1251. హజ్రత్ అబూ ఖతాదా (రధి అల్లాహు అన్హు) కధనం :-
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అరఫా నాటి ఉపవాసం గురించి విచారించటం జరిగింది. అందుకాయన సమాధానమిస్తూ, “అది క్రితం యేడు మరియు వచ్చేయేటి పాపాలన్నిటినీ (minor sins – చిన్న పాపాలు) తుడిచి పెట్టేస్తుంది” అని వివరించారు.
[సహీహ్ ముస్లిం లోని ఉపవాసాల ప్రకరణం]
ముఖ్యాంశాలు:-
జుల్ హిజ్జా మాసపు తొమ్మిదో తేదీని ‘అరఫా రోజు’ అని పిలుస్తారు. ఆ రోజు హజ్ యాత్రికులందరూ అరఫాత్ మైదానంలో ఆగుతారు. కనుక ఆ రోజును ‘అరఫాత్ రోజు’ గా వ్యవహరిస్తారు. ఆ విధంగా అరఫాత్ మైదానంలో ఆగటమనేది హజ్ విధులన్నిటిలోనూ అత్యంత ప్రధానమైనది. దాన్ని నిర్వర్తించకపోతే హజ్జే నెరవేరదు. హజ్ యాత్రికులు ఆ రోజున ప్రార్ధనలు, సంకీర్తనల్లో నిమగ్నులై ఉంటారు. ఆనాడు వారికి అదే గొప్ప ఆరాధనగా పరిగణించబడుతుంది. కనుక వారు ఆరోజు ఉపవాసం పాటించటం అభిలషణీయం కాదు. కాని హజ్ యాత్రలో పాల్గొనని వారికి మాత్రం ఆరోజు ఉపవాసం పాటిస్తే గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. ఆ ఒక్క ఉపవాసం రెండేళ్ళ పాపాలను తుడిచిపెట్టేస్తుంది.