532. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) కధనం :-
హజ్రత్ సాద్ బిన్ ఉబాదా (రధి అల్లాహు అన్హు) వ్యాధిగ్రస్తులయితే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రధి అల్లాహు అన్హు), సాద్ బిన్ వఖ్ఖాస్ (రధి అల్లాహు అన్హు), అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) లు కూడా ఉన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అక్కడకు చేరుకోగానే ఆ ఇంటి వాళ్ళు ఆయన చుట్టూ మూగారు. అది చూసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (సందేహిస్తూ) ” ఏమిటి ఆయన చనిపోయారా?” అని అడిగారు. దానికి వారు “చనిపోలేదు దైవప్రవక్త!” అన్నారు. ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (రోగస్థితి చూసి) కంటతడి పెట్టారు. ఆయన్ని చూసి అందరూ దుఖించడం మొదలెట్టారు. తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు – “వినండి, హృదయావేదన కన్నీళ్ళ వల్ల గానీ లేదా నోట దయార్ద్ర పలుకులు వెలువడటం వల్ల గానీ దేవుడు మనిషిని శిక్షించడు. అయితే దీని విషయంలో (దైవప్రవక్త నోటివైపు చూపిస్తూ అన్నారు) మాత్రం (పెడబొబ్బలు పెడితే) అల్లాహ్ తప్పకుండా శిక్షిస్తాడు. కుటుంబసభ్యులు ఏడ్చినా సరే మృతునికి శిక్ష ఉంటుంది.