు, జహబీ కూడా దీనితో ఏకీభవించారు.
ఇది దైవ ప్రవక్త నమాజు స్వరూపం – షేఖ్ అల్ అల్బానీ (రహిమహుల్లా) (పుస్తకం) నుండి తీసుకో బడింది. (150-154 పేజీలు)
ఇతర లింకులు:

You must be logged in to post a comment.