1405. హజ్రత్ అబూ వాఖిద్ లైసీ (రధి అల్లాహు అన్హు) కధనం :-
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మస్జిద్ లో కూర్చొని ఉన్నారు. ప్రజలు కూడా ఆయన దగ్గర (కూర్చొని) ఉన్నారు. అంతలో ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఇద్దరు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వైపుకు వచ్చారు. ఒకతను వెళ్ళిపోయాడు. వారిద్దరూ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికొచ్చి నిల్చున్నారు. వారిలో ఒకతనికి సమావేశం మధ్యలో ఖాళీ స్థలం కన్పించింది. వెంటనే అతనా స్థలంలో కూర్చున్నాడు. రెండవ వ్యక్తి సమావేశం చివరికెళ్ళి కూర్చున్నాడు. కాని మూడో వ్యక్తి తిరిగి వెళ్ళిపోయాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమావేశం ముగిసిన తరువాత ఇలా అన్నారు : “నేను మీకు ముగ్గురు మనుషులను గురించి చెప్పనా? వారిలో ఒకడు అల్లాహ్ శరణు కోరాడు. అల్లాహ్ అతనికి శరణు (రక్షణ) ప్రసాదించాడు. మరొకడు సిగ్గుపడ్డాడు. అల్లాహ్ కూడా అతని వల్ల సిగ్గుపడ్డాడు. మూడో వ్యక్తి ముఖం చాటేసి వెళ్ళిపోయాడు. అల్లాహ్ కూడా అతని వైపు నుండి ముఖం తిప్పుకున్నాడు. ( అంటే అతని వైఖరి పట్ల ఆగ్రహం చెందాడు).”