అజ్ జుఖ్ రుఫ్ (బంగారు ఆభరణాలు) సూరా పరిచయం
ఇది మక్కా కాలానికి చెందిన సూరా. ఇందులో 89 ఆయతులు ఉన్నాయి. ఎకధైవారాధన, మరణించిన తరువాత మళ్ళీ లేపబడటం, శిక్షా బహుమానాల గురించి ఈ సూరా నొక్కి చెప్పింది. ఇందులోని 35 వ ఆయతులో బంగారు ఆభరణాల గురించిన ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావన ఆధారంగా దీనికి ఈ పేరు పెట్టడం జరిగింది. ప్రాపంచిక జీవితం తాత్కాలికమైనదని, మున్నాళ్ళ ముచ్చటని, ఇక్కడి బంగారు ఆభరణాలు శాశ్వతమైనవి కావని బోధించింది. ప్రాపంచిక జీవితం మంచివారికి, చెడ్డవారికి అందరికీ దక్కుతుందనీ, కాని పరలోక జీవితంలో సంతోషాలు కేవలం మంచివారికి మాత్రమే దక్కుతాయని, అవి శాశ్వతమైనవనీ తెలియ జేసింది. దివ్య ఖుర్ఆన్ ఒక స్పష్టమైన గ్రంధంగా అభివర్ణిస్తూ ఈ సూరా ప్రారంభమయ్యింది. ఈ గ్రంథం పూర్తిగా వివేకంతో నిండి ఉందని, అయినప్పటికీ అవిశ్వాసులు దీనిని తిరస్కరిస్తున్నారనీ, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక సాధారణ మానవ మాత్రుడైనందున ఆయన్ను దైవ సందేశహరునిగా విశ్వసించడానికి నిరాకరిస్తున్నారనీ విమర్శించింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ఉద్దేశించి ఆయన రుజుమార్గంపై ఉన్నారనీ, ఆయన తనకు అందజేయబడుతున్న సందేశానికి స్థిరంగా కట్టుబడాలనీ బోధిస్తూ, గతకాలాల ప్రవక్తలు ఏ విధంగా సత్యధర్మ ప్రచారానికి సంఘర్షించవలసి వచ్చిందో వివరించింది. వారిని కూడా ఆయా జాతుల ప్రజలు తిరస్కరించి, వారిపై దౌర్జన్యాలు చేశారని తెలియజేసింది.
ప్రజలు ఆరాధనల్లో చేస్తున్న ఘోరమైన తప్పిదాన్ని ఈ సూరా ఎత్తిచూపింది. ప్రజలు తమ తాతముత్తాతల విశ్వాసాలను గుడ్డిగా అనుసరిస్తున్నారని, ఆ విధంగా తాము అల్లాహ్ కు భాగస్వాములను కల్పించే ఘోరమైన తప్పిదం చేస్తున్న విషయాన్ని కనీసం గుర్తించటం లేదని ఈ సూరా విమర్శించింది.