పుస్తకం నుండి: కలామే హిక్మత్ – 1(వివేక వచనం)
రచన: సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు: జమీ అతే అహ్ లె హదీస్, ఆంధ్రప్రదేశ్
[ఇక్కడ చదవండి / PDF డౌన్ లోడ్ చేసుకోండి]
అంతిమ దైవప్రవక్త ప్రవచించారని హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“బలవంతుడైన విశ్వాసి బలహీనుడైన విశ్వాసికంటే మేలైనవాడు. ఇంకా – అతను-అల్లాహ్ కు ప్రీతిపాత్రుడు. ఇంకా, ప్రతివాని లోనూ మంచి ఉంటుంది. మీ కొరకుప్రయోజనకరమయిన వాటిని ఆశించండి. ఇంకా, దైవ సహాయం కోరండి, నిస్పృహకులోనవబాకండి. మీకు ఏదయినా బాధ కలిగితే, ‘ఒకవేళ నేను అలాచేసి ఉంటేఇలా జరిగేది’ అని అనబాకండి. దానికి బదులు, ‘ఇది అల్లాహ్ నిర్ణయించిన విధి.ఆయన తలచినదే అయింది’ అని అనండి. ఎందుకంటే, ‘ఒకవేళ అలా జరిగిఉంటే…..’ (అనే ఊహాగానాలు) షైతాన్ మార్గాన్ని తెరచివేస్తాయి.’ (ముస్లిం)
ఈ హదీసులో దైవప్రవక్త (సఅసం) మూడు ముఖ్య విషయాలను ప్రబోధించారు :
(1) “బలవంతుడైన విశ్వాసి బలహీనుడైన విశ్వాసికన్నా మేలైనవాడు. అతను అల్లాహ్ కు ప్రీతిపాత్రుడు”
“ఇక్కడ బలం అంటే అన్ని రకాల బలం అని భావం. ఇమామ్ నవవి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు – “ఇక్కడ బలం అంటే మనో నిబ్బరం కలిగి ఉండి, పరలోక విషయాలలో ముందంజ వేయడం అని భావం. ఈ గుణాలున్న వ్యక్తి ధర్మ పోరాటంలో అందరికంటే ముందుకు పోయి శత్రువుపై దాడి జరుపుతాడు.అందరికంటే ముందు దైవాన్వేషణలో మునుముందు ఉంటాడు, మంచిని పెంచడంలో, చెడులను నిర్మూలించడంలో, సహనం వహించటంలో వజ్ర సంకల్పుడై ఉంటాడు. దైవ మార్గంలో ఎన్ని ఆపదలు ఎదురైనా ఓరిమిని ప్రదర్శిస్తాడు. నమాజ్, రోజా, జకాత్ తదితర ఆరాధనలకై, ఇంకా వాటి రక్షణకై అందరికంటే ఎక్కువగా చురుకుదనం కలిగి ఉంటాడు.”
శారీరక బలం లేదా శరీర దారుఢ్యం కూడా దైవానుగ్రహమే. హజ్రత్ దావూద్ (అలైహిస్సలాం) గురించి చెబుతూ అల్లాహ్ ఇలా అన్నాడు:
“అల్లాహ్ ఆయనకు బుద్ధిబలాన్ని, కండబలాన్ని సమృద్ధిగా ప్రసాదించాడు.” (అల్ బఖర : 247)
జ్ఞానశక్తి కూడా మహదానుగ్రహమే. తన అంతిమ గ్రంథంలో సర్వోన్నతప్రభువు ఏమన్నాడో చూడండి –
“మీరు (వారితో) అనండి, జ్ఞానులు, అజ్ఞానులు ఇద్దరూ ఒకటేనా? కేవలం బుద్ధిమంతులే హితబోధను స్వీకరిస్తారు.” (అజ్జుమర్ : 9)
ధనబలం కూడా దైవప్రసాదితమైన వరమే. అల్లాహ్ సెలవిచ్చాడు :
‘ఇంకా చూడండి. అల్లాహ్ మీలో కొందరికి కొందరికంటే ఉపాధివిషయంలో ఆధిక్యత ప్రసాదించాడు. అయితే ఎవరికయితే ఈ ఆధిక్యతఇవ్వబడిందో, వారు తమ ఉపాధిని తమ బానిసల వైపునకు మళ్ళించేవారు కాదు. ఇద్దరూ ఈ ఉపాధిలో సమానమైన భాగస్థులు అయ్యేందుకు.అయితే అల్లాహ్ ఉపకారాన్నే ఒప్పుకోవటానికి వీరు తిరస్కరిస్తున్నారా?” (అన్ నహ్ల్ – 71)
ఒక మనిషికి రెండో మనిషిపై ఆధిక్యతను ఇచ్చే, ఇంకా అతని వ్యవహారాలలో సరళతను సృష్టించే ప్రతిదీ బలంగానే పరిగణించ బడుతుంది. అటువంటి బలం గనక దైవ విధేయతలో, దైవ ప్రసన్నతను పొందే పనుల్లో వినియోగమైతే అది ఎంతో ప్రశంసనీయమైన దవుతుంది. ఈమాన్ (విశ్వాసం) అనేది ఎలాంటి ప్రేరణంటే అది మనిషి శక్తి సామర్థ్యాలు సరైన మార్గంలో వ్యయమయ్యేలా చేస్తుంది. తద్వారా మేలును, శుభాన్ని కలిగిస్తుంది. అందుకనే, “బలవంతుడైన విశ్వాసి బలహీనుడైన విశ్వాసి కన్నా మేలైనవాడు, అల్లాహ్ కు ప్రీతిపాత్రుడు” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు.
(2). “ప్రతి వానిలోనూ మంచి ఉంది.”
అంటే విశ్వాసి బలవంతుడైనా, బలహీనుడైనా అతను మంచివాడే. ఎందుకంటేఅతనిలో విశ్వాసం ఉంది. విశ్వాసం స్వతహాగా బలమైనది. అన్ని రకాల శక్తులు క్షీణించినా కనీసం విశ్వాస బలమైతే ఉండనే ఉంటుంది. కనుక ఏ విశ్వాసినైనా హీనుడుగా, అల్పుడుగా పరిగణించడం సమ్మతం కాదు.
(3). “మీ కొరకు మేలైన వాటిని ఆశించండి.”
ఇక్కడ ఆశించడమంటే భావం ప్రయత్నించడం, దానికోసం శక్తియుక్తులన్నీ ఒడ్డటం.ప్రాపంచికంగా నయినా, పారలౌకికంగా నైనా శ్రేయస్కరమైన ప్రతిదాన్నీ పొందమని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశించారు. విశ్వాసి ప్రతి మంచినీ పొందే ప్రయత్నంలో ఉంటాడు. ఎందుకంటే అతను తన ప్రభువు అనుగ్రహానికి అతీతుడు కాలేడు. అల్లాహ్ సెలవిచ్చాడు:
“(ఓ ప్రవక్తా! అనండి) నాకే గనక అగోచరాల జ్ఞానం ఉండి ఉంటే,ప్రయోజనకరమైన వాటిని నేను పుష్కలంగా పొందేవాడిని. నాకు నష్టమే వాటిల్లేది కాదు.”(అల్ ఆరాఫ్ – 188)
- “దైవ సహాయం అడగండి”
లాభదాయకమైన వాటిని పొందమని ఆదేశించిన తరువాత మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం),’లాభకరమైన వస్తువు దైవ ప్రమేయంతోనే ప్రాప్తిస్తుంద’ని కూడా చెప్పారు. అందుకే లక్ష్య సాధన కొరకు దైవ సహాయాన్నే వేడుకోవాలి. ప్రతి మేలు, ప్రతి సహాయంఆయన అనుగ్రహంతోనే లభిస్తుంది. అల్లాహ్ తలచనంతవరకూ ఏ కారణాలూఏమీ చేయలేవు. ఎందుకంటే కారణాలను పర్యవసానాలను సృష్టించిన వాడు అల్లాహ్ యే గనక. ధర్మసమ్మతమైన కోర్కెల సాధనకై విశ్వాసి ధర్మ సమ్మతమైనఒనరులనే వినియోగిస్తాడు. అయితే నమ్మకం మాత్రం లాభనష్టాలను చేకూర్చగలశక్తిని కలిగిఉన్న దైవంపై పెట్టుకుంటాడు.
- “నిస్పృహకు లోనవబాకండి”
అంటే దైవవిధేయతలో, దైవ సహాయం కోరే విషయంలో అలసత్వం, బద్దకంపనికిరావు. దానికి బదులు దైవాన్ని ఆశతో వేడుకోవాలి. వేడుకోవటంతో పాటు’సాధన’ చేయాలి. దైవానుగ్రహాలను పొందే విషయంలో మందకొడిగా ఉండటం, విముఖతను చూపటం ఎంతకీ మంచిది కాదు. అలా చేస్తే దైవానుగ్రహాలనుఆక్షేపించినట్లవుతుంది. విశ్వసించిన వ్యక్తి దైవానుగ్రహాలను ఎన్నడూ ఆక్షేపించడు.
- మీకేదయినా బాధ కలిగినపుడు, ‘మేము గనక అలాచేసి ఉంటే ఇలా జరిగిఉండేది’ అని అనటం ఎంతమాత్రం భావ్యం కాదు.
విశ్వాసి సమస్త ప్రయత్నాలను చేసిన తరువాత కూడా అనుకున్నది నెరవేరకపోతే,దాని నష్టం నుండి బయటపడకపోతే, అప్పుడు దైవ నిర్ణయానికి రాజీపడిపోవాలి.దైవచిత్తం కాని దాన్ని సాధించలేనని తెలుసుకోవాలి. ఫలానా కారణంగా ఈ పనికాలేదని నిందమోపటం, లేదా ఒకవేళ ఆ చర్య గైకొని ఉంటే అది నెరవేరేది అనికాకి లెక్కలు వేయటం మోమిన్ (విశ్వాసి) స్థాయికి ఎంతమాత్రం తగదు.
- ఈ హదీసులో “ఒకవేళ” అనే పదం ఉపయోగించరాదని చెప్పబడింది. అయితే కొన్ని ఇతర హదీసుల్లో ఈ “పదం” వాడినట్లు కూడా ఉంది. అంతిమ హజ్సందర్భంగా మహాప్రవక్త (సఅసం), ‘ఒకవేళ ఇప్పుడు నా దృష్టికి వచ్చిన విషయం ముందే తెలిసి ఉంటే ఖుర్బానీ పశువుల్ని తెచ్చేవాడ్ని కాను’ అని అన్నారు. అలాగేదివ్య ఖుర్ఆన్,
“ఒకవేళ నాకే గనక అగోచర విషయజ్ఞానం ఉంటే ప్రయోజనకరమైనవాటినెన్నో పొందేవాడిని, నాకు కష్టనష్టాలే రాకుండా ఉండేవి (అని ఓప్రవక్తా వారితో చెప్పివేయండి)” అని అనబడింది.
దీని భావం ఏమంటే భవిష్యత్తులో ఏదైనా మంచి పని చేయాలన్న సంకల్పం ఉంటే, ఉదాహరణకు, ‘ఒకవేళ వచ్చే సంవత్సరం దాకా నేను బ్రతికి వుంటే హజ్ చేస్తాను’ అనవచ్చు. అందులో తప్పులేదు. లేదా గత జీవితంలో దైవవిధేయత విషయంలో జరిగిన లోటుపాట్లను తల్చుకుని సిగ్గుపడుతూ, ‘ఒకవేళ నేను నమాజ్ను క్రమం తప్పకుండా చేసివుంటే ఎంత బాగుండేది!’ అని అనవచ్చు. ఇంకా, అల్లాహు అయిష్టం కాని రీతిలో ఏదన్నా వాక్యం పలికినా దోషం లేదు. ఉదాహరణకు హిజ్రత్సందర్భంగా హజ్రత్ అబూబకర్ (రజిఅన్) సూర్ గుహలో, ఓ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)!బహు దైవారాధకులలో ఎవరయినా తల ఎత్తాడంటే చాలు, మిమ్మల్ని చూసేస్తాడు”అని అన్నారు.
అయితే గతంలో జరిగిపోయిన నష్టాన్ని తలచుకుని ‘అరె అలా చేసే బదులు ఇలాచేసి ఉంటే లాభదాయకంగా ఉండేదేమో!’ అని మాత్రం అనకూడదు. అలా అనటం వల్ల దైవంపై నమ్మకం సడలి పోయిన భావం వ్యక్తమవుతుంది. ఉదాహరణకు,“నేను ఫలానా వస్తువు తిని ఉంటే స్వస్థత చేకూరేదేమో” అని అనడం విశ్వాసరాహిత్యానికి ఆనవాలుగా ఉంటుంది.
ఈ హదీసులో ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి. మొదటి విషయమేమంటే విశ్వాసులలో ఒకటికి రెండు కోవలకు చెందిన వారుంటారు. అయితే వారిలోనిబలవంతుడంటే అల్లాహ్ కు ఇష్టం. ఎందుకంటే దైవాజ్ఞాపాలనలో అతను తన బలాన్నిశక్తిని ధారపోస్తాడు. బలహీనుడైన విశ్వాసికన్నా సక్రమంగా ఎక్కువగా దైవాన్నిసేవిస్తాడు. అందుకే బలాన్ని, శక్తిని పొందడానికి ప్రయత్నించమని దైవప్రవక్త నొక్కిపలికారు. ఎందుకంటే ప్రతిదీ ప్రయత్నం ద్వారానే హస్తగతమవుతుంది. అలసత్వం సోమరితనాలవల్ల ఏదీ ప్రాప్తించదు. సోమరితనం, బద్దకాలను దూరంచేసి ధర్మసమ్మతమయిన ఒనరులను వినియోగించుకోవాలని చెప్పబడింది.
అయితే ఒక విశ్వాసి ప్రత్యేకత ఏమంటే అతని మనసు ఎంతసేపటికీ భౌతికవనరుల పైకాక, దైవ ప్రోద్బలంపై ఆధారపడి ఉంటుంది. మనిషి ఎన్ని ఒనరుల్నిసమకూర్చుకున్నా, ఎన్ని జాగ్రత్తలు గైకొన్నా నిర్ణీత లక్ష్యం నెరవేరి తీరుతుందన్ననమ్మకం లేదు. మనిషి విఫలుడవటం సంభవమే. ఒక్కోసారి అతను నిర్ణయించుకున్నలక్ష్యాన్ని అందుకోకపోవటంలోనే అతని శ్రేయస్సు ఇమిడి ఉండవచ్చు. ఎందులోఏం మేలుందో దైవానికే తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో విశ్వాసి నిరాశకుగురికాకుండా తన ప్రభువేచ్ఛతో రాజీపడిపోతాడు. విధిని విదిలించే, ఒనరులనుతప్పుపట్టే బదులు ‘దైవచిత్తం ఇలా ఉంది కాబోలు. కనుక ఇది నాకు ఆమోదమే’అని అంటాడు. అలాగే అతని ఆంతర్యం ఈర్ష్య, అసూయ, కపటత్వం, ద్వేషంవంటి నకారాత్మక భావనల నుడి, తుచ్ఛమైన భావాల నుండి సురక్షితంగా ఉంటుంది.ఇంకా అతని ఆంతర్యంపై దైవ కారుణ్యం ప్రశాంతత అవతరిస్తాయి.

You must be logged in to post a comment.